మీ అభిప్రాయాలను చొప్పించకండి
హైకోర్టు జడ్జి ‘పాక్’ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కేసుల విచారణ సందర్భంగా వాడే పదజాలం విషయంలో న్యాయస్థానాలు అత్యంత జాగరూకత వహించాలని సుప్రీంకోర్టు సూచించింది. పురుషాధిక్య భావజాలం, స్త్రీద్వేషం తదితరాలతో కూడిన వ్యాఖ్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని హితవు పలికింది. కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీశానంద ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా బెంగళూరులో ఒక ముస్లిం ప్రాబల్య ప్రాంతాన్ని పాకిస్తాన్‌తో పోల్చడం, మహిళా న్యాయవాదిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ ఉదంతంపై సుమోటో విచారణను సీజేఐ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం ముగించింది.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోని ఏ ప్రాంతాన్నీ పాకిస్తాన్‌తో పోల్చకూడదని కుండబద్దలు కొట్టింది. అవి దేశ ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధమని గుర్తు చేసింది. ఇలా ప్రాంతాలను, సామాజికవర్గాలను ఉద్దేశించి అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదని స్పష్టం చేసింది. ‘‘న్యాయవ్యవస్థ నిష్పాక్షికతపై సమాజంలో అన్ని వర్గాల ప్రజలకూ పూర్తి విశ్వాసముండాలి. దీన్ని కాపాడాల్సిన బాధ్యత లాయర్ల నుంచి జడ్జిల దాకా అందరిపైనా ఉంది. న్యాయమూర్తులు యథాలాపంగా చేసే ఇలాంటి వ్యాఖ్యలు వారి వ్యక్తిగత అభిప్రాయాలకు, రాగద్వేషాలకు అద్దం పడతాయి. వాటి ప్రభావం మొత్తం న్యాయవ్యవస్థపై పడుతుంది’’ అంటూ హెచ్చరించింది.
మరింత వెలుగే పరిష్కారం!
న్యాయవ్యవస్థలో పారదర్శకత చాలా ముఖ్యమని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. కోర్టుల విచారణ ప్రక్రియపై సోషల్ మీడియాలో విద్వేష వ్యాప్తి పెద్ద సవాలుగా మారిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. దీనిపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘వెలుగుకు మరింత వెలుగే పరిష్కారం తప్ప చీకట్లు కాదు. అన్నిరకాల కోర్టుల్లోనూ విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయడం, తద్వారా న్యాయవ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడమే సమస్యకు పరిష్కారం’’ అని కుండబద్దలు కొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment