కడప సెవెన్‌రోడ్స్ : ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్, సీనియర్ పాత్రికేయుడు దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి మరణం అటు పత్రికా రంగానికి, ఇటు ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పలువురు పేర్కొన్నారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న శ్రీనాథ్‌రెడ్డి బుధవారం హైదరాబాదులో తుది శ్వాస విడిచారు. సింహాద్రిపురం మండలం కోవరంగుట్టపల్లె గ్రామానికి చెందిన ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెల్లో ఒకరు అమెరికా, మరొకరు బ్రిటన్‌లో ఉన్నారు. ఆయన తల్లి సావిత్రమ్మ కోవరంగుట్టపల్లె సర్పంచుగా పనిచేశారు. తండ్రి ద్వారకనాథరెడ్డి తాడిపత్రిలో కళాశాల నిర్వహిస్తున్నారు. మద్రాసు ట్రిప్లికేన్‌లోని హిందూ హైస్కూలులో 10వ తరగతి అభ్యసించారు. తిరుపతిలోని ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో బీకాం చదివారు. ధర్మవరానికి చెందిన మాజీమంత్రి నాగిరెడ్డి సోదరిని వివాహం చేసుకున్నారు. జేసీ దివాకర్‌రెడ్డి, వేంపల్లె సతీష్‌రెడ్డి సమీప బంధువులే. విదేశాల్లో ఉన్న కుమార్తెలు వచ్చిన తర్వాత అంత్యక్రియలు ఎక్కడ జరపాలో నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.
పత్రికారంగంలో..
శ్రీనాథ్‌రెడ్డి చాలాకాలంగా కడప ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత బీబీసీ, హైదరాబాదులోని సాక్షి ప్రధాన కార్యాలయంలో ఉద్యోగ విధులు నిర్వర్తించారు. కడపలో పనిచేస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా సుమారు రెండున్నర శతాబ్దం పనిచేసి జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడారు. కడప రామాంజనేయపురంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించిన ఘనత ఆయనదే. కడప ప్రెస్‌క్లబ్ ఆయన చొరవతోనే ఏర్పాటైంది. ఆనాటి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు శ్రీనాథ్‌రెడ్డికి ఎంతో గౌరవం ఇచ్చేవారు.
‘సీమ’ ఉద్యమంలో..
రాయలసీమ ఉద్యమంలో శ్రీనాథ్‌రెడ్డి ఎంతో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఆనాటి ఉద్యమ నేతలు వైఎస్ రాజశేఖరరెడ్డి, డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి, డాక్టర్ ఎంవీ రమణారెడ్డి, సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులతో ఎంతో సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. పత్రికా రంగంలో కొనసాగుతూనే ప్రత్యక్షంగా ‘సీమ’ ఉద్యమంలో పాల్గొన్నారు. కడపలోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కార్యాలయం ఆయన హయాంలో నిత్యం రాయలసీమ ఉద్యమ కారులు, రాజకీయ నాయకులతో కిటకిటలాడుతూ ఉండేది. ఇప్పటి కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డిని రాయలసీమ ఉద్యమంలోకి ఆహ్వానించి రాయలసీమ యువ పోరాట సమితి ఏర్పాటు చేయించారు.
ప్రెస్ అకాడమి చైర్మన్‌గా..
సుమారు 40 ఏళ్లకు పైబడి పాత్రికేయరంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీనాథ్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు తగిన గౌరవం కల్పించారు. ఈ ఐదేళ్లలో రెండుసార్లు ప్రెస్ అకాడమి చైర్మన్‌గా కొనసాగిన ఘనత శ్రీనాథ్‌రెడ్డికే దక్కింది.
పలువురి సంతాపం
శ్రీనాథ్‌రెడ్డి మృతి పట్ల జిల్లాకు చెందిన పలువురు పా త్రికేయులు, ప్రజాసంఘాల నాయకులు తీవ్ర సంతా పం వ్యక్తం చేశారు. రాయ లసీమ సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉద్యోగాలు వంటి డిమాండ్లతో సాగిన ఉద్యమంలో ఆయన ఎంతో క్రియాశీలకంగా పాల్గొన్నారని రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఆయన మరణం పాత్రికేయ రంగానికి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీనియర్ జర్నలిస్టు పమిడికాల్వ మధుసూదన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment