
‘బిమ్‌స్టెక్’ సమావేశంలో ఇతర దేశాల నాయకులతో మోదీ
విశ్లేషణ
ప్రధాని మోదీ ఈ నెల మొదటి వారంలో రెండు ఉపయోగకరమైన విదేశీ పర్యటనలు జరిపారు. మొదటిది – 4వ తేదీన థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన ‘బిమ్ స్టెక్’ శిఖరాగ్ర సమావేశం కోసం. రెండవది – ఆ మరునాడు శ్రీలంకకు! ఈ రెండూ దేశ ప్రయోజనాలకు అవసరమైనవి కాగా, అద నంగా మరొకటి చెప్పుకోవాలి. బ్యాంకాక్‌లో ఆయన బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహా దారు మహమ్మద్ యూనుస్‌తో విడిగా సమావేశం కావటం.
లుక్ ఈస్ట్ – యాక్ట్ ఈస్ట్
వివిధ దేశాల మధ్య పరస్పర సహకారాలే కాకుండా ఒక ప్రాంతానికి చెందిన దేశాల మధ్య అందుకోసం ప్రాంతీయ సంస్థలు ఏర్పడటం ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధ కాలం తర్వాత నుంచి ఉండగా, ఆ క్రమంలో ఇండియాకు సంబంధించి 1997లో వచ్చిందే ‘బిమ్‌స్టెక్’. ఇటువంటివి సార్క్, హిందూ మహాసముద్ర తీర దేశాల సంస్థల పేరిట కూడా ఏర్పడ్డాయి గానీ, కారణాలు ఏవైనా అవి సంతృప్తికరంగా పనిచేయలేదు. ఆగ్నేయాసియాకు సంబంధించి 1967 నుంచి గత 57 ఏళ్లుగా విజయవంతంగా పనిచేస్తున్నది ‘ఆసి యాన్’ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్) ఒక్కటే.
‘ఆసియాన్’ దేశాలన్నీ భారత్ కన్నా చాలా చిన్నవి. వాటి ఆర్థిక వ్యవస్థలు కూడా చిన్నవే. ఆ పరిస్థితితో పోల్చినప్పుడు భారత్ కేంద్రంగా ఒక బలమైన ఆర్థిక సహకార వ్యవస్థ ఎప్పుడో ఏర్పడి బల పడ వలసింది. కానీ, విధానపరమైన లోపాల వల్ల ప్రభుత్వాలు కొంత కాలం అప్పటి సోవియట్ వైపు, తర్వాత పాశ్చాత్య ప్రపంచంవైపు చూశాయి గానీ చుట్టూ గల ఆసియా దేశాలను నిర్లక్ష్యం చేశాయి. ఈ వెనుకటి విధానాలకు భిన్నంగా మొదటిసారిగా ‘లుక్ ఈస్ట్’ పేరిట కొత్త విధానాన్ని ముందుకు తెచ్చింది, 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు.
ఆ విధంగా కొత్త దృష్టి అయితే ఏర్పడింది గానీ, ఆయనే అమలుకు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, వాటి అవసరాలను బట్టి అయినా తూర్పు దేశాలతో ఆర్థిక సంబంధాలు తగినంత అభివృద్ధి చెందలేదు. పీవీ ఐదేళ్ల పాలన తర్వాత రాజకీయ అస్థిరతలు ఏర్పడటం అందుకొక ముఖ్య కారణం. అప్పటికీ, విదేశాంగ వ్యవహారాలలో నిపుణుడైన గుజ్రాల్ నేషనల్ ఫ్రంట్, యునై టెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల కాలంలో విదేశాంగ మంత్రిగా, ప్రధానిగా పని చేసినపుడు 1997లో ‘బిమ్‌స్టెక్’ కోసం చొరవ తీసుకున్నారు.
‘బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ– సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కో ఆపరేషన్’ పేరిట ఏర్పడిన ఆ సంస్థలో మొదట ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్‌లాండ్ సభ్య దేశాలు కాగా, తర్వాత నేపాల్, భూటాన్, మయన్మార్ చేరాయి. మోదీ ప్రధాని అయిన తర్వాత ‘లుక్ ఈస్ట్’ను ‘యాక్ట్ ఈస్ట్’గా మార్చి కొంత చురుకుదనం తెచ్చారు.
సుదీర్ఘ అశ్రద్ధ
ఇతర ఆసియా దేశాలతో కన్నా ‘బిమ్‌స్టెక్’ మధ్య సంబంధాలు మందకొడిగానే ఉన్నాయి. సంస్థ ఆర్థిక, రక్షణ సహకార విషయాలు అధికారుల స్థాయికి పరిమితం కాగా, ఈ నెల నాల్గవ తేదీ నాటి శిఖరాగ్ర సమావేశం ఏడేళ్ల తర్వాత జరగటం గమనించదగ్గది. ఏడు సభ్య దేశాలలో నేపాల్, భూటాన్ చిన్నవి, సముద్ర తీరం లేనివి అను కున్నా, తక్కిన అయిదు కూడా ముఖ్యమైనవి, సముద్ర తీరం గలవి. సముద్ర మార్గ రవాణాలు, రక్షణలకు కీలకమైన ప్రదేశాల్లో ఉన్నాయి.
ఈ రెండు అంశాలను ‘బిమ్‌స్టెక్’ లక్ష్యాలలో ప్రముఖంగా పేర్కొ న్నారు కూడా! అయినప్పటికీ ఇంతకాలం కనిపించిన అలసత్వ వైఖరులు వాటికవే సరైనవి కాదు. ఈ పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, థాయ్‌లాండ్‌లతో చైనా సన్నిహితమయ్యింది. అనగా, ఇండియాకు భౌగోళికంగా దగ్గరగా ఉండి, బంగాళాఖాత తీర ప్రాంతానివి అయి కూడా భారత్ వాటిని ‘బిమ్ స్టెక్’ ఏర్పాటు తర్వాత సైతం దగ్గర చేసుకోలేక, చైనాతో పోటీపడాల్సి వస్తున్న దన్నమాట.
సంస్థలోని తక్కిన దేశాలకన్న భారత ప్రయోజనాలు విస్తృతమైనవి కావటం, బంగాళాఖాతం కీలక ప్రాంతంలో, అందులోనూ హిందూ మహాసముద్రానికి అనుసంధానమై ఉండ టాన్ని బట్టి అటువంటి చొరవలు ఇండియాకే ఎక్కువ అవసరం. అయినా సుదీర్ఘ కాలం అశ్రద్ధలన్నవి ఎంత పొరపాటో చెప్పనక్కర లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా తిరిగి శిఖరాగ్ర సమావేశం జరగటం మంచి పని.
ట్రంప్ సుంకాల హెచ్చింపు చర్యలు సృష్టిస్తున్న ఒత్తిడుల మధ్య జరగటం మరింత మంచిదవు తున్నది. సమావేశంలో చర్చించిన ఆర్థిక సహకారం, అభివృద్ధి, శాస్త్ర–సాంకేతిక రంగాలు, రక్షణ వంటి అంశాలు షరా మామూలువే అయినా, ‘ప్రపంచంలో ఏర్పడుతున్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా పరస్పర అభివృద్ధిపై దృష్టి పెట్టడం’ అన్నది ప్రత్యేకంగా గమనించ వలసిన ప్రకటన.
బంగ్లా, లంకలతో సంబంధాలు
పోతే, ఇదే సంస్థలోని పొరుగు దేశమైన బంగ్లా నాయకునితో మోదీ సమావేశం, సంబంధాల పునరుద్ధరణకు దారితీసినట్లయితే ఉభయులకూ మేలు చేస్తుంది. ఇండియా జోక్యంతో 1971లో ఏర్ప డిన ఆ దేశంతో సంబంధాలు ఈ 55 ఏళ్ళలో తరచూ ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రధాని షేక్ హసీనా పతనం నుంచి కొద్ది నెలలుగా తిరిగి అదే పరిస్థితి తలెత్తింది. ఈ నాయకులిద్దరూ బ్యాంకాక్‌లో అసలు విడిగా సమావేశమవుతారా అనే సందేహాలుండేవి.
కానీ, భారత ప్రధానికి అందజేసేందుకు బంగ్లా నాయకుడు జ్ఞాపక చిహ్నంగా ఒక పాత చిత్రాన్ని వెంట తీసుకువచ్చారంటేనే సామరస్య వైఖరి కనిపిస్తున్నది. బంగ్లాలో త్వరలో జరుగనున్న ఎన్నికలలో ఎవరు అధికారానికి రాగలదీ తెలియదు. ఇండియా మిత్ర పక్షమ నుకునే షేక్ హసీనా ‘అవామీ లీగ్’కు మాత్రం అవకాశాలు కన్పించటం లేదు.
ఇండియాలో అనధికార శరణార్థి రూపంలో ఉన్న ఆమెను విచారణ నిమిత్తం తమకు అప్పగించాలని బ్యాంకాక్‌లో మోదీని బంగ్లా నాయకుడు మరొకమారు కోరారు. ఇరు దేశాల సంబంధాలలో ఇదొక చిక్కు ప్రశ్న. అక్కడ హిందువులపై దాడుల సమస్య అట్లానే ఉంది. వీటన్నింటినీ అధిగమిస్తూ ‘బిమ్‌స్టెక్’ లక్ష్యాల వైపు కదలటం రెండు దేశాలకూ పెద్ద పరీక్షే. కానీ ఉత్తీర్ణత సాధించక తప్పని పరీక్ష.
శ్రీలంక విషయానికి వస్తే, భౌగోళికతలు, ఆర్థిక, రక్షణ అవస రాలు, పరస్పర సహకారాలు, విభేదాలు అన్నింటి విషయాలలోనూ ఇండియా సంబంధాలు బంగ్లాదేశ్‌ను పోలి ఉండటం యాదృచ్ఛికమే కావచ్చు. అక్కడ సరికొత్త శక్తులు పూర్తి మెజారిటీలతో గెలిచి అధికారానికి రావటంతో పరిస్థితులు మారాయి. కొత్త అధ్యక్షుడు దిస్సనాయకే, దేశంలో నెలకొని ఉన్న సమస్యలు, వాటి నుంచి బయటపడి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలనే పట్టుదల వల్ల, భారతదేశంతో గతంలో ఉండిన విభేదాలను మరచిపోయి పరస్పర సహకారం కోసం ప్రయత్నిస్తున్నారు.
చైనాకు ఎంత సన్నిహితమైనా, తమ విధానం సంతులనమని కొత్తలోనే ప్రకటించటం, చైనా కన్న భారత్‌ను మొదట సందర్శించటం దిస్సనాయకే దౌత్యనీతికి రుజువులు. మోదీ సందర్శన సందర్భంగా ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద స్వాగతం చెప్పిన అసాధారణ చర్య, ఆయనకు ‘మిత్ర విభూషణ’ పురస్కారం, తమ భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించనివ్వబోమన్న హామీ ఇదే కోవలోకి వస్తాయి. వివిధ ఆర్థిక, రక్షణ ఒప్పందాలు రెండు వైపుల నుంచి సజావుగా అమలైతే, ట్రంప్ ఆవిష్కరిస్తున్న కొత్త ప్రపంచపు సాధక బాధకాలను సమష్టిగా ఎదుర్కొన వీలవుతుంది.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు