wellness centers
-
హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో ఏపీకి రెండోస్థానం
సాక్షి, అమరావతి: గ్రామీణ, పట్టణ ప్రజానీకానికి వైద్యసేవలను మరింత చేరువ చేయడం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తోంది. తాజాగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలోనూ దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లోనూ ప్రజలకు వైద్యసేవలు అందిస్తుండటం విశేషం. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఏడాది జూలై నాటికి 1,60,480 హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 21,891, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 11,855 కేంద్రాలు పని చేస్తున్నాయని వివరించింది. ఏపీ తర్వాత వరుసగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశి్చమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో అత్యధిక హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు ఉన్నట్లు పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రజానీకానికి మరింత దగ్గరగా వైద్య సేవలందించడమే లక్ష్యంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సెంటర్లలో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలందించడంతోపాటు నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల స్క్రీనింగ్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేసి మందులు కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. ఏపీలో ఇలా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను అనుసంధానం చేసింది. వీటికి విలేజ్ హెల్త్ క్లినిక్స్, అర్బన్ హెల్త్ క్లినిక్స్గా పేరు పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో 2,500 జనాభాకు ఒకటి చొప్పున విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తోంది. విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌తోపాటు ఏఎన్ఎం, ఆశ వర్కర్లను అందుబాటులో ఉంచింది. ఈ క్లినిక్స్‌లో 14 రకాల పరీక్షలు చేయడంతోపాటు 105 రకాల మందులు అందించేలా ఏర్పాట్లు చేసింది. -
సచివాలయాలు భేష్
తగరపువలస (భీమిలి): రాష్ట్రంలో సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల పనితీరు బాగుందని న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్టేషన్ (ఐఐపీఏ) బృందం కితాబిచ్చింది. అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఏపీపీపీఏ) 48వ విజిట్‌లో భాగంగా 38 మంది సభ్యులున్న ఈ బృందం గురువారం విశాఖ జిల్లా భీమిలి మండలంలో పర్యటించింది. రెండురోజుల పర్యటనలో భాగంగా మొదటిరోజు వీరు రెండు బృందాలుగా విడిపోయి టి.నగరపాలెం, దాకమర్రి పంచాయతీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలు, అధికారులతో మాట్లాడారు. ఏడు కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఎంజీఎన్ఆర్ఈజీఏ, ఎన్ఆర్ఎల్ఎం, మిషన్ అంత్యోదయ, పీఎంఏవై, ఎస్బీఎం, ఎన్‌ఆర్‌ఐఐఎం, ఎస్ఎస్ఏ అమలు తీరుపై లబ్ధిదారులతో విడివిడిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఆరా తీశారు. స్థానిక పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థుల ఆరోగ్యం గురించి వారితో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. పుస్తకాలు, యూనిఫాం పరిశీలించారు. గణితంలో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. ఫ్యామిలీ ఫిజీషియన్ మంచి ఆలోచన గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల కార్యదర్శులను పిలిచి వారి బాధ్యతల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల పనితీరు బాగుందన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ మంచి ఆలోచనని చెప్పారు. రెండు వారాలకు ఒకసారి ఫ్యామిలీ ఫిజీషియన్ సందర్శించడం బాగుందన్నారు. సామాజిక పింఛన్లు డీఎం అండ్ హెచ్‌వో పెన్షన్ల పంపిణీపై సంతృప్తి వ్యక్తం చేశారు. పీఎంవై హౌసింగ్ పథకాన్ని లబ్ధిదారులు వినియోగించుకుంటున్నారని తెలిపారు. కోవిడ్ సమయంలో పంచాయతీల వారీగా మృతులు, వ్యాక్సినేషన్, తీసుకున్న జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీల్లో అమలవుతున్న ఆహారం, పౌష్టికాహార కిట్ల గురించి అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ ఇంకా మెరుగుపడాలని పేర్కొన్నారు. బృందంలో అధికారులు, త్రివిధదళాల ఉద్యోగులు బృందంలో కేంద్రంలోని వివిధ శాఖల అధికారులు, త్రివిధదళాల ఉద్యోగులు ఉన్నారు. ఆర్డీవో ఎస్.భాస్కరరెడ్డి, భీమిలి ఎంపీపీ దంతులూరి వెంకటశివసూర్యనారాయణరాజు, తహసీల్దార్ కోరాడ వేణుగోపాల్, ఎంపీడీవో ఎం.వెంకటరమణ, డీఆర్డీఏ పీడీ శోభారాణి, సర్పంచ్‌లు పొట్నూరు ఛాయాగౌతమి, చెల్లూరు పైడప్పడు, ఎంపీటీసీ సభ్యులు పల్లా నీలిమ, చెల్లూరు నగేష్, పీహెచ్సీ వైద్యుడు ఎ.బి.మల్లికార్జునరావు, కార్యదర్శులు రఘునాథరావు, శంకర్ జగన్నాథ్, లోకేశ్వరి, తెలుగు అనువాదకుడు టి.ఎస్.వి.ప్రసాదరావు ఈ బృందానికి, ప్రజలకు సంధానకర్తలుగా వ్యవహరించారు. -
టెలీమెడిసిన్ సేవల్లో నంబర్‌వన్‌గా ఏపీ
సాక్షి, అమరావతి: టెలీమెడిసిన్ సేవల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా మార్చడంలో, వాటి నిర్వహణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై ప్రశంసలు కురిపించింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్షుక్ మాండవీయ వర్చువల్ విధానంలో శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రజారోగ్యంపై సర్కార్ ప్రత్యేక దృష్టి ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఈ ఏడాది ఆఖరు నాటికి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా మార్చాలని కేంద్రం రాష్ట్రాలకు లక్ష్యం నిర్దేశించింది. దీనికి ముందే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘నాడు–నేడు’ కింద ఆరోగ్య ఉపకేంద్రాలను వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లుగా అభివృద్ధి చేసింది. అదేవిధంగా పీహెచ్‌సీల్లోనూ వసతుల కల్పన చేపట్టింది. పట్టణ ప్రజలకు వైద్య సేవలు చేరువ చేస్తూ పట్టణ ప్రాంతాల్లో 560 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు రాష్ట్రంలో 560 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 6,313 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు.. వంద శాతం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా రూపాంతరం చెందాయి. ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు కాకముందు వాటిలో కేవలం ప్రాథమిక వైద్యసేవలను మాత్రమే అందించేవారు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా మారాక పలు వ్యాధులకు ప్రాథమిక వ్యాధి నిర్ధారణతోపాటు వైద్య సేవలు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో 12 రకాల వైద్య సేవలు అందుతున్నాయి. పీహెచ్సీ, యూపీహెచ్‌సీల్లో సమగ్ర మాతా–శిశు సంరక్షణ సేవలు, ప్రసూతి సేవలు, మానసిక వైద్యసేవలు, బీపీ, షుగర్, గుండె సంబంధిత, కంటి, చెవి, ముక్కు, గొంతు సంరక్షణ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏపీ నుంచే 43.01 శాతం కన్సల్టేషన్లు కేంద్రం 2019 నవంబర్‌లో దేశవ్యాప్తంగా ఈ–సంజీవని టెలీమెడిసిన్ సేవలను ప్రారంభించింది. ప్రారంభంలో టెలీమెడిసిన్ సేవలు అందించడం కోసం ఇంతకుముందున్న 13 జిల్లాల్లోని వైద్య కళాశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం 13 హబ్‌లను ఏర్పాటు చేసింది. అనంతరం మరో 14 హబ్‌లతో ఈ సేవలు విస్తరించింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 27 హబ్‌లలో ప్రజలకు టెలీమెడిసిన్ సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 3,30,36,214 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. వీటిలో 43.01 శాతం అంటే 1,42,11,879 మన రాష్ట్రం నుంచే ఉన్నాయి. 47 లక్షల కన్సల్టేషన్లతో కర్ణాటక రెండో స్థానంలో, 34 లక్షలతో పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా రోజుకు లక్ష కన్సల్టేషన్లు నమోదవుతుంటే అందులో 50 నుంచి 60 శాతం ఏపీ నుంచే ఉంటున్నాయి. ఈ అంశంపై కేంద్రం ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించింది. ఆశా వర్కర్ల ద్వారా టెలీమెడిసిన్ సేవలపై అవగాహన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,145 పీహెచ్‌సీలతోపాటు వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను టెలీమెడిసిన్ హబ్‌లకు అనుసంధానం చేశారు. అదేవిధంగా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రజలు ఇంటి నుంచే టెలీమెడిసిన్ సేవలు పొందేందుకు వీలుగా ఈ–సంజీవని (ఓపీడీ) సేవలు అందుబాటులోకి వచ్చాయి. టెలీమెడిసిన్ సేవలను విస్తృతం చేయడంతోపాటు స్మార్ట్ ఫోన్ లేనివారు, వాడకం తెలియనివారు, వృద్ధులు, ఇతరులకు వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ సంజీవని ఓపీడీ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచడం కోసం రాష్ట్రంలో 42 వేల మంది ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసింది. స్మార్ట్ ఫోన్లన్నింటినీ హబ్‌లకు అనుసంధానించారు. ఆశాల ద్వారా ప్రజలకు మరింతగా టెలీమెడిసిన్ సేవలు అందిస్తున్నారు. -
వెల్నెస్ సెంటర్ల నిర్వహణలో ఏపీకి అగ్రస్థానం
సాక్షి, అమరావతి: ‘ఆయుష్మాన్ భారత్’ పథకం అమలులో భాగంగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ 66 మార్కులతో మొదటి ర్యాంక్ దక్కించుకుంది. ఆయుష్మాన్ భారత్‌లో రెండు రకాల సేవలు ఉంటాయి. ఒకటి.. జన ఆరోగ్య యోజన (ఆరోగ్యశ్రీ తరహా) కాగా రెండోది హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల నిర్వహణ. గ్రామీణ ప్రాంతాల్లో పేద రోగులకు వైద్యసేవలు అందించడం, వారి వివరాలను నమోదు చేయడం, వాటిని కేంద్ర ఆరోగ్య శాఖ పోర్టల్‌కు అనుసంధానించడం వంటి విషయాల్లో ఆంధ్రప్రదేశ్ మంచి ప్రతిభ కనబరిచినట్టు కేంద్రం కితాబిచ్చింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి వికాస్ షీల్ ఆయా రాష్ట్రాలకు లేఖ రాశారు. 2019 డిసెంబర్, 2020 జనవరి నెలలకు సంబంధించి ఆయా రాష్ట్రాల ప్రతిభను లెక్కించారు. ఇందులో 58 మార్కులతో గోవా, తమిళనాడు రెండో స్థానంలో, 57 మార్కులతో గుజరాత్ మూడో స్థానంలో నిలిచాయి. తెలంగాణ 37 మార్కులతో 19వ స్థానంలో నిలిచింది. కాగా.. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల నిర్వహణకు కేంద్రం నిధులు ఇస్తుంది. మాతృవందన యోజనలోనూ ఏపీదే అగ్రస్థానం దేశవ్యాప్తంగా అమలవుతున్న ప్రధానమంత్రి మాతృవందన యోజనలోనూ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ర్యాంక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంత గర్భిణులకు ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, వారికి వైద్య పరీక్షలు చేయించడం, బిడ్డ పుట్టాక వారికి సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించడం చేస్తారు. ఇందుకు దశలవారీగా రూ.5 వేలు ఆ మహిళకు చెల్లిస్తారు. ఇలా ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా పథకం అమలులో జిల్లాలను ప్రతిభ ఆధారంగా గుర్తించగా కర్నూలు జిల్లాకు రెండో ర్యాంకు వచ్చింది. -
ఆరోగ్యశ్రీ అధీనంలోకి వెల్నెస్ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి వెల్నెస్ సెంటర్లు వెళ్లనున్నాయా.. అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. శుక్రవారం ఖైరతాబాద్, వరంగల్, సంగారెడ్డి, వనస్థలిపురం వెల్నెస్ సెంటర్లను ఆరోగ్యశ్రీ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇకపై మందులు, చికిత్సలకు సంబంధించి అన్ని రకాల సిఫారసులను తమకే పంపాలని ఆదేశాలు జారీ చేశారు. సీఈవో పద్మను వెంటనే రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేశారు. పద్మ తొలగింపుపై ఉద్యోగులు, పింఛనుదారులు, జర్నలిస్టులు మండిపడ్డారు. తాజా ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జర్నలిస్టుల సంఘాలు శుక్రవారం కేటీఆర్‌కు విన్నవించగా ఆయన సానుకూలత వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 8,32,085 మంది ఉద్యోగులు, 3,06,125 పింఛనుదారులు, 32,210 జర్నలిస్టులు ఉన్నారు. ఇప్పటి వరకు 1,19,210 మంది ఇన్పేషెంట్లుగా చికిత్స పొందారు. ఈహెచ్ఎస్, జేహెచ్‌ఎస్‌లు రాక ముందు ఉద్యోగుల వైద్యబిల్లుల కోసం ప్రభుత్వం ఏటా రూ.700 కోట్లు చెల్లించేది. వెల్నెస్ సెంటర్లు వచ్చిన తర్వాత రూ.410 కోట్లు ఖర్చు అయింది. అంటే రూ.290 కోట్లు ఆదా అయింది. సీఈవో కల్వకుంట్ల పద్మ రోగుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేశారు. తాజాగా ప్రభుత్వం ఆమెను తొలగించి, నిమ్స్ డైరెక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. గురువారం రాత్రి పది గంటలకు రిలీవ్ ఆర్డర్ జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కమీషన్ల కోసమే.. ఉద్యోగులు, పింఛన్‌దారులకు, వారి కుటుంబసభ్యులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఎంప్లాయీ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్)ను ప్రవేశపెట్టింది. దేశంలోనే ఉత్తమ వైద్య సేవల కార్యక్రమంగా వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. అన్ని జిల్లాల్లో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2016 డిసెంబర్ 17 నుంచి ఈహెచ్ఎస్ సేవలు మొదలయ్యాయి. సిద్ధిపేట మినహా మిగిలిన సెంటర్లలో వైద్య సేవలు అందుతున్నాయి. రోజుకు సగటున 2,300 మంది వైద్య సేవలు పొందుతున్నారు. రోజూ రూ.20 వేల విలువైన ఔషధాలను ఉద్యోగులకు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. సాఫీగా సాగుతున్న ఈహెచ్ఎస్లో ఇప్పుడు మార్పులు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు వెల్నెస్ సెంటర్లలో చేస్తున్న వైద్యపరీక్షలు, మందులు ప్రైవేటు సంస్థలకు అప్పగించి వైద్యపరీక్షలు, మందుల కొనుగోలు వంటి అంశాల్లో ఆశించిన మేరకు కమిషన్లు పొందవచ్చని భావించిన అధికారులు, రాత్రికి రాత్రే పది మందిని అపాయింట్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
‘వెల్నెస్’... వెయిటింగ్ ప్లస్!
సాక్షి, హైదరాబాద్: పెన్షనర్లు, ఉద్యోగులు, పాత్రికేయుల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వెల్నెస్ సెంటర్లకు రోగులు పోటెత్తుతున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం రోగుల సంఖ్య భారీగా పెరిగింది. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్‌కు పది మాసాల క్రితం రోజూ సగటు ఓపీ 30–50 ఉండగా, ప్రస్తుతం 1,700 దాటింది. వనస్థలిపురం ఓపీ రోజుకు సగటున 500–600 మంది వస్తున్నారు. ఖైరతాబాద్ సెంటర్లో ఇప్పటి వరకు 1.60 లక్షల మంది రోగులకు చికిత్స అందించగా, వనస్థలిపురంలో 70 వేల మంది చికిత్స పొందారు. రోగుల నిష్పత్తికి తగినన్ని రిజిస్ట్రేషన్, ఫార్మసీ కౌంటర్లు లేకపోవడంతో నిరీక్షణ తప్పడం లేదు. ఏమీ తినకుండా వైద్య పరీక్షల కోసం సెంటర్‌కు చేరుకున్న వృద్ధులు, మధుమేహగ్రస్తులు, బీపీ బాధితులు గంటలకొద్దీ క్యూలైన్లలో నిలబడాల్సి రావడం వల్ల స్పృహ తప్పి పడిపోతున్నారు. వృద్ధులకు తప్పని నిరీక్షణ రాష్ట్రవ్యాప్తంగా 52 వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత డిసెంబర్లో ఖైరతాబాద్ ఆరోగ్య కేంద్రంలో వెల్నెస్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇటీవల వనస్థలిపురంలో ఏరియా ఆస్పత్రిలోనూ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఖైరతాబాద్‌లో మొత్తం 21 విభాగాల్లో వైద్యసేవలు అందిస్తోంది. అయితే రోగుల నిష్పత్తికి తగినన్ని మందులు, ఫార్మసీ కౌంటర్లు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం 8 గంటలకు సెంటర్‌కు చేరుకుంటే మధ్యాహ్నం 2 గంటలవుతోంది. అంతేకాదు వైద్యుడు రాసిన మందుల్లో సగమే ఇస్తున్నారు. ముఖ్యంగా కేన్సర్, హృద్రోగులు, మూత్రపిండాల బాధితులు, కాలేయ బాధితులకు సంబంధించిన లైఫ్ సేవింగ్ మందుల విషయంలో ఈ సమస్య ఎక్కువగా ఉత్పన్నమవుతోంది. ఇదిలా ఉంటే అప్పటికే ఇతర ఆస్పత్రుల్లో చూపించుకుని ఇన్‌పేషెంట్ అడ్మిట్ కోసం వచ్చిన రోగుల వద్ద వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు అన్నీ ఉన్నా.. మా కోర్సు పూర్తయిన తర్వాతే అడ్మిట్‌కు అనుమతి ఇస్తామని చెబుతుండటం కొసమెరుపు. మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేయాలి రోగుల నిష్పత్తికి తగినన్ని సెంటర్లు లేవు. దీంతో ఉన్నవాటిపై భారం పడుతోంది. ప్రభుత్వం చొరవ తీసుకుని పాతబస్తీ, కూకట్పల్లి, గచ్చిబౌలి, సికింద్రాబాద్ ఏరియాలతో పాటు జిల్లా కేంద్రాల్లోనూ సెంటర్లు ఏర్పాటు చేయాలి. – రత్నం, భారత్ పెన్షనర్ల సంఘం కార్యదర్శి 4 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది కొంతకాలంగా నడుమునొప్పితో బాధపడుతున్నా. ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్‌కు చేరుకున్నా. గంటన్నర తర్వాత ఓపీ చీటీ తీసుకుని వైద్యుడి వద్దకు వెళ్లా. మందులు తీసుకు నేందుకు ఫార్మసీ కౌంటర్ వద్ద 3 గంటలు నిలబడాల్సి వచ్చింది. అది కూడా సగం మందులే ఇచ్చారు. – సరోజిని, నల్లగొండ ఇబ్బందుల్లేకుండా చూస్తున్నాం గతంతో పోలిస్తే ఖైరతాబాద్, వనస్థలిపురం వెల్నెస్ సెంటర్లకు రోగుల తాకిడి పెరిగింది. రోగుల నిష్పత్తికి సరిపడా సాంకేతిక పరికరాలు, మానవ వనరులు లేకపోవడంతో స్వల్ప ఇబ్బం దులు ఎదురవుతున్న మాట వాస్తవమే. వచ్చిన వాళ్లకు సత్వరమే వైద్యసేవలు అందిస్తున్నాం. అత్యవసర రోగులను ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నాం. – డాక్టర్ పద్మ,సీఈఓ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ -
రెండే కేంద్రాలు.. లక్షల్లో ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఎంప్లాయీ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) కింద ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లు రోగులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. నాలుగు లక్షల మంది ఉద్యోగులతోపాటు మరో 7 లక్షల మంది వారి కుటుంబ సభ్యుల కోసం రాష్ట్రవ్యాప్తంగా కేవలం రెండు కేంద్రాలనే ఏర్పాటు చేయడం...అవి కూడా హైదరాబాద్‌లోనే ఉండటం వైద్యం కోసం వచ్చే వారికి తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. వైద్య సేవలు, వివిధ రకాల పరీక్షలు, వాటి నివేదికల కోసం రోగులు ఒక్కోసారి రోజులపాటు నిరీక్షించాల్సి వస్తోంది. రెండు కేంద్రాలకు కలిపి ప్రతిరోజూ సగటున 1,500 మంది వస్తున్నారు. ఎక్కువ మంది రావడంతో వైద్యుల అపాయింట్మెంట్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. పరీక్షలు నిర్వహించాలని వైద్యులు సూచిస్తే వాటి కోసం మరో రోజు వరకు వేచి చూడాల్సి వస్తోంది. దీంతో వైద్యం కోసం వచ్చిన వారు వసతి కోసం కష్టపడుతున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు బంధువుల ఇళ్లకు వెళ్లలేక డబ్బులు చెల్లించి హోటళ్లలో ఉండాల్సి వస్తోంది. హైదరాబాద్‌కు వచ్చేందుకు రవాణా చార్జీలు, బస ఖర్చులు కలిపి తడిసిమోపెడవుతున్నాయి. కేవలం హైదరాబాద్‌లోనే వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వ ఉచిత వైద్యం అనే పదానికి అర్థం లేకుండాపోతోందని ఆరోగ్య శాఖలోని అధికారులే అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అన్ని జిల్లాల్లో వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇప్పటికైతే కనీసం పాత జిల్లాల్లో అయినా వెంటనే వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. త్వరలో అన్ని జిల్లాల్లో.. దశలవారీగా అన్ని జిల్లాల్లో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాం. భవనాలు సిద్ధమైన చోట వెంటనే ప్రారంభించనున్నాం. ప్రస్తుత వెల్నెస్ సెంటర్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందిస్తున్నాం. – కె.పద్మ, ఈహెచ్ఎస్ సీఈఓ ఇప్పటివరకు 1.75 లక్షల మందికి వైద్యం... ఈహెచ్ఎస్ మొదలైన వెంటనే వైద్య, ఆరోగ్యశాఖ 2016 డిసెంబర్ 17న హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో మొదటి వెల్నెస్ సెంటర్‌ను, 2017 ఫిబ్రవరి 2న వనస్థలిపురంలో మరో వెల్నెస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో అన్ని విభాగాల వైద్యులను అందుబాటులో ఉంచింది. వెల్నెస్ సెంటర్లకు వచ్చే రోగులకు వైద్యంతోపాటు వివిధ పరీక్షలు, నివేదికలు, అవసరమైన మందులను ఈ కేంద్రాల్లోనే ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతం పని చేస్తున్న రెండు సెంటర్లలో కలిపి ఇప్పటి వరకు 1,75,175 మందిని వైద్యులు పరీక్షించారు. ఈ విధానం బాగానే ఉన్నా వెల్నెస్ కేంద్రాల ఏర్పాటులో వైద్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ఉద్యోగులకు ఇబ్బందులు కలిగిస్తోంది. వెల్నెస్ కేంద్రాల్లో వైద్యం పొందాల్సిన వారు 11 లక్షల మంది ఉంటే రెండు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ లక్ష్యం సైతం నెరవేరడంలేదు. సిద్దిపేటలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సేవలు మొదలుకాలేదు. మిగిలిన జిల్లాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. -
ఉద్యోగుల కోసం మరో 3 వెల్నెస్ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం త్వరలో హైదరాబాద్‌లోని కూకట్పల్లి, వరంగల్, కరీంనగర్‌లలో వెల్నెస్ సెంటర్లు ప్రారంభిస్తామని ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్) సీఈవో డాక్టర్ కల్వకుంట్ల పద్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న రెండు వెల్నెస్ సెంటర్లకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందన్నారు. మూడున్నర నెలల్లో 34,710 మంది ఔట్ పేషెంట్లు వచ్చారన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్‌ను డిసెంబర్ 18 ప్రారంభించగా, వనస్థలిపురం వెల్నెస్ సెంటర్ నెల రోజుల నుంచి వైద్య సేవలు అందిస్తోందన్నారు. మెరుగైన వైద్య చికిత్సకు ఈ వెల్నెస్ సెంటర్లు రిఫర్ చేస్తేనే కార్పొరేట్, ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవచ్చన్నారు. -
ఈ ఏడాదిలో 10 హమ్దర్ద్ వెల్నెస్ సెంటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో యునానీకి సంబంధించి ఈ సంవత్సరం పది వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు హమ్దర్ద్ ఇండియా చీఫ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఆఫీసర్ మన్సూర్ అలీ వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీలో 4, పాట్నాలో ఒకటి ఉన్నట్లు చెప్పారాయన. గురువారం హైదరాబాద్‌లో మరో వెల్నెస్ సెంటర్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మొహమ్మద్ మహమూద్ అలీ ప్రారంభించారు. ఒక్కో సెంటర్ ఏర్పాటుకు సుమారు రూ. 40-50 లక్షల దాకా వెచ్చిస్తున్నట్లు మన్సూర్ చెప్పారు. లైఫ్ స్టయిల్ మార్పులు, ఇతరత్రా కారణాలతోనూ వచ్చే ఆరోగ్య సమస్యలకు అందుబాటు ధరలో యునానీ చికిత్స అందించే ఉద్దేశంతో ఈ వెల్నెస్ సెంటర్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమ టర్నోవరు రూ.600 కోట్ల పైనే ఉండగా.. ఎగుమతుల వాటా 4-5%గా ఉంటోందన్నారు. 3 తయారీ ప్లాంట్లు, 500 పైగా ఉత్పత్తులు ఉండగా.. ఆదాయాల్లో 20% వృద్ధి అంచనా వేస్తున్నట్లు చెప్పారు. రూహ్ అఫ్జా, సాఫీ, సింకారా వంటి ఉత్పత్తులను హమ్దర్ద్ విక్రయిస్తోంది. -
2025 నాటికి 7 కోట్ల మందికి షుగర్
* 21 కోట్ల మందికి హై-బీపీ * ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన సాక్షి, హైదరాబాద్: దేశంలో 30 నుంచి 59 ఏళ్ల మధ్య వయసులో చనిపోతున్న వారిలో 53 శాతం మంది దీర్ఘకాలిక వ్యాధులతోనే మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలు ఆందోళన వ్యక్తంచేశాయి. అందులో హృదయ సంబంధ వ్యాధులతో చనిపోతున్న వారు 29 శాతం ఉన్నారంది. ‘భారత్‌లో దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, నిర్మూలన’పై కేంద్ర ఆరోగ్యశాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఇటీవల ఢిల్లీలో కీలక సదస్సు నిర్వహించాయి. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ, నిమ్స్ నెఫ్రాలజిస్ట్ టి.గంగాధర్ పాల్గొన్నారు.దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, నిర్మూలనకు సంబంధించి మార్గదర్శకాలపై సదస్సులో నివేదిక విడుదల చేశారు. మధుమేహ (షుగర్) వ్యాధి ద్వారానే దీర్ఘకాలిక వ్యాధులు మరింత ప్రబలుతున్నాయని ఆ నివేదిక స్పష్టంచేసింది. 2025 నాటికి దేశంలో 21.30 కోట్ల మంది హై-బీపీ, సుమారు 7కోట్ల మంది షుగర్ రోగులు ఉంటారని తెలిపింది. షుగర్, హై-బీపీ, గుండె పోట్ల కారణంగా విదేశాలతో పోలిస్తే దేశంలో ఐదు పదేళ్ల ముందే చనిపోతున్నారంది. చిన్న వయసులో షుగర్, గుండెపోటు రావడానికి ప్రధాన కారణం తాజా పండ్లు, కూరగాయలు తీసుకోకపోవడం, ఆహారపుటలవాట్లు, పొగ తాగడమేనని తేల్చింది. గ్రామస్థాయి వరకు వెల్నెస్ కేంద్రాలు... ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా మూడు రకాల ప్రత్యేక కార్యక్రమాలు... ఆరోగ్యంపై అవగాహన, దీర్ఘకాలిక వ్యాధులను ముందే గుర్తించడం, వ్యాధులకు గురైన వారికి అవసరమైన చికిత్స చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. ప్రజలు రోగాల బారిన పడకుండా చూసేలా గ్రామస్థాయి వరకు ‘వెల్నెస్ కేంద్రాల’ను నెలకొల్పాలని సూచించింది. కాగా, తమిళనాడులో ప్రస్తుతం ఆదర్శవంతమైన ఆరోగ్య వ్యవస్థ ఉందని, దాన్ని అమలు చేస్తే బాగుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులపై కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలపై కసరత్తు చేసి ఆదర్శవంతమైన ఆరోగ్య విధానాన్ని రూపొం దిస్తామని ఆయన తెలిపారు.