అయిదేళ్ల తర్వాత నైరుతి రష్యాలోని కజన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య బుధవారం ద్వైపాక్షిక సమావేశం జరిగింది. బ్రిక్స్ శిఖరాగ్ర భేటీ సందర్భంగా రెండు దేశాల అధినేతల మధ్యా చర్చలు జరగటం శుభపరిణామం. డెస్పాంగ్, దెమ్‌చోక్ ప్రాంతాల్లో ఇరు దేశాల సైన్యాల గస్తీకి రెండురోజుల క్రితం అవగాహన కుదరటంతో అధినేతల భేటీ సాధ్యమైంది.
ఈ విషయాన్ని మన విదేశాంగ మంత్రి జైశంకర్ సోమవారం ప్రకటించటం... దానికి అనుగుణంగా చైనా వైపునుంచి కూడా ప్రకటన జారీకావటంతో వాతావరణం తేలికపడింది. అయితే గతాన్ని అంత తేలిగ్గా మరిచిపోరాదు. సరిగ్గా అయిదేళ్లనాడు ఇదే నెలలో తమిళనాడులోని మహా బలిపురం వేదికగా ఇరు దేశాధినేతలూ కలుసుకోగా ఆ తర్వాత ఏడాది తిరగకుండానే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించి చైనా తన నైజం చాటుకుంది.
దాంతో ఇరు దేశాల సంబంధాలూ కనీవినీ ఎరుగనంతగా దెబ్బతిన్నాయి. నిజానికి అంతక్రితం 2018లో మోదీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సంప్రదింపుల కోసం వూహాన్ తరలివెళ్లిన నాటికే డోక్లాంలో రెండు దేశాల సైనికుల మధ్యా 73 రోజులపాటు ఘర్షణ వాతావరణం కొనసాగింది. డోక్లాం చిన్న అపశ్రుతి మాత్రమేనని, అంతా చక్కబడిందని అనుకుని మహాబలిపురంలో జిన్‌పింగ్‌కు ఘనమైన ఆతిథ్యం అందించిన కొద్దికాలా నికే మళ్లీ సరిహద్దుల్లో సమస్యలు తలెత్తాయి.
2020 ఏప్రిల్‌లో చైనా సైనికులు వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)ను అతిక్రమించి గాల్వాన్ లోయలో చొరబాట్లకు పాల్పడ్డారు. తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్, డెస్పాంగ్, హాట్‌స్ప్రింగ్స్ తదితరచోట్ల ఆక్రమణలకు దిగి అక్కడ మన సైనికులు గస్తీ తిరగడానికి వీల్లేదని పేచీకి దిగారు. కర్రలు, ఇనుపరాడ్లతో మన జవాన్లపై దాడికి దిగి 21 మంది ఉసురు తీశారు.
అంతంతమాత్రంగా సాగుతూవచ్చిన సంబంధాలు కాస్తా ఆ తర్వాత పూర్తిగా పడకేశాయి. సరిహద్దు వివాదాలపై ఇరు దేశాల సైనిక కమాండర్ల మధ్య సంప్రదింపులు జరుగుతున్నా, అడపా దడపా సేనల ఉపసంహరణ జరిగినా మునుపటి సాన్నిహిత్యం లేదు. రెండు దేశాల విదేశాంగ మంత్రులూ 2020 సెప్టెంబర్‌లో సమావేశమై ఉద్రిక్తతల ఉపశమనానికి పంచసూత్ర పథకం రూపొందించారు.
రక్షణ మంత్రుల స్థాయిలో కూడా చర్చలు జరిగాక వివాదాస్పద ప్రాంతాల నుంచి సైన్యాలను ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ సమస్యలు పూర్తిగా సమసిపోలేదు. 2022లో బాలిలో జరిగిన జీ–20 శిఖరాగ్ర సదస్సు, నిరుడు జోహన్నెస్ బర్గ్‌లో నిర్వహించిన బ్రిక్స్ అధినేతల సదస్సు సందర్భాల్లో మోదీ, జిన్‌పింగ్‌లు కలిసిన మాట వాస్తవం.
అయితే అవి ముక్తసరి, మర్యాదపూర్వక భేటీలు మాత్రమే. ఆ తర్వాత ఎల్‌ఏసీలో పరిస్థి తులు స్వల్పంగా మెరుగుపడ్డాయి. అయినా మన హిమాచల్‌ప్రదేశ్ గ్రామాలకు చైనా తనవైన పేర్లు పెట్టడం, సరిహద్దుల్లో కొత్త గ్రామాలు సృష్టించటంవంటి గిల్లికజ్జాలకు మాత్రం కొదవలేదు.
ఎల్‌ఓసీలో 45 ఏళ్లుగా ఇరు దేశాల సైనికులూ నిరంతరాయంగా గస్తీ కొనసాగిస్తున్న చోటులో చైనా దళాలు ఆక్రమణలకు దిగి ఇక్కడ గస్తీ కాయొద్దంటూ అభ్యంతరపెట్టడంతో 2020లో కొత్త వివాదం మొదలైంది. ఇలా మన జవాన్లు ఉండే చోటుకొచ్చి కవ్వింపులకు దిగి ఎదురుదాడి చేయ టమో, మానటమో మనవాళ్లే తేల్చుకోవాల్సిన స్థితి కల్పించటం చైనా మొదలెట్టిన కొత్త వ్యూహం.
యధాతథ స్థితిని కాలరాసి ఆ ప్రాంతం ఎప్పటినుంచో తమదన్న తర్కానికి దిగటం చైనాకే చెల్లింది. 1962లో సైతం ఇలాంటి వైఖరితోనే మన దేశంపై దురాక్రమణకు తెగించింది. అంత వరకూ మన దేశం చైనాకు అన్నివిధాలా సహాయసహకారాలు అందజేసింది. చైనా ఆవిర్భావం తర్వాత దాన్ని గుర్తించటంలో మనం ముందున్నాం. ఆ తర్వాత ‘పంచశీల’ ఒప్పందం సైతం కుదిరింది. కానీ దానికి వెన్నుపోటు పొడిచింది చైనాయే.
తాజాగా రెండు దేశాల మధ్యా సామరస్యత నెలకొనడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ చొరవ తీసుకున్నారన్న కథనం వినిపిస్తోంది. రష్యాను అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని పాశ్చాత్య దేశాలూ, అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో రష్యా తన ప్రయోజనాలు కాపాడుకోవాలనుకోవ టంలో వింతేమీ లేదు. ఉక్రెయిన్‌తో రష్యా సాగిస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు భారీయెత్తున ఆయుధ సామగ్రి అందిస్తున్న ఆ దేశాలు రష్యాను ఆర్థిక ఆంక్షలతో కూడా దిగ్బంధించి దెబ్బ తీయాలని చూశాయి.
ఆ తరుణంలో భారత్, చైనాలు రష్యానుంచి ముడి చమురు కొనుగోలుచేసి ఆదుకున్నాయి. అందుకే కావొచ్చు... ఆ రెండు దేశాలమధ్యా సామరస్యత సాధించి పాశ్చాత్య ప్రపంచానికి పుతిన్ షాక్ ఇచ్చారు. ఇరుగుపొరుగు దేశాలన్నాక సమస్యలు సహజం. ఇచ్చిపుచ్చు కునే ధోరణితో వ్యవహరించాలని, సామరస్యంగా మెలగాలని ఇరుపక్షాలూ అనుకున్నప్పుడు మాత్రమే అటువంటి సమస్యలు పరిష్కారమవుతాయి. అటు చైనాకు ఆర్థికరంగంలో సమస్యలు ముంచుకొస్తున్నాయి. అక్కడ హౌసింగ్ రంగం తీవ్రంగా దెబ్బతిని దాని ఆర్థిక వ్యవస్థను ఛిన్నా భిన్నం చేసింది.
రుణభారం తడిసి మోపెడైంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దాన్ని సక్రమంగా పరిష్కరించకపోతే చైనాయే కాదు... చైనాతోపాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ దెబ్బతింటాయి. భారత, చైనాలు రెండూ జనాభాపరంగా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. అతి పెద్ద మార్కెట్‌గల భారత్‌తో సంబంధాలు మెరుగుపడితే తన ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోవటానికి ఆ చర్య తోడ్పడుతుందన్న వివేకం చైనాకు ఉండాలి. అధినేతల మధ్య అవగాహన ఆచరణలో కనబడాలి. మాటకూ, చేతకూ పొంతన కుదరాలి. అప్పుడు మాత్రమే చెలిమి వర్ధిల్లుతుంది.
ఈ భేటీ శుభ పరిణామం
Published Thu, Oct 24 2024 12:03 AM | Last Updated on Thu, Oct 24 2024 4:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment