sandharbham
-
...అయినప్పటికీ చెరగని ముద్ర
సుమారు 28 సంవత్సరాల సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక చీకటి అధ్యా యానికి తెర లేచిన చీకటి రోజులు నాకు ఇప్పటికీ చాలా స్పష్టంగా జ్ఞాపకం వున్నాయి. 1975 జూన్ 26న (25వ తేదీ అర్ధరాత్రి) అలనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. 1977లో తిరిగి ఎన్నికలు జరిగే వరకూ, 21 నెలలపాటు దారుణమైన ఎమర్జెన్సీ పాలన కొనసాగింది. సామ్యవాద, ప్రజాస్వామ్య మార్గంలో ఇందిరాగాంధీ నియంతగా వ్యవహరించిన ఆ సందర్భంలో ఎన్నో అనుభవాలు, మరెన్నో జ్ఞాపకాలు. రాయబరేలిలో గెలుపుకోసం ఇందిర అనేక అక్రమాలకు పాల్పడ్డారని, కాబట్టి ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె చేతిలో ఓడిపోయిన అభ్యర్థి రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాని ఇందిరా గాంధీ లోక్‌సభ ఎన్నిక చెల్లదనీ, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్ లాల్ సిన్హా 1975 జూన్ 12న చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఇందిర అనర్హురాలిగా న్యాయస్థానం ప్రకటించింది. ఆమె తక్ష ణమే రాజీనామా చేయాలని ప్రతి పక్షాలు ముక్త కంఠంతో డిమాండు చేశాయి. రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా, యావత్ పాలనా యంత్రాంగాన్నీ తన గుప్పిట్లో పెట్టుకునే దిశగా అడుగులు వేసింది. యోధాన యోధులైన రాజకీయ నాయకులను నిర్బం ధించే ప్రక్రియకు నాంది పలికింది. అలనాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆమె అనుంగు సహచరుడు సిద్ధార్థ శంకర రే సలహా మేరకు దేశ సమగ్రత – సమైక్య తలకు తీవ్రమైన ముప్పు వాటిల్లనున్నదన్న కారణం చూపుతూ, 1975 జూన్ 25, అర్ధరాత్రి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఇందిరా గాంధీ ప్రభుత్వం. దీనిపై కోర్టుకు వెళ్లటానికి వీలులేకుండా రాజ్యాంగానికి 39వ సవరణ తెచ్చింది. అసాధారణ అధికారాలను చేజిక్కించుకుని, పౌర హక్కులను కాలరాసింది. అంత ర్గత భద్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరితో సహా, జయప్రకాశ్ నారాయణ, మొరార్జీ దేశాయ్ వంటి ప్రతిపక్ష పార్టీల నాయకుల నుండి సాధారణ కార్యకర్తల వరకు వేలాదిమందిని జైల్లో పెట్టించింది. ప్రజలకు అత్యవసర పరిస్థితి విధింపు తాత్కాలికమే అని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఆర్థిక, రాజకీయ సుస్థిరత కొరకు అంటూ... జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఒక ఏడాది వాయిదా వేసింది. అన్ని పత్రికా వార్తలపైనా సెన్సారు వచ్చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ రాయటానికి వీలులేదు. ‘మీసా’ వంటి చట్టాలను కాంగ్రెస్ అధిష్ఠానం యథేచ్ఛగా తమ కనుకూలంగా వాడుకుంది. ప్రముఖ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించింది. ప్రభుత్వంలో ఏ హోదాలేని ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ రాజ్యాంగేతర శక్తిగా అవతరించాడు. ఢిల్లీ నగరంలోని తుర్కమన్ గేటు, ఇతర ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఉన్న మురికివాడలను బుల్డోజర్లు పెట్టి కూల్చి వేశారు. అలాగే పేదవాళ్లు ఎక్కువగా పిల్లలను కనడం వల్లనే దేశానికి సమస్యలొస్తున్నాయని చెప్పి మురికి వాడలలో నిర్బంధంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాడు సంజయ్. హఠాత్తుగా, 1977 జనవరిలో ఎన్నికల నిర్ణయం ప్రకటించింది ఇందిరా గాంధీ. జైళ్లలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించింది. ఎమర్జెన్సీ దురాగ తాలను ఎదుర్కోవాలని జైలు నుంచే జయప్రకాశ్ నారాయణ ‘సంపూర్ణ విప్లవం’ అంటూ ఇచ్చిన పిలుపు దేశ రాజకీయాల దిశను మార్చివేసింది. అప్పటి వరకూ చిన్న చిన్న పార్టీలుగా ఉన్న అనేక పార్టీలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చి జనతాపార్టీగా ఏర్పడ్డాయి. ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఇందిర అనుంగు సహచరుడు జగ్జీవన్ రామ్ కూడా ప్రతి పక్షాల సరసన చేరాడు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో జనతా పార్టీకి వామపక్షాల మద్దతు కూడా లభించింది. కాంగ్రెస్‌లోని ‘యంగ్ టర్క్స్’ కూడా వారితో జత కట్టారు. 1977 మార్చ్ 20న జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇందిరాగాంధీని ఆమె నియోజక వర్గంలోనూ, ఆమె సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశం లోను దారుణంగా ఓడించారు. ప్రప్రథమ కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు ఓటర్లు. మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యారు. అవిశ్వాస తీర్మానం కారణంగా మొరార్జీ దేశాయ్ రాజీనామా చేయడం, ఆయన స్థానంలో ఇందిర మద్దతుతో చరణ్ సింగ్ ప్రధానిగా పదవిని చేపట్టడం, రాజీనామా చేయడం; దరిమిలా జరిగిన ఎన్నికల్లో ఓడి పోవడం తెలిసిన విషయమే. ఆ లోక్‌సభ ఎన్నికలలో 529 స్థానాలకుగాను 351 స్థానాలు గెలుచుకుని తన సత్తాను నిరూపించుకున్న ఇందిరాగాంధీ తిరిగి ప్రధానమంత్రి అయ్యారు. ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ పేరుతో అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్– హర్మందిర్ సాహిబ్‌పై జరిగిన సైనిక దాడికి నిరసనగా, అంగరక్షకులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్‌లు జరిపిన కాల్పుల్లో ఇందిరా గాంధీ హత్యకు గురై 38 సంవత్సరాలు నిండాయి. సామ్యవాద, ప్రజాస్వామ్య మార్గంలో ఆమె నియంతృత్వ పోకడలను పక్కనపెడితే, అలీన ఉద్యమ నాయకురాలిగా, మహిళా ప్రధానిగా, అరుదైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా ప్రపంచ స్థాయిలో ఇందిరాగాంధీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న దనడంలో మాత్రం సందేహం లేదు. వనం జ్వాలా నరసింహారావు వ్యాసకర్త తెలంగాణ ముఖ్యమంత్రి సీపీఆర్ఓ మొబైల్: 80081 37012 (నేడు ఇందిరాగాంధీ 38వ వర్ధంతి) -
నెరవేరిన చిరకాల స్వప్నం
ఇది 21వ శతాబ్దం. ఆధునికత, సాంకేతికతల సమ్మేళనంతో వాహన రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. విమాన, రైలు ప్రయాణాలు తప్పించి, రోడ్డు మీద తిరుగాడే అన్ని వాహనాలకు ఇప్పటివరకు పెట్రోలు / డీజిలు విని యోగమే అధికంగా జరుగుతున్నది. కాగా, ఇటీవలి కాలంలో ఈ పెట్రోలు / డీజిలు ధరలు గరిష్ఠంగా పెరిగి ప్రభుత్వాలకు, ప్రజలకు ఆర్థికంగా పెనుభారంగా మారాయి. వీటికి ప్రత్యామ్నాయ ఆలోచనే విద్యుత్ వాహనాలను ప్రవేశ పెట్టాలనుకోవడం. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పాలసీని రాష్ట్ర పురోభివృద్ధికి ఉపయోగపడేలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. దశల వారీగా రాష్ట్రంలో ‘ఈవీ’ల వినియోగాన్ని ప్రోత్సహించి, పర్యావరణ పరిరక్షణకు తన వంతు కర్తవ్యాన్ని పూర్తి స్థాయిలో చేపడుతున్నది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలతో అనేక ప్రయోజనాలు సమకూరుతాయి. ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత సమర్థంగా పని చేస్తాయి. డీజిల్, పెట్రోలు వాహనాలతో పోలిస్తే, తక్కువ నిర్వహణ ఖర్చులు కలిగి ఉంటాయి. డీజిల్ / పెట్రోలుతో పోల్చినప్పుడు విద్యుత్ ఇంధన ఆదా గణనీయంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలు సురక్షితమైనవి, నమ్మదగినవి. ఇతర సాంకేతికతలకు సమానమైన సమయ వ్యవధిని కలిగి ఉంటాయి. వాటి నిశ్శబ్ద, మృదువైన పయనం ప్రయాణికులు విశ్రాంతి తీసు కోవడానికి అనువుగా ఉంటుంది. డీజిల్ / పెట్రోలు ఇంజిన్ లేకపోవడం వల్ల శబ్ద కాలుష్యం తగ్గుతుంది. డీజిల్/ పెట్రోలు వాహనాల వల్ల గాలిలోకి హానికర ఉద్గారాలు విడుదలై ప్రజలకు... ముఖ్యంగా పిల్లలకు ఉబ్బసం, ఊపిరితిత్తుల సమస్యలు వంటివి తలñ త్తుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వల్ల ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈవీలు ఇప్పటికీ వాటి సంప్రదాయ ప్రత్యర్థుల కంటే తక్కువ ఉద్గారాలు, తక్కువ గ్లోబల్ వార్మింగ్లతో వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ఈ విద్యుత్ వాహనాల వినియోగంతో ప్రజా రవాణా శక్తి పెరుగుతుంది. పర్యావరణాన్ని దెబ్బతీసే హానికరమైన కార్బన్ డయాక్సైడ్ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు తగ్గుతాయి. ఎలక్ట్రిక్ డ్రైవింగ్ నుండి ఒక కిలో మీటరుకు వచ్చే ఉద్గారాలు పెట్రోల్ లేదా డీజిల్ డ్రైవింగ్ వల్ల విడుదలయ్యే ఉద్గారాల కంటే చాలా తక్కువ. అలాగే, పవర్ స్టేషన్ (ఛార్జింగ్ స్టేషన్) ఉద్గారాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు కూడా ఇది నిజం. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి చాలా ఉత్సాహ పూరితమైన వాతావరణం ఉన్నప్పటికీ, అధిక కొనుగోలు ధరలు, కొత్త ఛార్జింగ్ స్టేషన్ల స్థాపన వంటి కొన్ని ఆర్థ్ధికపరమైన భారాలు ఇప్పటికీ ఉన్నాయి. అయితే, ఈ సవాళ్లు తొలిదశలోనే వుంటాయి. తదనంతరం ప్రత్యామ్నాయ మార్గాలూ వుంటాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు ఆశాజనకమైన భవిష్యత్తు ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వ స్ఫూర్తితో ప్రజలకు, ప్రయా ణికులకు తన వంతు కర్తవ్యంగా ఈ విద్యుత్ బస్సుల వినియోగానికి ఏపీఎస్ఆర్టీసీ శ్రీకారం చుడుతున్నది. ఇటీవలి కాలంలో రవాణా రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే, ప్రజా రవాణాలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఎన్నో చర్యలు చేపట్టినది. సాధారణమైన ఎర్ర బస్సు స్థాయి నుంచి, క్రమేపీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, ఏసీ, చివరగా అత్యున్నత స్థాయి ఏసీ స్లీపర్ బస్సుల స్థాయి వరకు ఎదిగి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలో కూడా వాసికెక్కి, ప్రయాణికుల మన్ననలు పొంది, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు పొందుతున్నది కూడా. ప్రస్తుతం తలపెట్టిన ఈవీల వాడకం ఈ సంస్థ కిరీటంలో మరో కలికి తురాయి కానున్నది. మొదటి దశలో 100 ఎలక్ట్రిక్ బస్సులను పవిత్ర నగరమైన తిరుపతి – తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాలలో నడపటానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈ విద్యుత్ బస్సుల వల్ల ప్రయాణికులకు ఆహ్లాదకరమైన ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. అంటే శబ్దం, కాలుష్యం లేని ప్రశాంత ప్రయాణమన్న మాట. ఈవీలకు చార్జింగ్ చేసే విద్యుత్ ఛార్జీల పెరుగుదలతో పోలిస్తే పెట్రోలు, డీజిల్ ధర పెరుగుదల ఎక్కువ. ఈవీ బ్యాటరీ ధర క్రమంగా తగ్గుతూ ఉండటం గమనించవచ్చు. అలాగే కాపెక్స్ మోడల్‌తో పోల్చి నప్పుడు ఈవీల ఆపరేషన్ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఈవీలను సమకూర్చుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ అనేక సంవత్సరాలుగా యోచిస్తున్నది. పైన పేర్కొన్న విస్తృత ప్రయో జనాలు, ప్రస్తుత ప్రభుత్వ సహకారం వల్ల, ఇన్నాళ్ళకు ఈ చిరకాల స్వప్నం నెరవేరబోతున్నది. ఇందువల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగుతుంది. అలాగే ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరింత చేరువ అయ్యే అవకాశంగా దీన్ని భావిస్తున్నది. సీహెచ్ ద్వారకా తిరుమల రావు వ్యాసకర్త ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ -
Yadadri Temple: గుట్ట కష్టాలకు ముగింపు ఎప్పుడు?
యాదాద్రి దేవాలయాన్ని వేలాది సంవత్సరాలు మన్నే విధంగా నిర్మించామని ప్రభుత్వం చెబుతున్న మాటలు నీటిమూటలని తేలి పోయింది. ఈదురుగాలులూ, వర్షాలకు ఆలయ సముదాయ నిర్మాణంలోని డొల్లతనం బయటపడుతోంది. గతంలో వీచిన గాలులకు ప్రధానాలయ విమాన గోపురంపై ఉన్న సుదర్శన చక్రం ఒరిగిపోయింది. ఇటీవల కురి సిన వర్షాలకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దక్షిణ దిశలో స్టోన్ ఫ్లోరింగ్ కుంగింది. ఇప్పటికే ప్రధాన ఆలయంతో పాటు ప్రసాద కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్ ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడ్డాయి. దక్షిణ రాజగోపురం ప్రాంతంలో కృష్ణశిల స్టోన్ ఫ్లోరింగ్‌కు పగుళ్లు వచ్చి కుంగింది. అష్టభుజి మండపంలో వర్షపునీరు లీకేజీతో డంగు సున్నం బయటకు వస్తోంది. ఇవన్నీ చూస్తుంటే నిర్మాణం ఎంత ‘గొప్ప’గా చేశారో అర్థమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేళ్లలో దాదాపు 25 సార్లకు పైగా యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చి, వ్యక్తి గత శ్రద్ధ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ప్రణాళికా లోపం, నమూనాలు, డిజైన్లలో లోపాలు, అధికారుల బాధ్యతా రాహిత్యం, కాంట్రాక్టర్ల కక్కుర్తి, సమన్వయ లోపం వంటివి ప్రస్తుత పరిస్థితికి కారణా లుగా చెప్పవచ్చు. ‘అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రం’ అంటూ రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ఆలయ పునర్నిర్మాణం చేపట్టింది. ఈ సందర్భంగా తరతరా లుగా వస్తున్న ‘యాదగిరిగుట్ట’ పేరును సైతం ‘యాదాద్రి’గా మార్చేసింది. గుట్ట పునర్నిర్మాణానికి ఏకంగా రూ 1,300 కోట్లు వెచ్చించింది. ఈ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరేనా? ఆలయ నిర్మాణంలో నీటిపారుదల వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల కొండపైనా, కింద కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధాన ఆలయం శిల్పాల పనుల నుంచి కొండ దిగువన నిర్మా ణాల వరకు 14 మంది కాంట్రాక్టర్లు పనిచేశారు. ప్రభుత్వ పరంగా ఉన్న స్థానిక ఇంజనీర్లను కాదని కాంట్రాక్టు సంస్థలకు చెందిన సైట్ ఇంజనీర్లతోనే పను లన్నీ చేపట్టారు. గుట్ట చుట్టూ నిర్మాణాలు చేస్తున్న ప్పుడు స్థానిక ఇంజనీర్లను సంప్రదించకుండానే పనులు చేశారు. వర్షాలు కురిసినప్పుడు ఎటునుంచి వరద వస్తుంది... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది గుర్తించకపోవడంతో రోడ్లు ఎక్కడికక్కడ కోతకు గురవుతున్నాయి. గత మే నెలలో కురిసిన వర్షానికి ఆలయం చిత్తడిగా మారింది. ప్రధాన ఆలయంలో పంచతల రాజగోపురం నుంచి.. ధ్వజస్తంభం వరకు వాన నీరు చేరింది. మొదటి నుంచీ ఆలయ పునర్నిర్మాణ తీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. శిల్పాలు చెక్కే సమ యంలో దేవాలయ స్తంభాలపై మసీదు, పీర్లు, చర్చి, ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ, కేసీఆర్ చిత్రాలు (రిలీఫ్ ఫిగర్స్) చెక్కారు. అంతటితో ఆగలేదు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల లోగోలను కూడా చెక్కారు. దీంతో విశ్వహిందూ పరిషత్ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేయడంతో ఆ రిలీఫ్స్ను తొలగించారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ‘కాశీ అనేది పవిత్ర పుణ్యక్షేత్రం... అక్కడ రాజకీయాలు లేకుండా హిందువుల మనోభావాలు గౌరవించే స్థాయిలో నిర్మాణాలు చేపట్టాలి. కానీ... నట్లు, బోల్టు లతో ఆలయం నిర్మించి తప్పు చేశారు. వర్షం పడితే ఆలయ గోపురం కూలింది, అది అరిష్టం’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి ఆరోపించారు. మరి యాదాద్రిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి ఏమంటారు? నిజానికి కాశీలో నిర్మిం చిన ఆలయంలో ఎటువంటి అపశ్రుతులు దొర్ల లేదనే విషయం గమనించాలి. ఇతరులను విమర్శించే ముందు తాను చేసిన పనిని సమీక్షించుకోవాల్సిందిగా కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం. పగుడాకుల బాలస్వామి వ్యాసకర్త ప్రచార ప్రముఖ్, విశ్వహిందూ పరిషత్, తెలంగాణ ‘ మొబైల్: 99129 75753 -
YS Rajasekhara Reddy: దశాబ్దాల రాజకీయం... శతాబ్దాల కీర్తి
జనం గుండెల్లో కొలువై ఉన్న మహానేత డాక్టర్ యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి! ఎన్నికల్లో ఏనాడూ ఓటమి ఎరుగని నేత! రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని బలంగా నమ్మిన రైతుజన బాంధవుడు. లక్ష కోట్లు ఖర్చయినా కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యం కోసం పనిచేసిన అపర భగీరథుడు. నిరుపేదలకు కూడా ఆరోగ్య భద్రతను కల్పించిన ఆరోగ్యశ్రీ ప్రదాత. పింఛనుదారులకు ప్రతినెలా 1వ తారీఖునే పింఛన్ అందించడం వైఎస్ పాలనలోనే మొదలైంది. పేద కుటుంబాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం సరికొత్త ప్రయోగం. ఏ రంగాన్నీ, ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయని సుపరిపాలకుడు వైఎస్. ఆయన ఆశయాల కొనసాగింపునకు ఆవిర్భవించిన వైసీపీ నేటి నుంచి జరిగే ప్లీనరీలో అందుకు పునరంకితమవుతోంది. విశ్వసనీయత, ఆపేక్ష, ధైర్యం, కరుణ, జాగరూకత... ఈ ఐదు లక్షణాలూ కలిగిన విలక్షణ వ్యక్తిత్వం వై.ఎస్.రాజశేఖరరెడ్డి సొంతం. కడప జిల్లా జమ్మల మడుగు మిషనరీ ఆస్పత్రిలో 1949 జులై 8న వైఎస్ జన్మించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత, రూపాయికే వైద్యం అందించారు. నాడి చూసి ప్రజల జబ్బులను పసిగట్టి చికిత్స చేసిన ఆయన... 28 ఏళ్ల వయసులోనే రాజకీయ నాయకుడిగా మారి, అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా జయకేతనం ఎగుర వేశారు. నాలుగు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నేతగా చరిత్ర సృష్టించారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలోనూ, అమలు చేయడంలోనూ అధికారులకు వైఎస్ పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. ఉదాహరణకు ఒకసారి కొందరు ఎమ్మెల్యేలు వచ్చి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, తమ వారికి ఇప్పించాలనీ అడిగారు. అప్పుడు వెంటనే సంబంధిత వర్సిటీ వీసీకి ఫోన్ చేసి, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలనీ, ఎమ్మెల్యేలు చెప్పిన వారికి అర్హతను బట్టి పోస్టులు ఇవ్వాలనీ సూచించారు. అయితే వీసీ 14 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారున్నారనీ, ముందు వారికి అవకాశం ఇచ్చిన తర్వాతే కొత్తవారికి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందనీ అన్నారు. ‘ఓకే! అలాగే కానివ్వండి. వీసీగా మీరే యూనివర్సిటీకి బాస్. మేం చెప్పిన వారికే ఇవ్వాలనేం లేదు’ అని వైఎస్ ఆయనకు స్పష్టం చేశారు. అదీ ఆయన వ్యక్తిత్వం. అదే సమయంలో ఫైళ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించేవారు. ఆలస్యం చేస్తే సహించేవారు కాదు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి వైఎస్ఆర్ హయాంలో ఆరేళ్ళ పాటు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేశారు. తాను ఆ పదవిలో పనిచేసిన ఆరేళ్లలో ఎన్నడూ, ఏ సందర్భంలోనూ వైఎస్సార్ ‘వీరికి ఈ ఫేవర్ చేయండి’ అని చెప్పలేదనీ, పూర్తి స్వేచ్ఛ తమకిచ్చారనీ చెప్పారు. ఇటువంటి అధికారుల సహకారంతోనే వైఎస్ పాలనలో అద్భుతాలను ఆవిష్కరించారు. అనుక్షణం జనహితమే లక్ష్యంగా పనిచేసే వైఎస్సార్... రైతు పక్షపాతి. ౖరైతు బాగుంటేనే దేశం బాగుంటుందనీ, లక్ష కోట్లు ఖర్చయినా కోటి ఎకరాలకు సాగు నీరు అందించి, కోట్లాది మంది రైతుల కళ్లలో ఆనందాన్ని చూడడమే తన లక్ష్యమనీ చెప్పేవారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘జలయజ్ఞం’ పేరిట సాగునీటి చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఐదేళ్లలోనే 80 భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు చేపట్టి, 13 పూర్తి చేశారు. దాదాపు 25 లక్షల ఎకరాలకు పైగా భూములకు సాగునీటి సౌకర్యం కల్పించారు. రైతులకు ‘ఉచిత విద్యుత్’ చారిత్రక అవసరమని వైఎస్ ఉద్ఘాటించారు. ఢిల్లీలో పార్టీ పెద్దలు, కొందరు ఆర్థికవేత్తలు ఈ పథకాన్ని అమలు చేయగలరా అని అనుమానం వ్యక్తం చేశారు. ‘అధికారంలోకి వచ్చి, నేను ముఖ్యమంత్రి అయితే ఈ పథకాన్ని కొనసాగిస్తా. రైతులకు ఉచితంగా కరెంటు ఇవ్వలేని నాడు నేను సీఎం పదవిలో ఒక్క క్షణం కూడా కొనసాగను’ అని తేల్చిచెప్పారు. 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలి సంతకం ‘ఉచిత విద్యుత్’ ఫైలు పైనే చేశారాయన. అనంతర కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2007లో అమెరికాలో జరిగిన ‘ప్రపంచ వ్యవసాయ వేదిక’ సమావేశంలో భారత్ ఏకైక ప్రతినిధిగా వైఎస్ పాల్గొన్నారు. అక్కడ ఓ బహుళజాతి విత్తన కంపెనీ ప్రతినిధులు కలిశారు. ఆ కంపెనీకి చెందిన పత్తి విత్తనాల ధరపై అప్పటికే సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన కేసు నడుస్తోంది. వారు ఆ కేసును వెనక్కి తీసుకోవాలని గట్టిగా కోరారు. అది అంతర్జాతీయ కంపెనీ అనీ, కాస్త పట్టూ విడుపూ ప్రదర్శించమనీ ఢిల్లీలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారు కూడా సూచించారు. అయినా వైఎస్ వెనక్కి తగ్గలేదు. అనంతర కాలంలో సుప్రీంకోర్టులో కేసు గెలిచారు. తద్వారా ఏటా రూ 3,000 కోట్ల చొప్పున గత 16 ఏళ్లలో రైతాంగానికి దాదాపు రూ 48,000 కోట్లు ఆదా కావటం ఒక చరిత్రాత్మక ఘట్టం. ఆనాడు ఐదు వందల గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్ ధర దాదాపు 1,600 రూపాయలు ఉంటే, అందులో దాదాపు వెయ్యి రూపాయలు రాయితీగా ఉండేది. విత్తనాల ధరను 750 రూపాయలకు తగ్గిస్తూ వైఎస్ ప్రభుత్వం పత్తి విత్తనాల ధరలు నిర్ణయించే చట్టాన్ని తీసుకొచ్చింది. దాదాపు ఐదు రాష్ట్రాలు ఆ చట్టాన్ని అనుకరించడంతో ఆ చట్టం దేశం దృష్టిని ఆకర్షిం చింది. ఆ విషయాన్ని ఉటంకిస్తూ అమెరికాకు చెందిన ప్రఖ్యాత పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ వైఎస్‌ను ఎంతగానో ప్రశంసించింది. వైఎస్ రైతుల కోసం ఎంతకైనా తెగిస్తారనడానికి ఈ ఒక్క ఉదంతమే ఉదాహరణ. ఐదేళ్ల వైఎస్ పాలనలో చేపట్టిన పథకాలన్నీ జనరంజకమైనవే. 2003లో రాష్ట్రవ్యాప్తంగా మండుటెండల్లో దాదాపు 1,450 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు వైఎస్ ప్రతి కుటుంబాన్నీ కలిసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సీఎం అయిన తర్వాత పేదలకు కూడు, గూడు, విద్య, వైద్యం ఉచితంగా అందించాలన్న లక్ష్యాన్ని నెర వేర్చారు. పింఛనుదారులకు ప్రతినెలా 1వ తారీఖునే పింఛన్ అందిం చడం వైఎస్ పాలనలోనే మొదలైంది. దేశంలో ఎక్కడా లేని మరో వినూత్న పథకం ఫీజు రీయింబర్స్మెంట్. బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన విశిష్ట పథకం. 2008లో ఉగాది పర్వదినాన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. 2009 ఎన్నికల్లో తిరిగి రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు బాగా పెరిగాయి. దీనిపై పెద్ద చర్చ జరి గింది. చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. మార్కెట్లో ధరలు, ముఖ్యంగా సోనా మసూరీ ధర తగ్గేవరకూ సీఎం, ఆయన కుటుంబ సభ్యులూ 2 రూపాయలకు కిలో బియ్యం రకాన్నే వాడారు. పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించాలనీ, గుండె జబ్బులు సహా ఇతర వ్యాధులతో ఎవరూ మరణించకూడదనీ వైఎస్ ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని ప్రారంభించారు. సామాన్యులకు ఈ పథకం అపర సంజీవనిలా మారింది. 108 అత్యవసర అంబులెన్స్ సర్వీసు కూడా ఆయన ప్రారంభించిందే. 104 కాల్ సెంటర్ ఏర్పాటు గ్రామీణ ప్రజలకు ఇంటి వద్దకే వైద్య చికిత్సను అందించేందుకు చేపట్టిన మరో బృహత్తర పథకం. పావలా వడ్డీ, అభయ హస్తం, జలయజ్ఞం, రుణ మాఫీ, భూపంపిణీ, పశు క్రాంతి, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక బృందాలు... ఇలా అనేక పథకాలను విజయవంతంగా అమలు చేశారు. ఆయన ఏ రంగాన్నీ, ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయలేదు. వైఎస్ హయాంలో పాడి పంటలే కాదు, ఐటీ ఎగుమతులు కూడా గణ నీయంగా వృద్ధి చెందాయి. రైతు సంక్షేమమే ధ్యేయంగా తుది శ్వాస వరకూ పనిచేసిన వైఎస్ పుట్టిన రోజైన జూలై 8ని ‘రైతు దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. మూడు దశాబ్దాల ప్రజా జీవితంలో వైఎస్ ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు సంపాదించారు. చివరికి ప్రజల కోసం వెళుతూ, హెలికాప్టర్ ప్రమా దంలో ప్రాణాలు కోల్పోయారు. ఒక మనిషి గొప్పతనం ఆయన చనిపోయినప్పుడు తెలుస్తుందంటారు. అది వైఎస్ విషయంలో అక్షర సత్యమైంది. భౌతికంగా మన మధ్య లేకున్నా, ఆయన చేసిన సేవ, ప్రవేశపెట్టిన పథకాల రూపంలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు. ఎ. చంద్రశేఖర్ రెడ్డి వ్యాసకర్త రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ సీఈఓ, వైఎస్సార్‌కు నాటి ప్రెస్ సెక్రెటరీ -
GST: ఐదేళ్లుగా దేశమంతా ఒకే మార్కెట్
దాదాపు రెండు దశాబ్దాల క్రితం తొలిసారి ‘జీఎస్టీ’ గురించి చర్చ జరిగింది. కానీ 2017లో మాత్రమే అది అమలులోకి రాగలిగింది. తొలుత కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా, ఐదేళ్ల తర్వాత అది శక్తిమంతమైంది. వచ్చిన ఏడాదే 63.9 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఇందులోకి మళ్లారు. 2022 నాటికి ఈ సంఖ్య రెట్టింపయింది. కీలక అంశాలపై దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయ సాధనలో జీఎస్టీ మండలి కీలక పాత్ర పోషించింది. గతంలో రాష్ట్రాల మధ్య ఉనికిలో ఉంటూ వచ్చిన పన్ను మధ్యవర్తిత్వాల సమస్యను జీఎస్టీ పూర్తిగా తొలగించివేసింది. నిజంగానే జీఎస్టీ, భారతదేశాన్ని సింగిల్ మార్కెట్‌ను చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ మనదని చెప్పడంలో ఏ సందేహమూ లేదు. భారతదేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టి జూలై 1తో అయిదేళ్లు పూర్తయింది. 2003 సంవత్సరంలో పరోక్ష పన్నులపై కేల్కర్ టాస్క్‌ఫోర్స్ నివేదికలో జీఎస్టీ గురించి తొలిసారిగా చర్చించారు. కానీ దానికి తుదిరూపు ఇవ్వడానికి చాలా కాలం పట్టింది. ప్రవేశపెట్టింది మొదలుకొని జీఎస్టీ సహజంగానే పెను సమస్యలను ఎదుర్కొంది. అయితే కోవిడ్–19 కల్లోలాన్ని ఎదుర్కొని, దాని ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత, జీఎస్టీ శక్తిమంతంగా ఆవిర్భవించింది. సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో సరిపెట్టుకోకుండా, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణ మార్గంలోకి నడిపిం చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకున్నా యంటే ఆ ఘనత జీఎస్టీ కౌన్సిల్‌కే దక్కుతుంది. ఈ రకమైన పరస్పర కృషి వల్లే భారత్ ప్రపంచంలోనే అత్యంతవేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇప్పుడు ఆవిర్భవించింది. భారత్‌లో జీఎస్టీ 2017లో అమల్లోకి వచ్చింది కానీ, చాలా దేశాలు అంతకుముందే జీఎస్టీ విధానం వైపు మళ్లాయి. కేంద్రమూ, రాష్ట్రాలూ పన్నుల మీద స్వతంత్రతను అనుభవించిన అర్ధ–సమాఖ్య వ్యవస్థ చాలాకాలంగా ఏకీకృత పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ వచ్చింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన జీఎస్టీ మండలి, భారత్‌కే ప్రత్యేకమైన జీఎస్టీ సొల్యూషన్ (ద్వంద్వ జీఎస్టీ) దీనికి సమాధానాలుగా నిలి చాయి. దేశంలో విభిన్న పరిమాణాలతో, విభిన్న అభివృద్ధి దశలతో కూడిన రాష్ట్రాలు, వాటి వారసత్వ పన్నుల వ్యవస్థను మిళితం చేసి జీఎస్టీ పరిధిలోకి తేవలసి వచ్చింది. కొన్ని మినహాయింపులతో కేంద్ర, రాష్ట్రాలకు చెందిన పన్నులను జీఎస్టీలో కలపడం జరిగింది. ఈ క్రమంలో 17 రకాల పన్ను చట్టాలను మేళవించి జీఎస్టీ ద్వారా ఏకీకృత పన్నుల వ్యవస్థను అమల్లోకి తేవడం జరిగింది. పన్ను రేట్లు, మినహాయింపులు, వాణిజ్య ప్రక్రియ, ఐటీసీ చలనం వంటి కీలక అంశాలపై జాతీయ ఏకాభిప్రాయ సాధనలో జీఎస్టీ మండలి కీలక పాత్ర పోషించింది. దేశంలోని 63.9 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులు 2017 జూలైలో జీఎస్టీలోకి మళ్లారు. 2022 జూన్ నాటికి ఈ సంఖ్య రెట్టింపై 1.38 కోట్లకు చేరుకుంది. 41.53 లక్షలమంది పన్ను చెల్లింపుదారులు, 67 వేల మంది ట్రాన్స్ పోర్టర్లు ఈ–వే పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. నెలకు సగటున 7.81 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్ చేస్తున్నారు. ఈ వ్యవస్థ ప్రారం భమైంది మొదలు 292 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్ అయ్యాయి. ఇందులో 42 శాతం అంతర్రాష్ట్ర సరకుల రవాణాకు సంబంధించినవి. ఈ సంవత్సరం మే 31న ఒకేరోజు అత్యధికంగా 31,56,013 ఈ–వే బిల్స్ జనరేట్ కావడం ఒక రికార్డు. నెలవారీ సగటు వసూళ్లు కూడా 2020–21లో రూ. 1.04 లక్షల కోట్ల నుంచి, 2021–22లో రూ. 1.24 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ సంవత్సరం తొలి రెండు నెలల్లో సగటు వసూళ్లు రూ. 1.55 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ ధోరణి పెరుగుతుందని చెప్పడం హేతు పూర్వకమైన, న్యాయమైన అంచనా అవుతుంది. సీఎస్టీ, వీఎటీ వ్యవస్థలో రాష్ట్రాల మధ్య ఉనికిలో ఉంటూ వచ్చిన పన్ను మధ్యవర్తిత్వాల సమస్యను జీఎస్టీ పూర్తిగా తొలగించివేసింది. బోర్డర్ చెక్‌పోస్టులు, సరుకులు లోడ్ చేసిన ట్రక్కులను నిలబెట్టి మరీ తనిఖీ చేయడంతో కూడిన గతంలోని నియంత్రణ వ్యవస్థ కల్లోలం సృష్టించి కాలాన్నీ, ఇంధనాన్నీ వృథా చేసేది. దీంతో లాజిస్టిక్స్ వ్యవస్థ సామర్థ్యం తగ్గిపోయింది. సరుకుల ధరలో 15 శాతం వరకూ దీని ఖర్చులే ఉండేవని అంచనా. జీఎస్టీకి మునుపటి వ్యవస్థలో అనేక సరుకులపై కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి రేట్లు 31 శాతం కంటే ఎక్కువగానే ఉండేవి. కానీ ప్రస్తుత జీఎస్టీ వ్యవస్థ కింద 400 సరకులు, 80 సేవలపై పన్నులను బాగా తగ్గించడమైనది. అత్యధికంగా 28 శాతం రేటు ఇప్పుడు విలాస వస్తువులపై మాత్రమే ఉంది. గతంలో 28 శాతం పన్ను రేటు ఉన్న 230 సరుకుల్లో సుమారు 200 సరుకులను పన్ను తక్కువగా ఉండే శ్లాబ్‌లకు మార్చడమైనది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అవసరాలను తీర్చడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రధ్ద తీసుకుంది. వీటిపై పన్ను రేట్లు బాగా కుదించింది. పైగా ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ప్రయోజనం కోసం ఈ సంస్థలను సప్లయ్ చైన్స్‌తో అనుసంధానించడం జరిగింది. ఈ క్రమంలో రెండు కీలకమైన చర్యలను కేంద్రం తీసుకుంది. చిన్న తరహా పరిశ్రమలకు ఇస్తున్న పన్ను మినహాయింపు 20 లక్షల నుంచి 40 లక్షల రూపాయలకు పెరిగింది. కాగా, త్రైమాసిక రిటర్న్‌లు, నెల వారీ చెల్లింపుల పథకం ప్రవేశపెట్టడంతో 89 శాతం పన్ను చెల్లింపు దారులకు ప్రయోజనం కలిగింది. జీఎస్టీని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇది ఐటీ ఆధారితంగా, పూర్తి ఆటోమేటిక్ పద్ధతిలో కొనసాగుతోంది. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సామర్థ్యా లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నవీకరిస్తూండటం వల్ల మొత్తం వ్యవస్థను క్రియాశీలంగా ఉంచడం సాధ్యమైంది. జీఎస్టీ వ్యవహారాలపై అనేక వ్యాజ్యాలు... సమన్లు జారీ చేయడం, వ్యక్తులను అరెస్టు చేయడం, రికవరీల కోసం ఆస్తులను జప్తు చేయడంతో సహా ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ వంటి అంశాల పైనే వస్తున్నాయి. మోహిత్ మినరల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు కూడా చాలా ప్రాచుర్యం పొందింది. కానీ జీఎస్టీలోని ప్రాథమిక అంశాలను కోర్టు పక్కన పెట్టలేదని గుర్తించాలి. దాదాపు 24 సంవత్సరాల పాటు పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రిగా పనిచేసిన అసీమ్ దాస్‌గుప్తా 2000 నుంచి 2011 సంవ త్సరం దాకా రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికారిక గ్రూప్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. మొట్టమొదటి జీఎస్టీ చట్టాల రూపకల్పన 2009లో జరిగింది. 2017 జూలై 2న ఒక వాణిజ్య పత్రికకు అసీమ్ దాస్‌గుప్తా ఇచ్చిన ఇంటర్వ్యూలో జీఎస్టీలోని ముఖ్యమైన అంశాలను వక్కా ణించారు. ఆయన చెప్పిన అంశాలు ఇప్పటికీ మార్పు లేకుండా కొనసాగుతున్నాయి: ‘సర్వీస్ టాక్స్‌ని విధించే అధికారం రాష్ట్రాలకు అసలు ఉండేది కాదు. అందులో కేవలం భాగం పొందడమే కాదు, పన్ను విధించే అధికారం కోసం అడుగుతూనే ఉండేవి. జీఎస్టీ దానికి అవకాశం కల్పించింది.’ ఆయన ఇంకా ఇలా చెప్పారు: ‘రాష్ట్రాల స్వయంప్రతిపత్తిపై సాధికారిక కమిటీ దృఢమైన వైఖరి తీసుకుంది. సెంట్రల్ జీఎస్టీపై పార్లమెంట్‌కూ, రాష్ట్ర జీఎస్టీపై అసెంబ్లీలకూ సిఫార్సు చేసే విభాగమే జీఎస్టీ కౌన్సిల్. సాంకేతికంగా శాసనసభ దాన్ని ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. కాబట్టి శాసనసభల అధికారాన్ని ఇది తీసేసు కోవడం లేదు.’ ఇంకా ముఖ్యంగా ఆయన ఇలా అన్నారు: ‘ఇక రేట్లకు సంబంధించి చూస్తే, రాష్ట్రాలు, కేంద్రం కలిసి రెండింటికీ ఒక రకమైన ఏక పన్నును ఆమోదించాయి. కాబట్టి సహకారాత్మక సమాఖ్య ప్రయోజనం కోసం రాష్ట్రాలు, కేంద్రం పాక్షికంగా త్యాగం చేశాయని దీనర్థం. అదే సమయంలో సర్వీస్ టాక్స్ విషయంలో రాష్ట్రాలకు జీఎస్టీ అదనపు అధికారాలను ఇచ్చింది. రాష్ట్ర ప్రాంతీయ ఉత్పత్తుల్లో సగం సేవల కిందికే వస్తాయి.’ జీఎస్టీ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బ్లాగులో ఇలా రాశారు: ‘అటు వినియోగ దారు, ఇటు మదింపుదారు (అసెస్సీ) ఇద్దరికీ అనుకూలంగా జీఎస్టీ ఉంటుందని రుజువైంది. పన్ను చెల్లింపుదారులు, టెక్నాలజీని అంది పుచ్చుకున్న మదింపుదారులు ఇద్దరూ చూపించిన సానుకూలతకు ధన్య వాదాలు. నిజంగానే జీఎస్టీ, భారత్‌ను సింగిల్ మార్కెట్‌ని చేసింది.’ నిర్మలా సీతారామన్ (జూలై 1 నాటికి జీఎస్టీ వచ్చి ఐదేళ్లు) వ్యాసకర్త కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
‘రెవెన్యూ’కు 250 ఏళ్లు
ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ వ్యవసాయాదాయం పెంచుకునే ఇతర రంగాలను అభివృద్ధి చేసుకున్నాయి. భారతదేశ ప్రాచీన, మధ్యయుగ కాలాల్లోని రాజ్యాల ప్రధాన వనరు అయిన భూమిశిస్తును వసూలు చేసింది సాంప్రదాయ రెవెన్యూ ఉద్యోగులే. అంటే దేశంలో అతి పురాతన శాఖ రెవెన్యూ శాఖే. అయితే ఆధునిక రెవెన్యూ శాఖ సృష్టి, రూపురేఖలన్నీ బ్రిటిష్ రాజ్ కాలంలోనే సంతరించుకున్నాయి. బ్రిటిష్ వలస పాలనలో స్థాపితమైన అనేక వ్యవస్థలూ, చట్టాలూ కొన్ని యథాతథం గానూ, కొన్ని మార్పు చేర్పుల తోనూ ఇప్పటికీ కొనసాగు తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న రెవెన్యూ వ్యవస్థ ఆ కాలంలో పురుడుపోసుకున్నదే. ప్లాసీ యుద్ధం (1757) భారత దేశంలో బ్రిటిష్ అధికార స్థాపనకు వీలుకల్పించింది. బక్సార్ యుద్ధం (1764) ఆంగ్లేయుల అధికారాన్ని పటిష్ఠపరచింది. ఆ యుద్ధం తరువాత జరిగిన అలహా బాద్ సంధి ద్వారా మొగల్ చక్రవర్తి షా ఆలం నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు బెంగాల్, బిహార్, ఒరిస్సా, సుబాలలో దివానీ (శిస్తు వసూలు చేసుకునే) అధికారం పొందారు. ఉత్తర భారతంలో 1765 నుండి 1772 వరకు, అలాగే కర్ణాటక యుద్ధాలు విజయాల తరువాత దక్షిణాదిన కూడా బ్రిటిష్‌వాళ్లు శిస్తు వసూలుకు వివిధ పద్ధతులను పాటించారు. బెంగాల్ గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ 1772 మే 14న భూమిశిస్తు వసూలుకు ప్రతి జిల్లాకి ఒక కలెక్టర్‌ను నియమించారు. అంటే కలెక్ట్టర్ ఉద్యోగ సృష్టి జరిగి మే 14 నాటికి 250 ఏళ్ళు పూర్తవుతుందన్న మాట! బెంగాల్ మొత్తంలో శిస్తు వసూలును పర్య వేక్షించడానికి ‘బోర్డ్ ఆఫ్ రెవెన్యూ’ గవర్నర్ ఆధ్వ ర్యంలో ఏర్పాటయింది. తరువాత కాలంలో బెంగాల్ గవర్నర్ జనరల్‌గా వచ్చిన కారన్ వాలీస్ ‘బోర్డ్ ఆఫ్ రెవెన్యూ’ను సంస్కరించి, అన్ని బ్రిటిష్ ప్రావిన్స్‌ల లోనూ ఈ బోర్డులను ఏర్పాటు చేశాడు. ఆ విధంగా మద్రాస్ ప్రావిన్స్‌లో ఏర్పడిన ఈ వ్యవస్థ 1977లో íసీఎల్ఆర్ శాఖ ఏర్పాటు వరకూ కొనసాగింది. ప్రస్తుతం దాని స్థానంలో సీసీఎల్ఏ 1999 నుంచి కొనసాగుతోంది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళలో దేశంలో రెవెన్యూ సిబ్బంది నెరవేర్చిన బాధ్యతలు మరువ లేనివి. జమిందార్లకు శిస్తు వసూలు అధికారాలను రద్దు చేస్తూ, సాగుచేసే వాడికి భూమిపై హక్కులు కల్పిస్తూ చేసిన ‘ఎస్టేట్ రద్దు చట్టం–1948’ను అమలు చేయడం, ప్రతి పేదోడికి భూమిపై హక్కులను గుర్తించడానికి చేసిన ‘సర్వే అండ్ సెటిల్మెంట్’లో రెవెన్యూ శాఖవారి సేవ జీతంతో కొలవలేనిది. అలాగే ‘ల్యాండ్ సీలింగ్ యాక్ట్’ అమలు, ‘మిగులు భూమి’ని అర్హులుకు పంపిణీ చేయడం వంటివన్నీ రెవెన్యూ వారిని మరింత ప్రజల మనుషులను చేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భూ సంస్కరణ ఫలాలు పేదోడికి చేర్చిన ఘనత రెవెన్యూ శాఖదే! స్వాతంత్య్రం వచ్చిన తరువాత పంచవర్ష ప్రణా ళికలో ఎన్నో లక్ష్యాల కొరకు ఎంతో భూసేకరణ చేయవలసి వచ్చింది. రెవెన్యూశాఖే ఆ బాధ్యతను తలకెత్తుకొంది. దేశాభివృద్ధి దృష్ట్యా కొత్త ప్రాజెక్టులు – ఇరిగేషన్, రోడ్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, ఉన్నత విద్యా సంస్థలు, భారీ పరిశ్రమలు వంటి ఎన్నో నిర్మాణాలకు భూసేకరణ అనే మహా యజ్ఞం రెవెన్యూ శాఖతోనే జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘జగనన్న శాశ్వత భూ హక్కు పథకం/ రీ సర్వే’ రెవెన్యూ శాఖ ద్వారానే జరుగుతోంది. పేదలందరికీ ఇళ్ళ పథకంలో 30 లక్షల పైగా ఇంటి పట్టాల పంపిణీకి భూసేకరణ అంతా రెవెన్యూ శాఖ చేతుల మీదుగానే జరిగింది. సంక్షేమ పథకాలలో అగ్రగామి అయిన నిత్యావసర వస్తువుల పంపిణీ రెవెన్యూ శాఖ భుజస్కంధాల పైనే నేటికీ నడుస్తోంది. తుపానులు, వరదలు అగ్ని ప్రమాదాల ఇతర ప్రకృతి వైపరీత్యాలు వంటివి సంభవించినప్పుడు రెవెన్యూ శాఖ పాత్రే ఎంతో కీలకం. ఒక్క మాటలో చెప్పాలంటి సామా న్యుడి జననం నుండి మరణం వరకు కావలసిన ఎన్నో ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేయడమే కాక సామాన్యుడి సేవలో నిరంతరం పనిచేసేది రెవెన్యూ శాఖే! కోరాడ శ్రీనివాసరావు వ్యాసకర్త తహశీల్దారు, సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా ‘ 94410 08574 -
ఆలస్యం... అమృతం... విషం!
గణతంత్రదినోత్సవం నాడు రాష్ట్రంలో పరిపాలన, బౌగోళిక మార్పులకు శ్రీకారం చుడుతూ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకం. బ్రిటిష్ వారు 120 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన జిల్లాలకు అదనంగా స్వాతంత్య్రం వచ్చిన తరువాత నేటికి జనాభా 5 రెట్లు పెరిగినా కొత్త జిల్లాలు కేవలం రెండు (విజయనగరం, ప్రకాశం) మాత్రమే ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం 2021 జనగణనను కరోనా విపత్తు వల్ల నిరవధికంగా వాయిదా వేసి కొత్త పరిపాలనా విభాగాల ఏర్పాటు మార్పు చేర్పులపై వున్న నిషేధాన్ని 2022 జూన్ 30 వరకు ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ నూతన జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం సరైన సమయంలో తీసుకున్న సాహసోపేత చర్య. జూన్ 30 నాటికి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, రెవెన్యూ గ్రామాల ఏర్పాటు, సరిహద్దుల్లో మార్పులు వంటివి పూర్తి చేసి కేంద్ర హోంశాఖకు నివేదిస్తే జూలై తరువాత ఎప్పుడు జనగణన జరిగినా రాష్ట్రంలోని కొత్త జిల్లాల ప్రకారమే జనగణన చేపడతారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్‌లో ఎంతైనా వుంది. రాష్ట్రంలో సగటు జిల్లా జన సంఖ్య 37.98 లక్షలు కాగా మొత్తం జిల్లాలు 13 మాత్రమే. నూతనంగా ఏర్పడిన తెలం గాణలో జిల్లా సగటు జనాభా 11.35 లక్షలు ఉంటే జిల్లాలు 33 ఉన్నాయి. మనకన్నా జిల్లా సగటు జనాభా (26.64 లక్షలు) తక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 80 జిల్లాలు ఉండటం గమ నార్హం. దేశంలో ఒక్క పశ్చిమ బెంగాల్లో (39.68 లక్షలు) మాత్రమే ఏపీలోని జిల్లా సగటు జనాభా కన్నా ఎక్కువ జన సంఖ్య ఉంది. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకొని చూసిన ప్పుడు ఏపీలో జిల్లాల సంఖ్య బాగా తక్కువగా ఉన్నట్లు స్పష్ట మవుతున్నది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఇదీ ఒక కారణమే. దాదాపు పార్లమెంట్ నియోజకవర్గం సరిహద్దులే కొత్త జిల్లా సరిహద్దులకు ప్రాతిపదికగా తీసుకోవటం, అసెంబ్లీ నియోజక వర్గాలు రెండు మూడు జిల్లాల్లో విస్తరించకుండా ఏ జిల్లాకి ఆ జిల్లాలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం మేలైన నిర్ణయం. ఆంధ్రప్రదేశ్‌లో 1974 జిల్లాల చట్టంలో ఉన్నవీ, 1984లో రూపొందించిన నిబంధనలనూ పరిశీలించినప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుకు గమనించాల్సిన ముఖ్యాంశాలు– ప్రాంతం, జనాభా, ఆదాయం... కొత్త, పాత జిల్లాల్లో దాదాపు సమపాళ్లలో ఉండేటట్లు తుది ముసాయిదా నాటికి సవరిం చాలి. అలాగే చారిత్రక నేపథ్యం, ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలు; సాంస్కృతిక పరమైన, విద్య, మౌలిక సదుపాయాలూ; ఆర్థిక పురోభివృద్ధి అవకాశాలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. అభివృద్ధి చెందిన, లేదా బాగా వెనుకబడిన ప్రాంతాలు అన్నీ ఒకే దగ్గరకు రాకుండా చూడాలి. పార్లమెంట్ సరిహద్దు ప్రాతిపదికనే కాకుండా పరిస్థితిని బట్టి కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేయవలసి ఉంది. కొంతమంది 2026లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజక వర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి... పార్లమెంటు సరిహద్దులు మారుతాయనీ, అందువల్ల ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు సరికాదనీ అంటున్నారు. ఇది వాస్తవం కాదు. 2001లో జరిగిన 91వ రాజ్యాంగ సవరణను అనుసరించి 2026 తరువాత వచ్చే తొలి జనాభా లెక్కల ప్రకారం (అంటే 2031 సెన్సెస్) డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు పునర్విభజన చేయ డానికి 3 సంవత్సరాలు పడుతుంది. అసలు జనాభా లెక్కల తుది జాబితానే 2034లో ప్రకటిస్తారన్న సంగతి గుర్తించాలి. అంటే 2039 ఎన్నికల వరకు పార్లమెంటు స్థానాల సంఖ్య తేలే అవకాశమే లేదన్నమాట! కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలకు... ప్రత్యేకించి మెడికల్ కాలేజీలు, కేంద్రీయ విద్యాలయాలు, గ్రామీణా భివృద్ధి, పశువైద్యశాలలు, యువజన కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు జిల్లాను యూని ట్‌గా తీసుకొని కేటాయింపులు చేస్తుంది. నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తే... కొత్త జిల్లాలకు అదనపు నిధులు, మౌలిక సదుపాయాలకు హోం, డిజాస్టర్ శాఖల నుండి ప్రత్యేక నిధులు తెచ్చుకునే అవకాశం వుంటుంది. ఇంత ప్రయోజన కరమైన కొత్త జిల్లాల ఏర్పాటు ఎంత తొందరగా సాకారం అయితే అంతమంచిది. ‘ఆలస్యం అమృతం విషం!’ అందుకే వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర పరిధిలోనే ఉన్న కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై దృష్టి సారించింది. తద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గరకు మరింత సమర్థవంతంగా, వేగంగా చేర్చడానికి వీలుండటమే కాక అభివృద్ధి ఊపందుకుంటుంది. ఇనగంటి రవికుమార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మొబైల్: 94400 53047 -
ఆహారభద్రతే... ఆకలిచావులకు మందు!
కరోనా, అంతర్గత అస్థిర రాజకీయ పరిస్థితులు, కరువు కాటకాలు వంటి వాటివల్ల ప్రపంచంలో చాలా దేశాలలో ఆకలి చావులు అధికంగా ఉన్నాయనీ, కరోనా వైరస్ ప్రభావంతో పరిస్థితులు మరింత దిగజారాయనీ పేద రిక నిర్మూలన కోసం కృషి చేసే ‘ఆక్స్ ఫామ్’ సంస్థ వెల్లడించింది. ఆకలి కార ణంగా ప్రపంచంలో ప్రతి నిమిషానికి 11 మంది చనిపోతున్నారని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆకలితో మరణించిన వారి సంఖ్య ఆరు రెట్లు ఎక్కువగా వుంది అని అంచనా వేసింది. ఆ సంస్థ ‘ది హంగర్ ముల్టిప్లయిస్’ అనే పేరుతో నివేదికను విడుదల చేసింది. 2021 ఏడాది నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో 10 శాతం జనాభా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 30 శాతం జనాభాకు తగిన ఆహారం దొరకడం లేదు. అదనంగా 11 కోట్ల మంది ప్రజలు ఆకలి కోరల్లో చిక్కుకోవడం, ప్రజా పంపిణీ వ్యవస్థ వైఫల్యం, లోపభూయిష్ఠమైన ఆహారభద్రత విధానం, నిరుద్యోగం, ఆహార కొరతల కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఆకలితో మరణించిన వారి సంఖ్య అధికమవ్వడం వంటి విషయాలు ఈ నివేదిక వెల్లడించింది.. మన దేశంలో 2021–22లో 315 మిలియన్ టన్నుల రికార్డ్ స్థాయి ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి దశకు చేరినా పోషకాహార లోపంతో బాధపడుతున్న జనాభా 2018లో 13.8 శాతం ఉండగా... 2020 నాటికి 15.3 శాతానికి పెరిగింది. ఆహారధాన్యాల ఉత్పత్తిలో మిగులు సాధించినప్పటికీ నిరుద్యోగం, పేదరికం వల్ల ప్రజల కొనుగోలు శక్తి ఆశించిన మేరకు పెరగలేదు. కొనుగోలు సామర్థ్యం కొరవడింది. పోషకాహారం లోపం వల్ల ఆకలి చావులు పెరుగుతున్నాయి. భారత్‌లో దాదాపు 14 శాతం ప్రజలు పోషకా హార లోపంతో, ఐదేళ్ల లోపు వయస్సున్న పిల్లలు 20 శాతం తక్కువ బరువుతో ఉన్నారు. 15–49 ఏళ్ల లోపు మహిళల్లో 52 శాతం రక్తహీనతతో సతమతమౌతు న్నారని అంచనాలు తెలుపుతున్నాయి. 2021 ప్రపంచ ఆకలి సూచీ జాబితాలో 116 దేశా లను చేర్చారు. ఇందులో భారతదేశం అట్టడుగున 101వ స్థానంలో ఉండటం విచారకరం. 2020లో భారతదేశం స్థానం 94 కాగా, 2021 నాటికి 101 స్థాయికి దిగజారింది. శ్రీలంక 65, బంగ్లాదేశ్ 76, పాకిస్తాన్ 92 స్థానాల్లో ఉండటం ఈ సందర్భంగా గమ నించాలి. ఆకలితో అల్లాడుతున్న ప్రజలు నివసించే ప్రాంతాలు గుర్తించి వారికి సకాలంలో ఆహార ధాన్యాలు అందించాలనీ, ఆకలితో ఎవ్వరూ చని పోకూడదనీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలైనా ప్రభుత్వాన్ని నిద్ర మేల్కొలుపు తాయేమో చూడాలి. ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చెయ్యాలి. ఆహార భద్రత అంటే బియ్యం, గోదుమలు ఇవ్వడం కాదు. దారిద్య్రరేఖకు కింద వున్నవారికి పౌష్టికాహారం అందించడం. అప్పుడే పేద వర్గాలలో ఆహార భద్రత కలుగుతుంది. ఆహార వ్యవసాయ సంస్థ ప్రకారం ప్రజలు ఆరోగ్య దాయక జీవితాన్ని పొందేందుకు అవసరమైన తగినంత సుర క్షిత పౌష్టికాహారం ప్రజలందరికీ అందించాలి. ప్రభుత్వ పంపిణీ విధానం ద్వారా పేదలకు ఆహార ధాన్యాలను సబ్సిడీ ధరలకు సరఫరా చేయాలి. అంగన్వాడీ పిల్లలకు పోషకాహారం సరఫరా చేయాలి. అణగారిన వర్గాలకు, గిరిజనులకు, మురికి వాడల్లో నివసించే వారికి ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు అందజేయాలి. అప్పుడే ప్రజలందరికీ ఆహార భద్రత చేకూరుతుంది. నేదునూరి కనకయ్య వ్యాసకర్త తెలంగాణ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు మొబైల్: 94402 45771 -
మహిళలే నవ భారత నిర్మాతలు
ఎన్ని అవరోధాలు, సవాళ్లు ఉన్నప్పటికీ భారతీయ మహిళలు తాము శక్తిమంతులమని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. విజయం సాధించాలనే నిబద్ధతతో ఉత్సాహంగా దూసుకుపోతున్నారు. నైపుణ్యం, గుర్తింపు, గౌరవం సాధించడానికి మహిళలు తాము చేసే ప్రయత్నాలలో ఎప్పటికీ నిరుత్సాహం చెందకుండా ఉండటమే వారిని మనకు నిజమైన ఆదర్శప్రాయులుగా చేస్తోంది. ‘నేటి లింగ సమానత్వమే రేపటి సుస్థిర సమాజం’... ఈ ఏడాది మన మహిళా దినోత్సవ నేపథ్యాంశం. మహిళలే మన నవ భారత నిర్మాతలు. గొప్ప సంప్రదాయాలు, సమున్నత విలువలతో ప్రాచీన ఘనతను కలిగి వున్న సుసంపన్న భారత దేశంలో మహిళలు ఎల్ల ప్పుడూ తమ ప్రాము ఖ్యాన్ని చాటుతూనే వచ్చారు. ఎన్ని అవ రోధాలు ఉన్నప్పటికీ భారతీయ మహిళలు తాము శక్తిమంతులమని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. రవీంద్రనాథ్ టాగోర్ మాటల్లో చెప్పాలంటే.. ‘మనకు స్త్రీలు అగ్నిదేవతలు మాత్రమే కాదు. భారతీయాత్మ జ్వాలలు కూడా’. ధీర వనిత ఝాన్సీరాణి లక్ష్మీబాయి, భారత దేశ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే మొదలు... స్త్రీ విముక్తికి తన జీవితాన్ని అంకితం చేసిన రమాబాయి రణడె వరకూ ఎందరో మహి ళలు సంకల్పబలానికి తిరుగులేని నిదర్శనమై నిలి చారు. సరోజినీ నాయుడు సాహిత్య ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. ఇటీవలి సంవత్సరాలలో సైతం ఎందరో మహిళామణులు అత్యున్నత స్థాయిలో పెద్ద పెద్ద సంస్థల నిర్వహణ చేపట్టి దేశా నికి పథనిర్దేశకులయ్యారు. ఎస్బీఐ తొలి మహిళా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య, ఓఎన్జీసీ తొలి మహిళా సీఎండీ అల్కా మిట్టల్, ‘సెయిల్’ చైర్మన్ సోమా మండల్.. ఇలా ఎంతోమంది! హరియాణా మహిళ సంతోశ్ యాదవ్ రెండుసార్లు ఎవరెస్టును అధిరోహించి మహిళాశక్తిని శిఖరాగ్రంపై ప్రతిష్ఠిం చారు. ఇక బాక్సర్ మేరీకోమ్ పేరు తెలియని ఇల్లుందా భారత దేశంలో! మనమిప్పుడు ‘కార్యా చరణ దశాబ్దం’లోకి ప్రవేశించి ఉన్నాం. 2030 నాటికి సుస్థిరమైన అభివృద్ధిని సాధించి, ఈ భూమండలాన్ని మానవ జీవనానికి మరింత మెరుగైన ప్రదేశంగా మార్చడం మనముందున్న లక్ష్యం. లింగ సమానత్వం; మహిళలు, బాలికల సాధికారత అనేవి కూడా సుస్థిర అభివృద్ధి లక్ష్యా లలో భాగమైనవే. అదే సమయంలో.. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సంక్షోభ నిర్వహణ, సామా జిక అభివృద్ధి, సమాజంలోని బలహీన, అట్టడుగు వర్గాల అభ్యున్నతి, సంక్షేమం.. వీటన్నిటితో కూడిన ‘సుస్థిర భవిష్యత్తు’ అనే లక్ష్యాన్ని మహిళల భాగస్వామ్యంతో మాత్రమే సాధ్యం చేసుకో గలమని మనం గ్రహించాలి. నైపుణ్యం, గుర్తింపు, గౌరవం సాధించడానికి మహిళలు తాము చేసే ప్రయత్నాలలో ఎప్పటికీ నిరుత్సాహం చెందకుండా ఉండటమే వారిని మనకు నిజమైన ఆదర్శప్రాయులుగా చేస్తోంది. మహిళల్లోని సామర్థ్యాల గురించి ప్రఖ్యాత అమెరికన్ మత గురువు బ్రిగ్హామ్ యంగ్ సరిగ్గానే చెప్పారు. ‘‘మనం ఒక వ్యక్తిని విద్యావంతుడిని చేస్తే ఆ వ్యక్తికి మాత్రమే విద్య అందుతుంది. ఒక మహి ళకు విద్యను అందిస్తే ఒక తరం వారంతా విద్యా వంతులవుతారు’’ అంటారు బ్రిగ్హామ్. ‘నేటి లింగ సమానత్వమే రేపటి సుస్థిర సమాజం’.. అనే ఈ ఏడాది మహిళా దినోత్సవ ప్రధానాంశం.. బ్రిగ్హామ్ మాటలకు చక్కగా సరిపోలుతుంది. దేశంలో కోవిడ్–19 వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీకా కార్యక్రమాన్ని విజయ వంతం చేయడంలో మహిళలే కీలకమైన పాత్ర పోషించారు. అంగన్వాడీ కార్యకర్తల నుంచి, పాలనా విభాగాలలో ఉన్నత స్థానాలలో ఉన్న మహిళా అధికారుల వరకు అందరూ ఇందుకోసం విశేషకృషి సల్పారు. కోవిడ్‌కు స్వదేశీ ‘కోవ్యాక్సిన్’ టీకాను అభివృద్ధి చేయడంలో విశ్వస్థాయి క్రియా శీలత కనబరిచిన భారత్ బయోటెక్ జాయింట్ ఎండీ సుచిత్రా ఎల్లా ‘పద్మభూషణ్’ అందు కున్నారు. 12–18 ఏళ్ల మధ్య వారికి ఇవ్వడం కోసం కోవిడ్ టీకాను అభివృద్ధి చేసిన బృందానికి బయో లాజికల్ ఇ కంపెనీ ఎండీ మహిమా దాట్ల నాయ కత్వం వహించి, తక్కువ సమయంలో ఉత్తమ ఫలితాలను సాధించడానికి ప్రేరణ అయ్యారు. 6వ ఆర్థిక అధ్యయనం ప్రకారం దేశంలో 80 లక్షల 5 వేల మంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. స్టార్టప్‌లు (అంకుర సంస్థలు), ముఖ్యంగా మహిళా స్టార్టప్‌లు ఎందుకు మనకు ముఖ్య మైనవి? బెయిన్ అండ్ కంపెనీ, గూగుల్ విశ్లేషణల ప్రకారం 2030 నాటికి మన మహిళా వ్యాపార వేత్తలు 15 – 17 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తారని అంచనా. 2018–21లో దేశంలోని స్టార్టప్‌లు కల్పించిన ఉద్యోగాల సంఖ్య 5 లక్షల 90 వేలు. ఇంత ప్రాముఖ్యం ఉన్న స్టార్టప్‌లను గతంలో చేజార్చుకుని ఉండొచ్చు. వర్తమానంలో తప్పక చేజిక్కించుకోవాలి. రాణించాలనే పట్టుదల అమ్మాయిలలో బలంగా ఉంటోంది. ‘ఆజాదీ కా అమృత్ మహో త్సవ్’లో భాగంగా గతేడాది సెప్టెంబర్ 6–12 తేదీల మధ్య కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2,614 మంది స్వయం సహాయక బృందాల మహిళా వ్యాపారులకు కేవలం వారం వ్యవధిలోనే 8 కోట్ల 60 లక్షల రూపాయల రుణాలను ‘కమ్యూ నిటీ ఎంటర్ప్రైజ్ ఫండ్’ లోన్ కింద అందించింది. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలు తమను తాము శక్తిమంతం చేసుకోవడమే కాకుండా మన ఆర్థిక వ్యవస్థకూ నిలకడైన స్థిరత్వాన్ని చేకూర్చుతున్నారు. గత 6–7 ఏళ్లలో మహిళా స్వయం సహాయక సంఘాల ఉద్యమం విస్తృతం అయింది. నేడు దేశవ్యాప్తంగా 70 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. అర్థం చేసుకో వలసినది ఏమిటంటే, స్త్రీల శక్తి సామర్థ్యాలు దేశాన్ని గొప్ప శిఖరాలకు తీసుకు వెళతాయని! బండారు దత్తాత్రేయ వ్యాసకర్త హరియాణా రాష్ట్ర గవర్నర్ -
పోలవరం నిర్మాణంలో వాస్తవాలేంటి?
పోలవరం ప్రాజెక్టుకు 1981 మే 21న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టి. అంజయ్య శంకుస్థాపన చేసిన నాటినుండి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి భూమి పూజ చేసే వరకు పోల వరం ప్రాజెక్టును పట్టించుకున్న ప్రభు త్వమే లేదు. సుమారు పదహారున్నర సంవత్సరాల కాలం తెలుగుదేశం అప్పటికే అధికారంలో ఉంది. అయినా పోలవరం పేరెత్తిన పాపాన పోలేదు. అంతకుముందు ఈ తరహా ప్రాజెక్టుకు సర్వే చేయడానికి దశాబ్దాల కాలం పట్టేది. కానీ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టు పనులను వివిధ భాగాలుగా విభజించి ఈపీసీ పద్ధతిలో టెండర్లు పిలవడంతో పనులు శరవేగం అందుకున్నాయి. అయితే ఇంత భారీ ప్రాజెక్టును నిర్మించాలంటే అనేక రకాల అనుమతులు అవసరం. రాజశేఖరరెడ్డి హయాంలోనే దాదాపు అన్ని అనుమతులూ తెచ్చారు. 2005లో సైట్ క్లియరెన్సు అనుమతులను; రీలొకేషన్, రీహేబిలిటేషన్ అను మతులను 2007లో; వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఫారెస్ట్ క్లియ రెన్సులను 2008లో, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్‌ను 2009లో రాజశేఖర రెడ్డి తేగలిగారు. కేవలం ఐదేళ్ల కాలంలోనే పోలవరం కుడి, ఎడమ కాలువల నిర్మాణంలో సింహ భాగం పూర్తిచేయగలిగారు. అప్పట్లోనే పోలవరంను జాతీయ ప్రాజె క్టుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు. అయితే వైఎస్సార్ దివంగతులు అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ప్రాజెక్టు నత్తనడక నడిచింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సీఎం అయిన చంద్రబాబు చేపట్టిన అరకొర పనులు నష్టదాయకంగా తయారయ్యాయి. చంద్రబాబు హయాంలో స్పిల్ వే నిర్మాణం పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టడంవల్ల సమస్యలు తలెత్తాయి. ఎగువ కాఫర్ డ్యామ్ నది ఎడమ వైపున మొదలుపెట్టి కుడి వైపున ఖాళీ వదిలి పెట్టడం, దిగువ కాఫర్ డ్యామ్ నది కుడివైపున మొదలుపెట్టి ఎడమవైపున ఖాళీ వదిలిపెట్టడం వల్ల నది వరద కాలంలో నీరు ‘ఎస్’(ట) ఆకారంలో ప్రవహిస్తూ వంపులు తిరుగుతూ దిగువకు వెళ్ళ వలసి రావడం వల్ల ఆ ప్రవాహంలో కాఫర్ డ్యామ్‌ల వెంబడి సుడులు ఏర్పడి అప్పటి వరకు పాక్షికంగా çపూర్తయిన కాఫర్ డ్యామ్‌లు అనేక చోట్ల దెబ్బతిన్నాయి. ప్రచార యావతో చంద్రబాబు ప్రభుత్వం ‘గిన్నిస్’ రికార్డుల కోసం నాణ్యతా ప్రమాణాలను పణంగా పెట్టి... కేవలం 24 గంటల్లో సుమారు 33 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను స్పిల్ వే ఛానల్లో కుమ్మరించింది. అయినా పని పూర్తి చేయలేక పోయింది. ఈ నేపథ్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రిగా అధికారంలోకి వచ్చారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన ప్రాజెక్టును తాను త్వరితగతిన పూర్తి చేయాలనే తపనతో పోలవరం నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన చంద్రబాబు హయాంలో పిలిచిన టెండర్లను రద్దు చేసి, రివర్స్ టెండరింగ్ పద్ధతి ద్వారా టెండర్లు ఖరారు చేశారు. దీంతో సుమారు రూ. 800 కోట్లు పైగా నిధులు ఆదా అయ్యాయి. ఐతే దీనిపై ‘చంద్రబాబు టీమ్’ న్యాయస్థానాల్లో కేసులు వేయడంతో ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయి. వీటన్నిటినీ అధిగమిస్తూ ప్రాజెక్టును 2022 జులై కల్లా పూర్తి చేసి పొలాలకు నీరందించాలనే సంకల్పంతో జగన్ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించింది. ఇప్పటికే స్పిల్ వే పనులు పూర్తి చేయడం, 42 గేట్లను పూర్తిగా బిగించడం జరిగింది. మిగతా ఆరుగేట్లను కూడా ప్రస్తుతం బిగిస్తున్నారు. అప్రోచ్ పనులు, పైలెట్ ఛానల్స్ పనుల్లో సింహభాగం పూర్తి చేసి నది నీటిని స్పిల్ వే ద్వారా మళ్లించడం; ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేయడం, గ్యాప్–3 కాంక్రీట్ డ్యామ్‌ను పూర్తి చేయడం జరిగింది. అంతేగాక జల విద్యుత్ కేంద్రం పనులు వేగిరపరచడంతో పాటు, ఎడమ వైపున గ్యాప్–1 డ్యామ్‌కు అడుగున ‘సాయిల్ డెన్సిఫికేషన్ పనులు వేగంగా చేస్తున్నారు. దిగువ కాఫర్ డ్యామ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అయితే నదీ గర్భంలో సుమారు 310 అడుగుల లోతు వరకు చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని నిపుణులు గుర్తించారు. పరిస్థితిని క్షుణ్ణంగా బేరీజు వేసి, డీడీఆర్పీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప మెయిన్ డ్యామ్ (గ్యాప్–2) నిర్మాణం మొదలుపెట్టడానికి వీలు లేదు. అందు వల్ల పోలవరం ఈ ఏడాది అంటే 2022లో పూర్తి కావడం కష్ట సాధ్యంగా మారింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న ఈ జాప్యానికి పూర్తిగా చంద్రబాబే కారణమని ప్రత్యేకించి చెప్ప వలసిన పనిలేదు కదా! డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ వ్యాసకర్త జర్నలిస్ట్ ‘ మొబైల్: 98486 9337 -
ఒక సంకల్పం పుట్టిన రోజు
పధ్నాలుగేళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహింసా మార్గంలో పోరాడిన కేసీఆర్‌ను జనం అక్కున చేర్చుకుని ముఖ్యమంత్రిని చేశారు. అహరహం తెలం గాణ అభివృద్ధి కోసం ఆయన సీఎంగా శ్రమిస్తూ ఉన్నారు. జనగామ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు. మనందరం కలిసి పోరాడిన ఉద్యమ గెలుపు కథలను జనం మధ్యకు వెళ్లి విప్పారబోస్తున్నారు. ఆయన ఒక్క పిలుపునిస్తే అందరి ఇళ్లపై పోరు జెండాలు ఎగిరాయి. ఆయన ఒక్క నినాదమిస్తే ఆ«ధిపత్యం వణికిపోయింది. చెప్పిన మాటమీదనే, తాను పట్టిన పంతం మీదనే చివరిదాకా నిలిచాడు. తను పోరాడుతూ లక్ష్య సాధనవెంట నడిచే లక్షలాది యోధుల్ని నడిపించుకుంటూ ప్రపంచీకరణ కాలంలో అస్తిత్వ ఉద్యమాలకు పురుడు పోసి అస్తిత్వ ఉద్యమ పొద్దుపొడుపు అయ్యాడు కేసీఆర్. స్వరాష్ట్ర ఉద్యమాల అస్తిత్వ జెండా పట్టిన వాళ్లకు, రేపు జరుగ బోయే అస్తిత్వ సంఘర్షణల ఉద్యమాలకు మార్గ దర్శిగా నిలిచాడు. రాష్ట్రం సాధించాక తిరిగి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసమే పాలనా పగ్గాలు పట్టి ఈ మట్టిని ఒంటికి రాసుకుని వినమ్రంగా తెలంగాణ మళ్లకు నీళ్లు పడుతున్న రైతుకూలీ కేసీఆర్. పురుగుల మందులు తాగి పానాలు భూమితల్లి ఒడిలోనే వదులుతున్న వేలమంది పత్తిరైతుల మరణాలను చూసి దుఃఖించి, ఆ రైతుల కన్నీళ్లు తుడిచేందుకు కాళేశ్వరం ప్రాజెక్టునే కట్టి, మహానదినే తన రెండు చేతులతో ఎత్తి పోస్తు న్నాడు. తెలంగాణ హరితవిప్లవానికి ఒక కొత్త దారి చూపిన వ్యవసాయ పంచాంగం అతడు. తెలంగాణ వచ్చాక కూడా పత్తిచేలో పచ్చ పురుగులుంటాయని ఆయనకు తెలుసు. పంటను కాపాడటానికి ఆయన పచ్చపురుగుల్ని ఏరేస్తున్నాడు. ఈనేల అభివృద్ధికి ఈ పంటల చీడలేకుండా చేయటానికి మళ్లీ పరిశోధక విద్యార్థి అయి తపిస్తున్నాడు. చదవండి: (దేశానికి నూతన దిశ కేసీఆర్) ‘పల్లెప్రగతి’తో పల్లెలు ఎంత పరిమళిస్తున్నాయో ఊరూరా తిరిగి చూస్తూ పసిపిల్లగానిలా పరవ శిస్తున్నాడు. ‘పట్టణప్రగతి’తో నగరాల ముఖ చిత్రా లను మార్చుతూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు ఏ ఊరు చూసినా పచ్చగా ఉండాలే, ఏ టౌన్ కెళ్లినా సోబరుగా ఉండాలే. ప్రతి ఒక్కరీ కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలే. మన బడి బాగుపడాలే. బస్తీ దవాఖానాలు పేదలకు వైద్యం అందించాలే. చదువులు బాగుపడాలే. అందరి బతుకులు బాగు పడాలే... ఇదే అతడి తపన. అందుకే నిరంతరం శ్రమిస్తున్నాడు. నర్సాపూర్ అడవుల్లోకి పోయి మొక్కలు నాటి పర్యావరణానికి కాపలాదారునిగా కాపలా కాస్తున్నాడు. ఇంతగా ఈ నేల కోసం కృషి చేసిన అతడి కాలంలో ఉన్నాం. ఇపుడు తెలంగాణ 33 జిల్లాల సమాహారం. పాలన గడప గడపల దాకా పోవటానికి ఎంతో కృషిచేస్తున్నాడు. ‘పుట్టినరోజు పండుగే అందరికీ. మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి?’ అని ఒక తెలుగు సినీ కవి ప్రశ్నించాడు. ఇవాళ కేసీఆర్ పుట్టినరోజు. ఆయన ఎందుకు పుట్టాడో ఆయనకు బాగా తెలుసు. లేకపోతే కొన్ని దశాబ్దాల తెలంగాణ పోరాటంలో ఎందరో అసువులు బాసినా... ఫలితం దక్కని ఉద్యమాన్ని మళ్లీ భుజానికెత్తుకుని రాష్ట్రాన్ని సాధించేవాడా! తన కలకు మెరుగులు అద్ది ఒక మహా స్వప్నంగా మార్చి తెలంగాణ ప్రజల కళ్ళ ఎదుట ఆవిష్కరించిన ధన్యుడు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నా స్వప్నం’’ ఇదే ఇదే నా జెండా, ఎజెండా... అంటూ ఒక సుదీర్ఘ ఉద్యమ యాత్ర చేశాడు కేసీఆర్. ఇందుకోసమే ఎన్నో బాధలు పడ్డాడు. కష్టాలను ఎదుర్కొన్నాడు. అధికా రాలు, పదవులు గడ్డిపోచతో సమానమని అనేకసార్లు నిరూపించాడు. చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి లక్ష్యాన్ని సాధించాడు. ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మా ణంలో అలుపెరగక పోరాడుతున్నాడు. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు! జూలూరి గౌరీశంకర్ వ్యాసకర్త తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ -
కొత్త సంవత్సరంలో... జీఎస్టీ మోత
నిరుపేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై 2022, జనవరి 1 నుంచి కేంద్రం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో మోయ లేని భారం మోపనుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చేంత వరకు... చేనేత, జౌళి, పాదరక్షల రంగాలపై కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పన్నులు వేయలేదు. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని మొదట అమల్లోకి తీసుకొచ్చినప్పుడు 5 శాతం పన్ను మోపింది. దీన్ని జనవరి 1, 2022 నుంచి 12 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పన్నుల పెంపుదల వల్ల అసంఘటిత రంగంలోని చేనేత, జౌళి, పాదరక్షల ఉత్పత్తుల అమ్మకాలకు గడ్డు కాలం రానుంది. కంచి, బెనారస్, బెంగాల్, పోచంపల్లి, గద్వాల్, నారా యణపేట, వెంకటగిరి, ధర్మవరం లాంటి పట్టు, కాటన్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఇకపై ఆన్లైన్, ఈ–కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా పొందే సేవలపై కూడా జీఎస్టీ చెల్లించాల్సిందే. స్విగ్గీ, జొమోటో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా లాంటి వాటి ద్వారా పొందే సేవల పైనా; ట్రాన్స్‌పోర్టు రంగంలో ఉన్న ఓలా, ఊబెర్ సంస్థలు అందించే సేవల పైనా 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే. కరోనా వల్ల ఇప్పటికే కుదేలైన మోటారు రంగంపై ఈ భారం మోయలేనిది. ఒక పక్క గ్యాస్ ధరలు, మరోపక్క జీఎస్టీ పెంపుదలతో హోటల్ రంగానికి కూడా ఇకపై గడ్డుకాలమే. కరోనా వల్ల కుదేలైన పర్యాటక రంగానికి జీఎస్టీని పెంచడం చేదు వార్తే. జీఎస్టీ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం... పన్నుల పెంపు, హేతుబద్ధత, వ్యత్యాసాల తొలగింపు నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇకనుంచీ పన్నుల రీఫండ్ మార్పుల కోసం ఆధార్ అనుసంధానం తప్పనిసరి. వరసగా రెండు నెలలు జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే.. మూడో నెల బ్లాక్ లిస్ట్‌లో ఉంచుతారు. అంటే నవంబర్, డిసెంబర్ నెలల్లో జీఎస్టీ దాఖలు చేయకపోతే జనవరిలో బ్లాక్‌లిస్ట్‌లోకి వెళతారు. ఎలాంటి షోకాజ్ నోటీసు లేకుండా స్థిర, చర ఆస్తులు జప్తు చేసే అధికారం జీఎస్టీ కమిషనర్‌కు దఖలు పరిచారు. తనకు కావాల్సిన సమాచారం ఏ వ్యక్తి, సంస్థ నుంచైనా రాబట్టే అధికారం జీఎస్టీ కమిషనర్‌కు ఉంటుంది. ఈ జప్తుకు సంబంధించిన కారణాలు, పెనాల్టీలు ఏడు రోజుల్లో తెలియజేస్తారు. ఇకపై పెనాల్టీలు, ఇతర అభ్యంత రాలు కోర్టులు, ట్రిబ్యునల్‌లలో దావా దాఖలుకు 25 శాతం పెనాల్టీ పన్ను లేదా క్లయిం విలువను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా తుది సప్లయ ర్కు జీఎస్టీ ఇన్వాయిస్ను, డెబిట్ నోటు విధిగా మొదటి సరఫరా దారు తెలియపర్చాల్సి ఉంటుంది. ఈ మార్పులతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఉత్పత్తి, వ్యాపార సంస్థలను జీఎస్టీ 12 శాతం శ్లాబులోకి; కేంద్ర పరోక్ష పన్నుల, సుంకాల పరిధిలోకి పూర్తిగా తీసుకురావడం కేంద్ర ఉద్దేశం. పొనకా జనార్దన్‌రెడ్డి వ్యాసకర్త ఏపీ హైకోర్టు న్యాయవాది, తాడేపల్లి మొబైల్: 83094 09689 -
అఫ్గాన్ పరిణామాలు మళ్లీ కశ్మీర్ మెడకేనా?
భౌగోళిక స్వరూపం, భిన్న తెగల సమ్మేళనం, కిరాయి సేనలతో యుద్ధాన్ని వృత్తిగా స్వీకరించిన స్థానిక ప్రభువుల ఉనికి అఫ్గానిస్తాన్‌కు ప్రత్యేకం. ఇవే ఆ చిన్న దేశాన్ని ఇస్లామిక్ ఉగ్రవాద ప్రయోగశాలగా మార్చాయి. అఫ్గాన్‌పై నాటి సోవియెట్ రష్యా దురాక్రమణ అనేక ఉగ్రవాద సంస్థలకు బీజాలు వేసింది. అవే అమెరికా దాడి, నిష్క్రమణ కాలాలకి శాఖోపశాఖలుగా విస్తరించాయి. అఫ్గాన్ వర్తమాన సంక్షోభం వీటికి పరాకాష్ట. ఒక సమస్యగా ఇది ఆసియా స్థాయిని దాటిపోయిందని ప్రపంచ దేశాలు భయపడుతుంటే, పాకిస్తాన్ అక్కడి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల ఏకీకరణను తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉంది. తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్, ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఉబ్జెకిస్తాన్, ఈస్ట్రన్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ వంటి సంస్థలు కూడా అక్కడ పనిచేస్తున్నాయి. ఈ అవాంఛనీయ ఏకీకరణతో అయినా కశ్మీర్ సాధించుకోవాలని పాక్ తలపెటిన పథకం వెల్లడైంది. తాలిబన్ ముట్టడి తరువాత ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ నాయకురాలు నీలమ్ ఇర్షాద్ షేక్ ఒక టీవీ చానల్లో ‘పాకిస్తాన్ సైన్యానికీ, తాలిబన్‌కీ మధ్య అవినాభావ సంబంధాలు ఉన్నాయి. కశ్మీర్‌ను సాధించడంలో తాలిబన్లు మాకు తోడ్పడతారు.’ అని చెప్పారు. తాలిబన్ నేత బరాదర్ కాందహార్ వచ్చిన తరువాత ఐఎస్ఐ ప్రస్తుత అధిపతి ఫైజ్ హమీద్, పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ రహస్యంగా వెళ్లి అతడికి అభినందనలు తెలిపి వచ్చిన సంగతి కూడా బయటపడింది. అమెరికా మీద విజయం సాధించాం కాబట్టి జిహాద్‌ను విస్తరించి, ఇరాక్, సిరియా, జోర్డాన్, లెబనాన్, లిబియా, మొరాకో, అల్జీరియా, మారిటానియా, ట్యునీసియా, సోమాలియా, యెమెన్ల ‘విముక్తి’కి తరువాత ప్రాధాన్యం ఇవ్వాలంటూ పిలుపునిచ్చిన అల్‌కాయిదాకు, దాని అనుచర తాలిబన్‌కు పాకిస్తాన్ బహిరంగంగా ఇస్తున్న మద్దతు ఇది. జిహాద్‌తో ‘విముక్తం’ చేయవలసిన ప్రాంతాలలో కశ్మీర్ కూడా ఉంది. తాలిబన్ ఆధిపత్యంలోకి వచ్చిన అఫ్గాన్‌లో హక్కాని నెట్వర్క్ కమాండర్లు కీలక బాధ్యతలు చేపట్టారు. హక్కాని నాయకుడు ఖలీల్ ఉల్ రెహమాన్ హక్కాని కాబూల్ కొత్త సెక్యూరిటీ చీఫ్ అయ్యాడు. హక్కాని నెట్వర్క్ వ్యవస్థాపకుని కొడుకు జలాలుద్దీన్ హక్కానికి తాలిబన్ దళాలకు ఆయుధాలు, మందుగుండు సరఫరా చేసే బాధ్యత ఇచ్చారు. దీనితో తాను నిర్ణాయక శక్తిగా అవతరించవచ్చునని పాకిస్తాన్ నమ్ముతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఎలాంటి మాటలు చెప్పినా, అల్‌కాయిదా సహా, ఆ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతున్న ఏ ఒక్క సంస్థనీ, ప్రస్తుత పరిస్థితిలో తాలిబన్లు దూరం చేసుకునే స్థితిలో లేరు. పాక్‌లో తర్ఫీదు పొందిన ఉగ్రవాదులను తాలిబన్‌తో కలసి పనిచేయడానికి ఈ తాజా సంక్షోభంలోనూ ఐఎస్ఐ పంపించింది. అందుకే పదిరోజులలోనే 70,000 నుంచి 1,10,000కు అక్కడి ఉగ్రవాదులు పెరిగినట్టు అంచనా. హక్కాని, తాలిబన్లు 1980 నుంచి పాకిస్తాన్‌తో, ఐఎస్ఐతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నారు. తాలిబన్‌ను అదుపులో ఉంచుకోవడానికి పాకిస్తాన్‌కు హక్కాని అవసరం ఉంది. పైగా ఇది భారత వ్యతిరేక సంస్థ. కొన్ని అంతర్జాతీయ నిఘా సంస్థల అంచనా ప్రకారం 1,500 నుంచి 2,000 వరకు లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాదులు, దాదాపు 2,500 మంది జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాదులు తాలి బన్లతో కలసి ఇంతకాలం జిహాద్లో శ్రమించారు. నేడు వారే ఆక్రమిత కశ్మీర్‌లోని వాళ్ల శిక్షణ సంస్థలకి చేరుకుంటున్నారు. ఇది కశ్మీర్‌కు సరికొత్త బెడద. ఇప్పుడు ఐసిస్ (ఖొరాసన్) పేరు తెర మీదకు రావడం కూడా కొత్త ప్రశ్నలకు తావిచ్చేదే. దాదాపు 170 మందిని బలి తీసుకున్న కాబూల్ విమానాశ్రయం బాంబుదాడి (ఆగస్ట్ 26) వీళ్ల పనే. 2015 జనవరిలో అఫ్గాన్‌లో ఐఎస్ స్థాపించుకున్న అనుబంధ సంస్థ ఇస్లామిక్‌స్టేట్ ఖొరసాన్ ప్రావిన్స్. ఇదే ఐఎస్ఐఎస్ కె. ఇందులో ఎక్కువ మంది ఒకనాటి తెహ్రీక్ ఇ తాలిబన్ సంస్థ సభ్యులే. ఇస్లామిక్ సిద్ధాంతాల అమలు పట్ల నేతలు ఏమాత్రం మెతక వైఖరి చూపినా చాలామంది తాలిబన్ ఐసిస్కెలోకి ఫిరాయిస్తారని వినికిడి. అఫ్గాన్‌లో తాలిబన్ పైచేయి కావడంతోనే అసలు పని మొదలైం దని పాక్ భావిస్తున్నది. ఆ వార్త తెలియగానే ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అజహర్ అనే పాక్ ఉగ్రవాద నేత వెళ్లి తాలిబన్ ప్రముఖులు ముల్లా బరాదర్, ముల్లా యాకూబ్‌లను కాందహార్‌లో కలుసుకున్నాడు. మేం చేసిన సాయానికి మీరు కూడా ప్రత్యుపకారం చేసే సమయం వచ్చేసిందని గుర్తు చేయడానికే రవూఫ్ అజహర్ వెళ్లాడని విశ్లేషకుల అంచనా. తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ ఆగస్ట్ 16న ‘మంజిల్ కి తరఫ్’ అని పోస్ట్ పెట్టాడట. దానర్థం ‘గమ్యం వైపు’. అంటే అఫ్గాన్‌తో వారి లక్ష్యం పూర్తి కాలేదా? మరి లక్ష్యం ఏమిటి? అల్‌కాయిదా జిహాద్‌తో విముక్తం కావలసిన దేశాల జాబితాలోనే దీనికి జవాబు ఉంది. కాబట్టి అఫ్గాన్ మతోన్మాదశక్తుల ఏకీకరణ నుంచి పాక్ కోరుకునే లబ్ధి అంతా కశ్మీర్ సాధనకేనని అనుకోవచ్చు. డాక్టర్ గోపరాజు నారాయణరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు ‘ మొబైల్ : 98493 25634 -
రాజకీయ క్షేత్రంలో ఒక కేసరి
ఒక నాయకుడికి ఎన్నో గొప్ప లక్షణాలు ఉండొచ్చు. కానీ ధైర్యం అనేమాటకు సమానార్థకంగా నిలిచిన నాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులు. బ్రిటిష్ తుపాకీకి ఎదురొడ్డి, చొక్కా విప్పి ఛాతీని చూపిస్తూ, దమ్ముంటే కాల్చమని ఆయన సవాల్ విసిరిన తీరు స్వాతంత్య్ర పోరాటంలో ఒక ఉత్తేజకర ఘట్టం. ప్రజలంటే నేనే, నేనంటేనే ప్రజ అనగలిగిన అతిశయం; తన మాటనే శాసనంగా చలాయించుకోగల అధికార దర్పం ఆయనకే చెల్లాయి. ప్రజల పట్ల ఉన్న షరతులు లేని మమకారమే దానికి కారణం అయ్యుండాలి. ఆంధ్రకేసరి అనేది కేవలం బిరుదనామం కాదు. ప్రజాక్షేత్రంలో సింహంలానే బతికారు. 150వ జయంతి వేడుకల సందర్భంగా ప్రకాశం పంతులుకు భారతరత్న ప్రకటించడమే ఆయనకు ఇవ్వగలిగే సరైన నివాళి. స్వతంత్య్ర భారతావనికి 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభవేళ ఇది. ఈ వేడుకలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆజాదీ కా అమృత్‌మహోత్సవ్’ 75 వారాల పాటు జరుపు కోవాలని శ్రీకారం చుట్టారు. ఈ వేడుకలు ముఖ్యంగా అటు పాలకులు, ఇటు పాలితులు మన గొప్ప దేశ భక్తుల జీవితాలను, వారి త్యాగాలను, ధైర్య సాహసాలను, వారి అకుంఠిత దేశభక్తిని స్మరించుకొని ఆచరణలో పెట్టడానికి, వారిలో ఉత్తేజాన్ని నింపడానికి తలపెట్టినవి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈ మహోత్సవ్‌ని స్వర్గీయ పింగళి వెంకయ్య గడప నుండి శ్రీకారం చుట్టడం హర్షణీయం. ప్రజా అంటే నేనే స్వాతంత్య్ర పోరాటంలో దక్షిణాన బ్రిటిష్సామ్రాజ్యాన్ని ధైర్య సాహసాలతో ఎదురించి గడగడలాడించిన సాహసి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. అర్ధ శతాబ్దికి పైగా రాజకీయ, ప్రజా హిత జీవిత రంగంలో ఆయన ఆశాకిరణమై నిలిచారు. దక్షణాన యావత్ ప్రజానీకంతో ప్రకాశం గారికున్న చనువు, చొరవ మరి ఏ నాయకుడికీ లేదు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులలో నైనా సరే ప్రజల పక్షాన నిలిచాడు. ఆజన్మాంతం ప్రజా అంటే నేనేరా! నేనంటేనే ప్రజరా! అని నిష్కల్మషంగా అనేవారు. అనేక సందర్భాలలో అది రుజువు చేశారు కూడా. 1928లో మద్రాస్ పట్టణంలో సైమన్‌కు వ్యతిరేకంగా ‘సైమన్ గోబ్యాక్’ హర్తాళ్‌కు భయపడి అందరు అగ్ర నేతలు పట్టణం వదిలిపోయారు. ప్రకాశం ఒక్కడే స్వయంగా నిలబడి హర్తాళ్ జరిపారు. లక్షలమంది పాల్గొన్న ఆ ఉద్యమంలో బ్రిటిష్ తుపాకీకి ఒక యువకుడు బలి అయి రోడ్డు మీద పడిపోయాడు. ప్రకాశం పంతులు ఆవేశంతో ముందుకు దూకాడు. బ్రిటిష్తుపాకీకి తన గుండెను చూపించి ‘‘కాల్చుకోండిరా!’’ అని ఎదిరించిన ధీశాలి. ఆనాటి నుంచే ఆయన ఆంధ్రకేసరిగా ప్రసిద్ధులైనారు. ప్రకాశం గారు నిర్వహించిన ఆ హర్తాళ్ దేశానికే తలమానికైంది. మదరాస్ రాకుమారుడు పదవిలో ఉన్నా లేకున్నా ప్రజాసంక్షేమమే ఊపిరిగా జీవించారు. కొన్ని సందర్భాలలో పదవులను తృణపాయంగా వదిలిపెట్టారు. లండన్‌లో బారిష్టర్ చదువుతున్న రోజులలో సిగార్ తాగి చిన్న ఉపన్యాస మివ్వమని చెప్తే, తల్లికిచ్చిన మాట కోసం తాను ఆ పని చేయనని నిశ్చయంగా చెప్పి కాలేజీలో చరిత్ర సృష్టించారు. రాజ మండ్రిలో, కాకినాడలో చదువుకుంటున్న రోజులలో నాటకాలు వేసేవారు. ప్రకాశం నటనా ప్రావీణ్యం చూసి ఆంగ్లబృందం ‘స్టార్ ఆఫ్ ద స్టేజ్’ బిరుదును ఇచ్చారు. వీధి తగాదాలలో పెద్ద పెద్ద రౌడీలను కూడా గడగడలాడించాడు. మద్రాసులో న్యాయవాదిగా పని చేస్తున్నప్పుడు జడ్జీలు సైతం అపసవ్యంగా, అగౌరవంగా వ్యవహరిస్తుంటే ఎదురుతిరిగి సన్మార్గంలో పెట్టేవారు. ఆ రోజులలో రోజుకి 1000 రూపాయల దాకా ఫీజు వసూలు చేసేవారు. ఆనాటికి అది చాలా పెద్ద మొత్తం. అంత ఫీజు తీసుకోవడం తెలుగు లాయర్లు ఎవ్వరు ఎరుగరు. అందుకే ఆయనను (ప్రిన్స్ ఆఫ్మద్రాస్) ‘మదరాస్ రాకుమారుడు’ అని పిలిచేవారు. బీదరికం నుంచి సంపదలోకి... కడు బీద కుటుంబంలో 1872 ఆగస్టు 23న ఒంగోలులోని మారుమూల గ్రామం వినోదరాయుడు పాలెంలో పుట్టారు ప్రకాశం. పట్టుదలతో, నిర్భీతితో, నిరంతర కృషితో బారిస్టరై లక్షలకు లక్షలు సంపాదించారు. తోటలు, భూములు, భవనాలు, ఆభరణాలు కొన్నారు. భోగభాగ్యాలను అనుభవించారు. గాంధీగారి పిలుపు మేరకు అంత సంపాదననూ వదిలి, దేశ దాస్య విమోచనకై త్రికరణ శుద్ధిగా ప్రజాసేవలో దూకిన మొట్టమొదటి తెలుగు లాయర్‌ఆయనే. వృత్తిని వదిలేసే ఒకరోజు ముందు తన క్లయింట్ దగ్గర తీసుకున్న ఫీజును తిరిగి ఇచ్చివేశారు. మాటే శాసనం ఉమ్మడి మద్రాసులో ప్రకాశం పంతులు మంత్రిగా ఉండగా తాను తలపెట్టిన ఒక సంక్షేమ పథకానికి ఒక అధికారి దానికి జీవో తీయాలి, సమయం సందర్భం రావాలి అని అడ్డుపడితే ‘నామాటే ఒక జీవో. తక్షణమే అమలు చేయండి రా!’ అనే ధీమా, దమ్మూ కల జననేత. తాను మంత్రి పదవికి రాజీనామా ఇవ్వాల్సి వస్తే, కార్మికుల, ఉద్యమ కారులతో చర్చలు జరిపి ఒప్పించిన తరువాత సంతకం చేసిన మనిషాయన. సాహసమే ఊపిరి ప్రజల క్షేమం కోసం, వారి సుఖ శాంతుల కోసం పరితపించే వారు. మన రాష్ట్రాలలోనే కాక ఎక్కడ కల్లోలాలు జరిగితే అక్కడ ప్రత్యక్షమయ్యేవారు. రజాకార్ల దమనకాండను సహించలేక వారిని హెచ్చరించి ప్రజలకు ధైర్యాన్ని నింపి వచ్చారు. కేరళలో మతకల్లోలాలు జరుగుతుండగా ‘కనపడితే కాల్చు’ ఆదేశాలున్నప్పటికీ అక్కడికి వెళ్లారు. అక్కడి ప్రజలు విస్తుపోయి ఒక రాత్రంతా పంతులుగారిని కాపాడి రహస్యంగా బయటకు తీసుకుని వచ్చారు. కొట్లాటలు చంపు కోడాలు ఆగిపోయినాయి. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఒక ఏడాదిపాటు ఉన్నా దశాబ్ది కాలం పట్టే ప్రజారంజక పథకాలను అమలు చేశారు. కృష్ణా బ్యారేజ్, గుంటూరులో హైకోర్టు స్థాపన, వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుమల దేవస్థానాభివృద్ధి, దానికి గానూ ఆర్థిక సహాయం, పన్ను ఎత్తివేత కొన్ని మచ్చుతునకలు. రాష్ట్ర అవతరణ సందర్భంగా అమలుపర్చిన 2,000 మంది ఖైదీల విమోచన పథకం వంటిది దేశం మొత్తంలో ఎక్కడా జరగలేదని నెహ్రూ కితాబు ఇచ్చారు. తాను మంత్రిగా ఉండగా చేనేత పరిశ్రమ అభివృద్ధి పథకంలో భాగంగా స్పిన్నింగ్స్మిల్లులను కేంద్రానికి తిప్పి పంపిన పదహారణాల గాంధేయవాధి. మహాత్ముడు ప్రవేశపెట్టిన ఉప్పు సత్యాగ్రహాన్ని కాంగ్రెస్‌లోని మహామహులే వ్యతిరేకిస్తే ప్రకాశం పంతులు సెంట్రల్ అసెంబ్లీకి రాజీనామా ఇచ్చి నేరుగా ఎకాఎకిగా సత్యాగ్రహ శిబిరానికి వెళ్లిన నాయకుడాయన. ఒక అధికారి బాపూజీతో, ప్రకాశం పథకాలను కేంద్రంలో నెహ్రూతో అమలు చేయించమని అడిగితే బాపూ చిరునవ్వు నవ్వి ‘‘అది కేసరులకే సాధ్యం, పండితులకు కాదు’’ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత సద్భావనా యాత్ర చేస్తుండగా వడదెబ్బ తగిలిన ప్రకాశం పంతులు 1957 మే 20న హైదరాబాద్‌లో అనంతజ్యోతిలో కలిసిపోయారు. జీవితాంతం పల్లెలు, గ్రామాలు, మారుమూల తండాలు సైతం అలుపెరుగక తిరిగిన ప్రజల మనిషి. గ్రామాల అభివృద్ధి కోసం పరితపించిన ఆంధ్రకేసరి జన్మదినాన్ని ‘‘గ్రామ స్వరాజ్య దినోత్సవం’’గా ప్రకటించి, ‘భారతరత్న’ బిరుదును ప్రదానం చేయడం దేశం వారికి ఇచ్చే నిజమైన నివాళి అవుతుంది. - టంగుటూరి శ్రీరాం వ్యాసకర్త ప్రధాన కార్యదర్శి, ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ. మొబైల్: 99514 17344 (టంగుటూరి ప్రకాశం 150వ జయంతి వేడుకల సందర్భంగా) -
సీమ నేలను కథగా చూపినవాడు
కేతు విశ్వనాథ రెడ్డికి 80 ఏళ్లు. తెలుగు కథా సాహిత్యంలో భీష్మ పితామహుడి వంటి ఆయనకు ఇప్పుడు సాహిత్య జీవన సాఫల్య పురస్కారం ఇవ్వడం విశేషం కాదు. కాని ఆయనను సత్కరించుకోకుండా ఎవరిని సత్కరించుకోగలం? తెలుగు కథను, రాయలసీమ కథను సగర్వంగా, సమున్నతంగా గౌరవించుకోవాలని అనుకున్న ప్రతిసారీ ఆ పూలహారం వెళ్లి పడేది కేతు విశ్వనాథరెడ్డి మెడలోనే. సీమ కథకు చేవ ఆయనది. చేర్పు ఆయనది. నేల మీద గట్టిగా నిలబడి చెప్పిన సాహిత్యమంతా నిలిచింది. కేతు విశ్వనాథరెడ్డి తన చూపును నేలన గుచ్చి కథలు రాశారు. నేల మీద తిరుగాడే మట్టి పాదాలు, రైతు పాదాలు, స్త్రీల పాదాలు, తెలియకనే బానిసలుగా బతుకుతున్నవారి పాదాలు... ఇవి ఆయన కథా వస్తువులు. రాయలసీమ కథలో మధురాంతకం రాజారాం గారిది ఒక కథాధోరణి అయితే కేతు విశ్వనాథ రెడ్డిది మరో కథాధోరణి. మధురాంతకం రాజారాం పాఠకుణ్ణి ఒప్పించడం కూడా అవసరమే అనుకుంటారు. కేతు విశ్వనాథ రెడ్డి ‘నేను జీవితాన్ని చూపుతాను... చూడగలిగిన వారంతా చూడండి’ అని ములాజా లేని ధోరణి పాటించారు. కఠిన సత్యాలను, నిష్టూర సత్యాలను సీమ ప్రజల తరఫున పాఠకుల ముందు పెట్టారు. రైతుకు, నేలకు ముడి తెగితే ఆ రైతు ఎలా గాలికి కొట్టుకుపోయి పతనమవుతాడో కేతు తన ‘నమ్ముకున్న నేల’ కథలో చూపుతారు. ఆ కథ రాసే సమయానికీ ఇప్పటికీ పరిస్థితి మారి ఉండొచ్చు. కాని ఆ సమయంలో ఆ కథ మొత్తం రాయలసీమ నేల పెట్టిన వెర్రికేక. కరువు నేలలో మనిషిలో జడలు విప్పే స్వార్థం పశుస్థాయి కన్నా ఘోరమైనది అని ‘గడ్డి’ కథలో ఆయన చూపుతారు. ప్రజలకు అందాల్సిన ఫలాలు ప్రజల వరకూ చేరడం లో, ఆఖరుకు గడ్డి పంపకంలో కూడా భాగాలుంటాయని కేతు చెప్తే పాఠకునికి కడుపు తరుక్కుపోతుంది. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలపై కేతు నిశితమైన వ్యాఖ్యానం వంటి కథలు రాశారు. ‘కూలిన బురుజు’ అందువల్లే గొప్ప కథగా నిలిచిపోయింది. ఆ కథలో ఒక డాక్టరు చేత ‘జబ్బు ఉంది అని కనిపెట్టడం గొప్ప కాదు. ఆ జబ్బుకు మందు కనిపెట్టడం గొప్ప’ అనిపిస్తారు. ఆ కథలో చాలా రోజుల తర్వాత తన ఊరికి వచ్చిన డాక్టరు పాత్ర ఊరిని చూసి దిగ్భ్రమ చెందుతుంది. ఊళ్లో ఎక్కడ చూడు కొట్లాటలూ కార్పణ్యాలే. తలాన్ని మార్చి చూస్తే సమస్య సరిగ్గా అర్థమవుతుంది. ఊరిలో ఉన్న వాళ్లకు తాము అలా ఎందుకున్నామో తెలియదు. ఊరు వదిలి వెళ్లిన డాక్టరుకు అర్థమవుతుంది. మగవాళ్ల పంతాలలో నలిగిపోయే స్త్రీలను ఈ కథలో కేతు గొప్పగా చూపుతారు. కేతు విశ్వనాథరెడ్డి రాయలసీమలోని ఆత్మీయ జీవనాన్ని మతాల మధ్య ఉండే సహనపూర్వకమైన జీవనాన్ని కథల్లో చూపారు. ‘పీర్లసావిడి’, ‘అమ్మవారి నవ్వు’ ఆ విషయాన్ని నిరూపిస్తాయి. ఆయన స్త్రీవాద దష్టితో రాసిన కథలూ విలువైనవి. స్త్రీలు చదువులో, ఉపాధిలో వివక్ష అవసరంలేని, లైంగిక వేధింపులకు తావు లేని జీవనం పొందాలని బలంగా కోరుకున్నారు. ‘రెక్కలు’ కథ అందుకు ఉదాహరణ. ‘సతి’, ‘ఇచ్ఛాగ్ని’... ఆ వరుసలో ఎన్నో. రాయలసీమ వాసికి వాన ఎంత ముఖ్యమో వాన కోసం ఎన్ని అగచాట్లు పడతాడో ‘వాన కురిస్తే’ కథలో దుఃఖం కలిగేలా చెబుతాడాయన. కేతు విశ్వనాథ రెడ్డి కేవలం కథకుడు కావడం వల్ల మాత్రమే తన సాహితీ జీవనాన్ని సాఫల్యం చేసుకోలేదు. అరసంలో పని చేశారు. కొ.కు. సంపుటాలకు సంపాదకత్వం వహించారు. వత్తి రీత్యా అధ్యాపకుడైనందున కథకునిగా కూడా శిష్యులను ప్రశిష్యులను తయారు చేశారు. కేతు ప్రోత్సాహంతో కథా సాహిత్యంలో కషి చేసిన, చేస్తున్న మేలిమి కథకులు ఇవాళ ఉన్నారు. హైదరాబాద్‌లో సుదీర్ఘకాలం నివసించి, తన నేల– కడపలో విశ్రాంత జీవనం గడుపుతున్న కేతు విశ్వనాథ రెడ్డి కథాలోకానికి ఒక పెద్ద దిక్కు. నేడు ఆయనకు జరుగుతున్న సత్కారం తెలుగు కథకు జరుగుతున్న సత్కారం. ఆ సభకు ఆయన కథలూ బారులు తీరుతాయేమో. పాఠకులమైన మనం ఆ సమూహంలో మెడ నిక్కించకుండా ఎలా ఉండగలం? కేతుగారికి హదయపూర్వక శుభాకాంక్షలు. డాక్టర్ తుమ్మల రామకృష్ణ వ్యాసకర్త, వైస్ చాన్సలర్, కుప్పం యూనివర్సిటీ (కేతు విశ్వనాథరెడ్డికి నేడు అనంతపురంలో ‘విమల సాహిత్య జీవిత పురస్కారం’ బహూకరిస్తున్న సందర్భంగా...) -
మా బడిని... మాకిచ్చేయండి!
కరోనా వైరస్ అత్యంత దారుణంగా మానవాళిని బలిగొంటున్న దరిమిలా గత పద హారు నెలలుగా విద్యా సంస్థలన్నీ మూతబడ్డ విషయం తెలిసిందే. శాస్త్ర సాంకేతిక విప్లవం అందించిన మాధ్య మాల సహకారంతో విద్యా కార్యక్రమాలన్నీ ఆన్‌లైన్‌లోకి మారాయి. జూమ్, గూగూల్ మీట్, ఫేస్బుక్, యుడెమీ, స్కిల్ షేర్, కోర్సియా, ఎడెక్స్, ఎడ్ యాప్ వంటి వర్చువల్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు గిరాకీ పెరిగింది. కోవిడ్ నిబంధనల్ని కొంత సడలించి గత జనవరి, ఫిబ్రవరి మాసాల్లో స్కూళ్లు, కాలేజీలు తెరచినప్పటికీ, సెకండ్ వేవ్ ఉధృతితో విద్యా సంస్థలకు మళ్లీ తాళాలు పడ్డాయి. కరోనా కారణంగా విద్యార్థుల మేధోభివృద్ధి చెప్ప లేనంతగా కుంటుబడింది. విద్యాలయంతో తమ రోజువారీ భూభౌతిక సంబంధం, ప్రాకృతిక అను భవం స్తంభించిపోవడం మూలాన ఇటు విద్యార్థు ల్లోనూ, అటు ఉపాధ్యాయుల్లోనూ నిరాశ నిస్తేజాలు అలుముకున్నాయి. ఇవాళ దేశంలోని ముప్పై మూడు కోట్లమంది విద్యార్థులు తమ చదువుల్ని తమకివ్వ మని ముక్తకంఠంతో పెద్దల సమాజానికి, ప్రభుత్వా లకు నివేదించుకుంటున్నారు. ఇంట్లో నాలుగ్గోడలకే పరిమితమై పోవటాన పిల్లల సామాజిక ఎదుగుద లకు పెను ఆటంకం ఏర్పడింది. ఈ మొత్తం ఎపి సోడ్‌లో ఆన్లైన్ టీచింగ్ ఉత్త బోన్సాయ్ పెంపకం అని రూఢి అయ్యింది. కరోనా కష్టకాలంలో ఆన్లైన్ తరగ తులు, ఇ–లెర్నింగ్ మేలిమి ప్రత్యామ్నాయాలుగా కని పిస్తున్నప్పటికీ, వాటి వ్యవస్థీకృత లోపాల పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఏ రంగం దెబ్బతిన్నా తిరిగి దానికి ఉద్దీపన ఇవ్వవచ్చు, కానీ విద్యావ్యవస్థలో అట్లా కుదరదు. ఇది కాల సంబంధి, వయో సంబంధి. బాలలు పెరుగు తున్న క్రమంలో విద్య అందకపోతే జ్ఞానశూన్యులుగా మిగిలిపోయి ‘ఖాళీ మెదళ్ల తరం’ ఏర్పడుతుంది. ఇది ఆ సమాజానికి ఎంతో నష్టదాయకం. ప్రస్తుత నయా ఉదారవాద పెట్టుబడిస్వామ్యంలో విద్య ఇంతకు ముందరికంటే ఒక అనివార్యమైన అవసరమైంది. ఇప్పటికీ మనలో కొద్దిమందికి మాత్రమే చదువులు ఉత్తమంగా అందడం, మిగతా వారికి అంతంత మాత్రంగా కూడా అందుబాటులో లేకపోవడం ఒక సాంఘిక విషాదం. ఈ విషాదాన్ని ఆన్లైన్ విద్యా కార్యక్రమం సైతం అధిగమించలేకపోగా మరింత రాజేసింది. నగరాల్లో, పట్టణాల్లోలాగా ఇంటర్నెట్ సౌకర్యం గ్రామాలకు, మారుమూల ఆవాసాలకు విస్త రించకపోవడం, తగినంత సామర్థ్యం గల స్మార్ట్ఫోన్ల కొనుగోలుశక్తి పేదలకు లేకపోవడంతో పాటు గృహ వాతావరణంలోని అనేక అస్తవ్యస్తతలు పిల్లల చదు వుల మీద ఎనలేని ప్రభావాన్ని చూపుతున్నాయి. మనది విద్యార్థి కేంద్రక విధానం అని గొప్పలు చెప్పుకుంటున్న సందర్భంలో విద్యార్థి కేంద్రక విధాన లక్ష్యాలైన నమ్రత, సుగమతలకు దరిదాపుల్లో కూడా ఆన్లైన్ టీచింగ్, లెర్నింగ్ లేకపోవడం దాని ప్రధాన లోపం. ముఖ్యంగా పాఠశాల నుండి విద్యార్థులకు అబ్బే అభివ్యక్తీరణ, నాయకత్వ సామర్థ్యం, జట్టుగా పనిచేయడం లాంటివాటిని ఆన్లైన్ తరగతులు దెబ్బ తీశాయి. సోషల్ ఇంటలిజెన్స్, ఎమోషనల్ ఇంటలి జెన్స్, ఎథికల్ ఇంటలిజెన్స్ వాళ్లకు అందకుండా పోయింది. విద్యార్థులు వాళ్లుగా రూపొందించుకునే వ్యక్తిత్వ నిర్మాణానికి క్యాంటీన్, కారిడార్, ప్లేగ్రౌండ్ జ్ఞాపకాలు ఎంతగానో దోహదం పడతాయి. వీటన్ని టినీ కోవిడ్ హరించింది. విద్యార్థికి తన అభ్యసన జీవితంలో తన సహపాఠులతో ఏర్పడే స్నేహ సంబంధం చాలా ఉదాత్తమైంది. ‘ఇతరుల నుండి ప్రత్యక్షంగా నేర్చుకునేదే విద్యార్జనలో ఎక్కువ’ అంటాడు సుప్రసిద్ధ విద్యా తత్త్వవేత్త జాన్ డ్యూయీ. ఇందుకు ఏ రకమైన టెక్నికల్ కాన్ఫరెన్సింగ్ ప్రోగ్రాం లోనూ అవకాశం ఉండదు. అందుకే కంప్యూటర్లకు, మొబైళ్లకు పిల్లలు టాటా చెప్తూ తోట లాంటి, పాట లాంటి, మంచి మాట లాంటి ‘మా బడిని మాకు ఇవ్వండి’ అని ప్రాధేయపడుతున్నారు. సమయానికి అందాల్సిన పోషకాహారం లాంటి చదువు సంధ్యలు అందినపుడే వాళ్లు ప్రపుల్లం కాగలరు. డా. బెల్లి యాదయ్య వ్యాసకర్త ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామన్నపేట, యాదాద్రి భువనగిరి జిల్లా ‘ మొబైల్ : 98483 92690 -
మరొక ‘హిరోషిమా’ వద్దే వద్దు
హిరోషిమా నగరంపై అమెరికన్లు అణుబాంబు వేసిన రోజు 1945 ఆగస్టు 6. అది ప్రపంచ మానవ చరిత్రలో కారుచీకటి రోజు. ఘటన జరిగి ఆగస్టు 6వ తేదీనాటికి సరిగ్గా 76 ఏళ్లయింది. బాంబు వేసిన వెంటనే 70 వేలమంది చనిపోగా తర్వాత రోజుల్లో ధార్మికకిరణాల దుష్ప్రభావంతో 2 లక్షలకు పైగా ప్రజలు చనిపోయారు. 4,400 కిలోల ఈ అణ్వస్త్రం ‘లిటిల్‌బోయ్’లో 64 కిలోల యురేనియం వాడారు. ఆగస్టు 9న ‘ఫ్యాట్‌బోయ్’ను నాగసాకిలో ప్రయోగిం చారు. అక్కడికక్కడే 80 వేల వరకు సామాన్యులు చని పోయారు. 6.2 కిలోల ఫ్లుటోనియంతో ఈ బాంబును ప్రయోగించారు. ఆగస్టు 12న జపాన్ లొంగిపోయినట్లుగా ప్రకటించింది. యుద్ధానంతరం 1945 జూలై 17న విధివిధానాలు నిర్ణయించడానికి సోవియట్ యూనియన్, అమెరికా, ఇంగ్లండ్ అధినేతలు స్టాలిన్, ట్రూమెన్, చర్చిల్లు జర్మనీ పోట్స్‌డామ్‌లో సమావేశమై ఆగస్టు 2 వరకూ చర్చలు జరిపారు. జూలై 28న ఇంగ్లండ్ ప్రధాని హోదాలో అట్లీ బాధ్యతలు తీసుకున్నారు. సమావేశం జరుగుతున్న సమయంలోనే జూలై 18న రహస్యంగా అమెరికాలోని న్యూ మెక్సికోసిటీ ఎడారిలో అణుబాంబును విజయవంతంగా పరీక్షించారు. ఆ తర్వాత ట్రూమెన్ వద్దకు వచ్చిన అధికారులు ‘కవలపిల్లలు ప్రసవించటానికి ఏర్పాట్లు సిద్ధం చేశాం’ అన్నారు. ఆ కవలపిల్లలే లిటిల్‌బోయ్, ఫ్యాట్బోయ్లని ప్రపంచానికి తర్వాత తెలిసింది. అమెరికా న్యూక్లియర్ బలాన్ని స్టాలిన్‌కు ప్రదర్శించటానికి, ప్రపంచ ఆధిపత్య సాధనకోసమే ఈ అణ్వస్త్రాల ప్రయోగం జరిగింది. తదనంతరకాలంలో ప్రచ్ఛన్న యుద్ధానికి, ఆయుధపోటీకి దారితీసింది. 1962లో క్యూబన్ మిస్సైల్స్ సంక్షోభంతో అణ్వాయుధ యుద్ధానికి దరిదాపుల్లోకి ప్రవేశించింది. సోవి యట్ యూనియన్, అమెరికా, యూకేల మధ్య అణ్వాయుధ పరీక్షల సంఖ్యను తగ్గిస్తూ 1963లో కుది రిన ఎల్టీబీటీ ఒప్పందంపై 113 దేశాలు సంతకం చేశాయి. కానీ ఆ తదుపరి పదేళ్లలో అప్పటికే తయారయి వున్న క్షిపణులతో 12 వేల న్యూక్లియర్ హెడ్స్‌ను బిగించటం జరిగింది. జూన్ 1979లో ఆస్ట్రియా రాజ ధాని వియన్నాలో ఒప్పందం మేరకు అణ్వాయుధాల సంఖ్యను పరిమితం చేసుకోగా, 1980 అఫ్గానిస్తాన్ పరి ణామాలతో ఈ ఒప్పందం రద్దయింది. 1970వ దశకం మధ్య వరకూ అణ్వాయుధాలు, వ్యూహాత్మక క్షిపణుల తయారీలో అమెరికాదే పైచేయిగా ఉండేది. యూరప్‌లో ఒక మూలనుంచి వేరొక ప్రాంతానికి ఎక్కుబెట్టగలిగే అణు క్షిపణులు వేలకువేలు వచ్చిచేరి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో జరిగిన చర్చలు ఫలప్రదమవ్వటంతో 1987లో రొనాల్ట్ రీగన్, గోర్బచేవ్‌ల మధ్య కుదిరిన ఒప్పందమే ‘ఐఎన్ఎఫ్’ (మధ్యంతర అణుక్షిపణుల శక్తుల) ఒప్పందం. దీని ప్రకారం 5,500 కి.మీ.లలోపు ప్రయాణం చేయగల అణుక్షిపణులను నిర్వీర్యం చేయాలి. అణ్వాయుధాల నిర్మూలన ప్రక్రియలో ఇది ఒక పెద్ద విజయం. ఈ ఒప్పందాన్నే ట్రంప్ రద్దుచేశాడు. నేటి ఆయుధ పోటీలో హైపర్సోనిక్ క్షిపణులతో నూతన శకం ఆరంభమైంది. ఈ నూతన అధ్యాయాన్ని ఈసారి రష్యా ప్రారంభించింది. శక్తిమంతమైన జిక్రోన్ యుద్ధ నౌక నుండి క్రితం నెలలో ప్రయోగించిన హైపర్సోనిక్ క్షిపణి శబ్ధతరంగాల వేగం కంటే 7 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించి ప్రపంచ ఆయుధ ఉత్పత్తిదారులను ఆశ్చర్యపర్చింది. ఇటీవలి కాలంలో చైనా కూడా భూగర్భ అణ్వస్త్ర గిడ్డంగులను శరవేగంగా నిర్మిస్తోంది. ప్రపంచ అగ్రదేశాలు జాతీయవాదం, స్వీయరక్షణ పేరిట కూటములుగా ఏర్పడి అడ్డూఅదుపూ లేకుండా మారణాయుధాలను తయారు చేస్తున్నాయి. జీవన ప్రమాణాల మెరుగుదల, నిరుద్యోగ నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, దారిద్య్ర నిర్మూలన, మెరుగైన విద్యావైద్య సదుపాయాలు వంటి ప్రధాన సమస్యల కంటే, మానవాళిని, భూగోళాన్ని తొందరగా వినాశనం చేయాలనే దిశగానే ఆయుధపోటీకి ప్రభుత్వాలు వెళుతున్నాయి. ప్రపంచ ప్రజల శాంతి ఉద్యమమే దీనికి విరుగుడుగా ఎదగాలి. ప్రపంచంలో కొన్నిదేశాల దగ్గరే అణ్వస్త్రాలు ఉండాలనే వాదన కంటే అణ్వస్త్ర రహిత సమాజ దిశగా పయనిద్దాం. బుడ్డిగ జమిందార్ ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం కార్యవర్గ సభ్యులు ‘ 98494 91969 (ఆగస్టు 6 నాటికి హిరోషిమా మారణకాండ జరిగి 76 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా) -
నియామకాల్లో హిందీ ఆధిపత్యం
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల్లో హిందీ భాషకు ఇస్తున్న వెయిటేజ్ వలన హిందీయేతర రాష్ట్రాల ఉద్యోగా ర్థులు నష్టపోతున్నారు. ఉదాహర ణకు తెలంగాణలో గల 9 నవోదయ విద్యాలయాల్లో ఉపాధ్యాయ సిబ్బంది 220 మంది ఉండగా వారిలో సుమారు 50 (22.7%) మంది మాత్రమే తెలంగాణ వారున్నారు. మిగిలిన వారిలో కొద్దిమంది ఆంధ్రప్రదేశ్ వారున్నా మెజారిటీ హిందీ ప్రాంతం వారే. ఏపీ నవోదయ విద్యాలయాల్లో కూడా అదే పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 72 కేంద్రీయ విద్యాల యాల్లోని దాదాపు 2,500 మంది ఉపాధ్యా యుల్లో తెలుగు వారు 20 శాతమే. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల ఉపా« ద్యాయ నియామ కాల్లో 75% పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అవుతాయి. ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యు యేట్ టీచర్ పోస్టుల్లో ఏర్పడే ఖాళీల భర్తీ కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. సబ్జెక్ట్ నాలెడ్జితో పాటు రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, లాంగ్వేజెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విషయాల్లో పరీక్ష ఉంటుంది. వీటిలో ఇంగ్లిష్, హిందీ భాషలకు 20 మార్కుల చొప్పున ఉంటాయి. ఇంగ్లిష్‌లో ఏ ప్రాంతం వారికైనా మార్కులు సమానంగానే వస్తున్నాయి. కానీ హిందీలో హిందీ ప్రాంతం అభ్యర్థులకు 80% పైగా మార్కులు వస్తుండగా హిందీయేతరులకు అందులో సగం కూడా రావడం లేదు. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో బోధనా మాధ్యమం ఇంగ్లిష్. నియామక పరీక్షలో ఇంగ్లిష్ అని వార్యం. కానీ హిందీ ఎందుకు? ఇంగ్లిష్తో పాటు మరో భాషలో పరిజ్ఞానాన్ని పరీక్షించ దలిస్తే రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లో దేనిలోనైనా రాసే అవకాశం ఇవ్వాలి. సివిల్ సర్వీసులకు కూడా ప్రాంతీయ భాషల్లో రాసే వీలుండగా కేంద్రీయ, నవోదయ ఉపాద్యాయ నియా మకాలకు లేకపోవడం అన్యాయం. నియామకాలు జోనల్ పరిధిలో కాకుండా దేశం మొత్తం ఒకే యూనిట్‌గా కేంద్రీకృతంగా నిర్వహించడం కూడా ఈ అస మానతకు మరో ముఖ్య కారణం. పైన ఇచ్చినవి రెండు ఉదాహరణలు మాత్రమే. ఈ నష్టం అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అటానమస్ సంస్థ ల్లోనూ జరుగుతోంది. ఇండియన్ రైల్వేస్, పోస్టల్, సీపీడబ్ల్యూడీ, సెంట్రల్ సెక్రటేరి యట్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, డిఫెన్స్, రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్స్, సెంట్రల్ యూని వర్సిటీలు, ఐఐటీలు, ఎన్ ఐటీలు... ఇలా వందలకొలదీ వున్నాయి. వాటిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 40 లక్షల పోస్టులకు నియామకాలు చేస్తే అందులో సుమారు 2 లక్షలు తెలుగు రాష్ట్రాల వాటా ఉంటుంది. అమల్లో వున్న ఎంపిక పరీక్షా విధానంలో హిందీకి గల ప్రాధాన్యత తెలుగుకు లేకపోవడం వలన అవి తెలుగు వారికి దక్కే అవకాశం లేదు. రాజకీయ పార్టీలు, పార్లమెంట్ సభ్యులు ఇంత పెద్ద సమస్యను పట్టించుకోకపోవడం అన్యాయం. ప్రభుత్వ రంగంలో వున్న కొద్దిపాటి ఉద్యో గాల్లో కూడా జరుగుతున్న ప్రాంతీయ అన్యాయాన్ని ఎది రించే ఉద్యమం ఊపందుకోవాలి. నాగటి నారాయణ వ్యాసకర్త విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు మొబైల్: 94903 00577 -
చట్టం కంటే ప్రజాచైతన్యం ముఖ్యం
ప్రభుత్వాలు చేసే చట్టాల వల్ల తమకు మేలు జరుగుతుందని ప్రజలు భావించాలి. అప్పుడే ఆశించే ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఈ వాస్తవం ఏడు దశా బ్దాల స్వతంత్ర భారతంలో పదేపదే రుజువైనప్పటికీ, ఆయా వర్గాలను సంతృప్తి పర్చడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు పలు సందర్భాలలో మొక్కుబడి చట్టాలు తెచ్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇటీవల తెచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల గొప్ప మేలు కలుగుతుం దని కేంద్రం పేర్కొంటున్నప్పటికీ, రైతులు సాను కూలంగా స్పందించడం లేదు. ఎన్డీఏ తెచ్చిన పలు చట్టాలపై ఇప్పటికే ప్రజాబాహుళ్యంలో విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ‘జనాభా నియంత్రణ’పై చట్టం తేవడానికి అధికార బీజేపీ అడుగులు వేయడం మరో వివాదానికి తెరలేపింది. ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా నియం త్రణ బిల్లులను తమ శాసనసభల్లో ప్రవేశపెట్టాయి. ‘ఉత్తర ప్రదేశ్ జనాభా (నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమం) బిల్లు 2021’ ముసాయిదాను యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజానీకం ముందుంచి, వారి సలహాలు, సూచనలను ఆహ్వా నించింది. కాగా, యూపీ తరహాలోనే జనాభా నియంత్రణ బిల్లును తెచ్చి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జనాభా నియంత్రణకు సంబంధించి 2020 డిసెంబర్లో సుప్రీంకోర్టులో దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వాజ్యంలో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో చైనా తరహాలో బలవంతంగా కుటుంబ నియంత్రణ చట్టాన్ని తెచ్చే ఉద్దేశమేదీ తమకు లేదనీ, వివిధ స్వచ్ఛంద విధానాల ద్వారా కుటుంబ నియంత్రణ చర్యలతోనే దేశంలో సంతానోత్పత్తి వృద్ధిరేటును కనిష్టంగా 2.1 శాతం సాధించే క్రమంలో ఉన్నామనీ తెలిపింది. జనాభా నియంత్రణపై కేంద్ర ప్రభుత్వ విధానం ఇంత విస్పష్టంగా ఉన్నదని తెలిసినప్పటికీ, పార్లమెం టులో కొందరు అధికార బీజేపీ నేతలు ప్రైవేటు మెంబర్స్ బిల్ రూపంలో జనాభా నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టాలని పట్టుబడటం వెనుక పలు అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుత భారత్ జనాభా ప్రపంచ జనాభాలో 6వ వంతు. దేశంలో ప్రతి 20 రోజులకు లక్ష చొప్పున జనాభా పెరుగుతోంది. 135 కోట్ల జనాభా కలిగిన భారతదేశం, 142 కోట్ల జనాభాతో ప్రపంచంలో తొలిస్థానంలో ఉన్న చైనాను దాటడా నికి ఎక్కువ సమయం పట్టదు. స్వాత్రంత్యం లభించిన తొలినాళ్లల్లోనే దేశంలో తీవ్ర ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. అప్పుడున్న 30 కోట్ల జనాభాకు తిండిగింజలను విదేశాల నుండి దిగు మతి చేసుకొన్నది. అటువంటి నేపథ్యంలోనే, నెహ్రూ ప్రభుత్వం 1951లో కుటుంబ నియంత్రణ విధానాన్ని ప్రారంభించింది. అయితే, దీన్ని బల వంతంగా అమలు చేయలేదు. తర్వాతి ప్రభు త్వాలు కూడా ప్రజలపై నిర్బంధంగా రుద్ద లేదు. ఒక్క ఎమర్జెన్సీ సమయంలోనే చెదురుమదురుగా బలవంతపు ఆపరేషన్లకు పాల్పడిన అమానుష సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ ‘మేమిద్దరం– మాకిద్దరు’ అనే నినాదంతో సాగిన కుటుంబ నియంత్రణ కార్య క్రమాలు సత్ఫలితాలు అందించాయి. ఫలితంగానే, 1950–55 మధ్యకాలంలో సంతానోత్పత్తి వృద్ధి రేటు 5.9 శాతం ఉండగా, అది క్రమంగా 4 శాతా నికి, తదుపరి 3 శాతానికి తగ్గుతూ 2.2 శాతం వద్ద స్థిరపడింది. 2025 నాటికి 1.93 శాతంకు తగ్గిం చేలా చర్యలు తీసుకుంటున్నారు. ‘అన్ని సమస్యలకు మూలం అధిక జనా భాయే’ అనే భావన ఒకప్పుడు ఉండేది. తర్వాత ‘అన్ని సమస్యలను పరిష్కరించగలిగేది జనాభాయే’ అనే సిద్ధాంతం ఊపిరి పోసుకుంది. మానవ వనరుల్ని పూర్తిస్థాయిలో వినియోగించు కొనే దిశగా సమర్థమైన కార్యాచరణ అమలు చేసిన తర్వాతనే చైనా ఆర్థిక వ్యవస్థ బలీయమైన శక్తిగా రూపొందింది. అంతకుముందు ‘ఒకే బిడ్డ’ విధా నాన్ని నిర్బంధంగా అమలు చేయడంతో చైనాలో యువత సంఖ్య గణనీయంగా తగ్గి, వైద్య ఆరోగ్య సౌకర్యాలు అవసరమైన వృద్ధుల సంఖ్య పెరగ డంతో తన విధానాన్ని సవరించుకొంది. ఇద్దరు బిడ్డల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎక్కువ మంది పిల్లలను కనే కుటుంబాలకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. మహిళా సాధికారత, గ్రామీణ ప్రాంతాలలో విద్య, ఆరోగ్యం, మౌలిక సదు పాయాల కల్పన, ప్రతి ఒక్కరికి అర్హతలను అను సరించి నైపుణ్యాలలో శిక్షణ ఇప్పించడం, అభి వృద్ధి కార్య కలాపాలను వికేంద్రీకరించడం, తది తర చర్యలను తీసుకొన్నట్లయితే పెరుగుతున్న జనాభా విలువైన వనరుగా రూపొందుతుంది. యూపీ, అస్సాం రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ కుటుంబ నియంత్రణ చట్టాలు రూపొందించి, కొన్ని వర్గాల జనాభాను నియం త్రించాలనుకోవడం వెనుక రాజకీయ కోణం ఉంది. దేశంలో కొన్ని రాష్ట్రాలలో హిందువుల జనాభా సంఖ్యను దాటుకొని ముస్లింల జనాభా పెరిగి పోతోందని కొంతకాలంగా చాంధసవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూపీలో ముస్లిం జనాభా పెరుగుతోందన్న కారణంగానే ఆ రాష్ట్రం చట్టం ద్వారా జనాభాను నియంత్రించా లనుకొం టోందని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తు న్నాయి. యూపీ మోడల్‌ను జాతీయ స్థాయిలో అనుసరించి నట్లయితే, కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. ఇద్దరు బిడ్డల విధానం వల్ల, ఆడపిల్లలను పిండ దశలోనే తొలగించి వేసే అవకాశం ఉంది. ఇంకా అనేక సామాజిక సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో, ‘జనాభా నియంత్రణ బిల్లు’పై విçస్తృతమైన చర్చ జరగాలి. మెజార్టీ ప్రజల అభిప్రాయాల మేరకే నిర్ణయం చేయాలి. ‘చట్టం కంటే ప్రజా చైతన్యం’ ముఖ్యం. సి. రామచంద్రయ్య వ్యాసకర్త శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
వందేళ్ల ఆంధ్రుల స్వప్న సాకారం పోలవరం
ప్రపంచంలోనే గొప్పదని చెప్పుకునే చైనాలోని త్రీ గోర్జెస్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లో శరవేగంగా నిర్మాణమవుతున్న పోలవరం ప్రాజెక్ట్ తలదన్నబోతోంది. చైనా త్రీ గోర్జస్ ప్రాజెక్టు ప్రవాహం 41 లక్షల క్యూసెక్కులయితే మన పోలవరం ప్రవాహం 50 లక్షల క్యూసెక్కులు. వాస్తవంగా చెప్పాలంటే ‘త్రీ గోర్జస్’ మూడు మహానదుల కలయిక... ప్రవాహంలోనూ, ఆధునిక సాంకేతికతలోనూ, ఇతర విశేషాలకు సంబంధించి పోలవరం ప్రాజెక్టుతో పోలిస్తే త్రీ గోర్జస్ చిన్నబోయినట్లే... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కన్న కలను ఆయన కుమారుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మరీ సాకారం చేయబోతున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌కు కొన్ని ప్రత్యేకతలు సంతరించుకొనున్నాయి. సీఎం జగన్ ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఒక సమగ్ర క్యాలెండర్ ఏర్పాటుతో ప్రణాళికాబద్ధంగా అధిక శ్రద్ధ పెట్టారు... గతంలో ప్రాజెక్ట్‌కు చెందిన కొన్ని విభాగాల్లో అవినీతి జరిగిందని గుర్తించి రీ టెండరింగ్ విధానం తీసుకు రావడం ద్వారా ప్రజాధనం వృథా కాకుండా అడ్డుకట్ట వేశారు... ఆ తరువాత మాత్రమే అపార అనుభవం ఉన్న మెగా ఇంజనీరింగ్ సంస్థ టెండర్ ద్వారా ప్రాజెక్ట్ దక్కించుకుంది. ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వరదలొచ్చినా, కరోనా విలయ తాండవం చేసినా ఒక్కరోజు కూడ పని ఆగకుండా చేయడం గొప్ప విశేషం. అలాగే ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లు సైతం చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. వీరంతా పోలవరం చరిత్రలో నిలిచిపోతారు. సీఎం జగన్‌కు ఆ నిబద్ధతే శ్రీరామరక్ష కానుంది. ఎంతగా అంటే గోదావరి నదిపైన ఒక్కొక్క గేటు 20 మీటర్ల ఎత్తు ఉండే 48 గేట్లు ఇక్కడ ప్రాజెక్టులో ఏర్పాటు చేసి నదీ గమనం మార్చి నిర్మించడం, స్పిల్ వే ద్వారా మళ్ళించిన ప్రాజెక్ట్ ప్రపంచంలో ఇదే కావడం తెలుగు వాడికి ముఖ్యంగా ఆంధ్రుడికి ఒక గర్వకారణంగా నిలిచిపోనుంది. ఇది భారతదేశానికి కూడా గర్వకారణమే కదా. పైగా సముద్రాన్ని మరపించేలా మంచినీటి మత్స్య సంపదకు ఆటంకం లేకుండా ఫిష్ ల్యాడర్ ఏర్పాటుతో మత్స్య సంపదకు ఆటంకం లేకుండా ముందుగానే పాదుకొల్పారు. ఇక పాపికొండల అందాలు మరింత ఆస్వాదించేలా ప్రత్యేకంగా నావిగేషన్ కెనాల్ ఏర్పాటు చేయడం వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ ప్రాజెక్టులో చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడైనా ప్రకృతి ప్రతికూలించి వర్షాలకు ఆటంకం కలగవచ్చు. ఆ పరిస్థితే వస్తే డెల్టా సాగునీటి సరఫరాలకు ఆటంకం లేకుండా స్పిల్ లెవెల్ స్థాయిలో జలనిధి అడుగున ప్రాథమిక పునాది స్థాయినుంచి నీటి పారుదలకు ఆటంకం లేకుండా స్కవర్ స్లూయిస్‌లను నిర్మించారు. దార్శనికతకు వైఎస్సార్ నిలువెత్తు నిదర్శనం ధవళేశ్వరం వద్ద బ్యారెజ్ నిర్మించిన కాటన్ మహాశయుడు 1852లోనే గోదావరిపై రిజర్వాయర్ అవసరమని పేర్కొన్నారు... ఆనాడు ఆయన వెలిబుచ్చిన అభిప్రాయంకు అనుగుణంగా పోలవరం ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువలు తవ్వించిన డేరింగ్ అండ్ డేషింగ్ పొలిటికల్ హీరో దివంగత వైఎస్సార్ ఈ ప్రాజెక్టుకు జీవం పోశారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆధునిక రాజకీయ పాలనా వ్యవస్థలో మనదేశంలో ఎన్నో పథకాలకు శంకుస్థాపనలు లెక్కకు మిక్కిలిగా జరిగాయి... అంటే ఒకసారి చేసినదానికే మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేసిన వైనం పోలవరానికి దక్కింది... ఇలా ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారు ఆశించి పోలవరాన్ని కుటిల తరహాలో పావుగా ఆడుకుంటే వైఎస్సార్ మాత్రం ఆ తరహా కుటిలత్వానికి చరమగీతం పాడి రైతాం గానికి అనువుగా వాడుకున్నారు... అందుకే దాదాపు 360 కిలోమీటర్ల నిడివి కల్గిన రెండు కాల్వల పనులు చేపట్టి తొంబై ఎనిమిది శాతం పూర్తి చేశారు. సాగు, తాగు నీటి సమస్యతో పాటు పారిశ్రామిక ప్రగతికి పోలవరం ఒక్కటే పరిష్కారం చూపగలమని నమ్మారు... ఆలోచన రావడం తరువాయి ఆచరణలో పెట్టి ప్రాజెక్ట్‌కు ఇరువైపులా ఉభయగోదావరి జిల్లాల్లో కాల్వల నిర్మాణానికి భూసేకరణకు ఉపక్రమించారు. ఇందుకోసం రూ. వేలకోట్లు ఖర్చయినా సరే పరవాలేదనుకుని రంగంలోకి దిగారు. ఇలా రైతులకు పరిహారాలు అందజేసి ముందుగా పనులకు శ్రీకారం చుట్టడంతో కేంద్రం దిగొచ్చింది. ఫలితంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుకి నిధులు తామే ఇచ్చి పూర్తి చేస్తామని రాష్ట్ర విభజనలో భాగంగా మాట ఇచ్చింది. కానీ, బాబుని నమ్మి ఓట్లేస్తే సరికొత్త ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చాక తామే నిర్మిస్తామని తలదూర్చి రాజకీయం చేశారు తప్ప అయిదేళ్లయినా పునాదులు దాటకుండా నిర్వీర్యం చేశారనేది జగమెరిగిన సత్యమేగా. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ ప్యాకేజ్ స్థాయిలోనే అవినీతి అక్రమాలు జరిగిన తీరు లోకానికి తెలియ చేయడంలో జగన్ కృతకృత్యులయ్యారు. ఆ తరువాత పరిణామాలు అందరికీ తెలిసిందే. 1900 ప్రాంతం నుంచీ దాదాపు వందేళ్ళు రాజకీయం చేస్తూ పోలవరాన్ని అటకెక్కించిన తీరును తన చాణక్యంతో వైఎస్సార్ తిప్పికొట్టిన సంగతి వర్తమాన పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. దివంగత వైఎస్సార్ 17,500 క్యూసెక్కుల మేరకు నీరు పారే కుడి, ఎడమల కాల్వల తవ్వకానికి ఆనాడు చేపట్టిన సాహసోపేత చర్యే ప్రస్తుతం శరవేగంగా పనులవుతున్న ‘పోలవరం’గా చరిత్రకెక్కింది... ఈ కారణంగా ఉభయ గోదావరులకే కాదు అటు ఉత్తరాంధ్ర... ఇటు సర్కార్... రాయలసీమ జిల్లాలకు కూడా సాగు, తాగు పారిశ్రామిక అవసరాలు నెరవేరతాయి కదా..! ఇప్పుడు గోదావరి జిల్లాల డెల్టా స్థిరీకరణ జరగడమే కాదు. మెట్ట ప్రాంతాలకు, ఇతర జిల్లాల నీటి సమస్యలకు చెక్ పెట్టినట్టేగా. అన్నిటికీ మించి 960 మెగావాట్ల అతి చౌకైన విద్యుదుత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టులో కీలకమైన అంశం... ఈ ప్రాజెక్టుకోసం ఊళ్లు, ఇళ్లూ వదిలేసి నిర్వాసితులయిన ఒకో కుటుంబానికి రూ. 10 లక్షల రూపాయలు పరి హారంగా ఇవ్వడానికి ముఖ్యమంత్రి జగన్ ఉదారతతో తాజాగా నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయం. వారికి జీవించేందుకు అవసరమయ్యే ఇతర ఆర్థిక సాయం అందించడం.. జీవన భృతి ఏర్పాటు.. ఉద్యోగ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కొవ్వూరి త్రినాథరెడ్డి కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైఎస్సార్సీపీ రైతు విభాగం మొబైల్ : 94402 04323 -
అఫ్గానిస్తాన్ పర్యవసానాలు ఇలా...
అగ్రరాజ్య అమెరికా చరిత్రలో అతి పెద్ద యుద్ధం చేసిన సైన్యాలు అఫ్గానిస్తాన్ నుంచి మూటాముల్లె సర్దుకొని వెనుదిరిగాయి. 2011 సెప్టెంబరు 11న ట్విన్‌టవర్స్ కూలిన తర్వాత ‘టెర్రరిజంపై యుద్ధం’ పేరిట అఫ్గానిస్తాన్‌ను అమెరికా, నాటో దేశాలు కలిసి ఆక్రమించాయి. రెండు దశాబ్దాల తర్వాత ఉగ్రవాదం ఉత్తరాఫ్రికా, మధ్యప్రాచ్యం, మధ్య దక్షిణాసియాల్లో పెరిగిందే తప్ప తగ్గలేదు. తాలిబాన్ల పుట్టుక సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా ప్రోత్సహించిన అమెరికా అండదండలతో జరిగింది. ఇరాక్, సిరియా, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ ఉగ్రవాదులను ఉసిగొల్పి, శిక్షణనిచ్చి కోట్ల డాలర్లు కుమ్మరించిన అమెరికా ఉత్పత్తి పుత్రుడే బిన్ లాడెన్. ఇరవై ఏళ్లపాటు అఫ్గానిస్తాన్‌లో అమెరికా తిష్ఠవేయడానికి కారణం, ఆ దేశ పౌరులపై ప్రేమ, జాలితో కాదు. అఫ్గానిస్తాన్ భౌగోళికంగా సెంట్రల్ దక్షిణాసియా దేశాల మధ్య మినరల్స్, ఖనిజసంపదతో నిండిన వ్యూహాత్మక దేశమవటమే. అఫ్గానిస్తాన్ ఆర్థిక, రాజకీయ పర్యవసానాలు అనాదిగా మన ఇరుదేశాల మధ్యగల సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుత అఫ్గాన్ ప్రభుత్వం అమెరికా కీలుబొమ్మగా పేరుగాంచి మొత్తం 43 శాతం భూభాగంతో ప్రాబల్యంలేనిదిగా ఉంది. దీనికి విరుద్ధంగా ఛాందసవాద తాలిబాన్లు మెజారిటీ ప్రావిన్సులను ఆక్రమించి, అమెరికా సేనలతో పోరాడి చివరికి దేశాన్ని వదిలిపోయేలా చేశారు. దాడులు ముమ్మరమైనప్పుడు తాలిబాన్లు పాకిస్తాన్లో ఆశ్రయం పొందారు. ఉగ్రవాదం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ల మీదుగా భారతదేశ కశ్మీరు వరకూ తాలిబాన్ల రూపంలో పాకింది. సుదీర్ఘయుద్ధం వల్ల అమెరికా పరువు మసకబారింది. ఆర్థికంగా, సైన్యపరంగా తీవ్ర నష్టాన్ని చవిచూసింది. చివరికి 2021 సెప్టెంబరు 11 నాటికల్లా, 20 సంవత్సరాల ఆక్రమణ పూర్తి సమయానికి ఇంకా మిగిలి ఉన్న సైన్యాన్ని వెనుకకు రప్పిస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు బైడెన్. బ్రౌన్ యూనివర్సిటీ అంచనాల ప్రకారం మొత్తం అమెరికా యుద్ధఖర్చు రెండు లక్షల, 36 వేల కోట్ల డాలర్లయింది(177 లక్షల కోట్ల రూపాయలు). యుద్ధంలో కనీసం 2,41,000 మంది ప్రత్యక్షంగా చనిపోగా, లక్షలాది మంది ఆకలితో చనిపోయారు. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్లలో 71,344 మంది పౌరులు, అమెరికా నాటో సైన్యాలు 3,586 మంది, అఫ్గాన్ మిలిటరీ, పోలీసులు 78,314 మంది, ప్రతిపక్ష సాయుధులు 84,191 మంది చనిపోయారు. యునిసెఫ్ నివేదిక ప్రకారం కనీసం 37 లక్షల చిన్నారులు స్కూళ్లకు దూరమయ్యారు. వీరిలో 60 శాతం బాలికలే ఉన్నారు. 2007లో 33 శాతం పేదరికం 2020 నాటికి 55 శాతానికి పెరిగింది. 2002లో 74 వేల హెక్టార్లలో సాగయిన మాదక ద్రవ్య పంట ఓపియవ్‌ు, 2019 నాటికి 1,63,000 హెక్టార్లకు పెరిగింది. అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ‘యూఎస్ మిషన్ అఫ్గాన్‌లో విఫలమైంది. మధ్యదక్షిణాసియాలో ప్రాంతీయ భద్రతా పరిష్కార మార్గం ఇప్పుడు చైనా, రష్యా, ఇరాన్, భారత్‌లపై ఆధారపడి ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి చరమగీతం పాడి సహకరించాలి’ అన్నారు. ఈ దిశగా చర్చలు జరపటానికి మన విదేశాంగ ప్రతినిధి వర్గమొకటి కతార్‌లో తాలిబాన్లను కలుసుకొందని వార్తలొచ్చాయి. రష్యా చొరవతో అస్థానాలో, మాస్కోలో అనేక పర్యాయాలు శాంతిచర్చలు జరిగాయి. భారత్–రష్యా అనేక వేదికలలో కలిసి పని చేయటానికి విదేశాంగ మంత్రి జైశంకర్ మాస్కో వెళ్లారు. తాజాగా ఉత్తర అఫ్గాన్‌లో తాలిబాన్ల దూకుడుతో అక్కడి ప్రజలు తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్లకు తరలిపోతుండటంతో ఆ దేశాల సుస్థిరత పట్ల రష్యా ఆందోళన చెందుతోంది. ఇది మధ్య ఆసియా దేశాలకు తక్షణ సవాలుగా ఉంది గనుక అర్మేనియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్‌లను కూడా కలుపుకొని సహకార భద్రతా కూటమిగా ఏర్పడాలని రష్యా భావిస్తోంది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి చైనాకు వ్యతిరేకంగా పాల్గొంటున్న భారతదేశం అదే సమయంలో పశ్చిమాన పాకిస్తాన్, తాలిబాన్లతో విరోధ బాటన పయనించటం శ్రేయస్కరం కాదనీ, కనుకనే మన విదేశాంగ విధానం ఇటీవల తన వైఖరిని మార్చి పాకిస్తాన్, తాలిబాన్లకు స్నేహహస్తం అందించిందనీ, తాలిబాన్ల ప్రభావం కశ్మీర్‌పై పడకుండా ఉండటానికే ఇటీవల మన ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసిందనీ విశ్లేషకులు అంటున్నారు. బుడ్డిగ జమిందార్ ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం, కార్యవర్గ సభ్యులు; 9849491969 -
ప్రాంతీయ పార్టీలకు చెదరని ప్రజాదరణ
ఇటీవల మార్చి, ఏప్రిల్ నెలల్లో ఐదురాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, రెండు తెలుగురాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లోనూ వచ్చిన ఫలితాలు మతపరమైన విశ్వాసాలను రెచ్చగొట్టి లబ్ధిపొందడం లాంటి జిమ్మిక్కులను తిరస్కరించాయి. తమిళనాడులో స్టాలిన్ విజయం, కేరళలో విజయన్ గెలుపు, పుదుచ్చేరిలో ప్రాంతీయ పార్టీ గెలుపు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ గెలుపు దక్షిణాదిలో బీజేపీలాంటి మతపార్టీలకు స్థానం లేదన్న విషయాన్ని స్పష్టం చేశాయి. ఒక్క అస్సాంలో మాత్రం బీజేపీ గెలవగలిగింది. ఏడు రాష్ట్రాల్లోనూ గెలుపు కోసం బీజేపీ చేయని ప్రయత్నం లేదు. ఒక్క అభివృద్ధి పథకం గురించి మాట్లాడకుండా ప్రైవేటీకరణ పేరుమీద లక్షలాది మందిని రోడ్లమీద నిలబెడుతూ ఏ ఆర్థిక పథకమూ లేకుండా దేశభక్తి, మతం ద్వేష భావాలతో గెలవాలని చూసిన బీజేపీకి ఆయా రాష్ట్రాల ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం అపూర్వమైంది. బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రధానమంత్రితో పాటు మంత్రులు, పార్టీ అధ్యక్షులు, ముఖ్యులు, రాష్ట్ర నాయకత్వమంతా బెంగాల్లో మోహరించినా బెంగాల్ టైగర్ని ఎదుర్కొని నిలువలేకపోయారు. ఇప్పటికీ కార్మికవాడలో ఉన్న తన స్వగృహంలో నివసిస్తున్న మమతా బెనర్జీ నిరాడంబరజీవి. కాళ్ళకు హవాయి చెప్పులతో, అతి మామూలు వస్త్రధారణతో ఉండే ధీరవనిత. దీదీగా బెంగాల్ ప్రజలందరి హృదయాల్లో శాశ్వతస్థానం సంపాదించుకున్న వనిత. బీజేపీని మట్టికరిపించి మూడవసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా పాలనాపగ్గాలు చేతబట్టుకుంటున్న అపర కాళికామాత. కాంగ్రెస్, సీపీఎం లాంటి జాతీయ పార్టీలను తప్ప ప్రాంతీయ పార్టీలను బీజేపీ, జయించలేదని తృణమూల్ కాంగ్రెస్ విజయ పరంపర నిరూపిస్తుంది. రాష్ట్రాన్ని ద్రావిడ శూద్ర నాయకత్వ నేపథ్యంలోంచి పాలించిన కరుణానిధి తనయుడు స్టాలిన్. తండ్రిలాగే ద్రావిడ రాజకీయాలకు నిజ మైన ప్రతినిధి. ద్రావిడ రాజకీయాలకు స్వస్తి పలికి మళ్ళీ బ్రాహ్మణ రాజకీయాలకు తెరలేపాలని చూస్తున్న బీజేపీతో అన్నాడీఎంకే పొత్తుపెట్టుకొంది. ద్రావిడ రాజకీయాలను, శూద్ర నాయకత్వాన్ని బలంగా బలీయంగా ముందుకు తీసుకెళ్తున్న స్టాలిన్ ఎత్తుగడల ముందు బీజేపీ ఆటలు సాగలేదు. అన్నాడీఎంకే జిత్తులూ సాగలేదు. జాతీయ పార్టీలను నలభై ఏళ్లుగా రాష్ట్రంలోకి రానీయని తమిళ ప్రజలు డీఎంకేకు పట్టంగట్టి బీజేపీకి దక్షిణాదిలో స్థానం లేదని నొక్కి చెప్పారు. ఇక్కడా, పాండిచ్చేరిలోనూ బీజేపీకి పరాభవమే మిగిలింది. ప్రాంతీయ పార్టీలనే విజయం వరించింది. కేరళ భారతదేశంలో నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించిన ఏకైక రాష్ట్రం. కమ్యూనిస్టు పార్టీల పాలనను దేశంలోనే మొట్టమొదటగా ఆహ్వానించిన రాష్ట్రం. గత ఏడేళ్ళుగా పినరయి విజయన్ నాయకత్వంలో సంచలనాత్మక ప్రగతిశీల చర్యలను చేపట్టి సుపరిపాలను అందించింది. మత విశ్వాసాలు, దైవ నమ్మకాల విషయంలో సర్వమత సమానత్వాన్ని పాటిస్తూ మత సామరస్యాన్ని కాపాడుతున్న రాష్ట్రం. అలాంటి కేరళలో అడుగుపెట్టాలని తీవ్రప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి ఆశాభంగమే అయింది. మత, దైవ భావనలను ఎన్నిటిని రెచ్చగొట్టినా కేరళ విద్యావిజ్ఞాన సమాజం పైన, బీజేపీ ఏమాత్రం ప్రాభవాన్ని చూపలేక పోయింది. అస్సాంలో ప్రాంతీయ పార్టీ శక్తివంతంగా లేకపోవడం వల్ల, కాంగ్రెస్ పార్టీ క్రియారాహిత్యం వల్ల, బంగ్లా ఆక్రమణల సమస్యలను బీజేపీ రెచ్చగొట్టి తన స్థానాన్ని కాపాడుకోగలిగింది. ఇక తెలం గాణలో బలమైన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ని ఢీ కొనే శక్తి బీజేపీకి లేదని నాగార్జునసాగర్ ఉపఎన్నిక, ఖమ్మం, వరంగల్ మునిసిపల్ ఎన్నికలు రుజువు చేశాయి. అలానే వైఎస్సార్సీపీని ఢీ కొనడం బీజేపీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే కాదు. టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీలకు సాధ్యంకాదని తిరుపతి ఎన్నిక రుజువు చేసింది. గత ఏడేళ్లుగా కేసీఆర్ గత రెండేళ్లుగా వైఎస్ జగన్ చేస్తున్న ప్రజోపయోగకర పనులు, మానవీయ పథకాలు తెలుగు రాష్ట్రాల్లో ఏ జాతీయ పార్టీకి స్థానం లేదని నిరూపిస్తున్నాయి. మత తాత్వికత కాకుండా మనిషి తాత్వికతదే గెలుపన్న ఈ సందేశం భారత రాజకీయాలను మానవీయ రాజకీయాల దిక్కు మరల్చడానికి దిశానిర్దేశం చేస్తుందనడంలో సందేహం లేదు. డా. కాలువ మల్లయ్య వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు మొబైల్: 91829 18567 -
దళపతి స్టాలిన్.. వేచి చూస్తున్న ముళ్ల కిరీటం
తమిళనాడులో డీఎంకేకి, దాని అధ్యక్షుడు ఎమ్కే స్టాలిన్‌కి మే 2వ తేదీ చాలాకాలంగా ఎదురుచూస్తున్న రోజు కావచ్చు. దాదాపు అయిదు దశాబ్దాలపాటు తనతండ్రి, డీఎంకే పితామహుడు ఎమ్. కరుణానిధి చాటున ఎదుగుతూ.. దళపతిగా మద్దతుదార్లు, కేడర్లు అభిమానంతో పిల్చుకునే స్టాలిన్ తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలకు గాను 160 స్థానాలు గెల్చుకున్న డీఎంకే కూటమి అధికార పీఠాన్ని దక్కించుకుంది. మోదీ ప్రభంజనం దేశాన్ని చుట్టుముట్టిన స్థితిలోనూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు గాను ఒక్కటి మినహా అన్నింటినీ స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే గెల్చుకున్న నేపథ్యంలో, అసెంబ్లీ ఎన్నికల్లోనూ డీఎంకే విజయంపై ఎవరికీ సందేహాలు లేవు. పైగా గత రెండేళ్లలో క్షేత్ర స్థాయిలో పెద్దగా మార్పులూ లేవు. కేంద్రం నుంచి బీజేపీ రిమోట్ కంట్రోల్‌కి అనుగుణంగా పనిచేస్తోందని అన్నాడీఎంకే ప్రభుత్వంపై ముద్రపడటంతో తమిళనాడులో అధికార మార్పిడి తప్పదని క్షేత్ర స్థాయి నివేదికలు తేటతెల్లం చేశాయి. జనంలో గూడుకట్టుకున్న ఈ అభిప్రాయాన్ని డీఎంకే మరింత శక్తివంతంగా ముందుకు తీసుకొచ్చి తమిళనాడు వ్యతిరేక విధానాలను కేంద్రం అమలు చేస్తోందని దాడి చేసింది. నీట్, రైతుల ఆందోళన, గెయిల్ హైడ్రో కార్బన్ ప్రాజెక్టు వంటి అంశాల విషయంలోనే కాకుండా జీఎస్టీ సుంకాలపై కేంద్రం వ్యవహారాన్ని కూడా డీఎంకే ఎండగట్టింది. ఈ సమస్యలన్నింటిపై స్టాలిన్ తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తూ వచ్చారు. శాంతికి కేంద్రమే అసలు విలన్ అని, రాష్ట్రంలో ఈపీఎస్ ప్రభుత్వం కేంద్రం కీలుబొమ్మలా వ్యవహరిస్తూ పాలి స్తోందనే అవగాహనను ప్రజల్లో చొప్పించడంలో స్టాలిన్ విజయవంతమయ్యారు. తమ భాష, సంస్కృతి సుసంపన్నత పట్ల గర్వపడే తమిళ ప్రజలలో ఆత్మాభిమానాన్ని స్టాలిన్ ప్రేరేపించడమే కాకుండా భాషా సమస్యపై కూడా రాష్ట్ర ప్రజలను తనవైపు తిప్పుకున్నారు. అదే సమయంలో తన కూటమిలోని మిత్ర పక్షాలను తక్కువ స్థానాల్లో పోటీచేసేందుకు ఒప్పించిన స్టాలిన్ ఈ విషయంలో కఠినంగానే వ్యవహరించారు. స్టాలిన్ అభిమతాన్ని గౌరవించి 25 స్థానాల్లో మాత్రమే పోటీ చేసిన కాంగ్రెస్ 18 స్థానాల్లో గెలుపొందింది. డీఎంకే స్వయంగా 134 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని సొంతంగా ప్రభుత్వ స్థాపనకు కావలసిన మ్యాజిక్ సంఖ్యను దాటివేసింది. ఇంతకు మించి సుప్రసిద్ధ రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఒప్పందం చేసుకోవాలని స్టాలిన్ తీసుకున్న కీలక నిర్ణయం ఆయనకు ఎంతగానో సహాయపడింది. పదేళ్లుగా అధికారం చలాయించిన అన్నాడీఎంకే ప్రభుత్వం పనితీరుతో విసిగిపోయి మార్పును కోరుకుంటున్న ప్రజారాశుల వద్దకు సరికొత్త ప్రచార శైలితో వచ్చిన డీఎంకే కేడర్ ఎంతో ఉత్సాహంతో తమ అధినాయకుడి తరపున ప్రచార కార్యక్రమాన్ని శక్తివంతంగా సాగించింది. రాజకీయంగా అత్యంత చైతన్యంతో ఉండే తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి, నాటి ముఖ్యమంత్రి జె జయలలిత మరణం తర్వాత ఏర్పడిన సంక్షోభ కాలం పొడవునా అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి శక్తియుక్తులన్నింటినీ ప్రయోగించిన స్టాలిన్ ప్రతిఘటనా శక్తిని తమిళ ప్రజలు మర్చిపోలేదు. అయితే ఎన్నికల ద్వారానే అధికారాన్ని గెల్చుకోవడానికి ప్రాధాన్యమిచ్చిన స్టాలిన్ ఆ తరుణం కోసం వేచి ఉండి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తన శైలితో అధికార పీఠం దక్కించుకున్నారు. ఇప్పుడు స్టాలిన్ కోసం సింహాసనంపై ముళ్లకిరీటం ఎదురు చూస్తోంది. రాష్ట్రంలో పెచ్చరిల్లిపోతున్న కోవిడ్–19 మహమ్మారిని అరికట్టడమే తన ముందున్న సవాళ్లలో ప్రధానమైనది. పదవీబాధ్యతలు స్వీకరించక ముందే రాజకీయ పరిణతిని ప్రదర్శించి పాలనలో కొత్తదనం కోరుకుంటున్న స్టాలిన్.. కొత్త ప్రభుత్వానికి తన అనుభవాన్ని పంచిపెట్టడమే కాకుండా తగిన సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని అభ్యర్థించారు. పైగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రజల ముంగిటకే తీసుకుపోతానని స్టాలిన్ ఇప్పటికే ప్రకటించేశారు. అన్నాడీఎంకే ముఖ్యమంత్రి ఇ. పళనిస్వామి కోవిడ్–19ని సమర్థంగా ఎదుర్కొన్నారు. పైగా సుపరిపాలన అందించడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు కూడా. అయితే తన ప్రభుత్వం కేంద్రలోని బీజేపీ ప్రభుత్వానికి దాసోహమైపోయిందన్న వ్యతిరేక ప్రచారం ముందు ఆయన తన ప్రాముఖ్యతను కోల్పోయారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో స్టాలిన్ ఎలా వ్యవహరించనున్నారు అనేది ఆయనకు విషమ పరీక్షే. కేంద్రప్రభుత్వంపై, బీజేపీపై తీవ్రంగా వ్యతిరేక ప్రచారం చేసిన స్టాలిన్ ఇకపై ఏం చేయబోతారని ప్రజారాశులు నిశితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపున కేంద్ర ప్రభుత్వంతో కార్యాచరణ సంబంధాన్ని స్టాలిన్ ఎలా నిర్మించుకుంటారో చూస్తానని అన్నాడీఎంకే ఎదురు చూస్తోంది. రాష్ట్రం ఇప్పటికీ రెండు గుర్రాల పరుగుపందేన్ని కొనసాగించనుందని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేశాయి. చిరకాలంగా తిష్ట వేసి కూచున్న ద్రవిడియన్ పార్టీలకు ముగింపు పలికి కొత్త ప్రత్యామ్నాయాన్ని తీసుకువస్తామంటూ పలువురు చేసిన సుదీర్ఘ ప్రసంగాలు గాల్లో కలిసిపోయాయి. సూపర్ స్టార్ కమల్ హసన్ స్థాపించిన మక్కల్ నీతి మయ్యమ్ ఊసులోకూడా లేకుండా పోయింది. మరో సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పరిస్థితిని ముందుగానే గ్రహించినవాడై సకాలంలో ఎన్నికల రణరంగనుంచి తప్పుకున్నారు. రాజకీయరంగ ప్రవేశంపై ఎప్పటికప్పుడు సందేశాలు ఇస్తూ అభిమానులను అలరిస్తూ వచ్చిన రజనీ చివరికి అనారోగ్య కారణాలను సాకుగా చూపి రాజకీయ రంగం నుంచే తప్పుకోవడం మరీ విశేషం. లక్ష్మణ వెంకట కూచి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు -
నిండు ప్రాణాన్ని నిలువునా మింగిన అవ్యవస్థ..!!
ప్రపంచం నలుమూలల్లోని కథనాలను ప్రజలకు చేరవేసే జర్నలిస్టు.. తాను స్వయంగా ఓ కథనానికి వస్తువైతే ఎలా ఉంటుంది? పదిహేను నెలలుగా కరోనా భూతం కథలను చెబుతూ వచ్చిన నేను ఇప్పుడు ఆ భూతం బాధితురాలిగా మిగిలిపోయా. మా నాన్న ‘స్పీడీ దత్’ను కరోనా కాటేసింది. నా ప్రపంచం కుప్పకూలినంత వేదన అనుభవించా. కోపం... ఆందోళన.. ఒంటరితనం అన్నీ ఒక్కసారి నన్ను చుట్టుముట్టాయి. కరోనా కాలంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న కుటుంబాల కథలే కదా నేను బోలెడన్ని చెప్పింది? అనిపించింది. ఎయిరిండియా మాజీ అధికారి అయిన మా నాన్న వాస్తవానికి ఓ సృజనశీలి. యంత్రాలను ముక్కలు ముక్కలు చేసి వాటిని మళ్లీ జోడించడంలో ఆనందాన్ని అనుభవించేవాడు. మిలమిల మెరిసే కళ్లు... రేపటిపట్ల నిరంతరం ఆశలు కలిగిన, శాస్త్రీయ దృక్పథం ఉన్న వ్యక్తి. మా నుంచి ఏమీ ఆశించని స్త్రీవాద తండ్రి కూడా. సోదరితోపాటు నాకూ నిర్భయంగా ఎక్కడికైనా ఎగిరిపోగల స్వేచ్ఛనిచ్చారు. మా భావోద్వేగాలను కానీ.. సమయాన్ని కానీ ఆశించకుండా.. బుల్లి విమానాలు, రైళ్లను సిద్ధం చేస్తూ గంటల సమయం గడిపేవారు. తన తరువాత ఆ బొమ్మలన్నింటినీ పిల్లల అనాధాశ్రమానికి ఇచ్చేయాలని మాట కూడా తీసుకున్నారు. కోవిడ్ లాంటి విషాదం... మన బంధుమిత్రుల ఆప్యాయతలను, కాలాన్ని మన నుంచి దూరం చేస్తుంది. మన మెదడు, గుండెల్లో వారి జ్ఞాపకాలు తొలుస్తూంటే.. తీసుకున్న నిర్ణయాల్లో తప్పొప్పుల బేరీజు మనలను వెంటాడుతూనే ఉంటాయి. నాన్న చనిపోయి ఐదు రోజులవుతోంది. బుల్లి విమానాలు, రైళ్లు తయారు చేసేందుకు నాన్న సిద్ధం చేసుకున్న యూట్యూబ్ చానల్ ఓపెన్ చేస్తే చాలు... కళ్లల్లోని నీరు అప్రయత్నంగా కిందకు ఒలికిపోతున్నాయి. నాన్నకు మాటిచ్చి బతికుండగా నెరవేర్చేలేకపోయిన పనుల జ్ఞాపకాలు వెంటాడటం మొదలవుతుంది. (హిందుస్థాన్ టైమ్స్‌లో తాను రాసిన కథనాన్ని చూసుకోవాలన్నది వాటిల్లో ఒకటి). కోవిడ్ చుట్టుముట్టినప్పుడు చాలామంది వృద్ధుల మాదిరిగానే ఆయన కూడా ఆసుపత్రిలో చేరేందుకు అంతగా ఇష్టపడలేదు. చివరిరోజుల్లో తన వాళ్లకు దూరంగా ఉండాల్సి వస్తుందని భయపడ్డారేమో. వ్యాధి సోకిన తొలినాళ్లలో వైద్యులు మధ్యమస్థాయి లక్షణాలే కనిపిస్తున్నాయని, ఆక్సిజన్ మోతాదులుగా స్థిరంగా ఉన్నాయని చెప్పారు. ఇంట్లోనే చికిత్స కల్పించేందుకూ అంగీకరించారు. మెదాంతా ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం ఆయన పరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూం డేది. కానీ.. విపత్తు అంతా అకస్మాత్తుగా ముంచుకొచ్చింది. అనూహ్యంగా జ్వరం రావడం.. ఆక్సిజన్ మోతాదులు పడిపోవడం చకచక జరిగిపోయాయి. మెదాంతా ఆసుపత్రి అంబులెన్స్ కోసం వేచి చూస్తే సమయం వృథా అవుతుందేమో అన్న అందోళనలో అప్పటికప్పుడు ఓ ప్రైవేట్ అంబులెన్స్ ఏర్పాటు చేసుకున్నాం. తీరా చూస్తే అది అధ్వానస్థితిలో ఉన్న ఓ మారుతీ వ్యాన్‌గా తేలింది. డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. అవసరమైన ఏర్పాట్లన్నీ ఉన్నాయని, ఆక్సిజన్ సిలిండర్ కూడా పనిచేస్తోందని నమ్మబలకడంతో నేను డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నా. నాన్న అతడి సేవకుడు వెనుకన ఎక్కారు. ట్రాఫిక్‌ను దాటుకుని ఆసుపత్రి చేరేందుకు గంటకుపైగా సమయం పట్టింది. అంతసేపూ నాన్న అసౌకర్యంగానే వ్యాన్‌లోని టేబుల్‌పై పడుకుని ఉన్నారు. అంబులెన్స్‌లు సాఫీగా ప్రయాణిం చేందుకు గ్రీన్‌కారిడార్ ఒకటి ఏర్పాటు చేయాలని ఢిల్లీ పోలీసులను ఎంతో కాలంగా విజ్ఞప్తి చేస్తున్నా.. కర్ఫ్యూ అమలు కోసం రోడ్లపై ఏర్పాటు చేసిన బారికేడ్ల మధ్యనే మా ప్రయాణం సాగింది. శ్మశానంలో గందరగోళం... నాన్నను మెదాంతా ఆసుపత్రికి చేర్చే సమయానికి ఆక్సిజన్ మోతాదులు గణనీయంగా పడిపోయాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చాలని వైద్యులు తెలిపారు. అంబులెన్స్ ముసుగేసుకున్న ఆ డొక్కు వాహనంలోని సిలిండర్ పనిచేయలేదని, నాన్నకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ మాస్కు కూడా సరైంది కాదని అర్థమైంది. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ వైద్యులు మాత్రం తమ శాయశక్తులా ప్రయత్నాలు చేశారు. వారికి నా కృతజ్ఞత మాటల్లో చెప్పలేను. కానీ.. నాన్న కొన్ని రోజుల కంటే ఎక్కువ సమయం బతకలేకపోయారు. రెండు రోజులపాటు వెంటిలేటర్‌పై గడిపి వెళ్లిపోయారు. ఆసుపత్రికి దగ్గరలోనే ఉండే శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన మృతదేహాన్ని తీసుకెళ్లాం. పలుమార్లు వార్తా కథనాల్లో వివరించినట్టుగానే.. అక్కడ కాసింత స్థలం కూడా కరవై ఉంది. కనీసం మూడు కుటుంబాల వారికి ఒకే టోకెన్ నెంబర్ ఒకే సమయానికి ఇవ్వడంతో ఒకపక్క గందరగోళం నడుస్తోంది. కుటుంబాల మధ్య వాగ్వాదం మొదలై అది కాస్తా గొడవకు దారితీసింది. పరిస్థితిని అదుపు చేసేందుకు చెల్లి పోలీసులకు ఫోన్ చేయాల్సి వచ్చింది. జర్నలిస్టుగా ఈ రకమైన సమస్యలపై.. తరచూ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తి ఉంటాను నేను. కానీ.. ఆ ప్రశ్నలన్నీ ఆ సమయంలో నన్నే వెంటాడాయి. ప్రభుత్వం టీకా కార్యక్రమం మరింత ముందుగా మొదలుపెట్టి ఉంటే... మా నాన్న బతికి ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉండేదేమో అనిపించింది. ఇంకో రెండు వారాల్లో రెండో డోసు తీసుకోవాల్సి ఉండగా నాన్న మరణించారు. డొక్కు మారుతీవ్యాన్ కోసం కాకుండా మరికొంత సమయం వేచి ఉండి మెదాంతా అంబులెన్స్‌లోనే నాన్నను ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదా? నాన్న ఇప్పటికీ బతికి ఉండేవాడా? అయితే ఒక్క విషయం ఇంతటి కష్టంలోనూ ఒక జర్నలిస్టుగా నాకు లభించే ‘ప్రత్యేక’ సౌకర్యాల గురించి నాకు గుర్తుంది. వీట న్నింటి కారణంగా నాన్నకు కనీసం బతికేందుకు ఒక మంచి అవకాశమైనా లభించింది. ఆసుపత్రి గేట్ల వద్ద కుప్పకూలుతున్న వారు.. బెడ్లు, ఆక్సిజన్ దొరక్కుండా కన్ను మూస్తున్న వారెందరో! నాన్న మరణంతో అనాథను అయిపోయినా భారత ప్రభుత్వం కారణంగా అనాథలుగా మారిన వారికంటే నేను అదృష్టవంతురాలిననే అనుకుంటున్నా!! బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (హిందూస్థాన్ టైమ్స్ సౌజన్యంతో..) -
అభ్యర్థులు దొరకక... బరిలో నిలవలేక...
ప్రజాస్వామ్యంలో గెలుపు ఓట ములు సహజం. ప్రజల తీర్పును ఎవరైనా హుందాగా స్వీకరించా ల్సిందే. 40 యేళ్ల రాజకీయ అను భవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఆ మాటను పదేపదే చెప్పుకొంటారే తప్ప, ఆ రాజకీయ పరిపక్వతను చేతల్లో చూపరు. 2014 ఎన్నికలలో కేవలం 5 లక్షల ఓట్ల వ్యత్యాసంతో విజయం చేజారినా ఆనాడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వెంటనే ప్రజాతీర్పును శిరసావహిస్తామనీ, ప్రతిపక్షంగా తమ బాధ్యతను నిర్వర్తిస్తామనీ వినమ్రంగా తెలిపారు. కానీ చంద్రబాబు 2019 ఎన్నికలలో కేవలం 23 సీట్లకు పరిమితమైతే ‘మరీ ఇన్ని తక్కువ సీట్లా’ అంటూ ఆశ్చర్యం ప్రదర్శించారే తప్ప, ప్రజాతీర్పును గౌరవించ లేకపోయారు. ఆ ధోరణి ఇటీవల పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా చూపారు. పంచాయితీ ఎన్నికల తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాచి పనులు చేసు కోవడానికి ఇతర రాష్ట్రాలకు పోతున్నారంటూ సామాన్య ప్రజలను చులకన చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పట్ల విసుగెత్తిపోయి దూరం జరిగారని అందదరికీ అర్థం అయిందిగానీ, తనకు అర్థం కానట్లు ఆయన నటిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి లభించిన చారిత్రక విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉక్రోషంతో, ఉడుకుమోతుతనంతో మాట్లాడుతున్న మాటలు ఆయన అపసవ్య మానసిక స్థితికి, దెబ్బతిన్న మానసిక స్థయిర్యానికి ప్రతీక. అధికార పార్టీ చేసే ప్రతి పనిని తప్పుపట్టాలని, వాటిని భూతద్దంతో సొంత మీడియాలో చూపించి ప్రజల సానుభూతి పొందాలని భావిస్తున్నారే తప్ప వేసిన తప్పటడుగుల్ని సరిచేసుకోవాలనే ఉద్దేశం ఎక్కడా కనబడదు. చంద్రబాబు 2014–19 మధ్య అధికారంలో ఉండగా చేసిన తప్పులు సామాన్యమైనవి కావు. తెలంగాణలో అధి కారంలో ఉన్న టీఆర్ఎస్ను దెబ్బతీయడానికి ‘ఓటుకు కోట్లు’ వంటి అనైతిక చర్యకు పాల్పడి అడ్డంగా దొరికిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టాలన్న దుర్బుద్ధితో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఆయన పరిభాషలోనే చెప్పాలంటే సంతలో పశువుల్ని కొన్నట్టు కొనేశారు. అంతకుముందే ప్రతిపక్షనేత జగన్‌పై కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై తప్పుడు కేసులు బనాయించారు. ప్రజ లందర్నీ సమానంగా చూడకుండా ఒక వర్గానికి ఆర్థికంగా ప్రయోజనం కల్పించడానికి అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ప్రజల్లో తన విశ్వసనీయతను తనే దెబ్బ తీసుకొన్నారు. స్థానిక సంస్థలకు 2018లోనే ఎన్నికలు జరగాలి. కానీ, ఆనాడు తన పార్టీకి పరిస్థితులు అనుకూలంగా లేవని భావించి ఎన్నికలను జరపలేదు. అందుకు వంతపాడి నట్లుగా బాబు సొంతమనిషి రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా మారు మాట్లాడలేదు. నిజానికి, దేశంలోని ఐదంచెల స్థానిక సంస్థలకు నిర్ణీత వ్యవధిలో ఎన్నికలు జరిగి స్థానిక ప్రభుత్వాలు ఏర్పడాలన్న ఉద్దేశంతో 1992లో భారత పార్లమెంట్ 73, 74 రాజ్యాంగ సవరణలు తెచ్చింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిం చేందుకు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఏర్పా టయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 1992 తర్వాత రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా నిర్ణీత గడువులో ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర విభజన అనంతరం, ఏడాదిలోగా తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు, కమిషనర్ల నియామకం సజావుగా సాగింది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం విపరీతమైన జాప్యం చేసింది. ఏడాదిన్నర తర్వాత జనవరి 30, 2016న రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవస్థ ఏర్పాటైంది. అయితే, ఎన్నికల కమిషనర్‌ను మాత్రం నియమించలేదు. రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ వద్ద కార్యదర్శిగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చి 31, 2016న పదవీ విరమణ చేశారు. 24 గంటలు తిరగకముందే ఆయన్ని చంద్రబాబు కుర్చీలో కూర్బోబెట్టారు. తన సొంత మనిషిని నియమించడం కోసమే అంతకాలం వేచి చూశారన్నది స్పష్టం. స్థానిక సంస్థలకు గడువు పూర్తయినా ఎన్నికల కమిషనర్ నోరు విప్పలేదంటే అప్పటి ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేసినట్లు తేటతెల్లం అవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ అధికారంలో ఉన్నంతవరకూ ఆయనను కవచంగా పెట్టుకొని చంద్ర బాబు ప్రభుత్వంపై అధర్మ యుద్ధానికి దిగిన వైనం దేశమంతా చూసింది. మార్చి 15, 2020న రాష్ట్ర ప్రభుత్వంతోగానీ, ఏ రాజకీయ పార్టీతోగానీ సంప్రదించకుండా ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేశారు ఎన్నికల కమిషనర్. ఎంపీటీసీ స్థానాలు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవం కావడం చంద్రబాబు సహించలేక పోయారు. చంద్రబాబు ఒత్తిడి మేరకు నిమ్మగడ్డ ఏకగ్రీవాలు జరగడంపై అనుమానాలు ఉన్నాయంటూ, ముఖ్యమంత్రి మీద అభ్యంతరకరమైన పదజాలం వాడుతూ కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. ఆ లేఖ టీడీపీ కార్యాలయంలో రూపొందిన వాస్తవం సీఐడీ దర్యాప్తులో బయటపడింది. ఎంపీటీసీ ఏకగ్రీవాలు బల వంతంగా జరిగివుంటే నిమ్మగడ్డ వెంటనే స్పందించి ఉండే వారు. కానీ తెలుగుదేశం అధినేత ఒత్తిడిపైనే కేంద్రానికి ఫిర్యాదు చేశారని స్పష్టంగా బయటపడింది. పంచాయితీ ఎన్నికల నిర్వహణ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించకుండా మున్సిపల్ ఎన్నిక లను నిర్వహించారు. మార్చి 31, 2021న పదవీ విరమణ చేసేముందు తగిన సమయం ఉన్నప్పటికీ తెలుగుదేశానికి మేలు చేయాలన్న దురుద్దేశం నిమ్మగడ్డలో స్పష్టంగా కని పించింది. అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో పాల్గొ నకుండా వాటిని బహిష్కరిస్తున్నట్లు తెలుగుదేశం చేసిన ప్రకటన ఎవర్నీ ఆశ్చర్యపర్చలేదు. కనీసం అభ్యర్థులను నిలబెట్టలేక కొత్త డ్రామాకు తెర తీసింది. నిమ్మగడ్డ కమి షనర్‌గా ఉండగా తీసుకున్న నిర్ణయాలను సమర్థించిన తెలుగుదేశం నూతన కమిషనర్ నిర్ణయాలను తప్పు పట్టడం ద్వంద్వ నీతి. తమ తప్పులను కప్పిపుచ్చుకొని, తమ వైఫ ల్యాలకు కారణం ప్రజలేనని నిందించిన వారు చరిత్ర హీను లుగా మిగిలిపోయారు. ఇందుకు ఏ ఒక్కరూ అతీతం కాదని ప్రతిపక్షనేత గ్రహిస్తే మంచిది. డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ప్రభుత్వ చీఫ్ విప్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్