- నవంబర్ 2024 నాటికి దేశ జనాభా 145.56 కోట్లు
- ప్రపంచవ్యాప్తంగా జననాల రేటులో క్షీణత
- భారత్‌లో సంతానోత్పత్తి రేటు 2050 నాటికి 1.3 శాతానికి క్షీణత
- భారతదేశంతో పాటు పలు దేశాలకు ఒకవైపు సవాళ్లు, మరోవైపు అవకాశాలు
- పట్టణ ప్రాంతాల్లో తప్పనిసరిగా మారిన కుటుంబ నియంత్రణ ధోరణి
- సమ్మిళిత ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం లాంటి లక్ష్య వ్యూహాలతో పరిష్కారం
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా పేరొందిన భారత్ గత కొన్ని దశాబ్దాలుగా జనాభా పెరుగుదల విషయంలో గణనీయమైన మార్పులను చూసింది. నవంబర్ 2024 నాటికి దేశ జనాభా 145.56 కోట్లుగా ఉంది. ఈ సంఖ్య చైనాను అధిగమించింది. అయినప్పటికీ సంతానోత్పత్తి రేటులో చెప్పుకోదగిన క్షీణతను ఎదుర్కొంటోంది. ఈ ధోరణి భవిష్యత్తులో దేశానికి సానుకూల, ప్రతికూల పరిణామాలను తెచ్చిపెట్టనున్నదని నిపుణులు చెబుతున్నారు.
రెండు శాతానికన్నా దిగువకు..
1950లో దాదాపు 250 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా ఇప్పుడు 800 కోట్లకు చేరుకుంది. పెరుగుతున్న ప్రపంచ జనాభా మంచిదా? కాదా అనే చర్చ ఒకవైపు జరగుతుండగా, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు క్షీణత స్పష్టంగా కనిపిస్తోంది. ఐక్యరాజ్యసమితి తెలిపిన వివరాల ప్రకారం 1950లో ఒక మహిళకు 6.2 మంది పిల్లలు ఉన్న భారతదేశంలో ఇప్పుడు సంతానోత్పత్తి రేటు రెండు శాతానికన్నా తక్కువకు పడిపోయింది. ఇదే ధోరణి భవిష్యత్‌లో కొనసాగితే భారత్‌లో సంతానోత్పత్తి రేటు 2050 నాటికి 1.3 శాతానికి పడిపోనుంది.
ఒకవైపు సవాళ్లు.. మరోవైపు అవకాశాలు
2050 నాటికి ప్రపంచ సంతానోత్పత్తి రేటు 1.8 శాతానికి తగ్గుతుందని, అది 2100 నాటికి అది 1.6 శాతానికి తగ్గుతుందనే అంచనాలున్నాయి. ఈ క్షీణత భారతదేశంతో పాటు పలు దేశాలకు ఒకవైపు సవాళ్లను, మరోవైపు అవకాశాలను అందిస్తుంది. 2021లో భారత్‌లో సుమారుగా రెండు కోట్ల మంది పిల్లలు జన్మించారు. 2050 నాటికి ఈ సంఖ్య కేవలం 1.3 కోట్లకు తగ్గుతుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. తక్కువ ఆదాయం కలిగిన దేశాలు రాబోయే కాలంలో సంతానోత్పత్తి రేటులో క్షీణతను చవిచూడనున్నాయి.
కారణాలివే..
దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గడం వెనుక అనేక కారణాలున్నాయి. ఆలస్యంగా వివాహాలు జరగడం, ఉన్నత విద్యావకాశాలు పెరగడం, కుటుంబ నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు తప్పనిసరిగా కుటుంబ నియంత్రణను పాటిస్టున్నారు. ఈ పోకడలు భవిష్యత్‌లో కొనసాగి, కొన్ని దశాబ్దాల్లోనే దేశ జనాభా గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయనే అంచనాలున్నాయి.
జీవన నాణ్యత కోణంలో మేలు
సంతానోత్పత్తి రేటు క్షీణించడాన్ని ఒక సవాలుగా భావించినప్పటికీ, దీనివలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వనరుల నిర్వహణ, జీవన నాణ్యత కోణంలో మేలు జరగనుంది. ఆహారం, నీరు, ఇంధన శక్తి తదితర వనరులపై ఒత్తిడి తగ్గుతుంది. మరోవైపు తక్కువ పిల్లలను కలిగి ఉన్న మహిళలు సగటున ఎక్కువ కాలం జీవిస్తారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నియంత్రిత జనాభా దేశంలో దీర్ఘకాలికంగా మరింత స్థిరమైన వృద్ధిని సృష్టిస్తుంది.
సామాజిక భద్రతా వ్యవస్థలపై ఒత్తిడి
సంతానోత్పత్తి రేటు పడిపోతున్న దశలో సమాజంలో యువత నిష్పత్తి తగ్గుతుంది. వృద్ధుల జనాభా పెరుగుతుంది. ఫలితంగా కార్మిక మార్కెట్‌లో అసమతుల్యత, సామాజిక భద్రతా వ్యవస్థలపై ఒత్తిడి ఏర్పడుతుంది. భారతదేశంలో 0-14 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా ఇప్పటికే క్షీణిస్తూ వస్తోంది. ఇది 2001లో 36.4 కోట్ల నుండి 2024 నాటికి 34 కోట్లకు చేరుకుంది. ఇదేసమయంలో 60 అంతకంటే అధిక వయసు కలిగినవారి సంఖ్య 1991లో 6.1 కోట్ల నుండి రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. ఇది 2024 నాటికి 15 కోట్లుగా అంచనాలున్నాయి. పెరుగుతున్న వృద్ధాప్య జనాభా సామాజికంగా గణనీయమైన సవాళ్లను తెచ్చిపెడుతుంది.
విస్తృత ప్రపంచ ధోరణిలో భాగం
సంతానోత్పత్తి రేటు క్షీణత అనేది భారతదేశానికి మాత్రమే కాదు.. ఇది విస్తృత ప్రపంచ ధోరణిలో భాగం. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంతానోత్పత్తి రేటు క్షీణిస్తున్నందున శ్రామికశక్తి, వృద్ధాప్య జనాభా మరిన్ని సవాళ్లను తెచ్చిపెడుతోంది. దీంతో తక్కువ ఆదాయ వనరులు కలిగిన దేశాలలో పరిస్థితి మరింత క్షిష్టంగా మారనుంది. భారతదేశంలో సంతానోత్పత్తి రేటు క్షీణత అటు అవకాశాలను, ఇటు సవాళ్లు రెండింటినీ అందించనుంది. ఇటువంటి పరిస్థితుల్లో సమ్మిళిత ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం లాంటి లక్ష్య వ్యూహాలతో ప్రభుత్వాలు ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.
ఇది కూడా చదవండి: Delhi air pollution: కాస్త ఉపశమనం.. ఊపిరికి ఊరట
Comments
Please login to add a commentAdd a comment