సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా విద్యలో సమూల మార్పుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపడుతోంది. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసే విద్యార్థులకు ఉపాధి మెరుగుపడేలా, వారి ముంగిటకే ఉద్యోగావకాశాలు వచ్చేలా నూతన ప్రణాళికలను అమల్లోకి తెస్తోంది. ప్రస్తుతం ఉన్న సిలబస్‌లో సమూల సంస్కరణలు చేస్తోంది. అలాగే కొత్తగా పలు పరిశ్రమ ఆధారిత కోర్సులను ప్రవేశపెడుతోంది.
ఈ కోర్సుల బోధనకు వీలుగా అధ్యాపకులకు సైతం ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. రాష్ట్రంలో 84 ప్రభుత్వ, 165 ప్రైవేట్, 1 ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. వీటిలో 25 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులను కొత్త అంశాలతో సాంకేతిక విద్యాశాఖ అభివృద్ధి చేస్తోంది. కంపెనీల సూచన మేరకు పరిశ్రమ ఆధారిత కోర్సులను కూడా ప్రారంభిస్తోంది.
ఎక్కువమంది విద్యార్థులు జాబ్ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ వంటి కోర్సులకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. మరోవైపు ఆఫీస్ ఆటోమేషన్, ఫైర్ సేఫ్టీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ, బ్యూటిఫికేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఏసీ మెషిన్స్, ఫుట్‌వేర్ టెక్నాలజీ తదితర అంశాల్లో 6 నుంచి 18 నెలల కాలవ్యవధితో సర్టిఫికెట్ కోర్సులకు కూడా సాంకేతిక విద్యా శాఖ శ్రీకారం చుట్టింది.
ఉపాధి లభించే కోర్సులకు పెద్దపీట..
పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాలిటెక్నిక్‌ల్లో ప్రభుత్వం కోర్సులను ప్రవేశపెడుతోంది. ఉపాధి అవకాశాలు ఉన్న సిరామిక్స్ టెక్నాలజీ, టెక్స్‌టైల్స్ టెక్నాలజీ, మెటలర్జీ వంటి కోర్సుల్లో ఎక్కువమంది చేరుతుండడంతో వాటిలోనూ సీట్లు పెరిగాయి.
అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రభుత్వం వర్చువల్ డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేసింది. అలాగే పారిశ్రామిక శిక్షణా కార్యక్రమాల కోసం విద్యాసంస్థలను పరిశ్రమలతో అనుసంధానిస్తున్నారు. అధ్యాపకులను కూడా దశలవారీగా గంగవరం పోర్టు, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు ప్రాంతాలకు, పరిశ్రమలకు శిక్షణ కోసం పంపుతున్నారు.
విద్యార్థులకు స్టైఫండ్‌తో ఇంటర్న్‌షిప్..
పాలిటెక్నిక్ విద్యార్థులకు ఆయా పరిశ్రమల్లో స్టైఫండ్‌తో కూడిన శిక్షణ అందించడానికి చర్యలు చేపట్టారు. పాలిటెక్నిక్‌ల్లో మూడున్నరేళ్లు, మూడేళ్ల డిప్లొమా కోర్సులు ఉన్నాయి. మూడేళ్ల కోర్సు విద్యార్థులకు ఆరు నెలలు, ఇతర విద్యార్థులకు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల ద్వారా 11,604 మంది, ప్రైవేట్ పాలిటెక్నిక్‌ల ద్వారా 24,669 మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్ పొందుతున్నారు. దీనికోసం సాంకేతిక విద్యాశాఖ 566 పరిశ్రమలు, ఇతర సంస్థలతో చర్చించి ఏర్పాట్లు చేసింది. ఇంటర్న్‌షిప్‌లో విద్యార్థులకు పరిశ్రమలు నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు స్టైఫండ్ అందిస్తున్నాయి.
విద్యార్థులకు నైపుణ్యాల పెంపు
ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినవారితోపాటు డిప్లొమా విద్యార్థుల వైపు కూడా కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. అందుకనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఫలితంగా 90 శాతం మంది విద్యార్థులు ఉద్యోగావకాశాలు దక్కించుకుంటున్నారు. డిప్లొమా విద్యార్థులకు ప్లేస్‌మెంట్లను పెంచేందుకు సాంకేతిక విద్యాశాఖ పరిశ్రమలతో ఎప్పటికప్పుడు చర్చిస్తోంది.
కియా, అపాచీ, ఎఫ్‌ట్రానిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), శ్రీసిటీతో సహా కొన్ని కంపెనీలకు వెళ్లి సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సి.నాగరాణి చర్చలు జరిపారు. ప్రతి కాలేజీలో ప్లేస్‌మెంట్ సెల్‌లను ఏర్పాటు చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా విద్యార్థులందరికీ ఉద్యోగావకాశాలను కల్పించడానికి క్లస్టర్ ఆధారిత ప్లేస్‌మెంట్ మోడల్‌ను అమలు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు వివిధ ప్రాంతాల్లో క్యాంపస్ డ్రైవ్‌లు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు.
నైపుణ్యాల పెంపునకు పలు సంస్థలతో ఒప్పందాలు
పరిశ్రమ అవసరాలకనుగుణంగా విద్యార్థులను తయారు చేసేందుకు సిస్కో, ఏడబ్ల్యూఎస్, రెడ్–హేట్, పాలో–ఆల్టో, బ్లూప్రిజమ్ మాక్రోచిప్ వంటి ప్రముఖ సంస్థలతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారు. విద్యార్థులు తమ కోర్సులతోపాటు ఇతర ఆన్‌లైన్ కోర్సులను నేర్చుకోవడానికి వీలుగా ‘స్పోకెన్ ట్యుటోరియల్’ కోసం ఐఐటీ–బాంబేతో ఎంవోయూ చేసుకున్నారు.
17 స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేయగా మరో 17 హబ్‌లను సిద్ధం చేస్తున్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో కంప్యూటర్లు, ఇతర ల్యాబ్ పరికరాలను ఆధునికీకరిస్తున్నారు. వీటితో పాటు కాలేజీలకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్‌బీఏ) గుర్తింపు వచ్చేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కళ్యాణదుర్గం, కుప్పంలోని కాలేజీలకు ఈ గుర్తింపు ఉండగా మరో 49 కాలేజీలకు అక్రిడిటేషన్ వచ్చేలా చర్యలు చేపడుతున్నారు.
పాలిటెక్నిక్‌ల్లోనూ నాడు–నేడు
పాలిటెక్నిక్‌లను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కావాల్సిన మేర నిధులను కేటాయిస్తోంది. నాబార్డ్–ఆర్‌ఐడీఎఫ్ ఆధ్వర్యంలో 70 సివిల్ పనులకు రూ.365.46 కోట్లు మంజూరు కాగా రూ.218.66 కోట్లతో 49 పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు మరో 15 సివిల్ పనులకు రూ.82.84 కోట్లకు రాష్ట్ర ప్రణాళిక గ్రాంట్లు మంజూరయ్యాయి. ఇవి కాకుండా 16 ఎస్సీ హాస్టళ్లు, 27 మహిళా హాస్టళ్ల పనులు పురోగతిలో ఉన్నాయి.
నాడు–నేడు కింద పాలిటెక్నిక్‌లను కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. రూ.10 లక్షల ప్రైజ్‌మనీతో ఇటీవల డిప్లొమా విద్యార్థుల కోసం పాలీ టెక్‌ఫెస్ట్–2022ని కూడా నిర్వహించాం. ప్రాంతీయ స్థాయిలో 1,081 ప్రాజెక్టులు ప్రదర్శించగా.. రాష్ట్ర స్థాయికి 253 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఫెస్ట్‌లో వచ్చిన ఆలోచనలను ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సహకారంతో అభివృద్ధి చేస్తాం. పేటెంట్లు పొందడానికి దరఖాస్తులు కూడా పంపనున్నాం.
– చదలవాడ నాగరాణి, కమిషనర్, సాంకేతిక విద్యా శాఖ
Comments
Please login to add a commentAdd a comment