బెదిరింపులకు భయపడం..తైవాన్‌పై మా నిర్ణయం మారదు | Xi Jinping warns against foreign bullying as China marks party centenary | Sakshi
Sakshi News home page

బెదిరింపులకు భయపడం..తైవాన్‌పై మా నిర్ణయం మారదు

Published Fri, Jul 2 2021 4:58 AM | Last Updated on Fri, Jul 2 2021 7:38 AM

Xi Jinping warns against foreign bullying as China marks party centenary - Sakshi

ప్రసంగిస్తున్న జిన్‌పింగ్‌

బీజింగ్‌: చైనాను బెదిరించాలనుకునే విదేశీ శక్తులు 140 కోట్ల దేశ ప్రజలు, శక్తిమంతమైన దేశ మిలటరీలతో కూడిన ‘గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ స్టీల్‌’ను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ హెచ్చరించారు. అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ వందేళ్ల పండుగ సందర్భంగా చైనాను వ్యతిరేకించే దేశాలకు జిన్‌పింగ్‌ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కమ్యూనిస్ట్‌ పార్టీ శతవార్షిక ఉత్సవాలను గురువారం ప్రతిష్టాత్మక తియానన్మెన్‌ స్క్వేర్‌ వద్ద ఘనంగా నిర్వహించారు.

చైర్మన్‌ మావో జెడాంగ్‌ భారీ చిత్రపటం నేపథ్యంలో.. తియానన్మెన్‌ గేట్‌ బాల్కనీ నుంచి వేలాది దేశభక్తులను ఉద్దేశించి జిన్‌పింగ్‌ ప్రసంగించారు. చైనాలో తైవాన్‌ పునఃవిలీనం తమ చరిత్రాత్మక లక్ష్యమని, ఆ లక్ష్య సాధనకు కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా(సీపీసీ) కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకంగా అమెరికా పేరును ప్రస్తావించకుండా.. చైనాను భయపెట్టే అవకాశం ఏ విదేశీ శక్తికి ఇవ్వబోమని సీపీసీ ప్రధాన కార్యదర్శి, సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ చైర్మన్‌ కూడా అయిన జిన్‌పింగ్‌ పేర్కొన్నారు.

ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఆధిపత్య చర్యలకు పాల్పడుతోందని అమెరికా సహా ఇండో పసిఫిక్‌ దేశాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా గత అధ్యక్షుడు ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ చైనాతో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించడం, ఆ దిశగా వాణిజ్య ఆంక్షలు విధించడంతో పాటు, మానవహక్కులు, కరోనా పుట్టుక.. తదితర అంశాలపై చైనాను విమర్శించడం తెలిసిందే. ‘విదేశాల బెదిరింపులకు భయపడం. మనం ఇంతవరకు ఏ దేశాన్ని భయపెట్టలేదు.. అణచివేయలేదు.. వేధించలేదు. ఇకపై కూడా అలా చేయబోం. అలాగే, ఏ దేశం కూడా మనల్ని భయపెట్టే, అణచివేసే, వేధించే చర్యలకు పాల్పడితే సహించబోం’ అని జిన్‌పింగ్‌ తేల్చిచెప్పారు.

3ఒకవేళ ఏ దేశమైనా అందుకు తెగిస్తే.. 140 కోట్ల మందితో కూడిన గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ స్టీల్‌ను ఢీ కొనాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రత్యక్ష ప్రసారమైన ఈ కార్యక్రమంలో దాదాపు 70 వేల మంది పార్టీ కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే, కార్యక్రమంలో అత్యాధునిక జే 20 ఫైటర్‌ జెట్స్‌ సహా 71 యుద్ధ విమానాలు సాహసోపేత విన్యాసాలు చేశాయి. ఉత్సవాల్లో మాజీ అధ్యక్షుడు హు జింటావో, మాజీ ప్రధాని వెన్‌ జియాబావో సహా సీనియర్‌ పార్టీ నేతలు పాల్గొన్నారు. పార్టీలో మావో తరువాత ఆ స్థాయి శక్తిమంతమైన నేతగా జిన్‌పింగ్‌ ఎదిగారు. పార్టీ శతవార్షిక ఉత్సవాల్లో 100 ఏళ్ల క్రితం పార్టీ వ్యవస్థాపకుడు మావో తరహాలో గ్రే కలర్‌  సూట్‌ను ధరించి జిన్‌పింగ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తైవాన్‌ విలీనంపై రెండో ఆలోచన లేదని ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. ‘దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుకునే విషయంలో దేశ ప్రజల ప్రతిన, పట్టుదల, అసాధారణ సామర్ధ్యాలను ఎవరూ తక్కువగా అంచనా వేయవద్దు’ అని వ్యాఖ్యానించారు. తైవాన్‌ను స్వతంత్ర దేశంగా ఆ దేశస్తులు భావిస్తారు. కానీ చైనా మాత్రం అది చైనా భూభాగమేనని వాదిస్తోంది. ఒకవేళతైవాన్‌ను ఆక్రమించుకోవాలని చైనా ప్రయత్నిస్తే.. తైవాన్‌కు మిలటరీ సాయం అందించాలని అమెరికా చట్టాల్లోనే ఉంది. రెండు పర్యాయాలు మాత్రమే దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న నిబంధనను తొలగిస్తూ రాజ్యాంగ సవరణ చేసి, నచ్చినంత కాలం అధ్యక్షుడిగా ఉండేలా జిన్‌పింగ్‌ ఏర్పాట్లు చేసుకున్న విషయం తెలిసిందే. చైనా సాయుధ దళాలను ఆధునీకరించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాల్సి ఉందని జిన్‌ పింగ్‌ పేర్కొన్నారు. సాయుధ దళాలను అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో ఆధునీకరిస్తామన్నారు.

కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనాను 1921 జులై 1 న మావో ప్రారంభించారు. 1949లో పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా ఏర్పడినప్పటి నుంచి సీపీసీ అధికారంలో కొనసాగుతోంది. సీపీసీని చైనా ప్రజల నుంచి దూరం చేయడానికి జరిగిన ప్రయత్నాలన్నీ విఫలమవడం ఖాయమని ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు. 95 లక్షల మంది పార్టీ సభ్యులు, 140 కోట్ల దేశ ప్రజలు ఆ పరిస్థితిని రానవ్వరన్నారు. సీపీసీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే వైరస్‌లను ఏరివేస్తామని, పార్టీలో అసమ్మతిపై పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, హాంకాంగ్‌లో చైనా నేషనల్‌ సెక్యూరిటీ చట్టాన్ని అమలు చేయడాన్ని జిన్‌పింగ్‌ సమర్థ్ధించారు. ‘మనకు చెప్పే హక్కు తమకే ఉందని భావించే వారి నీతులను వినే ప్రసక్తే లేదు’ అని అమెరికాపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థి క వ్యవస్థపై మాట్లాడుతూ.. మైలురాళ్ల వంటి సంస్కరణలతో కేంద్రీకృత ఎకానమీని సోషలిస్ట్‌ మార్కెట్‌ ఎకానమీగా విజయవంతంగా మార్చగలిగామని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement