Polytechnic education
-
మా గోడు వినండి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగుల వెతలు మళ్లీ మొదలయ్యాయి. చట్టంలోని నిబంధనలను అమలు చేసి ఉద్యోగులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చట్ట ప్రకారం ఇచి్చన జీవోలను అమలు చేయకుండా తాత్సారం చేస్తోంది. ఫలితంగా ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివిధ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేసే మహాయజ్ఞాన్ని తలపెట్టింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో దశాబ్దాలుగా కాంట్రాక్టు పద్ధతిపై వర్క్‌షాప్ అటెండర్లుగా విధులు నిర్వహిస్తున్న 22 మందిని రెగ్యులర్ చేస్తూ.. ఈ ఏడాది మార్చి 16న జీవో నంబర్–8 జారీ చేసింది. అనంతరం ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో జీవో అమలు తాత్కాలింగా నిలిచిపోయింది. కొత్తగా అధికారంలోకి వచి్చన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల శ్రేయస్సును విస్మరించి న్యాయంగా వారికి దక్కాల్సిన హక్కులను దూరం చేస్తోంది. 50 ఏళ్లు పైబడిన వారే ఎక్కువ ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగుల చట్టంలోని నిబంధనల ప్రకారం వర్క్‌షాప్ అటెండర్లుగా పని చేస్తున్న వారిని గత ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. వీరు ఐటీఐ, డిప్లొమా విద్యార్హతతో దాదాపు 15 ఏళ్లుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో పని చేస్తున్నారు. సుమారు 50 ఏళ్ల వయసులో ప్రభుత్వం తమ సేవలను గుర్తించి క్రమబదీ్ధకరించడంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు. పదవీ వివరణ 62 ఏళ్లు ఉండటంతో.. మిగిలిన పుష్కర కాలం శాశ్వత ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసే అవకాశం దక్కిందనే ఆనందం కాస్తా రెండు నెలల్లోనే ఆందోళనగా మారింది. గత ప్రభుత్వం రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినా సాంకేతిక విద్యాశాఖ మాత్రం వాటిని అమలు చేస్తూ పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకుండా జాప్యం చేయడం కలవరపెడుతోంది. వాస్తవానికి 22 మంది రెగ్యులర్ ఉద్యోగుల పరిధిలోకి వచ్చినప్పటికీ సాంకేతిక కారణాలతో గడచిన మూడు నెలలుగా కాంట్రాక్టులోనే కొనసాగుతున్నారు. అయితే.. సీఎఫ్ఎంఎస్ ఐడీని మాత్రం బ్లాక్ చేశారు. ఫలితంగా జూన్ నెలలో రావాల్సిన జీతాలు సైతం పెండింగ్‌లో పడ్డాయి. జీతాలపై ఆధారపడటంతో కుటుంబాల పోషణ భారంగా మారుతోంది. ఎందుకింత ఆలస్యం? సాంకేతిక విద్యాశాఖలో కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్న వారిలో 22 మంది పార్క్షాపు అంటెండర్లు, ఇద్దరు లెక్చర్లను క్రమబదీ్ధకరిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచి్చంది. ఇద్దరు లెక్చరర్లు నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులర్ అయ్యారంటూ కొంతమంది కోర్టులో సవాల్ చేశారు. అయితే న్యాయస్థానం మాత్రం ఆ ఇద్దరు లెక్చరర్లు తప్ప మిగిలిన వారందరికీ నియామక ఉత్తర్వులు ఇవ్వాలని గతంలోనే ఆదేశించింది. కానీ, సాంకేతిక విద్యాశాఖ అధికారులు మాత్రం కావాలనే జాప్యం చేస్తున్నట్టు వర్క్‌షాపు అటెంటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ పేరుచెప్పి ఒకసారి, కోర్టు కేసుల పేరు చెప్పి మరోసారి తమకు అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు. -
'పాలిటెక్నిక్' లో నవోదయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్య సరికొత్త బ్రాండ్ ఇమేజ్ను సృష్టిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులై.. మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసేలోగా బహుళజాతి సంస్థల్లో లక్షల రూపాయల జీతాలతో ఉద్యోగాలు కల్పిస్తోంది. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో వివిధ కంపెనీల్లో దక్కుతున్న ఉద్యోగాలకు సంబంధించిన ప్లేస్మెంట్లు క్రమేణా పెరుగుతున్నాయి. 2023–24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏకంగా 12 వేల మందికి ఉద్యోగాలు దక్కడం విశేషం.గతేడాది అత్యధిక వార్షిక వేతనం రూ.6.25 లక్షలుగా ఉంటే.. ఈ ఏడాది రూ.8.60 లక్షలకు పెరిగింది. ప్రతి వి ద్యార్థి సగటున రూ.3 లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఒకప్పుడు 2019కి ముందు 400 కూడా దాటని ఉద్యోగ అవకాశాలు.. ఇప్పడు వేల మందికి చేరు వ అవుతున్నాయి.2019–20లో 575 ఉద్యోగాలు, 2020–21లో 652 పోస్టులు, 2021–22లో 780 కొలువులు మాత్రమే వచ్చాయి. 2022–23లో 6వేల మంది క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఎంపికైతే.. ఈ ఏడాది రెట్టింపైంది. ఇంటర్మీడియెట్, ఇంజనీరింగ్ కోర్సులను ఆరేళ్లు చదివి పూర్తి చేసిన తర్వాత అందుకునే వేతనాలను మూడేళ్ల డిప్లొమాతో 18 ఏళ్ల వయసులోనే దక్కించుకోవడం మార్కెట్లో పాలిటెక్నిక్ విద్య డిమాండ్‌కు అద్దం పడుతోంది. ఒకవైపు ఉద్యోగం.. మరోవైపు ఉన్నత చదువులు రాష్ట్రవ్యాప్తంగా 88 ప్రభుత్వ, 179 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 35,533 మంది డిప్లొమా ఫైనలియర్ చదువుతుంటే.. వీరిలో 12వేల మందికి ఉద్యోగాలు దక్కాయి. ఇందులో 50 శాతం ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర పాలిటెక్నిక్ విద్యా చరిత్రలో తొలిసారిగా బహుళజాతి సంస్థ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ రూ.8.60 లక్షల వార్షిక వేతనంతో విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఈ సంస్థ సాధారణంగా జాతీయ స్థాయిలో పేరొందిన ఐఐటీలు, ఎన్ఐటీలు నుంచి బీటెక్ గ్రాడ్యుయేట్లను మాత్రమే తమ సంస్థలో ఉద్యోగాలకు ఎంపిక చేసేది. కానీ.. ఏపీలో నైపుణ్యాలతో కూడిన విద్యను అభ్యసిస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు అరుదైన అవకాశం కల్పించింది.ఇక్కడ అత్యధిక ప్యాకేజీలతో రూ.8.60 వార్షిక వేతనానికి 9 మంది ఎల్రక్టానిక్స్ విద్యార్థులకు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ల్యాబ్ ఇంటర్న్‌లుగా, రూ.8 లక్షల వార్షిక వేతనంతో థాట్వర్క్ల కోసం సాఫ్ట్వేర్ డెవలపర్లుగా 35 మంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాయి. ఈ రెండు సంస్థలతో పాటు మెగా ఇంజనీరింగ్, జీఈ ఏరోస్పేస్, మోస్ చిప్, సుజ్లాన్, అమరరాజా, ఆర్సెలర్ మిట్టల్ అండ్ నిప్పన్ స్టీ ల్, ఎఫ్ట్రానిక్స్, మేధా సర్వో, డాక్టర్ రెడ్డీస్ లే»ొరేటరీస్, షాపూర్జీ పల్లోంజీ, ఆల్ఫా లావాల్, మారుతీ సుజుకి రాయ ల్ ఎన్ఫీల్డ్, వీల్స్ ఇండియా, స్మార్ట్‌డివి టెక్నాలజీస్, నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, హెచ్ఎల్ మాండో ఆనంద్ ఇండియా వంటి ప్రధాన సంస్థల్లో డిప్లొమా విద్యార్థులు కొలువుదీరారు.డిప్లొమా స్థాయిలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులను సైతం ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించేలా సాంకేతిక విద్యాశాఖ కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు రెండేళ్లు అనుభవం గడించిన తర్వాత ఉద్యోగులందరికీ బీటెక్ విద్యను అభ్యసించేలా తోడ్పాటును అందించనున్నాయి. ఇక్కడ ఉన్నత చదువులకయ్యే మొత్తం ఫీజును కూడా కంపెనీలే భరించనున్నాయి. ప్రత్యేక క్యాంపస్ రిక్రూట్మెంట్ శిక్షణసాంకేతిక విద్యాశాఖ విద్యార్థులను మార్కెట్లోకి రెడీ టు వర్క్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కరిక్యులమ్ అమలు చేస్తోంది. అకడమిక్ లెర్నింగ్, ఇండస్ట్రీ అవసరాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి వర్క్‌షాపులను నిర్వహిస్తోంది. పారిశ్రామికవేత్తలు, ఐటీ తదితర కంపెనీల ప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలతో పరిశ్రమ ఆధారిత కోర్సులను ప్రారంభించింది. అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రభుత్వం వర్చువల్ డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేసినందున విద్యార్థులకు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా థియరీ, ప్రాక్టికల్ సబ్జెక్టుల బోధన పకడ్బందీగా అందుబాటులోకి వచ్చింది.పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా సిలబస్‌ను మార్పు చేయడంతో పాటు వాటి బోధనకు వీలుగా సిబ్బంది కోసం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లను అమలు చేయిస్తున్నారు. పారిశ్రామిక శిక్షణ కార్యక్రమాల కోసం విద్యాసంస్థలను పరిశ్రమలతో అనుసంధానిస్తున్నారు. వీటితో పాటు క్యాంపస్ రిక్రూట్మెంట్ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు ఇంటర్వ్యూల్లో చక్కగా రాణించేలా సంసిద్ధం చేసింది. కళాశాల స్థాయి, క్లస్టర్ల వారీగా, కమిషనరేట్ స్థాయి వరకు మల్టీ లెవల్ ప్లేస్మెంట్ డ్రైవ్‌లు చేపట్టింది. తద్వారా మహిళా పాలిటెక్నిక్‌లు, మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్,మైనారిటీ పాలిటెక్నిక్‌ల విద్యార్థులు గణనీయంగా ఉద్యోగాలు పొందారు. పాడేరు, చీపురుపల్లి, శ్రీకాకుళం, అద్దంకి, శ్రీశైలం, చోడవరం వంటి మారుమూల ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విజయం సాధించింది. రూ.8.60 లక్షల వేతనంతో.. మాది అనంతపురం జిల్లా పామిడి గ్రామం. నాన్న డ్రైవర్. అమ్మ గృహిణి. వాళ్లిద్దరూ కష్టపడి చదివించడంతో నేను డిప్లొమాలో ఎలక్ట్రికల్ అండ్ ఎల్రక్టానిక్స్ (ఈఈఈ) పూర్తి చేశాను. చివరి ఏడాది చదువుతుండగానే బెంగళూరులోని టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీలో రూ.8.60 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం వచ్చింది. ఇది మల్టీ నేషనల్ కంపెనీ. నాకు రాయల్ ఎన్ఫీల్డ్లోనూ ఉద్యోగం వచ్చినప్పటికీ చిన్న ప్యాకేజీ కావడంతో చేరలేదు. మా కాలేజీలో చదువుతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను ముందుగానే నేరి్పంచారు. ల్యాబ్స్, కరిక్యులమ్, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో రాణించేలా ఇచ్చిన ప్రత్యేక శిక్షణ మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు కొనసాగించాలని ఉంది. – ఎన్.గౌతమి, ప్రభుత్వ పాలిటెక్నిక్, అనంతపురం‘రెడీ టూ వర్క్’ లక్ష్యంతో.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ విద్యను అందించడంలో ఏపీ విజయం సాధించింది. ఏటా పెరుగుతున్న క్యాంపస్ ఎంపికలే ఇందుకు నిదర్శనం. టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, థాట్వర్స్, మేధా సర్వో, జీఈ ఏరో స్పేస్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు సాంకేతిక విద్యలోని విప్లవాత్మక మార్పులను చూసి ఎంతో ప్రశంసించారు. దేశవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యలో ఇంతటి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కలి్పస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ ఒకటే.మారుతున్న సాంకేతిక, అవసరాలకు తగ్గట్టు బోధన ఉండేలా లెక్చరర్లకు పరిశ్రమల్లో నైపు ణ్య శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులను రెడీటూ వర్క్‌గా తీర్చిదిద్దుతున్నాం. అందుకే రాష్ట్రానికి అంతర్జాతీయ, జాతీయ బహుళజాతి కంపెనీలు వస్తున్నాయి. డిప్లొమాతో ఉద్యోగం పొందిన విద్యార్థులకు ఆయా సంస్థలే ఉన్నత చదువులకు ప్రోత్సహించేలా కంపెనీలు సైతం అంగీకరించాయి. చివరి సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ రిక్రూట్మెంట్పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నాం. అందుకే ప్లేస్మెంట్లు రెట్టింపయ్యాయి. – చదలవాడ నాగరాణి, కమిషనర్, సాంకేతిక విద్యాశాఖ -
మరో 12 పాలిటెక్నిక్ కాలేజీలకు ఎన్బీఏ గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్బీఏ) గుర్తింపు సాధనలో దూసుకెళ్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యనందిస్తూ గణనీయమైన ప్లేస్మెంట్లు నమోదు చేస్తున్నాయి. తాజాగా మరో 12 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు ఎన్బీఏ సర్టిఫికేషన్ దక్కింది. అనంతపురం, శ్రీశైలం, తిరుపతి, పిల్లరిపట్టు, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, జమ్మలమడుగు, కదిరి, నందిగామ, పలమనేరు, కడప మహిళా పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు మదనపల్లె మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీకి కూడా ఎన్బీఏ సర్టిఫికేషన్ దక్కింది. పక్కా ప్రణాళికతో ముందుకు.. రాష్ట్రంలో మొత్తం 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలుండగా.. తొలి దశలో 41 కాలేజీలకు ఎన్బీఏ సర్టిఫికేషన్ సాధించేలా సాంకేతిక విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మొత్తం 31 పాలిటెక్నిక్ కాలేజీల్లోని 60 విభాగాల్లో ఎన్బీఏ సర్టిఫికేషన్‌ను సాధించింది. ఈ విద్యా సంవత్సరం ముగిసేలోగా ఎన్బీఏ బృందం మరిన్ని కాలేజీలను కూడా పరిశీలించనుంది. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్న సాంకేతిక విద్యా శాఖ పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించడంతో పాటు ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌లు, సొంత భవనాల నిర్మాణాలను చేపడుతోంది. వచ్చే ఏడాదికి వీలైనన్ని కాలేజీల్లో హాస్టల్ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేలా ప్రత్యేక దృష్టి సారించింది. పాలిటెక్నిక్ విద్య ద్వారా లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల చేరికలను ప్రోత్సహిస్తోంది. పాలిసెట్ కోసం ఉచితంగా కోచింగ్‌ను కూడా అందుబాటులోకి తెస్తోంది. ఇది సరికొత్త చరిత్ర సీఎం జగన్ ఆదేశాలకు అనుగుణంగా విద్యా ప్రమాణాలను పెంపొందిస్తున్నాం. అందువల్లే ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు అత్యంత ప్రతిష్టాత్మక ఎన్బీఏ సర్టిఫికేషన్ దక్కుతోంది. భవిష్యత్‌లో ప్రతి కాలేజ్‌నూ ఎన్బీఏ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కరిక్యులమ్‌లో మార్పులు తెచ్చాం. ఉద్యోగ అవకాశాలు పెంచేలా 674 పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నాం. గత విద్యా సంవత్సరంలో 7 వేల మంది చదువులు పూర్తి చేసుకుంటే 4 వేల మందికి పైగా ప్లేస్మెంట్లు సాధించారు. పది శాతంగా ఉన్న ప్లేస్మెంట్లను 60 శాతానికి తీసుకువచ్చాం. ఇది సరికొత్త చరిత్ర. – చదలవాడ నాగరాణి కమిషనర్, సాంకేతిక విద్యాశాఖ -
ఏరోస్పేస్ శిక్షణకు 25 మంది డిప్లొమా విద్యార్థుల ఎంపిక
మురళీనగర్ (విశాఖ ఉత్తర): పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చేసిన ప్రతి విద్యార్థికి అత్యున్నత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ చెప్పారు. ఏరోస్పేస్ రంగంలో పారిశ్రామిక శిక్షణకు విద్యార్థుల ఎంపిక ప్రక్రియను ఆయన ఆధ్వర్యంలో విశాఖ కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో శుక్రవారం నిర్వహించారు. ఏరోస్పేస్ రంగంలో విశాఖ అభివృద్ధి చెందుతున్నందున ఇక్కడ నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఎంపిక చేశామన్నారు. గ్లోబల్ ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సహకారంతో మెకానికల్ డిప్లొమా విద్యార్థులకు 6 నెలల పారిశ్రామిక శిక్షణకు గాను రెండో బ్యాచ్ ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో 134 మంది పాల్గొనగా రాత, మౌఖిక పరీక్ష ద్వారా 25 మందిని ఏరోస్పేస్లో శిక్షణకు ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరిలో 12 మంది బాలురు, 13 మంది బాలికలున్నట్లు చెప్పారు. వీరికి అచ్యుతాపురంలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రంలో శిక్షణనిస్తారని, శిక్షణ కాలంలో బోయింగ్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్‌కు నిధులు అందిస్తుందని తెలిపారు. లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సంస్థ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్లో శిక్షణ తీసుకునే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.35,000 కోర్సు ఫీజుతోపాటు నెలకు రూ.3,000 ఉపకార వేతనం చెల్లిస్తుందన్నారు. -
‘ఎన్బీఏ’ గుర్తింపే లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యను ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులు చేయడంతో పాటు మొట్టమొదటిసారి సాంకేతిక విద్యా, శిక్షణ మండలి ద్వారా పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇండస్ట్రీ కనెక్ట్ పేరుతో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ విద్యార్థులకు బోధన సమయంలోనే లభించేలా చర్యలు తీసుకుంది. కోర్సు పూర్తయ్యేలోగా విద్యార్థులకు మెరుగైన కొలువులు లభించేలా సంస్కరణలు తెచ్చిది. అలాగే రాష్ట్రంలో మొత్తం 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలుండగా.. తొలి దశలో 41 కాలేజీలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్బీఏ) గుర్తింపు లభించేలా ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే తొమ్మిది కాలేజీల్లోని 16 ప్రోగ్రామ్‌లకు ఎన్బీఏ గుర్తింపు లభించింది. మిగిలిన 32 కాలేజీలు కూడా ఈ విద్యా సంవత్సరం చివరి నాటికి ఎన్బీఏ గుర్తింపు పొందేందుకు సిద్ధమయ్యాయి. వీటిలోని 5 కాలేజీల్లో అన్ని రకాల తనిఖీలు పూర్తవ్వగా.. ఈనెల చివరి వారంలో మరో 5 కాలేజీల్లో ఎన్బీఏ బృందాల సందర్శనకు షెడ్యూల్ ఖరారైంది. రెండో దశలో భాగంగా వచ్చే విద్యా సంవత్సరంలో మరో 43 కాలేజీలకు ఎన్బీఏ గుర్తింపు లభించేలా సాంకేతిక విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. వృత్తి విద్యా రంగంలో నాణ్యత, కొలువులు సాధించే సామర్థ్యాలను నిర్ధారించే అంతర్జాతీయ ప్రమాణాల అక్రెడిటింగ్ ఏజెన్సీగా భారతదేశంలో ఎన్బీఏ వ్యవహరిస్తోంది. విద్యార్థుల సంఖ్య, అధ్యాపకుల నిష్పత్తి, పీహెచ్డీ స్థాయి అర్హతలు, ఆర్థిక వనరుల వినియోగం, ఐపీఆర్–పేటెంట్లు, స్వీయ మూల్యాంకనం, జవాబుదారీతనం, నిపుణుల తయారీ తదితర అంశాలను ఎన్బీఏ పరిశీలిస్తుంది. వీటన్నింటి ఆధారంగా పాలిటెక్నిక్ కాలేజీలకు గుర్తింపునిస్తుంది. కాగా, ప్రభుత్వం ఇటీవల కొత్తగా 3 పాలిటెక్నిక్ కాలేజీలను ప్రారంభించింది. వీటికి మూడేళ్ల తర్వాతే ఎన్బీఏ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది. ప్రభుత్వ కృషితో పెరిగిన ప్లేస్‌మెంట్స్ మరోవైపు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులకు బోధన సమయంలోనే ఉపాధి లభించేలా వివిధ పరిశ్రమలతో సాంకేతిక విద్యా శాఖ 674 అవగాహన ఒప్పందాలు చేసుకుంది. దీంతో క్యాంపస్ ప్లేస్మెంట్ల సంఖ్య భారీగా పెరిగింది. 2022–23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 7,073 మంది విద్యార్థులు చదువు పూర్తి చేసుకోగా.. వారిలో 4 వేల మందికిపైగా విద్యార్థులు కొలువులు సాధించారు. గతంలో పది శాతానికే పరిమితమైన ప్లేస్‌మెంట్స్.. ఇప్పుడు 59.6 శాతానికి పెరిగాయి. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు గతంలో ఎన్బీఏ గుర్తింపు సాధించడంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు వెనుకబడ్డాయి. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్బీఏకు అనుగుణంగా కాలేజీల్లో ప్రమాణాలు పెంచాలని సాంకేతిక విద్యా శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా శ్రీకాకుళం, విజయవాడ, కుప్పం, అనకాపల్లి, గన్నవరం, కళ్యాణదుర్గం, ఆమదాలవలస, కాకినాడ, గుంటూరు పాలిటెక్నిక్ కాలేజీలకు ఎన్బీఏ గుర్తింపు దక్కింది. ఆయా కాలేజీల్లో పరిసరాల పరిశుభ్రత మొదలు భవనాల మరమ్మతులు, కొత్త నిర్మాణాలు, ప్రయోగశాలల ఆధునికీకరణ, విద్యార్థులకు వసతుల మెరుగు, సిబ్బంది రేషనలైజేషన్ తదితర మార్పులు తీసుకువచ్చాం. తద్వారా ప్రభుత్వ పాలిటెక్నిక్‌లకు ఎన్బీఏ గుర్తింపు లభించేలా చర్యలు తీసుకున్నాం. – చదలవాడ నాగరాణి, కమిషనర్, సాంకేతిక విద్యా శాఖ -
11 నుంచి పాలిటెక్నిక్ ప్రవేశాలకు ఆప్షన్ల ఎంపిక
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి బుధవారం విడుదల చేశారు. విధానపరమైన కారణాలతో వాయిదా పడిన పాలిసెట్ ప్రవేశాల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమయింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు నాలుగు రోజుల్లోగా ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 16వ తేదీ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చన్నారు. 18వ తేదీన సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. 19వ తేదీ నుంచి 23లోగా విద్యార్థులు సీట్లు పొందిన కళాశాలల్లో నేరుగా రిపోర్టు చేయాలన్నారు. 23వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. మొత్తం 88 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 18,141 సీట్లు, 182 ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో 64,933 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. చదవండి: మచిలీపట్నం కలెక్టరేట్లో.. కాబోయే కలెక్టర్-ఎస్పీలు.. సింపుల్‌గా దండలు మార్చేసుకున్నారు -
పాలిటెక్నిక్ విద్యార్థిని బలవన్మరణం
హిందూపురం అర్బన్: స్థానిక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని శ్రావణి (18) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన నరసింహులుకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తూ పిల్లలను చదివించుకుంటున్నాడు. ఈ క్రమంలో పెద్ద కుమార్తె శ్రావణి (18) హిందూపురంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కళాశాల క్యాంపస్‌లోని హాస్టల్లో ఉంటున్న ఆమె మంగళవారం ఉదయం 10.20 గంటలకు స్నానాలగదిలో అపస్మారక స్థితిలో పడి ఉండగా గమనించిన స్నేహితుల నుంచి సమాచారం అందుకున్న ప్రిన్సిపాల్ హరీష్‌బాబు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. క్రిమి సంహారక మందు తాగినట్లుగా వైద్యులు గుర్తించి చికిత్స మొదలు పెట్టారు. పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్ఐ హరూన్‌బాషా కళాశాల వసతి గృహానికి చేరుకుని పరిశీలించారు. క్రిమి సంహారక మందు తాగే ముందు శ్రావణి రాసి పెట్టిన ఓ ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో తన మృతికి కారకులు ఎవరూ కాదని ఆమె పేర్కొంది. క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, తనకు ఆపరేషన్ అంటే భయమని వివరించింది. తల్లిదండ్రులకు తాను భారం కాకూడదనే ఉద్దేశ్యంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
నేడు ఏపీ ఈసెట్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పాలిటెక్నిక్, బీఎస్సీ(గణితం) ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈసెట్–23 పరీక్షను మంగళవారం ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 103 పరీక్షా కేంద్రాలు, హైదరాబాద్‌లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 38,255 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 28,640 మంది బాలురు, 9,615 మంది బాలికలు ఉన్నారు. ఈ పరీక్షను ఆన్లైన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం సెషన్లో అగ్రికల్చరల్, సిరామిక్ టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్, సీఎస్ఈ, కెమికల్, బీఎస్సీ(గణితం) ఈఈఈ విభాగాలకు, మధ్యాహ్నం సెషన్లో ఈసీఈ, ఈఐఈ, మెకానికల్ మెటలర్జికల్, మైనింగ్ ఇంజినీరింగ్, ఫార్మసీ విభాగాల పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 23న ప్రాథమిక కీ విడుదల చేస్తామని, 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, జూలై మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ఈసెట్–2023 చైర్మన్, జేఎన్టీయూకే వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు సోమవారం తెలిపారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు 8500404562 హెల్ప్‌లైన్ నంబరు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. -
పాలిటెక్నిక్‌తో.. కొలువు పక్కా!
విశాఖ విద్య: పదో తరగతి ఉత్తీర్ణత తర్వాత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మార్గం వేసే పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. పదో తరగతి తర్వాత మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు అభ్యసిస్తే చాలు మంచి ఉద్యోగావకాశాలు తలుపు తడుతున్నాయి. అంతేకాకుండా డిప్లొమా పూర్తి చేశాక ఏపీ ఈసెట్ రాసి నేరుగా బీటెక్ సెకండియర్‌లో చేరే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ కోర్సులు చదివేవారికి సత్వర ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2023–24 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 34 వేల మందికి పైగా విద్యార్థులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాష్ట్రంలో 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 17 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో 250కి పైగా కాలేజీలు ఉన్నాయి. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్–2023లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా ఇటీవలే పూర్తయింది. విద్యార్థులు కళాశాలల్లో చేరికకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోరుకున్న కాలేజీలో నచ్చిన బ్రాంచ్ ఎంచుకునేలా సాంకేతిక విద్యాశాఖాధికారులు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 26 జిల్లాల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈ నెల 12 నుంచి సదస్సులు నిర్వహిస్తున్నారు. వీటిని ఈ నెల 24 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. పాలిటెక్నిక్‌తో దండిగా అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు తరలివస్తున్నాయి. పారిశ్రామికీకరణతో భవిష్యత్తులో సాంకేతిక కోర్సులు చేసిన వారికి దండిగా ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. మూడేళ్లలోనే చేతికొచ్చే డిప్లొమా సర్టిఫికెట్తో ఉపాధి లేదా ఉద్యోగం పొందే వీలు ఉండటం.. అలాగే ఏపీ ఈసెట్ రాసి నేరుగా బీటెక్‌లో సెకండియర్‌లో చేరే అవకాశం ఉండటంతో విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల బలోపేతం దిశగా.. పాలిటెక్నిక్ కోర్సులకు డిమాండ్ పెరగడంతో అధికారులు ప్రభుత్వ కాలేజీల్లో నూరు శాతం సీట్లు భర్తీ అయ్యేలా దృష్టి సారించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అర్హులకు ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో ఇస్తుండటంతో గతంలో మూత పడిన కాలేజీలను సైతం ప్రైవేట్ యాజమాన్యాలు మళ్లీ తిరిగి ప్రారంభిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్రమాణాలు లేని కళాశాలల్లో విద్యార్థులు చేరకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అవగాహన సదస్సుల్లో భాగంగా కాలేజీల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న మౌలిక సౌకర్యాలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వంటి అంశాలపై వివరిస్తున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో చదివి.. ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను సైతం సదస్సులకు ఆహ్వానించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన వసతులు.. ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా మంచి అవకాశాలు ఉండటంతో విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన వసతులున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. అవగాహన సదస్సుల ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. – డాక్టర్ ఎన్.చంద్రశేఖర్, అధ్యక్షుడు, ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ టీచర్స్ అసోసియేషన్, విశాఖపట్నం -
పాలిసెట్‌లో మెరిసిన గోదావరి విద్యార్థులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిప్లొమా సాంకేతిక విద్యకు ఉద్దేశించిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్– 2023 (పాలిసెట్)లో గోదావరి జిల్లాల విద్యార్థుల హవా కొనసాగింది. కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 15 మంది 120కి 120 మార్కులు సాధించి ప్రథమ–ర్యాంకర్లుగా నిలిచారు. మొదటి ర్యాంకును కాకినాడ జిల్లాకు చెందిన గోనెళ్ల శ్రీరామ శశాంక్ సాధించాడు. మే 10న నిర్వహించిన పాలిసెట్ ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా సంచాలకులు సి.నాగరాణి శనివారం విజయవాడలో విడుదల చేశారు. పరీక్ష జరిగిన పది రోజుల్లోనే ఫలితాలను వెల్లడించామని ఆమె చెప్పారు. పాలిసెట్‌కు 1,43,625 మంది హాజరయ్యారని, 1,24,021 మంది (86.35 శాతం) విద్యార్థులు అర్హత సాధించారని చెప్పారు. ఉత్తీర్ణుల్లో 74,633 మంది బాలురు (84.74శాతం), 49,388 మంది బాలికలు (88.90శాతం) ఉన్నట్టు వివరించారు. అత్యధికంగా 10,516 మంది విద్యార్థులు విశాఖపట్నం జిల్లా నుంచి అర్హత సాధించారన్నారు. 120 మార్కులకు 30 మార్కులు (25 శాతం) అర్హతగా పరిగణించామన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పరీక్షకు హాజరైన అందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించినట్టు వివరించారు. ప్రవేశ పరీక్షలో ఒకే మార్కులు పొందిన విద్యార్థులకు గణితం మార్కుల ఆధారంగా ర్యాంకులు నిర్ణయించామని, గణితంలోనూ ఒకేలా వస్తే భౌతిక శాస్త్రం మార్కులు, అందులోనూ సమానంగా వస్తే పదో తరగతి మార్కులను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. అక్కడా సమాన మార్కులుంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. ర్యాంకు కార్డులను https://polycetap.nic.in/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 25న వెబ్ కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తామని, 29 నుంచి కౌన్సెలింగ్ ఉంటుందని చెప్పారు. అడ్మిషన్ కోసం విద్యార్థులు వెబ్ అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు 39 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జూలై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. 31 కోర్సుల్లో 77,177 సీట్లు ఈ ఏడాది నుంచి నంద్యాల జిల్లా బేతంచెర్ల, వైఎస్సార్ జిల్లా మైదుకూరు, అనంతపురం జిల్లా గుంతకల్లులో 840 సీట్లతో కొత్తగా మూడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభిస్తున్నామన్నారు. వీటితో కలిపి మొదటి సంవత్సరం విద్యార్థులకు 268 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలల్లో రెండేళ్లు, మూడేళ్లు, మూడున్నరేళ్ల వ్యవధితో కూడిన 31 కోర్సుల్లో 77,177 సీట్లు ఉన్నాయన్నారు. ఈ ఏడాది నుంచి గన్నవరం ప్రభుత్వ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్‌లో రెండు కోర్సులు, కాకినాడ బాలికల కళాశాలలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల కోసం 33 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో కొత్త కరిక్యులమ్‌తో శిక్షణ ఇస్తున్నామన్నారు. 4 వేల మందికి ప్లేస్‌మెంట్స్ ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో చివరి సంవత్సరం చదువుతున్న 4 వేల మందికి పైగా విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లు సాధించినట్టు వివరించారు. వార్షిక వేతనం అత్యధికంగా రూ.6.25 లక్షలు, సరాసరి వేతనం రూ.2.50 లక్షలుగా ఉందని చెప్పారు. 84,117 మంది విద్యార్థులు తొలి విడత జగనన్న విద్యా దీవెన కింద రూ.44.37 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ అందుకున్నారని, 79,768 మంది విద్యార్థులు తొలి విడత జగనన్న వసతి దీవెనగా రూ.57.44 కోట్ల ఆర్థిక సాయాన్ని పొందారని తెలిపారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు కార్యదర్శి కేవీ రమణబాబు, జాయింట్ డైరెక్టర్ వి.పద్మారావు, ప్లేస్మెంట్ సెల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 120 కి120 మార్కులు సాధించిన విద్యార్థులు ♦ గోనెళ్ల శ్రీరామ శశాంక్ (కాకినాడ) ♦ వనపర్తి తేజశ్రీ (తూర్పు గోదావరి) ♦ కొంజర్ల శంకర్ మాణిక్ (తూర్పు గోదావరి) ♦ దువ్వి ఆశిష్ సాయి శ్రీకర్ (తూర్పు గోదావరి) ♦ శీల గౌతమ్ (తూర్పు గోదావరి) ♦ గ్రంధె గీతిక (తూర్పు గోదావరి) ♦ అగ్గాల కృష్ణ సాహితి (తూర్పు గోదావరి) ♦ ఉరింకాల జితు కౌముది (తూర్పు గోదావరి) ♦ పాల గేయ శ్రీ సాయి హర్షిత్ (తూర్పు గోదావరి) ♦ కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ (తూర్పు గోదావరి) ♦ కొడవటి మోహిత్ శ్రీరామ్ (పశ్చిమ గోదావరి) ♦ దొంగ శ్రీ వెంకట శర్వణ్ (పశ్చిమ గోదావరి) ♦ కానూరి భాను ప్రకాష్ (పశ్చిమ గోదావరి) ♦ దుద్దుపూడి రూపిక (తూర్పు గోదావరి) ♦ కప్పల వెంకటరామ వినేష్ (తూర్పు గోదావరి) -
AP POLYCET 2023 Exam: నేడు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పాలిసెట్–2023 పరీక్ష బుధవారం (నేడు) జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 61 పట్టణాల్లో 499 కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఉదయం 10 గంటల్లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష రాసే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. పాలిసెట్‌కు మొత్తం 1,59,144 మంది దరఖాస్తు చేశారని వివరించారు. వీరిలో 96,429 మంది బాలురు, 62,715 మంది బాలికలు ఉన్నారన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 21 వేల దరఖాస్తులు పెరిగాయని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక అవగాహన కార్యక్రమాలతో 26,698 మంది ఎస్సీ, 9113 మంది ఎస్టీ అభ్యర్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఉచితంగా కోచింగ్ అందించాం.. పాలిటెక్నిక్ విద్యతో ప్రయోజనాలు, ఉపాధి అవకాశాల గురించి ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌ల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ద్వారా పదో తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించినట్టు నాగరాణి తెలిపారు. రాష్ట్రంలో 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 9 వేల మంది విద్యార్థులకు పాలిసెట్‌కు ఉచితంగా కోచింగ్ అందించి స్టడీ మెటీరియల్ పంపిణీ చేశామన్నారు. ఈ ఏడాది కొత్తగా మరో మూడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో తరగతులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 87 ప్రభుత్వ, 171 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 29 బ్రాంచ్‌ల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సులు అందిస్తున్నామన్నారు. కాగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థులు ఈ ఏడాది నాలుగు వేలకు పైగా ప్లేస్మెంట్లు సాధించారని వెల్లడించారు. -
పాలిటెక్నిక్ కోర్సులకు ‘కొత్త’ ఊపు
విశాఖ విద్య: ఒకప్పుడు పాలిటెక్నిక్ అడ్మిషన్లకు తీవ్రమైన పోటీ ఉండేది. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారికి కొలువు గ్యారెంటీగా దక్కేది. ఈ మూడేళ్ల కోర్సు అనంతరం ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలోకి నేరుగా ప్రవేశం పొందొచ్చు. అయితే, గత పాలకుల నిర్లక్ష్యంతో పాలిటెక్నిక్ కాలేజీలు క్రమంగా నిర్వీర్యమైపోయాయి. ఇప్పుడు మళ్లీ వీటికి కొత్త ఊపు తీసుకొచ్చేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టిసారించింది. జీఐఎస్ ఒప్పందాలతో నయా జోష్ విశాఖపట్నం వేదికగా ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 (జీఐఎస్)లో ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. దీంతో 6 లక్షల మందికి పైగా నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. పెద్దఎత్తున నెలకొల్పే పరిశ్రమలకు మానవ వనరుల అవసరం దృష్ట్యా, మూడేళ్ల కాల వ్యవధి గల పాలిటెక్నిక్ కోర్సులపై అందరి దృష్టి పడింది. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిం చేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. కొత్త కోర్సులకు రూపకల్పన ఎనర్జీ, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఖనిజ, పెట్రో కెమికల్స్, ఫార్మాస్యూటికల్ వంటి రంగాల్లో పెద్దఎత్తున పరిశ్రమలు నెలకొల్పేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలో వీటి విస్తరణకు అనువైన పరిస్థితులు ఉండటమే ఇందుకు కారణం. ఆయా రంగాలకు అవసరమైన నిపుణులైన యువతను అందించేందుకు వీలుగా పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త కోర్సులను ప్రారంభించాలని సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. తొలిదశలో నాలుగుచోట్ల ఈ నేపథ్యంలో.. తిరుపతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రస్తుతం నిర్వహిస్తున్న కెమికల్ సుగర్ టెక్నాలజీ స్థానంలో ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఇండస్టీ ఇంటిగ్రేటెడ్), సత్యవేడులో మెకానికల్ ఇంజనీరింగ్ స్థానంలో మెకానికల్ రిఫ్రిజరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్, గన్నవరంలో కొత్తగా కంప్యూటర్ సైన్సు, గుంటూరులో గార్మెంట్ టెక్నాలజీ స్థానంలో డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు అనుమతిచ్చారు. 2023–24 విద్యా సంవత్సరం నుంచే వీటిలో ప్రవేశాలు కల్పించేలా చర్యలు చేపట్టారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఆయా ప్రాంతాల అవసరాల మేరకు సరికొత్త కోర్సుల రూపకల్పన చేసేలా సాంకేతిక విద్యాశాఖ ముందుకెళ్తోంది. 84 కాలేజీలు.. 17వేల సీట్లు.. 28 రకాల కోర్సులు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 84 కాలేజీలు నిర్వహిస్తుండగా, వీటి పరిధిలో 17వేల వరకు సీట్లున్నాయి. వీటిలో సివిల్, మెకానికల్, ఎల్రక్టానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మైనింగ్, కెమికల్, బయోమెడికల్, మెటలర్జి, 3డి యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్, పెట్రోలియం, టెక్స్టైల్ వంటి 28 రకాల కోర్సులను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాలిటెక్నిక్ కాలేజీల బలోపేతంపై సాంకేతిక విద్యాశాఖ కార్యాచరణలోకి దిగింది. కొత్త కోర్సులు అవసరం ప్రభుత్వం మంచి ఆలోచన చేస్తోంది. పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సుల ఆవశ్యకత ఉంది. ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. భవిష్యత్తులో ఈ రంగంలో నిపుణులు అవసరం. క్యాడ్ కామ్, పవర్ సిస్టమ్, ఎల్రక్టానిక్స్ కమ్యూనికేషన్ వంటి కోర్సులు తీసుకొస్తే ఎంతో మేలు. – డాక్టర్ ఎన్. చంద్రశేఖర్, ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐఎఫ్‌పీటీఓ) అధ్యక్షులు పాలిటెక్నిక్ కాలేజీలకు మంచిరోజులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో నైపుణ్యంతో కూడిన శిక్షణ అందించేలా సకల సౌకర్యాలున్నాయి. కొత్త కోర్సులకు సాంకేతిక విద్యాశాఖ అనుమతులిస్తోంది. పాలిటెక్నిక్ కాలేజీలకు మంచి రోజులొస్తున్నాయి. ఈసారి అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది. – జీవీవీ సత్యనారాయణమూర్తి, పాలీసెట్ కనీ్వనర్, ఉమ్మడి విశాఖ జిల్లా క్యాంపస్ కొలువు కొట్టా మాది విశాఖ నగరంలోని తాటిచెట్లపాలెం. తండ్రి గోదాములో కలాసీగా పనిచేస్తున్నారు. అమ్మ ఇంటిదగ్గర మిషన్ కుడుతుంది. సత్వర ఉపాధి కోసమని పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్ కోర్సు ఎంచుకున్నాను. క్యాంపస్ సెలక్షన్స్‌లో టాటా ప్రాజెక్టులో ఏడాదికి రూ.3.25 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించా. – ఈతకోట సియోన్, విశాఖపట్నం -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: యువతకు మంచి భవిష్యత్‌ను అందించాలనే ఆలోచనలను ఆచరణలో పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.100 కోట్లతో 3 పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గౌర్ సోమవారం గెజిట్ విడుదల చేశారు. ఈ వివరాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల, అనంతపురం జిల్లా గుంతకల్, వైఎస్సార్ జిల్లా మైదుకూరుల్లో పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ కాలేజీలు అందుబాటులోకి వస్తే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్, మెటలర్జికల్ విభాగాల్లో డిప్లొమా కోర్సుల కోసం సుదూర ప్రాంతాలు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ యువతకు మరింత వెసులుబాటు ఉంటుందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ మరింత మెరుగుపడి విద్య పూర్తవగానే ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని తెలిపారు. మంజూరైన 3 పాలిటెక్నిక్ కాలేజీల్లో ఒకదాన్ని రూ.30 కోట్లతో తన నియోజకవర్గం డోన్ పరిధిలోని బేతంచెర్లలో ఏర్పాటు చేస్తుండటం పట్ల సీఎం వైఎస్ జగన్‌కు బుగ్గన రాజేంద్రనాథ్ కృతజ్ఞతలు తెలియజేశారు. 3 కాలేజీలను వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికే కేటాయించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. చదవండి: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ -
25, 26 తేదీల్లో పాలిటెక్నిక్ విద్యార్థులకు జాబ్‌మేళా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం ఈ నెల 25, 26 తేదీల్లో విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్ సెంటర్లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు రవాణా సేవలను అందిస్తున్న మేధా సర్వో డ్రైవ్స్ సంస్థలో రూ.3లక్షల వార్షిక ప్యాకేజీతో వంద మందిని ఇంజనీరింగ్ ట్రైనీలుగా తీసుకునేందుకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్‌లలో 2022 సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా వాక్ ఇన్ ఇంటర్వూ్యలకు హాజరుకావొచ్చని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 9346207421, 6309953362 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు డిప్లమో విద్యార్థులకు తక్షణ ఉపాధి అవకాశాలు కల్పించేలా సాంకేతిక విద్యాశాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే గత డిసెంబరులో రూ.3 లక్షల ప్యాకేజీతో మేధా సర్వో డ్రైవ్స్ 31 మందికి పారిశ్రామిక శిక్షణతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించిందని నాగరాణి పేర్కొన్నారు. -
కొత్త విధానం.. ఇక పరీక్షల్లో చూసి రాయడమే.. ఎలాంటి అనుమానలొద్దు!
సాక్షి, హైదరాబాద్: ఏడాదిపాటు పుస్తకాలు తిరగేయడం... ముఖ్యమైనవి బట్టీపట్టడం... ఆఖరులో పునశ్చరణతో హడావుడి చేయడం.. ఇదీ ఇప్పటివరకూ అందరికీ తెలిసిన పరీక్ష విధానం. ఇందులో పరీక్ష హాల్లోకి చిన్న చిట్టీని కూడా అనుమతించరు. కానీ, ఈ సంప్రదాయ విధానానికి భిన్నంగా రాష్ట్ర సాంకేతిక విద్యామండలి పరీక్షలు నిర్వహించింది. పుస్తకాలు చూసి మరీ పరీక్షలు రాసేందుకు అనుమతించింది. గత నవంబర్‌లో జరిగిన పాలిటెక్నిక్ పరీక్షలో ఈ సరికొత్త పద్ధతిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అప్లైడ్ ఇంజనీరింగ్ మేథమెటిక్స్ పేపర్లో అకడమిక్ పుస్తకాన్ని చూసి పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. ఇందులో 59 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పుస్తకాలు చూడకుండా 2021 ఫిబ్రవరిలో నిర్వహించిన ఇదే సబ్జెక్టు పరీక్షలో కేవలం 35 శాతం మాత్రమే ఉత్తీర్ణత వచ్చింది. ఇక నుంచీ ఇదే తరహా పరీక్ష విధానాన్ని మరికొన్ని సబ్జెక్టులకు విస్తరించాలనే యోచనలో అధికారులున్నారు. కాపీ కొట్టడం కాదు.. క్రియేటివిటీ పెంచడం చూచి రాస్తే మార్కులు రావా? రిజల్ట్ పెరిగితే గొప్పా? ఇలాంటి అనుమానులొస్తే పొరపాటే అంటున్నారు అధికారులు. ఇంతకాలం బట్టీ పట్టే పద్ధతిని దూరం చేసి, విద్యార్థుల ఆలోచనాశక్తిని పెంచడమే దీని ఉద్దేశమని చెబుతున్నారు. పరీక్షకు మండలి సూచించిన అకడమిక్ పుస్తకాల్లో రెండింటిని మాత్రమే అనుమతిస్తారు. పరీక్షలో ప్రశ్నలు అడగడంలోనే అసలు కిటుకు ఉంటుంది. ప్రశ్నలను నేరుగా కాకుండా, పరోక్ష విధానంలో అడుగుతారు. క్వశ్చన్ బ్యాంక్‌లో ఉన్నట్టు సమాధానాలు ఈ అకడమిక్ పుస్తకాల్లో నేరుగా దొరకవు. ఉదాహరణకు త్రికోణమితిని పాఠ్యాంశంలో పొందుపరిస్తే.. పరీక్షలో వచ్చే ప్రశ్న ఇదే మూస పద్ధతిలో ఉండదు. ఆ లెక్కను పూర్తిగా సాధన చేస్తే... సూత్రాల ప్రకారం అనుసరిస్తేనే సమాధానం దొరుకుతుంది. ఒక రకంగా ఇది విద్యార్థి మరింత ఆలోచించి సమాధానం ఇవ్వగలిగేలా ప్రోత్సహిస్తుందని నిపుణులు అంటున్నారు. చాప్టర్ మొత్తం చదవడమే కాకుండా, ఏ కోణంలోనైనా సమాధానం రాయగల నేర్పును ముందు నుంచే విద్యార్థి అలవర్చుకోవాలి. అప్పుడే ఓపెన్ బుక్ విధానంలో సమాధానం రాసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గతంలో బట్టీ విధానంలో ట్విస్ట్ చేసి ప్రశ్న ఇస్తే ఆన్సర్ ఇచ్చే ఆలోచన దిశగా విద్యార్థి వెళ్లలేదని ఫలితాలను బట్టి తెలుస్తోందని అధికారులు అంటున్నారు. ఓపెన్ బుక్ విధానంపై ముందే అవగాహన కల్పించడం వల్ల వివిధ కోణాల్లో ఆలోచనాశక్తిని పెంచుకున్నారని చెబుతున్నారు. పరీక్షల నాణ్యత పెరుగుతుంది విద్యార్థి పట్టాతో బయటకు రావడం కన్నా... మంచి నైపుణ్యం, ఆలోచనాశక్తితో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి తరం మార్కెట్లో మంచి కేరీర్‌కు ఇదే దోహదపడుతుంది. ఓపెన్ బుక్ విధానంతో విద్యార్థి నైపుణ్యాన్ని కొలవడానికి వీలుంటుంది. ఈ దిశగానే కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చాం. –డాక్టర్ సి.శ్రీనాథ్, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ఆలోచనకు పదును క్లోజ్డ్ బుక్ విధానానికి, ఓపెన్ బుక్ విధానానికి చాలా తేడా ఉంది. పుస్తకం దగ్గరున్నా, ప్రశ్నలకు జవాబులు వెతుక్కోవడానికి చాప్టర్ మొత్తం చదవాల్సి వచ్చింది. దీనిపై ముందే అవగాహన కల్పించడంతో సబ్జెక్ట్‌పై కమాండ్ తెచ్చుకున్నాం. బట్టీ పద్ధతి కాకుండా, మరింత ఆలోచించి సమాధానాలు రాశాం. మున్ముందు పోటీ పరీక్షల్లోనూ సులువుగా జవాబులు రాయొచ్చనే విశ్వాసం పెరిగింది. – ఎన్.ప్రవీణ్ కుమార్, పాలిటెక్నిక్ విద్యార్థి, హైదరాబాద్ -
పాలిటెక్నిక్ చేసినా.. ఇంటర్లో చేరొచ్చు
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కోర్సు మొత్తం పూర్తి చేస్తే... ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో చేరే వీలుంది. కానీ ఇక మీదట పాలిటెక్నిక్ ఏడాది పూర్తి చేసినా.. రెండో సంవత్సరం ఇంటర్లో చేరే అవకాశం రాబోతోంది. ఇందుకు సంబంధించిన మార్పులకు సాంకేతిక విద్యా మండలి శ్రీకారం చుట్టనుంది. ఇంజనీరింగ్‌లో ఈ విధానం ఈ ఏడాది నుంచే అమలులోకి తీసుకొచ్చారు. ఇంజనీరింగ్ రెండేళ్ళు పూర్తి చేసిన విద్యార్థులకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనే డిగ్రీ ఇవ్వాలనే విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరహా ఎగ్జిట్ విధానాన్ని ఇక మీదట పాలిటెక్నిక్‌కు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పాలిటెక్నిక్ లోనూ మధ్యలో మానేసిన వారికి క్రెడిట్స్ విధానంతో కూడిన డిగ్రీని ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. సాంకేతిక విద్యా మండలి ఈ దిశగా పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సమయం వృథా కాకుండా... ‘క్రెడిట్ ’ టెన్త్ తర్వాత చాలామంది విద్యార్థులు పాలి టెక్నిక్‌ను ఎంచుకుంటారు. గత కొన్నేళ్ళుగా పాలి టెక్నిక్ కాలేజీల్లో సరైన సదుపాయాలు లేకపోవ డం, ప్రైవేటు కాలేజీలు ఫ్యాకల్టీకి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల సదరు కోర్సులో ఉత్తీర్ణత పెద్దగా ఉండటం లేదు. చాలా మంది వివిధ సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతున్నారు. ఎన్ని సార్లు పరీక్షలు రాసినా ఉత్తీర్ణులు కాలేకపోతు న్నారు. ఈ కారణంగా మధ్యలోనే విద్యను మానే స్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. దీన్ని నివారించేందుకు క్రెడిట్ విధానం తీసుకొస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. చదివినంత వరకైనా కొన్ని క్రెడిట్స్‌ను నిర్ధారిస్తూ డిగ్రీ ఇస్తే ఉపయోగంగా ఉంటుందనే ఆలోచనకు వచ్చారు. ఇంటర్లో చేరే అవకాశం.. పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం పూర్తి చేసి, ఆ తర్వాత ఆపివేస్తే ఇంటర్ ఫస్టియర్‌కు సమానమైన సర్టిఫికెట్ ఇవ్వాలని సాంకేతిక విద్యామండలి ప్రతిపాదించింది. అంటే ఫస్టియర్ పాలిటెక్నిక్, ఇంటర్ మొదటి సంవత్సరానికి సమానమైందని ధ్రువీకరించనున్నారు. దీంతో ఆ విద్యార్థి ఇంటర్ సెకెండియర్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మూడేళ్ల పాలిటెక్నిక్‌లో రెండేళ్ళు పూర్తి చేసి, ఆ తర్వాత మానేసినా, మూడేళ్ళు చదివి, మూడో ఏట ఫెయిల్ అయినా, ఆ విద్యార్థి క్రెడిట్స్‌ను 90 సాధిస్తే సర్టిఫికెట్ ఇన్ ఇంజనీరింగ్ ఇస్తారు. వీళ్లు బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో చేరేందుకు అవకాశం లభిస్తుంది. పాలిటెక్నిక్ మూడేళ్ళ కోర్సుకు 150 క్రెడిట్స్‌ను నిర్థారిస్తున్నారు. ఇందులో 130 క్రెడిట్స్ వస్తే పాలిటెక్నిక్ పూర్తి చేసినట్టు లెక్క. వీరికి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అని సర్టిఫికెట్ ఇస్తారు. ఏదేమైనా మూడేళ్ళు చది వితే తప్ప పాలిటెక్నిక్ చదువు సార్థకత అవుతుందనే విధానం ఇక మీదట తెరమరుగు కానుంది. -
పాలిటెక్నిక్ విద్యార్థుల ముంగిటకే ఉద్యోగావకాశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా విద్యలో సమూల మార్పుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపడుతోంది. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసే విద్యార్థులకు ఉపాధి మెరుగుపడేలా, వారి ముంగిటకే ఉద్యోగావకాశాలు వచ్చేలా నూతన ప్రణాళికలను అమల్లోకి తెస్తోంది. ప్రస్తుతం ఉన్న సిలబస్‌లో సమూల సంస్కరణలు చేస్తోంది. అలాగే కొత్తగా పలు పరిశ్రమ ఆధారిత కోర్సులను ప్రవేశపెడుతోంది. ఈ కోర్సుల బోధనకు వీలుగా అధ్యాపకులకు సైతం ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. రాష్ట్రంలో 84 ప్రభుత్వ, 165 ప్రైవేట్, 1 ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. వీటిలో 25 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులను కొత్త అంశాలతో సాంకేతిక విద్యాశాఖ అభివృద్ధి చేస్తోంది. కంపెనీల సూచన మేరకు పరిశ్రమ ఆధారిత కోర్సులను కూడా ప్రారంభిస్తోంది. ఎక్కువమంది విద్యార్థులు జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ వంటి కోర్సులకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. మరోవైపు ఆఫీస్ ఆటోమేషన్, ఫైర్ సేఫ్టీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ, బ్యూటిఫికేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఏసీ మెషిన్స్, ఫుట్‌వేర్ టెక్నాలజీ తదితర అంశాల్లో 6 నుంచి 18 నెలల కాలవ్యవధితో సర్టిఫికెట్ కోర్సులకు కూడా సాంకేతిక విద్యా శాఖ శ్రీకారం చుట్టింది. ఉపాధి లభించే కోర్సులకు పెద్దపీట.. పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాలిటెక్నిక్‌ల్లో ప్రభుత్వం కోర్సులను ప్రవేశపెడుతోంది. ఉపాధి అవకాశాలు ఉన్న సిరామిక్స్ టెక్నాలజీ, టెక్స్టైల్స్ టెక్నాలజీ, మెటలర్జీ వంటి కోర్సుల్లో ఎక్కువమంది చేరుతుండడంతో వాటిలోనూ సీట్లు పెరిగాయి. అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రభుత్వం వర్చువల్ డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేసింది. అలాగే పారిశ్రామిక శిక్షణా కార్యక్రమాల కోసం విద్యాసంస్థలను పరిశ్రమలతో అనుసంధానిస్తున్నారు. అధ్యాపకులను కూడా దశలవారీగా గంగవరం పోర్టు, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు ప్రాంతాలకు, పరిశ్రమలకు శిక్షణ కోసం పంపుతున్నారు. విద్యార్థులకు స్టైఫండ్‌తో ఇంటర్న్‌షిప్.. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఆయా పరిశ్రమల్లో స్టైఫండ్‌తో కూడిన శిక్షణ అందించడానికి చర్యలు చేపట్టారు. పాలిటెక్నిక్‌ల్లో మూడున్నరేళ్లు, మూడేళ్ల డిప్లొమా కోర్సులు ఉన్నాయి. మూడేళ్ల కోర్సు విద్యార్థులకు ఆరు నెలలు, ఇతర విద్యార్థులకు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల ద్వారా 11,604 మంది, ప్రైవేట్ పాలిటెక్నిక్‌ల ద్వారా 24,669 మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్ పొందుతున్నారు. దీనికోసం సాంకేతిక విద్యాశాఖ 566 పరిశ్రమలు, ఇతర సంస్థలతో చర్చించి ఏర్పాట్లు చేసింది. ఇంటర్న్‌షిప్‌లో విద్యార్థులకు పరిశ్రమలు నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు స్టైఫండ్ అందిస్తున్నాయి. విద్యార్థులకు నైపుణ్యాల పెంపు ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినవారితోపాటు డిప్లొమా విద్యార్థుల వైపు కూడా కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. అందుకనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఫలితంగా 90 శాతం మంది విద్యార్థులు ఉద్యోగావకాశాలు దక్కించుకుంటున్నారు. డిప్లొమా విద్యార్థులకు ప్లేస్మెంట్లను పెంచేందుకు సాంకేతిక విద్యాశాఖ పరిశ్రమలతో ఎప్పటికప్పుడు చర్చిస్తోంది. కియా, అపాచీ, ఎఫ్ట్రానిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), శ్రీసిటీతో సహా కొన్ని కంపెనీలకు వెళ్లి సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సి.నాగరాణి చర్చలు జరిపారు. ప్రతి కాలేజీలో ప్లేస్మెంట్ సెల్‌లను ఏర్పాటు చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా విద్యార్థులందరికీ ఉద్యోగావకాశాలను కల్పించడానికి క్లస్టర్ ఆధారిత ప్లేస్మెంట్ మోడల్‌ను అమలు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు వివిధ ప్రాంతాల్లో క్యాంపస్ డ్రైవ్‌లు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. నైపుణ్యాల పెంపునకు పలు సంస్థలతో ఒప్పందాలు పరిశ్రమ అవసరాలకనుగుణంగా విద్యార్థులను తయారు చేసేందుకు సిస్కో, ఏడబ్ల్యూఎస్, రెడ్–హేట్, పాలో–ఆల్టో, బ్లూప్రిజమ్ మాక్రోచిప్ వంటి ప్రముఖ సంస్థలతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారు. విద్యార్థులు తమ కోర్సులతోపాటు ఇతర ఆన్లైన్ కోర్సులను నేర్చుకోవడానికి వీలుగా ‘స్పోకెన్ ట్యుటోరియల్’ కోసం ఐఐటీ–బాంబేతో ఎంవోయూ చేసుకున్నారు. 17 స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేయగా మరో 17 హబ్‌లను సిద్ధం చేస్తున్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో కంప్యూటర్లు, ఇతర ల్యాబ్ పరికరాలను ఆధునికీకరిస్తున్నారు. వీటితో పాటు కాలేజీలకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు వచ్చేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కళ్యాణదుర్గం, కుప్పంలోని కాలేజీలకు ఈ గుర్తింపు ఉండగా మరో 49 కాలేజీలకు అక్రిడిటేషన్ వచ్చేలా చర్యలు చేపడుతున్నారు. పాలిటెక్నిక్ల్లోనూ నాడు–నేడు పాలిటెక్నిక్‌లను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కావాల్సిన మేర నిధులను కేటాయిస్తోంది. నాబార్డ్–ఆర్ఐడీఎఫ్ ఆధ్వర్యంలో 70 సివిల్ పనులకు రూ.365.46 కోట్లు మంజూరు కాగా రూ.218.66 కోట్లతో 49 పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు మరో 15 సివిల్ పనులకు రూ.82.84 కోట్లకు రాష్ట్ర ప్రణాళిక గ్రాంట్లు మంజూరయ్యాయి. ఇవి కాకుండా 16 ఎస్సీ హాస్టళ్లు, 27 మహిళా హాస్టళ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. నాడు–నేడు కింద పాలిటెక్నిక్‌లను కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. రూ.10 లక్షల ప్రైజ్‌మనీతో ఇటీవల డిప్లొమా విద్యార్థుల కోసం పాలీ టెక్‌ఫెస్ట్–2022ని కూడా నిర్వహించాం. ప్రాంతీయ స్థాయిలో 1,081 ప్రాజెక్టులు ప్రదర్శించగా.. రాష్ట్ర స్థాయికి 253 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఫెస్ట్‌లో వచ్చిన ఆలోచనలను ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సహకారంతో అభివృద్ధి చేస్తాం. పేటెంట్లు పొందడానికి దరఖాస్తులు కూడా పంపనున్నాం. – చదలవాడ నాగరాణి, కమిషనర్, సాంకేతిక విద్యా శాఖ -
రైతుల గోస తీరేలా..!
రాయదుర్గం (హైదరాబాద్): వారు వ్యవసాయ కుటుంబాలకు చెందిన విద్యార్థినులు.. ఆరుగాలం పండించిన పంట వానలకు తడిసిపోతూ తల్లిదండ్రులు బాధపడుతుంటే చూడలేకపోయారు. ఆ కష్టాలను తీర్చడంపై దృష్టిపెట్టారు. ఓ మెంటార్ సాయంతో ‘రైతన్న కిట్’ను రూపొందించారు. మూడు వేల ఖర్చుతో మళ్లీ వాడుకునే ప్రత్యేక టార్పాలిన్ బ్యాగ్‌తో కూడిన ఈ కిట్‌కు టీహబ్‌లో నిర్వహించిన ‘యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్’పోటీలో మొదటిస్థానం దక్కడం గమనార్హం. నెల రోజులు కష్టపడి.. వరంగల్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో వి.లహరిక, జి.చందన, ఎన్.శ్వేత ముగ్గురు ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వ్యవసాయ కుటుంబాలకు చెందిన వీరు.. ఏటా తమ తల్లిదండ్రులు పండించిన ధాన్యం వానకు తడవడం, ఎండబెట్టేందుకు వారుపడే పాట్లు, తడిసిన ధాన్యానికి తక్కువ ధరతో ఇబ్బందిపడటం కళ్లారా చూశారు. దీంతో ఈ సమస్యపై దృష్టిసారించారు. ఇదే సమయంలో వారికి ‘యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్’కార్యక్రమం అందివచ్చింది. ఈ కార్యక్రమం కింద తమ కు మెంటార్‌గా వచ్చిన మెట్టు రాజారెడ్డికి విద్యార్థినులు తమ ఆలోచనను వివరించారు. సమస్యను గమనించి.. వానలు వచ్చినప్పుడు రైతులు టార్పాలిన్లను కప్పుతుంటారు. వాటి నుంచి నీళ్లు లీకై ధాన్యం తడుస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేలా విద్యార్థినులు ఒక కిట్‌ను రూపొందించారు. దానికి కేసీఆర్ కిట్ స్ఫూర్తితో ‘రైతన్న కిట్’అని పేరుపెట్టారు. పరిష్కారాలన్నీ కలిపి చేర్చి.. విద్యార్థినులు నలుపు రంగులో ఉండే నాణ్యమైన రెండు టార్పాలిన్లను తీసుకున్నారు. వాటికి మధ్య లో జిప్‌ను ఏర్పాటు చేసి.. అది పెడితే ప్రత్యేకమైన బ్యాగ్‌లా మార్చేలా తీర్చిదిద్దారు. జిప్ వద్ద నీళ్లు పోకుండా అంటించేందుకు, ఒకవేళ చిరిగినా, రంధ్రం పడినా అంటించేందుకు టేపు, గ్లౌజులు, ఎలుకలు కొట్టకుండా ర్యాట్ స్ప్రే, టార్పాలిన్ దెబ్బతినకుండా పారలకు పెట్టేందుకు రబ్బర్ స్ట్రిప్‌లు, అత్యవసర ప్రాథమిక చికిత్స కిట్‌ను ఏర్పాటుచేశారు. వీటన్నింటినీ కలిపి ఒక కిట్లా సిద్ధం చేశా రు. అంతా సిద్ధం చేసి పరిశీలించేందుకు విద్యార్థినులకు నెల రోజులు సమయం పట్టింది. ఒక్కో కిట్‌లో 20 క్వింటాళ్ల ధాన్యం బస్తాలను నిల్వ చేయవచ్చు. జిప్ తీసి పరిస్తే విశాలమైన స్థలంలో ధాన్యాన్నిగానీ, ఇతర ఉత్పత్తులను గానీ ఎండబెట్టొచ్చు. ►గాలి ఆడేందుకు టార్పాలిన్ బ్యాగ్‌కు ఒకచోట చిన్నపాటి రంధ్రం చేసి మెష్‌ను అమర్చారు. టార్పాలిన్కు ర్యాట్ స్ప్రే చేస్తే 6 నెలల వరకు కూడా ఎలుకలు కొట్టకుండా ఉంటాయి. ►నల్లని టార్పాలిన్ వేడిని గ్రహించి ధాన్యంలోని తేమశాతం తగ్గేందుకు తోడ్పడుతుందని విద్యార్థినులు చెబుతున్నారు. వారి ఆలోచన నన్ను కదిలించింది రైతులైన తమ తల్లిదండ్రుల బాధ తీర్చాలన్న విద్యార్థినుల ఆలోచన నన్ను కదిలించింది. దీనిపై పరిశీలన జరిపి ‘రైతన్న కిట్’ను తయారు చేశాం. టీహబ్‌లో ప్రదర్శించగా మొదటి స్థానం, రూ.1.50 లక్షల నగదు బహుమతి వచ్చింది. ఒక కిట్ తయారీకి రూ.3,100 ఖర్చవుతుంది. ప్రభుత్వం సహకారం అందిస్తే రైతులకు మేలు జరుగుతుంది. – మెట్టు రాజారెడ్డి, రైతన్న కిట్ మెంటార్ ఉచితంగా ఇస్తే మేలు.. రైతులందరికీ మేలు జరిగేలా కిట్‌ను రూపొందించాం. దీని రూపకల్పనలో మెంటార్ రాజారెడ్డి సహకారం మరవలేనిది. మా ఉత్పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా ఇస్తే ఎంతో మేలు జరుగుతుంది. – ‘రైతన్న కిట్’రూపకర్తలు చందన, శ్వేత, లహరిక -
పాలిటెక్నిక్ కాలేజీల్లో 72.5% సీట్లు భర్తీ
సాక్షి, హైదరాబాద్: టెన్త్ తర్వాత డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన పాలిసెట్–2022 కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 118 పాలిటెక్నిక్ కాలేజీల్లోని దాదాపు 25 బ్రాంచీల్లో 28,562 సీట్ల భర్తీకి చేపట్టిన కౌన్సెలింగ్‌లో 20,709 సీట్లు (72.51%) నిండాయని సెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. 21 ప్రభుత్వ కాలేజీలు, 3 ప్రైవేటు కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 10 నాటికి లాగిన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీటును నిర్ధారించుకొని కాలేజీలో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకుంటే సీటు రద్దవుతుందన్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో సోమవారం నుంచి అకడమిక్ సెషన్ ప్రారంభం కానుండగా 16వ తేదీ వరకు ఓరియంటేషన్, ఈ నెల 17 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. 8 బ్రాంచీల్లో సీట్లన్నీ ఫుల్... పాలిటెక్నిక్ కోర్సుల్లో 8 బ్రాంచీల్లో 100% సీట్లు భర్తీ అయ్యాయి. ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, బయో మెడికల్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, కెమికల్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్ బ్రాంచీల్లో సీట్లన్నీ నిండాయి. టెక్స్టైల్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్‌వేర్ టెక్నాలజీ, మెటర్లాజికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో అతితక్కువగా సీట్లు భర్తీ అయ్యాయి. -
సీఎం జగన్‌ను కలిసిన పాలిటెక్నిక్ లెక్చరర్ల జేఏసీ ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో పాలిటెక్నిక్ లెక్చరర్స్ జేఏసీ ప్రతినిధులు కలిశారు. ఆరు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఏఐసీటీఈ పేస్కేల్స్-2016ను పాలిటెక్నిక్ లెక్చరర్స్‌కు వర్తింపజేస్తూ జీవో నెంబర్ 10ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పాలిటెక్నిక్ లెక్చరర్స్ జేఏసీ కన్వీనర్ సి.రాజేంద్రప్రసాద్, కో-కన్వీనర్లు రామ్మోహన్ రెడ్డి, సురేంద్ర రెడ్డి, రఘునాథరెడ్డి, బాలమోహన్, ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి సీఎంను కలిశారు. చదవండి: బాబూ..ఆ డబ్బులు ఏమయ్యాయి? -
సీఎం జగన్ రుణం తీర్చుకోలేనిది: పాలిటెక్నిక్ అధ్యాపకులు
కడప(వైఎస్సార్ జిల్లా): ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేసే బోధన సిబ్బందికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి పేస్కేల్–2016 అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వటంపై పాలిటెక్నిక్ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం కడప పాలిటెక్నిక్ కళాశాలలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. చదవండి: ఆదుకో.. మావయ్యా.. గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ ఆపి.. పాలిటెక్నిక్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఈ పేస్కేల్ ద్వారా 84 ప్రభుత్వ పాలిటెక్నిక్, 2 ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పదవీ విరమణ చేసిన సుమారు 2,500 మంది లెక్చరర్లకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. -
పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పడేలా పాలిటెక్నిక్, ఐటీఐ విద్యా సంస్థల్లో పలు కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. మాన్యుఫ్యాక్చరింగ్‌తో పాటు హాస్పిటాలిటీ, నర్సింగ్ తదితర కొత్త కోర్సులను ప్రవేశపెట్టి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని తెలిపారు. హోటల్ ఇండస్ట్రీలో అనేక మంది ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి చేరుతున్నారని, అలాగే నర్సింగ్ వంటి సేవలకు జాతీయంగా, అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉందని చెప్పారు. పాలిటెక్నిక్, ఐటీఐలలో, స్కిల్ డెవలప్మెంట్ సంస్థల్లో ఈ కొత్త కోర్సులు ప్రవేశపెడతామన్నారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ –2022 ఫలితాలను ఆయన శనివారం విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్త కోర్సులు, కరిక్యులమ్‌లో మార్పులు చేసి మరింత నాణ్యమైన విద్యను అందిస్తామని వివరించారు. మెడికల్, ఇంజనీరింగ్ కోర్సులతో సమానంగా ఈ డిప్లొమా కోర్సులను కూడా తీర్చిదిద్దుతామని అన్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో పాటు పలువురు ప్రముఖులు డిప్లొమా కోర్సుల్లో చేరి పైకి వచ్చిన వారేనని వివరించారు. 2021 విద్యా సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3డీ, యానిమేషన్, మల్టీ మీడియా కోర్సులను ప్రవేశపెట్టామన్నారు. రానున్న బ్యాచుల వారికి క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్‌డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషీన్ లెర్నింగ్, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్ కోర్సులు ప్రవేశ పెడుతున్నట్లు మంత్రి చెప్పారు. విద్యార్థులు బాగా రాణించాలంటే తల్లుల పాత్ర కీలకమన్నారు. ఈ సమావేశంలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ముఖ్య కార్యదర్శి సౌరభ్‌గౌర్, కమిషనర్ పోలా భాస్కర్, స్టేట్ టెక్నికల్ బోర్డ్ ఆఫ్ ట్రైనింగ్ సెక్రటరీ విజయభాస్కర్, జేడీ ఎ.నిర్మల్‌కుమార్ ప్రియ తదితరులు పాల్గొన్నారు. బాలికల ముందంజ పాలిటెక్నిక్ ఫలితాల్లో బాలురకన్నా బాలికలు ఉత్తీర్ణత శాతంలో ఆధిక్యంలో నిలిచారు. మొత్తం 1,31,608 మంది పరీక్షలు రాయగా వారిలో 1,20,866 (91.84 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 74,510 మంది (90.56 శాతం), బాలికలు 46,356 మంది (93.96 శాతం) ఉత్తీర్ణులయ్యారు. చల్లా సత్య హర్షిత మొదటి ర్యాంకు సాధించింది. టాప్ 10 ర్యాంకుల్లో తూర్పు గోదావరి జిల్లా ఎక్కువ దక్కించుకుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించగా ఓసీలు 91.39 శాతం ఉత్తీర్ణులయ్యారు. -
కొలువు సొంతమ(వు)ను
నేటి పోటీ ప్రపంచంలో చదువులు, మార్కులతోపాటు భావ వ్యక్తీకరణ, సాఫ్ట్‌స్కిల్స్ అవసరం.సాంకేతిక విషయ పరిజ్ఞానం, ఆంగ్లభాషపై పట్టు, అంకితభావం విజయంలో ముఖ్య భూమిక పోషిస్తాయి. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సీటీ (మను) ఉర్దూ పాలిటెక్నిక్ విద్యార్థులు అంగ్ల మాధ్యమంలోనే కాదు ఉర్దూ మీడియంలో చదువుతూ ఉద్యోగాలను సాధించవచ్చని నిరూపించారు. ఎంచుకున్న రంగంలో నైపుణ్యాలు సాధించి కొలువులు పొందారు. సంతోషంగా జీవ నం సాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కడప ఎడ్యుకేషన్: మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సీటీ (మను) అనుబంధ సంస్థ అయిన మను పాలిటెక్నిక్ కళాశాల వైఎస్సార్ జిల్లా విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. మను ఆధ్వర్యంలో 2018లో దీనిని దేవుని కడప వద్ద ఏర్పాటు చేశారు. తర్వాతఈ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం కడప రిమ్స్ వద్ద 10.15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఇందులో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్,మినిస్ట్రియల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారి ఆర్థిక సహాయం రూ. 20 కోట్లతో నూతన భవనాలు నిర్మించారు. అలాగే రూ. 5 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ , కళాశాల ఆవరణ మొత్తం ప్రహరీని ఏర్పాటు చేశారు. నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా బీహార్‌లోని దర్బాంగ, ఒరిస్సాలోని కటక్, కర్ణాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో మాత్రమే ఈ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. వందశాతం ఉత్తీర్ణత: ఈ కళాశాలలో 2021 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణతను సాధించారు. గతేడాదికి సంబంధించి పలువురు విద్యార్థులు కొలువులను సాధించారు. ఈ సంవత్సం పలువురు ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌ను తీసుకుంటున్నారు. ఇందులో రేణిగుంటలోని అమర్‌రాజా కంపెనీ, కడప ఎండీహెచ్ గ్రూపు, బెంగళూరు మెగాస్ట్రక్చర్, బీహార్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ముంబై, ఝార్జండ్లోని ఆల్ట్రాటెక్లలో అప్రెంటీస్ పూర్తి చేసి ఆయా కంపెనీల్లో ఉద్యోగాలను పొందారు. ఉద్యోగాలకు ఎంపికైన కంపెనీల్లో వార్షిక జీతం 1.50 లక్షల నుంచి 3 లక్షల వరకు పొందుతున్నారు. అవసరాలకు అనుగుణంగా కోర్సుల రూపకల్పన నేటి సాంకేతిక యుగంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మను ఉర్దూ పాలిటెక్నిక్ కళాశాలలో కోర్సులు రూపకల్పన చేశారు. ఇందులో డిప్లమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్, డిప్లమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్, డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు టెక్నికల్ పరంగా ఉండటంతో కొలువులు అందిపుచ్చుకుంటున్నారు. యూనివర్సిటీలో పలువురు ఉన్నత చదువులు ... మను పాలిటెక్నిక్‌లో కోర్సులు పూర్తి చేసిన మరి కొంత మంది విద్యార్థులు పలు యూనివర్సిటీలలో ఉన్నత చదువులు చదువుతున్నట్లు కళాశాల సిబ్బంది తెలిపారు. మను పాలిటెక్నిక్ కళాశాలలో ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతున్న 27 మంది చెన్నైలోని పోరెసియా ఇండియా లిమిటెడ్, మరో 10 మంది హిందూపూర్‌లోని టెక్స్ఫోరులో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అబ్దుల్ ముఖ్సిత్‌ఖాన్, ప్లేస్మెంట్ కో ఆర్డినేటర్ డ్టాక్టర్ హకీముద్దీన్ తెలిపారు. తొలిప్రయత్నంలోనే... నేను మదరసా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి కడప మను పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్ పూర్తి చేసి తొలి ప్రయత్నంలోనే సౌదీ అరేబియాలో బేటూర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎలక్ట్రికల్ సూపర్వైజర్గా ఎంపికయ్యాను.నెలకు రూ.40 వేల జీతం వస్తుంది. నేను మను పాలిటెక్నిక్‌లో చదువుకున్నందుకు గర్వంగా ఉంది. – ఆతిఫ్ ఆలం, దర్బాంగ, బీహార్. సంతోషంగా ఉంది... నేను మోకానికల్ ఇంజినీరింగ్ చేశాను. చదువు పూ ర్తికాగానే కడపలోని ఎండీహెచ్ హుందాయిలో స్పేర్‌పార్ట్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. నాకు ప్రస్తుతం నెలకు 10 వేలు జీతం వస్తుంది. – అసదుల్లాహ్ అజాం, ఉత్తరప్రదేశ్ ఆనందంగా ఉంది నా పేరు షేక్ నిజాముద్దీన్, కడపలోని మాసాపేట. నేను కడపలోని మున్సిపల్ ఉర్దూ బాయిస్ హైస్కూల్ ఉర్దూ మీడియం చదివా. తరువాత మనులో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను, ఇటీవల కొప్పర్తిలోని త్రివిసిన్ కంపెనీలో క్వాలిటీ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వచ్చింది. నా జీతం ఏడాదికి 1,32,000 . చాలా సంతోçషంగా ఉంది. – షేక్ నిజాముద్దీన్, మాసాపేట, కడప. అమర్‌రాజా బ్యాటరీస్‌లో.. నేను మను పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేశాను. అమర్‌రాజా బ్యాటరీస్‌లో జె పవర్ సొల్యూషన్స్‌గా పనిచేస్తున్నాను. నాకు ఏడాదికి 1,44,000 జీతం వస్తుంది. నేను ఉర్దూ మీడియంలో చదివినా ఉద్యోగాన్ని సులభంగా తెచ్చుకున్నాను. – షేక్ ముస్తఫా, కడప ఏపీ ప్రజలకు వరం... మను ఉర్దూ పాలిటెక్నిక్ కళాశాలను కడపలో ఏర్పాటు చేయడం వైఎస్సార్‌జిల్లా ప్రజలతోపాటు ఏపీ ప్రజలకు వరం. ఎలాంటి ఖర్చు లేకుండా ఫీజులతోమాత్రమే పాలిటెక్నిక్‌ను పూర్తి చేయవచ్చు. చదువుకునే విద్యార్థులకు నేషనల్ స్కాలర్ షిప్స్ వంటివి కూడా వస్తాయి. ప్రస్తుతం ఈ కళాశాలలో ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, జార్ఖడ్, బెంగాల్, తెలంగాణా రాష్ట్రాలతోపాటు ఏపీకి చెందిన పలువురు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. – డాక్టర్ ఎండీ అబ్థుల్ ముఖ్సిత్‌ఖాన్,ప్రిన్సిపాల్, మనుపాలిటెక్నిక్ కళాశాల, కడప ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేస్తున్నాను.. నేను మనులో అప్పీరెల్ టెక్నాలజీలో పాలిటెక్నిక్ చివరి సంవత్సరం చదువుతున్నాను, ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌లో భాగంగా హిందూపూరులో టెక్స్ఫోర్టు అప్పిరెల్ స్లీవ్ యూనిట్లో శిక్షణ తీసుకుంటున్నాను. నాతోపాటు మరికొందరు శిక్షణ తీసుకుంటున్నారు. – మొఘల్ నబియా, కడప. సామాజిక బాధ్యత గురించి అవగాహన విద్యార్థులకు చదువుతోపాటు సామాజిక బాధ్యత అంటే ఏమిటో ఎన్ఎస్ఎస్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ఎన్ఎస్ఎస్ క్యాంపుల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలందించడం, రోడ్లు శుభ్రం చేయడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను చేయిస్తున్నాం. అలాగే మద్యం తాగడం వల్ల ఏం జరుగుతుందో కూడా వివరిస్తున్నాం. – మహమ్మద్ సికిందర్ హుస్సేన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్లేస్మెంట్ ఆఫీసర్, ఎన్ఎస్ఎస్ పోగ్రాం కోఆర్డినేటర్. -
లీకేజీ వెనుక ఒప్పందం?
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన పాలిటెక్నిక్ రెండు, మూడో ఏడాదికి సంబంధించిన మూడు, ఐదవ సెమిస్టర్ పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ శివార్లలోని స్వాతి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి జరిగిన ఈ లీకేజీలో సిండికేట్ అయిన కాలేజీలు ఎన్ని? లీక్ అయిన ఎంతసేపటికి వాట్సాప్ ద్వారా పేపర్లు వెళ్లాయి? అనే సమాచారం సేకరిస్తున్నారు. దీనివెనుక సాంకేతిక విద్యామండలి సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. కాల్‌డేటాపై దృష్టి... పరీక్ష పేపర్ 8, 9 తేదీల్లో లీక్ అవగా 9వ తేదీన లీకేజీ వ్యవహారాన్ని ఓ ప్రభుత్వ కాలేజీ సిబ్బంది గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే 8వ తేదీనే లీకేజీని సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారనే కోణంలో పోలీసులు పలువురు విద్యార్థుల వాట్సాప్ నంబర్లను సేకరించారు. సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఆ సెల్ నంబర్ల నుంచి రెండు రోజులపాటు వెళ్లిన కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. మరోవైపు కాలేజీ యాజమాన్యం, సిబ్బంది సెల్ నంబర్లనూ పరిశీలించగా మొత్తం 10 కాలేజీలకు ఆ నంబర్ల నుంచి ఫోన్లు వెళ్లినట్లు తేలింది. వివిధ ప్రాంతాలకు చెందిన పాలిటెక్నిక్ కాలేజీల యాజమాన్యాలతో స్వాతి ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యానికి ఉన్న లింకేంటి? ముందే ఒప్పందం చేసుకొని పేపర్ లీక్ చేశారా? అనే కోణంలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు. పాస్వర్డ్ అధికారులు పంపినదేనా? స్వాతి ఇంజనీరింగ్ కాలేజీ గుర్తింపును గతంలోనే రద్దు చేశామని, పాలిటెక్నిక్ ఫస్టియర్ అడ్మిషన్లకు అనుమతి లేదని సాంకేతిక విద్య అధికారులు తెలిపారు. ఈ స్థాయిలో విశ్వసనీయత లేని కాలేజీకి ముందే పాస్వర్డ్ చేరడం, అధికారుల బాధ్యతారాహిత్యాన్ని స్పష్టం చేస్తోందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అసలు పాస్వర్డ్ అధికారులు పంపిందేనా? మరో మార్గంలో పాస్వర్డ్ రాక ముందే హ్యాక్ చేశారా? ఇలా జరిగితే ఉన్నత విద్యామండలి అధికారుల పాత్ర ఉందా? అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. సంబంధిత అధికారులనూ విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు. నేర స్వభావం, అధికారుల వివరణ పరస్పర విరుద్ధంగా ఉండటం ఈ కేసులో కొత్త అనుమానాలకు తావిస్తోంది. నిబంధనల ప్రకారం అరగంట ముందు పరీక్ష కేంద్రాలకు పాస్వర్డ్ పంపాలి. కాలేజీ నిర్వాహ కులు, బాధ్యతగల అధికారుల పర్యవేక్షణలో పేపర్‌ను డౌన్లోడ్ చేయాలి. కానీ స్వాతి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్ణీత గడువుకన్నా ముందే పాస్వర్డ్ చేరిందనే సందేహాలు బలపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పాస్వర్డ్ వెళ్లిన సమయానికి ముందే పాస్వర్డ్ ఇవ్వడం వెనుక ఉద్దేశమేంటనే దిశగానూ దర్యాప్తు జరుగుతోంది. కాగా, ఈ కేసులో ముగ్గురు కాలేజీ సిబ్బంది పాత్రను నిర్ధారిం చిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. మరోవైపు కాలేజీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశామని.. ఇంకా యాజమాన్యం బదులివ్వలేదని సాంకేతిక విద్య అధికారులు తెలిపారు. -
హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ ప్రశ్నాపత్రాల లీకేజీ కలకలం
-
పాలిటెక్నిక్ ప్రశ్నాపత్రాలు లీక్.. ఆ రెండు పరీక్షలు రద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రశ్నా పత్రాలు లీక్ అవ్వడంతో ఈ నెల 8,9 తేదీల్లో జరిగిన రెండు పాలిటెక్నిక్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సాంకేతిక విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. రద్దైన రెండు పరీక్షలు ఈ నెల 15,16 తేదీల్లో జరుగుతాయని బోర్డు అధికారులు వెల్లడించారు. కాగా ఫిబ్రవరి 8న మొదలైన పాలిటెక్నిక్ పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే బాలసింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి పాలిటెక్నిక్ ఫైనలియర్ ప్రశ్నాపత్రాలు లీకయినట్లు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ప్రశ్నాపత్రాల లీక్‌ను గుర్తించిన ఇతర జిల్లాల్లోని ప్రిన్సిపల్స్ బోర్డుకు సమాచారం అందించడంతో ఈ విషయం కాస్త బయటకు వచ్చింది. బోర్డు అధికారుల ఫిర్యాదు మేరకు స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ ద్వారా విద్యార్థులకు పంపించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అబ్జర్వర్‌గా ఉన్న అధికారిని సస్పెండ్ చేశారు. స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో పరీక్ష కేంద్రాన్ని కూడా రద్దు చేశారు. అక్కడ పరీక్షలు రాస్తున విద్యార్థులను వేరే కేంద్రాలకు బదిలీ చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీకి షోకాజు నోటీసులు జారీ చేశారు. కాలేజీ అనుమతి ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని విద్యామండలి ప్రశ్నించింది. వారంలోగా వివరణ ఇవ్వాలని కాలేజీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. చదవండి: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల -
Abdullapurmet: పాలిటెక్నిక్ క్వశ్చన్ పేపర్స్ లీక్
-
పాలిటెక్నిక్ ఫైనలియర్ ప్రశ్నాపత్రాలు లీక్
సాక్షి హైదరాబాద్: ఈ నెల 8 నుంచి ప్రారంభమైన పాలిటెక్నిక్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నట్లు బోర్డు గుర్తించింది. దీంతో బోర్డు ఇతర జిల్లాలోని కాలేజి ప్రిన్సిపాల్స్‌ను అప్రమత్తం చేసింది. ఈ మేరకు బాటసింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ విద్యార్థులకు వాట్స్అప్ ద్వారా పేపర్లను పంపిస్తున్నట్లు గుర్తించారు. దీంతో బోర్డు సెక్రెటరీ ప్రశ్నాపత్రాల లీక్ విషయమై ఆ ఇన్స్టిట్యూట్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ పైకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాలిటెక్నిక్ అధ్యాపకుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని అధ్యాపక సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి మంగళవారం జీవో 133ని విడుదల చేశారు. ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరి బదిలీ వర్తిస్తుంది. రెండేళ్ల కనీస సర్వీసు పూర్తి చేసిన వారు బదిలీకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. స్పౌజ్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి, దివ్యాంగులకు ప్రత్యేక పాయింట్లు కేటాయించి బదిలీల్లో వారికి ప్రాధాన్యత కల్పించారు. దీర్ఘకాలంగా పాలిటెక్నిక్ అధ్యాపకులు ఎదురుచూస్తున్న బదిలీలకు ప్రభుత్వం అనుమతించడంపై ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అయితే, బదిలీలు చేపట్టే నాటికి ఆ స్థానంలో ఐదేళ్లు పూర్తయి, రిటైర్మెంట్కు సమీపంలో ఆరు నెలల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న వారిని కూడా బదిలీ చేసేలా నిబంధన పెట్టారని, ఇది కొంతమంది ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారుతోందన్నారు. -
తండ్రి ఆవేదన: కష్టపడి చదివించుకున్నా.. అలా చేస్తుందనుకోలేదు..
సాక్షి, ప్రకాశం: పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్థాపం చెందిన పాలిటెక్నిక్ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్త పట్నం మండలం ఈతముక్కల గ్రామం మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో మంగళవారం జరిగింది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా, ఈపూరు మండలం, ఆర్ ముప్పాళ్ళ గ్రామానికి చెందిన మట్టా రామాంజనేయులు కుమార్తె మట్టా దివ్య (17) పాలిటెక్నిక్ కాలేజీలో ఈసీఈ సెకండ్ ఇయర్ చదువుతోంది. సోమవారం సాయత్రం వెలువడిన పాలిటెక్నిక్ మొదటి ఏడాది ఫలితాల్లో ఏడు సబ్జెక్ట్స్గాను అయిదు ఫెయిల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కాలేజీకి వెళ్లొచ్చిన దివ్య హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. మధ్యాహ్నం విద్యార్ధినులు హాస్టల్‌కు వచ్చేసరికి దివ్య ఉరికి వేలాడుతూ కనిపించడంతో కాలేజీ ప్రిన్సిపాల్ సుశీల్ కుమార్ ప్రియకు సమాచారం ఇచ్చారు. ప్రిన్సిపాల్ పోలీసులకు, తల్లిదండ్రులకు ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. చదవండి: (నువ్వురాకపోతే చచ్చిపోతా.. నువ్వు అవి మానేస్తానంటేనే వస్తా..) దివ్య క్లాస్‌లో ఎప్పుడూ ఫస్ట్ మార్కులతో వచ్చేవని తోటి విద్యార్థులు చెప్పారు. మంగళవారం ఉదయం అందిరతోపాటే సక్లాస్కు హాజరైన దివ్య తాను పరీక్షలు బాగా రాశానని, రీఎరిఫీకేషన్ పెట్టించాలని చెప్పినట్లు తమతో చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా కాలేజీలో మొదటి ఏడాది విధ్యార్థులు 75 మంది ఉండగా వారిలో 33 మంది విద్యార్థినులు మాత్రమే పాస్ అవ్వడం గమనార్హం. కష్టపడి చదివించుకున్నా నేను ముప్ఫాళ్ల గ్రామంలో కాంట్రాక్ట్ పద్దతిలో స్వీపరగా పనిచేస్తాను. నాకు వచ్చేది రూ.6 వేలు జీతం. ఎల్కేజీ నుంచి పదోవతరగతి వరకు ప్రవేటు స్కూల్లో డబ్బులు ఖర్చు పెట్టి చదివించుకున్నారు. నేను చేసే పని నా కుమర్తె చేయకూడదని కష్టపడి చదివించుకుంటున్నారు. ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంటుందని నేను అనుకోలేదని కుమార్తె ముందు కుప్పకూలీ పోయాడు. కేసు నమోదు చేసి పోష్టమార్టన్ నిమెత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. -
పాలిసెట్‌లో 37,978 సీట్లు భర్తీ
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పాలిసెట్–2021 తొలివిడత అడ్మిషన్లలో 37,978 మందికి సీట్లు కేటాయించినట్లు సెట్ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం పాలిసెట్ సీట్ల కేటాయింపు వివరాలను విడుదల చేశారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 18లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి 312 మంది అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి.. మెరిట్ జాబితాను శాప్‌కు పంపాల్సి ఉందన్నారు. అందువల్ల వారికి సీట్లు కేటాయించలేదని తెలిపారు. 259 కాలేజీలు.. 69,810 సీట్లు పాలిసెట్‌లో 64,188 మంది అర్హత సాధించగా 42,910 మంది కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. వీరిలో 41,978 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. 41,036 మంది వెబ్ ఆప్షన్లను నమోదు చేశారు. రాష్ట్రంలో 259 కాలేజీలు ఉండగా వాటిలో 69,810 సీట్లు ఉన్నాయి. తొలి విడతలో 37,978 సీట్లు భర్తీ కాగా 31,832 సీట్లు మిగిలాయి. అత్యధికంగా ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీట్ల భర్తీ ఇలా.. -
AP: పాలిటెక్నిక్ ప్రవేశాలకి నోటిఫికేషన్ విడుదల
సాక్షి, విజయవాడ: పాలిటెక్నిక్ ప్రవేశాలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే పలు ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తాజాగా పాలిసెట్ 2021 నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ సందర్భంగా టెక్నికల్ ఎడ్యకేషన్ కమిషనర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ.. ఉపాధి అవకాశాలున్న కోర్సులపై ప్రత్యేక దృష్టి సాధించాం. విద్యార్థులకి స్కిల్‌డెవలప్‌మెంట్ కోసం కొన్ని ప్రముఖ సంస్థలతో ఎంఓయూ చేసుకుంటున్నాం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదివే విద్యార్ధులకి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. చదవండి: (బద్వేలు ఉపఎన్నిక: ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే...) కాగా, రాష్ట్రంలో 84 పాలిటెక్నిక్ కళాశాలల్లో 17,004 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎయిడెడ్, ప్రైవేట్ పరిధిలో 173 పాలిటెక్నిక్ కళాశాలలో 53,423 సీట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70 వేల పైన సీట్లు అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకి 68,137 మంది పరీక్ష రాస్తే 64,187 మంది అర్హత సాధించారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. నోటిఫికేషన్ వివరాలను పరిశీలిస్తే.. ►అక్టోబర్ 6 వరకు ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకోవచ్చు. ►అక్టోబర్ 3 నుంచి 7 వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. ►అక్టోబర్ మూడు నుంచి ఎనిమిదో తేదీ వరకు వెబ్ ఆప్షన్స్‌కి అవకాశం కల్పించాం. ►అక్టోబర్ 9న ఆప్షన్స్ మార్చుకునే అవకాశం ఉంది. ►అక్టోబర్ 11న సీట్లు కేటాయింపు ఉంటుంది. ►అక్టోబర్ 12 నుంచి 18 వరకు విద్యార్ధులు కళాశాలలో రిపోర్ట్ చేయాలి. ►18వ తేదీ నుంచి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్ధులకి తరగతులు ప్రారంభం చదవండి: (దసరాలోపు టీచర్ల పదోన్నతులు) -
వైఎస్సార్ కడపలో ‘మను’ పాలిటెక్నిక్ కళాశాల
కడప ఎడ్యుకేషన్: మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మను) అనుబంధ సంస్థ అయిన మను పాలిటెక్నిక్ కళాశాల జిల్లా విద్యార్థులకు అందుబాటులో ఉంది. మను ఆధ్వర్యంలో 2018లో దీనిని దేవుని కడప వద్ద ఏర్పాటు చేశారు. ఇందులో ఇప్పటి వరకు రెండు బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం మూడో సంవత్సరానికి ఆడ్మిషన్లు జరగనున్నాయి. ఈ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం కడప రిమ్స్ వద్ద 10.15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఇందులో యూనివర్సీటీ గ్రాంట్ కమిషన్, మినిస్ట్రియల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారి ఆర్థిక సహాయం రూ. 20 కోట్లతో నూతన భవనాలు నిర్మించారు. రూ. 5 కోట్లతో మౌలిక సదుపాయాలు, కళాశాల ఆవరణ మొత్తం ప్రహారీని ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నేషనల్ ఉర్దూ యూనివర్సీటీ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా బీహార్‌లోని దర్భంగా, ఒరిస్సాలోని కటక్, కర్ణాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో మాత్రమే ఈ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ఏ కోర్సులు ఉన్నాయంటే.. మను పాలిటెక్నిక్ కళాశాలలో మూడు రకాల కోర్సులు ఉన్నాయి. ఇందులో డిప్లమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్, డిప్లమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎల్రక్టానిక్, డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు ఉన్నాయి. ప్రతి కోర్సుకు 60 సీట్ల చొప్పున 180 సీట్లు ఉంటాయి. ఈ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపాల్‌తోపాటు 17 మంది (ఎన్ఐటీ, ఐఐటీకి చెందిన హెచ్ఓడీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ) టీచింగ్, 10 మంది నాన్ టిచింగ్ సిబ్బంది ఉన్నారు. విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్, సెంట్రల్ లైబ్రరీ, అన్ని కోర్సులకు సంబంధించి వర్కుషాపులు ఉన్నాయి. వివిధ రకాల ఆటలు అడుకునేందుకు సువిశాలమైన ఆటస్థలం, క్రీడా పరికరాలు కూడా ఉన్నాయి. యూనివర్సీటీ నుంచి ఎవరైనా ప్రతినిధులు కళాశాల సందర్శనకు వస్తే వారు ఉండేందుకు వీలుగా గెస్ట్‌హౌస్‌ను ఏర్పాటు చేశారు. కళాశాలలో ప్రవేశానికి అర్హులెవరంటే... మను పాలిటెక్నిక్ కళాశాలలో అన్ని కేటగిరీలకు చెందిన విద్యార్థులు చేరవచ్చు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఏ కేటగిరికి చెందిన వారైనా పదో తరగతిలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో చదువుతున్నా లాంగ్వేజీకి సంబంధించి మాత్రం ఉర్దూ సబ్జెక్టు లేదా ఉర్దూ మీడియంలో చదివే వారికి ఇందులో ప్రవేశానికి అర్హులు. ఇందులో చేరాలనుకునే వారు కచ్చితంగా ప్రవేశ పరీక్ష రాసి ర్యాంకు సాధించాలి. ర్యాంకులు సాధించిన వారికి కేటగిరీల(ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికలీ హ్యాండీక్యాప్, ఉమెన్ కోటా) వారీగా రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారం సీట్లను కేటాయిస్తారు. ఇందులో చేరే వారిలో అమ్మాయిలు ఏడాదికి రూ. 900, అబ్బాయిలు రూ. 2,350 ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్మెంట్, నేషనల్ స్కాలర్షిప్ వంటివి కూడా వస్తాయి. ప్రస్తుతం ఈ కళాశాలలో ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఏపీకి చెందిన పలువురు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఆన్లైన్ తరగతులు మాత్రమే జరుగుతున్నాయి. జులై 12 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు.. మను పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి జులై 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రవేశ పరీక్ష జులై 30వ తేదీన జరుగుతుంది. కడప సమీపంలోని రిమ్స్ వద్ద నూతనంగా నిర్మించిన మను పాలిటెక్నిక్ కళాశాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్ష జరగనుంది. ప్రవేశ పరీక్షకు అమ్మాయిలు రూ. 350, అబ్బాయిలు రూ. 550 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులకు వచ్చిన ర్యాంకులను బట్టి రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారం సీట్లు భర్తీ చేస్తారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. కడపలో ఏర్పాటు చేసిన మను పాలిటెక్నిక్ కళాశాలను జిల్లా విద్యార్థులు వినియోగించుకోవాలి. ఈ కళాశాలలో డిప్లమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్, డిప్లమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎల్రక్టానిక్, డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు ఉన్నాయి. ఈ మూడు కోర్సులకు సంబంధించి 180 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులకు 6 సెమిష్టర్స్ పద్ధతిలో పరీక్షలు ఉంటాయి. ఇందులో 5 సెమిస్టర్స్‌కు పరీక్షలు జరుగుతాయి. 6వ సెమిస్టర్లో మాత్రం ఇండ్రస్టియల్ శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో విద్యార్థులకు స్టైఫండ్ కూడా వస్తుంది. ఇప్పటికే రెండు బ్యాచ్‌ల విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకుని బయటకు వెళ్లారు. మూడో సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. – డాక్టర్ ఎండీ ఆబ్దుల్ ముక్సిత్ఖాన్, ప్రిన్సిపాల్, మను పాలిటెక్నిక్ కళాశాల, కడప -
After 10th Class: టెన్త్.. టర్నింగ్ పాయింట్!
కరోనా కారణంగా గతేడాది పదోతరగతి పరీక్షలు లేకుండానే విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. ఈ ఏడాది కూడా పరీక్షలు వాయిదా పడుతున్నాయి. వాస్తవానికి విద్యార్థి జీవితంలో పదో తరగతి అనేది ఎంతో కీలకమైన దశ. అందుకే టెన్త్ను ‘టర్నింగ్ పాయింట్’ అంటారు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా.. విద్యార్థికి మ్యాథమెటిక్స్‌పై ఆసక్తి ఉందా.. సైన్స్‌లో మంచి మార్కులు వచ్చాయా.. అతని స్కిల్ సెట్ ఏంటి అనే దానిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒక అంచనాకు వస్తారు. అందుకు అనుగుణంగా ఏ కోర్సులో చేరాలో, ఏ కెరీర్ ఎంచుకోవాలో సలహా ఇస్తుంటారు. పదో తరగతి తర్వాత ఎంచుకునే కోర్సు/ ఇంటర్మీడియట్లో చేరే గ్రూప్.. భవిష్యత్ గమ్యాన్ని నిర్దేశిస్తుంది. ఈ నేపథ్యంలో.. పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న వివిధ కోర్సులు, కెరీర్ మార్గాలపై ప్రత్యేక కథనం.. ప్రతి విద్యార్థి భవిష్యత్‌లో గొప్ప స్థాయికి చేరుకోవాలని; ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటారు. కొందరు డాక్టర్, మరికొందరు ఇంజనీర్, ఇంకొందరు లాయర్.. కలెక్టర్, పోలీస్ ఆఫీసర్, టీచర్.. ఇలా ఎన్నో కలలు కంటారు. ఈ కలలు సాకారం అవ్వాలంటే.. లక్ష్య సాధనకు సరైన సమయంలో సరైన మార్గాన్ని ఎంచుకోవడం ముఖ్యం! ఆ టర్నింగ్ పాయింటే.. పదో తరగతి!! పదో తరగతి తర్వాత విద్యార్థుల ముందు ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కోర్సులు, ఇంటిగ్రేటెడ్ బీటెక్, ఐటీఐ కోర్సులు కనిపిస్తాయి. వీటిలో ఒక కోర్సు ఎక్కువ.. మరో కోర్సు తక్కువ కాదు. అన్నింటికీ చక్కటి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అయితే, విద్యార్థి తన భవిష్యత్ లక్ష్యం ఏమిటి.. ఏం సాధించాలనుకుంటున్నారో ఆలోచించుకొని.. దాన్ని బట్టి కోర్సును ఎంపిక చేసుకోవడం ఉత్తమం. నాలుగు గ్రూపులు ► పదో తరగతి తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకునే మార్గం.. ఇంటర్మీడియట్. వారివారి ఆసక్తులకు అనుగుణంగా గ్రూపులను ఎంచుకుంటారు. ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ/ఎంఈసీ, హెచ్ఈసీ గ్రూపులున్నాయి. ► ఎంపీసీ: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉండే ఈ గ్రూప్‌లో ఎక్కువగా ఇంజనీరింగ్ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు చేరుతుంటారు. వీరు జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్, ఎంసెట్, బిట్‌శాట్ వంటి ఎంట్రన్స్‌లు రాసి ఐఐటీలు, ఎన్ఐటీలు, బిట్స్ వంటి ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్స్లో బీటెక్/బీఈలో ప్రవేశం పొందొచ్చు. ఇక ఏపీ/టీఎస్ ఎంసెట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్/బీఈ కోర్సుల్లో చేరవచ్చు. ► బైపీసీ: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉండే.. ఈ గ్రూప్ చదివినవారు ‘నీట్’ ఎంట్రన్స్‌తో ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయిలో ఎంసెట్(మెడికల్ అండ్ అగ్రికల్చర్)లో ర్యాంక్ ఆధారంగా అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్,ఫార్మసీ, ఫిజియోథెరఫీ వంటి కోర్సుల్లో చేరవచ్చు. ► సీఈసీ/ఎంఈసీ: కామర్స్ అంటే ఇష్టపడేవారు; చార్టర్డ్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ, సీఎంఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదవాలనుకునే వారు ఈ గ్రూపులు ఎంచుకుంటారు. ఇందులో కామర్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులను అధ్యయనం చేస్తారు. ► హెచ్ఈసీ: టీచింగ్ రంగంలో ప్రవేశించాలనుకునేవారు, ఎల్ఎల్బీ వంటి కోర్సులు చేయాలనుకునేవారు, సివిల్స్, గ్రూప్స్ పరీక్షలు రాయాలనుకునే వారు ఇంటర్మీడియట్లో హెచ్ఈసీ గ్రూప్ ఎంచుకుంటారు. ఇంటర్లో ఈ నాలుగు గ్రూపులతోపాటు రెండేళ్లు, ఏడాదిన్నర కాలవ్యవధి గల పలు ఒకేషనల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకేషన ల్ కోర్సులు పదో తరగతి తర్వాత సంప్రదాయ ఇంటర్మీడియట్ కోర్సులే కాకుండా.. సత్వర ఉపాధికి అవకాశం కల్పించే ఒకేషనల్ కోర్సుల్లో కూడా చేరొచ్చు. ► అగ్రికల్చర్ విభాగం: క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, డెయిరీయింగ్, ఫిషరీస్, సెరికల్చర్ కోర్సులు. ► బిజినెస్ అండ్ కామర్స్ విభాగం: అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, మార్కెటింగ్ అండ్ సేల్స్‌మెన్‌షిప్, ఆఫీస్ అసిస్టెంట్‌షిప్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్. ► ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగం: ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్, రూరల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్, డీటీపీ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ. ► హోమ్‌సైన్స్ విభాగం: కమర్షియల్ గార్మెంట్ డిజైనింగ్ అండ్ మేకింగ్, ఫ్యాషన్ గార్మెంట్ మేకింగ్, హోటల్ ఆపరేషన్స్, ప్రి స్కూల్ టీచర్ ట్రైనింగ్. ► వీటితోపాటు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, మల్టిపర్పస్ హెల్త్ వర్కర్, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ► రెండేళ్ల ఒకేషనల్ కోర్సులు ఉత్తీర్ణులైన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా సంబంధిత పాలిటెక్నికల్ కోర్సు రెండో ఏడాదిలో ప్రవేశించే అవకాశం ఉంది. ఉపాధికి భరోసా–ఐటీఐ ► ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్(ఐటీఐ).. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లో కోర్సులు అందిస్తున్నాయి. విద్యార్థి ఆసక్తిని బట్టి అందుబాటులో ఉన్న కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా» టూల్ అండ్ డై మేకర్ ఇంజనీరింగ్ » డ్రాట్స్‌మన్(మెకానికల్) ఇంజనీరింగ్ » డీజిల్ మెకానిక్ ఇంజనీరింగ్ » డ్రాట్స్‌మన్ (సివిల్) ఇంజనీరింగ్ » పంప్ ఆపరేటర్ » ఫిట్టర్ ఇంజనీరింగ్ » మోటార్ డ్రైవింగ్ కమ్ మెకానిక్ ఇంజనీరింగ్ » టర్నర్ ఇంజనీరింగ్ » మ్యానుఫ్యాక్చరర్ ఫుట్‌వేర్ ఇంజనీరింగ్ » రిఫ్రిజిరేటర్ ఇంజనీరింగ్ » మెషినిస్ట్ ఇంజనీరింగ్ » హెయిర్ అండ్ స్కిన్ కేర్ » ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్ » సర్వేయర్ ఇంజనీరింగ్ » షీట్ మెటల్ వర్కర్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశం పొందొచ్చు. పాలిటెక్నిక్ కోర్సులు ► పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న మరో చక్కటి కోర్సు.. పాలిటెక్నికల్. ఈ డిప్లొమా కోర్సులకు విద్యార్థుల్లో మంచి ఆదరణ ఉంది. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో మెరుగైన ఉపాధి పొందేందుకు ఈ కోర్సులు దోహదం చేస్తాయి. మూడేళ్లు, మూడున్నరేళ్ల పాలిటెక్నిక్ కోర్సులు పూర్తికాగానే కంపెనీల్లో సూపర్వైజర్ స్థాయి కొలువులు దక్కించుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సర్టిఫికెట్తో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ఆసక్తి ఉంటే.. ఈసెట్ ద్వారా బీటెక్/బీఈ కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో చేరవచ్చు. ► పాలిసెట్‌తో ప్రవేశాలు: తెలుగు రాష్ట్రాల్లో టీఎస్ పాలిసెట్/ఏపీ పాలిసెట్ ఎంట్రన్స్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. పదో తరగతి అర్హతతో పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఎంట్రన్స్‌లో సాధించిన ర్యాంక్ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశం లభిస్తుంది. ► పాలిటెక్నిక్ కోర్సులివే: సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, డెయిరీ ఇంజనీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, టెక్స్టైల్ కెమిస్ట్రీ, గ్లాస్ అండ్ సిరామిక్ ఇంజనీరింగ్, లెదర్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, ఇంటీరియర్ డెకరేషన్ అండ్ డిజైన్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ గార్మెంట్ టెక్నాలజీ, ప్లాస్టిక్ అండ్ మౌల్డ్ టెక్నాలజీ, హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సర్వీస్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటనెన్స్, డిప్లొమా ఇన్ హోమ్‌సైన్స్, డిప్లొమా ఇన్ ఫార్మసీ తదితర పాలిటెక్నిక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. -
రేపట్నుంచి పాలిటెక్నిక్ కళాశాలలకు వేసవి సెలవులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలకు వేసవి సెలవులు వచ్చాయి. ఈ నెల 5వ తేదీ నుంచి వేసవి సెలవులు అని సాంకేతిక విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది. సవరించిన అకడమిక్ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. చదవండి: సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం: ఎయిమ్స్ డైరెక్టర్ చదవండి: వ్యాక్సిన్‌పై ప్రధానికి లేఖ రాయనున్న సీఎం -
ఇలా ఉంటే చదువు సాగేదెలా...?
గుమ్మలక్ష్మీపురం: చదువుకోవడానికి పాఠ్యపుస్తకాలు లేవు. ప్రయోగాలు చేసుకునేందుకు ల్యాబ్‌లు లేవు. కూర్చునేందుకు తగిన బెంచీలు లేవు. రెగ్యులర్ బోధకులు లేరు. ప్రిన్సిపాల్ లేరు. అసంపూర్తిగా నిలిచిపోయిన బోధన గదులు. మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. ఉల్లిపాయలు వేయకుండా... ఎక్స్పైర్ అయిన సామగ్రితో వంటలు. ఇదీ గుమ్మలక్ష్మీపురంలోని గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాల(ఎస్టీ)లో దుస్థితి. వాటిని ప్రత్యక్షంగా చూసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి చలించిపోయారు. గత పాలకుల నిర్లక్ష్యానికి విస్తుపోయారు. ఇప్పటికైనా దానిని పూర్తి మౌలిక సదుపాయాలతోతీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆదర్శంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అసలేమైందంటే...: గుమ్మలక్ష్మీపురంలో మంగళవారం నిర్వహించిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి హాజరయ్యారు. ఆ సందర్భంలో అక్కడి పాలిటెక్నిక్ విద్యార్థులు ఆమెకు కళాశాలలోని సమస్యలు వివరించారు. వెంటనే స్పందించిన ఆమె అప్పటికప్పుడు కళాశాలను సందర్శించారు. అక్కడ నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా చూశారు. ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు చదువుకోసం వస్తే గత టీడీపీ ప్రభుత్వం కనీస సౌకర్యాలేవీ కల్పించకుండా భవనాన్ని నిర్మించి నిర్లక్ష్యంగా వదిలేయడం బాధాకరమన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ సమస్య ఎప్పుడూ తన దృష్టికి రాలేదని, ఈ పరిస్థితుల్లో విద్యార్థులను చూస్తే ఎంతగానో బాధకలుగుతోందని, ఈ సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే కళాశాలలో నెలకొన్న సమస్యలను నివేదిక రూపంలో అందజేయాలని ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ నరసింహకు ఆమె ఆదేశించారు. ఆమె వెంట వైఎస్సార్సీపీ శ్రేణులు ఉన్నారు. -
వేధింపులతో పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య..!
సాక్షి, హైదరాబాద్ : మీర్పేట్లోని తీగల రాంరెడ్డి (టీఆర్ఆర్) కాలేజీలో విషాదం చోటేచేసుకుంది. పాలిటెక్నిక్ ఫైనలియర్ చదుతున్న సంధ్య అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. కాలేజీ యాజమాన్యం బెదిరింపుల వల్లనే సంధ్య బలవన్మరణానికి పాల్పడిందని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పార్వతి మేడమ్ వేధింపులు భరించలేకనే సంధ్య మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ కాలేజీ గేటు ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. డిటెండ్ చేస్తామని కాలేజీ యాజమాన్యం బెదిరిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పాలిటెక్నిక్ విద్యార్ధిని ఆత్మహత్య..!
-
వారికి పాఠాల్లేవు...వీరికి ఉద్యోగాల్లేవు
సాక్షి, అమరావతి : ఓ పక్క సరిపడా లెక్చరర్లు లేక కాలేజీల్లో బోధన ముందుకు సాగడం లేదు.. మరోపక్క అక్కడే పనిచేస్తూ విధులకు దూరమైన కాంట్రాక్టు లెక్చరర్లు ఉద్యోగాల్లేక అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయా పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న 232 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను అప్పటి ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఏపీపీఎస్సీ ద్వారా రెగ్యులర్ అధ్యాపకులను నియమించినందున వారిని తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఏపీలో 100 మంది, తెలంగాణలో 132 మంది ఉద్యోగం కోల్పోయిన వారిలో ఉన్నారు. వాస్తవానికి ఏపీపీఎస్సీ ద్వారా కొన్ని పోస్టులు భర్తీచేసినా ఇంకా అనేక ఖాళీలున్నందున వాటిలో వీరిని తిరిగి నియమించవచ్చు. కానీ విభజన అనంతరం వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వీరిని చేర్చుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఉద్యోగాలు కోల్పోయిన పాలిటెక్నిక్ ఒప్పంద అధ్యాపకులను మానవతా దృక్పథంతో తిరిగి విధుల్లోకి తీసుకుంది. ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం ఖాళీ పోస్టులున్నా వీరిని తిరిగి తీసుకోకుండా కొనసాగుతున్న ఒప్పంద అధ్యాపకులకు మాత్రమే రెన్యువల్ చేస్తూ వెళ్లింది. కేంద్రం కొత్త కాలేజీలు ఇచ్చినా... కేంద్ర ప్రభుత్వం ఏపీకి కొత్తగా 24 పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. ఆమేరకు కొన్నిటిని కొత్తగా ఏర్పాటు చేశారు. అయినా వీటిలో పోస్టులు మాత్రం భర్తీ కాలేదు. ఆ పోస్టులను ఐదేళ్లుగా ఖాళీగానే కొనసాగించారు తప్ప కాంట్రాక్ట్ పద్ధతిన కూడా నియామకాలు చేయలేదు. వీటిలో వేర్వేరు కాలేజీల్లో పనిచేస్తున్న వారినే సర్దుబాటు చేసి పాఠాలు చెప్పించారని నిరుద్యోగులు వాపోయారు. ఇప్పటికీ కొన్ని కాలేజీల్లో ఇదే పద్ధతి కొనసాగుతోందని, కొన్నిటిలో ఒక సబ్జెక్ట్ అధ్యాపకుడు వేర్వేరు సబ్జెక్టులు బోధిస్తున్నారని పేర్కొన్నారు. బయాలజీ అధ్యాపకుడితో కెమిస్ట్రీ లేదా ఇంగ్లిష్, మరో సబ్జెక్ట్ లెక్చరర్‌తో సంబంధం లేని సబ్జెక్ట్‌లు బోధింపజేస్తున్నారని తెలిపారు. గెస్ట్ లెక్చరర్లుగా కొంతమందిని నియమించి వారితో ఇలా చేయిస్తున్నారని తెలిపారు. అర్హులైన తాము కాంట్రాక్ట్ పద్ధతిలోనైనా పనిచేయడానికి కార్యాలయాల చుట్టూ తిరిగినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని వారు వాపోయారు. గతంలో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేసి రోడ్డున పడిన తమను తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీల పరిస్థితి ఇది.. కాలేజీ సంఖ్య విద్యార్థులు ప్రభుత్వ 84 40,056 ఎయిడెడ్ 02 1,502 ప్రైవేట్ 201 1,00,470 ప్రభుత్వ కాలేజీల్లో పోస్టుల పరిస్థితి -
మరో తప్పిదం.. అందరికీ సున్నా మార్కులే..!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఇంటర్ బోర్డు చేసిన తప్పిదాలను మరువకముందే రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు (టీఎస్‌ఎస్‌బీటీఈటీ)లోనూ ఇలాంటి ఘనకార్యమే వెలుగు చూసింది. పరీక్ష రాసిన విద్యార్థులందరినీ బోర్డు మూకుమ్మడిగా ఫెయిల్ చేసింది. విద్యార్థులంతా చివరి సెమిస్టర్లో సున్నా మార్కులతో ఫెయిల్ కావడం గమనార్హం. ఈ నెల 1న పాలిటెక్నిక్ డిప్లొమా చివరి ఏడాది ఫలితాలను బోర్డు విడుదల చేసింది. ఫలితాలు చూసుకున్న విద్యార్థులు ఒక్కసారి అవాక్కయ్యారు. ప్రతిభావంతులు, ఈసెట్–2019 టాప్ ర్యాంకర్లు సైతం ఫెయిల్ అవ్వడంతో లబోదిబోమంటున్నారు. అందరూ బాధ్యులే..: ఈసీఈ, ఈఈఈ బ్రాంచ్ విద్యార్థులకు చివరి సెమిస్టర్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఆధారంగా ప్రయోగ విభాగంలో మార్కులు వేయాల్సి ఉంటుంది. వీటిని విద్యార్థి ప్రతిభ ఆధా రంగా కాలేజీ యాజమాన్యాలే నిర్దేశిస్తాయి. ఆ మార్కులను కాలేజీ యాజమాన్యమే బోర్డు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. కానీ పలు కాలేజీ యాజమాన్యాలు బోర్డు నిర్దేశించిన తేదీల్లో అప్లోడ్ చేయలేదు. గడువు పూర్తవడంతో అప్లోడ్ ఆప్షన్‌ను బోర్డు తొలగించింది. దీనిని ఆలస్యంగా గుర్తించిన కాలేజీ యాజమాన్యాలు విషయాన్ని బోర్డుకు వివరించగా.. మార్కులను నిర్దేశిత పద్ధతిలో పంపించాలని కోరింది. దీంతో యాజమాన్యాలు మార్కులను పం పాయి. కానీ ఫలితాల్లో విద్యార్థులకు మార్కులు యాడ్ కాలేదు. సోమవారం మీర్పేట్ సమీపంలోని ఓ కాలేజీ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన చేపట్టినప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బోర్డుకు ఫిర్యాదు చేశారు. బోరుమంటున్న విద్యార్థులు.. ఈసెట్‌లో టాప్ 100లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఫలితాల్లో ఫెయిల్ కావడంతో బోరుమంటు న్నారు. త్వరలో ఈసెట్ కౌన్సెలింగ్ జరగనున్న నేపథ్యంలో పొరపాట్లు సరిదిద్ది ఫలితాలు ప్రకటించాలని బోర్డు అధికారులను కోరుతున్నారు. -
23 కాలేజీలు.. 7,199 సీట్లు కట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలు, సీట్లకు కోత పడింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) గుర్తింపు ఇచ్చిన వాటిల్లోనే 23 కాలేజీలతోపాటు 7,199 సీట్లు తగ్గిపోయాయి. రాష్ట్రంలోని 168 పాలిటెక్నిక్ కాలేజీల్లో 42,100 సీట్లకు ఏఐసీటీఈ ఇటీవల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందులో కొన్ని కాలేజీలు సీట్లను తగ్గించుకోగా, కొన్ని కాలేజీలు ప్రవేశాలకు ముందుకు రాలేదు. మరికొన్ని కాలేజీల్లో లోపాల కారణంగా రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. ఇలా 23 కాలేజీలు, 7,199 సీట్లకు కోత పడింది. ఈసారి ప్రవేశాల కౌన్సెలింగ్‌లో 145 కాలేజీల్లో 34,901 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించామని తెలిపారు. దీంతో 12,511 మంది విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించారని, అందులో 12,303 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్లను బుక్ చేసుకున్నట్లు ఆయన వివరించారు. 24 వరకు ప్రాధాన్యక్రమంలో ఆప్షన్లు.. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని బి.శ్రీనివాస్ పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు ఈనెల 24 వరకు ప్రాధాన్య క్రమంలో కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి ఈనెల 27న సీట్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఎన్సీసీ, వికలాంగులు, సాయుధ దళాల కుటుంబాలకు చెందిన పిల్లలు/ఆంగ్లో ఇండియన్ కుటుంబాలకు చెందిన పిల్లలు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్‌లో మాసాబ్‌ట్యాంకులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఎంచుకోవాలని పేర్కొన్నారు. కులీకుతుబ్ షాహి అర్బన్ డెవలప్మెంట్ ప్రాంతం లోని విద్యార్థులు అక్కడి క్యూక్యూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న సీట్లను ఎంచుకోవచ్చని, అయితే వారు తమ రేషన్‌కార్డు జిరాక్స్ కాపీ తప్పక సబ్మిట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అక్కడి విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్‌లో క్యూక్యూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఎంచుకోవాలని పేర్కొన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం వెళ్లే విద్యార్థులు వెంట తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్ల వివరాలను తమ వెబ్సైట్లో (https://tspolycet. nic.in) చూడొచ్చని తెలిపారు. -
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి:ఇంజనీరింగ్ డిప్లొమో పూర్తిచేసిన విద్యార్ధులు తదుపరి ఉన్నత సాంకేతిక విద్యన కొనసాగించేందుక వీలుగా నిర్వహిస్తున్న ఏపీ ఈసెట్-2019 ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు విజయవాడలో విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి వైస్ఛైర్మన్లు ప్రొఫెసర్ పి.నరసింహారావు, ప్రొఫెసర్ టి.కోటేశ్వరరావు, ఈసెట్ ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వీసీ శ్రీనివాస్ కుమార్, కన్వీనర్ ప్రొఫెసర్ భానుమూర్తి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి వరదరాజన్, ప్రత్యేకాధికారి డాక్టర్ రఘునాధ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ విజయరాజు మాట్లాడుతూ ఏప్రిల్ 30న ఏపీ ఈసెట్‌ను నిర్వహించినట్లు వివరించారు. ఏపీ, తెలంగాణలో కలిపి 132 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షకు 39734 మంది దరఖాస్తు చేయగా 37749 మంది పరీక్ష రాసినట్లు వివరించారు. వీరిలో 37066 మంది (98.19 శాతం) ఉత్తీర్ణులైనట్లు వివరించారు. పరీక్ష రూ.200 మార్కులకు నిర్వహించగా అందులో 25 శాతం అంటే 50 మార్కులను అర్హత మార్కులుగా నిర్ణయించి ఉత్తీర్ణులను ప్రకటిస్తున్నామన్నారు. గత ఏడాదికన్నా 4వేల మంది అదనంగా ఈ ఏడాది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. మొత్తం 13 బ్రాంచులకు సంబంధించి ఈసెట్‌ను నిర్వహించామని విజయరాజు వివరించారు. గత ఏడాదిలోమిగిలిపోయిన వాటిని కలుపుకొని మొత్తం 50774 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అర్హత సాధించిన వారు ఈనెల 19వ తేదీనుంచి హెచ్‌టీటీపీఎస్://ఎస్సీహెచ్ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్/ఈసీఈటీ/‘ వెబ్సైట్ ద్వారా ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఈసెట్‌లో ఆయా బ్రాంచులో మొదటి స్థానంలో నిలిచిన ర్యాంకర్లను ఛైర్మన్ ప్రకటించారు. సబ్జెక్టుల వారీగా ర్యాంకర్లు వీరే బయోటెక్నాలజీ: నాగబోయిన వెంకట అప్పారావు, సామర్లకోట తూర్పుగోదావరి జిల్లా బీఎస్సీ మేథమెటిక్స్: కేశవరెడ్డి కాగితాల, విశాఖ సిరామిక్ టెక్నాలజీ: చిల్లకూరు కల్యాణ్, చిల్లకూరు, నెల్లూరు కెమికల్ ఇంజనీరింగ్: రొంగలి నిధిష్, పెందుర్తి, విశాఖపట్నం సివిల్ ఇంజనీరింగ్: శ్రీపెరంబదూరు ప్రణతి, హన్మకొండ, వరంగల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్: విన్నకోట శ్రీవాణి, కాపువాడ, హన్మకొండ, వరంగల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్: మహమ్మద్ ముబీన్, మల్కాజ్గిరి, మేడ్చల్‌జిల్లా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: ఖాత్రి సుజయ్ కుమార్, జాజపూర్, నారాయణపేట్, మహబూబ్ నగర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్: వీరవల్లి సాయి సీతారాం, ఇరగవరం, పశ్చిమగోదావరి జిల్లా మెకానికల్ ఇంజనీరింగ్: తపల్ షేక్ ఇంతియాజ్, ముద్దనూరు, కడప మెటలర్జికల్ఇంజనీరింగ్: రాయవరపు ముత్యాలనాయుడు, విశాఖపట్నం మైనింగ్ ఇంజనీరింగ్: దేవునూరి సాయి వెంకటరాజ్, రామగుండం, పెద్దపల్లి జిల్లా ఫార్మసీ: రామిశెట్టి సులోచన, సీతారామపురం నెల్లూరు -
ఆటో ఇంజిన్‌తో కారు సిద్ధం చేసిన పాలిటెక్నిక్ విద్యార్థి
విశాఖపట్నం,కె.కోటపాడు (మాడుగుల) : కుర్రకారు ఆలోచనలన్నీ సృజనాత్మకంగా ఉంటాయి. తక్కువ ఖర్చుతో డీజిల్‌తో నడిచే కారును రూపొందించాలని ఆ గ్రామీణ విద్యార్థి ఆలోచించాడు. దానిని ఆచరణలో పెట్టి..ఆటోను కారుగా మార్చేసి రోడ్లపై పరుగులు పెట్టించేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే..చౌడువాడ గ్రామానికి చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి జనపరెడ్డి మధు పాలిటెక్నిక్‌లో మెకానికల్‌ను చేస్తున్నాడు. స్వతçహాగా చిన్నప్పటి నుంచి మెకానిజంపై ఆసక్తి ఉన్న మధు గత ఆరు నెలల కాలంగా కారు తయారు చేసే పనిలో ఉన్నాడు. మార్కెట్లోని ఆటో ఇంజిన్‌కు ఎక్కువ సామర్థ్యం గల కట్ ప్లేట్లును అమర్చాడు. కారు రూపం వచ్చేం దుకు ఐరన్ షీట్లను అమర్చడంతో పాటు కారు లోపల డాష్ బోర్డు, స్టీరింగ్, డోర్లను విద్యార్థి మధు ఏర్పాటు చేశాడు. కారును డీజిల్‌తో నడిచేలా సిద్ధం చేశాడు. లీటర్ డీజిల్‌తో 30 కిలో మీటర్లు ప్రయాణంను గంటకు 80కిలో మీటర్ల గరిష్ఠ వేగంతో వెళ్లేలా కారును విద్యార్థి మధు తయారు చేశాడు. తయారీ చేసిన కారును గ్రామంలో శుక్రవారం గ్రామస్తుల సమక్షంలో ప్రారంభించాడు. విద్యార్ధి దశలోనే మధు మంచి ఆలోచన శక్తితో ఆటో ఇంజిన్‌తో కారును తయారు చేయడంతో పలువురు మధును అభినందిస్తున్నారు. అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే.. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ ఆటో కారు తయారు చేశాను. 80 కిలోమీటర్ల వేగంతో ఈ కారులో ప్రయాణం చేయవచ్చును. చిన్ననాటి నుంచి మెకానిజంపై ఉన్న ఆసక్తితోనే ఇటువంటి వాహనాలను తయారీ చేయడం అలవాటుగా మారింది. –జనపరెడ్డి మధు, పాలిటెక్నిక్ విద్యార్థి. చౌడువాడ -
ఇంకెన్నాళ్లిలా.?
సాంకేతిక విద్యకు పెద్దపీట వేస్తున్నామని పాలకులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. బందరు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సమస్యలతో సావాసం చేస్తూ చదువులు సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కళాశాలకు నేటికీ సొంత భవనాలు లేవు. చిలకలపూడి రైల్యేస్టేషన్‌కు సమీపంలో గల ఓ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన భవనాలను అద్దెకు తీసుకొని, అందులో కళాశాలను నిర్వహిస్తున్నారు. అక్కడ సరైన మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు, అధ్యాపకులు అవస్థలు పడుతున్నారు. కృష్ణాజిల్లా ,మచిలీపట్నం: మచిలీపట్నంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను 2009లో ఏర్పాటు చేశారు. సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో బ్రాంచిలో 60 మంది విద్యార్థులకు అడ్మిషన్లను కల్పిస్తున్నారు. నిష్ణాతులైన అధ్యాపకుల బోధనతో కళాశాల విద్యార్థులు మంచి ప్రతిభను చాటుతున్నారు. గత ఏడాది మెకానికల్‌లో 95 శాతం, సివిల్ ఇంజినీరింగ్‌లో 85 శాతం మేర ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల నమోదులో రాష్ట్రంలో నాలుగో స్థానంలో మచిలీపట్నం కళాశాల నిలుస్తోంది. కళాశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులు ప్రతిభ పురస్కారాలను కూడా అందుకున్నారు. పదేళ్లుగా పరాయి పంచన.. ఫలితాల్లో ఘనకీర్తిని సాధిస్తున్న పాలిటెక్నిక్ కళాశాల పదేళ్లుగా పరాయి పంచన కాలం వెళ్లదీస్తోంది. కలెక్టరేట్ సమీపంలోని ఆర్అండ్బీ శాఖకు చెందిన భవనాల్లో ఆరు ఏళ్ల పాటు నిర్వహించారు. ఆ భవనాలు శిథిలావస్థకు చేరటంతో, అక్కడ నుంచి చిలకలపూడిలోని ఓ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలోని భవనాలను అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. వసతులు కరువు.. నెలకు రూ. 23 వేలు వరకూ అద్దె చెల్లిస్తున్నప్పటకీ, ఇక్కడ కళాశాల నిర్వహణకు సరైన వసతులు లేకపోవటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాల, మరో పక్కన ఓ ప్రైవేటు సంస్థ ఉపాధి శిక్షణ, ఇదే ప్రాంగణంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్వహణ, ఇలా అంతా గందరగోళంగా ఉంది. సరిపడా భవనాలు లేకపోవటంతో సాంకేతిక విద్యాబోధన కోసమని తీసుకొచ్చిన పరికరాలను కూడా వినియోగించలేని పరిస్థితి ఏర్పడుతోంది. సమస్యలతోనే చదువులు.. పాలిటెక్నిక్ కళాశాలలో సరైన వసతులు లేకపోవటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంతభవనాలు లేక తరగతుల నిర్వహణకు కూడా ఇబ్బందిగానే ఉందని అధ్యాపకులు సైతం అంగీకరిస్తున్నారు. ఒక్కో బ్రాంచికి 60 మంది చొప్పున వాస్తవంగా ఇక్కడ 320 మంది విద్యార్థులు ఉండాలి. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం వంటి ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ నెలకొన్న ఇబ్బందులను చూసిన తర్వాత విద్యార్థులు చాలా మంది వేరే కళాశాలకు బదిలీ చేయించుకోవటం, మరికొంతమంది మధ్యలోనే మానేసి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కళాశాలలో 219 మంది విద్యార్థులు ఉన్నారు. కో–ఎడ్యుకేషన్ అయినప్పటికీ, కళాశాలకు అనుబంధంగా హాస్టల్ వసతి లేకపోవటంతో బాలికలు చేరేందుకు ఆసక్తి చూపటం లేదు. సరిపడా తరగతి గదులు అందుబాటులో లేకపోవటంతో కళాశాలకు చెందిన ఫర్నీచర్ ఆరుబయటనే పెడుతున్నారు. సామగ్రిని తరగతి గదుల్లోనే ఉంచుతున్నారు. డిజిటల్ తరగతుల నిర్వహణ సవ్యంగా జరగటం లేదు. నిధులు మంజూరయ్యాయి.. సొంత భవనాలు లేకపోవటంతో కళాశాల నిర్వహణ కొంత ఇబ్బందిగానే ఉంది. శాశ్వత భవనాల నిర్మాణం కోసం కృష్ణా యూనివర్సిటీ సమీపంలో 11.93 ఎకరాల భూమిని కేటాయించారు. భవనాల కోసం రూ. 9 కోట్లు మంజూరైనట్లుగా సమాచారం ఉంది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాల్సి ఉంది. విద్యార్థులకు నాణ్యమైన బోధన సాగేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం.– ఎం. శార్వాణి, కళాశాల ప్రిన్సిపల్ -
పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్‌పై వేటు
చిత్తూరు ,పలమనేరు: పట్టణ సమీపంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ విశ్వనాథరెడ్డిపై ఎట్టకేలకు వేటుపడింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అధ్యాపకుడు శ్రీధర్‌ను సైతం సస్పెండ్ చేశారు. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీధర్ అనే అధ్యాపకుడు సెప్టంబరు 26న విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో వారు తరగతులను బహిష్కరించిన విషయం తెలిసిందే. దీనిపై సాంకేతిక విద్యాశాఖ ఆర్జేడీ సూర్యుడు విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ అక్కడి మహిళా అధ్యాపకులను వేధిస్తున్నారనే విషయాలు వెలుగుచూశాయి. ఆర్జేడీ నివేదికను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌కు పంపారు. దీంతో ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకుడిని సస్పెండ్ చేస్తూ ఆ శాఖ కమిషనర్ పండాదాస్ మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌గా మహ్మద్ కళాశాలకు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌గా సివిల్ ఇంజినీరింగ్ హెచ్వోడీగా పనిచేస్తున్న మహ్మద్‌ను నియమించారు. ఆయన శనివారం చార్జ్ తీసుకున్నారు. ఇప్పటికే కళాశాల హాస్టల్ మెస్ విషయంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కళాశాలలో గ్రూపు రాజకీయాలు సాగుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కళాశాల పాలన పూర్తిగా గాడితప్పింది. కొందరు అధ్యాపకులు సమయపాలన పాటించడం లేదు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న ప్రిన్సిపాల్ ఈ సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే. -
పాలిటెక్నిక్‌లో మొదటి ర్యాంకు సాధించిన హర్షిత
కడప అగ్రికల్చర్ : జిల్లాకు చెందిన విద్యార్థిని హర్షిత పాలిటెక్నిక్ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచింది. రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి అం దరిచేత శభాష్ అని పించుకుంది. కడపలోని డ్వామా ప్రాజెక్టులో ఏపీడీగా పనిచేస్తున్న డాక్టర్ జాజుల వరప్రసాద్, చిత్తూరు జిల్లా చంద్రగిరి సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కె.ప్రసూనల కుమార్తె హర్షిత. ఈ విద్యార్థిని తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2015–18 సంవత్సరంలో సివిల్ బ్రాంచ్‌ను పూర్తి చేసింది. ఇటీవల నిర్వహించిన చివరి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో 98.41 శాతం మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకుంది. ఇందుకుగాను ఈనెల 15న ఒంగోలు నగరంలో నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రతిభా అవార్డును హర్షిత అందుకోనుంది. -
మంత్రివర్యా ఇటువైపు చూడరా?
రెండేళ్ల క్రితం వరకు జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఏడాది కిందట టెక్కలికి తరలించారు. నందిగాం మండలం తురకల కోట సమీపంలో కొండల మధ్యనున్న మూత పడిన ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ కళాశాలను ఏర్పాటు చేశారు. ఆ భవనం యాజమాన్యానికి ప్రభుత్వం సుమారు 9 కోట్ల 80 లక్షల రూపాయలు చెల్లించింది. అయితే, కళాశాల ఏర్పాటై ఏడాది గడుస్తున్నా ఇంత వరకు రెగ్యులర్ సిబ్బందిని నియమించలేదు. డిప్యూటేషన్ సిబ్బందితో తరగతులు నిర్వహిస్తుండటం, పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు లేకపోవడం, ల్యాబ్‌లలో సరైన పరికరాలు లేకపోవడం, ప్రభుత్వ వసతి గృహాలు లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇలాకాలో ఉన్న ఈ కళాశాల విషయంలో చిన్నచూపు చూడడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. టెక్కలి: రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల విద్యార్థులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతానికి సర్కార్ కళా శాల మం జూరైందనే సంతోషం కం టే.. పిల్లల కష్టాలే తమను బాధిస్తున్నాయని ఈ ప్రాంతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండలు, తోటల మధ్యలో ఉన్న కళాశాలకు రక్షణ గోడ కూడా లేకపోవడంతో అక్కడ ఉండటానికే పిల్లలు భయపడుతున్నారు. ఈ కారణంగానే ఈ ఏడాది ఇక్కడి సీట్లు కూడా పూర్తిస్థాయిలో భర్తీ కావడం లేదు. కళాశాలలో ప్రస్తుతం ట్రిపుల్ ఈ, సివిల్ బ్రాంచ్‌లు నడుస్తున్నాయి. ఒక్కో బ్రాంచ్‌కి ఐదుగురు ఉపన్యాసకులు (లెక్చరర్లు), ఒక సీనియర్ ఉపన్యాసకుడు, శాఖాధిపతి ఒకరు చొప్పున ఉండాలి. ప్రస్తుతం ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) ఒకరు, ట్రిపుల్ ఈ, సివిల్ బ్రాంచ్‌లకు ఒక్కొక్కరు చొప్పున ఉపన్యాసకులు డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. వీరితో పాటు ఆరుగురు కాంట్రాక్ట్ ఉపన్యాసకులు, ఇద్దరు గెస్ట్ లెక్చరర్లు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం కళాశాలలో ట్రిపుల్ ఈ, సివిల్ బ్రాంచిల్లో మొత్తం 193 మంది విద్యార్థులు ఉన్నారు. అందుబాటులో లేని ల్యాబ్‌లు విద్యార్థులకు తగినన్ని ల్యాబ్‌లు ఏర్పాటు చేయలేదు. మూత పడిన ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న కొన్ని పరికరాలతో ఇప్పుడు ల్యాబ్‌లు నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం 5వ సెమిస్టర్ ల్యాబ్ పరీక్షలు జరగాల్సి ఉండగా అవి జరగడం లేదు. వసతి గృహాలు లేక అవస్థలు.. కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ వసతి గృహాలు లేకపోవడంతో అద్దె ఇళ్లల్లో అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థినులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో ఇంట్లో ముగ్గురు నుంచి ఐదు మంది చొప్పున వేల రూపాయలు అద్దె కడుతూ, వండుకుని తింటూ ఇబ్బందులు పడుతున్నారు. కళాశాలలో అవసరమైనన్ని మరుగుదొడ్లు లేవు. ఉన్నవి పూర్తిగా అధ్వానంగా మారాయి. కళాశాల ఏర్పాటు చేసిన తరువాత విద్యార్థులకు అవసరమైన వాటి కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వెచ్చించకపోవడం గమనించదగ్గ విషయం. కళాశాలలో తగ్గిన సీట్ల భర్తీ: కొండలు, తోటల మధ్యలో కనీస సదుపాయాలు లేని ఈ కాలేజీలో చేరేందుకు విద్యార్థులు కూడా ఆసక్తి చూపడం లేదు. ట్రిపుల్ఈ లో 60, సివిల్ విభాగానికి 60 చొప్పున ప్రభుత్వం సీట్లు కేటాయించగా, ఈ ఏడాది ట్రిపుల్ ఈలో 34, సివిల్‌లో 19 మంది మాత్రమే చేరారు. -
కాసుల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు
శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్) : పాలిటెక్నిక్ విద్యార్థులకు చివరి సెమిస్టర్లో ఉండాల్సిన పారిశ్రామిక శిక్షణపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఆరో సెమిస్టర్‌ను కొనసాగించడానికి స్టేట్‌బోర్టు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వారు సూచించిన నియమ నిబంధనలు కళాశాలలకు కాసుల వర్షం కురిపించేలా ఉన్నాయని విద్యారంగ నిపుణుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సాకుతో ఎస్బీటీఈటీ లక్ష్యాన్ని పక్కదారి పట్టించేలా నియమనిబంధనలకు విరుద్ధంగా అనుసరించడానికి ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేట్ డిప్లొమా కళాశాలలు వ్యూహాలు పన్నుతున్నాయి. చివరి సెమిస్టర్లో స్టేట్‌బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలకు చివరి సెమిస్టర్లో విద్యార్థుల అభిప్రాయం మేరకు ఆర్నెల్ల పారిశ్రామిక శిక్షణ లేదా మూడు సబ్జెక్టులతో కూడిన ఇన్‌హౌజ్ ప్రాజెక్టు అనే రెండుదారులు సూచించారు. ఇందులో ఎక్కువ శాతం మంది విద్యార్థులు పారిశ్రామిక శిక్షణ వైపే మొగ్గుచూపుతున్నారు. అయినా వివిధ సాకులను చూపిస్తూ తమ కళాశాలల్లోనే మూడు సబ్జెక్టులతో కూడిన ఇన్‌హౌజ్ ప్రాజెక్టు వైపు విద్యార్థులకు ఇష్టం లేకుండానే మళ్లించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ప్రాజెక్టు పేరుతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు కళాశాలలు విద్యార్థుల నుంచి అదనంగా డబ్బులు దండుకోవచ్చనే పన్నాగంతో వారి అభిప్రాయాలకు సంబంధం లేకుండానే ఇన్‌హౌజ్ ప్రాజెక్టు వైపునకు బలవంతంగా మళ్లిస్తున్నారని సమాచారం. ఎస్బీటీఈటీ అధికారులు దీనిపై దృష్టి పెట్టి విద్యార్థులు కోరుకున్న విధంగా చివరి సెమిస్టర్ అమలు చేయాలని పలు ప్రైవేట్ కళాశాలల పాలిటెక్నిక్ విద్యార్థులతోపాటు విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొదటి నుంచీ తర్జనభర్జనే.. పాలిటెక్నిక్ కోర్సుల్లో గతంలో దాదాపు చివరి సంవత్సరంలో ఏదైనా ఒక సెమిస్టర్లో ఆర్నెల్ల పారిశ్రామిక శిక్షణ ఉండేది. తర్వాత దీనిని తొలగించి సబ్జెక్టులు జోడించి కేవలం వేసవి సెలవులు, ఇతర సెలవుల్లో నెలరోజుల శిక్షణ పెట్టారు. ఈ నిర్ణయంతో నిపుణులు, విద్యావంతులతోపాటు వివిధ వర్గాల నుంచి పాలిటెక్నిక్ కోర్సులో కచ్చితంగా ఆర్నెల్ల శిక్షణ అవసరమనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో మళ్లీ ఆర్నెల్లకు మార్చారు. 2018–19 విద్యాసంవత్సరంలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆరు నెలల పారిశ్రామిక శిక్షణ లేదా మూడు సబ్జెక్టులతో కూడిన ఇన్‌హౌజ్ ప్రాజెక్టు ఉండాలనే రెండు ఆప్షన్లు ఇవ్వడం వారిని అయోమయంలోకి నెట్టివేస్తున్నాయి. ఈ విధంగా విద్యాసంవత్సరం ప్రారంభమైన నాటినుంచి పారిశ్రామిక శిక్షణపై సరైన స్పష్టత లేకుండానే గడుస్తూ వచ్చింది. తీరా చూసేసరికి అధికారులు రెండు ఆప్షన్లతో కూడిన నిర్ణయానికి వచ్చారు. ఇదే అదునుగా తీసుకుని విద్యార్థులను సంప్రదించకుండానే నేరుగా ఇన్‌హౌజ్ ప్రాజెక్టు వైపునకే మళ్లిస్తున్నట్లు సమాచారం. కొన్ని కళాశాలలు పారిశ్రామిక శిక్షణ వైపునకు వెళ్లాలని భావిస్తుండగా, మరికొన్ని ఇన్‌హౌజ్ ప్రాజెక్టు వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రాజెక్టు సాకుతో దండుకునే పన్నాగం..? ఎస్బీటీఈటీ అధికారులు రూపొందించిన పాలిటెక్నిక్ సెమిస్టర్లో పాటించాల్సిన నియమ నిబంధనలు కళాశాలలకు కాసుల వర్షం కురిపించేలా ఉన్నాయని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆర్నెల్ల పారిశ్రామిక శిక్షణకు పంపితే విద్యార్థులు నేరుగా పరిశ్రమలకే సంబంధిత ఫీజు చెల్లించే అవకాశాలుంటాయని.. దీంతో కళాశాలలకు ఒరిగేదేమీ ఉండదని భావించి, సబ్జెక్టులతో కూడిన ప్రాజెక్టు వర్క్ ఆప్షన్ ఎంపిక చేస్తే విద్యార్థులు కళాశాలలోనే ఉండడంతోపాటు ప్రాజెక్టు పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు దండుకునే పన్నాగం పన్నుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ మేర కు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు కళాశాలల్లో విద్యార్థులతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకోకుండానే నేరుగా కళాశాల యాజ మాన్యాలే ప్రాజెక్టు వైపు నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఆరో సెమిస్టర్లో విద్యార్థులకు అన్యాయం జరగడంతోపాటు కళాశాలలకు కాసుల వర్షం కురవడం ఖాయమనే భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు కళాశాలలు ఆరు నెలల పారిశ్రామిక శిక్షణ వైపునకు మొగ్గుచూపగా పలు కళాశాలలు ప్రాజెక్టు పేరుతో డబ్బులు దండుకోవాలనే ఊగిసలాటలో నిర్ణయాన్ని బయట పెట్టడంలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నగరానికి సమీపంలో ఉన్న ఒక పాలిటెక్నిక్ యాజమాన్యం మాత్రం విద్యార్థులను నామమాత్రంగా సంప్రదించి మూడు సబ్జెక్టులతో కూడిన ఇన్‌హౌజ్ ప్రాజెక్టు వైపు మళ్లించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. సొంత అభిప్రాయానికి ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల ఆశలకు గండికొడుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆరో సెమిస్టర్లో పాలిటెక్నిక్ విద్యార్థులకు రెండు దారులు ఆప్షన్లు కా కుండా ఏదో ఒకటే అధికారులే నిర్ణయించి నిబంధనలు రూపొందిస్తే బాగుంటుందని, రెండు దారులుండడంతో అయోమయానికి గురవుతున్నామని పలువురు విద్యార్థులు పెదవి విరుస్తున్నారు. ఎస్బీటీఈటీ అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాలిటెక్నిక్ ఆరో సెమిస్టర్లో అవలంబించే తీరుపై ప్రత్యేక నిఘాపెట్టి అక్రమాలకు పాల్పడడానికి ప్రయత్నిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
విద్యార్థి ఆత్మహత్య
తిరుపతి ఎడ్యుకేషన్: హాస్టల్ సీటు తొలగించారన్న మనస్తాపంతో పాలిటెక్నిక్ కళాశాల ఫైనలియర్ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం వెలుగు చూసింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు కళాశాల ఎదుట బైఠాయించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తురకపల్లికి చెందిన దస్తగిరి, జ్ఞానమ్మ దంపతుల కుమారుడు అశోక్ తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో ఉంటూ సెకండ్ షిప్ట్ ద్వారా తృతీయ సంవత్సరం ఈఈఈ అభ్యసిస్తున్నాడు. శనివారం తరగతి జరుగుతుండడంతో కాంట్రాక్ట్ అధ్యాపకురాలు పి.అఫియ అరుణోదయపై కామెంట్లు చేసేవాడు. అంతకుముందు కూడా అశోక్ రెండు మూడు మార్లు అలా చేయడంతో ఆమె అతని ప్రవర్తనపై విసుగు చెంది ప్రిన్సిపాల్ కె.వెంకట్రామిరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో అశోక్‌ను ప్రిన్సిపాల్ తన చాంబర్‌కు పిలిపించి తల్లిదండ్రులను తీసుకురావాలని తెలిపారు. లేకుంటే హాస్టల్ సీటు తొలగిస్తామని హెచ్చరించారు. తండ్రి మరణించడంతో తల్లికి ఈ విషయం తెలిస్తే బాధపడుతుందని అశోక్ మనస్తాపం చెందాడు. ఆదివారం, సోమవారం హాస్టల్లోనే ఉన్నాడు. ఈ నెల 25వ తేదీ మంగళవారం కుటుంబ సభ్యులను తీసుకురాలేనని, హాస్టల్ నుంచి తనను తొలగించి, నాకు రావాల్సిన సొమ్ము తిరిగివ్వాలంటూ ప్రిన్సిపాల్‌కు లిఖిత పూర్వకంగా రాసిచ్చాడు. అదే రోజు సాయంత్రం నుంచి హాస్టల్‌కు రాకపోవడంతో తోటి విద్యార్థులు బుధవారం వెతికారు. గురువారం ఉదయం రైలు కింద పడి యువకుడు మృతి చెందాడని తెలుసుకుని వెళ్లి చూసి అశోక్‌గా గుర్తించారు. అధ్యాపకుల వేధింపులతోనే... అశోక్ మరణంతో ఆగ్రహించిన విద్యార్థులు విద్యార్థి సంఘం నాయకులతో కలిసి కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈఈఈ విభాగంలోని అధ్యాపకులు కొందరు వేధిస్తుంటా రని ఆరోపించారు. కావాలనే మార్కులు తగ్గిస్తున్నారని వాపోయారు. ఆ విధంగానే శనివారం తరగతి గదిలో అశోక్‌ను మందలించడంతో పాటు అధ్యాపకురాలు చేయి చేసుకున్నారని పేర్కొన్నారు. పైగా హాస్టల్ సీటును తొలగిస్తామని చెప్పడంతో మనస్తాపం చెందాడని, మంగళవారం సాయంత్రం హాస్టల్ వదిలి పెట్టి వెళ్లడం కంటే చావడమే మేలని తమతో పేర్కొన్నట్లు తెలిపారు. అదే రోజు రాత్రి నుంచి హాస్టల్‌కు రాకపోవడంతో బుధవారం వెతికామని, గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లామన్నారు. గుర్తు తెలియని యువకుడు రైలు కిండ పడి మృతి చెందాడని తెలుసుకుని వెళ్లి చూడగా అశోక్‌గా గుర్తించినట్లు తెలిపారు. చదువులో ఎప్పుడూ ముందుండే అశోక్ ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని తాము ఊహిం చలేదని వాపోయారు. ఉద్రిక్త వాతావరణం విద్యార్థుల ఆందోళనతో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రిన్సిపాల్ చాంబర్ కిటికీ అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వెస్ట్ సీఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. విద్యార్థులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తమకు నిర్ధిష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు తెగేసి చెప్పారు. ప్రిన్సిపాల్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఆర్జేడీ సూరీడు నేతృత్వంలో విచారణ జరిపించి బాధితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. చర్యలు తీసుకుంటాం అధ్యాపకులు వేధిస్తున్నారనే విషయంపై విద్యార్థులు తనకు ఫిర్యాదు చేయలేదు. అశోక్ మృతికి అధ్యాపకుల వేధింపులే కారణమని విచారణలో తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అధ్యాపకురాలి ఫిర్యాదుతో అశోక్‌ను మందలించాను. తల్లిదండ్రులను తీసుకురాకుంటే హాస్టల్ సీటు తొలగిస్తానని హెచ్చరించిన మాట వాస్తవమే. తల్లిదండ్రులను తీసుకురాలేనని, హాస్టల్ సీటు తొలగించాలని అతనే లిఖిత పూర్వకంగా రాసిచ్చాడు. ఇంతలో ఇలా తమ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.– కె.వెంకట్రామిరెడ్డి, ప్రిన్సిపాల్,ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, తిరుపతి -
పాలిటెక్నిక్ విద్యార్థినుల ధర్నా
చిత్తూరు, పలమనేరు: పలమనేరు సమీపంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల బుధవారం ఆందోళనలతో దద్దరిల్లింది. ఓ అధ్యాపకుడు అకారణంగా తమను వేధిస్తున్నాడంటూ ముగ్గురు విద్యార్థినులు ఆరోపించారు. తర్వాత తమ తల్లిదండ్రులతో కలసి కళాశాల నుంచి వెళ్లిపోతామంటూ గొడవకు దిగారు. ఈవ్యవహారం క్రమంగా పెద్దదై విద్యార్థినుల ధర్నా, ఆపై మహిళా అధ్యాపకుల నిరసన వ్యక్తం చేసే స్థాయికి చేరింది. విద్యార్థినులకు మద్దతుగా సీఐటీయూ నాయకులు రావడంతో అక్కడి విషయాలు బయటపడ్డాయి. ఇక్కడ కళాశాలలో ఏపీ, తెలంగాణకు చెందిన 500 మందికి పైగా విద్యనభ్యసిస్తున్నారు. అక్కడ పనిచేసే ఎలక్ట్రానిక్స్ అధ్యాపకుడు శ్రీధర్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ముగ్గురు విద్యార్థినులు ప్రిన్సిపల్ విశ్వనాథరెడ్డికి ఫిర్యాదు చేశారు. దానికితోడు హాస్టల్లో సౌకర్యాలు లేవని తాము ఇక్కడ ఉండలేమని ఇళ్లకు వెళ్లిపోతామంటూ విన్నవించారు. అయితే ప్రిన్సిపల్ వారి మాటలను ఖాతరు చేయలేదు. దీంతో వందలాది మంది విద్యార్థినులు ప్రిన్సిపల్ గది ఎదుట ధర్నాకు దిగారు. మెస్‌లో పెట్టే భోజనంలో పురుగులున్నాయని ఆరోపించారు. మెస్‌లో వంట చేయడానికి కూడా తమను ఉపయోగించు కుంటున్నారని, అనారోగ్యానికి గురైతే కనీసం ఆస్పత్రికి కూడా పంపడం లేదన్నారు. ఇక్కో విద్యార్థినికి కేవలం 5 కాయిన్స్ మాత్రమే ఇచ్చి కుటుంబ సభ్యులతో కాయిన్‌బాక్స్‌లో మాట్లాడమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ కాయిన్‌బాక్స్ కూడా మరమ్మతులకు గురైనా.. పట్టించుకునే నాథుడు లేకుండా పోయారని ఆరోపించారు. తమకు న్యాయం జరిగేదాకా ధర్నా విరమించబోమంటూ విద్యార్థినులు భీష్మించారు. మహిళా అధ్యాపకులను వేధిస్తున్న ప్రిన్సిపల్ ఇది ఇలా ఉండగా ప్రిన్సిపల్ విశ్వనాథ రెడ్డి తమ ను వేధిస్తున్నారంటూ పలువురు మíహిళా అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు కూడా నిరసనకు సిద్ధమయ్యారు. విషయం ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కావడంతో ఆర్జేడీ సూర్యుడు కళాశాల వద్దకు చేరుకున్నారు. బాధిత విద్యార్థినులను, మహిళా అధ్యాపకులను విచారించారు. బాధ్యులపై వేటు తప్పదు.. విచారణ అనంతరం ఆర్జేడీ మీడియాతో మట్లాడారు. విద్యార్థినులను శ్రీధర్ అనే అధ్యాపకుడు వేధిస్తున్న మాట నిజమేనని, ఈ విషయం విచారణలో స్పష్టమైందన్నారు. గతంలోనే ఆయనకు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు చెప్పారు. మరోవైపు మహిళా అధ్యాపకులకు మెటర్నటీ లీవ్ అడిగితే ఎందుకు ఎంజాయ్ చేసేందుకా..? అనడం, సర్టిఫికెట్లను ఇవ్వకుండా సతాయించడం తదితరాల ఆరోపణలన్నీ వాస్తవాలేనన్నారు. వీరిపై కమిషనర్‌కు నివేదికను పంపిస్తామని, బాధ్యులపై వేటు తప్పదని ఆయన పేర్కొన్నారు. -
అమ్మా.. కాలేజికి వెళ్తున్నా..
ప్రొద్దుటూరు క్రైం (వైఎస్సార్ కడప): ఆ విద్యార్థినిది ఒక పల్లెటూరు.. ఆమెకు చిన్నప్పటి నుంచి వ్యవసాయానికి సంబంధించిన కోర్సు చేసి రైతులకు సాయ పడాలని కోరిక. అయితే కుటుంబ సభ్యుల సలహా మేరకు విద్యార్థిని ప్రొద్దుటూరులోని పాలిటెక్నిక్ కాలేజీలో చేరింది. బలవంతంగా చదువును కొనసాగించడం తన వల్ల కాదని భావించి ఆమె తనువు చాలించింది. కన్నవారికి కన్నీరు మిగిల్చింది. ప్రొద్దుటూరులో పాలిటెక్నిక్ చదువుతున్న అంగళ్లగుత్తి నందన (17) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. మెస్‌లోని గోడకున్న పొడవాటి మేకుకు చున్నీ కట్టుకొని విద్యార్థిని ఉరివేసుకుంది. త్రీ టౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నూరు మండలం, ఉప్పరపల్లె గ్రామంలోని దళితవాడకు చెందిన నాగేశ్వరరావు, రామతీర్థమ్మ దంపతులకు నందిని, నందన అనే కుమార్తెలతోపాటు నాని అనే కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమార్తె నందిని అనంతపురంలో రెండో సంవత్సరం పాలిటెక్నిక్ చదువుతుండగా, రెండో కుమార్తె నందన ప్రొద్దుటూరులోని పాలిటెక్నిక్ కాలేజిలో మొదటి సంవత్సరం ట్రిపుల్ఈ చదువుతోంది. తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తాను చదువుకోకున్నా పిల్లలను చదివించి ప్రయోజకులను చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బాగా చదివిస్తున్నాడు. మెస్‌లో చేరి నెల కూడా కాలేదు.. నందన తోటి విద్యార్థులతో కలసి ఈ నెల 3న సరస్వతి విద్యామందిరం రోడ్డులో ఉన్న లేడీస్ మెస్‌లో ఉంటోంది. రెండు రోజుల పాటు మెస్‌లో ఉన్న నందన తల్లిదండ్రులు రమ్మన్నారని ఊరికి వెళ్లింది. తిరిగి ఈ నెల 25న ఆమె తండ్రితో కలిసి ప్రొద్దుటూరుకు వచ్చింది. తండ్రి నాగేశ్వరరావు మెస్ ఫీజు రూ.2500 చెల్లించి వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు సాయంత్రం నందన మళ్లీ మెస్ నుంచి ఊరికి వెళ్లింది. కొత్త కావడంతో కొన్ని రోజుల పాటు ఇలానే ఉంటుందని తల్లిదండ్రులు కుమార్తెతో చెప్పేవారు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు ఇంటి వద్ద ఉన్న నందన తల్లిదండ్రుల సూచన మేరకు సోమవారం ఉదయం 9.30 సమయంలో మెస్‌కు వచ్చింది. అప్పటికే మెస్‌లోని విద్యార్థులందరూ కాలేజికి వెళ్లగా తల నొప్పి కారణంతో ఒక విద్యార్థిని వరండాలో పడుకొని ఉంది. సుమారు 10.30 గంటల సమయంలో వరండాలో పడుకున్న విద్యార్థిని లోపలికి వెళ్లగా అప్పటికే నందన ఉరి తాడుకు వేలాడుతోంది. ఆ దృశ్యాన్ని చూసిన విద్యార్థిని గట్టిగా కేకలు వేస్తూ పరుగెత్తుకుంటూ బయటికి వచ్చింది. దీంతో మెస్ నిర్వాహకులు వెంటనే త్రీ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ ఓబులేసు, త్రీ టౌన్ ఎస్ఐ కృష్ణంరాజునాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నందన ఊరి నుంచి వచ్చిన గంటలోపే ఈ దారుణానికి పాల్పడింది. కుమార్తె మృతి చెందిన విషయాన్ని పోలీసులు తల్లిదండ్రులకు తెలపడంతో హుటాహుటిన వారు ప్రొద్దుటూరుకు వచ్చారు. కుమార్తె మృతదేహాన్ని చూసి విలపించసాగారు. అమ్మా.. కాలేజికి వెళ్తున్నా.. సోమవారం ఉదయం నందన ఎక్కువ సేపు తల్లి వద్దనే గడిపింది. ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోవద్దని, బాగా చదవాలని ఆమె సూచించారు. ప్రొద్దుటూరుకు వెళ్లగానే ఫోన్ చేయమని కుమార్తెతో చెప్పారు. ఉదయం 9.30 గంటలకు నందన మెస్‌కు చేరుకుంది. వెంటనే మెస్ వద్ద ఉన్న కాలేజి విద్యార్థిని సెల్‌ఫోన్‌తో తల్లికి ఫోన్ చేసి ‘ఇప్పుడే మెస్‌కు వచ్చాను.. కాలేజికి వెళ్తున్నాను అమ్మా.. సాయంత్రం కాలేజి నుంచి వచ్చాక ఫోన్ చేస్తానని’ చెప్పింది. ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ తల్లి రామతీర్థమ్మ రోదిస్తోంది. నందనకు సెల్‌ఫోన్ వాడటం అలవాటు లేదు. అందువల్ల కాలేజి విద్యార్థులతో గానీ మెస్ వాళ్ల ఫోన్‌తో తల్లిదండ్రులతో మాట్లాడేది. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లి విలపించసాగింది. నందనకు పాలిటెక్నిక్ చదవడం ఇష్టం లేదని, అగ్రికల్చర్ కోర్సు చదవాలని చెబుతుండేదని కాలేజి విద్యార్థులు అన్నారు. ఈ కారణంతోనే కాలేజికి సరిగా వచ్చేది కాదని, మెస్‌లో కూడా ఎవ్వరితో మాట్లాడేది కాదని తెలిపారు. ఈ నెల 3న మెస్‌లో చేరినా ఎక్కువ రోజులు ఉండలేదని నిర్వాహకులు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ ఎస్ఐ కృష్ణంరాజునాయక్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. -
అర్హత మార్కులపై ఆరాటం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంసెట్‌తోపాటు ఇతర ప్రవేశ పరీక్షలకు సంబంధించిన అర్హత(క్వాలిఫైడ్) మార్కుల విషయంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ప్రవేశ పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో అర్హత మార్కులు పొందుతున్న వారికంటే సీట్ల సంఖ్య అధికంగా ఉండడంతో అవి భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. ప్రతిఏటా వేలాది సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. క్వాలిఫైడ్ మార్కులను తగ్గిస్తే ఎక్కువ మంది అర్హత సాధిస్తారని, తద్వారా సీట్లు భర్తీ చేసుకోవచ్చని యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వంపై వివిధ మార్గాల్లో ఒత్తిడి పెంచుతున్నాయి. ఇంజనీరింగ్‌లో 2 మార్కులు తగ్గిస్తే.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీలు 406 ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్స రానికి వీటిలో 1,66,373 సీట్ల భర్తీకి ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. ఇంజనీరింగ్‌లో 1.38 లక్షల మంది, బైపీసీ స్ట్రీమ్‌లో 63,000 మంది అర్హత సాధించారు. ఇటీవల నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్‌లో ఇంజనీరింగ్ ఎంపీసీ స్ట్రీమ్‌లో 89,592 కన్వీనర్ కోటా సీట్లకుగాను ఇంకా 47,000 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఆదివారం నుంచి రెండో విడత కౌన్సెలింగ్ చేపట్టినా పెద్దగా స్పందన లేదు. బైపీసీ స్ట్రీమ్‌లోనూ భారీగా సీట్లు మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎంసెట్‌లో అర్హత మార్కులను తగ్గించాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఎంసెట్‌లో అర్హత పొందాలంటే 160 మార్కులకుగాను 25 శాతం అంటే 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది. అందులో 2 మార్కులు తగ్గించాలని యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. దానివల్ల కొత్తగా మరో 20,000 మంది అర్హత సాధిస్తారని, కొన్ని సీట్లు భర్తీ అవుతాయని పేర్కొంటున్నాయి. క్వాలిఫైడ్ మార్కుల తగ్గింపునకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనా«థ్ దాస్ ససేమిరా అంటున్నట్లు సమాచారం. క్వాలిఫైడ్ మార్కుల తగ్గింపు వల్ల ఎక్కువ మంది ఇంజనీరింగ్‌లో చేరుతారని, ఫలితంగా ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో ఖజానాపై అధిక భారం పడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పాలిసెట్‌లో 39,444 సీట్లు ఖాళీ రాష్ట్రంలోని 291 పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 74,312 సీట్లు ఉన్నాయి. వీటి భర్తీ కోసం ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యింది. అయినా ఇంకా 39,444 సీట్లు మిగిలిపోయాయి. ఈ నెల 5, 6 తేదీల్లో మూడో విడత కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. అయినా సీట్లన్నీ భర్తీ అయ్యే అవకాశం లేదని సమాచారం. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ‘పాలిసెట్’లో కూడా అర్హత మార్కులను తగ్గించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పాండాదాస్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పాలిసెట్‌లో 120 మార్కులకుగాను 30 శాతం అంటే 36 మార్కులు సాధిస్తే అర్హులవుతారు. దీన్ని 25 శాతానికి అంటే 30 మార్కులకు కుదించాలని ప్రతిపాదనలు పంపగా.. అనుమతిస్తూ విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేశారు. అయితే, సంబంధిత ఫైల్ ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వద్ద పెండింగ్‌లో ఉంది. ఎటూ తేలని డీఎడ్ ప్రవేశాలు డీఎడ్ కోర్సులో ప్రవేశానికి సంబంధించిన డీఈఈసెట్లో అర్హత మార్కుల తగ్గింపు వ్యవహారాన్ని ప్రభుత్వం కొన్ని నెలలుగా నాన్చుతోంది. దాదాపు 65,000 సీట్లు అందుబాటులో ఉండగా అర్హులైన అభ్యర్థులు కేవలం 12,000 మంది ఉన్నారు. భారీగా సీట్లు మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ఇంకా చేపట్టలేదు. డీఈఈసెట్లో అర్హత సాధించాలంటే ఓసీలు 50 శాతం, బీసీలు 40 శాతం, ఎస్సీ, ఎస్టీలు 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. అయితే ఓసీలు, బీసీలకు అర్హత మార్కులను 35 శాతానికి కుదించాలని, ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులు పెట్టరాదని కాలేజీల యాజమాన్యాలు బేరసారాలు సాగిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో డీఎడ్ ప్రవేశాలు నిలిచిపోయాయి. -
రేపటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
ఖమ్మంకల్చరల్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంసెట్ కౌన్సెలింగ్ ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం తొలిరోజు నుంచే ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లింపునకు అవకాశం ఉంటుంది. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ 28వ తేదీ నుంచి ప్రారంభమై.. అదేరోజు కళాశాలలు, సీట్ల కోసంవెబ్ కౌన్సెలింగ్ కొనసాగుతుంది. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని అధికారులు పేర్కొంటున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు కలుపుకొని సుమారు 5వేల మందికిపైగా విద్యార్థులు వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొంటారని అంచనా వేసిన అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొత్తగూడెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. షెడ్యూల్ ఇలా.. ఈనెల 28వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ అదేరోజు నుంచి జూన్ 5వ తేదీ వరకు కొనసాగుతుంది. విద్యార్థులకు సీట్లను జూన్ 8వ తేదీన కేటాయిస్తారు. ఫీజు చెల్లింపు, కళాశాలల్లో రిపోర్టింగ్ జూన్ 8వ తేదీ నుంచి 12వ తేదీలోగా చేయాల్సి ఉంటుంది. ర్యాంకులవారీగా... మే 28వ తేదీన ఒకటో ర్యాంకు నుంచి 10వేల ర్యాంకు, మే 29న 10,001వ ర్యాంకు నుంచి 25వేల ర్యాంకు, మే 30న 25,001వ ర్యాంకు నుంచి 40వేల ర్యాంకు, మే 31న 40,001వ ర్యాంకు నుంచి 54వేల ర్యాంకు, జూన్ 1న 54,001వ ర్యాంకు నుంచి 68వేల ర్యాంకు, జూన్ 2న 68,001 నుంచి 82వేల ర్యాంకు, జూన్ 3న 82,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు పొందిన విద్యార్థుల వరకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసేందుకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న రెండు కళాశాలల్లో కోఆర్డినేటర్లను నియమించారు. ఆయా కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందితోపాటు అదనంగా మరికొందరు కంప్యూటర్ ఆపరేటర్లను ఔట్సోర్సింగ్ పద్ధతిన నియమించారు. సమర్పించాల్సిన పత్రాలు కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్, ర్యాంకు కార్డు, పదో తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు, ఆరు నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఆదాయ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, ఇంటర్ టీసీతో హాజరుకావాల్సి ఉంటుంది. పీహెచ్సీ, ఎన్సీసీ, సీఏపీ కోటాకు చెందిన విద్యార్థులు మాత్రం హైదరాబాద్‌లోని ఎస్వీ భవన్, మాసబ్ ట్యాంక్ ఏరియాలో జరిగే కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరుకావాల్సి ఉంటుంది. ఏర్పాట్లు పూర్తి చేశాం.. సోమవారం నుంచి జరిగే ఎంసెట్ కౌన్సెలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆన్లైన్లో రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. గతంలో పనిచేసిన అనుభవంతో ఎలాంటి అక్రమాలు, తప్పిదాలు జరగకుండా ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తాం. కౌన్సెలింగ్ కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యమైనా విద్యార్థులు సహకరించాలి. – కె.సుదర్శన్‌రెడ్డి, ఖమ్మం జిల్లా ఎంసెట్ కోఆర్డినేటర్ -
పది చదువు..ఆపై కొలువు
పదోతరగతి విద్యార్హతతో ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకొనే కోర్సుల్లో పశుసంవర్ధక పాలిటెక్నిక్ కోర్సు ప్రధానంగా ఉంది. ఈ డిప్లొమా కోర్సును తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో 7 కళాశాలలు ఏర్పాటు చేయగా ఇందులో రాపూరు వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ఒకటి. పది ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఇందులో చేరి డిçప్లొమా కోర్సును పూర్తి చేస్తే పశుసంవర్థక శాఖలో వెటర్నరీ సహయకుల ఉద్యోగాలకు అర్హులవుతారు. ప్రైవేటు డైయిరీల్లోనూ ఉపాధి అవకాశాలను అందిపుక్చుకోవచ్చు. రాపూరు: గ్రామీణ ప్రాంతంలో పదోతరగతి వరకే పరిమితమవుతున్న పేద విద్యార్థులకు పశువైద్యంలో ప్రభుత్వం, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పశుసంవర్థక శాఖ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కోర్సులను బోధించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు కళాశాలలను నిర్వహిస్తుంది, రాపూరు (నెల్లూరు జిల్లా), రామచంద్రాపురం (పశ్చిమగోదావరి), పలమనేరు (చిత్తూరు), మడకశిర (అనంతపురం), బద్వేల్ (కర్నూల్), గడివిడి (విజయనగరం) ప్రాంతాల్లో ఈ కళాశాలలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాకు సంబం«ధించి రాపూరుకు 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న బొజ్జనపల్లి సమీపంలో సుమారు 30 ఎకరాల స్థలంలో శాశ్వత భవనాలతో పశుసంవర్ధక పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటుచేయడం జరిగింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006 సంవత్సరం జూన్ 3వ తేదీన రాపూరులో పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2007–2008 విద్యాసంవత్సరం నుంచి రాపూరు బాలికల ఉన్నత పాఠశాలలోని మూడుగదుల్లో తరగతులను ప్రారంభించారు.అనంతరం బొజ్జనపల్లి వద్ద కళాశాలను సుమారు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించారు. బాలుర, బాలికలకు వేరువేరుగా వసతి గృహాలు, ప్రిన్సిపాల్ వసతి, వాచ్‌మేన్ గది, సీసీరోడ్లు, విద్యుత్‌దీపాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు రక్షణగా 9 మంది సెక్యూరిటీ గార్డులను నియమించారు. 2006 నుంచి 2014 వరకు ఏటా 20 సీట్లు కల్పిస్తు వచ్చారు.ఇందులో చేరేందుకు గ్రామీణ విద్యార్థులనుంచి ఆసక్తి పెరగడంతో 2015 నుంచి అదనంగా 10 సీట్లు పెంచి మొత్తం 30 సీట్లలో విద్యార్థులను చేర్చుకుంటున్నారు. వసతి సౌకర్యంరెండేళ్ల కోర్సుకాలంలో విద్యార్థులు వసతిగృహాల్లోనే ఉండేలా అన్ని వసతులు కల్పించారు.రాపూరులో కళాశాల ప్రక్కనే విద్యార్థిని, విద్యార్థులకు వేరువేరుగా చక్కటి వసతి గృహ భవనాలను ఏర్పాటుచేశారు. దరఖాస్తు చేసుకునేదిలా.. రాపూరు ప్రభుత్వ వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల్లో 30 సీట్లు ఉన్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు కోర్సులో చేరాలంటే ఎస్సీ, ఎస్టీలకు 10వ తరగతిలో55శాతం, ఓసీ, బీసీలకు 60 శాతం మార్కులు ఉండాలి. కోర్సులో చేరేవారికి 22సంవత్సరాల లోపు ఉండాలి. డబ్ల్యూడబ్ల్యూ .ఎస్‌వివియు.ఈడీయు.ఇన్ ఆన్లైన్లో దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని శ్రీవెంకటేశ్వర పశుసంవర్థక కళాశాల, తిరుపతికి దరఖాస్తు చేసుకుంటే వారు కౌన్సిలింగ్ ద్వారా ఎంపిక చేస్తారు. జూన్ మాసంలో పత్రికా ప్రకటనద్వారా లేదా ఆన్లైన్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఉపాధి అవకాశాలిలా.. కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు పశుసంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ల ఉద్యోగాలకు అర్హులవుతారు.ప్రైవేటు రంగంలో డైరీ, పౌల్ట్రీ పరిశ్రమల్లోనూ ఉద్యోగ అవకాశాలుంటాయి. ప్రస్తుతం వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడిపరిశ్రమ వృద్ధి చెందుతోంది. పాల ఉత్పత్తుల్లో రెండంకెల వృద్ధి సాధనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్యుల కొరత తీవ్రంగా ఉన్నా నేపథ్యంలో పశువైద్యసేవలతో స్వయం ఉపాధి పెంపొందించుకోవచ్చు . ఇంటర్ ఆపై తరగతులు చదివే స్తోమత లేని విద్యార్థులు పదోతరగతి ఉతీర్ణతతో ఈ కోర్సులో చేరితే త్వరగా ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంది. ఉపాధి అవకాశాలు మెండు వ్యవసాయ రంగానికి ప్రత్యామ్నాయంగా పాడిపరిశ్రమ పురోభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కోర్సు పూర్తి చేసినవారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రభుత్వ పశుసంర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నందున వాటిని భర్తీ చేసినప్పుడు సులభంగా ఉద్యోగవాకాశాలు పొందవచ్చు. రాపూరు కళాశాల్లో సీట్ల భర్తీకి శ్రీవెకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం నుంచి త్వరలో ప్రకటన వెలువడనుంది. – పి. వెంకటేశ్వరావు, ప్రిన్సిపాల్, వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల, రాపూరు -
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. పాలిటెక్నిక్ కోర్సు అనంతరం ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీ ఈసెట్) ఫలితాలను ఏపీ మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. మొత్తం 98.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నేడు 44 వేల ర్యాంకు వరకు వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మంగళవారం నిర్వహించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 22 వేల ర్యాంకులోపు విద్యార్థులు 6,633 మంది హాజరైనట్లు పాలీసెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. నేడు 22,001 ర్యాంకు నుంచి 44 వేల ర్యాంకు వరకు వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థులు ఈనెల 21వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వెల్లడించారు. -
నేటి నుంచి పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈనెల 14 నుంచి రిజిస్ట్రేషన్లను ప్రారంభించనున్నట్లు పాలిసెట్–2018 కన్వీనర్ నవీన్ మిట్టల్, ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై, పాలిసెట్‌లో ర్యాంకు సాధించిన విద్యార్థులు ప్రవేశాలకు అర్హులని చెప్పారు. సీబీఎస్ఈ/ఐసీఎస్ఈ విద్యార్థుల ప్రవేశాలు మాత్రం వారి పదో తరగతి ఉత్తీర్ణతను బట్టి ఉంటాయని వెల్లడించారు. విద్యార్థులు 14 నుంచి 18వ తేదీ వరకు ఆన్లైన్లో ((https://tspolycet. nic.in)) రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే రూ.300, ఇతరులు రూ.600 ప్రాసెసింగ్ ఫీజు ఆన్లైన్ (క్రెడిట్/డెబిట్‌కార్డు/నెట్ బ్యాంకింగ్) ద్వారా చెల్లించాలని వివరించారు. ఫీజు చెల్లించేటప్పుడు విద్యార్థి తన మొబైల్ నంబరు, ఈ–మెయిల్ ఐడీ, ఆధార్ నంబరు ఇవ్వాలని, ఆదాయ ధ్రువీకరణ పత్రం (వర్తించే వారు) నంబరు ఇవ్వాలని సూచించారు. ఆ తర్వాత హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని పేర్కొన్నారు. తగ్గిన కాలేజీలు, సీట్లు ఈసారి పాలిటెక్నిక్ కాలేజీలతోపాటు సీట్లు తగ్గిపోయాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 181 కాలేజీల్లో 43,082 సీట్లు అందుబాటులో ఉండగా, ఈసారి 13 కాలేజీలు తగ్గిపోయాయి. 4,470 సీట్లకు కోత పడింది. రాష్ట్రవ్యాప్తంగా 168 కాలేజీల్లో 38,612 సీట్ల భర్తీకి సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గతేడాది 55 ప్రభుత్వ కాలేజీల్లో 11,752 సీట్లు ఉండగా.. ఈసారి అవే కాలేజీల్లో 11,512 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. 2 ఎయిడెడ్ కాలేజీల్లో గతేడాది 420 సీట్లు ఉండగా, ఈసారి 360 సీట్లు ఉన్నట్లు తెలిపింది. గతేడాది 122 ప్రైవేటు కాలేజీల్లో 30,190 సీట్లు ఉండగా, ఈసారి 111 ప్రైవేటు కాలేజీల్లో 26,740 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వివరించింది. వెబ్సైట్లో సమగ్ర వివరాలు ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించి తేదీల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సిన విద్యార్థుల ర్యాంకుల వివరాలను సాంకేతిక విద్యాశాఖ తమ వెబ్సైట్లో పొందుపరిచింది. ఏ ర్యాంకుల వారికి ఏయే కాలేజీల్లో సీట్లు వచ్చాయనే వివరాలను విద్యార్థుల అవగాహన కోసం వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. విద్యార్థులు పాలిసెట్ ర్యాంకు కార్డు, ఆధార్ కార్డు, టెన్త్ మెమో, రాష్ట్ర ఎస్సెస్సీ బోర్డు కాకుండా ఇతర బోర్డుల వారు హాల్‌టికెట్, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, 2018 జనవరి 1 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలని వెల్లడించింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయబోయే విద్యార్థులు ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వారికి రెండో దశలో మిగిలిపోయే సీట్లను కేటాయిస్తారు. వారు టెన్త్ ఉత్తీర్ణులైతేనే ఆ సీటు ఇస్తారు. ఇదీ ప్రవేశాల షెడ్యూలు 14–5–2018 నుంచి 18–5–2018: ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు 15–5–2018 నుంచి 19–5–2018: సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 15–5–2018 నుంచి 21–5–2018: వెరిఫికేషన్ పూర్తయిన వారికి వెబ్ ఆప్షన్లు 23–5–2018: మొదటి దశ సీట్లు కేటాయింపు 23–5–2018 నుంచి 27–5–2018 వరకు: ట్యూషన్ ఫీజు చెల్లించడంతోపాటు కాలేజీలో చేరేందుకు ఆన్లైన్లో అంగీకారం తెలపాలి. సీట్లు పొంది ఫీజు చెల్లించకుండా, అంగీకారం తెలుపకపోతే రెండో దశలో అవకాశం ఉండదు. మొదటి దశలో సీటు వస్తే అంగీకారం తెలిపి, ఫీజు చెల్లించాలి. వారి పాత ఆప్షన్ల ప్రకారం కాలేజీలు, సీటును మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. 24–5–2018 నుంచి 27–5–2018: సీట్లు రాని వారు ఆప్షన్లను మార్చుకోవచ్చు. ఒకవేళ మార్చుకోకపోతే ముందుగా వారు ఇచ్చిన ఆప్షన్లనే పరిగణనలోకి తీసుకుంటారు. 30–5–2018: సీట్లు మెరుగుపరుచుకోవాలని అంగీకారం తెలిపిన వారికి, మొదటి దశలో సీట్లు రాని వారికి రెండో దశ సీట్లు కేటాయిస్తారు. మిగిలిన సీట్లను టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాయబోయే వారికి కేటాయిస్తారు. 30–5–2018 నుంచి 1–6–2018 వరకు: ట్యూషన్ ఫీజు చెల్లింపు, కాలేజీల్లో చేరికలు 1–6–2018 నుంచి: తరగతులు ప్రారంభం -
ఏడుగురికి 120/120 మార్కులు!
సాక్షి, హైదరాబాద్: పాలిసెట్–2018 ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ఏడుగురు విద్యార్థులు 120 మార్కులకు 120 మార్కులను సాధించి ఒకటో ర్యాం కును సాధించారు. గత నెల 21న జరిగిన పాలిసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 1,25,063 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 1,21,422 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 1,12,010 మంది (92.21 శాతం) విద్యార్థులు అర్హత సాధించినట్లు సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. మంగళవారం సాంకేతిక విద్యా కమిషనర్ కార్యాలయంలో పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. పరీక్షకు హాజరైన 74,224 మంది బాలురులో 67,499 మంది (90.94 శాతం) అర్హత సాధించారని.. 47,918 మంది బాలికల్లో 44,511 మంది (94.31 శాతం) అర్హత పొందారని ఆయన చెప్పారు. నోటిఫికేషన్లో కాలేజీలు, సీట్ల వివరాలు.. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు ఈ నెల 2న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు నవీన్ మిట్టల్ చెప్పారు. విద్యార్థులకు నోటిఫికేషన్ 3న అందుబాటులోకి వస్తుందని తెలిపారు. విద్యార్థులు ఈ నెల 14 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రవేశాల ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తి చేసి, జూన్ 1 నుంచి తరగతులను ప్రారంభిస్తామని వివరించారు. ఒకటి, రెండో దశ కౌన్సెలింగ్‌లను ఈలోగా పూర్తిచేస్తామని, స్లైడింగ్ కోసం (సంబంధిత కాలేజీల్లోనే ఒక బ్రాంచీ నుంచి మరో బ్రాంచీకి మార్చుకునేందుకు) ప్రత్యేకంగా మరో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల ర్యాంకును బట్టి వారికి సీట్లను కేటాయిస్తామని, అయితే వారు పదో తరగతిలో ఉత్తీర్ణులైతే ఆ సీట్లు ఉంటాయని పేర్కొన్నారు. ఇక అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీలు, సీట్ల వివరాలను నోటిఫికేషన్లో వెల్లడిస్తామని వివరించారు. ఈ సారి ముందుగానే ప్రవేశాల కౌన్సెలింగ్‌ను పూర్తి చేస్తున్నందునా ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు మిగిలే పరిస్థితి ఉండదన్నారు. ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం 31 జిల్లాల్లోనూ హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇదీ ప్రవేశాల షెడ్యూలు.. - మే 2న నోటిఫికేషన్ -14 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు -15 నుంచి 19 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ -15 నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు - 23న మొదటి దశ సీట్ల కేటాయింపు - ఆ తరువాత ప్రవేశాలు, 30వ తేదీలోగా రెండో దశ సీట్ల కేటాయింపు -
నేడో రేపో ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలకు బుధ లేదా గురువారాల్లో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు రానున్నాయి. మంగళవారమే అనుమతులు రావాల్సి ఉన్నా సాధ్యపడలేదు. అలాగే 238 ప్రైవేటు పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీల ల్యాండ్ కన్వర్షన్, భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన పత్రాలు సమర్పించేందుకు ఏఐసీటీఈ రెండేళ్ల గడువిచ్చింది. రాష్ట్రంలోని అనేక కాలేజీలు సరైన పత్రాలు లేకుండానే కొనసాగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో కాలేజీల వారీగా పత్రాల పరిశీలనను ఏఐసీటీఈ చేపట్టింది. గ్రామ పంచాయతీ అనుమతితో నడుస్తున్నవి, భవన నిర్మాణాల అనుమతులు లేనివి, చెరువులు, సీలింగ్ భూముల్లో, అటవీ భూముల్లో నిర్మించిన కాలేజీలు ఉన్నట్లు పరిశీలనలో తేలింది. సరైన పత్రాలుంటేనే అనుమతులిస్తామని ఏఐసీటీఈ స్పష్టం చేయడంతో యాజమాన్యాలు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. ఏఐసీటీఈతో ప్రభుత్వం చర్చించిన తర్వాత పత్రాలు అందజేసేందుకు యాజమాన్యాలకు రెండేళ్ల గడువిచ్చింది. -
టెన్త్ తర్వాత ఉపాధికి మార్గం..పాలిటెక్నిక్
నిడమర్రు : పదో తరగతి తర్వాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి, త్వరగా ఉపాధి సంపాదించాలంటే ఉత్తమ మార్గం పాలిటెక్నిక్ కోర్సు. దీనికోసం విద్యార్థులు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పాలీసెట్)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. జిల్లాలో ఈ ఏడాది 50,424 మంది విద్యార్థులు టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాశారు. పదో తరగతి తర్వాత టెక్నికల్ కోర్సులు చేసి టెక్నికల్ అంశాలపై పట్టు సాధించి జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహించేందుకు ఉత్తమ మార్గం పాలిటెక్నిక్ కోర్సులు అభ్యసించడం. పాలిసెట్–2018 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 15వ తేదీ వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పాలిటెక్నిక్ కోర్సులు, అర్హతలు, పరీక్షా విధానం తదితర సమాచారం తెలుసుకుందాం. పాలిసెట్ నిర్వహించేది.. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ సంస్థ ఈ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పాలిసెట్)ను నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రభుత్వ/ప్రైవేట్/ఎయిడెడ్/అన్ ఎయిడెడ్/ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో రెండో షిఫ్ట్ పాలిటెక్నిక్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సులు ఇలా.. మూడేళ్ల కోర్సులు : సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ షిప్, మెకానికల్, ఇంజినీరింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, గార్మెంట్ టెక్నాలజీ, క్రాఫ్ట్ టెక్నాలజీ, హోం సైన్స్. మూడున్నరేళ్ల కోర్సులు కెమికల్(సాండ్విచ్) ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఉన్న కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఈసీఈ, ఐఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్, బయో మెడికల్ ఇంజినీరింగ్, లెదర్ టెక్నాలజీ, టెక్స్టైల్స్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్ (షుగర్ టెక్నాలజీ) అర్హతలు :ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గుర్తించిన పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. పదో తరగతి కంపార్ట్మెంట్లో పాసైనవారు, పరీక్షలు రాస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ప్రవేశం తీసుకునే ముందు అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. పరీక్షా విధానం.. ♦ ఈ కామన్ ఎంట్రన్స్ పరీక్ష రాసేందుకు 2 గంటల సమయం ఉంటుంది. ♦ పరీక్ష పేపరు ఒకటే ఉంటుంది. 120 ఆబ్జెక్టివ్ మాదిరి ప్రశ్నలకు 120 మార్కులు కేటాయిస్తారు. ♦ పదో తరగతి స్థాయిలోని గణితంలో 60 ప్రశ్నలు, భౌతికశాస్త్రంలో 30 ప్రశ్నలు, రసాయన శాస్త్రానికి సంబంధించిన 30 ప్రశ్నలు ఉంటాయి. ♦ మొత్తం 120 మార్కులకు 36 మార్కులను ఈ కోర్సుకు క్వాలిఫైయింగ్ మార్కులుగా నిర్ణయిస్తారు. ♦ ఎస్సీ, ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు క్వాలిఫైయింగ్ మార్కులతో సంబంధం లేకుండా ఆయా కేటగిరిల్లో సీట్లు భర్తీ చేస్తారు. ఉన్నత విద్యాచదువులకు మంచి అవకాశం.. ♦ పాలిటెక్నిక్ కోర్సులు (మూడు/మూడున్నరేళ్ల డిప్లొమా) పూర్తి చేసిన అభ్యర్థుల కోసం ‘ఈ సెట్’ నిర్వహిస్తారు. దీని ద్వారా బీటెక్/బీఈ నేరుగా రెండో సంవత్సరంలో (లేటరల్ ఎంట్రీ ద్వారా) ప్రవేశాలు కల్పిస్తారు. ఉద్యోగ అవకాశాలు ♦ ప్రభుత్వ/ప్రైవేటు సంస్థల్లో డిప్లొమా చదివినవారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సబ్ ఇంజనీర్, ట్రెయినీ ఇంజనీర్‌గా అవకాశాలు ఉంటాయి. జెన్కో, ట్రాన్స్‌కో, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలు శాఖల్లో డిప్లొమా అభ్యర్థులకు అవకాశం ఉంది. ఆన్లైన్లో దరఖాస్తులు ఇలా ♦ https://appolycet.co.in/ వెబ్సైట్లో లాగిన్ అయి పదో తరగతి లేదా తత్సమాన కోర్సుకు సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, పుట్టిన తేదీ, పాస్/హాజరైన సంవత్సరం నమోదు చేస్తే కనిపించే దరఖాస్తు ను పూరించాలి, ఆన్లైన్లోనే ఫీజు రూ.350 కూడా చెల్లించాల్సి ఉంటుంది. లేదా జిల్లాలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్లలో దరఖాస్తులను అప్లోడ్ చేయవచ్చు. ♦ ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ: ఏప్రిల్ 15 ♦ పరీక్ష నిర్వహించే తేదీ: ఏప్రిల్ 27 (ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకూ) జిల్లాలోని హెల్ప్‌లైన్ సెంటర్స్: ♦ ఎస్ఎంవీఎం పాలిటెక్నిక్, తణుకు ♦ సీఆర్ఆర్ పాలిటెక్నిక్, ఏలూరు ♦ గవర్నమెంట్ పాలిటెక్నిక్ జంగారెడ్డిగూడెం ♦ శ్రీమతి సీతా పాలిటెక్నిక్, భీమవరం ♦ గవర్నమెంట్ పాలిటెక్నిక్, తాడేపల్లిగూడెం పరీక్షా కేంద్రాలు: తణుకు, ఏలూరు, భీమవరంమరిన్ని వివరాలకోసం 91333 99677/91333 99677/ 91333 99688/ 91333 99699 నంబర్లకు సంప్రదించవచ్చు. -
న్యాయం చేస్తారా..చావమంటారా..!
నాంపల్లి: అకారణంగా తొలగించిన తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్లు మంగళవారం ఇంటర్మీడియట్ కమిషనరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే... 2016–17 విద్యా సంవత్సరానికి గాను 135 కొత్త కాంట్రాక్టు పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబందించి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ మార్చి 27న గైడ్ లైన్స్ విడుదల చేశారు. ఇందులో 2016–17 విద్యా సంవత్సరంలో రెండు నెలల పాటు పనిచేసి మిగులు దామాషా ప్రకారం పక్కన ఉంచిన 16 మందిని ఈ నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా భర్తీ చేయాలనే ప్రతిపాదనను ముఖ్య కార్యదర్శి కార్యాలయానికి పంపారు. కాగా గతంలో కమిషనర్ వాణీ ప్రసాద్ ఇచ్చిన గైడ్‌లైన్స్ కాదని కొత్త గైడ్‌లైన్స్‌ను విడుదల చేయడంతో తాము రోడ్డున పడతామంటూ పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం 16 మంది బాధిత కాంట్రాక్టు లెక్చరర్లు నాంపల్లిలోని కమిషనరేట్‌కు వచ్చారు. మధ్యాహ్నం శంకర్‌లాల్, నరేందర్‌రెడ్డి, జానీ పాష, రాధిక, హరిత, రమ్య పెట్రోలు బాటిల్స్ తీసుకుని కార్యాలయ భవనంపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ లాల్ అనే వ్యక్తి పెట్రోల్ మీద పోసుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కిందకు తీసుకువచ్చారు. మీకు న్యాయం చేసే విధంగా అధికారులతో చర్చిస్తామంటూ కమిషనర్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అయితే చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఏసీపీ భిక్షంరెడ్డి, బేగంబజార్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి కొంత సమయం కావాలని కోరారు. ఐదు రోజుల్లో తమకు న్యాయం జరిగేలా చూడాలని, జి.ఓ నెం.324లో తమను చేర్చాలని బాధితులు డిమాండ్ చేశారు. -
పాలిటెక్నిక్ విద్యార్థి అనుమానాస్పద మృతి
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి అజ్మీరా గణేశ్(17) బుధవారం అనుమానాస్పదంగా తాను ఉంటున్న ప్రైవేటు హాస్టల్లో మృతి చెందాడు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం కమ్మర్పల్లి శివారు చక్రతండాకు చెందిన వాల్యానాయక్ – పద్మల కుమారుడైన అజ్మీరా గణేశ్ మెకానికల్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలో హాస్టల్ వసతి లేకపోవడంతో ప్రైవేటు హాస్టల్లో ఉంటున్నాడు. మంగళవారం ఇంటికి వెళ్తానని తోటి విద్యార్థులకు చెప్పి వెళ్లిన గణేశ్ రాత్రి 9 గంటలకు తిరిగి వచ్చాడు. తెల్లవారుజాము తోటి విద్యార్థులు తమతో పాటు గణేశ్ లేకపోవడాన్ని చూసి సెల్‌కు ఫోన్‌చేశారు. ఫోన్ ఎత్తకపోవడంతో ఎక్కడిౖకైనా వెళ్లి ఉంటా డని భావించారు. హాస్టల్ రెండో అంతస్తుపైకి వెళ్లగా గణేశ్ పడిపోయి ఉండటాన్ని గమనించారు. గణే‹శ్ పక్కనే పురుగుల మందు డబ్బా ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. M తమ కుమారుడిని ఎవరో చంపి.. పురుగుల మందు తాగించి ఆత్మహత్యగా చిత్రీకరించారని తల్లిదండ్రులు వాల్యానాయక్, పద్మ ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, అడ్డుకున్నారు. కేసు విచారణ జరిపిస్తామని డీఎస్పీ మల్లారెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
బిడ్డలా చూసుకుంటానన్నారు..!
కాజేజిలో చేర్పించేటప్పుడు కన్నబిడ్డలా చూసుకుంటామని ప్రిన్సిపాల్ చెప్పాడయ్యా.. నిన్ననగా చనిపోతే ఇంత వరకూ యాజమాన్యం వారు వచ్చిన పాపాన లేదు. ఐదొందల కిలోమీటర్ల నుంచి వచ్చి కాలేజీలో చేర్పిస్తే విగత జీవిగా తీసుకెళ్లాల్సి వస్తుందని సాగరసంగమం వద్ద విద్యార్థి అఖిల్ కుమార్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అవనిగడ్డ: శ్రీకాకుళం జిల్లా రాగోలుకు చెందిన ముగడ అఖిల్‌కుమార్(16)ని నాగాయలంకలోని అంజని వెటర్నరరీ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు నెలల క్రితం చేర్పించారు. 16 మంది మిత్రులతో సాగరసంగమానికి ఆదివారం వెళ్లారు. బీచ్‌లో స్నానం చేస్తూ గల్లంతవ్వగా, సోమవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. తోటి విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కనకరత్నం, సూర్యారావు ఉద యం 11 గంటలకు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. అప్పటి నుంచి సాయంత్రం 5.30 వరకు కాలేజీ యాజమాన్యం ఎవరూ ప్రమాద వివరాలు తెలుసుకునేందుకుగానీ, పరామర్శించేందుకు గా నీ రాలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చేర్చుకునేటప్పుడు మీ పిల్లాడిని నా సొంత బిడ్డలా చూసుకుంటానని ప్రిన్సిపాల్ చెప్పారని, బిడ్డ శవాన్ని అప్పగించారని తల్లి కనకరత్నం కన్నీటి పర్యాంతమైంది. మా పిల్లాడిని చేర్పించేటప్పుడు మా ఫోన్ నంబర్లు తీసుకున్నారని, ఈ ఘటన జరిగాక ఇంతవరకూ కాలేజీ నుంచి ఎవరూ ఫోన్ చేయలేదని, అడగడానికి మేము ఫోన్ చేస్తే వస్తున్నామని చెబుతున్నారే గానీ రాలేదని మృతుని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. అంజిని వెటర్నరీ కళాశాల అని చెబితే చేర్పించామని, అక్కడ కాలేజీకి ఆ పేరే లేదని, మారుతి పాలిటెక్నిక్ కళాశాల అని ఉందని, ఈ కాలేజికి గుర్తింపు ఉందోలేదో కూడా అర్థం కావడం లేదని, ఇక్కడ కూడా మమ్మల్ని మోసం చేశారని మృతుడి మేనమామ తాలాబత్తుల సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేస్తే మాకేమీ తెలియదు, చెప్పకుండా వెళ్లారని సమాధానం చెబుతున్నారని, హెచ్ఓడీతో కలసి వెళ్లినట్టు తోటి విద్యార్థులు చెబుతున్నారని చెప్పారు. కళాశాలలో చదివే విద్యార్థి చనిపోతే కనీసం చూడటానికి రాలేదని, మమ్మల్ని మోసం చేసి మా బిడ్డ ఉసురు తీసిన కళాశాల యాజమాన్యంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లి కనకరత్నం డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు రాయపూడి వేణుగోపాలరావు, సిద్దినేని అశోక్, లేబాక శ్యాం, పద్యాల వెంకట ప్రసాద్, బండ్రెడ్డి హరి, మాలమహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి దోవా గోవర్ధనరావు, సీపీఐ మండల కన్వీనర్ నారేపాలెం శంకరరావు, వైఎస్సార్సీపీ నాయకుడు గాజుల రాంబాబు (రాముడు) వైద్యశాలకు చేరుకుని మృతుడి తల్లిదండ్రులను పరామర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాలేజీ యాజమాన్యంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంగమం వద్ద లభ్యమైనఅఖిల్ మృతదేహం కోడూరు : హంసలదీవిలోని పాలకాయతిప్ప బీచ్ వద్ద ఆదివారం సాయంత్రం గల్లంతైన ముడుగ అఖిల్‌కుమార్ మృతదేహం సోమవారం సంగమం వద్ద లభ్యమైంది. సోమవారం తెల్లవారుజామునే 5.30 గంటల సమయంలో అఖిల్ మృతిచెంది సంగమానికి కొట్టుకువచ్చాడని ఎస్ఐ ఎస్ఐ వై.సుధాకర్ తెలిపారు. తండ్రి సూర్యారావు పిర్యాధు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. -
కొత్తగా 29 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా మరో 29 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. వీటి ఏర్పాటుకు అవసరమైన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే కేంద్రం 5 పాలిటెక్నిక్‌ల ఏర్పాటుకు ఓకే చెప్పగా, మరో 24 పాలిటెక్నిక్‌లకు అనుమతుల కోసం సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 58 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు ఉండగా, అసలు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు లేని 5 జిల్లాల్లో కొత్త పాలిటెక్నిక్ కాలేజీల మంజూరు కోసం సబ్మిషన్ పథకం కింద కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. ఒక్కో పాలిటెక్నిక్ భవన నిర్మాణం, లైబ్రరీ, ఫర్నిచర్, వాహనాలు, ఇతర సదుపాయాల కల్పనకు కేంద్రం రూ.12.30 కోట్లను ఇవ్వనుంది. నిర్వహణ ఖర్చులు, వేతనాలు ఇతరత్రా అవసరాలకు సంబంధించి మరో రూ.8 కోట్ల వరకు రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. కాగా, మూడు కంటే తక్కువ పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్న 20 జిల్లాల్లోని 24 ప్రాంతాల్లో కొత్త పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పాలిటెక్నిక్‌లకు సంబంధించిన అనుమతులు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి లభిస్తాయని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాత్కాలిక భవనంలో ముందుగా కాలేజీలను ఏర్పాటు చేసి, రెండేళ్లలోపు వాటి భవన నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరంనాటికి వాటిని ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 11,702 సీట్లు అందుబాటులో ఉండగా, ఈ కొత్త కాలేజీలు వస్తే ఒక్కో కాలేజీలో అదనంగా 180 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 16 వేలు దాటనుంది. ఇక భవిష్యత్తులో నియోజకవర్గానికి ఒకటి చొప్పున పాలిటెక్నిక్‌లు ఏర్పాటు చేసే ప్రతిపాదనల్లో భాగంగా మరో 32 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లను ఏర్పాటు చేసే దిశలో సర్కారు ఆలోచనలు చేస్తోంది. నియోజకవర్గానికి ఒకటిపై కసరత్తు.. రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుపై సాంకేతిక విద్యాశాఖ దృష్టి సారించింది. వీటికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పారిశ్రామిక రంగ లెక్కల ప్రకారం ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌కు ముగ్గురు పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్లు ఉండాలి. ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. ముగ్గురు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఒక పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ను ప్రారంభిస్తామని గతంలో పేర్కొంది. ఇందులో భాగంగా సాంకేతిక విద్యాశాఖ రూపొందిస్తున్న తెలంగాణ –2024 విజన్ డాక్యుమెంటులో వీటి ఏర్పాటును ప్రతిపాదిస్తోంది. కేంద్రం ఓకే చెప్పిన ఐదు పాలిటెక్నిక్‌లు.. జిల్లా ప్రతిపాదిత ప్రాంతం కొమురంభీం ఆసిఫాబాద్ సిర్పూర్ (యూ) పెద్దపల్లి రామగుండం నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ కామారెడ్డి జుక్కల్ మహబూబాబాద్ మహబూబాబాద్ -
రాసుకున్నోళ్లకు రాసుకున్నంత..!
కోదాడ: రాసుకున్నోళ్లకు రాసుకున్నంత.. అన్నట్టుగా మారింది.. కోదాడలోని పాలిటెక్నిక్ పరీక్షల వ్యవహారం. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాల్సిన కళాశాలల యా జమాన్యాలే అడ్డదారులు తొక్కుతున్నాయి. పరీక్షల విధులను నిర్వహించడానికి ఇతర కళాశాలల నుంచి వస్తున్న ఇన్విజిలేటర్లను పరీక్షహాళ్లోకి వెళ్లనీయకుండా తమ వారిని పంపించడం, వినని వారిని కరెన్సీతో మ్యానేజ్ చేయడం లేదంటే బెదిరించడం పరిపాటిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోదాడలో సుమారు 5 వేల మంది విద్యార్థులు పాల్టెక్నిక్ పరీక్షలు రాస్తున్నారు. కొన్ని కళాశాలలు పాస్ గ్యారెంటీ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.4 నుంచి 5 వేలు వసూలు చేస్తున్నారని తెలిసింది. వచ్చి కూర్చొని .. ఇచ్చింది తీసుకు వెళ్లండి... అక్టోబర్ 25 నుంచి పాలిటెక్నిక్ ప్రథమ, ద్వితీయ, అక్టోబర్ 26 నుంచి తృతీయ సంవత్సర సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. సెల్ఫ్ సెంటర్లో పరీక్షలు జరుగుతుండడంతో కళాశాలల యాజమాన్యాలు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఇన్విజిలేషన్ విధులకు వస్తున్న ఇతర కళాశాలల అధ్యాపకులకు డ్యూటీలు వెయ్యడం లేదని సమాచారం. వచ్చిన వారిని కూర్చోబెట్టి తమ కళాశాలవారికే డ్యూటీలు వేసుకుని జోరుగా మాస్ కాపీయింగ్‌ను జరుపుతున్నారని కొందరు అధ్యాపకులే ఆరోపిస్తున్నారు. దీనికోసం రెండు కళాశాలలు విద్యార్థుల నుంచి డబ్బుల వసూలుకు తెరలేపినట్టు తెలుస్తోంది. మాట వినని ఇన్విజిలేటర్లకు భారీగా ముట్టజెపుతున్నారు. ఒక రోజు డ్యూటీ చేస్తే రెండు మూడు వందలు ఇస్తారు. కాని కొన్ని కళాశాలలు తాము చెప్పినట్లు వింటున్న ఇతర కళాశాలల అధ్యాపకులకు ఒక్క రోజు డ్యూటీకి ఐదు వేల రూపాయలను ముట్టజెపుతున్నారని సమాచారం. వచ్చి కూర్చొని ఇచ్చింది తీసుకువెళ్లండని, మాట వినని వారిని ఘాటుగా బెదిరిస్తున్నట్లు కొందరు మహిళా అధ్యాపకులు వాపోతున్నారు. అన్నీ మేనేజ్ పాలిటెక్నిక్ పరీక్షల నిర్వహణ సీసీ కెమెరాల నడుమ పకడ్బందీగా నిర్వహించే ఏర్పాట్లు చేసినా వాటిని కూడా ఏమార్చి తమ దందా సాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాస్ కాపియింగ్ జరగకుండా చూడాల్సిన స్క్వా డ్లు అతిథుల వలె వచ్చిపోతున్నారని అధ్యాపకులే అంటున్నారు. పాస్ గ్యారెంటీ స్కీంలో భాగంగా జరుగుతున్న ఈ తంతంగంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అవకాశంగా మారిన పరీక్షల విధానం గతంలో సెల్ఫ్ సెంటర్లతో పాలిటెక్నిక్ పరీక్షలను నిర్వహించేవారు. దీంతో కళాశాలలు అడ్డదారులు తొక్కుతున్నాయనే ఆరోపణలు రావడంతో రాష్ట్ర సాంకేతిక విద్య అధికారులు ఒక కళాశాల విద్యార్థులను మరో కళాశాలకు మార్చి పరీక్షలు నిర్వహించారు. దీంతో మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకపోవడం పాస్ పర్సెంటేజీ గణనీయంగా తగ్గిపోయింది. దీంతో పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరే వారు తగ్గి పోతుండడంతో కంగుతిన్న కళాశాలలు తెర వెనుక లాబీయింగ్ జరిపి ఈ సారి ఆ విధానాన్ని ఎత్తి వేయించాయి. విద్యార్థులను మార్చకుండా ఏ కళాశాల విద్యార్థులు అదే కళాశాలలో పరీక్షలు రాసే విధంగా పాత విధానాన్నే తిరిగి తెరమీదకు తెచ్చారు. కాక పోతే పరీక్షల నిర్వహించే ఇన్విజిలేటర్లను మాత్రం ఒక కళాశాల వారిని మరో కళాశాలకు మార్చారు. -
28న పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు
మడకశిర : పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 28న ఉదయం 10గంటలకు స్పాట్ అడ్మిషన్లు ఉంటాయని ప్రిన్సిపల్ జి.కృష్ణమూర్తినాయుడు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్పాట్ అడ్మిషన్లలో పాల్గొనడానికి అర్హులన్నారు. ప్రధానంగా ఈఈఈ, డీటీటీ కోర్సులకు మాత్రమే స్పాట్ అడ్మిషన్లు ఉంటాయన్నారు. స్పాట్ అడ్మిషన్లో పాల్గొనే విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాలిటెక్నిక్ కళాశాలలో హాజరు కావాలన్నారు. -
పాలిటెక్నిక్‌కూ నిరాదరణ
ఎచ్చెర్ల క్యాంపస్: ఒకప్పుడు పాలిటెక్నిక్ డిప్లమా కోర్సుకు మంచి డిమాండ్ ఉండేది. జిల్లాలో ఎక్కువ మంది విద్యార్థులు 10వ తరగతి తరువాత మూడేళ్ల ఈ కోర్సుకు ప్రాధాన్యతనిచ్చేవారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఉన్నత చదువు చదివేవారు. లేని వారు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరేవారు. ప్రస్తుతం గతంలో పోల్చితే డిప్లమా తరువాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గాయి. మరోవైపు మూడేళ్ల డిప్లమా తరువాత మరో మూడేళ్లు ఇంజినీరింగ్ పూర్తి చేసినా ఆశించిన ఉపాధి అభ్యం కావడం లేదు . దీంతో ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కోర్సులకు డిమాండ్ తగ్గింది. పాలిటెక్నిక్‌లో ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు నిండకపోవడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మెకానికల్, సివిల్, ట్రిపుల్ఈ వంటి బ్రాంచ్‌లకు మాత్రమే ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు చేరారు. జిల్లాలో ఐదు ప్రభుత్వ కళాశాలలు ఉండగా.. 780 సీట్లకు 513 ప్రవేశాలు జరిగాయి. ఆరు ప్రైవేట్ కళాశాలలు ఉండగా.. 1920 సీట్లకు 536 నిండాయి. ప్రభుత్వ కళాశాలలను పరిశీలిస్తే.. సీతంపేట మోడల్ పాలిటెక్నిక్ ఎస్టీలకు మాత్రమే రిజర్వ్ చేశారు. మూడు విడతల కౌన్సెలింగ్ నిర్వహించినా 120 సీట్లకు 22 ప్రవేశాలు మాత్రమే జరిగాయి. సివిల్‌లో 60 సీట్లకు 07, మెకానికల్‌లో 60 సీట్లకు 15 మాత్రమే నిండాయి. ఎస్టీ అభ్యర్థులు లేనప్పుడు రిజర్వేషన్ రోస్టర్ మార్పు చేస్తే కొంత వరకు ప్రవేశాలు జరిగే అవకాశం ఉంటుంది. డిమాండ్ ఉన్న బ్రాంచ్లైనా కనీసం ఇక్కడ ప్రవేశాలు లేకపోవడం ప్రభుత్వ సంస్థ నిర్వహణ సమస్యగా మారుతుంది. రెసిడెన్సియల్ విద్యా సంస్థ అయినా కనీసం ప్రవేశాలు జరగలేదు. టెక్కలి ప్రభుత్వ కళాశాలను శ్రీకాకుళంలో నిర్వహించేటప్పుడు మెరుగ్గా ప్రవేశాలు ఉండేవి. శతశాతం ప్రవేశాలు జరిగే ఈ కళాశాలల్లో తరగతులు ప్రారంభమైన తరువాత మూడో విడత కౌన్సెలింగ్‌లో విద్యార్థులు ఆప్షన్లు మార్చుకుంటున్నారు. అక్కడ బోధకులు, సౌకర్యాలు సక్రమంగా లేకపోవడం సమస్యగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ 120 సీట్లకు 82 మంది చేరారు. సివిల్‌లో 60కి 39, ట్రిపుల్‌ఈలో 60కి 43 మంది చేరారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్‌లో నిర్వహిస్తున్న కొన్ని డిప్లమా బ్యాచ్‌లకు కూడా డిమాండ్ తగ్గింది. సీసీపీ బ్రాంచ్‌లో 60 మందికి ఏడుగురు మాత్రమే చేరారు. సీఎంఈలో 60కి 40 మంది చేరారు. ప్రభుత్వ మహిళల పాలిటెక్నిక్‌లో ఏఈఐలో 60 సీట్లకు ఆరుగురు మాత్రమే చేరారు. ప్రభుత్వ కళాశాలైనా.. ఈ బ్రాంచ్‌కు విద్యార్థినులు ప్రాధన్యాతివ్వలేదు. గత రెండు కౌన్సెలింగ్‌ల్లో ఆమదాలవలసలో పూర్తి స్థాయిలో సీట్లు నిండాయి. తుదివిడత కౌన్సెలింగ్‌లో మాత్రం ఈసీఈలో 60 సీట్లకు 57 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో నిర్వహిస్తున్న ఏఈఐ, సీసీపీ కోర్సుల్లో గత కొన్నేళ్ల నుంచి సైతం విద్యార్థులు ప్రవేశాలు మెరుగ్గా లేవు. కాలానుగుణంగా ఈ కోర్సు డిజైన్లు మార్పు చేస్తేనే మనుగడ సాధ్యమయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. ప్రైవేట్ కళాశాలల పరిస్థితి ఇదీ.. ఇక ప్రైవేట్ కళాశాలల పరిస్థితి చూస్తే.. ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’ అన్న చందాన ఉంది. డిప్లమాలో డిమాండ్ ఉన్న మెకానికల్, ట్రిపుల్ఈ, సివిల్ డిప్లమా కోర్సులు నిర్వహిస్తున్నారు. అయినా కళాశాలల్లో కనీస ప్రవేశాలు లేవు. సీనియర్ కళాశాలల్లో సైతం విద్యార్థులు చేరే పరిస్థితి లేదు. నారాయణ కళాశాలలో 420 సీట్లకు 41 మంది చేరారు. ఈసీఈలో 60 సీట్లకు 0, ట్రిపుల్‌ఈలో 120కి 4, సివిల్‌లో 60కి 8, మెకానికల్‌లో 180కి 29 చొప్పున ప్రవేశాలు జరిగాయి. టీవీఆర్లో 300 సీట్లకు 28 ప్రవేశాలు జరగ్గా.. మెకానికల్‌లో 120కి 18, ట్రిపుల్‌ఈలో 120కి 05, సివిల్ 60కి 05 ప్ర వేశాలు జరిగాయి. సిస్టంలో 240కి 72, శివానీలో 180కి 36 సీట్లు నిండాయి. ఈ కళాశాలలో మెకానికల్‌లో మాత్రమే 60కి 25 ప్రవేశాలు జరిగాయి. ట్రిపుల్‌ఈలో 60కి 4, సివిల్‌లో 60కి 07 సీట్లు నిండాయి. ఐతంలో 360కి 156, వెంకటేశ్వరలో 420కి 203 ప్రవేశాలు జరిగాయి. మెకానికల్, ట్రిపుల్ఈల్లో ఈ ఏడాది కొంత వరకు మెరుగ్గా ప్రవేశాలయ్యాయి. ప్రస్తుతం సాంకేతిక విద్యాశాఖ సీట్ల తగ్గింపుపై సైతం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంజినీరింగ్‌లో చాలా కళాశాలు సీట్లు తగ్గించుకున్నాయి. -
పాలపుంత కంటే కాంతివంతం
లండన్: మన పాలపుంత కంటే 1000 రెట్లు అధిక కాంతివంతమైన నక్షత్ర మండ లాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గెలాక్సీ సుమారు 10 వేల మిలియన్ కాంతి సంవ త్సరాల దూరంలో నిక్షిప్తమై ఉందని తెలిపారు. అత్యంత కాంతివంతమైన ఈ గెలా క్సీ చాలా బలమైన పరారుణ కిరణాలను ప్రసారం చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. స్పెయిన్‌లోని పాలిటెక్నిక్ యూనివర్సిటీ ఆఫ్ కార్టాజీనా (యూపీసీ టీ)కి చెందిన శాస్త్రవేత్తల బృందం సైజు, ఇంటెన్సిటీని ఎక్కువగా చేసి చూపించే గ్రావిటేషనల్ లెన్స్‌లను ఉపయోగించి దీని జాడ కనుగొన్నారు. దీని జాడ కోసం పరిశోధకులు ఆకాశం మొత్తాన్ని జల్లెడ పట్టడంతోపాటు వివిధ ఉపగ్రహాలు పంపిన సమాచారాన్ని విశ్లేషించారు. ఈ గెలాక్సీలో అత్యంత వేగంగా నక్షత్రాలు ఉద్భవి స్తున్నాయని పరిశోధకులు డియాజ్ సాన్చెజ్ తెలిపారు. దీనిలోని అణువు లపై అధ్యయనం చేస్తామని ప్రకటించారు. -
చివరి దశ ప్రవేశాల షెడ్యూలు జారీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలకు ఎంసెట్, ఈసెట్, పాలిసెట్ చివరి దశ కౌన్సెలింగ్ నిర్వహణకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం షెడ్యూలు జారీ చేసింది. ఎంసెట్ చివరి దశ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఈనెల 19 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేసే గడువు బుధవారంతో ముగుస్తుందని, ఆ తర్వాత చివరి దశ కౌన్సెలింగ్ అందుబాటులో ఉండే సీట్ల వివరాలను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈసెట్ చివరి దశ కౌన్సెలింగ్‌ను ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు పూర్తి చేస్తామని వెల్లడించారు. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు చివరి దశ కౌన్సెలింగ్‌ను ఈనెల 12న చేపట్టి 15న సీట్ల కేటాయింపుతో పూర్తి చేస్తామని వివరించారు. ఎవరెవరు చివరి దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చంటే.. ∙మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీటు వచ్చినా.. ఫీజు చెల్లించకుండా, కాలేజీల్లో చేరని వారు. ∙ఇప్పటికే సర్టిఫికెట్ల వెరిఫి కేషన్ చేయించుకొని, మొదటి దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నా సీటు లభించనివారు. ∙మొదటి విడతలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నా ఆప్షన్లు ఇచ్చుకోనివారు. ∙మొదటి విడతలో సీటు వచ్చి, ఫీజు చెల్లించి కాలేజీల్లో చేరినా.. మరింత మంచి కాలేజీ లు, కోర్సుల కోసం చివరి దశలో పాల్గొన వచ్చు. ∙మొదటి దశలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాని వారు, చివరి దశలో ఫ్రెష్‌గా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావచ్చు. ∙మొదటి దశలో ఇచ్చిన ఆప్షన్లు ఇపుడు పనికిరావు. తాజాగా మళ్లీ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ∙మొదటి దశలో సీటు పొంది, ఫీజు చెల్లించి, కాలేజీలో చేరిన వారు అదే కాలేజీలో ఉండాలనుకుంటే ఇపుడు అప్షన్లు ఇవ్వొద్దు. ∙మరో కాలేజీకి వెళ్లాలనుకుంటేనే ఇపుడు ఆప్షన్లు ఇవ్వాలి. ఒకవేళ ఇపుడు ఆప్షన్లు ఇస్తే మరో కాలేజీలో సీటు అలాట్ అయిందంటే మొదటి దశలో వచ్చిన సీటు రద్దవుతుంది. అది మరో విద్యార్థికి వెళుతుంది. సెట్స్వారీగా షెడ్యూలు.. ఎంసెట్... జూలై 19: సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూలై 19 – 20: వెబ్ ఆప్షన్లు జూలై 22: సీట్ల కేటాయింపు ప్రకటన ఈసెట్.. జూలై 18: సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూలై 18–19: వెబ్ ఆప్షన్లు జూలై 21: సీట్ల కేటాయింపు ప్రకటన. పాలిసెట్.. జూలై 12: సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూలై 12– 13: వెబ్ ఆప్షన్లు జూలై 15: సీట్ల కేటాయింపు ప్రకటన. -
నేటి నుంచి ఈసెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (లేటరల్ ఎంట్రీ) ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఈ నెల 30 నుంచి ప్రారంభించేందుకు ప్రవేశాల కమిటీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కౌన్సెలింగ్ షెడ్యూలును జారీచేసింది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 3 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతామని పేర్కొంది. వచ్చే నెల 1 నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 5న ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. 7న సీట్లను కేటాయించనుంది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 19,780 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు 22,564 మంది ఉన్నారు. తేదీల వారీగా, ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సిన వివరాలు, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సిన తేదీలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సిన హెల్ప్‌లైన్ కేంద్రాల వివరాలను https:tsecet.nic.in వెబ్సైట్లో పొందొచ్చని వివరించింది. ఈసారి కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులకు ఆధార్ తప్పనిసరి. బయోమెట్రిక్ వివరాలను సేకరిస్తారు. స్పెషల్ కేటగిరీ వారికి హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంకులో ఉన్న సాంకేతిక విద్యాభవన్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. వెంటతెచ్చుకోవాల్సిన ఒరిజినల్ సర్టిఫికెట్లు సెట్ ర్యాంకు కార్డు, హా హాల్‌టికెట్, ఆధార్ కార్డు, హా పదో తరగతి మెమో, డిప్లొమా/డిగ్రీ మార్కుల మెమో, డిప్లొమా/డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్, హా 4వ తరగతి నుంచి డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికెట్లు (బీఎస్సీ వారు అయితే 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు), హా ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, హా 2017 జనవరి 1న లేదా ఆ తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్లు హా నాన్ లోకల్ అభ్యర్థులైతే వారి తల్లిదండ్రులు 10 ఏళ్లు తెలంగాణలో నివసించిన నివాస ధ్రువీకరణ పత్రం, హా రెగ్యులర్ చదువుకోని వారైతే 7 ఏళ్ల నివాస ధ్రువీకరణపత్రం. -
అధికార పార్టీ నేతల స్వార్థానికి..పాలి‘టెక్నిక్’!
► అరకొర ఏర్పాట్లతోనే కాలేజీ స్థల మార్పిడి! ► సొంత లాభం చూసుకున్న టీడీపీ నాయకులు? ► మంత్రి అచ్చెన్న హామీలిచ్చినా ఆచరణ శూన్యం ► హాస్టల్ వసతి లేక విద్యార్థినుల ఇబ్బందులు ► కాలేజీ ప్రాంగణంలో కొరవడిన రక్షణ ఏర్పాట్లు టీడీపీ జిల్లా కార్యాలయానికి సొంత భవనం నిర్మించాలనేది నాయకుల ఆలోచన! ఇందుకోసం గతంలోనే కొనుగోలు చేసిన అరెకరం స్థలం అట్టే పెట్టుకొని జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం అంతా జల్లెడపట్టారు. కలెక్టరేట్‌కు వెళ్లే 80 అడుగుల రోడ్డులో అత్యంత ఖరీదైన రెండెకరాల ప్రభుత్వ స్థలం ఎంపిక చేశారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించి ఉంచిన ఆ భూమినే 99 ఏళ్లకు నామమాత్ర లీజుతో దక్కించుకున్నారు! టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్... పేరులో టెక్కలి ఉన్నా ఇప్పటివరకూ నిర్వహిస్తున్నది మాత్రం శ్రీకాకుళం పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోనే! రూ.10 కోట్ల వరకూ ఖర్చు చేస్తే టెక్కలిలోనే చక్కని భవనాలు, ఆధునిక సౌకర్యాలు కల్పించవచ్చు! కానీ వారి ఆలోచన వేరు! టీడీపీ నాయకుల బంధువులు నందిగామ మండలంలో ఓ మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేసి రెండేళ్లకే నిరాదరణకు గురై మూతవేసిన ఇంజినీరింగ్ కళాశాల భవనాలపై దృష్టిపెట్టారు. ఆ రూ.10 కోట్లు ప్రజాధనంతో కొనుగోలు చేశారు. ఈ రెండు లావాదేవీలు జరిగింది ఈ మూడేళ్ల కాలంలోనే! కానీ దృక్కోణం భిన్నంగా ఉండటమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. అప్పుడప్పుడూ సమావేశాలు జరిగే పార్టీ కార్యాలయం కోసం జిల్లా కేంద్రంలో కీలకమైన ప్రాంతంలో స్థలం ఎంపిక చేసుకున్న వారే... కొన్ని వందల మంది విద్యార్థులు రోజూ విద్యా తపస్సు చేసుకునే పాలిటెక్నిక్ కళాశాల కోసం ఎక్కడో మారుమూల ఏ మాత్రం రక్షణలేని ప్రాంతంలో మూతపడిన ఇంజినీరింగ్ కళాశాల భవనాలను కొనిపడేశారు! 99 సంవత్సరాల పాటు తమ సౌకర్యం కోసం ఆలోచించిన అధికార పార్టీ నాయకులు... కొన్ని తరాల యువతరం భవిష్యత్తుకు సంబంధించిన అంశంలో మాత్రం స్వీయ లబ్ధికే పెద్దపీట వేశారే తప్ప విద్యార్థుల శ్రేయస్సును పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: పాలిసెట్‌లో మంచి ర్యాంకు వచ్చి న చాలామంది విద్యార్థులు ఈసారి టెక్కలి పాలిటెక్నిక్ కళాశాలనే ఎంపిక చేసుకున్నారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలోని శ్రీకాకుళం పాలిటెక్నిక్ కళాశాల కన్నా ముందే ఇక్కడి సీట్లు భర్తీ అయిపోవడం విశేషం. టెక్కలి పాలిటెక్నిక్ కళాశాల అంటే అదేదో జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గ కేంద్రంలో ఉంటుందనే చాలామంది భ్రమపడ్డారు. కౌన్సెలింగ్‌లో జాయినింగ్ రిపోర్టు తీసుకొని టెక్కలి పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాల ఎక్కడుందో వెతికీ వెతికీ వెనుదిరిగి వెళ్లినవారూ ఉన్నారు. చివరకు అది టెక్కలి నియోజకవర్గ కేంద్రంలో గాకుండా టెక్కలి నియోజకవర్గ పరిధిలోనే నందిగామ మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో, జాతీయ రహదారికి రెండు కిలోమీటర్ల అవతల కొండకు ఆనుకొని ఉన్న జీడిమామిడి తోటల మధ్య ఉందని తెలుసుకొని అవాక్కవుతున్నారు. ఐదేళ్ల క్రితమే కాలేజీ మంజూరు టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఐదేళ్ల క్రితమే మంజూరైంది. అయితే టెక్కలిలో తగిన భవనాలు లేకపోవడంతో శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోనే ఇటీవలి వరకూ తరగతులు కొనసాగుతున్నాయి. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు చక్రం తిప్పి నందిగాం మండలం దేవుపురం పంచాయతీ పరిధిలోని తురకలకోట గ్రామం వద్దనున్న శివరామకృష్ణ ఇంజినీరింగ్ కళాశాల భవనాలను రూ. 9.88 కోట్ల ప్రజాధనంతో రాష్ట్ర ప్రభుత్వంతో కొనుగోలు చేయించారు. కేవలం రెండు బ్యాచ్‌లతోనే 2014 సంవత్సరంలో మూతపడిన ఈ కళాశాల యజమాని సాక్షాత్తూ జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, టీడీపీ నాయకుడు చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ) దంపతుల అల్లుడు. జిల్లాలోని అచ్చెన్న వర్గంలో బాబ్జీ దంపతులే ప్రధానమైన నేతలు. సరైన పరిశీలన లేకుండానే మంత్రి అచ్చెన్న 2015 నవంబర్ నెలలోనే ఆ భవనాలను కొనుగోలు చేసి ప్రభుత్వ పాలిటెక్నిక్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించడం గమనార్హం. రక్షణలేని భవనాలే ముద్దు సుమారు 11.78 ఎకరాల భూమిని సరస్వతి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో 2008 సంవత్సరంలో కొనుగోలు చేశారు. ఆ సమయంలో రైతులకు ఎకరాకు రూ. 2.5 లక్షల చొప్పున చెల్లించారు. ప్రస్తుత మార్కెట్ ధర రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ఉంది. అంటే భూమి ముఖ విలువ రూ.50 లక్షలకు మించదు. ఇక్కడ నిర్మించిన శివరామకృష్ణ ఇంజినీరింగ్ కాలేజీ మూడు బ్లాక్‌ల విస్తీర్ణం (ప్లింత్ ఏరియా) 65 వేల చదరపు అడుగులు. అన్ని ఖర్చులూ, కళాశాల ఫర్నీచర్, ఇంజినీరింగ్ ల్యాబ్ పరికరాలు కలిపి లెక్కవేసినా మొత్తం విలువ రూ.5 కోట్లు మించదనే వాదనలు ఉన్నాయి. కానీ ఆ యాజమాన్యం రూ.9.88 కోట్లకే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు కోసం విక్రయించేలా చొరవ తీసుకున్నామని టీడీపీ నాయకులు చెప్పుకోవడం గమనార్హం. అంతా భయం భయం... శివరామకృష్ణ ఇంజినీరింగ్ కాలేజీ 2011, జనవరి 9న ప్రారంభమైంది. మారుమూల మౌలిక సౌకర్యాల్లేని పల్లె ప్రాంతంలో ఉండటంతో విద్యార్థులను ఆకట్టుకోలేకపోయింది. 137 మందితో తొలి బ్యాచ్ ప్రారంభమైంది. రెండో ఏడాది (2011–12) ప్రవేశాల సంఖ్య 47 మందికి పడిపోయింది. నిర్వహణ భారంతో కళాశాలను మూసేశారు. ఈ భవనాల్లోకి టెక్కలి పాలిటెక్నిక్ కళాశాలను శ్రీకాకుళం నుంచి తరలించారు. సివిల్, ఎలక్ట్రికల్ ద్వితీయ, తృతీయ సంవత్సరం బ్యాచ్‌లకు చెందిన 240 మందిని పంపించారు. వారికితోడు ఇటీవల కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు పొందినవారు కూడా జాయినింగ్ రిపోర్ట్‌లతో వస్తున్నారు. వారికి బోధనకు కనీసం 14 మంది ఫ్యాకల్టీ ఉండాలి. ఇప్పటివరకూ రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టులు మంజూరుకాలేదు. జిల్లాలోని మిగతా పాలిటెక్నిక్ కళాశాలల నుంచే డిప్యూటేషన్‌పై కొంతమందిని పంపించే అవకాశాలు ఉన్నాయి. లేదంటే కాంట్రాక్టు ఫ్యాకల్టీని నియమించుకోవాల్సిందే. తరగతి గదుల్లో ఫర్నిచర్ ఉన్నా ల్యాబ్‌ల్లో మాత్రం ఇంజినీరింగ్ పరికరాలు నామమాత్రంగానే ఉన్నాయి. విద్యార్థుల ప్రయోగ అవసరాలకు అవేమాత్రం సరిపోవు. ఇక వసతి విషయానికొస్తే హాస్టల్ సౌకర్యం ఏర్పాటు చేయలేదు. టెక్కలి, పలాస పట్టణాలు దూరంగా ఉండటంతో పరిసర గ్రామాల్లోనే విద్యార్థులు అద్దె గదుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా అమ్మాయిలు తీవ్ర ఇబ్బం ది పడుతున్నారు. వారి రక్షణపై తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తమవుతున్నారు. అలాగే కళా శాల గ్రామ శివారు ప్రాంతంలో జీడితోటల మధ్య ఉన్నా ప్రహరీ లేకపోవడం, మైదానంలో తుప్పలు, పాము పుట్టలతో నిండి ఉండటంతో విద్యార్థులు హడలిపోతున్నారు. ప్రజాధనం దుర్వినియోగమే జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు జెడ్పీ చైర్పర్సన్ ధనలక్ష్మి అల్లుడికి ఆయాచిత లబ్ధి చేకూర్చడానికి చూస్తే ఆ కళాశాల వల్ల ప్రజాధనం దుర్విని యోగమే తప్ప విద్యార్థులకు ఏమాత్రం సౌకర్యంగా లేదు. ఆ రూ.10 కోట్లతో నందిగామ మండల కేంద్రంలోనే అత్యాధునిక వసతులతో మంచి కళాశాల భవనాలను నిర్మించే అవకాశం ఉండేది.- పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త రాజకీయ స్వార్థమే తప్ప మేలు లేదు టెక్కలి పేరుతో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను నందిగాం మండలంలో మూతపడిన ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ భవనాల్లోకి మార్పు వెనుక రాజకీయ నాయకుల స్వార్థమే ఉంది. ఈ ఏర్పాటు వల్ల విద్యార్థులకు అష్టకష్టాలు తప్ప వారికి ఎలాంటి ప్రయోజనం లేదు. – అల్లంశెట్టి పెంటారావు, విద్యార్థిని తండ్రి, బొంతలకోడూరు టీచింగ్ స్టాఫ్‌ను నియమించాలి శ్రీకాకుళం నుంచి నంది గాం మండలంలోని తురకలపాడు వద్దకు కళాశాలను మార్చారు. కానీ ఇక్కడ పాఠాలు బోధించేందుకు ఫ్యాకల్టీ లేరు. ఒక్కో డిపార్టుమెంట్‌కు ఒక్కరు చొప్పు న ఇద్దరు మాత్రమే లెక్చరర్లు ఉన్నారు. కాలేజీ తరలించి రెండు వారాలైనా ఇప్పటివరకూ మౌలిక వసతుల కల్పన జరగలేదు. – బొత్తా హరికృష్ణ, విద్యార్థి, ట్రిపుల్ ఈ (థర్డ్ ఇయర్) హాస్టల్ వసతి కల్పించాలి సుదూర ప్రాంతాల నుం చి వస్తున్న మాకు ఈ మారుమూల ప్రాంతంలో ఎలాంటి సౌకర్యాలూ లేవు. అందరమూ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అత్యవసరంగా ఈ కళాశాల ప్రాంగణంలోనే హాస్టల్ వసతి కల్పించాలి. – యు.రాజా భానుప్రతాప్, విద్యార్థి, సివిల్ (థర్డ్ ఇయర్) అమ్మాయిలు కాలేజీకి వెళ్లే పరిస్థితి లేదు.. జాతీయ రహదారి నుంచి ఇరుకు మార్గంలో తోటల మధ్య నుంచి రెండు కిలోమీటర్ల దూ రం నడిచి కాలేజీకి చేరుకోవాలంటే అమ్మాయిలకు చాలా కష్టంగా ఉంటోంది. ఆటోలు కూడా రావు. రక్షణ దృష్ట్యా ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. – అడ్డ అఖిల, విద్యార్థిని, సివిల్ (సెకెండ్ ఇయర్) -
పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
ఎచ్చెర్ల క్యాంపస్: పాలిటెక్నిక్ డిప్లొమాలో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్ – 2017 కౌన్సెలింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఈ మేరకు శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రంలో ఉదయం 9.30 గం టల నుంచి ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. ఈ కౌన్సెలింగ్‌ను ప్రారంభించిన సహాయ కేంద్రం ఇన్చార్జ్, పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ టీవీ రాజశేఖర్ టాఫ్ ర్యాంకర్ ప్రవీణ్‌కుమార్ (95)కు కౌన్సెలింగ్ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తొలిరోజు 1 నుంచి 10 వేలలోపు ర్యాంకులకు సంబంధించి 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఓసీ, బీసీలు 195, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఐదుగురు ఉన్నారు. బుధవారం 10,001 నుంచి 20,000 మధ్య ర్యాంకులకు ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. జూన్ 2న 1 నుంచి 30,000 ర్యాంకు మధ్య విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది. జూన్ 6వ తేదీ వరకు ధ్రువీకరణ పత్రాలు పరిశీలన కొనసాగనుంది. వెబ్ ఆప్షన్లు ఎంపిక ఏడో తేదీ వరకు ఉంటుంది. 8న ఆప్షన్ల మార్పుకు అవకాశం ఇవ్వనున్నారు. 10న సీట్లు ఎలాట్మెంట్ ప్రకటిస్తారు. 19 నుంచి తరగతలు ప్రారంభమవుతాయి. విద్యార్థులు రాష్ట్రం యూనిట్‌గా కళాశాలకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ ఏడాది జిల్లా నుంచి పాలిసెట్‌కు 7,146 మంది దరఖాస్తు చేసుకోగా, 6,951 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో ఎంతమంది కౌన్సెలింగ్‌కు హాజరవుతారో వేచి చూడాల్సిందే. 2015లో 1,928, 2016లో 2052 మంది హా జరయ్యారు. ఈ ఏడాది సైతం 2 వేల మంది వరకు హాజరయ్యే అవకాశముంది. ఈ కౌన్సెలింగ్‌కు హాజరైన వారందరూ ప్రవేశాలు పొందే అవకాశముండదు. మరోవైపు కౌన్సెలింగ్ హాల్ వెలుపల ప్రైవేట్ కళాశాలు ప్రవేశాల కోసం ప్రమోషన్వర్కు ముమ్మరంగా చేస్తున్నాయి. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియను విభాగాధుపతులు మురళీకృష్ణ, రామకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. -
పాలిసెట్ కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధం
మురళీనగర్ (విశాఖ ఉత్తర): పదో తరగతి విద్యార్హతతో నేరుగా సాంకేతిక విద్యాభ్యాసానికి అవకాశం కల్పించే పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి గాను పాలిసెట్ కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు అధికారులు జిల్లాలో మూడు హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరంలోని కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కాలేజీ, నర్సీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో కౌన్సెలింగ్ కేంద్రాలు పనిచేస్తాయి. ఇక్కడ సర్టిఫికెట్ల పరిశీలనకు అనుగుణంగా సిబ్బందిని నియమించి, కంప్యూటర్ సిస్టమ్‌లను సిద్ధం చేశారు. ఈనెల 30 నుంచి జూన్ 6 వరకు కౌన్సెలింగ్ జరగనుంది. ఉదయం 9 నుంచి ఒంటి గంట, మధ్యాహ్నం 2 నుంచి 5గంటల వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. ఉండాల్సిన ధ్రువపత్రాలు ఎస్ఎస్సీ మార్కుల మెమో, ఆధార్ కార్డు, 4 నుంచి 10 తరగతుల వరకు స్టడీ సర్టిఫికెట్లు లేదా రెసిడెన్సియల్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువపత్రం, కుల ధ్రువీకరణ పత్రం, దివ్యాంగుల ధ్రువపత్రం, ఎన్సీసీ/స్పోర్ట్స్/మైనార్టీ/ఆంగ్లో ఇండియన్ ధ్రువపత్రాలు, ర్యాంకు కార్డు ఒరిజినల్స్‌తో పాటు వాటి జెరాక్స్ కాపీలు తీసుకు రావాల్సి ఉంటుంది. ఫీజు వివరాలు ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.250, ఇతరులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎవరు ఎక్కడికి వెళ్లాలి? దివ్యాంగులు, ఆంగ్లో ఇండియన్, స్పోర్ట్స్, ఎన్సీసీ సర్టిఫికెట్ల ఉన్న వారు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో వారికి కేటాయించిన తేదీల ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇతరులు వారికి సమీపంలోని హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. జిల్లాలోని మూడు హెల్ప్‌లైన్ కేంద్రాలకు తేదీల వారిగా కేటాయించిన ర్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి. -
పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రారంభం
కర్నూలు సిటీ: పాలిటెక్నిక్ కాలేజీల ప్రవేశాల కోసం మంగళవారం కౌన్సెలింగ్ ప్రక్రియను కర్నూలులో జి.పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నికల్ కాలేజీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ చక్రవర్తి ప్రారంభించారు. మొదటి రోజు 1నుంచి 10 వేల ర్యాంకు వరకు నిర్వహించిన కౌన్సెలింగ్ నిర్వహించారు. గత నెల 28న పాలీసెట్–2017 ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ నెల 10న ఫలితాలు విడుదలయ్యాయి. వచ్చే నెల 6వరకు కౌన్సెలింగ్ ఉంటుంది. 2వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడం, 8న ఆప్షన్ల మార్చునకు అవకాశం ఉంటుంది. 10న సీట్లు కేటాయించనున్నట్లు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ చక్రవర్తి తెలిపారు. -
నేటి నుంచి పాలిసెట్ వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నేటి (సోమవారం) నుంచి విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫి కేషన్కు హాజరై, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సాంకేతిక విద్యా కమిషనర్ వాణి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 181 కాలేజీల్లో 43,082 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. నేడు 1 నుంచి 10 వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని తెలిపారు. వెరిఫికేషన్ పూర్తయిన వారు సోమవారం నుంచే 21 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చ న్నారు. వెరిఫికేషన్ సమయంలో విద్యార్థులు ఆధార్, బయోమెట్రిక్ వివరాలను ఇవ్వాలని సూచించారు. ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఆధార్, పదో తరగతి ధ్రువీకరణ పత్రాలు, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫి కెట్లు, టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు వెంట తెచ్చు కోవాలని పేర్కొ న్నారు. పూర్తి వివరాలను తమ వెబ్సైట్ https:// tspolycet. nic.inలో పొందవచ్చని తెలిపారు. ఇదీ షెడ్యూలు.. మే 29 నుంచి జూన్ 6 వరకు వెరిఫికేషన్ మే 29 నుంచి జూన్ 7 వరకు వెబ్ ఆప్షన్లు జూన్ 8: ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం జూన్ 10: సీట్లు కేటాయింపు జూన్ 14లోపు: కాలేజీల్లో చేరికలు జూన్ 14: తరగతుల ప్రారంభం -
రేపు ఈసెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ సెకండియర్‌లో చేరేందుకు ఈ నెల 6న నిర్వహించిన ఈ–సెట్ ఫలితాలు శని వారం విడుదల కానున్నాయి. ఈ మేరకు సెట్ కమిటీ అవసరమైన ఏర్పాట్లు చేపట్టింది. -
నేడు పాలీసెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్ృ2017 పరీక్ష ఫలితాలను 6వ తేదీన విడుదల చేసేందుకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు. నాంపల్లిలోని రూసా సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు. గత నెల 22న నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 1.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను www.sakshi.com, www. sakshieducation.com, https://polycetts. nic.in, www.dtets.cgg.gov.in, www.sbtet. telangana.gov.in, softnet.telangana.gov.in వెబ్ సైట్లలో పొందవచ్చు. కాగా, గతేడాది నిర్వహించిన ఎంసెట్, ఐసెట్, పాలీసెట్‌లో ఏ ర్యాంకు వారికి ఏ కాలేజీలో సీటొచ్చిందనే వివరాలతో కూడిన సీడీని శనివారం కడియం శ్రీహరి విడుదల చేస్తారు. ఈ నెల చివరలో ప్రారంభం కానున్న ఆయా ప్రవేశాలలో విద్యార్థులకు ఉపయోగపడేలా సాంకేతిక శాఖ ఈ సీడీని రూపొందించింది. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
నేడు పాలీసెట్–2017 రాత పరీక్ష సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించనున్న పాలీసెట్–2017 పరీక్షలో నిమిషం నిబంధనను అమలు చేసేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) చర్యలు చేపట్టింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షను నిర్వహించనుంది. 11 గంటల తరువాత విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించ బోమని స్పష్టం చేసింది. పరీక్ష హాల్లోకి గంట ముందునుంచే అనుమతిస్తామని, ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్బీటీఈటీ సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,31,044 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 393 కేంద్రాల్లో పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు 52సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. విద్యార్థులు హెచ్‌బీ/2బీ పెన్సిల్, ఎరేజర్, షార్ప్‌నర్, ఎగ్జామ్ ప్యాడ్, బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలని సూచించింది. సందేహాలకు హెల్ప్ డెస్క్ నంబర్ల (8499827774, 18005995577, polycetts@gmail.com)ను సంప్రదించవచ్చని పేర్కొంది. -
రేపు పాలీసెట్
♦ హాజరుకానున్న 1.31 లక్షల మంది ♦ ఏర్పాట్లు పూర్తి చేసిన ఎస్బీటీఈటీ ♦ నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 22న పాలీసెట్–2017 నిర్వహించేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షను నిర్వహించనుంది. పరీక్షకు హాజరయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,31,044 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 393 కేంద్రాల్లో పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు 52 సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. విద్యార్థులను పరీక్ష హాల్లోకి గంట ముందునుంచే అనుమతిస్తామని, ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్బీటీఈటీ సూచించింది. ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం అయ్యాక నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. సెల్‌ఫోన్, మొబైల్, క్యాలుక్యు లేటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని, విద్యార్థులు హెచ్‌బీ/2బీ పెన్సిల్, ఎరేజర్, షార్ప్‌నర్, ఎగ్జామ్ ప్యాడ్ వెంట తెచ్చుకోవాలని సూచించింది. విద్యార్థులు తమ వెబ్సైట్ నుంచి (ఞౌlyఛ్ఛ్టి్టట.nజీఛి.జీn) హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఏమైనా సమస్యలు తలెత్తితే హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సంప్రదించాలని, హెల్ప్ డెస్క్ నంబర్లలోనూ (8499827774, 18005995577–టోల్‌ఫ్రీ, ఞౌlyఛ్ఛ్టి్టటఃజఝ్చజీl.ఛిౌఝ మెయిల్లో) సంప్రదించ వచ్చని వివరించింది. -
ఐదు కొత్త జిల్లాల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు!
♦ కేంద్రానికి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు ♦ ఒక్కో పాలిటెక్నిక్‌కు రూ.12.3 కోట్లు ♦ 2018–19 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు జిల్లాలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. సబ్మిషన్ స్కీం ఆఫ్ పాలిటెక్నిక్స్ కింద కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఒక్కో పాలిటెక్నిక్ ఏర్పా టుకు రూ. 12.3 కోట్ల చొప్పున మంజూరు చేయ నుంది. ఇందులో పాలిటెక్నిక్‌ల భవన నిర్మాణాలకు రూ. 8 కోట్ల చొప్పున, పరికరాలు, వసతుల కల్పనకు రూ. 4.3 కోట్ల చొప్పున నిధులను ఇవ్వనుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 5 జిల్లాల్లో పాలిటెక్నిక్‌లు లేవు. మహబూబాబాద్ ఆసిఫాబాద్, నాగర్ కర్నూలు, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో కొత్త పాలిటెక్నిక్‌ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రతిపాద నలు సిద్ధం చేస్తోంది. అవి పూర్తి కాగానే కేంద్రానికి అందజేయనుంది. కేంద్రం నుంచి ఆమోదం లభించ గానే 2018–19 విద్యా సంవత్సరం నుంచి వాటిని అమల్లోకి తేనుంది. కొత్తగా ఏర్పాటు చేసే పాలి టెక్నిక్‌లకు అవసరమైన భూమి, వాటిల్లో నియమించే అధ్యాపకుల జీతభత్యాలను రాష్ట్ర ప్రభుత్వమే భరిం చాల్సి ఉంటుంది. కొత్తగా రానున్న 5 పాలిటెక్నిక్‌లలో 3 చొప్పున (సివిల్, ఎలక్ట్రికల్, మరొకటి) కోర్సులను ప్రవేశపెట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది నుంచే హుస్నాబాద్ పాలిటెక్నిక్‌లో తరగతులు హుస్నాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 2017–18 విద్యా సంవత్సరం నుం చే తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22న నిర్వహించనున్న పాలీసెట్–2017 ద్వారా ఆ కాలేజీలో సివిల్‌లో 60 సీట్లు, ఎలక్ట్రికల్‌లో 60 సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు హుస్నా బాద్ పాలిటెక్నిక్‌కు ఏఐసీటీఈ ఆమోదం తెలి పింది. ఈ విద్యా సంవత్సరంలో హుస్నాబాద్‌తో పాటు సికింద్రాబాద్ పాలిటెక్నిక్‌లో తరగతుల ప్రారంభానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఏఐసీటీఈకి ప్రతిపాదనలు పంపింది. సికింద్రాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌కు సొంత భవనం లేకపోవడంతో 2017–18లో ప్రవేశాలకు అనుమతి ఇవ్వలేదు.