సాక్షి ఇంటర్వ్యూలో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు డా.శ్రీనాథ్ రెడ్డి
ఎయిమ్స్ వంటి పెద్ద ఆస్పత్రుల కంటే ప్రాథమిక వైద్య రంగమే కీలకం
గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి ఆస్పత్రుల వరకు సదుపాయాల కల్పన ముఖ్యం
ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి ఆశా, అంగన్‌వాడీ సిబ్బందిని తీసుకురావాలి
సాంకేతికతతో వైద్యులు–ప్రజల మధ్య దూరం తగ్గించాలి
వ్యసనాలు, విలాసాలపై పన్నులతో రెవెన్యూ పెంచుకోవాలి
బీమా, ఆరోగ్య పరిరక్షణ రంగాలపై పన్నుల భారం తగ్గించాలి
సాక్షి, అమరావతి : దేశంలో ఎయిమ్స్ వంటి పెద్ద ఆస్పత్రుల కంటే గ్రామ స్థాయిలోని వెల్‌నెస్ సెంటర్లు మొదలు జిల్లా ఆస్పత్రుల వరకు మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం చాలా ఉందని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు, పబ్లిక్ హెల్త్ హానరరీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. గ్రామీణ, సబ్ డివిజన్, జిల్లా స్థాయిల్లో ప్రజారోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కోసం 2025–26 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలన్నారు.
2023–24తో పోలిస్తే 2024–25లో ఆరోగ్య రంగానికి బడ్జెట్ 12.59 శాతం పెరిగిందన్నారు. విజన్ 2047 లక్ష్యాలను అధిగమించాలంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వచ్చే ఏడాది 50 శాతం మేర ఆరోగ్య బడ్జెట్ పెరగాలన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన 2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఆరోగ్య రంగానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతల గురించి ఆయన ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
వైద్యం సులభతరం కావాలి
దేశంలో ప్రజారోగ్య అవసరాలకు తగ్గట్టుగా ఎంబీబీఎస్, స్పెషలిస్ట్, సూపర్ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో లేరు. గ్రామీణ ప్రాంత ప్రజలు నేటికీ వైద్య సేవల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమలవుతున్న టెలీ మెడిసిన్, ఇతర డిజిటల్ వైద్య సేవలను మరింత బలోపేతం చేయాల్సి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతోపాటు హెల్త్ ఇన్నోవేషన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
వైద్య సేవలను మరింత సులభతరం చేయాలి. హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీని మెరుగు పరచేలా కేటాయింపులు ఉండాలి. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని కేంద్రం అమలు చేస్తోంది. అయితే టైర్ 2, 3 నగరాలు, పట్టణాల్లో ఆయుష్మాన్ భారత్ సేవలు అందించే ఆస్పత్రుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. చిన్న చిన్న పట్టణాలకు సైతం సేవలను విస్తరించాలి.
సేవలు విస్తృతం చేయాలి
ఆయుష్మాన్ భారత్‌ను ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్‌లు, హెల్పర్‌లకు సైతం వర్తింపజేస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. ఈ హామీ అమలు చేస్తూ బడ్జెట్ ద్వారా ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నాం. సమాజంలో నివసిస్తున్న 10 శాతం మంది ధనికులు స్వతహాగా ఇన్సూరెన్స్‌లు పొందుతున్నారు. 50–60 శాతం మంది పేదలకు ఆయుష్మాన్ భారత్, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ద్వారా ఆరోగ్య భద్రత లభిస్తోంది.
మిగిలిన 30 శాతం మంది మధ్య తరగతి కుటుంబాలకు ఆరోగ్య భద్రత కరవవుతోంది. చాలా కొద్ది రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు మధ్య తరగతి కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నాయి. వీరు కొంత ప్రీమియం చెల్లిస్తే ఆయుష్మాన్ భారత్ వర్తింపజేసేలా ప్రతిపాదనలున్నాయి. ఈ నేపథ్యంలో పథకాన్ని మరింత విస్తృతపరచాలి.. మరింత బలోపేతం చేయాలి.
ప్రభుత్వ వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడానికి కొన్ని రాష్ట్రాల్లో పూల్ ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని అవలంభిస్తున్నారు. టాటా మెమోరియల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ గ్రిడ్ ఏర్పాటు చేసి.. క్యాన్సర్ మందులు, వైద్య పరికరాలను పూల్ ప్రొక్యూర్‌మెంట్ చేస్తున్నారు. ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలయ్యేలా ప్రోత్సహించాలి.
ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రజలపై పన్నుల భారం తగ్గించాలి. ముఖ్యంగా ఆరోగ్య బీమా, ఔషధాలు, రోగ నిర్ధారణ పరీక్షలు వంటి వాటిపై పన్నులు మినహాయించాలి. కొత్త ఆస్పత్రుల ఏర్పాటును ప్రోత్సహించాలి. వైద్య రంగం నుంచి రాబడి మార్గాలను ప్రభుత్వం అన్వేషించకూడదు. అవసరమైతే లగ్జరీ కార్లు, బైక్‌లు, బిజినెస్ క్లాస్ విమాన టికెట్‌ల వంటి విలాసాలకు సంబంధించిన అంశాలతో పాటు.. పొగాకు, మద్యం వంటి వ్యసనాలతో ముడిపడి ఉన్న వాటిపై పన్నులు పెంచాలి.
Comments
Please login to add a commentAdd a comment