పరస్పర వైరుద్ధ్యాలను బయటపెట్టుకుంటూనే సహకారం కోసం సాగిన ప్రయత్నం ఇది. మంగళవారం నాటి ‘షాంఘై సహకార సంఘం’ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సును ఒక్కమాటలో అభివర్ణించాలంటే అంతే! భారత ఆతిథ్యంలో వర్చ్యువల్‌గా సాగిన ఈ 8 సభ్యదేశాల సంఘం 23వ సదస్సు విజయవంతంగానే ముగిసింది కానీ, చైనా, పాకిస్తాన్‌లతో మన సంబంధాల్లో అంతర్లీనంగా ఉన్న అసంతృప్తి మాత్రం స్పష్టంగా కనపడింది. ఢిల్లీ ఎప్పటిలానే తీవ్రవాద వ్యతిరేక మంత్రం, బీజింగ్ షరా మామూలు ఆర్థిక సహకార తంత్రాలనే సదస్సులో ప్రవచించాయి.
అమెరికా, పాశ్చాత్య ప్రపంచాలతో సంబంధం లేకుండా చైనా–రష్యా కేంద్రకంగా యురేషియా బృందానికి, ప్రపంచ జనాభాలో 40 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం గనకే ఎస్‌సీఓపై ప్రపంచానికి అమితాసక్తి. భారత ప్రధాని వర్చ్యువల్‌గా ఆతిథ్యమిచ్చిన ఈ సదస్సుకు హాజరైనవారిలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లతో పాటు కొత్తగా సభ్యత్వం పొందిన అమెరికా వ్యతిరేక ఇరాన్ అధ్యక్షుడు ఉన్నారు. వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఈ సదస్సును జరపాలనుకున్నా, మోదీ అమెరికా పర్యటనతో వాయిదా వేసి, ఆన్‌లైన్‌లో సరిపెట్టాల్సి వచ్చింది.
ఈ సమావేశంతో ఏడాది కాలపు భారత అధ్యక్ష హోదా ముగిసింది. నిన్న గాక మొన్ననే అమెరికాలో పర్యటించి, స్నేహం పెంచుకున్నప్పటికీ విదేశాంగ విధానంలో తాము స్వతంత్రులమే అని భారత్ ప్రకటించుకోవడానికి ఈ సదస్సు ఉపకరించింది. అమెరికా వ్యతిరేక ఇరాన్‌ను సభ్యదేశంగా ఆహ్వానించడం, ఉక్రెయిన్‌పై దాడిలో రష్యాకు మిత్ర పక్షమైన బెలారుస్‌కు వచ్చే ఏటి కల్లా పూర్తి సభ్యత్వమిస్తామని ప్రతిపాదించడమే అందుకు సూచన.
అదే సమయంలో చైనా చేపట్టిన వందల కోట్ల డాలర్ల ప్రాజెక్ట్ ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’ (బ్రి)కు మిగతా దేశాలన్నీ మద్దతుగా నిలిచినా, సదస్సు అనంతర ప్రకటనలో ఆ భాగానికి భారత్ దూరం జరిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) మీదుగా సాగే ‘చైనా – పాకిస్తాన్ ఆర్థిక కారిడార్’ (సీపీఈసీ) నిర్మాణం సైతం ‘బ్రి’లో భాగం గనక దాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. ఆ ప్రాంతంలో సీపీఈసీ పురోగతి దేశ సార్వభౌమత్వా నికీ, ప్రాదేశిక సమగ్రతకూ తీవ్ర ఉల్లంఘన అనేది మన స్పష్టమైన వైఖరి.
ఆది నుంచి ఎస్‌సీఓ కొంత చైనా లక్షణాలను పుణికిపుచ్చుకున్నదే. అలా చూస్తే 2017 నుంచి పాకిస్తాన్‌తో పాటు ఈ సంఘంలో పూర్తిస్థాయి సభ్యత్వం పొందిన భారత్ ఇందులో విజాతీయ సభ్యదేశం. అదే ఏడాది ఇటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన పునరుద్ధరించిన ‘క్వాడ్’ లోనూ భారత్ సభ్యత్వం పొందింది. వర్తమాన భౌగోళిక రాజకీయాల రీత్యా వివిధ అంతర్జాతీయ వేదికలను సమర్థంగా వినియోగించుకోవాలని భారత్ సంకల్పం.
తాజా ఎస్‌సీఓ భేటీలోనూ సహకార, భాగస్వామ్యాలు వీలున్న అంశాల్లో మాటామంతీ ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నించింది. ఇది ప్రశంసనీయమే. సీమాంతర తీవ్రవాదం, ప్రాంతీయ సుస్థిరత, సభ్యదేశాల మధ్య మెరుగైన సహకారం తదితర కీలక అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. చైనా, పాకిస్తాన్‌లతో కలసి భారత్ వేదిక పంచుకోవడమనేది అరుదైన ఘటన గనక అందరి చూపూ ఇటు పడింది.
భారత, పాకిస్తాన్‌లు మాటామంతీ సాగించడానికీ, పరస్పర సహకారానికి గల మార్గాలను పరిశీలించడానికీ ఈ సదస్సు సదవకాశం. కానీ, ఇరుదేశాల మధ్య పాతుకుపోయిన అవిశ్వాసమే ఈ శిఖరాగ్ర సదస్సులో మళ్ళీ బయటపడింది. తీవ్రవాదానికి అండగా నిలిచినంత కాలం పాక్‌తో చర్చలు పునరుద్ధరించేది లేదన్నదే భారత వైఖరి. అలాగే, వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసీ) వెంట యథాపూర్వ స్థితి రావాలని కోరుతున్న భారత్, చైనాతో సాధారణ సంబంధాలను పునరుద్ధరించడానికి ఆ మాట మీదే పట్టుబడుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లోనూ సభ్యదేశాల మధ్య సహకరానికి ఢిల్లీ అయిదు అంశాల్ని గుర్తించింది. అవి... అంకుర సంస్థలు–నవకల్పన, సాంప్రదాయిక వైద్యం, యువతరం సాధికారికత, అందరికీ డిజిటల్ అవకాశాలు, ఉమ్మడి బౌద్ధ వారసత్వం. ఇవి అస్పష్టమే అయినప్పటికీ, వైరుద్ధ్యాల మధ్యా తమకు సామ్యాలున్నట్టు చెప్పడానికి ఉపకరిస్తాయి.
నిజానికి, సెప్టెంబర్‌లో భారత్‌లో జరిగే జీ–20 భేటీలో ఏకాభిప్రాయ ఉమ్మడి ప్రకటనకు చైనా, రష్యాల నుంచి చిక్కులు లేకుండా చూసుకొనేందుకు తాజా ఎస్‌సీఓను ముందస్తు ట్రయల్‌గా భారత్ వాడుకొని ఉండవచ్చు. కానీ, ఐరాస భద్రతామండలిలో భారత ప్రయత్నాలకు చైనా అడ్డుపడుతున్న వేళ తీవ్రవాదంపై బలంగా స్వరం వినిపిస్తూ చైనా, పాక్‌లపై పరోక్షంగా బాణం గురిపెట్టింది.
అయితే, అదే సమయంలో తీవ్రవాద, వేర్పాటువాద సంస్థల ‘ఉమ్మడి జాబితా’ రూపకల్పనను చైనా ఆధిపత్య ఎస్‌సీఓ లక్ష్యంగా పెట్టుకొనేలా చేయగలిగింది. భద్రతామండలి ఇప్పటికే ఈ పని చేస్తున్నందున ఈ రెండో జాబితా ఎందుకు, దాని వల్ల ఉపయోగమేమిటన్నది చెప్పలేం.
ఇంగ్లీషును లాంఛనప్రాయంగా ఎస్‌సీఓ భాషగా చేయడంపై ఎస్‌సీఓ దేశాల మధ్య ఒప్పందం కుదరలేదు. ఇక, త్రివిక్రమావతారం దాల్చి చైనా మొత్తం ఆక్రమిస్తుందనే శంకతో ఆర్థిక సహకారంపై నిర్ణీత ప్రణాళికకు భారత్ సై అనలేదు. వెరసి, మిశ్రమ ఫలితాలతోనే ఎస్‌సీఓ భారత అధ్యక్ష హయాం ముగిసిపోయింది.
మునుపటి లాభాలు తగ్గిపోతున్నా, పరస్పర భిన్నాభిప్రాయాలు ఎన్ని ఉన్నా సరే... మధ్య ఆసియా ప్రాంతంతో మాటామంతీకీ, అలాగే తాలిబన్ల హయాంలోని ఆఫ్‌ఘనిస్తాన్ నుంచి భద్రత కారణాల రీత్యా ఎస్‌సీఓలో క్రియాశీలంగా కాలు కదపడమే భారత్ ముందున్న మార్గం. ముగిసిన ఎస్‌సీఓ శిఖరాగ్ర సదస్సు అందులో ఓ భాగమని సంతృప్తిపడాలి.
వైరుద్ధ్యాలతోనే... ఒకే గూటిలో...
Published Fri, Jul 7 2023 3:32 AM | Last Updated on Fri, Jul 7 2023 3:38 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment