Department of Technical Education
-
119 మార్కులకు టాప్ ర్యాంక్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, నాన్– ఇంజనీరింగ్, అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో (పాలిటెక్నిక్) ప్రవేశానికి రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ పాలిసెట్–20 23)లో బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణుల య్యారు. బాలురు, బాలికలు కలిపి మొత్తం మీద 82.17 శాతం ఉత్తీర్ణత నమోదైంది. శుక్రవారం హైదరాబాద్‌లోని సాంకేతిక విద్యాభవన్ ఆడిటోరియంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఫలితాలను విడుదల చేశారు. 86.63 శాతం ఉత్తీర్ణతతో బాలికలు సత్తా చాటారు. బాలురు 78.62 శాతం ఉత్తీర్ణత సాధించారు. అర్హులైన వారికి జూన్ 14 నుంచి తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మిత్తల్ తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో మరో నాలుగు పాలిటెక్నిక్ కాలేజీలు కొత్తగా వస్తున్నాయని చెప్పారు. 119తో టాప్ ర్యాంక్ ఈనెల 17న నిర్వహించిన పాలిసెట్‌కు 1,05,742 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 98,274 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో ఎంపీసీ విభాగంలో 80,358, ఎంబైపీసీ విభాగంలో 80,752 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. సూర్యాపేట జిల్లాకు చెందిన సురభి శరణ్య 120 మార్కులకు 119 మార్కు లు సాధించి ఎంపీసీ విభాగంలో స్టేట్ మొదటి ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. అదే జిల్లాకు చెందిన షేక్ సిద్ధిక్ సైతం 119 మార్కులు సాధించి రెండో ర్యాంక్‌ను కైవసం చేసుకోగా, మెదక్ జిల్లాకు చెందిన జి.ప్రియాంశ్కుమార్, హైదరాబాద్‌కు చెందిన పి.ప్రణీత్, సూర్యాపేటకు చెందిన కె.శశివర్ధన్లు 118 మార్కులతో మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. ఎంబైపీసీ విభాగంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన చీర్ల ఆకాశ్ 116 మార్కులు సాధించి మొదటి ర్యాంక్‌ను సొంతం చేసుకోగా, సూర్యాపేట జిల్లా విద్యార్థి మిర్యాల అక్షయతార 116 మార్కులతో రెండు, సూర్యాపేట జిల్లాకే చెందిన కె.శశివర్ధన్ 116 మార్కులతో మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. శశివర్ధన్ ఎంపీసీ, ఎంబైపీసీ రెండింటిలోనూ రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం విశేషం. పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ, హార్టీకల్చర్ వర్సిటీల్లోని కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు. రైతుబిడ్డ.. ఎంబైపీసీలో ఫస్ట్‌ర్యాంకర్ కాటారం: రైతుబిడ్డ పాలిసెట్‌లో మెరిశాడు. ఎంబైపీసీలో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గంగారానికి చెందిన చీర్ల ఆకాశ్ 120కి 116 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్‌ర్యాంక్ సాధించాడు. ఆకాశ్ తండ్రి చీర్ల రమేశ్ రైతు కాగా, తల్లి రజిత గృహిణి. ఆకాశ్ 4వ తరగతి వరకు కాటారంలోని ప్రైవేటు పాఠశాలలో చదివాడు. 10వ తరగతి వరకు హనుమకొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివి 10 జీపీఏ సాధించాడు. ‘మా నాన్న కష్టం చూసేవాడిని. ప్రణాళికాబద్ధంగా చదివాను. అనుకున్న ర్యాంకు సాధించాను. ఏ కోర్సు తీసుకోవాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు’ అని ఆకాశ్ తెలిపాడు. తొలి విడత కౌన్సెలింగ్.. ♦ ఆన్లైన్లో దరఖాస్తు చేయడం, ఫీజు చెల్లించడం, స్లాట్ బుకింగ్: జూన్ 14 నుంచి 18 వరకు ♦ సరి్టఫికెట్ల వెరిఫికేషన్: జూన్ 16 నుంచి 19 వరకు ♦ వెబ్ ఆప్షన్లు: జూన్ 16 నుంచి 21 వరకు ♦ ఆప్షన్ల ఫ్రీజింగ్ జూన్ 21 ♦ సీట్ల కేటాయింపు జూన్ 25 ♦ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ జూన్ 25 నుంచి 29 వరకు తుది విడత కౌన్సెలింగ్.. ♦ ఆన్లైన్లో దరఖాస్తు చేయడం, ఫీజు చెల్లించడం స్లాట్‌బుకింగ్: జూలై 1 ♦ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూలై 2 ♦ వెబ్ ఆప్షన్లు జూలై 1 నుంచి 3 వరకు ♦ ఆప్షన్ల ఫ్రీజింగ్ జూలై 3 ♦ సీట్ల కేటాయింపు జూలై 7 ♦ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై 7 నుంచి 10 వరకు. స్పాట్ అడ్మిషన్లు.. ♦ స్పాట్ అడ్మిషన్ల ప్రకటన: జూలై 7 ♦ ఫీజు చెల్లింపు జూలై 8, 9 ♦ ర్యాంక్ జనరేషన్ జూలై 10 ♦ వెబ్ ఆప్షన్లు జూలై 8 నుంచి 11 వరకు ♦ ఆప్షన్ల ఫ్రీజింగ్ జూలై 11 ♦ సీట్ల కేటాయింపు జూలై 14 ♦ ఫీజు చెల్లించడం, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై 14 నుంచి 15 వరకు ♦ కాలేజీల్లో రిపోర్ట్ చేయడం జూలై 15, స్పాట్ అడ్మిషన్లు పూర్తి జూలై 17 -
పాలిటెక్నిక్ విద్యార్థుల ముంగిటకే ఉద్యోగావకాశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా విద్యలో సమూల మార్పుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపడుతోంది. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసే విద్యార్థులకు ఉపాధి మెరుగుపడేలా, వారి ముంగిటకే ఉద్యోగావకాశాలు వచ్చేలా నూతన ప్రణాళికలను అమల్లోకి తెస్తోంది. ప్రస్తుతం ఉన్న సిలబస్‌లో సమూల సంస్కరణలు చేస్తోంది. అలాగే కొత్తగా పలు పరిశ్రమ ఆధారిత కోర్సులను ప్రవేశపెడుతోంది. ఈ కోర్సుల బోధనకు వీలుగా అధ్యాపకులకు సైతం ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. రాష్ట్రంలో 84 ప్రభుత్వ, 165 ప్రైవేట్, 1 ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. వీటిలో 25 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులను కొత్త అంశాలతో సాంకేతిక విద్యాశాఖ అభివృద్ధి చేస్తోంది. కంపెనీల సూచన మేరకు పరిశ్రమ ఆధారిత కోర్సులను కూడా ప్రారంభిస్తోంది. ఎక్కువమంది విద్యార్థులు జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ వంటి కోర్సులకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. మరోవైపు ఆఫీస్ ఆటోమేషన్, ఫైర్ సేఫ్టీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ, బ్యూటిఫికేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఏసీ మెషిన్స్, ఫుట్‌వేర్ టెక్నాలజీ తదితర అంశాల్లో 6 నుంచి 18 నెలల కాలవ్యవధితో సర్టిఫికెట్ కోర్సులకు కూడా సాంకేతిక విద్యా శాఖ శ్రీకారం చుట్టింది. ఉపాధి లభించే కోర్సులకు పెద్దపీట.. పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాలిటెక్నిక్‌ల్లో ప్రభుత్వం కోర్సులను ప్రవేశపెడుతోంది. ఉపాధి అవకాశాలు ఉన్న సిరామిక్స్ టెక్నాలజీ, టెక్స్టైల్స్ టెక్నాలజీ, మెటలర్జీ వంటి కోర్సుల్లో ఎక్కువమంది చేరుతుండడంతో వాటిలోనూ సీట్లు పెరిగాయి. అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రభుత్వం వర్చువల్ డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేసింది. అలాగే పారిశ్రామిక శిక్షణా కార్యక్రమాల కోసం విద్యాసంస్థలను పరిశ్రమలతో అనుసంధానిస్తున్నారు. అధ్యాపకులను కూడా దశలవారీగా గంగవరం పోర్టు, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు ప్రాంతాలకు, పరిశ్రమలకు శిక్షణ కోసం పంపుతున్నారు. విద్యార్థులకు స్టైఫండ్‌తో ఇంటర్న్‌షిప్.. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఆయా పరిశ్రమల్లో స్టైఫండ్‌తో కూడిన శిక్షణ అందించడానికి చర్యలు చేపట్టారు. పాలిటెక్నిక్‌ల్లో మూడున్నరేళ్లు, మూడేళ్ల డిప్లొమా కోర్సులు ఉన్నాయి. మూడేళ్ల కోర్సు విద్యార్థులకు ఆరు నెలలు, ఇతర విద్యార్థులకు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల ద్వారా 11,604 మంది, ప్రైవేట్ పాలిటెక్నిక్‌ల ద్వారా 24,669 మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్ పొందుతున్నారు. దీనికోసం సాంకేతిక విద్యాశాఖ 566 పరిశ్రమలు, ఇతర సంస్థలతో చర్చించి ఏర్పాట్లు చేసింది. ఇంటర్న్‌షిప్‌లో విద్యార్థులకు పరిశ్రమలు నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు స్టైఫండ్ అందిస్తున్నాయి. విద్యార్థులకు నైపుణ్యాల పెంపు ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినవారితోపాటు డిప్లొమా విద్యార్థుల వైపు కూడా కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. అందుకనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఫలితంగా 90 శాతం మంది విద్యార్థులు ఉద్యోగావకాశాలు దక్కించుకుంటున్నారు. డిప్లొమా విద్యార్థులకు ప్లేస్మెంట్లను పెంచేందుకు సాంకేతిక విద్యాశాఖ పరిశ్రమలతో ఎప్పటికప్పుడు చర్చిస్తోంది. కియా, అపాచీ, ఎఫ్ట్రానిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), శ్రీసిటీతో సహా కొన్ని కంపెనీలకు వెళ్లి సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సి.నాగరాణి చర్చలు జరిపారు. ప్రతి కాలేజీలో ప్లేస్మెంట్ సెల్‌లను ఏర్పాటు చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా విద్యార్థులందరికీ ఉద్యోగావకాశాలను కల్పించడానికి క్లస్టర్ ఆధారిత ప్లేస్మెంట్ మోడల్‌ను అమలు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు వివిధ ప్రాంతాల్లో క్యాంపస్ డ్రైవ్‌లు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. నైపుణ్యాల పెంపునకు పలు సంస్థలతో ఒప్పందాలు పరిశ్రమ అవసరాలకనుగుణంగా విద్యార్థులను తయారు చేసేందుకు సిస్కో, ఏడబ్ల్యూఎస్, రెడ్–హేట్, పాలో–ఆల్టో, బ్లూప్రిజమ్ మాక్రోచిప్ వంటి ప్రముఖ సంస్థలతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారు. విద్యార్థులు తమ కోర్సులతోపాటు ఇతర ఆన్లైన్ కోర్సులను నేర్చుకోవడానికి వీలుగా ‘స్పోకెన్ ట్యుటోరియల్’ కోసం ఐఐటీ–బాంబేతో ఎంవోయూ చేసుకున్నారు. 17 స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేయగా మరో 17 హబ్‌లను సిద్ధం చేస్తున్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో కంప్యూటర్లు, ఇతర ల్యాబ్ పరికరాలను ఆధునికీకరిస్తున్నారు. వీటితో పాటు కాలేజీలకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు వచ్చేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కళ్యాణదుర్గం, కుప్పంలోని కాలేజీలకు ఈ గుర్తింపు ఉండగా మరో 49 కాలేజీలకు అక్రిడిటేషన్ వచ్చేలా చర్యలు చేపడుతున్నారు. పాలిటెక్నిక్ల్లోనూ నాడు–నేడు పాలిటెక్నిక్‌లను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కావాల్సిన మేర నిధులను కేటాయిస్తోంది. నాబార్డ్–ఆర్ఐడీఎఫ్ ఆధ్వర్యంలో 70 సివిల్ పనులకు రూ.365.46 కోట్లు మంజూరు కాగా రూ.218.66 కోట్లతో 49 పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు మరో 15 సివిల్ పనులకు రూ.82.84 కోట్లకు రాష్ట్ర ప్రణాళిక గ్రాంట్లు మంజూరయ్యాయి. ఇవి కాకుండా 16 ఎస్సీ హాస్టళ్లు, 27 మహిళా హాస్టళ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. నాడు–నేడు కింద పాలిటెక్నిక్‌లను కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. రూ.10 లక్షల ప్రైజ్‌మనీతో ఇటీవల డిప్లొమా విద్యార్థుల కోసం పాలీ టెక్‌ఫెస్ట్–2022ని కూడా నిర్వహించాం. ప్రాంతీయ స్థాయిలో 1,081 ప్రాజెక్టులు ప్రదర్శించగా.. రాష్ట్ర స్థాయికి 253 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఫెస్ట్‌లో వచ్చిన ఆలోచనలను ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సహకారంతో అభివృద్ధి చేస్తాం. పేటెంట్లు పొందడానికి దరఖాస్తులు కూడా పంపనున్నాం. – చదలవాడ నాగరాణి, కమిషనర్, సాంకేతిక విద్యా శాఖ -
ఫార్మసీ అడ్మిషన్లపై సందిగ్ధం
సాక్షి, అమరావతి: ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) కాలేజీలకు గుర్తింపు ఆమోదించే ప్రక్రియను ఆలస్యం చేయడంతో ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఈఏపీ సెట్ ఫలితాలు వెలువడి నెలలు గడిచిపోతున్నా ఫార్మసీ కాలేజీలకు అనుమతులు ఆలస్యం కావడంతో ఆయా కాలేజీల్లోని సీట్ల భర్తీకి ఆటంకంగా మారింది. రెండు నెలలుగా విద్యార్థులు ప్రవేశాల కోసం నిరీక్షిస్తుండగా.. పీసీఐ అనుమతులు లేకపోవడంతో ఈఏపీ సెట్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టేందుకు ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యా శాఖ ముందుకు వెళ్లలేకపోయాయి. దీనిపై ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పలుమార్లు సంప్రదింపులు చేశారు. గత నెలాఖరుకు అనుమతుల ప్రక్రియ పూర్తి చేస్తామని.. అనంతరం కౌన్సెలింగ్ చేపట్టవచ్చని సూచించింది. గడువు దాటినా పూర్తి స్థాయిలో అనుమతులు ఇంకా రాలేదు. దీంతో ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యా శాఖ ఈఏపీ సెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ను కేవలం ఇంజనీరింగ్ కోర్సులకే పరిమితం చేశాయి. మూడు విడతల్లో కౌన్సెలింగ్ చేపట్టి ఇంజనీరింగ్ కాలేజీలలోని 80 శాతం సీట్లు భర్తీ చేశారు. ప్రత్యామ్నాయాల వైపు విద్యార్థుల చూపు రాష్ట్రంలో బి.ఫార్మసీ కాలేజీలు 121 వరకు ఉన్నాయి. ఫార్మా–డి కోర్సులు నిర్వహించే కాలేజీలు 60 ఉన్నాయి. కన్వీనర్ కోటాలో బి.ఫార్మసీ కాలేజీలలో 4,386 సీట్లు, ఫార్మా–డిలో 682 సీట్లు ఉన్నాయి. సకాలంలో కౌన్సెలింగ్ చేపట్టిన రోజుల్లోనే ఈ కాలేజీల్లో సీట్లు పూర్తిగా భర్తీ అయ్యేవి కావు. పీసీఐ తీరు కారణంగా ఈసారి చాలా ఆలస్యం కావడంతో విద్యార్థులు ప్రత్యామ్నాయాల వైపు వెళ్లిపోతున్నారని పలు కాలేజీల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వానికి నివేదిక ఫార్మసీ కాలేజీలకు పీసీఐ నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు రాకపోవడంతో సాంకేతిక విద్యాశాఖ ఈ కోర్సు ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో కొన్నింటికి సరైన నిబంధనలు పాటించనందున పూర్తి సీట్లకు అనుమతివ్వలేదు. దీనిపై పలు కాలేజీలు పీసీఐని చాలెంజ్ చేశాయి. నిబంధనల ప్రకారం వసతులు, అధ్యాపకులు ఇతర అంశాలపై ఆధారాలు సమర్పణకు పీసీఐ కాలేజీలకు నెలాఖరు వరకు అవకాశం కల్పించింది. ఈ తరుణంలో కౌన్సెలింగ్ ఆలస్యం అవుతుండటంతో అధికారులు పీసీఐని సంప్రదించగా.. కొన్ని షరతులతో సీట్ల భర్తీకి అనుమతించింది. గత ఏడాది ఇన్ టేక్ ప్రకారం కౌన్సెలింగ్ చేపట్టవచ్చని, అయితే అవి తమ చివరి అనుమతుల మేరకు కొనసాగుతాయని పీసీఐ పేర్కొందని అధికారులు ప్రభుత్వానికి వివరించారు. ఈ నేపథ్యంలో ముందుకు వెళ్లేందుకు వీలుగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం సాంకేతిక విద్యా శాఖ పేర్కొన్న మేరకు కాలేజీలకు ప్రభుత్వం అనుమతిస్తే ఒకటి రెండు రోజుల్లోనే కౌన్సెలింగ్ ను చేపట్టే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొంటున్నాయి. -
మలి విడతలో మరో 9,240 సీట్లు
సాక్షి, హైదరాబాద్: అక్టోబర్ 11 నుంచి జరిగే ఎంసెట్ కౌన్సెలింగ్ నాటికి మరో 9,240 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 6,200 సీట్లు కన్వీనర్ కోటాలో ఉండే వీలుంది. ఇవన్నీ కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులే. వీటన్నింటికీ ఇటీవల అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతించింది. తాజాగా రాష్ట్ర సాంకేతిక విద్య విభాగం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యార్థుల నుంచి డిమాండ్ లేని కోర్సుల స్థానంలో డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకునేందుకు ఏఐసీటీఈ అనుమతించింది. ఇందుకు అనుగుణంగా 89 కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో సీట్లు తగ్గించుకునేందుకు దరఖాస్తులు చేసుకున్నాయి. దీంతో 6 వేలకుపైగా ఈ సీట్లు తగ్గుతున్నాయి. మొదటి విడత కౌన్సెలింగ్ నాటికి 71,286 సీట్లు అందుబాటులో ఉండగా, కొత్త సీట్లతో కలిపి ఈ ఏడాది కనీ్వనర్ కోటాలో 77,486 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త సీట్లపై కోటి ఆశలు తొలి దశలో సీట్లు పొందినా... మంచి కాలేజీ, మంచి బ్రాంచ్ కోసం మరో దఫా కౌన్సె లింగ్‌కు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఇందులోనూ ఎక్కువ మంది కంప్యూటర్ కోర్సు లపైనే దృష్టి పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల్లో సీట్లు లభించని విద్యార్థులు రెండో విడతలో మరోసారి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశాలున్నాయి. కొత్తగా 6,200 సీట్లు అందుబాటులోకి వచ్చి న నేపథ్యంలో మరింత మందికి ఈ బ్రాంచీల్లో సీట్లు లభించే అవకాశం ఉంది. కంప్యూటర్ సైన్స్‌పైనే గురి ఎంసెట్ మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో కంప్యూటర్ సైన్స్, ఐటీ అనుబంధ బ్రాంచీలకే విద్యార్థులు అత్యధికంగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. కంప్యూటర్ సై¯న్స్, ఐటీ అనుబంధ బ్రాంచీల్లో 99.91 శాతం సీట్లు కేటాయించగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 99.76 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. అలాగే డేటాసైన్స్‌లో 99.64 శాతం, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 99.59 శాతం సీట్లు కేటాయించారు. సివిల్, మెకానికల్, అలైడ్ ఇంజనీరింగ్ బ్రాంచీలపై విద్యార్థులు ఆసక్తి కనబరచలేదు. ఈ కోర్సుల అనుబంధ బ్రాంచీల్లో 36.75 శాతం సీట్లకు కేటాయింపులు జరగ్గా, 50 శాతానికి పైగా సీట్లు ఖాళీగా మిగిలాయి. సివిల్ ఇంజనీరింగ్‌లో 36.38 శాతం సీట్లు భర్తీ కాగా, మెకానికల్‌లో 31.92 శాతం, ప్లానింగ్‌లో 24.44 శాతం సీట్లు కేటాయించారు. అలాగే మైనింగ్, కెమికల్, ఫుడ్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, ఫార్మాసూటికల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ తదితర కోర్సుల్లో 84.45 శాతం సీట్లు కేటాయించారు. -
నెలాఖరుకు ఏపీఈఏపీ సెట్ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీఈఏపీ సెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానుంది. షెడ్యూల్‌తో పాటు ఇతర సమగ్ర సమాచారాన్ని ఈ నెల 21న విడుదల చేయనున్నారు. ఏపీఈఏపీ సెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశాన్ని సోమవారం ఉన్నత విద్యామండలిలో నిర్వహించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, అడ్మిషన్ల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి.సుధీర్‌ప్రేమ్‌కుమార్, సెట్స్ ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి తదితర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఏపీఈఏపీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ నిర్వహణపై సమావేశంలో చర్చించారు. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల(జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ.. జోసా) కౌన్సెలింగ్ 6 విడతల్లో జరుగనుండటం, చివరి విడత సీట్ల కేటాయింపు ఆయా సంస్థల్లో చేరికలు ఈ నెల 27 వరకూ కొనసాగనున్న నేపథ్యంలో.. ఆ తర్వాత రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలను చేపట్టడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఏపీఈఏపీ సెట్లో అగ్రస్థానంలో ఉన్న ర్యాంకర్లు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్లలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఈ నేపథ్యంలో ముందుగా రాష్ట్రంలో ఏపీఈఏపీ సెట్ కౌన్సెలింగ్ నిర్వహించి వారికి సీట్లు కేటాయించి చేరికలు చేపడితే.. జేఈఈలో కూడా మెరిట్లో ఉన్న ఆ విద్యార్థులు ప్రస్తుత జోసా కౌన్సెలింగ్‌లో ఐఐటీ, ఎన్ఐటీ తదితర సంస్థల్లో సీట్లు పొంది అటు వైపు వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఇక్కడి కాలేజీల్లో వారికి కేటాయించిన సీట్లు ఖాళీ అవ్వడం, వాటిని మళ్లీ తదుపరి కౌన్సెలింగ్‌లో కేటాయింపు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పటికే కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ఆయా సంస్థలకు ధ్రువపత్రాలిచ్చి, ఫీజులు చెల్లించి ఉంటే.. వాటిని తిరిగి పొందడం సమస్యగా మారుతుంది. జేఈఈ కౌన్సెలింగ్ తర్వాత ఏపీఈఏపీ కౌన్సెలింగ్ నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఈ ఇబ్బందులు తప్పడంతో పాటు.. తదుపరి మెరిట్లో ఉన్న వారికి మేలు జరుగుతుంది. ఇలా అన్ని అంశాలపై ఏపీఈఏపీ సెట్ అడ్మిషన్ల కమిటీ దృష్టి సారించింది. జేఈఈ కౌన్సెలింగ్ అనంతరం నెలాఖరు నుంచి ఏపీఈఏపీ సెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ చేపట్టడం తదితర అంశాలపై లోతుగా చర్చించింది. ఈ నెల 21న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ నేతృత్వంలో మరోసారి సమావేశమై చర్చించి ఏపీఈఏపీ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేసి విడుదల చేస్తారు. కన్వీనర్ కోటాలోకి ప్రైవేట్ వర్సిటీల్లోని 35 శాతం సీట్లు ఇదిలా ఉండగా ప్రైవేటు యూనివర్సిటీలలోని 35 శాతం సీట్లు కూడా ప్రస్తుత ఏపీఈఏపీ సెట్ కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. ఈ యూనివర్సిటీలు తమ కోర్సులకు ఫీజుల ఖరారుకు ప్రతిపాదనలను రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు అందించాయి. ఈ నెలాఖరులోగా కమిషన్ ఫీజులు ఖరారు చేసే అవకాశముందని, వాటిపై ప్రభుత్వం తుది ఉత్తర్వులు విడుదల చేశాక కౌన్సెలింగ్‌లో ఆ సీట్లను కూడా కన్వీనర్ కోటాలో మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం విద్యార్థులకు కేటాయిస్తామని అడ్మిషన్ల కమిటీ అధికారి ఒకరు తెలిపారు. -
25లోగా కాలేజీల అఫిలియేషన్ పూర్తి చేయాలి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మా కాలేజీల అఫిలియేషన్(గుర్తింపు) ప్రక్రియను ఈనెల 25కల్లా పూర్తి చేయాలని కాకినాడ, అనంతపురం జేఎన్టీయూ అధికారులను ఏపీ ఈఏపీ సెట్ కమిటీ ఆదేశించింది. ఈఏపీ సెట్ అడ్మిషన్ల ప్రక్రియపై చర్చించేందుకు కమిటీ బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో సమావేశమైంది. ఏపీ ఈఏపీ సెట్ కమిటీ చైర్మన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ పోలా భాస్కర్, సెట్స్ ప్రత్యేకాధికారి డాక్టర్ ఎమ్.సుధీర్‌రెడ్డి, వర్సిటీల అధికారులు, కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు ఈ సమావేశంలో షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉంది. కానీ కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియను యూనివర్సిటీలు ఇంకా పూర్తి చేయకపోవడంతో షెడ్యూల్ ఖరారు చేయలేకపోయారు. రాష్ట్రంలో ఉన్న 272 ఇంజినీరింగ్, ఫార్మా కాలేజీల్లోని 1,39,862 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతులు మంజూరు చేసి చాలా రోజులయ్యింది. ఈ కాలేజీల్లో ఏఐసీటీఈ నిబంధనల మేరకు నిర్ణీత సదుపాయాలు, సిబ్బంది ఉన్నారో, లేదో తనిఖీ చేసిన తర్వాత వర్సిటీలు వాటికి గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కాకినాడ, అనంతపురం జేఎన్టీయూ అధికారులు రోజులు గడుస్తున్నా ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఏఐసీటీఈ క్యాలెండర్ ప్రకారం ఇంజినీరింగ్ ప్రవేశాలను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేసి అక్టోబర్ 1 నుంచి తరగతులను ఆరంభించాలి. ఇందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి ఈఏపీ సెట్ నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేసింది. అయినా కాలేజీల అఫిలియేషన్‌ను జేఎన్టీయూలు పూర్తి చేయకపోవడంతో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుపెట్టలేకపోతున్నారు. వేగంగా పూర్తి చేయండి.. తాత్సారం వద్దు ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేసి చాలా రోజులైందని, అక్టోబర్ 1 నుంచి తరగతులను ప్రారంభించాల్సి ఉన్నందున కాలేజీల అఫిలియేషన్‌ను వేగంగా పూర్తి చేయాలని.. తాత్సారం చేయొద్దని సెట్ కమిటీ సమావేశంలో కన్వీనర్ స్పష్టం చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రవేశాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రానికల్లా జేఎన్టీయూ అధికారులు తమ పరిధిలోని కాలేజీల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అనంతరం కాలేజీలకు ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించాల్సి ఉంటుందని కన్వీనర్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. -
జిరాక్స్ కాపీలే కాలేజీలకు ఇవ్వండి
సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్–2020 ద్వారా వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీలో చేరే సమయంలో సర్టిఫికెట్లకు సంబంధించి జిరాక్స్ కాపీలు మాత్రమే సమర్పించాలని అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ ప్రత్యేక కమిషనర్ ఎంఎం నాయక్ కోరారు. ఈ మేరకు విద్యార్థులకు జారీచేసిన అలాట్మెంట్ ఆర్డర్లలో పలు సూచనలు పొందుపరిచారు. ఇలా చేయాలి.. ► అభ్యర్థులు ముందుగా అలాట్మెంట్ ఆర్డర్‌ను ‘ఏపీఈఏఎంసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ► ఆ తరువాత అభ్యర్థి లాగిన్ అయి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ► తదుపరి జాయినింగ్ రిపోర్ట్, అలాట్మెంట్ ఆర్డర్, రిసీప్ట్ ఆఫ్ సర్టిఫికెట్లను రెండు కాపీల చొప్పున ప్రింట్ తీసుకుని వారికి కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలి. ► ఒక కాపీని కాలేజీలో సమర్పించి.. రెండో కాపీపై అకనాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. ► ఆన్లైన్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు వెబ్సైట్ నుంచి రిసీప్ట్ ఆఫ్ సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకుని దాన్ని కూడా కాలేజీలో సమర్పించాలి. సీటు కేటాయింపు అయిన అభ్యర్థులు దాన్ని నిలుపుకోవాలంటే సెల్ఫ్ రిపోర్టింగ్‌తో పాటు, కాలేజీలో రిపోర్టు చేయడం తప్పనిసరి. ఇందుకు చివరి తేదీ 2021 జనవరి 8. ► వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్, అనంతరం కాలేజీలో రిపోర్టు చేయని వారి అలాట్మెంట్ సీటును ఖాళీగా పరిగణిస్తారు. తరువాత కౌన్సెలింగ్ సమయంలో మొదటి విడత సీటు కేటాయింపు రద్దవుతుంది. ► రెండో కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థుల్లో అర్హులకు దాన్ని కేటాయిస్తారు. ► విద్యార్హతలకు సంబంధించిన వివరాలు పరిశీలనలో తప్పని తేలితే సదరు అభ్యర్థికి సీటును రద్దుచేయడంతో పాటు క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకుంటారు. ► అభ్యర్థులు అడ్మిషన్ల సమయంలో సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులనే సమర్పించాలి. ► ఒరిజినల్ సర్టిఫికెట్లను కేవలం పరిశీలన వరకు అందించి తదుపరి వెనక్కి తీసుకోవాలి. ► ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు అర్హులు కాని అభ్యర్థులు తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తరువాత మాత్రమే ఆయా కాలేజీల్లో ట్యూషన్ ఫీజులు చెల్లించాలి. ► తుది విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యే వరకు విద్యార్థుల నుంచి కాలేజీ యాజమాన్యాలు ఎలాంటి ఫీజులు వసూలుచేయకూడదు. నేటి నుంచి ఇంజనీరింగ్ తరగతులు తొలివిడత కౌన్సెలింగ్ ముగియడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ తరగతులను బుధవారం నుంచి ప్రారంభించేలా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించింది. కోవిడ్–19 నేపథ్యంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించేలా ఆదేశాలు జారీచేసింది. ఇదీ క్యాలెండర్.. ప్రొఫెషనల్ యూజీ కోర్సుల తరగతుల ప్రారంభం : జనవరి 6 ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు : ఏప్రిల్ 17 సెకండ్ సెమిస్టర్ ప్రారంభం : మే 3 సెకండ్ సెమిస్టర్ పరీక్షలు : ఆగస్టు 23 థర్డ్ సెమిస్టర్ ప్రారంభం : సెప్టెంబర్ 1 -
ఎంసెట్ తొలివిడత కౌన్సెలింగ్‌లో 72 వేలకు పైగా సీట్లు భర్తీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఎంసెట్–2020 తొలివిడత కౌన్సెలింగ్‌లో భాగంగా 72,867 మందికి సీట్లు కేటాయించారు. ఈ మేరకు అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ ఆదివారం సాయంత్రం అభ్యర్థులకు సీట్లు కేటాయింపు పూర్తి చేయించారు. ఈసారి ఎంసెట్‌లో ఆన్లైన్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల పరిశీలన గతేడాది అక్టోబర్ 23 నుంచి ప్రారంభం అయినా ఫీజులు, కాలేజీల అఫ్లియేషన్ జాప్యంతో వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ డిసెంబర్ 28 నుంచి ఈనెల 1వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం ఎంసెట్‌లో 1,29,714 మంది అర్హత సాధించగా 90,076 మంది కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 89,078 మంది ధ్రువపత్రాలను పరిశీలన చేయించుకున్నారు. 83,014 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. రాష్ట్రంలోని 380 ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లోని మొత్తం సీట్లలో కన్వీనర్ కోటా కింద 1,03,766 సీట్లు ఉండగా వాటిలో 72,867 మొదటి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ అయ్యాయి. ఇంకా 30,899 సీట్లు మిగిలి ఉన్నాయి. యూనివర్సిటీల పరిధిలోని ప్రభుత్వ కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు 5,649, ఫార్మసీ సీట్లు 77 భర్తీ చేశారు. ప్రయివేటు కాలేజీల్లోని ఇంజనీరింగ్ సీట్లు 66,900, ఫార్మసీ సీట్లు 241 భర్తీ అయ్యాయి. ఇంకా స్పోర్ట్స్ కేటగిరీలోని 465 మందికి సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన నివేదికలు శాప్ నుంచి అందనందున వారికి మొదటి విడతలో సీట్లు కేటాయించలేదు. వారికి తదుపరి సీట్లు కేటాయించనున్నట్లు కన్వీనర్ నాయక్ వివరించారు. ఈసారి జీవో అలాట్మెంట్ కాలేజీ ఒక్కటే కాలేజీల్లో ప్రమాణాలు, ఇతర సదుపాయాల విషయంలో ప్రభుత్వం ఈసారి పగడ్బందీ చర్యలు తీసుకోవడంతో దాని ప్రభావం కౌన్సెలింగ్‌లో స్పష్టంగా కనిపించింది. గతంలో జీరో అలాట్‌మెంటు కాలేజీల నుంచి 20 సీట్లు కూడా భర్తీ కాని కాలేజీల సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ ఈసారి ప్రభుత్వమే సరైన ప్రమాణాలు, నిర్ణీత నిబంధనల ప్రకారం సదుపాయాలు, సిబ్బంది లేని కాలేజీలను జీవో అడ్మిషన్ల కేటగిరీలో చేర్చి వాటికి సీట్ల కేటాయింపును నిలిపివేసింది. ఇంజనీరింగ్‌లో 48, బీ ఫార్మసీలో 5 కాలేజీలకు అడ్మిషన్ల జాబితా నుంచి తప్పించింది. 54 కాలేజీల్లో 100 శాతం సీట్ల భర్తీ ఈసారి పూర్తి స్థాయిలో వంద శాతం సీట్లు భర్తీ అయిన కాలేజీల సంఖ్య గతంలో కన్నా పెరిగింది. 2019 ఎంసెట్‌లో తొలివిడత కౌన్సెలింగ్‌లో 44 కాలేజీల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాగా ఈసారి వాటి సంఖ్య 54కు పెరిగింది. కంప్యూటర్ సైన్స్‌దే అగ్రస్థానం ఏపీ ఎంసెట్–2020 తొలివిడత సీట్ల కేటాయింపులో అత్యధిక సీట్లు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలోనే భర్తీ అయ్యాయి. గతంలో మాదిరిగానే ఆ విభాగం అగ్రస్థానంలో ఉంది. ఐటీ, ఈసీఈ విభాగాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. -
సేఫ్టీ ఫస్ట్!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాలు వేగంగా రూపొందుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో టౌన్‌షిప్స్ నిర్మాణాలు జరుగుతున్నా యి. వీటిల్లో వేలాది కూలీలు, ఉద్యోగులు పనులు చేస్తున్నారు. కానీ వీరి రక్షణను పర్యవేక్షించే ఏర్పాటు లేదు. ఏ ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. ఆ నిర్మాణ పనుల్లో లోపాలెక్కడ ఉన్నాయో గుర్తించే ఏర్పాటు లేకపోవటమే దీనికి కారణం. విదేశాల్లో భారీ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు కన్స్ట్రక్షన్ సేఫ్టీ సూపర్వైజర్లు ఉంటారు. సై ట్లో ఎక్కడెక్కడ లోపాలు ఏర్పడుతున్నాయో గుర్తించి వాటిని సరిదిద్దటం అతని విధి. కానీ దేశంలో ఇలాంటి ప్రత్యేక వ్యవస్థ లేదు. దీంతో ప్రతి భారీ భవన నిర్మాణంలో కచ్చితంగా కన్స్ట్రక్షన్ సేఫ్టీ సూపర్వైజర్లను నియమించుకోవాలని ప్రభుత్వం సూచించబోతోంది. ఈ నేపథ్యంలో భద్రతా నిపుణులను తయారు చేసేందుకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) కొత్తగా 6 నెలల సర్టిఫికేషన్ కోర్సు ప్రారంభిస్తోంది. శిక్షణ పూర్తిగా న్యాక్ ఇవ్వనుండగా, సర్టిఫికెట్ మాత్రం సాంకేతిక విద్యా శాఖ జారీచేయనుంది. కెమికల్ ఇండస్ట్రీ సేఫ్టీ విషయంలో శిక్షణకు కొన్ని ప్రై వేటు సంస్థలున్నా, నిర్మాణ రంగంలో రక్షణకు సంబంధించిన శిక్షణ మాత్రం తొలిసారి న్యాక్ చేపడుతోంది. వీరు ఏం చేస్తారంటే.. బహుళ అంతస్తు నిర్మాణాల్లో ఎత్తులో ఉండి పనిచేసేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బాగా ఎత్తులో పనిచేసే వారి రక్తపోటు (బీపీ) నియంత్రణలో ఉందో లేదో చూసుకోవాలి. లేకుంటే ఎత్తు ప్రభావం వల్ల కళ్లు తిరిగి పడిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. ► సెల్లార్ గుంతలు తవ్వేటప్పుడు సమీపంలోని ఇతర భవనాల పునాదులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. ► విద్యుత్తు పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ► పై అంతస్తులకు నిర్మాణ సామగ్రి తరలించే లిఫ్టు వైర్లు, బకెట్లు ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. ► ఈ బాధ్యతలు మొత్తం నిర్వహించటమే కన్స్ట్రక్షన్ సేఫ్టీ సూపర్వైజర్ విధి. ఏ డిగ్రీ ఉన్నా అర్హులే ఇది ఆరునెలల సరి్టఫికెట్ కోర్సు. ఏ డిగ్రీ ఉన్న వారైనా ఈ కోర్సును చేయవచ్చు. సాంకేతిక విద్యాశాఖ నుంచి అనుమతికి రాగానే... త్వరలో 25 మందితో తొలిబ్యాచ్‌ను ప్రారంభించేందుకు న్యాక్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రమాదాలు తగ్గించేందుకు ఉపయోగం ప్రమాదాలు తగ్గించాలంటే నిర్మాణంలో ప్రతి అంశంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ప్రతిరోజూ కార్మికులకు రక్షణపై బ్రీఫింగ్ ఉండాలి. సేఫ్టీ డ్రిల్ అవసరం. ఇవన్నీ చేసేందుకు కన్స్ట్రక్షన్ సేఫ్టీ సూపర్వైజర్లు ఉండాలి. వారిని తయారు చేసేందుకే ఈ శిక్షణ. ముంబై మినహా మరెక్కడా ఈ శిక్షణ లేదు. తెలుగురాష్ట్రాల్లో తొలిసారి న్యాక్ చేపడుతోంది. డిమాండ్ ఆధారంగా ఈ కోర్సు సీట్ల సంఖ్య పెంచుతాం. – భిక్షపతి, న్యాక్ డైరెక్టర్ జనరల్ కోవిడ్ ట్రాకర్ ► ఏపీలో గత 24 గంటల్లో 64,099 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 478 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 7,067కు చేరింది. ► తెలంగాణలో ఇప్పటివరకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షలు 62,57,745.. కాగా అందులో మొత్తం కరోనా బారినపడిన వారి సంఖ్య 2,79,135 ► మంగళవారం చేసిన నిర్ధారణ పరీక్షల సంఖ్య 52,057... అందులో నమోదైన కరోనా కేసులు 536 ► మొత్తం ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాలు 1,502... అందులో మంగళవారం ముగ్గురు చనిపోయారు. -
పాలిసెట్ అడ్మిషన్స్ షెడ్యూల్ పొడిగింపు
సాక్షి, అమరావతి: ఏపీ పాలిసెట్ అడ్మిషన్ల షెడ్యూలును పొడిగిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పొడిగించిన గడువు తేదీలు ఇలా.. ► ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: అక్టోబర్ 21 వరకు ► ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు: అక్టోబర్ 22 వరకు ► సీట్ల కేటాయింపు: అక్టోబర్ 24 సాయంత్రం 6 తర్వాత. పాలిసెట్‌లో 60,780 మంది అర్హత సాధించగా శనివారం వరకు 35,346 మంది వెబ్ కౌన్సెలింగ్‌కు రిజిస్టర్ అయ్యారు. 34,288 మంది ధ్రువపత్రాల పరిశీలన జరగగా, 28,682 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. -
ఎంసెట్ వెబ్ ఆప్షన్లు వాయిదా?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సజావుగా జరిగేనా? షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందా? అంటే ఉన్నతాధికారుల నుంచి ఏమోనన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఫీజుల వ్యవహారంలో తలెత్తిన గందరగోళం ప్రవేశాల కౌన్సెలింగ్‌కు అడ్డంకిగా మారింది. కాలేజీలవారీగా ఫీజులను తేల్చకుండా వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించే అవకాశం లేకపోవడంతో ఈనెల 27 నుంచి జరగాల్సిన వెబ్ ఆప్షన్లు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఎంసెట్ అర్హత సాధించి ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న లక్ష మందికిపైగా విద్యార్థులకు ఎదురుచూపులు తప్పేలా లేవు. ఫీజులు ఖరారు కాకపోవడం వల్లే... రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం గత నెలలో నిర్వహించిన ఎంసెట్ ఫలితాలను ఎంసెట్ కమిటీ ఈ నెల 9న ప్రకటించింది. దానికి అనుగుణంగా ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ ప్రవేశాల కమిటీని ఏర్పాటు చేసి ఈ నెల 22న ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశాయి. అయితే వచ్చే మూడేళ్లలో ఏటా వసూలు చేయాల్సిన ఫీజులను ఖరారు చేయకుండా ఆరు కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. అయితే ప్రభుత్వం తెలంగాణ ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)కి చైర్మన్‌ను నియమించకుండా జాప్యం చేసినందున యాజమాన్యాలు టీఏఎఫ్ఆర్సీకి ప్రతిపాదించిన ఫీజును అమలు చేయాలని, చైర్మన్‌ను నియమించి ఫీజులు ఖరారు చేశాక ఎక్కువ తక్కువలు ఉంటే సర్దుబాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు ఉన్నత విద్యాశాఖ వర్గాలు చెబుతు న్నాయి. అయితే ఆ తీర్పు కాపీ ఇంతవరకు ప్రభుత్వానికే అందలేదని అధికారులు పేర్కొంటున్నారు. కోర్టు తీర్పు కాపీ అందగానే అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అంటే ఈ నెల 27 నాటికి తీర్పు కాపీ అందుతుందా? అప్పీల్‌కు వెళతారా? లేదా? అన్న గందరగోళం నెలకొంది. మరోవైపు ఆరు కాలేజీలే కాకుండా మరో 75 కాలేజీలు కూడా అవే ఉత్తర్వులను తమకు వర్తింపజేయాలంటూ కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. దీంతో కోర్టు తీర్పును అమలు చేస్తే యాజమాన్య ప్రతిపాదిత ఫీజును 81 కాలేజీల్లో అమలు చేయాల్సి వస్తుంది. అదే జరిగితే తల్లిదండ్రులపై అధిక భారం పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో టీఏఎఫ్ఆర్సీకి చైర్మన్ నియామకం, వచ్చే మూడేళ్లపాటు వసూలు చేయాల్సిన ఫీజుల ఖరారు వ్యవహారం, హైకోర్టు ఉత్తర్వులు తదితర అంశాలేవీ ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్లనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి మంగళవారం విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో ఈ వ్యవహారంపై చర్చించినట్లు తెలిసింది. మంత్రి కూడా ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని, సమస్యను త్వరగా పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. రేపటికల్లా స్పష్టత వచ్చేనా? ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్, విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభించేలా ప్రవేశాల కమిటీ ఇప్పటికే షెడ్యూల్ జారీ చేసింది. ఇప్పటివరకు 37,909 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. 27వ తేదీన వెరిఫికేషన్ చేయించుకున్న వారు అదే రోజు నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఫీజుల వ్యవహారమే తేలలేదు. ఫీజుల వ్యవహారంలో కోర్టు తీర్పు కాపీనే అందలేదంటున్న అధికారులు దానిపై అప్పీల్‌కు వెళ్లడం ఈ రెండు రోజుల్లో సాధ్యం కాకపోవచ్చన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వాయిదా వేయకుండా 27వ తేదీ నుంచి వెబ్ఆప్షన్లు ప్రారంభించాలంటే కోర్టు ఉత్తర్వుల అమలుతోనే ముందుకు వెళ్లాల్సి వస్తుంది. లేదంటే ఇప్పటివరకు కోర్టు తీర్పు కాపీ అధికారికంగా అందలేదని చెబుతున్నారు కాబట్టి కొత్త ఫీజులు ఖరారు చేసే వరకు పాత ఫీజులే అన్న ఆప్షన్‌ను పెట్టి వెబ్ ఆప్షన్లను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కోర్టు తీర్పు వ్యవహారం అయినందున ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుందా? లేదా? అన్నది బుధవారం తేలనుంది. మరోవైపు వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేయకుండా ఏమేం ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. -
ముందస్తుగా సిద్ధమైతే మేలు
► చివరి వారంలో మొదలు కానున్న పాలిసెట్ ప్రవేశాలు ► వెబ్సైట్లో ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పాలీసెట్ వివరాలు ► అందుబాటులోకి తెచ్చిన సాంకేతిక విద్యా శాఖ సాక్షి, హైదరాబాద్: వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ప్రక్రియ ఈ నెల చివరి వారంలో మొదలు కానుంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల 22న నిర్వహించిన పాలిసెట్–2017 ఫలితాలను శనివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాటి ప్రవేశాల కౌన్సెలింగ్పైనా దృష్టి సారించింది. ఈ నెల 15 నాటికి పాలిటెక్నిక్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు మంజూరు చేసి, చివరి వారంలో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. మరోవైపు పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసుకుని, ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (ల్యాటరల్ ఎంట్రీ) ఈసెట్–2017 పరీక్షను నిర్వహించింది. ఈ నెల 12న ఎంసెట్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే నెలలో ఆయా సెట్స్‌కు సంబంధించిన ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గత ఏడాది పాలిటెక్నిక్ డిప్లొమా, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఏయే ర్యాంకుల వారికి ఏయే కాలేజీల్లో సీట్లు లభించాయి తదితర సమగ్ర వివరాలను సాంకేతిక విద్యా శాఖ వెబ్సైట్ (dtets.cgg.gov.in, tsche.cgg.gov.in, sbtet.telangana.gov.in)లో అందుబాటులోకి తెచ్చింది. వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభమయిన తరువాత విద్యార్థులు ఆందోళన చెందకుండా, ముందస్తుగా సిద్ధం చేసుకోవాల్సిన సర్టిఫికెట్ల వివరాలను ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ వెల్లడించారు. సిద్ధం చేసుకోవాల్సిన ముఖ్యమైన సర్టిఫికెట్లివి... ♦ వివిధ కోర్సులకు అవసరమైన ఎస్సెస్సీ/డిప్లొమా/ఇంటర్మీడియట్/డిగ్రీ మార్కుల మెమోలు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం. ♦ పాలిసెట్‌కు 4 నుంచి 10వ తరగతి వరకు, ఈసెట్‌కు 7 నుంచి డిప్లొమా వరకు, ఎంసెట్‌కు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఐసెట్‌కు 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలి. ♦ 2017 జనవరి 1.. ఆ తరువాత జారీ చేసిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ పత్రం. ♦ విద్యార్థులు తమ పేరుతో బ్యాంకు అకౌంట్ తెరువాలి (ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం). æ చివరగా చదువుకున్న విద్యా సంస్థ నుంచి టీసీ. ♦ స్పెషల్ కేటగిరీ (ఫిజికల్ చాలెంజ్డ్, సైనిక ఉద్యోగుల పిల్లలు/ఎన్సీసీ/స్పోర్ట్స్ సర్టిఫికెట్లు. ♦ తల్లిదండ్రులు గతంలో తెలంగాణలో ఉండి, ఉద్యోగరీత్యా, ఇతర కారణాలతో ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారి పిల్లలకు ప్రవేశాలు కావాలంటే.. ఆ తల్లిదండ్రులు గతంలో పదేళ్లపాటు తెలంగాణలో ఉన్నట్లు నివాస ధ్రువీకరణ పత్రం జత పరచాలి. ♦ ఓపెన్ స్కూల్ వంటి విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు తాము ఏడేళ్లు తెలంగాణలో ఉన్నట్లు నివాస సర్టిఫికెట్‌ను సమర్పించాలి. ♦ కన్వీనర్ కోటాలోని 15 శాతం అన్‌రిజర్వుడు కోటా సీట్లలో ఉస్మానియా, ఆంధ్రా, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీల రీజియన్ల పరిధిలో చదువుకున్న వారు అర్హులు. -
ఒకేషనల్ అభ్యర్థులకు పాలిటెక్నిక్‌లో ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌లో ఒకేషనల్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా పాలిటెక్నిక్ సెకండియర్‌లో అడ్మిషన్ పొందవచ్చని సాంకేతిక విద్యాశాఖ డెరైక్టర్ ఎంవీ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని sbtet.telangana.gov.in, dtets.cgg.gov.in వెబ్సైట్ల నుంచి పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. పాలిసెట్ వెరిఫికేషన్‌కు హాజరుకండి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈనెల 20 నుంచి ప్రారంభం అయ్యే పాలిసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావచ్చని సాంకేతిక విద్యా శాఖ తెలిపింది. పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు 1,100 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ విద్యార్థుల ఫలితాలు ఈ నెల 27 తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో వారికి పదో తరగతి మోమోలు రాలేదు. దీంతో విద్యార్థులు మిగతా సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు హాజరు కావచ్చని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే జూన్ 1న సీట్ల కేటాయింపునకు ముందు పదో తరగతి మెమోలను అందజేస్తే సరిపోతుందని తెలిపారు. -
మే 17 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
♦ జూన్ 9 నుంచి తరగతులు ప్రారంభం ♦ ఆన్లైన్లో అనుబంధ గుర్తింపు ♦ ప్రైవేటు కాలేజీల్లోనూ బయోమెట్రిక్ ♦ ప్రైవేటు కాలేజీలతో సమీక్షలో సాంకేతిక విద్యాశాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను మే 17 నుంచి 31 వరకు నిర్వహించాలని సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. అలాగే ఈ నెల 21న జరిగిన పాలిసెట్-2016 ఫలితాలను వచ్చే వారంలో విడుదల చేయాలని...పాలిటెక్నిక్ డిప్లొమా తరగతులను జూన్ 9 నుంచి నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మంగళవారం హైదరాబాద్‌లో ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల యాజమాన్యాలతో సాంకేతిక విద్య డెరైక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. కాలేజీల దరఖాస్తు ప్రక్రియ పూర్తికానున్న నేపథ్యంలో అనుబంధ గుర్తింపును వచ్చే వారంలో చేపట్టి మే 15 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆన్లైన్ ద్వారానే కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈలోగా కాలేజీల్లో లోపాల సవరణకు వారం సమయం ఇవ్వాలని... కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సిలబస్‌లో, పరీక్ష విధానంలో మార్పులు తెస్తున్నామని, ఇందుకు యాజమాన్యాలు సిద్ధం కావాలని సూచించారు. తృతీయ సంవత్సర విద్యార్థులకు మాత్రం సీ-14 సిలబస్ ప్రకారమే బోధన కొనసాగుతుందని ఎంవీ రెడ్డి స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో కచ్చితంగా వీడియో రికార్డింగ్ చేయాలన్నారు. కాలేజీలవారీగా వెబ్సైట్లను ఏర్పాటు చేసి డిపార్ట్మెంట్ వెబ్సైట్లో అనుసంధానించాలన్నారు. వార్షిక ఫీజులను రూ. 15 వేల నుంచి రూ. 21 వేలకు పెంచాలన్న ఫీజుల కమిటీ సిఫారసుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని ఎంవీరెడ్డి పేర్కొన్నారు. అఫిలియేషన్లు ఇచ్చే సమయంలో మంజూరైన ఇన్‌టేక్‌ను కాకుండా కాలేజీల్లో చేరిన విద్యార్థుల సంఖ్యను బట్టి ఫ్యాకల్టీని (1:20 నిష్పత్తిలో) చూసి అనుబంధ గుర్తింపు ఇవ్వాలని కాలేజీల యాజమాన్యాలు కోరగా పరిశీలిస్తామని డెరైక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో సాంకేతిక విద్య జాయింట్ డెరైక్టర్ మూర్తి, సాంకేతిక విద్య మండలి కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మే 2న పాలిసెట్ ఫలితాలు! పాలిసెట్-2016 ఫలితాలను మే 2న విడుదల చేసేందుకు సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నెల 30 నాటికి ఫలితాలు సిద్ధమవుతాయని, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆమోదంతో మే 2న ఫలితాలు విడుదల చేయాలనుకుంటోంది. కాగా, పదో తరగతిలో విద్యార్థుల ఆధార్ నంబర్‌ను పాఠశాల విద్యాశాఖ సేకరిస్తున్న నేపథ్యంలో ఈసారి పాలిటెక్నిక్ ప్రవేశాల్లోనూ విద్యార్థుల ఆధార్‌ను తీసుకునేందుకు సాంకేతిక విద్యాశాఖ యోచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1.28 లక్షల మంది పాలిసెట్‌కు హాజరయ్యారు. -
పాలిటెక్నిక్ బోధనపై నిఘా!
♦ తరగతి గదుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ♦ సహజ బోధనకు ఆటంకమని ♦ అధ్యాపకుల ఆందోళన ♦ వెంటనే తొలగించాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో బోధన, అభ్యసన ప్రక్రియపై సాంకేతిక విద్యా శాఖ నిఘా పెట్టింది. తరగతి గదుల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే నల్లగొండ జిల్లాలోని రెండు పాలిటె క్నిక్ కాలేజీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, మిగిలిన జిల్లాల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో త్వరలోనే ఏర్పాటు చేసేందుకు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. వాస్తవానికి కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధానికి, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా గుర్తించి తగు చర్యలు చేపట్టేందుకు రాష్ట్రంలోని 52 పాలిటెక్నిక్ కాలేజీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సాంకేతిక విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి కాలేజీలో ప్రాధాన్యక్రమంలో విద్యార్థినుల హాస్టళ్లు, బాలుర హాస్టళ్లు, కళాశాల ప్రధాన భవనం, ప్రధాన ద్వారం వద్ద సీసీ కెమెరాలు అమర్చాలని సాంకేతిక విద్యా డెరైక్టర్ జనవరి 30న ఆదేశాలు జారీ చేశారు. అయితే కొందరు ప్రిన్సిపాళ్లు అత్యుత్సాహంతో ఏకంగా తరగతి గదుల్లో సీసీ కెమెరాలు అమర్చారు. నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్, తిరుమలగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని తరగతి గదుల్లో అమర్చారు. తరగతి గదుల్లో కెమెరాలు అమర్చడం వల్ల బోధన యాంత్రికంగా మారుతుందని, అందుకే తరగతి గదుల్లో అవసరం లేదని, వాటిని తొలగించాలని తెలంగాణ పాలిటెక్నిక్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు నర్సయ్యగౌడ్ డిమాండ్ చేశారు. -
నేటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
-
నేటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
* రాష్ట్ర వ్యాప్తంగా 34 హెల్ప్‌లైన్ కేంద్రాల ఏర్పాటు * హైదరాబాద్‌లో లేని కేంద్రం సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి శుక్రవారం నుంచి కౌన్సెలింగ్ నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే విజయవాడ కేంద్రంగా నోడల్ ఆఫీసును, రాష్ట్ర వ్యాప్తంగా 34 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్‌కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు, తరగతుల ప్రారంభానికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేశారు. హైదరాబాద్‌లో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) కేంద్రంగా పర్యవేక్షణ సాగిస్తారు. హైదరాబాద్‌లో కౌన్సెలింగ్‌కు ఎలాంటి కేంద్రాలు ఏర్పాటుచేయలేదు. కౌన్సెలింగ్ నోడల్ కేంద్రంగా ఉన్న సాంకేతిక విద్యాభవనానికి తెలంగాణ ప్రభుత్వం తాళాలు వేయించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో హెల్ప్‌లైన్ కేంద్రాలకు సహకరించదన్న ఉద్దేశంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఏపీ ఎంసెట్ రాసిన హైదరాబాద్ సహా తెలంగాణ అన్ని జిల్లాల విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు ఏపీలోని హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లాలి. విద్యార్థులకు ఇప్పటికే ర్యాంకు కార్డులు జారీచేశారు. ఏఐసీటీఈ అనుమతి ఉన్న కాలేజీలకు యూనివర్సిటీల అఫ్లియేషన్, అనుమతుల మంజూరు కొలిక్కివచ్చింది.ప్రస్తుతం 339 కాలేజీల్లో 1.70 లక్షల వరకు సీట్లున్నాయి. ఇందులో 1.28 వేల సీట్లు కన్వీనర్ కోటాకు సంబంధించినవి.1.38 లక్షల మంది ఎంసెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకానున్నారు. జేఎన్టీయూకే పరిధిలో 229 కాలేజీలు, జేఎన్టీయూఏ పరిధిలో 95 కాలేజీలు, ఏయూ పరిధిలో 10, ఏఎన్‌యూ పరిధిలో 5 కాలేజీలు కౌన్సెలింగ్ జాబితాలో ఉండనున్నాయి. తొలివిడత కౌన్సెలింగ్‌లో భాగంగా జూన్ 12 నుంచి 20 వరకు ర్యాంకుల వారీగా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. జూన్ 14 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. జూన్ 22, 23 తేదీల్లో ఆప్షన్లను మార్పుచేసుకొనే అవకాశం ఉంది. జూన్ 26న సీట్లను అలాట్ చేయనున్నారు.