
దేశం కోసం ఆమె
స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని కాంక్షిస్తున్న నేపథ్యంలో వివిధ రంగాలకు నిర్దిష్ట లక్ష్యాలు నిర్వచించుకున్నాం. ఈ లక్ష్యం నెరవేరడంలో సైన్స్ కీలకపాత్ర పోషించనుంది. అయితే, భారతీయ శాస్త్ర రంగం అక్కడక్కడ కొన్ని సంస్థల్లో కనిపించే అద్భుతంగా ఉండకూడదు. సామాజిక సమస్యల పరిష్కారానికి అన్నిచోట్లా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా మారాలి.
ఇవన్నీ జరగాలంటే, ప్రాథమిక విద్య నుంచి స్నాతకోత్తరం వరకూ శాస్త్ర రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెరగాలి. ప్రభావశీల పరిశోధనలకు ఇచ్చే ప్రోత్సాహకాలు, బహుమతులు పెరగాలి. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్‌రంగంతో ప్రభుత్వ భాగస్వామ్యం, సమాజంలోని అట్టడుగు వర్గాలు ముఖ్యంగా మహిళల ప్రాతినిధ్యం పెరగాలి.హేతుబద్ధమైన, ససాక్ష్యాలతో కూడిన పరిష్కారాలను చూపడం మొదలుపెడితే ప్రజాభిప్రాయం శాస్త్రవేత్తల నిర్ణయాలతో ఏకీభవిస్తుందని కోవిడ్ సమయంలో నిరూపితమైంది. మన అభివృద్ధిని అడ్డుకునే... పరిష్కారం లేని, రిస్క్ కారణంగా ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టని శాస్త్రపరమైన సమస్యలపై తక్షణం ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
బయో–ఈ3, నేషనల్ క్వాంటమ్ మిషన్ , డీప్ ఓషన్ మిషన్ వంటివి ఇలాంటి సమస్యల పరిష్కారం దిశగా శాస్త్రవేత్తల దృష్టిని కేంద్రీకరించేందుకు ప్రయత్నించాయి. ప్రోత్సాహకరమైన విషయం ఏమిటంటే, ఈ ఏడాది బడ్జెట్‌లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలకు కేటాయింపులు రెట్టింపు కంటే పెరగడం.దేశంలోని శాస్త్ర పరిశోధనశాలల్లో మూలనపడ్డ అద్భుతమైన ఆవిష్కరణలు ఉన్నాయడంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. ప్రోత్సాహకాల లేమితో ఇవి ముందుకు కదలడం లేదు. వాయు కాలుష్యం, నీటిలోని సీసం, ఆర్సెనిక్ విషాల ఏరివేత, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ కాలుష్యం, ముఖ్యంగా జలవనరులకు సంబంధించిన సమస్యలను శాస్త్ర పరిశోధన సంస్థలు కలిసికట్టుగా చేపట్టాలి.
దేశ సమస్యలకు శాస్త్ర ఆధారిత పరిష్కారాలు కనుక్కునేందుకు అవసరమైన మౌలిక పరిశో ధనలకు కేంద్రం సంస్థాగత గ్రాంట్ల రూపంలో అధి కంగా సాయపడాలి. ఇదే సమయంలో అప్లికేషన్స్, వాటి వాణిజ్యీకరణ, పరిశోధనలను మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లడం వంటివి భాగస్వామ్య ఏర్పా ట్లతో ప్రోత్సహించవచ్చు. దేశంలో శాస్త్ర పరిశోధన సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపు తున్న సంస్థలు క్రమేపీ పెరుగుతున్నాయి. టాటా గ్రూపు లాంటివి వందేళ్లుగా ఈ పని చేస్తున్నాయి. ప్రభుత్వ నిధులకు ప్రైవేట్ పెట్టుబడులు, దేశీ దాతలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు తోడైతే సమాజానికి ఉపయోగపడే పరిశోధనలకు ఊతమివ్వవచ్చు.
మహిళలకు సముచిత స్థానం...
భారతీయ మహిళలు చాలా రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. పురిటిబిడ్డను కోల్పోయిన బాధ ఆనందీబాయి జోషీని ఎన్నో అడ్డంకులు అధిగమించి వైద్యశాస్త్రం చదువుకునేలా చేసింది. అది కూడా అమెరికాలోని పెన్సిల్వేనియా మహిళా కళాశాలలో. 1886లోనే ఈ ఘనత సాధించిన తొలి భారతీయ వైద్యురాలు ఆమె. దురదృష్టవశాత్తూ ఆ మరుసటి ఏడాదే ఆమె క్షయ వ్యాధికి బలైనా... ఎంతో మంది మహిళలు వైద్యం, వైద్య పరిశోధనల రంగాలను ఎంచుకునేందుకు స్ఫూర్తిగా నిలిచారు.
ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కానీ... ‘స్టెమ్’ రంగాల్లో (సైన్ ్స, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మేథమేటిక్స్) భారతీయ మహిళల భాగస్వామ్యం తక్కువ. ఈ రంగాల్లో కోర్సులందిస్తున్నసంస్థలపై ఇటీవల ఒక అధ్యయనం జరిగింది. అక్కడి బోధన సిబ్బందిలో కేవలం 16.6 శాతం మంది మాత్రమే మహిళలు. నేషనల్ ఇన్ స్టిట్యూషనల్ రీసెర్చ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ ఐఆర్‌ఎఫ్) జాబితాలోని టాప్ ఎనిమిది సంస్థల్లో ఇది 10 శాతానికి మించడం లేదు.
ఈ మహిళల్లోనూ 26.2 శాతం మంది మాత్రమే సీనియర్ స్థానాల్లో ఉన్నారు. దీన్నిబట్టే మహిళల విషయంలో ఎన్ని అసమానతలు ఉన్నాయో అర్థమవుతుంది. మహిళలు నాయకత్వ స్థానాల్లో ఉంటే సంస్థల సమర్థత పెరుగుతుందనీ, వ్యవహారాలు పారదర్శకంగా ఉంటాయనీ, పనులు సమతుల్యతతో సాగుతాయనీ దశాబ్దాల అధ్యయనాలు చెబుతున్నాయి.
దేశంలోని శాస్త్ర, వైద్య సంస్థల్లోని ఈ అసమానతలను సరిదిద్దాలంటే మొత్తం వ్యవస్థలో మార్పులు చేయాల్సి ఉంటుంది. వనరుల కేటాయింపు, టాలెంట్ మేనేజ్‌మెంట్, పదోన్నతులు, బదిలీల వంటిఅంశాలపై నిర్ణయాలు తీసుకునే వ్యవస్థల్లో మహిళలకు తగిన భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలి. అన్ని స్థాయుల్లోనూ మహిళలకు ఉద్యోగాల విషయంలో తగిన సలహాలు ఇచ్చేందుకు, శిక్షణ వంటివి కల్పించేందుకు ఏర్పాట్లు ఉండాలి. శిశు సంరక్షణ, డే కేర్ సర్వీసులు, ప్రసూతి సెలవులు, పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేకమైన గదులు, పని వేళల్లో వెసలుబాటు, ఇంట్లోంచే పని చేసే అవకాశాలు అన్ని స్థాయుల్లోనూ కల్పించాలి. మహిళలు మళ్లీ ఉద్యోగాల్లో చేరేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయి.
వ్యవసాయం, ఆహార భద్రత, అంతరిక్ష ప్రయోగాలు, రక్షణ రంగ తయారీ, టీకాలు, వ్యాధి నిర్ధా రణ, ఫార్మా, ఐటీ వంటి అనేక రంగాల్లో భారతీయ శాస్త్రవేత్తల సామర్థ్యం, నాయకత్వం రెండింటికీ ఇప్పటికే ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఈ విజయాల నుంచి స్ఫూర్తి పొందుదాం.
-వ్యాసకర్త ‘ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ’ చైర్‌పర్సన్
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
-డా‘‘ సౌమ్య స్వామినాథన్
ఆమె కోసం అతను
సందర్భం
స్త్రీలు– ఎవరి నొప్పికి వారే మందు వేసుకుంటూ, ఎవరి యుద్ధం వాళ్ళే చేస్తూ, ఆకాశంలో సగాలమని నినదిస్తూ, పడుతూ, రెట్టింపు బలంతో లేస్తూ– చలిచీమల కవాతుకి అర్ధ శతాబ్ది. కడచి వచ్చిన కాలాలను ఈ మహిళా దినోత్సవం రోజున పాఠకురాలిగా తిరిగి చూడటమంటే వెన్ను నిలబెట్టిన అక్షరాలని కావిలించుకోవడం. ఎన్నెన్ని కథలు, కవిత్వాలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు మీకోసం మేమున్నామని భుజంమీద చేయివేసి కన్నీరు తుడిచాయి! అక్షరాలలో దట్టించిన ధైర్యం, విశ్వాసం, విజ్ఞానం, పోరాటం నలుగడలా కమ్ముకుని స్త్రీశక్తి విస్ఫోటనమై ఎన్నెన్ని కొత్త విలువలు బారులు తీరాయి! ఇప్పటి, మునుపటి తరాల ముందుచూపు కవులకి, రచయితలకివందనాలు.
ఆడపిల్లలను అమ్ముకుంటున్న రోజుల్లో, అతిబాల్య, అతివృద్ధ వివాహాల మారకంలో స్త్రీ వస్తువైన రోజుల్లో– ‘మగడు వేల్పన పాతమాట, ప్రాణసఖుడ’ని చెప్పి, ‘ఆధునిక మహిళ చరిత్ర పునర్లిఖిస్తుంద’ని నమ్మిన క్రాంతదర్శికి కృతజ్ఞతలు. ఒకటీ అరా ఘటనలు పట్టుకుని స్త్రీలు ఎంత నేరస్థులో నిరూపించడానికి వర్తమాన మీడియా ప్రయత్నిస్తున్న కాలాన– ‘స్త్రీల మీద ప్రపంచానికి యింత అపనమ్మకం గనుకనూ స్త్రీని శీలం విషయమై damn చెయ్యడమూ, గాయం చెయ్యడమూ ఇంత సులభం గనుకనూ స్త్రీ శీలం తన సొమ్మని పురుషుడు అనుకోవడం వల్లనూ స్త్రీని శిక్షించే అధికారం ప్రతి పురుషునికీఉండటం వల్లనూ స్త్రీ ఇంత మోసగత్తె అబద్ధీకురాలు ఐ జీవితమంతా నటిస్తోంద’ని స్త్రీల చెడుగు వెనుక కారణాలను బట్టబయలు చేసిన స్వేచ్చా మూర్తిని స్మరించుకుంటూ ముంజేతిపై నాలుగు ముద్దులు.
స్త్రీల నవ్వు, నడక, మాట దుస్తులబట్టి ఆమెలైంగిక వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్న ఈ మాయదారి కాలంలో– చెడిపోయిన మనుషులను, సవతి తల్లి, కొడుకుల ప్రేమబంధాన్ని ఒప్పించేలా రాసి, ‘మనిషి నుంచి మనిషికి సాధ్యమైనంత హెచ్చు ఉపకారమూ సాధ్యమైనంత తక్కువ అపకారమూ జరిగేలా చూసు కోవడమే నీతి. తక్కిన బూటకపు నీతి నియమాలను నమ్మకండి’ అన్న భావ విప్లవకారునికి శాల్యూట్. ఉన్నదంతా కుటుంబానికి పెట్టి, అన్నిటికోసం చేయి సాచాల్సి వచ్చే స్త్రీలకి కొదవలేని మనదేశంలో– ‘అది నా ఇల్లు కాదా అని అడిగావు.
అది నా ఇల్లు కాదు. ఒకప్పుడు నాదే అనుకున్నాను. ఆ ఇల్లు, మా ఆయన పెంచుకొంటున్న కుక్కదెట్లా కాదో, నాదీ అట్లానే కాదు. ఆయన కుక్కనీ అపేక్షగానే చూసుకొంటారు. నన్నూ ఆపేక్షగానే చూసుకొంటారు. అంతమాత్రాన ఆయనకులాగా మాకు ఇంటిమీద హక్కులుండవు. మేము మా బాధ్యతలు నిర్వహించడం ద్వారా ఆయన ఆపేక్షని ప్రతిఫలంగా పొందగలిగాము.
అంతే!’ అని ధీమాగా చెప్పిన ఆమె కోసం ఒకఇంటిని దృఢంగా నిర్మించిన మంచి రచయితకు ధన్యవాదాలు.అరవై దాటితే ఇక జీవితం బోనస్ అంటూ స్త్రీలకి ప్రో ఏజింగ్ మెళకువలను తిరస్కరించే సమాజంలో – ‘చీకటిని చూసో, పరిసరాలలోని అపరిచితత్వాన్ని చూసో భయం వేసినప్పుడు, ఆకలితో బెంగతో జ్వరంతో జీవనలౌల్యాల తీరనిమంకుతనంతో అల్లాడినప్పుడు, ఒక్కసారి గుక్కపట్టి ఏడ్వాలనిపిస్తుంది. లాలన, రక్షణ ఇవ్వగలిగే ఒకే ఒక్క అమ్మని పిలవాలనిపిస్తుంద’ని తల్లి విలువని గుర్తించిన పసిబాలునికి కావిలింతలు. తన కుటుంబ స్త్రీలు తప్ప తక్కినవారంతా అవైలబుల్ వస్తువులుగా కనపడే మెజారిటీ మగ సమాజంలో– ‘బాగ్ ఒక మూలకి పడేసి, కుర్చీలోంచి నా కాళ్ళు తీసి అక్కడ కూర్చుని కళ్ళు మూసుకుని ‘యాభై వచ్చాయి.
రెండునెలల నుంచి మెన్సెస్ రాలేదు. ఇప్పుడేమో రెండురోజుల నుంచి బ్లీడింగ్’ (I know that is not the complete story) ‘‘ఊ’’ అంటాను. ‘ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి పది అయ్యింది.బ్లూ ఫిలిమ్స్ చూస్తూ కూర్చున్నాడు. ఓపిక లేదన్నా వినలేదు, బ్లీడింగ్ అవుతుందని చెబుతున్నా...’ అనేక ఆమెలపై సాగే హింసలను ఒకచోట ముద్దచేసి కళ్లముందు పెట్టుకుని ఆ నెప్పినంతా తానే తీసేసు కోవాలన్నంతగా తపించే పువ్వులాంటి మనసున్న కవికి కరచాలనం.
స్త్రీల విలువను గుర్తించేవారు...
ఇతర మతాలు, ఆచారాలు, అలవాట్ల పట్ల వల్లమాలిన ద్వేషాన్ని నూరిపోస్తున్న మెజారిటీ మత రాజకీయ చదరంగంలో– ‘పువ్వులు రాల్చుకునీ రాల్చుకునీ/ నన్ను కాడగా మిగిల్చావు/ ఇంకా ఏం మిగిలిందని/ ఈ కంకాళంపై కారుమబ్బు కప్పి నడిపిస్తున్నావు/ నా ముఖానికి వేలాడేసిన నఖాబ్/ ఎత్తి చూశావా ఎన్నడైనా/ నా కళ్లు/ రెండు అమాస చంద్రుళ్లను మోస్తుంటాయ్’ అంటూ స్వజనులు చూపే వివక్షని నిలదీసిన సాహసికి సలాములు.
స్త్రీలు, తాము ఎవరిని ఎపుడు పెళ్లి చేసుకోవాలో సొంతంగా నిర్ణయం తీసుకోగల హక్కుని నిరాకరించే కుటుంబాలున్న సామాజిక చట్రంలో– ‘మీ ఊరికి మా వాడకి మధ్య ఎద్దుతునకల దండెం కడదాం /కాస్త మీ ఇంట్లో ఉన్న జంధ్యం తీసుకు రారాదూ /కులం గీతలు దాటిన ప్రేమలు చంపబడుతున్న చోట /పారుతున్న నెత్తుటి ప్రవాహంలో నిలబడి అడుగుతున్నా/ రావే పిల్లా రా/ హద్దులన్నీ చెరిపేసి/ సరిహద్దులు లేని సమాజంలోకి నడుద్దా’మంటూ స్త్రీలు కులాలు దాటగలరని నమ్మి, చేయందించిన ప్రేమికునికి వందనం.
కొందరుంటారు, తమ ఆధిపత్యాలకి తామే గండికొట్టుకుని చుట్టూ తనకలాడుతున్న ఆరాట పోరాటాలతో మమేకమయ్యేవారు. కొందరున్నారు తమ జీవితాల్లో మేలిమి భాగమైన స్త్రీల విలువని గుర్తించి అక్షరాలలో నిలబెట్టినవారు. వారందరి తపనని, ప్రేమని, అక్కరని, బాధ్యతని గుర్తు చేసుకుంటూ, అభినందిస్తూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
-వ్యాసకర్త ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏపీ కార్యదర్శి
malleswari.kn2008@gmail.com
-కె.ఎన్. మల్లీశ్వరి