నా స్థానంలో మీరుంటే ఏం చేసేవారో..!
‘‘ఆ అబ్బాయి మంచివాడే, ఈ పిల్లకే పొగరెక్కువ. అందుకే కాపురం చెడగొట్టుకుని ఉంటుంది’’... ఈ మాట విన్నప్పుడు మనసుకు తగిలిన గాయం, అతడు చేసిన గాయం కంటే ఎక్కువ బాధపెట్టింది. ఆడపిల్ల ఆత్మవిశ్వాసం ఈ సమాజానికి ఎప్పుడూ పొగరుగానే ఎందుకు కనిపిస్తుందో అర్థం కాదు నాకు.
మధ్య తరగతి కుటుంబంలో పుట్టాను. కష్టపడి చదివాను. మంచి ఉద్యోగం సంపాదించాను. ఎవరిమీదా ఆధారపడకుండా బతుకుతున్నాను. ఎవరి దగ్గరా ఏదీ ఆశించను. నా నిర్ణయాలు నేను తీసుకుంటాను. నా భావాలను నిక్కచ్చిగా వెల్లడిస్తాను. అది నా ఆత్మవిశ్వాసంతో వచ్చిన గట్టిదనమే తప్ప, అహంకారంతో వచ్చిన తలపొగరు కాదు. ఆ విషయం ఎవరికీ అర్థం కాదు. అర్థం కాకపోయినా నేను ఫీలవ్వలేదు... ఒక్కసారి తప్ప. అన్ని విషయాల్లోనూ తప్పుబట్టినా బాధనిపించలేదు కానీ, నా భర్తతో విడిపోయినప్పుడు తప్పుబడితే తట్టుకోలేకపోయాను.
బాధగా ఉండదా మరి! నేనే తప్పూ చేయలేదు.మంచివాడని నమ్మాను. ప్రేమగా చూసుకుంటాడనుకున్నా. కానీ మోసగాడని, హింసిస్తాడని ఊహించలేదు. మగాడినన్న అహంకారాన్ని నిలువునా నింపుకుని మనసును, తనువును తూట్లు పొడుస్తుంటే తట్టుకోలేకపోయాను. తన వివరాలన్నీ తప్పుగా చెప్పి మోసం చేశాడని తెలిసి సహించలేకపోయాను. నిలదీస్తే అరిచాడు. బతిమాలితే కాదు పొమ్మన్నాడు. నీ పద్ధతి సరిగ్గా లేదు అని చెప్పబోతే తిరిగి నా మీదే లేనిపోని నిందలు వేశాడు.
నన్నే చెడ్డగా చిత్రీకరించాలనుకున్నాడు. అయినా నేను నోరు మూసుకునే ఉండాలా! ఉంటే మంచిదాన్నని అని ఉండేవారా? మంచి సర్టిఫికెట్ ఎప్పుడిస్తారు? ఏం చూసి ఇస్తారు? చిత్రహింసలు పెట్టినా మౌనంగా భరించేస్తే మంచిదాన్ని అంటారా! కన్నీళ్లను దిగమింగుకుని కాళ్ల దగ్గర పడివుంటే అంటారా! ఇలా మాట్లాడినా కూడా తప్పనే అంటారు. అయినా వాళ్లంతా ఏమనుకుంటే నాకేంటి? బాధ నాది. బతుకు నాది. దాన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరమూ నాదే. అవతలివాడు దెబ్బ కొట్టాడు అంటే ఆ తప్పు అతడిది కాదు, కొట్టే అవకాశం ఇచ్చిన మనది అని భావిస్తాను నేను. అందుకే ఇంకా దెబ్బలు తినడం మంచిది కాదని అనుకున్నాను. అతడి నుంచి విడిపోవడమే మేలని నిశ్చయించుకున్నాను.
అప్పుడు వినబడిందే ఆ మాట. నేనే కాపురం చెడగొట్టుకుని ఉంటానని కొందరి సందేహం. ఎవరైనా కావాలని చెడగొట్టుకుంటారా? అయినా ఏం తెలుసని అంత మాట అంటారు! అతడు పెట్టిన హింసను చూడలేదు. అది తాళలేక నేను పెట్టిన కన్నీటి నీ లేదు. కానీ నా జీవితం గురించి నేను నిర్ణయం తీసుకునేసరికి కామెంట్లు చేయడానికి సిద్ధమైపోయారు. చాలా బాధపడ్డాను. కానీ ఏమీ మాట్లాడలేదు. మాట్లాడటం అనవసరం కూడా. ఎందుకంటే... ఎదుటివాడి కష్టాన్ని వాడి స్థానంలో ఉండి చూడగలిగే గొప్ప మనసు ఎవరికోగానీ ఉండదు. ఆ మనసే లేనప్పుడు ఎన్ని చెప్పి ఏం లాభం!
కానీ నన్ను ఆ మాట అన్నవాళ్లందరినీ ఒక్కటే ప్రశ్న అడుగుతాను. నా స్థానంలో మీ కూతురో లేక మీరో ఉండి ఉంటే కూడా ఇలాగే ఆలోచిస్తారా? తప్పు మీ మీదే వేసుకుంటారా?!
- స్వప్న, రావులపాలెం