అలా చదివింది..! జీవితంలో గెలిచింది
జీవితంలో ఎదురు దెబ్బలు తిననివాళ్లు బహుశా ఎవరూ ఉండరేమో. అయితే ఆ గాయాల్ని తలచుకుని బాధపడేవాళ్లు కొందరుంటారు. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తుకు అందమైన బాటలు పరచుకునేవాళ్లు కొందరుంటారు. వెంకటలక్ష్మి రెండో కోవకు చెందిన మహిళ. తన జీవితంలో జరిగిన సంఘటన నుంచి ఆమె చాలా నేర్చుకుంది. తన జీవన గమనాన్ని ఓ గమ్యం వైపు తిప్పుకుంది!
లక్ష్యం ఎప్పుడూ ఉన్నతంగానే ఉండాలి. నమ్మకం ఎప్పుడూ ఆకాశమంతే ఉండాలి. కృషి ఎప్పుడూ నిరంతరం సాగుతుండాలి. ప్రయాణం ఎప్పుడూ ముందుకే సాగాలి. ఇవన్నీ వెంకటలక్ష్మికి బాగా తెలిసిన విషయాలు. అందుకే ఆమె ప్రయాణం ఎప్పుడూ ఆగింది లేదు. ఒడిదుడుకులు ఎదురైనా, అడుగడుగునా ముళ్లు గుచ్చుకున్నా ఆమె పాదాలు నిలబడిపోలేదు. ముందుకే నడిచాయి. ఆమెను ఉన్నత స్థాయికి చేర్చాయి.
రెండేళ్ల క్రితం వరకూ వెంకటలక్ష్మి బెంగళూరు రోడ్ల మీద ఆటో నడుపుతూ కనిపించేది. కానీ ఇవాళ నల్లకోటు వేసుకుని, చేతిలో కేసు ఫైళ్లు పట్టుకుని బెంగళూరు కోర్టు మెట్లెక్కుతూ కనిపిస్తోంది. ఆటో స్టీరింగ్ పట్టుకున్న చేతులతోనే నల్లకోటు తొడుక్కునే స్థాయికి ఆమె చేరిన తీరు వింటే మనలోనూ స్ఫూర్తి ఏర్పడుతుంది. ఏదైనా సాధించాలన్న పట్టుదల కలుగుతుంది.
సాహసమే ఊపిరిగా...
ధైర్య సాహసాలు వెంకటలక్ష్మిని మొదట్నుంచీ వెన్నంటే ఉండేవి. హైస్కూల్లో చదివే రోజుల్లో ఆమె చేసిన ఓ సాహసం అందరినీ విస్మయపరిచింది. వేగంగా వస్తున్న ఓ బస్సు కింద పడబోతున్న విద్యార్థిని ఎంతో చాకచక్యంగా రక్షించింది వెంకటలక్ష్మి. ఆ ప్రయత్నంలో ఆమె బాగా గాయపడింది. ఆమె సాహసాన్ని మెచ్చి కర్ణాటక ప్రభుత్వం సాహస బాలిక అవార్డును కూడా ప్రకటించింది.
మధ్య తరగతి కుటుంబంలో పుట్టడం వల్ల వెంకటలక్ష్మి జీవితంలోని ఎత్తుపల్లాలను దగ్గర్నుంచి చూసింది. అందుకే ఎప్పుడూ జీవితంలో స్థిర పడాలన్న పట్టుదలతోనే ఉండేది. చిన్నప్పట్నుంచీ చదివేది. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేది. కళల్లో రాణించేది. సంప్రదాయిక కుటుంబం కావడంతో కట్టుబాట్లు ఎక్కువ ఉండేవి. కానీ అవి లక్ష్మిని ఎప్పుడూ ఆపలేదు. ఆమె తనకు నచ్చింది చేసే తీరేది. సంగీతం, నృత్యం... అన్నీ నేర్చుకుంది. అయితే పదో తరగతి పూర్తి కాగానే పరిస్థితుల కారణంగా పని చేయాల్సి వచ్చింది వెంకటలక్ష్మికి. అప్పుడు కూడా ఆమె తన శైలిలోనే ఆలోచించింది. ఆటో నడపాలని నిర్ణయించుకుంది. చేయడానికి ఇంకేమీ దొరకలేదా అని ఇంట్లోవాళ్లు అంటే... ‘ఇందులో ఏముంది తప్పు’ అంటూ ఆటో స్టీరింగ్ పట్టుకుంది. బెంగళూరు రోడ్ల మీద దూసుకుపోయింది.
అదో పెద్ద పాఠం...
ఎంత తెగువ ఉన్నా, ఎంతగా మగాళ్లతో పోటీ పడినా మహిళ ఎప్పుడూ మహిళేనని గుర్తుచేసే సంఘటన ఒకటి లక్ష్మి జీవితంలో జరిగింది. అది ఆమెకు పెద్ద పాఠమే నేర్పింది.ఇరవయ్యేళ్ల వయసులో ఓ రోజు లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఉన్నట్టుండి ఓ అయిదుగురు వ్యక్తులు ఆమె ఇంట్లో జొరబడ్డారు. లక్ష్మిని బలవంతం చేయబోయారు. వెంటనే లక్ష్మిలోని సాహసి మేల్కొంది. వారిని చితకబాది తరిమి కొట్టింది. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. కానీ పోలీసులు అవతలివారి మాటలకు లొంగిపోయి కేసు రిజిస్టర్ చేయకుండా వదిలేశారు. దాంతో కమిషనర్ దగ్గరకు వెళ్లింది లక్ష్మి. ఆయన చొరవతో కేసు రిజిస్టర్ అయ్యింది కానీ, ఆమె జీవితం నరకప్రాయం అయిపోయింది.
సదరు వ్యక్తులు ఆమెను వెంటపడి వేధించేవారు. ఆమె గురించి చెడుగా ప్రచారం చేసేవారు. దాంతో లక్ష్మిని అందరూ దూరం పెట్టేవారు. ఆమెకు ఇక పెళ్లి కాని పరిస్థితి ఏర్పడింది. అయితే ఓ తోటి ఆటో డ్రైవర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతడికి ఇల్లాలై ఊరి చివర ఓ ఇల్లు కట్టుకుని కాపురం పెట్టింది లక్ష్మి. అయితే ల్యాండ్ మాఫియా ముఠా ఆమె ఇంటిని లాక్కోవాలని ప్రయత్నించింది. ఆమెను లైంగిక వేధింపులకు గురిచేసింది. దాంతో మరోసారి ఆమె కోర్టు మెట్లెక్కింది.
లక్ష్మి తొమ్మిదేళ్లపాటు కోర్టు చుట్టూ తిరిగింది. కేసు మలుపులు తిరుగుతోందే తప్ప ఓ కొలిక్కి రావడం లేదు. దాంతో విసిగిపోయిన లక్ష్మి ఓ రోజు న్యాయస్థానంలో నోరు విప్పింది. తన కేసు తనే వాదించుకుంటాను, అనుమతినివ్వమంది. న్యాయమూర్తి ఆమె ఆవేదనను అర్థం చేసుకుని అనుమతినిచ్చారు. దాంతో న్యాయస్థానంలో దాదాపు మూడు గంటల పాటు తన వాదనను వినిపించింది లక్ష్మి. చివరికి కేసు గెలిచింది.
ఆ రోజు అర్థమైంది లక్ష్మికి... అన్యాయం జరిగినంత వేగంగా న్యాయం జరగదని. న్యాయస్థానాలు, చట్టాలు తనలాంటి వారికి అందుబాటులో లేవని. తనలా ఇంకెందరో కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ ఉంటారని. ఆ క్షణమే నిర్ణయించుకుంది... తాను లాయరై తీరాలని. కొందరికైనా న్యాయాన్ని చేకూర్చాలని. భర్త సహకారంతో లా కాలేజీలో చేరింది. ఓ పక్క ఆటో నడుపుతూ, మరోపక్క ఇంటి పనులు చేస్తూ, ఇంకో పక్క కూతురిని సాకుతూనే లా పూర్తి చేసింది. కర్ణాటక బార్ అసోసియేషన్‌లో తన పేరు నమోదు చేసుకుంది. ‘ఎదగాలన్న పట్టుదల ఉంటే ఎత్తుకే చేరతాం తప్ప పల్లానికి పడిపోం’ అని నిరూపించింది. అందరితో హ్యాట్సాఫ్ అనిపించుకుంటోంది!
- సమీర నేలపూడి
జీవితంలో కొన్నిసార్లు బలహీనపడిపోతాం. ఇక మన వల్ల కాదులే, వదిలేద్దాం అని రాజీ పడిపోతాం. ఒకటి రెండు సమయాల్లో నేనూ అలాగే అనుకున్నాను. కానీ ఆ ఆలోచనను మనసులో అలా ఉండనిస్తే నేను ఓడిపోయి ఉండేదాన్ని. నా పట్ల అన్యాయం జరిగింది. దాన్ని నిరూపించుకోవడానికి నేను పడిన కష్టం అంతా ఇంతా కాదు. నేను చేసిన ఆ పోరాటం నాలో పట్టుదలను పెంచింది. న్యాయం కోసం కష్టపడకూడదు అనిపించింది. ఆ ఆలోచనే నన్ను ‘లా’ చదివేలా చేసింది.