(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) : 19వ శతాబ్దం ప్రారంభంలో 100 కోట్ల మైలురాయిని చేరుకున్న ప్రపంచ జనాభా ఆ తరువాత ఎనిమిది రెట్లు పెరిగింది. ప్రస్తుతం భూమి మీద 800 కోట్ల మంది నివసిస్తుండగా సగం జనాభా 1975 తర్వాతే పెరిగింది. 50 ఏళ్లలో ప్రపంచ జనాభా రెట్టింపు అయింది. దాదాపు 140 కోట్ల జనాభా కలిగిన భారత్ సంతానోత్పత్తి రేటులో ‘థ్రెష్ హోల్డ్ లిమిట్’ దశకు చేరుకోగా 2.6 కోట్ల జనాభా ఉన్న ఆఫ్రికా దేశం నైజర్ సంతానోత్పత్తి రేటులో అగ్రస్థానంలో ఉంది.
జనాభా నిరంతర పెరుగుదలకు ప్రధాన కారణం నాణ్యమైన వైద్య, ఆరోగ్య సేవలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో పాటు పోషకాహార లభ్యత పెరగడం. అయితే క్రమంగా సంతానోత్పత్తి రేటు క్షీణిస్తుండటంతో జనాభా వృద్ధికి అడ్డుకట్ట పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. 2100 నాటికి జనాభా పెరుగుదల ఆగిపోతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. వివిధ దేశాల్లో సంతానోత్పత్తి రేటును విశ్లేషించి ఓ నివేదిక రూపొందించింది.
‘థ్రెష్ హోల్డ్ లిమిట్’లో భారత్..
1960లో ప్రపంచ సరాసరి సంతానోత్పత్తి రేటు 4.7 కాగా 2020 చివరి నాటికి 2.3కి పడిపోయింది. సంతానోత్పత్తి రేటు 2.1గా ఉంటే జనాభాలో పెరుగుదల, తగ్గుదల నమోదు ఉండదు. ముందు తరం స్థానంలో తర్వాత తరం వచ్చి చేరుతూ ఉంటుంది. దీన్ని ‘థ్రెష్ హోల్డ్ లిమిట్’ లేదా ‘రీప్లేస్‌మెంట్ రేట్’గా వ్యవహరిస్తారు. ప్రపంచ జనాభాలో దాదాపు మూడింట రెండు వంతుల మంది ‘రీప్లేస్‌మెంట్ రేట్’ కంటే తక్కువగా ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నారు. మన దేశం కూడా ఈ కేటగిరీలోనే ఉంది. ప్రస్తుతం మన దేశంలో సంతానోత్పత్తి రేటు 2.05గా ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు పేర్కొంది.
సంతానోత్పత్తి క్షీణించడానికి కారణాలు
♦ గర్భ నిరోధ అవకాశాలు పెరగడం
♦ శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం
♦ అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం
దక్షిణ కొరియాలో అత్యల్పం
ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో అత్యధిక సంతానోత్పత్తి రేటు నమోదవుతోంది. నైజర్ 6.9 సంతానోత్పత్తి రేటుతో నంబర్ 1 స్థానంలో ఉంది. అంటే నైజీరియాలో ఒక మహిళ తన జీవితకాలంలో ఏడుగురు పిల్లలకు జన్మనిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ (14వ స్థానం) మినహా సంతానోత్పత్తిలో టాప్ 30 దేశాలన్నీ ఆఫ్రికాలోనే ఉన్నాయి. 2100 నాటికి ఆఫ్రికా 250 కోట్ల మందిని ప్రపంచ జనాభాకు జోడిస్తుందని అంచనా. మిగతా ఖండాల్లో జనాభా పెరుగుదల దాదాపుగా ఉండదు.
ఇక అత్యల్ప సంతానోత్పత్తి రేటు ఉన్న దేశం దక్షిణ కొరియా. అక్కడ సంతానోత్పత్తి రేటు 0.84 మాత్రమే ఉంది. ఆసక్తికరంగా అత్యధిక జనాభా కలిగిన చైనా, భారత్, అమెరికాలో సంతానోత్పత్తి రేటు ‘రీప్లేస్‌మెంట్ రేట్’ కంటే దిగువన ఉండటం గమనార్హం. ఐరోపా, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు 1970 నుంచి తక్కువ సంతానోత్పత్తి రేటుతో కొనసాగుతున్నాయి.
తగ్గినా తిప్పలే..
సంతానోత్పత్తి రేటు క్షీణించడం వల్ల అనేక దేశాల్లో మెరుగైన సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధ్యమైంది. అయితే ఈ విజయగాథలు గత చరిత్రే. ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. భారీ జనాభాతో ఇబ్బందులున్నప్పటికీ సంతానోత్పత్తి రేటు ‘రీప్లేస్‌మెంట్ రేట్’ కంటే తక్కువగా ఉన్నప్పుడు భిన్న సమస్యలు తలెత్తుతాయి. పని చేసేవారు, పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్న వారి నిష్పత్తిలో భారీ వ్యత్యాసం చోటు చేసుకుంటుంది. వృద్ధుల వైద్య ఖర్చులు పెరగడంతో పాటు సంపాదించి పన్నులు చెల్లించేవారి సంఖ్య తగ్గిపోవడం లాంటి పరిణామాలు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి.
దీర్ఘ కాలంలో..
ఇతర దేశాల నుంచి వలసలను ప్రోత్సహించి తాత్కాలికంగా జనాభా తగ్గుదల, మానవ వనరుల కొరతను ఎదుర్కొన్నా దీర్ఘకాలిక వ్యూహాలు అవసరమని ఐక్యరాజ్య సమితి సూచించింది. పిల్లలు కలిగిన కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment