
మీరట్: మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న నిందితురాలు, అతడి భార్య ముస్కాన్ రస్తోగిని జైల్లోని ప్రత్యేక ప్రసూతి బ్యారక్‌లోకి మార్చడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆమెతో పాటు గర్భంతో ఉన్న మరో మహిళా ఖైదీని కూడా తరలించనున్నారు.
ప్రస్తుతం ఆరు వారాల గర్భవతిగా ఉన్న ముస్కాన్ రాస్తోగిని గర్భిణీ ఖైదీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యారక్‌లోకి పంపనున్నట్లు జైలు అధికారి తెలిపారు. బిడ్డ జన్మించేంత వరకు ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ముస్కాన్ రస్తోగికి ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమె గర్భం దాల్చినట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. దీనిపై హత్య గావించబడ్డ సౌరభ్ సోదరుడు మాత్రం.. ముస్కాన్‌కు పుట్టబోయే బిడ్డ సౌరభ్ రక్తం అయితే తాము తప్పకుండా పెంచుకుంటామన్నాడు.
సౌరబ్ రాజ్‌పుత్ సోదరుడు బబ్లూ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ముస్కాన్ కు పుట్టబోయే బిడ్డ మా అన్నకు సంబంధించిన బేబీ అయితే మేము కచ్చితంగా పెంచుకుంటాం. అన్నీ చూసుకుంటాం.’ అని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ముస్కాన్, సాహిల్‌లు ఇద్దరూ మీరట్ జిల్లా జైల్లో వేర్వేరు బారక్‌ల్లో ఉంటున్నారు. తాము కలిసి ఉంటామని ఒకే బారక్ ఇవ్వమని డిమాండ్ చేసినా జైలు రూల్స్ ఒప్పుకోవమని చెప్పి వారికి సెపరేట్ రూమ్‌లే కేటాయించారు అధికారులు.
కాగా, సౌరభ్ రాజ్‌పుత్, ముస్కాన్‌లు 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత సాహిల్(25)తో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీనిపై వారు విడాకుల వరకు వెళ్లారు. కానీ, కుమార్తె కోసం సౌరభ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి శరీరాన్ని ముక్కలు చేసి.. వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేసింది.