Xi Jinping
-
జిన్‌పింగ్‌తో ట్రంప్ చర్చలు
బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. ‘‘వ్యాపారం, వాణిజ్యం, టిక్‌టాక్ తదితర అంశాలపై జిన్‌పింగ్‌తో చక్కటి సంభాషణ జరిగింది. ప్రపంచాన్ని మరింత భద్రంగా మార్చడానికి చేయాల్సిందంతా చేస్తాం’’ అని ట్రంప్ ఉద్ఘాటించారు. అధ్యక్షుడిగా రెండో టర్మ్‌లో చైనాతో సంబంధాలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. -
చైనా దాగుడుమూతలు!
సాధారణంగా దౌత్య సంబంధాల్లో అనూహ్యతకు తావుండదు. అవతలి దేశం మనతో చెలిమి కోరుకుంటున్నదో లేదో... అది మనవైపో, వేరేవాళ్లవైపో ఊహించటం పెద్ద కష్టం కాదు. కానీ చైనా మటుకు ఇందుకు విరుద్ధం. ‘నేనేంటో చెప్పుకోండి చూద్దాం’ అన్నట్టు వ్యవహరిస్తుంటుంది. నోటితో నవ్వి నొసటితో వెక్కిరిస్తున్న చందాన ప్రవర్తిస్తుంటుంది. రష్యాలో మూడు నెలల క్రితం బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరిగినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌లు కలుసుకున్నారు. అంతకు రెండు రోజుల ముందు వాస్తవాధీన రేఖ ప్రాంతాలైన డెస్పాంగ్, దెమ్ చోక్‌లలో ఇరు దేశాల సైన్యాల గస్తీపై అవగాహన కుదిరింది. ఆ ప్రాంతంలో ఇకపై సైనిక విన్యాసాలకు చోటీయరాదనీ, ఉద్రిక్తతలను ఉపశమింపజేయాలనీ దాని సారాంశం. అంతేగాదు... రెండు దేశాలూ దీనిపై వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. చాన్నాళ్లుగా నిలిచిపోయిన ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధుల సమావేశం గత నెలలో జరిగింది కూడా. తీరా తాజాగా తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా సైన్యం అధునాతన సాంకేతికతలతో, అన్నిరకాల నేలల్లోనూ పనికొచ్చే వాహనాలతో, డ్రోన్లతో, మానవరహిత విమానాలతో విన్యాసాలు నిర్వహించినట్టు బయటపడింది. తన సైనిక సామర్థ్యాన్ని, కొండప్రాంతాల్లో యుద్ధ సంసిద్ధతలను అంచనా వేసుకోవటానికి షిన్ జియాంగ్ మిలిటరీ కమాండ్ రెజిమెంట్ ఈ విన్యాసాలు నిర్వహించిందంటున్నారు. అంతక్రితం మాటెలావున్నా 2020 ఏప్రిల్‌లో గాల్వాన్ లోయలో మన సైన్యంతో గిల్లికజ్జాలకు దిగటం ద్వారా చైనా తన కవ్వింపు చర్యల జోరు పెంచింది. అప్పుడు జరిగిన ఘర్షణల్లో మన జవాన్లు 21 మంది చనిపోగా, చైనా కూడా గణనీయమైన నష్టాలు చవిచూసింది. ఆ ఘర్షణల్లోనే బిహార్ రెజిమెంట్‌లో 17వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ అయిన తెలంగాణకు చెందిన బి.సంతోష్‌బాబు వీర మరణం పొందారు. అనంతర కాలంలో ఇరు దేశాల మధ్యా సైనిక అధికారుల స్థాయి చర్చలు జరిగాయి. కొన్ని అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి. ఆ ఏడాది ఆగస్టులో రెండు దేశాల విదేశాంగమంత్రులూ భేటీ అయ్యారు. అందులో భారత్–చైనాల మధ్య పంచసూత్ర పథకం కుదిరింది. ఇకపై సామరస్యంగా మెలగాలన్నది ఆ పథకం సారాంశం. దానికి కొనసాగింపుగా రక్షణ మంత్రులు కూడా సమావేశమయ్యారు. ఆ తర్వాత వివాదాస్పద ప్రాంతాల్లో సైనికుల ఉపసంహ రణ కూడా మొదలైంది. కానీ సమస్య ఎక్కడిదక్కడే ఉంది. డెస్పాంగ్, దెమ్చోక్ ప్రాంతాల విషయం మొదటి నుంచీ జటిలమే. అందువల్లే ప్రస్తుతానికి ఇరు దేశాల సైన్యాలూ ఆ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించాలని, ఉద్రిక్తతలు ముదిరే విధంగా ఎవరూ సైన్యాలను మోహరించ రాదని మూడు నెలలక్రితం నిర్ణయించారు. కానీ చైనాకు ఏమైందో కానీ దాన్ని బేఖాతరు చేస్తూ తాజాగా విన్యాసాలు మొదలుపెట్టింది. వారంరోజుల క్రితం షిన్జియాంగ్లోని వీగర్ స్వయంపాలిత ప్రాంతంలో ఉన్న హోటాన్ నగరానికి సమీపంలో చైనా కొత్తగా రెండు కౌంటీలను ఏర్పాటు చేసిందన్న కథనాలు వెలువడటం గమనించదగ్గది. ఈ రెండూ కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లోని ఆక్సాయ్చిన్కు సమీపంలో ఉన్నాయి. దానిలోని కొంత భూభాగం ఈ రెండు కౌంటీల్లోనూ ఉన్నదంటున్నారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ఇది చాలదా? ఇక బ్రహ్మపుత్ర నదిపై ఒక మెగా డ్యామ్‌ను నిర్మించటానికి చైనా సన్నాహాలు చేస్తున్నదన్న వార్త కూడా ఇటీవలి పరిణామమే. ఎగువ ప్రాంతాల్లో ఆనకట్టలు కట్టినప్పుడు దిగువ ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందక ఇబ్బందులు తలెత్తు తాయి. భారీవర్షాల సమయంలో దిగువకు నీరు వదలటం వల్ల ఆ ప్రాంతాలు మునుగుతాయి.అందువల్లే దేశాలమధ్య ప్రవహించే నదులపై నిర్మాణాలకు పూనుకున్నప్పుడు పరస్పరం చర్చించుకుంటాయి. అందరికీ ప్రయోజనం కలిగేలా ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. కానీ మెగా డ్యామ్ నిర్మాణాన్ని చైనా ఏకపక్షంగా ప్రకటించింది. దీనిపై మన దేశం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇక అరుణాచల్‌ప్రదేశ్‌కు మన నాయకులు వెళ్లినప్పుడల్లా చైనాకు ఆగ్రహావేశాలొస్తాయి. అక్కడి ఊళ్లకు సొంత పేర్లు పెట్టుకుని మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం చైనాకు చాన్నాళ్లుగా దురలవాటు. అందుకే చైనా వ్యవహారశైలి తెలిసినవారెవరూ దాని మాటలు విశ్వసించరు. చెప్పే మాటలకు భిన్నమైన ఆచరణ ప్రదర్శించటం చైనాకు అలవాటైన విద్య. ఇరుగు పొరుగు దేశాలన్నాక సమస్యలు సహజంగా వస్తాయి. వాటిని చర్చించుకోవటం, పరస్పర అంగీకారంతో సామరస్యపూర్వక పరిష్కారాన్ని సాధించటం వివేకవంతమైన చర్య. సమస్యలను దశాబ్దాల తరబడి అలాగే వదిలేస్తే అవి జటిలంగా మారి చివరకు శత్రుత్వానికి దారితీస్తాయి. మనతో ఉన్న వివాదాల విషయంలో చైనా మొదటినుంచీ దాగుడుమూతలు ఆడుతోంది. వివాదాలను పక్కనబెట్టి వ్యాపార వాణిజ్యాలను విస్తరించుకుంటే ఇరు దేశాలూ అభివృద్ధి చెందుతాయని ఊరించి 70వ దశకం చివరిలో మనకు మైత్రీ హస్తం అందించింది మొదలు చైనా తీరుతెన్నులు ఎన్నడూ సక్రమంగా లేవు. సరిహద్దు పరిణామాలపై మన దేశం అప్రమత్తంగానే ఉన్నదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ సోమవారం చేసిన ప్రకటన సూచిస్తోంది. వివాదాస్పద ప్రాంతాల్లో ప్రస్తుతానికి ప్రతిష్టంభన ఉన్నదని ఆయనంటున్నారు. బ్రహ్మపుత్ర నదిపై ఆనకట్ట నిర్మాణం విషయంలోనైనా, లద్దాఖ్ ప్రాంతంలో చైనా సైన్యం కదలికల విషయంలోనైనా మన దేశం దృఢంగా వ్యవహరించాలి. దేశ రక్షణకు అది తప్పనిసరి. కరచాలనం చేస్తూనే కత్తులు దూయటం ఏమైనా కావొచ్చుగానీ దౌత్య కళ కాదని చైనాకు తెలియచెప్పటం అవసరం. -
త్వరలో భారత్-చైనాల మధ్య విమానాల రాకపోకలు పునఃప్రారంభం?
బ్రెసిలియా : భారత్-చైనాల మధ్య శాంతియుత వాతావరణం నెలకునే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జీ20 సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడ ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.భారత్-చైనాల మధ్య శాంతి కుదిరేలా భారత విదేశాంగ మంత్రి జై శంకర్, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యిల భేటీ జరిగింది. ఈ భేటీలో రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలను పునరుద్ధరించడంతోపాటు కైలాష్ మానసరోవర్ యాత్ర పునఃప్రారంభంపై ఇరు దేశాలు చర్చించినట్లు సమాచారం.తూర్పు లద్దాఖ్‌లోని డెమ్చోక్ సెక్టార్లో భారత బలగాల పెట్రోలింగ్ ప్రారంభం తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన మొదటి ఉన్నత స్థాయి సమావేశం. ఈ సమావేశం శాంతి, ప్రశాంతత పరిరక్షణకు దోహదపడిందని మంత్రులు పేర్కొన్నారు.కాగా,2020 జూన్ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. కానీ ఆ సంఖ్యను వెల్లడించలేదు. ఈ పరిస్థితుల వల్ల ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. వాటిని నివారించేందుకు భారత్-చైనా మధ్య అనేక చర్యలు జరిగాయి. నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇటీవల ఇరు దేశాలు కీలక గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
బహుళ ధ్రువ ప్రపంచానికి దారి?
అక్టోబర్ 22–24 వరకు కజాన్(రష్యా)లో జరిగిన బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సమావేశం ఒక గొప్ప ఆరంభాన్ని వాగ్దానం చేసింది. బ్రిక్స్ దేశాలుతమ మధ్య ఆర్థిక వ్యవహారాలను తమ స్థానిక కరెన్సీలలో జరుపుకోవాలనీ, తమతో ఆర్థిక సంబంధాలు నెరపే ఇతర దేశాలతో సైతం ఇదే పద్ధతిలో వ్యవహరించేందుకు ప్రయత్నం జరగాలనీ ‘కజాన్ డిక్లరేషన్’ పేర్కొన్నది. ప్రపంచాన్ని శాసిస్తున్న డాలర్ వ్యవస్థను వీలైనంత బలహీన పరచటం వర్ధమాన దేశాలన్నిటికి కీలకంగా మారింది. అధికారం, అభివృద్ధి, విధాన పరమైన నిర్ణయాలకు కొత్త కేంద్రాలు ఉనికిలోకి వచ్చినందున, అవి సమానత్వంతో కూడిన న్యాయబద్ధమైన, బహుళ ధ్రువ ప్రపంచానికి దారులు వేయగలవన్న ఆశాభావం డిక్లరేషన్‌లో కనబడింది.కజాన్‌లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు రెండు రోజుల ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పిన మాటలు సంచలనమయ్యాయి. బ్రిక్స్ దేశాల మధ్య వ్యాపారాలకు, ఇతర అవసరాలకు చెల్లింపులు ఇక మీదటఆ యా దేశాల సొంత కరెన్సీలలోనే ఉండగలవని అన్నారు. అప్పటికి అది ఇంకా బ్రిక్స్ తీసుకున్న తుది నిర్ణయమో,చేసిన ఉమ్మడి ప్రకటనో కాదు. అయితే, ఈ అంశంపై బ్రిక్స్ దేశాల మధ్య కొంతకాలంగాసంప్రదింపులు సాగుతున్నాయి. ఒక ఏకాభిప్రాయ ప్రకటన రాగల సూచనలు కూడా ఉన్నాయి. అందువల్లనే కూటమి దేశాలేవీ పుతిన్ ముందస్తు ప్రకటనకు అభ్యంతరపెట్టలేదు. అక్టోబర్ 23న విడుదలైన కజాన్ డిక్లరేషన్‌లోని 134 పేరాగ్రాఫ్‌ల సుదీర్ఘ సంయుక్త ప్రకటనను చదివినపుడు, అందులో అత్యధికం ఆర్థిక సంబంధమైన అంశాలే కనిపిస్తాయి. వాటిలో రెండు (63, 65) పుతిన్ పేర్కొన్న స్థానిక కరెన్సీ చెల్లింపులకు సంబంధించినవి.134 పేరాలలో రెండు మాత్రమే ఇవా? అందుకోసం ఇంత ఆట్ట హాస ప్రకటన అవసరమా? అనుకుంటే పొరపాటు. మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్న డాలర్ వ్యవస్థను మటుమాయం చేయటం సాధ్యం కాకపోయినా, వీలైనంత బలహీన పరచటం బ్రిక్స్‌తో సహా మొత్తం వర్ధమాన దేశాలన్నిటికి కీలకంగా మారింది. డాలర్ ఆధిపత్యాన్నిఎంత దెబ్బ తీయగలిగితే, ప్రపంచంపై అమెరికా రాజకీయ, సైనిక ప్రాబల్యాన్ని, భౌగోళిక చాణక్యాన్ని అంతగా ఎదుర్కొనగలరు.ఈ దేశాలకు ఇటువంటి అవకాశం లభించటం ప్రపంచ చరిత్ర లోనే ఇది మొదటిసారని చెప్పాలి. వలస పాలనలు 60–70 సంవ త్సరాల క్రితమే ముగిసి ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయసంస్థలు ఎన్ని ఏర్పడినా, ఒకటి రెండు అగ్ర దేశాలే ఏకధ్రువ,ద్విధ్రువ ప్రపంచాలను సాగించాయి. అంతర్జాతీయ చట్టాలను తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ రాగా, అమెరికన్ డాలర్, యూరోపియన్ దేశాల యూరో కరెన్సీలు అందుకు సాధనాలుగా మారాయి.1947 స్వాతంత్య్ర సమయంలో ఒక డాలర్‌కు ఒక రూపా యిగా ఉండిన భారత కరెన్సీ ఈ రోజున 84 రూపాయలకు పడి పోయిందంటే అందుకు ఇవన్నీ కారణాలే. ఆ విలువ సహజ క్రమంలో తగ్గటం ఒకటైతే, అమెరికన్లు, ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ వారు ఒత్తిడి చేసి మరీ విలువను తగ్గింపజేసే సందర్భాలు వర్ధమాన దేశాలకు అనేకం. అంతర్జాతీయంగా ముడిసరకుల అమ్మకాలు, వాణిజ్య నిబంధనలు, డబ్ల్యూటీవో పనితీరు అన్నీ ధనిక దేశాలకు, డాలర్‌కు అనుకూలం. ఈ విధమైన అనేకానేక సమస్యలన్నింటికి సమాధానాలు కజాన్ డిక్లరేషన్‌లో పొందు పరచటం గమనార్హం. ఇటువంటి ఆలోచనలకు, మార్పులకు ఒక గొప్ప ఆరంభం బ్రిక్స్ దేశాలు తమ మధ్య ఆర్థిక వ్యవహారాలు తమ స్థానిక కరెన్సీలలో జరుపుకోవటం. తమతో ఆర్థిక సంబంధాలు నెరపే ఇతర దేశాలతో సైతం ఇదే పద్ధతిలో వ్యవహరించేందుకు ప్రయత్నం జరగాలని కూడా ఆ డిక్లరేషన్ పేర్కొన్నది. ఆ డాక్యుమెంట్ శీర్షికను గమనిస్తేనే బ్రిక్స్ లక్ష్యం, అంతరార్థం, భవిష్యత్తు గురించిన దార్శనికత అర్థమైపోతుంది: న్యాయబద్ధమైన విధంగా ప్రపంచాభివృద్ధి కోసం, భద్రత కోసం బహుళత్వాన్ని శక్తిమంతం చేయటం. ఈ మూడు క్లుప్తమైన మాటలను శోధిస్తూ పోతే అనేక విషయాలు అర్థమవుతాయి. వలసవాదం అంతమై, అంతర్జాతీయ సంస్థలు, నిబంధనలు ఎన్ని ఏర్పడినా పాశ్చాత్య రాజ్యాల ఏకధృవ ఆధిపత్యాన్ని తట్టుకోలేకపోయిన తక్కిన ప్రపంచానికి ఇపుడు బ్రిక్స్ రూపంలో ఒక బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడగల అవకాశాలు చరిత్రలో మునుపెన్నడూ లేనివి. వాస్తవానికి బహుళ ధృవ ప్రపంచ సృష్టి అనే మాట కొంతకాలంగా వినవస్తున్నదే. కాలక్రమంలో ఇండియా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో పాటు కొన్ని ఏషియన్, ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్, అరబ్ దేశాలు కొంత అభివృద్ధి సాధించి మధ్యమస్థాయి దేశాలుగా పురోగమించినా, వాటికి కూడా వివిధ పరిస్థితులవల్ల స్థిరత్వం ఉండటం లేదు. బ్రిక్స్ ఏర్పడినాక ఇంతకు ముందు 15 శిఖరాగ్ర సమావేశాలు జరిగినా, వివిధ ఆర్థికపరమైన నిర్ణయాల మూలంగా కజాన్‌లో జరిగింది ఎంతో భిన్నమైనది!డిక్లరేషన్‌లోని 134 పేరాలను 4 ఉప శీర్షికల కింద విభజించగా, అందులో 3 ఆర్థిక సంబంధమైనవే కావటం గమనించదగ్గది. అవన్నీ ఇక్కడ రాయటం వీలుకాదు గానీ, వాటి సారాంశాన్ని చెప్పుకోవాలంటే ఈ విధంగా ఉంటుంది: గ్లోబల్ సౌత్ అనబడే వర్ధమాన దేశాల కోసం పని చేయటం. అధికారం, అభివృద్ధికి, విధానపరమైన నిర్ణయా లకు కొత్త కేంద్రాలు ఉనికిలోకి వచ్చినందున, అవి సమానత్వంతో కూడిన న్యాయబద్ధమైన, బహుళ ధ్రువ ప్రపంచానికి దారులు వేయ గలవు. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి, డబ్ల్యూటీవో వంటి సంస్థలను సంస్కరించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రత్యేక అవకాశాలివ్వాలి. ముఖ్యంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరీబి యన్ ప్రాంతాలకు వాణిజ్యంపై ఏకపక్ష నియంత్రణలు, ఆంక్షలుఉండరాదు. అంతర్జాతీయ రుణాల చెల్లింపు పద్ధతిలో మార్పులు రావాలి. బ్రిక్స్ దేశాల మధ్య చెల్లింపులు స్థానిక కరెన్సీలలో జరగాలి. బ్రిక్స్ పే కార్డును వినియోగానికి తేవాలి. అయితే ఈ విషయమై ఇంకా చర్చలు అవసరం. అట్లాగే ఇది స్వచ్ఛందమే తప్ప, తప్పనిసరి కాదు. బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, వనరుల వితరణ; విద్యా, సాంకే తిక, ఆరోగ్య, పారిశ్రామిక రంగాలలో సహకారం పెరగాలి.కజాన్ డిక్లరేషన్ ఈ విధమైన స్వతంత్ర ప్రకటనలు చేస్తూనే, బ్రిక్స్ కూటమి పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకం కాదనీ, తమదొక స్వతంత్రమైన సంస్థ మాత్రమేననీ స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కొద్దికాలం క్రితం, ‘‘వారు (పాశ్చాత్య దేశాలు) ఒక క్లబ్ పెట్టుకున్నారు. మమ్ములను అందులోకి రానివ్వలేదు. కనుక మా క్లబ్బు మేము పెట్టుకున్నా’’మని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. మొదట బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతో బ్రిక్‌గా ఏర్పడిన ఈసంస్థ దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్‌గా మారింది. వాటి ఉమ్మడి భూభాగం ప్రపంచంలో 33.9 శాతం, జనాభా 45.2 శాతం, పారిశ్రా మిక ఉత్పత్తి 39.3 శాతం, జీడీపీ 36.7 శాతం, ఎగుమతుల శాతం 24.5 శాతం కావటాన్ని బట్టి ప్రపంచంలో వాటి స్థానం ఎంతటిదో గ్రహించవచ్చు. ఈ అయిదు దేశాలు కాక ఇప్పుడు కొత్తగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ చేరాయి. సౌదీ అరేబియా త్వరలో చేరనుంది. మరొక 30 చేరగోరుతున్నట్లు పుతిన్ ప్రకటించారు. బ్రిక్స్ విస్తరించేకొద్దీ పరిస్థితి గణనీయంగా మారుతుంది. ఈ సంస్థ దేశాల మధ్య ఏకాభిప్రాయంతో పరస్పర సహకారాలు తప్ప ఎవరి అంతర్గత వ్యవహారాలలోనూ జోక్యం చేసుకోవటం ఉండదని స్పష్టం చేయటం విశేషం. ఈ మాట, అటువంటి జోక్యాలు చేసుకునే పాశ్చాత్య దేశాలకు ఒక హెచ్చరిక అని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.అదే సమయంలో కొన్ని రాజకీయ పరిస్థితులను బ్రిక్స్ ఉపేక్షించబోదని కూడా కజాన్ డిక్లరేషన్ వల్ల స్పష్టమవుతున్నది. గాజాపై ఇజ్రాయెల్ మారణకాండను, లెబనాన్‌పై దాడులను ఖండించారు. ఇరాన్‌పై దాడి ఆలోచనను విమర్శించారు. పాలస్తీనా స్వతంత్రతను బలపరిచారు. పశ్చిమాసియాలో అణ్వస్త్ర వ్యాప్తిని వ్యతిరేకించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వివాదాలు ఏర్పడినా చర్చల ద్వారా మాత్రమే పరిష్కారాలు చేసుకోవాలన్నారు. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కజాన్‌లో సమావేశం కానుండగా, సరిహద్దు సమస్యపై ఒక చిన్న ముందడుగు వేయటం ఈ తీర్మానానికి అద్దం పడుతున్నది. మోదీ ముందస్తుగా మాట్లాడుతూ, భారత్–చైనా సత్సంబంధాలు ప్రపంచ శాంతి సుస్థిరతలకు అవసరమన్నారు.- వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు- టంకశాల అశోక్ -
ఉమ్మడి భద్రత కోసం పనిచేయాలి: జిన్‌పింగ్
కజన్: గ్లోబల్ సౌత్ దేశాలు కలిసికట్టుగా ఆధునికత దిశగా ముందుకు సాగుతుండడం ప్రపంచ చరిత్రలో, మానవ నాగరికతలో అపూర్వమైన ఘట్టమని చైనా అధినేత జిన్‌పింగ్ ప్రశంసించారు. శాంతి, ఉమ్మడి భద్రత కోసం బ్రిక్స్ ప్లస్ దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన బ్రిక్స్ ఔట్రీచ్ సదస్సులో ప్రసంగించారు. బ్రిక్స్‌ప్లస్ దేశాల శాంతి ప్రపంచ శాంతితో ముడిపడి ఉందన్నారు. ఉమ్మడి ప్రగతి కోసం ఆయా దేశాలన్నీ స్వయంగా చోదక శక్తిగా మారాలని సూచించారు. దేశాల మధ్య సమాచార మారి్పడి, సంప్రదింపులు మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ గ్లోబల్ సౌత్‌ను ఎప్పటికీ తమ గుండెల్లో నిలుపుకుంటామని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. తమ మూలాలను మర్చిపోవడం లేదన్నారు. ముగిసిన బ్రిక్స్ సదస్సు రష్యాలో మూడు రోజులపాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు గురువారం ముగిసింది. బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలు కాగా, కొత్తగా ఇరాన్, ఈజిప్టు, ఇథియోపియా, యూఏఈ, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. కూటమిలో సభ్యత్వం కోసం తుర్కియే, అజర్బైజాన్, మలేసియా దరఖాస్తు చేసుకున్నాయి. మరికొన్ని దేశాలు సైతం బ్రిక్స్‌లో చేరడానికి ఆసక్తి ప్రదర్శించాయి. ముగింపు సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రసంగించారు. రష్యాను ఒంటరిని చేసేందుకు అమెరికా సాగించిన ప్రయత్నాలు ఫలించలేదని చెప్పారు. ప్రపంచంలో బ్రిక్స్ పాత్రను పశి్చమ దేశాలకు ప్రత్యామ్నాయంగా అభివరి్ణంచారు. -
సుహృద్భావమే లక్ష్యం
కజాన్: భారత్, చైనా సంబంధాల మెరుగుదల దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ప్రధాని నరేంద్ర మోదీ నడుమ ద్వైపాక్షిక సమావేశం బుధవారం జరిగింది. రష్యాలో జరిగిన మూడు రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదికైంది. జిన్‌పింగ్, మోదీ అధికారికంగా భేటీ కావడం ఐదేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. లద్దాఖ్ సమీపంలో సరిహద్దు గస్తీపై ఇరు దేశాల సైనిక, తదితర ఉన్నతాధికారుల స్థాయిలో కుదిరిన తాజా ఒప్పందాన్ని అధినేతలిద్దరూ స్వాగతించారు. ఇరుదేశాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం దిశగా పలు అంశాలపై ప్రత్యేక ప్రతినిధులు నడుమ మరిన్ని ఉన్నత స్థాయి చర్చలు జరపాలని నిర్ణయించారు. సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతల పరిరక్షణే ఇరుదేశాల ధ్యేయం కావాలని మోదీ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పరస్పర విశ్వాసం, గౌరవం, పరిణతే ప్రాతిపదికగా ఇరు దేశాల సంబంధాలు బలపడాలని పిలుపునిచ్చారు. రష్యాలోని కజాన్‌లో బ్రిక్స్ సదస్సు ముగిసిన అనంతరం నేతల భేటీ జరిగింది. అన్ని అంశాలపైనా వారిద్దరూ 50 నిమిషాలకు పైగా లోతుగా చర్చలు జరిపారు. ‘‘విభేదాలు, వివాదాలను చర్చలు తదితరాల ద్వారా సజావుగా పరిష్కరించుకోవాలి. శాంతి, సౌభ్రాతృత్వాలను అవి దెబ్బతీయకుండా జాగ్రత్త పడాలి’’ అంటూ చైనా అధ్యక్షునికి మోదీ ఈ సందర్భంగా హితవు పలికారు. ప్రపంచంలోనే అతి పెద్ద దేశాలైన చైనా–భారత మధ్య సత్సంబంధాలు ఇరు దేశాల ప్రజలకే గాక ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, సామరస్యాలకు చాలా కీలకమని పేర్కొన్నారు. భేటీ అనంతరం ఈ మేరకు మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ భేటీని ఇరు దేశాల ప్రజలతో పాటు అంతర్జాతీయ సమాజం కూడా ఆసక్తిగా గమనిస్తోందని జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. సమస్యలు, విభేదాల పరిష్కారానికి, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు ఇరు దేశాల మధ్యా అన్ని స్థాయిల్లోనూ మరింత సమన్వయం, మరిన్ని చర్చలు అత్యవసరమన్నారు. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, సమస్యలు తదితరాలు కూడా నేతలిద్దరి చర్చల్లో చోటుచేసుకున్నాయి. షాంఘై సహకార సంస్థకు 2025లో చైనా సారథ్యానికి పూర్తిస్థాయిలో మద్దతిస్తామని జిన్‌పింగ్‌కు మోదీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. చైనా, భారత సైనికుల మధ్య 2020 నాటి గాల్వన్ లోయ ఘర్షణల అనంతరం ఇరు దేశాల సంబంధాలు దారుణంగా క్షీణించడం తెలిసిందే. వాటిని చక్కదిద్దుకునే ప్రయత్నాల దిశగా ఈ భేటీని కీలక ముందడుగుగా భావిస్తున్నారు. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కరచాలనం చర్చలు కొనసాగుతాయి పలు ద్వైపాక్షిక అంశాలను అధినేతలిద్దరూ దీర్ఘకాలిక దృష్టితో లోతుగా సమీక్షించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ‘‘సరిహద్దు వివాదం మొదలుకుని పలు విభేదాలపై ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు కొనసాగాలని వారు నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు త్వరలోనే చర్చలుంటాయి’’ అని వెల్లడించారు. మోదీ–జిన్‌పింగ్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు ముందుగా సరిహద్దు ప్రాంతాల వద్ద శాంతి, సామరస్యం నెలకొనాలన్న అంశంపై వారిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్టు వివరించారు. అభివృద్ధిపరమైన సవాళ్లను అధిగమిస్తూ పరస్పర సహకారం, సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించారన్నారు. ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో భారత్‌కు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనాకు విదేశాంగ మంత్రి వాంగ్ యీ సారథ్యం వహిస్తున్నారు. వారి నడుమ 2019లో చివరిసారిగా చర్చలు జరిగాయి. ఉజ్బెక్, యూఏఈ అధ్యక్షులతో మోదీ భేటీ బ్రిక్స్ సదస్సు చివరి రోజు బుధవారం ఉజ్బెకస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్అల్ నహ్యాన్తో కూడా మోదీ భేటీ అయ్యారు. వారిద్దరితో చర్చలు అత్యంత ఫలప్రదంగా జరిగినట్టు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అనంతరం రెండు రోజుల రష్యా పర్యటన ముగించుకుని మోదీ భారత్ బయల్దేరారు. -
ఈ భేటీ శుభ పరిణామం
అయిదేళ్ల తర్వాత నైరుతి రష్యాలోని కజన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య బుధవారం ద్వైపాక్షిక సమావేశం జరిగింది. బ్రిక్స్ శిఖరాగ్ర భేటీ సందర్భంగా రెండు దేశాల అధినేతల మధ్యా చర్చలు జరగటం శుభపరిణామం. డెస్పాంగ్, దెమ్చోక్ ప్రాంతాల్లో ఇరు దేశాల సైన్యాల గస్తీకి రెండురోజుల క్రితం అవగాహన కుదరటంతో అధినేతల భేటీ సాధ్యమైంది. ఈ విషయాన్ని మన విదేశాంగ మంత్రి జైశంకర్ సోమవారం ప్రకటించటం... దానికి అనుగుణంగా చైనా వైపునుంచి కూడా ప్రకటన జారీకావటంతో వాతావరణం తేలికపడింది. అయితే గతాన్ని అంత తేలిగ్గా మరిచిపోరాదు. సరిగ్గా అయిదేళ్లనాడు ఇదే నెలలో తమిళనాడులోని మహా బలిపురం వేదికగా ఇరు దేశాధినేతలూ కలుసుకోగా ఆ తర్వాత ఏడాది తిరగకుండానే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించి చైనా తన నైజం చాటుకుంది. దాంతో ఇరు దేశాల సంబంధాలూ కనీవినీ ఎరుగనంతగా దెబ్బతిన్నాయి. నిజానికి అంతక్రితం 2018లో మోదీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సంప్రదింపుల కోసం వూహాన్ తరలివెళ్లిన నాటికే డోక్లాంలో రెండు దేశాల సైనికుల మధ్యా 73 రోజులపాటు ఘర్షణ వాతావరణం కొనసాగింది. డోక్లాం చిన్న అపశ్రుతి మాత్రమేనని, అంతా చక్కబడిందని అనుకుని మహాబలిపురంలో జిన్‌పింగ్‌కు ఘనమైన ఆతిథ్యం అందించిన కొద్దికాలా నికే మళ్లీ సరిహద్దుల్లో సమస్యలు తలెత్తాయి. 2020 ఏప్రిల్‌లో చైనా సైనికులు వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను అతిక్రమించి గాల్వాన్ లోయలో చొరబాట్లకు పాల్పడ్డారు. తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్, డెస్పాంగ్, హాట్‌స్ప్రింగ్స్ తదితరచోట్ల ఆక్రమణలకు దిగి అక్కడ మన సైనికులు గస్తీ తిరగడానికి వీల్లేదని పేచీకి దిగారు. కర్రలు, ఇనుపరాడ్లతో మన జవాన్లపై దాడికి దిగి 21 మంది ఉసురు తీశారు.అంతంతమాత్రంగా సాగుతూవచ్చిన సంబంధాలు కాస్తా ఆ తర్వాత పూర్తిగా పడకేశాయి. సరిహద్దు వివాదాలపై ఇరు దేశాల సైనిక కమాండర్ల మధ్య సంప్రదింపులు జరుగుతున్నా, అడపా దడపా సేనల ఉపసంహరణ జరిగినా మునుపటి సాన్నిహిత్యం లేదు. రెండు దేశాల విదేశాంగ మంత్రులూ 2020 సెప్టెంబర్‌లో సమావేశమై ఉద్రిక్తతల ఉపశమనానికి పంచసూత్ర పథకం రూపొందించారు. రక్షణ మంత్రుల స్థాయిలో కూడా చర్చలు జరిగాక వివాదాస్పద ప్రాంతాల నుంచి సైన్యాలను ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ సమస్యలు పూర్తిగా సమసిపోలేదు. 2022లో బాలిలో జరిగిన జీ–20 శిఖరాగ్ర సదస్సు, నిరుడు జోహన్నెస్ బర్గ్‌లో నిర్వహించిన బ్రిక్స్ అధినేతల సదస్సు సందర్భాల్లో మోదీ, జిన్‌పింగ్‌లు కలిసిన మాట వాస్తవం. అయితే అవి ముక్తసరి, మర్యాదపూర్వక భేటీలు మాత్రమే. ఆ తర్వాత ఎల్ఏసీలో పరిస్థి తులు స్వల్పంగా మెరుగుపడ్డాయి. అయినా మన హిమాచల్‌ప్రదేశ్ గ్రామాలకు చైనా తనవైన పేర్లు పెట్టడం, సరిహద్దుల్లో కొత్త గ్రామాలు సృష్టించటంవంటి గిల్లికజ్జాలకు మాత్రం కొదవలేదు. ఎల్ఓసీలో 45 ఏళ్లుగా ఇరు దేశాల సైనికులూ నిరంతరాయంగా గస్తీ కొనసాగిస్తున్న చోటులో చైనా దళాలు ఆక్రమణలకు దిగి ఇక్కడ గస్తీ కాయొద్దంటూ అభ్యంతరపెట్టడంతో 2020లో కొత్త వివాదం మొదలైంది. ఇలా మన జవాన్లు ఉండే చోటుకొచ్చి కవ్వింపులకు దిగి ఎదురుదాడి చేయ టమో, మానటమో మనవాళ్లే తేల్చుకోవాల్సిన స్థితి కల్పించటం చైనా మొదలెట్టిన కొత్త వ్యూహం. యధాతథ స్థితిని కాలరాసి ఆ ప్రాంతం ఎప్పటినుంచో తమదన్న తర్కానికి దిగటం చైనాకే చెల్లింది. 1962లో సైతం ఇలాంటి వైఖరితోనే మన దేశంపై దురాక్రమణకు తెగించింది. అంత వరకూ మన దేశం చైనాకు అన్నివిధాలా సహాయసహకారాలు అందజేసింది. చైనా ఆవిర్భావం తర్వాత దాన్ని గుర్తించటంలో మనం ముందున్నాం. ఆ తర్వాత ‘పంచశీల’ ఒప్పందం సైతం కుదిరింది. కానీ దానికి వెన్నుపోటు పొడిచింది చైనాయే.తాజాగా రెండు దేశాల మధ్యా సామరస్యత నెలకొనడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ చొరవ తీసుకున్నారన్న కథనం వినిపిస్తోంది. రష్యాను అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని పాశ్చాత్య దేశాలూ, అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో రష్యా తన ప్రయోజనాలు కాపాడుకోవాలనుకోవ టంలో వింతేమీ లేదు. ఉక్రెయిన్‌తో రష్యా సాగిస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు భారీయెత్తున ఆయుధ సామగ్రి అందిస్తున్న ఆ దేశాలు రష్యాను ఆర్థిక ఆంక్షలతో కూడా దిగ్బంధించి దెబ్బ తీయాలని చూశాయి. ఆ తరుణంలో భారత్, చైనాలు రష్యానుంచి ముడి చమురు కొనుగోలుచేసి ఆదుకున్నాయి. అందుకే కావొచ్చు... ఆ రెండు దేశాలమధ్యా సామరస్యత సాధించి పాశ్చాత్య ప్రపంచానికి పుతిన్ షాక్ ఇచ్చారు. ఇరుగుపొరుగు దేశాలన్నాక సమస్యలు సహజం. ఇచ్చిపుచ్చు కునే ధోరణితో వ్యవహరించాలని, సామరస్యంగా మెలగాలని ఇరుపక్షాలూ అనుకున్నప్పుడు మాత్రమే అటువంటి సమస్యలు పరిష్కారమవుతాయి. అటు చైనాకు ఆర్థికరంగంలో సమస్యలు ముంచుకొస్తున్నాయి. అక్కడ హౌసింగ్ రంగం తీవ్రంగా దెబ్బతిని దాని ఆర్థిక వ్యవస్థను ఛిన్నా భిన్నం చేసింది. రుణభారం తడిసి మోపెడైంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దాన్ని సక్రమంగా పరిష్కరించకపోతే చైనాయే కాదు... చైనాతోపాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ దెబ్బతింటాయి. భారత, చైనాలు రెండూ జనాభాపరంగా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. అతి పెద్ద మార్కెట్గల భారత్‌తో సంబంధాలు మెరుగుపడితే తన ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోవటానికి ఆ చర్య తోడ్పడుతుందన్న వివేకం చైనాకు ఉండాలి. అధినేతల మధ్య అవగాహన ఆచరణలో కనబడాలి. మాటకూ, చేతకూ పొంతన కుదరాలి. అప్పుడు మాత్రమే చెలిమి వర్ధిల్లుతుంది. -
ఐదేళ్ల తర్వాత భేటీ కానున్న మోదీ, జిన్‌పింగ్
బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సు పాల్గొనేందుకు రష్యా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. ఇవాళ ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ఇరువురు నేతలు ఐదేళ్ల తర్వాత తొలిసారిగా భేటీ కానుండటం గమనార్హం. మరోవైపు.. ఇరుదేశాల మధ్య సరిహద్దు గస్తీకి సంబంధించి కీలక ఒప్పందం జరిగిన నేపథ్యంలో మోదీ, జిన్ పింగ్ మధ్య తాజాగా భేటీ జరగనుండటంపై ఆసక్తి నెలకొంది. గత నాలుగున్నరేళ్లుగా సరిహద్దుల్లో భారత్, చైనాల దేశాల మధ్య ఉద్రిక్తతలు, గల్వాన్ లోయలో ఇరు సైన్యాల మధ్య ఘర్షణతో తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.అదీకాక నాలుగేళ్లుగా ఇరు దేశాల మధ్య నేరుగా విమాన రాకపోకలు కూడా సాగలేదు. ఇక.. గల్వాన్ ఘటన తర్వాత ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌లు 2023 ఆగస్టులో దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సుకు హాజరైన సమయంలో మొదటిసారి అక్కడ కలిశారు. అనంతరం ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 సదస్సులో పాల్గొన్నారు. ఇక.. అప్పటినుంచి ప్రత్యకంగా ఇరు దేశాధినేతల మధ్య భేటీ జరగకపోవటం గమనార్హం. 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మంగళవారం రష్యాలోని కజాన్ నగరం చేరుకున్నారు. గత మూడు నెలల్లో మోదీ రష్యా వెళ్లడం ఇది రెండోసారి. కజాన్ చేరిన కాసేపటికే ఆయన పుతిన్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పలు అంశాలపై నేతలిద్దరూ లోతుగా చర్చించుకున్నారు.చదవండి: ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి...అన్నివిధాలా సహకరిస్తాం: మోదీ -
చైనా కవ్వింపులు.. యుద్ధానికి సిద్దం కావాలన్న జిన్‌పింగ్!
బీజింగ్: చైనా, తైవాన్ మధ్య మరోసారి యుద్ద వాతావరణం నెలకొంది. తాజాగా చైనాకు చెందిన సైనిక విమానాలు, నౌకలు తైవాన్ భూభాగంలోకి వెళ్లినట్టు తైవాన్ తెలిపింది. మరోవైపు.. యుద్ధానికి సిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తమ దేశ సైనికులకు పిలుపునిచ్చినట్లు సమాచారం. దీంతో, రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 6 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) చైనాకు చెందిన ఆరు సైనిక విమానాలు, ఏడు నౌకాదళ నౌకలు తైవాన్ భూభాగంలో గుర్తించబడ్డాయి. రెండు విమానాలు మధ్యస్థ రేఖను దాటి తైవాన్ నైరుతి వైమానిక రక్షణ గుర్తింపు జోన్లోకి ప్రవేశించాయి. దీంతో, రక్షణ శాఖ అప్రమత్తమైందని తెలిపింది. ఇక, తైవాన్ చుట్టూ బీజింగ్ తరచుగా సైనిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా..ఇటీవల పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్‌కు చెందిన బ్రిగేడ్‌ను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ.. యుద్ధానికి సన్నాహాలను సమగ్రంగా బలోపేతం చేయాలి. దళాలు పటిష్ఠమైన పోరాట సామర్థ్యాలను కలిగి ఉండేలా చూడాలి. సైనికులు తమ వ్యూహాత్మక పోరాట సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. దేశ భద్రత, ప్రధాన ప్రయోజనాలను కాపాడాలని సైన్యానికి సూచించినట్లు చైనా వార్తా సంస్థలు తెలిపాయి.URGENT 🇨🇳 President Chino Xi Jinping orders his troops to prepare for war, visits installations and requests an increase in missile production as soon as possible. This appeared in the national broadcast on the state channel CCTV pic.twitter.com/9HXfSMMyLI— Nostr World (@newsandworld) October 20, 2024 -
సరిహద్దులో చైనాతో కొత్త బెడద
‘షావోకాంగ్’ పథకం ద్వారా వందల ఆధునిక గ్రామాలను సరిహద్దుల్లో చైనా నిర్మించింది. సరిహద్దు ప్రాంత అభివృద్ధి పేరిట సాగుతున్న ఇది పూర్తిగా నిర్బంధ విస్తరణపై కేంద్రీకృతమైంది. లద్ధాఖ్, బారాహోతి, అరుణాచల్ ప్రదేశ్‌లను తన భూభాగాలుగా చూపిస్తూ చైనా ‘భౌగోళిక పటాల దాడి’ని కూడా ప్రారంభించింది. ఈ ప్రాంతాల్లోని స్థలాలకు మాండరిన్ పేర్లను ఇవ్వడం అనేది చైనా ‘త్రిముఖ యుద్ధవ్యూహం’లో భాగం. టిబెట్, షిన్జాంగ్ లలో భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి తర్వాత మాత్రమే, సరిహద్దు ప్రాంతాలలో రోడ్లు, ఉపరితల కమ్యూనికేషన్ లను అప్‌గ్రేడ్ చేయడం భారత్ మొదలుపెట్టింది. ‘ఎత్తుకు పై ఎత్తు’ వేయడం కాకుండా, చైనా విస్తరణవాద నమూనాలను సమర్థంగా ఎదుర్కోవడానికి, నవ్య విధానం అవసరం. సరిహద్దులలో చైనా ఆధునిక గ్రామాలను నిర్మించడం, వాటిని నివాస ప్రాంతాలుగా చేసుకోవడం గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. మార్చ్ 28న, టిబెట్‌ను చైనా స్వాధీనం చేసుకున్న ఘటన 65వ వార్షికోత్సవం సందర్భంగా, భారత్, భూటాన్ సరిహద్దులకు సమీపంలో ఉన్న కొత్త గ్రామాలలో చైనా ప్రభుత్వం అనేక వేడుకలను నిర్వహించింది. తాజా వార్తల ప్రకారం, ఇప్పటికే ఉన్న 628 ‘సవొకాంగ్’ (సంపన్న గ్రామా లు)తో పాటు, మరో 175 సరిహద్దు గ్రామాలను చైనా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది. సరిహద్దు ప్రాంత అభివృద్ధి పేరిట, షావోకాంగ్ చొరవ అనేది నిర్బంధ విస్తరణపై కేంద్రీకృతమైంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన ద్వారా చైనా సమాజపు సమాన అభివృద్ధిని నిర్ధారించ డానికి 1979లో డెంగ్ జియావోపింగ్ ఈ నమూనాను ప్రతిపాదించారు. ప్రస్తుత చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ దీనిని, ప్రధాన భూభాగంతో సరిహద్దు ప్రాంతాల ఏకీకరణ వ్యూహంగా మార్చారు. తద్వారా అరుణాచల్‌ప్రదేశ్‌కు ఎదురుగా ఉన్న టిబెట్‌లో దాని భూసరిహద్దుల భద్రతను మెరుగుపరిచారు. షావోకాంగ్ పథకంలో భాగంగా, 427 మోడల్ గ్రామాలను ఫ్రంట్ లైన్లో నిర్మించగా, 201 గ్రామాలు రెండవ శ్రేణిలో ఉన్నాయి. ఈ సంపన్న గ్రామాలు షిగత్సే, లోహ్కా, న్యింగ్చి, ఎన్గారి వంటి ముఖ్య మైన పట్టణాలతో సహా 21 సరిహద్దు కౌంటీలలో విస్తరించి ఉన్నాయి. భూటాన్, అరుణాచల్‌ప్రదేశ్‌లతో సరిహద్దును పంచుకునే లోహ్కా ప్రాంతంలోనే, చైనా 354 ‘సంపన్న’ సరిహద్దు స్థావరాలను అభివృద్ధి చేసింది. ఈ గ్రామాలలో దాదాపు మూడింట ఒక వంతు వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) సమీపంలో నిర్మించారు. మౌలిక సదు పాయాలు సహా, ఈ ఆవాసాల నిర్మాణం కోసం సుమారుగా 4.6 బిలి యన్ డాలర్లు కేటాయించారు. 2017 అక్టోబర్‌లో జరిగిన 19వ పార్టీ కాంగ్రెస్‌లో, ప్రతిభావంతులైన చైనీస్ పౌరులు మారుమూల జాతిపరమైన మైనారిటీ ప్రాంతాలలో పని చేయాలని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. దీంట్లో నిగూఢంగా దాగి ఉన్నది, ప్రధానంగా అక్కడి జనావాసాల స్థితిగతులను మార్చడమే. గత దశాబ్దంలోనే, టిబెట్‌లో హాన్ జనాభా సుమారు 12 శాతం పెరిగింది. కమ్యూనిస్ట్ పాలన అంతిమ లక్ష్యం, టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో పూర్తిగా చైనీకరణను సాధించడం. భారత్, నేపాల్, భూటాన్ సరిహద్దు ప్రాంతాలలో అన్ని సరిహద్దు గ్రామాలకు రోడ్లు, విద్యుదీకరణ, ఆఖరికి ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి నాణ్యమైన సౌకర్యాలు అందించారు. అదనంగా, దాదాపు 206 పారిశ్రామిక ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. సరిహద్దు నిర్వహణను బలోపేతం చేయడానికి చైనా ఇటీవలి సంవత్సరాలలో రెండు జాతీయ చట్టాలను ప్రవేశపెట్టింది. 2021లో ఆమోదించిన నేషనల్ డిఫెన్స్ లా, జాతీయ ప్రయోజనాల కోసం పౌర సంస్థలతో కలిసి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పనిచేయడానికి అధిక పాత్రను అందిస్తుంది. ఒక సంవత్సరం తర్వాత, ఆక్రమిత ప్రాంతా లపై చైనా పట్టును ఏకీకృతం చేసేందుకు భూ సరిహద్దు చట్టాన్ని ఆమోదించారు. ఈ చట్టంలోని ఆర్టికల్స్ 10, 43... సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి యథాతథ స్థితిని సవాలు చేస్తున్నాయి. ఇది భారతదేశ సరిహద్దు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. లద్ధాఖ్, బారాహోతి, అరుణాచల్ ప్రదేశ్‌లను తన భూభాగాలుగా చూపిస్తూ చైనా ‘మ్యాప్‌ల దాడి’ని ప్రారంభించింది. ఈ ప్రాంతాల్లోని స్థలాలకు మాండరిన్ పేర్లను ఇవ్వడం అనేది చైనా ‘త్రిముఖ యుద్ధవ్యూహం’లో భాగం. ఇది ప్రచారపరమైన, మానసికపరమైన, చట్టపరమైన కోణాలను కలిగి ఉంటుంది. జూలై 2021లో, జిన్‌పింగ్ లాసాను సందర్శించారు. గత మూడు దశాబ్దాలలో చైనా దేశాధినేత చేసిన మొదటి సందర్శన. ఆయన టిబెట్‌ను ‘ఇనుప కవచం’గా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. దీని ప్రకారం, డోక్లామ్, లాంగ్ జు వంటి వివాదాస్పద ప్రాంతాలలోని సరిహద్దు గ్రామాలు ఫార్వర్డ్ పోస్ట్‌లుగా వ్యవహరించడానికి చైనా సైన్యపు రక్షణ ప్రణాళికలలో విలీనం చేయబడ్డాయి. హాన్ జాతికి చెందిన మాజీ సైనిక సిబ్బంది సరిహద్దు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. చైనా చర్యలు దాని ‘గ్రే జోన్ వార్ఫేర్’కు అనుగుణంగా ఉన్నాయి. ఇందులో పౌరులు, పౌరసైనికులు ‘నాన్–కాంటాక్ట్’ యుద్ధంలో భాగమ వుతారు. దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ కార్యాచరణ దీనికి ఒక ఉదాహరణ. ఒక స్పష్టమైన విధానం లేనందున, ముఖ్యంగా చైనాకు ఎదు రుగా ఉన్న భారత సరిహద్దు ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు. టిబెట్, షిన్జాంగ్లలో భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి తర్వాత మాత్రమే, సరిహద్దు ప్రాంతాలలో రోడ్లు, ఉపరితల కమ్యూనికేషన్ లను అప్‌గ్రేడ్ చేయడం భారత్ మొదలుపెట్టింది. సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ (వీవీపీ)ని గతేడాది ప్రారంభించారు. దీని ప్రకారం, చైనా సరిహద్దులో కనెక్టివిటీ లోపించిన 168 గ్రామాలను ఈ ఏడాది చివరి నాటికి అనుసంధానం చేయనున్నారు. 19 జిల్లాల్లోని 663 సరి హద్దు గ్రామాల్లో తగిన మౌలిక సదుపాయాల కల్పనకు రూ.4,800 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు.చైనా నియంత్రణలో పూర్తిగా ఉండే సవొకాంగ్ పథకానికి విరు ద్ధంగా, భారత్ కార్యక్రమం ‘హబ్ అండ్ స్పోక్’(ఒక దగ్గరి నుంచి అందరికి) నమూనాను అనుసరిస్తోంది. ఇది జిల్లా పరిపాలన, గ్రామ పంచాయతీల ద్వారా అమలవుతుంది. కేంద్ర ప్రభుత్వ పాత్ర నిధులు ఇవ్వడానికే పరిమితమైంది. వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ప్రధాన దృష్టి సామాజిక–ఆర్థిక కార్యక్రమాల ప్రచారంపై ఉంది. అయితే, భద్రతా అంశాలను కూడా చేర్చడం ద్వారా ద్వంద్వ–వినియోగ విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉంది. రహదారులు, రైలు మార్గాలు, విమానాశ్రయాలు, దిబాంగ్ జల విద్యుత్ ప్రాజెక్టు, జలమార్గాలతో సహా భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా సరిహద్దుల్లో భారత్ చేపడుతోంది. ఈశాన్య ప్రాంత సమగ్ర అభివృద్ధికి రూ. 12,882.2 కోట్ల నిధులను ‘స్థూల బడ్జెట్ సహాయం’ కింద సమకూర్చారు. వివాదాస్పద సరిహద్దు, లద్ధాఖ్‌లలో కొనసాగుతున్న ప్రతిష్టంభన దృష్ట్యా, చైనా ప్రణాళిక తీవ్రమైన వ్యూహాత్మక పరిణామాలను కలిగి ఉంది. వాస్తవ నియంత్రణ రేఖ స్థితిని ఏకపక్షంగా మార్చాలనే బీజింగ్ ఉద్దేశం, సవొకాంగ్ పథకంతో మరింత తోడ్పాటును పొందు తుంది. 2005 (ఆర్టికల్ 7)లో పొందుపర్చిన ‘సరిహద్దు సమస్య పరి ష్కారానికి రాజకీయ పరామితులు, మార్గదర్శక సూత్రాలు’ ఒప్పందాన్ని కూడా చైనా విస్మరించింది. ఈ ఒప్పందం ప్రకారం సరిహద్దుల వెంబడి జనాభా ప్రస్తుత అమరికకు ఎవరూ భంగం కలిగించకూడదు. చైనా విస్తరణవాద నమూనాలను సమర్థంగా ఎదుర్కోవడానికి, నవ్య విధానం అవసరం. ‘ఎత్తుకు పై ఎత్తు’పై ఆధారపడిన మన ప్రస్తుత ప్రతిస్పందనా విధానానికి కాలం చెల్లిపోయింది. సరిహద్దు నిర్వహణ మొత్తంగా సమగ్ర సమీక్షకు గురికావాలి. ఇది జాతీయ భద్రతా వ్యూహంలో కీలకమైన అంశంగా ఉండాలి. దురదృష్టవశాత్తూ ఇది ఇప్పటికీ రూపు దాల్చుతూనే ఉంది! మేజర్ జనరల్ జిజి ద్వివేది (రిటైర్డ్) వ్యాసకర్త చైనాకు భారత మాజీ డిఫెన్స్ అటాచె (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అమెరికా–చైనా చర్చలపర్వం
ఎడతెగని చర్చలు జరుగుతున్నాయంటే, అయినా కనుచూపుమేరలో పరిష్కారం కానరా లేదంటే... కనబడని కారణాలేవో అడ్డుపడుతున్నాయని అర్థం. సమస్య తీవ్రంగా ఉన్నదని తాత్పర్యం. ఈనెల ప్రారంభంనుంచి అమెరికా–చైనాలమధ్య భిన్న అంశాలపై చర్చోపచర్చలు సాగుతూనే వున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌లు నేరుగా ఫోన్లో సంభాషించుకున్నారు. నాలుగు నెలలక్రితం తొలిసారి మాట్లాడుకున్న ఈ నేతలిద్దరూ మళ్లీ మాట్లాడుకోవాల్సిన పనిబడటం గమనించదగిందే. వారం తిరగకుండానే అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ ఎలెన్ చైనా సందర్శనకొచ్చి ప్రధాని లీ కియాంగ్‌తోపాటు చైనా ఉన్నత స్థాయి అధికారులను కలిసి మాట్లాడారు. అంతకుమునుపే ఇరు దేశాల ఉన్నతాధికారులు నాలుగు రోజులపాటు చర్చించుకున్నారు. త్వరలోనే అమెరికా విదేశాంగమంత్రి ఆంథోనీ బ్లింకెన్ చైనా వెళ్లబోతున్నారు. ఇలా సంభాషణల పరంపర కొనసాగుతున్నది గానీ పరిష్కారం కానరావటం లేదు. వీటికి సమాంతరంగా చైనాను కట్టడి చేసే ఇండో–పసిఫిక్ వ్యూహంలో భాగంగా 2021లో రూపుదిద్దుకున్న సైనిక సహకార సంస్థ ‘ఆకస్’ కార్యకలాపాలు చురుకందు కున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ రక్షణమంత్రులు ఇటీవల భేటీ అయ్యారు. ఇందులో మనదేశాన్ని కూడా చేర్చు కోవాలని అమెరికా తహతహలాడుతున్నా ఎలాంటి సైనిక ఒడంబడికల్లోనూ భాగం కారాదన్న విధానానికే ఇంతవరకూ మన దేశం కట్టుబడివుంది. మొదట్లో పెద్దగా ఆసక్తి చూపని జపాన్ మాత్రం చేరే అవకాశం ఉందంటున్నారు. అలాగని మన దేశం మౌనంగా ఏమీ లేదు. దక్షిణ చైనా సముద్రంలో చైనానుంచి తరచు బెదిరింపులు ఎదుర్కొంటున్న ఆగ్నేయాసియా దేశాలకు మద్దతుగా నిలుస్తామని చాటుతూనేవుంది. ఇటీవల చైనా గస్తీ నౌకలు చేసిన దాడుల్లో ఫిలిప్పీన్స్ వాణిజ్య నౌకలు రెండు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవలే ఆ దేశాన్ని సందర్శించి అండగా వుంటామని ప్రకటించారు. దక్షిణ చైనా సముద్రంలో 90 శాతం తన సొంతమని చైనా చెప్పుకుంటోంది. నిరంతర గస్తీ కాస్తోంది. సమస్యేమంటే ప్రపంచ సముద్ర ఉత్పత్తుల వాణిజ్యంలో 60 శాతం దక్షిణ చైనా సముద్రం వైపే సాగుతోంది. అంతర్జాతీయంగా చైనాను కట్టడి చేయటమే అత్యవసరమని భావిస్తున్న అమెరికాకు రష్యా దూకుడు ఊహించని పరిణామం. రెండేళ్ల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం ప్రారంభించాక దృష్టి అటువైపు మళ్లింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలందించటం ద్వారా రష్యాను దారికి తేవొచ్చని భావించిన అమెరికాకు నిరాశే ఎదురైంది. రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలు సైతం ఆశించినంత ఫలితాన్నివ్వలేదు. రష్యాకు ఇరాన్ నుంచి డ్రోన్లు అందుతున్నాయి. ఎడాపెడా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవటం ద్వారా రష్యాకు చైనా అండగా నిలుస్తోంది. ఉత్తర కొరియా సైతం చైనా ద్వారా రష్యాకు సహాయసహకారాలందిస్తోందని అమెరికా భావిస్తోంది. ఇటు ఇజ్రాయెల్ దుందుడుకుతనంతో గాజా మండుతోంది. ఇజ్రాయెల్‌ను ఎలాగైనా దారికి తేవా లన్న బైడెన్ ఎత్తుగడలు ఫలించటం లేదు. కనుకనే దౌత్యరంగంలో వున్నంత దూకుడు రక్షణరంగంలో కనబడటం లేదన్నది బైడెన్‌పై వున్న ప్రధాన విమర్శ. ఈ ఏడాది చివర అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నందున ఈ విమర్శలు బైడెన్‌ను కలవరపెడుతున్నాయి. పర్యవసానంగా చైనాతో చర్చోప చర్చలు సాగుతున్నాయి. వాణిజ్యపరంగా అమెరికాకు మరో ప్రత్యేక సమస్య కూడా వుంది. అంతర్జాతీయ మార్కెట్లోకి అపరిమితంగా వచ్చిపడుతున్న చైనా ఎలక్ట్రిక్ కార్లు, సౌరశక్తి ప్యానెళ్లు, ఇతర ఉపకరణాలు అమెరికాకు తలనొప్పి తెస్తున్నాయి. వాటివల్ల అమెరికా ఉత్పత్తులు అమ్ముడుకావటం కష్టమవుతోంది. అమెరికా పరిశ్రమలు సంక్షోభంలో పడుతున్నాయి. ఈ నెల మొదట్లో జో బైడెన్, షి జిన్‌పింగ్ మధ్య ప్రధానంగా తైవాన్, దక్షిణ చైనా సముద్రం అంశాలపై చర్చలు నడిస్తే... చైనా తమ వాణిజ్య దూకుడుకు కళ్లెం వేయటంపై జానెట్ ఎలెన్ ప్రధాని లీ కియాంగ్‌తో చర్చించారు. దీన్ని ఆపకపోతే మరో మూడేళ్లలో అవసరానికి మించి ఏటా 50 లక్షల నుంచి కోటి ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్కొస్తాయన్నది అమెరికా అంచనా. కృత్రిమ మేధ, సెమీ కండక్టర్ తదితర అంశాల్లో తమ ఎదుగుదలను నిరోధించేలా అమెరికా వ్యవహరిస్తున్నదని చైనా ఆరోపణ. కనుకనే ఇరుదేశాల ఉన్నతాధికారులమధ్యా వరసగా నాలుగురోజులపాటు చర్చలు సాగినా... నేరుగా ఎలెన్, లీ కియాంగ్‌లు సంభాషించుకున్నా పరిష్కారం దొరకలేదు. చిత్రమేమంటే అమెరికా, చైనాల మధ్య అనేక అంశాల్లో తీవ్ర విభేదాలున్నా వాణిజ్యపరంగా ఆ రెండు దేశాలూ పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడక తప్పని స్థితి. అందుకే ఇండో–పసిఫిక్ అంశంలో దూకుడుగా వున్నట్టు కనిపిస్తున్నా వాణిజ్య సమస్యలపై ఏదోవిధంగా చైనాను దారికి తెచ్చుకోవాలని అమెరికా తాపత్రయపడుతోంది. ట్రంప్ హయాంలో చైనాపై విధించిన ఆంక్షల్లో చాలా భాగం బైడెన్ కొనసాగించారు. వీటికి మరిన్ని జోడిస్తానన్న బైడెన్ హెచ్చరికలు ఆచరణలోకి రాకపోయినా అవసరాన్నిబట్టి అప్పుడప్పుడు సడలింపు వైఖరితో ఉన్నామన్న సంకేతాలు రెండు దేశాలూ ఇస్తున్నాయి. ఎలాంటి సమస్యలకైనా ఓర్పుగా సాగించే సంభాషణలు పరిష్కారాన్ని చూపుతాయి. ఘర్షణల నివారణ ఎప్పుడూ మంచిదే. ఎందుకంటే ఘర్షణలవల్ల అంతిమంగా విధ్వంసం తప్ప మరేమీ మిగలదు. అయితే ఏ చర్చలైనా నిర్మాణాత్మకంగా వుండాలి. చిత్తశుద్ధితో సాగాలి. లేనట్టయితే నిష్ఫలమవుతాయి. -
సైన్యంలోని అవినీతిపై చైనా పోరాటం
2013 నుండి నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ప్రజా విముక్తి సైన్యం(పీఎల్ఏ)లోని అవినీతిని తొలగించలేకపోయారు. దానికోసం ఆయన అమలు చేసిన పర్యవేక్షణ వ్యవస్థ కూడా పనిచేసినట్లు లేదు. జిన్‌పింగ్‌కు మరింత ఇబ్బంది కలిగించే విషయం ఏమిటంటే, సీనియర్ అధికారులందరూ ఆయన ద్వారానే పదోన్నతి పొందారు. అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న కనీసం 70 మంది పీఎల్ఏ అధికారులను తాము గుర్తించినట్లు ఒక కెనడా థింక్ ట్యాంక్ పేర్కొంది. ఇక, తైవాన్ పై దాడికి పీఎల్ఏ సిద్ధంగా లేదని మరో నివేదిక పేర్కొంది. పీఎల్ఏ రాజకీయ విశ్వసనీయతను, సైద్ధాంతిక నిబద్ధతను బలోపేతం చేయడానికి చైనా అధ్యక్షుడు ఒక కఠినమైన ప్రచారం నిర్వహించనున్నారనేది స్పష్టం. గత సంవత్సరం మధ్య నుండి చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ–ప్రజా విముక్తి సైన్యం) ఉన్నత స్థాయులలో స్పష్టంగా గందరగోళం కనిపిస్తోంది. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) నిర్వహించిన నూతన సంవ త్సర ప్రదర్శనలో జనవరి 29న కనిపించిన సీఎంసీ సీనియర్ వైస్ ఛైర్మన్ జనరల్ జాంగ్ యూక్సియాను, రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్ఫును ఆకస్మికంగా తొలగించడం గురించి సుదీర్ఘకాలంపాటు చైనా ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు. వీరిద్దరికీ చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్‌తో సన్నిహిత కుటుంబ సంబంధాలు ఉండటం అనిశ్చితిని మరింతగా పెంచింది. అవినీతి లేదా రాజకీయ క్రమశిక్షణను ఉల్లంఘించిన ఆరోపణలపై చాలా మంది సీనియర్ అధికారులను ఇటీవలి నెలల్లో పదవుల నుండి తొలగించారు. అవినీతి ఆరోపణలపై విచారణలో ఉంచిన కనీసం 70 మంది పీఎల్ఏ అధికారులను తాము గుర్తించినట్లు ఒక కెనడా థింక్ ట్యాంక్ (మేధా సంస్థ) పేర్కొంది. అదనంగా, తైవాన్ పై దాడికి పీఎల్ఏ సిద్ధంగా లేదని పీఎల్ఏ అధికారులు జిన్ పింగ్‌కు తెలియజేసినట్లు మరో నివేదిక పేర్కొంది. అవినీతిని నిర్మూలించడం, రాజకీయ క్రమశిక్షణ, విశ్వసనీయతను నిర్ధారించడంపై చైనా అధ్యక్షుడు దృష్టి సారించడంతో, పీఎల్ఏ పూర్తిగా ‘ప్రక్షాళన’ లేదా దిద్దుబాటుకు లోనవుతుందనే విషయం దాదాపు నిశ్చయమైంది. కదులుతున్న సోపానక్రమం గత ఏడాది సెప్టెంబర్‌లో జనరల్ లీ షాంగ్ఫు ఆకస్మికంగా ప్రజల దృష్టి నుండి అదృశ్యమైనప్పటి నుండి, ఇది ఎందుకు జరిగింది, అతని స్థానంలో ఎవరు ఉంటారు? అనే దానిపై నిరంతర ఊహాగానాలు కొనసాగుతున్నాయి. జిన్ పింగ్ మరొక ఆశ్రితుడైన విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ జూలైలో ఆకస్మికంగా, ఇప్పటికీ వివరించలేని విధంగా అదృశ్యమవడం కారణంగా మరింతగా ఊహాగానాలు పెరిగాయి. బహుశా వారు అవినీతికి పాల్పడ్డారనీ, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనీ ఆ తర్వాత సంకేతాలు వచ్చాయి. ఆసక్తికరంగా, వీరిద్దరూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులుగా తమ స్థానాన్ని మాత్రం నిలుపుకొన్నారు. 2023 సంవత్సరం అక్టోబరులో జనరల్ లి షాంగ్ఫు అధికారికంగా రక్షణ మంత్రి పదవి నుండి వైదొలిగారు. అయితే పీఎల్ఏ మాజీ నేవీ కమాండర్ జనరల్ డాంగ్ జున్ ను ఆయన వారసుడిగా నియమించటానికి మరో మూడు నెలలు పట్టింది. మొదటిసారిగా, మాజీ పీఎల్ఏ నేవీ కమాండర్‌ను రక్షణ మంత్రిగా నియమించడం వలన పీఎల్ఏ పదాతి బలగం, పీఎల్ఏ రాకెట్ బలగం గురించి సందేహాలు తలెత్తాయి. అదే సమయంలో, ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు జనరల్ జాంగ్ చాలా కాలం గైర్హాజరు కావడం, మళ్లీ అడపాదడపా సుదీర్ఘకాలం కనిపించకపోవడం వల్ల, జిన్‌పింగ్‌తో ఆయన సంబంధాలు దెబ్బతిన్నాయని ఊహాగానాలు వచ్చాయి. జనవరి 16న బీజింగ్‌లోని సెంట్రల్ పార్టీ స్కూల్లో ‘అధిక నాణ్యత, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం’పై జరిగిన అధ్యయన సెషన్లో జనరల్ జాంగ్, జనరల్ హీ వీడాంగ్ వెనుక మూడవదైన చివరి వరుసలో కూర్చున్నట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని సీసీటీవీ కవరేజి చూపించింది. ఇది పీఎల్ఏ సోపానక్రమం విషయంలో చాలా అసాధారణమైనది తనిఖీ పరిధిలోకి వచ్చినప్పటికీ... పీఎల్ఏలో దశాబ్దాలుగా అవినీతి రాజ్యమేలుతున్న సంగతి తెలిసిందే. 2012 నవంబర్‌లో సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఛైర్మన్ గా జిన్‌పింగ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, పీఎల్ఏను చైనా కమ్యూ నిస్టు పార్టీకి చెందిన అవినీతి నిరోధక సంస్థ అయిన కేంద్ర క్రమశిక్షణా తనిఖీ కమిషన్ పరిధిలోకి తీసుకువచ్చారు. దానిని ఏడాది పొడవునా సైద్ధాంతిక, అవినీతి వ్యతిరేక ప్రచారాలకు గురిచేశారు. పీఎల్ఏ ఆధు నీకరణ, ఆల్–రౌండ్ టెక్నాలజీ అప్‌గ్రేడ్‌పై కొత్త, ప్రధాన ప్రాధాన్యత కారణంగా భారీ మొత్తంలో డబ్బు అందుబాటులోకి వచ్చేది. పీఎల్ఏ రాకెట్ ఫోర్స్ ముఖ్యంగా క్షిపణుల జాబితాను పెంచడానికి, కొత్త రకాల క్షిపణులను ప్రవేశపెట్టడానికి, అనేక భూగర్భ గోతులను నిర్మించడానికి చేసిన కృషి కారణంగా పెద్ద మొత్తాలను అందుకుంది. పీఎల్ఏ సామగ్రి అభివృద్ధి విభాగానికి సంబంధించిన రక్షణ శాస్త్రీయ సంస్థల్లోని అధికారుల తొలగింపు, వారు కూడా అవినీతికి పాల్ప డ్డారని నిర్ధారిస్తుంది. తాను కనీవినీ ఎరుగని స్థాయిలో అవినీతి వ్యతిరేక ప్రచారం సాగించినప్పటికీ, పీఎల్ఏలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి కొనసాగడంపై జిన్ పింగ్ ఆగ్రహం చెందారు. దీని ఫలితంగా 2017 నాటికి అవినీతి ఆరోపణలపై 40 శాతం మంది అధికారులను తొలగించారు. రిపోర్టింగ్, పర్యవేక్షణ యంత్రాంగం పని చేయలేదనీ, దానిని పర్య వేక్షించడానికి పార్టీ చేసిన ప్రయత్నాలను పీఎల్ఏ ప్రతిఘటించిందనీ ఇది సూచిస్తుంది. దీనికి అనుగుణంగా, 2024 జనవరి 1న నాటి పీఎల్ఏ దినపత్రిక సంపాదకీయం, అవినీతిపై పోరాటానికి ప్రాధాన్య తనిస్తూ మూడుసార్లు ‘అవినీతి’ని ప్రస్తావించింది! అప్పటి నుండి, పీఎల్ఏ అవినీతిని అరికట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పే దాదాపు అరడజను కథనాలు వచ్చాయి. కఠిన ప్రచారం ఇంతలో, రహస్య పీఎల్ఏ రాకెట్ ఫోర్స్ కమాండర్, పొలిటికల్ కమిస్సార్, జనరల్ లీ యుచావో, జనరల్ గ్జూ జోంగ్బోలను, వరు సగా వారి పదవుల నుండి తొలగించారు. అవినీతి ఆరోపణలపై వీరిపై విచారణ సాగించారు. విశ్వసనీయ నివేదికల ప్రకారం, ఈ అవినీతి సొమ్ము విలువ మొత్తం 2 బిలియన్ డాలర్లు అని అంచనా. డిసెంబర్ 29న, చైనా పార్లమెంటుగా పేర్కొనే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ తొమ్మిది మంది సీనియర్ పీఎల్ఏ అధికారులను వారి పదవుల నుండి తొలగించింది. 2023 జూన్ లో, అణువ్యతిరేక దాడిని ప్రారంభించడం కోసం చర్యలను పర్యవేక్షించిన జనరల్ లి యుచావో, జనరల్ జు, ఆయన సహాయకులు లియు గ్వాంగ్బిన్, జాంగ్ జెన్ జాంగ్లను కూడా వారి పదవుల నుండి తొలగించారు. పీఎల్ఏ సామగ్రి అభివృద్ధి విభాగం అధికారులైన జాంగ్ యులిన్, రావో వెన్ మిన్ లను తొలగించడం మరింత ఆసక్తికరంగా ఉంది. గత నెల ప్రారంభంలో, దాదాపు 15 మంది సీనియర్ పీఎల్ఏ రాకెట్ ఫోర్స్ అధికారులను కూడా తొలగించి విచారణలో ఉంచారు. వారిలో ఐదుగురు ఆ సంస్థకు చెందిన గత లేదా ప్రస్తుత కమాండర్లు. 2013 నుండి నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, జిన్‌పింగ్, పీఎల్ఏ నుండి అవినీతిని తొలగించలేకపోయారు. పైగా ఆయన అమలులో ఉంచిన పర్యవేక్షణ వ్యవస్థ కూడా పనిచేసినట్లు లేదు. జిన్‌పింగ్‌కు మరింత ఇబ్బంది కలిగించే విషయం ఏమిటంటే, సీనియర్ అధికారులందరూ ఆయన ద్వారానే పదోన్నతి పొందారు. జనరల్ లి షాంగ్ఫు వంటి ఆయన సన్నిహిత వ్యక్తులు కూడా వారి స్థానాల నుండి తొలగించబడిన అధికారులలో ఉన్నారు. పీఎల్ఏ రాజకీయ విశ్వసనీయతను, సైద్ధాంతిక నిబద్ధతను బలోపేతం చేయడానికి ఒక కఠినమైన కేంపెయిన్ నిర్వహించనున్నారని స్పష్టం అవుతోంది. జయదేవ రానాడే వ్యాసకర్త ‘సెంటర్ ఫర్ చైనా ఎనాలిసిస్ అండ్ స్ట్రాటెజీ’ అధ్యక్షుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అబ్బే! అది ప్రజల కోసం ప్రభుత్వానికి కాదు, భారత్ సరిహద్దుల్లో మీ పని మీరు పూర్తి చేయండి!
అబ్బే! అది ప్రజల కోసం ప్రభుత్వానికి కాదు, భారత్ సరిహద్దుల్లో మీ పని మీరు పూర్తి చేయండి! -
బైడెన్‌తో జిన్‌పింగ్ భేటీ
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చైనా అధినేత షీ జిన్‌పింగ్ సమావేశానికి రంగం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన ఈ భేటీ జరుగనుంది. ఇటీవలి కాలంలో అమెరికా–చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇరువురు నాయకుల సమావేశం అవుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంబంధాలను పునరుద్ధరించుకొనే దిశగా వారిద్దరూ చర్చలు జరుపునున్నట్లు తెలుస్తోంది. ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార మండలి(ఏపీఈసీ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు జిన్‌పింగ్ మంగళవారం అమెరికా చేరుకున్నారు. ఆయన అమెరికాకు రావడం ఆరేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. -
చైనా బిగ్ ప్లాన్.. పుతిన్ మద్దతు
తాయ్ పీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా పర్యటనకు బయల్దేరారు. మంగళవారం చైనా రాజధాని బీజింగ్ చేరుకున్నారు. ఆయనకు గార్డ్ ఆఫ్ ఆనర్తో ఘన స్వాగతం లభించింది. ద్వైపాక్షిక విషయాలతో పాటు పలు ఇతర అంశాల్లో ఇరు దేశాల బంధం ఎంత పటిష్టంగా ఉందో చెప్పేందుకు ఈ పర్యటన తాజా నిదర్శనమని అంటున్నారు. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా అవి ఇప్పటికే పరోక్షంగా జట్టు కట్టడం తెలిసిందే. అందులో భాగంగా ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు చైనా మద్దతు పలుకుతోంది. విదేశాల్లో ఆర్థిక, భౌగోళిక, దౌత్యపరమైన ఆధిపత్యం సాధించేందుకు చైనా ప్రదర్శిస్తున్న దూకుడుకు రష్యా దన్నుగా నిలుస్తూ వస్తోంది. ముఖ్యంగా చైనా అధ్యక్షుడు తలపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు (బీఆర్ఐ)కు కూడా రష్యా మద్దతు పలుకుతోంది. ఆ ప్రాజెక్టులో తనకేమీ తప్పుడు ఉద్దేశాలు కనిపించడం లేదని చైనా అధికార మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ చెప్పారు కూడా. బీఆర్ఐ పదో వార్షికోత్సవానికి ఆయన హాజరవుతున్నారు. దీని ద్వారా మధ్య ఆసియాలోని మాజీ సోవియట్ యూనియన్ దేశాల మధ్య ఆర్థిక బంధం ఏర్పాటు చేయాలని ఆశాభావం వెలిబుచ్చారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగేందుకు కొద్ది వారాల ముందు కూడా పుతిన్ చైనాలో పర్యటించారు. ఇక జిన్ పింగ్ కూడా మార్చిలో రష్యాలో పర్యటించారు. ఆ దేశంపై అమెరికా, పాశ్చాత్య దేశాల ఆంక్షలను దుయ్యబట్టారు. ఇది కూడా చదవండి: గాజా ఆస్పత్రిపై భీకర దాడి -
చైనాపై నిరసనల హోరు.. జిన్‌పింగ్ దిష్టిబొమ్మ దహనం
ఇటానగర్: ఉషు ఆటగాళ్లను ఆసియా క్రీడల్లో పాల్గొనకుండా చేసినందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అరుణాచల్ ప్రదేశ్వాసులు. తమ రాష్ట్రానికి చెందిన ముగ్గురు క్రీడాకారులకు చైనా వీసాలు నిరాకరించడాన్ని నిరసించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్‌లోని లోహిత్ యూనిట్, ఆల్ అరుణాచల్ ప్రదేశ్ యూత్ ఆర్గనైజేషన్ తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ స్టూడెంట్స్ యూనియన్ సహకారంతో రాష్ట్రంలో ఆందోళన నిర్వహించారు. ముగ్గురు క్రీడాకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముగ్గురు క్రీడాకారులు ఒనిలు తేగా, నేమన్ వాంగ్సు, మెపుంగ్ లాంగులకు చైనా వీసాలను రద్దు చేయడంతో చైనాలో జరిగిన ఆసియా క్రీడలలో పాల్గొనలేకపోయారు. అరుణాచల్ ప్రదేశ్ భూభాగాన్ని తమదిగానే పేర్కొంటూ చైనా ఈ చర్యకు పాల్పడింది. అరుణాచల్‌ను ప్రత్యేక దేశంగా పరిగణించనందున వీసాలను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. తమ రాష్ట్ర ఆటగాళ్లు అవకాశం కోల్పోవడంతో అరుణాచల్ ప్రదేశ్వాసులు నిరసనలు చేపట్టారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ స్పందించారు. ఆటగాళ్లు భారత ఉషు జట్టులో పాల్గొనేవారుగానే పరిగణించబడతారని చెప్పారు. రూ.20 లక్షల ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. ఆటగాళ్ల కోచ్‌కు కూడా ప్రోత్సాహకంలో కొంత భాగం కేటాయించినట్లు సీఎం ఖండూ చెప్పారు. 2026లో టోక్యోలో జరగనున్న ఆసియా గేమ్స్‌కు అవకాశం దక్కుతుందని హామీ ఇచ్చారు. ఆటగాళ్ల భవిష్యత్‌కు తాను భరోసా ఇస్తున్నట్లు పేర్కొన్న సీఎం.. ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: కెనడా ప్రధాని క్షమాపణలు -
..ఆఫీసుల్లో ఫైళ్లు మాయమవడం చూశాగానీ మంత్రులు మాయం కావడం ఇప్పుడే చూస్తున్నాస్సార్!
..ఆఫీసుల్లో ఫైళ్లు మాయమవడం చూశాగానీ మంత్రులు మాయం కావడం ఇప్పుడే చూస్తున్నాస్సార్! -
జీ-20: కోవిడ్ కారణంగా మరో నేత మిస్.. పుతిన్, జిన్‌పింగ్ సహా..
ఢిల్లీ: రేపటి నుంచి దేశ రాజధాని ఢిల్లీలో జీ-20 సదస్సు జరుగనుంది. కాగా, కోవిడ్ కారణంగా మరో నేత జీ-20 సమావేశాలకు హాజరు కావడం లేదు. స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో జీ-20 సదస్సుకు ఆయన హాజరుకావడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీంతో, మరో కీలక నేత సమావేశాలకు దూరమయ్యారు. వివరాల ప్రకారం.. జీ-20 సమావేశాలకు స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ హాజరు కావడం లేదు. తాజాగా ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో సమావేశాలకు రావడంలేదని తెలిపారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా శాంచెజ్..‘గురువారం నిర్వహించిన కోవిడ్ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో, ఢిల్లీలో జరగబోయే జీ-20 సమావేశాలకు హాజరు కావడం లేదు. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. జీ-20 సమావేశాల్లో స్పెయిన్ తరఫున వైఎస్ ప్రెసిడెంట్ నాడియా క్వాలినో శాంటామారియా, విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బరేస్ ప్రాతినిధ్యం వహిస్తారని’ చెప్పారు. అలాగే, యూరోపియన్ యూనియన్(ఈయూ) సహకారం ఉంటుందన్నారు. Esta tarde he dado positivo en COVID y no podré viajar a Nueva Delhi para asistir a la Cumbre del G-20. Me encuentro bien. España estará magníficamente representada por la vicepresidenta primera y ministra de Asuntos Económicos y el ministro de Exteriores, UE y Cooperación. — Pedro Sánchez (@sanchezcastejon) September 7, 2023 ముగ్గురు కీలక నేతలు గైర్హాజరు.. ఇదిలా ఉండగా.. ఢిల్లీ కేంద్రంగా జరుగనున్న జీ-20 సమావేశాలకు ప్రపంచ దేశాల నుంచి నేతలు హాజరుకానున్నారు. ఇక, ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా హాజరు కావడం లేదు. తాజాగా కోవిడ్ కారణంగా స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ జీ-20 సమావేశాల్లో పాల్గొనడం లేదు. దీంతో, ముఖ్యమైన మూడు దేశాల నుంచి అధ్యక్షులు సమావేశాలకు హాజరు కావడం లేదు. ► మరోవైపు.. ప్రపంచంలోని ప్రధాన దేశాల అధినేతలు శుక్రవారం ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని తమ వాణిని వినిపించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ మొదలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వరకు పలు దేశాల నాయకగణం నేడే హస్తినకు చేరుకోనుంది. ► జీ20 సదస్సు కోసం అందరికంటే ముందే భారత్‌కు చేరుకుంటున్న కీలక నేత రిషి సునాక్. భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని అయిన సునాక్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌదరి ఈయనకు సాదర స్వాగతం పలకనున్నారు. ‘భారత్ జీ20కి సారథ్య బాధ్యతలు వహిస్తున్న ఈ ఏడాదికాలంలో భారత ప్రధాని మోదీ చేస్తున్న కృషి అమోఘం. ఆయన నాయకత్వంలో ప్రపంచ యవనికపై భారత్ సాధిస్తున్న విజయాలు అద్వితీయం’అని రిషి సునాక్ శ్లాఘించారు. ఇది కూడా చదవండి: ఇండియా-భారత్ పేరు మార్పుపై ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..? -
గైర్హాజరీ సందేశం!
అనుకున్నదే అయింది. రానున్న ‘జీ20’ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అసాధారణ రీతిలో హాజరు కాకపోవచ్చంటూ కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలు నిజమయ్యాయి. చైనా ప్రధాని లీ కియాంగ్ ఆ సదస్సుకు హాజరవుతారంటూ ఆ దేశ విదేశాంగ శాఖ సోమవారం మధ్యాహ్నం ప్రకటించింది. అధ్యక్ష, ప్రధానులిద్దరూ ఏకకాలంలో విదేశాల్లో ఉండడం, అందులోనూ ఒకే కార్యక్రమంలో ఉండడమనేది చైనా ఎన్నడూ చేయని పని గనక ‘జీ20’కి షీ గైర్హాజరు ఖాయమని తేటతెల్లమైంది. వెరసి, ‘జీ–20’ అధ్యక్ష హోదాలో భారత్ ఈ నెల 9, 10 తేదీల్లో ఆతిథ్యమిస్తున్న 18వ వార్షిక శిఖరాగ్ర సదస్సు ఇప్పుడు కొత్త కారణంతో వార్తల్లో నిలిచింది. ఇంట ఆర్థికవ్యవస్థలో ఇక్కట్లు, బయట అమెరికా – భారత్‌లతో క్షీణసంబంధాలు, పొరుగుదేశాలతో కొనితెచ్చుకున్న తగాదాల మధ్య చైనా అధినేత కావాలనే మొహం చాటేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆహ్వానించినప్పుడు వెళ్ళడానికి కొన్ని కారణాలుంటే, వెళ్ళాల్సి ఉన్నా వెళ్ళకపోవడానికి అంతకు మించే కారణాలుంటాయి. చైనా అధినేత గైర్హాజరు కథా అంతే! భారత్‌తో చైనా ద్వైపాక్షిక సంబంధాలు నానాటికీ దిగజారుతున్నాయి. లద్దాఖ్‌లో మూడేళ్ళ క్రితం సైనికుల కొట్లాట నుంచి ఇదే ధోరణి. సరిహద్దుకు ఇరువైపులా మోహరించిన సైన్యం ఉద్రిక్తతలకు అద్దంపడుతోంది. వాణిజ్యంపై విభేదాలు ఉండనే ఉన్నాయి. బద్ధశత్రువైన అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలను భారత్ పెంచు కోవడంతో డ్రాగన్‌కి పుండు మీద కారం రాసినట్టుంది. చైనాను వెనక్కినెట్టి అత్యధిక ప్రపంచ జనాభా గల దేశంగా భారత్ ఇప్పటికే ముందుకొచ్చింది. సాంకేతిక విజ్ఞానం, అంతరిక్ష శోధన, ప్రపంచ వాణిజ్యంలో పోటాపోటీ సరేసరి. ఇవి చాలదన్నట్టు ప్రామాణిక దేశపటమంటూ భారత భూభాగాల్ని కలిపేసుకున్న వక్రీకరించిన మ్యాప్‌ను చైనా తాజాగా విడుదల చేసి కొత్త రచ్చ రేపింది. చైనా అధినేత మొహం చాటేయడానికి ఇలా చాలా కారణాలే! ఈ తాజా పరిణామం చైనా – భారత సంబంధాల మెరుగుదలకు తోడ్పడదు. మరోపక్క అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో షీ సంభాషించే అవకాశం తప్పిపోతోంది. నిజానికి, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సహా పలువురు ఈ మధ్య బీజింగ్‌కు సందర్శనలు జరిపారు. అయినప్పటికీ అగ్రదేశాలైన అమెరికా, చైనాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత క్షీణించి ఉన్నాయి. గత నవంబర్‌లో ఇండొ నేషియాలోని బాలిలో జరిగిన గత ‘జీ20’ తర్వాత షీ, బైడెన్లు కలసి మాట్లాడుకున్నది లేదు. ఇప్పుడు మళ్ళీ కలసి, సంబంధాలను సరిదిద్దుకొనే అవకాశాన్ని చైనా చేతులారా జారవిడుస్తోంది. బైడెన్ సైతం ఈ పరిణామంతో నిరాశకు లోనయ్యాననడం గమనార్హం. షీ ఒక్క ‘జీ20’నే కాదు, జకార్తాలో జరగనున్న ఏషియాన్ (వాయవ్య ఆసియా దేశాల సంఘం), ఈస్ట్ ఏషియా సదస్సులూ ఎగ్గొడుతున్నారు. వాటికీ చైనా ప్రధానే హాజరు కానున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు మొత్తం 16 సార్లు భౌతికంగానూ, ఒకసారి వర్చ్యువల్‌గానూ (సౌదీ అరేబియా– 2020) జీ20 సదస్సులు జరిగాయి. వాటిలో మొదటి మూడు మినహా 2010 నుంచి ఇప్పటి వరకు ఏ ఇతర సదస్సులోనూ అన్ని దేశాల అధినేతలూ పాల్గొన్న దాఖలా లేదు. అయితే, చైనా అధినేత మాత్రం ఏ జీ20 సదస్సుకూ ఇప్పటి దాకా గైర్హాజరవలేదు. కరోనా ఆంక్షలున్న రెండేళ్ళూ వర్చ్యువల్‌గానైనా హాజరయ్యారు. గత నెల దక్షిణాఫ్రికాలో ప్రధాన వర్ధమాన ఆర్థిక వ్యవస్థల బృందమైన ‘బ్రిక్స్’ సదస్సు జరిగినప్పుడూ షీ వచ్చారు. మరి, ఇప్పుడు మాత్రం తన బదులు ప్రధానిని పంపుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన బదులు విదేశాంగ మంత్రినిపంపుతున్నట్టు ఇప్పటికే చెప్పేశారు. అధ్యక్షుడి గైర్హాజరుకు కారణాలు చైనా బయటకు చెప్పక పోయినా, ఇదంతా సహజమేనన్నట్టు భారత అధికార వర్గాలు చిత్రిస్తున్నా... విషయం మాత్రం అసాధారణమే. షీ రాజనీతి పట్ల సందేహాలు రేపుతున్నాయి. మావో తర్వాత మరే ఇతర చైనా నేతకూ లేనంతటి అధికారం షీ సొంతం. ప్రాదేశిక ప్రయో జనాల పేరు చెప్పి, తైవాన్, దక్షిణ చైనా సముద్రం సహా అన్నీ చైనావేనంటూ ఆయన అంతకంతకూ దూకుడు చూపుతున్నారు. సహజంగానే పాకిస్తాన్ లాంటి ఒకట్రెండు దేశాల్ని మినహాయిస్తే, పొరుగున మిత్రుల కన్నా ఎక్కువగా శత్రువుల్ని చేసుకున్నారు. నిజానికి, జీ20 దేశాలంటే ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బృందం. ఇంత కీలకమైనా సరే, దీని కన్నా తమ చైనా ఆధిపత్యం ఉన్న ‘బ్రిక్స్’ వగైరాల వైపే షీ మొగ్గుతున్నారనుకోవచ్చు. ఇటీవల ఆయన ప్రయాణించినదల్లా సౌదీ అరేబియా, రష్యా, సౌతాఫ్రికా లాంటి స్నేహపూర్వక స్వాగతం లభించే దేశాలకే అని విశ్లేషించవచ్చు. అటు అమెరికా, ఇటు భారత్‌లతో ఉద్రిక్తతలు తగ్గించడమూ తన షరతుల ప్రకారమే జరగాలని చూస్తున్నారనుకోవచ్చు. డ్రాగన్ బుసలు కొడుతున్నందునే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన భద్రతా కూటమి ‘క్వాడ్’లో భారత్ చేరిందని గమనించాలి. ఇక, బైడెన్‌తో ఇప్పుడు భేటీ తప్పిందంటే మళ్ళీ నవంబర్‌లో శాన్ఫ్రాన్సిస్కోలో ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు దాకా వారు కలిసే ఛాన్స్ లేదు. ప్రస్తుత చైనా వైఖరి చూస్తుంటే, అప్పుడైనా షీ హాజరవుతారన్న గ్యారెంటీ లేదు. జీ20లోనూ దేశాధి నేతలు చేయాల్సిన సమష్టి ప్రకటనకు గండికొట్టి, భారత పాలకుల విశ్వగురు ప్రచారాన్ని దెబ్బ తీశారనుకోవచ్చు. ప్రధానిని పంపుతున్నా, సదస్సులోని నిర్ణయాలకు చైనా కట్టుబడేలా చూసేందుకు సదరు వ్యక్తికి ఏపాటి అధికారం ఉంటుందో చెప్పలేం. వెరసి, షీ గైర్హాజరీ సందేశం సుదీర్ఘమైనదే! -
జీ20 సదస్సుకు జిన్‌పింగ్ స్థానంలో చైనా ప్రీమియర్
బీజింగ్: భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మంకంగా నిర్వహిస్తోన్న జీ20 సమావేశాలకు చైనా అధ్యక్షుడి స్థానంలో ఆ దేశ ప్రీమియర్ హాజరు కానున్నట్లు తెలిపింది చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 సదస్సుకు హాజరు కావడం లేదని మొదట రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించగా ఆయనను అనుసరిస్తూ చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ స్పోక్స్‌పర్సన్ మావో నింగ్ కీలక ప్రకటన చేశారు. మావో నింగ్ మాట్లాడుతో.. భారత్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనున్న 18వ జీ20 సమావేశాలకు చైనా ప్రీమియర్ లీ కియాంగ్ హాజరవుతారని అన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశాల్లో రెండు దేశాల దౌత్యపరమైన సంబంధాల విషయమై ఏకాభిప్రాయాన్ని సాధించి అభివృద్ధికి దోహద పడతామని అన్నారు. రెండు దేశాల సంబంధాలకు చైనా ఎప్పుడూ అధిక ప్రాధాన్యతనిస్తూనే వచ్చిందని దీనికి సంబంధించి జరిగిన అనేక సమావేశాల్లో కూడా తాము చురుగ్గా పాల్గొన్నామని గుర్తు చేశారు. ముఖ్యంగా ఈ సమావేశాల్లో సమాఖ్య దేశాల ఐక్యతను బలోపేతం చేసి ప్రపంచ ఆర్ధికాభివృద్ధికి మిగతా దేశాలతో కలిసి పనిచేసే విషయమై చైనా ప్రీమియర్ లీ కియాంగ్ చైనా అభిప్రాయాలను వెల్లడిస్తారని తెలిపారు మావో నింగ్. స్థిరమైన ప్రపంచ ఆర్ధిక పునరుద్ధరణ, సుస్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించేందుకు మిగతా జీ20 భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తామని ఈ సమావేశాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఇది కూడా చదవండి: ఆకాశంలో అద్భుతం.. ఆకుపచ్చ కాంతిలో ఉల్కపాతం -
జీ 20 సదస్సుకు జిన్‌పింగ్ గైర్హాజరు.. స్పందించిన బైడెన్
భారత్ అధ్యక్షతన ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో ప్రతిష్టాత్మక జీ20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశాలు జరిగే దేశ రాజధానిలో భారత్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. జీ 20 సభ్య దేశాల అధినేతలతోపాటు ఇతర దేశాల అగ్రనేతలు సైతం హాజరుకానున్న నేపథ్యంలో వారికి కావాల్సిన ఏర్పాట్లు, సౌకర్యాలను పకడ్బందీగా చేపట్టింది. ఈ సదస్సుకు తాను రాలేకపోతున్నానని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే పేర్కొన్నారు. ఆయన తరపున రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరుకానున్నారు. అలాగే చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సైతం గర్హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ మధ్య చైనాతో సరిహద్దు వివాదం తెరపైకి రావడంతో జిన్‌పింగ్ జిన్‌పింగ్ రాకపై సందిగ్ధం నెలకొంది. అంతేగాక ఆయన స్థానంలో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లో అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ.. భారత్‌లో జరిగే జీ20 నేతల శిఖరాగ్ర సమావేశానికి జిన్‌పింగ్ రావడం లేదనే వార్తలు విని కలత చెందినట్లు తెలిపారు. ‘ చైనా అధ్యక్షుడు సదస్సుకు రాకపోవడం నిరాశకు గురి చేసింది. అయినా ఆయన్ను నేను త్వరలోనే చూడబోతున్నాను’ అని పేర్కొన్నారు. చదవండి: కరోనాకు మించిన విపత్తు: రాబోయే ఏళ్లలో 100 కోట్లమంది మృతి? అయితే బైడెన్ చైనా అధ్యక్షుడిని ఎక్కడ కలవబోతున్నారనేది మాత్రం వెల్లడించలేదు. ఒకవేళ జిన్‌పింగ్ ఢిల్లీ రాకపోతే.. నవంబర్‌లో అమెరికా అతిథ్యం ఇస్తున్న శాన్ఫ్రాన్సిస్కోలో జరిగే APEC సమావేశంలో వీరిరువురూ కలుసుకునే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సదస్సుకు రెండు రోజుల ముందే అంటే సెప్టెంబర్ 7నే భారత్‌కు రానున్నారు. ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 9, 10 తేదీల్లో జీ20 సదస్సులో పాల్గొంటారు. వాతావరణ మార్పులు, క్లీన్ ఎనర్జీ వంటి అంశాలతోపాటు ఉక్రెయిన్ సంక్షోభం వంటి అంతర్జాతీయ సమస్యలపై ఈ సందర్భంగా సభ్య దేశాల ప్రతినిధులతో చర్చిస్తారు. అనంతరం బైడెన్.. వియత్నాం పర్యటకు వెళ్తారు ఇక భారత్‌లో పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు బైడెన్ తెలిపారు. తనకు మరికొంత సమన్వయం కావాలి. భారత్, వియత్నాం రెండూ యూఎస్‌తో చాలా సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నారని, అది చాలా తమకు కూడా సహాయకారిగా ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
అక్రమంగా వాళ్ల ప్రాంతాలు మన మ్యాప్‌లో చేర్చడం ఎందుకూ..
అక్రమంగా వాళ్ల ప్రాంతాలు మన మ్యాప్‌లో చేర్చడం ఎందుకూ.. భయపడి వెళ్లకుండా ఉండటమెందుకు.. సార్! -
జీ20 శిఖరాగ్ర సదస్సుకు జిన్‌పింగ్ గైర్హాజరు!
న్యూఢిల్లీ: జీ20 దేశాల అధినేతల ముఖ్యమైన శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరవుతారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ నెల 9, 10న ఢిల్లీలో ఈ సదస్సు జరుగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్, యూకే ప్రధానమంత్రి రిషి సునాక్ సహా వివిధ దేశాదినేతలు హాజరు కానున్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశం లేదని మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. బదులుగా ప్రధానమంత్రి లీ కియాంగ్ రావొచ్చని తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ çకూడా సదస్సుకు రావడం లేదు. -
Arunachal Pradesh: మ్యాపులతో మడతపేచీ
నోటితో మాట్లాడుతూ, నొసటితో వెక్కిరించడమంటే ఇదే. భారత్‌తో స్నేహసంబంధాలకు కట్టుబడి ఉన్నట్టు తీయటి కబుర్లు చెప్పే చైనా తన వక్రబుద్ధిని మరోసారి వెల్లడించుకుంది. సోమవారం నాడు సరికొత్త అధికారిక ‘ప్రామాణిక పటం’– 2023 విడుదల చేస్తూ, అందులో భారత్‌లోని పలు ప్రాంతాల్ని తమ దేశంలో భాగమన్నట్టు చూపింది. భారత ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్‌చిన్‌లను తన భూభాగాలంటోంది. మొత్తం తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని కూడా ఈ కొత్త జాతీయ పటంలో తమ అంతర్భాగమనేందుకు చైనా తెగించింది. దాదాపు పొరుగు దేశాలన్నిటికీ కోపం తెప్పించడమే కాక, మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. పైపెచ్చు, అంతా సవ్యంగానే ఉన్నదన్నట్టు ‘‘జాతీయ సరిహద్దులను గీయడంలో చైనాతో పాటు వివిధ దేశాలు ఉపయోగించే పద్ధతి ఆధారంగా’’నే ఈ పటాన్ని రూపొందించినట్టు డ్రాగన్ ప్రకటించుకోవడం విచిత్రం. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ ఖండిస్తుంటే, బీజింగ్ మాత్రం మ్యాప్‌ల విడుదల నిత్య కృత్యమేననీ, దీనిపై అతి చేయద్దనీ విషయతీవ్రతను తక్కువ చేసి చెబుతుండడం మరీ విడ్డూరం. చెప్పేదొకటి చేసేదొకటి జిత్తులమారి చైనా నిత్యకృత్యం. అందుకే, ఈ వ్యవహారాన్ని భారత్ తీవ్రంగా తీసుకోక తప్పదు. వారం క్రితం జొహాన్నెస్‌బర్గ్‌లో ‘బ్రిక్స్’ సదస్సు జరిగినప్పుడు భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు సమావేశమై సంభాషించుకున్నారు. సరిహద్దుల వద్ద పరిస్థితిని చక్కదిద్ది, సత్సంబంధాలకు కృషి చేయాలని చర్చించుకున్నారు. మరోపక్క ఈ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే ‘జీ–20’ శిఖరాగ్ర సదస్సుకూ చైనా అధినేత హాజరు కావాల్సి ఉంది. సరిగ్గా ఈ సమయంలో ఉరుము లేని పిడుగులా డ్రాగన్ దేశ సరిహద్దులు ఈ ‘వక్రీకరించిన’ పటంతో బాంబు పేల్చింది. గమనిస్తే మన ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెడుతూ, మునుపటి పటంలోనూ చైనా ఇదే తెంపరితనం చూపింది. ఆ దేశ పశ్చిమ హద్దుల్లో ఉన్న ప్రాంతాలను తనవిగా చెప్పుకొంది. అక్సాయ్‌చిన్ 1950–60ల నుంచి మన కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో భాగం. 1962 యుద్ధంలో చైనా దాన్ని ఆక్రమించుకుంది. అరుణాచల్నేమో దశాబ్దాలుగా తమ దక్షిణ టిబెట్లోది అంటోంది. ఆ రెండూ భారత అంతర్భాగాలని మన ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా, తన మూర్ఖవాదన కొనసాగిస్తోంది. పటంలోని అంశాలు అంతర్జాతీయ అంగీకృత సరిహద్దులను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌ను ‘జంగ్నాన్’ (దక్షిణ టిబెట్) అని పిలుస్తూ, అది తమదేననడం బీజింగ్ సిగ్గు మాలినతనం. చరిత్ర చూస్తే టిబెట్‌కూ, బ్రిటీషు ఇండియాకు మధ్య 1914లో సిమ్లా సమావేశం జరిగింది. అప్పుడే సరిహద్దుగా మెక్‌మోహన్ రేఖను అంగీకరించాయి. చైనా చేస్తున్న ప్రకటనలు, చూపుతున్న పటం ఆ అంగీకరించిన సరిహద్దు రేఖ చట్టబద్ధతను ఉల్లంఘించడమే! అలాగే, ద్వీప దేశమైన తైవాన్ ఏడాదిపైగా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నా, పట్టువదలని బీజింగ్ ‘వన్ చైనా విధానం’ అంటూ దాన్ని తమ పటంలో చూపడం దురహంకారం. ఇక, పసిఫిక్, హిందూ మహాసముద్రాలకు ప్రధాన నౌకాయాన అనుసంధానమైన దక్షిణ చైనా సముద్ర ప్రాంతం సైనిక, వాణిజ్యపరంగా అతి కీలకం. వివాదాస్పద ద్వీపాలతో సహా ఈ ప్రాంతమంతా చైనా తమ పటంలో కలిపేసుకుంటోంది. ఈ ప్రాంతంలో డ్రాగన్ సామ్రాజ్యవాద విస్తరణ వైఖరిని ఫిలిప్పీన్స్, వియత్నామ్, మలేసియా, జపాన్ తదితర దేశాలు పదే పదే ఎత్తిచూపుతున్నాయి. అయినా అది తన తీరు మార్చుకోలేదు. భౌతికంగా తన అధీనంలో లేకున్నా ఈ ప్రాంతాలు తనవేననడం చిరకాలంగా చైనా చూపుతున్న మొండివైఖరే. తాజా పటం జారీ వల్ల దానికి కొత్తగా కలిసొచ్చేదేమీ లేదు. పైగా, మిగతా ప్రపంచపు సహాయం, సానుభూతి కూడా దక్కవు. అయినా సరే, డ్రాగన్ తన దురహంకారాన్ని చాటుకోవడం గమనార్హం. ఒక్కమాటలో చైనా అధినేత షీ జిన్‌పింగ్ సామ్రాజ్యవాద విస్తరణ వైఖరికి ఈ కొత్త మ్యాప్ ప్రతీక. అధికారిక జాతీయ పటాల జారీ చైనాలో దాదాపు ఏటా జరిగే తంతు అయినా... భారత్ వరకు తీసుకుంటే చంద్రయాన్–3 విజయం, రానున్న జీ–20 సదస్సు నేపథ్యంలో ఇప్పుడీ పటాన్ని ఎందుకు విడుదల చేసినట్టు? ఇరుదేశాల మధ్య ఇలాంటి సరిహద్దు వివాదాలే గతంలోనూ సైనిక ప్రతిష్టంభనకు దారితీశాయి. 2017లో తలెత్తిన డోక్లామ్ సంక్షోభం, 2020లో గల్వాన్ లోయలో సైనిక ఘర్షణలే తాజా ఉదాహరణలు. దీంతో దౌత్య సంబంధాలూ దెబ్బతింటున్నాయి. బలగాల్ని వెనక్కి పిలిచి, ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించుకోవాల్సిన వేళ ఇలాంటి తప్పుడు పటం సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ఏ రకంగానూ దోహదపడదు. ఇప్పటికే లద్దాఖ్‌లోని కొంత భాగాన్ని చైనా ఆక్రమించేసుకుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. వివిధ విదేశీ సర్వేలు, ఉపగ్రహ ఛాయాచిత్రాలు సైతం భారత సరిహద్దులో చైనా వివాదాస్పద నిర్మాణాల్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అనుమానాలు పోగొట్టేలా మన పాలకులు వాస్తవాలను వెల్లడించాలి. నమ్మడానికి వీల్లేని పొరుగుదేశంతో నిక్కచ్చిగానే వ్యవహరించాలి. సార్వభౌమాధికారం, సమగ్రతల్లో రాజీ లేదని మాటల్లో కన్నా చేతల్లో చూపాలి. జీ–20 అధ్యక్షతతో విశ్వగురువులయ్యామని సంబరపడేకన్నా, అంతర్గత ఘర్షణలున్న అన్ని పక్షాలనూ అర్థవంతమైన సమగ్ర చర్చలతో ఒక తాటిపైకి తేవడమే అసలు విజయమని గ్రహించాలి. చైనాతో సంభాషణకు అన్ని మార్గాల్నీ అన్వేషిస్తూనే, మనకున్న ఆందోళనల్ని కుండబద్దలు కొట్టాలి. అవకాశాన్ని బట్టి అందుకు రానున్న జీ–20ను సైతం వేదికగా చేసుకోవాలి. దౌత్య, వాణిజ్య సంబంధాల మెరుగు దలకు సరిహద్దుల్లో సామరస్య వాతావరణం కీలకమని మరోసారి అందరికీ తలకెక్కేలా చూడాలి. -
బ్రిక్స్ మీటింగ్‌లో జిన్‌పింగ్‌కు అనుకోని ఘటన..
జోహెన్నస్‌బర్గ్: జోహెన్నస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అయోమయ ఘటన ఎదురైంది. సమావేశానికి హాజరయ్యే క్రమంలో జిన్‌పింగ్ సెక్యూరిటీని అడ్డుకున్నారు అక్కడి భద్రతా సిబ్బంది. తన వెనక ఏం జరిగిందో తెలియని జిన్‌పింగ్ సందేహాంగా వెనక్కి ముందుకు చూస్తూ వెళ్లారు. బ్రిక్స్ మీటింగ్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన భేటీ జరిగే సెంట్రల్ హాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన వెనకే కొద్ది దూరంలో వస్తున్న వ్యక్తిగత సిబ్బంది వస్తున్నారు. జిన్‌పింగ్ హాల్లోకి అడుగుపెట్టగానే ఆయన్ని వెనకే వెళ్లాలనుకున్న పర్సనల్ సెక్యూరిటీ వేగంగా వచ్చారు. జిన్‌పింగ్ వ్యక్తిగత సిబ్బంది నడక కాస్త అనుమానంగా ఉండే సరికి.. అక్కడి సెక్యూరిటీ వారిని అడ్డగించారు. వెంటన్ డోర్లు మూసుకుపోయాయి. వెనక ఏం జరిగిందో తెలియని జిన్‌పింగ్.. వెనకకు ముందుకు చూస్తూ వెళ్లారు. South African Security Officers physically stop Chinese Officials from entering BRICS main venue behind Xi Jinping. Forcibly shut the door.🤣🤣🤣#Prigojine #Prigozhin #republicanDebate #Wagner #BRICSSummit2023 #XiJinping #BRICS #BRICSSummit2023 #BRICSSummit #ChinaNews #China pic.twitter.com/dY4CgLZadq — Mr. R V (@Havoc3010) August 24, 2023 ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జిన్‌పింగ్‌కు అయోమయ పరిస్థితి ఎదురైందని నెటిజన్లు కామెంట్ పెట్టారు. అయితే.. దక్షిణాఫ్రికా జోహెన్నస్‌బర్గ్ వేదికగా 15వ బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ, జిన్‌పింగ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇదీ చదవండి: వీడియో: బ్రిక్స్‌లో జిన్‌పింగ్, మోదీ ముచ్చట్లు.. కరచలనం