
మీరట్: మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రేమించి వివాహం చేసుకున్న భర్తను ప్రియుడి సాయంతో భార్యే దారుణంగా హత్య చేసి, ముక్కలు చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితురాలు ముస్కాన్ రస్తోగి గర్భం దాల్చినట్లు సీనియర్ జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ వెల్లడించారు.
ముస్కాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతూ జైలు అధికారులు సీఎం కార్యాలయాన్ని కోరారు. దీంతో ఇటీవల ఆమెకు గర్భ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కటారియా తెలిపారు. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్న ఈ హత్య కేసులో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
ఈ కేసులో అరెస్టైన ముస్కాన్, సాహిల్‌కు సంబంధించి.. గతంలో కూడా పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ మాదకద్రవ్యాలకు బానిసలుగా మారారని పేర్కొన్నారు. జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. అరెస్ట్ నాటి నుంచి అవి దొరక్కపోవడంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని.. తరచూ గంజాయి కోసం డిమాండ్ చేసినట్లు కూడా పోలీసులు చెప్పారు.
సౌరభ్ రాజ్‌పుత్(29), ముస్కాన్(27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత సాహిల్(25)తో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీనిపై వారు విడాకుల వరకు వెళ్లారు. కానీ, కుమార్తె కోసం సౌరభ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి శరీరాన్ని ముక్కలు చేసి.. వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేసింది.