దళపతి స్టాలిన్‌.. వేచి చూస్తున్న ముళ్ల కిరీటం | Lakshmana Venkat Kuchi Article On M.K. Stalin | Sakshi
Sakshi News home page

దళపతి స్టాలిన్‌.. వేచి చూస్తున్న ముళ్ల కిరీటం

Published Tue, May 4 2021 12:40 AM | Last Updated on Tue, May 4 2021 4:34 AM

Lakshmana Venkat Kuchi Article On M.K. Stalin - Sakshi

తమిళనాడులో డీఎంకేకి, దాని అధ్యక్షుడు ఎమ్‌కే స్టాలిన్‌కి మే 2వ తేదీ చాలాకాలంగా ఎదురుచూస్తున్న రోజు కావచ్చు. దాదాపు అయిదు దశాబ్దాలపాటు తనతండ్రి, డీఎంకే పితామహుడు ఎమ్‌. కరుణానిధి చాటున ఎదుగుతూ.. దళపతిగా మద్దతుదార్లు, కేడర్లు అభిమానంతో పిల్చుకునే స్టాలిన్‌ తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలకు గాను 160 స్థానాలు గెల్చుకున్న డీఎంకే కూటమి అధికార పీఠాన్ని దక్కించుకుంది. మోదీ ప్రభంజనం దేశాన్ని చుట్టుముట్టిన స్థితిలోనూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు గాను ఒక్కటి మినహా అన్నింటినీ స్టాలిన్‌ నేతృత్వంలో డీఎంకే గెల్చుకున్న నేపథ్యంలో, అసెంబ్లీ ఎన్నికల్లోనూ డీఎంకే విజయంపై ఎవరికీ సందేహాలు లేవు. పైగా గత రెండేళ్లలో క్షేత్ర స్థాయిలో పెద్దగా మార్పులూ లేవు. 

కేంద్రం నుంచి బీజేపీ రిమోట్‌ కంట్రోల్‌కి అనుగుణంగా పనిచేస్తోందని అన్నాడీఎంకే ప్రభుత్వంపై ముద్రపడటంతో తమిళనాడులో అధికార మార్పిడి తప్పదని క్షేత్ర స్థాయి నివేదికలు తేటతెల్లం చేశాయి. జనంలో గూడుకట్టుకున్న ఈ అభిప్రాయాన్ని డీఎంకే మరింత శక్తివంతంగా ముందుకు తీసుకొచ్చి తమిళనాడు వ్యతిరేక విధానాలను కేంద్రం అమలు చేస్తోందని దాడి చేసింది. నీట్, రైతుల ఆందోళన, గెయిల్‌ హైడ్రో కార్బన్‌ ప్రాజెక్టు వంటి అంశాల విషయంలోనే కాకుండా జీఎస్టీ సుంకాలపై కేంద్రం వ్యవహారాన్ని కూడా డీఎంకే ఎండగట్టింది. ఈ సమస్యలన్నింటిపై స్టాలిన్‌ తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తూ వచ్చారు. శాంతికి కేంద్రమే అసలు విలన్‌ అని, రాష్ట్రంలో ఈపీఎస్‌ ప్రభుత్వం కేంద్రం కీలుబొమ్మలా వ్యవహరిస్తూ పాలి స్తోందనే అవగాహనను ప్రజల్లో చొప్పించడంలో స్టాలిన్‌ విజయవంతమయ్యారు. తమ భాష, సంస్కృతి సుసంపన్నత పట్ల గర్వపడే తమిళ ప్రజలలో ఆత్మాభిమానాన్ని స్టాలిన్‌ ప్రేరేపించడమే కాకుండా భాషా సమస్యపై కూడా రాష్ట్ర ప్రజలను తనవైపు తిప్పుకున్నారు. 

అదే సమయంలో తన కూటమిలోని మిత్ర పక్షాలను తక్కువ స్థానాల్లో పోటీచేసేందుకు ఒప్పించిన స్టాలిన్‌ ఈ విషయంలో కఠినంగానే వ్యవహరించారు. స్టాలిన్‌ అభిమతాన్ని గౌరవించి 25 స్థానాల్లో మాత్రమే పోటీ చేసిన కాంగ్రెస్‌ 18 స్థానాల్లో గెలుపొందింది. డీఎంకే స్వయంగా 134 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని సొంతంగా ప్రభుత్వ స్థాపనకు కావలసిన మ్యాజిక్‌ సంఖ్యను దాటివేసింది. ఇంతకు మించి సుప్రసిద్ధ రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో ఒప్పందం చేసుకోవాలని స్టాలిన్‌ తీసుకున్న కీలక నిర్ణయం ఆయనకు ఎంతగానో సహాయపడింది. పదేళ్లుగా అధికారం చలాయించిన అన్నాడీఎంకే ప్రభుత్వం పనితీరుతో విసిగిపోయి మార్పును కోరుకుంటున్న ప్రజారాశుల వద్దకు సరికొత్త ప్రచార శైలితో వచ్చిన డీఎంకే కేడర్‌ ఎంతో ఉత్సాహంతో తమ అధినాయకుడి తరపున ప్రచార కార్యక్రమాన్ని శక్తివంతంగా సాగించింది. రాజకీయంగా అత్యంత చైతన్యంతో ఉండే తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి, నాటి ముఖ్యమంత్రి జె జయలలిత మరణం తర్వాత ఏర్పడిన సంక్షోభ కాలం పొడవునా అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి శక్తియుక్తులన్నింటినీ ప్రయోగించిన స్టాలిన్‌ ప్రతిఘటనా శక్తిని తమిళ ప్రజలు మర్చిపోలేదు. అయితే ఎన్నికల ద్వారానే అధికారాన్ని గెల్చుకోవడానికి ప్రాధాన్యమిచ్చిన స్టాలిన్‌ ఆ తరుణం కోసం వేచి ఉండి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తన శైలితో అధికార పీఠం దక్కించుకున్నారు.

ఇప్పుడు స్టాలిన్‌ కోసం సింహాసనంపై ముళ్లకిరీటం ఎదురు చూస్తోంది. రాష్ట్రంలో పెచ్చరిల్లిపోతున్న కోవిడ్‌–19 మహమ్మారిని అరికట్టడమే తన ముందున్న సవాళ్లలో ప్రధానమైనది. పదవీబాధ్యతలు స్వీకరించక ముందే రాజకీయ పరిణతిని ప్రదర్శించి పాలనలో కొత్తదనం కోరుకుంటున్న స్టాలిన్‌.. కొత్త ప్రభుత్వానికి తన అనుభవాన్ని పంచిపెట్టడమే కాకుండా తగిన సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని అభ్యర్థించారు. పైగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రజల ముంగిటకే తీసుకుపోతానని స్టాలిన్‌ ఇప్పటికే ప్రకటించేశారు.

అన్నాడీఎంకే ముఖ్యమంత్రి ఇ. పళనిస్వామి కోవిడ్‌–19ని సమర్థంగా ఎదుర్కొన్నారు. పైగా సుపరిపాలన అందించడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు కూడా. అయితే తన ప్రభుత్వం కేంద్రలోని బీజేపీ ప్రభుత్వానికి దాసోహమైపోయిందన్న వ్యతిరేక ప్రచారం ముందు ఆయన తన ప్రాముఖ్యతను కోల్పోయారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో స్టాలిన్‌ ఎలా వ్యవహరించనున్నారు అనేది ఆయనకు విషమ పరీక్షే. కేంద్రప్రభుత్వంపై, బీజేపీపై తీవ్రంగా వ్యతిరేక ప్రచారం చేసిన స్టాలిన్‌ ఇకపై  ఏం చేయబోతారని ప్రజారాశులు నిశితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపున కేంద్ర ప్రభుత్వంతో కార్యాచరణ సంబంధాన్ని స్టాలిన్‌ ఎలా నిర్మించుకుంటారో చూస్తానని అన్నాడీఎంకే ఎదురు చూస్తోంది.

రాష్ట్రం ఇప్పటికీ రెండు గుర్రాల పరుగుపందేన్ని కొనసాగించనుందని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేశాయి. చిరకాలంగా తిష్ట వేసి కూచున్న ద్రవిడియన్‌ పార్టీలకు ముగింపు పలికి కొత్త ప్రత్యామ్నాయాన్ని తీసుకువస్తామంటూ పలువురు చేసిన సుదీర్ఘ ప్రసంగాలు గాల్లో కలిసిపోయాయి. సూపర్‌ స్టార్‌ కమల్‌ హసన్‌ స్థాపించిన మక్కల్‌ నీతి మయ్యమ్‌ ఊసులోకూడా లేకుండా పోయింది. మరో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఈ పరిస్థితిని ముందుగానే గ్రహించినవాడై సకాలంలో ఎన్నికల రణరంగనుంచి తప్పుకున్నారు. రాజకీయరంగ ప్రవేశంపై ఎప్పటికప్పుడు సందేశాలు ఇస్తూ అభిమానులను అలరిస్తూ వచ్చిన రజనీ చివరికి అనారోగ్య కారణాలను సాకుగా చూపి రాజకీయ రంగం నుంచే తప్పుకోవడం మరీ విశేషం. 


లక్ష్మణ వెంకట కూచి 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement