పొరుగు స్నేహాల్లో పురోగతి ఎంత? Sakshi Guest Column On India neighborhood Countries friendships | Sakshi
Sakshi News home page

పొరుగు స్నేహాల్లో పురోగతి ఎంత?

Published Fri, Jun 28 2024 12:06 AM | Last Updated on Fri, Jun 28 2024 12:06 AM

Sakshi Guest Column On India neighborhood Countries friendships

విశ్లేషణ

ఉగ్రవాద ఎగుమతి ఆరోపణలతో భారత్‌ సంబంధాలు పాకిస్తాన్‌ తో నిలిచిపోయాయి. చైనా ప్రభావ పరిధిలోకి నేపాల్‌ జారిపోయింది. భారత్‌తో అనేక వ్యూహాత్మక ఒప్పందాలను రద్దు చేసుకోవడంతో సహా అనేక చైనా అనుకూల నిర్ణయాలను మాల్దీవులు తీసుకుంది. చైనా అప్పుల ఊబిలో చిక్కుకున్నప్ప టికీ ఆ రుణాలను చైనా పునఃవ్యవస్థీకరిస్తుందని శ్రీలంక ఆశపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం బంగ్లాదేశ్‌ మాత్రమే భారత ఏకైక పొరుగు నేస్తంగా మిగిలిపోయింది. దాన్ని బలపరిచేలా, ఎన్డీఏ 3.0 ప్రభుత్వం స్థిరపడేలోపే బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా గత వారం భారత పర్యటనకు వచ్చారు. ఆ స్నేహాన్ని కాపాడుకుంటూనే, బంగ్లాదేశ్‌ను దాటి ఈ స్ఫూర్తిని విస్తరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో భారత్‌ ఆలోచించాలి.

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, తీవ్రమైన వేడితో ఉడికిపోతున్న ఢిల్లీని ఒక నెలలోనే రెండోసారి సందర్శిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కోసం గతవారం ఇండియా వచ్చారు. ఆ భేటీ నాటికి ఎన్డీఏ 3.0 ప్రభుత్వం అప్పుడే స్థిరపడుతోంది. తదుపరి 125 రోజుల కోసం అది రచిస్తున్న పథకాలు ఇంకా పురోగతిలోనే ఉన్నాయి.  

ప్రభుత్వాధినేతల స్థాయి సమావేశాలను చాలా నెలల ముందుగానే ప్లాన్‌ చేయడం జరుగుతుంది. ఇరుదేశాల మధ్య కుదిరే ఒప్పందంలోని ప్రతి పదాన్ని భేటీకి వారాల ముందుగానే దౌత్యవేత్తల బృందం నిశిత పరిశీలన చేసిన తర్వాతే సంతకాలు చేయడం జరుగుతుంది. షేక్‌ హసీనా పర్యటన కూడా... రెండు పొరుగు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలను మెరుగ్గా ఉంచడానికి ఢిల్లీలోని సౌత్‌ బ్లాక్, ఢాకాలోని సెగున్‌ బగీచాలో ఉన్న బంగ్లా విదేశాంగ మంత్రిత్వ శాఖ రూపొందించిన ప్రణాళికాబద్ధమైన ప్రయత్నంలో భాగమే.

ఈ పర్యటన నుండి సాధించిన రెండు పెద్ద ప్రయోజనాలు ఏవంటే, తీస్తా నదీ జలాలను మెరుగ్గా సంరక్షించడానికీ, నిర్వహించడానికీ సహాయం చేస్తామనే వాగ్దానం. ఇది పశ్చిమ బెంగాల్‌ ఆవేశపూరిత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకున్న అస్థిరమైన వైఖరి కారణంగా రెండు దేశాల చేయి దాటిపోయిన ఒప్పందం. అలాగే చైనాపై కన్నేస్తూనే, ఇరు దేశాల మధ్య మరిన్ని రహదారి, రైలు, విద్యుత్‌ కనెక్టివిటీలపై స్పష్టంగా సంతకం కుదిరింది.

భూటాన్‌ నుండి ఉత్తర బెంగాల్‌ మీదుగా బంగ్లాదేశ్‌లోకి ప్రవహించే నదిలోని పూడికను తొలగించడంతోపాటు జెట్టీలు, ఓడరేవులు, రహదారులను నిర్మించి నౌకాయానానికి అనువుగా ఉండేలా చేయడానికి చైనా ఇంతకుముందు బంగ్లాదేశ్‌కు నిధులు సమకూర్చడానికి ముందుకొచ్చింది. దీంతో భారతదేశ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య దిశగా కలిపే చికెన్‌ నెక్‌ కారిడార్‌కు సమీపంలో చైనా ఉనికికి అవకాశం ఉండటంతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్‌ చేస్తున్న ఎదురు ప్రతిపాదనకు (కౌంటర్‌ ఆఫర్‌) అనుకూలంగా వ్యవహరిస్తూ, చైనా ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్‌ను కోరింది.

మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రిగా పని చేసినప్పటినుండి, లాటిన్‌ అమెరికా కోసం ఫ్రాంక్లిన్‌ డెలానో రూజ్‌వెల్ట్‌ ప్రతిపాదించిన ‘మంచి పొరుగు’ విధానం తరహాలో భారతదేశం ఒక పొరుగు విధానాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తోంది. ఇది దక్షిణాసియాను సన్నిహితం చేయగలదు. అంతేకాకుండా భారత ఉపఖండం వరకు దేశాల మధ్య శాంతి, ఆర్థిక సంబంధాలను ప్రోత్సహిస్తుంది. 

ఇస్లామాబాద్‌కు వ్యతిరేకంగా భారత్‌ చేస్తున్న ఉగ్రవాద ఎగుమతి ఆరోపణల కారణంగా పాకిస్తాన్‌ తో భారత్‌ సంబంధాలు స్తంభించిపోయాయి. అదే సమయంలో చైనా ప్రభావ పరిధి వైపు నేపాల్‌ మొగ్గు చూపుతోంది. పైగా పూర్వ హిందూ రాజ్యంలో భాగంగా కుమావూ భూభాగాలను చూపిస్తున్న మ్యాప్‌ విషయమై భారతదేశంతో నేపాల్‌ గొడవ పడుతోంది. భారత రక్షణ ప్రాంతమైన భూటాన్, ఎదుగుతున్న చైనాతో విరోధించకూడదనే ఆత్రుతలో బీజింగ్‌తో సరిహద్దు చర్చల్లో మునిగిపోయింది.

ద్వీప దేశమైన మాల్దీవులు గత సంవత్సరం ప్రభుత్వంలో మార్పును చూసినప్పటి నుండి, ‘తుంటరి పిల్లాడి’లా వ్యవహరిస్తోంది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజూ ఢిల్లీలో ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రధాని మోదీతో కలిసి వేదికపై కనిపించారు; కానీ మాల్దీవులలోని కొన్ని డజన్ల మంది భారత సైనికులను వెనక్కి తీసుకోవాలని కోరడం, భారత్‌తో అనేక వ్యూహాత్మక ఒప్పందాలను రద్దు చేయడంతో సహా అనేక చైనా అనుకూల భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. బీజింగ్‌తో కుదుర్చుకున్న ఖరీదైన ప్రాజెక్టుల కారణంగా చైనా అప్పుల ఊబిలో శ్రీలంక చిక్కుకుంది; అయినప్పటికీ చైనా తన రుణాలను పునఃవ్యవస్థీకరిస్తుందనీ, మరిన్ని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుందనీ ప్రకటించింది. 

కొలంబో చైనా ఆలింగనంలోకి వెళ్తోందనడానికి ఇది గట్టి సంకేతం.
దీంతో భారత్‌కు పొరుగున ఉన్న ‘మంచి మిత్రుడు’గా ఢాకా మాత్రమే ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. బంగ్లాదేశ్‌ స్థాపకుడు షేక్‌ ముజీబ్‌ హత్య తర్వాత, భారత్‌ పట్ల బంగ్లాదేశ్‌ విద్వేషపూరితమైన ప్రారంభానికి సంబంధించిన మొదటి సంకేతాలు, 2007–09లో సైనిక మద్దతుగల ఆపద్ధర్మ ప్రభుత్వ పాలనలో వచ్చాయి. ముజీబ్‌ కుమార్తె షేక్‌ హసీనా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరుదేశాల సంబంధాలు వికసించాయి. అప్పటి నుండి రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విద్యుత్‌ గ్రిడ్‌ల గొలుసు ద్వారా ఈ ప్రాంతాన్ని ఏకీకృతం చేసే ప్రయత్నంలో బంగ్లాదేశ్‌... భారతదేశానికి గొప్ప మిత్రదేశంగా ఉంది. 

భారత్‌కు సమస్యాత్మకమైన ఈశాన్య తిరుగుబాటుదారులను, ఇస్లామిస్ట్‌ టెర్రర్‌ మాడ్యూల్స్‌ను అప్పగించడంలో సహకారం, పరస్పర భూభాగాల్లోని చిన్న ప్రాంతాల మార్పిడి అనేవి, ఇరుదేశాల మధ్య సంబంధానికి బలమైన పునాదిని ఏర్పర్చాయి. ఈ ఢాకా–న్యూఢిల్లీ సంబంధాలపై చీకటి మేఘాలు లేవని కాదు. గత సంవత్సరం ఎన్నికల సమయంలో మాల్దీవుల్లో వివాదాస్పదమైన ‘ఇండియా అవుట్‌’ ప్రచారాన్ని చూసినట్లే, బంగ్లాదేశ్‌ కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రతిపక్షాలు నిర్వహించిన అదే తరహా ప్రచారాన్ని చూసింది. ఇది భారత స్నేహితులను ఆందోళనకు గురి చేసింది.

1980 నుండి తలసరి ఆదాయం పదిరెట్లు పెరిగి 2,700 అమెరికన్‌ డాలర్లకు చేరిన నదీతీర దేశం, మరింత వృద్ధి సాధించడం కోసం విదేశీ వాణిజ్యంపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటినుంచి రెండు సంవత్సరాల్లో బంగ్లాదేశ్‌ తక్కువ అభివృద్ధి చెందిన దేశం అనే తన స్థితిని మార్చుకుంటుంది. దీంతో ఎదురయ్యే ఒక సవాలు ఏమిటంటే, చాలా మార్కెట్లలో డ్యూటీ–ఫ్రీ ప్రాప్యత అవకాశాన్ని కోల్పోతుంది. 

సుంక రహిత మార్కెట్‌ ప్రాప్యత కొనసాగే కొత్త సమగ్ర వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్‌ సహాయం చేయాలి. మరింత వెసులుబాటుతో కూడిన వీసా పాలన; ఆ దేశానికి అవసరమైన ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి ఆహారాన్ని అంతరాయాలు లేకుండా సాఫీగా ఎగుమతి చేయడం వంటివి భారత్‌ రాబోయే రోజుల్లో అనుసరించే ‘మంచి పొరుగు’ విధానంలో భాగంగా ఉండాలి. 

అదే సమయంలో బంగ్లాదేశ్‌ను దాటి, ఈ స్నేహపూర్వకమైన స్ఫూర్తిని విస్తరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో భారత్‌ ఆలోచించాలి. ప్రధాని మోదీ తన దక్షిణాసియా ప్రత్యర్థులకు ఆహ్వానాలు పంపినప్పుడు, పాకిస్తాన్‌ మాత్రమే దీనికి మినహాయింపు అయింది. బహుశా మన విధానాన్ని మార్చుకుని, దివాళాకు దగ్గరగా ఉన్న పొరుగుదేశానికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చుతూ బదులుగా శాంతిని పొందడానికి సమయం ఆసన్నమై ఉండవచ్చు. 

ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావం కోసం బీజింగ్‌తో కొత్త గొప్ప ఆటలో భారత్‌ నిమగ్నమై ఉన్నప్పుడు... ఇస్లామాబాద్‌ను దాని ‘బెస్ట్‌ ఫ్రెండ్‌’ అయిన చైనా నుండి దూరంగా ఉంచడం భారతదేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది,వాస్తవానికి, తక్కువ వాగాడంబరం, చిన్న పొరుగువారి పట్ల ఎక్కువ సున్నితత్వం, మరింత వాణిజ్యం, కనెక్టివిటీ, చిన్నచిన్న అసౌకర్యాలను విస్మరించి పెద్ద చిత్రాన్ని చూసే తేడాలను క్రమబద్ధీకరించడంలో ఉదారమైన ప్రతిపాదనల వంటివి భారతదేశం చుట్టూ ఉన్న రాజధానులతో కంచెలను చక్కదిద్దడానికి మార్గం కావచ్చు. బీజింగ్‌ను ఈ ప్రాంతంలోకి మరింత ప్రవేశించకుండా నిరోధించాలి.

జయంత రాయ్‌ చౌధురీ 
వ్యాసకర్త ‘పీటీఐ’ ఈస్టర్న్‌ రీజియన్‌ నెట్‌వర్క్‌ హెడ్‌
(‘ద ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement