మహిళలే నవ భారత నిర్మాతలు | International Womens Day Special Article By Bandaru Dattatreya | Sakshi
Sakshi News home page

మహిళలే నవ భారత నిర్మాతలు

Published Tue, Mar 8 2022 12:25 AM | Last Updated on Tue, Mar 8 2022 12:25 AM

International Womens Day Special Article By Bandaru Dattatreya - Sakshi

ఎన్ని అవరోధాలు, సవాళ్లు ఉన్నప్పటికీ భారతీయ మహిళలు తాము శక్తిమంతులమని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. విజయం సాధించాలనే నిబద్ధతతో ఉత్సాహంగా దూసుకుపోతున్నారు. నైపుణ్యం, గుర్తింపు, గౌరవం సాధించడానికి మహిళలు తాము చేసే ప్రయత్నాలలో ఎప్పటికీ నిరుత్సాహం చెందకుండా ఉండటమే వారిని మనకు నిజమైన ఆదర్శప్రాయులుగా చేస్తోంది. ‘నేటి లింగ సమానత్వమే రేపటి సుస్థిర సమాజం’... ఈ ఏడాది మన మహిళా దినోత్సవ నేపథ్యాంశం. మహిళలే మన నవ భారత నిర్మాతలు.

గొప్ప సంప్రదాయాలు, సమున్నత విలువలతో ప్రాచీన ఘనతను కలిగి వున్న సుసంపన్న భారత దేశంలో మహిళలు ఎల్ల ప్పుడూ తమ ప్రాము ఖ్యాన్ని చాటుతూనే వచ్చారు. ఎన్ని అవ రోధాలు ఉన్నప్పటికీ భారతీయ మహిళలు తాము శక్తిమంతులమని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. రవీంద్రనాథ్‌ టాగోర్‌ మాటల్లో చెప్పాలంటే.. ‘మనకు స్త్రీలు అగ్నిదేవతలు మాత్రమే కాదు. భారతీయాత్మ జ్వాలలు కూడా’.

ధీర వనిత ఝాన్సీరాణి లక్ష్మీబాయి, భారత దేశ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే మొదలు... స్త్రీ విముక్తికి తన జీవితాన్ని అంకితం చేసిన రమాబాయి రణడె వరకూ ఎందరో మహి ళలు సంకల్పబలానికి తిరుగులేని నిదర్శనమై నిలి చారు. సరోజినీ నాయుడు సాహిత్య ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. ఇటీవలి సంవత్సరాలలో సైతం ఎందరో మహిళామణులు అత్యున్నత స్థాయిలో పెద్ద పెద్ద సంస్థల నిర్వహణ చేపట్టి దేశా నికి పథనిర్దేశకులయ్యారు. ఎస్బీఐ తొలి మహిళా చైర్మన్‌ అరుంధతీ భట్టాచార్య, ఓఎన్జీసీ తొలి మహిళా సీఎండీ అల్కా మిట్టల్, ‘సెయిల్‌’ చైర్మన్‌ సోమా మండల్‌.. ఇలా ఎంతోమంది! హరియాణా మహిళ సంతోశ్‌ యాదవ్‌ రెండుసార్లు ఎవరెస్టును అధిరోహించి మహిళాశక్తిని శిఖరాగ్రంపై ప్రతిష్ఠిం చారు. ఇక బాక్సర్‌ మేరీకోమ్‌ పేరు తెలియని ఇల్లుందా భారత దేశంలో! మనమిప్పుడు ‘కార్యా చరణ దశాబ్దం’లోకి ప్రవేశించి ఉన్నాం. 2030 నాటికి సుస్థిరమైన అభివృద్ధిని సాధించి, ఈ భూమండలాన్ని మానవ జీవనానికి మరింత మెరుగైన ప్రదేశంగా మార్చడం మనముందున్న లక్ష్యం. లింగ సమానత్వం; మహిళలు, బాలికల సాధికారత అనేవి కూడా సుస్థిర అభివృద్ధి లక్ష్యా లలో భాగమైనవే. అదే సమయంలో.. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సంక్షోభ నిర్వహణ, సామా జిక అభివృద్ధి, సమాజంలోని బలహీన, అట్టడుగు వర్గాల అభ్యున్నతి, సంక్షేమం..  వీటన్నిటితో కూడిన ‘సుస్థిర భవిష్యత్తు’ అనే లక్ష్యాన్ని మహిళల భాగస్వామ్యంతో మాత్రమే సాధ్యం చేసుకో గలమని మనం గ్రహించాలి.   

నైపుణ్యం, గుర్తింపు, గౌరవం సాధించడానికి మహిళలు తాము చేసే ప్రయత్నాలలో ఎప్పటికీ నిరుత్సాహం చెందకుండా ఉండటమే వారిని మనకు నిజమైన ఆదర్శప్రాయులుగా చేస్తోంది. మహిళల్లోని సామర్థ్యాల గురించి ప్రఖ్యాత అమెరికన్‌ మత గురువు బ్రిగ్‌హామ్‌ యంగ్‌ సరిగ్గానే చెప్పారు. ‘‘మనం ఒక వ్యక్తిని విద్యావంతుడిని చేస్తే ఆ వ్యక్తికి మాత్రమే విద్య అందుతుంది. ఒక మహి ళకు విద్యను అందిస్తే ఒక తరం వారంతా విద్యా వంతులవుతారు’’ అంటారు బ్రిగ్‌హామ్‌. ‘నేటి లింగ సమానత్వమే రేపటి సుస్థిర సమాజం’.. అనే ఈ ఏడాది మహిళా దినోత్సవ ప్రధానాంశం.. బ్రిగ్‌హామ్‌ మాటలకు చక్కగా సరిపోలుతుంది. దేశంలో కోవిడ్‌–19 వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీకా కార్యక్రమాన్ని విజయ వంతం చేయడంలో మహిళలే కీలకమైన పాత్ర పోషించారు. అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి, పాలనా విభాగాలలో ఉన్నత స్థానాలలో ఉన్న మహిళా అధికారుల వరకు అందరూ ఇందుకోసం విశేషకృషి సల్పారు. కోవిడ్‌కు స్వదేశీ ‘కోవ్యాక్సిన్‌’ టీకాను అభివృద్ధి చేయడంలో విశ్వస్థాయి క్రియా శీలత కనబరిచిన భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ ఎండీ సుచిత్రా ఎల్లా ‘పద్మభూషణ్‌’ అందు కున్నారు. 12–18 ఏళ్ల మధ్య వారికి ఇవ్వడం కోసం కోవిడ్‌ టీకాను అభివృద్ధి చేసిన బృందానికి  బయో లాజికల్‌ ఇ కంపెనీ ఎండీ మహిమా దాట్ల నాయ కత్వం వహించి, తక్కువ సమయంలో ఉత్తమ ఫలితాలను సాధించడానికి ప్రేరణ అయ్యారు.

6వ ఆర్థిక అధ్యయనం ప్రకారం దేశంలో 80 లక్షల 5 వేల మంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. స్టార్టప్‌లు (అంకుర సంస్థలు), ముఖ్యంగా మహిళా స్టార్టప్‌లు ఎందుకు మనకు ముఖ్య మైనవి? బెయిన్‌ అండ్‌ కంపెనీ, గూగుల్‌ విశ్లేషణల ప్రకారం 2030 నాటికి మన మహిళా వ్యాపార వేత్తలు 15 – 17 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తారని అంచనా. 2018–21లో దేశంలోని స్టార్టప్‌లు కల్పించిన ఉద్యోగాల సంఖ్య 5 లక్షల 90 వేలు. ఇంత ప్రాముఖ్యం ఉన్న స్టార్టప్‌లను గతంలో చేజార్చుకుని ఉండొచ్చు. వర్తమానంలో తప్పక చేజిక్కించుకోవాలి. 

రాణించాలనే పట్టుదల అమ్మాయిలలో బలంగా ఉంటోంది. ‘ఆజాదీ కా అమృత్‌ మహో త్సవ్‌’లో భాగంగా గతేడాది సెప్టెంబర్‌ 6–12 తేదీల మధ్య కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2,614 మంది స్వయం సహాయక బృందాల మహిళా వ్యాపారులకు కేవలం వారం వ్యవధిలోనే 8 కోట్ల 60 లక్షల రూపాయల రుణాలను ‘కమ్యూ నిటీ ఎంటర్‌ప్రైజ్‌ ఫండ్‌’ లోన్‌ కింద అందించింది. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలు తమను తాము శక్తిమంతం చేసుకోవడమే కాకుండా మన ఆర్థిక వ్యవస్థకూ నిలకడైన స్థిరత్వాన్ని చేకూర్చుతున్నారు. గత 6–7 ఏళ్లలో మహిళా స్వయం సహాయక సంఘాల ఉద్యమం విస్తృతం అయింది. నేడు దేశవ్యాప్తంగా 70 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. అర్థం చేసుకో వలసినది ఏమిటంటే, స్త్రీల శక్తి సామర్థ్యాలు దేశాన్ని గొప్ప శిఖరాలకు తీసుకు వెళతాయని!


బండారు దత్తాత్రేయ 
వ్యాసకర్త హరియాణా రాష్ట్ర గవర్నర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement