ఎడతెగని చర్చలు జరుగుతున్నాయంటే, అయినా కనుచూపుమేరలో పరిష్కారం కానరా లేదంటే... కనబడని కారణాలేవో అడ్డుపడుతున్నాయని అర్థం. సమస్య తీవ్రంగా ఉన్నదని తాత్పర్యం. ఈనెల ప్రారంభంనుంచి అమెరికా–చైనాలమధ్య భిన్న అంశాలపై చర్చోపచర్చలు సాగుతూనే వున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌లు నేరుగా ఫోన్‌లో సంభాషించుకున్నారు. నాలుగు నెలలక్రితం తొలిసారి మాట్లాడుకున్న ఈ నేతలిద్దరూ మళ్లీ మాట్లాడుకోవాల్సిన పనిబడటం గమనించదగిందే.
వారం తిరగకుండానే అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ ఎలెన్ చైనా సందర్శనకొచ్చి ప్రధాని లీ కియాంగ్‌తోపాటు చైనా ఉన్నత స్థాయి అధికారులను కలిసి మాట్లాడారు. అంతకుమునుపే ఇరు దేశాల ఉన్నతాధికారులు నాలుగు రోజులపాటు చర్చించుకున్నారు. త్వరలోనే అమెరికా విదేశాంగమంత్రి ఆంథోనీ బ్లింకెన్ చైనా వెళ్లబోతున్నారు. ఇలా సంభాషణల పరంపర కొనసాగుతున్నది గానీ పరిష్కారం కానరావటం లేదు. వీటికి సమాంతరంగా చైనాను కట్టడి చేసే ఇండో–పసిఫిక్ వ్యూహంలో భాగంగా 2021లో రూపుదిద్దుకున్న సైనిక సహకార సంస్థ ‘ఆకస్’ కార్యకలాపాలు చురుకందు కున్నాయి.
ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ రక్షణమంత్రులు ఇటీవల భేటీ అయ్యారు. ఇందులో మనదేశాన్ని కూడా చేర్చు కోవాలని అమెరికా తహతహలాడుతున్నా ఎలాంటి సైనిక ఒడంబడికల్లోనూ భాగం కారాదన్న విధానానికే ఇంతవరకూ మన దేశం కట్టుబడివుంది. మొదట్లో పెద్దగా ఆసక్తి చూపని జపాన్ మాత్రం చేరే అవకాశం ఉందంటున్నారు. అలాగని మన దేశం మౌనంగా ఏమీ లేదు.
దక్షిణ చైనా సముద్రంలో చైనానుంచి తరచు బెదిరింపులు ఎదుర్కొంటున్న ఆగ్నేయాసియా దేశాలకు మద్దతుగా నిలుస్తామని చాటుతూనేవుంది. ఇటీవల చైనా గస్తీ నౌకలు చేసిన దాడుల్లో ఫిలిప్పీన్స్ వాణిజ్య నౌకలు రెండు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవలే ఆ దేశాన్ని సందర్శించి అండగా వుంటామని ప్రకటించారు. దక్షిణ చైనా సముద్రంలో 90 శాతం తన సొంతమని చైనా చెప్పుకుంటోంది. నిరంతర గస్తీ కాస్తోంది. సమస్యేమంటే ప్రపంచ సముద్ర ఉత్పత్తుల వాణిజ్యంలో 60 శాతం దక్షిణ చైనా సముద్రం వైపే సాగుతోంది.
అంతర్జాతీయంగా చైనాను కట్టడి చేయటమే అత్యవసరమని భావిస్తున్న అమెరికాకు రష్యా దూకుడు ఊహించని పరిణామం. రెండేళ్ల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం ప్రారంభించాక దృష్టి అటువైపు మళ్లింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలందించటం ద్వారా రష్యాను దారికి తేవొచ్చని భావించిన అమెరికాకు నిరాశే ఎదురైంది. రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలు సైతం ఆశించినంత ఫలితాన్నివ్వలేదు. రష్యాకు ఇరాన్ నుంచి డ్రోన్‌లు అందుతున్నాయి. ఎడాపెడా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవటం ద్వారా రష్యాకు చైనా అండగా నిలుస్తోంది.
ఉత్తర కొరియా సైతం చైనా ద్వారా రష్యాకు సహాయసహకారాలందిస్తోందని అమెరికా భావిస్తోంది. ఇటు ఇజ్రాయెల్ దుందుడుకుతనంతో గాజా మండుతోంది. ఇజ్రాయెల్‌ను ఎలాగైనా దారికి తేవా లన్న బైడెన్ ఎత్తుగడలు ఫలించటం లేదు. కనుకనే దౌత్యరంగంలో వున్నంత దూకుడు రక్షణరంగంలో కనబడటం లేదన్నది బైడెన్‌పై వున్న ప్రధాన విమర్శ. ఈ ఏడాది చివర అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నందున ఈ విమర్శలు బైడెన్‌ను కలవరపెడుతున్నాయి. పర్యవసానంగా చైనాతో చర్చోప చర్చలు సాగుతున్నాయి. వాణిజ్యపరంగా అమెరికాకు మరో ప్రత్యేక సమస్య కూడా వుంది.
అంతర్జాతీయ మార్కెట్‌లోకి అపరిమితంగా వచ్చిపడుతున్న చైనా ఎలక్ట్రిక్ కార్లు, సౌరశక్తి ప్యానెళ్లు, ఇతర ఉపకరణాలు అమెరికాకు తలనొప్పి తెస్తున్నాయి. వాటివల్ల అమెరికా ఉత్పత్తులు అమ్ముడుకావటం కష్టమవుతోంది. అమెరికా పరిశ్రమలు సంక్షోభంలో పడుతున్నాయి. ఈ నెల మొదట్లో జో బైడెన్, షి జిన్‌పింగ్ మధ్య ప్రధానంగా తైవాన్, దక్షిణ చైనా సముద్రం అంశాలపై చర్చలు నడిస్తే... చైనా తమ వాణిజ్య దూకుడుకు కళ్లెం వేయటంపై జానెట్ ఎలెన్ ప్రధాని లీ కియాంగ్‌తో చర్చించారు.
దీన్ని ఆపకపోతే మరో మూడేళ్లలో అవసరానికి మించి ఏటా 50 లక్షల నుంచి కోటి ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌కొస్తాయన్నది అమెరికా అంచనా. కృత్రిమ మేధ, సెమీ కండక్టర్ తదితర అంశాల్లో తమ ఎదుగుదలను నిరోధించేలా అమెరికా వ్యవహరిస్తున్నదని చైనా ఆరోపణ. కనుకనే ఇరుదేశాల ఉన్నతాధికారులమధ్యా వరసగా నాలుగురోజులపాటు చర్చలు సాగినా... నేరుగా ఎలెన్, లీ కియాంగ్‌లు సంభాషించుకున్నా పరిష్కారం దొరకలేదు.
చిత్రమేమంటే అమెరికా, చైనాల మధ్య అనేక అంశాల్లో తీవ్ర విభేదాలున్నా వాణిజ్యపరంగా ఆ రెండు దేశాలూ పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడక తప్పని స్థితి. అందుకే ఇండో–పసిఫిక్ అంశంలో దూకుడుగా వున్నట్టు కనిపిస్తున్నా వాణిజ్య సమస్యలపై ఏదోవిధంగా చైనాను దారికి తెచ్చుకోవాలని అమెరికా తాపత్రయపడుతోంది. ట్రంప్ హయాంలో చైనాపై విధించిన ఆంక్షల్లో చాలా భాగం బైడెన్ కొనసాగించారు.
వీటికి మరిన్ని జోడిస్తానన్న బైడెన్ హెచ్చరికలు ఆచరణలోకి రాకపోయినా అవసరాన్నిబట్టి అప్పుడప్పుడు సడలింపు వైఖరితో ఉన్నామన్న సంకేతాలు రెండు దేశాలూ ఇస్తున్నాయి. ఎలాంటి సమస్యలకైనా ఓర్పుగా సాగించే సంభాషణలు పరిష్కారాన్ని చూపుతాయి. ఘర్షణల నివారణ ఎప్పుడూ మంచిదే. ఎందుకంటే ఘర్షణలవల్ల అంతిమంగా విధ్వంసం తప్ప మరేమీ మిగలదు. అయితే ఏ చర్చలైనా నిర్మాణాత్మకంగా వుండాలి. చిత్తశుద్ధితో సాగాలి. లేనట్టయితే నిష్ఫలమవుతాయి.
అమెరికా–చైనా చర్చలపర్వం
Published Thu, Apr 11 2024 12:44 AM | Last Updated on Thu, Apr 11 2024 12:44 AM
Comments
Please login to add a commentAdd a comment