కాళేశ్వరం/కోరుట్ల/చర్ల: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ భార్య సృజనక్క (48) ఎన్‌కౌంటర్‌లో మృతి చెందింది. ఈ ఘటన మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా జారవండి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీన్‌బట్టి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. గడ్చిరోలి ఎస్పీ శైలేష్ బాల్కావుడే కథనం ప్రకారం.. మావోయిస్టులు రహస్య ప్రదేశంలో సమావేశమైనట్లు సమాచారం రావడంతో శనివారం సాయంత్రం పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులు ప్రారంభించగా.. పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మావోయిస్టు కసన్‌సూర్ దళం డివిజన్ ఇన్‌చార్జి సృజనక్క అలియాస్ చిన్నక్క అలియాస్ చైతు ఆర్కా మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. కొంతమంది మావోయిస్టులు తప్పించుకొని పారిపోయారని పేర్కొన్నారు. సృజనక్క ఇరవై ఏళ్లకు పైగా మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పని చేస్తోందని, ఆమెపై రూ.16 లక్షల రివార్డు ఉందని, పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయని ఆయన వివరించారు. సంఘటన స్థలంలో ఏకే 47, ప్రెషర్ కుక్కర్, క్‌లైమోర్‌మైన్, విప్లవ సాహిత్యాలు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవ్‌జీది ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల కాగా, సృజనక్క స్వస్థలం గడ్చిరోలి జిల్లా అహేరి. కొన్నేళ్లుగా వీరిద్దరు మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment