
మెంటల్ హెల్త్‌కు భారతీయుల ప్రాధాన్యం
సమస్యలపై వెల్‌నెస్ సెంటర్లలో కౌన్సెలింగ్‌కు మొగ్గు
మానసిక ఆరోగ్య రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు
2020లోనే ‘ఫైండ్ హోప్’పేరిట మొదటి మెంటల్ హెల్త్ స్టార్టప్
కౌన్సెలింగ్‌కు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది
మానసిక వైద్య నిపుణులు సి.వీరేందర్
సాక్షి, హైదరాబాద్: మనిషి జీవనవిధానంలో చోటుచేసుకుంటున్న మార్పులు నిత్య జీవితంలో అనేక సమస్యలకు కారణమవుతున్నాయి. శారీరక సమస్యలతోపాటు మానసిక రుగ్మతలు కూడా పెరుగుతున్నాయి. ఐదేళ్ల క్రితం వచ్చిన కోవిడ్ మహమ్మారి తర్వాత అందరూ మానసిక ప్రశాంతత అవసరాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యం, వెల్‌నెస్ రంగంలో కూడా వేగంగా మార్పులు వస్తున్నాయి.
భారతీయుల్లో ముఖ్యంగా యువత, విద్యార్థులు ‘మెంటల్ హెల్త్ అండ్ వెల్‌నెస్’పై దృష్టిపెడుతూ మానసిన వైద్య నిపుణుల వద్ద ‘కౌన్సెలింగ్’ తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. డిమాండ్ పెరుగుతుండటంతో మనదేశంలో ‘మెంటల్ హెల్త్ సెక్టార్’లో పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. బెయిన్ ఇండియా ప్రైవేట్ ఈక్విటీ రిపోర్ట్–2024 ఇదే విషయాన్ని వెల్లడించింది. మెంటల్ హెల్త్ వెల్‌నెస్ రంగంలో అవకాశాలు భారీగా పెరుగుతున్నట్టు పేర్కొంది. 2023లో 372 బిలియన్ డాలర్లుగా ఉన్న ఇండియా హెల్త్‌కేర్ మార్కెట్ విలువ.. 2025 చివరికల్లా 638 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని బజాజ్ ఫిన్‌సర్వ్ ఏఎంసీ నివేదిక అంచనా వేసింది.
మనదగ్గరా పెరిగిన డిమాండ్
తెలంగాణలో కూడా మెంటల్ హెల్త్ నిపుణులకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. దీంతో మెంటల్ హెల్త్ ఎకోసిస్టమ్ ఏర్పడేందుకు దోహపడేలా మెంటల్ హెల్త్ స్టార్టప్‌ల స్థాపన మొదలైంది. అగర్తలా ఎన్‌ఐటీలో బీటెక్ పూర్తిచేసిన హైదరాబాద్‌కు చెందిన తరుణ్‌సాయి 2020లోనే మెంటల్ వెల్‌బీయింగ్ ఫైండ్‌హోప్ స్టార్టప్‌ను ప్రారంభించాడు. ఇది భారత్‌లోనే మొట్టమొదటి మెంటల్ హెల్త్ స్టార్టప్‌గా గుర్తింపు పొందడంతోపాటు కేంద్ర ప్రభుత్వ ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్’నుంచి నిధులు కూడా సాధించింది.
నగరంలో లాభాపేక్ష లేని స్మార్ట్ మైండ్స్ కౌన్సెలింగ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ కూడా అందుబాటులోకి వచ్చింది. ‘లైఫ్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్’పై శిక్షణా తరగతులను కూడా ఈ సంస్థ నిర్వహిస్తోంది. అదేవిధంగా యూ అండ్ మీ కౌన్సిలింగ్ సెంటర్ విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, దంపతులు వంటి వారికి కౌన్సెలింగ్ సేవలు అందిస్తోంది. ‘పాజ్ ఫర్ పర్‌స్పెక్టివ్–మెంటల్ హెల్త్ సరీ్వసెస్’, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ విభాగం, అన్ని ప్రధాన ఆసుపతుల్లోనూ మెంటల్ హెల్త్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాయి.
కౌన్సెలింగ్‌కు వచ్చేవారి సంఖ్య పెరిగింది
మెంటల్ హెల్త్ రంగంలో కౌన్సెలింగ్‌కు సంబంధించిన స్టార్టప్‌లతో పాటు యాప్‌లు కూడా విరివిగా వస్తున్నాయి. అవి ఇంకా విస్తృతంగా జనబాహుళ్యంలోకి రాలేదు. మానసిక ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు అన్నివర్గాల వారు మా కౌన్సెలింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. గతంతో పోలి్చతే వైవాహికబంధంలో సమస్యలు, రిలేషన్‌షిప్స్ విషయంలో కౌన్సెలింగ్ కోసం వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్, యూ అండ్ మీ కౌన్సెలింగ్ సెంటర్