
‘భావప్రకటన స్వేచ్ఛను అణచివేయడం ఒకటి కాదు... రెండు తప్పులతో సమానం. ఎందుకంటే అది చెప్పేవారి హక్కుతోపాటు వినేవారి హక్కునూ ఉల్లంఘిస్తుంది’ అంటాడు అమెరికా సంఘ సంస్కర్త, పౌరహక్కుల నేత ఫ్రెడరిక్ డగ్లస్. ఈ రెండింతల తప్పు చేయటం మన ప్రభుత్వాలు దిన చర్యగా మార్చుకున్నాయి.
ఈ నేపథ్యంలో పౌరుల భావప్రకటన స్వేచ్ఛ అత్యంత కీలక మైనదని, వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహం తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయటం నాగరిక సమాజంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ధర్మాసనం మొన్న శుక్రవారం తేల్చిచెప్పింది. ‘ఆ అభిప్రాయాలతో లేదా ఆలోచనలతో విభేదించవచ్చు. ఆ అభిప్రాయాలకు భిన్నంగా మరో అభిప్రాయాన్ని ప్రకటించటం ద్వారా దాన్ని ఎదుర్కొనాలి తప్ప అణిచేస్తామనటం రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే అవుతుంది’ అని తెలియజేసింది.
ఇన్‌స్టాలో, ఎక్స్‌లో గుజరాత్ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ పెట్టిన కవిత వల్ల సమాజంలో విద్వేషాలు రగులుతాయని ఆరోపిస్తూ అక్కడి పోలీసులు కేసుపెట్టారు. దీన్ని తప్పుబడుతూ, కేసును కొట్టివేస్తూ ఇచ్చిన ఈ తీర్పు అనేక విధాల ఎన్నదగినది. రాజ్యాంగ విలువల పట్లా, పౌరుల హక్కులపట్లా వీసవెత్తు గౌరవం లేని అనైతిక పాలకులు ఇష్టా రాజ్యంగా రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టడం ఈమధ్య బాగా ముదిరింది.
పాలకులు చెప్పిందే తడవుగా తప్పుడు కేసులు పెట్టే పోలీసులు కొందరైతే... వారి మెప్పు కోసం అనవసర ఉత్సాహాన్ని ప్రదర్శించే బాపతు మరికొందరు. ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ఎక్కడ చూసినా ఇలాంటివారి హవా నడుస్తోంది. రాజ్యాంగాన్ని బేఖాతరు చేయటమంటే... దాని ప్రసక్తి లేకుండా పాలించాలనుకోవటమంటే హక్కులు లేని అధికారాన్ని చలాయించాలని చూడటమే.
గుజరాత్ పోలీసులకు అభ్యంతరకరంగా అనిపించిన కవిత చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.అందులో ఒక మతాన్ని, వ్యవస్థనూ లేదా వ్యక్తిని కించపరిచింది లేదు. దేశద్రోహం పోకడలు రవ్వంతయినా లేవు. ‘ఓ రక్త పిపాసులారా వినండి...’ అంటూ మొదలయ్యే ఆ కవితలో అలాంటివారికి ప్రేమను పంచుతామన్న సందేశమే ఉంటుంది.
అన్యాయానికి ఒడిగట్టినా దాన్ని న్యాయంతోనే ఎదుర్కొంటామంటుంది. ఇందులో పోలీసులకు ఏది అభ్యంతరమనిపించిందో గానీ... వెనకా ముందూ చూడకుండా కేసు పెట్టారు. విచారణ సందర్భంలో గుజరాత్ ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ‘ఒక్కొక్కరు దీన్ని ఒక్కోవిధంగా విశ్లేషించుకుంటారు’ అని పోలీసులను సమర్థిస్తుండగా సృజనాత్మకతను గౌరవించే సంస్కృతి లేకపోవటాన్ని ధర్మాసనం ఎత్తిచూపింది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం దాదాపు ఇదే స్వరంతో పోలీసులను తప్పు బట్టింది. రహదారుల బాగుకు నిధుల కోసం ఊరూరా టోల్‌గేట్లు పెడతామని ముఖ్యమంత్రి చంద్ర బాబు చేసిన ప్రకటనపై వ్యంగ్యంగా, ప్రతీకాత్మకంగా రూపకం తయారుచేయడాన్ని నేరంగా పరిగ ణిస్తూ కేసు పెట్టడాన్ని నిలదీసింది. అవసరాన్నిబట్టి కేసులు పెట్టడం కాక, ఏదో ఒక కేసు పెట్టాలి, ఎవరో ఒకర్ని అరెస్టు చేయాలని చూడటం సరికాదని హెచ్చరించింది.
ఇదొక్కటే కాదు... ఇలాంటి కేసులు కూటమి ప్రభుత్వం లెక్కకు మిక్కిలి బనాయిస్తోంది. ఈమధ్యకాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులనూ, కార్యకర్తలనూ అరెస్టు చేయని రోజంటూ లేదు. ఎప్పుడో మూడు నాలుగేళ్లక్రితం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఏదో పోస్టు కారణంగా ఇప్పుడు మనోవ్యాధి పట్టుకుందని కూటమి లోని మూడు పార్టీల నాయకులూ పోలీస్‌స్టేషన్లకు పోతున్నారు.
అధికారంలో ఊరేగుతున్నవాళ్లు ఫిర్యాదు చేసినంతమాత్రాన కేసులు పెట్టడం సబబా అన్న విచక్షణ కూడా పోలీసులకు ఉండటం లేదు. అధికారపక్షం కేసులు పెట్టడంలోని ఉద్దేశం, దాన్నుంచి ఆశిస్తున్న ప్రయోజనం వారికి తెలియందేమీ కాదు. అయినా ఈ నాటకం యథావిధిగా సాగిపోతోంది. అసమ్మతి గొంతు నొక్కడానికి నిరంతరం ప్రయత్నిస్తూనేవున్నారు.
‘ఒక చిన్న కవిత వల్లనో, ఒక స్టాండప్ కామెడీ వల్లనో సమాజంలో భిన్న వర్గాల మధ్య విద్వేషాలు రగులుతాయని ఎలా అనుకుంటున్నారు...మన రాజ్యాంగ మౌలిక సిద్ధాంతాలు అంత బలహీనమైనవనుకుంటున్నారా?’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం గుజరాత్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది.
ఇదే మాదిరి సంస్కృతిని అమలు చేస్తున్న అన్ని ప్రభుత్వాలకూ ఈ ప్రశ్న చెంపపెట్టు. నిరంతరం అభద్రతాభావంతో బతు కీడ్చే వ్యక్తులనూ లేదా విమర్శ వల్ల తమ అధికారానికీ, పదవికీ ముప్పుకలుగుతుందనుకునే వారినీ ప్రమాణంగా తీసుకుని దేనిపైనా నిర్ణయానికి రావొద్దని ధర్మాసనం పోలీసులకు హితవు చెప్పింది.
కింది స్థాయి కోర్టులు సక్రమంగా వ్యవహరించలేదని గమనించినప్పుడు దాన్ని సరిదిద్దాల్సిన హైకోర్టులు సైతం అదే బాటలో పోతుండటాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. రాజ్యాంగ ఆదర్శాలను ప్రభుత్వాలు అణిచివేయకుండా చూడటం రాజ్యాంగ న్యాయస్థానాలుగా హైకోర్టులతోపాటు సుప్రీంకోర్టు కర్తవ్యం. కానీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ కేసులో గుజరాత్ హైకోర్టు ఆ విషయంలో పూర్తిగా విఫలమైందన్నది సుప్రీం అభిప్రాయం.
ఈమాదిరి కేసుల విషయంలో పోలీసులు ఎలా వ్యవహరించాలో ఈ సందర్భంగా ధర్మాసనం సూచించింది. ఫిర్యాదు అందిందే తడవుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయటం కాక, ముందు పోలీసు అధికారి ప్రాథమిక విచారణ జరపాలని ఆదేశించింది. సరైందను కుంటేనే కేసు నమోదు చేయాలని, లేనిపక్షంలో ఫిర్యాదీదారుకు ఆ సంగతి చెప్పాలని తెలిపింది. సుప్రీంకోర్టు తాజా తీర్పయినా అకారణంగా, అన్యాయంగా కేసులు బనాయించే పాలకుల దుష్ట సంస్కృతికి కళ్లెం వేయగలిగితే ప్రజాస్వామ్యం సురక్షితంగా మనుగడ సాగించగలుగుతుంది.