Srinath Reddy
-
ఎంపాక్స్‌పై భయం వీడండి
చికెన్‌పాక్స్(ఆటలమ్మ, అమ్మవారు) తరహా వ్యాధి ఎంపాక్స్. కరోనా వైరస్ మాదిరిగా గాలి ద్వారా ఇతరులకు వ్యాపించదు. ఇన్ఫెక్షన్కు గురైన వారితో సన్నిహితంగా మెలిగిన వారికే వ్యాధి సోకుతుంది. దేశంలో ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ ప్రయాణికులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ శ్రీనాథ్రెడ్డిసాక్షి, అమరావతి: మూడేళ్ల కిందటే ఎంపాక్స్ వ్యాప్తి ఆఫ్రికాలో ప్రారంభమైంది. అప్పట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అయితే ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలకే ఈ వ్యాధి పరిమితం కావడం, త్వరగా నియంత్రణలోకి రావడంతో పెద్ద ప్రమాదం లేదని గుర్తించి ఎమర్జెన్సీని ఎత్తివేశారు. ఆ సమయంలో భారత్‌లోని కేరళ రాష్ట్రంలో పరిమిత సంఖ్యలో కేసులు నమోదైయ్యాయి. మళ్లీ తిరిగి ఇప్పుడు ఎంపాక్స్ కారక వైరస్‌లలోని క్లేడ్ 1బీ అనే కొత్త రకం వేరియంట్ రూపంలో ప్రమాదకరంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తికి ఆఫ్రికా కేంద్ర బిందువు కాగా, గల్ఫ్, యూరప్ నుంచి ఇతర దేశాలకు వ్యాప్తి పెరుగుతోంది. ఎందుకంటే ఆఫ్రికా దేశాలకు గల్ఫ్, యూరప్‌ల నుంచి ప్రయాణాలు సాగిస్తుంటారు. దీంతో వైరస్ ప్రాథమిక వ్యాప్తి ఆఫ్రికాలో, రెండో దశ వ్యాప్తి యూరప్, గల్ఫ్లలో, మూడో దశలో ఇతర దేశాల్లో ఉంటోంది. మన పక్కనున్న పాకిస్తాన్లో వెలుగు చూసిన కేసుల్లో వ్యాధిగ్రస్తులు గల్ఫ్ నుంచి వచ్చినట్టుగా తేలింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎంపాక్స్‌పై అప్రమత్తమైంది. విమాన, నౌకాశ్రయాల్లో స్క్రీనింగ్ ప్రారంభించింది.స్మాల్‌పాక్స్‌తో దగ్గరి సంబంధంభారత్తో పాటు, ప్రపంచ దేశాలను ఒకప్పుడు స్మాల్‌పాక్స్(మశూచి) ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. స్మాల్‌పాక్స్‌కు ఎంపాక్స్‌కు దగ్గరి సంబంధం ఉంటుంది. ఈ రెండు వ్యాధులు ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందినవే. ఎలుకలు, ఉడతలు, కుందేలు వంటి జంతువుల నుంచి మనుషులకు ఎంపాక్స్ సోకినట్లు మూడేళ్ల కిందటే నిర్ధారించారు. దీన్ని మంకీపాక్స్ అని పిలవడం కూడా సరికాదు. 1978 వరకూ ప్రపంచ వ్యాప్తంగా స్మాల్‌పాక్స్‌కు వ్యాక్సినేషన్ చేశారు. ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించినట్లు డబ్ల్యూహెచ్‌వో, ఇతర సంస్థలు ప్రకటించడంతో 1980 తర్వాత వ్యాక్సిన్లు అందుబాటులో లేకుండా పోయాయి. కాగా, స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎంపాక్స్ నుంచి రక్షణ ఉంటుంది. వ్యాక్సినేషన్‌పై చర్చలుఎంపాక్స్ నియంత్రణకు సామూహిక వ్యాక్సినేషన్ అవసరమా? అనేదాని మీద ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్ తిరిగి తయారు చేయాలా? లేదా అటువంటి వ్యాక్సిన్‌ను తయారు చేయాలా అనేదాని మీద ఆలోచనలున్నాయి. ఎంపాక్స్‌కు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికా, జర్మనీలో వ్యాక్సిన్లు తయారీలో ఉన్నాయి. కొన్ని దేశాలు ఇప్పటికే కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చాయి. అయితే కోవిడ్ వ్యాక్సిన్ తరహాలో పెద్ద ఎత్తున అందుబాటులో ఈ వ్యాక్సిన్ ఉండదు. సన్నిహితంగా మెలగడం ద్వారానే..కోవిడ్ మాదిరిగా గాలి ద్వారా ఎంపాక్స్ వ్యాపించదు. లైంగిక సంబంధం, ఇన్ఫెక్షన్కు గురైన వారితో సన్నిహితంగా మెలిగిన వారికే వ్యాధి సోకుతుంది. అదే విధంగా వ్యాధిగ్రస్తుల నోటి తుంపరలు, ఉమ్ము, శరీర స్రావాల ద్వారా కూడా వ్యాపిస్తుంది. చర్మం మీద గీసుకుపోయిన, గాయాలు, పుండ్లున్న ప్రాంతంలో వ్యాధిగ్రస్తుల స్రావాలు పడినా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం మనం చిన్నపిల్లల్లో ఎక్కువగా, పెద్దల్లో అరుదుగా చికెన్ పాక్స్‌ను చూస్తుంటాం. చికెన్ పాక్స్(ఆటలమ్మ, అమ్మవారు) తరహాలోనే ఎంపాక్స్ సోకిన వారిలో కూడా చర్మం మీద పొక్కులు వస్తాయి.అయితే ఎంపాక్స్ సోకిన వారికి అరికాళ్లు, అరచేతుల్లో కూడా పొక్కులు వస్తాయి. అదే విధంగా మల, మూత్ర విసర్జన భాగాలు, కళ్లు, నోరు, ఇలా శరీరంలోని అన్ని భాగాల్లో పొక్కులు ఏర్పడతాయి. దీంతో పాటుగా జ్వరం, తీవ్ర అలసట, గొంతు నొప్పి, తల, కీళ్లు, ఒళ్లు నొప్పులు, ఆకలి మందగించడం వంటివి జరుగుతాయి. వైరస్ సోకిన వారిలో 5 నుంచి 21 రోజుల పాటు వ్యాధి లక్షణాలు ఉంటాయి.విమానాలు, నౌకల ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరిఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు వైరస్ క్యారియర్లుగా ఉంటారు. ఈ క్రమంలో విమాన, నౌకాయానం ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలి. విమానాశ్రయం, నౌకాశ్రయాల్లో రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఎదుటి వ్యక్తి తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా నోటి తుంపరలు మీద పడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో వ్యక్తుల నుంచి ఎడం పాటించాలి. మాస్క్ ధరించడం ఉత్తమం. సాధారణ ప్రజలు సైతం ఎదుటి వారితో మాట్లాడేప్పుడు సన్నిహితంగా మెలగకూడదు. ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలి. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి -
ఇన్క్యుబేషన్ సెంటర్ల ఏర్పాటులో రామ్ఇన్ఫో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ సొల్యూషన్స్ అందించే లిస్టెడ్ సంస్థ రామ్ఇన్ఫో వచ్చే మూడేళ్లలో టాప్ 5 మధ్య స్థాయి టెక్ కంపెనీల్లో ఒకటిగా ఎదగాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా అమెరికాలో కూడా కార్యకలాపాలు విస్తరిస్తోంది. అంకుర సంస్థలకోసం అమెరికాలో రెండు, భారత్‌లో ఒకటి చొప్పున ఇన్క్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ఎండీ ఎల్ శ్రీనాథ్‌రెడ్డి బుధవారమిక్కడ తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా 1994లో ఏర్పాటైన రామ్ఇన్ఫో .. ఈసేవ, మీసేవ, సువిధా వంటి సొల్యూషన్స్‌తో అటు ప్రభుత్వాలు, ఇటు కంపెనీలకు ఐటీ, డిజిటల్ పరివర్తన సేవలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో సాగిస్తున్న కార్యకలాపాలను 2024–25లో 15 రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. 135 మిలియన్ డాలర్ల ఆదాయం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. -
టీటీడీ ఆస్పత్రుల్లో ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలు
తిరుపతి తుడా: తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్, బర్డ్, శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రుల్లో ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలు పాటిస్తున్నారని ప్రముఖ పీడియాట్రిక్ సర్జన్, నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మిను బాజ్‌పాయ్ ప్రశంసించారు. ఆయన గురువారం టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డితో కలిసి శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం, బర్డ్ ఆస్పత్రులను సందర్శించారు. ముందు శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డితో కలిసి గుండెమార్పిడి అనంతరం చికిత్స పొందుతున్న చిన్నారితోపాటు పలు వార్డుల్లో గుండె జబ్బులకు చికిత్స పొందుతున్న చిన్నారులను, క్యాథ్‌ల్యాబ్, ఐసీయూ తదితర కేంద్రాలను చూసి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం బర్డ్‌లో నిరుపేదలకు ఉచితంగా మోకీళ్ల మార్పిడి, ఆర్థో సంబంధిత వ్యాధులకు అందిస్తున్న చికిత్సలను బర్డ్ ఆస్పత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్పరెడ్డి.. డాక్టర్ బాజ్‌పాయ్‌కి వివరించారు. అనంతరం డాక్టర్ బాజ్‌పాయ్ మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఆస్పత్రుల్లో నిరుపేదలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు, మోకీలు, తుంటిమార్పిడి, అత్యంత సంక్లిష్టమైన వెన్నుపూస ఆపరేషన్లు, గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు చేయడం పట్ల అభినందనలు తెలిపారు. శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం, బర్డ్ ఆస్పత్రుల్లో అత్యాధునిక సౌకర్యాలు, స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నట్లు చెప్పారు. పద్మావతి ఆస్పత్రిలో ఇప్పటివరకు 1,300కు పైగా గుండె సంబంధిత ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. దేశం నలుమూలలతో పాటు పక్క దేశం నుంచి కూడా చిన్నపిల్లల తల్లిదండ్రులు ఇక్కడికి చికిత్సకోసం వస్తుండడం గొప్ప విషయమన్నారు. తిరుమల శ్రీవారి అండదండలతోనే ఇంతటి ఘనత సాధ్యమైందని కొనియాడారు. పేద, మధ్య తరగతి ప్రజలకు వరం రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం పేద, మధ్యతరగతి ప్రజలకు వరమని చెప్పారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద వైద్యరంగంలో కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తామని తెలిపారు. తమ బోర్డు ఆధ్వర్యంలో స్పెషలిస్టులను తయారు చేయడమే ప్రధాన ఉద్దేశమన్నారు. కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్ అంశాల్లో వైద్యులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. క్యాన్సర్ రోగుల కోసం వినియోగించే లీనియర్ యాక్సిలరేటర్ రూ.50 కోట్లు అవుతుందని, మన దేశంలో ఇలాంటివి వందల సంఖ్యలో కావాల్సి ఉందని తెలిపారు. ఇలాంటి ఖరీదైన వైద్య పరికరాలను ఉత్పత్తి చేసేందుకు మన డాక్టర్లకు శిక్షణ ఇప్పించేందుకు చర్యలు మొదలుపెట్టినట్లు చెప్పారు. బర్డ్ ఆస్పత్రిలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సౌకర్యాలు ఉన్నాయన్నారు. వైద్యరంగంలో నూతన పరికరాల తయారీ కోసం బర్డ్‌లో ప్రత్యేకంగా ల్యాబ్ ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం దేశంలోని ఐదు ప్రముఖ ఐఐటీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన చెప్పారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవిలను ఆయన అభినందించారు. ఈఈ కృష్ణారెడ్డి, ఎస్పీసిహెచ్సీకి చెందిన డాక్టర్ గణపతి తదితరులు పాల్గొన్నారు. -
రాయలసీమ ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప: జర్నలిజం రంగంలో ఆయన సవ్యసాచి. ప్రజలు, ప్రజాహక్కులు, రాయలసీమ అస్థిత్వంపై పోరాటం, అడ్డదిడ్డంగా పయనిస్తున్న యంత్రాంగాన్ని గాడిలో పెట్టడం, రాయలసీమకు అనువైన రాజకీయాలను నెరిపేందుకు నేతల్ని ఏకీకరణ చేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు ఆయన సొంతం. రాయలసీమ కోసం దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి ఎంచుకున్న ఉద్యమపథం ఆదర్శనీయం. కలాన్ని కరవాలంగా ధరించిన ఆ పెద్దరికం కనుమరుగైంది. ► కడప జిల్లా సింహాద్రిపురం దగ్గర కోరుగుంటపల్లెలో సంపన్న కుటుంబంలో దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి జన్మించారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన ఆయన వారి తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకు. ఆయన ఎస్వీ యూనివర్సిటీలో ఆంగ్ల సాహిత్యంలో పీజీ చేశారు. 1978 లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో చేరారు. కొద్దిరోజులు బెంగుళూరులో పనిచేసి, కడప స్టాప్రిపోర్టర్గా దాదాపు 30 ఏళ్లు పనిచేశారు. ఆ తరువాత కొంతకాలం తిరుపతి, హైదరాబాద్‌లలో వివిధ హోదాల్లో పనిచేశారు. జర్నలిస్ట్‌గా ఆయన ప్రస్థానంలో అనేక ఘటనలకు ఆయనే కేంద్ర బిందువుగా నిలవడం విశేషం. ఎన్టీఆర్‌కు ఎదురుప్రశ్న.. ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీ రామారావు జిల్లాలోని ముద్దనూరు పర్యటనకు వచ్చారు. అప్పట్లో రాయలసీమ వెనుకబాటు తనంపై ఉద్యమం బాగా నడుస్తోంది. ఆ పరిస్థితుల్లో జిల్లాకు వచ్చిన ఎన్టీఆర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాయలసీమలో సాగు, తాగునీటికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లుగా వివరిస్తూనే, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎన్ని కిలోమీటర్లు నీరు పారుదల చేయనున్నామో వివరించసాగారు. ఆ సందర్భంలో ‘ఎక్స్క్యూజ్్ మీ.. చిన్న డౌట్ సార్’ అంటూ శ్రీనాథ్‌రెడ్డి గళం విప్పారు. 1 టీఎంసీ నీటికి ఎన్ని ఎకరాలు సాగుచేయవచ్చు సార్.. అంటూ ప్రశ్నించడంతో ఎన్టీఆర్ నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో సందర్భంలో చింతకొమ్మదిన్నె సమీపంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన బహిష్కరించి ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమాన్ని అదే రోజు కడపలో అప్పటి విపక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డిచే ఏపీయూడబ్ల్యుజే జిల్లా అధ్యక్షుడి హోదాలో శ్రీనాథ్‌రెడ్డి నిర్వహించడం విశేషం. దమ్మున్న జర్నలిస్టుగా ఆయనకు ఆయనే సాటి. సంచలనంగా ‘సెవెన్‌రోడ్స్ జంక్షన్’.. జర్నలిస్టుగా శ్రీనాథ్‌రెడ్డికి ఇంగ్లీషు, తెలుగు భాషలో విశేష నైపుణ్యం ఉంది. ప్రతిపదం అర్థవంతంగా.. ఆలోచనాత్మకంగా రాయడంలో ఆయన దిట్ట అని అప్పటి తరం జర్నలిస్టులు గుర్తుచేసుకుంటున్నారు. అప్పట్లో ప్రతి బుధవారం ఆంధ్రప్రభలో ‘సెవెన్‌రోడ్స్ జంక్షన్’ శీర్షికతో శ్రీనాథ్‌రెడ్డి కొన్ని ఏళ్లపాటు ఏకదాటిగా ప్రత్యేక కథనాలు రాసేవారు. అందులో ఇప్పటికీ గుర్తుండిపోయే వార్తలు చాలా ఉన్నాయి. వాటిలో.. ఇద్దరు పార్లమెంటు సభ్యుల గురించి ‘ఆవు–దూడ’. ఎస్పీగా ఉమేష్‌చంద్ర పనితీరుపై ‘ఎగిరిపడుతోన్న ఎర్రటోపీ’ రాయచోటి ఉప ఎన్నికలపై ‘రిగ్గుడు వాడే–నెగ్గుడు’ ఇలాంటి దమ్మున్న శీర్షికలు ఎన్నో పెట్లారు. ఉత్తర, దక్షిణ ధ్రువాలు సైతం.... ప్రజాస్వామ్య రాజకీయ నేతలు, పౌరహక్కుల నేతలు.. ఉత్తర దక్షిణ ధ్రువాలుగా 90వ దశకం కంటే ముందు ఉండేవారు. అలాంటి ఉత్తర, దక్షిణ ధ్రువాలకు దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి అనుసంధానకర్తగా నిలిచారు. అప్పట్లో జిల్లాలో క్రియాశీలకంగా పనిచేసిన న్యాయవాది కె. జయశ్రీపై రెండు తప్పుడు కేసులను పోలీసులు బనాయించారు. ఆ కేసులు తప్పుడు కేసులని.. జయశ్రీపై బనాయించడం ఏంటని ఎస్పీని శ్రీనాథ్‌రెడ్డి ధైర్యంగా ప్రశ్నించారు. ఆ తర్వాత ఆ కేసుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ► పౌరహక్కుల నేత బాలగోపాల్ జిల్లా పర్యటనకు వస్తే శ్రీనాథ్‌రెడ్డితో చర్చించేవారు. రాయలసీమలో విభిన్న రాజకీయ పార్టీల నేతలు, వారి వారి రాజకీయ పరిమితులు ఎలా ఉన్పప్పటికీ శ్రీనాథ్‌రెడ్డి కార్యాలయంలో సమ ప్రాధాన్యత లభించేది. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు.... కడప జిల్లా జర్నలిస్టు దిగ్గజం. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి భౌతికకాయం శుక్రవారం ఉదయం స్వగ్రామం కోరుగుంటపల్లెకు చేరనుంది. బంధువులు, సన్నిహితులు, ప్రజల సందర్శన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాయలసీమ ఉద్యమానికి కేరాఫ్ అడ్రస్.... రెండు దశాబ్దాలపాటు కడప శివలింగంపిళ్లై వీధిలోని శ్రీనాథ్‌రెడ్డి ఆఫీసు రాయలసీమ ఉద్యమానికి కేరాఫ్ అడ్రస్. రాజకీయ ఉద్దండులు వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎంవీ రమణారెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, జేసీ దివాకరరెడ్డి, ఆర్. రాజగోపాల్ రెడ్డి మొదలుకుని.. రాయలసీమ ఉద్యమంతో ముడిపడిన అందరి తలలో నాలుకగా ఆయన నిలిచారంటే అతిశయోక్తి కాదు. రాయలసీమ నలుదిక్కుల నుంచి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వరకూ పాదయాత్ర చేపట్టాలనే కీలక నిర్ణయానికి రాజకీయ నేతలను ఏకీకరణ చేయడంలో ప్రధాన పాత్ర ఈయనదేనని నాటి ఉద్యమనేతలు వెల్లడిస్తున్నారు. ప్రస్తుత కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి అధ్యక్షుడుగా, కోఆపరేటివ్ కాలనీ ప్రతాప్‌రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఏర్పాటైన ‘రాయలసీమ యువపోరాట సమితి’ కూడా ఈయన కార్యాలయంలో పురుడు పోసుకుంది. విలువలకు పెద్దపీట వేసిన శ్రీనాథ్‌రెడ్డి వైవీయూ : విలువలకు పెద్దపీట వేస్తూ పాత్రికేయానికి సరైన అర్థంలా నిలిచిన సీనియర్ పాత్రికేయులు, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి మృతి ఆవేదనకు గురిచేసిందని వైవీయూ వీసీ ఆచార్య జింక రంగజనార్ధన, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకటసుబ్బయ్య, గజ్జల మల్లారెడ్డి ట్రస్ట్ కన్వీనర్ డా. ఎన్. ఈశ్వరరెడ్డి తెలిపారు. వైవీయూ ద్వారా గజ్జెల మల్లారెడ్డి స్మారక పురస్కారం–2019ని ఆయన అందుకున్నారని గుర్తుచేశారు. -
అనారోగ్యంతో కన్నుమూసిన ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్
కడప సెవెన్‌రోడ్స్ : ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్, సీనియర్ పాత్రికేయుడు దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి మరణం అటు పత్రికా రంగానికి, ఇటు ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పలువురు పేర్కొన్నారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న శ్రీనాథ్‌రెడ్డి బుధవారం హైదరాబాదులో తుది శ్వాస విడిచారు. సింహాద్రిపురం మండలం కోవరంగుట్టపల్లె గ్రామానికి చెందిన ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెల్లో ఒకరు అమెరికా, మరొకరు బ్రిటన్‌లో ఉన్నారు. ఆయన తల్లి సావిత్రమ్మ కోవరంగుట్టపల్లె సర్పంచుగా పనిచేశారు. తండ్రి ద్వారకనాథరెడ్డి తాడిపత్రిలో కళాశాల నిర్వహిస్తున్నారు. మద్రాసు ట్రిప్లికేన్‌లోని హిందూ హైస్కూలులో 10వ తరగతి అభ్యసించారు. తిరుపతిలోని ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో బీకాం చదివారు. ధర్మవరానికి చెందిన మాజీమంత్రి నాగిరెడ్డి సోదరిని వివాహం చేసుకున్నారు. జేసీ దివాకర్‌రెడ్డి, వేంపల్లె సతీష్‌రెడ్డి సమీప బంధువులే. విదేశాల్లో ఉన్న కుమార్తెలు వచ్చిన తర్వాత అంత్యక్రియలు ఎక్కడ జరపాలో నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. పత్రికారంగంలో.. శ్రీనాథ్‌రెడ్డి చాలాకాలంగా కడప ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత బీబీసీ, హైదరాబాదులోని సాక్షి ప్రధాన కార్యాలయంలో ఉద్యోగ విధులు నిర్వర్తించారు. కడపలో పనిచేస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా సుమారు రెండున్నర శతాబ్దం పనిచేసి జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడారు. కడప రామాంజనేయపురంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించిన ఘనత ఆయనదే. కడప ప్రెస్‌క్లబ్ ఆయన చొరవతోనే ఏర్పాటైంది. ఆనాటి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు శ్రీనాథ్‌రెడ్డికి ఎంతో గౌరవం ఇచ్చేవారు. ‘సీమ’ ఉద్యమంలో.. రాయలసీమ ఉద్యమంలో శ్రీనాథ్‌రెడ్డి ఎంతో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఆనాటి ఉద్యమ నేతలు వైఎస్ రాజశేఖరరెడ్డి, డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి, డాక్టర్ ఎంవీ రమణారెడ్డి, సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులతో ఎంతో సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. పత్రికా రంగంలో కొనసాగుతూనే ప్రత్యక్షంగా ‘సీమ’ ఉద్యమంలో పాల్గొన్నారు. కడపలోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కార్యాలయం ఆయన హయాంలో నిత్యం రాయలసీమ ఉద్యమ కారులు, రాజకీయ నాయకులతో కిటకిటలాడుతూ ఉండేది. ఇప్పటి కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డిని రాయలసీమ ఉద్యమంలోకి ఆహ్వానించి రాయలసీమ యువ పోరాట సమితి ఏర్పాటు చేయించారు. ప్రెస్ అకాడమి చైర్మన్‌గా.. సుమారు 40 ఏళ్లకు పైబడి పాత్రికేయరంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీనాథ్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు తగిన గౌరవం కల్పించారు. ఈ ఐదేళ్లలో రెండుసార్లు ప్రెస్ అకాడమి చైర్మన్‌గా కొనసాగిన ఘనత శ్రీనాథ్రెడ్డికే దక్కింది. పలువురి సంతాపం శ్రీనాథ్‌రెడ్డి మృతి పట్ల జిల్లాకు చెందిన పలువురు పా త్రికేయులు, ప్రజాసంఘాల నాయకులు తీవ్ర సంతా పం వ్యక్తం చేశారు. రాయ లసీమ సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉద్యోగాలు వంటి డిమాండ్లతో సాగిన ఉద్యమంలో ఆయన ఎంతో క్రియాశీలకంగా పాల్గొన్నారని రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఆయన మరణం పాత్రికేయ రంగానికి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీనియర్ జర్నలిస్టు పమిడికాల్వ మధుసూదన్ పేర్కొన్నారు. -
Omicron BF 7: ఇతర దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే మన టీకాల సత్తా ఎంత?
సాక్షి, అమరావతి: చైనా, ఇతర దేశాల్లో పంపిణీ చేసిన కరోనా టీకాలతో పోలిస్తే మన వ్యాక్సిన్లు చాలా శక్తిమంతమైనవని, వైరస్ సోకడం, వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా మన దేశంలో ఇప్పటికే చాలా మందిలో రోగ నిరోధకత వచ్చిందని ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్–7 పట్ల ప్రజలు అలజడికి గురి కావాల్సిన అవసరం లేదన్నారు. కొత్త వేరియంట్ ప్రభావం ఎలా ఉండనుంది? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. చైనాలో అలా ఎందుకంటే? చైనాలో మన కంటే చాలా ముందుగానే టీకాల పంపిణీ చేపట్టినా అన్ని వర్గాలకు పంపిణీ చేయలేదు. వయసు మళ్లిన వారిలో చాలా మందికి టీకాలు వేయలేదు. దీంతో ఎక్కువ మందిలో హైబ్రీడ్ రోగ నిరోధకత లేదు. చాలా ముందే టీకాల పంపిణీ జరిగిన నేపథ్యంలో వాటిని తీసుకున్న వారిలోనూ హైబ్రీడ్ రోగనిరోధకత క్షీణించి ఉంటుంది. జీరో కోవిడ్ పాలసీతో అక్కడ కఠినమైన లాక్డౌన్ విధిస్తూ వచ్చారు. దీంతో సహజసిద్ధమైన రోగ నిరోధకత తక్కువ మందికే ఉంది. తక్కువ మందికి వ్యాక్సినేషన్, ఒక్కసారిగా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడం లాంటి కారణాలతో చైనాలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. వాతావరణం కూడా.. దేశ, కాలమాన పరిస్థితులను బట్టి వైరస్ల ప్రభావం, కదలికలు ఉంటాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న చైనా, జపాన్, కొరియా, అమెరికా దేశాల్లో చలి తీవ్రత ఎక్కువ. వైరస్ వ్యాప్తికి అక్కడి వాతావరణం కూడా ఒక కారణం. ఆయా దేశాల్లో ఏ మేరకు మరణాలు సంభవిస్తున్నాయి? ఆస్పత్రుల్లో ఎంత మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు? అనే అంశాలను బట్టి వైరస్ ప్రభావాన్ని అంచనా వేయాలి. బీఎఫ్–7 వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న దేశాల్లో ఎక్కువ మంది వైరస్ బారిన పడుతున్నారనే వార్తలు మినహా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు వెల్లడి కాలేదు. రెండు మూడు నెలల క్రితమే.. మన దేశంలో బీఎఫ్–7 వేరియంట్ కేసులు రెండు మూడు నెలల కిందటే వెలుగు చూశాయి. అయితే వ్యాప్తి పెద్దగా లేదు. దీని బారిన పడిన వారికి జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, డయేరియా, కీళ్ల నొప్పులు లాంటి సమస్యలు తలెత్తుతాయి. వారికి బూస్టర్ డోస్ తప్పనిసరి రోగ నిరోధకత తక్కువగా ఉండే వారిపై ఈ వేరియంట్ ప్రభావం చూపే అవకాశం ఉంది. 60 ఏళ్లుపైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వ్యక్తులు తప్పనిసరిగా బూస్టర్ డోస్ టీకా తీసుకోవాలి. బూస్టర్ డోస్ తీసుకుని చాలా రోజులైన వారు, రోగ నిరోధకత తక్కువగా ఉన్నవారు నాలుగో డోస్ టీకా తీసుకోవడం కూడా మంచిదే. వీలైనంత వరకు ప్రయాణాలు చేయకుండా ఉండటం ఉత్తమం. అంతర్జాతీయ ప్రయాణాలను విరమించుకోవాలి. జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. -
పూర్తిస్థాయి టీకాలొచ్చే వరకు కాస్త జాగ్రత్త
సాక్షి, అమరావతి: కరోనా నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే టీకాలు అందుబాటులోకి వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ కె.శ్రీనాథ్‌రెడ్డి సూచిస్తున్నారు. ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సహా పలుచోట్ల కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో వ్యాధి తీవ్రత వంటి అంశాలపై ‘సాక్షి’తో శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... ఒమిక్రాన్ పరివారంలోనిదే ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులన్నీ ఒమిక్రాన్ వేరియంట్ పరివారానికి చెందిన వైరస్ రకమే. గతంలో వైరస్ సోకడం, టీకా వేసుకోవడంతో వచ్చిన రోగ నిరోధక శక్తి ఉన్న వారిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపించడం లేదు. దగ్గు, జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలే ఎక్కువ మందిలో ఉంటున్నాయి. తీవ్రమైన జబ్బు చేసి ఆస్పత్రుల్లో చేరడం, మరణించడం వంటి పరిస్థితులు చాలా అరుదుగానే ఉంటున్నాయి. వైరస్ బలహీన పడటంతో ముక్కు, గొంతులోనే ఉండిపోతోంది. ఊపిరితిత్తులపై దాడి చేయడం లేదు. కొంతమందిలో ముక్కు, గొంతు నుంచి వైరస్ కడుపులో చేరుతోంది. దీంతో వాంతులు, కడుపు తిప్పడం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. తీవ్రమయ్యే అవకాశాలు లేకపోలేదు ఒమిక్రాన్ పరివారం వల్ల ఇప్పటివరకూ తీవ్రమైన జబ్బు కలుగుతున్న దాఖలాలు లేకపోయినా వేగంగా వ్యాపించే గుణం మాత్రం కొనసాగుతోంది. ఈ వైరస్ తన స్వరూపాన్ని మార్చుకుని ప్రభావవంతంగా దాడి చేయడానికి ఆస్కారం లేకపోలేదు. గత అనుభవాలు, ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే మరోమారు దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి పెరిగే ఆస్కారం ఉంది. మనకేమీ కాదులే అనే ధీమాకు పోకుండా, ఆందోళన చెందకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. మాస్క్ ధరించడం, సమూహాలకు దూరంగా ఉండటం, ఇతర జాగ్రత్తలు పాటించాలి. మాస్క్ ధరించడం వల్ల ఒక్క కరోనా నుంచే కాకుండా ఇన్ఫ్లుయెంజా, టీబీ, ఇతర రెస్పిరేటరీ వైరస్ల నుంచి కూడా రక్షణ కలుగుతుంది. వైరస్ స్థిమితంగా ఉండకుండా ఎప్పటికప్పుడు స్వరూపాన్ని మార్చుకుంటోంది. రెండు, మూడు నెలలకోసారి కొత్త వేరియంట్ రూపంలో వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. ఈ క్రమంలో స్వీయ రక్షణపై ప్రజలంతా దృష్టి సారించాలి. ప్రతి ఒక్కరు ప్రికాషన్ డోసు టీకా వేయించుకోవాలి. రోగ నిరోధక శక్తి పెంచుకోవడంపై శ్రద్ధ పెట్టాలి. బ్రాడ్‌బాండ్ టీకాపై ప్రయోగాలు విభిన్న కరోనా వేరియంట్ల నుంచి రక్షణ కల్పించే బ్రాడ్‌బాండ్ టీకా తయారీకి సంబంధించి ప్రయోగాలు జరుగుతున్నాయి. యూరప్, యూఎస్ఏ దేశాల్లో ట్రయల్స్ నడుస్తున్నాయి. మన దేశంలో ఇంకా ప్రయోగాలు మొదలు పెట్టలేదు. బ్రాడ్‌బాండ్ టీకాలు అందుబాటులో రావడానికి సమయం పట్టొచ్చు. -
కొత్త వేరియెంట్లు రావని అనుకోవడానికి లేదు
సాక్షి, హైదరాబాద్: ‘కొన్ని దేశాల్లో కోవిడ్ ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఐరోపా, చైనా, దక్షిణ కొరియా, వియత్నాం తదితర దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు. దీన్ని మనం హెచ్చరికగా తీసుకుని భారత్‌కు ఇక ఏమీ కాదనే అతి విశ్వాసాన్ని వీడాలి. మరో నెలరోజులపాటు అప్రమత్తంగా ఉంటూ ఇతర దేశాల్లోని పరిస్థితులను గమనిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ప్రముఖ వైద్యుడు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా.కె. శ్రీనాథ్‌రెడ్డి సూచించారు. ప్రస్తుతం దేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యల్పస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఇంటర్వ్యూలో శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఇతర దేశాల నుంచి ప్రమాదం పొంచే ఉంది ఒమిక్రాన్ వేరే దేశాల్లో ఇంకా పరిభ్రమిస్తోంది. రూపును మార్చుకుంటోంది. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 కాకుండా ఎక్స్, ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్ అనే కొత్త వేరియెంట్లు అధిక ఇన్ఫెక్షన్లు కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అది కొత్తరూపంలో మళ్లీ మనదేశంలోకి ప్రవేశిస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. కాబట్టి ఇప్పుడు మనలో ఏర్పడిన రోగనిరోధక శక్తి మూడు, నాలుగు నెలల తర్వాత కూడా ఉంటుందా అన్నది తెలియదు. అంటే ఆ తర్వాత అధికశాతం మందిలో ఇమ్యూనిటీ స్థాయిలు తగ్గాక కొత్త వేరియెంట్లు ప్రవేశిస్తే పరిస్థితి ఏమిటనేది చెప్పలేం. వైరస్ స్థిమితంగా ఉండటం లేదు ఇప్పుడు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదని కొందరు చెబుతున్నారు. గతంలోనూ థర్డ్‌వేవ్‌కు ఆస్కారం లేదని చెప్పారు. అయితే, ఒమిక్రాన్ వచ్చింది. అందువల్ల ఇక కొత్త వేరియెంట్లు రావనుకోవడానికి లేదు. ఒకవేళ మన దగ్గర 2, 3 నెలల్లోనే కొత్తవి వచ్చినా పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. ఎప్పుడు ఏ వేరియెంట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పలేం. ఎందుకంటే వైరస్ ఇంకా పరిణామ దశలోనే ఉంది. అది ఇంకా పూర్తిగా స్థిమితంగా ఉండటం లేదు. వచ్చే వేరియెంట్లతో తీవ్రత పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. వైరస్ తీరు తేలేదాకా అందరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ రక్షణ చర్యలు తీసుకోవడమే మంచిది. 12 ఏళ్లలోపు వారికి పెద్దగా ప్రమాదం లేదు ప్రపంచవ్యాప్తంగా 12 ఏళ్ల లోపు వారికి తీవ్రమైన జబ్బు చేసే ఆస్కారం చాలా తక్కువగా ఉంది. అందువల్ల వారికి టీకాలు వేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా రూపుదిద్దుకుంటున్న క్రమంలో ఆ వయసు వారికి కరోనా టీకాలు ఇవ్వడం వల్ల అంతకంటే ప్రమాదకర జబ్బులను ఎదుర్కునే శక్తిని తగ్గించినట్టు అవుతుందా అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. ఇప్పటికైతే 12 ఏళ్లలోపు వారికి కోవిడ్ టీకా ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. అన్ని వేరియెంట్లపై పనిచేసేలా టీకాలు ఏ వేరియెంట్‌పై అయినా ప్రభావవంతంగా పనిచేసే టీకా తయారీలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. అయితే కేవలం టీకాపైనే ఆధారపడకుండా మాస్క్‌లు ధరించడం, వ్యక్తిగత, చేతుల పరిశుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలను కొనసాగించాలి. ఇదివరకు జపాన్, దక్షిణ కొరియాల్లో ఎవరికైనా జలుబు చేస్తే మాస్క్‌లు వేసుకుని వెళ్లే వాళ్లు. అలాంటి అలవాట్లను మనం కూడా అలవరచుకోవాలి. వారికి బూస్టర్ డోస్‌లు మంచిది 18 ఏళ్లు నిండిన వారందరికీ బూస్టర్ డోస్‌లు ఇవ్వడం మంచిదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సూచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై పునరాలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే 60 ఏళ్లలోపు వయసు వారిలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక జబ్బులున్న వారికి బూస్టర్‌డోస్‌లు ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఈ కేటగిరిలోని వారు సులభంగా వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది. -
ముగింపునకు మూడో దశ.. అయినా, కరోనా అంతరించిపోవడం భ్రమే!
సాక్షి, అమరావతి: ‘కరోనా వైరస్ పూర్తిగా అంతరించిపోతుంది.. భవిష్యత్‌లో ఇక ఎప్పటికీ మనకు రాదు అని ఆలోచించడం తప్పు. అలా ఆలోచిస్తే భ్రమలో ఉన్నట్లే’నని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితులు, ఉధృతి ఎలా ఉంది తదితర అంశాలను ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మూడో దశ తగ్గుముఖం కరోనా వైరస్ మూడో దశ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. తీవ్రమైన వ్యాధి లక్షణాలు కలిగి, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఆధారంగా వైరస్ ఉధృతిని పరిగణిస్తాం. ప్రస్తుతం వైరస్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య, పాజిటివ్ కేసుల నమోదు తగ్గుతున్నాయి. రెండో దశతో పోలిస్తే మూడో దశలో నష్టం చాలా తక్కువగా ఉంది. ఎండమిక్‌గా భావించలేం వైరస్ స్థిరంగా ఉండి బలహీనంగా మారితే ఎండమిక్ అవుతుంది. ప్రస్తుతం కరోనా వైరస్ స్థిరంగాలేదు. కొత్తకొత్త వేరియంట్లు వస్తున్నాయి. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌లో వైరస్ బలహీనపడింది. ఒకవేళ కొత్త వేరియంట్లు వస్తే.. వాటిల్లోనూ వైరస్ బలహీనంగా ఉంటే ఎండమిక్‌గా భావించవచ్చు. పోస్ట్ కోవిడ్ సమస్యలు తక్కువే ఒమిక్రాన్ వేరియంట్‌కు శరీరంలోకి తీవ్రంగా చొచ్చుకుపోయే తత్వంలేదు. దీంతో ఊపిరితిత్తులు, రక్తంలోకి వైరస్ ప్రవేశించలేదు. దీంతో ఈ వేరియంట్ సోకిన వారిలో పోస్ట్ కోవిడ్ సమస్యలు చాలా తక్కువ. అయినా, ఒమిక్రాన్ సోకిన వారిలో పోస్ట్ కోవిడ్ సమస్యలపై అధ్యయనాలు చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, ఐసీఎంఆర్‌లు అధ్యయనం చేస్తున్నాయి. అదే విధంగా పెద్ద నగరాల్లో పలు ప్రైవేట్ ఆసుపత్రులు అధ్యయనాలు కొనసాగిస్తున్నాయి. హెర్డ్ ఇమ్యూనిటీ లేదు హెర్డ్ ఇమ్యూనిటీ ఇంకా రాలేదు. వ్యాక్సిన్ వేసుకున్న వారు, గతంలో వైరస్ సోకిన వారూ ఒమిక్రాన్ బారిన పడ్డారు. దీన్నిబట్టి చూస్తే హెర్డ్ ఇమ్యూనిటీ ఇంకా రాలేదని చెప్పొచ్చు. వ్యాక్సిన్ వేసుకోవడం, గతంలో ఇన్ఫెక్షన్ బారిన పడటంవల్ల వచ్చిన ఇమ్యూనిటీతో తీవ్రమైన వ్యాధి బారిన పడకుండా మాత్రమే రక్షణ కలుగుతోంది. శ్వాసకోశ (రెస్పిరేటరీ) వైరస్ల తరహాలోనే కరోనా వైరస్ సోకకుండా ఇమ్యూనిటీ అనేది సాధ్యంకాదు. నేటికీ ఫ్లూ బారిన పడకుండా విదేశాల్లోని ప్రజలకు వ్యాక్సిన్లు పంపిణీ చేస్తుంటారు. ఇదే తరహాలో వైరస్ నుంచి రక్షణ పొందడానికి తక్కువ రోగనిరోధక శక్తి ఉండే వృద్ధులు, కోమార్బిడిటీస్‌తో బాధపడే వారు ఇమ్యూనిటీ తగ్గకుండా వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ చర్యలు భేష్ కరోనా వ్యాప్తి కట్టడికి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. ముందస్తు సన్నద్ధత సత్ఫలితాలిస్తోంది. టీనేజర్లకు 100 శాతం వ్యాక్సినేషన్‌ను వేగంగా పూర్తిచేశారు. అలాగే, పెద్దలకు వ్యాక్సిన్ పంపిణీలోను, ప్రభావవంతంగా వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవడంలోనూ ప్రభుత్వం సఫలీకృతం అయింది. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సాంకేతిక కమిటీ పనితీరు ప్రశంసనీయం. -
ఉగాది దాకా జాగ్రత్త!
కరోనా విజృంభణకు చెక్ పెట్టాలంటే.. సంక్రాంతి నుంచి ఉగాది దాకా జాగ్రత్తగా ఉండాల్సిందేనని ప్రముఖ వైద్యుడు, పబ్లిక్‌హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు కె.శ్రీనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. స్వీయ నియంత్రణ చాలా ముఖ్యమని.. మాస్కులు, భౌతికదూరం వంటి కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో పాజిటివ్ కేసులు తగ్గుతున్నా.. ఈ నెలాఖరు దాకా ఇదే పరిస్థితి కొనసాగితేనే కరోనా తగ్గుముఖం పట్టినట్టు భావించాలని చెప్పారు. కొద్దిపాటి ఆంక్షలు విధిస్తే సరిపోతుందని, లాక్డౌన్ అవసరం లేదని పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో శ్రీనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు.. – సాక్షి, హైదరాబాద్ సాక్షి: ప్రస్తుత కరోనా పరిస్థితి ఎలా ఉందంటారు? డాక్టర్ శ్రీనాథ్: కేవలం పాజిటివ్ కేసుల సంఖ్య కాకుండా.. సీరియస్ అయ్యే వారి ఆధారంగా అంచనా వేయాలి. ప్రస్తుతం మొత్తం కేసుల్లో 5–10 శాతం మధ్యలోనే ఆస్పత్రుల్లో చేరుతున్నట్టు తేలింది. ఇప్పుడు తీవ్ర పరిస్థితులు లేకపోయినా.. కరోనాను తక్కువగా అంచనా వేయొద్దు. ఎక్కువ మంది డాక్టర్లు, వైద్య సిబ్బందికి వైరస్ సోకి ఐసోలేషన్‌కు వెళ్లాల్సి వస్తోంది. దీనితో వైద్యసేవలకు అంతరాయం ఏర్పడుతోంది. రాబోయే రోజుల్లో చాలా మందికి పాజిటివ్ రావొచ్చు. ఒమిక్రాన్ వేరియంట్ ముక్కు, గొంతులోనే ఎక్కువగా పెరుగుతోంది. ఊపిరితిత్తుల్లోకి వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువ. అందువల్ల తీవ్ర వ్యాధిగా మారకపోవచ్చు. కానీ వృద్ధులు, తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారిపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. మూడో వేవ్ ఎప్పటికల్లా పీక్కు వెళ్లొచ్చు? ►అందరూ నిబంధనలు పాటిస్తే జనవరి చివరి వరకల్లా కేసులు తగ్గిపోవచ్చు. అజాగ్రత్తగా ఉంటే ఫిబ్రవరి దాకా పెరగవచ్చు. ప్రస్తుతం పెద్ద నగరాల్లో కేసులు తగ్గుముఖం పట్టే సూచనలున్నాయి. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులపై స్పష్టత రాలేదు. సంక్రాంతి, ఇతర సెలవులంటూ ఇష్టారీతిన ప్రయాణాలు చేస్తే అక్కడా కేసులు పెరుగుతాయి. అత్యవసరమైతేనే ప్రయాణం చేయాలి. పండుగలు, పబ్బాలను ఇళ్లలో, కుటుంబ సభ్యుల మధ్యే జరుపుకోవడం మంచిది. యూఎస్, ఇతర దేశాల వంటి పరిస్థితి వస్తుందా? ►నిజానికి అమెరికాలో డెల్టా వ్యాప్తే ఇంకా ముగియలేదు, పైగా ఒమిక్రాన్ విజృంభణతో కేసులు పెరుగుతున్నాయి. అదీగాక అక్కడ 60శాతం మంది ఒక్క డోసే తీసుకున్నారు. అక్కడ ఆస్పత్రుల్లో చేరుతున్న వారిలో చాలా వరకు వ్యాక్సిన్ తీసుకోని వారే. అందువల్ల అమెరికా పరిస్థితి వేరు. ఇక పశ్చిమ దేశాల ప్రభావం మన దేశంపై ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. తొలివేవ్ సమయంలో ఆల్ఫా వేరియెంట్ మనకు ఆలస్యంగా వచ్చింది. రెండో వేవ్‌లో డెల్టా వేరియంట్ ముందు మన దగ్గర వచ్చాకే.. యూఎస్, ఇతర దేశాల్లో ప్రభావం చూపింది. ప్రస్తుతం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేంటి? ►సరైన మాస్కులు పెట్టుకుంటే కరోనా ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. రెండు, మూడు పొరల క్లాత్ మాస్కులు వాడాలి. క్లాత్ మాస్కు, సర్జికల్ మాస్కు కలిపి పెట్టుకుంటే మంచిది. పేదలు, అల్పాదాయ వర్గాలు మాస్కులపై డబ్బులు ఖర్చుపెట్టలేక.. సాధారణ మాస్కులతోనే ఉంటే వైరస్ బారినపడతారు, వ్యాప్తి పెరుగుతుంది. అందువల్ల వారికి ప్రభుత్వాలే ఉచితంగా సర్జికల్, ఇతర మాస్కులు అందజేయాలి. ఒమిక్రానే చివరి వేరియెంట్ అనుకోవచ్చా? ►ఒమిక్రానే కరోనా చివరి వేరియెంట్ అనుకుంటే.. అత్యధిక మందికి సోకి ఇమ్యూనిటీ రావొచ్చు. రెండు, మూడు నెలల్లోగా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు కుదుటపడొచ్చు. కానీ మరోవేరియెంట్ వచ్చే ప్రమాదం లేదని చెప్పలేం. అందువల్ల కనీసం ఏప్రిల్‌దాకా జాగ్రత్తలు పాటించాలి. -
భయం వద్దు.. భద్రత వీడొద్దు
సాక్షి, అమరావతి: ‘ఒమిక్రాన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగని నిర్లక్ష్యంగా ఉండకూడదు. విదేశాలతో పోలిస్తే భారత్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి వేగం తక్కువగా ఉంది. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. కానీ, ప్రజలు అప్రమత్తంగా ఉండటం మాత్రం ముఖ్యం. వైరస్ బారిన పడకుండా ఎవరికి వారు భద్రత చర్యలు తీసుకోవాలి. అలసత్వం వద్దు’ అని ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి చెప్పారు. భారత దేశంలోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ తీవ్రత ఏ విధంగా ఉంటుంది? ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలను ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సాక్షి: ఒమిక్రాన్ వ్యాప్తి ఏ విధంగా ఉంది? డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి: విదేశాలతో పోలిస్తే భారత్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి వేగం తక్కువగా ఉంది. విదేశాల్లో వాతావరణ పరిస్థితులు, రోగ నిరోధక శక్తి వైరస్ వ్యాప్తిపై ప్రభావం చూపుతాయి. భారత్‌తో పోలిస్తే విదేశాల్లో ప్రజల సగటు వయసు ఎక్కువ. మన దేశంలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య జనాభాలో 6 శాతమే. అదే ఇటలీలో 27 శాతం, అమెరికాలో 16 శాతం. ఇలా చాలా దేశాల్లో మనకన్నా ఎక్కువగా ఉంది. దీనికి తోడు రక్తపోటు, మధుమేహం తరహా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) ప్రభావితులు విదేశాల్లో ఎక్కువగా ఉంటారు. అందువల్లే అక్కడ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. భారతదేశంలో వాతావరణం, రోగ నిరోధక శక్తి, ఇతరత్రా అంశాల కారణంగా ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉండదు. సాక్షి: కరోనా నుంచి టీ లింఫోసైట్స్ రక్షణ కల్పించినట్టు గతంలో వెల్లడైంది. ఒమిక్రాన్ నుంచి టీ లింఫోసైట్స్ రక్షణ కల్పిస్తాయా? శ్రీనాథ్‌రెడ్డి: యాంటీబాడీలు తగ్గినప్పటికీ టీ లింఫోసైట్స్ ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పిస్తున్నట్టు దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. యాంటీబాడీలు మూడు నుంచి ఆరు నెలల్లో తగ్గుతున్నాయి. కొందరిలో 9 నెలలు ఉంటున్నాయి. టీకాలు వేసుకున్న వారితో పోలిస్తే గతంలో కరోనా వచ్చి తగ్గిన వారిలో టీ లింఫోసైట్స్ చురుగ్గా పనిచేస్తాయి. ఇవి శరీరంలో పోలీస్‌లా వ్యవహరిస్తాయి. వైరస్లు, బాక్టీరియాలు దాడి చేసినప్పుడు వాటిని నియంత్రిస్తాయి. సాక్షి: యాంటీబాడీలు త్వరగా తగ్గిపోవడానికి ఆస్కారం ఉందా? శ్రీనాథ్‌రెడ్డి: క్యాన్సర్, ఇతర వ్యాధులకు మందులు వాడే వారు, పౌష్టికాహారం తీసుకోని వారిలో యాంటీబాడీలు త్వరగా తగ్గిపోతాయి. అందువల్లే ప్రభుత్వం 60 ఏళ్లు పైబడి, జబ్బులతో బాధపడుతున్న వారికి ప్రికాషన్ డోసు టీకా పంపిణీ చేపట్టబోతోంది. వారందరూ ఈ టీకా వేయించుకుంటే వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు ప్రభుత్వం టీకా పంపిణీ చేయబోతోంది. అపోహలు వీడి అందరూ టీకా తీసుకోవాలి. సాక్షి: ఒమిక్రాన్‌తో ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడతాయా? శ్రీనాథ్‌రెడ్డి: ఢిల్లీ, మహారాష్ట్ర, సహా పలు రాష్ట్రాల్లో ఎక్కువగా ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి. అక్కడ ఆసుపత్రులకు వెళ్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. వైరస్ సోకిన వారిలో ఎక్కువ మందిలో లక్షణాలు కనిపించడంలేదు. పెద్దగా ఆసుపత్రులపై ఒత్తిడి లేదు. విదేశాల్లో డెల్టా, ఒమిక్రాన్ కలిసిన కేసులు నమోదవుతుండటంతో అక్కడ ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. సాక్షి: ఒమిక్రాన్ నేపథ్యంలో ఎటువంటి మాస్క్‌లు ధరించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శ్రీనాథ్ రెడ్డి: ఆస్కారం ఉన్న వాళ్లు ఎన్ 95 మాస్క్‌లు వాడితే మంచిది. లేని పక్షంలో డబుల్ లేయర్ మాస్క్‌లు సురక్షితం. గుడ్డ, సర్జికల్ మాస్క్‌లు ఏవైనా సరే డబుల్ లేయర్ ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే సంక్రాంతి నాటికి కేసుల సంఖ్య పెరుగుతుంది. -
క్లిష్ట దశలో ఉన్నాం.. థర్డ్ వేవ్ మొదలై ఉండొచ్చు
ప్రమాదం పొంచి ఉంది.. మళ్లీ మునుపటిలా రోజువారీ జీవనం గడపాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ ఇంకా ప్రమాదం పొంచి ఉన్నందున మధ్యేమార్గంగా మెలగాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది చివరిదాకా అప్రమత్తంగా ఉండాలి. మాస్కులు, భౌతికదూరం, ఇతర జాగ్రత్తలు తప్పనిసరి. పండుగలు, పబ్బాల్లో జాగ్రత్త.. గత ఏడాది కరోనా తొలిదశ చివరలో ఆగస్టు–అక్టోబర్ మధ్య వరుసగా పండుగలు వచ్చినా.. మాస్కులు, ఇతర జాగ్రత్తలు పాటించడం వల్ల వైరస్ నియంత్రణలోనే ఉంది. తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రెండో వేవ్‌కు దారితీసింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. చాలా రోజులుగా ఇండ్లకే పరిమితమైన జనం.. ఇటీవల బయట తిరగడం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి కేసుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారికి సంబంధించి ప్రస్తుతం సున్నితమైన, క్లిష్టదశలో ఉన్నామని ప్రముఖ వైద్యుడు, పబ్లిక్‌హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కె.శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు ఒకేలా లేవని.. దేశంలో కొన్నిచోట్ల ఇప్పటికే కరోనా మూడో వేవ్ మొదలై ఉండొచ్చని చెప్పారు. కరోనా మహమ్మారి నియంత్రణకు వ్యాక్సినేషన్ కీలకమని.. దేశంలో 70, 80 శాతం మందికి టీకాలు వేసే వరకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్కులు, భౌతికదూరం వంటి జాగ్రత్తలతోపాటు ఇండ్లు, ఆఫీసులు, ఇతర చోట్ల గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చూసుకోవడం కూడా కీలకమన్నది గుర్తుంచుకోవాలని చెప్పారు. దేశంలో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకతను కోవిడ్ మహమ్మారి గుర్తు చేసిందన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కె.శ్రీనాథ్‌రెడ్డి ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలు వెల్లడించారు. ఆ వివరాలివీ.. సాక్షి: దేశంలో థర్డ్ వేవ్ మొదలైందా? పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్ శ్రీనాథ్: దేశంలోని అన్నిచోట్లా ఇంకా కరోనా రెండో వేవ్ ముగియలేదు. ముగిసిన చోట కొద్దిరోజులు తెరిపి ఇచ్చి.. మళ్లీ కేసులు పెరిగితే థర్డ్ వేవ్ అనుకోవచ్చు. కేరళ, ఈశాన్య రాష్ట్రాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా రెండో వేవ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో రెండో వేవ్ ఆలస్యంగా మొదలైంది. కేసులు పూర్తిగా తగ్గాయని భావించిన బెంగళూరు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, బెంగాల్, గుజరాత్ తదితర చోట్ల మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అంటే ఆయా ప్రాంతాల్లో మూడో వేవ్ మొదలైందని అనుకోవచ్చు. మూడో వేవ్ తీవ్రత ఎలా ఉంటుంది? కొత్త స్ట్రెయిన్లు, వేరియెంట్లు వస్తే ఎలా? శ్రీనాథ్: మొత్తం దేశవ్యాప్తంగా ఒకే విధంగా మూడో వేవ్ వస్తుందనేది సరైన అవగాహన కాదు. ఒకేసారి దాడి చేయకుండా దశలుగా వస్తోంది. కొన్నిసార్లు తక్కువ, ఎక్కువ ప్రభావమున్న దశలు ఉంటున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో రెండో వేవ్ సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. ఇక మూడో వేవ్ కొన్నిచోట్ల ముందుగానే మొదలైందని, చాలాచోట్ల ఇంకా ప్రారంభం కాలేదని భావించాల్సి ఉంటుంది. ఇదొక సంక్లిష్టమైన దశగా భావించొచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియెంట్ ప్రబలంగా వ్యాపిస్తోంది. అనేక దేశాల్లో ముఖ్యమైన వేరియెంట్‌గా ఉంది. వ్యాక్సినేషన్ పెంచి దానిని నియంత్రించేందుకు ప్రయత్నించే కొద్దీ మనుగడ కోసం వైరస్ మరిన్ని మార్పులు చేసుకునేందుకు (మ్యూటేట్ అయ్యేందుకు) ప్రయత్నిస్తుంది. అందువల్ల వృద్ధులు, తీవ్రంగా జబ్బు చేసిన వారిలో మ్యుటేషన్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త మ్యుటేషన్లు, వేరియంట్లు ఎంత ప్రభావం చూపుతాయి, వ్యాప్తి ఏమేర పెరుగుతుంది అన్నది చూడాలి. డెల్టా వేరియంట్ నుంచి మరింత ప్రమాదకరమైన మ్యూటేషన్లు రాకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితులను ఎలా అంచనా వేయాలి? ఏం చేయాలి? శ్రీనాథ్: మొత్తంగా ఎంతమందికి ఇమ్యూనిటీ వచ్చింది? ఎంతవరకు వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాం? గుంపులుగా తిరగడం, మాస్క్ ధరించకపోవడం వంటి జాగ్రత్తలను ప్రజలు ఎంతవరకు ఆచరిస్తున్నారు? ఏ వేరియెంట్, ఎంతగా వ్యాప్తి చెందుతోంది..? వంటి అంశాలపై అంచనాలు ఆధారపడి ఉంటాయి. అయితే ఈ పరిస్థితులు ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా ఉన్నందున అన్నింటినీ ఒక గాటన కట్టి.. మూడో వేవ్, వ్యాప్తి, ఇతర అంచనాలు వేయలేం. ఏ రాష్ట్రాల్లో కేసులు అదుపులో ఉన్నాయి, ఎక్కడ పెరుగుతున్నాయనేదీ పరిశీలించాల్సి ఉంటుంది. మళ్లీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వెళ్తుంటే.. కరోనా మూడోవేవ్ వచ్చినట్టుగానే భావించాలి. కరోనా రెండో వేవ్ నుంచి ఏమైనా నేర్చుకున్నామంటారా? శ్రీనాథ్: రెండో వేవ్ తీవ్ర ప్రభావం చూపించడంతో ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా కొంతవరకు పాఠాలు నేర్చుకున్నారు. వైద్యారోగ్యసేవలు పెంచేదిశగా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. హాస్పిటల్ సర్వీసెస్, ఎక్విప్మెంట్, ఆక్సిజన్ సరఫరా పెంచేందుకు అన్నిచోట్లా సన్నాహాలు చేస్తున్నారు. కానీ ప్రాథమిక వైద్యసేవల విషయంలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ఆ వ్యవస్థ ఇంకా పటిష్టం కాలేదు. హోంకేర్, కమ్యూనిటీ కేర్ విషయంలో అవసరమైన ప్రయత్నాలు చేయడం లేదు. దేశంలో వ్యాక్సినేషన్ పరిస్థితి ఏమిటి? శ్రీనాథ్: ఈ ఏడాది మొదట్లో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగం పెంచాల్సిన సమయంలోనే ప్రభుత్వ స్థాయిలో తప్పటగుడులతో చిక్కులు ఎదురయ్యాయి. ఈ ఏడాది జనవరిలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోవిడ్ సమస్య ఇక ముగిసినట్టేనని భావించాయి. అందువల్ల అత్యవసరంగా వ్యాక్సిన్ల ఉత్పత్తి, దిగుమతి అవసరం లేదని.. దేశంలో ఉత్పత్తయ్యే వ్యాక్సిన్లను ఉపయోగిస్తూ వెళితే చాలని అభిప్రాయపడ్డాయి. మొదట 45ఏళ్లు పైబడిన వారికి వాడదామని, ఆలోగా మన దగ్గరి ఉత్పత్తులు పెరుగుతాయని అనుకున్నాయి. కానీ ఈ అంచనాలను తలకిందులు చేస్తూ రెండో వేవ్ పంజా విసిరడంతో మళ్లీ కొత్త చర్యలు మొదలుపెట్టారు. తొలుత ప్రైవేట్ రంగాన్ని వ్యాక్సినేషన్లో భాగస్వాములను చేయకపోవడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాలకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ నిల్వలు చేరుకునేలా చూడాలి. ప్రజలకు వ్యాక్సిన్లపై విశ్వాసం కలిగించి, తీసుకునేలా చూడాలి. వ్యాక్సినేషన్ పూర్తయితే మళ్లీ సాధారణ జీవితం గడిపేందుకు వీలవుతుందని నచ్చజెప్పాలి. సాక్షి: దేశంలో థర్డ్ వేవ్ మొదలైందా? పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్ శ్రీనాథ్: దేశంలోని అన్నిచోట్లా ఇంకా కరోనా రెండో వేవ్ ముగియలేదు. ముగిసిన చోట కొద్దిరోజులు తెరిపి ఇచ్చి.. మళ్లీ కేసులు పెరిగితే థర్డ్ వేవ్ అనుకోవచ్చు. కేరళ, ఈశాన్య రాష్ట్రాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా రెండో వేవ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో రెండో వేవ్ ఆలస్యంగా మొదలైంది. కేసులు పూర్తిగా తగ్గాయని భావించిన బెంగళూరు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, బెంగాల్, గుజరాత్ తదితర చోట్ల మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అంటే ఆయా ప్రాంతాల్లో మూడో వేవ్ మొదలైందని అనుకోవచ్చు. -
ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో కోర్సులు నిర్వహిస్తాం: శ్రీనాథ్‌రెడ్డి
సాక్షి, విజయవాడ: ప్రెస్ అకాడమీ సొంతంగా సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తుందని ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. శిక్షణా కార్యక్రమంలో 6వేల మంది జర్నలిస్టులు పాల్గొన్నారని చెప్పారు. ఈయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జర్నలిస్టుల స్థితిగతులపై సమీక్షించామని, జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం కోసం కృషి చేస్తామని తెలిపారు. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా సర్టిఫికెట్ కోర్సు పెడుతున్నామని చెప్పారు. ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో కోర్సులు నిర్వహిస్తామని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నాలుగు సబ్జెక్ట్‌లను రూపొందించామని వివరించారు. విక్రమసింహపురి వర్సిటీ ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. గ్రామీణ జర్నలిస్టులకు మేలు చేసేలా అనేక పుస్తకాలు కూడా ప్రచురించామని, జర్నలిస్టులు వృత్తిలో భాగంగా యూనివర్సిటీలో చదివేందుకు కుదరడం లేదని చెప్పారు. అలాంటి వారికి మేలు చేసేలా యూజీసీ నిబంధనలకు అనుగుణంగా 3 నెలల సర్టిఫికెట్ కోర్స్ పెడుతున్నామని చెప్పారు. ప్రెస్ అకాడెమీ అద్వర్యంలో ఈ కోర్సులను నిర్వహిస్తామని, ఆన్లైన్ ద్వారా క్లాసులు నిర్వహిస్తామన్నారు. వాటిలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నాలుగు సబ్జెక్ట్స్ రూపొందించామని, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లతో పాటు సీనియర్ జర్నలిస్టులతో క్లాసులు చెప్పిస్తామన్నారు. విక్రమసింహపురి యూనివర్సిటీ 3 నెలల తర్వాత పరీక్షలు నిర్వహిస్తుందని, జర్నలిస్టులతో పాటు ఆసక్తి ఉండి డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. జర్నలిస్టులకు 1500, నాన్ జర్నలిస్టులకు 3000 ఫీజ్ ఉంటుందని, జర్నలిస్టుల ఫీజుతో సగం అకాడెమీ భరిస్తుందన్నారు. దేశంలో ఇంత తక్కువ ఫీజుతో సర్టిఫికెట్ కోర్స్ నిర్వహించడం ఇదే ప్రధమని, మంచి ప్రతిభ చూపిన వారికి ఇంటర్న్‌షిప్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మంచి ప్రతిభ ఉంటే ఉద్యోగాలు ఇప్పించడంలోనూ అకాడెమీ కృషి చేస్తోందని గుర్తుచేశారు. విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రారర్ ఎల్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే జర్నలిస్టులు యూనివర్సిటీల్లో జర్నలిజం చేసేందుకు ఎంఓయూలు చేసుకుని ఫీజ్ రాయితీ ఇస్తున్నామన్నారు. ఇప్పుడు ఈ సర్టిఫికెట్ కోర్స్ వల్ల జర్నలిస్టులకు, నాన్ జర్నలిస్టులకు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. -
ప్రెస్ అకాడమీ సొంతంగా సర్టిఫికేట్ కోర్సు నిర్వహిస్తుంది
-
సూపర్ వ్యాక్సిన్.. అన్ని వేరియంట్లకు అడ్డుకట్ట
►డెల్టా ప్లస్‌కు వ్యాపించే సామర్థ్యం ఎక్కువగా ఉన్నా.. అందుకు మనం ఆస్కారం ఇస్తున్నామా అన్నది ముఖ్యం. లాక్డౌన్ సడలించారన్న ఉద్దేశంతో జనం గుమిగూడటం, కొవిడ్ నిబంధనలు పాటించకుండా ఇష్టమొచ్చినట్టు తిరిగితే అందరినీ ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ►ప్రజలు గుంపులుగా చేరకుండా ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే.. ఇంట్లో వారిని, ఇతర ప్రైమరీ కాంటాక్టులను విడిగా ఉంచి పరీక్షలు చేయించాలి. వ్యాక్సినేషన్ వేగం పెంచాలి. మార్కెట్లు, ఆఫీసులు వంటి చోట్ల పూర్తిగా భౌతికదూరం పాటించడం సాధ్యం కాకపోవచ్చు. కచ్చితంగా మాస్కులు ధరించడం, శానిటైజేషన్ పాటించేలా చూడాలి. ►ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లను ఎదుర్కొనేలా కొత్త వ్యాక్సిన్లపై పరిశోధనలు జరుగుతున్నాయి. వాస్తవానికి వైరస్ ఉపరితలంపై ఉండే స్పైక్ ప్రోటీన్‌తో పోల్చితే.. అంతర్గతంగా ఉండే యాంటీ జెన్లు నెమ్మదిగా మ్యుటేట్ అవుతాయి. అందువల్ల స్పైక్ ప్రోటీన్‌తోపాటు యాంటీజెన్లపైనా పనిచేసేలా.. భిన్నమైన వేరియెంట్లను ఎదుర్కొనేలా కొత్త వ్యాక్సిన్లను రూపొందిస్తున్నారు. అమెరికాలో ఇలాంటి సూపర్ వ్యాక్సిన్‌కు సంబంధించి మార్చిలోనే ట్రయల్స్ మొదలయ్యాయి. దీనిపై తదుపరి దశల ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి సూపర్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక శాస్త్రవేత్త కేథరిన్ జె వూ వెల్లడిస్తున్న వివరాల ప్రకారం.. మల్టీ యాంటీజెన్ వ్యాక్సిన్లను పరీక్షిస్తున్నారు. స్పైక్ ప్రోట్రీన్, న్యూక్లియో క్యాప్సిడ్, ఇంటీరియర్ వైరల్ యాంటీజెన్లతో కూడిన ‘ఓఆర్ఎఫ్–3ఏ’లను సమ్మిళితం చేసి ఆ వ్యాక్సిన్లు తయారు చేస్తున్నారు. ఇంటర్వ్యూ: డాక్టర్ కె.శ్రీనాథ్‌రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ఎపిడమాలజిస్ట్ సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని.. వైరస్ తాకిడి మాత్రమే తగ్గిందని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ఎపిడమాలజిస్ట్ డాక్టర్ కె.శ్రీనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రమాదం పక్కనే పొంచి ఉందనే విషయాన్ని మరిచిపోవద్దని, లాక్డౌన్ సడలింపును ఆసరాగా తీసుకుని ఇష్టమొచ్చినట్టు వ్యవహరించ వద్దని సూచించారు. పూర్తిగా సాధారణ పరిస్థితులు ఏర్పడేదాకా అన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. అన్ని వేరియంట్లపై పనిచేసే సూపర్ వ్యాక్సిన్‌పై ప్రయోగాలు జరుగుతున్నాయని, ఏడాది చివరినాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. దేశంలో మూడో వేవ్ వస్తుందన్న అంచనాలు, కొత్తగా డెల్టా ప్లస్ కేసుల నమోదు, వ్యాక్సినేషన్ తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై శ్రీనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. దీని ముఖ్యాంశాలు.. సాక్షి: డెల్టా ప్లస్ వేరియంట్ ఏ మేరకు ప్రమాదకరం? కె.శ్రీనాథ్‌రెడ్డి: డెల్టా ప్లస్ వేరియంట్‌కు సంబంధించి ఇంకా పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో లేదు. మనదేశంలోనే కాదు పలు ఇతర దేశాల్లోనూ డెల్టా ప్లస్ కేసులొచ్చాయి. కొత్త వేరియంట్‌తో పెద్ద ప్రమాదం వస్తుందనేందుకు ప్రస్తుతం ఆధారాలేమీ లేవు. వ్యాప్తి ఎక్కువగా ఉండొచ్చన్న అంచనాలు మాత్రం ఉన్నాయి. ఈ వేరియంట్‌పై వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉంటుందన్నది తేలాల్సి ఉంది. గతేడాది వ్యాక్సిన్ లేకపోయినా లాక్డౌన్లు, కఠినమైన నిబంధనలు పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని చాలా వరకు ఆపగలిగాం. రెండో వేవ్‌లో కొత్త వేరియంట్లు రావడం, జాగ్రత్తలు సరిగా పాటించకపోవడం వల్ల వైరస్ వ్యాప్తికి మనమే ఆస్కారం ఇచ్చాం. నిజానికి వైరస్లలో మార్పులు సహజం. అయితే కొత్త వేరియంట్‌గా మారినపుడు తీవ్రత (విరులెన్స్) పెరిగిందా, తగ్గిందా అనేది ముఖ్యం. సాధారణంగా వైరస్ ఇన్ఫెక్టివిటీ (వ్యాప్తి సామర్థ్యం)ని పెంచుకున్నప్పుడు విరులెన్స్ తగ్గు తుంది. ఎవల్యూషనరీ బయాలజీలో భాగంగానే ఇది జరుగుతుంది. అప్పటికే ఉన్న వ్యాక్సిన్లు కొత్త వేరియెంట్లపై కాస్త తక్కువ ప్రభావం చూపొచ్చు తప్ప.. వ్యాధి తీవ్రంగా మారకుండా ఉంటుంది. దేశంలో జీనోమ్ సీక్వెన్సింగ్ పరిస్థితి ఏమిటి? మన దేశంలో వైరస్ శాంపిళ్ల జీనోమ్ సీక్వెన్సింగ్‌ను మరింతగా పెంచాలి. యూకే వేరియంట్ వ్యాప్తితో జనవరిలో భారత్‌లో ఈ సీక్వెన్సింగ్ ప్రారంభించారు. కానీ రెండో వేవ్ రాదనే భ్రమలో జీనోమ్ సీక్వెన్సింగ్‌ను భారీ స్థాయిలో చేపట్టేందుకు ఏర్పాట్లు చేయలేదు. మొత్తం శాంపిళ్లలో కనీసం 5 శాతమైనా సీక్వెన్సింగ్ చేయాలి. వైరస్ వేరియంట్లను గుర్తించి ఆయా చోట్ల నియంత్రణ చర్యలు చేపట్టాలి. కానీ ప్రస్తుతం అది జరగడం లేదు. పబ్లిక్ హెల్త్ సిస్టమ్ బలోపేతమెలా? కోవిడ్ నేపథ్యంలో దేశంలో వైద్య మౌలిక సదుపా యాలను పెంచుకోవాల్సి ఉంది. 2021–22 బడ్జెట్లో కేంద్రం, 15వ ఆర్థిక సంఘం నుంచి ప్రాథమిక వైద్య సదుపాయాల పెంపు, అత్యవసర సేవల కోసం నిధులు కేటాయించారు. ప్రభుత్వాలు పర్యవేక్షక వ్యవస్థను బలోపేతం చేసి.. కొత్త వైరస్లు, ఇతర సూక్ష్మజీవుల వ్యాప్తిపై నిఘా పెట్టాలి. కొత్త వైరస్లు, మైక్రోబ్‌లను గుర్తిస్తే.. వెంటనే పరిశోధన చేపట్టి, వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవచ్చు. ప్రస్తుతం రెండో వేవ్ తగ్గుముఖం పట్టినందున.. వెంటనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక వైద్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రుల బలోపేతానికి చర్యలు చేపట్టాలి. పర్యవేక్షక వ్యవస్థను పటిష్టపరచడం, అన్నిచోట్లా క్రిటికల్ కేర్ విభాగాల ఏర్పాటు మంచిది. వైద్య రంగానికి నిధుల కేటాయింపులు పెంచాలి. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనూ ఈ చర్యలు తీసుకోవాలి. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనా మహమ్మారి నుంచి రక్షణకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలి. దానితోపాటు మాస్కులు, ఇతర జాగ్రత్తలు పాటించడం అనివార్యం. మాస్కులు ధరించకపోతే తమకే కాదు, ఇతరులకూ నష్టం చేసిన వారవుతారన్న విషయాన్ని గ్రహించాలి. పశ్చిమ దేశాల్లో మాస్కులు కచ్చితంగా పెట్టుకోవడం వల్ల.. కరోనాను తప్పించుకోవడంతోపాటు అక్కడ సీజనల్‌గా వచ్చే ఫ్లూ వ్యాధులు కూడా గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. వ్యాక్సిన్లు వేసుకుంటే బయటపడొచ్చా? దేశవ్యాప్తంగా కనీసం 50శాతంపైగా వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు అప్రమత్తత అవసరం. జాగ్రత్తగా ఉండటమంటే పూర్తిగా తలుపులు మూసుకుని, ఇళ్లలోనే ఉండాలని కాదు. వారం వారం పోల్చి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయా, సీరియస్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయా, ఆస్పత్రులకు తాకిడి ఎక్కువగా ఉందా, మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోందా అన్న అంశాలను బట్టి కరోనా తీవ్రతను అంచనా వేయొచ్చు. కేసులు, సీరియస్ పేషెంట్ల సంఖ్య పెరిగితే మళ్లీ కఠిన నిబంధనలు అమలు చేయాల్సి వస్తుంది. కొత్త వేరియంట్లకు సంబంధించి ఏ అంశాలపై దృష్టి పెట్టాలి? కొత్త వేరియంట్ల వ్యాప్తి సామర్థ్యం(ఇన్ఫెక్టివిటీ), తీవ్రత ఎలా ఉంటుందో గమనించాలి. అవి ఇన్ఫెక్టివిటీ పెంచుకుంటే ఎక్కువ మందిని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా జనం గుమిగూడితేనే వైరస్ వ్యాప్తికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దక్షిణ కొరియాలో జనం గుమిగూడిన చోట్లనే మరో వేవ్ వచ్చింది. ఆస్ట్రేలియాలో కొత్తగా కేసులు నమోదైన సిడ్నీలోనూ ఎయిర్‌పోర్ట్‌కు టాక్సీ నడిపే డ్రైవర్లు వ్యాక్సిన్ తీసుకోకపోవడం, మాస్కులు సరిగా పెట్టుకోకపోవడం వల్ల విమాన ప్రయాణికుల నుంచి వైరస్ సోకింది. కేసులు పెరిగాయి. దాంతో సిడ్నీ న్యూసౌత్‌వేల్స్‌లో మళ్లీ లాక్డౌన్ పెట్టారు. ఇలాంటి ఘటనలతో మనవాళ్లకు జ్ఞానోదయం కలగాలి. కనీసం 50–60 శాతం దాకా వ్యాక్సినేషన్ పూర్తయ్యే దాకా జాగ్రత్తలు పాటించాలి. ఉన్నవేకాదు.. కొత్తగా పుట్టుకొచ్చే వాటికీ సూపర్ చెక్ సాధారణంగానే వైరస్లు తరచూ మ్యుటేషన్ చెంది కొత్త వేరియంట్లు ఏర్పడుతుంటాయి. అదే తరహాలో కరోనా వైరస్ చాలా మ్యూటేషన్లు చెందింది. ప్రస్తుతం డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని రకాల కరోనా వేరియంట్లపై పనిచేసే సూపర్ వ్యాక్సిన్‌ను.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాకు చెందిన ‘గిల్లింగ్స్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్’శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగశాలలో ఎలుకలు, ఇతర జంతువులపై పరిశీలించగా.. మంచి ఫలితాలు ఇస్తున్నట్టు గుర్తించారు. హైబ్రిడ్ ఆర్ఎన్ఏ టెక్నాలజీతో.. నార్త్ కరోలినా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మొదట ఫైజర్, మొడెర్నా కంపెనీల తరహాలో ‘ఎంఆర్ఎన్ఏ’టెక్నాలజీతో వ్యాక్సిన్ రూపొందించాలని భావించారు. ఆ దిశగా ప్రయోగాలు మొదలుపెట్టారు. అయితే వైరస్ వేరియంట్లు మారినప్పుడు కూడా వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేసేందుకు ఎక్కువ సంఖ్యలో కరోనా వేరియంట్ల ‘ఆర్ఎన్ఏ’లను తీసుకుని.. ‘హైబ్రిడ్ ఎంఆర్ఎన్ఏ’ఎన్కోడింగ్ను అభివృద్ధి చేశారు. దీనితో రూపొందించిన వ్యాక్సిన్‌ను ప్రయోగశాలలో ఎలుకలపై పరీక్షించారు. శరీరంలో రోగనిరోధక శక్తిని తప్పించుకునేలా మ్యూటేట్ అయిన దక్షిణాఫ్రికా బీటా రకం (బీ.1.351) కరోనాపైనా వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తోందని గుర్తించారు. వేరియంట్లు మారినా.. ఇప్పుడున్న వేరియంట్లే కాదు భవిష్యత్తులో కొత్తగా పుట్టుకొచ్చే కరోనా వేరియంట్లను కూడా ఈ సూపర్ వ్యాక్సిన్ ఎదుర్కొంటుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డేవిడ్ ఆర్ మార్టినెజ్ చెప్పారు. కరోనా స్పైక్ ప్రొటీన్‌తోపాటు అంతర్గతంగా ఉండే న్యూక్లియోటైడ్, యాంటీ జెన్లనూ ఈ వ్యాక్సిన్ టార్గెట్ చేస్తుందని వివరించారు. ఈ సూపర్ వ్యాక్సిన్‌పై త్వరలోనే హ్యూమన్ ట్రయల్స్ చేపడతామని తెలిపారు. తమ పరిశోధన ఆధారంగా భవిష్యత్తులో ‘సార్స్ కోవ్–3’వచ్చినా కూడా సులువుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని వివరించారు. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
థర్డ్‌వేవ్: కెరటమా.. ఉప్పెనా? మీ చేతుల్లోనే ఉంది
ప్రస్తుతం కేసులు, మరణాల తగ్గుదలను బట్టి చూస్తే జూన్ చివరికల్లా కరోనా నియంత్రణలోకి రావొచ్చు. అయితే లాక్డౌన్లో ఉన్నపుడు సహజంగానే ఇవి తగ్గుతాయి కాబట్టి ఎత్తేశాక వచ్చే వాస్తవ పరిస్థితుల ఆధారం గా మళ్లీ అంచనా వేయాలి. ప్రజలు మళ్లీ మామూలుగా తిరిగేస్తే వైరస్ ముప్పు మళ్లీ మొదటికొస్తుం ది. అందువల్లే అంచలంచెలుగా లాక్డౌన్ సడలిం చాలి. దీంతోపాటు పెద్దయెత్తున పరీక్షలు చేయాలి. అప్పుడే ఇది ఏమేరకు కంట్రోల్లోకి వచ్చిందనేది తెలుస్తుంది. రెండోదశ తగ్గుముఖం పట్టే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. కాని అది వెను వెంటనే వెనక్కు మళ్లుతుందా లేక మరికొంతకాలం పరీక్షిస్తుందా అన్న విషయాన్ని పరిశీలించాల్సి ఉంది. వ్యాక్సిన్ సన్నాహాల్లో విఫలం వ్యాక్సినేషన్ మరింతగా అందుబాటులోకి వచ్చేం దుకు అవసరమైన సన్నాహాలు చేసుకోలేకపోయాం. దానివల్ల ప్రైవేట్ రంగంలో టీకా కేంద్రాలు మూతపడ్డాయి. లాక్డౌన్ సమయంలో గ్రామీణ ప్రాంతాలకు, చిన్న పట్టణాలకు వ్యాక్సిన్లను అందించడానికి అనువైన పరిస్థితుల్లో మనం లేము. లాక్డౌన్ సడలింపులు ఇచ్చినప్పుడైనా పెద్ద పట్టణాలకు కాకుండా చిన్న నగరాల్లోనూ దీని వేగాన్ని పెంచాలి. ఆ తర్వాత గ్రామాల్లోనూ వ్యాక్సిన్లు అందించాలి. ఏ గ్రామాల్లోనైతే ఆందోళనకర పరిస్థితులున్నాయో అక్కడ అందజేయాలి. అయితే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లకు జూలై వరకు వేచి ఉండాల్సిందే.. తప్పుడు అంచనాలతోనే ప్రస్తుత పరిస్థితి సెకండ్‌వేవ్ రాదనే భావన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ని చాలామంది నిపుణుల్లో ఏర్పడడం వల్లనే ప్రస్తు త పరిస్థితి ఏర్పడి ఉండొచ్చునని అనుకుంటున్నా. జనవరి, ఫిబ్రవరిలో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గి పోయిందనే తప్పుడు అంచనాలు, భ్రమలతో పొరపాటు చేశాం. ఇప్పుడైనా మళ్లీ ఆ పొరబాటు చేయకుండా టీకా ఉత్పత్తి పెంచుకునేందుకు, దిగుమతులు చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఇంగ్లండ్‌లో వ్యవధి తగ్గించారు టీకాల మొదటి, రెండో వ్యాక్సిన్ డోస్‌ల మధ్య కాలవ్యవధి పెంపు విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. రూపాంతరం చెందిన వైరస్ వ్యాప్తి, ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి దానిపై వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. అందువల్ల రెండో డోస్ వ్యవధి మరీ ఆలస్యం చేయకూడదన్నది కొందరి అభిప్రాయం. ఇంగ్లండ్‌లో అందుబాటులోకి వచ్చిన కొత్త డేటా కూడా ఇదే విషయం స్పష్టం చేస్తోంది. అక్కడి నిపుణులు రెండోడోస్ వ్యవధిని 8–12 వారాలకు తగ్గించారు. మన దేశంలోనూ అలానే చేయాలని నేను కూడా భావిస్తున్నాను. కానీ 12 నుంచి 16 వారాల వ్యవధి అనేది ప్రభుత్వ విధాన నిర్ణయం. థర్డ్‌వేవ్ వచ్చినా తీవ్రం కాకుండా చూసుకోవాలి వైరస్‌కు, అది రూపాంతరం చెందేందుకు మనం అవకాశం, ఆస్కారం ఇవ్వకపోతే మూడో దశ వచ్చి నా ఎక్కువ హాని చేయకుండా వెళ్లిపోయే అవకాశాలుంటాయి. ఒకవేళ అది కొంత ప్రమాదకరంగా వస్తే దానిని ఎదుర్కోవడానికి అవసరమైన సన్నాహాలు ప్రభుత్వాల పరంగా ముందుగానే చేసుకోవా లి. తీవ్రస్థాయికి చేరితే ఎదుర్కోలేనంత నిస్సహాయ పరిస్థితుల్లో ఉండకూడదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా వైద్య వ్యవస్థను పటిష్టం చేయాలి. కరోనా ఫస్ట్‌వేవ్ తర్వాత దీనిపై దృష్టి పెడతామన్నారు. ఈలోగా సెకండ్‌వేవ్ వచ్చేసింది. ఇప్పుడు కూడా రెండోదశ ప్రమాదం తొలిగిపోయిందనే భావనలో పడకుండా వైద్యవ్యవస్థ బలోపేతంపై దృష్టి పెట్టా లి. ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళికలు రూపొం దించి అమలు చేస్తే, ఒకవేళ థర్డ్‌వేవ్ తీవ్రంగా రాకపోయినా వైద్య వ్యవస్థ బాగుపడుతుంది. ప్రజా వైద్య వ్యవస్థ మెరుగుపడాలి ప్రజా వైద్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఎవరికైనా జబ్బులు వచ్చినా వెంటనే గుర్తించే వ్యవస్థ, రోగ నివారణకు తీసుకునే చర్యలు, ప్రజలకు సరైన సమాచారం అందించడం వంటివి చేపట్టాలి. సురక్షితమైన తాగునీరు, ఆరోగ్యకరమైన ఆహారం వంటి వి కూడా ప్రజావైద్య వ్యవస్థ పరిధిలోకే వస్తాయి. ప్రాథమిక సేవలు ఎలా ఉన్నాయి? జ్వరాలు వస్తే వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి త్వరగా గుర్తించగలరా? ఆయా లక్షణాలపై వెంటనే టెస్టింగ్ చేయగలరా? అన్నవి పరిశీలించాలి. కోవిడ్‌నే తీసుకుంటే.. వైరస్ సోకిన వ్యక్తి ఎంతమందిని కలిశాడు, ఎందరికి వ్యాప్తి చెందిందనే దానిపై కాంటాక్ట్ ట్రేసింగ్ చేసే పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోగలగాలి. ఇవన్నీ కూడా పబ్లిక్ హెల్త్ ద్వారానే తెలుసుకోగలం. ప్రైమరీ హెల్త్ కేర్ సబ్ సెంటర్లు మొదలుకుని సబ్ డిస్ట్రిక్ట్, డిస్ట్రిక్ట్ ఆసుపత్రుల వరకు పబ్లిక్ హెల్త్సెంటర్లను బలోపేతం చేసి పటిష్ట పరచకపో తే కిందిస్థాయి నుంచి సరైన వైద్యసేవలు, చికిత్స అందించలేం. ప్రజావైద్య వ్యవస్థ బలోపేతంతోనే పబ్లిక్ సెక్టార్ హెల్త్ కేర్ సిస్టమ్‌ను బలోపేతం చేయగలం. అందరూ ఆసుపత్రులకు పరిగెత్తకుండా ఇళ్లలోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకునేలా కుటుంబంలో ని వారికి వైద్యవ్యవప్థ ద్వారా ‘హోంకేర్’కు అవసరమైన సదుపాయాల కల్పనపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. కోవిడ్‌తో ఇబ్బందులు పడే నిరుపేదలకు సరిగ్గా మందులు అందించడంతో పాటు ఆహారం ఇతర సదుపాయాలు కల్పించాలి. పిల్లలపై థర్డ్‌వేవ్ ప్రభావం నిర్ధారణ కాలేదు... థర్డ్‌వేవ్‌లో చిన్నపిల్లలపై ఎక్కువగా ప్రభావం పడుతుందన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. మొదటిదశలో పెద్ద వయసువారు ఎక్కువగా ప్రభావితం కాగా.. యువత, పిల్లలు పెద్దగా బయటకు వెళ్లలేదు. స్కూల్స్, సినిమాహాళ్లు, మాల్స్ వంటివి మూతపడి, ఆటలు, పాటలు లేకపోవడంతో సమస్య తీవ్రం కాలేదు. రెండోవేవ్‌లో ఈ కార్యకలాపాలు మొదలు కావడంతో బయట తిరగడం, గుమిగూడటం వంటి వాటితో వీరిపై తాకిడి పెరిగింది. పెద్దవారిలో ఇమ్యూనిటీ ఏర్పడడంతో పాటు కొందరు వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల ప్రభావం పెరగలేదు. ఇక వైరస్ వెతుక్కుంటూ వెళ్లి పిల్లలను టార్గెట్ చేయడమంటూ ఉండదు. కానీ థర్డ్వేవ్కల్లా పెద్దల్లో వ్యాక్సిన్లు, ఇతర కారణాలతో రోగనిరోధక శక్తి పెరగడం వల్ల ఇక మిగిలేది యువకులు, పిల్లలే కాబట్టి ఆ మేరకు వారిపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు ఆసుపత్రుల్లో ఎక్కువ సదుపాయాలు కల్పించగలిగితే ఆ తర్వాత అవి వేరే జబ్బులకు కూడా ఉపయోగపడతాయని గ్రహించాలి. రూపాంతర వైరస్‌తోనే ఆందోళన ప్రస్తుతం రూపాంతరం చెందిన బి.1.167 వైరస్ ఆందోళన కలిగించేదిగా ఉంది. దేశం లో ఇప్పుడు అదే ఎక్కువ ప్రబలంగా ఉంది. అది బలం పుంజుకుని చాలా ప్రాంతాల్లో త్వరగా ప్రవేశిస్తోంది. అదింకా ప్రమాదకరం గా ఉందనే విషయాన్ని గుర్తించి జాగ్రత్త పడాల్సి ఉంది. వైరస్ ఎలాంటి రూపుదాల్చినా నోరు, ముక్కు, కళ్ల ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తున్నందున ప్రజలంతా మాస్క్ ధారణ, భౌతికదూరం పాటించడం, గుంపులుగా చేరకుం డా ఉండడం, గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ప్రాంతాల్లోనే ఉండడం ముఖ్యం. ప్రభుత్వాలపరంగా చూస్తే ఈ ఏడాది చివరి వరకు సూపర్ స్ప్రెడర్ ఈవెంట్స్ నిర్వహిం చకుండా జాగ్రత్త పడాలి. రూపాంతరం చెందుతున్న వైరస్ వేరియెంట్లు ఎలా వస్తున్నాయి?, ఎలా వ్యాప్తి చెందుతున్నాయి?, అవి వ్యాక్సిన్లకు ఎలా లొంగుతున్నాయి?, ఎలాంటి మందులు వాటిపై పనిచేస్తున్నాయన్న అంశాలపై మరింత విస్తృత స్థాయిలో పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. -
‘లాక్డౌన్ మంచిదే, తర్వాత ఏంటన్నదే ప్రశ్న’
సాక్షి, అమరావతి: ‘ఈ ఏడాది జనవరిలోనే బ్రిటన్‌కు చెందిన ప్రమాదకర వేరియంట్స్ భారతదేశంలోకి ప్రవేశించాయి. అప్పుడే వీటిని నిలువరించి ఉంటే ఇప్పుడింత ఉపద్రవం వచ్చేది కాదు. అవే ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తృత వ్యాప్తిలో ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందాయి. అప్పట్లోనే అంతర్జాతీయ రాకపోకలను నిలిపివేసి.. ఆయా రాష్ట్రాల్లో తగిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి అదుపులో ఉండేది. ఏమరుపాటు వల్ల చేయి దాటిపోయింది. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మినహా మరో మార్గం లేదు’ అంటున్నారు ప్రముఖ హృద్రోగ నిపుణులు, ఢిల్లీలోని ఎయిమ్స్ కార్డియాలజీ మాజీ విభాగాధిపతి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ కె.శ్రీనాథ్‌రెడ్డి. దేశంలో కరోనా ఉధృతికి దారి తీసిన పరిస్థితులపై మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మేళాలు.. ఎన్నికలు.. జన సమూహాలే కారణం జనవరిలో బ్రిటన్ నుంచి వచ్చిన వేరియంట్స్ దేశంలో బాగా వ్యాప్తి చెందాయి. వీటిపై జాగ్రత్త పడకపోగా మేళాలు, రాష్ట్ర స్థాయి ఎన్నికలు, స్థానిక ఎన్నికల పేరిట సుదీర్ఘ ప్రక్రియ సాగింది. వాటిలో జన సమూహాలు ఎక్కువగా భాగస్వామ్యం కావడంతో వైరస్ వ్యాప్తికి తలుపులు బార్లా తెరిచినట్టయింది. మొదటి వేవ్ తర్వాత ప్రజల్లో నిర్లక్ష్యం 2020 నవంబర్ నాటికి మొదటి వేవ్ తగ్గింది. జనవరి నాటికి జనంలో కోవిడ్ అంటే భయం పోయింది. మాస్కులు ధరించలేదు. భౌతిక దూరం పాటించలేదు. ప్రజల్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం వహించాయి. ప్రమాదం పొంచి ఉందన్న వాస్తవాన్ని గ్రహించలేకపోయాయి. యువత ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యారు మొదటి వేవ్‌లో లాక్డౌన్ ఉండటం, స్కూళ్లు, కాలేజీలు మూసివేయడం వల్ల యువకులు ఎక్కువగా బయటకు వెళ్లలేదు. ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోమ్‌కు పరిమితమయ్యారు. అందుకే మొదటి వేవ్‌లో సంభవించిన మరణాల్లో యువత లేదు. ఇప్పుడు యువతే ఎక్కువగా వైరస్‌కు ఎక్స్పోజ్ అయ్యారు. పైగా వ్యాప్తి ఉధృతంగా సాగే వేరియంట్స్ యువతను బాగా దెబ్బ కొట్టాయి. ఇద్దరు గుమికూడితే వచ్చే వైరస్ తీవ్రత కంటే పాతిక మంది గుమికూడితే ఉండే తీవ్రత ఎక్కువ. అదే ఎక్కువ నష్టం చేకూర్చింది. లాక్డౌన్ తర్వాత ఏమిటన్నదే ప్రశ్న లాక్డౌన్ విధించడం మంచిదే. కానీ లాక్డౌన్ సడలించాక పరిస్థితి ఏమిటన్నదే మన ముందున్న ప్రశ్న. లాక్డౌన్ సడలింపు తర్వాత కూడా ప్రజలు అజాగ్రత్తగా ఉంటే లాక్డౌన్ విధించి ఫలితం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలు విధిగా జాగ్రత్తల్ని పాటించాలి. టీకా వేస్ట్ అంటే కుదరదు చాలామంది టీకా రెండు డోసులు వేసుకున్నా వైరస్ సోకింది. అలాంటప్పుడు టీకా ఎందుకు అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. టీకా వైరస్‌ను రాకుండా అడ్డుకోలేదు. వచ్చినా నియంత్రించగలదని గుర్తుంచుకోవాలి. టీకా 100 శాతం ఫలితాలను ఇస్తోంది. థర్డ్ వేవ్ గురించి ఇప్పుడే ఆలోచన అనవసరం చాలామంది థర్డ్ వేవ్‌కూడా వస్తుందంటున్నారు. ముందు మనమంతా సెకండ్ వేవ్ నుంచి ఎలా బయటపడాలనే దానిపైనే ఆలోచన చేయాలి. టీకా సామర్థ్యాన్ని పెంచాలి. వైద్యానికి అవసరమయ్యే మౌలిక వసతులు పెంచుకోవాలి. అంతేకానీ.. దీనిని పక్కన పెట్టేసి థర్డ్ వేవ్ గురించి ఆలోచించడం అనవసరం. -
వ్యాక్సినేషనే తక్షణ కర్తవ్యం
సాక్షి, అమరావతి: ‘కరోనా కేసులు తగ్గినంత మాత్రాన వైరస్ పూర్తిగా పోయినట్లు కాదు. ఇప్పటికీ యూరప్ దేశాలను ఈ వైరస్ వణికిస్తోంది. పోయినట్లే పోయి వివిధ రూపాలను మార్చుకుని తిరిగి విస్తరిస్తోంది. దక్షిణ కొరియాలో అయితే పూర్తిగా వైరస్ పోయిందనుకున్నారు. కానీ, మళ్లీ కేసులు రావడంతో అక్కడ భయాందోళన మొదలైంది. ఇక బ్రిటన్, అమెరికా పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇక మనదేశంలోనూ చాలా జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏమాత్రం అలక్ష్యం చేయకూడదు. కేసులు తగ్గడం మంచి పరిణామమే. కానీ, దీన్ని పూర్తిగా నిర్మూలించే వరకూ మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే’.. అంటున్నారు ప్రముఖ హృద్రోగ నిపుణులు, ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ మాజీ విభాగాధిపతి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డా.కె. శ్రీనాథ్‌రెడ్డి. ఆయన శనివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. వ్యాక్సిన్‌తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది లక్షలోనో, కోటిలోనో ఒకరికి ఏదైనా దు్రష్పభావం కలిగినంత మాత్రాన వ్యాక్సిన్‌ను తప్పపట్టలేం. వ్యాక్సిన్ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరిగితే వైరస్ ప్రభావం శరీరంపై అంత పెద్దస్థాయిలో చూపించలేదు. వ్యాక్సినేషనే మనముందున్న లక్ష్యం ఇప్పటికీ మనం ప్రమాదంలోనే ఉన్నాం. ఏ మాత్రం అలక్ష్యం చేసినా మూల్యం చెల్లించుకుంటాం. ఈ వైరస్‌ను నమ్మడానికిలేదు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ రూపంలో వస్తుందో అంతుచిక్కడంలేదు. ప్రస్తుతం అంతటా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. వీలైనంత వరకూ అందరికీ వ్యాక్సిన్ వేయడమే మనముందున్న ప్రస్తుత లక్ష్యం. అందుకే ప్రాధాన్యతల వారీగా వేస్తున్నారు. దీనివల్ల నష్టాన్ని భారీగా తగ్గించుకునే అవకాశముంది. కానీ, వ్యాక్సిన్ ఉత్పత్తిని బట్టి మన ప్రభుత్వం ఎవరికి ముందు వేయాలో వారికి వేస్తోంది. వ్యాక్సిన్ విధిగా వేయించుకోవడం మంచిది. అలాగే, యాభై ఏళ్లు దాటిన వారు, మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు బాగా ఉన్నారు. వీళ్లు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసమ్మర్థం ఉండే ప్రాంతాలకు వెళ్లకూడదు. వైరస్ సోకితే ఇలాంటి వాళ్లలో ప్రాణనష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. మరికొన్ని నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందే. జనసమూహాల్లోకి వెళ్లకూడదు ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, అన్నింటికీ మించి జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఉండటం చేయాలి. కేసులు తగ్గాయి కదా అని విచ్చలవిడిగా ప్రజలు గుమికూడితే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీనివల్ల నష్టం కొనితెచ్చుకున్నట్లవుతుంది. -
కొత్త వైరస్: ఆ లక్షణాలు కనిపించడం లేదు
సాక్షి, హైదరాబాద్: కరోనా కొత్త వైరస్‌తో తీవ్రమైన వ్యాధిగా మారకపోయినా.. ఎక్కువ మందికి సోకి కేసుల సంఖ్య పెరుగుతుందని ప్రముఖ వైద్యులు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా. కె. శ్రీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది మరణాల సంఖ్య అధికం కావడానికి పరోక్షంగా కారణం కావొచ్చన్నారు. అందువల్ల ఇది వ్యాప్తి చెందకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కరోనా కొత్త వైరస్ వ్యాప్తిపై శనివారం ‘సాక్షి’కి డాక్టర్ కె.శ్రీనాథ్‌రెడ్డి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... వైరస్ రూపురేఖల మార్పుతోనే... ఏ వైరస్ అయినా స్వాభావికంగా తన రూపురేఖలు మార్చుకోవడం సహజమే. యూకేలో సెప్టెంబర్‌లోనే ఈ వైరస్ కనపడినా డిసెంబర్లో దానిని కొత్త రకంగా గుర్తించి.. కేసులు వేగంగా వ్యాప్తి చెందడాన్ని కనుగొన్నారు. యూకేతో పాటు సౌతాఫ్రికా, నైజీరియా వంటి దేశాల్లోనూ కొత్త మ్యుటేషన్లు వచ్చాయంటున్నారు. వీటి వల్ల వైరస్ వ్యాప్తి పెంచుకుంటుంది. చదవండి: (ఒక అద్భుతం... ఓ ఆశ్చర్యం!) అడ్డంకులు దాటేందుకు... మాస్క్‌లు ధరించడం, ఇతరత్రా పద్ధతుల ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నాలు చేసినప్పుడు వైరస్ రూపాన్ని మార్చు కుంటుంది. ఎక్కువ మందికి వ్యాప్తి చెందేందుకు ఈ అడ్డంకులను అధిగమించేందుకు తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. అయితే దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అప్రమత్తత అవసరం... ఈ కొత్త వైరస్ ఇప్పటికైతే ప్రమాదకరంగా మారే లక్షణాలు కనిపించడం లేదు. అయితే వైరస్ పెరగకపోయినా, తీవ్రమైన వ్యాధిగా మారకపోయినా.. అధిక వ్యాప్తి కారణంగా ఎక్కువ మంది ఈ వైరస్ బారినపడతారు. మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య పెరిగి ఆసుపత్రులు, వైద్య వ్యవస్థపై తాకిడి, ఒత్తిళ్లు పెరుగుతాయి. క్రమంగా ఈ కేసుల్లో మరణాల సంఖ్య ఎక్కువయ్యే అవకాశాలుండొచ్చు. ప్రత్యేక టెస్టింగ్‌లు అవసరం... కొత్త వైరస్ సెప్టెంబర్‌లోనే బయటపడినందున.. భారత్‌తోపాటు ఇతర దేశాలకు ఇది ఇప్పటికే చేరుకుని ఉండొచ్చు. దీని జెనిటిక్ స్ట్రక్చర్ తెలుసుకునేందుకు ‘సైంటిఫిక్ టెస్టింగ్’ద్వారా ప్రత్యేక పరీక్షలు చేయాలి. బ్రిటన్, సౌతాఫ్రికా, ఐరోపాలో ని కొన్ని దేశాల్లోని ల్యాబ్‌లలో తరచుగా ఈ టెస్టులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన తాజా పరిస్థితిపై మరింత సమాచారం కోసం వేచిచూడాలి. జనవరిలో వ్యాక్సిన్... భారత్‌లో తయారవుతున్న ఆస్ట్రా జెనెకా(బ్రిటన్‌ది) వ్యాక్సిన్ జనవరి 1, 2 వారాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. దీనికి బ్రిటీష్ రెగ్యులేటర్ అనుమతి లభించాలి. భారత్ బయోటెక్, రష్యన్ వ్యాక్సిన్ స్టేజ్–3 ప్రయోగాలు పూర్తయ్యాక వాటి డేటా ఇవ్వాలి. భారత్ బయోటెక్ ప్రయోగాలు ఇక్కడే జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో వీటికి అనుమతి రావొచ్చు. రెగ్యులేటరీ ఏజెన్సీలు, ఇంటర్నేషనల్ అప్రూవల్స్‌పై ఇది ఆధారపడి ఉంది. మరో 3, 4 నెలలు జాగ్రత్త... వ్యాక్సిన్ డోసులు 28 రోజుల వ్యవధిలో రెండుసార్లు తీసుకున్నాక, 14 రోజుల తర్వాతే యాంటీబాడీస్ ఏర్పడి రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశాలున్నాయి. అదీ కాకుండా మొదట ఫ్రంట్‌లైన్ వారియర్స్.. తర్వాత క్లిష్టమైన అనారోగ్యంతో ఉన్న వారు.. ఇలా అంచెలంచెలుగా వ్యాక్సిన్లు అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు మరింత సమయం పడుతుంది. అందువల్ల మరో 3, 4 నెలల దాకా అందరూ బాధ్యతగా, అప్రమత్తంగా వ్యవహరించాలి. అప్పటివరకు వైరస్‌కు సంబంధించిన పరిస్థితులు, మనం తీసుకున్న చర్యల ప్రభావంపై స్పష్టత వస్తుంది. సెకండ్ వేవ్ ప్రభావం... మన దేశంలో సెకండ్ వేవ్ వస్తే తీవ్రత ఉండబోదని చెప్పలేం. పశ్చిమ దేశాల్లో నిబంధనలు పాటించకుండా స్వేచ్ఛగా తిరగ డం, విందులు, వినోదాల్లో మునిగితేలడం వల్ల విపత్కర పరిస్థి తులు ఏర్పడ్డాయి. ఇక్కడా అజాగ్రత్తగా ఉంటే కేసులు పెరగొచ్చు. హెర్డ్ ఇమ్యూనిటీపై చెప్పలేం... భారత్‌లో ఎంత శాతం మందిలో ఇమ్యూనిటీ ఏర్పడితే..æ హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందనేది చెప్పలేం. అది వచ్చినా కొన్ని ప్రదేశాలు, ప్రాంతాలకు పరిమితం కావొచ్చు. ఒక ప్రాంతంలోని ఇమ్యూనిటీ ఏర్పడిన ప్రజల్లోంచి ఎవరైనా ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు సొంతంగా రోగ నిరోధకశక్తి లేకపోతే వైరస్ బారినపడే అవకాశాలున్నాయి. అందువల్ల అందరూ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామీణ జనాభా ఎక్కువ కాబట్టే... యూఎస్, యూకే, ఐరోపా దేశాలతో పోలిస్తే.. భారత్‌లో యువత అధికంగా ఉండటం, గ్రామీణ జనాభా ఎక్కువకావడం, అక్కడి వారికి అనారోగ్య లక్షణాలు తక్కువగా ఉండటం, చిన్నప్పటి నుంచే వివిధ టీకాలు తీసుకోవడం వంటి కారణాలతో కరోనా వైరస్ నుంచి కొంతమేర ఇమ్యూనిటీకి కారణమై ఉండొచ్చు. అందువల్లే కరోనా కేసుల తీవ్రత పెరగకపోవడంతోపాటు మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉండేందుకు కారణం కావచ్చు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, ఇతర దక్షిణాసియా దేశాల్లోనూ కేసుల సంఖ్య ఎలా ఉన్నా కోవిడ్ మరణాలు తక్కువగానే ఉన్నాయి. భారతీయులు జన్యుపరంగా స్ట్రాంగ్‌గా ఉన్నారా.. అన్నది పరిశోధనలతోనే తేల్చాలి. కొత్త వైరస్‌పైనా వ్యాక్సిన్... ఇప్పటికే సిద్ధమైన వివిధ వ్యాక్సిన్లు కొత్త వైరస్‌పైనా పనిచేస్తాయని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్ కారణంగా ‘స్పైక్ ప్రోటీన్’ కొంత రూపుమారినా దానిపైనా వ్యాక్సిన్ పనిచేస్తుంది. అయితే, ఈ వైరస్ మరింత అధికంగా రూపు మార్చుకుంటే మాత్రం దానికి తగ్గట్టుగా వ్యాక్సిన్‌లోనూ మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడొచ్చు. వైరస్ తీవ్రత మరింత పెరిగినా ఇప్పటికే ఇస్తున్న చికిత్స, మందులు పనిచేస్తాయి. ఎక్కువ మందికి వైరస్ సోకితే అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రమాదం పెరగొచ్చు. సాధారణ పరిస్థితులకు ఏడాది... మన దేశంలో పూర్తిగా సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు మరో ఏడాది పట్టే అవకాశాలున్నాయి. వచ్చే ఏప్రిల్ కల్లా కరోనా వైరస్ తీరుతెన్నులు, దాని అదుపునకు తీసుకున్న చర్యలు ఏ మేరకు ప్రభావం చూపాయి.. వ్యాక్సిన్ వినియోగం తదితర అంశాలపై స్పష్టత వస్తుంది. కరోనా వైరస్ విషయంలో భయాందోళనకు గురికాకుండా, పూర్తిస్థాయి కట్టడితోపాటు మళ్లీ వస్తే ఎదుర్కొనేందుకు ఏమి చేయాలన్నది తేలుతుంది. జాగ్రత్తలే రక్షణ కవచం... పశ్చిమ దేశాల్లో అత్యంత శీతల పరిస్థితులు ఉన్నందున కొంత వేగంగా కేసుల వ్యాప్తి జరుగుతోంది. మన దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గినందున అక్కడ ఎక్కువ ప్రభావం ఉండొచ్చు. తెలుగు రాష్ట్రాలతో సహా దక్షిణాదిలో పండుగల ప్పుడు అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కేసుల పెరుగుదలకు అడ్డుకట్టవేయొచ్చు. ప్రస్తు తం తలెత్తిన కొత్త పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే. వైరస్ సోకినట్లు అనుమానం వస్తే వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. మాస్క్‌లు, భౌతిక దూరం, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలే రక్షణ కవచం. -
జాతీయ స్థాయిలో ‘ఆప్కాబ్’కు ప్రథమ స్థానం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రుణాల మంజూరు, వసూళ్లతోపాటు వివిధ అంశాల్లో మెరుగైన పనితీరుతో ముందుకు సాగుతోందని, రైతులు, వివిధ వర్గాల ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉన్నాయని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్స్ (నాఫ్కాబ్) పేర్కొంది. 2018–19 సంవత్సరంలో రాష్ట్ర, జిల్లా సహకార బ్యాంకులు, సహకార సంఘాల పనితీరును నాఫ్కాబ్ పరిశీలించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాటి వివరాలను వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుంటూనే రుణాల రికవరీ, మంజూరు విషయంలో ఆప్కాబ్ గత రెండేళ్లుగా ఉత్తమ ప్రతిభ కనబరుస్తోందని, గతేడాది (2017–18) కూడా రెండోస్థానాన్ని దక్కించుకుందని వివరించింది. సిబ్బంది, అధికారులు నిబద్ధతతో పని చేయడం వల్లనే ఈ గుర్తింపు వచ్చిందని ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. అదే విధంగా డీసీసీబీ స్థాయిలోనూ కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)కు ఉత్తమ పనితీరులో ద్వితీయ స్థానం లభించిందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ పరిధిలోని కొమ్ముగూడెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సుభాష్ యాదవ్ అవార్డును పొందినట్టు చెప్పారు. ఈ అవార్డులను నాఫ్కాబ్ డిసెంబర్లో ప్రదానం చేస్తుందని చెప్పారు. -
ఏప్రిల్ దాకా జాగ్రత్తలు తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా విషయంలో వచ్చే ఏప్రిల్ దాకా జాగ్రత్తలు తప్పనిసరి. వైరస్ ప్రవర్తన ఎలా ఉంటుంది. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చికిత్సా పద్ధతులు, వాటి ఫలితాలపై అప్పటికి పూర్తి స్పష్టత వస్తుంది. కరోనా వైరస్ ఎక్కువ మందికి సోకి విస్తృతంగా వ్యాప్తి చెందాక తాను బలహీనమై మనుగడే కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి తన సహజ గుణాన్ని, దిశను కూడా మార్చుకుంటుందా అన్నది వేచి చూడాలి. అయితే ఏప్రిల్‌లోగా వ్యాక్సిన్ వస్తే ఇంకా మంచిదే..’అని ప్రముఖ వైద్యుడు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు కె.శ్రీనాథ్‌రెడ్డి వెల్లడించారు. వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ల స్థాయి తగ్గి మరణాల సంఖ్య పెరిగిన క్రమంలో స్వతహాగా దాని మనుగడే ప్రమాదంలో పడుతుందని, అందువల్ల ఈ పరిణామ క్రమంలో వైరస్ తన నైజాన్ని కూడా మార్చుకునే అవకాశాలున్నాయని చెప్పారు. ఈ నెలాఖరుకల్లా కోవిడ్‌పై పోరులో మన ప్రయత్నాలు, వాతావరణంలో వచ్చే మార్పులు, వైరస్ వ్యాప్తి, చికిత్సకు అది స్పందిస్తున్న తీరుపై మరింత స్పష్టత వచ్చి, దీనిపై అవగాహన పెరిగే అవకాశాలున్నాయని వివరించారు. వివిధ అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వూ్యలో ఆయన మాట్లాడారు. ముఖ్యాంశాలు.. నగరాల్లోనే అదుపు చేస్తే బాగుండేది.. ప్రస్తుతం వైరస్ వేగంగా విస్తరిస్తోంది. నగరాలకు ఇది పరిమితమైనప్పుడే అదుపులోకి తెచ్చి ఉంటే బాగుండేది. లాక్డౌన్ ఎక్కువ కాలమే ఉన్నా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అంచెలంచెలుగా ఆంక్షలు ఎత్తేయడంతో ప్రమాదం తగ్గిపోయిందనే భావన ప్రజల్లో ఏర్పడింది. అన్ని ప్రాంతాలకు రాకపోకలు పెరగటంతో దీని విస్తరణ మారుమూల ప్రాంతాలకు సైతం చేరుకుంది. చికిత్స తీరుతెన్నులపై.. గతంతో పోల్చితే ఇప్పుడు మెరుగైన చికిత్సా పద్ధతులు, రకరకాల మందులు, ఇంజెక్షన్లు, స్టెరాయిడ్స్ అందుబాటులోకి వచ్చాయి. వైరస్ సోకాక చాలా తక్కువ మంది మాత్రమే ప్రమాదకర దశకు వెళ్తున్నారు. ఎలాంటి లక్షణాలకు ఏ మందులు వాడాలి, మార్పులు చోటుచేసుకున్న వారిని ఎలా పరీక్షించాలి, తీవ్రత పెరిగిన వారిని ఎలా ట్రీట్ చేయాలన్న దానిపై గత రెండు నెలల్లో ఆప్షన్లు పెరిగాయి. తీవ్రమైన జబ్బు చేసినా చికిత్స చేసే సదుపాయాలు వచ్చాయి. వెంటిలేటర్ల అవసరం అంతలేదు.. కోవిడ్ వ్యాప్తి తొలిదశలో వెంటిలేటర్ల ఆవశ్యకత అత్యధికంగా ఉంటుందని భావించాం. అయితే ఆ అవసరం లేకుండానే చికిత్స అందించగలుగుతున్నాం. ఆక్సిజన్ అందించడం, పొట్టమీద బోర్లా పడుకోబెట్టడం, వివిధ స్టెరాయిడ్స్, ఇతర మందుల వినియోగంతో జబ్బు తీవ్రం కాకుండా డాక్టర్లు నివారించగలుగుతున్నారు. వైరస్ సోకుతున్న వారు అధికసంఖ్యలోనే ఉంటున్నా కోలుకుంటున్న వారు కూడా పెద్దసంఖ్యలోనే ఉంటున్నారు. మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉంటోంది. మందులతో ప్రివెన్షన్ తక్కువే.. కోవిడ్ రాకుండా మందులతో నివారించడం తక్కువనే చెప్పాలి. కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇతర పోషక విలువలున్న ఆహారంతో రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. చాలావరకు ముందస్తు జాగ్రత్తల వల్ల వైరస్ సోకకుండా చూడొచ్చు. అయితే వ్యాక్సిన్ వస్తేనే కరోనాను పూర్తిగా నిరోధించడం సాధ్యం అవుతుంది. రీఇన్ఫెక్షన్ల వల్ల ప్రమాదం తక్కువగానే.. రీఇన్ఫెక్షన్ల వల్ల ప్రమాదం తక్కువే. వైరస్ రీయాక్టివ్ కావడం వల్లనో, ఫాల్స్ పాజిటివ్ లేదా డెడ్ వైరస్ వల్లనో ఇది జరగొచ్చునని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ వైరస్ వేరే వ్యక్తి ద్వారా, వేరే రూపు దాల్చడం ద్వారా రీఇన్ఫెక్షన్ వచ్చిందని హాంకాంగ్‌లో తేల్చారు. ఇమ్యూనిటీ తగ్గి వైరస్ మళ్లీ దేహంలోకి ప్రవేశించేటప్పుడు ముక్కులోని మెమోరీ బీ, టీ సెల్స్ (ఐజీఏ యాంటీబాడీస్) గుర్తించి అక్కడే నియంత్రిస్తాయి. మొదటిసారి వైరస్ శరీరంలోకి ప్రవేశించాక రోగనిరోధకశక్తితో ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీస్ తయారవుతాయి. వైరస్ ప్రపంచ పర్యటన చేస్తోంది.. ప్రస్తుతం కోవిడ్ వైరస్ ప్రపంచ పర్యటన చేస్తోంది. కొన్ని దేశాల్లో ప్రభావం తగ్గినా కొన్నిచోట్ల మరింత విజృంభిస్తోంది. ఇలా అది ప్రవర్తిస్తున్న తీరు ఇంకా కొన్ని ప్రదేశాలు తిరిగేలోగా మరింత మార్చుకుంటుందా? ఇప్పుడు ఐరోపాలో తగ్గినా మళ్లీ పశ్చిమ దేశాల్లో చలికాలం వచ్చేటప్పటికీ కేసులు పెరిగి పెనుమార్పులొస్తాయా అన్నది తెలుసుకునేందుకు డిసెంబర్, జనవరి వరకు వేచి చూడాలి. మళ్లీ ఏప్రిల్ వచ్చేటప్పటికీ పరిస్థితులు ఎలా ఉంటాయనేది బేరీజు వేయాల్సి ఉంది. మాల్స్, షాపుల్లో అరగంటైనా ప్రమాదమే.. ప్రస్తుతం వైరస్ సోకినా లక్షణాలు బయటపడని అసింప్టమేటిక్ వ్యక్తులు, ప్రీ సిమ్టమ్స్ ఉన్న వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. మాస్క్‌లు, మనుషుల మధ్య దూరం పాటించడంతో పాటు గుంపుల్లోకి వెళ్లొద్దు. షాపింగ్ మాల్స్‌తో పాటు గాలి, వెలుతురు సరిగా లేని షాపుల్లోనూ అరగంట ఉన్నా ప్రమాదమే. విశాలమైన ప్రదేశాలు, గాలి, వెలుతురు ఎక్కువగా ప్రసరించే చోట్లలోనే ఉండాలి. -
కరోనా కేసులు పెరిగితే ఆందోళన అక్కర్లేదు
సాక్షి, అమరావతి: ‘దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువవుతోంది. ఇది ఒక స్థాయి వరకు పెరిగి ఆ తర్వాత తగ్గే అవకాశం ఉంది. కేసులు ఎక్కువగా పెరిగినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రోజు పది వేల పాజిటివ్ కేసులను గుర్తించామంటే.. వారి నుంచి మరో పది వేల మందికి వైరస్ వ్యాపించకుండా కాపాడినట్టు లెక్క. ఎక్కువ మందిని గుర్తించి వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా చేయడమే ఈ వైరస్‌కు అసలు సిసలు మందు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు’ అని అంటున్నారు.. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు, ఎయిమ్స్ ఢిల్లీ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ గౌరవ సలహాదారు డా.కె.శ్రీనాథరెడ్డి. శనివారం ఆయన సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. మరణాలను నియంత్రించాలి.. మరణాలను నియంత్రించగలిగితే చాలు. వైరస్‌ను ఎదుర్కోవడంలో ఇదే పెద్ద వ్యూహం. రాష్ట్రంలో రోజూ 70 వేల టెస్టులు చేస్తున్నారు. ఇందులో పది వేలు పాజిటివ్‌గా తేలుతున్నాయి. ఇలా ఎక్కువ మందిని గుర్తించడం వల్ల వారి నుంచి అంతకంటే ఎక్కువ మందికి వైరస్ సోకకుండా కాపాడుకోవచ్చు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మార్గదర్శకాల ప్రకారం.. వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్న చోట అధికంగా టెస్టులు చేయాలి. దీని ద్వారా వ్యాప్తిని అడ్డుకోవచ్చు. ఎక్కువ టెస్టులు చేయడం.. గొప్ప వ్యూహం. కేసులు పెరుగుతున్నాయని టెస్టులు చేయకపోవడం అసలుకే ప్రమాదం. డబ్ల్యూహెచ్‌వో అంచనా ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి టీకా వస్తుంది. -
కరోనా: అందుకే మనదేశంలో మరణాలు తక్కువ
బెంగళూరు: కరోనా మహమ్మారిని నగర ప్రాంతాల నుంచి పల్లెలకు వ్యాపించకుండా చూడటం కోవిడ్–19పై జరుగుతున్న యుద్ధంలో అత్యంత కీలకమైన అంశమని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా(పీహెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు ప్రొఫెసర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. ‘నగరాల నుంచి పల్లెలకు.. హాట్స్పాట్ల నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు వీలైనంత వరకూ తగ్గించాలి’ అని శ్రీనాథ్ రెడ్డి పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. నిత్యావసర, రవాణా అవసరాలకు మాత్రమే ట్రాఫిక్‌ను పరిమితం చేయడం ద్వారా కరోనా వైరస్‌ను నియంత్రించవచ్చునని అన్నారు. దేశంలో యువ జనాభా ఎక్కువగా ఉండటం మరణాల రేటు తక్కువగా ఉండేందుకు ఒక కారణం కావచ్చునని ఆయన తెలిపారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత కూడా భౌతిక దూరం, ఫేస్ మాస్క్‌లు ధరించడం, చేతి పరిశుభ్రత సాధనను ప్రజలు కొనసాగించాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా ప్రజల చలన శక్తి తక్కువ కాబట్టి కరోనా వ్యాప్తి చెందే అవకాశం కూడా పరిమితంగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచినప్పుడు, కచ్చితంగా ఎక్కువ కేసులు వెలుగు చూస్తాయన్నారు. పరీక్షల సంఖ్య శాతంగా, కొత్త కేసుల సంఖ్యను చూడాల్సి ఉంటుందని వివరించారు. దీన్నిబట్టి వైరస్ విజృంభణ ఎంత తీవ్రంగా ఉందో గమనిస్తూ ఉండాలన్నారు. ఎక్కువ ఉష్ణోగ్రతలో వైరస్ చనిపోతుందన్న వాదనకు స్పష్టమైన శాస్త్రీయ రుజువు లేదన్నారు. జూన్-జూలైలో భారతదేశంలో కోవిడ్-19 కేసులు పెరిగే అవకాశం ఉందనే దాని గురించి తమకు తెలియదన్నారు. అయితే, జూన్-జూలై నాటికి ఎక్కువ ఉష్ణోగ్రత, అధిక తేమ కలయిక కారణంగా ఇతర కరోనా వైరస్లు తక్కువ చురుకుగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. విద్య, శిక్షణ, పరిశోధన, విధాన అభివృద్ధి, ఆరోగ్య కమ్యూనికేషన్, సలహాల ద్వారా దేశంలో ప్రజారోగ్య సామర్థ్యాన్ని పెంపొందించడానికి పీచ్ఎఫ్ఐ కృషి చేస్తోంది. (కరోనా: బెంగాల్లో అందుకే అధిక మరణాలు) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1401284236.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఏపీలో మరో 81 కరోనా పాజిటివ్ కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో మరో 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1097కి చేరింది. ఈ వైరస్ నుంచి ఇప్పటివరకు 231 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, 31 మంది ప్రాణాలు కోల్పొయారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 835గా ఉంది. కాగా గత కొన్ని రోజులుగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం దూసుకువెళుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. దేశంలో పదిలక్షల మంది జనాభాకు 418 మందికి టెస్టులు, రాష్ట్రంలో 1, 147 టెస్టులు చేస్తున్నారు. (దూసుకెళ్తున్న ఏపీ) లాక్‌డౌన్‌తోనే కరోనాకు అడ్డుకట్ట సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో తెలుగు రాష్ట్రాలు ముందంజ వేశాయని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో పరిస్థితులు చాలా వరకు అదుపులోనే ఉన్నాయని ఆయన చెప్పారు. మన దగ్గర కరోనా మృతుల సంఖ్య చాలా తక్కువగా ఉందని శ్రీనాథ్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలో సగానికి పైగా దేశాలు లాక్‌డౌన్‌లోనే ఉన్నాయని గుర్తు చేస్తూ.. కేవలం లాక్డౌన్ ద్వారానే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. (అవును.. మేము కరోనాపై గెలిచాం) -
మూకుమ్మడి భేటీలతోనే ‘వైరల్ లోడ్’
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను బలహీన పర్చడమే మనముందున్న మార్గమని వైద్య నిపుణులు డాక్టర్ కె. శ్రీనాథరెడ్డి, డాక్టర్. జీవీఎస్. మూర్తిలు వెల్లడించారు. మూకుమ్మడి భేటీలతో ఈ వైరల్ లోడ్‌ను ఉధృతం చేయొద్దని, ఇది అత్యంత ప్రమాదకరమని వారు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అంతర్జాతీయ వైద్యనిపుణుడు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లోని యూనివర్శిటీల్లో ప్రొఫెసర్‌గా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రతినిధిగా, ఎయిమ్స్ డైరెక్టర్‌గా పనిచేసిన డాక్టర్. శ్రీనాథరెడ్డి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్. జీవీఎస్ మూర్తిలతో ఆదివారం భేటీ అయి చర్చించారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సలహాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్. శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ క్రియాశీలకంగా పనిచేస్తున్నారని, దేశానికే దిశానిర్దేశం చేసే విధంగా రాష్ట్రం ముందుకెళుతోందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన సూచించారు. భౌతికదూరాన్ని పాటించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు నడుం బిగించాలని, ఎక్కువ మంది గుమికూడటం మంచిది కాదని చెప్పారు. వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడు ప్రజల సహకారం కూడా అవసరమని, వైద్య నిపుణుల సలహాలతో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు.