africa
-
కల్లోల కడలిలో.. పడవలోనే కాన్పు
వలస బతుకుల దుర్భర దైన్యానికి దర్పణం పట్టే ఉదంతమిది. వలసదారులతో కిక్కిరిసిన పడవలో ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులు పడింది. ఆఫ్రికా నుంచి స్పెయిన్‌కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. కొద్దిసేపట్లో స్పెయిన్ పాలనలోని స్వయం ప్రతిపత్తి ప్రాంతం కానరీ దీవులకు చేరతారనగా నొప్పులు ఎక్కువయ్యాయి. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో పడవే ప్రసూతి గదిగా మారింది. చుట్టూ ఉత్కంఠగా వేచి చూస్తున్న వలసదారుల నడుమే పండంటి బాబు ఈ లోకంలోకి వచ్చాడు. తర్వాత పది నిమిషాలకే నేవీ బోటులో ఆ పడవను చుట్టుముట్టిన కోస్ట్ గార్డులు వలసదారుల మధ్యలో రక్తమయంగా కనిపించిన పసిగుడ్డును చూసి నిర్ఘాంతపోయారు. తల్లీబిడ్డలను హుటాహుటిన హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగానే అన్నారు. వలస పడవలో నిస్త్రాణంగా పడి ఉన్న తల్లి పక్కన మరొకరి చేతిలో నవజాత శిశువును చూసిన క్షణాలను కోస్ట్ గార్డ్ సిబ్బంది కెమెరాలో బంధించారు. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. క్రైస్తవులకు పర్వదినమైన ఎపిఫనీ రోజునే ఈ ఘటన జరగడం విశేషం. ఆ రోజున ప్రధానంగా బాలలకు బోలెడన్ని కానుకలివ్వడం సంప్రదాయం. అలాంటి పండుగ రోజున వలస దంపతులకు ఏకంగా బుల్లి బాబునే దేవుడు కానుకగా ఇచ్చాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ తెలుగాయన ఆఫ్రికాని జయించాడు!
విజయం ఏ ఒక్కరి సొత్తు కాదు. సమాజంలోని ప్రతి ఒక్కరూ దాన్ని అందుకోవాలి అనే అనుకుంటారు. కాకపోతే ఇక్కడ అనుకోవటం వేరు.. విజయాన్ని అందుకోవడం వేరు!. ఆటంకాలకు అవకాశాలుగా మార్చుకుని.. పట్టుదలతో శ్రమిస్తే విజయం సొంతం అవుతుందని నిరూపించిన గాథల్లో మోటపర్తి శివరామ వర ప్రసాద్(MSRV Prasad) సక్సెస్‌కు చోటు ఉంటుంది. ఆయన ఎదుగుదలా క్రమమే ‘అమీబా’గా ఇప్పుడు పాఠకుల ముందుకు వచ్చింది.చీకటి ఖండంగా పేరున్న ఆఫ్రికాలో.. అదీ అననుకూల పరిస్థితుల నడుమ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న ఓ తెలుగోడి ఆత్మకథే అమీబా. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ (Yandamuri Veerendranath) దీనిని రచించడం ఇక్కడ ఒక విశేషం కాగా.. తెలుగులో ఇది తొలిక్రైసిస్ మేనేజ్మెంట్ బుక్ కావడం మరో ప్రత్యేకత. నవ సాహితి బుక్ హౌజ్ పబ్లికేషన్స్ అచ్చేసిన ఈ బయోగ్రఫీ బుక్.. ఈ మధ్యే జయప్రకాశ్ నారాయణ లాంటి మేధావులు పాల్గొన్న ఓ ఈవెంట్లో లాంఛ్ అయ్యింది.పశ్చిమ గోదావరిలో కొవ్వలి అనే కుగ్రామంలో ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి మోరపాటి జన్మించారు. ఆటంకాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ సాగిన ఆయన ప్రయాణం.. ప్రస్తుతం సంపద విలువను రూ. 12 వేల కోట్లకు చేర్చింది. Warangal NIT లో మెటలర్జి చదివారు. గుజరాత్ లో పని చేసి, హైదరాబాద్‌లో ఫౌండ్రి పెట్టారు. తర్వాత ఆ వ్యాపారాన్ని ఘనాలో విస్తరించాడు. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ స్టీల్, సిమెంట్, కెమికల్స్, ఆటోమొబైల్స్, రియల్ ఎస్టేట్, గార్మెంట్స్ పరిశ్రమలను స్థాపించారాయన. వాటి ద్వారా 20 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు. శ్రమ, ముందు చూపు, జ్ఞానం.. తన విజయానికి కారణాలని చెప్తున్నారు. అన్నట్లు.. సారధి స్టూడియోకు ప్రస్తుతం చైర్మన్ ఈయనే. మోటపర్తి శివరామ వర ప్రసాద్ విజయ ప్రయాణం.. దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం, చాతుర్యం వంటి వాటికి నిదర్శనం. ఉద్యోగి సంక్షేమం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తుంది.:::డాక్టర్ జయప్రకాష్ నారాయణAMOEBA.. అడ్డంకులను అవకాశాలుగా మార్చుకుని.. నిర్దేశించని ప్రాంతాలను జయించిన వ్యక్తికి సంబంధించిన స్ఫూర్తిదాయకమైన కథనం. గొప్ప విజయాల్ని అందుకోవాలనుకునేవాళ్లెందరికో ఆయన జీవితం ఓ ఆశాజ్యోతి. :::రచయిత యండమూరి వీరేంద్రనాథ్రూ.400 జీతగాడిగా(మెటాలర్జిస్ట్గా) మొదలైన ఓ తెలుగు ఎంట్రప్రెన్యూర్ ప్రయాణం.. ఇప్పుడు సాధన సంపత్తి, అపారమైన సంపద, ఓ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించడం ఎంతైనా స్ఫూర్తిదాయకం కాదంటారా?. -
ముంచుకొస్తున్న మిస్టరీ వ్యాధి ’డింగా డింగా’.. బాధితుల్లో వింత లక్షణాలు!
ఆఫ్రికా దేశం ఉగాండాలో వింత వ్యాధి అక్కడి ప్రజలను వణికిస్తోంది. ఈ వ్యాధి పేరు ‘డింగా డింగా’ ఫీవర్. ఈ వ్యాధి పేరు ఎంత భిన్నంగా ఉందో.. ఈ వ్యాధి లక్షణాలు కూడా అంతే వింతగా ఉంటాయి. ఈ వ్యాధి బారినపడిన వారిలో అనియంత్రిత వణుకు ఉంటుంది. దీంతో, వారు డ్యాన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తారు. ఇక, స్థానిక భాషలో ‘డింగా డింగా అంటే.. కదులుతూ నృత్యం చేయడం’ అని అర్థం’ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాధులు ప్రబలుతున్న వేళ ఉగాండాలో డింగా డింగా వ్యాధి ప్రజలను టెన్షన్ పెడుతోంది. ఉగాండాలోని బుండిబుగ్యో జిల్లాలో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఈ వ్యాధి ప్రధానంగా మహిళలు, బాలికల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందడం స్థానికులను, అధికారులను టెన్షన్ పెడుతోంది. స్థానిక నివేదికల ప్రకారం, ఇప్పటివరకు 400 మందికి పైగా వ్యాధి బారిన పడినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, వ్యాధి కారణంగా ఇప్పటివరకు ఎటువంటి మరణాలు సంభవించలేదు. ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో వ్యాధి రావడానికి గల కారణాలను తెలుసుకుంటున్నట్టు తెలిపారు.ఇక, డింగా డింగా ఫీవర్ వ్యాధి కారణంగా శరీరంలో అనియంత్రిత వణుకు మొదలవుతుంది. దీని కారణంగా వ్యాధి బారినపడిన వ్యక్తి నడవడానికి కూడా ఇబ్బంది పడతాడు. వీరిని దూరం నుంచి చూస్తే బాధితురాలు డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. వణికిపోతున్న చేతులు, కాళ్ల కారణంగా డ్యాన్స్ మాదిరిగా కనపడటం విశేషం. ఇక 2023 ప్రారంభంలో మొదటిసారిగా ఈ వ్యాధిని గుర్తించారని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధి గురించి ఇంకా చాలా వివరాలు తెలిసి రాలేదు. దీంతో, డింగా డింగాపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇక తదుపరి విశ్లేషణ కోసం నమూనాలను ఉగాండా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపారు స్థానిక అధికారులు.మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులు ఈ వ్యాధి వ్యాప్తిని 1518లో ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో ‘డ్యాన్సింగ్ ప్లేగు’ వ్యాధితో పోలుస్తున్నారు. అప్పుడు ఫ్రాన్స్‌లో ఈ వ్యాధి ప్రబలిన సమయంలో కూడా బాధితులు.. అనియంత్రితంగా రోజుల తరబడి ఉన్నారని తెలిపారు. అలాగే, ఇది మరణాలకు కూడా దారి తీసినట్టు చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. తాజాగా ఈ వ్యాధి నుంచి కోలుకున్న బాధితురాలు(18) మాట్లాడుతూ..‘నేను చాలా బలహీనంగా ఉన్నాను. నేను నడవడానికి ప్రయత్నించినప్పుడు నా కంట్రోల్లో నేను ఉండటం లేదు. కాళ్లు, చేతులు వణికిపోతున్నాయి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. వారం రోజులకు పైగా వ్యాధి కారణంగా ఆసుపత్రిలోనే ఉన్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను’ అంటూ చెప్పారు.డింగా డింగా లక్షణాలు..జ్వరం.తలనొప్పి.దగ్గు.ముక్కు కారటం.శరీర నొప్పులు.A mysterious illness locally called 'Dinga Dinga' is rapidly spreading amog women and girls in Uganda's Bundibugyo district, leaving dem dancing and shaking uncontrollably, along with experiencing fever. The illness is treatable with antibiotics. pic.twitter.com/yYEx9unIbR— Common Sense (@keysense_1) December 20, 2024 -
‘బాహుబలి’ ఏనుగులకు పెద్ద కష్టం.... భూమాతకు తీరని శోకం!
భూమండలంపై అత్యంత భారీకాయంతో సంచరించే శాకాహార బాహుబలిగా ఏనుగు మనందరికీ చిరపరిచితం. ఆఫ్రికా ఖండంలోని పీఠభూముల్లో సర్వసాధారణంగా కనిపించే ‘సవన్నా’, ‘అటవీ’జాతి ఏనుగులు అత్యంత వేగంగా అంతర్థానమవుతున్నాయి. అటవీప్రాంతాల్లో విచ్చలవిడిగా పెరిగిన మానవ కార్యకలాపాలు, విస్తరిస్తున్న వ్యవసాయం, విజృంభిస్తున్న అక్రమ వేటతో ఏనుగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. తాజాగా జరిపిన అధ్యయనం ప్రకారం గత యాభై సంవత్సరాల్లో.. సర్వేచేసిన ప్రాంతాల్లో సవన్నా జాతి ఏనుగుల సంఖ్య 70 శాతం తగ్గిపోయింది. ‘ఫారెస్ట్’జాతి ఏనుగుల సంఖ్య ఏకంగా 90 శాతం క్షీణించడం ఏనుగుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఏనుగుల సంఖ్య పెరగడం ఒకింత ఉపశమనం కల్పిస్తోంది.అత్యంత తెలివి అత్యంత తెలివితేటలతోపాటు మానవునిలా సామూహికంగా జీవించే నైపుణ్యమున్న వన్యప్రాణిగా ఏనుగు పేరొందింది. 1964 నుంచి 2016 సంవత్సరం దాకా ఆఫ్రికా ఖండంలోని 37 దేశాల్లోని 475 భిన్న ప్రదేశాల్లో ఏనుగుల జాడపై విస్తృతస్థాయి గణన, పరిశోధన చేశారు. ఇటీవలి దశాబ్దాల్లో ఇంతటి విస్తృత సర్వే చేపట్టడం ఇదే తొలిసారి. సంబంధిత నివేదిక సోమవారం వెల్లడైంది. దీనిలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. సవన్నా, ఫారెస్ట్ జాతి ఏనుగుల సంఖ్య సగటున ఏకంగా 77 శాతం తగ్గిపోయింది. విడిగా చూస్తే సవన్నా జాతి 70 శాతం, ఫారెస్ట్ జాతి సంఖ్య 90 శాతం తగ్గిపోయింది. ఒకప్పుడు గుంపులగుంపులుగా కనిపించిన కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు అవి ఒక్కటికూడా లేవని సర్వేలో తేలింది. అయితే కొన్ని చోట్ల స్థానిక ప్రభుత్వాల పరిరక్షణ చర్యలతో వాటి సంఖ్య పెరిగిందని నివేదిక పేర్కొంది. ‘‘తగ్గిపోయిన సంఖ్యను ఎలాగూ పెంచలేము. ఉన్న ఏనుగుల సంఖ్యా వేగంగా క్షీణిస్తోంది. మాలి, చాద్, నైజీరియా వంటి దేశాల్లో మరీ దారుణంగా పడిపోయింది’’ అని కొలరాడో స్టేట్ వర్సిటీలో వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ విభాగ ప్రొఫెసర్ జార్జ్ విటెమర్ చెప్పారు.కొన్ని చోట్ల మెరుగైన పరిస్థితులు ఆఫ్రికా ఖండం దక్షిణ దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎంతో శ్రమకోర్చి ఏనుగుల సంతతిని కాపాడుతున్నారు. ప్రభుత్వాల చొరవ, స్థానికుల అండతో ఏనుగుల సంఖ్య అక్కడ పెరిగింది. బొట్సావా, జింబాబ్వే, నమీబియాలో ఇప్పటికే వాటి సంఖ్య భారీగానే ఉంది. ‘‘కొన్ని చోట్ల మనం విజయం సాధించాం. ఈ విషయంలో మనకు మనం శెభాష్ చెప్పకోవాల్సిందే. అయితే ఇంకా ఏఏ ప్రాంతాల్లో విజయావకాశాలు ఉన్నాయో కనిపెట్టి కార్యసాధకులం కావాల్సిన తరుణమొచ్చింది’’అని ప్రొఫెసర్ జార్జ్ విటెమర్ అన్నారు.ఏనుగు దంతాలపై మోజుతో.. చాలా పొడవుండే ఆఫ్రికన్ ఏనుగుల దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో చాలా విలువ ఉంది. వీటి కోసమే వేటగాళ్లు ఏనుగులను చంపేస్తున్నారు. వేటగాళ్లను అడ్డుకోగలిగితే ఈ వన్యప్రాణులను కాపాడవచ్చని జంతుప్రేమికులు చెబుతున్నారు. అడవుల్లో పెరుగుతున్న వ్యవసాయం కారణంగా ఏనుగులు తమ ఆవాసాలను, ఆహార వనరులను కోల్పోతున్నాయి. చదవండి: అడవిలో అమ్మప్రేమ.. జంతువులు, పక్షుల్లో అరుదైన మమకారం!‘‘అడవుల విస్తరణకు ఏనుగులు మూలాధారం. ఎన్నో రకాల చెట్ల కాయలు, పండ్లను తింటూ వాటి గింజలను జీర్ణంచేయకుండా వేర్వేరు చోట్ల విసర్జించి కొత్త మొక్కల అంకురార్పణకు ఆజ్యం పోస్తాయి. నిత్యం వనవృద్ధి కార్యం చేసే ఏనుగుల సంఖ్య తగ్గడం భూమాతకు తీరని శోకం’’ అని సౌత్ ఆఫ్రికాలోని నెల్సన్ మండేలా యూనివర్సిటీలోని ఆఫ్రికన్ కన్జర్వేషన్ ఎకాలజీ అధ్యయనకారుడు, నివేదిక సహరచయిత డేవ్ బల్ఫోర్ ఆందోళన వ్యక్తంచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అడవుల్లో రాజమౌళి హంటింగ్.. ఆ సినిమా కోసమేనా?
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం వేకేషన్లో చిల్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్యాప్ ఎక్కువగా రావడంతో ఆఫ్రికాలో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం కెన్యాలోని అడవుల్లో వన్య ప్రాణలను చూస్తూ సేద తీరుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ప్రాంతంలో సినిమా షూటింగ్ లోకేషన్స్ కోసమే రాజమౌళి వెళ్లినట్లు తెలుస్తోంది. అడవుల్లో తిరుగుతున్న ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు దర్శకధీరుడు. (ఇది చదవండి: ఆ సమయంలో అవార్డ్ తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది: మెగాస్టార్)మరోవైపు ప్రిన్స్ మహేశ్‌బాబుతో తన తదుపరి చిత్రం తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధమైంది. ఈ సినిమాను ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో రూపొందించనున్నారు. ఈ మూవీని ఫుల్ యాక్షన్ అడ్వెంచరస్ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో కథ ఉంటుందని ఇప్పటికే హింట్ కూడా ఇచ్చారు. అందువల్లే ఆఫ్రికాలోని దట్టమైన అడవుల లోకేషన్స్ కోసమే రాజమౌళి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాదిలో ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. #TFNReels: Maverick Director @ssrajamouli is currently scouting locations in Kenya, Africa for #SSMB29!!🌎🔥#MaheshBabu #SSRajamouli #TeluguFilmNagar pic.twitter.com/ABq6DxfVOg— Telugu FilmNagar (@telugufilmnagar) October 29, 2024 View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) -
శంకర్ దయాళ్ శర్మకు ఏనుగు గిఫ్ట్.. అసలు ఆ కథేంటి?
ఢిల్లీ: ఢిల్లీ జూలో ఉన్న 29 ఏళ్ల ఆఫ్రికన్ ఏనుగు ‘శంకర్’ ఆరోగ్యం, గొలుసుల బంధీ నుంచి విడిపించడానికి కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. ఆఫ్రికన్ ఏనుగు శంకర్ శుక్రవారం గొలుసుల నుంచి విముక్తి చేశారు. ఇప్పుడు ఆ ఏనుగు జూలోని తన ఎన్‌క్లోజర్‌లో చురుకుగా తిరుగుతోంది. అయితే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ‘ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘అక్టోబర్ 9న నేను జూని సందర్శించాను. ఆఫ్రికన్ ఏనుగు 'శంకర్'ను పరిశీలించాను. ఏనుగు ‘శంకర్’ ఆరోగ్యం కోసం పర్యావరణ మంత్రిత్వ శాఖ, జామ్‌నగర్‌కు చెందిన ‘వంతరా’ బృందం, నిపుణులైన వెటర్నరీ వైద్యుల బృందం చేసిన కృషికి ధన్యవాదాలు. అందులో నీరజ్, యదురాజ్, దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్, ఫిలిప్పీన్స్‌కు చెందిన మైఖేల్ ఉన్నారు. శంకర్ ఆరోగ్యం, పరిశీలనకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక కొనసాగుతోంది’’ అని అన్నారు."Following my visit to the zoo on 9th October and meeting with 'Shankar', the lone African elephant, we brought together the Ministry of Environment, Team Vantara from Jamnagar and the expert veterinary doctors. I am happy to share that 'Shankar' is finally free from chains.… pic.twitter.com/AN3pVFU2hi— Kirti Vardhan Singh (@KVSinghMPGonda) October 11, 2024 ప్రస్తుతం జూలో ఉన్న మావటిలు.. శంకర్‌తో సులభంగా సంభాషించేలా శిక్షణ తీసుకుంటారని జూ అధికారులు తెలిపారు. ఏనుగు ‘శంకర్’ ప్రవర్తన , దినచర్యను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. శంకర్ పురోగతిని తనిఖీ చేయడానికి ఫిలిప్పీన్స్‌కు చెందిన మావటి మైఖేల్‌తో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం శంకర్ గతంలో కంటే చాలా కనిపిస్తోందని జూ అధికారులు తెలిపారు.1996లో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు జింబాబ్వే దౌత్య బహుమతిగా ఇచ్చిన ఈ ఏనుగు(శంకర్)ను సరిగా చూసుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్ (జూ) సభ్యత్వాన్ని వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియమ్స్ (వాజా) ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. -
సహారాకు కొత్త అందం!
ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారిలో వర్షం కురిసింది. అదీ భారీగా. రెండు రోజులపాటు కురిసిన వానకు అక్కడి ఇసుక తిన్నెల స్వరూపమే మారిపోయింది. హఠాత్తుగా ఆ ప్రాంతంలో పెద్దపెద్ద సరస్సులు వెలిశాయి. ఒయాసిస్‌ల వద్ద ఉండే చెట్ల ప్రతిబింబాలు వాన నీటిలో చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దశాబ్దాల కాలంలో కురిసిన అతి భారీ వర్షం ఇదేనని అక్కడి వారు సంబరపడుతున్నారు. సాధారణంగా సహారాలో ఏడాదిలో అదీ వేసవిలో కొద్దిపాటి వాన కురుస్తుంది. కానీ, మొరాకో ఆగ్నేయాన ఉన్న సహారాలో అల్ప పీడనం కారణంగా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల అతిభారీగా కూడా వానలు కురిశాయని నాసా ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. మొరాకాలో వాయవ్య నగరం ఇర్రాచిడియాలో ఏడు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. సెపె్టంబర్లో సాధారణంగా కురిసే వర్షపాతానికి ఇది ఏకంగా నాలుగు రెట్లు. అంతేకాదు, ఆ ప్రాంతంలో ఆరు నెలల్లో కురిసే వర్షపాతానికి ఇది సమానం. ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో వర్షాలు కురియడం 30–50 సంవత్సరాల కాలంలో ఇదే మొదటిసారని మొరాకో వాతావరణ అధికారి హొస్సేన్ చెప్పారు. దీంతో, ఎడారి ఇసుక తిన్నెలు, అక్కడక్కడ పెరిగే మొక్కలు, ఖర్జూర చెట్లు కొత్త ప్రకృతి అందాలను సంతరించుకున్నాయి. మెర్జౌగా ఎడారి పట్టణంలో అరుదైన ఇసుక తిన్నెల్లోకి భారీగా చేరిన వరద కొత్త సరస్సులను సృష్టించింది. మొరాకోలోని అతిపెద్ద నేషనల్ పార్క్‌గా ఉన్న ఇరిఖి నేషనల్ పార్క్‌లో ఇంకిపోయిన చెరవులు మళ్లీ నిండాయి. కొన్ని చోట్ల పచి్చక బయళ్లు అవతరించాయి. అంతగా జనం ఉండని ప్రాంతాల్లోనే ఎక్కువగా వానలు కురిశాయి. ఇక్కడ ఎలాంటి నష్టం జరగలేదు. అయితే, ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలతో పట్టణాలు, గ్రామాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ విపరీత మార్పులే ఈ పర్యవసానాలకు కారణమని నిపుణులు అంటున్నారు. వాతావరణం మరింతగా వేడెక్కితే మున్ముందు ఇక్కడ మరింతగా వర్షాలకు కురిసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దాదాపు 36 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించిన ఉన్న సహారా ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి. –నేషనల్ డెస్క్, సాక్షి -
కాంగోలో 37 మందికి మరణ శిక్ష
కిన్షాసా: ఆఫ్రికా దేశం కాంగోలో మే నెలలో జరిగిన విఫల తిరుగుబాటు యత్నం ఘటన లో పాలుపంచుకున్న ఆరోపణలపై అక్కడి కోర్టు ఏకంగా 37 మందికి మరణ దండన విధించింది. దోషుల్లో అమెరికాకు చెందిన ముగ్గురు, బెల్జియం, కెనడా, యూకేలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. అప్పీల్ చేసుకునేందుకు వీరికి కోర్టు ఐదు రోజుల గడువిచ్చింది. తిరుగుబాటుకు పాలుపంచుకున్నారంటూ మొత్తం 50 మందిపై ఆర్మీ అభియోగాలు మోపింది. కోర్టు వీరిలో 14 మందిని నిర్దో షులుగా పేర్కొంటూ విడుదల చేసింది. కో ర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ఆరుగురు విదేశీయుల తరఫు లాయర్ తెలిపారు. -
వామ్మో మంకీపాక్స్!.. భారత్‌లో అనుమానిత కేసు
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్ (ఎంపాక్స్) వైరస్ సెగ భారత్‌కూ తాకింది. మన దేశంలో తాజాగా ‘అనుమానిత’ ఎంపాక్స్ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎంపాక్స్ వ్యాప్తి అధికంగా ఉన్న ఓ దేశం నుంచి వచి్చన యువకుడిలో వైరస్ లక్షణాలను గుర్తించినట్లు ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ‘‘బాధితుడిని ఆసుపత్రిలో చేర్చి ఐసోలేషన్‌లో ఉంచాం. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అతడితో కలిసి ప్రయాణించిన వ్యక్తులను గుర్తిస్తున్నాం. అతనికి నిజంగా ఎంపాక్స్ సోకిందీ లేనిదీ నిర్ధారించడానికి నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నాం’’ అని పేర్కొంది. ‘‘ఇది అనుమానిత కేసే. ఇంకా నిర్ధారణ కాలేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని తెలిపింది. వైరస్ విషయంలో ఏ పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు వివరించింది. 99,176 కేసులు.. 208 మరణాలు యూరప్, ఆఫ్రికా దేశాల్లో ఇటీవల మంకీపాక్స్ వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను ‘అంతర్జాతీయ ఆరోగ్య విపత్తు’గా ఆగస్టు 14న ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి 2022లో వెలుగులోకి వచి్చంది. ఇటీవల ఆఫ్రికాలో కొత్త రకం ఎంపాక్స్ పుట్టుకొచి్చనట్లు తేలింది. 2022 వైరస్ కంటే ఇది మరింత ప్రాణాంతకమని తేలింది. కొత్త వైరస్ లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. 2022 నుంచి 2023 దాకా 116 దేశాల్లో 99,176 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. 208 మంది మరణించారు. 2024లో 15,600కు పైగా కేసులు నమోదయ్యాయి. 537 మంది మృతిచెందారు. 2022 నుంచి భారత్‌లో కనీసం 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. చివరిసారిగా ఈ మార్చి నెలలో ఒక కేసు బయటపడింది.ఏమిటీ ఎంపాక్స్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. అందుకే దీనికి మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్‌కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. మనుషుల్లో దీన్ని 1970లో తొలిసారిగా గుర్తించారు. కాంగోలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకింది. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకుతుండటంతో ఎంపాక్స్ అనే పొట్టిపేరు ఖరారుచేశారు. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి కారక వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గో మశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే.ఇలా సోకుతుంది→ అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్‌కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచీ సోకుతుంది. → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా, ముఖాన్ని ముఖంతో తాకినా, కరచాలనం చేసినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు. → తల్లి నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు.వ్యాధి లక్షణాలు ఏమిటీ?→ ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులొస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. → చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. → 90 శాతం కేసుల్లో ముఖంపై, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులొస్తాయి. → నీటి బొడిపెలుగా పెద్దవై సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. → నీరసంగా ఉంటుంది. గొంతెండిపోతుంది.వ్యాక్సిన్ ఉందా? స్వల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్‌కు నిర్దిష్టమైన చికిత్స విధానం, వ్యాక్సిన్ లేవు. మశూచికి వాడే టికోవిరమాట్ (టీపీఓఎక్స్ ఎక్స్) యాంటీ వైరల్‌నే దీనికీ వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ (ఇమ్వామ్యూన్, ఇంవానెక్స్) డ్రగ్స్‌నే 18 ఏళ్ల పై బడిన రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న దేశాల్లో మాదిరిగా నివారణ చర్యలు, నిర్ధారణ పరీక్షల వంటివి లేక ఆఫ్రికా దేశాల్లో వైరస్ విజృంభిస్తోంది.అప్రమత్తంగా ఉండండి: కేంద్రం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల్లో ఎంపాక్స్ కేసులు పెరిగిపోతుండటంతో సరిహద్దులతోపాటు ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సర్క్యులర్ జారీ చేసింది. ఎంపాక్స్ లక్షణాలు గుర్తించడానికి విదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఎంపాక్స్ సన్నద్ధతపై ప్రధాని ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్రా తాజాగా ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఈ కేసుల్లో సమర్థ చికిత్స కోసం ఆసుపత్రులను ఇప్పట్నుంచే సిద్ధం చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
చేపపై యుద్ధం
ఎక్కడి జీవి అక్కడ ఉంటేనే ప్రకృతి సమతుల్యత సజావుగా ఉంటుంది. ఆఫ్రికా జలాశయాల్లో జీవించే చిన్నపాటి బ్లాక్చిన్ తిలాపియా చేప ఇప్పుడు థాయిలాండ్‌కు చుక్కలు చూపుతోంది. అక్కడి చిన్న చేపలు, రొయ్యలు, నత్త లార్వాలను గుటకాయ స్వాహా చేస్తోంది. అలా దేశ మత్స్య పరిశ్రమకు భారీ నష్టాలు తెచి్చపెడుతోంది. దాంతో వాటిపై థాయ్‌లాండ్ ఏకంగా యుద్ధమే ప్రకటించింది. తిలాపియా చేప అంతు చూసేందుకు రంగంలోకి దిగింది. వాటిని పట్టుకుంటే కేజీకి రూ.35 చొప్పున ఇస్తామంటూ జనాన్నీ భాగస్వాములను చేసింది. దాంతో జనం సైతమంతా తిలాపియా వేటలో పడ్డారు. గ్రామీణులు ప్టాస్టిక్ కవర్లు, వలలు చేతబట్టుకుని మోకాలి లోతు జలాశయాల్లో తిలాపియా వేటలో మునిగిపోయారు. దీనికి తోడు చెరువులు, కుంటలు, సరస్సుల్లో... ఇలా ఎక్కడ పడితే అక్కడ తిష్ట వేసిన తిలాపియా చేపలను తినే ఆసియాన్ సీబాస్, క్యాట్ఫి‹Ùలనూ ప్రభుత్వం వదులుతోంది. ఆడ తిలాపియా చేప ఒకేసారి 500 పిల్లలను పెడుతుంది. దాంతో వీటి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఘనా నుంచి దిగుమతి! జంతువుల దాణా, రొయ్యలు, పౌల్ట్రీ, పంది మాంసం వ్యాపారం చేసే ఓ సంస్థ దిగుమతి చేసుకున్న తిలాపియా చేపలు చివరికిలా దేశమంతటినీ ముంచెత్తినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఏం చేసినా ఒక చేప జాతిని సమూలంగా అంతం చేయడం దాదాపు అసాధ్యమని స్థానిక జలచరాల శాస్త్రవేత్త డాక్టర్ సువిత్ వుథిసుథిమెథవే అంటున్నారు. ‘‘వేగవంతమైన పునరుత్పత్తి వ్యవస్థ ఉన్న చేపలను పూర్తిగా అంతం చేయడం మరీ కష్టం. బాగా ప్రయతి్నస్తే మహా అయితే వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు’’ అని అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Zambia: 400 కుక్కలు మృతి.. ప్రభుత్వం అప్రమత్తం
ఆఫ్రికా దేశమైన జాంబియాలో విషాదకర ఉదంతం చోటుచేసుకుంది. కలుషితమైన మొక్కజొన్న పిండిని తిన్న 400కు పైగా పెంపుడు కుక్కలు మృతి చెందాయి. జాబియా దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. మొక్కజొన్న పిండి వినియోగించే విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు.నెల రోజుల వ్యవధిలో భారీ సంఖ్యలో కుక్కలు చనిపోవడంతో ఆరోగ్య శాఖ విచారణ ప్రారంభించింది. ఆ కుక్కలు తిన్న మొక్కజొన్న పిండికి సంబంధించిన 25 నమూనాలలో ప్రమాదకరమైన ఫంగస్ ఉనికిని గుర్తించారు. ఈ ఫంగస్ అఫ్లాటాక్సిన్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుందని, ఇది మానవులకు, జంతువులకు ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య మంత్రి ఎలిజా ముచిమా మాట్లాడుతూ జాంబియాలోని ప్రజలకు మొక్కజొన్న ప్రధాన ఆహారం. అందుకే ఇది ఆందోళనకరంగా మారిందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం అఫ్లాటాక్సిన్ అనేది కాలేయ క్యాన్సర్‌కు కారణమయ్యే విష పదార్థం.జాంబియా ఆరోగ్య శాఖ తాజాగా కలుషితమైన మొక్కజొన్న పంటను గుర్తించి, దానిని నాశనం చేస్తోంది. దేశ జనాభాలో 60 శాతం మందికి మొక్కజొన్న ప్రధాన ఆహారం. ఇటీవలి కాలంలో తీవ్రమైన కరువు ఏర్పడి మొక్కజొన్న పంటను దెబ్బతీయగా, ఇప్పుడు ఈ ఫంగస్ మరో ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. -
Monkeypox: మరో మహమ్మారి.. !
కోవిడ్ మహమ్మారి సృష్టించిన మహావిలయం నుంచి ప్రపంచం పూర్తిగా తేరుకోకముందే ఎంపాక్స్ రూపంలో మరో వైరస్ భూతం భూమండలాన్ని చుట్టేస్తోంది. తొలుత ఆఫ్రికా దేశాలకే పరిమితమైన ఈ వైరస్ తాజాగా రూపాంతరాలు చెంది ప్రాణాంతకంగా పరిణమించింది. ఆఫ్రికాలో ఇన్నేళ్లలో వందలాది మంది మరణాలతో ప్రపంచదేశాలు ఇన్నాళ్లకు అప్రమత్తమయ్యాయి. నిర్లక్ష్యం వహిస్తే మరో మహమ్మారిని స్వయంగా ఆహా్వనించిన వారమవుతామని దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీచేసింది. ఈ మేరకు బుధవారం ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించింది. ఆఫ్రికా ఖండాన్ని దాటి వేరే ఖండాల దేశాల్లోనూ వేగంగా వ్యాపిస్తుండటంతో 2022 ఏడాది తర్వాత తొలిసారిగా డబ్ల్యూహెచ్ఓ ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆఫ్రికాలో ఈ 7 నెలల్లో∙15,600 కేసులు నమోదయ్యాయి. 537 మంది ఎంపాక్స్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా స్వీడన్, పాకిస్థాన్‌లకూ వైరస్ పాకింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి, కట్టడి, నివారణ చర్యలుసహా వ్యాధి పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి తెల్సుకుందాం. ఏమిటీ ఎంపాక్స్ వైరస్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. అందుకే ఈ వైరస్‌కు మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్‌కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. 1970లో కాంగో దేశంలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకడంతో తొలిసారిగా మనుషుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకడంతో ‘మంకీ’పాక్స్‌కు బదులు ఎంపాక్స్ అనే పొట్టిపేరును ఖరారుచేశారు. ఆర్థోపాక్స్ వైరస్ రకానికి చెందిన ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులు వస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి వ్యాధికి కారణమైన వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గోమశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే. వైరస్ ఎలా సోకుతుంది? → అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా వైరస్ సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్‌కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచి వైరస్ సోకుతుంది → ఎక్కువసేపు ముఖాన్ని ముఖంతో తాకినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా వైరస్ సోకే అవకాశాన్ని కొట్టిపారేయలేం వేటి ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది? రోగి వినియోగించిన దుస్తులు, మంచం, టవల్స్, పాత్రలు సాధారణ వ్యక్తి వాడితే అతనికీ వైరస్ వస్తుం లాలాజలం తగిలినా, కరచాలనం చేసినా సోకుతుంది. తల్లి నుంచి బిడ్డకు వైరస్ సంక్రమించవచ్చు. కొత్తగా ఏఏ దేశాల్లో విస్తరించిందికొత్తగా 13 ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోందని గత వారం గణాంకాల్లో వెల్లడైంది. క్రితంతో పోలిస్తే ఇక్కడ కేసులు 160 శాతం, మరణాలు 19 శాతం పెరగడం గమనార్హం. కొత్త కేసుల్లో 96 శాతం కేసులు ఒక్క కాంగోలోనే గుర్తించారు. ఎంపాక్స్ కొత్త వేరియంట్ రోగుల్లో మరింతగా వ్యాధిని ముదిరేలా చేసి జననాంగాల వద్ద చర్మగాయాలకు కారణమవుతోంది. దీంతో తమకు ఈ వైరస్ సోకిందన్న విషయం కూడా తెలీక చాలా మంది కొత్త వారికి వైరస్‌ను అంటిస్తున్నారు. 2022 ఏడాదిలో ఎంపాక్స్ క్లాడ్2 రకం వేరియంట్ విజృంభిస్తే ఈసారి క్లాడ్1 వేరియంట్ వేగంగా సంక్రమిస్తోంది. ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకరం. లక్షణాలు ఏమిటీ?→ చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. ఒళ్లంతా నీరసంగా ఉంటుంది. గొంతు ఎండిపోతుంది. → మధ్యస్థాయి పొక్కులు పైకి తేలి ఇబ్బంది కల్గిస్తాయి.→ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి, వణ్యప్రాణుల నుంచి సోకుతుంది. 90 శాతం కేసుల్లో ముఖంపైనా, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులు వస్తాయి. నీటి బొడిపెలుగా చిన్నగా మొదలై పెద్దవై తర్వాత సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. వ్యాక్సిన్ ఉందా? అత్యల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్ సోకిన వారికి నిర్ధష్టమైన చికిత్స విధానంగానీ వ్యాక్సిన్‌గానీ లేవు. మశూచి చికిత్సలో వాడే యాంటీ వైరల్ ఔషధమైన టికోవిరమాట్(టీపీఓఎక్స్ ఎక్స్)ను ఎంపాక్స్ రోగులకు ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ డ్రగ్స్‌నే 18 ఏళ్లు, ఆపైబడిన వయసు రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాధులు ప్రబలేలోపే నివారణ చర్యలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఆరోగ్యపరంగా నిఘా కార్యక్రమాలు కొనసాగుతున్నాయిగానీ వెనుకబడిన ఆఫ్రికా దేశాల్లో అవేం లేవు. దీంతో వైరస్ వ్యాప్తి ఆగట్లేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పాకిస్తాన్‌కు పాకిన మంకీపాక్స్.. ముగ్గురికి పాజిటివ్
ఇస్లామాబాద్: మంకీ పాక్స్ వ్యాధి ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాప్తిచెందుతోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. తాజాగా పాకిస్థాన్‌లో ముగ్గురు వ్యక్తులకు మంకీ పాక్స్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆగస్టు 3న సౌదీ అరేబియా నుంచి వచ్చారు. వారికి ఆరోగ్య సమస్యలు రావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా మంకీ పాక్స్ ఉన్నట్లు తేలింది. వారికి మంకీపాక్స్ ఉన్నట్లు ఆగస్ట్ 13న పెషావర్‌లోని ఖైబర్ మెడికల్ యూనివర్సిటీ వెల్లడించింది.కాగా ఆ ముగ్గురితో విమానంలో ప్రయాణించిన వారిని, సన్నిహితులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. 2023లో కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ముగ్గురు ప్రయాణికులకు మంకీపాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అవడంతో వారికి అత్యవసర వైద్యసేవలు అందించారు. అప్పట్లో దేశంలో మొత్తం 11 మంకీపాక్స్ కేసులు నమోదవగా ఒకరు మరణించారు. -
ఆఫ్రికాలో పడవ బోల్తా.. 15 మంది మృతి
ఆఫ్రికన్ దేశమైన మారిటానియా సమీపంలోని సముద్రంలో పడవ బోల్తా పడి 15 మంది వలసదారులు మృతిచెందారు. ఈ ఘటనలో పలువురు గల్లంతయ్యారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) ఈ సమాచారాన్ని తెలియజేసింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 300 మంది ఉన్నారు. మారిటానియా రాజధాని నౌవాక్చాట్కు సముద్రమార్గంలో పడవ చేరుకుంటున్న సమయంలో అది బోల్తా పడింది. ఈ పడవ ఏడు రోజుల పాటు సముద్రంలో ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఈ పడవలో అధికశాతం మంది సెనెగల్, గాంబియన్ ప్రజలు ఉన్నారు.నౌక్‌చాట్‌లో పడవ బోల్తా పడి 15 మంది వలసదారులు మృతిచెందడం, సముద్రంలో 195 మందికి పైగా జనం గల్లంతుకావడం తమకు చాలా బాధ కలిగించిందని ఐఓఎం ట్విట్టర్లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. ప్రాణాలతో బయటపడిన వారిలో 10 మందిని అత్యవసర వైద్య చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. -
West Africa: పడవ బోల్తా.. 105 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికా దేశం మారిటానియా తీరంలో వలస బోటు బోల్తా పడడంతో 105 మంది మృతి చెందారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులకు 89 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి.ఈ ఉదంతం గురించి ఎన్‌డియాగోలోని మత్స్యకార సంఘం అధ్యక్షుడు యాలీ ఫాల్ మాట్లాడుతూ స్థానికులు ఆ మృతదేహాలను పూడ్చిపెట్టారన్నారు. మైగ్రేషన్ రైట్స్ గ్రూప్ వాకింగ్ బోర్డర్స్ తెలిపిన వివరాల ప్రకారం 2024 మొదటి ఐదు నెలల్లో సుమారు ఐదువేల మంది వలసదారులు కానరీ దీవులకు వెళుతుండగా వివిధ బోటు ప్రమాదాల్లో మృతి చెందారు.పశ్చిమ ఆఫ్రికా దేశపు మత్స్యకార సంఘం అధిపతి తెలిపిన వివరాల ప్రకారం 89 మంది వలసదారుల మృతదేహాలను కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుంది. బోటు బోల్తా పడిన ఘటనలో ఐదేళ్ల బాలిక సహా తొమ్మిది మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. కాగా పశ్చిమ ఆఫ్రికా తీరం నుండి కానరీ దీవులకు చేరుకునే అట్లాంటిక్ వలస మార్గం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన మార్గాలలో ఒకటి. ఈ మార్గాన్ని సాధారణంగా ఆఫ్రికన్ వలసదారులు స్పెయిన్ చేరుకోవడానికి ఉపయోగిస్తారు. వేసవి కాలంలో ఈ మార్గం అత్యంత రద్దీగా ఉంటుంది. -
ఆఫ్రికాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఆఫ్రికాలో భారతీయులు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 30వ తేదీ ఆదివారం నిర్వహించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో భాగంగా దారుసలెమ్ భారతీయ రాయబార కార్యాలయ ఉద్యోగి డాక్టర్ సౌమ్య చౌహన్ ఆధ్వర్యంలో టాంజానియా రాష్ట్రం ఎంబీఈఎఫ్వై టౌన్లో 9వ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు సౌమ్య చౌహన్ మాట్లాడుతూ.. "యోగా అనేది ఒక ప్రయాణం, గమ్యం కాదు. ఇది అంతర్గత శాంతికి, స్వీయ-ఆవిష్కరణకు, ప్రకృతితో సామరస్యానికి ఒక మార్గం. "అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వాహకుడు ఆంధ్రప్రదేశ్ తిరువూరు వాసి రామిశెట్టి వెంకట నారాయణ (సత్య) మాట్లాడుతూ ..." ప్రధాని మంత్రి మోదీగారు పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయలు శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సుకు, సమగ్ర ఐక్యతకు యోగ ఒక మంచి సాధనమన్నారు. రోజువారీ ఒత్తుడులు, వ్యక్తిగత జీవితాల తోపాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిచడంలో యోగా ముఖ్య పాత్ర పోషిస్తుంది" అని అన్నారు. ఈ యోగా అభ్యాసకులలో మానసిక ప్రశాంతతా, ఐక్యత భావాన్ని పెంపొందించి, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడతుందని యోగ సాధకుడు రోహిత్ పేర్కొన్నారు. (చదవండి: డాలస్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు) -
దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్లీ రామఫోసా
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్సీ)కు చెందిన సిరిల్ రామఫోసా(71) మళ్లీ ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో దాదాపు 30 ఏళ్ల తర్వాత ఏఎన్సీ పార్లమెంట్లో మెజారిటీ కోల్పోయింది. దీంతో, డెమోక్రాటిక్ అలయెన్స్, ఇతర చిన్న పార్టీలతో కలిసి ఏఎన్సీ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. శుక్రవారం పార్లమెంట్లో జరిగిన ఎన్నిక లో రామఫోసాకు 283 ఓట్లు పడగా, ప్రత్యర్థి మలేమాకు 44 ఓట్లే ద క్కాయి. రామఫోసా బుధవారం అధ్యక్షునిగా ప్రమాణం చేయనున్నారు. -
స్లాట్లు, విదేశీ దైపాక్షిక హక్కులు కోల్పోయిన విమానసంస్థ
గోఎయిర్ విమాన సంస్థ స్లాట్లు, విదేశీ ద్వైపాక్షిక హక్కులను తాత్కాలికంగా ఇతర కంపెనీలకు కట్టబెడుతూ కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంది.గోఎయిర్‌కు చెందిన స్లాట్లు, దైపాక్షిక హక్కులను ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగోలకు పంపిణీ చేస్తున్నట్లు మంత్రిత్వశాఖ ప్రకటించింది. అయితే వీటిని సాధారణ పూల్‌లో ఉంచి ఆపై ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా కేటాయించాలని మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా, అకాసా సంస్థ గోఎయిర్ దుబాయ్ విమానయాన హక్కులను కోరినట్లు తెలిసింది. దీనిపై కేంద్రం అకాసాకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.గోఎయిర్ స్లాట్లు, దైపాక్షిక హక్కుల కోసం గతంలో బిడ్డింగ్ వేసిన ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ ఈజ్‌మైట్రిప్ సీఈఓ నిశాంత్ పిట్టి ఇటీవల తన బిడ్‌ను ఉపసంహరించుకున్నారు. ఆ సమయంలో ఈజ్‌మైట్రిప్ స్థిరమైన వృద్ధి సాధించేందుకు వనరులను ఉపయోగించనున్నామని నిశాంత్ చెప్పారు. మళ్లీ గోఎయిర్ కోసం కొత్తగా ఎవరు బిడ్ వేయలేదు. దాంతో సంస్థకు చెందిన స్లాట్లు, ఇతర హక్కులను మంత్రిత్వశాఖ ఇతర సంస్థలకు తాత్కాలికంగా కేటాయించింది.స్లాట్లు, దైపాక్షిక హక్కులు..ఒక నిర్దిష్ట దేశానికి చెందిన విమానయాన సంస్థలు మరొక దేశానికి అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకోవాలి. ఇది ఒక దేశం నుంచి వారానికి ఎన్ని విమానాలు ప్రయాణించాలో నిర్ణయిస్తుంది. అయితే విమానయాన సంస్థ ఈ హక్కులు కలిగిఉన్నా విమాన కార్యకలాపాలను ప్రారంభించడానికి ఎయిర్‌పోర్ట్‌ల్లో స్లాట్లను కలిగి ఉండాలి. ఒక ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరడానికి లేదా విమానాశ్రయానికి చేరుకోవడానికి అనుమతించే తేదీ, సమయాన్ని స్లాట్‌గా పేర్కొంటారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీబీసీఏ అధికారులు, విమానాశ్రయ ఆపరేటర్లు, విమానయాన సంస్థలతో కూడిన కమిటీ ఈ స్లాట్లను కేటాయిస్తుంది.టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా, ఇండిగో ప్రతి వారం దాదాపు ఒక కొత్త విమానాన్ని తమ ఫ్లీట్‌లో చేరుస్తున్నాయి. ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్, అకాసా ఈరంగంలో వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇలాంటి సమయంలో గోఎయిర్‌కు ఈ స్థితి రావడంపట్ల మార్కెట్ వర్గాలు కొంత ఆందోళన చెందుతున్నాయి.ఇదీ చదవండి: మరో ఆఫ్రికా దేశంలో రిలయన్స్ సేవలు!వాడియా గ్రూప్ యాజమాన్యంలో గో ఫస్ట్ రుణదాతలకు రూ.6,200 కోట్లకు పైగా బకాయిపడింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంక్‌లకు వరుసగా రూ.1,934 కోట్లు, రూ.1,744 కోట్లు, రూ.75 కోట్లు రుణాలు చెల్లించాల్సి ఉంది. -
మరో ‘కేజీఎఫ్’ ఆనవాలు.. ఎక్కడో తెలుసా..?
టాంజానియాలో బంగారం, లిథియం నిల్వలు ఉన్నట్లు డెక్కన్ గోల్డ్ మైన్స్ గుర్తించింది. దాంతో ఈస్ట్ఆఫ్రికాలోని టాంజానియాలో ‘కేజీఎఫ్’ తరహా తవ్వకాలు జరుపనున్నట్లు తెలిసింది. బంగారంతోపాటు లిథియం వంటి విలువైన ఖనిజాలను వెలికి తీయడంలో ఇదొక కీలక పరిణామమని సంస్థ తెలిపింది. డెక్కన్ గోల్డ్ మైన్స్‌కు చెందిన డెక్కన్ గోల్డ్ టాంజానియా ప్రైవేట్ లిమిటెడ్ న్జెగా-టబోరా గ్రీన్‌స్టోన్ పరిధిలోని పీఎల్ బ్లాక్ 11524లో ఈ నిల్వలను గుర్తించింది. అక్కడ బంగారంతోపాటు లిథియంకు చెందిన ముడిపదార్థాలు ఉన్నట్లు తేలింది. విద్యుత్ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీల తయారీకి లిథియం ఎంతో ముఖ్యమైనది. అంతర్జాతీయంగా విస్తరించేందుకు ఈ లిథియం నిల్వల గుర్తింపు ఎంతో ఉపయోగపడుతాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హనుమ ప్రసాద్ మొదాలి తెలిపారు. ఇదీ చదవండి: మారుతున్న రాజకీయ ప్రచార పంథా.. సోషల్ మీడియా సాయమెంత..? లిథియం, ఇతర అనుబంధ లోహాల కోసం ప్రాస్పెక్టింగ్ లైసెన్సు(పీఎల్) ఆర్డరు కోసం చూస్తున్నట్లు మోదాలి పేర్కొన్నారు. టాంజానియాలో కీలక ఖనిజాల కోసం అధ్యయనాలను కొనసాగించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా 100.49 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో లిథియం నిల్వలు ఉన్నట్లు తేలిందన్నారు. దీనికి పీఎల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. డెక్కన్ గోల్డ్ మైన్స్‌కు ఐదు అధునాతన బంగారు గనుల ప్రాజెక్టులున్నాయి. -
అక్కడ ఇద్దరమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాల్సిందే!..లేదంటే జైలు శిక్ష!
వివాహాలకు సంబంధించి పలు దేశాల్లో పలు ఆచారాలు ఉంటాయి. కొన్ని చూడటానికి, వినటానికి చాలా వింతగా ఉంటాయి. ఎంతలా అంటే..ఇదేం ఆచారం రా ! బాబు అని నోటిపై వేలేసుకునేలా ఉంటాయి. పైగా వాళ్లు ఆ ఆచారాలను చాలా నిబద్ధతతో ఆచరించడం మరింత విస్తుపోయేలా ఉంటుంది. ఇంతకీ ఈ గమ్మతైన వింత ఆచారం ఏదేశంలో ఉంది? ఏంటా వింత ఆచారం అంటే..? ఇలాంటి వింత ఆచారాలు ఎక్కువగా ఆఫ్రికాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ ఏరిత్రియ అనే తెగ ఒకటి ఉంది. ఈ తెగల ప్రజలు వివాహ సమయంలో చాలా వింతైన ఆచారాలను సంప్రదాయాలను పాటిస్తారు. సాధారణంగా ఒక పురుషుడు ఒక మహిళను పెళ్లి చేసుకునే ఆచారమే ఏ సంప్రదాయంలోనైనా ఉంటుంది. కానీ ఇక్కడ సంప్రదాయంలో మాత్రం ఇద్దరు మహిళలను తప్పనిసరిగా వివాహం చేసుకోవాలట. ఏంటీ బై వన్ గెట్ వన్ ఆఫర్ అనుకుంటున్నారా..? కానీ ఆఫ్రికా ఖండంలోని ఈ ఎరిత్రియ తెగ మాత్రం ఈ సంప్రదాయన్ని నేటికి పాటిస్తోంది. ఒక వేళ అలా గనుకు ఎవరైన చేయకపోతే దాన్ని అతిపెద్ద నేరంగా పరిగణించి వారిని జైల్లో వేయిస్తారట. అందేకాదండోయ్ ఏకంగా జీవత ఖైదు శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుందట. అందువల్లే అక్కడ ప్రాంతంలోని ప్రతి స్త్రీ కూడా తన భర్తను మరో స్త్రీతో పంచుకునేందుకు రెడీ అవుతుందట. అయితే ఈ తెగలో దశాబ్దకాలంగా పురుషుల కంటే స్త్రీ జనాభానే ఎక్కువగా ఉటుందట. దీంతో ఆ తెగ పెద్దలు స్త్రీ-పురుషుల నిష్పత్తి సమానంగా ఉండేలా ఇలాంటి గట్టి నిర్ణయం తీసుకున్నారట. (చదవండి: ప్రంచంలోనే అత్యంత సంపన్న శునకం!ఆస్తుల జాబితా వింటే షాకవ్వుతారు!) -
నైజీరియాలో 287 మంది విద్యార్థుల కిడ్నాప్
అబూజా: ఆఫ్రికా దేశం నైజీరియాలో సాయుధ దుండగులు 287 మంది విద్యార్థులను అపహరించుకుపోయారు. కడునా రాష్ట్రం కురిగా పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలను గురువారం ఉదయం దుండగులు చుట్టుముట్టారు. అప్పుడప్పుడే స్కూలుకు చేరుకుంటున్న విద్యార్థులను వారు బలవంతంగా తమ వెంట సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. మొత్తం 287 మంది విద్యార్థులు కనిపించడం లేదని ప్రధానోపాధ్యాయుడు చెప్పారు. ఈ ఘటనకు కారణమంటూ ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించుకోలేదని అధికారులు చెప్పారు. సాయుధ ముఠాలు విద్యార్థులను కిడ్నాప్ చేయడం, పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం నైజీరియాలో 2014 తర్వాత పెరిగిపోయింది. 2014లో బోర్నో రాష్ట్రంలోని చిబోక్ గ్రామంలోని స్కూలు నుంచి 200 మందికి పైగా బాలికలను ఇస్లామిక్ తీవ్రవాదులు ఎత్తుకుపోవడం అంతర్జాతీయంగా కలకలం రేపడం తెలిసిందే. -
వూడూ ఫెస్టివల్! ఈ వేడుకకు దెయ్యాలొచ్చి నృత్యాలు చేస్తాయట!
ప్రపంచవ్యాప్తంగా మతపరమైన ఆచారాల్లోని ఎన్నో వింతలు, విచిత్రాల గురించి విన్నాం, చూశాం. అయితే, ‘హైతియన్ వూడూ’ అనే ప్రాచీనమతానికి చెందిన ఆఫ్రికన్ భక్తులు నిర్వహించే ‘వూడూ ఫెస్టివల్’ ప్రపంచానికే మిస్టరీ. సాధారణంగా సంప్రదాయ వేడుకల్లో.. మనిషిని దేవుడు ఆవహించడం, మనుషులు పూనకాలొచ్చి ఊగడం లాంటివి చూస్తుంటాం. అలాంటి జాతరల్లో.. కొందరు భక్తులు బృందాలుగా విడిపోయి రకరకాల వేషధారణలతో.. డప్పు దరువుల మధ్య గజ్జె కట్టి తాండవమాడటం తెలిసిందే. అయితే ఈ వూడూ వేడుకకు దయ్యాలొస్తాయి. స్వయంగా నాట్యమాడతాయి. ఎంతటివారినైనా నిర్ఘాంతపరుస్తాయి. ‘ఈ బొమ్మ లోపల ఉన్నది మా పూర్వీకుల ఆత్మే’ అని చెబుతుంటారు వూడూ మతస్థులు. ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ ఈ పండుగకు వెళ్లిన వాళ్లంతా.. అక్కడ నోరెళ్లబెట్టి రావాల్సిందే. ఏమిటా కథ? పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్, టోగో, ఘనా వంటి దేశాల్లో కొన్ని నగరాలు.. జనవరి నెలొస్తే ప్రపంచ పర్యాటకులతో కిటకిటలాడు తుంటాయి. జనవరి 7 నుంచి సుమారు 14 రోజుల పాటు ఈ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. రకరకాల వేషధారణలతో భక్తులు.. నిప్పుల గుండాల చుట్టూ తిరుగుతూ.. నృత్యాలు చేస్తూ ఆకట్టుకుంటారు. ఈ మొత్తం వేడుకలో గుర్రం పందాలతో పాటు.. ‘వూడూ ఘోస్ట్ డాన్స్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పండుగ ప్రతి ఇంట్లో తమ పూర్వీకుల ఆత్మలకు గౌరవార్థంగా ప్రార్థన చేయడంతో మొదలవుతుంది. తర్వాత చిన్నచిన్న మనిషి ప్రతిమలను పెట్టి.. అందులోకి చనిపోయినవారి ఆత్మలను ఆహ్వానిస్తారట. అనంతరం పూజ చేసి.. మేకను బలిచ్చి, మద్యంతో పాటే.. నైవేద్యంగా పెట్టి.. ఆత్మలకు శాంతి కలిగిస్తారట. గడ్డి, ఎండిన ఆకులు, నల్ల కుండలు, పుర్రెలు, కర్రల సాయంతో ఎత్తైన పెద్ద బొమ్మలను తయారు చేసి.. వాటిని రాత్రి అయ్యేసరికి ప్రదర్శన కోసం తీసుకొస్తుంటారు చాలామంది. అయితే అలా తీసుకెళ్లే ముందు.. ఆ బొమ్మలకు పూర్వీకుల ఆత్మశక్తిని ఆపాదిస్తారట. ప్రత్యేకమైన పూజలు చేసి.. ఆ వూడూ బొమ్మల్లో కనిపించని అదృశ్యశక్తిని నింపుతారట. వాటిని జాతరకు తీసుకుని వెళ్లి ప్రదర్శన ఇస్తున్నప్పుడు.. అవి చూపరులను హడలగొట్టేలా నృత్యాలు చేస్తాయి. అయితే అవేం హాని కలిగించవు. అలా అని వాటిని తాకడానికి ప్రయత్నించకూడదని స్థానికులు హెచ్చరిస్తుంటారు. కొన్ని వూడూ బొమ్మల్లో మనుషులుండి దాన్ని నడిపిస్తారు. అందులోంచే నృత్యం చేస్తుంటారు. కానీ ఇంకొన్ని వూడూ బొమ్మలు మాత్రం.. మనిషి సాయం లేకుండానే ఏదో కనిపించని శక్తి నడిపిస్తున్నట్లుగా కదులుతాయి. ‘ఈ బొమ్మలో మనిషి లేడు.. కేవలం ఇదంతా ఆత్మ కోలాహలమే’ అనే విషయాన్ని తెలియపరచడానికి.. ఆ బొమ్మను మధ్యమధ్యలో ఎత్తి.. చూపిస్తుంటారు ఆ వంశస్థులు. ‘వూడూ మతస్తులు ఆత్మలతో మాట్లాడతారు. చేతబడులు చేస్తారు’ అనే ప్రచారం.. అక్కడ నివసించే ఇతర స్థానికులకు ఓ సూచన. విదేశీయులను అదుపులో ఉంచే ఒక హెచ్చరిక. ఏదిఏమైనా ఈ వూడూ ఫెస్టివల్లో.. ప్రాణంలేని కొన్ని బొమ్మలు మనిషి సాయం లేకుండా ఎలా కదులుతున్నాయి? ఎలా నాట్యం చేస్తున్నాయి? అనేది నేటికీ మిస్టరీనే! ప్రతి ఏటా బెనిన్లోని కోటోనౌ, ఔయిడా, అబోమీ, గాన్వీ, నాటిటింగౌ, పోర్టో నోవో, అల్లదా నగరాల్లో.. టోగోలోని లోమ్, టోగోవిల్ నగరాల్లో.. ఘనాలోని అక్రా, కేప్ కోస్ట్, కుమాసి నగరాల్లో ఈ సంబరాలు జరుగుతుంటాయి. సుమారు ఐదువందల ఏళ్ల క్రితం నుంచే ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు వూడూ మతస్థులు. ఈ మతం 1996లో అధికారికంగా గుర్తింపు పొందింది. పశ్చిమ ఆఫ్రికా దేశంలోని 13 మిలియన్ల జనాభాలో 12% మంది వూడూను అభ్యసిస్తున్నారట. ఈ ఆధ్యాత్మిక మూలాలతో ఆచారాలతో పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఈ జాతరను, పండగను ఆయా దేశాలు ప్రెస్టీజియస్‌గా నిర్వహిస్తుంటాయి. ---సంహిత నిమ్మన (చదవండి: తవ్వకాల్లో రెండువేల ఏళ్ల నాటి చెయ్యి..దానిపై మిస్టీరియస్..!) -
‘ఆఫ్రికన్ బ్లాక్ ఉడ్’ ముందు ఎర్ర చందనం వెలవెల..
ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు అత్యుత్తమ ఫర్నిచర్‌ను సమకూర్చుకోవాలని అనుకుంటారు. ఖరీదైన కలప విషయానికొస్తే భారతదేశంలో ఎర్ర చందనం అత్యంత ఖరీదైనదిగా పరిగణిస్తారు. అయితే ప్రపంచంలో దీనికి మించిన ఖరీదైన కలప మరొకటుంది. అదే ఆఫ్రికన్ బ్లాక్ కలప. దీని ఖరీదెంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే. ఆఫ్రికన్ బ్లాక్ కలపను అత్యంత విలువైన వస్తువులలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది ప్రపంచంలో అతి అరుదుగా దొరుకుతుంది. ఆఫ్రికన్ బ్లాక్ కలప ప్రపంచంలోని 26 దేశాలలో మాత్రమే కనిపిస్తుంది. అలాగే ఆఫ్రికన్ బ్లాక్ చెట్టు పూర్తిగా అభివృద్ధి చెందడానికి 60 సంవత్సరాలు పడుతుంది. ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ చెట్టు ఎక్కువగా ఆఫ్రికన్ ఖండంలోని మధ్య, దక్షిణ భాగాలలో పెరుగుతుంది. ఈ కలప ధర కిలో రూ.7 నుంచి 8 వేల వరకూ పలుకుతుంది. ఫర్నిచర్‌తో పాటు, షెహనాయ్, వేణువుతో సహా పలు సంగీత వాయిద్యాలను ఈ చెక్కతో తయారు చేస్తారు. అత్యంత ధనవంతులు తమ ఇంటిని ఆకర్షణీయంగా మార్చుకోవడానికి ఈ కలపను ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తుంటారు. ఈ కలపకున్న డిమాండ్, ధరను దృష్టిలో పెట్టుకుని స్మగ్లర్లు ఈ కలపను స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్‌ను రక్షించేందుకు కెన్యా. టాంజానియా తదితర దేశాలలోని ప్రభుత్వాలు సాయుధ బలగాలను వినియోగిస్తున్నాయి. -
‘ఐఎస్ఐఎస్’కి అడ్డాగా ఆఫ్రికా దేశాలు?
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ ఇప్పుడు కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోంది. గత కొన్నేళ్లుగా అల్లకల్లోలంగా మారిన పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఇప్పుడు ‘ఐఎస్ఐఎస్’కి అనువైన గమ్యస్థానాలుగా మారుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. పేదరికం,ఆకలితో పాటు పశ్చిమ ఆఫ్రికా దేశాలు అంతర్యుద్ధంతో తల్లడిల్లుతున్నాయి. నైజర్, మాలి, బుర్కినా ఫాసో వంటి పశ్చిమ ఆఫ్రికా దేశాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకుని ఈ దేశాలలో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో నెలకొన్న రాజకీయ అస్థిరతతో పాటు అక్కడి తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ స్థావరాలు ముప్పుగా పరిణమించాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘ఐఎస్ఐఎస్’ విదేశాల్లో దాడులు చేయాలనుకుంటోందనే సమాచారం తమకు నిఘా వర్గాల ద్వారా అందిందని, అలాగే ఆ సంస్థ ఉగ్రవాదులు ఆఫ్రికన్ దేశాలను తమ కొత్త స్థావరంగా ఏర్పాటు చేసుకుంటున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. -
Wageningen University: 2050 నాటికి...నీటికి కటకటే!
నీటి కొరతతో ఇప్పటికే ప్రపంచం అల్లాడుతోంది. పలు దేశాల్లో ఈ సమస్య ఉగ్ర రూపు దాలుస్తోంది. తాగునీటి సమస్య యూరప్, ఆఫ్రికాల్లో పలు దేశాల మధ్య వివాదాలకు కూడా దారి తీస్తోంది. కొరతకు నీటి కాలుష్యమూ తోడవడంతో కొన్నేళ్లుగా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. అయితే ఇదంతా ట్రైలర్ మాత్రమేనని, సమీప భవిష్యత్తులో ఈ సమస్య పెను ఊపు దాల్చవచ్చని తాజా అధ్యయనం తేలి్చంది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా మూడో వంతు నదీ పరీవాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటికి తీవ్ర కొరత నెలకొనడం ఖాయమని పేర్కొంది! ఇది కనీసం 300 కోట్ల జనాభాను తీవ్రంగా ప్రభావితం చేయబోతోందని అంచనా వేయడం గుబులు రేపుతోంది... నదీ పరివాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటి లభ్యతపై నెదర్లాండ్స్‌లోని వాగెనింగెన్ యూనివర్సిటీ సారథ్యంలోని బృందం అధ్యయనం నిర్వహించింది. చైనా, మధ్య యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాతో పాటు భారత్‌లోని మొత్తం 10 వేల పై చిలుకు సదీ బేసిన్లు, సబ్ బేసిన్లలో నీటి నాణ్యత తదితరాలపై సుదీర్ఘ కాలం లోతుగా పరిశోధన చేసింది. వాటిలో ఏకంగా మూడో వంతు, అంటే 3,061 నదీ బేసిన్ల పరిధిలో నీరు తాగేందుకు దాదాపుగా పనికిరాకుండా పోనుందని హెచ్చరించింది. ఆయా బేసిన్ల పరిధిలోని జల వనరుల్లో నైట్రోజన్ వచ్చి కలుస్తుండటం ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించింది. వాటిలో నైట్రోజన్ పరిమాణం కొంతకాలంగా మరీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోందని తేలి్చంది. దీనికి నీటి కొరత తోడై పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవచ్చని స్పష్టం చేసింది. జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించిన ఈ పరిశోధన ఫలితాలు కలకలం రేపుతున్నాయి... అధ్యయనం ఇలా... ► ఆయా నదీ బేసిన్లు, సబ్ బేసిన్లలో నీటి ప్రవాహం, పరిమాణాన్ని లెక్కలోకి తీసుకున్నారు. ► వాటిలో కలుస్తున్న నైట్రోజన్ పరిమాణాన్ని నీటి పరిమాణంతో పోల్చి కాలుష్య స్థాయిని లెక్కించారు. ► 2010 నుంచి చూస్తే గత 13 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని నదీ బేసిన్లు, సబ్ బేసిన్లలోనూ నైట్రోజన్ పరిమాణం క్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు తేలింది. ► 2010లో నాలుగో వంతు బేసిన్లలో కనిపించిన ఈ సమస్య ఇప్పుడు మూడో వంతుకు విస్తరించింది. పైగా వాటి కాలుష్య కారకాల్లో నైట్రోజన్ పాత్ర ఏకంగా 88 శాతానికి పెరిగింది! ఏం జరుగుతోంది... నదీ బేసిన్లు, సబ్ బేసిన్లు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు. భారీ స్థాయి పట్టణీకరణకు, ఆర్థిక కార్యకలాపాలకు కూడా కేంద్ర బిందువులు కూడా. ► ఫలితంగా భారీగా ఉత్పత్తయ్యే మురుగునీరు చాలామటుకు వాటిలోనే కలుస్తోంది. ► మురుగులోని నైట్రోజన్ కారణంగా నీటి వనరులు బాగా కలుషితమవుతున్నాయి. ► ఇది కూడా జల వనరుల కాలుష్యంలో పెద్ద కారకంగా మారుతోంది. ► దీనికితోడు బేసిన్ల పరిధిలో వ్యవసాయ కార్యకలాపాలు భారీగా సాగుతాయి. అది విచ్చలవిడి ఎరువుల వాడకానికి దారి తీస్తోంది. పెను సమస్యే... ► అధ్యయనం జరిపిన 10 వేల పై చిలుకు నదీ బేసిన్లు ప్రధానంగా సాగుకు ఆటపట్టులు. ► ప్రపంచ జనాభాలో ఏకంగా 80 శాతం దాకా వాటి పరిధిలోనే నివసిస్తోంది! ► 2050కల్లా మూడో వంతు, అంటే కనీసం 300 కోట్ల పై చిలుకు జనం తాగునీటి సమస్యతో అల్లాడిపోతారు. ► ఈ నీటి వనరులు పూర్తిస్థాయిలో తాగటానికి పనికిరాకుండా పోతే సమస్య ఊహాతీతంగా ఉంటుందని అధ్యయనం హెచ్చరించింది. ► ఉత్తర అమెరికా, యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా, చైనాతో పాటు భారత్‌లోనూ పలు ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి! – సాక్షి, నేషనల్ డెస్క్