భారత్‌లో ఒక్క కేసూ నమోదు కాలేదు
ఆఫ్రికాలో ప్రారంభం.. గల్ఫ్, యూరప్ దేశాలకు విస్తరణ
చికెన్ పాక్స్ తరహాలోనే ఎంపాక్స్‌తో శరీరంపై పొక్కులు
అంతర్జాతీయ ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి
చికెన్‌పాక్స్(ఆటలమ్మ, అమ్మవారు) తరహా వ్యాధి ఎంపాక్స్. కరోనా వైరస్ మాదిరిగా గాలి ద్వారా ఇతరులకు వ్యాపించదు. ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారితో సన్నిహితంగా మెలిగిన వారికే వ్యాధి సోకుతుంది. దేశంలో ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ ప్రయాణికులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి
సాక్షి, అమరావతి: మూడేళ్ల కిందటే ఎంపాక్స్ వ్యాప్తి ఆఫ్రికాలో ప్రారంభమైంది. అప్పట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అయితే ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలకే ఈ వ్యాధి పరిమితం కావడం, త్వరగా నియంత్రణలోకి రావడంతో పెద్ద ప్రమాదం లేదని గుర్తించి ఎమర్జెన్సీని ఎత్తివేశారు. ఆ సమయంలో భారత్‌లోని కేరళ రాష్ట్రంలో పరిమిత సంఖ్యలో కేసులు నమోదైయ్యాయి. మళ్లీ తిరిగి ఇప్పుడు ఎంపాక్స్ కారక వైరస్‌లలోని క్లేడ్ 1బీ అనే కొత్త రకం వేరియంట్ రూపంలో ప్రమాదకరంగా వ్యాపిస్తోంది.
ఈ వైరస్ వ్యాప్తికి ఆఫ్రికా కేంద్ర బిందువు కాగా, గల్ఫ్, యూరప్ నుంచి ఇతర దేశాలకు వ్యాప్తి పెరుగుతోంది. ఎందుకంటే ఆఫ్రికా దేశాలకు గల్ఫ్, యూరప్‌ల నుంచి ప్రయాణాలు సాగిస్తుంటారు. దీంతో వైరస్ ప్రాథమిక వ్యాప్తి ఆఫ్రికాలో, రెండో దశ వ్యాప్తి యూరప్, గల్ఫ్‌లలో, మూడో దశలో ఇతర దేశాల్లో ఉంటోంది. మన పక్కనున్న పాకిస్తాన్‌లో వెలుగు చూసిన కేసుల్లో వ్యాధిగ్రస్తులు గల్ఫ్ నుంచి వచ్చినట్టుగా తేలింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎంపాక్స్‌పై అప్రమత్తమైంది. విమాన, నౌకాశ్రయాల్లో స్క్రీనింగ్ ప్రారంభించింది.
స్మాల్‌పాక్స్‌తో దగ్గరి సంబంధం
భారత్‌తో పాటు, ప్రపంచ దేశాలను ఒకప్పుడు స్మాల్‌పాక్స్(మశూచి) ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. స్మాల్‌పాక్స్‌కు ఎంపాక్స్‌కు దగ్గరి సంబంధం ఉంటుంది. ఈ రెండు వ్యాధులు ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందినవే. ఎలుకలు, ఉడతలు, కుందేలు వంటి జంతువుల నుంచి మనుషులకు ఎంపాక్స్ సోకినట్లు మూడేళ్ల కిందటే నిర్ధారించారు. దీన్ని మంకీపాక్స్ అని పిలవడం కూడా సరికాదు. 1978 వరకూ ప్రపంచ వ్యాప్తంగా స్మాల్‌పాక్స్‌కు వ్యాక్సినేషన్ చేశారు. ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించినట్లు డబ్ల్యూహెచ్‌వో, ఇతర సంస్థలు ప్రకటించడంతో 1980 తర్వాత వ్యాక్సిన్‌లు అందుబాటులో లేకుండా పోయాయి. కాగా, స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎంపాక్స్ నుంచి రక్షణ ఉంటుంది.
వ్యాక్సినేషన్‌పై చర్చలు
ఎంపాక్స్ నియంత్రణకు సామూహిక వ్యాక్సినేషన్ అవసరమా? అనేదాని మీద ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్ తిరిగి తయారు చేయాలా? లేదా అటువంటి వ్యాక్సిన్‌ను తయారు చేయాలా అనేదాని మీద ఆలోచనలున్నాయి. ఎంపాక్స్‌కు ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికా, జర్మనీలో వ్యాక్సిన్‌లు తయారీలో ఉన్నాయి. కొన్ని దేశాలు ఇప్పటికే కొనుగోలుకు ఆర్డర్‌లు ఇచ్చాయి. అయితే కోవిడ్ వ్యాక్సిన్ తరహాలో పెద్ద ఎత్తున అందుబాటులో ఈ వ్యాక్సిన్ ఉండదు.
సన్నిహితంగా మెలగడం ద్వారానే..
కోవిడ్ మాదిరిగా గాలి ద్వారా ఎంపాక్స్ వ్యాపించదు. లైంగిక సంబంధం, ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారితో సన్నిహితంగా మెలిగిన వారికే వ్యాధి సోకుతుంది. అదే విధంగా వ్యాధిగ్రస్తుల నోటి తుంపరలు, ఉమ్ము, శరీర స్రావాల ద్వారా కూడా వ్యాపిస్తుంది. చర్మం మీద గీసుకుపోయిన, గాయాలు, పుండ్లున్న ప్రాంతంలో వ్యాధిగ్రస్తుల స్రావాలు పడినా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం మనం చిన్నపిల్లల్లో ఎక్కువగా, పెద్దల్లో అరుదుగా చికెన్ పాక్స్‌ను చూస్తుంటాం. చికెన్ పాక్స్(ఆటలమ్మ, అమ్మవారు) తరహాలోనే ఎంపాక్స్ సోకిన వారిలో కూడా చర్మం మీద పొక్కులు వస్తాయి.
అయితే ఎంపాక్స్ సోకిన వారికి అరికాళ్లు, అరచేతుల్లో కూడా పొక్కులు వస్తాయి. అదే విధంగా మల, మూత్ర విసర్జన భాగాలు, కళ్లు, నోరు, ఇలా శరీరంలోని అన్ని భాగాల్లో పొక్కులు ఏర్పడతాయి. దీంతో పాటుగా జ్వరం, తీవ్ర అలసట, గొంతు నొప్పి, తల, కీళ్లు, ఒళ్లు నొప్పులు, ఆకలి మందగించడం వంటివి జరుగుతాయి. వైరస్ సోకిన వారిలో 5 నుంచి 21 రోజుల పాటు వ్యాధి లక్షణాలు ఉంటాయి.
విమానాలు, నౌకల ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి
ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు వైరస్ క్యారియర్‌లుగా ఉంటారు. ఈ క్రమంలో విమాన, నౌకాయానం ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలి. విమానాశ్రయం, నౌకాశ్రయాల్లో రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఎదుటి వ్యక్తి తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా నోటి తుంపరలు మీద పడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో వ్యక్తుల నుంచి ఎడం పాటించాలి. మాస్క్ ధరించడం ఉత్తమం. సాధారణ ప్రజలు సైతం ఎదుటి వారితో మాట్లాడేప్పుడు సన్నిహితంగా మెలగకూడదు. ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలి.
పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment