
సందర్భం
కడప కేంద్రంగా 2006లో రాయలసీమ, అనంత, పినాకిని గ్రామీణ బ్యాంకుల విలీనంతో ‘ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు’ (ఏపీజీబీ) ప్రారంభమైంది. గత 18 ఏళ్లలో, స్థానిక అవసరాలకు అనుగుణంగా, కొత్త సాంకేతిక తను స్వీకరిస్తూ, మంచి వ్యాపార ఫలితాలతో 10 జిల్లాల పరిధిలో పనిచేస్తున్నది. రాజకీయ అనిశ్చితులు, మార్కెట్ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, తన పరిధిలో వెనకబడిన ప్రాంతాల స్థానిక అభివృద్ధికి ఆసరాగా నిలిచింది.
ఈ రోజు, దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ బ్యాంకుగా పేరు తెచ్చుకుంది. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం ‘వన్ స్టేట్, వన్ రూరల్ బ్యాంక్’ విధానంతో రాష్ట్ర స్థాయిలో ఒకే గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో... ఏపీజీబీ భవి ష్యత్తు ఏమిటి? దాని ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగితే ఈ ప్రాంతానికి ఎంత మేలు జరుగుతుంది? అమరావతికి తరలిపోతే రూరల్ బ్యాంకింగ్ లక్ష్యాలకు, ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎంత నష్టం వాటిల్లుతుంది అన్న ప్రశ్నలపై లోతైన చర్చ అవసరం.
గతంలో పినాకిని (నెల్లూరు), అనంత (అనంత పురం), రాయలసీమ (కడప) గ్రామీణ బ్యాంకులు విలీనమైనప్పుడు, రాయలసీమ బ్యాంకు అతిపెద్దది కావడంతో ప్రధాన కార్యాలయం కడపలో ఏర్పాటైంది. ఈ సంప్రదాయం ఇప్పుడూ కొనసాగాలి. ప్రస్తుతం, ఏపీజీబీలో చిత్తూరు కేంద్రంగా ఉన్న సప్తగిరి,గుంటూరు కేంద్రంగా ఉన్న చైతన్య గోదావరి, వరంగల్ కేంద్రంగా ఉన్న ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులు విలీనం కానున్నాయి. వ్యాపారం, ప్రత్యేకతలు, సామర్థ్యం... ఇలా ఏ కోణంలో చూసినా ఈ నాలుగు గ్రామీణ బ్యాంకులలో ఏపీజీబీ అగ్రగామి. అందుకే, కొత్త రాష్ట్రస్థాయి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యా లయం కడపలోనే ఉండాలి.
2024 నవంబర్ 4న కేంద్ర ఆర్థిక శాఖలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆర్.ఆర్.బి. విభాగం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, విలీనం తర్వాత ప్రధాన కార్యాలయం అతిపెద్ద బ్యాంకు యొక్క కేంద్రంలోనే ఉండాలి. ఈ మార్గదర్శకాన్ని గౌరవించాలి.
అమరావతి వాదన ఎవరి కోసం?
రాష్ట్ర రాజధానిలో ప్రధాన కార్యాలయం ఉండా లన్న వాదన ప్రజల మనోభావం కాదు – ఇది స్పాన్సర్ బ్యాంకుల రాజకీయం, పాలకవర్గాల స్వార్థం. అమరా వతిని ముందుకు తెచ్చే ఈ ప్రయత్నం వెనుక రాష్ట్ర ప్రభుత్వ కేంద్రీకృత అభివృద్ధికి ప్రాతినిధ్యం వహించే సిఫారసులు, కేంద్రం యొక్క విభజన హామీల నిర్లక్ష్యం ఉన్నాయి. ఇది రాజకీయ ఒత్తిడికి లోనైన నిర్ణయమే అవుతుంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని చాలా గ్రామీణ బ్యాంకులు రాజధానుల్లో కానీ, రాష్ట్రం నడిబొడ్డున కానీ లేకుండానే విజయవంతంగా నడుస్తున్నాయి.
అరుణాచల్ ప్రదేశ్ (నహర్లగున్), కేరళ (మళప్పురం), మహారాష్ట్ర (ఔరంగాబాద్), పంజాబ్ (కపుర్తలా) గ్రామీణ బ్యాంకులు ఇందుకు ఉదా హరణలు. ఈ వాస్తవాన్ని విస్మరించరాదు. రాయల సీమకు రాష్ట్రావతరణ నుంచీ అన్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ బ్యాంకును అమరావతికి తరలించి మరో అన్యాయానికి ప్రభుత్వం పాల్పడ కూడదు.
ఏపీజీబీ దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ బ్యాంకు. రాష్ట్ర గ్రామీణ బ్యాంకుల వ్యాపారంలో 43 శాతం (రూ. 56,056 కోట్లు) దీనిదే. 25.65 శాతం మూలధన సామర్థ్యం, 86.75 లక్షల కస్టమర్లు, 551 శాఖలు,రూ. 1,400 కోట్ల రిజర్వులు– ఇవన్నీ ఏపీజీబీ ఔన్న త్యాన్ని చాటుతాయి. కిసాన్ కార్డులు, ఎమ్ఎస్ఎమ్ ఈలకు రూ. 50 లక్షల రుణాలు, 2,934 ఆర్థిక సాక్షరతా శిబిరాల ఏర్పాటు వంటి సేవలను 2,775 గ్రామాలకు అందించడం ద్వారా... మొత్తం రాయలసీమలోనే కాక, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో సైతం ప్రజల జీవనోపాధి పెరగడానికి కారణమయ్యింది. అటువంటి బ్యాంకు అమరావతికి తరలితే, ఈ రూరల్ ఎకోసిస్టమ్ కుప్ప కూలుతుంది.
రూరల్ బ్యాంకింగ్ లక్ష్యం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి. కడప ప్రధాన కేంద్రంగా ఏపీజీబీ ఈ లక్ష్యాన్ని నెరవేర్చింది. ‘అమరావతి’ రాజకీయ కేంద్రీ కరణకు ప్రతీక అయితే, ‘కడప’ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆలంబన. ఇక్కడి పౌర సమాజం, రైతులు, కార్మికులు, రాజకీయ పక్షాలు అందరూ అమరావతికి ఏపీజీబీ తరలింపును వ్యతిరేకిస్తున్నారు.
అధికార పక్షా నికి కడప పట్ల సానుకూలత ఉన్నా, నాయకుడిని కాదని బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి. వైసీపీ ఎంపీలు అమరావతికి వ్యతిరేకంగా పార్లమెంటులో గళమెత్తారు, కేంద్రానికి లేఖలు రాశారు. కాబట్టి కడపకు అనుకూలంగా ఉన్న ఈ ఏకాభిప్రాయాన్ని కాదనడం అన్యాయం. అవసరమైతే, అమరావతిలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయవచ్చు.
ఒకవేళ కడపలో కేంద్ర కార్యాలయం ఉంచడం సాధ్యం కాకపోతే ఏపీజీబీ, సప్తగిరి బ్యాంకులను రాష్ట్ర స్థాయి విలీన ప్రక్రియ నుంచి మినహాయించాలి. ఆ రెండు బ్యాంకులను మాత్రమే విలీనం చేసి కడప కేంద్రంగా ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి నడపాలి. ఏపీజీబీ 18 ఏళ్ల అనుభవం, నెట్వర్క్,సాంకేతికత రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ఆధారం. అందువల్ల, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలి. రాయలసీమ ఆర్థిక భవిష్యత్తు దెబ్బతినకుండా చూడాలి!
రఘునాథరెడ్డి అలవలపాటి
వ్యాసకర్త రాయలసీమ ఆకాంక్షల పౌరవేదిక కోఆర్డినేటర్ ‘ 85238 41285