119 మార్కులకు టాప్‌ ర్యాంక్‌ | Top rank for 119 marks in polyset | Sakshi
Sakshi News home page

119 మార్కులకు టాప్‌ ర్యాంక్‌

Published Sat, May 27 2023 3:28 AM | Last Updated on Sat, May 27 2023 11:12 AM

Top rank for 119 marks in polyset - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్, నాన్‌– ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ డిప్లొమా కోర్సుల్లో (పాలిటెక్నిక్‌) ప్రవేశానికి రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్‌ పాలిసెట్‌–20 23)లో బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణుల య్యారు. బాలురు, బాలికలు కలిపి మొత్తం మీద 82.17 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

శుక్రవారం హైదరాబాద్‌లోని సాంకేతిక విద్యాభవన్‌ ఆడిటోరియంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఫలితాలను విడుదల చేశారు. 86.63 శాతం ఉత్తీర్ణతతో బాలికలు సత్తా చాటారు. బాలురు 78.62 శాతం ఉత్తీర్ణత సాధించారు. అర్హులైన వారికి జూన్‌ 14 నుంచి తొలి విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని మిత్తల్‌ తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో మరో నాలుగు పాలిటెక్నిక్‌ కాలేజీలు కొత్తగా వస్తున్నాయని చెప్పారు. 

119తో టాప్‌ ర్యాంక్‌ 
ఈనెల 17న నిర్వహించిన పాలిసెట్‌కు 1,05,742 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 98,274 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో ఎంపీసీ విభాగంలో 80,358, ఎంబైపీసీ విభాగంలో 80,752 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. సూర్యాపేట జిల్లాకు చెందిన సురభి శరణ్య 120 మార్కులకు 119 మార్కు లు సాధించి ఎంపీసీ విభాగంలో స్టేట్‌ మొదటి ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.

అదే జిల్లాకు చెందిన షేక్‌ సిద్ధిక్‌ సైతం 119 మార్కులు సాధించి రెండో ర్యాంక్‌ను కైవసం చేసుకోగా, మెదక్‌ జిల్లాకు చెందిన జి.ప్రియాంశ్‌కుమార్, హైదరాబాద్‌కు చెందిన పి.ప్రణీత్, సూర్యాపేటకు చెందిన కె.శశివర్ధన్‌లు 118 మార్కులతో మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. ఎంబైపీసీ విభాగంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన చీర్ల ఆకాశ్‌ 116 మార్కులు సాధించి మొదటి ర్యాంక్‌ను సొంతం చేసుకోగా, సూర్యాపేట జిల్లా విద్యార్థి మిర్యాల అక్షయతార 116 మార్కులతో రెండు, సూర్యాపేట జిల్లాకే చెందిన కె.శశివర్ధన్‌ 116 మార్కులతో మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు.

శశివర్ధన్‌ ఎంపీసీ, ఎంబైపీసీ రెండింటిలోనూ రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం విశేషం. పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీలు, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, వెటర్నరీ, హార్టీకల్చర్‌ వర్సిటీల్లోని కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు.

రైతుబిడ్డ.. ఎంబైపీసీలో ఫస్ట్‌ర్యాంకర్‌ 
కాటారం: రైతుబిడ్డ పాలిసెట్‌లో మెరిశాడు. ఎంబైపీసీలో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గంగారానికి చెందిన చీర్ల ఆకాశ్‌ 120కి 116 మార్కులు సాధించి స్టేట్‌ ఫస్ట్‌ర్యాంక్‌ సాధించాడు. ఆకాశ్‌ తండ్రి చీర్ల రమేశ్‌ రైతు కాగా, తల్లి రజిత గృహిణి.

ఆకాశ్‌ 4వ తరగతి వరకు కాటారంలోని ప్రైవేటు పాఠశాలలో చదివాడు. 10వ తరగతి వరకు హనుమకొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివి 10 జీపీఏ సాధించాడు. ‘మా నాన్న కష్టం చూసేవాడిని. ప్రణాళికాబద్ధంగా చదివాను. అనుకున్న ర్యాంకు సాధించాను. ఏ కోర్సు తీసుకోవాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు’ అని ఆకాశ్‌ తెలిపాడు.  

తొలి విడత కౌన్సెలింగ్‌.. 
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం, ఫీజు చెల్లించడం, స్లాట్‌ బుకింగ్‌: జూన్‌ 14 నుంచి 18 వరకు  
సరి్టఫికెట్ల వెరిఫికేషన్‌: జూన్‌ 16 నుంచి 19 వరకు 
వెబ్‌ ఆప్షన్లు: జూన్‌ 16 నుంచి 21 వరకు 
 ఆప్షన్ల ఫ్రీజింగ్‌ జూన్‌ 21 
 సీట్ల కేటాయింపు జూన్‌ 25 
ఫీజు చెల్లింపు, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ జూన్‌ 25 నుంచి 29 వరకు 

తుది విడత కౌన్సెలింగ్‌.. 
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం, ఫీజు చెల్లించడం స్లాట్‌బుకింగ్‌: జూలై 1 
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జూలై 2 
వెబ్‌ ఆప్షన్లు జూలై 1 నుంచి 3 వరకు 
ఆప్షన్ల ఫ్రీజింగ్‌ జూలై 3 
సీట్ల కేటాయింపు జూలై 7 
ఫీజు చెల్లింపు, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ జూలై 7 నుంచి 10 వరకు. 

స్పాట్‌ అడ్మిషన్లు.. 
స్పాట్‌ అడ్మిషన్ల ప్రకటన: జూలై 7 
ఫీజు చెల్లింపు జూలై 8, 9 
ర్యాంక్‌ జనరేషన్‌ జూలై 10 
 వెబ్‌ ఆప్షన్లు జూలై 8 నుంచి 11 వరకు 
ఆప్షన్ల ఫ్రీజింగ్‌ జూలై 11 
సీట్ల కేటాయింపు జూలై 14 
ఫీజు చెల్లించడం, ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ జూలై 14 నుంచి 15 వరకు 
కాలేజీల్లో రిపోర్ట్‌ చేయడం జూలై 15, స్పాట్‌ అడ్మిషన్లు పూర్తి జూలై 17 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement