
జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ
కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై సమగ్ర అధ్యయనానికే...
అసెంబ్లీలో సీఎం స్టాలిన్ ప్రకటన
చెన్నై: రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం బలవంతంగా లాక్కొంటోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రాలకు అధికారాలు, హక్కులు కావాల్సిందేనని తేల్చిచెప్పారు. కేంద్రం పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడుకు స్వయంప్రతిపత్తి(అటానమీ) సాధించే దిశగా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్వయంప్రతిపత్తిపై అధ్యయనం చేసి, ప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
స్టాలిన్ మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు. రాష్ట్రాల చట్టబద్ధమైన హక్కులకు పరిరక్షించుకోవడానికి, కేంద్ర–రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టంచేశారు. రాష్ట్రాల హక్కులను హరిస్తున్న పరిస్థితులు దాపురించాయని, దీనికి సంబంధించి రాజ్యాంగంలోని నిబంధనలను పునఃసమీక్షించాలని చెప్పారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై అమల్లో ఉన్న విధానాలు, చట్టాలు, సహకార సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రాజ్యాంగం ప్రకారం కేంద్రం, రాష్ట్రాలను సమానంగా సృష్టించినట్లు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చెప్పారని గుర్తుచేశారు. పరస్పరం సహకరించుకోవాలి తప్ప ఒకదానిపై మరొకటి ఆధిపత్యం చెలాయించడానికి వీల్లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు, అధికారాలను క్రమంగా నీరుగారుస్తూ పెత్తనం సాగిస్తోందని, రాజ్యాంగం సూచించిన సున్నితమైన సమతూకాన్ని దెబ్బతీస్తోందని ఆక్షేపించారు. బలహీనమైన రాష్ట్రాలతో బలమైన కేంద్రాన్ని నిర్మించడం సాధ్యం కాదన్నారు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం తమిళనాడుకు స్వయంప్రతిపత్తి కోరుతూ అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని స్వయంప్రతిపత్తిపై స్టాలిన్ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

రెండేళ్లలోగా పూర్తిస్థాయి నివేదిక
ఉన్నత స్థాయి కమిటీలో అశోక్‌వర్దన్ షెట్టీ, ఎం.నాగనాథన్‌ను సభ్యులుగా నియమిస్తున్నట్లు స్టాలిన్ వెల్లడించారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి, స్వయంప్రతిపత్తి సాధనపై సిఫార్సులు చేస్తుందని అన్నారు. 2026 జనవరి నాటికి మధ్యంతర నివేదిక, రెండేళ్లలోగా పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుందని చెప్పారు. స్టాలిన్ ప్రకటనను విపక్ష అన్నాడీఎంకే నేతలు తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో చేరి అధికారం పంచుకున్నప్పుడు స్వయంప్రతిపత్తి గురించి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.