చెట్లు కుములుతున్న దృశ్యం | Sakshi Editorial On Trees and Nature | Sakshi

చెట్లు కుములుతున్న దృశ్యం

Apr 7 2025 1:01 AM | Updated on Apr 7 2025 4:03 AM

Sakshi Editorial On Trees and Nature

నగరం అప్పుడప్పుడే మేలుకుంటున్న వేళ డాబా మీదికి వెళ్ళి చూడండి: ఎప్పుడు మేలుకున్నాయో తెలియదు, ఎలా వచ్చాయో తెలియదు, చుట్టూ ఉన్న పెద్ద పెద్ద చెట్ల మీద, చిన్న చిన్న మొక్కల మీద, ఎక్కడబడితే అక్కడ చిన్నాపెద్దా పక్షులు, రంగురంగుల బుల్లి బుల్లి పిట్టలు! అవి నిర్విరామంగా కిచకిచల ధ్వనులు చేస్తూనే ఉంటాయి. అవి వాటితో అవి మాట్లాడుకోవడం; ఒకరి ఉల్లాసాన్ని ఒకరు పంచుకోవడం; కొమ్మమీంచి కొమ్మకు, ఆకుమీంచి ఆకుకు గెంతుతాయి,మందారపుష్పాల మెత్తని కేసరకాండాన్ని పట్టుకుని ఊగుతాయి. 

అది వాటి క్రీడావినోదం. అది కూడా కాసేపే! ఉషఃకాలపు పిల్లగాలులు చల్లచల్లగా వీస్తున్నప్పుడు, సూర్యుడు పూర్తిగా పొడుచుకు రానప్పుడు, పరిసరాలు వేడెక్కనప్పుడు, మరీముఖ్యంగా మానవ సంచారం మొదలవనప్పుడు! ఆ తర్వాత అవి అదృశ్యం! ఎక్కడికెడతాయో తెలియదు, రోజంతా ఎక్కడుంటాయో తెలియదు! 

వాటి గురించి ఎప్పుడైనా క్షణకాలం ఆలోచించి చూడండి, అప్పుడేమనిపిస్తుంది? బహుశా, ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం మానవ ధూర్తరాష్ట్రులతో ఆడిన జూదంలో ఓడిపోయి జనారణ్యంగా మారిన తమదైన అరణ్యంలోనే అజ్ఞాతవాసం చేస్తున్న పాండవుల అనంత సంతతి కాదుకదా అనిపిస్తుంది. అవి రోజూ పొద్దుటే కాసేపు తమ కొమ్మల మీద, తమ ఆకుల మధ్య ఇంద్రధనువుల్ని ఆవిష్కరిస్తూ కోలాహలంగా తిరుగుతూ ఉంటే ఆ చెట్లకెంత సంబరం! 

ఆ చెట్లూ, పిట్టలూ ప్రకృతి చరిత్ర పుటల్లోని తమ గురించిన అధ్యాయాలను మనిషి నిర్దాక్షిణ్యంగా చెరిపేసి పూర్తిగా సొంత అధ్యాయాలతో నింపేసుకున్న తర్వాత, కేవలం ప్రాచీన స్మృతులుగా మారిన తమ అనుబంధం గురించిన ఊసులు ఆ కాసేపూ నెమరేసుకుంటాయి కాబోలు! పక్షులతో పోల్చితే చెట్ల పరిస్థితి మరీ ఘోరం. అవి ఎగరనూ లేవు, ఆపైన వాటివి భారీకాయాలు కనుక అజ్ఞాతవాసయోగం కూడా వాటికి లేదు. తమ కొమ్మల మీద, తమ వేళ్ళ మీద మనిషి గొడ్డలి వేటు ఏ క్షణంలో పడుతుందో నన్న నిత్యభయగ్రస్త జీవితాన్ని నిలువు కాళ్ళమీద గడపక తప్పదు. 

చెట్లు కూలుతున్న దృశ్యం గురించి, రాక్షసుని వెన్నెముకపై ప్రతిష్ఠించిన నగరం గురించి, నగరంలో మనిషి కంటక శరీరుడిగా మారడం గురించి, సర్వత్రా వినిపించే కఠోర శబ్దాలు,ధ్వంసక్రీడ, దగ్ధక్రీడల గురించి, పూల చెట్లు విలపించడం గురించి, నిద్రలో నడుస్తున్న మనిషి నెత్తుటి మడుగును దాటలేడని చెప్పి అవి శపించడం గురించి– కవి అజంతా రాస్తాడు. అవును, నిజమే, నిద్రలో నడుస్తున్న మనిషి ప్రకృతిలోని సమస్త జీవజాలం మనుగడనూ నెత్తుటి మడుగు చేశాడు, తను సృష్టించిన ఆ మడుగును తను కూడా దాటలేని పరిస్థితిని తెచ్చుకుంటూనే ఉన్నాడు. 

ఒకప్పుడంతా అడవేనన్న సంగతి మరచిపోయి, నగరమే నిత్యమూ, సత్యమనే భ్రమలో పడిపోయాడు. చెట్లను కూల్చడం, వాటిని ఆశ్రయించుకున్న జీవజాలానికి నిలువనీడ లేకుండా చేయడమే అభివృద్ధి అని నిర్వచించుకుంటున్నాడు. తను కూడా భాగమైన ప్రకృతికి దూరమై ఒంటరివాడై పోతున్నాడు. అంతా తన ప్రయోజకత్వం, తానే భువికధినాథుడినని విర్రవీగుతున్నాడు.  

తను నెత్తిన మోసే తన పౌరాణిక, ఇతిహాస వారసత్వం నుంచి కూడా మనిషి పాఠాలు నేర్చుకోవడం లేదు. ఎగిరే పర్వతాల గురించి, మానవరూపం ధరించి మాట్లాడే నదుల గురించి, మాట్లాడే పక్షులు, జంతువుల గురించి అవి చెబుతాయి. అది, నువ్వు కూడా ప్రకృతిలో భాగమే సుమా అని గుర్తుచేయడం; ప్రకృతిలో ఏ జీవీ ఎక్కువా కాదు, తక్కువా కాదు, అన్నింటికీ జీవించే హక్కు ఉందని చెప్పడం! 

అడవులకు, అక్కడి సమస్త్ర పాణులకు రక్షణ కల్పించవలసిన అవసరం గురించి అర్థశాస్త్రం చెబుతుంది; అడవులూ, వాటిని ఆశ్రయించుకుని బతికే జీవులూ రాజ్యంలో భాగం కాని, స్వతంత్ర అస్తిత్వాలన్న సంగతిని ఆనాటి రాజుల వివేకం చెబుతుంది. ప్రాకృతికమైన పూర్తి అవగాహనతో పూర్వులు గీసిన ఈ లక్ష్మణ రేఖలన్నీ ఏమైపోయాయి? అడవిపై విచక్షణా రహితమైన రాజ్యపు రాబందు రెక్క పరచిందెవరు?! 

సమకాలీన శాస్త్రవిజ్ఞాన పాఠాలు కూడా మనిషి తలకెక్కడం లేదు; ఈ విశ్వమూ, భూమీ,అందులోని ప్రకృతీ తమవైన ప్రణాళికను, తమవైన కేలండర్‌ను అనుసరిస్తాయనీ, మనిషి ప్రణాళికలనూ, కేలండర్‌నూ అవి ఏ క్షణంలోనైనా కుప్పకూల్చగలవనే ఎరుక లేదు. వందల కోట్ల సంవత్సరాల భూమి చరిత్రలో ఎన్నో మంచుయుగాలు దొర్లాయి. భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటాలు జీవి మనుగడను ఎన్నో మలుపులు తిప్పాయి. 

ఎంతో చరిత్రను తిరగరాశాయి. జీవపరిణామం ఎన్నో మార్పులు చెందింది. మానవ పరిణామంలో ఇప్పుడు చూస్తున్నదే తుది అంకం కాదు, మరిన్ని అంకాలకు అవకాశముందని జన్యుశాస్త్రజ్ఞులు హెచ్చరిక. మరి జంతువులు సహా ఇతర జీవజాలం సంగతేమిటి? మనిషిలోలానే వాటిలో కూడా ఏదైనా ఉత్పరివర్తన జరిగి అవి మనిషి స్థానాన్ని ఆక్రమిస్తే?! 

అది ప్రస్తుతానికి విపరీత ఊహలా అనిపించవచ్చు, కానీ ప్రకృతి గర్భంలో ఏ రహస్యాలు దాగున్నాయో ఎవరికి తెలుసు? కనుక మనిషి నేర్చుకోవలసింది వినమ్రత! ప్రకృతిపట్లా, అందులోని చరాచరాలన్నిటిపట్లా సమభావం, సమరసభావం!! పగబట్టి తిరగబడే ప్రకృతి ముందు తను పిపీలకమన్న ఆత్మజ్ఞానం!!      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement