Middle-class family
-
మమతా ఎనర్జీ
కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చి, కాంగ్రెస్ నుంచి ఎదిగిన వ్యక్తి మమత. అయితే ఆ మాటను దీదీ ఒప్పుకోరు. ‘‘నేనెక్కడికీ ఎదగలేదు. ప్రజల మధ్యలోనే ఉన్నాను’’ అంటారు. ‘కాదు, కాంగ్రెస్ నుంచే ఎదిగారు గుర్తుకుతెచ్చుకోండి అని రెట్టిస్తే’ - ‘నిజమే, కాంగ్రెస్ తప్పిదాల నుంచి ఎదిగి ఉంటాను’ అని నవ్వేస్తారు! ప్రజల కోసం తను ఎంతైతే చెయ్యగలరో అంతా చేసేందుకు ప్రయత్నిస్తారు మమతా బెనర్జీ. అందుకోసం అడ్డొచ్చిన వారిని హక్కుగా నిలదీసి అడుగుతారు. వారు సొంత పార్టీవారైనా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా! ఆ ధర్మాగ్రహమే.. ఆమె ఎనర్జీ. ఆ ఎనర్జీతోనే ఇప్పుడు మమతా బెనర్జీ.. ఎన్నికలకు సిద్ధమౌతున్నారు. 20 మే 2011. శుక్రవారం. ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఆ ఉదయమే ప్రమాణం చేశారు. రాజ్‌భవన్ నుంచి రైటర్స్ బిల్డింగ్స్ (సచివాలయం)కి వెళ్లాలి. రోడ్డయితే ఉంది కానీ వెళ్లేందుకు దారే లేదు. కనీసం రెండు లక్షల యాభై వేల మంది బెంగాల్ ప్రజలు తమ తొలి మహిళా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పడం కోసం క్రిక్కిరిసి ఉన్నారు. ‘‘నడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి’’ అని గవర్నర్‌ను అడిగారు మమత. ఆ తర్వాత ప్రజల మధ్యలోంచి అడుగు అడుగు వేసుకుంటూ... పుష్పగుచ్ఛాలు, ఆశీర్వచనాలు అందుకుంటూ కిలో మీటరు దూరంలో ఉన్న సచివాలయం చేరుకున్నారు. పదిహేడేళ్ల తర్వాత ఆమె మళ్లీ సచివాలయం గడప తొక్కడం అదే మొదటిసారి! పదిహేడేళ్ల క్రితం ఒకరోజు - పోలీసులు మమతాబెనర్జీని అదే సచివాలయ ప్రాంగణం నుంచి ఈడ్చి పడేశారు! అప్పుడామె కాంగ్రెస్‌లో ఫైర్‌బ్రాండ్ కార్యకర్త. అప్పటి ముఖ్యమంత్రి జ్యోతిబసు. బసు కార్యాలయం బయట మమత నినాదాలిస్తోంది. అత్యాచారానికి గురైన ఒక బాధితురాలిని బసు పరామర్శించాలని ఆమె డిమాండ్. అత్యాచారం జరిపింది సి.పి.ఎం. కార్యకర్తలేనని ఆరోపణ. బసు బయటికి రావడం లేదు. మమత బయటికి వెళ్లడం లేదు. మధ్యలోకి పోలీసులు తోసుకుంటూ వచ్చేశారు. మమతను గెంటేశారు. అదిగో... అప్పుడు చేశారు ఆవిడ ప్రతిజ్ఞ. బెంగాల్లో కమ్యూనిస్టుల కరెంట్ పోయేవరకు రైటర్స్ బిల్డింగ్‌లోకి అడుగు పెట్టనని ప్రకటించారు. చివరికి ప్రజలే ఆమె ప్రతిజ్ఞను నెరవేర్చారు! గిర్రున ఐదేళ్లు ! బెంగాల్‌కు మళ్లీ ఎన్నికలొచ్చాయి. ఈ నెల చివర్లో షెడ్యూల్. మార్చి మొదటి వారంలో మమత ప్రచారం. అయితే ఈసారి మమత ప్రత్యేకంగా హామీలేం ఇవ్వడం లేదు. అలాగని చేసిన పనుల్నీ ఏకరువు పెట్టబోవడం లేదు. ‘మా, మాటీ, మనుష్’ (మదర్, మదర్లాండ్, పీపుల్) అనే తన పూర్వపు నినాదంతోనే ప్రజల్లోకి వెళుతున్నారు. బి.జె.పి. వ్యతిరేక శక్తులను చేరదీసి, సి.ఐ.ఐ.(ఎం)కి వ్యతిరేకంగా రాజకీయ వ్యూహాలను రచిస్తున్నారు. ఇంతకీ ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా మమత ఏం చేశారు? అన్నం మొత్తం పట్టుకుని చూడనవసరం లేదు. ముఖ్యమంత్రిగా తొలి 48 గంటల్లోనే తనేమిటో బెంగాల్‌కి, మిగతా దేశానికి చూపించారు మమత. మొదట ఆమె అన్ని ప్రొటోకాల్స్ని బ్రేక్ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రతి అధికార లాంఛనాన్నీ తీసి అవతల పడేశారు. బులెట్ ప్రూఫ్ కారును తిప్పి పంపించారు. తన సొంత కారులోనే విధులకు బయల్దేరారు. ఆ మధ్యాహ్నం ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాలు పంపించే విషయంలోనూ కోల్‌కతా రాజనీతిజ్ఞులు మునుపెన్నడూ ఎరుగని ప్రత్యేక మర్యాదలు పాటించారు! మమత సూచన మేరకు డిప్యూటీ అసెంబ్లీ లీడర్ పార్థ చటర్జీ ఉదయం 8.35కి నేరుగా బుద్ధదేవ్ భట్టాచార్జీ (అప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రి) ఇంటికి వెళ్లి, తలుపు తట్టి మరీ ఆయన చేతికి ఇన్విటేషన్ అందించారు! అనుకోని అతిథులు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిని అంత పర్సనల్‌గా ఆహ్వానించడం బెంగాల్లో బహుశా అదే మొదటిసారి కావచ్చు. ఇలాంటి ‘ఫస్ట్’లు ఇంకో రెండుమూడు కూడా ఉన్నాయి! సీమ అని... సెక్స్ వర్కర్. సోనాగంజ్ రెడ్‌లైట్ ఏరియాలో ఉంటుంది. ఆవిడక్కూడా మమత ప్రత్యేక ఆహ్వానం పంపారు. అలాగే, నెతాయ్, నందిగ్రామ్ ఘటనల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు మమత నుంచి ఆహ్వానాలు అందాయి. ఏం చేసినా ప్రజల కోసమే.. మమతా బెనర్జీ... అగ్గిరవ్వ, తారాజువ్వ. మొహమాటాల్లేని మనిషి. ‘నీకోసం అది చేశాను, ఇది చేసేశాను. అవన్నీ మర్చిపోయి ఇప్పుడిలా చేస్తావా’ అని అడిగితే - ఎంతటి వాళ్లకైనా ఆమె చెప్పే సమాధానం ఒక్కటే... నీకూ నాకూ జరగడం కాదు, ప్రజలకు ఏం ఒరిగిందన్నదే నా ప్రయారిటీ అని! మమత తగాదాలు, వివాదాలు, నినాదాలు, రాజీనామాలు అన్నీ ప్రజల కోసమే. అలాగే ఏ పార్టీలో ఉన్నదీ, ఏ పదవిలో ఉన్నానన్నది, ఎవరికి మద్దతు ఇస్తున్నదీ ముఖ్యం కాదు దీదీకి. తను అనుకున్నది నెరవేరాలి. అంతే. అయితే తనెప్పుడూ తనకోసం ఏదీ అనుకున్నది లేదు. ప్రజలు, పశ్చిమబెంగాల్... పార్లమెంటులోనూ ఇదే ఆమె అజెండా. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు మమత కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నారు. యూత్, స్పోర్ట్స్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ చూస్తున్నారు ఆవిడ. దేశంలో క్రీడారంగం నీరసించి పోయింది. కాస్త గ్లూకోజ్ ఎక్కించండి అని దీదీ ఎంత మొత్తుకున్నా ఎవరూ విన్లేదు. చిర్రెత్తుకొచ్చి కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో పెద్ద ర్యాలీ తీశారు. రాజీనామా చేస్తానని హెచ్చరించారు. మమతతో వేగలేక కాంగ్రెస్ ఆమె శాఖలన్నిటినీ ఇంకొకరికి మార్చింది. అయినా దీదీ మారలేదు. బెంగాల్లో సి.పి.ఐ-ఎం. కి కాంగ్రెస్ తొత్తులా వ్యవహరిస్తోందని 1996 ఏప్రిల్‌లో బహిరంగంగా ప్రకటించినప్పుడు కాంగ్రెస్ వణికిపోయింది. ఇంటి రహస్యాలను ఎవరైనా బైటికి చెప్పుకుంటారా అని ప్రత్యేక దూతలు కొందరు ఢిల్లీ నుంచి వచ్చి లాజికల్‌గా కన్విన్స్ చెయ్యబోయారు కానీ ఆమె కాలేదు. తర్వాతి ఏడాదే పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. దీదీగిరి ‘దాదాగిరి’ అనే మాట భారత రాజకీయాలలోకి ఎలా ప్రవేశించిందో చెప్పడం కష్టం. ‘దీదీగిరి’ అనే మాట మాత్రం మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే పుట్టుకొచ్చింది! మూడు దశాబ్దాల కమ్యూనిస్టు కోటను బద్దలు కొట్టి మరీ అమె 2011లో బెంగాల్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. వచ్చీరావడంతోనే అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి మరీ ప్రజలకు చేరువ అయ్యారు. అవే పరుగులను తనను వ్యతిరేకించేవారినీ పెట్టించి అసహన వైఖరికి ప్రతిరూపంలా నిలిచారు. అయితే ఈ వైఖరిని నియంతృత్వ పోకడ అనేందుకు లేదు. ప్రజల మధ్య చిరస్థాయి నాయికగా నిలిచిపోయేందుకు చేసే ప్రయత్నంలో అమె అనుసరించిన విధానంగానే చూడాలి. పాలనలో వందకు వంద మార్కులు గెలుచుకోగలిగారంటే అంత కన్నా ముందు ప్రజల హృదయాలను గెలుచుకున్నారనే కదా. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి ఎదిగి వచ్చిన నాయకురాలు మమత. స్కూల్లో ఉండగానే ఆమె విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. మరీ పదిహేనేళ్ల వయసుకే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారు. చరిత్రలో డిగ్రీ, ఇస్లాం చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ, ‘లా’లో ఇంకో డిగ్రీ... పాలిటిక్స్‌లో ఉంటూనే పూర్తి చేశారు. పొయెట్రీ రాశారు. పుస్తకాలు వేశారు. సీపీయెంకు వ్యతిరేకంగా గోడలకు పోస్టర్లు అంటించిన అజ్ఞాత కార్యకర్తగా మొదలైన మమత కెరీర్.. కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత కాంగ్రెస్‌నే ధిక్కరించే స్థాయికి, శిఖరాగ్రానికి చేరుకుంది. మమత ఒక సాధారణ మహిళగా ఎలా ఉంటారో... ముఖ్యమంత్రిగానూ అలాగే ఉంటారు. రెండు మూడొందల్లో వచ్చే కాటన్ చీర, కాళ్లకు రబ్బరు స్లిప్పర్స్.. ఇవీ కూడా ఆమె దృఢచిత్తంలా ఆమెకో ప్రత్యేకమైన గుర్తింపును, ఎనర్జీని తెచ్చిపెట్టాయి. మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జననం : 5 అక్టోబర్ 1960 జన్మస్థలం : కలకత్తా తల్లిదండ్రులు : గాయత్రి, ప్రమీలేశ్వర్ బెనర్జీ తోబుట్టువులు : ఆరుగురు సోదరులు వైవాహిక స్థితి : అవివాహిత పార్టీ : తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ ప్రవేశం : 1970 (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) కాంగ్రెస్‌ను వదిలిపెట్టింది : 1997 చేపట్టిన పదవులు : ఎంపీగా, రైల్వే మంత్రిగా. ప్రస్తుత ప్రాతినిధ్యం : భవానీపూర్ (విధాన సభ నియోజకవర్గం) ఆటోబయోగ్రఫీ : మై అన్ఫర్గెటబుల్ మెమరీస్ రాజకీయాలలోకి ప్రవేశించినట్లే, చదువులలోకీ చాలా త్వరగా వచ్చేశారు మమత. సెకండరీ (టెన్త్) పరీక్షలు రాయడానికి వయసు సరిపోకపోతే ఐదేళ్లు ఎక్కువగా వేసి రాయించారు! అసలైతే మమత పుట్టింది 1960 అక్టోబర్ 5న. రికార్డులలో ఉన్న తేదీ మాత్రం 1955 జనవరి 5. -
ఒక్క క్లిక్‌తో ఇంటికి అనుమతి
సరళ పద్ధతుల్లో నూతన భవన నిర్మాణ పాలసీ జీహెచ్ఎంసీపై సమీక్ష అనంతరం మంత్రి తలసాని హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఒక మధ్యతరగతి కుటుంబం ఇల్లు కట్టుకోవాలంటే ప్రస్తుతం సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. లెక్కకు మిక్కిలిగా ఉన్న ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ తదితర సంస్థల నుంచి పొందాల్సిన అనుమతులు, అధికారులకు ‘ఆమ్యామ్యాలు’ వంటి దశలను దాటితేగానీ మహాయజ్ఞం లాంటి ఇంటి నిర్మాణం మొదలుపెట్టడం సాధ్యంకావట్లేదు. ఈ దుస్థితి లేని వ్యవస్థ అందుబాటులోకి వస్తే... అధికారులకు చేయి తడపాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక్క మౌస్ క్లిక్‌తో క్షణాల్లో గృహ నిర్మాణానికి అనుమతి లభిస్తే ఎలా ఉంటుంది? హైదరాబాద్‌లో సరళ పద్ధతుల్లో భవన నిర్మాణ అనుమతులు జారీ చేసేందుకు రాష్ట్రం ప్రభుత్వం కొత్తగా భవన నిర్మాణ విధానాన్ని రూపొందిస్తోంది. అక్రమ కట్టడాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణతోపాటు నూతన భవన నిర్మాణ పాలసీ రూపకల్పన అంశంపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం సచివాలయంలో పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో నూతన భవన నిర్మాణ పాలసీపై కసరత్తు చేస్తున్నామన్నారు. ఒకే ఒక్క మౌస్ క్లిక్‌తో భవన నిర్మాణ అనుమతులన్నీ వచ్చేలా కొత్త పాలసీ ఉంటుందన్నారు. కొత్త పరిశ్రమల స్థాపనకు అనుమతుల కోసం అమలు చేస్తున్న ‘టీఎస్-ఐపాస్’ విధానం తరహాలోనే భవన నిర్మాణ విధానం ఉంటుందన్నారు. ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. నగరంలో చాలా అక్రమ కట్టడాలున్నాయని, నాలాలపైనా నిర్మాణాలున్నాయని, దేవాలయస్థలాలను సైతం ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని కన్జర్వేటివ్ జోన్లో అనుమతులు లేకపోయినా నిర్మాణాలు జరిగాయన్నారు. ఇలాంటి దుర్మార్గమైన వ్యవస్థను రూపుమాపి భవిష్యత్తులో తప్పులు పునారావృతం కాకుండా ఉండేందుకు అన్ని విభాగాలను సమన్వయం చేసేలా నూతన పాలసీ ఉంటుందన్నారు. దీని ద్వారానే అన్ని అనుమతులు ఇస్తామన్నారు. భవిష్యత్తులో అక్రమ కట్టడాలు జరిగితే ఆ ప్రాంత అధికారినే బాధ్యుడిగా చేసి చర్యలు తీసుకుంటామన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా నగరానికి ఇప్పటికే రూ. 230 కోట్లు మంజూరు చేశామన్నారు. వీటికి ప్రస్తుతం టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా రోడ్ల మీద చెత్త పారబోయకుండా నగర పరిశుభ్రత కోసం ప్రతీ ఇంటికీ రెండు డస్టుబిన్లు ఇవ్వనున్నట్లు తలసాని చెప్పారు. పరిశుభ్రత విషయంలో ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం రెండు రిజర్వాయర్లు నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగర ప్రణాళికపై తమ కమిటీ సెప్టెంబర్ 1న మరోసారి సమావేశమై నెల రోజుల్లో సీఎం కే సీఆర్‌కు నివేదిక ఇస్తుందన్నారు. జీవో 111కు ఎలాంటి మినహాయింపులు ఉండబోవని, అక్కడ కట్టిన నిర్మాణాలను కూల్చేస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఈ సమస్యలకు ఇక చెక్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పలు సమస్యలు తీరనున్నాయి. ఇప్పటివరకూ ఇంటిని నిర్మించాలంటే ఈ పాట్లన్నీ పడాల్సి వచ్చేది. నగర పాలక సంస్థ నుంచి ఇంటి నిర్మాణ అనుమతి విధిగా పొందాలి. ఇందుకు ఇళ్లు నిర్మించాల్సిన స్థలం తాలూకా అన్ని లింక్ డాక్యుమెంట్లను సమర్పించాలి. అంతేకాదు టౌన్‌ప్లానింగ్ అధికారుల తనిఖీలు, వాళ్లకుఇవ్వాల్సిన ‘మామూళు’్ల షరామామూలే. డాక్యుమెంట్లన్నీ సరిగానే ఉన్నా...మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. నిర్మాణ అనుమతికి లోబడి మాత్రమే భవనంలో అంతస్తులు నిర్మించాలి. విద్యుత్,మంచినీటి కనెక్షన్ పొందాలంటే లింక్ డాక్యుమెంట్లు, సేల్డీడ్లు తప్పనిసరి. బహుళ అంతస్తుల భవంతులు నిర్మించాలంటే ఫైర్‌సేఫ్టీ అనుమతులు, సెట్బ్యాక్లు(భవంతి చుట్టూ ఖాళీస్థలాలు) తప్పనిసరి. 200 చదరపు మీటర్ల విస్తీర్ణం మించిన భవనానికి సంబంధించిన స్థలంలో నిర్మాణ వైశాల్యంలో పదిశాతం స్థలాన్ని మున్సిపాల్టీకి తనఖా పెట్టాలి. టౌన్‌ప్లానింగ్ అనుమతుల ప్రకారమే ఇంటిని నిర్మించినట్లు ధ్రువీకరిస్తేనే భవంతి నిర్మాణం తరవాత ఆక్యుపెన్సీ ధ్రువీకరణ మంజూరు చేస్తారు.గృహనిర్మాణ అనుమతికి దరఖాస్తుతోపాటు రూ.10 వేలు డీడీని సమర్పించాలి. ఇంటి నిర్మాణ విస్తీర్ణాన్ని బట్టి అనుమతులకు చెల్లించాల్సిన రుసుము పెరుగుతుంది. ఇంటిని నిర్మిస్తున్న లేఅవుట్ ల్యాండ్ రెగ్యులరైజేషన్(ఎల్ఆర్ఎస్)ధ్రువీకరణ ఉంటేనే ఇంటిరుణం దొరికే పరిస్థితి ఉంది. గతంలో అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించిన వారు ప్రభుత్వం జారీచేసే మార్గదర్శకాల ప్రకారం బిల్డింగ్ పీనలైజేషన్(బీపీఎస్) పథకం కింద భవంతిని క్రమబద్దీకరించుకోవాలి. పదిమీటర్ల ఎత్తుకు మించిన భవనానికి సమర్పించాల్సిన డాక్యుమెంట్లు ఇవీ... భవన నిర్మాణ దరఖాస్తుపై ఇంటి యజ మాని సంతకం, బిల్డర్, ఆర్కిటెక్ట్, ఇంజనీర్ల సంతకాలు. ఓనర్ డిక్లరేషన్‌పై గెజిటెడ్ అధికారి అటెస్టేషన్. భవన ఆర్కిటెక్ట్ లేదా ఇంజ నీర్ లెసైన్సు కాపీ. ఎమ్మార్వో జారీ చేసే టౌన్ సర్వే రికార్డు. గతంలో జారీచేసిన అనుమతి పత్రం. వెయ్యి చదరపు మీటర్లు దాటిన భవంతికి యూఎల్సీ క్లియరెన్స్. వెయ్యి చదరపు మీటర్ల లోపలున్న భవంతికి యూఎల్సీ అఫిడవిట్. ఓనర్షిప్ డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్లు. రూ. 20 నాన్‌జ్యుడీషియల్ స్టాంప్ పేపర్. భవన నిర్మాణ ప్లాన్. -
మా బంధం ఇంకా బలపడింది!
‘‘నేను ఆర్మీ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని. అందుకే స్వతహాగా ధైర్యం ఎక్కువ. ‘ఏ విషయానికీ భయపడకూదు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఢీ కొట్టడానికి రెడీగా ఉండాలి’ అని మా నాన్నగారు ఎప్పుడూ చెబుతుంటారు. అందుకే, మొన్న విరాట్ కోహ్లీ సరిగ్గా మ్యాచ్ ఆడకపోతే నన్ను నిందించినా నేను నిబ్బరంగా ఉండగలిగా. అసలు నాకే మాత్రం సంబంధం లేని, నేను తప్పు చేయని విషయాలకు నేనెందుకు బాధపడాలి? నిన్న మొన్నటివరకూ నేను బయటివాళ్ల మాటలకు ప్రాధాన్యం ఇచ్చేదాన్ని. నా గురించి ఎవరేమనుకుంటారోనని కంగారుపడేదాన్ని. కానీ, ఇప్పుడు మా అమ్మ, నాన్న, నా సోదరుడుతో పాటు విరాట్ కోహ్లీ మాటలకు మాత్రమే నేను ప్రాధాన్యం ఇస్తాను. మిగతా వాళ్ల మాటలు నాకనవసరం. ఆ నలుగురే నా జీవితం. విరాట్ నా జీవితానికి చాలా ముఖ్యం. మా ఇద్దరి గురించీ అందరికీ తెలియని విషయం ఏంటంటే.. మా అభిప్రాయాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అలాగే, మా ఇద్దరికీ ఇంకా చాలా విషయాల్లో పోలికలున్నాయి. ఇద్దరం మధ్యతరగతి కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చిన వాళ్లమే. ఎవరి అండదండలూ లేకుండా స్వశక్తితో పైకొచ్చినవాళ్లం. మాకేం కావాలో మాకు స్పష్టంగా తెలుసు. ఒక్క ముక్కలో చెప్పాలంటే... మా గురించి వచ్చిన విమర్శలు మా అనుబంధాన్ని ఇంకా పటిష్టం చేశాయి.’’ - అనుష్క శర్మ, కథానాయిక -
వెండితెర చంద్రునికి నివాళి
సామాన్య మధ్యతరగతి కుటుంబానికి ఇంటి పెద్ద బాధ్యతలను నెత్తిన వేసుకున్న ఒక అవివాహిత యువతి మనోగతాన్ని, త్యాగశీల తను, సంసారం కోసం ఆమె పడే తపన, ఆవేదనలను సజీవ చిత్రంగా మలచి... ఒకవంక ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తూనే, మరోవంక సునిశిత హాస్యంతో గిలిగింతలు పెట్టిన ‘అంతులేని కథ’ కర్త బాల చందర్. ఆచార వ్యవహారాల అడ్డంకులను అధిగమించి, మానవత్వం పునాదిగా సమాజ పునర్నిర్మాణానికి నడుం బిగించాలని యువతకు మేలుకొలపడానికై ‘రుద్రవీణ’ను మీటిన ప్రగతిశీలి బాలచందర్. నిరుద్యోగం యువతను ఎలా రగిలేట్టు చేస్తుందో, ఆకలి మంటల మధ్య ఆదర్శాల కోసం ఆర్తితో అలమటించేట్టు చేస్తుందో చెప్పి ‘ఆకలి రాజ్యం’కు నిలువెత్తు అద్దం పట్టిన అసాధారణ ప్రతిభాశాలి బాలచం దర్. సామాజిక వాస్తవికతను గొప్ప కళాఖండాలుగానే గాక, జనరంజ కంగా రూపొందించడం ద్వారానే కళ సామాజిక ప్రయోజన సాధనం కాగలదని నిరూపించిన అతి అరుదైన చలనచిత్ర దర్శకుడు బాలచం దర్. ప్రయోగాత్మకతే ఊపిరిగా కళా తపస్సు చేసి, మట్టిలోంచి మాణి క్యాలను వెలికి తీసి, గొప్ప కళాకారులుగా మార్చిన అపర కళాబ్రహ్మ ఇక లేరన్న వార్త దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు, ప్రేక్షకకులకే కాదు భారత సినీ పరిశ్రమకే తీరనిలోటు. ఆయనకు అశ్రునివాళులు. - శొంటి విశ్వనాథం హైదరాబాద్ -
నా స్థానంలో మీరుంటే ఏం చేసేవారో..!
‘‘ఆ అబ్బాయి మంచివాడే, ఈ పిల్లకే పొగరెక్కువ. అందుకే కాపురం చెడగొట్టుకుని ఉంటుంది’’... ఈ మాట విన్నప్పుడు మనసుకు తగిలిన గాయం, అతడు చేసిన గాయం కంటే ఎక్కువ బాధపెట్టింది. ఆడపిల్ల ఆత్మవిశ్వాసం ఈ సమాజానికి ఎప్పుడూ పొగరుగానే ఎందుకు కనిపిస్తుందో అర్థం కాదు నాకు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టాను. కష్టపడి చదివాను. మంచి ఉద్యోగం సంపాదించాను. ఎవరిమీదా ఆధారపడకుండా బతుకుతున్నాను. ఎవరి దగ్గరా ఏదీ ఆశించను. నా నిర్ణయాలు నేను తీసుకుంటాను. నా భావాలను నిక్కచ్చిగా వెల్లడిస్తాను. అది నా ఆత్మవిశ్వాసంతో వచ్చిన గట్టిదనమే తప్ప, అహంకారంతో వచ్చిన తలపొగరు కాదు. ఆ విషయం ఎవరికీ అర్థం కాదు. అర్థం కాకపోయినా నేను ఫీలవ్వలేదు... ఒక్కసారి తప్ప. అన్ని విషయాల్లోనూ తప్పుబట్టినా బాధనిపించలేదు కానీ, నా భర్తతో విడిపోయినప్పుడు తప్పుబడితే తట్టుకోలేకపోయాను. బాధగా ఉండదా మరి! నేనే తప్పూ చేయలేదు.మంచివాడని నమ్మాను. ప్రేమగా చూసుకుంటాడనుకున్నా. కానీ మోసగాడని, హింసిస్తాడని ఊహించలేదు. మగాడినన్న అహంకారాన్ని నిలువునా నింపుకుని మనసును, తనువును తూట్లు పొడుస్తుంటే తట్టుకోలేకపోయాను. తన వివరాలన్నీ తప్పుగా చెప్పి మోసం చేశాడని తెలిసి సహించలేకపోయాను. నిలదీస్తే అరిచాడు. బతిమాలితే కాదు పొమ్మన్నాడు. నీ పద్ధతి సరిగ్గా లేదు అని చెప్పబోతే తిరిగి నా మీదే లేనిపోని నిందలు వేశాడు. నన్నే చెడ్డగా చిత్రీకరించాలనుకున్నాడు. అయినా నేను నోరు మూసుకునే ఉండాలా! ఉంటే మంచిదాన్నని అని ఉండేవారా? మంచి సర్టిఫికెట్ ఎప్పుడిస్తారు? ఏం చూసి ఇస్తారు? చిత్రహింసలు పెట్టినా మౌనంగా భరించేస్తే మంచిదాన్ని అంటారా! కన్నీళ్లను దిగమింగుకుని కాళ్ల దగ్గర పడివుంటే అంటారా! ఇలా మాట్లాడినా కూడా తప్పనే అంటారు. అయినా వాళ్లంతా ఏమనుకుంటే నాకేంటి? బాధ నాది. బతుకు నాది. దాన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరమూ నాదే. అవతలివాడు దెబ్బ కొట్టాడు అంటే ఆ తప్పు అతడిది కాదు, కొట్టే అవకాశం ఇచ్చిన మనది అని భావిస్తాను నేను. అందుకే ఇంకా దెబ్బలు తినడం మంచిది కాదని అనుకున్నాను. అతడి నుంచి విడిపోవడమే మేలని నిశ్చయించుకున్నాను. అప్పుడు వినబడిందే ఆ మాట. నేనే కాపురం చెడగొట్టుకుని ఉంటానని కొందరి సందేహం. ఎవరైనా కావాలని చెడగొట్టుకుంటారా? అయినా ఏం తెలుసని అంత మాట అంటారు! అతడు పెట్టిన హింసను చూడలేదు. అది తాళలేక నేను పెట్టిన కన్నీటి నీ లేదు. కానీ నా జీవితం గురించి నేను నిర్ణయం తీసుకునేసరికి కామెంట్లు చేయడానికి సిద్ధమైపోయారు. చాలా బాధపడ్డాను. కానీ ఏమీ మాట్లాడలేదు. మాట్లాడటం అనవసరం కూడా. ఎందుకంటే... ఎదుటివాడి కష్టాన్ని వాడి స్థానంలో ఉండి చూడగలిగే గొప్ప మనసు ఎవరికోగానీ ఉండదు. ఆ మనసే లేనప్పుడు ఎన్ని చెప్పి ఏం లాభం! కానీ నన్ను ఆ మాట అన్నవాళ్లందరినీ ఒక్కటే ప్రశ్న అడుగుతాను. నా స్థానంలో మీ కూతురో లేక మీరో ఉండి ఉంటే కూడా ఇలాగే ఆలోచిస్తారా? తప్పు మీ మీదే వేసుకుంటారా?! - స్వప్న, రావులపాలెం -
ఒకే మనిషిలో... రెండు కోణాలూ చూడాలి!
లైఫ్ బుక్ సినిమా నేపథ్యం ఉన్న వాళ్లు అలవోకగా నటిస్తారని, లేని వాళ్లు కష్టపడాల్సి వస్తుందనే దాన్ని నమ్మను. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు సినిమా నేపథ్యం లేదు. అయినా ‘నటించగలను’ అనే ఆత్మవిశ్వాసం ఉండేది. మొదట్లో నా నటనపై విమర్శలు వచ్చేవి. కొందరైతే ‘‘ఇషాకు నటించడం కూడా తెలుసు!’’ అని వ్యంగ్యంగా రాసే వాళ్లు. నాకు కోపం రాలేదు. నటన మెరుగు పరుచుకోవాలనే పట్టుదల మాత్రం పెరిగింది. అలా క్రమంగా నా నటనను మెరుగుపరుచుకున్నాను. విమర్శించిన వాళ్ల నుంచే ప్రశంసలు అందుకున్నాను. సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని పరిస్థితులే కల్పిపిస్తాయి. మా అమ్మకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు చాలాకాలం పాటు ఆసుపత్రికి తిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో నాకు నేనుగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాను. తెలియని విషయాలను అడిగి తెలుసుకున్నాను. సినిమా ఫీల్డ్‌లో నాకంటూ గాడ్‌ఫాదర్, సలహాదారులు ఎవరూ లేరు. మంచి అయినా, చెడు అయినా నా నిర్ణయాలు నేనే తీసుకున్నాను. సొంత నిర్ణయాలు తీసుకోవడంలో ఆత్మసంతృప్తి కూడా ఉంది. ఒక వ్యక్తికి ఉన్న రెండు కోణాలను చూడాలి. ఒకే కోణంలో చూస్తే అపార్థాలు పెరుగుతాయి. ఉదా: డెరైక్టర్ సాజిత్‌ఖాన్ సెట్లో గట్టిగా అరిచేవాడు. షూటింగ్ అయి పోయిన తరువాత మాత్రం ఆత్మీయంగా మాట్లాడేవాడు. ‘అరుస్తున్నాడు కదా!’ అని మనసులో కోపం పెట్టుకుంటే అతడిని ఎన్నడూ అర్థం చేసుకోలేకపోయేదాన్ని. ఏ విషయానికైనా సరే అధిక ప్రాధాన్యత ఇవ్వను. అధిక ప్రాధాన్యత వల్ల ఆందోళన తప్ప ఏమీ మిగలదు. ఒత్తిడి భారంతో పొరపాట్లు చేస్తుంటాం. - ఈశా గుప్తా, హీరోయిన్ -
ఉత్తరం రాస్తే... విజ్ఞాన వీచికలు వీస్తాయి!
అది మహారాష్ట్రలోని ఎగువ మధ్య తరగతి కుటుంబం. పిల్లల అవసరాలను తీర్చడానికి, ఆసక్తులను నెరవేర్చడానికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులూ తలెత్తని సౌకర్యవంతమైన జీవితం వారిది. ఒకరోజు ఆ ఇంట్లో పాపాయి ‘‘నాన్నా! నాకు ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తకం కావాలి, కొనివ్వవా’’ అంటూ గారాలు పోయింది. ఆ పుస్తకం మాజీ రాష్ట్రపతి ఏపీజె అబ్దుల్ కలాం రాసుకున్న జీవిత చరిత్ర. ఆ అమ్మాయి అప్పటికే కలాం వంటి ఎందరో ప్రముఖుల జీవిత చరిత్రలను చదివింది. ఆమె పుస్తకాల అలమరాలో ఒక అర క్లాసు పుస్తకాలతో నిండి ఉండే మూడు అరల్లో పిల్లలు చదివి తీరాల్సిన పుస్తకాలే ఉంటాయి. కూతురి మాట పూర్తయ్యేలోపే ‘‘అలాగే కొనిస్తాను బంగారు తల్లీ’’ అన్నాడా తండ్రి మురిపెంగా. తాను చదవమని సూచించడానికంటే ముందే కూతురు అంత గొప్పవాడి జీవితచరిత్రను చదవాలని అడగడం ఆ తండ్రిని ఎక్కువగా సంతోష పెట్టింది. దాంతోపాటే మరో ఆలోచన కూడా వచ్చిది. ఎంతోమంది పిల్లలు నగరాల్లోని మురికివాడల్లో, గ్రామాల్లో నిరుపేద కుటుంబాల్లో జీవిస్తూ క్లాసు పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బుల్లేక చిరిగిపోయిన పుస్తకాలతో సరిపెట్టుకుంటున్నారు. అలాంటి పిల్లలకు మంచి సాహిత్యం అందడం ఎలా? అని. పిల్లలకు తిండి, బట్ట సమకూర్చడమే కష్టమయ్యే కుటుంబాల్లో సాహిత్యం కోసం డబ్బు ఖర్చు చేయలేరు. మారుమూల గ్రామాల్లో కొన్ని కలిగిన కుటుంబాల పిల్లలకు పుస్తకాల కొనగలిగిన ఆర్థిక స్తోమత ఉన్నా, ఎలా తెప్పించుకోవాలో తెలియదు. దీనికి పరిష్కారంగా రూరల్ లైబ్రరీకి శ్రీకారం చుట్టారు ప్రదీప్ లొఖాండే. మహారాష్ట్రలోని పుణేలో నివసించే ప్రదీప్ లొఖాండే గ్రామీణ గ్రంథాలయాల స్థాపనలో వినూత్నమైన శైలిని అనుసరించారు. భారీ వ్యయంతో లైబ్రరీలను స్థాపించి, వాటి నిర్వహణ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం తన శక్తికి మించిన పని. కానీ గ్రామాల్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలకూ లైబ్రరీ ఉండాలి, అందులో మంచి పుస్తకాలు ఉండాలి. బాధ్యతాయుతంగా నిర్వహించే వారిని ఇందులో భాగస్వాములను చేయాలి... అనుకున్నారు. మొదట పుణే పరిసర గ్రామాలతో మొదలు పెట్టారు. ప్రతి పాఠశాలకూ వెళ్లి తమ ప్రయత్నాన్ని వివరించి తన అడ్రస్ రాసిన పోస్టు కార్డులు పంచారు. స్కూలు లైబ్రరీ లేనివారు మంచి పుస్తకాల కోసం ఆ కార్డు మీద రాసి పోస్టు చేయమని కోరారు. అడిగిన వారికి అడిగినట్లు పుస్తకాలను పేదవారికి సొంతఖర్చులతో పంపించారు. కొనుక్కోగలిగిన వారికి ఎలా తెప్పించుకోవాలో తెలియచేస్తూ మరో ఉత్తరం రాసేవారు. అలా తన సేవలను ఇప్పటికి వెయ్యికి పైగా గ్రామాలకు విస్తరించారు ప్రదీప్ లొఖాండే. మూడు లక్షల మంది విద్యార్థులకు పుస్తకాలను అందుబాటులోకి తెచ్చారు. ఇంకా కావాలనే వారికి పుస్తకాలు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక వినూత్నమైన ఆలోచన విశేషమైన విజయాన్ని తెచ్చిందంటారు ప్రదీప్ లొఖాండే. తన పుస్తకాలు అందుకున్న వారిలో దాదాపుగా 50 వేల మంది విద్యార్థులు ఆ పుస్తకాలను చదివి తమ అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా పంచుకున్నారని సంతోషం వ్యక్తం చేస్తారాయన. మహారాష్ట్రలోని 5,800 లైబ్రరీలకు పుస్తక పంపిణీ చేశాక దేశంలో ఉన్న 85 వేల లైబ్రరీలకు తన సేవలను విస్తరించాలని ఉందని, అదే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమనీ అంటారు ప్రదీప్ లొఖాండే. పుస్తకాలు కావాలంటే ఒక ఉత్తరం రాయమంటూ కొత్తగా పరిచయమైన వారందరికీ తన అడ్రస్ రాసిస్తారు. సామాజిక, సాహిత్య సేవలకు ఇదో వినూత్నమైన ఆలోచన. -
ఆటో భవానీ... బతుకు సవారీ
వారిది ఓ మధ్య తరగతి కుటుంబం. భర్త నంబూరులో చిన్న హోటల్ నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ప్రశాంతంగా సాగిపోతున్న వారి జీవననౌక ఒక్కసారిగా సుడిగుండంలో చిక్కుకుంది. అనారోగ్యంతో ఇంటి యజమాని మరణించాడు. ముగ్గురు పిల్లల పోషణ భారం మీద పడడంతో కొన్నాళ్లు ఆమె చిన్నాచితకా ఉద్యోగాలు చేసింది. అవేమీ కుటుంబ ఖర్చులకు చాలకపోవడంతో మహిళలకు క్లిష్టమైన వృత్తి అయినా సరే పట్టుదలగా ఆటో నేర్చుకుంది. బతుకు బండి నడపడానికి ఆటో భవానీ అవతారమెత్తింది. - పట్నంబజారు(గుంటూరు) సారసాగరంలో ఊహించని విధంగా వచ్చిన సునామీ ఆమె బతుకును చెల్లాచెదురు చేసినా...మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసింది. ఆత్మవిశ్వాసంతో ఏటికి ఎదురీదుతోంది. మహిళలకు ఇబ్బందికరమైనా... పిల్లల భవిష్యత్తు కోసం ఆటోడ్రైవింగ్ను వృత్తిగా ఎంచుకుంది. కష్టాలు, అవమానాలను దిగమింగుతూ ముందుకు సాగుతోంది. నగరంలో ఆటో నడుపుతూ జీవిస్తున్న ‘ఆటో భవాని’ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే... నంబూరు గ్రామానికి చెందిన కొల్లా హనుమంతరావుకు అదే ప్రాంతానికి చెందిన భవానితో 1995లో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. ఊళ్లోనే చిన్న హోటల్ నడుపుకునేవాడు. వచ్చే ఆదాయంతో ఆ పల్లెటూళ్లో కుటుంబం ఉన్నంతలో ఆనందంగానే గడిపేది. ప్రశాంతంగా సాగిపోతున్న వారి కాపురంలో ఒక పిడుగులాంటి వార్త అలజడి సృష్టించింది. భర్త తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. దాదాపు మూడేళ్లు మంచాన ఉండి 2003లో భర్త మృతి చెందాడు. ఆ తర్వాత రెండేళ్లపాటు అత్త,మామల ఆదరణతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. అయితే వృద్ధులైన అత్తా, మామలపై భారం వేయడం సరికాదని భావించి 2005లో పిల్లలను తీసుకుని గుంటూరుకు వచ్చింది. తాను చదివిన పదో తరగతి విద్యార్హతతో ఉద్యోగాల కోసం యత్నించింది. కొన్నాళ్లపాటు చిన్నా, చితకా ఉద్యోగాలు చేస్తూ, పిల్లలను చదివించుకుంటూ బతుకు బండిని నెట్టుకొచ్చింది. నగరంలో పెరిగిన ఇంటిఅద్దెలు, ఇతర ఖర్చుల కారణంగా వచ్చే జీతం చాలకపోవడంతో ఒక ఆటో డ్రైవర్ వద్ద డ్రైవింగ్ నేర్చుకుంది. ముదితల్ నేర్వగరాని విద్య గలదే...అన్నట్టు కష్టమైనా...బతుకు కష్టాలు గట్టెక్కాలంటే ఇదే సరైన మార్గమని నమ్మి పట్టుదలగా ఆటో నడపడం నేర్చుకుంది. నగరంలో గత రెండేళ్లుగా ఆటో నడుపుతూ కుటుంబ భారాన్ని మోస్తోంది. ఆడదానికి నువ్వేం నడుపుతావు అన్నారు... ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నాక అద్దె ఆటోల కోసం వెళితే అనేకచోట్ల అవమానాలు ఎదుర్కోవలసి వచ్చిందని భవాని వాపోయింది. ఆడదానికి నువ్వేం నడుపుతావని ఎగతాళి చేశారని చెప్పింది. ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నా... కళ్ల ముందు పిల్లల పోషణభారం కనపడుతుండడంతో అన్నింటిని మౌనంగా భరించింది. ఒక ఆటో యజమాని సహకారంతో రెండేళ్లుగా నగర వీధుల్లో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. భవాని నగర వీధుల్లో ఆటో నడుపుతుంటే మహిళ ఆటో నడుపుతోందని కొందరు అబ్బురంగా చూస్తున్నారు. అయితే ఆమె వెనుక ఉన్న విషాదగాధ తెలిస్తే మాత్రం గుండె బరువెక్కుతుంది. ముగ్గురు పిల్లలో పెద్దవాడైన అనంత గుప్తా సీఏ సీపీటీ కోర్సు చదువుతున్నాడు. రెండో కుమారుడైన నాగతేజ పదో తరగతితో ఆపేసి, తల్లికి చేదోడువాదోడుగా ఉందామని, ఓ మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. మూడో కుమారుడు కేదార్నాథ్ 9వ తరగతి చదువుతున్నాడు. కష్టాలు అలవాటైపోయాయి నా భర్త చనిపోయిన నాటి నుంచి ఎన్నో కష్టాలు పడుతున్నాను. అత్తమామలు ఎంతో ప్రేమగా కన్నబిడ్డలా చూసినప్పటికి వారికి భారం కాకూడదనే ఇంటి నుంచి బయటకు వచ్చాను. నా బిడ్డలు భవిష్యత్తులో నాలాంటి కష్టాలు పడకూడదు. అందుకే ఎంత కష్టమైనా... ఆటో నడుపుకుంటూ నా పిల్లలను చదివించుకుంటున్నా.. ఈ వృత్తిలో ఆదాయం బాగానే ఉన్నా, సగం అద్దెలకే పోతోంది. సొంత ఆటో ఉంటే మెరుగ్గా ఉంటుంది. ప్రభుత్వం ద్వారా ఆటో కొనుక్కోవడానికి సహాయం చేస్తారేమోనని చాలామంది అధికారుల చుట్టూ తిరిగాను. ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వం ద్వారా గానీ, లేదా స్వచ్ఛంద సంస్థల వారు కాని ఆటో కొనిస్తే నడుపుకుంటాను. నా పిల్లల్ని ఇంకా మెరుగ్గా చదివించుకోగలుగుతాను. - భవాని, ఆటోడ్రైవర్ -
నాన్న కళ్లలో వెలుగు!
కనువిప్పు మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. కేవలం మా నాన్న జీతం డబ్బులే మాకు ఆధారం. అందుకే నాన్న ‘‘ఒరేయ్...నేను పెద్ద చదువులు చదువుకోలేదు. దాంతో, ఇలా చిన్న ఉద్యోగమేదో చేస్తూ నానా కష్టాలు పడుతున్నాను. నువ్వు ఇంటికి పెద్ద కొడుకువి. బాగా చదవాలి. పెద్ద చదువులు చదవాలి. నీ చదువు కోసం ఇల్లు కూడా అమ్మేస్తాను’’ అనేవారు తరచుగా. ‘‘అలాగే నాన్న’’ అని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసేవాడిని. అప్పుడప్పుడూ ఆయన మాటలు నాకు చాదస్తంగా అనిపించేవి కూడా. నాకు పాలిటెక్నిక్ కాలేజీలో సీటు రావడంతో, ఊరికి దూరం కావాల్సి వచ్చింది. ‘‘నువ్వు తరచుగా ఇంటికి రావద్దు. చదువు దెబ్బతింటుంది. నీకు డబ్బులు అవసరమైతే ఒక్క ఫోన్ చెయ్ చాలు. పంపిస్తాను’’ అన్నారు నాన్న. మొదట్లో హోమ్సిక్గా అనిపించినా, కొత్త స్నేహాలు పెరగడంతో అక్కడ అలవాటైపోయింది. ఫ్రెండ్స్‌తో షికార్లు చేయడం ఎక్కువైంది. ఫ్రెండ్స్ ముందు గొప్ప కోసం ‘‘మాకు ఊళ్లో చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. మా నాన్న ఎంతంటే అంత డబ్బు పంపిస్తాడు’’ అని కోతలు కోసేవాడిని. ఫ్రెండ్స్ అందరూ కలిసి నాకు ‘దానకర్ణ’ అనే బిరుదు ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకోవడం కోసం విపరీతంగా ఖర్చు చేసేవాడిని. ఒకరోజు నాన్న ‘‘ఇన్ని డబ్బులు ఏం చేస్తున్నావురా?!’’ అని అడిగారు కూడా. నేను ఏదో సాకు చెప్పి తప్పించుకున్నాను. ఒకరోజు... ఆరోజు మా రూమ్‌లో పార్టీ చేసుకుంటున్నాం. ఇంతలో తలుపు చప్పుడైంది. తీసి చూస్తే... నా గుండె ఆగినంత పనైంది! నాన్న!!! ‘‘ఫరావాలేదురా... బాగా కష్టపడుతు న్నావ్’’ అన్నారు వ్యంగ్యంగా నాన్న. ఆ క్షణంలో నేను చనిపోతే బాగుండునని అనిపించింది. నాతో పాటు పార్టీలో కూర్చున్న ఫ్రెండ్స్‌కు కూడా నాన్న వేడిగా క్లాస్ తీసుకున్నారు. ‘‘నాయనలారా... వీడికి పెళ్లి కావాల్సిన అక్క ఉంది. ఆ అమ్మాయి పెళ్లి గురించి కంటే వీడి చదువు గురించే ఎక్కువ ఆలోచిస్తూ వచ్చాను. మంచిగా బుద్ధి చెప్పాడు’’ అన్నారు నాన్న కన్నీళ్లు తుడుచుకుంటూ. నేను నాన్న కాళ్లు గట్టిగా పట్టుకొని ఏడ్చాను... ఆ కన్నీళ్లతో నా మనసులో ఉన్న చెడు కొట్టుకుపోయేలా! ‘‘నేను మారతాను’’ అని ఆ రోజు చెప్పలేదు. మారి చూపించాను. మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యాను. నాన్న కళ్లలో వెలుగు నింపాను. - వి.ఆర్, ఖమ్మం -
అలా చదివింది..! జీవితంలో గెలిచింది
జీవితంలో ఎదురు దెబ్బలు తిననివాళ్లు బహుశా ఎవరూ ఉండరేమో. అయితే ఆ గాయాల్ని తలచుకుని బాధపడేవాళ్లు కొందరుంటారు. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తుకు అందమైన బాటలు పరచుకునేవాళ్లు కొందరుంటారు. వెంకటలక్ష్మి రెండో కోవకు చెందిన మహిళ. తన జీవితంలో జరిగిన సంఘటన నుంచి ఆమె చాలా నేర్చుకుంది. తన జీవన గమనాన్ని ఓ గమ్యం వైపు తిప్పుకుంది! లక్ష్యం ఎప్పుడూ ఉన్నతంగానే ఉండాలి. నమ్మకం ఎప్పుడూ ఆకాశమంతే ఉండాలి. కృషి ఎప్పుడూ నిరంతరం సాగుతుండాలి. ప్రయాణం ఎప్పుడూ ముందుకే సాగాలి. ఇవన్నీ వెంకటలక్ష్మికి బాగా తెలిసిన విషయాలు. అందుకే ఆమె ప్రయాణం ఎప్పుడూ ఆగింది లేదు. ఒడిదుడుకులు ఎదురైనా, అడుగడుగునా ముళ్లు గుచ్చుకున్నా ఆమె పాదాలు నిలబడిపోలేదు. ముందుకే నడిచాయి. ఆమెను ఉన్నత స్థాయికి చేర్చాయి. రెండేళ్ల క్రితం వరకూ వెంకటలక్ష్మి బెంగళూరు రోడ్ల మీద ఆటో నడుపుతూ కనిపించేది. కానీ ఇవాళ నల్లకోటు వేసుకుని, చేతిలో కేసు ఫైళ్లు పట్టుకుని బెంగళూరు కోర్టు మెట్లెక్కుతూ కనిపిస్తోంది. ఆటో స్టీరింగ్ పట్టుకున్న చేతులతోనే నల్లకోటు తొడుక్కునే స్థాయికి ఆమె చేరిన తీరు వింటే మనలోనూ స్ఫూర్తి ఏర్పడుతుంది. ఏదైనా సాధించాలన్న పట్టుదల కలుగుతుంది. సాహసమే ఊపిరిగా... ధైర్య సాహసాలు వెంకటలక్ష్మిని మొదట్నుంచీ వెన్నంటే ఉండేవి. హైస్కూల్లో చదివే రోజుల్లో ఆమె చేసిన ఓ సాహసం అందరినీ విస్మయపరిచింది. వేగంగా వస్తున్న ఓ బస్సు కింద పడబోతున్న విద్యార్థిని ఎంతో చాకచక్యంగా రక్షించింది వెంకటలక్ష్మి. ఆ ప్రయత్నంలో ఆమె బాగా గాయపడింది. ఆమె సాహసాన్ని మెచ్చి కర్ణాటక ప్రభుత్వం సాహస బాలిక అవార్డును కూడా ప్రకటించింది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టడం వల్ల వెంకటలక్ష్మి జీవితంలోని ఎత్తుపల్లాలను దగ్గర్నుంచి చూసింది. అందుకే ఎప్పుడూ జీవితంలో స్థిర పడాలన్న పట్టుదలతోనే ఉండేది. చిన్నప్పట్నుంచీ చదివేది. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేది. కళల్లో రాణించేది. సంప్రదాయిక కుటుంబం కావడంతో కట్టుబాట్లు ఎక్కువ ఉండేవి. కానీ అవి లక్ష్మిని ఎప్పుడూ ఆపలేదు. ఆమె తనకు నచ్చింది చేసే తీరేది. సంగీతం, నృత్యం... అన్నీ నేర్చుకుంది. అయితే పదో తరగతి పూర్తి కాగానే పరిస్థితుల కారణంగా పని చేయాల్సి వచ్చింది వెంకటలక్ష్మికి. అప్పుడు కూడా ఆమె తన శైలిలోనే ఆలోచించింది. ఆటో నడపాలని నిర్ణయించుకుంది. చేయడానికి ఇంకేమీ దొరకలేదా అని ఇంట్లోవాళ్లు అంటే... ‘ఇందులో ఏముంది తప్పు’ అంటూ ఆటో స్టీరింగ్ పట్టుకుంది. బెంగళూరు రోడ్ల మీద దూసుకుపోయింది. అదో పెద్ద పాఠం... ఎంత తెగువ ఉన్నా, ఎంతగా మగాళ్లతో పోటీ పడినా మహిళ ఎప్పుడూ మహిళేనని గుర్తుచేసే సంఘటన ఒకటి లక్ష్మి జీవితంలో జరిగింది. అది ఆమెకు పెద్ద పాఠమే నేర్పింది.ఇరవయ్యేళ్ల వయసులో ఓ రోజు లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఉన్నట్టుండి ఓ అయిదుగురు వ్యక్తులు ఆమె ఇంట్లో జొరబడ్డారు. లక్ష్మిని బలవంతం చేయబోయారు. వెంటనే లక్ష్మిలోని సాహసి మేల్కొంది. వారిని చితకబాది తరిమి కొట్టింది. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. కానీ పోలీసులు అవతలివారి మాటలకు లొంగిపోయి కేసు రిజిస్టర్ చేయకుండా వదిలేశారు. దాంతో కమిషనర్ దగ్గరకు వెళ్లింది లక్ష్మి. ఆయన చొరవతో కేసు రిజిస్టర్ అయ్యింది కానీ, ఆమె జీవితం నరకప్రాయం అయిపోయింది. సదరు వ్యక్తులు ఆమెను వెంటపడి వేధించేవారు. ఆమె గురించి చెడుగా ప్రచారం చేసేవారు. దాంతో లక్ష్మిని అందరూ దూరం పెట్టేవారు. ఆమెకు ఇక పెళ్లి కాని పరిస్థితి ఏర్పడింది. అయితే ఓ తోటి ఆటో డ్రైవర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతడికి ఇల్లాలై ఊరి చివర ఓ ఇల్లు కట్టుకుని కాపురం పెట్టింది లక్ష్మి. అయితే ల్యాండ్ మాఫియా ముఠా ఆమె ఇంటిని లాక్కోవాలని ప్రయత్నించింది. ఆమెను లైంగిక వేధింపులకు గురిచేసింది. దాంతో మరోసారి ఆమె కోర్టు మెట్లెక్కింది. లక్ష్మి తొమ్మిదేళ్లపాటు కోర్టు చుట్టూ తిరిగింది. కేసు మలుపులు తిరుగుతోందే తప్ప ఓ కొలిక్కి రావడం లేదు. దాంతో విసిగిపోయిన లక్ష్మి ఓ రోజు న్యాయస్థానంలో నోరు విప్పింది. తన కేసు తనే వాదించుకుంటాను, అనుమతినివ్వమంది. న్యాయమూర్తి ఆమె ఆవేదనను అర్థం చేసుకుని అనుమతినిచ్చారు. దాంతో న్యాయస్థానంలో దాదాపు మూడు గంటల పాటు తన వాదనను వినిపించింది లక్ష్మి. చివరికి కేసు గెలిచింది. ఆ రోజు అర్థమైంది లక్ష్మికి... అన్యాయం జరిగినంత వేగంగా న్యాయం జరగదని. న్యాయస్థానాలు, చట్టాలు తనలాంటి వారికి అందుబాటులో లేవని. తనలా ఇంకెందరో కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ ఉంటారని. ఆ క్షణమే నిర్ణయించుకుంది... తాను లాయరై తీరాలని. కొందరికైనా న్యాయాన్ని చేకూర్చాలని. భర్త సహకారంతో లా కాలేజీలో చేరింది. ఓ పక్క ఆటో నడుపుతూ, మరోపక్క ఇంటి పనులు చేస్తూ, ఇంకో పక్క కూతురిని సాకుతూనే లా పూర్తి చేసింది. కర్ణాటక బార్ అసోసియేషన్‌లో తన పేరు నమోదు చేసుకుంది. ‘ఎదగాలన్న పట్టుదల ఉంటే ఎత్తుకే చేరతాం తప్ప పల్లానికి పడిపోం’ అని నిరూపించింది. అందరితో హ్యాట్సాఫ్ అనిపించుకుంటోంది! - సమీర నేలపూడి జీవితంలో కొన్నిసార్లు బలహీనపడిపోతాం. ఇక మన వల్ల కాదులే, వదిలేద్దాం అని రాజీ పడిపోతాం. ఒకటి రెండు సమయాల్లో నేనూ అలాగే అనుకున్నాను. కానీ ఆ ఆలోచనను మనసులో అలా ఉండనిస్తే నేను ఓడిపోయి ఉండేదాన్ని. నా పట్ల అన్యాయం జరిగింది. దాన్ని నిరూపించుకోవడానికి నేను పడిన కష్టం అంతా ఇంతా కాదు. నేను చేసిన ఆ పోరాటం నాలో పట్టుదలను పెంచింది. న్యాయం కోసం కష్టపడకూడదు అనిపించింది. ఆ ఆలోచనే నన్ను ‘లా’ చదివేలా చేసింది.