సాక్షి ప్రతినిధి, కడప: జర్నలిజం రంగంలో ఆయన సవ్యసాచి. ప్రజలు, ప్రజాహక్కులు, రాయలసీమ అస్థిత్వంపై పోరాటం, అడ్డదిడ్డంగా పయనిస్తున్న యంత్రాంగాన్ని గాడిలో పెట్టడం, రాయలసీమకు అనువైన రాజకీయాలను నెరిపేందుకు నేతల్ని ఏకీకరణ చేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు ఆయన సొంతం. రాయలసీమ కోసం దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి ఎంచుకున్న ఉద్యమపథం ఆదర్శనీయం. కలాన్ని కరవాలంగా ధరించిన ఆ పెద్దరికం కనుమరుగైంది.
► కడప జిల్లా సింహాద్రిపురం దగ్గర కోరుగుంటపల్లెలో సంపన్న కుటుంబంలో దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి జన్మించారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన ఆయన వారి తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకు. ఆయన ఎస్వీ యూనివర్సిటీలో ఆంగ్ల సాహిత్యంలో పీజీ చేశారు. 1978 లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో చేరారు. కొద్దిరోజులు బెంగుళూరులో పనిచేసి, కడప స్టాప్‌రిపోర్టర్‌గా దాదాపు 30 ఏళ్లు పనిచేశారు. ఆ తరువాత కొంతకాలం తిరుపతి, హైదరాబాద్‌లలో వివిధ హోదాల్లో పనిచేశారు. జర్నలిస్ట్‌గా ఆయన ప్రస్థానంలో అనేక ఘటనలకు ఆయనే కేంద్ర బిందువుగా నిలవడం విశేషం.
ఎన్టీఆర్‌కు ఎదురుప్రశ్న..
ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీ రామారావు జిల్లాలోని ముద్దనూరు పర్యటనకు వచ్చారు. అప్పట్లో రాయలసీమ వెనుకబాటు తనంపై ఉద్యమం బాగా నడుస్తోంది. ఆ పరిస్థితుల్లో జిల్లాకు వచ్చిన ఎన్టీఆర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాయలసీమలో సాగు, తాగునీటికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లుగా వివరిస్తూనే, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎన్ని కిలోమీటర్లు నీరు పారుదల చేయనున్నామో వివరించసాగారు. ఆ సందర్భంలో ‘ఎక్స్‌క్యూజ్‌్ మీ.. చిన్న డౌట్ సార్’ అంటూ శ్రీనాథ్‌రెడ్డి గళం విప్పారు. 1 టీఎంసీ నీటికి ఎన్ని ఎకరాలు సాగుచేయవచ్చు సార్.. అంటూ ప్రశ్నించడంతో ఎన్టీఆర్ నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో సందర్భంలో చింతకొమ్మదిన్నె సమీపంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన బహిష్కరించి ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమాన్ని అదే రోజు కడపలో అప్పటి విపక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డిచే ఏపీయూడబ్ల్యుజే జిల్లా అధ్యక్షుడి హోదాలో శ్రీనాథ్‌రెడ్డి నిర్వహించడం విశేషం. దమ్మున్న జర్నలిస్టుగా ఆయనకు ఆయనే సాటి.
సంచలనంగా ‘సెవెన్‌రోడ్స్ జంక్షన్’..
జర్నలిస్టుగా శ్రీనాథ్‌రెడ్డికి ఇంగ్లీషు, తెలుగు భాషలో విశేష నైపుణ్యం ఉంది. ప్రతిపదం అర్థవంతంగా.. ఆలోచనాత్మకంగా రాయడంలో ఆయన దిట్ట అని అప్పటి తరం జర్నలిస్టులు గుర్తుచేసుకుంటున్నారు. అప్పట్లో ప్రతి బుధవారం ఆంధ్రప్రభలో ‘సెవెన్‌రోడ్స్ జంక్షన్’ శీర్షికతో శ్రీనాథ్‌రెడ్డి కొన్ని ఏళ్లపాటు ఏకదాటిగా ప్రత్యేక కథనాలు రాసేవారు. అందులో ఇప్పటికీ గుర్తుండిపోయే వార్తలు చాలా ఉన్నాయి. వాటిలో.. ఇద్దరు పార్లమెంటు సభ్యుల గురించి ‘ఆవు–దూడ’. ఎస్పీగా ఉమేష్‌చంద్ర పనితీరుపై ‘ఎగిరిపడుతోన్న ఎర్రటోపీ’ రాయచోటి ఉప ఎన్నికలపై ‘రిగ్గుడు వాడే–నెగ్గుడు’ ఇలాంటి దమ్మున్న శీర్షికలు ఎన్నో పెట్లారు.
ఉత్తర, దక్షిణ ధ్రువాలు సైతం....
ప్రజాస్వామ్య రాజకీయ నేతలు, పౌరహక్కుల నేతలు.. ఉత్తర దక్షిణ ధ్రువాలుగా 90వ దశకం కంటే ముందు ఉండేవారు. అలాంటి ఉత్తర, దక్షిణ ధ్రువాలకు దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి అనుసంధానకర్తగా నిలిచారు. అప్పట్లో జిల్లాలో క్రియాశీలకంగా పనిచేసిన న్యాయవాది కె. జయశ్రీపై రెండు తప్పుడు కేసులను పోలీసులు బనాయించారు. ఆ కేసులు తప్పుడు కేసులని.. జయశ్రీపై బనాయించడం ఏంటని ఎస్పీని శ్రీనాథ్‌రెడ్డి ధైర్యంగా ప్రశ్నించారు. ఆ తర్వాత ఆ కేసుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
► పౌరహక్కుల నేత బాలగోపాల్ జిల్లా పర్యటనకు వస్తే శ్రీనాథ్‌రెడ్డితో చర్చించేవారు. రాయలసీమలో విభిన్న రాజకీయ పార్టీల నేతలు, వారి వారి రాజకీయ పరిమితులు ఎలా ఉన్పప్పటికీ శ్రీనాథ్‌రెడ్డి కార్యాలయంలో సమ ప్రాధాన్యత లభించేది.
నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు....
కడప జిల్లా జర్నలిస్టు దిగ్గజం. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి భౌతికకాయం శుక్రవారం ఉదయం స్వగ్రామం కోరుగుంటపల్లెకు చేరనుంది. బంధువులు, సన్నిహితులు, ప్రజల సందర్శన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
రాయలసీమ ఉద్యమానికి కేరాఫ్ అడ్రస్....
రెండు దశాబ్దాలపాటు కడప శివలింగంపిళ్లై వీధిలోని శ్రీనాథ్‌రెడ్డి ఆఫీసు రాయలసీమ ఉద్యమానికి కేరాఫ్ అడ్రస్. రాజకీయ ఉద్దండులు వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎంవీ రమణారెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, జేసీ దివాకరరెడ్డి, ఆర్. రాజగోపాల్ రెడ్డి మొదలుకుని.. రాయలసీమ ఉద్యమంతో ముడిపడిన అందరి తలలో నాలుకగా ఆయన నిలిచారంటే అతిశయోక్తి కాదు.
రాయలసీమ నలుదిక్కుల నుంచి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వరకూ పాదయాత్ర చేపట్టాలనే కీలక నిర్ణయానికి రాజకీయ నేతలను ఏకీకరణ చేయడంలో ప్రధాన పాత్ర ఈయనదేనని నాటి ఉద్యమనేతలు వెల్లడిస్తున్నారు.
ప్రస్తుత కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి అధ్యక్షుడుగా, కోఆపరేటివ్ కాలనీ ప్రతాప్‌రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఏర్పాటైన ‘రాయలసీమ యువపోరాట సమితి’ కూడా ఈయన కార్యాలయంలో పురుడు పోసుకుంది.
విలువలకు పెద్దపీట వేసిన శ్రీనాథ్‌రెడ్డి
వైవీయూ : విలువలకు పెద్దపీట వేస్తూ పాత్రికేయానికి సరైన అర్థంలా నిలిచిన సీనియర్ పాత్రికేయులు, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి మృతి ఆవేదనకు గురిచేసిందని వైవీయూ వీసీ ఆచార్య జింక రంగజనార్ధన, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకటసుబ్బయ్య, గజ్జల మల్లారెడ్డి ట్రస్ట్ కన్వీనర్ డా. ఎన్. ఈశ్వరరెడ్డి తెలిపారు. వైవీయూ ద్వారా గజ్జెల మల్లారెడ్డి స్మారక పురస్కారం–2019ని ఆయన అందుకున్నారని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment