వామ్మో మంకీపాక్స్‌!.. భారత్‌లో అనుమానిత కేసు | India records first suspected mpox case, patient condition stable | Sakshi
Sakshi News home page

వామ్మో మంకీపాక్స్‌!.. భారత్‌లో అనుమానిత కేసు

Published Mon, Sep 9 2024 4:46 AM | Last Updated on Mon, Sep 9 2024 12:39 PM

India records first suspected mpox case, patient condition stable

వైరస్‌ ఉన్న దేశం నుంచి వచ్చిన యువకునిలో లక్షణాలు   

ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స 

ఆందోళన అవసరం లేదు: కేంద్రం

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్‌ (ఎంపాక్స్‌) వైరస్‌ సెగ భారత్‌కూ తాకింది. మన దేశంలో తాజాగా ‘అనుమానిత’ ఎంపాక్స్‌ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎంపాక్స్‌ వ్యాప్తి అధికంగా ఉన్న ఓ దేశం నుంచి వచి్చన యువకుడిలో వైరస్‌ లక్షణాలను గుర్తించినట్లు ఆదివారం ప్రకటన విడుదల చేసింది. 
‘‘బాధితుడిని ఆసుపత్రిలో చేర్చి ఐసోలేషన్‌లో ఉంచాం. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అతడితో కలిసి ప్రయాణించిన వ్యక్తులను గుర్తిస్తున్నాం. అతనికి నిజంగా ఎంపాక్స్‌ సోకిందీ లేనిదీ నిర్ధారించడానికి నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నాం’’ అని పేర్కొంది. ‘‘ఇది అనుమానిత కేసే. ఇంకా నిర్ధారణ కాలేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని తెలిపింది. వైరస్‌ విషయంలో ఏ పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు వివరించింది. 

99,176 కేసులు.. 208 మరణాలు  
యూరప్, ఆఫ్రికా దేశాల్లో ఇటీవల మంకీపాక్స్‌ వైరస్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను ‘అంతర్జాతీయ ఆరోగ్య విపత్తు’గా ఆగస్టు 14న ప్రకటించింది. ఈ వైరస్‌ వ్యాప్తి 2022లో వెలుగులోకి వచి్చంది. ఇటీవల ఆఫ్రికాలో కొత్త రకం ఎంపాక్స్‌ పుట్టుకొచి్చనట్లు తేలింది. 2022 వైరస్‌ కంటే ఇది మరింత ప్రాణాంతకమని తేలింది. కొత్త వైరస్‌ లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. 2022 నుంచి 2023 దాకా 116 దేశాల్లో 99,176 ఎంపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. 208 మంది మరణించారు. 2024లో 15,600కు పైగా కేసులు నమోదయ్యాయి. 537 మంది మృతిచెందారు. 2022 నుంచి భారత్‌లో కనీసం 30 ఎంపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. చివరిసారిగా ఈ మార్చి నెలలో ఒక కేసు బయటపడింది.

ఏమిటీ ఎంపాక్స్‌? 
1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. అందుకే దీనికి మంకీపాక్స్‌ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్‌కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్‌ పరీక్షలు జరిపి ఈ వైరస్‌ ఉనికి కనిపెట్టారు. మనుషుల్లో దీన్ని 1970లో తొలిసారిగా గుర్తించారు. కాంగోలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్‌ సోకింది. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్‌ సోకుతుండటంతో ఎంపాక్స్‌ అనే పొట్టిపేరు ఖరారుచేశారు. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి కారక వైరస్, ఎంపాక్స్‌ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గో మశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్‌ కూడా ఈ రకానిదే.

ఇలా సోకుతుంది
→ అప్పటికే వైరస్‌ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్‌ సోకుతుంది. 
→ కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్‌ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా సోకుతుంది. 
→ చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్‌కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచీ సోకుతుంది. 
→ రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా, ముఖాన్ని ముఖంతో తాకినా, కరచాలనం చేసినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు. 
→ తల్లి నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు.

వ్యాధి లక్షణాలు ఏమిటీ?
→ ఎంపాక్స్‌ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులొస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. 
→ చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. 
→ 90 శాతం కేసుల్లో ముఖంపై, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులొస్తాయి. 
→ నీటి బొడిపెలుగా పెద్దవై సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. 
→ నీరసంగా ఉంటుంది. గొంతెండిపోతుంది.

వ్యాక్సిన్‌ ఉందా? 
స్వల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్‌కు నిర్దిష్టమైన చికిత్స విధానం, వ్యాక్సిన్‌ లేవు. మశూచికి వాడే టికోవిరమాట్‌ (టీపీఓఎక్స్‌ ఎక్స్‌) యాంటీ వైరల్‌నే దీనికీ వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్‌ (ఇమ్వామ్యూన్, ఇంవానెక్స్‌) డ్రగ్స్‌నే 18 ఏళ్ల పై బడిన రోగులకు ఇస్తున్నారు. కోవిడ్‌ దెబ్బకు సంపన్న దేశాల్లో మాదిరిగా నివారణ చర్యలు, నిర్ధారణ పరీక్షల వంటివి లేక ఆఫ్రికా దేశాల్లో వైరస్‌ విజృంభిస్తోంది.

అప్రమత్తంగా ఉండండి: కేంద్రం 
పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల్లో ఎంపాక్స్‌ కేసులు పెరిగిపోతుండటంతో సరిహద్దులతోపాటు ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సర్క్యులర్‌ జారీ చేసింది. ఎంపాక్స్‌ లక్షణాలు గుర్తించడానికి విదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహించాలని సూచించింది.  ఎంపాక్స్‌ సన్నద్ధతపై ప్రధాని ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్రా తాజాగా ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఈ కేసుల్లో సమర్థ చికిత్స కోసం ఆసుపత్రులను ఇప్పట్నుంచే సిద్ధం చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement