నాన్న కళ్లలో వెలుగు!
కనువిప్పు
మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. కేవలం మా నాన్న జీతం డబ్బులే మాకు ఆధారం. అందుకే నాన్న ‘‘ఒరేయ్...నేను పెద్ద చదువులు చదువుకోలేదు. దాంతో, ఇలా చిన్న ఉద్యోగమేదో చేస్తూ నానా కష్టాలు పడుతున్నాను. నువ్వు ఇంటికి పెద్ద కొడుకువి. బాగా చదవాలి. పెద్ద చదువులు చదవాలి. నీ చదువు కోసం ఇల్లు కూడా అమ్మేస్తాను’’ అనేవారు తరచుగా.
‘‘అలాగే నాన్న’’ అని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసేవాడిని.
అప్పుడప్పుడూ ఆయన మాటలు నాకు చాదస్తంగా అనిపించేవి కూడా.
నాకు పాలిటెక్నిక్ కాలేజీలో సీటు రావడంతో, ఊరికి దూరం కావాల్సి వచ్చింది.
‘‘నువ్వు తరచుగా ఇంటికి రావద్దు. చదువు దెబ్బతింటుంది. నీకు డబ్బులు అవసరమైతే ఒక్క ఫోన్ చెయ్ చాలు. పంపిస్తాను’’ అన్నారు నాన్న.
మొదట్లో హోమ్‌సిక్‌గా అనిపించినా, కొత్త స్నేహాలు పెరగడంతో అక్కడ అలవాటైపోయింది. ఫ్రెండ్స్‌తో షికార్లు చేయడం ఎక్కువైంది. ఫ్రెండ్స్ ముందు గొప్ప కోసం ‘‘మాకు ఊళ్లో చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. మా నాన్న ఎంతంటే అంత డబ్బు పంపిస్తాడు’’ అని కోతలు కోసేవాడిని. ఫ్రెండ్స్ అందరూ కలిసి నాకు ‘దానకర్ణ’ అనే బిరుదు ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకోవడం కోసం విపరీతంగా ఖర్చు చేసేవాడిని.
ఒకరోజు నాన్న ‘‘ఇన్ని డబ్బులు ఏం చేస్తున్నావురా?!’’ అని అడిగారు కూడా. నేను ఏదో సాకు చెప్పి తప్పించుకున్నాను.
ఒకరోజు...
ఆరోజు మా రూమ్‌లో పార్టీ చేసుకుంటున్నాం. ఇంతలో తలుపు చప్పుడైంది. తీసి చూస్తే... నా గుండె ఆగినంత పనైంది! నాన్న!!!
‘‘ఫరావాలేదురా... బాగా కష్టపడుతు న్నావ్’’ అన్నారు వ్యంగ్యంగా నాన్న. ఆ క్షణంలో నేను చనిపోతే బాగుండునని అనిపించింది. నాతో పాటు పార్టీలో కూర్చున్న ఫ్రెండ్స్‌కు కూడా నాన్న వేడిగా క్లాస్ తీసుకున్నారు.
‘‘నాయనలారా... వీడికి పెళ్లి కావాల్సిన అక్క ఉంది. ఆ అమ్మాయి పెళ్లి గురించి కంటే వీడి చదువు గురించే ఎక్కువ ఆలోచిస్తూ వచ్చాను. మంచిగా బుద్ధి చెప్పాడు’’ అన్నారు నాన్న కన్నీళ్లు తుడుచుకుంటూ. నేను నాన్న కాళ్లు గట్టిగా పట్టుకొని ఏడ్చాను... ఆ కన్నీళ్లతో నా మనసులో ఉన్న చెడు కొట్టుకుపోయేలా!
‘‘నేను మారతాను’’ అని ఆ రోజు చెప్పలేదు. మారి చూపించాను. మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యాను. నాన్న కళ్లలో వెలుగు నింపాను.
- వి.ఆర్, ఖమ్మం