భావి ఫలం | Sakshi Editorial On Future Generations | Sakshi
Sakshi News home page

భావి ఫలం

Published Mon, May 22 2023 12:06 AM | Last Updated on Mon, May 22 2023 12:06 AM

Sakshi Editorial On Future Generations

పాత కథే. కానీ కొత్త విషయానికి ప్రారంభంగా పనికొస్తుంది. చావు దగ్గరపడిన ఓ ముసలాయన ఎంతో శ్రద్ధగా మొక్క నాటడాన్ని చూసిన బాటసారి నవ్వడం మనకు తెలుసు. అది ఎప్పటికి పెరిగేనూ, ఎప్పటికి కాసేనూ! ప్రతి పనినీ మన కోసమే చేయం. ముందు తరాలకు పనికొచ్చేట్టుగా చేస్తాం.

అదే వాళ్ల పూర్వీకులుగా మనం ఇవ్వగలిగే కానుక! బాటసారిలో గౌరవం పెరిగేలా వృద్ధుడు ఇదే చెబుతాడు. సరిగ్గా ఇలాంటి భావనతోనే నార్వేలో ‘ఫ్యూచర్‌ లైబ్రరీ ప్రాజెక్ట్‌’ ప్రారంభమైంది. దీనికి శ్రీకారం చుట్టింది స్కాట్‌లాండ్‌కు చెందిన విజువల్‌ ఆర్టిస్ట్‌ కేటీ పేటర్సన్. ఈమె వయసు 41 ఏళ్లు.

ఈ భవిష్యత్‌ గ్రంథాలయ ప్రాజెక్టు 2014లో ప్రారంభమైంది. వందేళ్ల పాటు అంటే 2114 వరకూ కొనసాగుతుంది. ఒక్కో ఏడాదికి ఒక్కో రచయిత తన సరికొత్త అముద్రిత రచనను ఈ గ్రంథాలయానికి బహూకరిస్తారు. మొదటి రచనగా 2014 సంవత్సరానికి మార్గరెట్‌ అట్‌వుడ్‌ (కెనడా) తన ‘స్క్రిబ్లర్‌ మూన్ ’ సమర్పించారు. 2015కు డేవిడ్‌ మిషెల్‌ (ఇంగ్లండ్‌) తన ‘ఫ్రమ్‌ మి ఫ్లోస్‌ వాట్‌ యు కాల్‌ టైమ్‌’ను ఇచ్చారు.

2016కు షివోన్  (ఐస్‌లాండ్‌), 2017కు ఏలిఫ్‌ షాఫక్‌ (టర్కీ) తమ రచనలు బహూకరించారు. 2018కి హాన్  కాంగ్‌ (దక్షిణ కొరియా), 2019కి కార్ల్‌ ఊవ్‌ నాస్‌గార్డ్‌ (నార్వే), 2020కి ఓసియన్  వువాంగ్‌ (వియత్నాం) ఇచ్చారు. ఈ రచనలన్నీ ఆంగ్లంలోనే ఉన్నాయని కాదు, అలా ఇవ్వాలని కూడా లేదు. సౌకర్యార్థం శీర్షికల వరకు ఆంగ్లంలో అనువదించి ఉంచారు.

విశేషం ఏమంటే– ఇందులోకి చేరే ‘పుస్తకాలు’ ఏమిటో కేటీకి గానీ, ఈ లైబ్రరీని నిర్వహించడానికి నెలకొల్పిన ‘ద ఫ్యూచర్‌ లైబ్రరీ ట్రస్టు’కు గానీ తెలీదు. సాహిత్యానికి గానీ కవిత్వానికి గానీ అద్భుతమైన చేర్పు అయిన, భవిష్యత్‌ తరాల ఊహలను అందుకోగలిగే శక్తి సామర్థ్యాలున్న రచయితను ఆ సంవత్సరపు రచయితగా ఎంపిక చేసుకుంటారు. వారు అంగీకరించాక, అది రాయడానికి ఒక ఏడాదైనా పడితే, ఆ పూర్తయిన రాతపత్రిని నార్వేలో జరిపే ప్రత్యేక వేడుక ద్వారా స్వీకరిస్తారు.

అందుకే 2021కి గానూ సిత్సి దాంగెరెంబ్గా(జింబాబ్వే) ‘నారిని అండ్‌ హర్‌ డాంకీ’ని 2022లో ఇచ్చారు. 2022 సంవత్సరానికి జుడిత్‌ షలన్ స్కీ (జర్మనీ) ఈ జూన్ లో అందజేస్తారు. ఆ రాతప్రతిని ప్రత్యేకమైన వస్త్రాల్లో చుట్టి, ఓస్లో ప్రజా గ్రంథాలయంలో ప్రత్యేకంగా డిజైన్  చేసిన గదిలో ఉంచుతున్నారు. ఇవి వందేళ్ల తర్వాత ప్రచురితమవుతాయి. మరో విశేషం ఏమంటే, ఈ పుస్తకాలను అచ్చు వేయడానికే వెయ్యి చెట్లను ప్రత్యేకంగా అక్కడి నార్డ్‌మార్కా అటవీ ప్రాంతంలో పెంచుతున్నారు.

ఈ వంద చేతిరాత ప్రతులను ఈ చెట్లతో తయారుచేసిన కాగితాలతో లిమిటెడ్‌–ఎడిషన్ గా ప్రచురిస్తారు. అందుకే దీన్ని ప్రపంచపు అత్యంత రహస్య గ్రంథాలయం అని గార్డియన్ పత్రిక అభివర్ణించింది. అయితే వందేళ్ల పాటు వీటిని చదవకుండా పాఠకులకు దూరంగా ఉంచుతున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి.

వందేళ్ల నాటికి ఈ ప్రాజెక్టును ప్రారంభించిన వాళ్లుగానీ, దీనికి పుస్తకాలు సమర్పించిన చాలామంది రచయితలుగానీ ఉండరు. మార్గరెట్‌ అట్‌వుడ్‌ వయసు 83 ఏళ్లు. అంతెందుకు, ఈ ప్రాజెక్టు రచయితలుగా పరిగణనలోకి వచ్చిన టోమాస్‌ ట్రాన్స్ ట్రోమార్‌ (స్వీడన్ ), ఉంబెర్టో ఎకో (ఇటలీ) ఇప్పటికే మరణించారు కూడా. ‘‘అప్పటికి దీర్ఘకాలంగా నిశ్శబ్దంగా ఉన్న నా గొంతుక ఉన్నట్టుండి, ఒక వందేళ్ల తర్వాత మేల్కొంటుందన్న ఆలోచనే చిత్రంగా ఉంది.

ఆ కంటెయినర్‌ లోంచి ఆ పుస్తకంలోని మొదటి పేజీ తెరిచే ఇప్పటికింకా శరీరంగా రూపుదిద్దుకోని ఆ చేతికి ఆ గొంతుక ఏం చెబుతుంది?’’ అని ఉద్విగ్నంగా మాట్లాడారు మార్గరెట్‌ అట్‌వుడ్‌. ‘‘భవిష్యత్తులో ఎప్పుడో చదువుతారని ఆశిస్తున్న ఒక రాతప్రతిని రాయడమనే ఆలోచనే ఒక ఉత్తరం రాసి నదిలో వేయడం లాంటిది.

అది ఎటు పోతుందో మనకు తెలీదు, ఎవరు చదువుతారో తెలీదు– ఆ కాలప్రవాహాన్ని విశ్వసించడమే’’ అన్నారు ‘ద బాస్టర్డ్‌ ఆఫ్‌ ఇస్తాంబుల్‌’, ‘ద ఫార్టీ రూల్స్‌ ఆఫ్‌ లవ్‌’ లాంటి నవలలు రాసిన ఎలిఫ్‌ షఫాక్‌. ఆమె ఇచ్చిన ‘ద లాస్ట్‌ టాబూ’ కాల ప్రవాహంలో ఏ మలుపులు తీసుకుంటుందో!

‘‘నేనెట్లాగూ మరో వందేళ్లు ఉండను. నేను ప్రేమించేవాళ్లు కూడా ఉండరు. ఈ కనికరం లేని వాస్తవం నా జీవితంలోని అత్యంత ముఖ్యమైన విషయం గురించి ఆలోచించేట్టు చేసింది. నేనెందుకు రాస్తాను? నేను రాస్తున్నప్పుడు ఎవరితో సంభాషిస్తున్నాను? ఆ తర్వాత నేను ఒక ప్రపంచాన్ని ఊహించాను, అక్కడ నేను ప్రేమించేవాళ్లు ఎవరూ ఉండరు. కానీ ఆ ప్రపంచంలో నేను బతికి వుండగా కలిసిన నార్వేలోని చెట్లు ఇంకా ఉంటాయి. మనుషులకూ, చెట్లకూ మధ్య ఉన్న స్పష్టమైన ఈ అంతరం నన్ను తాకింది.

ఈ ధ్యానం ఎంత తీవ్రమైనదంటే, మన నశించిపోయే జీవితాల అశాశ్వతత్వానికీ, విలువైన పెళుసుదనాల మన జీవితాలకూ నేరుగా కళ్లు తెరిపించింది’’ అంటారు దక్షిణ కొరియా రచయిత్రి హాన్  కాంగ్‌. ‘‘ఈ ఆలోచన అద్భుతం. ఇప్పటికింకా పుట్టని పాఠకులకు మన కాలం నుంచి వారి కాలానికి ఒక చిన్న పడవను పంపడమే ఇది’’ అన్నారు కార్ల్‌ ఓవ్‌ నాస్‌గార్డ్‌.

ఇప్పుడు పెరుగుతున్న ఈ చెట్ల నుంచి కాయనున్న పుస్తకాలను ఆరగించడానికి ప్రపంచంలోని ఏ మూలల్లో మనుషులు జీవం పోసుకోనున్నారో! వందేళ్ల తర్వాత ఏం జరుగుతుందో చూడాలని ఇప్పుడే కుతూహలంగా లేదూ!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement