Courts
-
తాత్కాలిక జడ్జీలను నియమించుకోండి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హైకోర్టులో 18 లక్షలకుపైగా క్రిమినల్ కేసులు పోగుబడటంతో ఆ కేసుల కొండ కరిగించేందుకు హైకోర్టులకు సుప్రీంకోర్టు అదనపు అధికారాలిచ్చింది. సొంతంగా తాత్కాలిక ప్రాతిపదికన న్యాయమూర్తులను నియమించుకునేందుకు హైకోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. రెండు లేదా మూడేళ్ల కాలానికి జడ్జీల నియామకానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. హైకోర్టుల్లో ఇలా అదనపు జడ్జీల నియాకంపై 2021 ఏప్రిల్ 20వ తేదీన విధించిన షరతుల అమలును తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ‘‘హైకోర్టుల వారీగా ఆ కోర్టులో అనుమ తించిన సామర్థ్యంలో 10 శాతానికి మించి తా త్కాలిక జడ్జీలను తీసుకోవద్దు. ఇద్దరు లేదా ఐదుగురు జడ్జీలను తీసుకోండి. సిట్టింగ్ జడ్జి సూ చించిన ధర్మాసనంలో కొత్త జడ్జీలు కూర్చోవాలి. పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను మాత్రమే వినాలి. డివిజన్ బెంచ్‌లో భాగ స్వాములుగా ఉన్నాసరే శాశ్వత జడ్జీలతోపాటు కాకుండా విడిగా కూర్చుని కేసులను పరిష్కరించాలి’’ అని సుప్రీంకోర్టు గురువారం స్పష్టంచేసింది. షరతులను విధిస్తూ గతంలో నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్ఏ బోబ్డే ఆ తీర్పు చెప్పారు. రిటైర్ అయిన హైకోర్టు జడ్జీలను కేవలం ఒక్కసారి మాత్రమే రెండు లేదా మూడేళ్ల కాలానికి తాత్కాలిక జడ్జీగా నియమించుకోవచ్చని ఆయన తీర్పు చెప్పడం తెల్సిందే. నేషనల్ జుడీషియల్ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా హైకోర్టులో 62 లక్షల కుపైగా కేసులు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి. వీటిలో 18 లక్షలకు పైగా క్రిమినల్ కేసులున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 224ఏ ప్రకారం గతంలో హైకోర్టులో జడ్జిగా చేసి రిటైర్ అయిన వాళ్లను అవసరమైతే తిరిగి తాత్కాలిక జడ్జీలుగా నియమించవచ్చు. అయితే ఈ నిబంధనను కేంద్రప్రభుత్వం అత్యంత అరుదుగా వినియోగించుకుందని ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. -
న్యాయస్థానాలే నిర్లక్ష్య ధోరణితో తప్పులు చేస్తే..!
సంచలన సృష్టించిన ఓ హత్య కేసులో అతనొక నిందితుడు. కింది కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. హైకోర్టు, ఆపైన సుప్రీం కోర్టు కూడా కోర్టు తీర్పునే సమర్థించాయి. క్షమాభిక్ష కోరితే.. రాష్ట్రపతి సున్నితంగా తిరస్కరించారు. కొడుకు కోసం అతని తల్లి మరోసారి రాష్ట్రపతి భవన్ తలుపు తట్టింది. ఈసారి రాష్ట్రపతి కనికరించి జీవితఖైదుగా శిక్షను మార్చారు. కట్ చేస్తే.. దాదాపు 25 ఏళ్ల తర్వాత అతని విషయంలో పెద్ద తప్పే జరిగిందని దేశసర్వోన్నత న్యాయస్థానమే ఒప్పుకుంది. అతన్ని విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేస్తూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏంటా తప్పు?.. ఇంతకీ కోర్టు ఏం చెప్పిందంటే..వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని అంటారు. అయితే నిందితులతో పాటు దోషులకూ మన చట్టాలు కొన్ని హక్కులు కల్పిస్తున్నాయి. అయితే ఆ హక్కును న్యాయస్థానాలే నిర్లక్ష్యం చేస్తే..?! ఫలితంగా ఓం ప్రకాశ్లాగా పాతికేళ్లు జైల్లో మగ్గాల్సి వస్తుంది.ఉత్తరాఖండ్‌కు చెందిన ఓం ప్రకాశ్(Om Prakash).. తన యజమానితో పాటు అతని కుటుంబాన్ని హతమార్చిన కేసులో నిందితుడు. 1994లో ఈ నేరం జరిగింది. నేరం రుజువు కావడంతో 2001లో ట్రయల్ కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. అయితే నేరం జరిగిననాటికి అతను మైనర్. తన కొడుకు మైనర్ అని మరణశిక్షపై అతని తల్లి అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు.. నిందితుడి పేరిట ఉన్న బ్యాంక్ పాస్‌బుక్ ఆధారంగా నేరం జరిగిన నాటికి అతనికి 20 ఏళ్లని అధికారులు వాదించారు. కోర్టు ఓం ప్రకాష్ తల్లి అభ్యర్థనను పక్కనపెట్టి మరణశిక్ష ఖరారు చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆమె హైకోర్టు, సుప్రీం కోర్టులకు వెళ్లారు. అయితే అక్కడా ఆ తల్లికి చేదు అనుభవం ఎదురైంది. రివ్యూ పిటిషన్లు వేస్తే వాటిని కొట్టేశాయి. దీంతో చివరి అవకాశంగా ఆమె రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరారు. అయితే మొదటి పిటిషన్ తిరస్కరణకు గురికాగా.. 2012లో రెండో పిటిషన్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కాకుంటే.. ఓం ప్రకాశ్‌కు 60 ఏళ్లు వచ్చేదాకా జైల్లోనే ఉంచాలంటూ సూచించారు. ఆ తర్వాత సుప్రీం కోర్టులో అతని తల్లి మరో పిటిషన్ వేసినప్పటికీ.. అది చెల్లదంటూ రిజిస్ట్రీ కొట్టిపారేశారు. 2019లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే.. అదీ తిరస్కరణకే గురైంది. చివరకు.. సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ఆధారంగా బోన్ ఆసిఫికేషన్(ఎముక పరిణామంచెందే క్రమం) పరీక్ష నిర్వహించగా.. నేరం జరిగిననాటికి అతని వయసు 14 ఏళ్లుగా తేలింది!. అంతేకాదు.. సమాచారం హక్కు చట్టం ప్రకారం 14 ఏళ్ల వయసువాళ్లకూ బ్యాంక్ అకౌంట్ ఉండొచ్చనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జువైనల్ జస్టిస్ యాక్ట్(Juvenile Justice Act) 2015 ప్రకారం.. జువైనల్‌కు కఠిన శిక్షలు విధించరాదని మన చట్టం చెబుతోంది. కానీ, ఈ కేసులో ఓం ప్రకాశ్‌కు ఏకంగా మరణశిక్ష విధించాయి కోర్టులు. అయితే.. ఈ తరహా కేసుల్లో శిక్షలు ఖరారైన తర్వాత కూడా నిందితుడి మైనర్ అని నిరూపించుకునేందుకు పిటిషన్ వేయొచ్చు. అందుకు సెక్షన్ 9(2) వెసులుబాటు కల్పించింది. అయితే.. కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా ఓం ప్రకాశ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరించాయి. సెక్షన్‌కు విరుద్ధంగా ప్రవర్తించాయి.‘‘మన దేశంలో న్యాయస్థానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాంటిది ఇలాంటి కేసుల్లో.. అభ్యర్థలను కోర్టులు జాగ్రత్తగా పరిశీలించాలి. నిర్లక్ష ధోరణితో పక్కన పడేయకూడదు. 2015 జువైనల్ చట్టం.. పిల్లలను అపరాధిగా కాకుండా బాధితుడిగా పరిగణించాల చెప్పింది. వాళ్లలో పరివర్తన తీసుకొచ్చి.. సమాజంలోకి పంపించి పునరావాసం కల్పించాలని చెబుతోంది. అయితే ఇక్కడ కోర్టులు చేసిన తప్పిదానికి అప్పీలుదారుడు శిక్షను అనుభవించాడు. సమాజంలో కలిసిపోయే అవకాశాన్ని కోల్పోయాడు. తన తప్పులేకుండా అతను కోల్పోయిన కాలాన్ని ఎలాగూ వెనక్కి తేలేము’’ అంటూ జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్‌కుమార్ బెంచ్ వ్యాఖ్యానించింది. మరేయిత కేసులతో గనుక అతనికి సంబంధం లేకుంటే తక్షణమే అతన్ని విడుదల చేయాలంటూ ఉత్తరాఖండ్ జైళ్ల శాఖను ఆదేశించింది. అలాగే ప్రభుత్వ పునరావాస పథకాల కింద అతనికి ఏదైనా ఉపాధి కల్పించాలని ఉత్తరాఖండ్ స్టేట్ లీగల్‌సర్వీసెస్ అథారిటీకి ధర్మాసనం సూచించింది.1994లో ఏం జరిగిందంటే..డెహ్రాడూన్(Dehradun)లో ఓ ఇంట్లో జరిగిన హత్యలు కలకలం రేపాయి. శ్యామ్‌లాల్ ఖన్నా అనే రిటైర్ట్ ఆర్మీ ఆఫీసర్‌ను, ఆయన కొడుకు సరిత్, భార్య సోదరిని ఎవరో కిరాతకంగా హతమార్చారు. పోలీసుల విచారణలో ఆ ఇంట్లోనే పని చేసే ఓం ప్రకాశ్ పనేనని తేలింది. ఐదేళ్ల గాలింపు తర్వాత పశ్చిమ బెంగాల్లో నిందితుడ్ని, అతని స్నేహితుడు నితేష్‌ను అరెస్ట్ చేశారు. అయితే.. ఈ కేసులో నితేష్ ప్రమేయం లేదని తేలడంతో కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది.ప్రతీక్ చాదా అనే లాయర్ సుప్రీం కోర్టులో ఓం ప్రకాశ్ తరఫున పిటిషన్ వేయగా.. ఎస్ మురళీధర్ ఓం ప్రకాశ్ తరఫున వాదనలు వినిపించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం తరఫున అడిషనల్ సోలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్, అడ్వొకేట్ వన్షజా శుక్లా వాదనలు వినిపించారు. -
జడ్జీలపై పెండింగ్ కేసుల కొండ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని న్యాయస్థానాలన్నీ కేసుల భారం, విపరీతమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నాయి. పెరుగుతున్న కేసుల కొండను కరిగించేంత స్థాయి పరిమాణంలో న్యాయమూర్తులు లేరు. క్రింది స్థాయి కోర్టులు మొదలు హైకోర్టు దాకా చాలా జడ్జీ పోస్టులు ఖాళీలున్నాయి. దీంతో ఉన్న కొద్దిమంది న్యాయమూర్తుల మీదనే విపరీతమైన పని భారం పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 4,94,907 కేసులు న్యాయస్థానాల్లో పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. తెలంగాణలో ఒక్కో న్యాయమూర్తిపై 9,144, ఆంధ్ర ప్రదేశ్‌లో 8,576 కేసుల భారం ఉందని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో మొత్తం 4,54,55,345 పెండింగ్ కేసులు ఉండగా.. వాటిలో 57 శాతం సివిల్ కేసులు, 62 శాతం క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ నివేదిక ప్రకారం సుప్రీంకోర్టులో 83,410 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కేసులతో పెండింగ్ భారం విపరీతంగా పెరిగిపోతోందని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తుత పరిస్థితులపై విచారం వ్యక్తం చేసింది. ‘2005 నాటికి ట్రయల్ కోర్టుల్లోని న్యాయమూర్తుల సంఖ్య ప్రతి 10లక్షల జనాభాకు 50 మంది జడ్జిలుగా ఉండాలని 2002లో ఉత్తర్వులు జారీ చేశాం. ఉత్తర్వులు జారీ చేసి 22 సంవత్సరాలు గడిచినా ఈ నిష్పత్తి 2024 ఏడాదిలో ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 25 మంది న్యాయమూర్తులకు చేరుకోలేదు’అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.. ఢిల్లీకి చెందిన ఓ సెషన్స్ జడ్జికి ఉపశమనం కలి్పస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య చేసింది. సెషన్స్ జడ్జికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఒక్కో న్యాయమూర్తికి సగటున 2 వేలకు పైగా కేసుల భారం ఉంది. మూడు హైకోర్టుల్లోని జడ్జీలపైనే అత్యధిక పనిభారం రాజస్థాన్, మధ్యప్రదేశ్, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులపై దేశంలోనే అత్యధిక పనిభారం ఉందని తెలుస్తోంది. 25 హైకోర్టుల్లో 61,09,862 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దేశంలో పెండింగ్‌లో ఉన్న కేసుల విషయంలో ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టు అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉందని నివేదిక చూపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ 6,56,141 కేసులు పెండింగ్‌లో ఉండగా కేవలం 32 మంది న్యాయమూర్తులు మాత్రమే ఈ కేసుల పరిష్కారానికి బాధ్యత వహిస్తున్నారు. ఇక్కడ సగటున ప్రతి న్యాయమూర్తి 20,504 కేసుల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మొత్తం పాతిక హైకోర్టులలో ఇదే అత్యధికం. దీని తర్వాత మధ్యప్రదేశ్ హైకోర్టు రెండో స్థానంలో నిలిచింది. 4,69,462 కేసుల పరిష్కారం బాధ్యత 35 మంది న్యాయమూర్తులపై ఉంది. ఇక్కడి న్యాయమూర్తిపై సగటున 13 వేల 414 కేసుల భారం ఉంది. అలాగే అలహాబాద్ హైకోర్టు దేశంలోనే మూడో స్థానంలో ఉంది. 10,67,614 కేసులను పరిష్కరించే బాధ్యత 82 మంది న్యాయమూర్తులపై ఉంది. -
సమాజం పట్ల కరుణతోనే న్యాయమూర్తిగా నిలదొక్కుకున్నా..
ముంబై: న్యాయస్థానాలు, న్యాయమూర్తులు సైతం సూక్ష్మ పరిశీలనకు గురి కావాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. న్యాయమూర్తుల పనితీరును చుట్టూ ఉన్న సమాజం పరిశీలిస్తూనే ఉంటుందని అన్నారు. అయితే, సమాజం పట్ల ఉన్న దయ, కరుణ, జాలి, అనురాగం వల్లే తాను అన్ని రకాల పరిశీలనలు, పరీక్షలకు నిలిచి, న్యాయమూర్తిగా నిలదొక్కుకున్నానని తెలిపారు. సమాజం పట్ల తమ ప్రేమానురాగాలు తమ తీర్పుల ద్వారా వెల్లడవుతాయని వివరించారు. జస్టిస్ చంద్రచూడ్ వచ్చే నెల 10వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ముంబైలో ఆయనను ఘనంగా సత్కరించారు. జస్టిస్ చంద్రచూడ్ అందించిన సేవలను న్యాయవాదులు ప్రశంసించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ తాను ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. ‘‘ఐఐటీ–ధన్బాద్లో చేరేందుకు సకాలంలో అడ్మిషన్ ఫీజు రూ.17,500 చెల్లించలేకపోయిన దళిత విద్యార్థికి మా ఆదేశాలతో ప్రవేశం లభించింది. ఇలాంటి తీర్పులు తనకెంతో సంతృప్తిని ఇచ్చాయి’’ అని తెలిపారు. -
విద్వేష వ్యాఖ్యలొద్దు
న్యూఢిల్లీ: కేసుల విచారణ సందర్భంగా వాడే పదజాలం విషయంలో న్యాయస్థానాలు అత్యంత జాగరూకత వహించాలని సుప్రీంకోర్టు సూచించింది. పురుషాధిక్య భావజాలం, స్త్రీద్వేషం తదితరాలతో కూడిన వ్యాఖ్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని హితవు పలికింది. కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీశానంద ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా బెంగళూరులో ఒక ముస్లిం ప్రాబల్య ప్రాంతాన్ని పాకిస్తాన్‌తో పోల్చడం, మహిళా న్యాయవాదిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ ఉదంతంపై సుమోటో విచారణను సీజేఐ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం ముగించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోని ఏ ప్రాంతాన్నీ పాకిస్తాన్‌తో పోల్చకూడదని కుండబద్దలు కొట్టింది. అవి దేశ ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధమని గుర్తు చేసింది. ఇలా ప్రాంతాలను, సామాజికవర్గాలను ఉద్దేశించి అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదని స్పష్టం చేసింది. ‘‘న్యాయవ్యవస్థ నిష్పాక్షికతపై సమాజంలో అన్ని వర్గాల ప్రజలకూ పూర్తి విశ్వాసముండాలి. దీన్ని కాపాడాల్సిన బాధ్యత లాయర్ల నుంచి జడ్జిల దాకా అందరిపైనా ఉంది. న్యాయమూర్తులు యథాలాపంగా చేసే ఇలాంటి వ్యాఖ్యలు వారి వ్యక్తిగత అభిప్రాయాలకు, రాగద్వేషాలకు అద్దం పడతాయి. వాటి ప్రభావం మొత్తం న్యాయవ్యవస్థపై పడుతుంది’’ అంటూ హెచ్చరించింది.మరింత వెలుగే పరిష్కారం!న్యాయవ్యవస్థలో పారదర్శకత చాలా ముఖ్యమని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. కోర్టుల విచారణ ప్రక్రియపై సోషల్ మీడియాలో విద్వేష వ్యాప్తి పెద్ద సవాలుగా మారిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. దీనిపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘వెలుగుకు మరింత వెలుగే పరిష్కారం తప్ప చీకట్లు కాదు. అన్నిరకాల కోర్టుల్లోనూ విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయడం, తద్వారా న్యాయవ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడమే సమస్యకు పరిష్కారం’’ అని కుండబద్దలు కొట్టారు. -
ప్రపంచ న్యాయస్థానం తీర్పుని సమర్థించిన భారత న్యాయమూర్తి!
ఇజ్రాయెల్ సైన్యం (మే 26, 2024) రఫా నగరంపై బాంబు దాడలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఐతే గత శుక్రవారమే అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఇజ్రాయెల్‌ని రఫా నగరంపై సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సమర్థించారు అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) లోని భారత ప్రతినిధి, న్యాయమూర్తి దల్వీర్ భండారీ. ఆయన అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా ఓటు కూడా వేశారు. భండారీ 2012 నుంచి ఐసీజే సభ్యడిగా ఉన్నారు. ఆయన న్యాయమూర్తిగా తన కెరీర్లో అనేక గొప్ప మైలురాయి కేసులను వాదించారు. ఆయన అక్టోబర్ 28, 2005న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రజావాజ్యం, రాజ్యాంగ చట్టం, క్రిమినల్ చట్టం, సివిల్ ప్రొసీజర్, అడ్మినిస్ట్రేటివ్ లా, ఆర్బిట్రేషన్, ఫ్యామిలీ లా, కార్మిక- పారిశ్రామిక చట్టం, కార్పొరేట్ చట్టం వంటి అంశాలలో ఆయన అనేక తీర్పులు ఇచ్చారు. అంతర్జాతీయ న్యాయస్థానంకి సంబంధించిన సముద్ర వివాదాలు, అంటార్కిటికాలో తిమింగలం వేట, మారణహోమం, కాంటినెంటల్ షెల్ఫ్ డీలిమిటేషన్, అణు నిరాయుధీకరణ, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, సార్వభౌమ హక్కుల ఉల్లంఘన వంటి అన్ని కేసులతో భండారీ సంబంధం కలిగి ఉన్నారు. న్యాయమూర్తి భండారీ అనేక సంవత్సరాలు ఇంటర్నేషనల్ లా అసోసియేషన్ ఢిల్లీ సెంటర్‌కు అధ్యక్షత వహించారు.సుప్రీంకోర్టుకు జడ్జిగా రాకమునుపు బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. విడాకుల కేసులో అతడిచ్చిన తీర్పుతో హిందూ వివాహ చట్టం, 1955ను సవరించేలా కేంద్రాన్ని ప్రేరేపించింది. కాగా, ఇజ్రాయెల్ మారణహోమా చర్యలపై దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన దరఖాస్తుకు ప్రతి స్పందనగా ఐసీజే ప్రిసైడింగ్ జడ్జి నవాఫ్ సలామ్ ఇజ్రాయెల్ దాడులను నిలిపివేయాలంటూ తీర్పుని ప్రకటించడం జరిగింది. అంతేగాదు ఇజ్రాయెల్ తక్షణమే ఎటువంటి అవరోధం లేని మానవతా సహాయాన్ని అందించాలని, అలాగే మారణహోమం ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న యూఎన్ సంస్థలకు సహకరించాలని ఈ తీర్పులో నొక్కి చెప్పింది ఐసీజే. అయితే ఈ తీర్పుకి ఉగాండాకు చెందిన న్యాయమూర్తులు జూలియా సెబుటిండే, ఇజ్రాయెల్ హైకోర్టు మాజీ అధ్యక్షుడు జడ్జి అహరోన్ బరాక్ మాత్రమే భిన్నాభిప్రాయాలతో వ్యతిరేకంగా ఓటు వేశారు. (చదవండి: అమెరికా వీసా ఫీజులు పెంపు.. గగ్గోలు పెడుతున్న ఇండియన్ ఐటీ కంపెనీలు) -
డీఎల్ఎఫ్ ఫుడ్ కోర్టుల్లో తనిఖీలు.. విస్తుపోయే అంశాలు
కుళ్లిపోయిన పండ్లతో జ్యూసులు.. నాసిరకం పన్నీరుతో రకరకాల వంటకాలు.. కూరలు, గ్రేవీల్లో నాసిరకం మసాలాలు.. కలర్ కలిపిన టీ పొడితో ఛాయ్.. వంటనూనె నాణ్యతలోనూ లేని కనీస ప్రమాణాలు.. ఇక శుభ్రత సంగతి అంటారా? బాబోయ్.. ఇవీ హైదరాబాద్ డీఎల్ఎఫ్ ఫుడ్ కోర్టుల్లో తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ విషయాలు. అర్ధరాత్రి దాకా కూడా వేడి వేడి ఆహారం కోసం ఐటీ ఉద్యోగులు సహా ఆహార ప్రియుల సందడి కనిపిస్తుంటుందక్కడ. రేటు ఎంతైనా ఫర్వాలేదనుకునే జనాలే ఎక్కువ కనిపిస్తారక్కడ. వాళ్లకు తగ్గట్లే పుట్టగొడుగుల్లా ఫుడ్‌కోర్టులు వెలిశాయి. కానీ, ఆ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు వెంపర్లాడుతున్న ఫుడ్ కోర్ట్ సెంటర్ నిర్వాహకులు, కనీస నాణ్యతా ప్రమాణాలు మాత్రం పాటించడం లేదు. న్యూస్ పేపర్లో ఫుడ్‌ను అందించొద్దనే నిబంధనల నుంచి.. కంప్లయింట్ కోసం ఉద్దేశించిన టోల్ ఫ్రీ నెంబర్‌ను సైతం ప్రస్తావించకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా.. డీఎల్ఎఫ్ ఫుడ్ కోర్టులలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కుళ్లిపోయిన పళ్లతో రసాలు చేసి విక్రయిస్తుండడం.. అలాగే నాసిరకం మసాలాలతో ఆహార పదార్థాల తయారీ, టీ పొడిలో కలర్ గ్రాన్యూల్స్ కలిపి టీ విక్రయాలు(ఇది క్యాన్సర్‌కు దారి తీయొచ్చని ప్రచారం నిపుణులు చెబుతుంటారు). డీఎల్ఎఫ్ సమీపంలో ఫుడ్ కోర్టుల్లో ఆహార నాణ్యతపై ట్విటర్లో అందించిన ఫిర్యాదు మేరకే ఈ తనిఖీలు జరిగినట్లు తెలుస్తోంది. డీఎల్ఎఫ్ వద్ద సుమారు 150 ఫుడ్ కోర్టులు ఉండగా.. అందులో చాలావాటికి అనుమతులు లేవు. దీంతో ఆయా యజమానులకు నోటీసులు జారీ చేశారు. -
Delhi Pollution: ఆ భారం మాపైకి నెట్టేయకండి
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని నియంత్రించే విషయంలో కోర్టుపైకి భారం నెట్టేసే ప్రయత్నాలు మానుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఢిల్లీలో మళ్లీ సరి–బేసి ట్రాఫిక్ విధానం తేవడంపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, తామెలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని స్పష్టం చేసింది. సరి–బేసి విధానంతో తమకు ఎటువంటి సంబంధం లేదని, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే ట్యాక్సీలకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని తామెన్నడూ తెలపలేదని పేర్కొంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది. సరి–బేసి విధానం కాలుష్యాన్ని తగ్గించడంలో అంతగా పనిచేయదని అమికస్ క్యూరీకి చెప్పామని గుర్తు చేసింది. ‘‘మీరేం చేయాలో చెప్పడానికి మేమిక్కడ లేం. ఆ విధానం కొనసాగించొద్దు అని మేం చెప్తే, సుప్రీంకోర్టు ఆదేశించినందువల్లే కాలుష్యం ఎక్కువైందని మీరంటారు’’ అని పేర్కొంది. ఢిల్లీలో వాయు నాణ్యత మెరుగు పడినందున సరి–బేసి విధానం అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. -
కోర్టుల సంఖ్య పెంచాలి
హుజూర్నగర్: పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి కోర్టుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. మంగళవారం సూ ర్యాపేట జిల్లా హుజూర్నగర్ అదనపు జిల్లా కోర్టును హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హుజూర్‌నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు తమ కేసుల కోసం జిల్లా న్యాయ స్థానాన్ని ఆశ్రయించటానికి పడుతున్న వ్యయ ప్రయాసలను దృష్టిలో పెట్టుకుని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సభ్యుల విజ్ఞప్తి మేరకు హుజూర్‌నగర్‌కు జిల్లా అదనపు న్యాయస్థానాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. మారుమూల గ్రామాల ప్రజల సౌకర్యార్థమే అదనపు జిల్లా కోర్టు మంజూరు చేశామని, కోర్టు ప్రారంభమైనందున ఈ ప్రాంత వాసులకు సౌకర్యంగా ఉండటమే కాకుండా సత్వర న్యాయం ల భించడానికి మార్గం సుగమమైందన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినోద్ కుమార్, జస్టిస్ లక్ష్మణ్, సూర్యాపేట పోర్టుపోలియో జడ్జి జస్టిస్ శ్రీ సుధా, జస్టిస్ సుజన వర్చువల్‌గా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాంకుమార్, జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షు డు సాముల రాంరెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ప్రశంసనీయమైన ప్రయత్నం
‘అక్కడ అనాథల ఆక్రందన. అక్కడ అసహాయుల ఆర్తనాదం. అక్కడ పేదల కన్నీటి జాలు. అదే సుమా కోర్టు....’ సుప్రసిద్ధ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి అరవై రెండేళ్లనాటి ‘న్యాయం’ కథలో గుండెల్ని పిండే వాక్యాలివి. ఈ అనాథల్లో, ఈ అసహాయుల్లో, ఈ నిరుపేదల్లో మహిళలకు మరిన్ని కష్టాలు! ఆలస్యంగానైనా మన సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయంలో ప్రశంసనీయమైన పని చేసింది. న్యాయస్థానాల్లో సాగే వాదప్రతివాదాల్లో, విచారణల్లో, తీర్పుల్లో మహిళలకు సంబంధించి దశాబ్దాలుగా ఎంతో అలవోకగా వాడుతున్న పదాలను ఇకపై ఉపయోగించడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఆ పదాలకు ప్రత్యామ్నాయంగా ఏయే పదాలను ఉపయోగించాలో వివరిస్తూ బుధవారం ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. వ్యవస్థలన్నీ ఎక్కడినుంచో ఊడిపడవు. సమాజంలో ఉండే అసమానతలు, వివక్ష, ఆధిపత్య ధోరణులు వంటి సమస్త అవలక్షణాలూ వ్యవస్థల్లో కూడా ప్రతిఫలిస్తుంటాయి. న్యాయస్థానాల్లో ఈ పెడధోరణులు ఉండరాదని విశ్వసించి, అందుకోసం కృషి చేసిన న్యాయమూర్తులు లేకపోలేదు. కానీ వ్యక్తులుగా కృషి చేయటం వేరు, వ్యవస్థే తనంత తాను సరిదిద్దుకునేందుకు పూనుకోవడం వేరు. వృత్తి ఉద్యోగాలరీత్యా సరేగానీ... పౌరుల్లో అత్యధికులు కేసుల్లో ఇరుక్కొని కోర్టు మెట్లెక్కాలనీ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలనీ కోరుకోరు. మహిళల్లో ఈ విముఖత మరింత ఎక్కువ. ఇతరచోట్ల కంటే అక్కడ లింగ వివక్ష అధికం కావటమే ఇందుకు కారణం. మరీ ముఖ్యంగా కింది కోర్టుల్లో మహిళల పట్ల ఉపయోగించే భాష, సంబోధనలు అమాన వీయంగా ఉంటాయి. పర్యవసానంగా న్యాయం కోసం వెళ్లేవారికి అవమానాలే మిగులుతున్నాయి. మన రాజ్యాంగం అన్ని అంశాల్లో సమానత్వాన్ని ప్రబోధించింది. లింగ, వర్ణ, జాతి, కుల, మతాలను ఆధారం చేసుకుని వివక్ష ప్రదర్శించరాదని నిర్దేశించింది. ఇందుకు రాజ్యాంగ పీఠిక మాత్రమే కాదు... 14, 15, 16 అధికరణలతోపాటు 325 అధికరణం కూడా సాక్ష్యాలు. ఆదేశిక సూత్రాల్లో సైతం లింగ సమానతను సాధించటానికి ప్రభుత్వాలు పాటుపడాలన్న ఆకాంక్ష వ్యక్తమైంది. లింగ వివక్షకు తావులేకుండా పౌరులందరికీ పనిచేసే హక్కు కల్పించడంతోపాటు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 39(డి), 41 అధికరణలు నిర్దేశించాయి. కానీ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా ఇవి విరగడ కాలేదు. మహిళల విషయంలో ఎలాంటి దురాచారాలు, పెడ ధోరణులు అలుముకుని ఉన్నాయో మన రాజ్యాంగ నిర్మాతలకు సంపూర్ణ అవగాహన ఉంది. అందుకే వాటిని రూపుమాపటానికి పూనుకొన్నారు. దానికి అనుగుణంగా కాలక్రమంలో ప్రభు త్వాలు చాలా చట్టాలు తీసుకొచ్చాయి. కానీ దురదృష్టమేమంటే అమలు చేసే వ్యవస్థలు సైతం పితృస్వామిక భావజాలంలో కూరుకుపోవటంతో సమానత్వం అసాధ్యమవుతోంది. తమ ముందున్న కేసులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తీర్పు చెప్పవలసిన న్యాయమూర్తులు సైతం విచారణ క్రమంలో కావొచ్చు, తీర్పుల్లో కావొచ్చు... మహిళలకు సంబంధించి సమాజంలో ఉన్న పెడ ధోర ణులను ప్రతిబింబించే పదాలను వాడుతుంటారు. ఒక్కోసారి వాంఛనీయం కాని వైఖరిని ప్రదర్శి స్తుంటారు. ఉద్దేశపూర్వకం అయినా కాకపోయినా, వాటివల్ల మౌలికంగా న్యాయం తారుమారు కాకపోయినా... మన రాజ్యాంగం నిర్దేశించిన విలువలకు, విధానాలకు ఆ వైఖరి, ఆ పదాల వాడకం విరుద్ధమైనవి. ఈ విషయంలో రెండో మాటకు తావులేదు. వ్యభిచారం కేసుల్లో, వివాహేతర సంబంధంలో ఉన్న పురుషులకు ప్రత్యేక పదాలు లేవు. కానీ స్త్రీ విషయంలో అలా కాదు... వేశ్య, వ్యభిచారిణి, ఉంపుడు కత్తె, కాముకి అనే అర్థాలు వచ్చే రకరకాల పదాలు ఇంగ్లిష్‌లో ఉన్నాయి. కేసుల విచారణ సమయంలో న్యాయవాదులు, న్యాయమూర్తులు వీటిని యధేచ్ఛగా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు... రెచ్చగొట్టే దుస్తులు, పెళ్లికాకుండానే తల్లయిన యువతి వంటివి వాడుతున్నారు. 2012 డిసెంబర్లో దేశ రాజధాని నగరంలో కదిలే బస్సులో ఒక యువతిపై మూకుమ్మడి అత్యాచారం జరిగాక కఠినమైన నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది. అత్యంత అమానవీయమైన, దుర్మార్గమైన ఆ ఉదంతం తర్వాత సమాజపు ఆలోచనల్లో పూర్తి మార్పు వస్తుందనీ, మహిళల పట్ల చిన్నచూపు చూసే ధోరణులు తగ్గుతాయనీ అనేకులు ఆశించారు. కానీ సమాజం మాట అటుంచి న్యాయస్థానాల ఆలోచనా ధోరణే పెద్దగా మారలేదు. ఒక అత్యాచారం కేసులో నేరగాడిని నిర్దోషిగా పరిగణిస్తూ యువతులు శారీరక సుఖాలను ఆశించి తమంత తాము పురుషులతో వెళ్లడానికి సిద్ధపడి ఆ తర్వాత నిందపడుతుందన్న భయంతో కిడ్నాప్, అత్యాచారం కథలల్లుతున్నారని ఒక న్యాయమూర్తి 2013లో వ్యాఖ్యానించారు. సమాజంలో ఇలాంటి ధోరణి పెరుగుతున్నదని ఆయన ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి 2020లో కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది! అత్యాచారానికి గురైన యువతి ఆ వెంటనే నిద్రపోయి, మరునాడు కేసు పెట్టిందనీ, కనుక ఆమె ఫిర్యాదులో నిజాయితీ లేదనీ తేల్చారు. నిరంతర చలనశీలత సమాజ మౌలిక లక్షణం. మారుతున్న కాలానికి అనుగుణంగా భాష మారాలి. ప్రవర్తన, వైఖరి సంస్కారవంతం కావాలి. అది న్యాయస్థానాల నుంచే ప్రారంభం కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ భావించటం ప్రశంసనీయం. 19వ శతాబ్దం నాటి చట్టాలను మారుస్తూ ఈమధ్యే మూడు కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టిన కేంద్రం కూడా ఈ కోణంలో వాటిని పునఃసమీక్షించుకుని లింగ వివక్ష ధోరణులున్న నిబంధనలను సవరించుకుంటే మంచిది. -
టెండర్ ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోలేవు
సాక్షి, అమరావతి : టెండర్ నిబంధనలను బిడ్డర్లు సంతృప్తిపరిచారా లేదా అన్న విషయాలు పూర్తిగా బిడ్ ఆహ్వానించిన అధికారుల పరిధిలోనివని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని చెప్పింది. టెండర్ ప్రక్రియలో కోర్టుల జోక్యం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని, ప్రభుత్వం, ప్రజలు రెండు విధాలుగా నష్టపోతారని తెలిపింది. ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని, పనుల్లో అసాధారణ జాప్యం వల్ల ప్రజలు మౌలిక సదుపాయాలకు దూరమవుతారని వెల్లడించింది. రూ. 148 కోట్లతో చేపట్టిన రాజుపాళెం – అమరావతి రోడ్డు టెండర్ ప్రక్రియలో ఎలాంటి దోషం లేదని, దానిని చట్ట విరుద్ధంగా ప్రకటించలేమని తేల్చి చెప్పింది. ఈ పనులను వీఎస్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, కేబీసీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (వీఎస్–కేబీసీ) జాయింట్ వెంచర్‌కు అప్పగించడాన్ని సమర్థించింది. ఈ టెంటర్లపై దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయన సుజాత ఇటీవల తీర్పు వెలువరించారు. టెండర్ల తిరస్కరణపై పిటిషన్లు గుంటూరు జిల్లా రాజుపాళెం – అమరావతి రోడ్డు విస్తరణ, బలోపేతానికి ఆర్ అండ్ బీ టెండర్లు ఆహా్వనించగా, నాలుగు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. నిబంధనల ప్రకారం సర్టిఫికెట్లు, కొన్ని వివరాలు ఇవ్వకపోవడంతో పృథ్వీ కన్స్ట్రక్షన్స్ టెండర్‌ను, సాల్వెన్సీ సర్టిఫికెట్ సమర్పించకపోవడంతో శ్రీసాయినాథ్ కన్స్ట్రక్షన్స్ టెండర్‌ను అధికారులు తిరస్కరించారు. దీనిపై ఇరు కంపెనీలు వేర్వురుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ సుజాత విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. కంప్యూటర్ ఆపరేటర్ పొరపాటు వల్ల అనుభవ ధ్రువీకరణ పత్రం అప్లోడ్ చేయలేదన్నారు. దీనిపై వివరణ ఇచ్చినా అధికారులు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఆర్ అండ్ బీ తరఫున ప్రభుత్వ న్యాయవాది అశోక్ రామ్ వాదనలు వినిపిస్తూ.. అన్ని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సిన బాధ్యత బిడ్డర్లదేనన్నారు. బిడ్డర్లను అధికారులు వివరణ కోరాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఆన్లైన్ ద్వారానే అన్ని పత్రాలు ఇవ్వాలని, ఆఫ్‌లైన్‌లో స్వీకరించే అధికారం అధికారులకు లేదని తెలిపారు. బిడ్ తెరిచిన ఐదు రోజుల తరువాత అనుభవ ధ్రువీకరణ పత్రాన్ని పిటిషనర్లు ఇచ్చారన్నారు. నిబంధనల ప్రకారమే తమ బిడ్‌ను ఆమోదించారని వీఎస్–కేబీసీ జేవీ తరఫు న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సుజాత ప్రభుత్వ న్యాయవాది అశోక్ రామ్ వాదనలతో ఏకీభవించారు. అప్లోడ్ చేయని డాక్యుమెంట్ విషయంలో బిడ్డర్‌ను అధికారులు వివరణ కోరాల్సిన అవసరం లేదన్నారు. పిటిషనర్లు చేసిన జాప్యానికి మొత్తం టెండర్ ప్రక్రియను రద్దు చేయడం సాధ్యం కాదన్నారు. -
ఇమ్రాన్ ఖాన్‌ను బహిరంగంగా ఉరితీయాలి: పాక్ ప్రతిపక్ష నేత
ఇస్లామాబాద్: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను బహిరంగంగా ఉరి తీయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్ ప్రతిపక్ష నేత రాజా రియాజ్ అహ్మద్ ఖాన్. ఆయనకు బెయిల్ మంజూరు చేసిన కోర్టులపై కూడా విమర్శలు గుప్పించారు. ఇమ్రాన్‌ను జడ్జీలు అల్లుడిలా ట్రీట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంటులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్.. అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చారని, యూధుల ఏజెంట్ అని తీవ్ర ఆరోపణలు చేశారు రియాజ్. ఈ ఉగ్రవాదులే పాక్ పోలీసులపై పెట్రోల్ బాంబులు విసిరారని, దాడులు చేశారని పేర్కొన్నారు. కమాండర్ జిన్నా ఇంటిని కూడా తగలబెట్టారని మండిపడ్డారు. కోర్టులు ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేస్తూ.. ఒకవేళ ఆయన అంతగా నచ్చితే జడ్జీలంతా వెళ్లి పీటీఐ పార్టీలో చేరాలని సెటైర్లు వేశారు. కాగా.. ఇమ్రాన్ ఖాన్, పీటీఐ మద్దతుదారులు పాకిస్థాన్‌లో విధ్వంసం సృష్టిస్తున్న తెలిసిందే. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులు, భవనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు చనిపోయారు. దీంతో ప్రజలంతా శాంతియుతంగా నిరసనల్లో పాల్గొనాలని ఇమ్రాన్‌ఖాన్ పిలుపునిచ్చారు. పోలీసులు పీటీఐ కార్యకర్తలను అరెస్టు చేయడంపై మండిపడ్డారు. హింసకు పాల్పడింది ఒవరో నిర్ధారించుకోకుండా పీటీఐ శ్రేణలపై కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. చదవండి: అమ్మో హాజీ! పాకిస్తాన్ అండతో రెచ్చిపోతున్న డ్రగ్ కింగ్.. తేలు, ఎగిరే గుర్రం, డ్రాగన్... -
రూ.1,000 కోట్లు ఇచ్చానని చెబితే మోదీని అరెస్టు చేస్తారా?
న్యూఢిల్లీ: ‘‘ఢిల్లీ మద్యం విధానం పూర్తి పారదర్శకమైనది. గేమ్ చేంజర్. పంజాబ్‌లోనూ అదే విధానాన్ని అమలు చేస్తున్నాం. అక్కడ ఇప్పటికే ఆదాయంలో 50 శాతం పెరుగుదల నమోదైంది. ప్రధాని మోదీకి ఒక్కటే చెప్పదలచుకున్నా. నేనే అవినీతిపరుడినైతే ఇక ప్రపంచంలో ఎవరూ నిజాయతీపరులు కారు’’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆదివారం విచారణకు రావాలంటూ ఆయనకు సీబీఐ సమన్లు జారీ చేయడం తెలిసిందే. దీనిపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. విచారణకు హాజరవుతానన్నారు. ‘‘అయితే, మోదీకి రూ.1,000 కోట్లిచ్చానని ఏ ఆధారమూ లేకుండా నేను చెప్తాను. సీబీఐ, ఈడీ ఆయనను కూడా అరెస్టు చేస్తాయా?’’ అని ప్రశ్నించారు. మోదీపై జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తాజాగా చేసిన తీవ్ర ఆరోపణలను ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రస్తావించారు. ఆపాదమస్తకం అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తికి బహుశా అదో పెద్ద విషయంగా కని్పంచకపోవచ్చంటూ దుమ్మెత్తిపోశారు. ‘‘కేవలం రాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కేందుకే దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారు. నన్ను అరెస్టు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆ మేరకు ఆ పార్టీ గనక ఆదేశిస్తే దర్యాప్తు సంస్థలు పాటించి తీరతాయి’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘ఏ పార్టీ చేయనంతటి మంచి పనులు ఆప్ చేసి చూపడంతో ప్రజల్లో సరికొత్త ఆశలు చిగురించాయి. అందుకే 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో కనీవినీ ఎరగని స్థాయిలో ఆప్‌ను వేధిస్తున్నారు. నంబర్ 2, నంబర్ 3గా ఉన్న మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్లను జైలుపాలు చేశారు. ఇప్పుడు నాపై పడ్డారు’’ అని ఆరోపించారు. ‘‘గుజరాత్లో బీజేపీ 30 ఏళ్ల పాలనలో స్కూళ్ల పరిస్థితి ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఇటీవల మోదీ అక్కడ ఒక స్కూళ్లో పర్యటించినప్పుడు అధికారులు హడావుడిగా తాత్కాలిక క్లాస్‌రూం ఏర్పాటు చేయాల్సి వచి్చంది. కానీ ఢిల్లీలో మేం ఐదేళ్లలోనే సర్కారీ స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దాం’’ అన్నారు. ఆ 100 కోట్లు ఎక్కడ? ‘‘మేం రూ.100 కోట్ల లంచం తీసుకున్నట్టు ఆరోపించారు? ఆ డబ్బు ఎక్కడుంది?’’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. అవకతవకలు జరిగినట్టు ఎలాంటి ఆధారాలూ లేకపోయినా దర్యాప్తు సంస్థలు కోర్టులకు సమరి్పస్తున్న అఫిడవిట్లలో పచ్చి అబద్ధాలు చెబుతున్నాయని ఆరోపించారు. ‘‘నా పేరు, సిసోడియా పేరు చెప్పాలంటూ అరెస్టు చేసిన వారిని హింసిస్తున్నాయి. ఇదీ వారి విచారణ!’’ అంటూ నిప్పులు చెరిగారు. కోర్టులకు తప్పుడు ఆధారాలు సమరి్పస్తున్న సీబీఐ, ఈడీలపై కేసు పెడతానంటూ ట్వీట్ చేశారు. అవినీతిపై మాట్లాడకుండా కేజ్రీవాల్ గొంతు నొక్కేందుకు ఆయన అరెస్టుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోందని ఆప్ ఆరోపించింది. లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా: బీజేపీ కేజ్రీవాల్ వ్యాఖ్యలను బీజేపీ తోసిపుచి్చంది. ‘‘సీబీఐ సమన్లతో ఆయన వణికిపోతున్నారు. దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధపడాలి’’ అని సవాలు విసిరింది. చదవండి: ప్రయాగ్‌రాజ్‌లో అసద్ అంత్యక్రియలు.. తండ్రి అతిఖ్ అహ్మద్‌కు అనుమతి నిరాకరణ.. -
పౌర హక్కులకు... మేమే సంరక్షకులం
ముంబై: దేశంలో పౌరుల స్వేచ్ఛ తదితర హక్కులకు న్యాయస్థానాలే శ్రీరామరక్ష అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ పునరుద్ఘాటించారు. ప్రజలు కూడా ఈ విషయంలో న్యాయవ్యవస్థపైనే అపారమైన నమ్మకం పెట్టుకున్నారని స్పష్టం చేశారు. శనివారం బాంబే బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జస్టిస్ అశోక్ హెచ్.దేశాయ్ స్మారకోపన్యాసం చేశారు. దేశంలో స్వేచ్ఛా దీపిక నేటికీ సమున్నతంగా వెలుగుతోందంటే దాని వెనక ఎందరో గొప్ప న్యాయవాదుల జీవితకాల కృషి దాగి ఉందన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తన మనోగతాన్ని కుండబద్దలు కొట్టారు. ‘‘ఏ కేసూ చిన్నది కాదు, పెద్దదీ కాదు. నిన్న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన ఒక సామాన్య కేసే ఇందుకు తాజా ఉదాహరణ. విద్యుత్ పరికరాల దొంగతనం కేసులో యూపీకి చెందిన ఒక వ్యక్తికి ట్రయల్ కోర్టు తొమ్మిది కేసుల్లో రెండేసి సంవత్సరాల చొప్పున జైలు శిక్ష విధించింది. కానీ అది ఏకకాలంలో, అంటే రెండేళ్లలోనే పూర్తి కావాలని స్పష్టమైన ఆదేశాలివ్వడం మర్చిపోయింది. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ తప్పిదాన్ని సరిదిద్దాల్సి వచ్చింది. లేదంటే చిన్న దొంగతనం కేసులో దోషి ఏకంగా 18 ఏళ్ల జైల్లో మగ్గాల్సి వచ్చేది. అందుకే మరోసారి చెప్తున్నా. జిల్లా కోర్టు మొదలుకుని హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా ఏ కోర్టుకైనా చిన్న కేసు, పెద్ద కేసు అని విడిగా ఏమీ ఉండవు. అన్ని కేసులూ ముఖ్యమైనవే’’ అన్నారు. పౌర హక్కుల్ని అంతిమంగా న్యాయవ్యవస్థే పరిరక్షిస్తుందని ఈ కేసుతో మరోసారి తేటతెల్లమైందని అభిప్రాయపడ్డారు. సదరు కేసులో అలహాబాద్ హైకోర్టు కూడా ట్రయల్ కోర్టు తీర్పునే సమర్థించింది. దాంతో శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ సీజేఐ సారథ్యంలోని ధర్మాసనమే శుక్రవారం తీర్పు వెలువరించడం తెలిసిందే. ‘‘మనిషి ప్రవర్తన సజావుగా ఉండేలా చూడటంలో చట్టంతో పాటు నైతికతది కూడా కీలక పాత్ర. మన బయటి ప్రవర్తనను చట్టం నియంత్రిస్తే మనోభావపరమైన లోపలి ప్రవర్తనను నైతికత దారిలో ఉంచుతుంది’’ అని ఈ సందర్భంగా సీజేఐ అభిప్రాయపడ్డారు. కోర్టుల వల్లే సుస్థిర ప్రజాస్వామ్యం ఎమర్జెన్సీ సమయంలో కోర్టుల స్వతంత్ర వ్యవహార శైలే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు బాంబే హైకోర్టులో సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ‘‘ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొంటూ స్వతంత్రంగా, నిర్భీతిగా వ్యవహరించే న్యాయస్థానాలే నాడు దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాయి. మనకబారిన ప్రజాస్వామ్య స్వేచ్ఛా ప్రమిద పూర్తిగా కొడిగట్టిపోకుండా జస్టిస్ రాణే వంటి న్యాయమూర్తులే కాపాడారు. బార్ నుంచి వచ్చిన న్యాయమూర్తులు కూడా ఇందులో కీలక పాత్ర పోషించి ప్రజాస్వామ్య పతాకాన్ని సమున్నతంగా నిలిపారు. మన ప్రజాస్వామ్యం ఇప్పటికీ సుస్థిరంగా నిలిచి ఉందంటే అదే కారణం’’ అన్నారు. పలువురు న్యాయమూర్తులతో తాను పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ‘‘యువత న్యాయవాద వృత్తిని చేపట్టేలా ప్రోత్సహించడంలో బాంబే బార్ అసోసియేషన్ చురుౖMðన పాత్ర పోషించాలి. ఈ విషయంలో న్యాయమూర్తులపైనా గురుతరమైన బాధ్యత ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. -
కొలీజియం పరాయి వ్యవస్థ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి విమర్శలు గుప్పించారు. అది మన రాజ్యాంగానికి పరాయి వ్యవస్థ అన్నారు. 1991 కంటే ముందు న్యాయమూర్తులను ప్రభుత్వమే నియమించేదని గుర్తుచేశారు. కొలీజియం వ్యవస్థను తీర్పు ద్వారా సుప్రీంకోర్టే సృష్టించుకుందని శుక్రవారం ఢిల్లీలో ‘టైమ్స్ నౌ’ సదస్సులో ఆయనన్నారు. రాజ్యాంగం దేశంలో అందరికీ, ముఖ్యంగా ప్రభుత్వానికి మత గ్రంథం వంటిదే. కోర్టులు, కొందరు న్యాయమూర్తులు తీసుకున్న నిర్ణయానికి మొత్తం దేశం మద్దతున్నట్టు ఎలా భావిస్తాం? కొలీజియం వ్యవస్థను ఏ నియమం కింద నిర్వచిస్తారో చెప్పాలి. అయితే జడ్జీల నియామకానికి మరో ఉత్తమ వ్యవస్థ అందుబాటులోకి వచ్చేదాకా కొలీజియంను ప్రభుత్వం గౌరవిస్తూనే ఉంటుంది’’ అన్నారు. ఆ ఉత్తమమైన వ్యవస్థ ఏమిటన్న దానిపై తాను చర్చించలేనన్నారు. -
కోర్టుల సంఖ్య పెంచాలి.. ఎందుకంటే!
ఇటీవల కేంద్ర ప్రభుత్వం లోకసభలో, దేశవ్యాప్తంగా జైళ్లలోని ఖైదీలు, పొలీసు కస్టడీలోని నిందితులు 2016 నుండి 2022 వరకు 11,656 మంది మరణించినట్లు వెల్లడించారు. ఇందులో ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో, చివరి స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు నిలిచాయి. పొలీసు కస్టడీలో 7 శతం, జైళ్లలో 93 శతం మరణాలు సంభవిస్తున్నాయి. ఇందులో 1184 మరణాలకు ప్రభుత్వాలు బాధ్యతవహించి సంబంధిత కుటుంబాలకు 28.5 కోట్ల రూపాయలు నష్ట పరిహారం చెల్లించారు. భాద్యులైన అధికారులపై, పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. సంబంధిత మరణాలు సహజ, అసహజ, అనారోగ్య, పొలీసు ఎన్కౌంటర్లు, పోలీసుల చిత్ర హింసలు, జైళ్లలో తోటి ఖైదీలు చంపడం వంటి మొదలగు కారణాలని తెల్పింది. ఆధునిక భారతావనిలో దినదినం పెరుగుతున్న కస్టోడియల్ మరణాలు కల్లోలం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా 672 న్యాయస్థానాల్లో 4.70 కోట్ల కేసులు విచారణ దశలో పెండింగులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో సుప్రీమ్ కోర్టులో 71 వేలు, హైకోర్టుల్లో 59 లక్షలు మిగితావి క్రింది స్థాయి కోర్టుల్లో, ట్రిబ్యునళ్లలో పెండింగులో ఉన్నాయి. దేశంలో న్యాయమూర్తుల సంఖ్యను దేశ జనాభాతో పోల్చిచూసినప్పుడు ప్రతి 50 వేలమంది పౌరులకు కేవలం ఒక్క న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు. దేశంలో ప్రభుత్వాలు మంజూరు చేసిన న్యాయమూర్తుల సంఖ్య 25 వేలు ఇందులో, ఎప్పుడూ సుమారు 30 శాతం పోస్టులు ఖాళీగా ఉంటాయి. 1987లో లాకమీషన్ ప్రతీ 20 వేలమంది పౌరులకు ఒక్క న్యాయమూర్తిని నియమించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కానీ, నేటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రపంచ దేశాల న్యాయవ్యవస్థను పోల్చిచూసినప్పుడు చైనాలో ప్రతీ 3500 మంది పౌరులకు ఒక్క న్యామూర్తి, అమెరికాలో ప్రతీ 7,000 మంది పౌరులకు ఒక్క న్యాయ మూర్తి చొప్పున నియమించారు అందుకే, ఆయా దేశాల్లో పౌరులకు సత్వర న్యాయం లభిస్తుంది. దేశంలోని 1350 జైళ్లలో సుమారు 6 లక్షల 10 వేల మంది ఖైదీలు, శిక్షలు ఖరారైన వాళ్లు మరియు విచారణలో కొనసాగుతున్న వాళ్లు జైలు జీవితాన్ని గడుపుతున్నారు. వీరిలో సుమారు 80 శాతం మంది నిందితులు న్యాయస్థానాల్లో శిక్షలు ఖరారు కాకుండానే విచారణ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. వీరికి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కును దృష్టిలో పెట్టుకొని, ఇటీవల సుప్రీంకోర్టు సతేందర్ కుమార్ అంతిల్ వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మధ్య జరిగిన కేసు తీర్పులో, నేరాలను నాలుగు రకాలుగా విభజించి పలు ఆదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేస్తూ, నిందితులు చేసిన నేరానికి విధించే శిక్షలో 50 శాతం జైళు జీవితాన్ని పూర్తిచేసి జైళ్లల్లో మగ్గుతున్న ఖైదీలను వెంటనే బేయిలుపై విడుదల చెయ్యాలని అన్ని మేజిస్ట్రేట్, జిల్లా, హైకోర్టులను ఆదేశించింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించింది. కానీ, దురదృష్టవశాత్తు మనదేశంలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత అనేక క్రిమినల్ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ, కొంత మంది పోలీసులు అమాయకులపై తప్పుడు కేసులు పెడుతూ, బ్రిటిష్ కాలంనాటి మూస పద్ధతిలోనే పనిచేస్తున్నారు. పోలీసులు నిందితులను, నిందితులుగా చూడకుండా నేరస్తులుగానే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి క్రిమినల్ చట్టాల ప్రకారం ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను/అనుమానితులను గుర్తించి, విచారించి సదరు నిందితులను కోర్టు ముందు హాజరపరిచి విచారణలో, వారు నేరం చేసినట్లుగా తగు సాక్ష్యాధారాలతో న్యాయమూర్తుల ముందు పోలీస్ యంత్రాంగం చూపించవలసి ఉంటుంది. అంతిమంగా న్యాయస్థానాలు నిందితులను నేరస్తులుగా గుర్తించి శిక్షలు ఖరారు చేసి జైలుకు పంపిస్తాయి. దేశంలో సుమారు 4 లక్షల 88 వేలకు పైగా విచారణ ఖైదీలు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కును కోల్పోయి జైలు జీవితం గడుపుతున్నారు. న్యాయస్థానాలు వీరిలో కొందరిని నిర్దోషులుగా తేల్చినప్పుడు, వీరు కోల్పోయిన జీవితానికి ఎవరు బాధ్యులు?. వీరిలో నూటికి నూరు శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా పేదవారే ఉండడం గమనించతగ్గ విషయం. భారత రాజ్యాంగం నిందితులకు సత్వర న్యాయం పొందే హక్కును కల్పించింది. కానీ, నేడు నిందితులకు విచారణ ఖైదీగా జైలు జీవితం గడపడం అతిపెద్ద శిక్షగా మారింది. అందుకు కారణం ప్రభుత్వాలు దేశ జనాభాకు తగ్గట్లుగా కోర్టులు ఏర్పాటు చేయకపోవడం, న్యాయమూర్తులను నియమించకపోవడం, న్యాయస్థానాలకు కావలసిన భవన సముదాయాలు, వసతులు, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకపోవడమే. దేశంలో జైళ్ల సంఖ్యను పెంచి, జైళ్లలో కనీస వసతులతో ఖైదీలకు పౌష్ట ఆహారం, మెరుగయినా వైద్య సదుపాయాలు అందించాలి. అప్పుడే కస్టోడియల్ మరణాలు తగ్గి, రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన స్వేచ్ఛగా జీవించే హాక్కును రక్షించనివారిగా పాలకులు చరిత్రలో నిలిచిపోతారు. అదే సమయంలో దేశంలోని పౌరులకు విద్యార్థి దశ నుండి పోలీసు, జైళ్ల వ్యవస్థలపై, నేరాలపై, కేసుల నమోదు ప్రక్రియ నుండి న్యాయవ్యవస్థ విచారణ వరకు ప్రాథమిక అంశాలను విద్యా బోధనలో నేర్పించాలి. తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్న పోలీసులపై, అవే క్రిమినల్ చట్టాల ప్రకారం వారిపై కేసులు నమోదు చేసే స్థాయికి యువకులు, ప్రజలు ఎదుగవలసి ఉంది. (క్లిక్ చేయండి: విన్నారా? ‘మెదడే’ ప్రమాదకరమట!) – కోడెపాక కుమార స్వామి, హైదరాబాద్ -
పై కోర్టుల్లోనూ రిజర్వేషన్లు ఉండాలి
ఉన్నత న్యాయస్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీల నుంచి న్యాయమూర్తుల ప్రాతినిధ్యం తగినంతగా లేదు. ఆధిపత్య కులాలకు చెందిన వారికి అందుబాటులో ఉండే వృద్ధి అవకాశాలను వెనుకబడిన వర్గాలకు చెందినవారు పొందడం లేదన్నది వాస్తవం. ఉమ్మడి రాష్ట్ర న్యాయమూర్తుల్లో వీరి ప్రాతినిధ్యం సుమారు ఇరవై శాతమే. అదే సమయంలో జనాభాలో ఇరవై శాతం ఉన్నవారికి హైకోర్టు జడ్జీలుగా సుమారు ఎనభై శాతం ప్రాతినిధ్యం లభించింది. ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలో ఎలాంటి రిజర్వేషనూ లేదు. ఈ నేపథ్యంలో జడ్జీల నియామకంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మాత్రమే వ్యవస్థాగత వివక్షకు గురవుతున్న కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం లేని స్థితిని అధిగమించవచ్చు. భారత ప్రభుత్వం తరపున జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ చైర్పర్సన్ (2013–2016)గా, అదే సమయంలోనే అఖిల భారత వెనుకబడిన వర్గాల సమాఖ్య చైర్‌పర్సన్‌గా వ్యవహరించాను. నా మూడేళ్ల పదవీ కాలంలో దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీలకు చెందిన నేతల నుంచి వందలాది ఉత్తరాలను అందుకున్నాను. హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి న్యాయమూర్తుల ప్రాతినిధ్యం తగినంతగా లేని దుఃస్థితిని వారు నా దృష్టికి తెచ్చారు. సుప్రీం కోర్టులో, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టేలా చూడాలని ఈ వర్గాల ప్రతినిధులు కోరారు. ఆధిపత్య కులాలతో పోలిస్తే సాపేక్షికంగా ప్రతిభా సామర్థ్యాలు తక్కువగా ఉన్న కారణంగానే కోర్టుల్లో వెనుకబడిన వర్గాల ప్రాతి నిధ్యం లేదనేదాన్లో నిజం లేదని వీరి భావన. అణచివేయబడిన కమ్యూనిటీలకు చెందిన యువ న్యాయవాదులకు హై–ప్రొఫైల్ చాంబర్ లేదా సంస్థలో అరుదుగా చోటు లభిస్తోందని వీరు భావిస్తు న్నారు. విజయవంతమైన లాయర్ల కార్యాలయాల్లో వారి సామాజిక వర్గాలకు చెందిన సభ్యుల ఆధిపత్యమే నడుస్తోందని వీరు గమనిం చారు. సీనియర్లు కూడా వారికి విజయవంతమైన లాయర్లు కావడంలో తోడ్పాటు అందిస్తున్నారని వీరి అభిప్రాయం. ఇలా ఎదిగి వచ్చిన లాయర్లలో చాలామంది తర్వాత జడ్జీలుగా మారుతుంటారు. ఆధిపత్య కులాలకు చెందిన వారికి అందుబాటులో ఉండే వృద్ధి అవకా శాలను వెనుకబడిన వర్గాల అడ్వకేట్లు పొందడం లేదన్నది వాస్తవం. న్యాయస్థానంలో ఉన్న జడ్జీల సామాజిక నేపథ్యానికి చెందిన వాడు తమ కేసు వాదిస్తున్న లాయర్ అయితే కేసు త్వరగా విచారణకు వచ్చే అవకాశం ఉందని లిటిగెంట్ పబ్లిక్‌లో ఒక అభిప్రాయం ఉందని నాకు ఉత్తరాలు పంపిన వెనుకబడిన వర్గాల ప్రతినిధులు భావించారు. హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో అమలవుతున్న న్యాయమూర్తుల నియామక ప్రక్రియ... వివక్షకు ముగింపు పలకటం లేదనీ, న్యాయ మూర్తుల నియామకాల్లో కొన్ని సామాజిక బృందాల ఆధిపత్యాన్ని బద్దలు చేయడం లేదనీ వెనుకబడిన వర్గాల ప్రతినిధుల భావన. జ్యుడీషియల్ నియామకాల్లో రిజర్వేషన్లు ప్రస్తుతం ఎగువ, దిగువ స్థాయి జిల్లా న్యాయస్థానాలకు మాత్రమే వర్తిస్తుండటం గమనించాలి. ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలో ఎలాంటి రిజర్వేషన్ లేదు. బార్, జిల్లా జడ్జీలకు చెందిన అడ్వకేట్లను ఎలాంటి రిజర్వేషన్లు లేకుండానే ఉన్నత స్థానాల్లో నియమిస్తున్నారు. అలాగే హైకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు అడ్వ కేట్లను కూడా రిజర్వేషన్లు లేకుండానే ఉన్నత స్థానాల్లో నియమి స్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియా మకంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మాత్రమే వ్యవస్థాగత వివక్షకు గురవుతున్న కమ్యూనిటీలు ప్రాతినిధ్యం లేని స్థితిని అధిగమించవచ్చనే అభిప్రాయం ఉంటోది. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ప్రాతినిధ్య పరమైన వాస్తవికతను అంచనా వేయడానికి, అవిభక్త ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల సామాజిక నేపథ్యానికి చెందిన డేటాను సేకరించడమైనది. అలాగే విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకు చెందిన డేటా కూడా సేకరించడం జరిగింది. అయితే ఈ డేటాను సమర్పించడంలో జడ్జీల సామాజిక నేపథ్యానికీ... వారి ప్రతిభ, పనితీరు లేదా న్యాయ దృక్పథాలు, నిర్ణయాలకు మధ్య సహసంబంధం ఉందని చెప్పే ఉద్దేశం లేదని గమనించాలి. సరైన ప్రాతినిధ్యాలకు హామీ ఇవ్వడానికి రాజ్యాంగబద్ధ న్యాయ స్థానాల్లో రిజర్వేషన్లను కల్పించడాన్ని సమర్థించడమే ఈ డేటా సేకరణ మౌలిక ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా పేరు మార్చిన హైదరాబాద్ కోర్టును రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం, 1956 నవంబర్ 5న నెలకొల్పారు. 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్‌లో హైదరా బాద్ చేరిక తర్వాత, భాషా ప్రాతిపదికన తెలుగుప్రజల కోసం ఏర్పర్చిన రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్. 1956 నుంచి 2014 దాకా హైదరా బాద్ ప్రధాన కేంద్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు సేవలం దించింది. 1956లో హైకోర్టు జడ్జీల సంఖ్య 12 కాగా, 2014 నాటికి అది 61కి పెరిగింది. 2014లో రాష్ట్ర పునర్విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికీ, విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కూ ఉమ్మడి హైకోర్టుగా ఇది నాలుగేళ్లపాటు పనిచేసింది. 2018 డిసెంబర్ 26న భారత రాష్ట్రపతి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ కేంద్రంగానూ, విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి కేంద్రంగానూ హైకోర్టులను పునర్ వ్యవస్థీకరించారు. 2019 జనవరి 1న తెలంగాణకు 24 మంది జడ్జీలను, ఆంధ్రప్రదేశ్‌కి 37 మంది జడ్జీలను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సుప్రీంకోర్టుకు ప్రమోషన్‌పై వెళ్లిన న్యాయ మూర్తుల సంఖ్య 16. వీరిలో ఏడుగురు రెడ్డి కమ్యూనిటీకి చెందిన వారు. ముగ్గురు కమ్మ కమ్యూనిటీకీ, ఇద్దరు బ్రాహ్మణ కమ్యూనిటీకి, ఇద్దరు క్షత్రియ కమ్యూనిటీకి చెందివారు (వీరిలో ఒకరు వెలమ, మరొకరు రాజు). ఒకరు ముస్లిం కమ్యూనిటీకి, ఇంకొకరు షెడ్యూల్డ్ కులానికి చెందినవారు. అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లిన జడ్జీల్లో ఒక్కరు మాత్రమే ఎస్సీ! ఎస్టీలు, ఓబీసీలకు అసలు అవకాశమే లభించలేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రారంభమైనప్పటి నుంచీ ఇంతవరకు 45 మంది ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. ఇందులో 16 మంది బ్రాహ్మణ, 5 మంది రెడ్డి, 5 మంది వైశ్య కులానికి చెందినవారు. ముగ్గురు కాయస్థులు, ముగ్గురు క్షత్రియులు (వెలమ, రాజు, రాజ్ పుత్), ఇద్దరు కమ్మవారు, ఇద్దరు ముస్లిం కమ్యూనిటీకి చెందినవారు. మరో ఇద్దరు పంజాబీలు, ఒకరు మాహేశ్వరి, ఒకరు నాయర్, ఒకరు మరాఠా, మరొరు క్రిస్టియన్. వీరిలో ముగ్గురు ప్రధాన న్యాయ మూర్తులు మాత్రమే ఓబీసీలకు చెందినవారు. ఈ ముగ్గురిలో ఒకరు కేరళకు, మరొకరు తమిళనాడుకు చెందిన వారు కాగా ఒకరు తెలం గాణ వాసులు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినవారు ఒక్కరూ లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు నెలకొల్పినప్పటి నుంచీ నేటి వరకు 253 మంది జడ్జీలు సేవలందించారు. ఇందులో ఓబీసీల నుంచి 43 మంది, ఎస్సీల నుంచి 10 మంది, ఇద్దరు ఎస్టీలు హైకోర్టు జడ్జీలుగా పనిచేశారు. వాస్తవానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 80 శాతం పైగా జనాభా ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు చెందినవారే. రెండు రాష్ట్రాల హైకోర్టుల్లో వీరి ప్రాతినిధ్య 21.73 శాతం మాత్రమే. అదే సమయంలో జనాభాలో 20 శాతం కంటే తక్కువగా ఉన్నవారికి హైకోర్టు జడ్జీలుగా 78.26 శాతం ప్రాతినిధ్యం లభించింది. ఈ డేటా ప్రకారం తెలంగాణ హైకోర్టులో ఎస్సీ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించినవారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముస్లిం కమ్యూనిటికీ చెందిన జడ్జి ఒక్కరు కూడా లేరు. వెనుకబడిన వర్గాలు ముస్లింలు, క్రిస్టియన్లకు చెందిన ప్రతిభావంతులు ఎంతోమంది ఉన్నప్పటికీ వీరికి హైకోర్టులోనూ, సుప్రీకోర్టులోనూ న్యాయమైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. (క్లిక్: ముమ్మాటికీ తప్పును సరిదిద్దుకోవాలి) కాబట్టి, జనాభాలోని 80 శాతానికి పైగా వెనుకబడిన వర్గాల కమ్యూనిటీలకు, ఇతర మతపరమైన మైనారిటీ కమ్యూనిటీలకు రాజ్యాంగబద్ధ న్యాయస్థానాల్లో రిజర్వేషన్లు కల్పించాలనీ, వారికి తగిన స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించాలనీ వీరు గౌరవ న్యాయ స్థానాలను, భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఈ డేటా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీల ఆందోళనను నిర్ధారిస్తోంది. హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో జడ్జీల నియామకానికి జాతీయ న్యాయ కమిషన్ ద్వారా తాజాగా శాసనం రూపొందించాలని వీరు కోరుతున్నారు. - జస్టిస్ వి. ఈశ్వరయ్య అధ్యక్షుడు, అఖిల భారత వెనుకబడిన వర్గాల సమాఖ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి -
దివ్యాంగుల కోసం కోర్టుల్లో సౌకర్యాలు కల్పించాలి: హైకోర్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో దివ్యాంగులైన న్యాయవాదులు, కక్షిదారుల సౌకర్యార్థం లిఫ్టులు, రాకపోకలు సాగించేందుకు వీలుగా ఏర్పాట్లు, ఇతర వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వసతుల ఏర్పాటు బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలుసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇందుకోసం తమ ముందున్న వ్యాజ్యంలో ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్లను ఆదేశించింది. విచారణను ఏప్రిల్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా నరసరావుపేట కోర్టులో దివ్యాంగులైన న్యాయవాదులకు, కక్షిదారులకు తగిన సౌకర్యాలు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాదులు జీఎల్‌వీ రమణమూర్తి, మరో ఏడుగురు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. -
వివక్ష, వివాదం ఉంటేనే జోక్యం
న్యూఢిల్లీ: ప్రభుత్వ పాలనా విధానాల్లో స్పష్టంగా వివక్ష, వివాదకర అంశాలు ఉన్న సందర్భాల్లోనే కోర్టులు కలగజేసుకోవాలని, విధానాలు సవ్యంగా ఉన్నపుడు జోక్యం అనవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. బోనస్ మార్కుల విషయంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎన్హెచ్ఎం, ఎన్ఆర్హెచ్ఎం సిబ్బంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల ధర్మాసనం విచారించింది. ‘ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ అవసరాలకు తగ్గట్లుగా శిక్షణ పూర్తిచేసుకుని రాజస్తాన్ గ్రామీణ, ఎడారి ప్రాంతాల్లో పనిచేసిన ఆ సిబ్బందికి అదనపు పరిజ్ఞానం, అనుభవం ఉంటుంది. అందుకే వారికి అదనంగా బోనస్ మార్కులు ఇవ్వడం సబబే. ఇలాంటి పరిపాలనా విధానాల్లో కలగజేసుకోవడంలో కోర్టులు తొందరపాటు పనికిరాదు. వివాదాలు ఉంటేనే న్యాయం అందించేందుకు నెమ్మదిగా జోక్యం చేసుకోవాలి’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అనవసర వ్యాఖ్యలొద్దు న్యూఢిల్లీ: ఏదైనా కేసుపై విచారణ జరిపేటప్పుడు దానితో సంబంధం లేని అనవసర వ్యాఖ్యలు చేయద్దని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టులు పరిధులను అతిక్రమించరాదని, వాద, ప్రతివాదుల మధ్య వివాదాలకు తలెత్తేలా వ్యవహరించరాదని, అనవసర వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఓ టెండర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత్ ఫ్రిట్జ్ వెర్నర్ లిమిటెడ్ అనే సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో హైకోర్టు వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఢిల్లీ హైకోర్టు కనీసం రిట్ పిటిషన్ అర్హతను కూడా నిర్ణయించలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆక్షేపించింది. కేసుతో సంబంధం లేని అనవసర వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హితవు పలికింది. -
ఏపీకి 18 ఈ-పోక్సో కోర్టులు
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారం, పోక్సో చట్టం కేసుల సత్వర పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌కు 18 ఈ–పోక్సో కోర్టులు కేటాయించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌రిజుజు శుక్రవారం లోక్‌సభలో తెలిపారు. వీటిలో 10 ప్రస్తుతం పనిచేస్తున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ మూడు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిచేయ తలపెట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులకు సాగరమాలలో భాగంగా ఆర్థికసాయం ఇవ్వడం లేదని కేంద్ర నౌకాయన మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. ఈ మూడు నాన్–మేజర్ పోర్టులు అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని ఎంపీ బాలశౌరి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కోర్టుల్లో ఏఐ జస్టిస్ డెలివరీ సిస్టమ్ సామర్థ్యం పెంచడానికి సాంకేతికతతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆవశ్యకతను గుర్తించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌రిజుజు తెలిపారు. ఈ–కోర్టు రెండో దశ ప్రస్తుతం కొనసాగుతోందని వైఎస్సార్సీపీ ఎంపీలు గోరంట్ల మాధవ్, వంగా గీతావిశ్వనా«థ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భర్తీకాని 1,425 పీజీ సీట్లు 2020–21లో 1,425 మెడికల్ పీజీ సీట్లు భర్తీకాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా చెప్పారు. వీటిలో 1,365 బ్రాడ్–స్పెషాలిటీ సీట్లు, 60 డిప్లొమా సీట్లు ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఏపీలో 12,859 మంది ఔషధ మొక్కల సాగు ఆంధ్రప్రదేశ్‌లో 12,859 మంది రైతులు ఔషధ మొక్కలు సాగుచేస్తున్నట్లు కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా ఆయా రైతులకు ఆర్థికసాయం అందిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్‌లో నర్సింగ్ కళాశాల మంగళగిరి ఎయిమ్స్‌లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి నర్సింగ్ కళాశాల ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ తెలిపారు. ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. కాగా,దేశవ్యాప్తంగా మంగళగిరి సహా 13 ఎయిమ్స్‌ల్లో 7,500 పడకలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ఉచిత వ్యాక్సిన్‌కు రూ.27,945.14 కోట్లు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించడానికి 2021–22లో రూ.35 వేల కోట్లు కేటాయించగా ఫిబ్రవరి 7 నాటికి రూ.27,945.14 కోట్లు వినియోగించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ తెలిపారు. 2022–23 బడ్జెట్లో కూడా వ్యాక్సినేషన్‌కు రూ.5 వేల కోట్లు కేటాయించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మంత్రుల సంఖ్య పెంచే ప్రతిపాదన లేదు కేంద్ర మంత్రుల సంఖ్య పెంచడానికి రాజ్యాంగాన్ని సవరించే ప్రతిపాదనేదీ ప్రస్తుతం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌రిజుజు.. వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. -
ప్రభుత్వాలు సొంతంగా పనిచేస్తే పిటిషన్ల అవసరం ఉండదు
న్యూఢిల్లీ: ప్రభుత్వాలు సొంతంగా పనిచేస్తే న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయాల్సిన అవసరం ఎవరికీ ఉండదని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్), ఢిల్లీలో వాయు కాలుష్యం నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ విషయంలో ‘ఎన్సీఆర్, పరిసర ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్’ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని పేర్కొంది. రాజధానిలో గాలి నాణ్యతను పెంచేలా ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ప్రత్యేక న్యాయస్థానం వరుసగా రెండోరోజు శుక్రవారం కూడా విచారణ జరిపింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో పాఠశాలలను మూసివేయాలని ఆదేశించినందుకు ఓ వర్గం మీడియా, కొందరు వ్యక్తులు తమను(న్యాయమూర్తులు) విలన్‌గా చిత్రీకరిస్తున్నారని ఆక్షేపించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం కేసును మూసివేయబోమని స్పష్టం చేసింది. కాలుష్యం కట్టడికి ప్రభుత్వాలు చేపట్టే చర్యలను పర్యవేక్షిస్తూనే ఉంటామని తేల్చిచెప్పింది. కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు గాను ఆసుపత్రులను సిద్ధం చేయడానికి వీలుగా నిర్మాణాలను పునఃప్రారంభించేందుకు ఢిల్లీ ప్రభుత్వానికి ధర్మాసనం అనుమతి మంజూరు చేసింది. ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఐదుగురు సభ్యులతో ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలియజేసింది. తాము సూచించిన చర్యల అమలు తీరును పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. -
మౌలిక సదుపాయాలు అధ్వానం
ముంబై: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. అందరికీ న్యాయం అందాలంటే, న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. కానీ మన కోర్టుల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిర్వహణ ఒక ప్రణాళిక లేకుండా ఉండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్‌కు చెందిన భవనాలను శనివారం సీజేఐ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హాజరయ్యారు. న్యాయశాఖ మంత్రి ఎదుటే జస్టిస్ రమణ తన ఆవేదనంతా బయటపెట్టారు. దేశంలోని చాలా కోర్టుల్లో సరైన సదుపాయాలు లేవని, కొన్ని కోర్టు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని చెప్పారు. మౌలిక సదుపాయాలు ఉంటేనే న్యాయవ్యవస్థ బాగుంటుందని, న్యాయవ్యవస్థ సమర్థంగా పనిచేస్తే ఆర్థిక రంగం వృద్ధి చెందుతుందని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. 2018లో సరైన సమయంలో తీర్పులు రాకపోవడం వల్ల దేశం వార్షిక జీడీపీలో 9% మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైనట్టుగా ఈ సందర్భంగా జస్టిస్ రమణ చెప్పారు. ఇప్పుడు తాను ప్రారంభించిన ఔరంగాబాద్ కోర్టు భవన నిర్మాణం 2011లో మొదలైందని, అది పూర్తి కావడానికి పదేళ్లు పట్టిందంటే ప్రణాళికలో ఎన్ని లోపాలున్నాయో తెలుస్తోందని అన్నారు. కేవలం క్రిమినల్స్, బాధితులు మాత్రమే కోర్టు గుమ్మం తొక్కుతారన్న అభిప్రాయం ఇప్పటికీ సామాన్యుల్లో నెలకొని ఉందని.. చాలా మంది తాము అసలు కోర్టు ముఖం కూడా చూడలేదని గర్వంగా చెప్పుకుంటారన్న జస్టిస్ రమణ అలాంటి ఆలోచనల్ని రూపుమాపి అందరూ తమ హక్కుల సాధనకు కోర్టుకు వచ్చే పరిస్థితులు కల్పించాలన్నారు. ప్రజలు కోర్టుకు రావడానికి సంకోచపడే రోజులు పోవాలని, న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉండడమే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు. దృఢమైన న్యాయవ్యవస్థతో ప్రజాస్వామ్యం విజయవంతం: రిజిజు జస్టిస్ ఎన్.వి. రమణ మౌలిక సదుపాయాల అంశం గురించి ఆందోళన వ్యక్తం చేయడానికి ముందే కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తన ప్రసంగంలో ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే దృఢమైన న్యాయవ్యవస్థ ఉండాలన్నారు. న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. కింది కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.9 వేల కోట్లు కేటాయిస్తూ గత మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ బడ్జెట్‌తో 4 వేల కోర్టు భవనాలు, న్యాయమూర్తులకు 4 వేల నివాసాలు కట్టించి ఇస్తామని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాయని రిజిజు చెప్పారు. కోర్టుల్లో పరిస్థితి ఇదీ..! కోర్టుల్లో మౌలికసదుపాయాలు ఎంత అధ్వానంగా ఉన్నాయో జస్టిస్ రమణ గణాంకాలతో సహా వివరించారు. ‘‘దేశవ్యాప్తంగా 20,143 కోర్టు భవనాలు ఉన్నాయి. 16% కోర్టుల్లో కనీసం టాయిలెట్లు లేవు. 26% కోర్టుల్లో మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్ సదుపాయం లేదు. కేవలం 54% కోర్టుల్లోనే రక్షిత మంచినీరు లభిస్తోంది. 5% కోర్టుల్లో ప్రాథమిక వైద్య సదుపాయాలు ఉన్నాయి. 32% కోర్టుల్లో రికార్డు రూములు విడిగా ఉన్నాయి. 51%కోర్టుల్లో మాత్రమే లైబ్రరీ సదుపాయం ఉంది. కేవలం 27% కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచా రణ చేయడానికి వీలుగా న్యాయమూర్తుల టేబుల్‌పై కంప్యూటర్లు ఉన్నాయి’’ అని తెలిపారు. -
నిందితుడి పూర్వాపరాలు విచారించాకే బెయిల్
న్యూఢిల్లీ: నిందితుడికి బెయిల్ మంజూరు చేసేటప్పుడు న్యాయస్థానాలు అతడి పూర్వాపరాలను సమగ్రంగా విచారించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అతడి నేర చరిత్రను పరిశీలించాలని సూచించింది. ఒకవేళ బెయిల్ ఇస్తే బయటకు వెళ్లాక తీవ్రమైన నేరాలకు పాల్పడే అవకాశం ఉందా? అనేది తెలుసుకోవాలని పేర్కొంది. హత్య, సాక్ష్యాధారాలను మాయం చేయడం వంటి కేసుల్లో నిందితుడైన ఇందర్‌ప్రీత్ సింగ్‌కు పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్.షాల ధర్మాసనం విచారణ చేపట్టింది. నిందితుడికి బెయిల్ ఇస్తూ పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను పక్కనపెట్టింది. పూర్వాపరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని కోర్టులకు సూచించింది. జరిగిన నేరం, లభించిన సాక్ష్యాధారాలు కూడా బెయిల్‌ను ప్రభావితం చేస్తాయని తెలిపింది. నేరం రుజువైతే విధించబోయే శిక్ష తీవ్రతను కూడా బెయిల్ విషయంలో పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. -
11న మెగా లోక్‌అదాలత్
సాక్షి, హైదరాబాద్: జాతీయ న్యాయసేవా సాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 11న(శనివారం) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో మెగా లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర న్యాయసేవా సాధికార సంస్థ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. రాజీ ద్వారా పరిష్కారానికి అవకాశం ఉన్న కేసులను ఈ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించింది. అదాలత్ తీర్పునకు అప్పీల్ ఉండదని వివరించింది. అదాలత్‌లో కేసులను పరిష్కరించుకుంటే సివిల్ కేసుల్లో చెల్లించిన కోర్టు ఫీజును తిరిగి చెల్లిస్తామని పేర్కొంది. -
‘స్త్రీలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’
న్యూఢిల్లీ: ‘‘లా అంటే నేటికి కూడా ధనవంతులు మాత్రమే చదవగలిగే కోర్సుగానే చూస్తున్నారు.. కాకపోతే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వస్తుంది. అలానే న్యాయవాద వృత్తిని స్వీకరించే మహిళల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందన్నారు’’ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. దేశంలోని పలు కోర్టుల్లో కనీస మౌలిక సౌకర్యాలు లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో కొత్తగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. అలానే హైకోర్టులలో ఉన్న ఖాళీల్లో 90శాతం పోస్టులను మరో నెల రోజుల వ్యవధిలో పూర్తిచేయనున్నట్లు ఎన్వీ రమణ తెలిపారు. ఎలాంటి వివాదం లేకుండానే కేవలం ఆరు రోజుల్లోనే సుప్రీంకోర్టుకు 9 మంది న్యాయమూర్తుల నియాకమానికి అనుమతులిచ్చినందుకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజుకి జస్టిస్ రమణ ధన్యవాదాలు తెలిపారు. కాగా ఏడు దశాబ్దాల చరిత్రలో ఒకేసారి 9 మంది న్యాయమూర్తులు ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘‘లా కోర్సు అనగానే కేవలం ధనవంతులు మాత్రమే చదవగలిగేదిగా చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అవకాశాలు పెరుగుతున్నాయి. న్యాయవాద వృత్తి నేటికి కూడా పట్టణ వాసులకు సంబంధించిన వృత్తిగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఈ వృత్తిల్లో స్థిరంగా కొనసాగవచ్చు అని ఎవరూ హామీ ఇవ్వలేకపోతున్నారు. అందుకే న్యాయవాద వృత్తిని స్వీకరించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది’’ అన్నారు. అలానే కోర్టుల్లో మౌలిక సౌకర్యాలకు సంబంధించి ఎన్వీ రమణ.. కేంద్ర న్యాయ శాఖ మంత్రికి నివేదిక సమర్పించారు. (చదవండి: ఇదేం బాధ్యతారాహిత్యం) ఈ సందర్భంగా ఎన్వీ రమణ కోర్టుల్లో మహిళా జడ్జీల సంఖ్య తక్కువగా ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ‘‘సుప్రీంకోర్టులో కేవలం 11 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారనే విషయాన్ని తెలియజేయడానికి చాలా చింతిస్తున్నాను. నేను హైకోర్టులో పని చేసే రోజుల్లో మహిళా జడ్జీల కోసం కనీసం టాయిలెట్స్ కూడా ఉండేవి కావు. నేను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాను’’ అన్నారు. దేశవ్యాప్తంగా పది హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా 68 మంది పేర్లను ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఎకానమీ పురోగమిస్తోందన్న వార్తలు చదివాం!) -
ఫుడ్‌కోర్టుపై రాబంధులు.. ఒక్కో షాపు తెరిచేందుకు..
‘మీరు నైట్ ఫుడ్ కోర్టులో షాప్ పెట్టుకుంటారా? అయితే లక్ష రూపాయలు మా చేతిలో పెట్టండి. మీ బండి మీకు నచ్చిన ప్లేస్‌లో పెట్టిస్తాం.’ కొంతమంది సాగిస్తున్న బేరసారాలివి. కార్పొరేషన్ సాక్షిగా దందా చేస్తూ.. నైట్ ఫుడ్ కోర్టు ప్రారంభించేందుకు వసూళ్ల పర్వానికి తెరతీస్తున్నారు. వీరి వ్యవహారానికి జీవీఎంసీ సిబ్బంది కొందరు సహకారమందిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: మహా నగర పరిధిలో స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కోసం జీవీఎంసీ 2019 ఫిబ్రవరిలో జైల్ రోడ్డులో 27 ఫుడ్ స్టాల్స్‌తో నైట్ ఫుడ్ కోర్టు ప్రారంభించింది. ఆ తర్వాత క్రాఫ్ట్ బజార్ కూడా ఇందులో ప్రారంభించాలని భావించింది. కరోనా ప్రభావంతో 2020 మార్చి నుంచి వ్యాపారాలు మూతపడ్డాయి. పర్యవేక్షించాల్సిన జీవీఎంసీ అధికారులంతా కోవిడ్ నియంత్రణ చర్యల్లో 24 గంటలూ బిజీ అయిపోయారు. లాక్డౌన్ క్రమక్రమంగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో నైట్‌ఫుడ్ కోర్టు తిరిగి తెరుచుకుంటుందని కొందరు ప్రచారానికి తెరతీశారు. దీంతో తాము ఫుడ్ కోర్టులో బండి పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆ కీలక వ్యక్తుల వెనుక షాపుల యజమానులు తిరగడం ప్రారంభించారు. 27 స్టాళ్లకు అనుమతి.. 120 షాపులకు వసూళ్లు నైట్ ఫుడ్ కోర్టులో మొత్తం 27 స్టాళ్లకు మాత్రమే అధికారిక అనుమతులు ఇచ్చినా లాక్డౌన్ ప్రారంభానికి ముందు ఈ దుకాణాల సంఖ్య 138కి చేరుకుంది. ఏ ఒక్కరికీ అనుమతి లేకపోయినా.. అప్పట్లో జీవీఎంసీ అధికారులు, సిబ్బంది వసూళ్ల పర్వంతో అవి నడిపించేశారు. ఇందులోనూ రెండు సంఘాలు ఏర్పడి.. వాళ్లు కూడా దందా సాగించేశారు. ఇప్పుడు మళ్లీ దుకాణాలు తెరిచేందుకు కొందరు బేరసారాలు మొదలు పెట్టేశారు. రెండు యూనియన్ల ద్వారా.. రాయబేరాలు నడుపుతూ పాతవారితో పాటు కొత్తగా వచ్చేవారికి కూడా స్టాల్ ప్లేస్ కేటాయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు వసూళ్లు ప్రారంభించేశారు. ఒక స్టాల్ పెట్టడానికి అక్షరాలా రూ.లక్ష చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నైట్ ఫుడ్ కోర్టుకు మంచి డిమాండ్ ఉండటంతో ఇప్పటికే 50 మందికి పైగా డబ్బులు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. మరో 70 మంది వరకూ వీరితో బేరాలు ఆడుతున్నారని.. రూ.లక్షకు ఒక్క పైసా కూడా తగ్గేదేలే అని తెగేసి చెబుతున్నట్లు తెలిసింది. ఈ వసూళ్లకు జీవీఎంసీ సిబ్బంది కూడా సహకరిస్తున్నట్లు సమాచారం. లాక్డౌన్ కొనసాగుతుండగా ఎలా? ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే మంచి స్పందన రావడంతో నగరంలోని వివిధ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 500కు పైగా దరఖాస్తులు వచ్చినా వారికి ఇవ్వకుండా అప్పటి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులకు దుకాణాలు కేటాయించేశారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ గతంలో కథనాలు రాయగా... ఫుడ్‌కోర్టు నుంచి స్టాల్స్ మొత్తాన్ని తొలగించేశారు. ఇప్పుడు మళ్లీ రచ్చ మొదలైంది. దీనిపై జీవీఎంసీ అధికారులను సంప్రదించగా.. లాక్డౌన్ కొనసాగుతుండగా నైట్ ఫుడ్ కోర్టు తెరిచే అవకాశమే లేదని స్పష్టం చేశారు. కొందరు వసూళ్లకు పాల్పడుతున్న విషయం తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు. మొత్తంగా ఫుడ్ కోర్ట్ ఏర్పాటు సదుద్దేశాన్ని పక్కదారి పట్టించి.. చిరు వ్యాపారులను మింగేసేందుకు వేస్తున్న స్కెచ్‌పై జీవీఎంసీ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. చదవండి: ఇసుక మైనింగ్‌పై టీడీపీ అసత్య ఆరోపణలు: గోపాలకృష్ణ ద్వివేది -
TS High Court: నెలాఖరు వరకు ఆన్లైన్లోనే విచారణ
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ నెల 31వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారానే కేసులను హైకోర్టు విచారించనుంది. అయితే కింది కోర్టుల్లో ఆదిలాబాద్, నిజామాబాద్‌ల్లో మినహా ఇతర అన్ని జిల్లా కోర్టుల్లో మాత్రం కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ నెల 19 నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు ఫుల్‌కోర్టు నిర్ణయించింది. ఈ విషయాన్ని ఉన్నత న్యాయస్థానం రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో 50 శాతం ఉద్యోగులే దశలవారీగా విధులకు హాజరుకావాలని ఆదేశించగా ఈ నెల 19 నుంచి 100 శాతం ఉద్యోగులు విధులకు హాజరుకావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మహారాష్ట్రతో సరిహద్దులు ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని కోర్టులు మాత్రం ఈ నెల 31వ తేదీ వరకు ఆన్లైన్ విచారణ కొనసాగించాలని పేర్కొన్నారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో ఈ నెల 19 నుంచి పాక్షికంగా విచారణ ప్రారంభించాలని ఆదేశించారు. గతేడాది మార్చి నెలాఖరు నుంచి హైకోర్టు న్యాయమూర్తులు ఆన్లైన్లోనే కేసులను విచారిస్తున్నారు. కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టిన అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొందరు జడ్జీలు ఒక రోజు భౌతికంగా, మరోరోజు ఆన్లైన్లో కేసులను విచారించారు. మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరగడంతో న్యాయమూర్తులంతా ఆన్లైన్ ద్వారానే కేసులను విచారిస్తున్నారు. -
హైకోర్టు ఆన్‌లైన్‌కు ఏడాది
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా రాష్ట్రంలో న్యాయస్థానాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాక ఏడాది అవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 9 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కేసులను విచారించాలని హైకోర్టు తన పరిధిలో పనిచేసే అన్ని న్యాయస్థానాలకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. భౌతిక విచారణలో జరిగినంత వేగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ సాధ్యం కాకపోవడంతో ఆ ప్రభావం కేసులపై పడుతోంది. దీంతో పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. హైకోర్టు న్యాయమూర్తులు, కింది కోర్టుల న్యాయా ధికారులు, సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతోంది. కక్షిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్డౌన్ సమయంలో మొత్తం స్తంభించిపోవడంతో న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కనీస ఆదాయం లేక పలువురు న్యాయవాదులు ముఖ్యంగా యువ న్యాయవాదులు ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి వారిని రాష్ట్ర ప్రభుత్వం ‘లా నేస్తం’ద్వారా కొంతమేర ఆదుకుంది. న్యాయవాదులకు రుణాలు కూడా ఇచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ విధానం వల్ల పాతతరం న్యాయవాదు లు సాంకేతికతకు అలవాటు పడేందుకు చాలా సమయం పట్టింది. పలువురు మృత్యువాత... హైకోర్టులో కరోనా విజృంభించినప్పుడు పలువురు ఉద్యోగులు, న్యాయవాదులు మృత్యువాతపడ్డారు. అప్పటి సీజే తీరువల్లే కరోనా చెలరేగిందని, అప్పటి ఇన్చార్జి రిజిస్ట్రా్టర్ రాజశేఖర్, మరికొందరు మృత్యువాత పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కింది కోర్టుల్లో ఇబ్బందులు... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు అవసరమైన పూర్తిస్థాయి సాంకేతికత కింది కోర్టుల్లో అందుబా టులో లేకపోవడం కేసుల విచారణకు అవరోధంగా మారింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వి నిపించేందుకు న్యాయవాదులు మొబైల్ ఫోన్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఫోన్లలో సిగ్నల్స్ లేక కేసులు తరచూ వాయిదా పడుతున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాక్షుల విచారణ, సాక్ష్యాల నమోదు కింది కోర్టులకు సవాలుగా మారింది. కరోనా సెకండ్‌వేవ్ భయాందోళనల నేపథ్యంలో హైకోర్టు ఏప్రిల్ తరువాత కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణకు మొగ్గు చూపే అవకాశం ఉంది. హైకోర్టులో పెండింగ్ కేసుల వివరాలు... ► హైకోర్టులో 29.01.2020 నాటికి 70,264 సివిల్ కేసులు, 30,485 క్రిమినల్ కేసులు, 95,804 రిట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 1,96,553 పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సంఖ్య 16.09.2020 నాటికి 2,03,124కు పెరిగింది. వీటిలో సివిల్ 1,72,657, క్రిమినల్ కేసులు 30467 ఉన్నాయి. ► హైకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య 2021 మార్చి 21 నాటికి 2,10,900కు పెరిగింది. వీటిలో సివిల్ 1,79,673 కాగా, క్రిమినల్ కేసులు 31,227 ఉన్నాయి. ► రాష్ట్రవ్యాప్తంగా కింది కోర్టుల్లో 6,66,996 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 3,66,718 సివిల్ కేసులు కాగా 3,00,278 క్రిమినల్ కేసులు ఉన్నాయి. -
దర్యాప్తు దశలో ‘స్టే’ వద్దు
సాక్షి, అమరావతి కేసు నమోదు, దర్యాప్తు చేయడం పోలీసుల పరిధిలోని అంశాలు. న్యాయవ్యవస్థ ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా ముఖ్యం. కాగ్నిజబుల్ నేరాల్లో న్యాయస్థానం అనుమతి లేకుండా దర్యాప్తు చేసే హక్కు పోలీసులకుంది. – కింగ్ ఎంపరర్ వర్సెస్ ఖ్వాజా అహ్మద్ (1945) నేరంపై దర్యాప్తు జరపడం పోలీసులకు సంబంధించింది. దర్యాప్తులో నేరం చేసినట్లు తేలితే, ఆ నేరం చేసినట్లు రుజువు చేయాల్సిన బాధ్యత కూడా పోలీసులదే. ఇందులో న్యాయస్థానాల జోక్యానికి ఆస్కారమే లేదు. – స్టేట్ ఆఫ్ బిహార్ వర్సెస్ జేఏసీ సల్దాన (1979) శాంతిభద్రతల పరిరక్షణలో దర్యాప్తు అధికారిదే కీలక పాత్ర. నేరానికి సంబంధించిన ఆధారాలను సేకరించే స్వేచ్ఛను పోలీసులకు న్యాయస్థానాలివ్వాలి. – స్టేట్ ఆఫ్ బిహార్ వర్సెస్ పీపీ శర్మ (1991) నేరాలపై దర్యాప్తు చేయడం దర్యాప్తు అధికారుల పరిధిలోని అంశం. అత్యంత అరుదైన కేసుల్లో తప్ప కోర్టులు దర్యాప్తులో ఏవిధంగానూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. నేరస్తుల విచారణ, సమాధానాలు రాబట్టడం, అవి సంతృప్తికరంగా ఉన్నాయా.. తప్పుదోవ పట్టించేలా ఉన్నాయా? అనేవి దర్యాప్తు సంస్థ పరిధిలోనివి. – పి.చిదంబరం వర్సెస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (2019) అమరావతి భూకుంభకోణంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు వంటివి గతంలో ఎన్నడూ ఇవ్వలేదు. అత్యంత అరుదైన కేసుల్లోనే జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులిచ్చింది. ఇలాంటి కేసుల్లో ఉత్తర్వులిచ్చేటప్పుడు న్యాయస్థానాలు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే సామాన్యులు మాకొక న్యాయం, వారికొక న్యాయమా? అని ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. – ఎల్.రవిచందర్, సీనియర్ న్యాయవాది, హైకోర్టు దర్యాప్తు చేయడానికి ముందు, దర్యాప్తు కీలక దశలో ఉండగా స్టే ఇవ్వడాన్ని అసాధారణంగానే భావించాలి. దర్యాప్తు సంస్థలను వాటి పని వాటిని పనిచేసుకోనివ్వాలి. ప్రత్యేక పరిస్థితుల్లోనే కోర్టులు జోక్యం చేసుకోవాలి. – గండ్ర మోహనరావు, న్యాయవాది దర్యాప్తును ఆపడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పింది. ఫిర్యాదు ఇచ్చినప్పుడు దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు తెలుస్తాయి. ఫిర్యాదులో చేసిన ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉందో తేల్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. – చిత్తరవు నాగేశ్వరరావు, సీనియర్ న్యాయవాది ఇవేకాదు. నిర్మల్జీత్సింగ్ హూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పశ్చిమ బెంగాల్ (1972), స్టేట్ ఆఫ్ పశ్చిమ బెంగాల్ వర్సెస్ సుజిత్‌కుమార్ రాణా (2004), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్సెస్ అరుణ్ కుమార్ భజోరియా (1997) సహా ఎన్నో కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం ఇదే విషయాన్ని పదేపదే ఉద్ఘాటిస్తూ వస్తోంది. నిన్నగాక మొన్న రాజధాని భూములకు సంబంధించిన ఓ కేసులో కూడా ఇలాంటి ఉత్త్తర్వులే ఇచ్చింది. “దర్యాప్తు పోలీసుల పరిధిలోని వ్యవహారం. ప్రాథమిక స్థాయిలోనే దర్యాప్తును న్యాయస్థానాలు అడ్డుకోవడానికి వీల్లేదు’ అని పేర్కొంది. ఇటీవల కొన్ని కేసుల్లో... ప్రాథమిక దశలోనే ఎఫ్ఐఆర్లపై, అరెస్టులపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీనిపై న్యాయవర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. “్ఙ75 ఏళ్లుగా ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలిస్తూనే ఉంది. దర్యాప్తు దశలో కోర్టుల జోక్యం తగదని చెబుతూనే ఉంది. మళ్లీ మళ్లీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కనకే మళ్లీ మళ్లీ సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని చెబుతోంది’’ అని రిటైర్డు న్యాయమూర్తి ఒకరు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇటీవల హైకోర్టులో ఇలాంటి ఉత్తర్వులు వచ్చిన కేసుల్ని ఒకసారి చూస్తే... తుళ్లూరు భూముల కేసులో అప్పటి తహసీల్దార్ సుధీర్‌బాబుపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీన్ని కొట్టేయాలని ఆయన మార్చి 23న హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ బట్టు దేవానంద్ ఆ మరుసటి రోజే తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా స్టే ఇవ్వడాన్ని ప్రాథమికంగా తప్పుపడుతూ కేసును వారంలో తేల్చాలని హైకోర్టుకు సూచించింది. విజయవాడలోని రమేశ్ ఆస్పత్రి ఓ హోటల్లో నిర్వహిస్తున్న కోవిడ్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగి పదిమంది మరణించారు. పోలీసుల దర్యాప్తునకు సహకరించకుండా పారిపోయిన రమేశ్ ఆస్పత్రి చైర్మన్ రమేశ్‌బాబు తనపై ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్... కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేశారు. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించింది. గత ప్రభుత్వ హయాంలో అవినీతిని వెలికితీసేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అమరావతి భూముల కొనుగోళ్లలో ఇన్సైడర్ ట్రేడింగ్, ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో అవినీతి జరిగాయని అన్ని ఆధారాలతో ఇది నివేదిక ఇచ్చింది. దీంతో ప్రభుత్వం సిట్‌ను వేసింది. సిట్ కేసు నమోదు చేయడానికి ముందే.. టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ వీటి ఏర్పాటును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీంతో హైకోర్టు.. మంత్రివర్గ ఉపసంఘం, సిట్ జీవోల్లో తదుపరి చర్యలన్నీ నిలిపేసింది. అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేయడానికి ముందే.. మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేసి తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ఆ మర్నాడు ఉదయమే ఏసీబీ అటు దమ్మాలపాటి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఇద్దరు కుమార్తెలతోపాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనిపై అప్పటికప్పుడు విచారణ జరిపిన సీజే జస్టిస్ జేకే మహేశ్వరి.. నిందితులెవరినీ అరెస్ట్ చేయొద్దని, కేసు వివరాలను మీడియాలో రాయవద్దని పేర్కొంటూ గ్యాగ్ ఉత్తర్వులిచ్చారు. రిటైర్డ్ లెక్చరర్‌ను మోసం చేసిన కేసులో దమ్మాలపాటి, ఆయన భార్య, బావమరిది నన్నపనేని సీతారామరాజు తదితరులపై మంగళగిరి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై హైకోర్టు స్టే ఇచ్చింది. ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ సీతారామరాజు గత నెల 28న పిటిషన్ వేయగా 29నే తదుపరి చర్యలన్నీ మూడు వారాలపాటు నిలిపేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. -
మాల్స్ తెరచినప్పుడు కోర్టులు తెరవడం తప్పా?
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్–19 మహమ్మారి ప్రభావం సమాజంలోని ప్రతి రంగంపై పడింది. చివరకు న్యాయ వ్యవస్థ కూడా తప్పించుకోలేక పోయింది. కోవిడ్ మహమ్మారి నియంత్రణలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా హైకోర్టుల్లో 50 శాతం కేసులను పెండింగ్‌లో వేయాల్సిరాగా, జిల్లా కోర్టుల్లో 70 శాతం కేసులను వాయిదా వేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో కీలకమైన కేసుల విచారణను వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో విచారిస్తూ వస్తున్నారు. కోవిడ్ మహమ్మారి ప్రభావం ఇప్పట్లో పోయే అవకాశం కనించక పోవడంతో కేసుల భౌతిక విచారణను పునరుద్ధారించాలంటూ న్యాయవర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. సుప్రీం కోర్టు గత ఆగస్టు నెలలోనే పరిమితంగానైనా కొన్ని కేసుల విచారణను చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం ఓ వెయ్యి కేసుల జాబితాను రూపొందించింది. (త్వరలోనే ప్రత్యక్ష విచారణ చేపట్టనున్న కోర్టులు?) వాటి విచారణకు ప్రాతినిథ్యం వహించాల్సిందిగా న్యాయవాదులను కోర్టు కోరింది. అందుకు ఆశ్చర్యంగా ఒక్క శాతం న్యాయవాదులు మాత్రమే కేసుల వాదనకు కోర్టుకు హాజరయ్యేందుకు అంగీకరించారు. కేసుల పునరుద్ధరణ కు సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చినప్పటికీ ఇంత తక్కువ సఖ్యలో న్యాయవాదులు స్పందించడం శోచనీయంగా కనిపిస్తోంది. ఢిల్లీ హైకోర్టు, దాని దిగువ కోర్టులు గత వారం నుంచి పని చేస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లో హైకోర్టులతోపాటు వాటి దిగువ కోర్టుల్లో ఇంకా కేసుల విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. జిల్లా సబార్డినేట్ కోర్టుల్లోనే ఎక్కువ లిటిగేషన్ కేసుల విచారణ కొనసాగుతాయి. అవే న్యాయవాదులకు ప్రధాన ఆదాయ వనరులుగా ఉపయోగపడుతూ వస్తున్నాయి. సబార్డినేట్ కోర్టుల్లో ఇంకా కేసుల విచారణ ప్రారంభం కాకపోవడంతో జిల్లా, గ్రామీణ స్థాయిలో న్యాయవాదులు ఆర్థిక సంక్షోభం చిక్కుకు పోయారు. సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి కేసుల విచారణను పునరుద్ధరిస్తున్నట్లు మద్రాస్ హైకోర్టు ఇటీవలనే ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రోజుకు మూడు నుంచి ఐదు కేసులను విచారించాలని నిర్ణయించింది. (న్యాయస్థానాలు మూడో సభ కానున్నాయా?) కొత్త కేసులను దాఖలు చేసేందుకు కోర్టు ఆవరణలో డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇతర ప్రభుత్వ యంత్రాంగాలన్నీ తమ కార్యకలాపాలను పునరుద్ధరించినప్పుడు న్యాయవర్గాలు మాత్రం ఎందుకు తమ కార్యకలాపాలను పునరుద్ధరించరన్నది ప్రశ్న. హైకోర్టు కార్యకలాపాలను ప్రారంభించాలంటూ అస్సాంలో న్యాయవాదులంతా ధర్నాలు చేయగా, కొన్ని ప్రాంతాల్లో సరైన సదుపాయాలు లేనందున ఇప్పుడే కేసుల విచారణ చేపట్టరాదని న్యాయవాదులు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా న్యాయవర్గాల్లో పరస్పర భిన్నమైన వాదనలు వినిపిస్తుండడంతో అనిశ్చిత పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు, మాల్స్‌ను తెరచారని, మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా వాటిని తెరవబోతున్నారని, అలాంటప్పుడు కోర్టుల కార్యకలాపాలను పునరుద్ధరిస్తే తప్పేమిటని న్యాయవాదుల్లో ఓ వర్గం వాదిస్తోంది. -
త్వరలోనే ప్రత్యక్ష విచారణ చేపట్టనున్న కోర్టులు?
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో నిలిచిపోయిన ప్రత్యక్ష విచారణ పద్ధతి వచ్చే వారం నుంచి మళ్లీ మొదలయ్యే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. సుప్రీంకోర్టుతో పాటు కొన్ని ఎంపిక చేసిన న్యాయస్థానాల్లో ప్రత్యక్ష విచారణను మొదలుపెట్టేందుకు ఏడుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీ సిఫారసు చేసింది. సుప్రీంకోర్టులోని మొత్తం 15 బెంచ్‌లలో కనీసం రెండు మూడు బెంచ్‌లలో ప్రత్యక్ష విచారణ చేపట్టాలని కమిటీ సూచించింది. దీంతో వచ్చే వారం నుంచి కొన్ని అదనపు రక్షణ ఏర్పాట్లతో విచారణ ప్రారంభమయ్యే అవకాశముంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 25న దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించింది మొదలు, సుప్రీంకోర్టు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాత్రమే కేసుల విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ఏడుగురు జడ్జిల ప్యానెల్ మంగళవారం సమావేశమైందని, రెండు మూడు సుప్రీంకోర్టు బెంచ్‌లలో ప్రత్యక్ష విచారణ చేపట్టడాన్ని పరిగణిస్తున్నట్లు తెలిపిం దని సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అధ్యక్షుడు శివాజీ ఎం.జాధవ్ తెలిపారు. చదవండి: గహ్లోత్, పైలట్ షేక్‌హ్యాండ్! -
15 నుంచి కోర్టులు ఓపెన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున నగరంలోని హైకోర్టు, ఇతర కోర్టులు మినహా రాష్ట్రంలోని ఇతర కోర్టులన్నీ ఈ నెల 15 నుంచి పనిచేయనున్నాయి. హైకోర్టు, నాంపల్లి క్రిమినల్ కోర్టు, రంగారెడ్డి జిల్లా కోర్టులు, సీబీఐ కోర్టు, స్మాల్ కాజెస్ కోర్టులకు ఈ నెల 28 వరకు లాక్డౌన్ నిబంధనలు వర్తిస్తాయి. జిల్లాల్లోని అన్ని కోర్టులు ఈ నెల 15 నుంచి పనిచేసే విధానంపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ నెల 15 నుంచి 30 వరకు తొలి విడత, జూలై 1 నుంచి 15 వరకూ రెండో విడత, జూలై 16 నుంచి ఆగస్టు 7 వరకు మూడో విడత, ఆగస్టు 8 నుంచి నాలుగో విడతగా మార్గదర్శకాలను జారీ చేసింది. కోర్టులకు లాక్డౌన్ నిబంధనలను సడలిసుండటంతో 15 రోజులకోసారి జిల్లా కోర్టు జడ్జీలను, ఎస్పీ, జిల్లా వైద్యాధికారులు, బార్ అసోసియేషన్లు సమీక్షించి నివేదిక పంపాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది. తొలివిడతలో ఒక్కో కోర్టు రోజుకు 20 కేసులే.. తొలి రెండు వారాలు కోర్టు సిబ్బంది రొటేషన్ పద్ధతిలో 50 శాతం విధులకు హాజరవుతారు. సిబ్బంది హాజరు విషయంలో ఏవిధమైన ఒత్తిళ్లు ఉండవు. కోర్టు విధులకు హాజరయ్యే జడ్జీల నుంచి సిబ్బంది, న్యాయవాదులు ఇతరులంతా విధిగా మాస్క్‌లు ధరించాలి. మాస్క్ లేకపోతే కోర్టుల్లోకి ప్రవేశముండదు. ప్రధాన ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేశాకే లోపలికి అనుమతిస్తారు. శానిటైజర్లు వినియోగించాకే కోర్టు హాల్లోకి వెళ్లాలి. జ్వరం, దగ్గు, జలుబు, ఇతర అనారోగ్య సమస్యలున్నవారికి అనుమతి ఉండదు. ఒకవేళ ఎవరైనా వస్తే వారిని ప్రభుత్వాసుపత్రికి పంపేస్తారు. అలాగే 65 ఏళ్ల పైబడిన వారికి అనుమతి ఉండదు. ఆ వయసు న్యాయవాదులైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించవచ్చు. చిన్నపాటి కేసుల్లో వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఉంటుంది. కోర్టుకు వాదప్రతివాదుల్లో ఎవరైనా హాజరు కాలేకపోతే కోర్టులు ఉత్తర్వులు జారీ చేయవు. రెండువైపులా వాదనల తర్వాతే కోర్టులు ఉత్తర్వులు వెలువరిస్తాయి. కేసు విచారణకు హాజరు కాకపోతే వారెంట్లు జారీ కావు. భౌతిక దూరం పాటించాలి. రెండు విడతల్లో క్యాంటీన్లు పనిచేయవు. తొలివిడతలో ఒక కోర్టు రోజుకు 20 కేసులనే విచారణ చేస్తాయి. కోర్టులోకి అయిదుగురికే అనుమతి ఉంటుంది. కేసుల విచారణ జాబితా ఒకరోజు ముందే రెడీ చేసి జీపీ, పీపీలు, న్యాయవాదులకు తెలియజేస్తారు. సివిల్ కేసుల్లో ఇంజంక్షన్ ఆర్డర్స్, అడ్వొకేట్ కమిషన్ నియామకం, ఆస్తుల అటాచ్మెంట్, కుటుంబ వివాదాలు విచారణకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. క్రిమినల్ కేసులకు సంబంధించిన వాటిలో తుది విచారణ మొదలవుతుంది. జైళ్లల్లో ఉండే నిందితుల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేస్తారు. రద్దీ తగ్గింపునకు ఈఫైలింగ్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు ప్రాధాన్యత ఉంటుంది. వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో సాక్ష్యాల రికార్డు, వాదనలు జరిపే ప్రయత్నాలు ఉంటాయి. రెండో విడతలోనూ ఆ ఆంక్షలను కొనసాగిస్తూనే సడలింపులిచ్చింది. రోజుకు 40 కేసులను ఒక్కో కోర్టు విచారిస్తుంది. కోర్టులోకి పది మంది వరకు అనుమతి ఉంటుంది. మూడో విడతలో రోజుకు 60 కేసులు చొప్పున ఒక్కో కోర్టు విచారిస్తుంది. మూడో విడతలో మాత్రమే కోర్టుల్లోని క్యాంటీన్లను తెరిచేందుకు అనుమతి ఉంటుంది. బార్ అసోసియేషన్లు కూడా ఉదయం 10.15 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మూడో విడతలో తెరిచేందుకు అనుమతినిచ్చింది. ఇక అప్పటి పరిస్థితులను బట్టి నాలుగో విడతలో మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు వీలుంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. -
న్యాయస్థానాలు మూడో సభ కానున్నాయా?
ఈ మధ్య దేశ న్యాయస్థానాలు సంచలన తీర్పులు, కటువైన వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లోకి ఎక్కుతున్నాయి. గతేడాది సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల విచారణ, అనంతరం ఆయనకు లభించిన క్లీన్చిట్ వివాదాస్పదంగా మారింది. ప్రపంచ న్యాయవ్యవస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2018 జనవరి 12వ తేదీన నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ప్రెస్‌మీట్ పెట్టి మరీ న్యాయవ్యవస్థ సమగ్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని హెచ్చరించారు. రెండేళ్ళ తర్వాత దేశంలోనూ, వివిధ రాష్ట్రాల్లోనూ ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే వారు చెప్పింది నిజమేననిపిస్తోంది. పార్లమెంట్ ఉభయ సభలకు తోడు న్యాయవ్యవస్ధ మూడో సభగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలొస్తున్నాయి. కొందరు న్యాయమూర్తులు అత్యుత్సాహంతో రాష్ట్రాల పాలనాపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకుం టున్నారనే విమర్శలు ఉన్నాయి. కార్యనిర్వాహక, చట్ట సభల్లాగే న్యాయవ్యవస్థ కూడా వ్యవహరిస్తే న్యాయమూర్తులు కూడా అణచివేతదారులుగా మారి పౌర స్వేచ్ఛకు భంగం కలిగిస్తారని ప్రముఖ ఫ్రెంచ్ రాజనీతి వేత్త విలియం మాంటెస్క్యూ హెచ్చరించారు. కార్యనిర్వాక, చట్ట సభలు చేసే పనిని న్యాయస్థానాలు చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. 1950 జనవరి 28వ తేదీన భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మాట్లాడుతూ, ‘దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన పార్లమెంట్ విధులకు సుప్రీంకోర్టు కానీ, న్యాయస్థానాల తీర్పులు కానీ ఆటంకం కాకూడదు. న్యాయ స్థానాలు గానీ, న్యాయవ్యవస్థ కానీ పార్లమెంట్ ఉభయ సభలకు తోడుగా మూడో సభగా వ్యవహరించకూడదు’’ అని స్పష్టం చేశారు. అంబేడ్కర్ కూడా ‘‘ఐదారుగురు పెద్దమనుషులు సుప్రీంకోర్టులో కూర్చుని శాసస వ్యవస్థ రూపొందించిన చట్టాలను తనిఖీ చేయడాన్ని, అలాగే వీరి వ్యక్తిగత చైతన్యం, లేదా పక్షపాత లేక దురభిప్రాయాల తోడుతో తీసుకునే నిర్ణయాలతో ఏ చట్టం సరైంది, ఏ చట్టం సరైంది కాదు అని నిర్ధారిస్తే వాటిని విశ్వసించడాన్ని నేను ఊహిం చలేను’’ అని విస్పష్టంగా చెప్పారు. సుప్రీంకోర్టు జడ్జి మార్కండేయ ఖట్జూ కొంతకాలం క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతూ, సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల్లో 50 శాతం మంది అవినీతి పరులేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2010 మట్టూ ప్రియదర్శిని కేసులో ఆయన తీర్పునిస్తూ, ‘న్యాయ వ్యవస్థ స్వయం నియంత్రణ పాటించాలి, సూపర్ లెజిస్లేచర్‌గా వ్యవహరించడానికి ప్రయత్నించకూడదు’ అన్నారు. న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్ మరో ముందడుగు వేసి సుప్రీంకోర్టులోని ఎనిమిది మంది న్యాయమూర్తులు అవినీతిపరులని ఆరోపిస్తూ, వారి పేర్లను సుప్రీంకోర్టుకు అందజేసి, ధైర్యం ఉంటే తనపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టులు ఇచ్చిన తీర్పులు, ఆదేశాలు కొన్ని వివాదాస్పదంగా మారాయి. ఈ తీర్పులు, ఆదేశాలపై ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాజీ సీఎం చంద్రబాబుని విశాఖ పోలీసులు సి.ఆర్.పి.సి.సెక్షన్ 151 క్రింద అరెస్ట్ చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. అంతేకాక రాష్ట్ర డి.జి.పి. గౌతం సవాంగ్‌ను కోర్టులో నిలబెట్టి ఆ సెక్షన్ మొత్తాన్ని చదివించింది. కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను ఎగువ కోర్టులు తప్పు పట్టి, కొట్టి వేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇటువంటి తప్పులు చేసిన కింది కోర్టుల వారిని ఉన్నత న్యాయస్థానాలు తమ వద్దకు పిలిపించుకుని సంబంధిత చట్టాలు, శాసనాలను చదవమంటే ఎలా ఉంటుంది? ఏ మాత్రం హుందాగా ఉండదు. ఇటీవల నర్సీపట్టణానికి చెందిన డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో కూడా కోర్టు ఆదేశాలు వివాదంగా మారాయి. అతను విశాఖలో పబ్లిక్ న్యూసెన్స్‌కు పాల్ప డుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని దుర్భాషలాడుతున్నట్లు వీడియోల్లో ఉంది. అతనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడకు వచ్చారు. పోలీసులను కూడా తిడుతూ వారిని ఎదిరిస్తున్నట్లు వీడియోలు ఉన్నాయి. ఒక వైద్యుడిపై లాఠీచార్జీ చేసి అమానుషంగా ప్రవర్తించారనే భావనతో న్యాయస్థానం ఉంది. మంచిదే, అయితే చట్టం ముందు అందరూ సమానులే. అందరికి సమాన హక్కులుంటాయి. కానీ లాక్డౌన్ సమయంలో అన్ని రాష్ట్రాల్లో పోలీసులు వేలాది మందిని విచక్షణా రహితంగా లాఠీలతో కొట్టారు. ఇటువంటి దృశ్యాలు న్యూస్ చానళ్ళలోనూ, పేపర్లలోనూ నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఏపీతో సహా దేశం లోని ఏ న్యాయస్థానం ఈ అకృత్యాలపై సుమోటో కేసుగా తీసుకుని అమాయకులను కాపాడటానికి ఎందుకు ప్రయత్నించదు? న్యాయమూర్తులు తమ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా స్వయం నిర్ణయాధికారం పేరుతో సుమోటోగా కేసులు చేపట్టే ముందు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు లోని సహచర న్యాయమూర్తుల అంగీ కారం కూడా తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 24న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి. లోకూర్ ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుసుప్రీంకోర్టు’ అనే అంశంపై ప్రసంగిస్తూ న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అంతరం పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు కేసులు స్వీకరించే విషయంలో విచక్షణ చూపుతున్నాయని చెబుతూ.. 2009లో మండల్ కమిషన్ నివేదికపై దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు దానికి సంబంధించిన కేసును అడ్మిట్ చేసుకుని విచారించిందని, అయితే ఇటీవల పౌరసత్వ బిల్లులపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే అవి సమసిపోయే వరకూ కేసును అడ్మిట్ చేసుకోబోమని సుప్రీంకోర్టు చెప్పడం ఎంత వరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. ‘వలస కార్మికుల వ్యవహారంలో జోక్యం చేసుకోలేని సుప్రీంకోర్టు.. జైపూర్ పార్క్ సుందరీకరణ పనులు పర్యవేక్షిస్తామని చెప్పింది. ఇలాగైతే న్యాయస్థానాల నుంచి ఏమి ఆశించగలం?’ అని జస్టిస్ మదన్ బి. లోకూర్ ప్రశ్నించారు. నిజమే.. ప్రశ్నించి, పరిశీలించి, న్యాయం చేయాల్సిన వ్యవస్థపైనే ప్రశ్నల వర్షం కురుస్తోంది. గతంలో నలుగురు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తులు చెప్పినట్లు ఇది మన ప్రజాస్వామ్యానికి ఏమంత మంచి పరిణామం కాదు. వ్యాసకర్త : వి.వి.ఆర్. కృష్ణంరాజు, అధ్యక్షుడు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ మొబైల్ : 95052 92299 -
29 వరకు కోర్టులకు లాక్డౌన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఈ నెల 29 వరకు పొడిగించిన నేపథ్యంలో హైకోర్టు సహా కింది కోర్టులు, జ్యుడిషియల్ అకాడమీ, ట్రైబ్యునళ్లు, న్యాయ సేవాధికార సంస్థలను కూడా అప్పటి వరకు మూసేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఇప్పటిలాగే అత్యవసర కేసుల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ కొనసాగిస్తామని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉన్న జిల్లా వినియోగదారుల ఫోరాలు గురువారం నుంచి పని చేయడం ప్రారంభించాయి. రెడ్ జోన్‌లోని హైదరాబాద్‌లో ఉన్న మూడు ఫోరాలు, వరంగల్‌లోని ఒక్క ఫోరం పనిచేస్తున్నాయి. చదవండి: చైనాకు ప్రత్యామ్నాయం మనమే తెలంగాణలో కొత్త రూట్లో ప్రజా రవాణా! -
కోర్టులకు వేసవి సెలవులు రద్దు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు, జిల్లా కోర్టులు ఈ నెల 30 వరకూ అత్యవసర కేసుల్ని మాత్రమే విచారించాలని ఫుల్ కోర్టు నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఈ నెల 14వరకూ లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర కేసుల్ని14వ తేదీ వరకు మాత్రమే విచారించాలని గతంలో హైకోర్టు నిర్ణయించింది. తాజాగా మంగళవారం న్యాయమూర్తులంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై ప్రస్తుత విధానాన్ని ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించాలని నిర్ణయించారు. ప్రతి సోమ, బుధ, శుక్రవారాలు అత్యవసర కేసుల్ని వీడియో కాన్ఫెరెన్స్ మాత్రమే విచారణ చేస్తున్న విధానం ఇక నెలాఖరు వరకూ కొనసాగుతుంది. కరోనా నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని కోర్టులకు వేసవి సెలవులను రద్దు చేయాలని కూడా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో హైకోర్టు, జిల్లా కోర్టులు, రాష్ట్రంలోని ఇతర అన్ని కోర్టులు మే1వ తేదీనుంచి జూన్ 5వ తేదీ వరకు పనిచేస్తాయి. హైకోర్టు న్యాయమూర్తులందరూ (ఫుల్‌కోర్టు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సమావేశమై ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
వీడియో కాన్ఫరెన్సింగ్
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో అత్యవసరమైతే తప్ప కోర్టులకు రావాల్సిన అవసరం లేదనీ, అన్ని కోర్టులు భౌతిక దూరం పాటిస్తూ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. టెక్నాలజీని ఉపయోగించుకుని కోర్టుల్లో విచారణ చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ రాసిన లేఖను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను జారీచేసింది. న్యాయప్రక్రియ సజావుగా సాకేందుకు ఆధునిక సాంకేతిక తను ఉపయోగించుకుని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ చేపట్టేందుకు దేశంలోని హైకోర్టులన్నింటికీ అనుమతినిస్తూ అత్యున్నత న్యాయస్థానం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. -
ఏప్రిల్ 14 వరకు కోర్టులకు లాక్డౌన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో న్యాయస్థానాల లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14 వరకు పొడిగిస్తూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని కోర్టులు ఏప్రిల్ 14వ తేదీ లేదా తిరిగి ఉత్తర్వులు జారీ చేసే వరకు లాక్డౌన్లో ఉంటాయని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హైకోర్టు సహా జిల్లా కోర్టులు, మేజిస్ట్రేట్ కోర్టులు, ట్రిబ్యునళ్లు, మధ్యవర్తిత్వ కేంద్రాలు, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు, రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ.. వీటన్నింటినీ మూసేయాలని ఆదేశించారు. హైకోర్టులో అత్యవసర కేసుల్ని వీడియో కాన్ఫరెన్స్ లేదా స్కైప్ ద్వారా వారం లో 3 రోజులపాటు విచారిస్తుందన్నారు. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో అత్యవసర కేసుల విచారణకు కారణాలు తెలియజేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు ఈ–మెయిల్ పంపాలన్నారు. ఈ–మెయిల్ ద్వారా వచ్చే వాటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ పరిశీలించి అనుమతిస్తే.. వాటిని సంబంధిత న్యాయమూర్తులు తమ ఇంటి వద్ద ఏర్పాటయ్యే ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపడుతుంది. విచారణకు ఎంపికయ్యే కేసుల్ని కక్షిదారులు, న్యాయవాదులకు ఫోన్ మెసేజ్ పంపుతామని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ జారీ చేసిన మరో ప్రకటనలో పేర్కొన్నారు. రొటేషన్ పద్ధతిలో బాధ్యతలు కింది కోర్టుల్లో రిమాండ్, బెయిల్, ఇంజక్షన్ ఉత్తర్వులకు సంబంధించిన కేసుల్ని వీడియో కాన్ఫరెన్స్ లేదా స్కైప్ ద్వారా విచారించాలని హైకోర్టు ఆదేశించింది. ఇలాంటి అత్యవసర కేసుల్ని విచారణ చేసేందుకు జిల్లా జడ్జీలు, జూనియర్ సివిల్ జడ్జీలు, మేజిస్ట్రేట్లు రొటేషన్ పద్ధతిలో వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో నిర్వహించేం దుకు జిల్లా జడ్జి బాధ్యతలను ఎంపిక చేయాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. అత్యవసర కేసులని భావించిన వాటిని కింది కోర్టులు జిల్లా జడ్జికి ఈ–మెయిల్ ద్వారా పంపాలని, వాటిని జిల్లా జడ్జీలు పరిశీలించి అత్యవసరమని భావించిన కేసుల్ని వీడియో కాన్ఫరెన్స్ లేదా స్కైప్ ద్వారా విచారణ చేయాలని ఆదేశించింది. ఈ–మెయిల్ ఐడీలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని పేర్కొంది. కింది కోర్టు జడ్జీ లందరూ హెడ్‌క్వార్టర్స్‌ను విడిచిపెట్టి వెళ్లడానికి వీల్లేదని, అత్యవసర మరణ వాంగ్మూలాల నమోదు, ఎఫ్ఐఆర్లు తీసుకోవడానికి వారంతా సంబం ధిత హెడ్‌కార్టర్స్‌లోనే ఉండాలని, ఇలాంటి విధులను నిర్వహించేందుకు ఒక్క కోర్టు మాత్రమే పనిచేయాలని, రోజు వారీ నివేదికలను కింది కోర్టుల నుంచి జిల్లా జడ్జి తెప్పించుకుని హైకోర్టుకు నివేదించాలని ఆదేశించింది. న్యాయవాదులుగానీ, కక్షిదారులుగానీ ఎవరూ వ్యక్తిగతంగా హాజరుకానవసరం లేదని, సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉందని స్పష్టం చేసింది. న్యాయశాఖ ఉద్యోగులు ఇళ్లలోనే అందుబాటులో ఉండాలని, ఫోన్ చేస్తే తక్షణమే విధులకు హాజరయ్యేలా ఉండాలని చెప్పింది. అత్యవసరమైన సిబ్బంది మాత్రమే విధుల్లో ఉండాలని పేర్కొంది. గడువుకు సంబంధించిన ఉత్తర్వుల పొడిగింపు చేస్తున్నట్లు, ఈ నెల 15 నుంచి తిరిగి ఆదేశాలు జారీ చేసే వరకూ గడువు ఉత్తర్వులు పొడిగింపులో ఉంటాయని వెల్లడించింది. -
కోర్టులకు సీఐఎస్ఎఫ్ భద్రత?
న్యూఢిల్లీ: హింసాత్మక ఘటనలను నివారించేందుకు కొన్ని న్యాయస్థానాల్లో ప్రత్యేక తరగతికి చెందిన సీఐఎస్ఎఫ్ జవాన్లతో భద్రత ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇటీవల ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈ వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. గత నవంబరులో జరిగిన ఈ ఘటనలో న్యాయవాదులు, పోలీసులు పరస్పరం దాడులకు దిగిన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ నిర్ణయం తరువాత ప్రత్యేక సీఐఎస్ఎఫ్ జవాన్లను ఏర్పాటు చేసే అంశాన్ని చేపట్టాలని జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ సూర్యకాంత్‌లు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు తెలిపారు. జవాన్ల ఏర్పాటు న్యాయవాదులకు ఇబ్బందికరం కావచ్చునని ఈ కేసుకు సంబంధించి కోర్టుకు సహాయపడుతున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా అన్నారు. -
వీడుతున్న వాహబంధం
వారిది పెద్దలు కుదిర్చిన సంబంధం. అందరి అంగీకారంతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఏడాది తిరిగేసిరికి మగబిడ్డ జన్మించాడు. తొలుచూరు కాన్పులోనే తమ వంశానికి వారసుడు వచ్చాడని అందరూ వేడుకలు జరుపుకున్నారు. చూస్తుండగానే పిల్లాడికి మూడేళ్లు నిండాయి. బడికి పంపించే ముందు ఏ గుడిలోనో అక్షరాభ్యాసం చేయించడం ఆనవాయితీ కదా! ఇంటివద్దనే అక్షరాభ్యాసం చేయిద్దామని ఇంట్లో నిర్ణయించగా, అమ్మమ్మ తాతయ్యలు బాసర సరస్వతీ దేవాలయంలో అక్షర శ్రీకారం చేయించాలని పట్టుబట్టారు. భర్త అలా కాదన్నందుకు ‘మా పుట్టింటివారు చెప్పినట్లు చేయకుండా ఎదురు మాట్లాడతావా’ అంటూ ఒకరికొకరు గొడవపడ్డారు. మా వాళ్లను గౌరవించని ఇంట్లో క్షణం కూడా ఉండనంటూ పుట్టింటికి వెళ్లిన ఆమె ఏకంగా విడాకులు కావాలంటూ కోర్టులో కేసు వేసింది. ఇలా చిన్న చిన్న కారణాలకే వివాహ బంధాలు విచ్ఛిన్నమవుతున్న తీరు ఇటీవల కాలంలో పెరిగిపోతోంది. కరీంనగర్‌లీగల్: ‘మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్’ అంటారు పెద్దలు. అంటే పెళ్లిల్లు స్వర్గంలోనే నిర్ణయించబడుతాయని పెద్దల నమ్మకం. కలిసి మెలిసి ఉండి మాంగళ్య బంధాన్ని ఆనందమయం చేసుకోవాల్సిన దంపతులు తృణప్రాయంగా వివాహ బంధాలను తెంచేసుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలు, అర్థంలేని పట్టుంపులు కుటుంబ తగాదాలతో పాటు వివిధ కారణాలతో విడాకులు కోరుతూ కోర్టులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వీరిలో ఎక్కువగా విడాకులు, భరణం ఇప్పించాలని కోర్టుకు వస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2013 నుంచి ఇప్పటివరకు 776 మంది విడాకులు, భరణం కావాలని కోర్టును ఆశ్రయించారు. ఇందులో ప్రస్తుతం 81 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సర్దుబాటు ధోరణి లేకనే... భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు చినికి చినికి వానగాలిగా మారుతున్నాయి. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలను పంతాలు, పట్టింపులకుపోయి పెద్దవి చేసుకొని విడాకుల కోసం కోర్టులను ఆశ్రయిస్తూ వీధులకు ఎక్కుతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో వాదులాడుకుంటున్న జంటలు భావోద్వేగాల వలలో చిక్కి విడిపోయేందుకు సిద్ధమవుతూ పచ్చని కాపురాలను ముక్కలు చేసుకుంటున్నారు. జిల్లాలో ఏటేటా విడాకులు కోరుతూ కోర్టులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రేమించుకొని ఇరువురి కుటంబ పెద్దలను ఎదిరించి ప్రేమవివాహం చేసుకున్న వారు, పెద్దలు కుదిర్చిన వివాహంతో ఒక్కటైన దంపతులైనా సర్దుబాటు ధోరణి లేక వివాహ బంధాన్ని వీడటానికి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. చిన్నపాటి గొడవలను పట్టింపులకు పోయి కాపురాలను కూల్చుకుంటున్నారు. దంపతులిద్దరు అవగాహన లోపంతో విడాకులు తీసుకొని జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు పిల్లలు ఏమైపోతారో అని వారికి జన్మించిన సంతానం గురించి ఏ కోశానా ఆలోచించడం లేదు. విడాకులు అనే మాట వింటేనే అదోలా చూసే సమాజంలో ఇపుడు ఆ పదం సాధారణమైపోయింది. 2013 నుంచి ఇప్పటివరకు భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా విడాకులు, భరణం వంటివి కోరుతూ ఫ్యామిలీ కోర్టులో 776 మంది కేసులు వేశారు. ఈ కేసులను ఎప్పటికపుడు కేసులు పరిష్కరించగా.. ప్రస్తుతం కోర్టులో 181 కేసులు నడుస్తున్నాయి. విడాకులకు దారితీస్తున్న కారణాలు తను చెప్పిన మాటను గౌరవించాలని ఇద్దరు పట్టింపులకు పోవడం. అత్యసవర వేళల్లో తల్లి దండ్రులకు డబ్బులు పంపడాన్ని అదేదో పెద్దనేరం అన్నట్లుగా భర్త, అత్తింటివారి నుంచి సూటిపోటి మాటలు తాను సంపాదించిన డబ్బును తానే పొదుపు చేసుకుంటానని చెప్పడం. అత్తమామలు, ఉమ్మడి కుటుంబంతో కలిసి ఉండననే భావన ఈతరం గృహిణిల్లో ఉండటం, ఈ కారణంగా ఇతర పట్టింపులు పండగలు, వేడుకల్లో తమ వారిని పట్టించుకోలేదని భార్యాభర్తలు గొడవలు పడటం. పండగల సమయాల్లో పుట్టింటికి వెళ్లవద్దని భార్యను అడ్డుకుంటూ పట్టుబట్టడం పుట్టిన పుల్లలకు పెట్టే పేరు నుంచి వారిని చేర్పించే స్కూలు ఎంపిక విషయంలోనూ తగాదాలు ఉద్యోగం చేసే భార్య బ్యాంక్ పాస్‌బుక్, ఏటీఎం వంటివి తన వద్దనే ఉండాలని భర్త వేధించడం ఫలితమివ్వని కౌన్సెలింగ్ మనస్పర్థలతో విడాకులు కోరు తూ కేసులు వేస్తున్న వారికి ముందుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తుంటారు. అయితే కౌన్సెలింగ్‌కు హాజరైన వారు కలిసి ఉంటా మని చెప్పి వారం తిరగకముందే గొడవలు పడుతున్నారు. దీంతో ఇరువర్గాలకు రెండు మూడుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించినా ఫలితం ఉండటం లేదు. కౌన్సెలింగ్ కేంద్రాల్లో మహిళల పక్షాన మాత్రమే ఆలోచించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని ఆరోపణలు ఉంటున్నాయి. దీంతో కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ కొంతకాలానికి కోర్టును ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. -
కోర్టులతో జైళ్ల అనుసంధానం
నరసన్నపేట శ్రీకాకుళం : జిల్లాలో జైళ్లను కోర్టులతో అనుసంధానం చేస్తున్నామని, ఇక నుంచి ఖైదీల హాజరును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జీలే తీసుకుంటారని జిల్లా సబ్‌జైళ్ల అధికారి బి.ఈరన్న అన్నారు. ఈమేరకు అన్ని జైళ్లల్లో టీవీలు, ఆన్‌లైన సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కోర్టుల్లో వాటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నరసన్నపేట సబ్‌జైల్‌ను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతానికి పాలకొండ, పాతపట్నం, నరసన్నపేట సబ్‌జైళ్లలో ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖైదీలను జడ్జి ఎదుట హాజరుపరుస్తామన్నారు. ప్రస్తుతం పోలీస్ ఎస్కార్టుల సాయంతో ఖైదీలను కోర్టుకు తీసుకువెళ్తున్నామని, ఇక మీదట ఎస్కార్టు అవసరం ఉండదన్నారు. టెక్కలిలో నూతనంగా సబ్‌జైల్ నిర్మాణానికి రూ. 8 కోట్లుతో ప్రతిపాదనలు పంపామని, అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. సబ్‌జైల్ ఆవరణలో పెట్రోల్ బంకు కూడా నిర్వహిస్తామన్నారు. ఈమేరకు 2.10 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ శాఖ కేటాయించిందన్నారు. సోంపేటలో ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న సబ్‌జైల్ భవన సాముదాయ స్థలాన్ని రెవెన్యూశాఖకు అప్పగించామని, ఇందుకు గాను వేరోచేట స్థలం కేటాయించనున్నట్లు అధికారులు హామీ ఇచ్చారని అన్నారు. పాలకొండ జైల్లో కిచెన్ అభివృద్ధికి, నరసన్నపేటలో డబుల్ గేట్ నిర్మాణం, కిచెన్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. జైళ్ల సిబ్బంది హాజరును బయోమెట్రిక్ ద్వారానే తీసుకుంటున్నామని అన్నారు. ఆయన వెంట నరసన్నపేట సబ్‌జైల్ సూపరింటెండెంట్ రామకృష్ణ ఉన్నారు. -
చట్టసభల్లో కోర్టుల జోక్యం సరికాదు
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో చట్టసభల అధికారం వాటికే ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. అసెంబ్లీ అధికారాలు అసెంబ్లీకే ఉండాలని, ఈ విషయంలో కోర్టుల జోక్యం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.సంపత్‌కుమార్‌ల అసెంబ్లీ బహిష్కరణ అంశంపై కోర్టు తీర్పుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల వేతన సవరణపై పీఆర్సీ మధ్యంతర నివేదిక ఇంకా రాలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ప్రతిపాదించిన జోనల్ వ్యవస్థకు త్వరలోనే ఆమోదం వస్తుందని, నాలుగైదు రోజుల్లో నిర్ణయం రావొచ్చని చెప్పారు. దీనికోసమే పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపివేశామన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. గ్రూపుల వారీగా బీసీ లెక్కలు గ్రామపంచాయతీ ఎన్నికల వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. బీసీ జనాభాను గ్రూపుల వారీగా చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. మన రాష్ట్రంలో 1.30 లక్షల గ్రామపంచాయతీ వార్డులు ఉన్నాయి. బీసీల్లో ఐదు గ్రూపుల వారీగా వివరాలను సేకరించాలి. కులాల వారీగా లెక్కలు ఉంటేనే ఇది చేయగలం. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఉన్న లెక్కలు ఉన్నా.. కులాల వారీగా ఉంటేనే గ్రూపుల వారీగా కచ్చితంగా ఇవ్వగలం. నీతి ఆయోగ్‌లో పారదర్శకత లేదు నీతి ఆయోగ్ అంటే ఏదో నీతితో ఉండే పేరు కాదు. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. పేరులో ట్రాన్స్ఫార్మింగ్ అని ఉంది గానీ అందులో పారదర్శకత లేదు. నీతి ఆయోగ్ పేరు కింద ఉండే కొటేషనల్లో సమాఖ్య స్ఫూర్తి అని ఉంటుంది. కానీ చేతల్లో ఇది కనిపించడ లేదు. ప్రజాస్వామ్యంలో అధికారాల బదిలీ జరగాలి. కానీ దీనికి విరుద్ధంగా ఇంకా కేంద్రీకృతంగా మారుతోంది. రాష్ట్రాలను మున్సిపాలిటీలుగా మారుస్తున్నారు. నీతి ఆయోగ్ గత సమావేశంలో నేను ఇదే విషయాన్ని మొహం మీదే చెప్పా. అందరు సీఎంలు అభినందించారు. రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు, పథకాలు ఉండాలి. ఆరోగ్య సమస్యల విషయంలో తెలంగాణలో ఉండే రోగాలు వేరు, కోస్తా తీరంలో వచ్చే రోగాలు వేరు. కేరళలో వంద శాతం అక్షరాస్యత ఉంది. అయితే వయోజనుల విద్య కోసమని రెండు శాతం నిధులను తీసుకుంటున్నట్లు ఆ రాష్ట్ర సీఎం చెప్పారు. ఇలా చేయాల్సిన అవసరం ఎందుకు? అలాగే వ్యవసాయ విధానాలు ప్రాంతాలకు అనుగుణంగా ఉండాలి. స్థానిక పరిస్థితులకు తగినట్లుగా విధానాలు ఉండాలి. ఆర్థికవేత్తలుగా చెప్పుకునే కొందరు పంటకు కనీస మద్దతు ధరల విషయం వచ్చేసరికి ద్రవ్యోల్బణం అని, ఇంకోటని చెబుతారు. ఇలాంటి వారు చెప్పేవి వాస్తవాలు కాదు. ఒకేసారి రుణ మాఫీ సాధ్యం కాదు ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్ వారు ఆపద మొక్కుల తరహాలో హామీలిస్తున్నారు. ఒకేసారి రెండు లక్షల రుణ మాఫీ అని ప్రకటిస్తున్నారు. ఇది సాధ్యం కాదు. పంజాబ్‌లో హామీ ఇచ్చారు. ఇప్పుడు సాధ్యం కాదని చెబుతున్నారు. కర్ణాటకలో సీఎం కుమారస్వామి నన్నే అడిగారు. మన రాష్ట్రంలో చేసిన విధానం చెప్పా. ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10,500 కోట్ల ఆదాయం వస్తుంది. రెండు లక్షల రుణ మాఫీ ఒకేసారి చేయాలంటే ఏడాదిపాటు ఎలాంటి ఇతర ఖర్చులు చేయవద్దు. కాంగ్రెస్ నేతల హామీలు ఎలా సాధ్యమో ప్రజలకు వివరించాలి. ఆసరా పింఛన్లు, ఉద్యోగుల వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, రేషన్ బియ్యం ఏది ఆపేస్తారో చెప్పాలి. అయినా రెండు లక్షల రుణ మాఫీ అని రాహుల్‌గాంధీ గత ఎన్నికల్లోనూ ప్రకటించారు. ప్రజలు నమ్మలేదు. నిరుద్యోగభృతి అని చెబుతున్నారు. హామీ ఇవ్వడం కాదు ఎలా అమలు చేస్తామో స్పష్టత ఇవ్వాలి. ఎవరు నిరుద్యోగి అనేది వివరించాలి. ఎక్కడి నుంచి నిధులు తెస్తారో చెప్పాలి. ఏపీలో మహిళా స్వయం సహాయ సంఘాల రుణాలను మాఫీ చేస్తామని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారు. ఇదే హామీ ఇక్కడ చేద్దామని మా పార్టీ నేతలు నాపై ఒత్తిడి తెచ్చారు. సాధ్యం కాదని వద్దని చెప్పా. కాంగ్రెస్ అధికారంలోకి రాదు కాబట్టి ఆ పార్టీ నేతలు ఏదైనా చెబుతారు. మన పథకాలే ఉత్తమం: కాంగ్రెస్ కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వీటికి రెండు మూడు నెలల ముందు కొన్ని పథకాలను ప్రారంభించింది. అభయహస్తం, బంగారుతల్లి ఇలాంటివే. ఎప్పుడో 30 ఏళ్ల తర్వాత ప్రయోజనం కలిగే పథకాలివి. వీటిని అమలు చేయలేమని అసెంబ్లీలోనే నేను స్పష్టంగా చెప్పా. పేద కుటుంబాలకు చెందిన ఆడ పిల్లల పెళ్లిళ్లకు తక్షణ అవసరాలు తీరేలా పథకాలు అమలు చేస్తున్నాం. కేంద్రం ప్రకటించిన ఆయుష్మాన్‌భవలో ఎందుకు చేరడంలేదని ప్రధాని అడిగారు. అంతకంటే మంచిగా అమలు చేస్తున్నామని చెప్పాం. మనం అమలు చేస్తున్న పథకం సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకుంటామని కేంద్రం అడిగింది. మన ప్రభుత్వ పేరును చేర్చాలని చెప్పాం. పేరు పెడతారో లేదో చూడాలి. కేంద్రం ప్రకటించిన బీమా పథకం కంటే మనది ఉత్తమమైనది. రాష్ట్రంలోని రైతు బీమా పథక ంలో ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఏదీ ఒకరోజులో జరగదు కొందరు ఇదేనా బంగారు తెలంగాణ అని మాట్లాడుతున్నారు. ఏదీ ఒకరోజులో జరగదు. హైదరాబాద్‌ను మహానగరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. రూ.50 వేల కోట్లతో ప్రణాళిక రూపొందించాం. మొక్కను పెడితే కొన్ని ఏళ్లకు చెట్టవుతుంది. ఒకేరోజులో పెరిగితే అది చెట్టు కాదు. బ్రహ్మ రాక్షసి అవుతుంది. వాస్తవాలు పట్టించుకోకుండా ఏది పడితే అది మాట్లాడవద్దు. సింగపూర్ ఒక్కరోజులో నిర్మాణం కాలేదు. -
కక్షిదారులకు అర్థమయ్యేలా తీర్పులు
న్యూఢిల్లీ: కోర్టులిచ్చే తీర్పులు సకారణంగా, కక్షిదారులకు అర్థమయ్యేలా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక కేసు కోర్టులో ఎందుకు ఓడిపోయిందో, లేక ఎందుకు గెలిచిందనే విషయం కక్షిదారులకు తెలిసేలా తీర్పులుండాలని సూచించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై ఈ వ్యాఖ్యలు చేసింది. ఇండోర్ కాంపోజిట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2005–06 కాలానికి గాను తమ సంస్థలో పనిచేసే కొందరు ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ జమ చేయలేదు. బాధితులు ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌ను ఆశ్రయించగా వెంటనే రూ.87,204 చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కాంపోజిట్ కంపెనీ ఈపీఎఫ్ ట్రిబ్యునల్‌లో సవాల్ చేసింది. పరిశీలించిన ట్రిబ్యునల్ బోర్డ్ ఆదేశాలను పక్కన బెట్టింది. దీంతో ట్రస్టీస్ బోర్డ్ హైకోర్టులో పిటిషన్ వేసింది. పరిశీలించిన ఇండోర్ బెంచ్.. బోర్డ్ పిటిషన్‌ను కొట్టి వేయడంతోపాటు ట్రిబ్యునల్ ఆదేశాలను సమర్థించింది. ఈ తీర్పుపై ఈపీఎఫ్ బోర్డ్ సుప్రీంకు వెళ్లింది. విచా రణ చేపట్టిన జస్టిస్ ఏఎం సప్రే, జస్టిస్ నవీన్ సిన్హాల బెంచ్.. ‘ఆ తీర్పు కక్షిదారుల పట్ల పక్ష పాతం చూపినట్లుంది. కేసులో కక్షిదారులు తామెందుకు ఓడామో లేక గెలిచామనే విష యం తెలియకుండాపోయింది’ అని పేర్కొంది. -
కోర్టుకెక్కిన చట్టసభలు
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం బలనిరూపణకు సుప్రీం కోర్టు కేవలం ఒక్క రోజే గడువు ఇవ్వడంతో ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప భవితవ్యం ఏమిటా అన్న చర్చ జరుగుతోంది. కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ఇప్పటివరకు పూర్తి కాలం పనిచేయలేదు. మొదటి సారి సీఎంగా ప్రమాణం చేసినప్పుడు జేడీ(ఎస్) మద్దతు ఉపసంహరించడంతో కేవలం ఏడురోజుల్లోనే గద్దె దిగాల్సి వచ్చింది. ఇక రెండోసారి అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో మూడేళ్లలోనే పదవీచ్యుతుడయ్యారు. సంకీర్ణ రాజకీయాల యుగంలో కోర్టుల కనుసన్నుల్లో ప్రభుత్వాల ఏర్పాటు చాలా సార్లు జరిగింది. వాటిల్లో యూపీలో జగదంబికా పాల్ ఒక్క రోజు సీఎం ఉదంతం చాలా ఆసక్తికరం. యూపీలో ఏం జరిగిందంటే ఇప్పుడు కర్ణాటకలో మాదిరిగానే 1998 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు నరాలు తెగే ఉత్కంఠతో సాగాయి. బీఎస్పీ. ఎస్పీ ఫిరాయింపుదారులు, ఇతర చిన్నా చితక పార్టీల మద్దతుతో బీజేపీ అధికారంలో ఉండేది. ముఖ్యమంత్రిగా కల్యాణ్ సింగ్ ఉండేవారు. అదే సమయంలో కేంద్రంలో ఐకే గుజ్రాల్ ప్రధానమంత్రిగా యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కల్యాణ్ సింగ్ సంకీర్ణ సర్కార్‌కు మాయావతి మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయి బలనిరూపణకు సిద్ధమవాల్సి వచ్చింది. బలపరీక్ష రోజు అసెంబ్లీలో యుద్ధవాతావరణం నెలకొని హింస చెలరేగింది. కప్పల తక్కెడ రాజకీయాలతో ఎవరు ఏ పార్టీకి మద్దతునిస్తున్నారో తెలీని పరిస్థితి నెలకొంది. దీంతో అప్పటి యూపీ గవర్నర్ రమేష్ భండారీ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసినా కేంద్రం తిరస్కరించింది. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి విడిపోయిన జగదంబికా పాల్, నరేష్ అగర్వాల్‌లు లోక్తాంత్రిక్ కాంగ్రెస్ పేరుతో వేరు కుంపటి పెట్టి , అప్పటివరకు కళ్యాణ్ సింగ్‌కు మద్దతిచ్చినట్టే ఇచ్చి ప్లేట్ ఫిరాయించారు. ఎస్పీ, బీఎస్పీ మద్దతు తమకే ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్‌ని కలిసారు. గవర్నర్ రమేష్ భండారీ కళ్యాణ్ సింగ్ సర్కార్‌ని 1998 ఫిబ్రవరి 21 అర్ధరాత్రి రద్దు చేయడం,జగదంబికా పాల్ సీఎంగా ప్రమాణస్వీకారం వెంట వెంటనే జరిగిపోయాయి. తెల్లారేసరికల్లా గవర్నర్ నిర్ణయంపై నిరసన స్వరాలు భగ్గుమన్నాయి. 425 సభ్యులున్న అసెంబ్లీలో కేవలం 21 సభ్యులతో కాంగ్రెస్ నుంచి చీలిపోయిన ఒక నేతకు అవకాశం ఇవ్వడమేమిటంటూ అటల్ బిహారి వాజపేయి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. బీజేపీ కోర్టును ఆశ్రయించడంతో యూపీ హైకోర్టు అదే రోజు జగదంబికా పాల్‌ను సీఎంగా తొలగిస్తూ, కల్యాణ్‌సింగ్ సర్కార్‌ని పునరుద్ధరించింది. అంతేకాదు ఆయనని మాజీ ముఖ్యమంత్రి అని కూడా అనకూడదని తీర్పు చెప్పింది. అలా జగదంబికా పాల్ ఒక్క రోజు సీఎంగా రికార్డు సృష్టించారు. కోర్టులు కలుగజేసుకున్న ఇతర సందర్భాలు జార్ఖండ్ (2005) అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు గవర్నర్ ఇచ్చిన గడువు తగ్గించడం మొదటిసారి 2005లో జార్ఖండ్‌లో జరిగింది. ముఖ్యమంత్రిగా జేఎంఎం అధినేత శిబుసోరెన్‌కు గవర్నర్ సయ్యద్ సిబ్టే రజీ అవకాశం ఇవ్వడాన్ని బీజేపీ నేత అర్జున్ ముండా వ్యతిరేకించారు. అసెంబ్లీలో తమకే బలం ఉందని, తమకే అవకాశం ఇవ్వాలంటూ సుప్రీం కోర్టుకెక్కారు. గవర్నర్ ఇచ్చిన గడువు కంటే నాలుగు రోజుల ముందుగానే బలం నిరూపించుకోవాలంటూ సుప్రీం అప్పట్లో ఆదేశించింది. ఉత్తరాఖండ్ (2016) ఉత్తరాఖండ్‌లో హరీశ్ రావత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అసంతృప్తులు తారాస్థాయికి చేరుకున్నాయి. అసెంబ్లీలో అత్యంత కీలకమైన ఆర్థిక బిల్లుకు తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేయడమే కాదు, బీజేపీతో చేతులు కలిపి కాంగ్రెస్ సర్కార్‌కు మైనార్టీలో పడిపోయిందన్నారు. దీంతో హరీశ్ రావత్ బలపరీక్షకు సిద్ధమయ్యారు. సరిగ్గా బలపరీక్షకు ఒక్కరోజు ముందు కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి పాలనను విధించింది. దీనిపై కాంగ్రెస్ హైకోర్టుకెక్కడంతో రాష్ట్రపతి పాలనను రద్దు చేసి హరీశ్ రావత్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ తీర్పు చెప్పింది గోవా (2017) గత ఏడాది గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ను కాదని, బీజేపీకి చెందిన మనోహర్ పరికర్కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వడంపై వివాదం చెలరేగింది. దీనిపై కాంగ్రెస్ కోర్టును ఆశ్రయిస్తే, వెంటనే ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటూ కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని పిలవాలో గవర్నర్‌కు విచక్షణాధికారాలు ఉన్నాయని, వాటిలో తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది తమిళనాడు (2017) తమిళనాడులో జయలలిత మృతి అనంతరం ఏర్పడిన రాజకీయ గందరగోళ పరిస్థితుల్లోనూ కోర్టుల తీర్పే కీలకంగా మారింది. ఏఐఏడీఎంకేలో దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడం వివాదాస్పదమైంది. దీంతో బలపరీక్షకు ప్రభుత్వం సిద్ధపడుతూనే, ఆ పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలంటూ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయడంతో ఆ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. అయితే మద్రాసు హైకోర్టు తదుపరి తీర్పు ఇచ్చేవరకు ఎన్నికల్ని నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేస్తూనే వెంటనే పళనిస్వామి ప్రభుత్వం విశ్వాసపరీక్ష ఎదుర్కోవాలని తీర్పు ఇచ్చింది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
23 ఏళ్లు పోరాడి గెలిచినా..
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులను అధికారులు అమలు చేయడం లేదని, దీంతో కోర్టు తీర్పుల తాలుకు విజయ ఫలాలను సంబంధిత వ్యక్తులు ఆస్వాదించలేకపోతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం నుంచి సానుకూల ఉత్తర్వులు పొందినప్పటికీ, అధికారుల తీరుతో ఆ ఉత్తర్వుల ఫలాలను ఆస్వాదించకుండానే ఓ కక్షిదారుడు తనువు చాలించిన ఘటనపై హైకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కోర్టులిచ్చిన తీర్పులను అధికారులు అమలు చేయకపోతుండటంతో, బాధిత వ్యక్తులు విధి లేని పరిస్థితుల్లో సమస్య పరిష్కారానికి అసాంఘిక శక్తులను ఆశ్రయిస్తున్నారని తెలిపింది. అధికారుల తీరుతో న్యాయవ్యవస్థ పరిహాసానికి గురవుతోందని, వ్యవస్థకు ఇది మంచిది కాదంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ విషయాన్ని గ్రహించి.. కోర్టుల ఆదేశాలను అసలైన స్ఫూర్తితో అమలు చేయాలని హితవు పలికింది. 1995 నుంచి ఇప్పటి వరకు న్యాయ పోరాటం చేస్తూ వచ్చిన ఆ కక్షిదారుకి అనుకూలంగా.. న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం కందికల్ గ్రామంలోని 43/1, 44/1, 45/1 సర్వే నంబర్లలో ఉన్న తన 31.25 ఎకరాల భూమిని 234 మంది ఆక్రమించుకోవడంతో సుల్తాన్ మోహినుద్దీన్ అనే వ్యక్తి 1995లో న్యాయ పోరాటం ప్రారంభించారు. 1997లో భూ ఆక్రమణల నిరోధక ప్రత్యేక న్యాయస్థానం (ఎల్జీసీ) ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిపై ఆక్రమణదారులు 1998లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పటిషన్‌ను హైకోర్టు 2009లో కొట్టేసింది. దీంతో 1997లో తనకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును అమలు చేసి, అక్రమణదారులను ఖాళీ చేయించేలా రెవెన్యూ అధికారులను ఆదేశించాలంటూ సుల్తాన్ మోహినుద్దీన్ ఎల్జీసీలో 2009లో పిటిషన్ దాఖలు చేశారు. సానుకూలంగా స్పందించిన ఎల్జీసీ, ఆక్రమణదారులను ఖాళీ చేయించి భూమిని మోహినుద్దీన్కి స్వాధీనం చేయాలని ఆర్డీవోను ఆదేశించింది. అయితే అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం కింద ఎంత మేర భూమికి అర్హులో అంతమేర స్వాధీనం చేయాలని పేర్కొంది. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన మోహినుద్దీన్.. 1995లో ఇచ్చిన తీర్పునకు భిన్నంగా ఎల్జీసీ తాజా ఉత్తర్వులున్నాయని నివేదించారు. విచారణ జరిపిన హైకోర్టు 2010లో మోహినుద్దీన్‌కు అనుకూలంగా ఆదేశాలిచ్చింది. స్పందించని రెవెన్యూ అధికారులు హైకోర్టు తీర్పు నేపథ్యంలో భూమిని స్వాధీనం చేయాలని ఆదేశిస్తూ ఎల్జీసీ ఇచ్చిన ఉత్తర్వులను ఆర్డీవో అమలు చేయలేదు. మరోవైపు ఆక్రమణదారుల్లో కొందరు 1997లో మోహినుద్దీన్‌కు అనుకూలంగా ఎల్జీసీ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. 2010లో హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటినీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ సమయంలోనే మోహినుద్దీన్ కన్నుమూశారు. దీంతో ఆయన వారసులు న్యాయ పోరాటం కొనసాగించారు. ఎల్జీసీ ఆదేశాలను రెవెన్యూ అధికారులు అమలు చేయకపోవడంతో మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిర్ణీత కాల వ్యవధిలోపు ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. తర్వాత కొందరు ఆక్రమణదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆ వ్యాజ్యాలను తిరిగి హైకోర్టుకు పంపింది. తాజాగా అందరి వాదనలు విన్న ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం మేరకు ఎంత వరకు మోహినుద్దీన్ అర్హుడో అంత మేర భూమినే స్వాధీనం చేయాలంటూ ఎల్జీసీ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఎల్జీసీ కోర్టు పలుమార్లు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయని రెవెన్యూ అధికారుల తీరును, పదే పదే నిరర్థక వ్యాజ్యాలు దాఖలు చేస్తూ సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఆక్రమణదారుల తీరును హైకోర్టు తప్పుపట్టింది. -
న్యాయ వ్యవస్థ పయనం ఎటు?
‘న్యాయస్థానం న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్టు ఆచరణలో కనిపించాలి. ఉన్నత న్యాయస్థానంలో ఆసీనులైన న్యాయమూర్తుల నడత కూడా న్యాయవ్యవస్థ నిష్పాక్షికతలో ప్రజల విశ్వాసం పాదుకొనేలా, దానిని రూఢి పరిచేలా ఉండాలి. ఈ విశ్వసనీయతను తుడిచిపెట్టేసే విధంగా సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల చర్యలు ఉండరాదు.’ – (‘న్యాయమూర్తుల జీవన విలువల పునరుద్ఘాటన’ పేరుతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంయుక్త సమావేశం చర్చించి ఆమోదించి మే 7,1997న విడుదల చేసిన ప్రకటన పత్రం) ‘జ్ఞానం కత్తి వంటిది. దాని విలువ ఆ జ్ఞానాన్ని వినియోగించుకునేవాడి చేతులలో ఉంటుంది. చదువులేని వాడు ఎదుటివారిని వంచించగల శక్తి గల వాడు కాదు. ఎవరినీ మోసగించే ‘కళ’ అతనికి తెలియదు. కానీ చదువుకున్న వాడు మాత్రం నిజాన్ని అబద్ధంగానూ, అబద్ధాన్ని నిజంగానూ తన వాదనా బలం చేత తారుమారు చేయగలడు. ఈ వంచనా శిల్పంతోనే చదువుకున్నవాళ్లు ప్రజలను మోసగిస్తూ ఉంటారు.’ – డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికీ, సుప్రీంకోర్టుకూ మధ్య ఇటీవల తరచూ కొన్ని అంశాల మీద ఘర్షణ వాతావరణం కనిపిస్తున్నది. అది భారత రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకు, ప్రజలు తమకు తాము అంకితం చేసు కుంటూ ఆమోదించిన సెక్యులర్, సోషలిస్ట్, గణతంత్ర ప్రజాస్వామ్య సూత్రాల ద్వారా అవతరించిన రాజ్యాంగ స్ఫూర్తిని రక్షించే వాతావరణం అనిపించదు. వివిధ సవరణల ద్వారా (ప్రగతిశీలమైనవీ, అలా అనిపించుకో లేనివీ) చొచ్చుకు వచ్చిన భావాలతో న్యాయస్థానాలకు, పాలకపక్షాలకు మధ్య అవాంఛనీయ వాతావరణం నెలకొంటున్నది. డాక్టర్ అంబేడ్కర్ తది తరులు రూపొందించిన రాజ్యాంగానికి తరువాతి కాలాలలో తూట్లు పడడా నికి కారణం ఇదే. ప్రభుత్వాన్ని నిర్వహించే పాలకపక్షానికీ (బ్రాండ్ ఏదైనా) శాసన వేదికలకూ న్యాయస్థానాలకూ రాజ్యాంగం బాధ్యతలను విభజిం చింది. అయితే న్యాయస్థానాలకు మరొక అదనపు బాధ్యతను కూడా అప్ప గించింది. అదే– ప్రభుత్వ నిర్ణయాలను, చట్టసభ సభ్యుల నిర్ణయాలను పరిశీ లించి, వాటిలోని తప్పొప్పులను కనిపెట్టి వాత పెట్టడమే. రాజ్యాంగం మార్చే కుట్ర బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలకూ వీటి మీద పౌర సమాజం నుంచి వెల్లువె త్తుతున్న రిట్ల ఆధారంగా కోర్టులకు ఉన్న సర్కారును ప్రశ్నించే అధికారానికీ మధ్య ఇటీవల తీవ్ర ఘర్షణ జరుగుతోంది. ఇందుకు మూలాలు అత్యవసర పరిస్థితి కాలంలో లభిస్తాయి. తన ఇష్టానుసారం జరిగిన నిర్ణయాలకు రాజ్యాంగ విరుద్ధంగా ఆమోదముద్ర వేయించడానికి నాటి కాంగ్రెస్ పార్టీ ప్రధాని న్యాయవ్యవస్థను వినియోగించుకున్నారు. ఇప్పుడు రాజ్యాంగాన్నీ, అందులోని ప్రజాస్వామిక నిబంధనలనీ మత ప్రాతిపదికపైన మార్చేందుకు లేదా సవరించేందుకు బీజేపీ పాలనలో ప్రయత్నం జరుగుతున్నది. న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి విఘాతం కలిగించే విధంగా పావులు కదపడం ఇందుకు తొలిమెట్టు. న్యాయవ్యవస్థ ప్రత్యేకంగా నెలకొల్పుకున్న కొలీజి యంకు విరుద్ధంగా నేషనల్ జ్యుడీషియల్ కొలీజియంను నెలకొల్పాలని ప్రభుత్వం ప్రయత్నించింది. ఇది న్యాయ వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యంగా భావించిన న్యాయవ్యవస్థ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించింది. ఇదే చినికి చినికి గాలివాన అయింది. సుప్రీంకోర్టు కొలీజియం (సమష్టి వ్యవస్థ) నిర్మాణంలో కూడా లొసు గులు ఉన్నాయనీ, ముందు వాటిని సవరించుకోవాలనీ సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ చలమేశ్వర్ సూచించారు. అంతేగాని మోదీ ప్రభుత్వం నేషనల్ కొలీజియం ప్రతిపాదనను ఆయన సమర్థించలేదు. అయితే అత్యున్నత న్యాయస్థానం నిర్మాణ సూత్రాల మేరకు ప్రధాన న్యాయమూర్తిని ‘సమాను లలో సమానుడు’గానే భావిస్తూ, న్యాయస్థానం అధిపతిగా గుర్తించారు. కోర్టు పరిశీలనకు వచ్చిన కేసులను ధర్మాసనాలకు కేటాయించే అధికారం అప్పగించారు. ఈ కేటాయింపులలో పక్షపాతం లేకుండా సీనియారిటీని కూడా దృష్టిలో పెట్టుకుని వ్యాజ్యాలను ధర్మాసనాలకు కేటాయించాలన్నది వ్యవహార న్యాయం. ఈ న్యాయం ఎక్కడో దారి తప్పినందునే జస్టిస్ చల మేశ్వర్ సహా నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యవస్థను గాడిలో పెట్టడానికి సాహసించి పత్రికా గోష్టిని నిర్వహించవలసి వచ్చింది. సుప్రీం లోని నడవడికను బహిర్గతం చేస్తూ దేశాన్నీ ప్రజలనూ జాగరూకం చేయ వలసి వచ్చింది. చలమేశ్వర్ ప్రభృతుల నిర్ణయం సబబా కాదా అన్నది ఆ తరువాత కొలది రోజుల్లోనే జరిగిన పరిణామం నిరూపిస్తోంది. సంఘర్షణ, సర్దుబాటు న్యాయస్థానం పరిధిలోకి చొరబడే పాలకులకు హెచ్చరికగా 17వ శతాబ్దపు ఇంగ్లండ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోక్ ఉదంతాన్ని చెప్పుకోవచ్చు. ఆయన కోర్టు పరువును కాపాడిన తీరు ప్రశంసనీయం. జస్టిస్ కోక్‌ను నియ మించింది జేమ్స్ రాజే, అయినా కోక్‌ను నియంత్రించడానికి ప్రయత్నిం చాడు. ‘నీవు ప్రధాన న్యాయమూర్తివే అయినా పాలకుడిని కాబట్టి కోర్టుల్లో జోక్యం చేసుకుని నేను ఏ కేసునైనా సరే కోర్టుల పరిధి నుంచి తప్పిం చేయగలను’ అని ప్రకటించాడు. అప్పుడు జస్టిస్ సి.జె. కోక్ ‘పాలకుడికి ఆ అధికారం లేదు, ఇంగ్లండ్ చట్టం ప్రకారమే న్యాయస్థాన నిబంధనల ప్రకా రమే, న్యాయచట్టం ప్రకారమే కేసులు పరిష్కారమవుతాయి’ అని ప్రకటిం చాడు. ఈ మాటను అవమానంగా భావించిన జేమ్స్, ‘అంటే, మీ ఉద్దేశం నేను చట్టానికి లొంగి ఉండాలా? ఇది దేశద్రోహం’ అన్నాడు. అందుకు జస్టిస్ కోక్, ‘మీరు పాలకులు, మీరు ఏ వ్యక్తికీ లోబడి ఉండొద్దు. కానీ, చట్టానికి మాత్రం లోబడి ఉండాల్సిందే!’ అన్నాడు. కానీ ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న లార్డ్ మాన్స్ఫీల్డ్ (18వ శతాబ్దం) తన సోదర జడ్జీలతో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇంగ్లిష్ ధర్మాసనం కలకలా నికి గురయింది. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హ్యూవర్ట్ (1922–40) తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అభాసుపాలైనాడు. ఇలా రెండు రకాల ఉదాహరణలున్నాయి. మన దేశ తాజా పరిణామాలు కూడా మరొకలా లేవు. కొన్ని కేసుల విషయంలో జరుగుతున్న అవకతవకలను ప్రస్తావిస్తూ, ప్రజల దృష్టికి తెస్తూ జస్టిస్ చలమేశ్వర్ ప్రభృతులు (నలుగురు)చేసిన విన్నపం ఒక ఆలోచనా ధార విజయమని చెప్పకపోయినా, ప్రతిఫలమా అన్నట్టు తాజాగా ఐదుగురు సుప్రీం న్యాయమూర్తులు కూడా (ఎస్.ఎ. బాబ్డే/ ఎన్.వి. రమణ/ యు.వి. లలిత్/ డి.వై. చంద్రచూడ్/ ఎ.కె. సిక్రీ) రంగంలోకి దిగి వివిధ ధర్మాసనాలకు కేసుల కేటాయింపు గురించి ప్రధాన న్యాయమూర్తితో పాటు, నలుగురు (చలమేశ్వర్ ఆధ్వర్యంలో) న్యాయమూర్తులతోనూ చర్చలు జరపడం శుభసూచకమే. కేసుల కేటాయింపు విషయంలో నిర్ణయానికి కమి టీని వేయాలన్న ఐదుగురు న్యాయమూర్తుల ఆలోచన మంచిదే. అయితే– చల మేశ్వర్ ఆధ్వర్యంలో ఆవేదన వెలిబుచ్చిన నలుగురు న్యాయమూర్తులు కేసుల పరిశీలనలో జరుగుతున్న అస్తవ్యస్త వ్యవహారాలను సరిదిద్దడానికి, పాలక రాజ కీయ పెద్దలకు సంబంధం ఉన్న లేదా వారు ఇరుక్కున్నట్లు భావిస్తున్న కేసుల విచారణలో జరుగుతున్న జాప్యానికి, ధర్మాసనానికి కేసుల (తీవ్రమైన ఫిర్యా దులున్న కేసులు)ను విచారణకు నివేదించడంలో జరుగుతున్న తడబాటు గురించి అన్యాపదేశంగా కొన్ని ఉదాహరణలు పేర్కొన్నారని సమాచారం. ఉదా హరణకు సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు. ఇందులో బీజేపీ నేత అమిత్ షా జైలు పాలైనా కేసు కొట్టివేయడంతో విడుదలయ్యారు. పాత కేసు తిరిగి సీబీఐ స్పెషల్ జడ్జి లోయా కోర్టులో విచారణకు వచ్చింది. ఆ వెంటనే లోయా ఆకస్మి కంగా మరణించారు. జస్టిస్ లోయా మృతి కేసు నేను, ఇతర పాత్రికేయులు వేసిన ‘పిల్’ ఆధారంగా సుప్రీంలో విచారణకు వచ్చింది. ఈ కేసు పర్య వసానాన్ని ఇప్పట్లో ఊహించలేం. ముందుకు వెళ్లిన చర్చ ఈ సమయంలోనే ఐదుగురు గౌరవ న్యాయమూర్తులు సుప్రీం ధర్మాసనాలకు ప్రధాన న్యాయమూర్తి కేటాయించాల్సిన కేసులపై ప్రతిపాదనలు చేశారు. కానీ నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన కేసుల కేటాయింపు పరిష్కారా నికి, ఐదుగురు న్యాయమూర్తులు కొత్తగా ప్రతిపాదించిన పరిష్కారానికి మౌలికమైన తేడా కనిపిస్తోంది. ఎందుకంటే, మధ్యవర్తులలో(ఐదుగురు) ఒక రైన గౌరవ జస్టిస్ చంద్రచూడ్ ఏప్రిల్ 11న ఒక తీర్పు చెప్పారు: ‘కేసులను వివిధ ధర్మాసనాలకు కేటాయించి, బెంచ్‌లను ఏర్పాటు చేసే ప్రత్యేక విశి ష్టాధికారం ప్రధాన న్యాయమూర్తికి ఉంది’ అని స్పష్టం చేశారు. అంటే కేసులు ఏ బెంచ్‌కి నివేదించాలో నిర్ణయించే విశేషాధికారం (మాస్టర్ ఆఫ్ రోస్టర్) ప్రధాన న్యాయమూర్తికే ఉంటుందని పునరుద్ఘాటించారు. అసలు ప్రశ్న ప్రధాన న్యాయమూర్తి ఏ బెంచ్‌కి ఏ కేసును పరిశీలనార్థం నివేదించాలో నిర్ణ యించే అధికారం ఆయనకు ఉన్నా, ఆయన రాజ్యాంగ ధర్మాసన న్యాయ మూర్తులలో సమానుల మధ్య సరిసమానుడైన వ్యక్తి కాబట్టి, కేసుల కేటా యింపులు సహ న్యాయమూర్తులతో చర్చించిన తరువాతనే కేటాయించాలని జస్టిస్ చలమేశ్వర్, మిగిలిన నలుగురి వాదన. అందుకనే, భావితరాల భద్రత కోసం న్యాయ వ్యవస్థ హుందాతనాన్ని రక్షించుకోవాలని చలమేశ్వర్ కోరు కుంటున్నారు. అంతేగాదు, పౌర స్వేచ్ఛ, పౌరుడి తిండీ తిప్పల గురించి, మత స్వేచ్ఛ గురించీ పత్రికా స్వేచ్ఛ గురించీ ఆంక్షలు విధించే పాలకులను ప్రభుత్వాలను దృష్టిలో పెట్టుకునే హ్యూగో బ్లాక్ లాంటి మహా మహా అమె రికన్ న్యాయమూర్తులు, అత్యున్నత న్యాయస్థానం ద్వారా సేవలు అందిం చిన గజేంద్ర గాడ్కర్, సవ్యసాచి, వి.ఆర్. కృష్ణయ్యర్, చిన్నప్పరెడ్డి లాంటి ఉద్దండులు భావ ప్రకటనా స్వేచ్ఛకు ఇచ్చిన ప్రాధాన్యం అసాధారణం. అందుకే జస్టిస్ హ్యూగో బ్లాక్ ఇలా ప్రకటించాడు: ‘భావ ప్రకటనా స్వేచ్ఛకు అసలైన అర్థం– ఎదుటివారు అభిప్రాయాల్ని ప్రకటించినందుకు, వారు ఉచ్చ రించే మాటలకు లేదా రాసే రాతలకు నీవు వారిపట్ల హాని తలపెట్టడం కాదు. అదే నా నిశ్చితాభిప్రాయం, ఇందులో మినహాయింపులు లేవు. ఇదే, నా అభిప్రాయం’. ‘మన అధికారాల్ని మన సొంత గౌరవ, మర్యాదల్ని రక్షించు కోడానికి వినియోగించరాద’న్నాడు జస్టిస్ డెన్నింగ్ (ఇంగ్లండ్)! అవును కదా– ‘‘క్షేమం అవిభాజ్యం అన్నందుకే/జైళ్లు నోళ్లు తెరిచే భూమిలో న్యాయం నాలుగు పాదాల నడుస్తుందనుకోవడం అత్యాశే’’! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
న్యాయ దేవతకు...న్యాయమేది?
అందరికీ న్యాయం చేసే న్యాయ వ్యవస్థలోనే మహిళలకు తగిన న్యాయం జరగడం లేదు. న్యాయమూర్తుల పోస్టుల్లో సముచిత స్థానం దక్కడం లేదు. దేశంలో న్యాయస్థానాలు ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు పరిస్థితి ఇలానే ఉంది. 1959లో జస్టిస్ అన్నా చాందీ దేశంలనే తొలిసారిగా హైకోర్టు మహిళా న్యాయమూర్తిగా నియమితులైనప్పుడు.. ఉన్నత న్యాయ వ్యవస్థలో మహిళలకు తగినంత ప్రాతినిధ్యం లభిస్తుందని భావించారు. కానీ వాస్తవం మాత్రం అందుకు భిన్నంగానే ఉంది. దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుతో పాటు అన్ని హైకోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల సంఖ్య ఇప్పటికీ అతి తక్కువగా ఉండడం ఈ దుస్థితికి తార్కాణంగా నిలుస్తోంది. కిందిస్థాయి న్యాయవ్యవస్థలో మహిళల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా సముచిత స్థానం మాత్రం దక్కడం లేదు. – సాక్షి, హైదరాబాద్ సుప్రీంకోర్టులో 68 ఏళ్లలో ఆరుగురే.. సుప్రీంకోర్టులో ప్రస్తుతమున్న 25 మంది న్యాయమూర్తుల్లో కేవలం ఒక్క మహిళా న్యాయమూర్తే ఉన్నారు. భారత సుప్రీంకోర్టు 1950 జనవరి 26న ఏర్పాటైంది. అప్పటినుంచి ఇప్పటివరకు అంటే 68 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో న్యాయమూర్తులుగా నియమితులైన మొత్తం మహిళల సంఖ్య ఆరుగురు మాత్రమే. ఇటీవలే సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా ప్రముఖ న్యాయవాది ఇందూ మల్హోత్రాను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అయితే ఆమెకు అవకాశం లభించే పరిస్థితి లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 1989లో సుప్రీంకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తిగా కేరళ నుంచి జస్టిస్ ఫాతిమా బీవీ నియమితులయ్యారు. అంటే సుప్రీంకోర్టు ఏర్పాటైన 39 సంవత్సరాలకు ఓ మహిళ న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 29 ఏళ్లలో సుప్రీం న్యాయమూర్తులుగా నియమితులైన మహిళలు ఐదుగురే. మొత్తంగా 1950 నుంచి ఇప్పటివరకు సుప్రీంకోర్టుకు 229 మంది న్యాయమూర్తులు నియమితులైతే.. అందులో పురుష న్యాయమూర్తులు 223 మందికాగా.. మహిళా న్యాయమూర్తులు ఆరుగురే. 2014 నుంచి సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తి లేరు. హైకోర్టుల్లో 10 శాతమే.. హైకోర్టుల్లోనూ మహిళల పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. దేశవ్యాప్తంగా 24 హైకోర్టుల్లో ప్రస్తుతం పనిచేస్తున్న మొత్తం న్యాయవాదులు 676 మందికాగా.. అందులో మహిళా న్యాయమూర్తులు కేవలం 74 మంది మాత్రమే. అసలు ఏడు హైకోర్టుల్లో ఒక్క మహిళా న్యాయమూర్తి కూడా లేరు. ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, ఉత్తరాఖండ్ హైకోర్టుల్లో ఒక్క మహిళా న్యాయమూర్తి లేరు. ఇక దేశంలోకెల్లా అలహాబాద్ హైకోర్టు పెద్దది. ఇక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న 104 మంది న్యాయమూర్తుల్లో మహిళా న్యాయమూర్తులు ఆరుగురే. అత్యధికంగా బొంబే హైకోర్టులో 70 మంది న్యాయమూర్తులకు గాను 11 మంది.. మద్రాసు హైకోర్టులో 58 మంది న్యాయమూర్తులకు గాను 11 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. మన ఉమ్మడి హైకోర్టులో ముగ్గురు మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. ఉమ్మడి ఏపీ హైకోర్టులో 8 మందే.. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు 8 మంది మహిళా న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. 1977లో ఉమ్మడి హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ కె.అమరేశ్వరి నియమితులయ్యారు. అంటే హైకోర్టు ఏర్పాటైన 21 సంవత్సరాలకు తొలి మహిళా న్యాయమూర్తి నియామకం జరిగింది. 1992లో జస్టిస్ ఎస్.వి.మారుతి, 1998లో జస్టిస్ టి.మీనాకుమారి, 2001లో జస్టిస్ రోహిణి, 2013లో జస్టిస్ అనిస్, 2017లో జస్టిస్ జె.ఉమాదేవి, జస్టిస్ తేలప్రోలు రజని, జస్టిస్ కొంగర విజయలక్ష్మి న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ప్రస్తుతం జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ రజని, జస్టిస్ విజయలక్ష్మి న్యాయమూర్తులుగా కొనసాగుతున్నారు. మొత్తంగా దేశంలోని అన్ని హైకోర్టుల్లో కలిపి.. మహిళా న్యాయమూర్తుల సంఖ్య 10.94 శాతమే కావడం గమనార్హం. మహిళా న్యాయాధికారులు 27.7శాతమే దేశవ్యాప్తంగా కిందిస్థాయి న్యాయవ్యవస్థలో మొత్తం 11,382 మంది పురుష న్యాయాధి కారులు పనిచేస్తుంటే.. 4,408 మంది మహిళా న్యాయాధికారులు ఉన్నారు. అంటే మహిళా న్యాయాధికారుల శాతం 27.7 మాత్రమే. చిన్న రాష్ట్రాలైన గోవా, మేఘాలయ, సిక్కింలలో మహిళా న్యాయాధికారుల సంఖ్య 60 శాతానికి మించి ఉంది. అత్యధికంగా మేఘాలయలో 73.08 శాతం న్యాయాధికారులు మహిళలే. ఆ రాష్ట్రంలో 42 మంది న్యాయాధికారులుంటే.. అందులో 31 మంది మహిళలే కావడం విశేషం. అత్యల్పంగా బిహార్‌లో 11.52% మాత్రమే మహిళా న్యాయాధికారులు ఉన్నారు. అక్కడ 967 మంది న్యాయాధికారులు ఉండగా.. మహిళలు 110 మంది మాత్రమే. బిహార్‌లో దేశంలోనే అత్యధికంగా 35 శాతం మేర మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నా.. మహిళా న్యాయాధికారుల సంఖ్య తక్కువగా ఉండడం గమనార్హం. బిహార్ తర్వాత గుజరాత్లో తక్కువ శాతం మహిళా న్యాయాధికారులు ఉన్నారు. ఇక్కడ మొత్తం 959 మంది న్యాయాధికారులు ఉండగా.. 148 మంది మాత్రమే మహిళా న్యాయాధికారులు కావడం ఆందోళనకరం. పలు హైకోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల సంఖ్య... అలహాబాద్ (06), ఏపీ–తెలంగాణ (03), బాంబే (11), కోల్‌కతా (04), ఢిల్లీ (10), గౌహతి (01), గుజరాత్ (04), కర్ణాటక (03), కేరళ (05), మధ్యప్రదేశ్ (03), మద్రాస్ (11), ఒడిశా (01), పట్నా (02), పంజాబ్–హరియాణా (06), రాజస్థాన్ (02), సిక్కిం (01), జార్ఖండ్ (01). దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలే టాప్... దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే అత్యధిక శాతం మహిళా న్యాయాధికారులు పనిచేస్తుండటం విశేషం. తెలంగాణలో 197 మంది పురుష న్యాయాధికారులు పనిచేస్తుంటే, 155 మంది మహిళా న్యాయాధికారులు బాధ్యతలు నిర్వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జూనియర్ సివిల్ జడ్జీల్లో 51.98 శాతం మంది మహిళలు ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో 37.54 శాతం మంది మహిళా న్యాయాధికారులున్నారు. మొత్తం 549 మంది న్యాయాధికారులు పనిచేస్తుండగా, 208 మంది మహిళా న్యాయాధికారులున్నారు. ప్రస్తుతం ఉన్న జూనియర్ సివిల్ జడ్జీల్లో 44.13 శాతం మంది మహిళలు ఉన్నారు. -
ట్రిపుల్ తలాక్‌పై రాద్ధాంతం వద్దు: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ తలాక్‌పై కేంద్రం ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ట్రిపుల్ తలాక్ పేరుతో ముస్లిం మహిళలను తప్పుదారి పట్టించొద్దని, దేశంలోని ముస్లిం మహిళలు తమ భర్తలు, పిల్లలతో సంతోషంగా ఉన్నారన్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డ డివిజన్లోని ఏజీ కాలనీలో శనివారం రాత్రి ఆలిండియా పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో జల్సా సమావేశాన్ని నిర్వహించారు. అసదుద్దీన్ మాట్లాడుతూ ముస్లింలపై ప్రభుత్వాలు, న్యాయస్థానాలు కక్షసాధింపు చర్యలు తీసుకుంటున్నాయని ఆరోపించారు. వివాహ చట్టంలో ముస్లింలకు, హిందువులకు వేర్వేరుగా శిక్షలున్నాయన్నారు. ముస్లింల సమస్యలు, హక్కుల కోసం జల్సా సభలను నిర్వహిస్తున్నామని, ఈ నెల 11న దారుస్సలాంలో చివరి జల్సా సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ రాష్ట్ర కార్యదర్శి రహీముద్దీన్ అన్సారీ, సభ్యులు మునీరుద్దీన్, అక్తర్ జాఫర్‌పాషా, హుస్సేనీ, హఫీజ్, మౌలానా అక్సర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆమెపై అలక్ష్యం..
సాక్షి, హైదరాబాద్: మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణ, దర్యాప్తులో తీవ్రజాప్యం జరుగుతోంది. సంచలన కేసులు సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ ఆలస్యమే మృగాళ్లు మరింత రెచ్చిపోయేందుకు కారణమవుతోంది. గతనెలలో హైదరాబాద్ లాలాగూడ ప్రాంతంలో సంధ్యారాణి... ఈ నెలలో కూకట్‌పల్లిలో జానకి.. సోమవారం చందానగర్‌లో అపర్ణ, ఆమె తల్లీ, నాలుగేళ్ల చిన్నారి.. మంగళవారం హయత్‌నగర్‌లో అనూష, గచ్చిబౌలిలో బొటానికల్ గార్డెన్ వద్ద ముక్కలుగా దొరికిన గుర్తుతెలియని మహిళ.. రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వెలుగులోకి వచ్చిన దారుణాలివీ. మహిళలు, యువతులపై జరిగే నేరాల్లో దోషులకు సత్వరమే శిక్షలు పడకపోవడం వల్లే దారుణాలు పెరిగిపోతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. నాలుగు రోజులే హడావుడి ఆడపిల్లలపై ప్రేమోన్మాదులు కత్తులు, యాసిడ్‌తో దాడులకు తెగబడిన సమయాల్లో పోలీసులు నాలుగు రోజులు హడావుడి చేస్తున్నారు. కళాశాలలు, హాస్టల్స్ ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తున్నారు. తర్వాత కేసు దర్యాప్తు పూర్తయి, కోర్టులో విచారణ ముగిసి దోషులకు శిక్ష పడటం మాత్రం ప్రహసనంగా మారిపోయింది. ‘నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తాం. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తాం’అంటూ గంభీరంగా ప్రకటించే అధికార యంత్రాంగం, పాలకుల హామీలు కూడా నీటి మూటలుగా మిగిలిపోతున్నాయి. నేరగాళ్ల ‘ధైర్యం’అదే..! మహిళలపై నేరాలు పెరగడానికి వ్యవస్థాగత లోపాలు, కుటుంబ వ్యవస్థలు పతనం కావడం, చట్టమంటే భయం లేకుండా పోవడం వంటివి ప్రధాన కారణాలుగా నిపుణులు చెప్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ)–206 గణాంకాల ప్రకారం మహిళలపై జరిగిన నేరాల్లో.. ఏపీలో 9.3 శాతం, తెలంగాణలో 8.1 శాతం కేసుల్లో మాత్రమే దోషులకు శిక్షలు పడ్డాయి. కేసుల విచారణ పూర్తవడానికి ఏళ్లు పడుతుండటంతో అప్పటివరకు బాధితులు పోరాడలేకపోతున్నారు. ఇలాంటి కారణాల వల్లే ‘ఏం చేసినా.. ఏం కాదు’అన్న ధైర్యం నేరగాళ్లలో పెరిగిపోతోంది. ఈ పరిస్థితి మారేందుకు పోలీసులు.. దోషులకు వీలైనంత త్వరగా శిక్షలు పడేలా చూడాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేయాలని బాధితులు కోరుతున్నారు. మరింత ‘భరోసా’కావాలి.. బాధిత మహిళలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి హైదరాబాద్‌లో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే దీన్ని కేవలం అత్యాచారం, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలు, తీవ్రమైన గృహహింస కేసుల్లోనివారికి మాత్రమే పరిమితం చేశారు. ఈ కేంద్రం బాధితులకు అండగా ఉండటంతోపాటు వైద్య, న్యాయ సహాయం చేస్తోంది. పునరావాసం కూడా కల్పిస్తోంది. ఈ తరహా కేంద్రాలు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మహిళలపై జరిగే ప్రతి నేరంలోనూ స్పందించేలా మార్పుచేర్పులు చేయాల్సి ఉంది. బెయిల్ ఇవ్వొద్దు మహిళలపై జరిగే నేరాలకు తక్షణం ఫుల్స్టాప్ పెట్టాలంటే నేరస్తులకు విచారణ పూర్తయ్యేదాకా బెయిల్ రాకుండా చూడాలి. బెయిల్ వచ్చిందంటే సాక్షులను ప్రభావితం చేయటం, రాజీ కోసం ఒత్తిడి చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. మహిళలపై జరిగే నేరాలను రుజువు చేసేందుకు ప్రాసిక్యూషన్ కూడా ఇన్వెస్టిగేషన్ నుంచి జడ్జిమెంట్ వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళల కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తేవాలి. – కాటేపల్లి సరళ, హైకోర్టు అడ్వకేట్ తక్షణ న్యాయం జరగాలి ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత స్పందన చూస్తే మహిళలకు మంచిరోజులు వచ్చాయనిపించింది. కానీ కొన్నాళ్ల తర్వాత మళ్లీ పాతరోజులే రిపీట్ అవుతున్నాయి. నేరం జరిగిన వెంటనే కఠిన శిక్షలు అమలు చేయాలి. ఆ దిశగా న్యాయ వ్యవస్థను క్రియాశీలం చేయాలి. హైదరాబాద్‌లో పోలీస్స్టేషన్లు మరింత విమెన్ ఫ్రెండ్లీగా తయారు కావాలి. న్యాయం కోసం వెళ్లిన వారిని ప్రశ్నలతో భయపెట్టే పరిస్థితి ఉండొద్దు. – నీలిమా పొనుగోటి,సాఫ్ట్వేర్ ఇంజనీర్, గచ్చిబౌలి ఏపీలో ఇలా.. - 2015కు సంబంధించిన 9,349 కేసుల దర్యాప్తు 2016లోనూ కొనసాగాయి - వీటిలో 66 కేసులను ఆయా పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. 153 కేసులు సరైన ఆధారాల్లేక మూతబడ్డాయి. 1,323 కేసులు తప్పుడు ఫిర్యాదులుగా, 226 కేసుల్లో వాస్తవాలు వక్రీకరించినట్లు తేలింది - 14,774 కేసుల్లో మాత్రమే దర్యాప్తు పూర్తయి కోర్టులో అభియోగపత్రాలు దాఖలయ్యాయి - విచారణ పూర్తయిన 9,882 కేసుల్లో 922 (9.3 శాతం) కేసుల్లో మాత్రమే దోషులకు శిక్షలు పడ్డాయి తెలంగాణలో ఇలా.. - 2015కు సంబంధించిన 6,585 కేసుల దర్యాప్తు 2016లోనూ కొనసాగింది - 50 కేసులను ఆయా ఠాణాలకు బదిలీ చేశారు. 569 కేసులు సరైన ఆధారాల్లేక మూతబడ్డాయి. 642 కేసులు తప్పుడు ఫిర్యాదులుగా, 438 కేసుల్లో వాస్తవాలు వక్రీకరించినట్లు తేలింది. - 12,185 కేసుల్లోనే దర్యాప్తు పూర్తయి కోర్టులో అభియోగపత్రాలు దాఖలయ్యాయి - విచారణ పూర్తయిన 5,809 కేసుల్లో 471 (8.1 శాతం) కేసుల్లో మాత్రమే దోషులకు శిక్షలు పడ్డాయి -
కోర్టులకూ జంతువులపై ప్రేమేనా..?
ఈ మధ్య కాలంలో హిందువుల పండుగలపై కొంతమంది పనిగట్టుకుని విషం చిమ్ముతున్నారు. రాజకీయ అలజడుల కారణంగా హిందూ పండుగలపై రోజురోజుకు ఆంక్షలు మితి మీరుతున్నారు. సంప్రదాయాలకు చట్టాలతో ముడి పెడుతున్నారు. పూజపై..పండుగపై లెక్కలేనన్ని ఆంక్షలు వేస్తున్నారు. సంక్రాంతికి సంబరాలు నిర్వహించాలన్నా.. వాకిట్లో కళ్లాపి చల్లి ముగ్గులు వేయాలన్నా.. సంప్రదాయ బద్ధమైన గంగిరెద్దులను ఆడించాలన్నా జంతు ప్రేమికుల నుంచి అనుమతి పొందాలి. పతంగులు ఎగరేయాలన్నా.. దారాలకు తట్టుకుని పక్షులు చనిపోతాయని ఆరోపణలు. కోడిపందేలు ఆడించాలన్నా ఆంక్షలే.. దీపావళికి టపాసులు కాల్చాలన్నా, జల్లికట్టు ఆడాలన్నా కోర్టు అనుమతి కావాలి. వినాయకుడికి పూజలు చేయాలన్నా.. నిమజ్జనం చేయా లన్నా.. నాగుల చవితికి పుట్టలో పాలు పోయాలన్నా, పుష్క రాల్లో స్నానం చేయాలన్నా కోర్టు అనుమతి కావాలి. నమ్మిన దేవుడికి పాలాభిషేకం చేయాలంటే ఆంక్షలు. చివరకు హోళీ ఆడాలన్నా కూడా! ఇలా హిందువుల పండుగలు అంటేనే ప్రకృతి విరుద్ధమని, వాటిని నిషేధించాలనే ప్రచారం జోరుగా సాగుతోంది. కోడి పందేలు లేనిదే ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగలేదు. ఏడాది కోసారి హుషారుగా.. ఉల్లాసంగా సంప్రదాయ బద్దంగా నిర్వహించే ఈ పండు గపైనా జంతు ప్రేమికులు ఆంక్షలు నిప్పులు గక్కుతున్నారు. కానీ, కోడి పందెం అనేది గ్రామీణ ప్రాంతాల్లో రైతాం గాన్ని.. పల్లె సీమలను ఒక్కటి చేసే పండుగ. తర తరాలుగా వస్తున్న సంప్రదాయం. అయితే దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసేవారికి చికెన్ సెంటర్లు కనపడవా..? పర్యావరణానికి ముప్పుగా సంక్రమి స్తున్న పశువధను ఆపేందుకు ఎవరూ కదలడంలేదు. కానీ జల్లికట్టు ఆట అనగానే.. కోడి పందేలు వినగానే తోక తొక్కిన పాములా ఎగిరి దూకుతున్నారు. కాబట్టి వీటిపై పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు స్పందించాలి. హిందు త్వంపై జరుగుతున్న విష ప్రచారాన్ని అరికట్టాలి. – పగుడాకుల బాలస్వామి, హైదరాబాద్ మొబైల్ : 99129 75753 -
జడ్జీల కంటే కోర్టు గదుల సంఖ్య తక్కువ..
న్యూఢిల్లీ: దేశంలో కింది స్థాయి కోర్టుల్లో పనిచేసే జడ్జీల సంఖ్య కంటే అక్కడ ఉన్న గదుల సంఖ్య తక్కువ ఉన్నట్లు న్యాయ మంత్రిత్వ శాఖ తన నివేదికలో వెల్లడించింది. జిల్లా కోర్టులు, వాటి అధీనంలో పనిచేసే(సబ్ ఆర్డినేట్) కోర్టుల్లో జడ్జీలు, గదుల సంఖ్యలను సమం చేస్తే దేశంలో న్యాయవ్యవస్థ పనితీరు మెరుగవుతుందని అభిప్రాయపడింది. దేశంలో మొత్తం 17,576 కోర్టు రూమ్‌లు, 14,363 రెసిడెన్షియల్ యూనిట్లు ఉండగా.. జడ్జీల సంఖ్య 22,288 ఉందని తెలిపింది. ఈ మేరకు పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సభ్యులకు నివేదిక ఇచ్చింది. -
స్తంభించిన కోర్టులు
హైదరాబాద్: లా కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనతో దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో కార్యకలాపాలు స్తంభించాయి. కోర్టుల్లో విధులను లాయర్లు బహిష్కరించారు. రాజధానిలోని అన్ని కోర్టుల్లోనూ న్యాయసేవలకు అంతరాయం ఏర్పడింది. -
భయాందోళనకు గురిచేసేందుకే పేలుళ్లు
అల్‌ఖైదా బేస్ మూమెంట్ పేరుతో దుశ్చర్యకు పాల్పడిన దుండగులు నెల్లూరు (క్రైమ్): తమ వర్గం వారి పట్ల పోలీసులు, న్యాయస్థానాలు కఠిన వైఖరి అవలంబిస్తున్నాయన్న భావనతో ఓ ఐదుగురు జట్టుగా ఏర్పడి అల్‌ఖైదా బేస్ మూమెంట్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. తక్కువ పేలుడు సామర్థ్యం కల్గిన ఐఈడీ(ఇంప్రవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)లను వినియోగించి కోర్టులు, ప్రజలను భయాందోళనకు గురిచేసేందుకు పథకం రచించారు. అందులో భాగంగా చిత్తూరు, నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలు.. కేరళ రాష్ట్రంలోని కొల్లాం, మలపురం, కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో పేలుళ్లకు పాల్పడ్డారు. దీనిపై శనివారం నిందితుల విచారణ పూర్తయింది. తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లా ఇస్మాల్పురానికి చెందిన ఎన్.అబ్బాస్ అలీ, చెన్నై పాలవక్కంకు చెందిన దావూద్ సులేమాన్, మదురై జిల్లా విశ్వాంత్నగర్కు చెందిన ఎం.సంసూన్ కరీం రాజా, కె.పాడూరుకు చెందిన మొహ్మద్ అయూబ్, మదురై త్యారిమార్కెట్కు చెందిన షంషుద్దీన్ అలియాస్ కురువ షంషుద్దీన్‌లు ఈ పేలుళ్లకు పాల్పడ్డారు. -
నడిగర్ సంఘం సమావేశం తథ్యం
మారిన వేదిక తమిళసినిమా: వ్యతిరేకవర్గం ఆరోపణ లు, కేసులు, కోర్టులు లాంటి పలు వివాదాల మధ్య ఎట్టకేలకు దక్షిణ భారత నటీనటుల సంఘం( నడిగర్‌సంఘం) సర్వసభ్య సమావేశం ముందుగా నిర్ణరుుంచిన ప్రకారమే ఆదివారం జరగనుంది. అరుుతే వేదికే మారింది. ముం దుగా ఈ సర్వసభ్య సమావేశం స్థానిక నుంగంబాక్కంలోని లయోలా కళాశాల లో జరపనున్నట్లు కార్యవర్గం వెల్లడిం చింది. అరుుతే అక్కడ నిర్వహించడానికి పలువురు వ్యతిరేకత వ్యక్తం చేశారు. భ ద్రతా దష్ట్యా పోలీసులు కూడా లయో లా కళాశాలలో సమావేశానికి అనుమతించకపోవడంతో స్థానిక టీ.నగర్, అబిబుల్లా రోడ్డులో గల సంఘ ఆవరణలోనే సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సంఘ కార్యదర్శి విశాల్ శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎంజీఆర్ శతజయంతి వేడుక: ఈ సర్వసభ్య ఈ సర్వసభ్య సమావేశంలో తమిళసినిమా నూరేళ్ల వేడుక, ఎంజీఆర్ శత జయంతి వేడుకలతో పాటు వందేళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ కళాకారుల పేర్లతో అవార్డుల ప్రదాన కార్యక్రమం జరుగుతుందని సంఘ నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా సంఘ కార్యక్రమాల తీర్మానాలు, ఆదాయ, వ్యయాల సభ్యుల ఆమోదం వంటి కార్యక్రమాలు జరగనున్నట్లు తెలిపారు. పోస్టర్లు వద్దు ఇకపోతే పోలీసు శాఖ అనుమతి లేనందువల్ల సంఘ సర్వసభ్యసమావేశానికి సంబంధంచిన ఎలాంటి పోస్టర్లను గోడలపై అంటించడం లాంటి ప్రచారాలు చేయరాదని సభ్యలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా గుర్తింపు కార్డులున్న సభ్యులకే సమావేశంలో పాల్గొనడానికి అనుమతి ఉంటుందని తెలియజేశారు.ఆదివారం జరగనున్న ఈ సమావేశానికి పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. -
చనిపోయిన రైతు పేరిట కాంగ్రెస్ పిటిషన్!
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల కోసం న్యాయస్థానాలను సైతం వాడుకుంటున్న నీచ సంస్కతి కాంగ్రెస్‌దేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో నాలుగు దశాబ్దాలపాటు ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ నేతలకు ఏనాడూ ప్రజల సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల సమస్యలు తమవి కావన్న రీతిలో వారు వ్యవహరించారని విమర్శించారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ నేతలు మొండిగా, మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కోర్టులంటే టీఆర్ఎస్కు అత్యంత గౌరవం ఉందని, కానీ, కాంగ్రెస్ మాత్రం తన రాజకీయాల కోసం కోర్టులను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. 2014లో చనిపోయిన ఓ రైతు పేరిట మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు కోర్టులో పిటిషన్ వేశారని విమర్శించారు. ఈ విధంగా తప్పుడు పిటిషన్ వేసినందుకు కాంగ్రెస్ నేతలపై కోర్టు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
ప్రశ్నించే గొంతు నొక్కేందుకే పీడీ యాక్టు
పంజగుట్ట: ప్రశ్నించిన ప్రతీ ఒక్కరినీ పీడీ యాక్టు పేరుతో భయపెట్టడం తగదని మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ప్రభుత్వాలు ప్రజల ఆందోళనకు కారణాలను గుర్తించి సమస్య పరిష్కరించాలని కోరారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ‘తెలంగాణలో నిర్భంధం ఎవరిమీద ..? పీడీ యాక్ట్ ఎందుకోసం’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రమైన నేరాలకు ఉద్ధేశించిన పీడీ యాక్టును చిన్న చిన్న కేసులకు, ప్రజా ఆందోళనలు, ఉద్యమాలు చేసే వారిపై ప్రయోగించడం దారుణమన్నారు. పీడీయాక్టు అమలుపై గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలన్నారు. ప్రజాస్వామ్యంలో పీడీ, నాసా తదితర నిర్భంధ చట్టాలను అమలు చేయాలనుకోవడం మంచిది కాదన్నారు. చెరుకు సుధాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం పీడీ యాక్ట్ సర్వసాధారణమైపోయిందన్నారు. ఖమ్మం జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న 80 మంది గిరిజనులపై పీడీ యాక్టు ప్రయోగించడం విడ్డూరంగా ఉందన్నారు. పోడు వ్యవసాయం అటవీ హక్కు చట్టం ప్రకారం వారి హక్కుగా పేర్కొన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే నయీంతో సంబంధాలు ఉన్న అధికార పార్టీ నాయకులపై పీడి యాక్ట్ పెట్టాలని హితవు పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యెన్న శ్రీనివాస్ రెడ్డి, ఎపూరి సోమన్న, సందీప్ చమల్, శ్రీనివాస్ గౌడ్, మేరీ మాదిగ, వనజ తదితరులు పాల్గొన్నారు. -
రేపు కోర్టుల్లో లోక్ అదాలత్
మచిలీపట్నం : జిల్లాలోని అన్ని కోర్టులలో ఈ నెల 10వ తేదీన జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు చెప్పారు. జిల్లా కోర్టులోని లోక్ అదాలత్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని కోర్టులలో లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నామన్నారు. రాజీపడదగిన క్రిమినల్ కేసులు, సివిల్, ప్రీలిటిగేషన్, బ్యాంకు వ్యాజ్యాలు, రోడ్డు ప్రమాదం కేసులు 2939 పరిష్కరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇక నుంచి ప్రతి రెండో శనివారం లోక్‌అదాలత్‌ను అన్ని కోర్టులలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం రామకృష్ణ లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కారం చేసుకుంటే కలిగే ప్రయోజనాలను వివరించారు. సమావేశంలో లోక్‌అదాలత్ కార్యదర్శి రజని, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పీఆర్ రాజీవ్ పాల్గొన్నారు. -
పెరగనున్న కోర్టుల సంఖ్య
అడ్వకేట్ జనరల్, లా సెక్రటరీ కలిసి నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వం ఒక్కో జిల్లా కేంద్రంలో దాదాపు 13 కోర్టులు జగిత్యాల జోన్ : కొత్త జిల్లాలుగా మారనున్న జగిత్యాల, పెద్దపల్లి పట్టణాల్లో కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటు, సిబ్బందిని నియమించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కొత్త జిల్లాల్లో కోర్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని న్యాయవాదులు అంటున్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు, రవాణా భారం తగ్గించేందుకు జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో మరిన్ని కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అడ్వకేట్ జనరల్, లా సెక్రటరీలు కలిసి నూతన కోర్టుల ఏర్పాటుపై హైకోర్టుకు నివేదిక ఇవ్వగానే, కోర్టుల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. ప్రస్తుతం ఉన్న కోర్టులు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జిల్లా ప్రధాన న్యాయస్థానంతో పాటు మొదటి, మూడవ అదనపు కోర్టులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఫ్యామిలీ కోర్టు, ఎస్సీ, ఎస్టీ కోర్టు, ఎసీబీ కోర్టు, ఐదు మేజిస్ట్రేట్ కోర్టులు, రెండు సబ్ కోర్టులు, ఒక సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, వినియోగదారుల ఫోరం, లోక్ అదాలత్‌లు ఉన్నాయి. జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, వేములవాడ, హుస్నాబాద్‌లలో మేజిస్ట్రేట్ కోర్టులు ఉండగా, మంథని, పెద్దపల్లిలలో మేజిస్ట్రేట్ కోర్టులతో పాటు సబ్ కోర్టులు ఉన్నాయి. సిరిసిల్లలో సబ్ కోర్టుతో పాటు రెండు మేజిస్ట్రేట్ కోర్టులు, హుజురాబాద్‌లో సబ్ కోర్టులో పాటు మూడు మేజిస్ట్రేట్ కోర్టులు, గోదావరిఖనిలో అదనపు జిల్లా కోర్టుతో పాటు మేజిస్ట్రేట్ కోర్టు, జగిత్యాలలో అదనపు జిల్లా కోర్టుతో పాటు సబ్ కోర్టు, మూడు మేజిస్ట్రేట్ కోర్టులు, ఒక సెకండ్ క్లాస్ కోర్టులు ఉన్నాయి. జగిత్యాల, పెద్దపల్లిలో పెరగనున్న కోర్టుల సంఖ్య జగిత్యాలలో ప్రస్తుతం ఉన్న ఆరు కోర్టులకు, పెద్దపల్లిలో ఉన్న రెండు కోర్టులకు అదనంగా వినియోగదారుల ఫోరం, ఫ్యామిలీ కోర్టు, ఎస్సీ, ఎస్టీ కోర్టు, జిల్లా ప్రధాన న్యాయస్థానం, ఎకై ్సజ్ కోర్టు, పీసీఆర్ కోర్టు, లేబర్ కోర్టు, పర్మినెంట్ లోక్‌అదాలత్‌లు రానున్నాయి. నూతన జిల్లాలోని మండలాల సంఖ్య తక్కువగా ఉండటంతో, కొత్తగా ఏర్పాటు చేసే కోర్టులను అయా జిల్లాలోని ఇతర మండలాల్లో కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని, రామగుండం తదితర ప్రాంతాల్లో మరిన్ని కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. జగిత్యాల జిల్లాలో మెట్పల్లిలో సబ్‌కోర్టు, ధర్మపురి, కొండగట్టులో మున్సిఫ్ కోర్టులు ఏర్పాటు చేసే అలోచనలు సైతం ఉన్నాయి. పూర్తి స్థాయి నివేదిక అందగానే.. అయా ప్రాంతాల్లోని బార్ అసోసియేషన్ల న్యాయవాదులు, ప్రజాప్రతినిధుల నుంచి కొత్త కోర్టులకు సంబంధించిన విషయాలను రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌తో పాటు న్యాయశాఖ కార్యదర్శి సేకరిస్తారు. నివేదికను హైకోర్టుతో పాటు ప్రభుత్వానికి అందజేస్తారు. కొత్త జిల్లాల్లో నూతన కోర్టులు ఏర్పాటు చేయడం లేదంటే ఉన్న కోర్టులను ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. జగిత్యాలలో కొత్త కోర్టులు ఏర్పడే అవకాశం ఉన్నందున జగిత్యాల న్యాయవాదులు కోర్టు ప్రాంగణంలో ఉన్న జగిత్యాల స్పెషల్ సబ్ జైలును ధరూర్ క్యాంప్‌కు తరలించాలని ప్రభుత్వానికి విన్నవించారు. కోర్టుల ఏర్పాటుతో సత్వర న్యాయం – బండ భాస్కర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, జగిత్యాల కొత్త కోర్టులను స్వాగతిస్తున్నాం. కొత్త కోర్టుల ఏర్పాటుతో కక్షిదారులకు రవాణాభారం తగ్గడమే కాకుండా సత్వర న్యాయం అందే అవకాశాలున్నాయి. ఒక్కో జిల్లాకు దాదాపు 13 కోర్టులు వచ్చే అవకాశం ఉంది. అవసరమైన మండలాల్లో సైతం కోర్టులు ఏర్పాటు చేయాలి. పెండింగ్ భారం తగ్గుతుంది –కటుకం చంద్రమోహన్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, జగిత్యాల కొన్ని కేసుల్లో కక్షిదారులు కరీంనగర్ జిల్లా కేంద్రానికి వెళ్తున్నారు. కొత్త కోర్టుల ద్వారా ఏ జిల్లాలో కేసులను ఆ జిల్లాలోనే పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. కోర్టులతో పాటు జడ్జి పోస్టులను పెంచితే కక్షిదారులకు సత్వర న్యాయం జరుగనుంది. -
న్యాయం దక్కేదెలా?
ఏళ్లు గడిచినా అతీ గతీ లేకుండా న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉండి పోవడానికి కారణమేమిటో ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్‌ను అభినం దించాలి. అంతకుముందు పనిచేసిన ప్రధాన న్యాయమూర్తులు అసలు మాట్లాడ లేదని కాదు గానీ... జస్టిస్ ఠాకూర్ ఆ పదవిలో కొచ్చాక కేసులు పెండింగ్‌లో పడిపోవడం గురించీ, న్యాయమూర్తుల నియామకాలలో జాప్యం గురించీ తరచు పాలకుల దృష్టికి తీసుకొస్తున్నారు. తాజాగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట బురుజులపై నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో జడ్జీల నియామకం అంశాన్ని ప్రస్తావించకపోవడాన్ని ఆయన ఎత్తిచూపారు. అందుకు ఖేదపడ్డారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాల్గొన్న సభలో ఆయన సమక్షంలోనే ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. సమస్యలెదురై తమ దగ్గరకొస్తే పరిశీలించి తప్పొప్పుల్ని నిర్ధారించి న్యాయం చెప్పగల వ్యవస్థ నుంచే ఇలాంటి వ్యాఖ్యలు వినవలసి రావడం పాలకు లకే కాదు... దేశ ప్రజలందరికీ ఇబ్బందికరమే. జస్టిస్ ఠాకూర్ ఇలా బహిరంగ వ్యాఖ్యానించడం ఆక్షేపణీయమని కొందరంటే... కేంద్ర న్యాయశాఖ మంత్రి దృష్టికి లేదా ప్రధాని దృష్టికి మరోసారి సమస్యను నేరుగా తీసుకెళ్లాల్సిందని మరికొందరు అభిప్రాయపడ్డారు. అయిదు నెలలక్రితం ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్న జాతీయ సదస్సులో కూడా జస్టిస్ ఠాకూర్ జడ్జీల నియామకంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రస్తావించారు. ఆ సందర్భంలో ఆయన కంటతడి పెట్టారు కూడా. కోర్టుల్లో న్యాయమూర్తుల కొరత, దాన్ని సరిదిద్దడంలో జరుగుతున్న జాప్యంపై దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం గత శుక్రవారం విచారణకొచ్చినప్పుడు... తాము న్యాయపరంగా జోక్యం చేసుకునే స్థితి కల్పించ వద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాజ్యంపై ఏడాది కాలంగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేసేలా చూస్తానని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ హామీ ఇవ్వాల్సివచ్చింది. నిజానికి దీన్ని కేంద్రం, న్యాయవ్యవస్థ మధ్య సాగుతున్న పంచాయతీగా చూడలేము. దీని పర్యవసానాలను అనుభవిస్తున్నది సాధారణ పౌరులు. న్యాయస్థానాల్లో కింది నుంచి పైవరకూ భారీయెత్తున కేసులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. వాటి సంఖ్య 3 కోట్ల వరకూ ఉంటుందని ఒక అంచనా. వీటిని తేల్చవలసిన న్యాయమూర్తుల సంఖ్య మాత్రం 7,675కు పరిమితమై ఉంది. మన దేశంలో పది లక్షలమందికి సగటున పదిమంది న్యాయ మూర్తులున్నారు. అమెరికాలో ఈ సంఖ్య 107! అమెరికాలో సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు ఏడాదికి సగటున 81 కేసులు పరిష్కరిస్తారు. మన దేశంలో ఈ సంఖ్య 2,600. న్యాయమూర్తులపై ఇంత భారం పడటం ఎలా చూసినా అవాంఛనీయం. స్వచ్ఛంద సంస్థ దక్ష్ ఈమధ్యే విడుదల చేసిన గణాంకాలను చూస్తే... మన న్యాయస్థానాల్లో అయిదేళ్లకు పైబడి పెండింగ్‌లో ఉన్న కేసులు 4 శాతమైతే, 5 నుంచి పదేళ్లలోపు పెండింగ్‌లో ఉన్నవి 12 శాతం, 10 ఏళ్ల పైబడి 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నవి 82 శాతం. నిజానికి తాము పూర్తి స్థాయిలో డేటా సేకరించ లేకపోయామని ఆ సంస్థ చెబుతున్నది. ఈ కేసులన్నిటా ప్రధాన కక్షిదారు కేంద్ర ప్రభుత్వమే అన్నది మరవకూడదు. కేసులు తెమల్చడంలో జరుగుతున్న విపరీత జాప్యం పర్యవసానంగా 31 శాతంమంది బెయిల్‌కు వీలైన కేసుల్లో అరెస్టయిఉన్నా జైళ్లలో మగ్గుతున్నారు. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న కొలీ జియం వ్యవస్థ స్థానంలో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ)ని ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని నిరుడు అక్టోబర్‌లో కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పుతో కొలీజియం వ్యవస్థను పునరుద్ధరించారు. న్యాయమూర్తులే న్యాయమూర్తుల్ని నియమించుకునే ఈ విధానంలో పారదర్శకత లోపించిందని ఇదే కేసులో మెజారిటీ తీర్పుతో విభేదించిన జస్టిస్ చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. ఏమైతేనేం కొలీజియం వ్యవస్థే ఇప్పుడు అమల్లో ఉంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి వెలువడాల్సిన విధాన పత్రం(ఎంఓపీ) రాక పోవడం ప్రస్తుత సమస్య. ఫలితంగా కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల నియామకం, బదిలీలకు సంబంధించి 75మంది పేర్లున్న జాబితా అనిశ్చితిలో పడింది. దేశంలోని 24 హైకోర్టుల్లో జడ్జీల ఖాళీలు 478 ఉన్నాయని న్యాయ మూర్తుల నియామకాలపై సుప్రీంకోర్టులో పిల్ విచారణ కొనసాగిన రోజునే కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. ఆ హైకోర్టుల్లో దాదాపు 39 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కూడా చెప్పింది. సమస్యపై ఇంత స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు పరిష్కారంలో జాప్యం మంచిది కాదు. అయితే మొత్తం సమస్యకు న్యాయమూర్తుల కొరత అన్నది ఒక పార్శ్వం మాత్రమే. అదే ఏకైక కారణమనడం కూడా సరిగాదు. కేసులకు సంబంధించిన యాజమాన్య నిర్వహణ సరిగా లేక పోవడం కూడా ఒక కారణమని దక్ష్ సంస్థ ఎత్తిచూపింది. జాతీయ స్థాయిలో ఉన్న కోర్టు మేనేజ్మెంట్ వ్యవస్థ సమకూర్చిన డేటాకూ, కోర్టు వెబ్సైట్లలో చూపుతున్న డేటాకూ పొంతన లేదని ఆ సంస్థ అంటున్నది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టాన్ని సవరించాక చెక్ బౌన్స్ కేసులు వెల్లువలా వచ్చిపడి నేర న్యాయవ్యవస్థ పని విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. న్యాయమూర్తులకూ, న్యాయ వాదులకూ మధ్య తలెత్తే వివాదాలు, ఎడతెగని వాయిదాలు, కేసుల దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం, కింది స్థాయి కోర్టుల్లో మౌలిక సదుపాయాల లేమి, నిరర్ధకమైన కేసులు వంటివి కూడా సమస్యను పెంచుతున్నాయి. పర్యవసానంగా న్యాయం లభించక సాధారణ పౌరులు విలవిల్లాడుతున్నారు. అందువల్ల సమస్య పరిష్కా రానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు న్యాయవ్యవస్థ సమష్టిగా కృషి చేసి దీనికొక ముగింపు పలకాలి. -
కోర్టులకొచ్చేందుకు నేటికీ అత్యధికుల సంశయం
* 10 శాతం మంది మాత్రమే న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు * దీన్ని మార్చి.. సత్వర న్యాయం అందేలా చూడాలి * ఈ బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులపై ఉంది * స్వాతంత్య్ర వేడుకల్లో ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ * పలువురు సీనియర్ న్యాయవాదులకు ఘన సన్మానం సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యధిక శాతం మంది ప్రజలు తమ హక్కుల విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు ఇప్పటికీ సంశయిస్తున్నారని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ పేర్కొన్నారు. కేవలం 10 శాతం మంది మాత్రమే వివాదాలు, సమస్యల పరిష్కారానికి న్యాయస్థానాల మెట్లు ఎక్కుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చి అవసరమైన ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే కాకుండా అది సత్వరమే అందేలా చూడాల్సిన బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులపై ఉందన్నారు. సోమవారం హైకోర్టు ప్రాంగణంలో 70వ స్వాతంత్య్ర దిన వేడుకలు జరిగాయి. ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన వారిలో అత్యధికులు న్యాయవాదులే అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీతోపాటు మొదటి గవర్నర్ జనరల్ రాజగోపాలచారి, మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మొదటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ, మొదటి ఉప ప్రధాన మంత్రి, హోంమంత్రి సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్, మొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తదితరులు ప్రముఖ న్యాయవాదులేనని ఏసీజే గుర్తుచేశారు. వారి త్యాగాల ఫలితమే ఇప్పుడు దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోందన్నారు. ఆ త్యాగాలను సదా స్మరించుకోవాలన్నారు. న్యాయం ఎవరికైతే అవసరమో వారికి న్యాయం అందించడంతోపాటు దానిని వేగంగా కూడా అందించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉందన్నారు. ఈ విషయంలో సీనియర్ న్యాయవాదులు తమ వంతు పాత్ర పోషించాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు వారు తమ అనుభవనాలు, జ్ఞానాన్ని పంచాలని కోరారు. కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఏపీ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ అదనపు ఏజీ జె.రామచంద్రరావు, ఏపీ, తెలంగాణ హైకో ర్టు న్యాయవాదుల సంఘాల అధ్యక్షుడు సి.నాగేశ్వరరావు, జి.మోహనరావు తదితరు లు ప్రసంగించారు. వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన హైకోర్టు సిబ్బంది పిల్లలకు జస్టిస్ రమేశ్ రంగనాథన్ దంపతులు బహుమతులు ప్రదానం చేశారు. సీనియర్ న్యాయవాదులకు సన్మానం... ఉభయ రాష్ట్రాలకు చెందిన పలువురు సీనియర్ న్యాయవాదులను ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఘనంగా సన్మానించారు. గత 55 ఏళ్ల నుంచి సీనియర్ న్యాయవాదులుగా న్యాయవ్యవస్థకు ఎనలేని సేవలందిస్తున్నందుకు హైకోర్టు వారిని సన్మానిం చింది. సన్మానం అందుకున్న వారిలో ఎ.పుల్లారెడ్డి, టి.బాల్‌రెడ్డి, కె.ప్రతాప్‌రెడ్డి, పి.బాలకృష్ణమూర్తి, బి.వి.సుబ్బయ్య, బత్తుల వెంకటేశ్వరరావు, ఇ.మనోహర్, కోకా రాఘవరావు, కె.వి.సత్యనారాయణ, సుబ్రహ్మణ్య నరసు తదితరులున్నారు. -
విద్యుత్ సమస్యల పరిష్కారానికి లోకల్ కోర్టులు
హన్మకొండ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి లోకల్ కో ర్టులు నిర్వహిస్తున్నట్లు వరంగల్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరి ష్కార వేదిక చైర్మన్ కందుల కృష్ణయ్య తెలిపారు. విద్యుత్ వినియోగదారు లు ఎదుర్కొంటున్న సమస్యలను లోకల్ కోర్టులో ఫిర్యాదు చేయడం ద్వారా పరిష్కరించుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో వచ్చే హెచ్చుతగ్గులు, అంతరాయాలు, మీటర్, బిల్లులోని సమస్యలు, కొత్త సర్వీసులు ఇవ్వడంలో జాప్యం, నిరాకరణను ఈ కోర్టు ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈనెల 8న స్టేషన్‌ఘన్‌పూర్ సబ్ డివిజన్ కార్యాలయంలో, 10న కురవి సబ్‌డివిజన్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు లోకల్ కోర్టులు నిర్వహించనున్నట్లు వివరించారు. -
న్యాయ వ్యవస్థను గుడిసెలు, అద్దెభవనాల్లోకి తరలించలేం
- ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నెల్లూరు సిటీ: ఉన్నపాటుగా మిగిలిన శాఖలతో పాటు న్యాయవ్యవస్థను గుడిసెలు, అద్దె భవనాల్లోకి తరలించలేమని టీడీపీ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఈ విషయం తెలంగాణ ప్రభుత్వానికి, న్యాయాధికారులకు తెలుసన్నారు. నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ..ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఏపీకి 10 సంవత్సరాల పాటు పాలించే హక్కుందన్నారు. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డు పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులో ముఖ్యమైనవి ఉంటాయని, వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. వారికి సరైన సౌకర్యాలు కల్పించాకే నూతన రాజధానికి మారుస్తామని చెప్పారు. న్యాయవాదులను 60:40 నిష్పత్తిలో విభజిస్తామంటే అడ్డుపడుతున్నారని, రాష్ట్రం విడిపోయిన తరువాత బార్ కౌన్సిల్ విడిపోవాల్సి ఉందని దీన్ని తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఆస్తులు, నీటి పంపకాల విషయంలో కూర్చునేందుకు సమయం కేటాయించదని ఎద్దేవా చేశారు. ఎక్కడ శాంతి భద్రతల విషయంలో కోర్టులు అంతిమతీర్పులు ఇస్తాయో, అక్కడే శాంతికి విఘాతం కలిగే పరిస్థితి చరిత్రలో ఇంతకుముందు జరగలేదన్నారు. ఉమ్మడి రాజధానిలో ఇష్టప్రకారం వ్యవహరిస్తే కుదరదని సోమిరెడ్డి అన్నారు. -
‘పెండింగ్’ తీరేదెలా?
అందరికీ తెలిసిన సమస్యే అయినా దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని ఒక ప్రధాన అంశం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ భావోద్వేగ ప్రసంగంతో మరోసారి చర్చకొచ్చింది. ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశాన్ని ఆదివారం ప్రారంభిస్తూ ఆయన ఒకటికి రెండుసార్లు కంటతడి పెట్టుకున్నారు. దేశంలో జనాభాకు అనుగుణంగా న్యాయమూర్తుల సంఖ్య లేదని, ఈ విషయంలో ఎన్నిసార్లు పాలకులకు విన్నవించుకున్నా నిరుపయోగమవుతున్నదని ఆవేదనపడ్డారు. ఏటా ఇలాంటి సమావేశాలు జరగడం, సమస్యల గురించి చర్చించడం...పాలకులు ఏవో హామీలివ్వడం షరా మామూలే. కానీ క్రియకొచ్చేసరికి ఏమీ జరగడం లేదు. జస్టిస్ ఠాకూర్ చెప్పినట్టు పది లక్షలమంది జనాభాకు 10మంది న్యాయమూర్తులుండగా ఆ సంఖ్యను 50కి పెంచాలని 1987లో లా కమిషన్ సిఫార్సుచేసింది. మూడేళ్లక్రితం ఇలాంటి సదస్సే జరిగినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్...ప్రతి పది లక్షలమందికీ 15.5మంది జడ్జీలున్నారని లెక్కలు చెప్పారు. దీన్ని పెంచాల్సి ఉన్నదని కూడా అన్నారు. అలా అన్నాక కూడా ఈ విషయంలో ఆయన ప్రభుత్వం చేసిందేమీ లేదు. చూడటానికి ఈ సమస్య ప్రభుత్వానికీ, న్యాయవ్యవస్థకూ మధ్య సాగుతున్న వివాదంగా కనిపిస్తుందిగానీ ఇందువల్ల ఇబ్బందులు పడుతున్నది అసంఖ్యాకులైన పౌరులు. న్యాయం పొందడానికి వారికి గల హక్కు అను నిత్యం ఉల్లంఘనకు గురవుతోంది. న్యాయస్థానాల్లో ఏళ్లతరబడి కేసులు అతీగతీ లేకుండా పెండింగ్ పడుతుంటే కోట్లాది కుటుంబాలు దిక్కుతోచక విలపిస్తున్నాయి. అది సివిల్ స్వభావమున్నా కేసా...క్రిమినల్ కేసా అన్న అంశంతో నిమిత్తం లేదు. ఏ కేసైనా కోర్టు గడప తొక్కితే ఏళ్ల తరబడి అనిశ్చిత స్థితి ఏర్పడుతోంది. సకాలంలో విచారణ జరిగితే పడే శిక్షాకాలానికి మించి అనేకమంది నిందితులు జైలు గోడల వెనక మగ్గుతున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా కేసు ఇందుకు తాజా ఉదాహరణ. ఆయనపై ఉన్న రాజద్రోహం కేసులో కనీసం రెగ్యులర్ బెయిల్ లభించడానికే రెండున్నరేళ్లు పట్టింది. మాలెగావ్ పేలుళ్ల కేసు నిందితులు నిర్దోషులని రుజువు కావడానికి అయిదేళ్ల సమయం పట్టింది. సల్మాన్‌ఖాన్ ప్రమేయం ఉన్న కేసులు దశాబ్దాల తరబడి సాగుతూనే ఉన్నాయి. సివిల్ కేసులు కావొచ్చు...క్రిమినల్ కేసులు కావొచ్చు ఇలాంటివి కింది కోర్టుల్లో 2.70 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. హైకోర్టుల్లో 38 లక్షలు, సుప్రీంకోర్టులో 60,000కుపైగా కేసులు తేల్చాల్సినవి ఉన్నాయి. ఇప్పుడున్న జనాభాకు అనుగుణంగా న్యాయమూర్తులుండాలనుకుంటే తక్షణం 40,000మందిని నియమించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెబుతున్నారు. ప్రస్తుతం 16,238మంది న్యాయమూర్తులుండగా, మంజూరై భర్తీ కాకుండా ఉన్న పోస్టుల సంఖ్య 21,301. ఫలితంగా న్యాయమూర్తులపై పనిభారం అపారంగా పెరుగుతోంది. ఉన్న కేసులు అలాగే ఉండగా రోజురోజుకూ కొత్త కేసులు వచ్చి చేరుతున్నాయి. పౌరులకు త్వరితగతిన న్యాయం అందించడానికి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో 2000 సంవత్సరంలో 1,734 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేశారు. ఈ కోర్టులకయ్యే వ్యయభారాన్ని రాష్ట్రాలపైనే మోపాలని 2011లో కేంద్రం నిర్ణయించడంతో వాటిలో దాదాపు 60 శాతం మూతబడ్డాయి. వాస్తవానికి ఏ రాష్ట్రమైనా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల కోసం ఖర్చు చేయాల్సింది తమ బడ్జెట్ వ్యయంలో 0.01 శాతం మాత్రమే. అయినా ఈమాత్రం వ్యయాన్ని భరించడానికి అవి సిద్ధపడలేదు. 2012 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం తర్వాత ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు కొన్ని మళ్లీ ఊపిరి పోసుకున్నాయి. నిరుడు విడుదలైన లెక్కల ప్రకారం వాటి సంఖ్య 473. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల వల్ల అనుకున్న ప్రయోజనాలు పెద్దగా నెరవేరడం లేదని నిపుణులు చెబుతారు. ఢిల్లీ ఉదాహరణే తీసుకుంటే అత్యాచారాల కేసుల విచారణ కోసం అక్కడ ఏర్పాటైన 9 కోర్టుల్లో గత మూడున్నరేళ్లుగా 93 శాతం కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి! కనుక సమస్యకు సంబంధించిన మూలాలు మరెక్కడో ఉన్నాయని అర్ధమవుతుంది. కేసుల దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ సక్రమంగా లేకపోవడం...వాయిదాలివ్వడంలో ఉదారంగా వ్యవహరించడంవంటివి కూడా కేసుల పెండింగ్‌కు కారణమవుతున్నాయి. అన్నిటికన్నా ప్రధానమైంది ప్రభుత్వాల నిర్లిప్తత. అత్యధిక కేసుల్లో ప్రధాన కక్షిదారుగా ప్రభుత్వమూ లేదా దాని అనుబంధ సంస్థలే ఉంటాయి. న్యాయస్థానాల్లో తాము నడిపిస్తున్న కేసుల్లో నిజంగా విచారణార్హమైనవెన్నో, కోర్టు వెలుపల సులభంగా పరిష్కరించుకోదగినవెన్నో, నిరర్ధకమైనవెన్నో సరిచూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. కానీ ఆ బాధ్యత నుంచి అవి తప్పుకుంటున్నాయి. ఒక కేసు కొనసాగితే ప్రభుత్వానికి లేదా సమాజానికి ఒనగూడే ప్రయోజనమేమిటో...వెనువెంటనే పరిష్కారం చేసుకుంటే ఖజానాకు కలిగే ఆదా ఎంతో సమీక్షించేవారు లేరు. ఏళ్ల తరబడి కేసులు సాగుతూనే ఉన్నా కారణమేమిటో తెలుసుకునేవారుండరు. ఈ వైఖరి కూడా పెండింగ్ కేసుల సంఖ్యను పెంచుతోంది. న్యాయవ్యవస్థ పరంగానూ లోపాలున్నాయి. కేవలం ప్రచారాన్ని ఆశించి లేదా రాజకీయ ప్రయోజనాలను ఉద్దేశించి దాఖలు చేస్తున్న కేసుల్ని స్వీకరణ దశలోనే కొట్టేయాల్సి ఉండగా ఆ పని సమర్ధవంతంగా జరగటం లేదు. ఆ పేరు మీద కొన్ని నిజమైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఎగిరిపోతున్నాయి. కోర్టులకుండే సెలవుల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల్లోనూ వాస్తవముంది. సుప్రీంకోర్టు వరకూ చూస్తే నెల్లాళ్లకుపైగా వేసవి సెలవులు...దసరా, దీపావళివంటి పండుగలకు ఆరేసి రోజుల సెలవులు...పది పన్నెండు రోజుల క్రిస్మస్ సెలవులు ఉంటాయి. ఇతరత్రా ప్రభుత్వ సెలవు దినాలు వీటికి అదనం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పోల్చినా ఇవి బాగా ఎక్కువ. 2009లో జస్టిస్ ఏఆర్ లక్ష్మణన్ నేతృత్వంలోని లా కమిషనే ఈ సెలవుల సంగతి ప్రస్తావించి, తగ్గించుకోవాలని సూచించింది. ప్రధాన సమస్య అయిన న్యాయమూర్తుల నియామకంతోపాటు ఇలాంటి చిన్న చిన్న అంశాలను కూడా సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. జస్టిస్ ఠాకూర్ ఈ అంశాన్ని లేవనెత్తిన తీరు చూశాకైనా సమస్యపై పాలకులు దృష్టి సారిస్తారని, దీనికొక శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశించాలి. -
'సెలవుల్లోనూ కోర్టులు పనిచేసేలా చర్యలు'
సాక్షి, న్యూఢిల్లీ: పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు ఉదయం, సాయంత్రం, సెలవు దినాల్లో కోర్టుల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. న్యాయ సంస్కరణలపై ఆదివారం ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు వీలుగా కొత్త కోర్టుల ఏర్పాటుకు కేసీఆర్ సహకరిస్తారని చెప్పారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కొత్త కోర్టు భవనాల నిర్మాణానికి కావల్సిన మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని వివరించారు. పెండింగ్ కేసుల పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కంటతడి పెట్టడం మనసును కలచి వేసిందన్నారు. -
‘న్యాయ’ రిజర్వేషన్లు అవసరమే
సందర్భం హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక గురించి ఏర్పాటు చేసిన కమిషన్ని సుప్రీం కోర్టు రద్దు చేసి కొలీజియమ్ పద్ధతిని సమర్థిస్తూ తీర్పును ప్రకటించింది. న్యాయమూర్తుల ఎం పిక పద్ధతిపై ఒక విజ్ఞాపన పత్రం (అఫిడవిట్)ను కేంద్ర ప్రభుత్వం సమర్పించాలని సుప్రీం కోర్టు ఆ తీర్పులో కోరింది. 1999లో రూపొందించిన జడ్జీల ఎంపిక పద్ధతిని మార్చాలని కూడా సుప్రీంకోర్టు డిసెంబర్ 16, 2015న ఆ తీర్పులో చెప్పింది. కానీ ఇప్పటికీ ఆ ఎంపిక పద్ధతి గురించిన విజ్ఞాపన పత్రం తుది రూపు దాల్చలేదు. పత్రికల్లో వస్తున్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విజ్ఞాపన పత్రంలో పారదర్శకత, అర్హత, సచివా లయ వివరాలు, ఫిర్యాదుల విచారణ తదితర అంశాలు ప్రాధాన్యత సంతరించు కున్నాయి. కానీ సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్ల ప్రస్తావన ఎక్కడా లేదు. జడ్జీల నియామకాల్లో రాజ్యాంగం ఎలాంటి రిజర్వేషన్లు నిర్దేశించ లేదు కానీ అన్ని వర్గాల ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి నెలకొనే అవకాశం ఉంది. అదే విధంగా ఉన్నత వర్గాలే న్యాయ మూర్తులుగా ఉండటం వల్ల వారి వర్గ దృక్పథం ప్రకారం తీర్పులు వెలువడే అవకాశం కూడా వుంది. ఉన్నత న్యాయస్థానాల్లోని న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్లు ఉండాలని అప్పటి కేంద్ర సహాయమంత్రి నాచియప్పన్ 2007 సంవత్సరంలో గొంతెత్తారు. జస్టిస్ సదాశివం భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్య తలు స్వీకరించే ముందు ఒక ఇంటర్వ్యూలో ఇలాంటి అభిప్రాయమే వెలిబుచ్చారు. షెడ్యూల్డు కులాలకి, తెగలకి, వెనుకబడిన తరగతులకి చెందిన వ్యక్తులకి ప్రాతినిధ్యం కలిగేలా రిజర్వేషన్లు ఉండాలని అయితే కనీస ప్రమాణాలు వున్న వ్యక్తులనే ఎంపిక చేస్తామని కూడా ఆయన అన్నారు. జనవరి 19, 2016వ తేదీన మద్రాస్ హైకోర్టు న్యాయ మూర్తులు హరిపరంతమన్, పి.ఆర్ శివకుమార్‌లు మదురై న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్లు ఉండాలని గొంతెత్తారు. దేశవ్యాప్తంగా వున్న 1200 మంది న్యాయ వాదుల్లో షెడ్యూల్డు కులాలకు చెందిన వ్యక్తులు 18 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు జడ్జీల ఎంపిక కమిషన్ చట్టాన్ని కొట్టివేసిన తర్వాత తీసుకొని రావాల్సిన సంస్కరణల గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జె.ఎస్.కెహర్ అధ్యక్షతన గల బెంచ్ విచారి స్తున్నపుడు మహిళల రిజర్వేషన్ ప్రస్తావన వచ్చింది. మహి ళలని న్యాయమూర్తులుగా ఎంపిక చేసే ఆలోచనలకి వ్యతిరే కంగా న్యాయమూర్తులు ఉండకూడదని మహిళా న్యాయ వాదులు కోర్టు ముందు గట్టిగా వాదించారు. దేశంలోని హైకోర్టు న్యాయమూర్తులలో 611 మంది పురుషులు న్యాయవాదులుగా ఉంటే 62 మంది మాత్రమే మహిళలు ఉన్నారని వాళ్లు కోర్టుకు విన్నవించారు. దిగువ కోర్టులో రిజర్వేషన్లు ఉన్నాయి కానీ హైకోర్టు, సుప్రీంకోర్టులో రిజర్వేషన్లు లేవు. ప్రధాన న్యాయమూర్తుల పదోన్నతులలో అన్ని రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తులకి ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్టు అన్పి స్తుంది. కానీ న్యాయమూర్తుల ఎంపికలో అన్ని వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కన్పించటం లేదు. అదే విధంగా సర్వీసెస్ నుంచి వచ్చే న్యాయమూర్తులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. ఇపుడున్న 601 న్యాయ మూర్తుల్లో 378 మంది న్యాయవాదుల వృత్తి(బార్) నుంచి వచ్చిన వాళ్లే. 168 మంది మాత్రమే సర్వీసెస్ నుంచి వచ్చిన వాళ్లు. ఈ నిష్పత్తిని సమానంగా ఉంచకపోవడం ఒక రకంగా వివక్షే. బార్ నుంచి ఎంపికయ్యే న్యాయమూర్తుల సగటు వయస్సు 48 సంవత్సరాలు ఉంటే సర్వీసెస్ నుంచి వచ్చిన న్యాయమూర్తుల సగటు వయస్సు 56 సంవత్స రాలు వుంటుంది. వయస్సు రీత్యా సీనియారిటీలో కింద పెట్టడం వల్ల సర్వీసెస్ నుంచి వచ్చిన న్యాయమూర్తులు కొలీజియమ్లోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా హైకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 60 మాత్రమే. సుప్రీంకోర్టులో ఒకే ఒక మహిళా న్యాయమూర్తి. 8 హైకోర్టులలో ఒక్క మహిళా న్యాయ మూర్తి కూడా లేరు. షెడ్యూల్ తెగలకి, వెనుకబడిన తరగ తులకి, మైనార్టీలకి సంబంధించి ఎంత మంది న్యాయ మూర్తులు ఉన్నారో తెలియదు గానీ వారి సంఖ్య పరిమి తంగా ఉందని చెప్పవచ్చు. రిజర్వేషన్లు లేకపోయినా అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం ఉండేలా న్యాయమూర్తుల ఎంపిక జరగాలి. చదువు అనేది వ్యాపారంగా మారిన మనదేశంలో యోగ్యత ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తామని అనడం ఎంత వరకు సమంజసమన్న ప్రశ్న కూడా వస్తుంది. అట్లా అని యోగ్యత లేని వాళ్లని ఎంపిక చేయమని అనడం కూడా సరైంది కాదు. రిజర్వేషన్లు కావాలని అనడం మెరిట్కి వ్యతిరేకం కాదు. న్యాయవ్యవస్థలో అన్ని వర్గాలని భాగస్వా మ్యం చేయాలన్న ఉద్దేశంతో చెబుతున్న మాట. ఎందుకంటే ఉన్నత వర్గాలకి చెందిన, అణగారిన వర్గాల నుంచి వచ్చిన న్యాయమూర్తుల దృక్పథం వేరు వేరుగా ఉంటుంది. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి బి. పార్ధివాలా ఓ కేసును విచారిస్తూ. ‘‘ఈ దేశాన్ని నాశనం పట్టించిన లేదా దేశం సరైన దిశలో ప్రయాణం చేయక పోవడానికి గల కారణాలు చెప్పమని నన్ను ఎవరైనా అడిగితే రెండు విషయాలు చెపుతాను. అవి రిజర్వేషన్లు, అవినీతి’’ అన్నారు. పైగా ‘‘స్వాతంత్య్రం వచ్చిన 65 సంవత్సరాల తర్వాత కూడా రిజర్వేషన్లు అడుగుతున్నా రంటే అంతకన్నా సిగ్గు పడాల్సిన అంశం మరొకటి లేదు. ఒక్క మన దేశంలోనే కొంత మంది వ్యక్తులు తాము వెనకబడినామని చెప్పుకోవడం అధిక్షేపం లాంటిదే. ఈ దేశాన్ని భయపెట్టిస్తున్నది అవినీతి. అందుకని రిజర్వేషన్ల కోసం కాకుండా అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి.’’ అనేశారు. ఆ న్యాయమూర్తిని పదవీచ్యుతుడిని చేయాలంటూ అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత తన వ్యాఖ్యలను ఆ న్యాయమూర్తి తొలగించారు. రిజర్వేషన్లని, అవినీతిని ఒకే గాటన కట్టడం అగ్రవర్ణాల మనస్తత్వానికి తార్కాణం. భిన్న వర్గాలు, భిన్న మతాలు ఉన్న దేశంలో అంతే వైవిధ్యం వున్న న్యాయమూర్తులు ఉండాలి. అన్ని వర్గాల ప్రాతినిధ్యం ఉన్నప్పుడే వైవిధ్య మైన అనుభవాలు ఒక బెంచ్ నుంచి ప్రవహించి, సరైన నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఉపయోగపడుతుంది. అప్పుడే న్యాయధర్మం సుసంపన్నమవుతుంది. ఈ దిశగా న్యాయమూర్తుల ఎంపిక విజ్ఞాపన పత్రం రూపొందాలని ప్రజల ఆకాంక్ష. మంగారి రాజేందర్, వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు మొబైల్: 94404 83001 -
కోర్టులకు మరో 'కఠిన' పరీక్ష
రెండో మాట ‘న్యాయ వ్యవస్థ రోజూ కఠిన పరీక్షలు ఎదుర్కొంటున్నది. విశ్వసనీయతతోనే ఈ పరీక్షలలో నెగ్గడం సాధ్యం. రాజ్యాంగ వ్యవస్థల మనుగడ అంతా ఈ విశ్వసనీయత మీదనే ఆధారపడి ఉంది.’ సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ (మార్చి 20-21న జరిగిన రాష్ర్ట స్థాయి న్యాయాధికారుల సమావేశాలలో) ‘న్యాయపాలనలో పారదర్శకత అవసరం. మన దేశంలో రాజ్యాంగం కన్నా ఎవరూ ఎక్కువ కాదు. అందరం రాజ్యాంగం కిందనే పని చేయాలి. న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేసే చర్యల పట్ల కఠినంగా వ్యవహరించాలి.’ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ (అదే సమావేశంలో) న్యాయవ్యవస్థ ఇప్పుడు ఎన్ని రకాల ఆటుపోట్లనూ, కఠిన పరీక్షలనూ, పాలనా వ్యవస్థ జోక్యాన్నీ ఎదుర్కొనవలసి వస్తున్నదో తెలుగు ప్రాంతాల వారైన ఆ ఇరువురు న్యాయమూర్తులకు తెలుసు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసన సభలో సినీనటి, వైఎస్ఆర్సీపీ సభ్యురాలు రోజా వివాదం విషయంలో కూడా న్యాయవ్యవస్థ అలాంటి కఠిన పరీక్షనే ఎదుర్కొంటున్నది. ఆ శాసన సభ్యురాలి ఉదంతం ఒక్కటే కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమి దృష్టిలో పౌరుడి ప్రశ్నించే హక్కు ‘దేశ వ్యతిరేక చర్య’గా, ఫ్యూడల్ పరిభాషలో ‘రాజద్రోహం’గా మారిపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన తెలుగుదేశం మద్దతును బీజేపీ కీలకంగా పరిగణిస్తున్నది. ఈ బంధం వల్లనే ఏ క్షణంలో ఏ విపరీత పరిణామం ఎదురైనా తప్పించుకోలేని స్థితిలో ఉన్నాం. అందుకేనేమో జేఎన్‌యూ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయా లలో విద్యార్థి నాయకులపై అవాంఛనీయ ఘటనలూ, వేధింపులూ, ఆరోపణ లూ కొనసాగుతున్న తరుణంలో జస్టిస్ చలమేశ్వర్ అంతా ఆలోచించదగిన ఒక ప్రశ్న వేశారు: ‘అసలీ దేశంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోగోరు తున్నాను’ అని. ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానం న్యాయవ్యవస్థ పారదర్శకతకు మరో సారి కఠిన పరీక్షగా మారబోతున్నది. రోజా మొదట రాష్ట్ర న్యాయస్థానాన్ని ఆశ్రయించినా సరైన స్పందన లేకపోవడంతో, తనకు న్యాయం చేయవలసిందిగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రతిపత్తికీ, పారదర్శకతకూ ప్రశ్నార్థకంగా మారాయి. ఆ తరువాతే గౌరవ రాష్ట్ర హైకోర్టు కొత్త అడుగు వేయవలసి వచ్చింది. ఏం జరుగుతోంది? జస్టిస్ చలమేశ్వర్ ఒక క్షోభతో వేసిన ప్రశ్న వలెనే, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో ఏం జరుగుతోందనీ, జరిగిన పరిణామాలను చూస్తే ‘ఏదో తప్పు జరుగుతోంది’ (‘సంథింగ్ రాంగ్, సంథింగ్ రాంగ్’) అనిపిస్తున్నదనీ చెప్పవలసి వచ్చింది. అసలు స్పీకర్ కార్యాలయం ఏమి చేస్తున్నట్టు? శాసనసభ్యురాలి సస్పెన్షన్ ఉత్తర్వును అధికారి కోర్టుకు అందకుండా చేయడమేమిటి? అది ఆయన పరిధి కాదు అని కూడా సుప్రీం వ్యాఖ్యానించవలసి వచ్చింది. వాదప్రతివాదాలలో అధికార, విపక్షాల మధ్య ఉద్రేకాలు పెచ్చరిల్లి అవాంఛనీయ ఘటనలకు దారితీయరాదన్న ఉద్దేశంతో అనుభవజ్ఞులు మనకొక పాఠం చెప్పేవారు. రెండుసభలు (అసెంబ్లీ, కౌన్సిల్) అవసరం ఏమిటంటే, కౌన్సిల్లో పెద్ద మనుషులు సభ్యులుగా ఉంటారు కాబట్టి అక్కడి వాతావరణం ఉద్రేకాలకు దూరంగా, ‘చల్లగా’ ఉంటుందని చెప్పేవారు. ఇప్పుడు ఎల్లకాలం ఉభయసభలలోనూ మండుటెండలే కాస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి, అధికారంలోఉన్న తెలుగుదేశం ముందు ముందు ఎలాంటి పరిణామాలను ఊహిస్తున్నదో గానీ, ఎన్నికలలో బీజేపీని తోడు తెచ్చుకుంది. ఎన్నికల తరువాత నుంచీ వైఎస్ఆర్సీపీ ఎంపీలకూ, ఎమ్మెల్యేలకూ ఎరలు వేస్తూనే ఉంది. భవిష్యత్ పరిణామాల పట్ల ఎలాంటి ఊహలూ లేకుంటే ఎరవేసి అధికార పక్షంలో చేర్చుకోవలసిన అవసరం లేనేలేదు. నిజానికి తెలుగుదేశం తెచ్చుకుంటున్న ‘వాపు’ ప్రస్తుత భాగస్వామి బీజేపీ బలపడకుండా ఉండడం కోసమే. అందుకే ప్రతిపక్షాన్ని చీల్చడం ద్వారా తన బలాన్ని పెంచుకోవాలని ఆ పార్టీ ఉబలాటపడుతున్నది. నిజానికి ఉత్తరాఖండ్, అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లలో ఎలాంటి అస్థిర రాజకీయ పరిణామాలకు బీజేపీ కారణమవుతున్నదో, చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నిస్తున్నదో గమనిస్తే భవిష్యత్తులో తన వాపునకు కూడా ముప్పు తప్పదన్న విషయం తెలుగుదేశం గుర్తించ గలుగుతుంది. ఎక్కడైనా సరే అధికార పార్టీల ఉద్రేకాలలో, నిరంకుశ నిర్ణయాలలో స్పీకర్లు పావులు కారాదు. అలాంటి ఉద్రేకాలకు, పార్టీ ఆలోచనలకు అతీతంగా సభాపతులు ఎలా వ్యవహరించవలసి ఉంటుందో మౌలాలంకర్, అనంతశయనం అయ్యంగార్, నీలం సంజీవరెడ్డి, జీఎస్ థిల్లాన్, ఇటీవలి సోమనాథ్ చటర్జీ వంటి వారు నిరూపించారు. ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలిచారు. అసలు విపక్షాలు స్పీకర్ల మీద ఎలాంటి స్థితిలో అవిశ్వాసం ప్రవేశపెడతాయి? ఉత్కళ్ విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర విభాగంలో పనిచేసిన కేవీరావు ‘ఇండియాలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం’ తీరుతెన్నులను వివరిస్తూ ఈ ప్రశ్నకు ఇలా సమాధానం (1961) చెప్పారు: ‘శాసన సభాపతులు సభా వ్యవహారాల నిర్వహణలో నిష్పాక్షికంగా ఉండడమే కాదు, అలా ఉన్నట్టు సభవారు భావించేలా కనిపించాలి. ఎందుకంటే పక్షపాతంతో వ్యవ హరించే స్పీకర్లు ప్రజాస్వామ్యానికి ఏవగింపుగానే ఉంటారు. అందువల్లనే రాజకీయపక్షాలు ఈ అత్యంత కీలక ప్రజాస్వామ్య వ్యవస్థను కంటికి రెప్పలా కాపాడుకోగలగాలి.’ ఇలా ఆయన ఎందుకు అనవలసి వచ్చింది? ఇప్పటి మాదిరిగానే, అప్పుడు కూడా మంత్రిపదవుల కోసం స్పీకర్ పదవులను మారకపు సరుకులుగా మారకం వేయించుకున్న సంఘటనలు ఉన్నాయట. ఒక రాష్ట్రంలో అయితే ఒకే ఒక్క రోజులో స్పీకర్ కాస్తా ముఖ్యమంత్రిగా వేషం మారిస్తే, మరొక మంత్రి స్పీకర్‌గా మారిపోయాడట. నిజానికి ఇలాంటి పరిణామాలను చర్చలలో ఉన్న రాజ్యాంగ నిర్ణయ సభ (1946-49) ఎన్నడూ ఊహించలేదు. అలాగే ‘స్పీకర్‌పైన సంబంధిత శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం అనేది, సభా నిర్వహణ తీరుతెన్నుల మీద ప్రతిపక్షం ఎంతో మనస్తాపం చెందితే తప్ప, జరగదు’ అని కూడా ప్రొఫెసర్ రావ్ అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ వెన్నుపోటు వ్యవహారంలో, తరువాత చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన ఈ తరహా పరిణామాలను ప్రజలు మరచిపోలేదు. నిష్పాక్షికంగా ఉండాలి ఎన్నికలలో అధికార పార్టీ తరఫున గెలిచిన వారే చట్టసభలకు స్పీకర్లుగా ఎన్నికవుతారు. అయితే స్పీకర్ పదవికి ఎంపికైన తరువాత పార్టీలకు అతీతంగా నడుచుకోవాలి. అధికార విపక్షాలకు సమంగా న్యాయం అందించడానికి తక్కెడ పట్టాలి. కానీ ఇలా జరగడం లేదు. అందుకే స్పీకర్‌గా ఎన్నికైన వారు పార్టీకి రాజీనామా చేసి, తరువాత కూడా ఇండిపెండెంట్లుగానే పోటీ చేయాలని కొన్ని దేశాలలో ఉద్యమం మొదలైంది. కానీ ఫిరాయింపులు మొదటినుంచి ఉన్నాయి. అభ్యర్థులు గోడ దూకడానికి సిద్ధంగానే ఉంటున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో 1950 నాటికే ప్రవేశించిన ఈ వ్యాధి నిరంకుశత్వంగా మారింది. అంబేడ్కర్ ప్రభృతులు రూపొందించిన రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్న తరువాత, తన ఎన్నిక అనంతరం పార్లమెంటుకు ఎందుకు రాజీనామా చేస్తున్నాడో వివరించడానికి ప్రయత్నించినప్పుడు మాట్లాడే అవకాశం రాకపోవడం దీని ఫలితమే. సభలో హైందవంలో గూడు కట్టుకున్న కుల వ్యవస్థ గురించి ఆయన విమర్శించబోయినందుకు ఆయన నోరు నొక్కేశారు. రాజ్యాంగం పూచీ పడిన వాక్, సభా స్వాతంత్య్రాలకు భావ ప్రకటనా స్వేచ్ఛకు నేటి బీజేపీ పాలనలో కాదు, అరవయ్యేళ్ల నాడే, కాంగ్రెస్ పాలనలో సంకెళ్లు తగిలించడానికి శ్రీకారం జరిగిందని గుర్తించాలి. అలాగే 1954లో ఒక రాష్ట్ర గవర్నర్ ప్రవర్తన మీద చర్చ జరక్కుండా తప్పించేశారు. కొన్ని సందర్భాలలో కొందరు స్పీకర్ల ప్రవర్తన హుందాగా లేదనడానికి పార్లమెంటరీ భాషకు విరుద్ధంగా స్పీకర్లు ప్రసంగిస్తున్నారని చెప్పే ఉదాహరణ- కామత్ అనే ఒక గౌరవ సభ్యుడు స్పీకర్ మాటలకు నిరసన తెలియచేయగా, ‘నీవు అతిగా ప్రవర్తిస్తున్నావ్! సీటులో నుంచి ఎత్తి సభ బయటపడేస్తాను’ అని ఒక స్పీకర్ (ఏప్రిల్ 21,1956, పత్రికలలో వార్త) అన్నాడట. శాసనకర్తకూ హక్కులు ఏ సభ్యుడి మీద అయినా అనర్హత వేటు వేయడానికి శాసన వేదికకు హక్కు ఉన్నా, ఆ అంశాన్ని గవర్నర్ అంతిమ నిర్ణయానికి వదలాలనీ, అయితే గవర్నర్ తన నిర్ణయాన్ని తెలియచేసే ముందు ఆ విషయం మీద ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని విధిగా తెలుసుకోవాలనీ (ఎన్నికల సంఘం వర్సెస్ సుబ్రహ్మణ్యం స్వామి కేసు-1966)సుప్రీంకోర్టు ప్రకటించింది. లెజిస్లేచర్ నిర్ణయాలు ‘హేతుబద్ధంగానూ, అదుపు తప్పకుండానూ’ ఉండాలని చెప్పింది కూడా. రాజ్యాంగ- ప్రభుత్వ/ శాసనవేదిక/ న్యాయవ్యవస్థల అధికారాలు స్పష్టంగా విభజించి ఉన్నందున శాసనవేదికల నిర్వహణ అధికారాలలో కోర్టుల జోక్యం తగదన్న వాదనను సుప్రీంకోర్టు పలుమార్లు తోసిపుచ్చింది. చట్టాలనూ, శాసనసభల నిర్ణయాలనూ సమీక్షించే హక్కును రాజ్యాంగం కోర్టులకు దఖలు పరిచిందని మరవరాదు. కోర్టు తీర్పులను తిరిగి సమీక్షించుకునే హక్కు కూడా కోర్టులకు ఉందని (లీలా థామస్ కేసులో) ఎంతో హుందాగా సుప్రీంకోర్టు అంగీకరించింది. శాసనకర్త అయినంత మాత్రాన అతడు/ఆమె పౌర, ప్రాథమిక హక్కులను కత్తిరించలేరని కూడా సుప్రీంకోర్టు పలుమార్లు ప్రకటించింది. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
జైలు గోడల వెనక...
అందరికీ తెలిసిన విషయాలే. ఎప్పటినుంచో పౌర సమాజ ప్రతినిధులు, హక్కుల సంఘాల బాధ్యులూ చెబుతున్నవే. కానీ కొత్తగా అధికారిక సమాచారం సైతం ఆ విషయాలే చెప్పినప్పుడు ఆందోళన కలుగుతుంది. ఇంతమంది ఇన్నేళ్లుగా కృషి చేస్తున్నా పరిస్థితులు కాస్తయినా మారలేదా అన్న నిరాశ ఏర్పడుతుంది. జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) జైళ్ల స్థితిగతుల గురించి వెల్లడించిన సమాచారం ఎవరికైనా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. నిర్బంధానికీ... నిస్సహాయతకూ, నిర్బంధానికీ... నిరక్షరాస్యతకూ, నిర్బంధానికీ... అణగారిన కులాల్లో, వర్గాల్లో పుట్టకకూ మధ్య సంబంధం ఉన్నదని ఆ సమాచారం మళ్లీ ధ్రువీకరించింది. విచారణ ఖైదీలుగా ఉంటున్నవారిలో, శిక్షలు పడినవారిలో అత్యధికులు నిరుపేదలూ, నిరక్ష రాస్యులూ, అణగారిన కులాలకు, వర్గాలకూ చెందినవారేనని గణాంకాలు చెబుతు న్నాయి. మన దేశంలో జనాభాకు అనుగుణంగా కేసులు విచారించే న్యాయమూర్తుల సంఖ్య లేకపోవడంవల్లనే న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లో ఉండిపోతున్నాయని... ఆ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు జైళ్లలో మగ్గుతున్నారని 1987లో లా కమిషన్ నివేదిక తెలిపింది. పది లక్షలమంది జనాభాకు సగటున 10 మంది న్యాయమూర్తులుండే ప్రస్తుత స్థితిని మెరుగుపరిచి 2007 కల్లా పది లక్షల మందికి సగటున 50మంది న్యాయమూర్తులుండేలా చర్యలు తీసుకోవాలని ఆ నివేదిక కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కానీ రెండున్నర దశాబ్దాలు గడుస్తున్నా మారిందేమీ లేదు. దేశంలోని 1,387 జైళ్లలో మగ్గుతున్న ఖైదీల్లో 68 శాతంమంది విచారణలో ఉన్న వారేనని ఎన్సీఆర్బీ తెలిపింది. వారిలో 40 శాతానికి మించి ఆర్నెల్లు అంతకన్నా ఎక్కువగా జైళ్లలో ఉంటున్నారని వివరించింది. ఇలాంటివారిలో మూడు నెలలకు మించి జైళ్లలో ఉండేవారు నిరుటి కంటే పెరిగారని ఆ నివేదిక అంటున్నది. 2013లో అలాంటివారు 62.1 శాతంమంది ఉండగా ఇప్పుడు వారి శాతం 65కి చేరుకుంది. ఇది ప్రపంచ సగటు 32 శాతంకన్నా రెట్టింపు. వాస్తవానికి ఈ శాతం ఆ ఏటికా యేడు పెరుగుతోంది. బెయిల్ తెచ్చుకునే స్తోమత లేనివారు, తమకుండే హక్కులు తెలియని నిరక్షరాస్యులు ప్రధానంగా జైళ్లలో మగ్గుతున్నారు. వారు పాల్పడ్డారం టున్న నేరానికి పడే శిక్షకు మించి అలాంటివారు జైళ్లలో గడుపుతున్నారు. 3 లక్షల 56 వేల 561 మంది ఖైదీలుండటానికి చోటున్న మన జైళ్లలో ఇప్పుడు 4 లక్షల 18 వేల 536 మంది ఉంటున్నారు. అంటే 117.4 శాతంమందితో జైళ్లు కిక్కిరిసి ఉంటు న్నాయన్న మాట. మావోయిస్టు ఉద్యమం జోరుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో జైళ్లు మరిం తగా కిక్కిరిశాయి. అక్కడి జైళ్లలో 258.9 శాతంమంది ఉంటున్నారని ఎన్సీఆర్బీ గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో అత్యధికులు ఆదివాసీలేనని వేరే చెప్పనవసరం లేదు. మన జైళ్లలోదళిత, ఓబీసీ కులాలవారు, ఆదివాసీలు 62.3 శాతంమంది ఉండ గా... 31.4 శాతంమంది సాధారణ కేటగిరీకి సంబంధించినవారు. జనాభాలో 14 శాతంగా ఉన్న ముస్లింలు... ఖైదీల్లో మాత్రం 21.1 శాతంగా ఉన్నారు. గత దశాబ్ద కాలంలో మహిళా ఖైదీల సంఖ్య క్రమేపీ పెరుగుతోందని వివిధ నివేదికలు చెబుతు న్నాయి. మొత్తం ఖైదీల్లో మహిళా ఖైదీల శాతం 2003లో 3.9 ఉంటే అదిప్పుడు 4.55 శాతానికి చేరుకుంది. ఈ జాతీయ సగటు కంటే అధికంగా మహిళా ఖైదీలున్న రాష్ట్రాలు మిజోరం(7.58 శాతం), ఆంధ్రప్రదేశ్(6.28శాతం), పశ్చిమబెంగాల్ (6.11శాతం), మహారాష్ట్ర(5.68శాతం), ఛత్తీస్‌గఢ్(5.18శాతం) ఉన్నాయి. అనవసరమైన కేసులవల్లనే విచారణ ఖైదీల సంఖ్య పెరుగుతున్నదని చాన్నాళ్లక్రితం జాతీయ పోలీస్ కమిషన్ నివేదిక సైతం చెప్పింది. అలాగే పోలీసులు చేసే అరెస్టుల్లో దాదాపు 60 శాతం అనవసరమైనవేనని అభిప్రాయపడింది. ఇలాం టి కేసుల్లో అధిక భాగం గ్రామసీమల్లో పెత్తందార్లు, డబ్బు, పలుకుబడి ఉన్నవారు తమకు అడ్డుగా ఉన్నవారిపైనా, తమ మాట విననివారిపైనా పెడుతున్నవే. జైళ్ల కెళ్లడంవల్ల సాధారణ పౌరులకూ, వారి కుటుంబాలకూ సామాజికంగా, ఆర్థికంగా ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. సమాజం వెలేసినట్టు చూడటం... కుటుం బాన్ని పోషించేవారు జైలుపాలవడంవల్ల సంపాదన లేక పస్తులుండే పరిస్థితులు ఏర్పడటం, తమవారిని జైలునుంచి విడిపించుకోవడానికి ఏంచేయాలో, ఎవర్ని ఆశ్రయించాలో తెలియకపోవడం ఆ కుటుంబాల్లో పెను తుఫాన్లను సృష్టిస్తాయి. ఈ సమస్య న్యాయస్థానాల దృష్టికి వెళ్లినప్పుడల్లా ఏవో ఆదేశాలు వెలువడుతున్నాయి. నేరం రుజువై పడే శిక్షలో సగం కాలం విచారణ ఖైదీగా జైళ్లలో ఉన్నవారిని గుర్తించి అలాంటివారిని విడుదల చేయాలని నిరుడు సుప్రీంకోర్టు సూచించింది. అలాగే క్రిమినల్ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి కావడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయాలని తెలిపింది. జనాభాకు అనుగుణంగా న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని లా కమిషన్ సూచించినా...అసలు ఉన్న ఖాళీలను పూడ్చడమే ప్రభుత్వాలకు చేతగావడం లేదు. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. శాంతిభద్రతలకూ, ప్రముఖుల భద్రతకూ అధిక సంఖ్యలో పోలీసుల్ని వినియోగించాల్సి వస్తున్నప్పుడు దర్యాప్తులు సహజంగానే కుంటుబడతాయి. సిబ్బంది తక్కువగా ఉండటం, దర్యాప్తు చేయడానికి అవసరమైన ఆధునిక విధానాల గురించి వారికి అవగాహన లేకపోవడం, అట్టడుగు కులాలవారిపైనా, వర్గాలపైనా అంతరాంతరాల్లో పాతుకుపోయిన అభిప్రాయాలు కేసుల్ని తెమల్చడంలో పెను అడ్డంకిగా ఉంటున్నాయి. దర్యాప్తులో నత్తనడక, అందులో ఉండే లోపాలు న్యాయస్థానాల్లో ఆ జాప్యాన్ని మరింత పెంచుతాయి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులైనా సాధారణ కోర్టులకు వర్తించే నిబంధనలకు లోబడి పనిచేయాలి గనుక ఆచరణలో వాటివల్ల పెద్దగా ఫలితం ఉండటం లేదు. సమస్య మూలాల్లోకి వెళ్లి చిత్తశుద్ధితో పరిశీలిస్తే తప్ప పరిష్కారం సాధ్యం కాదు. ఈ దిశగా కేంద్రమూ, రాష్ట్ర ప్రభుత్వాలూ పూనుకోవాలి. -
ఇదే నా చివరి వీలునామా
లీగల్ కౌన్సెలింగ్ ‘నా’ అంటే ఎవరు? ‘చివరి’ వీలునామా అంటే ఏమిటి? వీలునామాను బాండ్ పేపర్లోనే రాయాలా? తెల్ల కాగితమైనా చెల్లుతుందా? కొట్టివేతలు, దిద్దుబాట్లు ఉండొచ్చా? ఇవే కాదు... వీలునామా రాసే ముందు, రాసేటప్పుడు, రాసిన తర్వాత కూడా... అనేక సందేహాలు తలెత్తుతాయి. వీటన్నిటికీ చట్టంలో స్పష్టమైన సమాధానాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే పేచీల ప్రశ్నే ఉండదు. నా వయసు 75. నాకు నలుగురు సంతానం. అందరి బాధ్యతలూ తీరిపోయాయి. అందరూ కలసి మెలసి ఉంటారు. నా తదనంతరం కూడా వారు ఇలాగే కలసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను. నేనెటూ వయోవృద్ధుడిని కాబట్టి ఆస్తి విషయంలో వారి మధ్య ఎటువంటి పేచీలూ రాకుండా వీలునామా రాయాలనుకుంటున్నాను. అయితే ఎలా రాయాలో తెలియదు. అసలు వీలునామా ఎలా రాయాలి? దానికి ఉండే నియమ నిబంధనలు ఏమిటి? దయచేసి మీరు తెలియజేస్తే నాలాంటి వృద్ధులకు కనీస అవగాహన కల్పించిన వారవుతారు. - రాఘవరె డ్డి, నెల్లూరు సరియైన ఆస్తి విభజన జరగక కొన్ని అస్పష్టమైన వీలునామాల వల్ల అనేకమంది కోర్టులను ఆశ్రయించవలసి వస్తోంది. భారతీయ వారసత్వ చట్టం 1925 సెక్షన్ 2 (హెచ్) ప్రకారం వీలునామా కర్త అనగా వీలునామా రాసే వ్యక్తి తన ఆస్తిని తను మరణించిన తర్వాత ఏ విధంగా పంచాలో తెలుపుతూ రాసిన చట్టబద్ధమైన ప్రకటనను వీలునామా అనవచ్చు. స్థిమితమైన బుద్ధి కలిగి, మైనరుకాని వ్యక్తి తన ఆస్తిని పంచుతూ వీలునామా రాయొచ్చు. అనారోగ్యం వల్ల కాని, మత్తుమందులు సేవించి ఉన్నప్పుడు కాని, మరి ఏ ఇతర కారణాల వల్లనైనా తాను ఏం చేస్తున్నాడో తనకే తెలియని స్థితిలో ఉన్నప్పుడు వీలునామా రాయకూడదు. చెవిటి, మూగ, గుడ్డి వారు కూడా వారేమి చేస్తున్నారో తెలుసుకోగలిగిన స్థితిలో ఉంటే వీలునామా రాయవచ్చు. వీలునామాలు అవి రాసిచ్చిన వ్యక్తి మరణానంతరమే అమలులోకి వస్తాయి. వీలునామా రాసే వారికి వారి జీవితకాలంలో దానిని రద్దు చేసుకునే అధికారం ఉంటుంది. వీలునామాలో మొదట వీలునామా రాసే వ్యక్తి పూర్తి పేరు, తండ్రి పేరు, వయసు, శాశ్వత చిరునామా, స్పష్టంగా రాయాలి. తరువాత సంతానం ఎంతమంది ఉన్నారు, వారి పేర్లు, వయసు, వృత్తి మొదలైనవి రాయాలి. తేలిక పదాలతో మాతృభాషలో ఏయే సంతానానికి ఎంతెంత ఆస్తి ఇస్తున్నారో రాయాలి. తనకున్న స్థిరాస్తులు, చరాస్తుల వివరాలు స్పష్టంగా రాయాలి. వీలునామాను తెల్లకాగితం పైన స్పష్టంగా రాసినా చెల్లుతుంది. వీలునామా రాసే వ్యక్తి వీలునామాలోని అన్ని పేజీలపైనా సంతకం చేయాలి. రాసేటప్పుడు దిద్దుబాట్లు లేదా కొట్టివేతలు దొర్లినప్పుడు అక్కడ చిన్న సంతకం చేయాలి. వీలునామాకు ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది సాక్షులు ఉండాలి. సాక్షి సంతకం చేసేవారు మేజర్లై, వీలునామా రాసిన వ్యక్తికన్నా చిన్నవారై ఉండాలి. పెద్దమనుషులు, విద్యావంతులు అయితే మంచిది. సంతకంతోపాటు సాక్షుల వయస్సు, వృత్తి, తండ్రిపేరు, చిరునామా రాయాలి. వీలునామా రాసేవారు అదే తమ చివరి వీలునామా అని ప్రకటించాలి. వీలునామాను రిజిస్టర్ చేయించడం తప్పనిసరి కానప్పటికీ, రిజిస్టర్ చేయించడం వల్ల భవిష్యత్తులో ఏమైనా వివాదాలు వస్తే, సాక్ష్యంగా పనికి వస్తుంది. వీలునామాను బ్యాంక్లాకర్లలో లేదా నమ్మకమైన లాయర్ల వద్ద దాచవచ్చు. లేదంటే కవర్లో ఉంచి, సీల్‌వేసి సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లో డిపాజిట్ చేయవచ్చు. నా వయసు 20. రెండేళ్ల క్రితం నన్నొక అర బ్షేక్ వివాహం చేసుకున్నాడు. అతనికి దాదాపు 65 ఏళ్లుంటాయి. నా తలిదండ్రులు ఒక బ్రోకర్ మాయమాటలను నమ్మి, నాకు ఇష్టం లేకున్నా నిఖా జరిపించారు. ఈ సందర్భంగా బ్రోకర్ నా తల్లిదండ్రులకు కొంత డబ్బిచ్చి, నాతో ఒక అగ్రిమెంటుపై సంతకం చేయించుకున్నాడు. నా భర్త కేవలం నెలరోజులు మాత్రమే నాతో ఉన్నాడు. తర్వాత దుబాయ్ వెళ్లిపోయాడు. ఇంతవరకూ అతని నుంచి ఏ సమాచారమూ లేదు. వాకబు చేస్తే నాది మ్యూటా మ్యారేజ్ అంటారని, బ్రోకర్ డబ్బు తీసుకుని మా కుటుంబాన్ని మోసం చేశాడని తెలిసింది. మ్యూటా మ్యారేజ్ అంటే ఏమిటి? దయచేసి వివరాలు తెలియజేయగలరు. - రజియా, నల్గొండ కొందరు బ్రోకర్లు ఒక ముఠాగా ఏర్పడి పేదరికంలో ఉన్న తల్లిదండ్రులను ప్రలోభపెట్టి కొంత డబ్బు అప్పజెప్పి వారి ఆడపిల్లలకు వృద్ధులైన అరబ్ షేక్‌లతో పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. ప్రతిఫలంగా అరబ్‌షేక్‌ల నుండి కొంత డబ్బు తీసుకుంటారు. కొందరు త్వరలో దుబాయ్‌కి వెళ్లి, పేపర్లు పంపిస్తామని, అక్కడికి వారిని తీసుకెళ్తామని మోసపు మాటలు చెప్పి వెళ్లిపోతున్నారు. మరికొందరు అమాయకులైన ఆడ పిల్లలను పెళ్లి చేసుకుని, దుబాయ్‌కి తీసుకొని వెళ్లి, అక్కడ వారి భార్యలకు పనివారిగా మార్చుతున్నారు. ఇంకొందరు జీతం భత్యం ఇవ్వకుండా చాకిరీ చేయించుకుంటున్నారు. చాలామంది అ్కడ ఉండలేక, ఇక్కడకు వచ్చేమార్గం తెలియక, అక్కడే మగ్గిపోతున్నారు. మీరు చేసుకున్న మ్యూటా మ్యారేజ్ అంటే తాత్కాలిక వివాహం అని అర్థం. విదేశాలనుండి సొంతపనుల మీదనో, వ్యాపారం కోసమో, టూర్ల కోసమో మన దేశానికి వచ్చే ధనికులైన అరబ్‌లు ఆ కాస్త సమయంలో తమ శారీరక అవసరాలు తీర్చుకునేందుకు చేసుకునే వివాహం అన్నమాట. దానికోసం కొంత డబ్బును మెహర్ రూపేణా చెల్లిస్తారు. వారు ఏర్పరచుకున్న కాలపరిమితి అయిపోగానే వివాహం రద్దవుతుంది. ఈ వివాహం వల్ల దంపతులిరువురికీ ఎలాంటి వారసత్వ హక్కులూ రావు. ఈ వివాహం చేసుకున్న యువతి మనోవర్తికి కూడా అర్హురాలు కాదు. ఒకవేళ సంతానం కలిగితే వారికి మాత్రం వారసత్వ హక్కులు ఉంటాయి. అయితే ఇటువంటి తాత్కాలిక వివాహాలు ఏర్పాటు చేసే బ్రోకర్లు, ఇటువంటి వివాహం చేసుకున్న వారు, పెళ్లి తతంగం జరిపించిన వారు గర్ల్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద శిక్షార్హులవుతారు. మీరు మీకు దగ్గరలోని కోర్టును ఆశ్రయించండి. కొంత ఫలితం ఉంటుంది. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ -
అడగడుగునా నీచులే.. మాకు స్థానం లేదు!
న్యూఢిల్లీ ఈ దేశంలో ఆడవాళ్లుగా పుట్టకూడదని నా ప్రార్థన. నీచులు ప్రతి అంగుళం కాచుకొని ఉన్నారు. ఇదీ ఓ యువ ఐఏఎస్ ఆఫీసర్ ఆవేదన. తన ఆవేదన వెలిబుచ్చుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేసింది. తనకెదురైన అవమానాలను వివరిస్తూ ఫేస్బుక్లో పెట్టిన ఈ పోస్ట్ ఇపుడు సంచలనం సృష్టిస్తోంది. వేధింపులకు గురైన మహిళ పట్ల న్యాయవాది, జడ్జి వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే రిజు బఫ్నా అనే మహిళా ఐఏఎస్ ఆఫీసర్... తనను ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడంటూ కేసు పెట్టింది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా జడ్జి, న్యాయవాదులు వ్యవహరించిన తీరుపై ఆమె మండిపడ్డారు. కోర్టు హాల్లో తన వాదనను వినిపించడానికి తనకు ప్రైవసీ కావాలని కోరితే న్యాయవాది, జడ్జి అనుమతించలేదన్నారు. పైగా మీరు బయట ఆఫీసర్ గానీ, కోర్టులో కాదని లాయర్ తనపై విరుచుకుపడ్డారని ఆరోపించారు. చివరికి అర్థం చేసుకోవాల్సిన జడ్జి కూడా అనుచితంగా ప్రవర్తించారన్నారు. మీరు యూత్ కదా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారన్నారు. సుదీర్ఘ పోరాటం తర్వాత అతన్ని ఆ పదవి నుంచి తప్పించారు తప్ప, తగిన శిక్ష పడలేదన్నారు. మహిళల పట్ల సెన్సిటివ్‌గా వ్యవహరించాల్సిన హక్కుల సంఘాల్లోని సభ్యుల ప్రవర్తన తీరుపైనా ఆమె మండిపడ్డారు. కేసు విచారణ సమయంలో మహిళలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సిన కోర్టులు, న్యాయవాదుల తీరు పట్ల ఆమెతన పోస్ట్‌లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇపుడిది సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఇంతకీ ఈ మహిళా ఐఏఎస్‌ను అసభ్య మెసేజ్‌లతో వేధించింది ఎవరో కాదు.. సాక్షాత్తు ఓ మానవ హక్కుల సంఘం సభ్యుడు. -
కోర్టు తీర్పులతో మహిళా భద్రత ప్రశ్నార్థకం
మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం రాంగోపాల్‌పేట్: న్యాయస్థానాలు ఇస్తున్న కొన్ని తీర్పులు మహిళా భద్రతపై ప్రభావ చూపిస్తున్నాయని మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం అన్నారు. గురువారం బుద్దభవన్‌లోని మహిళా కమిషన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 7ఏళ్లకు లోబడి శిక్ష పడే కేసుల్లో నిందితులకు పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇవ్వవచ్చని ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పుతో 498(ఏ) కేసుల్లో నిందితులకు కూడా స్టేషన్ బెయిల్ లభించే అవకాశం ఉందన్నారు. ఇలాంటి తీర్పుల కారణంగా మహిళల భద్రత ప్రశ్నార్ధకమవుతుందన్నారు. యామిని, శ్రీలేఖ హత్య కేసులో నిందితుడిని వెంటనే అరెస్టు చేసి అతనికి శిక్ష పడేలా చూడాలన్నారు. మహిళ భద్రత, నిర్భయ చట్టాలపై చర్చ జరుగుతున్న తరుణంలో ఇలాంటి ఘటన జరుగడం ఆలోచించాల్సిన విషయన్నారు. ప్రేమ పేరుతో వేధింపులు ఎదుర్కొంటున్న వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, వారు స్పందించకపోతే మహిళా కమిషన్‌కు ఫోన్ ద్వారా, పోస్టు ద్వారా సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆలయ భూములపై తమ్ముళ్ల కన్ను
తెలుగు తమ్ముళ్ల దోపిడీ పర్వానికి అడ్దూఅదుపూ లేకుండా పోతోంది. ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడ మా ఆధిపత్యం అన్నట్లు వారి అధికార దర్పం సాగుతోంది. వంశపారంపర్యంగా అర్చకులు చేసుకుంటున్న ఆలయ భూములపైనా వారి కన్ను పడింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దేవాదాయశాఖ అధికారులపైనే ఒత్తిడి చేస్తున్నారు. ఏళ్ల తరబడి వస్తున్న ఆచారాన్ని, గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను కాదని.. అగస్త్యేశ్వరుని ఆలయ భూముల వేలంపాట వేయాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. రాజంపేట: చెయ్యేరు నది ఒడ్డున ఉన్న గుండ్లూరు అగస్త్యేశ్వరస్వామి ఆలయభూములపై గ్రామానికి చెందిన కొందరు పెద్దలు కన్నేశారు. వాటిని ఎలాగైనా వేలం వేయించాలని దేవదాయశాఖ అధికారులపై తమ్ముళ్లు ఒత్తిడి చేస్తున్నారు. మట్లిరాజుల పాలన నుంచి అర్చకత ్వం చేస్తున్న తంబెళ్ల వంశానికి చెందిన కుటుంబీకులు ఆలయ భూములను సాగుచేసుకుంటూ జీవిస్తున్నారు. అందుకు ప్రతిగా అగస్త్యేశ్వరస్వామికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వివాదం వ చ్చినప్పుడు, మద్రాసు నుంచి విడిపోయిన సమయంలోనూ ప్రభుత్వం, కోర్టులు కూడా తంబెళ్ల వంశస్తులకే ఆలయ అర్చకత్వం అని చెప్పాయి. భూములు వేలం వేయించాలని తమ్ముళ్ల ఒత్తిడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం.. దేవాలయ భూములకు వేలంపాట పెట్టాలనే ఉత్తర్వులు తీసుకురావడంతో తమ్ముళ్ల కన్ను ఈ ఆలయభూములపై పడింది. ఇంకేముంది ఎలాగైనా తంబెళ్ల వంశస్తులు అనుభవిస్తున్న భూములను వేలంపాట ద్వారా దక్కించుకోవడానికి దేవాదాయశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం మొదలైంది. తరతరాలుగా వస్తున్న ఆచార, సంప్రాదాయాలకు నీళ్లు వదలకూడదని ఓ వైపు గ్రామస్తులు ముక్తకంఠంతో చెబుతున్నా వారి చెవికెక్కడం లేదు. ఆలయానికి భూములు ఇలా.. గుండ్లూరు అగస్తేశ్వరస్వామి ఆలయంతోపాటు విఘ్నేశ్వరాలయం, కుమారుస్వామి, మారెమ్మ, యల్లమ్మ దేవస్ధానాలు ఏటిఒడ్డున ఒకే చోట ఉన్నాయి. ఈ ఆలయాలు అన్నింటిలోనూ తంబెళ్ల వంశస్తులు అర్చకులుగా ఉంటున్నారు. ఏడాదికి రూ.4వేలు ఆలయ ధర్మకర్తకు అందజేస్తుంటారు. ఈ భూముల్లో 1.80 ఎకరాల భూమి స్వామి పూజాది కార్యక్రమాలకు ఖర్చు చేసేందుకు కేటాయించారు. రాజంపేట మండలంలోని గుండ్లూరు గ్రామం పొలంలో సర్వేనెంబరు 48లో 1.05ఎకరా, 126లో 0.48సెంట్లు, 184లో 0.40సెంట్లు, 595లో 0. 83సెంట్లు , 2121లో 0.14 సెంట్లు, 329లో 0. 04 సెంట్లు, 80లో 0.18సెంట్లు, 82లో 0.28సెంట్లు, 331లో 0. 25 సెంట్లు, 171లో 0. 74 సెంట్లు, 172లో 0.33 సెంట్లు భూములు స్వామికి సంబంధించినవి. మొత్తం మీద 7.14ఎకరాలు భూమి తంబెళ్ల వంశస్తుల ఆధీనంలో రాజుల కాలం నుంచి ఉంది. పూర్వం నుంచి భూములనే నమ్ముకున్నాం తాతలకాలం నుంచి అగస్తేశ్వరుని స్వామి భూములనే నమ్ముకుని జీవిస్తున్నాం. ఇప్పుడేమో దేవాదాయశాఖ అధికారులు ఈ భూములకు వేలంపాట పాడతామంటున్నారు. మద్రాసు హైకోర్టు, జిల్లా కోర్టులు కూడా భూములను తామే సాగుచేసుకునే విధంగా తీర్పులు ఇచ్చాయి. వేలంపాటే వస్తే మళ్లీ కోర్టుకెళతాం. - చాపాటి చిన్నవీరయ్య, తంబెళ్ల కులస్తుడు తంబెళ్ల కులస్తులకు లేకుండా చేయాలని చూస్తున్నారు అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూములను తంబెళ్ల కులస్తులకు లేకుండా చేయాలని చూస్తున్నారు. గతంలో అనేక మార్లు ప్రయత్నాలు చేశారు. న్యాయస్థానం మా వైపు మొగ్గుచూపింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని కౌలుకు చేసుకుంటున్న భూములును లాక్కోవాలని చూస్తున్నారు. ఇది అన్యాయం. - నరసింహులు, తంబెళ్ల కులస్తుడు -
‘బరి’ తెగింపే..
పసిబిడ్డను సాకినట్టు పెంచిన పుంజులనే ‘కసి’ బరిలో దింపేందుకు రంగం సిద్ధమవుతోంది. జాతి ఒకటే అయినా.. కళ్లలో పట్టరాని వైరం తొణుకుతుండగా, కాళ్లకు కట్టిన కత్తులు తళుకుమంటుండగా, రెక్కలు విప్పి, గాలిలోకి ఎగిరి పోరాడేందుకు, నేలను తమ నెత్తుటితో తడిపేందుకు.. పుంజులు ‘తుది’ తర్ఫీదు పొందుతున్నాయి. న్యాయస్థానాల తీర్పులతో నిమిత్తం లేకుండానే.. పెద్ద పండగ పేరుతో జరిగే నిర్దయాత్మక యుద్ధానికీ; రకరకాల జూదాలకూ.. ‘పెద్దల’ దన్నుతో జిల్లాలో వేదికలు తయారవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ :కోర్టులు, తీర్పులు, పోలీసులు..ఇవేమీ మాకు అడ్డు కాదంటూ కోడిపందేలకు నిర్వాహకులు బరి తెగిస్తున్నారు. సోమవారం సర్వోన్నత న్యాయస్థానం పందేల వ్యవహారాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశించింది. ఆ తీర్పు ఎలా ఉన్నా అన్ని హంగులతో జిల్లాలో పందేలకు సర్వం సిద్ధమవుతోంది. గత ఏడాది పందేలు జరిగిన ప్రాంతాల్లోనే ఈసారీ నిర్వహించేందుకు టెంట్ల వంటి సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో జూదం, గుండాట, ముక్కాట.. వంటి వాటికి నిర్వాహకులు లక్షల్లోనే ‘రుసుము’ వసూలు చేస్తున్నారు. (ఎదుర్లంకలో కేవలం గుండాట నిర్వహణ అవకాశానికి వేలం వేయగా పాట రూ.16.5 లక్షలకు ఖరారైంది). పందేల స్థాయిని బట్టి పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల అధికారులతో నిర్వాహకులు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. పందేల విషయంలో చూసీచూడనట్టు పోవాల్సిందిగా రాజకీయ నాయకుల నుంచి మౌఖిక ఆదేశాలూ అందాయి. కొబ్బరితోటలే పోరుబరులు రాష్ట్ర విభజనకు ముందు, తరువాత కోడిపందేలకు పశ్చిమగోదావరి జిల్లాది మొదటిస్థానం కాగా మనజిల్లా రెండో స్థానంలో ఉంటుంది. పండగ మూడు రోజులు (బుధ, గురు, శుక్రవారం)లో పందేల నిర్వహణకు సర్కారు తొలి నుంచీ సానుకూలంగా ఉండడంతో అడ్డుఅదుపూ లేకుండా బరులు సిద్ధంచేస్తున్నారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప కోర్టు తీర్పును గౌరవిస్తామంటున్నారు. అదేనోటితో సంక్రాంతి సంబరాల్లో సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తామంటున్నారు. చినరాజప్ప మాటలతో నిర్వాహకుల ఉత్సాహం పెరిగింది. జిల్లాలో ప్రధానంగా కోనసీమలో కోడిపందేలు భారీ ఎత్తున జరగనున్నాయి. పండగ మూడు రోజుల్లో ఇక్కడ సుమారు రూ.20 కోట్ల మేర పందేలు జరుగుతాయని అంచనా. చాలాచోట్ల కొబ్బరితోటలను పందేలకు వేదికగా చేసుకుంటున్నారు. యానాం-ఎదుర్లంక గోదావరి మధ్య లంకల్లో భారీగా పందేలకు ఇరు ప్రాంతాల నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. యానాం నుంచి గోదావరి దాటి కోనసీమలో అడుగుపెట్టే ఐ.పోలవరం మండలంలో పందేలకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ఆ మండలంలో ఆర్థికంగా బలమైన సామాజికవర్గ నేతలు తమ కనుసన్నల్లోనే ఎదుర్లంక, కేశనకుర్రు, పెదమడి మొక్కతోట, ముమ్మిడివరం మండలం పల్లిపాలెం, రాజుపాలెం, కాట్రేనికోన మండలం పల్లంకుర్రు, గెద్దనాపల్లి తదితర ప్రాంతాల్లో పందేలకు సర్వం సిద్ధం చేశారు. ఈసారి అధికారపార్టీ ముఖ్యనేత అండదండలుండటంతో రెట్టింపు స్థాయిలో పందేలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోడిపందేలంటే కోనసీమలో ముందు గుర్తుకువచ్చే అల్లవరం మండలంలో గోడి, గోడిలంకలో కొబ్బరితోటల్లో పందేలు భారీగా వేసేందుకు సిద్ధమవుతున్నారు. హోంమంత్రి చినరాజప్ప సొంత మండలం ఉప్పలగుప్తంలో కూడా ఈ సారి బరితెగిస్తున్నారు. లంక గ్రామాల్లో మెరవనున్న కత్తులు పశ్చిమగోదావరికి సరిహద్దున ఉన్న మలికిపురం, వీవీ మెరక సరిహద్దులోను, తూర్పు, పశ్చిమ సరిహద్దు లంక గ్రామాల్లో పందేలకు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. లంక గ్రామాలైన కలగంపూడి, ఒంటిలంక, ఏనుగులంక, నర్సాపురం, యలమంచలి గోదావరి సరిహద్దులంకల్లో, కొత్తపేట, మండపేట నియోజకవర్గాల్లోని వెదిరేశ్వరం, పొడగట్లపల్లి, కపిలేశ్వరపురం మండలంలోని లంకల్లో, కె.గంగవరం మండలం కూళ్లలో ఒక మోస్తరు పందేలు జరగనున్నాయి. బొబ్బర్లంక సమీపంలోని ధవళేశ్వరం, విజ్జేశ్వరంల మధ్య లంక ప్రాంతంలో పందేలకు బరి తెగిస్తున్నారు. సఖినేటిపల్లి, అప్పనరామునిలంక, మలికిపురం మండలం తూర్పులంక, కేశనపల్లి, చింతలపల్లి, మామిడికుదురు మండలం గోగన్నమఠం, మగటపల్లి, అమలాపురం మండలం సాకుర్రు గున్నేపల్లి, ఇందుపల్లి, కొత్తపేట మండలం అవిడి, ఆలమూరు మండలంలోని పలు గ్రామాల్లో పందేలకు బరి సిద్ధహవుతోంది. మెట్ట, ఏజెన్సీల్లో కూడా పందేలకు బరులు సిద్ధమవుతున్నాయి. చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట మండలం వేట్లపాలెంలో పందేలు జోరుగా సాగనున్నాయి. ప్రత్తిపాడు, శంఖవరం మండలాల్లో పలు గ్రామాల్లో పందేలు జోరుగా జరిపేందుకు సిద్ధపడుతున్నారు. గిరిజన ప్రాంతమైన దేవీపట్నం, మారేడుమిల్లి, రంపచోడవరంలలో పందేలకు రెడీ అవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు పందేలు జరుగుతాయని అంచనా. కోర్టు తీర్పుకు అనుగుణంగా వ్యవహరిస్తాం : రాజప్ప సోమవారం పొద్దుపోయాక సర్పవరం పోలీసు అతిథిగృహంలో పోలీసు డైరీ ఆవిష్కరణకు హాజరైన ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప దృష్టికి కోడిపందేల విషయాన్ని విలేకరులు తీసుకువెళ్లారు. దానిపై ఆయన మాట్లాడుతూ పందేల వ్యవహారంపై కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లగా హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు. -
అలా చదివింది..! జీవితంలో గెలిచింది
జీవితంలో ఎదురు దెబ్బలు తిననివాళ్లు బహుశా ఎవరూ ఉండరేమో. అయితే ఆ గాయాల్ని తలచుకుని బాధపడేవాళ్లు కొందరుంటారు. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తుకు అందమైన బాటలు పరచుకునేవాళ్లు కొందరుంటారు. వెంకటలక్ష్మి రెండో కోవకు చెందిన మహిళ. తన జీవితంలో జరిగిన సంఘటన నుంచి ఆమె చాలా నేర్చుకుంది. తన జీవన గమనాన్ని ఓ గమ్యం వైపు తిప్పుకుంది! లక్ష్యం ఎప్పుడూ ఉన్నతంగానే ఉండాలి. నమ్మకం ఎప్పుడూ ఆకాశమంతే ఉండాలి. కృషి ఎప్పుడూ నిరంతరం సాగుతుండాలి. ప్రయాణం ఎప్పుడూ ముందుకే సాగాలి. ఇవన్నీ వెంకటలక్ష్మికి బాగా తెలిసిన విషయాలు. అందుకే ఆమె ప్రయాణం ఎప్పుడూ ఆగింది లేదు. ఒడిదుడుకులు ఎదురైనా, అడుగడుగునా ముళ్లు గుచ్చుకున్నా ఆమె పాదాలు నిలబడిపోలేదు. ముందుకే నడిచాయి. ఆమెను ఉన్నత స్థాయికి చేర్చాయి. రెండేళ్ల క్రితం వరకూ వెంకటలక్ష్మి బెంగళూరు రోడ్ల మీద ఆటో నడుపుతూ కనిపించేది. కానీ ఇవాళ నల్లకోటు వేసుకుని, చేతిలో కేసు ఫైళ్లు పట్టుకుని బెంగళూరు కోర్టు మెట్లెక్కుతూ కనిపిస్తోంది. ఆటో స్టీరింగ్ పట్టుకున్న చేతులతోనే నల్లకోటు తొడుక్కునే స్థాయికి ఆమె చేరిన తీరు వింటే మనలోనూ స్ఫూర్తి ఏర్పడుతుంది. ఏదైనా సాధించాలన్న పట్టుదల కలుగుతుంది. సాహసమే ఊపిరిగా... ధైర్య సాహసాలు వెంకటలక్ష్మిని మొదట్నుంచీ వెన్నంటే ఉండేవి. హైస్కూల్లో చదివే రోజుల్లో ఆమె చేసిన ఓ సాహసం అందరినీ విస్మయపరిచింది. వేగంగా వస్తున్న ఓ బస్సు కింద పడబోతున్న విద్యార్థిని ఎంతో చాకచక్యంగా రక్షించింది వెంకటలక్ష్మి. ఆ ప్రయత్నంలో ఆమె బాగా గాయపడింది. ఆమె సాహసాన్ని మెచ్చి కర్ణాటక ప్రభుత్వం సాహస బాలిక అవార్డును కూడా ప్రకటించింది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టడం వల్ల వెంకటలక్ష్మి జీవితంలోని ఎత్తుపల్లాలను దగ్గర్నుంచి చూసింది. అందుకే ఎప్పుడూ జీవితంలో స్థిర పడాలన్న పట్టుదలతోనే ఉండేది. చిన్నప్పట్నుంచీ చదివేది. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేది. కళల్లో రాణించేది. సంప్రదాయిక కుటుంబం కావడంతో కట్టుబాట్లు ఎక్కువ ఉండేవి. కానీ అవి లక్ష్మిని ఎప్పుడూ ఆపలేదు. ఆమె తనకు నచ్చింది చేసే తీరేది. సంగీతం, నృత్యం... అన్నీ నేర్చుకుంది. అయితే పదో తరగతి పూర్తి కాగానే పరిస్థితుల కారణంగా పని చేయాల్సి వచ్చింది వెంకటలక్ష్మికి. అప్పుడు కూడా ఆమె తన శైలిలోనే ఆలోచించింది. ఆటో నడపాలని నిర్ణయించుకుంది. చేయడానికి ఇంకేమీ దొరకలేదా అని ఇంట్లోవాళ్లు అంటే... ‘ఇందులో ఏముంది తప్పు’ అంటూ ఆటో స్టీరింగ్ పట్టుకుంది. బెంగళూరు రోడ్ల మీద దూసుకుపోయింది. అదో పెద్ద పాఠం... ఎంత తెగువ ఉన్నా, ఎంతగా మగాళ్లతో పోటీ పడినా మహిళ ఎప్పుడూ మహిళేనని గుర్తుచేసే సంఘటన ఒకటి లక్ష్మి జీవితంలో జరిగింది. అది ఆమెకు పెద్ద పాఠమే నేర్పింది.ఇరవయ్యేళ్ల వయసులో ఓ రోజు లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఉన్నట్టుండి ఓ అయిదుగురు వ్యక్తులు ఆమె ఇంట్లో జొరబడ్డారు. లక్ష్మిని బలవంతం చేయబోయారు. వెంటనే లక్ష్మిలోని సాహసి మేల్కొంది. వారిని చితకబాది తరిమి కొట్టింది. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. కానీ పోలీసులు అవతలివారి మాటలకు లొంగిపోయి కేసు రిజిస్టర్ చేయకుండా వదిలేశారు. దాంతో కమిషనర్ దగ్గరకు వెళ్లింది లక్ష్మి. ఆయన చొరవతో కేసు రిజిస్టర్ అయ్యింది కానీ, ఆమె జీవితం నరకప్రాయం అయిపోయింది. సదరు వ్యక్తులు ఆమెను వెంటపడి వేధించేవారు. ఆమె గురించి చెడుగా ప్రచారం చేసేవారు. దాంతో లక్ష్మిని అందరూ దూరం పెట్టేవారు. ఆమెకు ఇక పెళ్లి కాని పరిస్థితి ఏర్పడింది. అయితే ఓ తోటి ఆటో డ్రైవర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతడికి ఇల్లాలై ఊరి చివర ఓ ఇల్లు కట్టుకుని కాపురం పెట్టింది లక్ష్మి. అయితే ల్యాండ్ మాఫియా ముఠా ఆమె ఇంటిని లాక్కోవాలని ప్రయత్నించింది. ఆమెను లైంగిక వేధింపులకు గురిచేసింది. దాంతో మరోసారి ఆమె కోర్టు మెట్లెక్కింది. లక్ష్మి తొమ్మిదేళ్లపాటు కోర్టు చుట్టూ తిరిగింది. కేసు మలుపులు తిరుగుతోందే తప్ప ఓ కొలిక్కి రావడం లేదు. దాంతో విసిగిపోయిన లక్ష్మి ఓ రోజు న్యాయస్థానంలో నోరు విప్పింది. తన కేసు తనే వాదించుకుంటాను, అనుమతినివ్వమంది. న్యాయమూర్తి ఆమె ఆవేదనను అర్థం చేసుకుని అనుమతినిచ్చారు. దాంతో న్యాయస్థానంలో దాదాపు మూడు గంటల పాటు తన వాదనను వినిపించింది లక్ష్మి. చివరికి కేసు గెలిచింది. ఆ రోజు అర్థమైంది లక్ష్మికి... అన్యాయం జరిగినంత వేగంగా న్యాయం జరగదని. న్యాయస్థానాలు, చట్టాలు తనలాంటి వారికి అందుబాటులో లేవని. తనలా ఇంకెందరో కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ ఉంటారని. ఆ క్షణమే నిర్ణయించుకుంది... తాను లాయరై తీరాలని. కొందరికైనా న్యాయాన్ని చేకూర్చాలని. భర్త సహకారంతో లా కాలేజీలో చేరింది. ఓ పక్క ఆటో నడుపుతూ, మరోపక్క ఇంటి పనులు చేస్తూ, ఇంకో పక్క కూతురిని సాకుతూనే లా పూర్తి చేసింది. కర్ణాటక బార్ అసోసియేషన్‌లో తన పేరు నమోదు చేసుకుంది. ‘ఎదగాలన్న పట్టుదల ఉంటే ఎత్తుకే చేరతాం తప్ప పల్లానికి పడిపోం’ అని నిరూపించింది. అందరితో హ్యాట్సాఫ్ అనిపించుకుంటోంది! - సమీర నేలపూడి జీవితంలో కొన్నిసార్లు బలహీనపడిపోతాం. ఇక మన వల్ల కాదులే, వదిలేద్దాం అని రాజీ పడిపోతాం. ఒకటి రెండు సమయాల్లో నేనూ అలాగే అనుకున్నాను. కానీ ఆ ఆలోచనను మనసులో అలా ఉండనిస్తే నేను ఓడిపోయి ఉండేదాన్ని. నా పట్ల అన్యాయం జరిగింది. దాన్ని నిరూపించుకోవడానికి నేను పడిన కష్టం అంతా ఇంతా కాదు. నేను చేసిన ఆ పోరాటం నాలో పట్టుదలను పెంచింది. న్యాయం కోసం కష్టపడకూడదు అనిపించింది. ఆ ఆలోచనే నన్ను ‘లా’ చదివేలా చేసింది. -
దళితుల కోసం ఆరు ప్రత్యేక కోర్టులు ఆర్.ఆర్.పాటిల్
సాక్షి, ముంబై: దళితుల కోసం ఆరు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేస్తామని హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ప్రకటించారు. అహ్మద్‌నగర్ జిల్లా జామ్ఖేడ్ తాలూకా ఖర్డా గ్రామంలో ఇటీవలే హత్యకు గురైన దళిత యువకుడు నితిన్ కుటుంబసభ్యులను పాటిల్ పరామర్శించారు. సుమారు 15 నిమిషాల పాటు చర్చలు జరిపి వారి కుటుంబ సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అనంతరం పాటిల్ మీడియాతో మాట్లాడుతూ నితిన్‌ను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష విధించేలా చూస్తామని చెప్పారు. ఈ కేసును వాదించేందుకు ప్రభుత్వం తరఫున న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను నియమిస్తామన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ఈ కేసు తీర్పు త్వరగా వచ్చేలా కృషి చేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న దళితుల కేసులను త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఆరు కోర్టులను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. దళితులపై జరుగుతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని జిల్లా సూపరింటెండెంట్ పోలీసు రావ్‌సాహెబ్ శిందేకు ఆదేశాలు జారీ చేశామన్నారు. -
విగ్రహాల దొంగల అరెస్ట్
=రూ.80 లక్షలు విలువ చేసే పంచలోహ విగ్రహాలు స్వాధీనం =వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ డీఎస్పీ శోభన్‌కుమార్ నెల్లికుదురు, న్యూస్‌లైన్ : చిత్తూరు జిల్లాలో పంచలోహ విగ్రహాలను దొంగిలించి మానుకోటలో విక్రయించేందుకు వెళ్తున్న ఇద్దరిని నెల్లికుదురు పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబాబాద్ డీఎస్పీ పి.శోభన్‌కుమార్ నిందితుల వివరాలు వెల్లడించారు. చిత్తూరు జిల్లా వరదాయపాలెం మండలంలోని సుంచురామిచెట్టు కందీగ గ్రామంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో 2006 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన గౌని మునస్వామి, ఉరందర్ ధనుంజయ, పాయ మధు అనే ముగ్గురు వ్యక్తులు సుమారు (21కిలోల బరువున్న) ప్రసన్న వెం కటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి పంచలోహ విగ్రహాలను దొం గిలించారు. ఈ విషయంపై ఆలయ పూజారులు, గ్రామస్తులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పట్లో ఫిర్యాదు చేశారు. అయితే వరదాయపాలెం మండలంలోని తొండబొట్టు గ్రామానికి చెందిన గౌని చంద్ర, నల్లగొండ జిల్లా ఆత్మకూర్ మండలంలోని పాతర్లపాడుకు చెందిన తండా అంజయ్యకు తాము దొంగిలించిన విగ్రహాలను విక్రయించేందుకు పై ముగ్గురు ముందుగా ఒప్పందం చేసుకున్నారు. ఆరేళ్ల కాలంలో వారు ఎక్కడా కూడా దొం గిలించిన విగ్రహాలను విక్రయించలేదు. దీంతో ప్రసన్న వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని చిత్తూరు జిల్లాలో విక్రయించేందుకు ఇటీవల ఉరందర్ ధనుంజయ పట్టుకుని వెళ్తుండగా మార్గమధ్యలో అతడు వరదాయపాలెం పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే మిగిలిన శ్రీదేవి, భూదేవి విగ్రహాలను విక్రయించేందుకు మునస్వామి, పాయ మధు బుధవారం ఉదయం తొర్రూరు నుంచి మహబూబాబాద్‌కు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో అదే మార్గంలో వాహనాలు తనిఖీ చేస్తున్న నెల్లికుదురు పోలీసులకు వారు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం మునస్వామి, మధు నుంచి రూ.80 లక్షల విలువ చేసే శ్రీదేవి, భూదేవి విగ్రహాలను స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా, విగ్రహాల దొంగలను పట్టుకునేందుకు కృషిచేసిన తొర్రూరు సీఐ రాజు, ఎస్సై ముప్పారపు కరుణాకర్, ట్రైనీ ఎస్సై నాగభూషణం, ఏఎస్సై రాజేందర్, కాని స్టేబుళ్లు శ్రీనివాస్, శ్రవణ్‌ను డీఎస్పీ అభినందించారు. -
విధులు బహిష్కరించిన న్యాయవాదులు
పెద్దపల్లిరూరల్, న్యూస్‌లైన్ : హైకోర్టు ఆవరణలో తెలంగాణ న్యాయవాదులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతిరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం వారిపై ఇంకా వివక్ష కొనసాగుతోందనడానికి ఈ సంఘటనలే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో సందె మొగిళి, సత్యనారాయణ, అశోక్, జాపతి రాజేశం, రాంకిషన్‌రావు, డొంకెన మొగిళి, రమణారెడ్డి, బాదం రమేశ్, సురేశ్ తదితరులున్నారు. కరీంనగర్లో.. కరీంనగర్ లీగల్ : కరీంనగర్‌లోని జిల్లా కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి సంజీవరెడ్డి, బి.రఘునందన్‌రావు, బూడిద మల్లేశం, సయ్యద్ సాబీర్, శ్రీరాముల కిషన్, చౌడమల్ల వీరస్వామి, ముద్దమల్ల సుధాకర్ పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. సుల్తానాబాద్‌లో.. సుల్తానాబాద్: సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ ఆ ధ్వర్యంలో మున్సిఫ్‌కోర్టు న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న న్యాయవాదులను ప్రభుత్వం కావాలనే అరెస్టులు చేయిస్తోందని లక్ష్మీరాజం, లక్ష్మీకాంతరెడ్డి, బాల కిషన్, ప్రసాద్, శ్రీనివాస్‌రావు, దివాకర్‌రావు, కాంపెల్లి నారాయణ, ఆకారపు సరోత్తమ్‌రెడ్డి, భూమయ్య, తిరుపతిరెడ్డి, శ్యామ్, రమేశ్, అంజయ్య ఆరోపించారు.