YSR District Latest News
-
హార్సిలీహిల్స్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
బి.కొత్తకోట: నిర్వహణలో రాష్ట్రంలోనే ఉత్తమ యూనిట్‌గా నిలిచిన హార్సిలీహిల్స్ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక అమలు చేస్తామని పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. శనివారం ఆయన హార్సిలీహిల్స్ పై పర్యాటకశాఖ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు. అతిథి గృహాల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులు పరిశీలించి బార్, రెస్టారెంట్ నిర్వహణ, వాటి విస్తరణ పనులపై సమీక్షించారు. రూ.10 కోట్లతో ప్రస్తుతం జరుగుతున్న పనులపై ఆయన తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. పనుల్లో ఐదు శాతం కూడా పూర్తి చేయించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైతే పర్యాటకశాఖకు ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికే భారీ ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. యాత్రి నివాస్ వద్ద నిర్మాణ పనులు చేపట్టవద్దని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆ స్థలంలో కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు కేటాయించాలని సూచించారు. రెవెన్యూ అతిథి గృహాన్ని టూరిజంకు అప్పగించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పట్టు శాఖ భవనాలను సద్వినియోగం చేసుకుంటే మరింత ఆదాయం వస్తుందని మేనేజర్ నేదురుమల్లి సాల్విన్ రెడ్డి ఆయన దృష్టికి తెచ్చారు. అధికారుల తీరుతో పర్యాటకశాఖ నాశనం అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ నాశనమైందని నూకసాని బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్సిలీహిల్స్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోర్డుకు తెలియకుండా యూనిట్లను ప్రైవేటుకు ఇస్తామని స్టెర్లింగ్ సంస్థను పర్యాటక కేంద్రాల్లో ఎవరు తిప్పుతున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు చేపడితే.. సంస్థకు నష్టం జరగాలని పనులు పూర్తి చేయకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని అన్నారు. పర్యాటకశాఖకు టీటీడీ కేటాయించిన వెయ్యి దర్శన టికెట్లను రద్దు చేయడాన్ని వ్యతిరేకించారు. ఏపీ టీడీసీ చైర్మన్ బాలాజీ చైర్మన్ దృష్టికి సాక్షి కథనం హార్సిలీహిల్స్‌ను ప్రైవేటుకు ఇచ్చే ప్రయత్నాలపై సాక్షిలో ప్రచురితమైన కథనాన్ని టూరిజం సిబ్బంది బాలాజీ దృష్టికి తెచ్చారు. స్పందించిన బాలాజీ ఉద్యోగులు, సిబ్బంది బాగా పనిచేస్తున్నారు, మంచి ఆదాయం వస్తోంది. ఇలాంటి యూనిట్ ప్రైవేట్‌కు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
23న జిల్లా స్థాయి క్విజ్ పోటీలు
కడప ఎడ్యుకేషన్: ఈ నెల 23న ఉదయం పది గంటలకు కడప రిమ్స్ వద్దగల కేంద్రీయ విద్యాలయంలో జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ మీనాక్షి తెలిపారు. పోటీల్లో పాల్గొనే 9, 10వ తరగతి విద్యార్థులు 23న ఉదయం 8.30 గంటలకు రిమ్స్ వద్ద కేంద్రీయ విద్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని డీఈఓ మీనాక్షి తెలిపారు. వివరాలకు 9490633934 నెంబర్లో సంప్రదించాలని ఆమె తెలిపారు. ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష రాయచోటి: జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. శనివారం అన్నమయ్య జిల్లాలో 26 పరీక్షా కేంద్రాలలో ప్రవేశ పరీక్షలను నిర్వహించారు. 6వ తరగతిలో ప్రవేశం పొందేందుకు 5058 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. శనివారం నిర్వహించిన పరీక్షలలో 4242 మంది విద్యార్థులు హాజరుకాగా 816 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం పరిశీలించారు. గణతంత్ర వేడుకలకు నూలివీడు విద్యార్థులు గాలివీడు: విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జనవరి 26వ తేదీన జరగనున్న గణతంత్ర వేడుకల పెరేడ్లో నూలివీడు విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ హైస్కూల్ స్కౌట్ మాస్టర్ కరకోటి చంద్రశేఖర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ 76వ భారత గణతంత్ర రాష్ట్ర స్థాయి వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో రాయలసీమ జోన్ (8 జిల్లాలు) నుంచి నూలివీడు జిల్లాపరిషత్ హైస్కూల్ 9వ తరగతి ఇద్దరు గైడ్ విద్యార్థులు కె.వైష్ణవి, పి.గీతామాధురి, ఇద్దరు స్కౌట్ విద్యార్థులు డి.నరసింహా, పి.గణేష్ ఎంపికయ్యారన్నారు. రాష్ట్రస్థాయి పెరేడ్‌కు మారుమూల ప్రాంతమైన నూలివీడు హైస్కూల్ విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు, చైర్మన్ జనార్దన్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. హుండీ ఆదాయం రూ.7 లక్షల 21వేలు గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మకొండ ఆలయానికి హుండీ ద్వారా రూ.7,21,112 ఆదాయం సమకూరింది. శనివారం స్థానిక ఆలయంలో రాయచోటి దేవదాయశాఖ అధికారి శశికుమార్ ఆధ్వర్యంలో అమ్మవారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మూడు నెలల కాలానికి సంబంధించి వివిధ కానుకలు, నగదు రూపంలో రూ.7,21,112, బంగారు ఆభరణాలు 29 గ్రాములు, వెండి 425 గ్రాములు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మొత్తాన్ని వాల్మీకిపురం సప్తగిరి గ్రామీణ బ్యాంకులో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శశికుమార్, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. అగ్గిపుల్లే.. అగ్గి పుల్లే! కురబలకోట: సినీ హీరో కిరణ్ అబ్బవరం శనివారం రాత్రి అంగళ్లులో సందడి చేశారు. వచ్చే నెల 14న విడుదల కానున్న దిల్ రూబా సినిమాలోని అగ్గిపుల్లే అనే పాటను అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో అట్టహాసంగా విద్యార్థుల హర్షధ్వానాల మధ్య విడుదల చేశారు. అంతకు ముందు ప్రదర్శించిన టీజర్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ విశ్వకరుణ్ దర్శకత్వంలో హీరోయిన్గా రుక్సానా ధిల్లాన్ నటిస్తున్న దిల్ రూబా సినిమాను వచ్చే నెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నామన్నారు. లవ్, రొమాంటిక్, యాక్షన్, ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను చిత్రీకరించామన్నారు. గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందన్నారు. సక్సెస్ అవుతుందన్న ధీమా ఉందన్నారు. -
● నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయండి
మైదుకూరు పర్యటనలో సీఎం చంద్రబాబు రిక్తహస్తం ● అభివృద్ధి చేస్తామంటూనే గల్లా పెట్టే ఖాళీ అని వ్యాఖ్యలు ● మైదుకూరు అభివృద్ధిపై ఎమ్మెల్యే పుట్టా విజ్ఞప్తులను తోసిపుచ్చిన సీఎం రాష్ట్రంలో పార్టీకి భవిష్యత్తు ఉండాలంటే టీడీపీ మూడో తరం నాయకుడు మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. మైదుకూరులో ఎన్టీ రామారావు వర్థంతి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై పవన్ కల్యాణ్ ఓపెన్‌గా మాట్లాడుతుండటంపై టీడీపీలో ఒకింత అసహనం మొదలైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో వాసు వ్యాఖ్యలు ఎలాంటి మార్పులకు దారితీస్తాయో వేచి చూడాల్సిందే. -
●మైదుకూరులో సీఎం చంద్రబాబు గ్రీన్ వాక్
మైదుకూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు మరోసారి మొండిచేయి చూపించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన బాబు ఈ ప్రాంత అభివృద్ధికి వరాలు ప్రకటిస్తారని జిల్లా ప్రజలు ఆశించారు. జిల్లా సంగతి దేవుడెరుగు.. చివరికి తాను పర్యటించిన మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధిపై కూడా మాట్లాడకుండా ‘గల్లా పెట్టె ఖాళీ’ అంటూ ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు. మైదుకూరులో శనివారం జరిగిన ఎన్టీఆర్ వర్థంతి సభకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అంతకు ముందుకు మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.. కడప జిల్లా రైతాంగానికి మేలు చేసే రాజోలి ఆనకట్టను పూర్తి చేయాలని, మైదుకూరులో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబును కోరారు. మైదుకూరు మున్సిపాలిటీలో రోడ్ల నిర్మాణానికి రూ.50కోట్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.50కోట్ల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మైదుకూరులో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ, ఉర్దూ జూనియర్ కళాశాలలకు సొంత భవనాలను నిర్మించాలని కోరారు. ఎగుమతి రకం కేపీ ఉల్లి అభివృద్ధి కోసం కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేయాలని, ఇంటింటికి తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేసే బృహత్తర నీటి పథకం కోసం రూ.90కోట్లను మంజూరు చేయాలని, చేనేతలకు పనులు కల్పించాలని, మైదుకూరులో క్రీడల అభివృద్ధి కోసం మినీ స్టేడియం నిర్మించాలని కోరారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. పుట్టా సుధాకర్ యాదవ్ చేంతాడంత కోరికల జాబితా ఇచ్చాడని అవన్నీ తీర్చడానికి.. గల్లా పెట్టె ఖాళీగా ఉంది.. చేయలేనని సభాముఖంగానే తోసిపుచ్చారు. దాంతో కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలు, ప్రజలు నిరాశకు గురయ్యారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం.. సంపదను సృష్టిస్తామని గొప్పలు చెప్పే చంద్రబాబుకు ఈ జిల్లాకొచ్చేసరికి ‘గల్లాపెట్టె ఖాళీ’ విషయం గుర్తుకొచ్చిందా అని జనం మండిపడుతున్నారు. సీమపై.. కడపపై ఎప్పుడూ కడుపుమంటేనని పలువురు విమర్శిస్తున్నారు. ● స్థానిక జెడ్పీ హైస్కూల్లో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మైదుకూరు మున్సిపాలిటీలో 12 కి.మీ. మేర సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం చేయిస్తామని హామీ ఇచ్చారు. డ్రైనేజీల విషయంలో మైదుకూరును మోడల్‌గా తీసుకుని మురికి నీటిని శుద్ధిచేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలుగు వారి ఆత్మ గౌరవం ఎన్టీఆర్.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కడప జిల్లా మైదుకూరులో శనివారం ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. స్థానిక కేఎస్సీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి చంద్రబాబు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం తాను చేసిన ప్రసంగంలో ఎప్పుడూ చెప్పే పాత విషయాలనే వల్లె వేశారు. పేదలకు పక్కా ఇళ్లు, వృద్ధులకు రూ.35లు పింఛను అందించిన ఘనత ఎన్టీఆర్‌ది అని.. తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు తీసుకొచ్చారంటూ గొప్పలు చెప్పుకొచ్చారు. కడప జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తాం.. రాబోవు రోజుల్లో జిల్లాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాం.. అంటూ పాత డైలాగులే చెప్పారు. ఈ ఏడాది 4వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయని, పోలవరం నుంచి 200 టీఎంసీల నీళ్లు రాయలసీమకు వస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని ‘నీటి మాటలు’ చెప్పారు. పోలవరం నీటిని బనకచర్లకు తీసుకురావడమే తన జీవితాశయం అన్నారు. కొప్పర్తి పారిశ్రామిక వాడ అభివృద్ధికి కేంద్రం రూ.2300 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. భవిష్యత్తులో కడప ఎయిర్‌పోర్టు నుంచి అనేక నగరాలకు విమానాలు నడిపేందుకు కృషి చేస్తామన్నారు. కేంద్రం ఇచ్చిన రూ.80 కోట్లతో గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాజోలిని పూర్తి చేసి 90వేల ఎకరాలకు నీళ్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత, రవాణా శాఖ మంత్రి రామప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పుట్టా సుధాకర్, వరదరాజులరెడ్డి, ఆర్.మాధవి, ఆదినారాయణరెడ్డి, పుత్తా చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈమె పేరు లావణ్య. మైదుకూరులోని పార్వతీనగర్. భర్త రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. పెద్ద కొడుకేమో ఇదిగో ఇలా చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. దివ్యాంగుల పింఛన్ కోసం ఆర్నెళ్లుగా తిరుగుతూనే ఉంది. సీఎంకు విన్నవించుకుందామని ఆశగా ఇక్కడికి వచ్చింది. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అర్జీ తీసుకుని పంపించారు. ఈసారైనా పింఛన్ మంజూరవుతుందో లేదో చూడాలి మరి. పట్టించుకునేవారేరి!‘పాపం హరి’...స్వర్ణ ఆంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర.. కార్యక్రమంలో భాగంగా శనివారం మైదుకూరులో సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ వాక్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి మైదుకూరులో శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మైదుకూరు పట్టణంలోని రాయల కూడలి నుంచి మంత్రి సవితా, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉపాధ్యా యులు, విద్యార్థులతో కలసి స్థానిక జెడ్పీ హైస్కూల్ వరకూ ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ హైస్కూల్ వద్ద పారిశుధ్య వాహనాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం హైస్కూల్లో జరిగిన స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజావేదికలో మైదుకూరు మున్సిపాలిటీకి చెందిన పారిశుధ్య కార్మికులు చెన్నమ్మ, అమ్ముళ్లమ్మ, కంపాక్టర్ వాహన డ్రైవర్ గంగాధర్‌లను సీఎం చంద్రబాబు సత్కరించారు. కేంద్రం పారిశుధ్యకార్మికులకు అవార్డులు ఇస్తున్న తరహాలోనే రాష్ట్రంలో కూడా వారికి అవార్డులు ఇస్తామని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. ఈ మేరకు మైదుకూరు మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు రూ.లక్ష నగదు బహుమతులను ప్రకటించారు. అనంతరం ‘స్వచ్ఛ ఆంధ్ర ’ ప్రతిజ్ఞ చేయించారు. పార్టీలో ఆయన సీనియర్ నాయకుడు... ఇదివరకు చంద్రబాబు పాల్గొన్న వేదికలపై చాలాసార్లు ఆశీనులయ్యాడు. తాజాగా మైదుకూరు సభలోనూ వేదికపైకి వచ్చాడు. ఏమైందో ఏమో.. ప్రొటోకాల్‌లో పేరు లేదంటూ సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం చెప్పడంతో ఇదిగో ఇలా వెనుదిరిగాడు. -
నాయీబ్రాహ్మణుల ఉపాధిపై ‘కత్తెర’ పడింది. ఏళ్ల తరబడి నమ్ముకున్న సంప్ర దాయ వృత్తిపై ఆధునిక సెలూన్ ‘కత్తి’కట్టింది. నాడు వైఎస్ జగన్ క్షురకుల కత్తికి వరాల సాన పట్టగా.. నేడు చంద్రబాబు సంక్షేమాన్ని అటకెక్కించి ‘మొండికత్తి’గా మార్చేశారు. ఫలితంగా ఓ వైపు రాబడి ల
కడప సెవెన్‌రోడ్స్: ఆధునిక సెలూన్స్ వచ్చి సంప్రదాయ వృత్తినే నమ్ముకున్న క్షురకుల జీవనోపాధిని చిధ్రం చేస్తున్నాయి. ఎంతోమంది ఉపాధి కోల్పొయి రోడ్డున పడుతున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాల వల్ల వీరికి ఆర్థిక భరోసా ఉండేది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు డీబీటీ పథకాలు ఎత్తివేశారు. దీంతో ఓ వైపు ఉపాధి లేక.. మరోవైపు ప్రభుత్వం నుంచి చేయూత కానరాక క్షురకులు అష్టకష్టాలు పడుతున్నారు. ● జిల్లాలో నాయీ బ్రాహ్మణులు చాలా మంది సాంప్రదాయంగా వస్తున్న తమ కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. కొందరు అద్దె గదుల్లో క్షౌరశాలలు ఏర్పాటు చేసుకుని బతుకుతుంటే... మరికొందరు వీధుల్లో బంకులు ఏర్పాటు చేసుకుని పొట్టపోసుకుంటున్నారు. ఇలాంటి వారు ఒక్క కడప నగరంలో 400 కు పైబడే ఉంటారని అంచనా. వీరు క్షౌరానికి రూ. 70–100 తీసుకుంటారు. షేవింగ్‌కు రూ. 20 అడుగుతారు. తల వెంట్రుకలకు రంగు వేసేందుకు రూ. 50 వసూలు చేస్తారు. పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలు వీరి వద్దకు వెళుతుంటారు. క్షౌర వృత్తితో పాటు వాయిద్యం తెలిసిన వీరు వివాహాలు, ఉత్సవాలు, చావులకు వెళుతుంటారు. కులవృత్తిని నమ్ము కున్న వీరికి రోజుకు సగటున రూ. 600 రాబడి ఉంటుందని తెలుస్తోంది. నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, ఆరోగ్యం, పిల్లల చదువులు ఇలా జీవన వ్యయం రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితుల్లో వచ్చే రాబడితో కష్టంగా కుటుంబాలను నెట్టుకొచ్చేస్తున్నామని చెబుతున్నారు. జగన్ సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేయూత కింద ఏడాదికి రూ.10 వేలు ఉచితంగా ఇస్తుండేవారని, ఆ డబ్బులు విద్యుత్ చార్జీలు, ఇతర ఖర్చులకు ఉపయోగపడేదని చెబుతున్నారు. అలాగే జగన్ అమలు చేసిన ఇతర సంక్షేమ పథకాల ద్వారా తాము లబ్ది పొందేవారమని చెబుతున్నారు. అలాగే తమ సామాజిక వర్గానికి టీటీడీ పాలక మండలిలో స్థానం కల్పించిన ఘనత కూడా ఆయనకే దక్కిందని పలువురు గుర్తు చేశారు. వీటితోపాటు దేవస్థానాల్లో తమకు ఉపాధి ఏర్పాటు చేశారని చెబుతున్నారు. దీంతో తమకు ఎంతో ఆర్థిక భరోసా ఉండేదన్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఈ పథకాలన్నీ రద్దు చేయడంతో తమలాంటి వారి బతుకు దుర్భరంగా మారిదంటూ వాపోతున్నారు. క్షురకుల పొట్టకొడుతున్న ఆధునిక సెలూన్లు భారీగా తగ్గిన రోజువారి రాబడి వృత్తిని వదులుకోవాల్సిన దుస్థితి ఇతర మార్గాల అన్వేషణలో పలువురు ప్రభుత్వం ఆదుకోవాలి సంప్రదాయ వృత్తినే నమ్ము కుని జీవిస్తున్న నిరుపేద క్షుర కులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్ట ళ్లు, జువైనల్ హోంలో వీరికి అవకాశం కల్పించాలి. షాపులను ఆధునీకరించుకోవడం కోసం సబ్సిడీ రుణాలు విరివిగా మంజూరు చేయాలి. అలాగే మంగళ వాయిద్య పరికరాలు సబ్సిడీతో పంపిణీ చేయాలి. వృద్ధులై పనిచేయలేని క్షురకులకు కళాకారుల పెన్షన్లు మంజూరు చేయాలి. – జేవీ రమణ, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, కడప ఉపాధిపై పెద్ద దెబ్బ నేను బీకాం కంప్యూటర్స్ చదివాను. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూనే సాంప్రదాయంగా వస్తున్న మా కుల వృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. ఇప్పుడు ఆధునిక సెలూన్లు రావడం వల్ల మా ఉపాధిపై పెద్ద దెబ్బ పడింది. రోజుకు సగటున రూ. 600 మాత్రమే వస్తుండడంతో ఎలా నెట్టుకు రావాలో అర్థం కావడం లేదు. – జి.నాగేంద్ర, వైఎస్సార్ కాలనీ, కడప బతుకుదెరువు భారంగా మారింది పెద్దపెద్ద సెలూన్లు రాకవల్ల మాకు గిరాకీలు బాగా తగ్గిపోయాయి. గతంతో పోలిస్తే రోజువారి ఆదాయం సగానికి పైగానే పడిపోయింది. నేను చదువుకోలేదు. మా కుల వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నాను. వృద్దులైన మా తల్లితండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆదాయం తగ్గిపోవడం వల్ల బతుకుదెరువు భారంగా మారింది. కొందరు వృత్తిని వదిలేసి కువైట్ వంటి దేశాలకు వలస వెళ్తున్నారు. – ఇ.వెంకటేశ్, సిద్దవటం -
మాస్టర్ ట్రైనర్ల కృషి ప్రశంసనీయం
డీఎఫ్ఓ ఎం.శివకుమార్ కడప సెవెన్‌రోడ్స్: సుస్థిర వ్యవసాయం, ఆగ్రో ఫారెస్ట్రీ, మొక్కల సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడంలో టీఓఎఫ్ మాస్టర్ ట్రైనర్ల కృషి ప్రశంసనీయమని జిల్లా అటవీ అధికారి ఎన్.శివకుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్ ఓ–బ్లాక్‌లోని సమావేశ మందిరంలో మాస్టర్ ట్రైనర్ల సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతనెల 8న వ్యవసాయ, ఉద్యాన, డీఆర్డీఏ, ఎఫ్‌పీఓ శాఖల నుంచి ఎంపిక చేసిన మాస్టర్ ట్రైనర్లు ఐదు రోజులపాటు ఆగ్రో ఫారెస్ట్రీ మొక్కల సాగుపై శిక్షణ పొందారన్నారు. వీరు జిల్లాలోని 58 గ్రామాల్లో 6141 మంది రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వారికి అవగాహన కల్పించారని తెలిపారు. ప్రభుత్వం నిర్దశించిన లక్ష్యాలను సాధించడంలో మాస్టర్ ట్రైనర్ల కృషి మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా టీఓఎఫ్ మాస్టర్ ట్రైనర్లకు ఆయన సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి డాక్టర్ అయితా నాగేశ్వరరావు, జిల్లా ఉద్యాన అధికారి సుభాషిణి, బద్వేలు సబ్ డీఎఫ్ఓ బి.స్వామి వివేకానంద తదితరులు పాల్గొన్నారు. -
● ఆధునిక సెలూన్ల రాకతో..
ఆధునికత అంటూ ఇటీవల జిల్లాలో కొత్తకొత్త పేర్లతో సెలూన్లు ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా కడప నగరంతో పాటు ప్రధాన పట్టణాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన పెట్టుబడిదారులు ఏసీలతో కూడిన భారీ సెలూన్లు ఏర్పాటు చేశారు. గ్రీన్ ట్రెండ్స్, మోజ్, (బీ)యూ, డబల్ సెవెన్, స్టూడియో సెవెన్, ఎంఫైర్ తదితర సెలూన్ల పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. కొత్త కొత్త హంగులతో ఇవి యువతను ఆకర్శిస్తున్నాయి. బుల్లెట్ కటింగ్, మిడ్ ఫేడ్, లోఫేడ్ వంటి పేర్లతో కటింగ్, షేవింగ్, హెడ్ వాష్ చేసి రూ. 500 చొప్పున రాబడుతున్నారు. తల వెంట్రుకలకు రంగు వేయాలంటే రూ. 300 అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. రకరకాల క్రీముల పేరిట డబ్బులు బాగానే గుంజుతున్నారు. వీరి వద్దకు వెళ్లాలంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. వీధి బంకుల నిర్వాహకులు కూడా రకరకాల రీతుల్లో కటింగ్, షేవింగ్స్ చేయగలరు. హంగు ఆర్భాటాలు ఉండవు గనుక యువత వెళ్లడం లేదు. దీంతో రాబడి నామమాత్రంగా ఉంటోందని బంకు నిర్వాహకులు వాపోతున్నారు. బంకు ఏర్పాటు చేసుకున్నందుకు మున్సిపాలిటీకి పన్ను చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. -
అభివృద్ధి పథంలో వీరబ్రహ్మ క్షేత్రం
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలోని శ్రీ వీరబ్రహ్మ క్షేత్రంలో గతం కంటే ఇప్పుడు అభివృద్ధి కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోకర్ణ శ్రీనివాస్ తెలిపారు. ఆయన బృందంతో కలిసి శనివారం మద్విరాట్ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మఠం ఫిట్పర్సన్ శంకర్‌బాలాజీ, మేనేజర్ ఈశ్వరాచారితో కలిసి మఠంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంత మంది అభివృద్ధి పనులు జరగలేదని, నిధులు దుర్వినియోగం అయ్యాయని సమాచారం ఇవ్వడంతో బీజేపీ తరఫున ఇక్కడికి రావడం జరిగిందన్నారు. ఇక్కడ పనులు చూసిన తరువాత అభివృద్ధి జరిగినట్లు కన్పిస్తోందన్నారు. భక్తుల కోసం ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. వ్యాపార సముదాయాల నిర్మాణాలు జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వపు మఠాధిపతి కుమారులు వీరభద్రయ్యస్వామి, వీరంబొట్లయ్య స్వామి, దత్తాత్రేయస్వామి, స్థానికులు పాల్గొన్నారు. -
‘ఆల్విన్’ కథ.. ఇక అంతేనా..!
రాయలసీమకే తలమానికంగా నిలిచిన ఆల్విన్ రిఫ్రిజిరేటర్ల కర్మాగారానికి గ్రహణం పట్టింది. ఆది నుంచి ఆటంకాలు ఎదుర్కొంది. ప్రభుత్వం నుంచి ప్రైవేటు సంస్థలైన ఓల్టాస్, ఎలక్ట్రోలెక్స్ చేతుల్లోకి మారి చివరికి మూతపడింది. పర్యవసానంగా జిల్లాలో భారీ పరిశ్రమ ఉన్నా.. లేనట్టుగానే మారింది. రాజంపేట : అన్నమయ్య జిల్లాలో నందలూరు సమీపంలో వెలసియున్న ఆల్విన్ రిఫ్రిజిరేటర్ల కర్మాగారానికి 1987 ఏప్రిల్ 3న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శుంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కర్మాగారం ప్రారంభోత్సవానికి మొదటి నుంచి ఆటంకాలు ఎదురవుతూనే వచ్చాయి. 1987 మార్చి 27న జరగాల్సి ఉండగా ఏప్రిల్ 3కి వాయిదా పడింది. అనంతరం కేవలం 15 నెలల్లో నిర్మాణం పూర్తి అవుతుందని భావించగా.. ఏడాది కాలం టెండర్లతోనే గడిచిపోయింది. నిర్మాణం పూర్తయై 1989 నవంబరులో ఆనాటి సీఎం ఎన్టీఆర్ ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంది. అప్పట్లో ఎన్నికలు రావడంతో పరిస్థితి తారుమారైంది. 1990లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డితో మార్చిలో ఒక సారి ప్రయత్నం చేశారు. ఇలా ప్రారంభోత్సవానికి పురిటి కష్టాలు పడింది. చేతులు మారుతూ.. ప్రైవేటు పరం దిశగా.. నందలూరు ఆల్విన్ కర్మాగారాన్ని 1992లో ప్రైవేటుపరం చేస్తామని ప్రకటించారు. అప్పట్లో ఆల్విన్‌లో 700 మంది కార్మికులు, 150 మంది హెల్పర్లు, 60 మంది ఇంజినీర్లు, సూపర్వైజర్లు 1200 మంది ఉన్నారు. హైదరాబాద్ ఆల్విన్‌కు రెండేళ్లుగా నష్టం సంభవించడంతో అక్కడి నుంచి నందలూరుకు ముడిసరుకుల రవాణా ఆగిపోయింది. 2001లో ఉత్పత్తి ఆగిపోయింది. రెండేళ్లు కార్మికులను కూర్చోబెట్టి జీతాలు ఇచ్చారు. 2003లో కార్మికులకు వీఆర్ఎస్ ఇచ్చారు. 21 ఏళ్లుగా తెరుచుకోని.. నందలూరు ఆల్విన్ మూతపడి 21 ఏళ్లయినా తెరుచుకోని పరిస్థితి. ప్రభుత్వాలు, పాలకులు భారీ పరిశ్రమను మల్టీనేషనల్ కంపెనీలకు ఇవ్వడం.. వారు నష్టాల సాకుతో అమ్మివేయడం.. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఓ బిల్డరు తీసుకోవడం జరిగింది. భూములు, క్వార్టర్స్, భవనాలు నిరుపయోగంగా మారాయి. జిల్లాకు చెందిన పలువురు కొనుగోలు చేయడానికి ముందుకొచ్చినా.. బిల్డరు చెప్పే రేటుకు ఒప్పుకోక, అలాగే వాస్తు సరిగ్గా లేదనే భావనతో కొంత వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికై నా భారీ పరిశ్రమ దిశగా పెద్ద సంస్థలు ముందుకొస్తేనే ఆల్విన్ కర్మాగారానికి పూర్వవైభవం సంతరించుకుంటుందని నిరుద్యోగులు భావిస్తున్నారు. అంతేగాకుండా ఆల్విన్ ఫ్యాక్టరీని పరిశ్రమల చట్టం ప్రకారం ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్‌ను ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు. నవ్యాంధ్రలో జిల్లా వరకు భారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే నందలూరు ఆల్విన్ ఫ్యాక్టరీ అనుకూలమనే ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పాలకులదే. ‘కల’గానే ప్రభుత్వ పరిశ్రమ నిరుద్యోగుల ఎదురుచూపులు 21 ఏళ్లయినా తెరుచుకోని ఫ్యాక్టరీ కూటమి దృష్టి సారించాలంటున్న జనం -
ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
పెండ్లిమర్రి : మండలంలోని మాచునూరు గ్రామానికి చెందిన మాచునూరు శ్రీనివాసులు (37) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. శ్రీనివాసులు కొంత కాలం నుంచి అనా రోగ్యంతో బాధ పడుతుండే వాడు. మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతు ర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సుపెండ్లిమర్రి : కడప–పులివెందుల ప్రధాన రహదారిలోని మిట్టమీదపల్లె గ్రామ సమీపంలో శనివారం ఆటోను ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మిట్టమీదపల్లె గ్రామానికి చెందిన బాదుల్లా(50) ఆటో నడుపుకొంటూ, గ్రామాల్లో పరుపులు కుట్టుకుంటూ ఉండేవాడు. జంగంరెడ్డిపల్లె, రంపతాడు గ్రామాలకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మిట్టమీదపల్లె సమీపంలో పులివెందుల నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటో రోడ్డు డివైడర్‌పై బోల్తా పడింది. ఆటో నడుపుతున్న బాదుల్లాకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు మృతుడి బంధువులు తెలిపారు. బాదుల్లాకు భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఆటో డ్రైవర్ మృతి -
కారుకు నిప్పు
రాయచోటి : జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో టీడీపీ వర్గీయుల గ్యాంగ్ దాష్టికానికి శనివారం తెల్లవారుజామున కారు దగ్ధమైంది. పట్టణ పరిధి కొత్తపల్లిలోని లాల్ మసీదు సమీపంలో నిలిపిన కారుకు టీడీపీకి చెందిన మైనార్టీ నాయకులు, వారి అనుచరులు నిప్పు పెట్టారు. తెల్లవారుజామున రెండు గంటల సమీపంలో కొంతమంది గ్యాంగ్ సభ్యులు కొత్తపల్లి వీధుల్లో తిరుగుతూ.. నిలబెట్టిన బైకులను పడదోస్తూ వీరంగం సృష్టించారు. అనంతరం కొద్దిసేపటికి మసీదు సమీపంలో నిలిపిన కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. పట్టణానికి చెందిన టీడీపీ నేత ఖాదర్ బాషా అనుచరుల వీరంగం అధికమైందని స్థానిక మైనార్టీలు వాపోతున్నారు. కారు దగ్ధం ప్రమాదం కూడా ఖాదర్ బాషా అనుచరులు సయ్యద్, డాకు అనే గ్యాంగ్ సభ్యుల కారణంగానే సంభవించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు అర్బన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. -
పూర్వ వైభవం తీసుకురావాలి
ప్రభుత్వం రంగ సంస్థనే ఆల్విన్ ఫ్యాక్టరీలో నెలకొల్పాలి. ఈ పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆల్విన్‌లో ప్రత్యామ్నాయ పరిశ్రమకు ఉద్యమించాల్సిన సమయం ఆస్నమైంది. ఆల్విన్ కర్మాగారం ఏర్పాటు లక్ష్యం నీరుగారకుండా ఉండాలంటే మళ్లీ పరిశ్రమ ఏర్పాటు చేయాలి. మాజీ సీఎం ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన కర్మాగారానికి కూటమి సర్కారు ఊపిరిపోయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. –మల్లెల విజయుడు, ఆల్విన్ మాజీ కార్మికుడు, వైపీపల్లె, నందలూరు ఫైనల్స్‌కు చేరిన కడప, అనకాపల్లి జట్లు -
ఉత్కంఠ భరితంగా రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు
మదనపల్లె సిటీ : మదనపల్లె పట్టణం బీటీ కాలేజీ హాకీ మైదానంలో 14వ ఏపీ సబ్ జూనియర్స్ రాష్ట్ర స్థాయి బాలుర హాకీ పోటీలు ఉత్కంఠ భరితంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 22 జట్లు పాల్గొన్నాయి. మొదటి సెమీ ఫైనల్స్‌లో తిరుపతి–కడప జిల్లా జట్లు పోటీ పడ్డాయి. ఇందులో 5–1 స్కోరుతో కడప జిల్లా జట్టు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. కడప జట్టు నుంచి జాకీర్‌హుస్సేన్ రెండు గోల్స్, సాయిమోహన్ ఒక గోల్, బాలాజీ ఒక గోల్, మిథుల్కౌశిక్ ఒక గోల్ చేశారు. తిరుపతికి చెందిన నవీన్‌కుమార్ ఒక గోల్ చేశారు. రెండవ సెమీఫైనల్స్ మ్యాచ్‌లో అన్నమయ్య– అనకాపల్లి జట్లు పోటీ పడ్డాయి. 6–0 స్కోరుతో అనకాపల్లి జట్టు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. ఫైనల్స్ మ్యాచ్ ఆదివారం కడప–అనకాపల్లి జట్ల మధ్య జరగనున్నట్లు హాకీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శివప్రసాద్, కోశాధికారి పి.ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఉదయం లీగ్, క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ పోటీలు జరిగాయి. ఉదయం నుంచి హాకీ మైదానంలో క్రీడాకారులతో సందడి నెలకొంది. పోటీలను హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చాణిక్యరాజు, కోశాధికారి థామస్, కోచ్ నౌషాద్, కన్వీనర్ హితేష్రావు, పీడీలు శివప్రసాద్, జలజ తదితరులు పర్యవేక్షించారు. ఆర్టీసీ బస్సులో మంటలుసిద్దవటం : కడప– చైన్నె జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి పొగలు వచ్చాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పులివెందుల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం పులివెందుల నుంచి చైన్నెకి వెళతుండగా సిద్దవటం మండలం భాకరాపేట మూడు రోడ్ల కూడలిలోకి వచ్చే సరికి.. ఒక్కసారిగా రేడియేటర్ వద్ద పొగతో కూడిన మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను దింపేశారు. స్థానికులు హుటాహుటిన బస్సులోని మంటలపై బిందెలతో నీళ్లు పోయడంతో బస్సుకు పెను ప్రమాదం తప్పింది. దీంతో వాహనాలు దాదాపు 20 నిమిషాలు ఆగిపోయాయి. బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిని సురక్షితంగా వేరే బస్సులో ఎక్కించి వారి ప్రాంతాలకు తరలించామని ఏఎస్ఐ సుబ్బరామచంద్ర తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో సామగ్రి దగ్ధం తంబళ్లపల్లె : ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన అగ్ని ప్రమాదంలో వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. సంఘటన శనివారం వెలుగు చూసింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని సాలివీధికి చెందిన కిషోర్ తహసీల్దార్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. గత సోమవారం తల్లి సరస్వతితో కలిసి సంక్రాంతి పండుగకు రాయచోటిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. వారు తిరిగి శనివారం ఉదయం ఇంటికి వచ్చి తలుపులు తెరవగా వస్తువులన్నీ కాలిబూడిదయినట్లు గుర్తించారు. ఇంటిలోని ఫ్రిడ్జ్, ఫ్యాన్లు, బట్టలు, ఫర్నీచర్ కాలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగివుండవచ్చునని బాధితులు తెలిపారు. సుమారు రూ.6 లక్షల నష్టం వాటిలినట్లు వారు వాపోయారు. ● తప్పిన ప్రమాదం ● ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు -
ఎందరికో ఉపాధినిచ్చిన పరిశ్రమ
సీమలో ఎందరికో ఉపాధినిచ్చిన పరిశ్రమను సిక్ ఇండ్రస్టీగా మార్చేశారు. భారీ పరిశ్రమ ఏర్పాటుకు ఆల్విన్ ఫ్యాక్టరీ అనుకూలమని పాలకులకు తెలుసు. మూతపడి, ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న ఆల్విన్ విషయంలో ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకోవాలి. మా లాంటి వందలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించిన ఆల్విన్ దుస్థితి మమ్మల్ని కలిచివేస్తుంది. పాలకులు పరిశ్రమ ఏర్పాటు చేసి ఈ ప్రాంత నిరుద్యోగ సమస్య తీర్చాలి. – ముక దుర్గయ్య, ఆల్విన్ ఐఎన్టీయూసీ మాజీ కార్మిక నేత, నందలూరు -
మహిళ మృతిపై ఆందోళన
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో శస్త్రచికిత్స అనంతరం రమాదేవి (38) అనే మహిళ మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రగుంట్ల మండలంలోని తుమ్మలపల్లె గ్రామానికి చెందిన వడ్డెరపు రమాదేవికి కడుపు నొప్పి రావడంతో ప్రొద్దుటూరులోని గాంధీరోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. పరిశీలించిన వైద్యుడు హెర్నియా కారణంగా కడుపునొప్పి వచ్చినట్లు నిర్ధారణ చేసి శుక్రవారం రాత్రి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అనంతరం చికిత్స పొందుతున్న రమాదేవి శనివారం మృతి చెందింది. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే మహిళ మృతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9.30 వరకు వారు గాంధీరోడ్డుపై బైఠాయించారు. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి హాస్పిటల్‌లోని రమాదేవి మృతదేహాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. రమాదేవి భర్త శ్రీనివాసులు జువారి సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. వారికి జగదీష్ అనే కుమారుడితోపాటు రాధిక, చంద్రిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బాధితులు రోడ్డుపై బైఠాయించడంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించి పోయింది. సీఐలు గోవిందరెడ్డి, యుగంధర్, రామకృష్ణారెడ్డిలు సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. రాత్రి 9.45 సమయంలో కుటుంబ సభ్యులు రమాదేవి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. కాగా ఇందులో వైద్యుడి నిర్లక్ష్యం లేదని, అనారోగ్యం కారణంగానే రమాదేవి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు మీడియా సమావేశంలో చెప్పడం చర్చనీయాంశమైంది.రోడ్డుపై బైఠాయించిన బాధితులు -
సమాజ సేవే ‘రెడ్ల’ ధ్యేయం
కడప కల్చరల్ : సమాజానికి అవసరమైనపుడు తన సేవలను ప్రాణాలకు తెగించి, త్యాగాలు చేసి మనిషిగా తన బాధ్యతను చాటుకున్నవాడు నిజమైన రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థాన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి అన్నారు. రెడ్డి సేవా సమితి సంస్థ కడప శాఖ ఆధ్వర్యంలో శనివారం నగర పరిధిలోని డీఎస్ఆర్ కల్యాణ మండపంలో రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రోలయ వేమారెడ్డి నుంచి నేటి వరకు అనేక మంది రెడ్లు దేశానికి అనేక రంగాల్లో సేవలందించారన్నారు. తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మొదలుకొని తెలుగునేలపై 11 మంది రెడ్లు ముఖ్యమంత్రులుగా సేవలందించారన్నారు. కార్యక్రమంలో ముందుగా ‘మేలుకొలుపు’ ప్రత్యేక సంచికను ఆయన అతిథులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత పుత్తా పుల్లారెడ్డి రచించిన ‘మహాభారత విజ్ఞాన సర్వస్వం’ నాలుగు సంపుటాలను ఆవిష్కరించి, రచయితకు ‘సాహిత్య రత్నాకర’ బిరుదు ప్రదానం చేశారు. విశిష్ట అతిథి, రాజంపేట శాసన సభ్యుడు ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ రెడ్లలో అనేక తెగలు ఉన్నా.. రెడ్లందరూ ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో ఉన్న విశ్వవిద్యాలయానికి యోగి వేమన విశ్వవిద్యాలయం పేరు పెట్టడం గర్వకారణమన్నారు. సభాధ్యక్షులు, రెడ్డి సేవాసమితి అధ్యక్షులు ఆచార్య కుప్పిరెడ్డి నాగిరెడ్డి మాట్లాడుతూ సంస్థ ఆవిర్భావ వికాసాలను సభకు పరిచయం చేశారు. ప్రధాన కార్యదర్శి లెక్కల కొండారెడ్డి నివేదిక సమర్పిస్తూ సంస్థ పుట్టిన 25 ఏళ్లుగా వరద, కరోనా బాధితులు, పేద రైతులు, విద్యార్థులకు చేసిన అనేక సేవా కార్యక్రమాలను సభకు తెలియజేశారు. ఆత్మీయ అతిథి, శాసనమండలి సభ్యులు ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పది మందికి అన్నం పెట్టే గుణం రెడ్లకుంటుందని, ఆ దిశగా సేవలందిస్తూ రెడ్డి సేవాసమితి ఏర్పాటు కావడం వారికి ఎంతో సహకారాన్ని అందించినట్లయిందన్నారు. ఎందరో విద్యార్థినులకు ఆశ్రయం ప్రత్యేక అతిథి, యోగి వేమన విశ్వవిద్యాలయం సహ ఆచార్యులు కొవ్వూరు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ పాతికేళ్లుగా విద్య, వసతిని కల్పించి ఎందరో విద్యార్థినులకు ఆశ్రయం కల్పిస్తున్న రెడ్డి సేవాసమితి సేవలు ప్రశంసనీయమన్నారు. ప్రతి రెడ్డికి ఆత్మాభిమానంతోపాటు వినయం కూడా ఉండటం అవసరమన్నారు. ప్రత్యేక ఆహ్వానితులు, హంస అవార్డు గ్రహీత డాక్టర్ నరాల రామారెడ్డి మాట్లాడుతూ గతంలో తనను గండపెండేర సత్కారంతో సత్కరించిన సందర్భాన్ని గుర్తుకు చేశారు. రెడ్డి సేవాసమితి అభ్యుదయం దిశగా సేవలందించడం వెనుక నిర్వాహకుల కృషిని కొనియాడారు. వేమన పద్యం మార్గదర్శకం ప్రత్యేక ఆహ్వానితులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ వేమన పద్యాలు నాటి, నేటి, రేపటి సమాజానికి మార్గదర్శకాలన్నారు. ప్రత్యేక ఆహ్వానితులు, ప్రముఖ జానపద పరిశోధకులు ఆచార్య చిగిచెర్ల కృష్ణారెడ్డి రాయలసీమ జానపద గేయాలను ఆలపించి సభను అలరింపజేశారు. ప్రత్యేక ఆహ్వానితులు కొండా లక్ష్మీకాంతరెడ్డి మాట్లాడుతూ రెడ్డి సేవా సమితి ఆవిర్భావం వెనుక సహకరించిన దాతలను సభకు తెలియజేశారు. యలమర్తి మధుసూదన్వేమన పద్యాలను గానం చేశారు. వేమన పద్యపఠన పోటీల్లో విజేతలైన విద్యార్థులను నగదు బహుమతి, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. అతిథులను, ‘మేలుకొలుపు’ సంచిక సంపాదకులు డాక్టర్ భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, డాక్టర్ చింతకుంట శివారెడ్డి, డాక్టర్ వెల్లాల వెంకటేశ్వరాచారి, డాక్టర్ అనుగూరు చంద్రశేఖరరెడ్డి, కొండూరు జనార్దనరాజు, చదలవాడ వెంకటేశ్‌లను, రెడ్డి సేవా సమితి సంస్థ అభివృద్ధికి తోడ్పడిన దాతలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. గుడ్ల ఆదినారాయణరెడ్డి వందన సమర్పణ చేశారు. వైఎస్సార్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి సభాసమన్వయం చేశారు. కార్యక్రమంలో పద్మప్రియ చంద్రారెడ్డి, కార్యవర్గ సభ్యులు, రెడ్డి ప్రముఖులు పాల్గొన్నారు. జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి ఘనంగా రెడ్డి సేవా సమితి రజతోత్సవ వేడుకలు ‘మేలుకొలుపు’ సంచిక ఆవిష్కరణ -
ప్రైవేటు ఆస్పత్రి వద్ద ఆందోళన
పోరుమామిళ్ల : పోరుమామిళ్ల పంచాయతీ రామాయపల్లెకు చెందిన కారు రామయ్య (50) వైద్యం వికటించి మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు రాత్రి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఎస్ఐ కొండారెడ్డి కథనం మేరకు గురువారం అర్థరాత్రి రామయ్యకు కడుపులో మంటగా ఉందని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న డాక్టర్ జనార్ధనరెడ్డి ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్ పరీక్షించి ఇంజెక్షన్, మందులు ఇచ్చారు. ఇంటికి వెళ్లగానే వాంతులు రావడం, కడుపులో బాధ అధికం కావడంతో మళ్లీ ఆసుపత్రికి వచ్చాడు. డాక్టర్ పరిశీలించి మరొక ప్రిస్కిప్సన్ రాశాడని, ఆ మందులు తీసుకొని ఇంటికి వెళ్లగా.. శరీరం నీలుక్కు పోతుండటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తెచ్చారు. పరీక్షించిన డాక్టర్ రామయ్య మృతి చెందాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు.. ‘నీవే చంపావంటూ’ ఆందోళనకు దిగారు. దాంతో డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆసుపత్రి ఎదుట రాత్రంతా శవాన్ని ఉంచి బంధువులు డాక్టర్ నిర్లక్ష్యమే రామయ్య చావుకు కారణమంటూ కేకలు వేశారు. డాక్టర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం ఉదయం ఎస్ఐ వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపుతామని, రిపోర్టు వచ్చాక కేసు నమోదు చేస్తామని వారికి నచ్చజెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. రామయ్యకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారు గుండెలవిసేలా రోదించారు.వైద్యం వికటించి మృతి చెందాడని బాధితుల నిరసన -
వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం
కడప ఎడ్యుకేషన్ : అఖిల భారత అంతర్ విశ్వ విద్యాలయాల పురుషుల వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో వైవీయూకు కాంస్య పతకం లభించింది. యోగివేమన క్రీడా బోర్డు కార్యదర్శి, వ్యాయాయ విద్య విభాగ అధిపతి కొవ్వూరు రామసుబ్బారెడ్డి శుక్రవారం క్రీడాకారుడిని అభినందించి, వివరాలు వెల్లడించారు. జలందర్‌లో జనవరి 15 నుంచి 21వ తేదీ వరకు యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోటీలలో యోగివేమన విశ్వ విద్యాలయ చాంపియన్ లిఫ్టర్ పోటీలలో దేవరకొండ ప్రేమ్‌సాగర్ 81 కేజీల విభాగంలో సత్తా చాటి వేమన విశ్వ విద్యాలయానికి కాంస్య పతకం సాధించి పెట్టారని తెలిపారు. ఈ క్రీడాకారుడు సీఎస్ఎస్ఆర్, ఎస్‌ఆర్‌ఆర్‌ఎస్ డిగ్రీ కళాశాలల్లో విద్యను అభ్యసించారని చెప్పారు. ఈయన స్నాచ్నందు 140 కేజీలు, క్లీన్ అండ్ జర్క్స్థాయిలో 166 కేజీల బరువును ఎత్తి మొత్తం 306 కేజీలతో జాతీయ స్థాయిలో బ్రాంజి మెడల్ సాధించాడని చెప్పారు. ఇదే క్రీడాకారుడు దక్షణ, పశ్చిమ మండల విశ్వ విద్యాలయాల పోటీలలో విశ్వవిద్యాలయానికి కాంస్య పతకం సాధించి అఖిల భారత అంతర్ విశ్వ విద్యాలయాల పోటీలకు అర్హత సాధించాడన్నారు. ఈ సందర్భంగా వైవీయూ ఉపకులపతి, క్రీడాబోర్డు చైర్మన్ అచార్య కృష్ణారెడ్డి క్రీడాకారుడిని అభినందించి రాబోయే ఖేలో ఇండియా పోటీలకు వైవీయూ తరఫున భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు. వైవీయూ కుల సచివులు ఆచార్య పుత్తపద్మ, ప్రధానాచార్యులు రఘనాధరెడ్డిలు క్రీడాబోర్డు, శిక్షకులు, టీమ్ మేనేజర్ ప్రసాద్‌రెడ్డిని అభినందించారు. -
‘శుభమస్తు’లో బహుమతి స్కూటీల పంపిణీ
కడప కల్చరల్ : కడప నగరంలోని శుభమస్తు షాపింగ్‌మాల్‌లో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలైన వారికి శుక్రవారం బహుమతులు అందజేశారు. కడపకు చెందిన కొనుగోలుదారులకు డిసెంబర్ 31 నుంచి ఈ నెల 17 వరకు మాల్లో కొనుగోలు సందర్భంగా ఇచ్చిన లక్కీ డ్రా కూపన్లను లాటరీ తీసిన అనంతరం వారికి ఎలక్ట్రిక్ స్కూటీలు బహుమతిగా అందజేసే ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జరిగిన లక్కీ డ్రాలో కడపకు చెందిన రామకృష్ణ, నాగార్జున, గురవయ్య, నరసయ్యలు బహుమతులు గెలుచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమానికి మానస ఎండీ చిన్నపరెడ్డి, సిటీ కేబుల్ ఎండీ సూర్య నారాయణ, యోగివేమన యూనివర్సిటీ వీసీ కృష్ణారెడ్డి, వన్‌టౌన్ సీఐ రామకృష్ణ, మానస ఇన్ ఎండీ అనంతమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నపరెడ్డి మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ ఏర్పాటుతో ప్రజలకు నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరకు అందించడంతోపాటు స్థానిక యువతలో పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నాణ్యత ప్రమాణాల్లో ఎలాంటి రాజీ లేకుండా వస్త్రాలను అందించడం పట్ల అభినందించారు. అనంతరం లయన్ క్లబ్ సభ్యులు వెంకటసుబ్బయ్య, మన్సూర్ అలీఖాన్ తదితరులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్లు మడక వెంకటరమణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
బైరెటీస్ను కొల్లగొడుతున్న టీడీపీ నేతలు
పులివెందుల రూరల్ : పులివెందుల నియోజకవర్గంలోని టిఫిన్ బైరెటీస్ను టీడీపీ నాయకులు కొల్లగొడుతున్నారని వైఎస్సార్సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆరు నెలల వ్యవధిలోనే అరాచకాలు ఎక్కువయ్యాయని, తనపైన అవినీతి ఆరోపణలు నిరూపిస్తే దేనికై నా సిద్ధమని పేర్కొన్నారు. శుక్రవారం పులివెందుల పట్టణంలోని భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ నాయకులు నాగేళ్ల సాంబశివారెడ్డి, బయపురెడ్డి, చిన్నప్ప, వరప్రసాద్, హాలు గంగాధరరెడ్డి, రసూల్, వేల్పుల గ్రామంలోని రైతులు, నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డి మాట్లాడుతూ ‘నిజాయితీగా బతుకుతుంటే నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారా, నీవు మోసం చేయడం వల్లే ఏజెంట్‌గా తొలగించారు’ అని టీడీపీ నాయకుడు పేర్ల పార్థసారథిరెడ్డిపై మండి పడ్డారు. వ్యవస్థలన్నీ నాశనం చేసి దోచుకో, దాచుకో అన్న రీతిలో టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. ‘టిఫిన్ బైరెటీస్ ఏజెంట్‌గా పార్థసారథిరెడ్డి ఉన్నది వాస్తవమేనని, కానీ ఆయన నట్టు, బోల్టులను అమ్ముకుని మోసం చేయడం వల్లనే ఏజెంట్‌గా తప్పించి 2015లో నన్ను పెట్టారు’ అని, ఎరగ్రుంట్ల ఖనిజ వనరుల శాఖ వారే ఏజెంట్‌గా జారీ చేసిన నియామక పత్రాన్ని మీడియాకు చూపించారు. కోట్ల సరుకు చోరీపై ఫిర్యాదు ‘ఆ తర్వాత టిఫిన్ కంపెనీ దివాలా తీయడంతో అప్పుల వాళ్లంతా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లారని, అక్కడ ఆ ట్రిబ్యునల్ తీర్మానం చేసి ఏజెంట్‌గా వాసుదేవన్‌ను నియమించారని, వాసుదేవన్నే 2019లో నన్ను కేర్ టేకర్‌గా నియమించారు’ అన్నారు. బెంగళూరుకు చెందిన ఎంబీసీ గ్రూప్ కంపెనీ హక్కులను పొందిందని ఆ కంపెనీ డైరెక్టర్ ధర్మలింగం నన్ను కేర్ టేకర్ ఏంజెంట్‌గా కొనసాగించారన్నారు. అందుకు సంబంధించిన నియామక పత్రాలను మీడియాకు చూపించారు. ఈ నెల 13 ,14వ తేదీన రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల విలువ చేసే ఖనిజాల సరుకును దొంగలించారని, అందుకు సంబంధించి కంపెనీ ఏజెంట్ అయినందున ఆ దొంగతనం గురించి పోలీసు అధికారులకు, మైన్స్ అధికారులకు, అలాగే కంపెనీ వారికి తెలియజేశానన్నారు. వాస్తవాలు తెలియకుండా ఇష్టమొచ్చినట్లు మీడియా ముందు మాట్లాడటం మంచిది కాదన్నారు. వేల్పులలో నేను రెండు మైన్సులు చేసిన మాట వాస్తవమే అని, కానీ లీజు ఉన్న మైన్స్‌లను మేము చేశామన్నారు. వేల్పులలో మైన్స్ యజమానులైన సుకర్ బాషా, విశ్వంశెట్టిలను బెదిరించి రూ.50 లక్షలు దోచుకున్నారని చెప్పడం అవాస్తవమన్నారు. అలాగే అశోక్ కంపెనీ వారితో రూ.30 కోట్లు తీసుకున్నానని చెప్పడం కూడా అవాస్తమేనని, వీటిపై నేను ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు. అధికారుల నుంచి స్పందన కరువు మా తండ్రి మరణం ప్రమాదమని నాకు, మా కుటుంబ సభ్యులకు తెలుసు అని.. మా తండ్రిని కోడిని కోసినట్లు కోశారని ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. కుటుంబంలో విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనే స్వార్థపరుడు పార్థ అని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కోట్ల రూపాయలు విలువ చేసే ఖనిజాలన్నీ దొంగలించబడ్డాయని, వాటిని ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు. బైరెటీస్ను కాపాడేందుకు అనేక సార్లు అధికారులకు రక్షణ కల్పించాలని వినతి పత్రాలు పెట్టామని, కానీ ఎవరూ స్పందించలేదన్నారు. రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల విలువైన సరుకును కూటమి నాయకులు రాత్రికి రాత్రే తరలించారన్నారు. ఎంబసీ గ్రూప్ ద్వారా ఎంత స్టాక్ వచ్చిందనే విషయాన్ని కూడా కోర్టుకు తెలిపామన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి వేముల మండలంలో నేను దోచుకుని ఉంటే నా వెంట ప్రజలు ఉండేవారు కాదని, ఎప్పుడు నా వెంటే ఉంటారన్నారు. వేల్పులలో నాలుగు సార్లు సర్పంచ్‌గా గెలిచామని, ఇప్పటికీ మా గ్రామంలో నేను సూచించిన వ్యక్తి సర్పంచ్‌గా, ఎంపీటీసీగా గెలుస్తున్నారని, ఇదే నా వెంట ప్రజలు ఉన్నారనడానికి నిదర్శనమన్నారు. వైఎస్ కుటుంబ సభ్యులు చాలా మంచివారని, వారి కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధమన్నారు. నెలలో 20 రోజులు కుటుంబానికి దూరంగా ఉండి పనులు చేసుకుంటున్నానని, నా టర్నవర్ రూ.110 కోట్లు ఉందని, నాది తెరిచిన తెల్లని కాగితమని, ఎప్పుడైనా విచారణ చేయించుకోవచ్చని, నా వద్ద అన్నింటికీ ఆధారాలు ఉన్నాయన్నారు. ఇప్పటికై నా వాస్తవాలు తెలుసుకుని అసంబద్ధమైన మాటలు మాట్లాడడం సరికాదని, హత్య రాజకీయాలను మానుకోవాలన్నారు. నాపై అవినీతి ఆరోపణలు నిరూపిస్తే దేనికై నా సిద్ధం కూటమి ప్రభుత్వంలో అరాచకాలు ఎక్కువయ్యాయి టిఫిన్ మైన్స్ నుంచి రూ.15 కోట్ల సరుకు చోరీ పార్థసారథిరెడ్డిపై వైఎస్సార్సీపీ నాయకుల ధ్వజం -
పీఠాధిపతి అక్బర్ బుఖారి కన్నుమూత
కడప కల్చరల్ : కడపకు చెందిన ఆస్థానె–యే–బుఖారియా పీఠాధిపతి అల్ హాజ్ సయ్యద్ షా అక్బర్ బుఖారి సాహెబ్ గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. నగరంలోని రహమతుల్లా వీధిలోగల అంజదియ మస్జిద్లో అసర్ నమాజ్ తర్వాత నమాజ్ ఏ జనాజా ప్రార్థన చేసి, అనంతరం అంతక్రియలు నిర్వహించారు. జిల్లాలోని ముస్లిం ధార్మిక పీఠాలలో సౌమ్యుడిగా, ధార్మిక వేత్తగా మంచి పేరుగల అక్బర్ బుఖారి మరణ విషయం తెలుసుకున్న పలువురు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ధార్మిక, ఇస్లామిక్ కార్యక్రమాల నిర్వహణలో ఆయన ప్రధానపాత్ర వహించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకుశాంతి కలగాలని దైవాన్ని ప్రార్థిస్తున్నామన్నారు. మత గురువులు, మౌల్వీలు, ముఫ్తీలు, ముస్లిం ప్రముఖులు, రాజకీయ నాయకులు, బుఖారియ పీఠం సభ్యులు, బంధువులు తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
రేపు ఏపీజీఈఏ జిల్లా మహాసభ
కడప రూరల్ : కడప నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా మహాసభను నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఆ సంఘం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మహాసభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ తదితరులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశానికి ఉద్యోగులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రఘురామ నాయుడు, సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘శుభమస్తు’లో బహుమతి స్కూటీల పంపిణీ
కడప కల్చరల్ : కడప నగరంలోని శుభమస్తు షాపింగ్‌మాల్‌లో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలైన వారికి శుక్రవారం బహుమతులు అందజేశారు. కడపకు చెందిన కొనుగోలుదారులకు డిసెంబర్ 31 నుంచి ఈ నెల 17 వరకు మాల్లో కొనుగోలు సందర్భంగా ఇచ్చిన లక్కీ డ్రా కూపన్లను లాటరీ తీసిన అనంతరం వారికి ఎలక్ట్రిక్ స్కూటీలు బహుమతిగా అందజేసే ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జరిగిన లక్కీ డ్రాలో కడపకు చెందిన రామకృష్ణ, నాగార్జున, గురవయ్య, నరసయ్యలు బహుమతులు గెలుచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమానికి మానస ఎండీ చిన్నపరెడ్డి, సిటీ కేబుల్ ఎండీ సూర్య నారాయణ, యోగివేమన యూనివర్సిటీ వీసీ కృష్ణారెడ్డి, వన్‌టౌన్ సీఐ రామకృష్ణ, మానస ఇన్ ఎండీ అనంతమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నపరెడ్డి మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ ఏర్పాటుతో ప్రజలకు నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరకు అందించడంతోపాటు స్థానిక యువతలో పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నాణ్యత ప్రమాణాల్లో ఎలాంటి రాజీ లేకుండా వస్త్రాలను అందించడం పట్ల అభినందించారు. అనంతరం లయన్ క్లబ్ సభ్యులు వెంకటసుబ్బయ్య, మన్సూర్ అలీఖాన్ తదితరులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్లు మడక వెంకటరమణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వృత్తి నైపుణ్యం పెంచుకుని మెరుగైన సేవలందించండి
కడప అర్బన్ : విధుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని ఏ.ఆర్. అదనపు ఎస్పీ బి.రమణయ్య సూచించారు. జిల్లా సాయుధ పోలీసు బలగాలకు రెండు వారాల పాటు నిర్వహించే ‘మొబలైజేషన్’ కార్యక్రమాన్ని జిల్లా ఇన్చార్జి ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ఆయన శుక్రవారం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఆర్ అదనపు ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో చేసే ప్రతి పనిలోనూ ఎంతో నేర్పరితనం, సమయస్ఫూర్తి, నైపుణ్యంతో కూడుకుని ఉంటాయన్నారు. ఇతర ఉద్యోగాల కంటే పోలీసు ఉద్యోగం భిన్నంగా వుంటుందన్నారు. ప్రజలు పోలీసులపై పెట్టుకున్న ఆశలు ఏమాత్రం సడలకుండా క్రమశిక్షణతో మెలగాల్సి వుంటుందన్నారు. ఏఆర్ సిబ్బందికి ప్రతి ఏటా మొబలైజేషన్ను నిర్వహించి విధుల్లో నైపుణ్యం, ఫిజికల్ ఫిట్నెనెస్ను మెరుగుపరచడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అంతేగాకుండా ఉద్యోగంలో చేరే ముందు శిక్షణలో నేర్చుకున్న తర్ఫీదు అంశాలను మరోసారి గుర్తు చేసుకుంటూ మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుకునేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలిచ్చిన విధంగా సామర్థ్యాలను పెంపొందించుకోవాలన్నారు. బి.డిటీం, ప్రిజనర్స్, ఎస్కార్ట్, పి.ఎస్.ఓలు, డ్రైవర్లు, తదితర సిబ్బంది బాగా మెరుగు పరుచుకోవాలన్నారు. ఫైరింగ్, డ్రిల్, కవాతు, మాబ్ కంట్రోల్, ప్రముఖుల బందోబస్తు, తదితర విధులు సమర్థవంతంగా నిర్వహించేలా తర్ఫీదునిస్తారన్నారు. ఇదే సమయంలో మొబలైజేషన్‌కు వచ్చిన సిబ్బంది సంక్షేమం, ఆరోగ్య సమస్యలపై కూడా దృష్టి సారించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్ఐలు ఆనంద్, శివరాముడు, వీరేష్, టైటాస్, ఆర్ఎస్ఐలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. ఏఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య -
‘నా పంటను దున్నేశారు’
బ్రహ్మంగారిమఠం : ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సొంత పంచాయతీ పలుగురాళ్ళపల్లె సమీపంలోని బొగ్గులవారిపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ వర్గీయుడు శీలం సిద్దారెడ్డికి చెందిన పైరు ఉన్న భూమిని శుక్రవారం ఎర్రంపల్లెకు చెందిన సిద్దయ్య యాదవ్ మేకల పుల్లయ్య యాదవ్‌లు దున్నినట్లు బాధితుడు తెలిపారు. శుక్రవారం సిద్దారెడ్డి విలేకరులతో తన గోడు వెల్లబోసుకున్నాడు. పలుగురాళ్ళపల్లె పొలం సర్వే నంబర్ 825లో 2.50 ఎకరాలు తమ పిత్రాజితం భూమి అని పేర్కొన్నారు. సర్వే నంబర్ 826లో 2 ఎకరాలు ఎర్రంపల్లెకు చెందిన లగసాని వీరయ్య దగ్గర అదే గ్రామానికి చెందిన మేకల పోలయ్య కొనుగోలు చేశాడన్నారు. దాదాపు 5 ఏళ్ల నుంచి తనకు ఉన్న భూమిలో అర్ధం ఆయన భూమి ఉందంటూ.. తనపై దౌర్జన్యం చేస్తూ వస్తుంటే అడ్డుకుంటూ వస్తున్నామన్నారు. సర్వే చేయించుకోవాలని తెలిపినా వినడం లేదని, ఇప్పటికే సర్వే కోసం మేకల పుల్లయ్యకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారన్నారు. అయినా రాకుండా ఉన్నారన్నారు. ప్రస్తుతం తాను పంటను వేశానన్నారు. టీడీపీ అధికారంలో ఉందని, ఎమ్మెల్యే తమ్ముడు పుట్టా ఆనంద్ చెప్పాడని శుక్రవారం ఉదయం.. తాము లేని సమయంలో పైరు ఉన్న పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలిసి అడ్డుకోవడానికి తాము అక్కడికి వెళ్లే లోపు కొంత దున్నేసి వెళ్లిపోయారని వాపోయారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పొలం ఎవరిది ఎంత వరకు అనేది సర్వే చేయించుకోవాలని సిద్దారెడ్డి కోరారు. రిమ్స్‌లో గుర్తు తెలియని మృతదేహాలు కడప అర్బన్ : కడప నగర శివారులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో చికిత్స పొందుతున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందారు. వారి ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ శ్రీనివాసులు తెలియజేశారు.