మంకీపాక్స్‌ పాజిటివ్‌ కేసు నిర్ధారణ | Laboratory testing has confirmed the presence of Mpox virus of the West African clade 2 in the patient | Sakshi
Sakshi News home page

మంకీపాక్స్‌ పాజిటివ్‌ కేసు నిర్ధారణ

Published Tue, Sep 10 2024 4:58 AM | Last Updated on Tue, Sep 10 2024 4:58 AM

Laboratory testing has confirmed the presence of Mpox virus of the West African clade 2 in the patient

అనుమానిత కేసులో పరీక్షలు  

హరియాణా యువకుడికి వైరస్‌ సోకినట్లు గుర్తింపు  

ఢిల్లీ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో కొనసాగుతున్న చికిత్స  

న్యూఢిల్లీ: ‘అనుమానిత’ కేసు మంకీపాక్స్‌(ఎంపాక్స్‌) కేసుగానే నిర్ధారణ అయ్యింది. ఎంపాక్స్‌ వ్యాప్తి అధికంగా ఉన్న ఓ దేశం నుంచి వచి్చన యువకుడిలో వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. అతడికి పరీక్షలు నిర్వహించగా ఎంపాక్స్‌ పాజిటివ్‌గా తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నాడని, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఇతర అనారోగ్య లక్షణాలేవీ లేవని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. 

సదరు యువకుడు ప్రయాణంలో ఉండగా ఎంపాక్స్‌ వైరస్‌ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అతడిలో వెస్ట్‌ ఆఫ్రికన్‌ క్లేడ్‌–2 ఎంపాక్స్‌ వైరస్‌ ఉన్నట్లు గుర్తించామని వివరించింది. ఇది 2022 జూలై నుంచి మన దేశంలో నమోదైన 30 కేసుల్లాంటిదేనని తెలియజేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన క్లేడ్‌–1 రకం వైరస్‌ కాదని స్పష్టంచేసింది. క్లేడ్‌–2 రకం వైరస్‌ అంతగా ప్రమాదకారి కాదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. బాధితుడు ఐసోలేషన్‌లో ఉన్నాడు కాబట్టి అతడి నుంచి వైరస్‌ ఇతరులకు సోకే అవకాశం లేదని తెలిపింది.  

హరియాణాలోని హిసార్‌ పట్టణానికి చెందిన 26 ఏళ్ల యువకుడు ఇటీవలే విదేశాల నుంచి తిరిగొచ్చాడు. అతడిలో ఎంపాక్స్‌ లక్షణాలు కనిపించడంతో శనివారం ఢిల్లీలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి్పంచారు. అనుమానిత ఎంపాక్స్‌ కేసుగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. పరీక్షల అనంతరం ఎంపాక్స్‌ పాజిటివ్‌గా తేలింది. అదే ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు. మరోవైపు అనుమానిత, నిర్ధారిత ఎంపాక్స్‌ బాధితుల కోసం ఢిల్లీలో మూడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ గదులు సిద్ధం చేశారు. ఎంపాక్స్‌ కేసుల చికిత్స విషయంలో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆసుపత్రి నోడల్‌ సెంటర్‌గా సేవలందిస్తోంది. ఇందులో 20 ఐసోలేషన్‌ గదులు ఉన్నాయి.  

అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర ఆరోగ్య శాఖ  
ఎంపాక్స్‌ వైరస్‌ వ్యాప్తిపై ప్రజ ల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో  కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అనుమానిత ఎంపాక్స్‌ కేసుల విషయంలో స్క్రీనింగ్, టెస్టింగ్‌ నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ మేరకు సోమవా రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ఎంపాక్స్‌పై ప్రజల్లో అనుమానాలు తొలగించాలని పేర్కొన్నారు. వైరస్‌ సోకినా ప్రాణాలకు ముప్పు ఉండదన్న సంగతి తెలియజేయాలని కోరారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement