author
-
‘పెన్షన్’ పత్రిక
ఆ జ్ఞానము అచట ఉన్నది. పండిన అనుభవాల రాశి పోగుబడి ఉన్నది. వేళ్లకు వయసు వచ్చినది కాని కలానికి కాదు సుమా. విశాలమైన తలపులు చెప్పవలసిన సంగతులు ఒకటా రెండా? మేము విశ్రాంతిలో లేము. అక్షరాల ఆలోచనల్లో ఉన్నాం. గత యాత్రకు కొనసాగింపులో ఉన్నాం. మేము నడవవలసిన దారి తెరిచిన పుటల మీదుగా సాగుతుంది. పాఠకుల మనోరథాల మీదుగా విహరిస్తుంది. ఊహలకు ఊపిరి పోస్తే మాకు ఆయువు. పాత్రలతో సంభాషిస్తే మాకు ఉత్సాహం. మేమెవరమో మీకు తెలుసా? మా లోపల ఏముందో మీకు ఎరుకేనా?‘మా నాన్న అదృష్టవంతుడు. చనిపోయే వరకూ రాస్తూనే ఉన్నాడు. రాసిన దాని కోసం పత్రికలు ఎదురు చూశాయి. ప్రచురించి మర్యాద చేశాయి. ఆయన రచయితగా జీవించి రచయితగా మరణించాడు. నేనూ ఉన్నాను. కథ రాస్తే ఎక్కడ ఇవ్వను. రాయకుండా ఎలా బతకను?’ పెన్షనర్ వయసున్న ఒక రచయిత అన్న మాటలు ఇవి. నేటి తెలుగు రాష్ట్రాల్లో యాభైలు దాటి, రచనాశక్తితో ఉన్న వారి ఆవేదనంతటికీ ఈ మాటలు శోచనీయమైన ఆనవాలు.ఒక రచయిత పరిణతి యాభైల తర్వాతే రచనల్లో వ్యక్తమవుతుంది. అనుభవాల సారము, వాటి బేరీజు, వాటిపై వ్యాఖ్యానం, వాటితో నేటి తరానికి చెప్పవలసిన జాగరూకత, వాటి నమోదు, తద్వారా బలపడే సారస్వత సంపద... ఏ జాతికైనా పెను పెన్నిధి. దురదృష్టం, కాలమహిమ తెలుగు రాష్ట్రాల్లో పత్రికలు కనుమరుగైపోయాయి. సాహిత్య పత్రికలు, చిన్న పత్రికలు, వీక్లీలు.... ఎంత రాసినా వేసే మంత్లీలు... బైమంత్లీలు... క్వార్టర్లీలు.... ఏ బస్టాండ్ బడ్డీకొట్టులోనో అందుకునే అపరిచిత పాఠకుడికై వాటి అందుబాటు... ఎక్కడ... ఎక్కడా? ‘మీ రచనను ప్రచురణకు స్వీకరించాం’ కార్డు ముక్క, దానికి ఫలానా చిత్రకారుడు వేసే గొప్ప బొమ్మ, పోస్టులో పత్రిక అందడం, మరికొన్ని రోజులకు సంబరంగా సంతకం చేసి తీసుకునే పారితోషికపు మనీఆర్డర్... ఎక్కడ... ఎక్కడా? కంప్యూటర్ స్క్రీన్ కో, సెల్‌ఫోన్ కురచదనానికో సంతృప్తి పడే నేటి పాఠకులు ఉండుగాక. కాని పెద్దలు ఉన్నారు. కాగితపు వాసనను పీల్చి, అక్షరాలను వేళ్లతో తడిమిగాని సంతృప్తి పడని ప్రాణాలున్నాయి. కట్టె కొట్టె తెచ్చేలా కాకుండా, అరచేత్తో లోడేదే లోతు అనుకునే రచయితల్లా కాకుండా, తమ రచనలతో చెరువులనూ, కడలి కెరటాల సంచలనాత్మలనూ సృష్టించిన చేతులు ఉన్నాయి. వారి సంగతి ఏమిటి? వారికేదైనా పెన్షన్ కావాలని ఎవరైనా ఆలోచించారా?1970–90ల మధ్య కాలంలో కథ అంటే కనీసం ఐదారు పేజీలు ఉండేది. పెద్దకథలు ఉండేవి. నవలికలు, సీరియల్ నవలలు, గల్పికలు, ప్రహసనాలు, ఆత్మకథలు, జ్ఞాపకాలు, సంవాదాలు, అనువాదాలు, ఇంటర్వ్యూలు... ఇవన్నీ రాసినవారు, ఇచ్చినవారు ఇంకా ఉన్నారు. జనాభా లెక్కల్లో గల్లంతై పోలేదు. వీరు రాయగా చదివి అభిమానులు అయినవారు ఉన్నారు. బండలై పోలేదు. ఈ రాసే వారు రాయడానికీ... ఈ చదివేవారు అనుసంధానమై చదవడానికీ... అవసరమైన వేదికలే తెలుగునాట లేవు. ఈ రచయితలకు, పాఠకులకు ఒక పెన్షన్ స్కీమ్ కావాలి. వీరి అనుభవాన్ని, ఆత్మగౌరవాన్ని మన్నిస్తూ వీరి రచనలకు చోటు కల్పించడం కోసం ఒక పథకం కావాలి. కొత్త తరాలతో పోటీ పడుతూ డిజిటల్ క్యూలలో దూరి బుకింగ్ కోసం వీరు చేయి దూర్చరని గ్రహించడం అత్యవసరం. అదొక్కటేనా? పునఃపఠనం సంగతో? ఎంతో రాసి, ఎన్నో క్లాసిక్స్ ఇచ్చిన రచయితలను రీవిజిట్ చేయడానికి ఒక్క కాగితపు పుట ఇంత పెద్ద జాతికి లేకపోవడం విషాదమా, కాదా?‘ఏజ్‌లెస్ ఆథర్స్’... 65 ఏళ్లు ఆపైన వయసున్న వారి రచనలనే క్రమం తప్పకుండా వెలువరించే సంకలనాల వరుస ఇది. ‘క్రోన్ : విమెన్ కమింగ్ ఆఫ్ ఏజ్’... ఇది అరవైలు దాటిన స్త్రీల రచనలు ప్రచురించే పత్రిక. ‘పాసేజర్’... యాభై ఏళ్ల తర్వాత రాసిన వారివే ఈ పత్రిక వేస్తుంది. ‘ఎనభై ఏళ్లు పైబడిన వారు రాయట్లేదే అని చింతించాం. కాని ఇప్పుడు ఆ వయసు వారూ వచ్చి రాస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని ఆ పత్రిక పేర్కొంది. ‘రీ ఇన్వెన్షన్ ఆఫ్టర్ రిటైర్మెంట్’... స్లోగన్‌తో యాభైలు దాటిన రచయితల రచనలు మాత్రమే వేసే పత్రికలు పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయి. వారి మానసిక ఆనందానికి అవి అవసరం అని ఆ యా దేశాలు భావిస్తున్నాయి. మన దేశంలో ఇతర భాషల్లో పత్రికలు సజీవంగా ఉన్నాయి కాబట్టి వారికి ఈ బెడద తెలియదు. తెలుగు సీనియర్స్కే సమస్య అంతా! వీరు చదివిన వందల పుస్తకాల నుంచి విలువైన మాటలు చెప్పాలా, వద్దా? వేయిదీపాల మనుషులు వీరు అనే సోయి మనకు ఉందా?‘రాయాలంటే ఎక్కడ రాయాలి’ అనుకునే కవులు, రచయితలు, ఆలోచనాపరులు, విమర్శకులు, నాటకకర్తలు, వ్యంగ్య విన్యాసకులు నేడు ఎందరో నిశ్శబ్దంగా ఉన్నారు. లోపలి వెలితితో ఉన్నారు. వీరి సృజన సన్నగిల్లలేదు. మరింత విస్తరణను కోరుకుంటోంది. వీరిని నిర్లిప్తంగా ఉంచడమంటే కనబడని గోడల జైలులో పెట్టడమే! సాంస్కృతిక ఆస్తిపత్రాలు గల్లంతు చేసుకోవడమే. ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, ఇద్దరు సంపాదక సిబ్బందితో ఏ రాష్ట్ర సాంస్కృతిక శాఖ అయినా ఏ యూనివర్సిటీ అయినా ఏ బాధ్యత గల్ల సంస్థైనా ప్రతి నెలా ‘పెన్షన్ పత్రిక’ నడపవచ్చు. పెన్షన్లు వ్యక్తిగత హితానికైతే ఇది సామాజిక హితానికి! అమరావతి, మూసీల ఖర్చులో దీనికై వెచ్చించవలసింది 0.0000001 పైసా. ఈ కొత్త పెన్షన్ కోసం డిమాండ్ చేద్దాం! -
బిష్ణోయి స్త్రీలు..: చెట్ల కోసం తలలు ఇచ్చారు
‘పచ్చటి చెట్టు నరకకూడదు’ అని బిష్ణోయ్ తెగ మొదటి నియమం. మన దేశంలో పర్యావరణానికి మొదటి యోధులు బిష్ణోయ్ స్త్రీలే. కరువు నుంచి రక్షించే‘ఖేజ్రీ’ చెట్లను 1730లో రాజభటులు నరకడానికి వస్తే అమృతాదేవి అనే మహిళ తన తల అర్పించి కాపాడుకుంది. ఆమెతో పాటు 363 మంది బిష్ణోయిలు ఆరోజు బలిదానం ఇచ్చారు. బిష్ణోయిల పర్యావరణ స్పృహ గురించి బ్రిటిష్ రచయిత మార్టిన్ గుడ్మాన్ ‘మై హెడ్ ఫర్ ఏ ట్రీ’ పుస్తకం రాశాడు. ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో దాని గురించి మాట్లాడాడు. వివరాలు...అందరూ ఎండు కట్టెలు వంట కోసం నేరుగా పొయ్యిలో పెడతారు. కాని బిష్ణోయి స్త్రీలు ఆ ఎండు కట్టెలను పరీక్షించి వాటి మీద క్రిమి కీటకాలు, బెరడును ఆశ్రయించి ఉండే పురుగులు... వీటన్నింటిని విదిలించి కొట్టి అప్పుడు పొయ్యిలో పెడతారు. ప్రాణం ఉన్న ఏ జీవజాలాన్నీ చంపే హక్కు మనిషికి లేదు’ అని బిష్ణోయిలు గట్టిగా విశ్వసించడమే దీనికి కారణం. బిస్ అంటే 20. నొయి అంటే 9. బిష్ణోయిల ఆది గురువు జంభోజి వారి కోసం 29 నియమాలను ఖరారు చేశారు. వాటిని పాటిస్తారు కాబట్టి వీరిని బిష్ణోయిలు అంటారు. మరో విధంగా వీరు వైష్ణవ పథానికి చెందిన వారు కాబట్టి కూడా విష్ణోయి లేదా బిష్ణోయి అని అంటారు.కరువు నుంచి బయటపడేందుకుపశ్చిమ రాజస్థాన్‌లో జోద్పూర్, బికనిర్లు బిష్ణోయిల ఆవాసం. 15వ శతాబ్దంలో ఇక్కడ తీవ్రమైన కరువు వచ్చింది. అందుకు కారణం చెట్లు, అడవులు నాశనం కావడమేనని ఆ సమయానికి జీవించి ఉన్న గురు జంభోజి గ్రహించారు. అందుకే చెట్టును కాపాడుకుంటే మనిషి తనను తాను కాపాడుకోవచ్చునని కచ్చితమైన నియమాలను విధించారు. వాటిని శిరోధార్యంగా చేసుకున్న బిష్ణోయిలు నాటి నుంచి నేటి వరకూ గొప్ప పర్యావరణ రక్షకులుగా ఉన్నారు. వీరి ప్రాంతంలో ఉన్న ఖేజ్రీ చెట్లను, కృష్ణ జింకలను వీరుప్రాణప్రదంగా చూసుకుంటారు. జింక పిల్లలను వీరు సాకుతారు. అవసరమైతే చనుబాలు ఇస్తారు.1730 స్త్రీల ఊచకోత1730లో జోద్పూర్ రాజు అభయ్ సింగ్ కొత్త ΄్యాలస్ నిర్మాణానికి కలప కోసం సైనికులను ఖేజర్లీ అనే పల్లెకు పంపాడు. అక్కడ ఖేజ్రీ చెట్లు విస్తారం. ఆ సమయానికి మగవారంతా పశువుల మందను మేపడానికి వెళ్లి ఉన్నారు. ఊళ్లో స్త్రీలు మాత్రమే ఉన్నారు. సైనికులు చెట్లు కొట్టబోతుంటే అమృతాదేవి అనే స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి అడ్డుపడింది. పచ్చని చెట్టును నరకకూడదు అంది. ఆమెకు ముగ్గురు కూతుళ్లు. వారంతా వచ్చి చెట్లను చుట్టుకుని నిలబడ్డారు. చాలామంది స్త్రీలు అలాగే చేశారు. సైనికులు వెర్రెత్తి పోయారు. గొడ్డలి ఎత్తారు. ‘చెట్టుకు బదులు నా తల ఇస్తాను తీసుకో’ అని గర్జించింది అమృతాదేవి. సైనికులు నిర్దాక్షిణ్యంగా ఆమెను, ఆమె కూతుళ్లను, ఆ తర్వాత మొత్తం స్త్రీ, పురుషులను కలిపి మొత్తం 363 మందిని నరికారు. ఇప్పటికీ ఆ ఊళ్లో ఆ జ్ఞాపకంగా స్మారక స్థూపం ఉంది.చలించిన రచయిత‘2020లో జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌కు వచ్చినపుడు ఈ ఊచకోత గురించి తెలిసింది. పర్యావరణం కోసం ఇలాప్రాణత్యాగం చేసిన స్త్రీలు లేరు. నేను ఇది పుస్తకంగా రాయాలనుకున్నాను’ అన్నాడు బ్రిటిష్ రచయిత మార్టిన్ గుడ్మాన్. 2022లో అతను లండన్ నుంచి వచ్చి ఆరు నెలల పాటు బిష్ణోయి సమూహంతో ఉండి ‘మై హెడ్ ఫర్ ఏ ట్రీ’ పుస్తకం రాశాడు. ‘నేను బిష్ణోయి గురువు జంభోజి ఏ చెట్టు కిందైతే మరణించాడో ఆ చెట్టు కిందకు వెళ్లాను. ఆ రోజు రాజస్థాన్‌లో 36 డిగ్రీల ఎండ ఉంటే లండన్‌లో 40 డిగ్రీల ఎండ వుంది. బిష్ణోయిల నుంచి ఈ ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. బిష్ణోయిలు చెట్లు పెంచుతూ, కుంటలు తవ్వుతూ తమ భూమిని సస్యశ్యామలం చేసుకుంటూనే ఉన్నారు. ఇందులో స్త్రీల కృషి అసామాన్యం. వీరి వల్లే చి΄్కో ఉద్యమ ఆలోచన వచ్చిందని కూడా మనం గ్రహించాలి’ అన్నాడు మార్టిన్ గుడ్మాన్.వేటాడితే జైల్లో వేస్తాంపుస్తకం ఆవిష్కరణ వేడుకలో బిష్ణోయి ఉద్యమకర్త నరేంద్ర బిష్ణోయి కూడా పాల్గొన్నాడు. ‘రాజస్థాన్‌లో 1972, 1980 చట్టాల ప్రకారం చెట్టు కొడితే 100 రూపాయల ఫైను. ఆ రోజుల్లో 100 పెద్దమొత్తం కావచ్చు. ఇవాళ్టికీ వంద కట్టి తప్పించుపోతున్నారు. ఈ చట్టంలో మార్పు కోసం పోరాడుతున్నాం. మేము పెద్దఎత్తున చెట్లు పెంచుతుంటే అభివృద్ధి పేరుతో సోలార్ ΄్లాంట్ల కోసం ప్రభుత్వం చెట్లు కొట్టేస్తోంది. ఇంతకు మించిన అన్యాయం లేదు. గత రెండు దశాబ్దాలుగా మాప్రాంతంలో కృష్ణ జింకలను చంపిన వారు కోర్టుల్లో ఏదో చేసి తప్పించుకున్నారు. అందుకే మా కుర్రాళ్లే లా చదివి అడ్వకేట్లు అవుతున్నారు. ఇక ఎవరు వేటాడినా వారిని జైళ్లల్లో మేమే వేయిస్తాం’ అన్నాడు నరేంద్ర బిష్ణోయి. ఈ గొప్ప పర్యావరణప్రేమికులు దేశం మొత్తానికి స్ఫూర్తినివ్వాలి. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
చరిత్రలోనే అతిపెద్ద స్టాక్‌మార్కెట్ క్రాష్ రాబోతోందా?
ప్రఖ్యాత రచయిత, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తకాన్ని రచించిన రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) స్టాక్ మార్కెట్‌కు (stock market) సంబంధించి సంచలన జోస్యం చెప్పారు. "చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్" వచ్చే ఫిబ్రవరిలో సంభవిస్తుందని ఆయన అంచనా వేశారు. ఈ మేరకు ఆయన అందర్నీ అప్రమత్తం చేస్తూ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. రాబోతున్న ఈ మహా పతనం సాంప్రదాయ పెట్టుబడి మార్కెట్లను అతలాకుతలం చేస్తుందని, అయితే వెంటనే మేల్కొని అప్రమత్తమయ్యేవారికి ఇది ఒక పెద్ద అవకాశంగా తాను చూస్తున్నట్లు కియోసాకి పేర్కొన్నారు. తన 2013 నాటి రిచ్ డాడ్ పుస్తకంలోనూ కియోసాకి రాబోయే స్టాక్ మార్కెట్ క్రాష్ గురించి హెచ్చరించారు. గతంలో వచ్చిన అన్ని పతనాలు దీని ముందు దిగదుడుపే అని కూడా అందులో చెప్పారు.2025 ఫిబ్రవరిలో స్టాక్ మార్కెట్ భారీ క్రాష్ సంభవించే అవకాశం ఉందని కియోసాకి తాజాగా చేసిన ట్వీట్.. ఆ పుస్తకంలోని జోస్యం నిజమవుతోందని సూచిస్తోంది. అయినప్పటికీ, దీని ద్వారా వినాశనం జరుగుతుందని కియోసాకి ఏమీ భావించడం లేదు. ఈ క్రాష్ గొప్ప కొనుగోలు అవకాశాన్ని అందిస్తుందని నమ్ముతున్నారు. "ఈ క్రాష్‌లో అన్నీ విక్రయానికి వస్తాయి" అని వివరించారు. మార్కెట్ పతనం సమయంలో కార్లు, ఇళ్లు వంటివి తక్కువ ధరకు వస్తాయంటున్నారు.ఇది మంచి వార్తే..కియోసాకి ప్రకారం ఇది మంచి వార్త. స్టాక్, బాండ్ మార్కెట్ల నుండి మూలధనం ప్రత్యామ్నాయ పెట్టుబడులలోకి, ముఖ్యంగా బిట్‌కాయిన్‌లోకి ప్రవహిస్తుంది. పెట్టుబడిదారులు సురక్షితమైన, మరింత లాభదాయకమైన ఎంపికలను వెతుకుతున్నందున, క్రిప్టోకరెన్సీ భారీ వృద్ధిని అందుకుంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. బిట్‌కాయిన్, బంగారం, వెండి వాటిలో పెట్టుబడులు పెట్టాలని కియోసాకి చాలా కాలంగా తన ఫాలోవర్లకు సూచిస్తున్నారు.భవిష్యత్తు క్రిప్టోకరెన్సీదే..సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి క్రిప్టోకరెన్సీ ఆదరణ పొందుతున్న నేపథ్యంలో బిట్‌కాయిన్‌ను సురక్షిత స్వర్గంగా కియోసాకి అభివర్ణిస్తున్నారు. మార్కెట్ అస్థిరత సమయంలో బిట్‌కాయిన్ వృద్ధికి ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుందని, ముఖ్యంగా స్టాక్‌లు, బాండ్లు వంటి సాంప్రదాయ ఆస్తులు తమ ఆకర్షణను కోల్పోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. బిట్‌కాయిన్‌లో అతి చిన్న యూనిట్ అయిన సతోషి ఉన్నా కూడా గణనీయమైన సంపదకు దారితీస్తుందని కియోసాకి నొక్కిచెబుతున్నారు. 100 మిలియన్ల సతోషిలు కలిపితే ఒక బిట్‌కాయిన్. కియోసాకి అంచనా వేసిన మార్కెట్ క్రాష్ సమయం సమీపిస్తున్న కొద్దీ ఇన్వెస్టర్లలో గుబులు పుడుతుంటే ఆయన జోస్యం నిజమవుతుందా లేదా అని ప్రపంచం నిశితంగా గమనిస్తోంది.In RICH DADs PROPHECY-2013 I warned the buggiest stock market crash in history was coming. That crash will be in February 2025.Good news because in a crash everything goes on sale. Cars and houses on sale now.Better news billions will leave the stock and bond markets and…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 27, 2025 -
గెలిచిన దారులు మిగిలిన ఆకాంక్షలు
రాజ్యాంగం... దేశ పాలనావ్యవస్థకు పరమగ్రంథం. ప్రతి పౌరునికి శిరోధార్యం. బలహీనులకు వజ్రాయుధం. బలవంతులను అదుపు చేసే అంకుశం. పురుషస్వామ్య పెత్తందారీ నుంచి స్త్రీలు అడుగు ముందుకు వేయడానికి రాజ్యాంగం పరిచిన దారులు వారిని నేడు ఆత్మగౌరవంతో నిలబెట్టి స్వయం సమృద్ధి వైపు నడిపిస్తున్నాయి. సాధించింది ఎంతో. సాధించాల్సింది మరెంతో. ఆకాంక్షలను అలాగే నిలబెట్టుకుంటూ ముందుకు సాగాలని అంటున్నారు సీనియర్ రచయిత్రి.భారత రాజ్యాంగాన్ని స్త్రీల దృష్టితో చూడటానికి ఈరోజొక వజ్రోత్సవ సందర్భం. వాలుకి కొట్టుకుపోయే యాంత్రికత నుంచి బైటకి వచ్చి, దాటి వచ్చిన కాలాలను, నడుస్తున్న సమయాలను నిమ్మళంగా చూస్తున్నప్పుడు కొంత సంతోషం, మరికొంత బాధ. ఈ రోజుల్లో భర్త చనిపోతే భార్య చితిలోకి దూకనవసరం లేదు, అతి బాల్య వివాహాలు చేసుకోనవసరం లేదు, వితంతువులు రహస్య గర్భవిచ్చిత్తిలో ప్రాణాలు పోగొట్టుకోనవసరం లేదు. గడపచాటున నిలబడి మాట్లాడటం, ముట్టుగదుల్లో మగ్గడం, అవిద్య, అజ్ఞానం, మూఢనమ్మకాల నుంచి స్త్రీలు చాలావరకూ బైటపడ్డారు. రాజ్యాంగంలో స్త్రీలకి సమానహక్కులు పొందుపరచడానికి ముందుతరాల వారు చేసిన సంఘసంస్కరణ చాలావరకూ మూలకారణం. దీనికి సమానమైన చేర్పుని రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ ఆలోచనలు ఇచ్చాయి. స్త్రీలని వాహికలుగా చేసుకుని కులం, మతం వ్యాప్తి చెందుతాయని, ఈ సమాజాన్ని కొందరి చెప్పుచేతుల్లోనే ఉంచుతాయన్నది అంబేద్కర్ అవగాహన. అందుకే దళిత, కార్మికవర్గాల కోసం ఆలోచించినంతగా స్త్రీ సమానత్వం కోసం కూడా పాటుబడ్డారు. రాజ్యాంగానికి మూలాధారమైన ‘అందరికీ సమానమైన విలువ’ అనే అంబేద్కర్ ప్రతిపాదన పైకి కనిపించే సాధారణ విషయం కాదు. ఆ కాలానికే కాదు, ఇప్పటికీ మనుషులు సమానంగా లేరు. స్త్రీలు చాలా విషయాల్లో రెండవ తరగతి పౌరులుగానే ఉన్నారు. ఆ స్థితిని పోగొట్టి, స్త్రీల జీవితాల్లో విప్లవాత్మక మార్పుల కోసం అంబేద్కర్ ప్రవేశపెట్టిన ‘హిందూ కోడ్ బిల్’ ఒక సంచలనం. అంతవరకూ స్త్రీలకి సామాజిక, రాజకీయ, కుటుంబహక్కుల వంటివి లేవు. సమానత్వప్రాతిపదిక మీద రాజ్యాంగం ద్వారా వారు ఆ హక్కులను మిగతావారితో పాటు సహజంగానే పొందారు. ఉదాహరణకి రాజ్యాంగ ఏర్పాటుకి మునుపు సార్వత్రిక ఓటుహక్కు లేదు. తొంభైశాతం పైగా స్త్రీలకి ఓటువేయడం అంటే ఏమిటో తెలీదు. కానీ రాజ్యాంగం ద్వారా స్త్రీలంతా ఓటు వేయడమే కాదు, రాజకీయ పార్టీలలో చేరి, ఎన్నికలలో పాల్గొని, శాసనసభలకి చేరారు. ‘బిఎ చదివినా బియ్యంలో రాళ్లేరక తప్పుతుందా’ అన్నవారికి– ఉద్యోగాలు చేసి, ఊళ్ళేలి చూపించారు స్త్రీలు. బ్రిటిష్ పాలనకి భిన్నంగా భారత రాజ్యాంగం స్త్రీల ఉనికిని నిరూపించింది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను వాడుకుని చేసిన అనేక పోరాటాల ఫలితంగా స్త్రీలకి అనుకూలమైన కొన్ని చట్టాలు రూపొందాయి. వివాహానికి సరైన వయసుప్రాతిపదిక అయింది. అబార్షన్ హక్కులు ఉన్నాయి. విడాకులు పూర్వమంత కఠినం కావు. స్త్రీలపై సాగే గృహహింస, లైంగిక వేధింపులు, అత్యాచారాలకి కఠినశిక్షలు ఉన్నాయి. ఆస్తి, వారసత్వ హక్కుల విషయంలో కూడా ప్రగతి కనబడుతోంది. ముఖ్యంగా స్త్రీల సామాజిక, రాజకీయ భాగస్వామ్యం మెరుగుబడింది. అయితే, స్త్రీల హక్కులన్నిటికీ కాపాడగల రక్షణ వ్యవస్థలు నిష్పక్షపాతంగా లేవు. అవి మగ స్వభావాన్ని, మగ పెత్తనాన్ని తెలియక, తెలిసి ప్రదర్శిస్తాయి. దానివల్ల మొగ్గు పురుషుడి వైపు ఉండి స్త్రీ సమానత్వాన్ని సూచించే రాజ్యాంగస్ఫూర్తిని భగ్నం చేస్తాయి. అందుకే ‘అందరికీ ఒకే విలువ’ సూత్రం ఆచరణలో విఫలం అయింది. స్త్రీలు అన్ని ఉద్యోగాలకి అర్హులు. కానీ సైనికులుగా, భారీ వాహన చోదకులుగా, పెద్దపెద్ద హోదాలు కల ఉద్యోగులుగా, మంత్రులుగా, వ్యాపారవేత్తలుగా వారి ఉనికి ఎంత? ఇటీవలి అంచనాలు కార్మిక వర్గంలో, ‘బాస్’ స్థానాలలో స్త్రీల నిష్పత్తి పతనమవుతున్నదని హెచ్చరిస్తున్నాయి. ఇక కొన్ని ప్రత్యేక రంగాల్లో స్త్రీలు అడుగు పెట్టాల్సే ఉంది. సంసిద్ధత లేకపోవడం సమాజానికే కాదు, సమాజం తయారు చేసే స్త్రీలది కూడా కావొచ్చు. అందరినీ ఒక చోటికి చేర్చాలంటే వెనుకబడి ఉన్నవారిని ముందుకు చేర్చడానికి రిజర్వేషన్లు కావాలి. విద్యా ఉద్యోగ రంగాలలో స్త్రీలకి 33 శాతం రిజర్వేషన్లని అంగీకరించిన రాజ్యాంగం– చట్టసభలకి ఆ హక్కుని వర్తింపజేయలేక పోయింది. 33 శాతం రిజర్వుడ్ స్థానాల్లోనూ, జనరల్ స్థానాల్లో మరి కొందరు స్త్రీలు కలిసి చట్టసభలకి చేరి విధాన నిర్ణయాలు చేయడమన్న ఆలోచనకే రాజకీయపార్టీలు వ్యతిరేకం కనుకనే ఇంతవరకూ మహిళా రిజర్వేషన్ల బిల్లు ముందుకు పోవడం లేదు. స్త్రీల శరీరాల మీద పురుషులకి ఉండే హక్కులకి, స్త్రీల గౌరవానికి భంగకరంగా ఉన్న అడల్టరీ చట్టం ఎత్తి వేయడానికి రాజ్యాంగం ఏర్పడ్డాక కూడా దాదాపు ఏడు దశాబ్దాలు పట్టింది. తల్లికి బిడ్డల మీద ఉండాల్సిన సహజ బాధ్యతలు, హక్కుల విషయంలో కూడా చాలా వివక్ష ఇప్పటికీ ఉంది. పురుషుని ఇంటిపేరుతో స్త్రీ, ఆమె పిల్లలు గుర్తింపు పొందడం– పితృస్వామ్యం బలంగా ఉండడాన్నే సూచిస్తుంది. రాజ్యాంగంలో కూడా స్త్రీలహక్కులకి సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆచరణలో చాలా లోటుపాట్లు కూడా ఉన్నాయి. అయినాసరే స్త్రీలు తాము పోరాడి సాధించుకున్న చైతన్యాన్ని నిలుపుకోవడానికి తమ హక్కులకి రక్షణ ఉండాలని గట్టిగా అడగడానికి రాజ్యాంగమే ఆసరాగా ఉంది. దానికి తోడు మహిళాపోరాటాల సాధించుకున్న, సాధించుకోబోయే మార్పులు– ‘అందరికీ ఒకే విలువ’ సూత్రానికి స్త్రీలని మరింత దగ్గర చేస్తాయని నమ్మిక. ఈ నమ్మకాన్ని సడలనివ్వకుండా మనం ముందుకు సాగాలి.– కె.ఎన్.మల్లీశ్వరి, రచయిత -
పరువు నష్టం కేసులో రాజీ.. ట్రంప్‌కు రూ.127 కోట్లివ్వనున్న ఏబీసీ
న్యూయార్క్: పరువు నష్టం కేసులో కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఏబీసీ న్యూస్ ఛానల్ రాజీ కుదుర్చుకోనుంది. ఇందులో భాగంగా సుమారు రూ.127 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ తమ వెబ్సైట్లో ఒక నోట్‌ను ఉంచేందుకు ముందుకొచ్చింది. ట్రంప్ తనపై అత్యాచారం చేశారంటూ రచయిత్రి జీన్ కరోల్ కోర్టు కెక్కారు. గతేడాది విచారణ చేపట్టిన న్యాయస్థానం లైంగిక దాడి, ప్రతిష్టకు భంగం కలిగించడం వంటి నేరాలకు రూ.42 కోట్లు ఆమెకు చెల్లించాలని ట్రంప్‌ను ఆదేశించింది. ఇదే కేసులో ఈ ఏడాది జనవరిలో మరికొన్ని ఆరోపణలపై మరో రూ.700 కోట్ల చెల్లించాలని తీర్పు వెలువరించింది. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ కోర్టు రేప్ అనే మాటను ఎక్కడా పేర్కొనలేదు. అయితే, ఏబీసీ న్యూస్ ఛానెల్ ప్రముఖ యాంకర్ జార్జి స్టెఫనోపౌలోస్ మార్చి 10వ తేదీన కాంగ్రెస్ సభ్యురాలు నాన్సీ మేస్తో జరిగిన ఇంటర్వ్యూ సందర్భంగా జీన్ కరోల్‌ను ట్రంప్ రేప్ చేసినట్లు రుజువైందంటూ పదేపదే వ్యాఖ్యానించారు. దీనిపై ట్రంప్ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. -
మీ చేతి ఉన్నివస్త్రం
‘తపాలా బండి గంటల చప్పుడుకు ఏ పడుచు పిల్లయినా నిద్ర లేచినా మళ్లీ అటు తిరిగి పడుకుని తియ్యటి కలలు కంటుంది’ అని ఉంటుంది చెహోవ్ రాసిన ‘ఒక చలి రాత్రి’ కథలో! ఊహించండి. దట్టమైన చలికాలం. రాత్రి మూడు గంటల సమయం. ఏ వెధవ ప్రాణమైనా ముడుక్కుని పడుకుని కాసింత సుఖాన్ని అనుభవించే వేళ. ఒడలు మరిచే వేళ. వెచ్చదనమూ భోగమే అని భావించే వేళ. పొట్టకూటి కోసం, రోజూ చేయాల్సిన పని కోసం తపాలా మూటలను బగ్గీలో వేసుకుని స్టేషనుకు చేర్చక తప్పని మెయిల్మేన్ మనసులో ఎలా ఉంటుంది? నిశ్శబ్దాన్ని కప్పుకొని గాఢ సుషుప్తిలో ఉన్న ఊరి వీధుల గుండా అతడొక్కడే చలికి వణుకుతూ, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటిలో వెళుతూ ఉంటే అతడి అంతరంగ జగాన ఏముంటుందో ఆ సమయాన ఇళ్లల్లోని గదుల్లో రగ్గుల చాటున శయనిస్తున్న మనుషులకు తెలుస్తుందా?శ్రీమంతులు కూడా భలే వాళ్లులే! చలి రాత్రుళ్లలో వారికి మజాలు చేయాలనిపిస్తుంది. అతిథులను పిలవాలనిపిస్తుంది. పార్టీలూ గీర్టీలూ. పనివాళ్లను తొందరగా ఇళ్లకు పోండి అంటారా ఏమి? లేటు అవర్సు వరకూ పని చేయాల్సిందే! బయట చలి ఉంటుంది. పాకల్లో పసిపిల్లలు ‘కప్పుకోవడానికి ఇవాళైనా దుప్పటి కొనుక్కుని రా నాన్నా’ అని కోరడం గుర్తుకొస్తూ ఉంటుంది. ఒంటి మీదున్న ఈ కనాకష్టం బట్టలతో ఇంతరాత్రి చలిలో ఇంటికి ఎలా చేరాలనే భీతి ఉంటుంది. వెచ్చటి ద్రవాలు గొంతులో ఒంపుకునే శ్రీమంతులు ‘ఒరే... ఆ రగ్గు పట్టుకుపో’ అంటారా? ‘ఈ పాత స్వెటరు నీ కొడుక్కు తొడుగు’ అని దయతో పారేస్తారా? ఆ సోయి ఉంటే కొందరు ఎప్పటికీ శ్రీమంతులు కాలేరు. పాపం పనివాడు రంగడు పార్టీలో యజమాని ఉండగా ఆ అర్ధరాత్రి రగ్గు దొంగిలిస్తాడు. పేదవాణ్ణి దొంగను చేసింది లోపలి పెద్దమనిషా... బయటి చలా? డి.వెంకట్రామయ్య ‘చలి’ కథ ఇది.దర్శకుడు బి.నరసింగరావు కథలు కూడా రాశారు. ‘చలి’ అనే కథ. నగరానికి వచ్చిన వెంటనే మొగుడు పారిపోతే ఆ వలస కూలీ చంకన బిడ్డతో వీధుల్లో తిరుగుతూ చలిరాత్రి ఎక్కడ తల దాచుకోవాలా అని అంగలారుస్తుంటుంది. అక్కడ నిలబడితే ఎవరో కసురుతారు. ఇక్కడ నిలబడితే ఎవరో తరుముతారు. నోరూ వాయి లేని చెట్టు ‘పిచ్చిదానా... నిలుచుంటే నిలుచో. నీకేం వెచ్చదనం ఇవ్వలేను’ అని చిన్నబోతూ చూస్తుంది. చెట్టు కింద తల్లీబిడ్డా వణుకుతుంటారు. చలి. చెట్టు కింద తల్లీ బిడ్డా కొంకర్లు పోతూ ఉంటారు. శీతలం. చెట్టు సమీపంలోని చాటు అటుగా వచ్చి ఆగిన కారులోని యువతీ యువకులకు మంచి ఏకాంతం కల్పిస్తుంది. బయట చలి మరి. ఒకే తావు. చెట్టు కింద చావుకు దగ్గరపడుతూ తల్లీబిడ్డ. అదే తావులో ఏమీ పట్టని వెచ్చని సరస సల్లాపం. చలి ఒకటే! బహు అర్థాల మానవులు.శతకోటి బీదలకు అనంతకోటి ఉపాయాలు. పేదవాడు బతకాలంటే నోరు పెంచాలి. లేదా కండ పెంచాలి. కండ పెంచిన మల్లయ్య రైల్వేస్టేషన్ దగ్గర సగం కట్టి వదిలేసిన ఇంటి వసారాను ఆక్రమించుకుంటాడు. తక్కిన కాలాల్లో దాని వల్ల లాభం లేదు. చలికాలం వస్తే మాత్రం రాత్రిళ్లు తల దాచుకోవడానికి అలగా జనాలు ఆ వసారా దగ్గరికి వస్తారు. తలకు ఒక్కరూపాయి ఇస్తే వెచ్చగా పడుకునేందుకు చోటు. కొందరి దగ్గర ఆ రూపాయి కూడా ఉండదు. దీనులు. పేదవాడు మల్లయ్య దయ తలుస్తాడా? తరిమి కొడతాడు. లేచిన ప్రతి ఆకాశహర్మ్యం నా ప్రమేయం ఏముందని నంగనాచి ముఖం పెట్టొచ్చుగాని అది ఎవడో ఒక పేదవాడిలో మంచిని చంపి రాక్షసత్వం నింపుతుంది. వి. రాజా రామమోహనరావు ‘చలి వ్యాపారం’ కథ ఇది.చలిరాత్రి ఎప్పటికీ అయిపోదు. అది పేదవాళ్లకు తామెంత నగ్నంగా జీవిస్తున్నారో గుర్తు చేయడానికే వస్తుంది. చలికి వణికే కన్నబిడ్డల్ని చూపి బాధ పెట్టడానికే వస్తుంది. మనందరం మధ్యతరగతి వాళ్లమే. ఇంటి పనిమనిషిని అడుగుదామా ‘అమ్మా... నీ ఇంట ఒక గొంగళన్నా ఉందా... పిల్లలకు ఉన్ని వస్త్రమైనా ఉందా?’.... ‘చలికి వ్యక్తి మృతి’ అని వార్త. మనిషి చలికి ఎందుకు చనిపోతాడు? ప్రభుత్వం అతనికి ఇస్తానన్న ఇల్లు ఇవ్వకపోతే, ఇల్లు ఏర్పాటు చేసుకునేంత ఉపాధి చూపకపోతే, నీ దిక్కులేని బతుకును ఇక్కడ వెళ్లదీయమని వింటర్ షెల్టరైనా చూపకపోతే, తన నిర్లక్ష్యాన్ని తోడు చేసుకుని చలి హత్యలు చేయగలదని గ్రహించకపోతే అప్పుడు ఆ వ్యక్తి ‘చలికి చనిపోయిన వ్యక్తి’గా వార్తలో తేలుతాడు. విలియమ్ సారోయాన్ అనే రచయిత రాస్తాడు– చలి నుంచి కాపాడటానికి కనీసం శవాల మీదున్న వస్త్రాలనైనా తీసివ్వండ్రా అని! అతని కథలో ఒక యువకుడు ఆకలికి తాళలేక ఓవర్‌కోట్ అమ్మి చలితో చచ్చిపోతాడు.పగిలిన గాజుపెంకుతో కోసినట్టుగా ఉంటుందట చలి. అదంత తీవ్రంగా ఉండేది మను షుల్లో నిర్దయను పెంచడానికా? కాదు! దయను పదింతలు చేయడానికి! పాతదుప్పట్లో, పిల్లలు వాడక వదిలేసిన స్వెటర్లో, నాలుగు కంబళ్లు కొనేంత డబ్బు లేకపోలేదులే అని కొత్తవి కొనో వాటిని స్కూటర్లో, కారులో పడేసి ఆఫీసు నుంచి వచ్చేప్పుడు ఒక్కరంటే ఒక్కరికి ఇచ్చి వస్తే ఎలా ఉంటుందో ఈ చలికాలంలో చూడొద్దా? ఉబ్బెత్తు బ్రాండెడ్ బొంతలో నిద్రపోయే వేళ మన చేతి ఉన్నివస్త్రంతో ఒక్కరైనా నిద్ర పోతున్నారన్న భావన పొందవద్దా? అదిగో... అర్థమైందిలే... మీరు అందుకేగా లేచారు! -
బాంబు బెదిరింపుల వెనక నాగ్‌పూర్‌కు చెందిన పుస్తక రచయిత..
న్యూఢిల్లీ: బాంబు బెదిరింపులతో యావత్ దేశం హడలిపోతోంది. విమానాలు, హోటళ్లు, విద్యాసంస్థలు.. ఇలా ప్రతిచోటా బాంబులు పెట్టినట్టు ఈమెయిల్, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బెదిరింపుల వరద ముంచెత్తుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపు హెచ్చరికలు ఎక్కువగా వస్తుండటంతో పోలీసు బృందాలు, బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేయడం.. బాంబు లేదని నిర్ధారించడం ప్రహసనంగా మారింది.ఈనేపథ్యంలో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పోలీసులు గుర్తించారు.ఈ బూటకపు బెదిరింపుల వెనక గోండియాకు చెందిన 35 ఏళ్ల వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు తెలిపారు. అయితే నిందితుడు గతంలో ఉగ్రవాదంపై ఓ పుస్తకాన్ని రచించడం గమనార్హం. నిందితుడిని జగదీష్ యూకీగా గుర్తించామని, ఓ కేసులో 2021లో అరెస్ట్ కూడా అయినట్లు నాగ్‌పూర్ సిటీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని. అతడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పారు.జగదీశ్ యూకీ అనే వ్యక్తి ఇ-మెయిల్ ద్వారా పలు ఎయిర్‌లైన్స్‌లకు నకిలీ బాంబు బెదిరింపులు పంపించాడు. దీని కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతోపాటు ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే మంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం కార్యాలయాలతోపాటు పలు ఎయిర్‌లైన్స్ కార్యాలయాలకు, డీజీపీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)తో సహా వివిధ ప్రభుత్వ సంస్థలకు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు డీసీపీ శ్వేతా ఖేద్కర్ వెల్లడించారు. సోమవారం నాగ్‌పూర్ పోలీసులు ముంబైలోని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సైతం బెదిరింపులు రావడంతో ఆయన నివాసం వెలుపల భద్రతను పెంచారు. తాను తెలుసుకున్న రహస్య ఉగ్రవాద కోడ్‌పై సమాచారం ఇచ్చేందుకు అవకాశం ఇవ్వకపోతే నిరసన తెలుపుతానంటూ నిందితుడు బెదిరింపు మెయిల్లో పేర్కొన్నాడు. ఉగ్రవాద బెదిరింపులపై తనకున్న అవగాహన గురించి చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కావాలని కూడా అభ్యర్థించారు. -
ప్రముఖ రచయిత్రి డాక్టర్ విజయభారతి కన్నుమూత
సనత్‌నగర్/సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రచయిత్రి, పద్మభూషణ్ బోయి భీమన్న కుమార్తె, బొజ్జా తారకం సతీమణి, సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా మాతృమూర్తి డాక్టర్ విజయభారతి (83) శనివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆమె, సనత్‌నగర్ రెనోవా నీలిమ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలులో ఆమె జన్మించారు. తెలుగు రచయిత్రిగా సుప్రసిద్ధురాలు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆమె ఎంఏ తెలుగు లిటరేచర్, అనంతరం పీహెచ్డీ చేశారు. తెలుగు సాహిత్యం, చరిత్ర, సామాజిక అంశాలకు సంబంధించి 20కి పైగా పుస్తకాలను రచించారు. ముఖ్యంగా ఆమె మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవిత చరిత్రలను తన పుస్తకాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం అధిపతిగా కూడా వ్యవహరించారు. 2005లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 2015లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేషనల్ అవార్డులు ఆమెకు దక్కాయి. విజయభారతి పారి్థవదేహాన్ని ఆదివారం గాంధీ మెడికల్ కళాశాలకు అందించనున్నారు. ప్రముఖుల సంతాపం: ప్రముఖ రచయిత్రి, ఐఏఎస్ అధికారి బొజ్జా రాహుల్ తల్లి డాక్టర్ విజయభారతి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. విజయభారతి తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలు అందించడంతో పాటు ప్రాచీన సాహిత్య కోశం, ఆధునిక సాహిత్య కోశం వంటి రచనలు వెలువరించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సాహితీరంగానికి ఆమె చేసిన సేవలు అపారమైనవని పేర్కొ న్నారు. రాహుల్ బొజ్జాతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. విజయభారతి మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విజయభారతి మరణంపై సెంటర్ ఫర్ దళిత్ స్టూడెంట్ (సీడీఎస్) చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య, వైస్ చైర్మన్కృష్ణ సంతాపం ప్రకటించారు. -
ఓ గూటికి చేరిన చెదిరిన అక్షరం
‘ఎవరితోనూ కలవలేను, ఎవరికీ చెందిన దానిని కాను అనే భావనతో జీవితమంతా గడి΄ాను’ అంటోంది ‘హోమ్‌లెస్’ రచయిత్రి కె. వైశాలి. అస్తవ్యస్తంగా పలకడం, రాయడం అనే డిస్లెక్సియా, డిస్గ్రాఫియా సమస్యలను అధిగమించి తన అనుభవాలను అక్షర రూపంగా మార్చి పుస్తకంగా తీసుకొచ్చింది. ఈ ఏడాది సాహిత్య అకాడమీ యువ పురస్కార్ (ఇంగ్లిష్) అవార్డును గెలుచుకున్న వైశాలి 22 ఏళ్ల వయసులో ముంబైలోని తన ఇంటి నుంచి బయటకు వచ్చి, హైదరాబాద్‌లో ఎలాంటి వసతులూ లేని హాస్టల్ రూమ్‌లో ఉంటూ తనలో చెలరేగే సంఘర్షణలకు సమాధానాలు వెతుక్కుంది. దేశంలో పెరుగుతున్న డిస్లెక్సియా బాధితులకు ఈ పుస్తకం ఒక జ్ఞాపిక అని చెబుతుంది. తనలాంటి సమస్యలతో బాధపడుతున్నవారిని కలుసుకుని, వారి అభివృద్ధికి కృషి చేస్తోంది.‘సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకోవడం అంటే నేను ప్రతి ఒక్కరికీ సమర్థురాలిగానే కనిపిస్తాను’ అంటూ ‘హోమ్‌లెస్’ పుస్తకం గురించి వైశాలి రాసిన వాక్యాలు మనల్ని ఆలోచింప చేస్తాయి. బయటకు చెప్పుకోవడం చిన్నతనంగా భావించే వ్యక్తిగత సమస్యలపై వైశాలి ఒక పుస్తకం ద్వారా తనను తాను పరిచయం చేసుకుంటుంది. వ్యక్తిగత జీవితం, సమాజం పట్టించుకోని మానసిక వైకల్యాలు ఉన్న పిల్లలకు వసతి కల్పించడంలో విఫలమయ్యే విద్యావ్యవస్థలోని లో΄ాలు, నిబంధనలను ధిక్కరించే వారి పట్ల సమాజం చూపే అసహన ం వంటి అంశాలెన్నింటినో వైశాలి కథనం మనకు పరిచయం చేస్తుంది. ‘‘నా బాల్యంలో డిస్లెక్సియా, డిస్గ్రాఫియాల (అస్తవ్యస్తంగా పలకడం, రాయడం) ప్రభావాన్ని అధిగమించడానికే ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఈ కథను చెప్పడానికి నా బాల్యంలోని అన్ని అంశాలనూ అనేకసార్లు గుర్తుచేసుకున్నాను. పదే పదే పునశ్చరణ చేసుకున్నాను.బాధపెట్టిన బాల్యంనాలో ఉన్న న్యూరో డైవర్షన్స్ నన్ను నిరాశపరచేవి. వాటి వల్ల ఎవరితోనూ కలిసేదాన్ని కాదు. ఎప్పుడూ ఒంటరిగానే ఉండేదానిని. నాలోని రుగ్మతలను ఇంట్లో రహస్యంగా ఉంచేవాళ్లు. నిర్ధారించని రుగ్మతల కారణంగా భయంతో నా రాతలు ఎవరికీ తెలియకుండా దాచేదాన్ని. నాలోని ఆందోళనలను, రుగ్మతలను నేనే పెంచి ఉంటానా? నేను ఇం΄ోస్టర్ సిండ్రోమ్ (తమ ప్రవర్తన, తెలివి తేటలపై తమకే అనుమానాలు ఉండటం)తో బాధపడుతున్నానా?.. ఇలా ఎన్నో సందేహాలు ఉండేవి.అద్దెలేని హాస్టల్ గదిలో..ఇరవై ఏళ్ల వయస్సులో చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం ్ర΄ారంభించాను. నాదైన మార్గం అన్వేషించడానికి మా ఇంటిని వదిలేశాను. అటూ ఇటూ తిరిగి హైదరాబాద్ చేరుకున్నా. నా దగ్గర డబ్బుల్లేవు. మొత్తానికి మురికిగా, ఈగలు దోమలు ఉండే ఓ హాస్టల్లో గది ఇవ్వడానికి ఒప్పుకున్నారు అక్కడి యజమాని. ఆ హాస్టల్ గదికి తలుపులు కూడా సరిగ్గా లేవు. అలాంటి చోట నా అనుభవాల నుంచి ఒక పుస్తకం రాస్తూ, నా పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించాల్సి వచ్చింది. డిస్లెక్సియా బాధితురాలిని, స్వలింగ సంపర్కం, ప్రేమలో పడటం, బాధాకరంగా విడి΄ోవడం, చదువులో ఫెయిల్, అనారోగ్యం, నిరాశ, జీవించడం అంటే ఏంటో అర్థం కాని ఆందోళనల నుంచి నన్ను నేను తెలుసుకుంటూ చేసిన ప్రయాణమే హోమ్‌లెస్ పుస్తకం.కోపగించుకున్నా.. కుటుంబ మద్దతుఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణకు మా అమ్మ హాజరైంది. ఆమె నాకు ఇచ్చిన ఆసరా సామాన్య మైనది కాదు. అయితే, మొదట నా పుస్తకంలోని రాతల వల్ల అమ్మ మనస్తాపం చెందింది. కానీ, నేనెందుకు అలా నా గురించి బయటకు చె΄్పాల్సి వచ్చిందో ఓపికగా వివరించాను. అవార్డు రావడంతో నాపై ఉన్న కోపం ΄ోయింది’’ అని ఆనందంగా వివరిస్తుంది వైశాలి.సమాజంలో మార్పుకుఅనిశ్చితి, దుఃఖం, గజిబిజిగా అనిపించే వైశాలి మనస్తత్వం నుంచి పుట్టుకు వచ్చిన ఈ పుస్తక ప్రయాణం ఒక వింతగా అనిపిస్తుంది. సైమన్, ఘుస్టర్, యోడా ప్రెస్ సంయుక్తంగా వైశాలి పుస్తకాన్ని మన ముందుకు తీసుకువచ్చాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెక్రటరీ ్ర΄÷ఫెసర్ మనీష్ ఆర్ జోషీ రాసిన అభినందన లేఖ వైశాలికి ఎంతో ఓదార్పునిచ్చింది. ‘డిస్లెక్సిక్ వ్యక్తుల గురించిన విధానాలు, చట్టం, మార్గదర్శకాలపై నా పుస్తకం ప్రభావం చూపగలదని ఆశాజనకంగా ఉంది. గదిలో ఒంటరిగా కూర్చుని రాసుకున్న పుస్తకం సమాజంలో మార్పుకు దారితీస్తుందని తెలిసి ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది’ అని చెబుతుంది వైశాలి. తన పుస్తకం తనలాంటి సమస్యలు ఉన్న వారితో ఓ ‘గూడు’ను కనుగొన్నట్టు చెబుతుంది వైశాలి. -
అరుంధతి రాయ్‌పై ఉపా కేసు
న్యూఢిల్లీ: 2010లో రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే అభియోగాలపై అత్యంత కఠినమైన ‘చట్టవిరుద్ధ కార్యాకలాపాల నిరోధక చట్టం (ఉపా)’ కింద రచయిత్రి అరుంధతి రాయ్‌పై విచారణ జరపడానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా శుక్రవారం అనుమతి మంజూరు చేశారు. ఢిల్లీలో 2010 అక్టోబరు 21న ‘ఆజాదీ.. ది ఓన్లీ వే’ పేరిట జరిగిన సదస్సులో అరుంధతి రాయ్, కశీ్మర్ సెంట్రల్ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్‌లు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని అభియోగం. -
అమర్ రచన "మూడు దారులు" పై.. కల్లూరి భాస్కరం సమీక్ష!
సహచర పాత్రికేయ మిత్రుడు దేవులపల్లి అమర్ తన నాలుగున్నర దశాబ్దాల అనుభవసారం రంగరించి రచించిన ‘మూడు దారులు - రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు’ అనే ఈ పుస్తకంలో మొత్తం 15 అధ్యాయాలు ఉన్నాయి. ‘రాజకీయాలు-ఒక సమాలోచన’ అనే అధ్యాయంతో మొదలయ్యే ఈ రచనలో అమర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు-మొదట ఆంధ్రరాష్ట్రాన్ని, ఆ తర్వాత అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ను - ఏకచ్చత్రంగా ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వాల గురించి, కాంగ్రెస్ ముఠాకలహాల గురించి, ఒకరినొకరు పడదోసుకుంటూ సాగించిన రాజకీయక్రీడ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి వివరించి ఈ తొలి అధ్యాయం ద్వారా ఈ పుస్తకానికి ఒక చారిత్రక ప్రతిపత్తిని సంతరించారు. ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయాన్ని ‘చరిత్రను తిరగ తోడటం దేనికి?’ అనే ప్రశ్నతో అమర్ ప్రారంభిస్తారు. ‘చరిత్ర పుటలను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ వర్తమానంలోకి రాలేమా, రావచ్చు కానీ గతాన్ని నిశితంగా పరికించినప్పుడు మాత్రమే వర్తమానాన్ని బేరీజు వేయగలం. అంతేకాదు వర్తమానంలో చోటు చేసుకుంటున్న మార్పులను, జరుగుతున్న సంఘటనలను నిష్పాక్షిక దృష్టితో చూసే వీలు కలుగుతుంది’ అంటూ ప్రారంభంలోనే ఈ పుస్తకంలోని థీమ్‌కి ఒక డెప్త్ తీసుకువచ్చారు, దీనిని చరిత్రగా చూపించారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి ఒకే కాలంలో రాజకీయరంగ ప్రవేశం చేయడం, భిన్నమైన దారుల్లో వెళ్లడం, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి ప్రవేశం ఇవన్నీ ఈ పుస్తకంలో రచయిత చర్చించారు. ఈ విషయాల్లో ఎక్కడా రచయిత బేసిక్ ఫ్యాక్ట్స్‌తో కాంప్రమైజ్ కాలేదు. బేసిక్ ఫ్యాక్ట్స్‌పై, పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలపై ఇంకొంచెం స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నం చేశారు తప్ప ఫ్యాక్ట్స్‌ను డిస్టార్ట్ చేయడం గానీ, కప్పిపుచ్చడం గానీ చేయలేదని ఈ పుస్తకం చదివినప్పుడు నాకు అర్థమైంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ ముగ్గురు నాయకులూ, వారు అనుసరించిన దారుల గురించి ప్రధానంగా చర్చించిన పుస్తకం ఇది. ఈ పుస్తకంలో వైస్రాయి ఘట్టం చదువుతున్నప్పుడు నాకు ఒక సినిమా చూస్తున్నట్టు అనిపించింది. నిజంగా ఒక సినిమాకు సబ్జెక్టు అది. అమర్ ఈ పుస్తకంలో బేసిక్ ఫ్యాక్ట్స్‌తో కాంప్రమైజ్ అవలేదనడానికి ఇంకో ఉదాహరణ ఏం చెబుతానంటే, వైస్రాయ్‌తో ముడిపడిన ఈ మొత్తం ఉదంతంలో ఎన్టీఆర్ స్వయంకృతం కూడా చాలా ఉంది. రాజకీయంగా అనుభవం లేకపోవడం, చెప్పినా వినకపోవడం, మొండితనం వంటివి కూడా దీనికి కొంత దోహదం చేశాయి. ఆ సంగతినీ అమర్ ప్రస్తావించారు. ఆవిధంగా రెండువైపులా ఏం జరిగిందో చిత్రించారు. అలాగే లక్ష్మీపార్వతి జోక్యాన్నీ ఆయన దాచలేదు. ఆ తరువాత మీడియా! ఇందులో ఎన్టీఆర్ వ్యక్తిగత వ్యవహార శైలి, అల్లుళ్లతో సహా ఆయన కుటుంబ సభ్యుల పాత్ర, ఆయన అర్ధాంగి పాత్ర.. వీటన్నిటితో పాటు మీడియా కూడా ప్రధాన పాత్రధారి. ఎన్టీఆర్ అధికారచ్యుతికి సంబంధించిన మొత్తం ఉదంతంలో మీడియా పాత్ర గురించి, మీడియా వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా ఒక పుస్తకం రావాలని! ప్రీ-తెలుగుదేశం, పోస్ట్-తెలుగుదేశం అనే డివిజన్‌తో తెలుగు మీడియా చరిత్ర రాయాలని నేనంటాను. నాదెండ్ల భాస్కరరావు చేసిన దానికి చంద్రబాబు చేసినది ఒకవిధంగా పొడిగింపే. మొత్తం మీద అమర్ ఈ పుస్తకంలో పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలనే అందించారు. ప్రత్యక్షసాక్షిగా తన దృక్కోణాన్ని కలుపుకుంటూ వాటిని కథనం చేశారు. చివరిగా జగన్ మోహన్ రెడ్డిగారి విషయానికి వచ్చేసరికి ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహార శైలి, ఆయన ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాలు, ఇతరత్రా చర్యలు, విధానాల గురించి చెప్పారు. ఈ అధ్యాయంలో కూడా అమర్ ఫ్యాక్ట్స్‌తో రాజీపడలేదనే విశ్వసిస్తున్నాను. (ఫిబ్రవరి ఒకటవ తేదీన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో దేవులపల్లి అమర్ రాసిన మూడు దారులు పుస్తక పరిచయ సభలో పాత్రికేయ ప్రముఖులు, రచయిత కల్లూరి భాస్కరం చేసిన సమీక్ష నుంచి ముఖ్య భాగాలు). ఇవి చదవండి: Lok Sabha polls 2024: సోషల్ మీడియా... నయా యుద్ధరంగం -
పరమ కంగాళీ కథానాయకుడు
ఒక దేశానికి హైకమిషనర్‌గా, విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి నుంచి తన వృత్తిపరమైన అనుభవాల రచనలను ఆశిస్తాం. కానీ కృష్ణన్ శ్రీనివాసన్ ఈ సంప్రదాయానికి పూర్తి భిన్నంగా డిటెక్టివ్ రచయితగా అవతరించారు. అయితే ఒకటి, ఆ రచనల్లోనూ ఆ యా పాత్రలు ఆ వృత్తి తాలూకు జీవితాన్ని ప్రతిఫలిస్తాయి. ఒక్కోసారి అవి రచయిత వ్యక్తిత్వానికి పూర్తి భిన్నంగా కూడా కనిపించవచ్చు. క్రిస్ రచనల్లోని అపరాధ పరిశోధకుడు పదవీ విరమణ పొందిన సోమాలియా రాయబారి. పేరు మైఖేల్ మార్కో. మనకు తెలిసిన హీరో ఎలా ఉంటాడో అలా ఉండడు. తెర వెనుక ఉండి కథ నడిపిస్తాడు. అధికారాలు ఉండవు. కానీ అనధికార యుక్తి సామర్థ్యాలతో నేర రహస్యాలను ఛేదిస్తుంటాడు. అతడు తొడుక్కునే సూట్లు నలిగి ఉంటాయి. అతడి ‘టై’లు నిటారుగా ఉండవు. షూ లేసులు వదులుగా కట్టి ఉంటాయి. క్రిస్ అతడిని ‘రెట్రో–కేయాటిక్’ (పాతకాలపు పరమ కంగాళీ) అంటాడు. మాజీ విదేశాంగ కార్యదర్శుల నుంచి మీరు ఇలాంటి రచనలను ఊహించనే లేరు. ఒక పుస్తకం ఆ పుస్తక రచయిత వ్యక్తిత్వాన్ని ఎంత వరకు వెల్లడిస్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా? బహుశా ఆ రచయిత గురించి ముందే మీకు తెలిసి ఉంటే తప్ప మీరెప్పటికీ ఆ వైపుగా ఆలోచించరు. ఒకవేళ అలా ఆలోచిస్తే కనుక ఆ వచ్చే ఫలితం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయగలిగినదై ఉంటుంది. కృష్ణన్ శ్రీనివాసన్ విషయంలో సరిగ్గా ఇలాగే జరుగుతుంది. క్రిస్, అదే... కృష్ణన్ శ్రీనివాసన్... నలభై ఏళ్లుగా నాకు మిత్రుడు. మొదట లాగోస్‌లో మేము కలుసుకున్నాం. అప్పుడాయన హై కమిషనర్. నేను లండన్ పత్రిక ‘ది టైమ్స్’కు కరస్పాండెంట్. ఆయన విదేశాంగ కార్యదర్శిగా ఎదిగాక మా స్నేహం కూడా వికసించి విప్పారింది. రాయటం అనేది క్రిస్‌కి సంతోషం కలిగించే సంగతని నాకు తెలుసు కానీ, అపరాధ పరిశోధన రచనల్లో ఆయన ఆరితేరినవారని నాకెన్నడూ అనిపించలేదు. పదవీ విరమణ అనంతరం క్రిస్ ఏడు పుస్తకాలు రాశారు. మాజీ విదేశాంగ కార్యదర్శుల నుంచి మీరు ఇలాంటివి ఊహించనే లేరు. లేక, నేనేమైనా పొరపడ్డానా?క్రిస్ రచనల్లోని అపరాధ పరిశోధకుడు పదవీ విరమణ పొందిన సోమాలియా రాయబారి. పేరు మైఖేల్ మార్కో. మనకు తెలిసిన హీరో ఎలా ఉంటాడో అలా ఉండడు అతడు. తెర వెనుక ఉండి కథ నడిపిస్తాడు. అధికారాలు ఉండవు. కానీ అనధికార యుక్తి సామర్థ్యాలతో నేర రహస్యాలను ఛేదిస్తుంటాడు. అతడు తొడుక్కునే సూట్లు నలిగి ఉంటాయి. అతడి ‘టై’లు నిటారుగా ఉండవు. షూ లేసులు వదులుగా కట్టి ఉంటాయి. క్రిస్ అతడిని ‘రెట్రో–కేయాటిక్’ (పాతకాలపు పరమ కంగాళీ) అంటాడు. అంతేకాదు, క్రిస్ చెబుతున్న దానిని బట్టి... అతడి దుస్తులను అంధుడైన ఒక టైలర్ వాడుకగా కుడుతుంటాడు. మాక్రో... జేమ్స్ బాండేమీ కాదు. అందమైన స్త్రీల కోసం అతడు కానీ, అతడి కోసం ఆ అందమైన స్త్రీలు కానీ పరుగులు పెట్టటం ఉండదు. అతడు అలవాటుగా సేవించే మద్యం టమాటా రసం. ‘మార్టినీ’ని ఏం చేసుకోవాలో అతడికి తెలియదు. అయితే ‘‘అతడి నిశిత దృష్టికి సంబంధించి పైపైన కనిపించేదంతా మనల్ని పక్కదారి పట్టించేదే’’. అతడు ప్రతీదీ చూస్తాడు, అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే ముగింపులకు వచ్చేస్తాడు. అతడిని ఊహించుకుంటే నాకు అగాథా క్రిస్టీ అపరాధ పరిశోధక నవలల్లోని మిస్ మాపుల్ అనే కల్పిత పాత్ర స్ఫురించింది. మార్కో వంటి ఒక వ్యక్తిని క్రిస్ ఆరాధిస్తాడని నేనెప్పుడూ ఊహించలేదు. అతడి పట్ల గొప్ప ఇష్టంతో అతడి గురించి రాస్తాడని కూడా అనుకోను. క్రిస్ స్నేహితులుగా నేను ఎరిగిన వారంతా మార్కో తరహాకు పూర్తిగా భిన్నమైనవారు. నిజా నికి క్రిస్ కూడా అలాంటì వ్యక్తిని వ్యతిరే కిస్తాడు. నేను కనుగొన్న మరొక సంగతి... క్రిస్ చూపు మిక్కిలి లోతైనదని. వస్త్రధార ణను బట్టి ఎలాంటి వారో చెప్పగల నైపుణ్యం ఆయనకు ఉంది. ఆయన తాజా పుస్తకం ‘రైట్ యాంగిల్ టు లైఫ్’ లోని ఒక పురుష పాత్ర వర్ణన ఎలా ఉందో చూడండి: ‘‘రెండు రోజులుగా గడ్డం గీయని ఆకర్షణీయమైన ముఖం, పదునైన చెంప ఎముకలు, లేత గోధుమ రంగు కళ్లు, నుదుటిపై పడుతున్న దట్టమైన ముంగురులు, టమాటా రంగు ఓపెన్ నెక్ డ్రెస్ మీదకు తటస్థ వర్ణంలోని పియాహ్ కార్డాన్ లినన్ జాకెట్, చర్మానికి అంటుకుపోయే చినోస్ ప్యాంట్స్, సాక్సు వేయని స్వేడ్ లోఫర్స్ పాదరక్షలు... ఒక్క మాటలో ఒక మేల్ మోడల్ టైప్’’అంటూ... మనిషిని సాక్షాత్కరింపజేసిన ట్లే రాస్తాడు క్రిస్. స్త్రీ పాత్రలను క్రిస్ మరింత మెరుగ్గా వర్ణిస్తాడు. తాజా పుస్తకంలో... తన కథ చెప్పుకుంటూ పోయే వ్యాఖ్యాన పాత్ర కోయెల్ దేవ్... తనను తాను దృశ్యమానం చేసుకుంటూ: ‘‘ఒక చక్కటి సాధారణ వస్త్రధారణలోకి నేను మారిపోయాను. హారీమ్ ప్యాంట్స్ మీదకు పొడవాటి చేతుల వి–నెక్ సిల్కు బ్లవుజ్, దాని పైన డెనిమ్ జాకెట్ తొడుక్కుని, సెయింట్ వాలెంటైన్ లెదర్ షూజ్ ధరించాను. నా ముత్యాల చెవి దుద్దులు తీసి పెట్టుకున్నాను. బెల్లా వీటా స్ప్రేను మెడపైన, చెవుల వెనకాల చిమ్మినట్లుగా చల్లుకున్నాను. క్లినిక్ ప్లమ్ లిప్‌స్టిక్‌తో నా పెదవులను అద్దుకున్నాను’’ అని చెప్పుకుంటూ పోతారామె. క్రిస్ తనకు అప్పగించిన రాయబార విధుల్ని ఏ విధంగా పూర్తి చేసిందీ రాసి పంపేటప్పుడు కూడా ఇదే విధమైన వివరణాత్మకతను పాటించేవారా అని నేనిప్పుడు ఆశ్చర్యానికి లోనవుతున్నాను. తను సంభాషించిన వారిని ఇంత సూక్ష్మంగానే వర్ణించి ఉంటారా? ఆయన విదేశాంగ కార్యదర్శిగా ఉన్నప్పుడు మీరు ఆయన ఎదురుగా కూర్చొని ఉండగా మిమ్మల్ని కూడా ఇంతే నిశితంగా అంచనా వేయడాన్ని మీరు పసిగట్టారా? ఏమైనా ఇది కేవలం తేరిపార చూడటం మాత్రమే కాదు. సరిగ్గా అంచనా వేయటం కూడా! ఒక మూసలో కాక, వ్యక్తులకు వేర్వేరుగా ఉండే ప్రత్యేక సూక్ష్మాంశాలను కొద్దిమంది రచయితలు మాత్రమే వడకట్టగలరు. చాలామంది లేస్–అప్స్(లేసులు పైకి కనబడేట్టుగా ఉండే షూలు)కు, మాకసిన్స్(లేసులు ఉండని షూలు)కు వ్యత్యాసాన్ని గుర్తించగలరు. కానీ ఎంతమందికి ఆక్స్‌ఫోర్డ్ షూజ్కి, బ్రోగ్స్ షూజ్కి తేడా తెలిసుంటుంది? నేనేం చెబుతున్నదీ మీకు అర్థం కావడం మొదలైందా? క్రిస్ తాజా రచనలోని కాల్పనికత ఆయన వ్యక్తిత్వంలోని ఒక కోణాన్ని బహిర్గతం చేసింది. అది – మీరాయన్ని కేవలం రాయబారిగా, లేక సాయంత్రపు పార్టీలను ఇష్టపడే విలాస పురుషుడిగా మాత్రమే చూస్తుంటే కనుక మీరెప్పటికీ తెలుసుకోలేనిది! ఒక కాక్టైల్ పార్టీని ఆయన వర్ణించిన తీరు అలాంటి పార్టీల పట్ల ఆయన ఎంతగా జాగ్రత్తగా ఉంటారో సూచనప్రాయంగా తెలియ జేస్తుంది. ఇది గమనించండి: ‘‘అతిథులు మెల్లగా దగ్గరయ్యారు. తెచ్చి పెట్టుకున్న హృదయపూర్వకతల్లో కలిసిపోయారు. ప్రతి ఒక్కరూ తిరగడమే పనిగా తిరుగుతున్నారు. మళ్లీ మళ్లీ వాళ్లే వాళ్లే నిర్లక్ష్యంగా కలిపిన చేతుల్లోంచి జారి పడుతున్న పేకముక్కల్లా ఉన్నారు. పానీయాలు, నోటితో కొరికి తినగలిగినంత పరిణామంలోని నంజుళ్లు ఉన్న ట్రేలను మౌనంగా అందిస్తున్న వెయిటర్లు, వారి వెనుక – అయో మయ విశదీకరణలు, అస్పష్ట ఉపోద్ఘాతాలు, అర్థరహితంగా చెప్పిందే చెప్పడాలు, నిర్జీవ కరచాలనాలు, జవాబులే లేని వాకబులు, ఉత్సాహ పూరిత వాతావరణ ప్రస్తావనలు, హఠాన్మౌనాలు, చిత్తశుద్ధి లేని కుశల ప్రశ్నలు...’’ నిజంగానే నేను క్రిస్‌కి పార్టీలంటే ఇష్టం అనుకున్నాను. ఎంత పొరపడ్డాను! కానీ నేను చెప్పినట్లుగా – ఒక మనిషిలో మొదట మీరు అర్థం చేసుకున్న దాని కంటే చాలా ఎక్కువే ఉందని తెలుసుకోడానికి మీరు ఆ మనిషి రాసిన పుస్తకం చదవాలి. సమస్యేమిటంటే ఈసారి క్రిస్ ఎదురైనప్పుడు నేనేమి ధరించాలో నాకు తెలీదు. అలాగే నేనేం చెప్పాలన్నది కూడా! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
International Womens Day 2024: రాజ్యసభకు సుధామూర్తి
సాక్షి, న్యూఢిల్లీ/బనశంకరి: ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ సంఘ సేవకురాలు, రచయిత్రి డాక్టర్ సుధా నారాయణమూర్తి(73) రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమెను పార్లమెంట్ ఎగువ సభకు నామినేట్ చేశారు. సామాజిక, విద్యా రంగాల్లో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పెద్దల సభకు పంపిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే రాజ్యసభకు నామినేట్ చేయడం తనకు డబుల్ సర్ప్రైజ్ అని సుధామూర్తి పేర్కొన్నారు. తాను ఏనాడూ పదవులు ఆశించలేదని చెప్పారు. రాష్ట్రపతి తనను పెద్దల సభకు నామినేట్ చేయడానికి గల కారణం తెలియదని అన్నారు. ఉన్నత చట్టసభకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ఇది తనకు కొత్త బాధ్యత అని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యురాలిగా తన వంతు సేవలు అందిస్తానని వివరించారు. ప్రధాని మోదీకి సుధామూర్తి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో పర్యటిస్తున్న సుధామూర్తి ఫోన్లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ హర్షం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సుధామూర్తిని రాష్ట్రపతిద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేయడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అనాథ ఆశ్రమాలు ఏర్పాటు చేయడంతోపాటు వివిధ రంగాల్లో ఎన్నెన్నో సేవలు అందించిన సుధామూర్తి చట్టసభలోకి అడుగు పెడుతుండడం నారీశక్తికి నిదర్శనమని మోదీ ఉద్ఘాటించారు. ఆమెకు అభినందనలు తెలియజేశారు. టెల్కోలో తొలి మహిళా ఇంజనీర్ డాక్టర్ సుధామూర్తి 1950 ఆగస్టు 19న కర్ణాటకలోని హావేరి జిల్లా శిగ్గావిలో జని్మంచారు. ఆమె తల్లిదండ్రులు డాక్టర్ ఆర్‌హెచ్ కులకరి్ణ, విమలా కులకరి్ణ. సుధామూర్తి హుబ్లీలోని బీవీబీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి కంప్యూటర్స్‌లో ఎంఈ చేశారు. టాటా ఇంజినీరింగ్ లోకోమోటివ్ కంపెనీ(టెల్కో)లో ఉద్యోగంలో చేరారు. దేశంలోనే అతి పెద్దవాహన తయారీ కంపెనీలో మొదటి మహిళా ఇంజినీర్‌గా గుర్తింపు పొందారు. 1970 ఫిబ్రవరి 10న నారాయణమూర్తితో వివాహం జరిగింది. 1981లో స్థాపించిన ఇన్ఫోసిస్ కంపెనీకి సుధామూర్తి సహ వ్యవస్థాపకురాలు. సంస్థ ప్రారంభించే సమయంలో రూ.10వేలు తన భర్తకు ఇచ్చి ప్రోత్సహించారు. సేవా కార్యక్రమాలు.. పురస్కారాలు 1996లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ను సుధామూర్తి ప్రారంభించారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో పలు పుస్తకాలు రాశారు. సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వరద బాధితుల కోసం 2,300 ఇళ్లు నిర్మించారు. పాఠశాలల్లో 70 వేల గ్రంథాల యాలు నిర్మించారు. భారత ప్రభుత్వం నుంచి 2006లో పద్మశ్రీ,, 2023లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి చింతామణి అత్తిమబ్బే అవార్డు స్వీకరించారు. సాహిత్యంలో ఆమె చేసిన సేవకుగానూ ఆర్కే నారాయణ సాహిత్య పురస్కారం, శ్రీరా జా–లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు అందుకున్నారు. భర్త నారాయణమూర్తి (2014)తో సమానంగా 2023లో గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు ద్వారా తాను అందుకున్న మొత్తాన్ని టోరంటో విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇచ్చారు. నాన్ఫిక్షన్ విభాగంలో క్రాస్‌వర్డ్ బుక్ అ వార్డు, ఐఐటీ–కాన్పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులకు అక్షతామూర్తి, రోహన్‌మూర్తి సంతానం. అక్షతామూర్తి భర్త రిషి సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రి. వీరిది ప్రేమ వివాహం. రాజ్య సుధ – ప్రత్యేక కథనం ఫ్యామిలీలో.. -
సమాజాన్ని అద్దంలో చూపించాను
‘దేర్ ఐ వజ్, మీడియా మ్యూజింగ్స్’ పేరుతో తన జర్నలిస్ట్ జీవితాన్ని పాఠకుల ముందు ఆవిష్కరించారు అరుణా రవికుమార్. ముప్ఫై ఎనిమిదేళ్ల కిందట ‘అరుణా అశోకవర్ధన్’ పేరుతో తొలిసారి బైలైన్ చూసుకోవడం నుంచి నేటి వరకు సాగిన అక్షరయానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘నేను మీడియా రంగంలోకి రావడమే ఒక ఆశ్చర్యం. నా చదువు ఇంగ్లిష్ మీడియంలో, గ్రాడ్యుయేషన్ సైన్స్‌లో సాగింది. అమ్మ రచయిత కావడంతో తెలుగు సాహిత్యం మీద అభిరుచి మెండుగా ఉండేది. నా లక్ష్యం సివిల్స్. ప్రిలిమ్స్ క్లియర్ అయింది. మెయిన్స్ పరీక్షల నాటికి తాతగారు పోవడంతో రాయలేకపోయాను. ఆ తర్వాత అనుకోకుండా ఓ ఇంగ్లిష్ పత్రికలో జర్నలిస్టుగా చేరాను. నా తొలి రిపోర్టింగ్ జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్ రిపోర్ట్ మీద. బై లైన్‌తో వచ్చింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లు, ప్రపంచ విజేతనైన భావన. అలా మొదలైన నా జర్నీ ఎలక్ట్రానిక్ మీడియాకు మారింది. తెలుగులో ప్రైవేట్ టీవీ రంగంలో రిపోర్టర్ బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళను. పెళ్లి చేసుకున్న తర్వాత విజయవాడకు బదిలీ కావడం కూడా చాలా కీలకమైన అనుభవాన్నిచ్చింది. అది 1988, మార్చి నెల పదవ తేదీ. విజయవాడ వెళ్లిన తొలి రోజు, దేవినేని మురళి హత్య. సూపర్ మార్కెట్లో ఉన్నాను. ఓ కుర్రాడు పరుగున లోపలికి వచ్చి షట్టర్ వేసేశాడు. భయం కలిగినప్పటికీ నిబ్బరంగా ఉండిపోయాను. ఓ అరగంట తర్వాత షట్టర్ తీశారు. రోడ్డు మీదకు వస్తే... అంతకు ముందు ఏమీ జరగనట్లు తుపాను తర్వాత ప్రశాంతతలా ఉంది వాతావరణం. జర్నలిస్టుగా కొత్త ప్రపంచాన్ని చూశాను. చీరాలలో చేనేతకారుల ఆకలి చావులను రిపోర్ట్ చేయగలిగాను. సమాజంలో వేళ్లూనికొని ఉన్న ఆవేదనలు, ఆందోళనలకు అద్దం పట్టాను. ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టు సాంబశివుడి ఇంటర్వ్యూ చేశాను. ఎలిమినేటి మాధవరెడ్డి గారి హత్యకు కొద్దిగా ముందు ఆయనతోపాటు వారి వాహనంలోనే ప్రయాణించాను. అప్పటికే రెక్కీ నిర్వహించి హత్యకు ప్రణాళిక సిద్ధంగా ఉందని ఆ తర్వాత నాకు తెలిసింది. బళ్లారిలో ఎన్నికలను కవర్ చేశాను. భ్రూణహత్యల మీద పరిశోధనాత్మక కథనాలకు యూనిసెఫ్ అవార్డు వచ్చింది. స్టూడియో లో ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల ఇంటర్వ్యూలు ఎన్ని చేసినప్పటికీ క్షేత్రస్థాయి పరిశీలనా కథనాలు ఎక్కువ సంతోషాన్నిస్తాయి. ఫ్లోరోసిస్ బాధితుల కథనాలకు స్పందనగా ప్రభుత్వాలు నీటి సౌకర్యాన్ని కల్పించడం రిపోర్టర్‌గా నాకు అత్యంత సంతోషాన్నిచ్చిన సందర్భం. లంబాడా తండాల్లో ఆడపిల్లలను పుట్టగానే చంపేయడం, కుటుంబాన్ని పోషించడానికి ఓ మహిళ మూడుసార్లు సరోగసీ ద్వారా బిడ్డను కని అనారోగ్యం పాలు కావడం వంటి కథనాలెన్నింటికో నేను అక్షరసాక్షిని కావడం ద్వారా నాకు ఈ రంగం ఎంతో సంతృప్తినిచ్చింది. మా వారి బదిలీల రీత్యా, పిల్లలు పుట్టినప్పుడు, వాళ్ల చదువులు కీలక దశల్లో ఉన్నప్పుడు కెరీర్లో విరామాలు తీసుకుంటూ నా వృత్తిని కొనసాగిస్తున్నాను. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద ‘మరాడర్స్ ఆఫ్ హోప్’ నా తొలి రచన. ‘దేర్ ఐ వజ్, మీడియా మ్యూజింగ్స్’ నా రెండవ రచన. ఇండిపెండెంట్ జర్నలిస్టుగా హైదరాబాద్‌లో ప్రశాంతంగా జీవిస్తున్నాను. ఇప్పటికీ రోజూ చదువుతాను, రాస్తుంటాను. మహిళ ఎన్ని సాధించినప్పటికీ సమాజంలో సమానత్వం మాత్రం పూర్తిస్థాయిలో రాలేదనే చెప్పాలి. అయితే నా చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పట్లో సమాజంలో స్త్రీ–పురుషుల మధ్య అసమానత్వం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అంత తీవ్రంగా లేదు. కానీ సమానత్వం మాత్రం ఇంకా రాలేదు’’ అంటూ తన అక్షరయానం గురించి వివరించారు అరుణ. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫొటో: అనిల్‌కుమార్ మోర్ల -
కథల అమ్మమ్మ
నాగరకత ముసుగులో... ఆదివాసీలకు ఆధునిక సమాజం పెట్టే పరీక్షలు... అడవి బిడ్డల చుట్టూ ఊహకందని ప్రమాదాలు... పల్లెపదాలు... జానపదజావళులకు... ఆమె అక్షరమైంది. అలాగే... అమెరికా ప్రకృతి అందాలు... మనవాళ్ల ప్రగతి సుగంధాలు కూడ. ఆరుపదులు దాటిన ఆమెలోని రచయిత్రి...ఇప్పుడు... పిల్లలకు కథల అమ్మమ్మ అవుతోంది. విజయనగరం జిల్లా... స్వచ్ఛతకు, అమాయకత్వానికి నిలయం. అణచివేత, దోపిడీలను ప్రశ్నించే గళాలను పుట్టించిన నేల. ఇంటి గడపలే సప్తస్వరాలుగా సరిగమలు పలికే గుమ్మాలు ఒకవైపు. అరాచకాన్ని ఎదిరిస్తూ గళమెత్తిన స్వరాలు మరొకవైపు... పడుగుపేకల్లా అల్లుకుని సాగిన జీవన వైవిధ్యానికి ప్రత్యక్ష సాక్షి కోరుపోలు కళావతి. నాటి అమానవీయ సంఘటనలకు సజీవ సాక్ష్యాలు ఆమె రచనలు. చదివింది పదవ తరగతే. కానీ ‘వాస్తవాలను కళ్లకు కట్టడానికి గొప్ప పాండిత్యం అవసరం లేదు, అన్యాయానికి అక్షరరూపం ఇవ్వగలిగితే చాలు. వాస్తవ జీవితాలు చెప్పే నీతి సూత్రం కంటే పాండిత్యం చెప్పగలిగిన న్యాయసూత్రం పెద్దదేమీ కాద’ని నిరూపిస్తోందామె. ఇటీవల ‘మన్యంలో మధురకోయిల’ రచనను ఆవిష్కరించిన సందర్భంగా ఆమె సాక్షితో పంచుకున్న అక్షర జ్ఞాపకాలివి. ‘‘మాది విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామం. మా నాన్న పెదపెంకి కూర్మినాయుడు కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా ఉండేవారు. వంగపండు ప్రసాదరావుగారితో కలిసి ప్రజాచైతన్యం కోసం పనిచేశారు. నేను చదివింది పదవ తరగతి వరకే. కానీ రాయాలనే దాహం తీరనంతగా ఉండేది. యద్దనపూడి సులోచనారాణి పెద్ద చదువులు చదవకపోయినా లెక్కలేనన్ని నవలలు రాశారని తెలిసి నాలో ఉత్సాహం ఉరకలు వేసింది. ఆమె స్ఫూర్తితోనే రచనలు మొదలుపెట్టాను. మా వారు టాటా స్టీల్‌లో అధికారి కావడంతో పెళ్లి తర్వాత మేము పాతికేళ్లపాటు ‘కడ్మా’లో నివసించాం. కడ్మా అనేది జార్ఖండ్‌లో జెమ్షెడ్పూర్ నగరానికి సమీపంలో, టాటా స్టీల్ కంపెనీ ఉద్యోగులు నివసించేప్రాంతం. అక్కడ అన్నిప్రాంతాలు, రకరకాల భాషల వాళ్లతో కలిసి జీవించడం నాకు మంచి అనుభవం. పిల్లలు పెద్దయ్యే వరకు ఇంటి బాధ్యతలే ప్రధానంగా గడిచిపోయింది నా జీవితం. కడ్మాలో ఉన్న తెలుగు అసోసియేషన్ ఉగాది సంచిక కోసం వ్యాసాలు సేకరించడం, రాయడంతో సంతోషపడేదాన్ని. పదిహేనేళ్ల కిందట యూఎస్‌లో ఉన్న మా అమ్మాయి దగ్గర కొంతకాలం ఉన్నాను. ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడి ప్రకృతి, మనవాళ్లు సాధిస్తున్న ప్రగతిని ‘అమెరికా అందాలు గంధాలు’ పేరుతో నవల రాశాను. అదే తొలి నవల. నేను రాయగలననే నమ్మకం వచ్చిన రచన కూడా. ఆ తర్వాత మా జిల్లా సంగీత కౌశలాన్ని వివరిస్తూ ‘భారత్‌లో భాసిల్లిన విద్యల నగర సౌధము’ రాశాను. మా గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు జీవితాన్ని చిన్న పదాలతో అల్లేసి, రాగయుక్తంగా పాడుతారు. ఆ వైనాన్ని ‘జానపద జావళి’ పేరుతో రాశాను. ఆదివాసీల స్వచ్ఛతకు అద్దం పట్టే ‘గడ్డిగులాబీలు’, ప్రతిమ, చిగురించే ఆశలు, వసివాడిన వసంతం, అవనిలో ఆంధ్రావని, జీవన స్రవంతి... ఇలా రాస్తూ ఉన్నాను, రాయడంలో ఉన్న సంతోషాన్ని ఇనుమడింప చేసుకుంటున్నాను. ‘మన్యంలో మధురకోయిల’ సుమారు యాభై ఏళ్ల కిందట ఆత్మహత్యకు పాల్పడిన మన్యం బాలికల యదార్థగాధ. అంతకుమునుపు రాసిన ‘ప్రతిమ’ అరకు చుట్టూ సాగింది. ఒక ఫొటోగ్రాఫర్ అరకు ప్రకృతి సౌందర్యాన్ని, అడవిబిడ్డ అచ్చమైన స్వచ్ఛతను ఫొటో తీయడానికి తరచూ వస్తుండేవాడు. ఒక గిరిజన అమ్మాయిని ఫొటోలు తీసి, పోటీకి పంపించి అవార్డు తెచ్చుకుంటాడు కూడా. ఫొటోల పేరుతో మళ్లీ అరకు బాట పట్టిన ఆ ఫొటోగ్రాఫర్ అవకాశవాదం నుంచి తమ అడవి బిడ్డను కాపాడుకోవడానికి గిరిజనులు పెట్టిన ఆంక్షలకు కథారూపమిచ్చాను. ఆలయాలు సరే... ఆశ్రమాలూ కట్టండి! నన్ను నేను వ్యక్తం చేసుకునే అవకాశాన్నిచ్చింది అక్షరమే. కథ అంటే ఊహల్లో నుంచి రూపుదిద్దుకోవాలని అనడం కూడా విన్నాను. కానీ నా కథాంశాలన్నీ వాస్తవాలే. అమెరికాలో మనవాళ్లు... మన సంస్కృతికి ఆనవాళ్లుగా పెద్ద పెద్ద ఆలయాలను నిర్మిస్తుంటారు. భాషల పరంగా సంఘాలు ఏర్పాటు చేసుకుని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. కానీ భారతీయుల కోసం ఒక్క వృద్ధాశ్రమాన్నయినా కట్టారా? వార్ధక్యంలో ఉన్న తల్లిదండ్రులను ఇంగ్లిష్ వాళ్లు ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమంలోనే చేరుస్తారు. అక్కడ మనవాళ్లకు భాష తెలియక పోవడంతో మాట రాని మూగవాళ్లుగా జీవిస్తుంటారు. అదే మన భారతీయులే వృద్ధాశ్రమాలను నిర్మించి నిర్వహిస్తే... రిటైర్ అయిన తల్లిదండ్రులు మన ఆహారం తింటూ, మన భాష వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ అక్కడ సేదదీరుతారు కదా! అలాగే పండుగలు, సెలవులప్పుడు వీలు చూసుకుని కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్లు వెళ్లి కలవడానికి వీలవుతుంది. నాకు కలిగిన ఈ ఆలోచననే ఆ రచనలో చెప్పాను. నా అక్షరాలకు చిత్ర రూపం! నా రచనలకు ముఖచిత్రం నా మనుమరాలు హర్షిత వేస్తుంది. తను సెవెన్త్ క్లాస్, ఇంగ్లిష్‌లో చిన్న చిన్న కథలు సొంతంగా రాస్తుంది. యూఎస్‌లో ఉన్న పెద్ద మనుమరాలు నందిని నా తొలి నవలను ఇంగ్లిష్‌లో ట్రాన్స్‌లేట్ చేస్తానని తీసుకువెళ్లింది. నా ఇద్దరబ్బాయిలూ విజయనగరంలో ఇంజనీర్లే. నేను, మా వారు వాళ్ల దగ్గర శేషజీవితాన్ని గడుపుతున్నాం. నా రచనల్లో కర్పూరకళిక, వలస వచ్చిన వసంతం, వాడినపూలే వికసించునులే, కలలగూడు’ వంటి వాటికి పుస్తకరూపం ఇవ్వాలి. పిల్లలకు కథలు చెప్పే నానమ్మలు, అమ్మమ్మలు కరవైన ఈ రోజుల్లో ‘బాలానందం’ పేరుతో పిల్లల కథల పుస్తకం రాశాను. అది ముద్రణ దశలో ఉంది. అక్షరంతో స్నేహం... నాకు జీవితంలో ఎదురైన ఎన్నో సమస్యలను ఎదుర్కోగలిగిన మనోధైర్యాన్నిచ్చింది. నా ఈ స్నేహిత ఎప్పటికీ నాతోనే ఉంటుంది’’ అన్నారు కళావతి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: కంది గౌరీ శంకర్, సాక్షి, విజయనగరం తొలివాక్యం ఆత్మవిశ్వాసాన్నిచ్చింది! నేను రాసిన తొలివాక్యం ‘కొట్టు కొనమంటుంది– పోట్ట తినమంటుంది’. ఈ వాక్యానికి ఐదు రూపాయల పారితోషికం అందుకున్నాను. ఆ ఐదు రూపాయలను ఖర్చు చేయకుండా చాలా ఏళ్లు దాచుకున్నాను. అప్పుడు నేను ఐదవ తరగతి. చందమామ పత్రికలో ఫొటో ఇచ్చి ఒక వాక్యంలో వ్యాఖ్యానం రాయమనేవారు. మా పెద్దన్నయ్య భాస్కరరావు పుస్తకం తెచ్చిచ్చి క్యాప్షన్ రాయమన్నాడు. ‘ఒక చిన్న కుర్రాడు ఆకలితో పచారీ కొట్టు ముందు బేలగా నిలబడి వేలాడదీసిన అరటి గెల వైపు చేయి చూపిస్తూ ఉన్నాడు. కొట్టతడేమో డబ్బిస్తేనే ఇస్తానంటూ కసురుకుంటున్నాడు’ ఇదీ అందులో విషయం. ఆ తొలివాక్యమే కవయిత్రి కావాలనే కలకు కారణం అయింది. నేను చూసిన సంఘటనలు, నా గమనింపునకు వచ్చిన అంశాలు కొత్త రచనకు ఇంధనాలయి తీరుతాయి. అలా ఒక వాక్యంతో మొదలైన నా అక్షరవాహిని జీవనదిలా సాగుతోంది. – కోరుపోలు కళావతి,రైటర్ -
US Court: ఆమెకు రూ.692 కోట్లు చెల్లించండి
న్యూయార్క్: పాత్రికేయురాలు, రచయిత్రి ఇ.జీన్ కరోల్‌కు పరువు నష్టం కలిగించినందుకు జరిమానాగా ఆమెకు దాదాపు రూ.692 కోట్లు(8.33 కోట్ల డాలర్లు) చెల్లించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అమెరికా కోర్టు శనివారం ఆదేశించింది. 1996లో మాన్హాటన్లోని బెర్గ్‌డోర్ఫ్ గుడ్‌మ్యాన్ అవెన్యూ షాపింగ్‌మాల్ ట్రయల్రూమ్లో ట్రంప్ తనను రేప్ చేశారంటూ కరోల్ కేసు వేసింది. లైంగికదాడి జరిగిందని నిర్ధారించిన కోర్టు, ఆమెకు 41.56 కోట్లు చెల్లించాలంటూ 2023 మే లో ట్రంప్‌ను ఆదేశించింది. తనపై లైంగికదాడి వివరాలను న్యూయార్క్ మేగజైన్ వ్యాసంలో, తర్వాత పుస్తకంలో కరోల్ పేర్కొన్నారు. రచనల అమ్మకాలు పెంచుకునేందుకు అసత్యాలు రాస్తున్నారంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇవి తన పరువుకు భంగం కలిగిస్తున్నాయంటూ ఆమె మరో దావా వేశారు. ఈ కేసు తుది తీర్పును మన్హాటన్ ఫెడరల్ కోర్టు శనివారం వెలువరించింది. కరోల్‌కు 1.83 కోట్ల డాలర్ల పరిహారంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు హెచ్చరికగా మరో 6.5 కోట్ల డాలర్లు ఇవ్వాలని ట్రంప్‌ను ఆదేశించింది. పై కోర్టుకు వెళతా: ట్రంప్ కోర్టు తీర్పు హాస్యాస్పదమని ట్రంప్ దుయ్యబట్టారు. ‘‘న్యాయ వ్యవస్థ చేయి దాటి పోయింది. ప్రభుత్వం దాన్నో ఆయుధంగా వాడుతోంది. పై కోర్టుకు వెళతా’ అని తీర్పు తర్వాత వ్యాఖ్యానించారు. గురువారం ఈ కేసు విచారణ మధ్యలోనే ట్రంప్ కోర్టులో నుంచి లేచి బయటికొచ్చారు. దీనిపై జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రంప్ లాయర్ వైఖరిని సైతం బాగా తప్పుబట్టారు. సరిగా ప్రవర్తించకుంటే మీరు జైలుకెళ్తారని లాయర్‌ను తీవ్రంగా మందలించారు కూడా. -
‘ముకుంద’ కవితా రూపం
తెలుగు వర్తమాన వచన కవులలో నాకు మిక్కిలి ఇష్టమైన ముగ్గురు నలుగురు కవులలో యల్లపు ముకుంద రామారావు ఒకరు. మా గురువర్యులు ఆచార్య పింగళి లక్ష్మికాంతం సాహిత్య విమర్శ పాఠం చెపుతూ ‘కవిత్వము – వేదాంతము ఒకే కొమ్మకు పూచిన రెండు పువ్వులు’ అన్నారు. ఈ రెండు పువ్వుల సౌరభాలను మేళవించి, సారమతితో మంచి కవిత్వం చెప్పిన వారిలో ముకుంద రామారావు మొట్టమొదటి వారు. వృత్తిరీత్యా కంప్యూ టర్ ఇంజనీరు అయిన ముకుంద రామారావు ప్రవృత్తి రీత్యా మూర్తీభవించిన కవి. రామారావు 1995 నుండి 2017 వరకు 22 ఏళ్ల కాలంలో స్వీయ కవితా సంపుటాలను మాత్రమే ప్రచురించారు. రామారావు ఏ కవిత అయినా సరే సంక్షిప్తంగా, అనుభూతి సాంద్రంగా, ఆత్మీయతానుబంధంతో కూడి ఉంటుంది. ప్రకృతిలోనూ, మానవ జీవితంలోనూ దాగి ఉన్న సృష్టి రహస్యాన్ని వెదుకుతూ ఉంటుంది. తమ పెద్దమ్మాయికి పెండ్లి చేసి అత్తగారింటికి పంపిన తర్వాత ఆమె కోసం బెంగపెట్టుకొని ‘వలసపోయిన మందహాసం’ అనే మొట్టమొదటి కవిత వ్రాశారు రామా రావు. ఆ కవితకు ఎంతో పేరు వచ్చింది. 1995లో ఇదే శీర్షికతో మొదటి కవితా సంపుటిని వెలువరించారు. అక్కడి నుండి ఆయన కవితా దిగ్విజయ యాత్ర కొనసాగింది. ‘మరో మజిలీకి ముందు’ కవితా సంపుటికి ప్రముఖ కవి ఇస్మాయిల్ ‘కవిత్వ మజిలీ కథలు’ అనే పేరుతో చాలా గొప్ప పీఠిక వ్రాశారు. అందులో ‘ముకుంద రామారావు కవితల్లో సున్ని తమైన హృదయం అనుభవ ప్రకంపనలకు స్పందించే తీరు కనిపిస్తుంది. ఇక్కడ మనతో మాట్లాడేది హృదయం, హేతువు కాదు...’ అని రాశారు. ‘ఎవరున్నా లేకున్నా’ కవితా సంపుటికి ప్రముఖ కవి, అను వాదకుడు అయిన దీవి సుబ్బారావు తాను రాసిన పీఠికలో ‘ముకుంద రామారావు గారి వ్యక్తిత్వం నుండి కవిత్వాన్ని విడదీసి చూడలేము... ఇలాంటి కవిత్వాన్ని చెప్పడానికి మనిషి తాత్త్వికుడై ఉండాలి. చుట్టూరా ఉన్న మనుషుల్ని ప్రేమించ గలిగిన వాడై ఉండాలి. ముకుంద రామారావు గారు ఆ కోవకు చెందినవారు’ అని రాశారు. ‘నిశ్శబ్దం నీడల్లో’ కవితా సంపుటిలో శరీరంలోని ప్రాణాన్ని ఒక దీపంతో పోల్చుతూ ‘దేహ దీపం’ అనే ఆ చిన్న కవిత వ్రాశారు–‘దళసరి చర్మం / ఎముకల గూడు / రహస్య స్థావరంలో / దేహ దీపం! / ఎంతోకొంత వెలిగి / ఆరిపోతుందో / ఎగిరి పోతుందో / ఎవరికెరుక? / ఆపలేక / అందుకోలేక / జీవితాంతం ఆరాటం!!‘ స్వీయ అనువాద రచనలు రామారావు సాహిత్య కృషిలో ముఖ్యమైనవి. దీనిలో మొత్తం 14 గ్రంథాలున్నాయి. వీటిలో మొదటి అయిదు పుస్తకాలు ఈ ప్రపంచ సృష్టికి మూల భూతములయిన పంచభూతాల పేర్లతో వెలువడ్డాయి. ‘ఆకాశం – గాలి – నేల – కాంతి – నీరు‘ అనే వరుసలో తమ అనువాద గ్రంథాలను వెలువరించారు. ‘అదే నీరు’ పీఠికలో తనలో దాగివున్న పంచభూతాలను తెలియజేస్తూ, ఒక చక్కటి కవిత వ్రాశారు. ‘అవును/సూర్యుడు వస్తుంటాడు పోతుంటాడు –/ఆకాశం అదే!/ అలలు వస్తుంటాయి పోతుంటాయి –/సముద్రం అదే!/సముద్రం నువ్వయితే –/నీటిలో మునిగి ఈదాలనుకునే చేపని నేను!’ అని సాగే ఇంత గొప్ప కవితను ఈ మధ్యకాలంలో నేను చదవలేదు. దీనిని చదివిన నేను ‘ఈ కవితలో కలసిపోతిని, కరిగిపోతిని, కాన రాకే కదిలి పోతిని!’ – ప్రొ‘‘ తంగిరాల వెంకట సుబ్బారావు, సాహితీవేత్త (అజో–విభొ కందాళం వారి ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం నేడు విశాఖలో ముకుంద రామారావు అందుకుంటున్న సందర్భంగా) -
‘ప్రాఫెట్ సాంగ్’ పుస్తకానికి బుకర్ ప్రైజ్
లండన్: ఐర్లాండ్ రచయిత పాల్ లించ్ రాసిన ‘ప్రాఫెట్ సాంగ్’ పుస్తకానికి ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్–2023 లభించింది. లండన్‌కు చెందిన భారత సంతతి రచయిత చేతన మారూ రాసిన తొలి నవల ‘వెస్ట్రన్ లేన్’ సైతం ఈ బహుమతి కోసం పోటీ పడగా, ప్రొఫెట్ సాంగ్ విజేతగా నిలిచింది. తాజాగా లండన్‌లో బహుమతి ప్రదానోత్సవం జరిగింది. 46 ఏళ్ల పాల్ లించ్ బుకర్ ప్రైజ్ అందుకున్నారు. ఈ బహుమతి కింద ఆయనకు రూ.52,64,932 నగదు లభించింది. దిగజారుతున్న ప్రజాస్వామ్య విలువలు, పెరిగిపోతున్న నిరంశకుత్వం, ప్రబలుతున్న అశాంతి, వలసల సంక్షోభం.. వంటి పరిస్థితుల్లో ఐర్లాండ్‌లో తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఓ మహిళ చేసిన పోరాటాన్ని ‘ప్రాఫెట్ సాంగ్’ నవలలో పాల్ లించ్ హృద్యంగా చిత్రీకరించారు. కెన్యాలో జన్మించి లండన్‌లో స్థిరపడిన భారత సంతతి రచయిత చేతన మారూ రాసిన ‘వెస్ట్రన్ లేన్’ నవల టాప్–6లో నిలిచింది. -
అందుకే భావోద్వేగానికి లోనయ్యాను: చంద్రబోస్
‘‘నేనిప్పటివరకు 3700 పాటలు రాశాను. ఈ రోజు నా మీద పాట రాసి, పాడారు. ఆ పాటను నాకు బహుమతిగా ఇచ్చిన ‘పర్ఫ్యూమ్’ టీమ్‌కి కృతజ్ఞతలు. నేను ఆస్కార్ అందుకున్న వీడియోను మళ్లీ ఇక్కడ చూడటంతో భావోద్వేగానికి లోనయ్యాను. ‘పర్ఫ్యూమ్’ పెద్ద విజయం సాధించాలి. నా భార్య సుచిత్ర ఈ చిత్రంలో ఒక పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారు’’ అని రచయిత చంద్రబోస్ అన్నారు. చేనాగ్,ప్రాచీ థాకర్ జంటగా జేడీ స్వామి దర్శకత్వం వహించిన చిత్రం ‘పర్ఫ్యూమ్’. శ్రీమాన్ మూవీస్ సమర్పణలో జె. సుధాకర్, శివ .బి, రాజీవ్ కుమార్ .బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఆస్కార్ అవార్డుగ్రహీత చంద్రబోస్‌ను యూనిట్ సత్కరించింది. ఈ వేడుకకి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎస్. విష్ణుమూర్తి, ఐఆర్ఎస్ అధికారి మురళీమోహన్, గ్రీన్ హార్స్ కంపెనీ అధినేత ప్రవీణ్ రెడ్డి, ఆచార్య భట్టు రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ‘‘కొత్త పాయింట్‌తో రూపొందిన చిత్రమిది’’ అన్నారు జేడీ స్వామి, చేనాగ్. -
షేక్స్పియరే తన పవర్
‘ఏ యుద్ధం ఎందుకు జరిగెనో? ఏ రాజ్యం ఎన్నాళ్లుందో? తారీఖులు, దస్తావేజులు... ఇవి కావోయ్ చరిత్రకర్థం’... మహాకవి మాట తిరుగులేని సత్యం అయినప్పటికీ కొన్నిసార్లు యుద్ధాలు, తారీఖులు, ప్రేమ పురాణాలు, ముట్టడికైన ఖర్చులు... చారిత్రక పరిశోధనకు అవసరం. ఏ సమాచారమూ వృథా పోదు. వర్తమానంలో ఉండి ఆనాటి మొగల్, బ్రిటిష్ ఇండియాలోకి వెళ్లడం అంత తేలిక కాదు. అలుపెరగని పరిశోధన కావాలి. అంతకుముందు కనిపించని ప్రత్యేక వెలుగు ఏదో ఆ పరిశోధనలో ప్రతిఫలించాలి. అందమైన శైలికి అద్భుతమైన పరిశోధన తోడైతే...అదే ‘కోర్టింగ్ ఇండియా’ పుస్తకం. ఫ్రొఫెసర్ నందిని దాస్ రాసిన ‘కోర్టింగ్ ఇండియా: ఇంగ్లాండ్, మొఘల్ ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్’ పుస్తకం ప్రతిష్ఠాత్మకమైన బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్–2023 గెలుచుకుంది... ఇంట్లో, తరగతి గదిలో, పుస్తకాల్లో, టీవీల్లో విన్న కథల ద్వారా నందిని దాస్‌కు షేక్స్పియర్ ఇష్టమైన రచయితగా మారాడు. ఆ మహా రచయితపై ఇష్టం ఆంగ్ల సాహిత్యంపై ఇష్టంగా మారింది. ఆయన పుస్తకాలు తన మనోఫలకంపై ముద్రించుకుపోయాయి. అలనాటి ప్రయాణ సాహిత్యం నుంచి భిన్న సంస్కృతుల మధ్య వైరు«ధ్యాల వరకు నందినికి ఎన్నో అంశాలు ఆసక్తికరంగా మారాయి. పరిశోధిస్తూ, రాసే క్రమంలో తన మానసిక ప్రపంచం విశాలం అవుతూ వచ్చింది. యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో నందిని దాస్ ప్రొఫెసర్. షేక్స్పియర్ సాహిత్యం ఆమెకు కొట్టిన పిండి. ఆమె పేరు పక్కన కనిపించే విశేషణం...‘స్పెషలిస్ట్ ఇన్ షేక్స్పియర్ స్టడీస్’ కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీలో బీఏ ఇంగ్లీష్ చేసింది నందిని. ఆ తరువాత స్కాలర్‌షిప్‌పై యూనివర్శిటీ కాలేజి, ఆక్స్‌ఫర్డ్‌లో చేరింది. కేంబ్రిడ్జీ, ట్రినిటీ కాలేజిలో ఎంఫిల్, పీహెచ్డీ చేసింది. ఒక ప్రచురణ సంస్థలో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్‌గా పని చేసిన నందిని సంవత్సరం తరువాత మళ్లీ అకాడమిక్ రిసెర్చ్‌లోకి వచ్చింది. ఇక తాజా విషయానికి వస్తే... ‘ది పవర్ ఆఫ్ గుడ్ రైటింగ్’గా విశ్లేషకులు కీర్తించిన ‘కోర్టింగ్ ఇండియా’ యూరోపియన్ల హింసా ధోరణి గురించి చెప్పింది. రాయబార కార్యాలయాల అసమర్థతను ఎత్తి చూపింది. మొఘల్ రాజకీయాలను ఆవిష్కరించింది. ‘ ఆనాటి బ్రిటన్, ఇండియాలకు సంబంధించి వాస్తవిక చిత్రాన్ని ఆవిష్కరించింది నందిని. మొగల్ రాజుల ఒడిదొడుకుల నుంచి బ్రిటీష్ వైఖరి వరకు ఈ పుస్తకంలో ఎన్నో కనిపిస్తాయి’ అంటాడు బ్రిటీష్ అకాడమీ బుక్‌ప్రైజ్– ఛైర్ ఆఫ్ ది జ్యూరీ ప్రొఫెసర్ చార్లెస్ ట్రిప్. -
Welcome to Paradise: స్వాగతం.. సుస్వాగతం
రచయిత్రిగా కూడా మంచి మార్కులు కొట్టేసింది నటి ట్వింకిల్ ఖన్నా.‘మిసెస్ ఫన్నీబోన్స్: ‘పైజామాస్ ఆర్ ఫర్ గివింగ్’ ‘ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీప్రసాద్’ పుస్తకాలతో పాఠకులను అలరించింది. తాజాగా తన కొత్త పుస్తకం ‘వెల్కమ్ టూ ప్యారడైజ్’ను ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ట్వింకిల్ ఖన్నా లండన్‌లో ఫిక్షన్ రైటింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత వస్తున్న పుస్తకం ఇది. ‘ఈ పుస్తకంలోని క్యారెక్టర్లు గత అయిదు సంవత్సరాలుగా నా మనసులో తిరుగుతున్నాయి. నాకు మాత్రమే పరిచయమైన ఈ క్యారెక్టర్లు ఇప్పుడు మీకు కూడా పరిచయం కాబోతున్నాయి’ అంటూ రాసింది ఖన్నా. మానవ సంబంధాలు, ఎడబాట్లు, అనుబంధాలు, ఆప్యాయతలను ఆధారంగా చేసుకొని రాసిన ఈ పుస్తకం వచ్చే నెలలో విడుదల కానుంది. సామాన్య పాఠకుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వరకు సోషల్ మీడియాలో ఈ పుస్తకంపై కామెంట్స్ పెడుతున్నారు. -
జాన్ ఫోసేకు సాహిత్య నోబెల్
నార్వే రచయిత జాన్ ఫోసేకు సాహిత్యంలో నోబెల్ పురస్కారం వరించింది. బయటకు చెప్పుకోలేని ఎన్నో అంశాలకు తన నవలలు, నాటకాలు, చిన్న పిల్లల పుస్తకాల ద్వారా గళంగా నిలిచినందుకు ఫోసే ఈ ఏడాది ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. నోబెల్ లిటరేచర్ కమిటీ చైర్మన్ ఆండర్స్ ఓల్సన్ గురువారం అవార్డును ప్రకటించారు. ఫోసే చేసిన రచనల్లో నార్వే సంస్కృతి, స్వభావాలు ఉట్టిపడుతూ ఉంటాయని కొనియాడారు. ఈ పురస్కారం కింద ఫోసేకు 1.1 కోట్ల స్వీడిష్ క్రోనర్లు (10 లక్షల డాలర్లు) లభిస్తాయి. సాహిత్యంలో నోబెల్ పురస్కారం లభించిందంటే తనని తాను నమ్మలేకపోయానంటూ జాన్ ఫోసే తీవ్ర ఉద్విగ్నానికి లోనయ్యారు. ‘‘నోబెల్ కమిటీ ఫోన్ చేసి చెప్పగానే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. మళ్లీ నన్ను నేనే నిలవరించుకున్నారు. గత పదేళ్లుగా నోబెల్ వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను. ఈ అవార్డు విపరీతమైన ఆనందాన్ని ఇస్తోంది. కాస్త కూడా భయం వేస్తోంది. ’’ అని నార్వే మీడియాకు చెప్పారు. నార్వేలో అత్యంత ప్రతిభావంతుడైన నాటక రచయితగా గుర్తింపు పొందిన ఫోసే 43 వరకు నవలలు, నాటకాలు, చిన్న కథలు, పిల్లల పుస్తకాలు, అనువాదాలు, పద్యాలు, గద్యాలు రచించారు. అయితే నాటక రచయితగానే ఆయనకు విశేషమైన గుర్తింపు లభించింది. మాటల్లో తమ బాధల్ని చెప్పుకోలేని ఎన్నో వర్గాలకు ఆయన తన రచనలతో ఒక గళంగా మారి సామాజిక పరిస్థితుల్ని అద్దంలో చూపించారంటూ ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రోజువారీ ఘటనలే కథా వస్తువు నిత్యజీవితంలో మనకు ఎదురయ్యే ఘటనలే జాన్ ఫోసే రచనలకు ఆధారం. అలాంటి ఘటనల్ని సరళమైన భాషలో,, శక్తిమంతమైన భావ ప్రకటనతో రచనలు చేసి సామాన్యుల మనసుల్ని కూడా దోచుకున్నారు. మానవ సంబంధాల్లోని బలమైన భావోద్వేగాలను , సామాజిక పరిస్థితుల్ని చిన్నారులకి కూడా అర్థమయ్యేలా రచనలు చేసి సమాజంలో వివిధ వర్గాలపై ఎంతో ప్రభావాన్ని చూపించారు. నార్వేలో 1959లో క్రిస్టియన్ మతాచారాల్ని గట్టిగా ఆచరించే ఒక సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. విద్యార్థి దశలోనే ఆయన తన కుటుంబంపైన, మతంపైనా తిరుగుబాటు ప్రకటించారు. తాను నాస్తికుడినని ప్రకటించారు. చిన్నప్పట్నుంచి తిరుగుబాటు ధోరణి కలిగిన జాన్ ఫోసే రచనల్లో, నాటకాల్లో అది వ్యక్తమయ్యేది. 1983లో ఆయన రాసిన మొదటి నవల రెడ్, బ్లాక్‌లో ఆత్మహత్యల అంశాన్ని స్పృశించారు. అప్పట్నుంచి ఆయన వెనక్కి చూసుకోలేదు. నవలైనా, నాటకమైనా, పద్యాలైనా, గద్యాలైనా ఆ రచనల్లో ఆయన ముద్ర స్పష్టంగా కనిపించేది. 40 భాషల్లో పుస్తకాల అనువాదం ఫోసే చేసిన రచనలు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 40 భాషల్లోకి అనువాదమ య్యాయి. 2015లో ది డైలీ టెలిగ్రాఫ్ రూపొందించిన భూమ్మీద ఉన్న లివింగ్ జీనియస్లలో టాప్ 100 జాబితాలో ఫోసే 83వ స్థానంలో నిలిచారు. 2022లో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అవార్డు కోసం ఆయన రాసిన ‘‘ఏ న్యూ నేమ్ :సెప్టాలజీ Vఐ– Vఐఐ’’ షార్ట్ లిస్ట్‌లో నిలిచింది. జాన్ ఫోసేకు మూడు పెళ్లిళ్లయ్యాయి. ఆరుగురు పిల్లలకు తండ్రి. 64 ఏళ్ల వయసున్న జాన్ ఫోసే ఆస్ట్రియాలోని తన రెండో భార్యతో కలిసి ఉంటున్నారు. యువకుడిగా ఉన్నప్పుడు దేవుడ్ని నమ్మని జాన్ ఫోసే ప్రస్తుతం కాథలిజంలోకి మారి దానినే అనుసరిస్తున్నారు. ఫోసే చేసిన రచనల్లో బోట్‌హౌస్, మెలాంకలి, సెప్టాలజీ అత్యంత ప్రజాదరణ పొందాయి. ఫోసే రచించిన నాటకాలను వేలాది ప్రొడక్షన్ హౌస్‌లు వివిధ దేశాల్లో ప్రదర్శించాయి. ఇంగ్లిష్ భాషలోకి అనువదించిన ఫోసే సెప్టాలజీ సిరీస్‌లో ది అదర్ నేమ్, ఐ ఈజ్ అనదర్, ఏ న్యూనేమ్ ఆయనకు చాలా గుర్తింపు తీసుకువచ్చాయి. భాషకు పట్టాభిషేకం జాన్ ఫోసే రచనలు నార్వేజియన్ భాషలో రాస్తారు. నార్వేలో 10% మంది మాత్రమే ఈ భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు. నార్వేలో ఉన్న రెండు అధికారిక భాషల్లో ఇదొకటి. గ్రామీణ ప్రాంత ప్రజలు మాట్లాడే మాండలికంలో ఉండే ఈ భాష 19వ శతాబ్దంలో డానిస్కు ప్రత్యామ్నాయంగా పుట్టింది. స్వచ్ఛమైన సెలయేరులాంటి భాషలో ప్రజలు రోజువారీ ఎదుర్కొనే సమస్యలకి తన రచనల్లో కొత్త కోణంలో పరిష్కారం మార్గం చూపించడంతో ఆయన పుస్తకాలు అపరిమితమైన ఆదరణ పొందాయి. అందుకే ఈ పురస్కారం తనకే కాకుండా, తన భాషకి కూడా పట్టాభిషేకం జరిగినట్టుగా ఉందని ఫోసే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నీ కోసం కథలు రాసి
‘ఇంటి మూలన వంట గది’ ‘అడవిలో హరిణి’ ‘సంధ్య వెలుతురు’... సి.ఎస్.లక్ష్మి అనే చిత్తూరు సుబ్రహ్మణ్యం లక్ష్మి కథల సంపుటాల పేర్లు ఇవి. ‘అంబై’ కలం పేరుతో తమిళంలో స్త్రీల పారంపరిక బంధనాలను ప్రశ్నించే కథలు రాస్తున్న సి.ఎస్.లక్ష్మికి ప్రతిష్టాత్మక ‘టాటా లిటరేచర్ లైఫ్‌టైమ్ అవార్డు’ ఈ సంవత్సరానికి ప్రకటించారు. ‘స్పారో’ అనే సంస్థను స్థాపించి మహిళా సాహిత్యకారుల చరిత్రను నిక్షిప్తం చేస్తున్న లక్ష్మి పరిచయం... ఆలోచనలు... ‘నన్ను మహిళా రచయిత అని ప్రత్యేకంగా పిలవొద్దు. పురుషులు ఏం రాసినా వారిని పురుష రచయిత అంటున్నారా? మమ్మల్ని మాత్రం మహిళా రచయితలు అనడం ఎందుకు? మమ్మల్ని కూడా రచయితలు అనే పిలవండి’ అంటారు సి.ఎస్.లక్ష్మి. ‘అంబై’ కలం పేరుతో తమిళ పాఠకులకు సుదీర్ఘకాలంగా అభిమాన రచయిత్రిగా ఉన్న సి.ఎస్.లక్ష్మి ఒకటీ రెండు నవలలు రాసినా ఎక్కువగా అంకితమైంది కథలకే. అదీ స్త్రీల కథలకి. తమిళంలో స్త్రీవాద దృక్పథంతో రాసి ఒక కదలిక తేగలిగిన రచయితల్లో సి.ఎస్.లక్ష్మి ప్రముఖులు. సుదీర్ఘ కాలంగా తాను ఆశించిన స్త్రీ వికాసం కోసం కలాన్ని అంకితం చేయడం వల్లే ఆమెకు ‘టాటా లిటరేచర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ 2023 సంవత్సరానికి ప్రకటించారు. టాటా సన్స్ ప్రతినిధి హరీష్ భట్ ఈ విషయాన్ని తెలియచేస్తూ ‘స్త్రీలు తాము మోయక తప్పని మూసలను లక్ష్మి తన కథల ద్వారా బద్దలు కొడుతూనే వచ్చారు’ అని వ్యాఖ్యానించారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును గతంలో అందుకున్న వారిలో వి.ఎస్.నైపాల్, మహాశ్వేతా దేవి, రస్కిన్ బాండ్, గిరిష్ కర్నాడ్ తదితరులు ఉన్నారు. ఊరు కోయంబత్తూరు కోయంబత్తూరులో జన్మించిన అంబై ఢిల్లీలోని జె.ఎన్.యు నుంచి పిహెచ్.డి పట్టా పొందారు. తమిళనాడులో అధ్యాపకురాలిగా పని చేస్తూ కథలు రాశారు. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ విష్ణు మాథూర్‌ని వివాహం చేసుకుని తర్వాతి కాలంలో ముంబైలో స్థిరపడ్డారు. 18 ఏళ్ల వయసులో తొలిసారి పిల్లల కోసం ‘నందిమలై చరలిలె’ (నందిమల కొండల్లో) అనే డిటెక్టివ్ నవలతో ఆమె రచనా జీవితం మొదలైనా 1967లో రాసిన ‘సిరగుగల్ మురియుమ్’(రెక్కలు విరిగిపోతాయి) అనే కథతో సిసలైన బాట పట్టారు. స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం, స్త్రీవాద దృక్పథం గురించి తమిళంలో తొలిసారి గొంతు విప్పిన రచయిత్రి ఆమేనని విమర్శకులు అంటారు. సంప్రదాయం, ఆచారాలు మహిళల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా అణచివేస్తున్నాయో ఆమె తన కథల్లో వివరించే ప్రయత్నం చేశారు. తప్పక చదవాల్సిన తమిళ కథల్లో అంబై రాసిన ‘వీట్టిన్ మూలై ఒరు సమేలరై’, ‘అమ్మా ఒరు కొలై సెయ్దల్’, ‘కరుప్పు కుదిరై చతుక్కుమ్’ కథలు ఉంటాయని రచయిత జయమోహన్ పేర్కొన్నారు. 2021లో అంబైకు సాహిత్య అకాడెమీ పురస్కారం దక్కింది. కలం పేరు వెనుక కథ తన కలం పేరు ‘అంబై’గా మార్చుకోవడానికి వెనకున్న కథను గతంలో వెల్లడించారామె. శుక్రవారం పుట్టే ఆడపిల్లలకు ‘లక్ష్మి’ అనే పేరు పెడతారని, తనకూ అదే పేరు పెడితే ఆ పేరుతోనే కథలు రాయాలపించలేదని చెప్పారు. తమిళ సీనియర్ రచయిత దేవన్ రాసిన ‘పార్వతిన్ సంగల్పం (పార్వతి సంకల్పం)’ నవలలో భర్త చేత అణచివేతకు గురైన ఓ భార్య తన పేరును అంబైగా మార్చుకొని రాయడం మొదలు పెడుతుందని, అదే తనకు స్ఫూర్తినిచ్చి కలం పేరును అంబైగా మార్చుకున్నానని తెలిపారు. సాహితీ కార్యకర్త సి.ఎస్.లక్ష్మి కేవలం రాయడమే కాదు చాలా సాహితీ కార్యక్రమాలు చేస్తారు. తమిళంలో మహిళా సాహిత్యం గురించి ఆమె చేసిన పరిశోధన ముఖ్యమైనది. 1994లో చెన్నైలో స్థాపించిన రోజ ముత్తయ్య రీసెర్చ్ లైబ్రరీ ఏర్పాటు వెనుక అంబై కీలకంగా నిలిచారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రైవేటు లైబ్రరీల్లో ఇదీ ఒకటి కావడం విశేషం. ప్రస్తుతం ఇక్కడ మూడు లక్షల పుస్తకాల దాకా ఉన్నాయి. అలాగే 1988లో SPARROW (Sound and Picture Archives for Research on Women) అనే ఎన్జీవో ప్రారంభించారు. మహిళా రచయితలు, మహిళా కళాకారుల రచనలు, ప్రతిభ, వారి కృషిని డాక్యుమెంట్ చేయడం, నిక్షిప్తం చేయడం ఆ సంస్థ లక్ష్యం. ప్రస్తుతం ఆమె ఆ సంస్థకు అధ్యక్షురాలిగా ఉన్నారు. తన సంస్థ తరఫున అనేక పుస్తకాలు ప్రచురించారు. -
కవిత్రయం తరువాత సిసలైన కవి జాషువా
ఏఎన్‌యూ: కవిత్రయం తరువాత తెలుగులో సిసలైన కవి గుర్రం జాషువా అని అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు అన్నారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యూనివర్సిటీ తెలుగు విభాగం, ఏపీ అధికార భాషా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతి ముందస్తు వేడుకలు మంగళవారం జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన విజయబాబు మాట్లాడుతూ.. తాను ఎదుర్కొన్న ఛీత్కారాలను సత్కారాలుగా మలచుకున్న దార్శనికుడు జాషువా అని చెప్పారు. వీసీ పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. జాషువా విశ్వజననీయమైన రచనలు చేశారన్నారు. జాషువా తన సాహిత్యం ద్వారా విశ్వాన్ని జాగృతం చేశారన్నారు. రెక్టార్ పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ బి.కరుణ, పాలక మండలి సభ్యురాలు సీహెచ్.స్వరూపరాణి, సీడీసీ డీన్ కె.మధుబాబు, ప్రిన్సిపాల్స్ పి.సిద్దయ్య, శ్రీనివాసరెడ్డి, ప్రమీలారాణి ప్రసంగించారు. సాహితీ పురస్కారాలు ప్రదానం తెలుగు భాషా సాహిత్యంలో విశేష సేవలు అందించిన దుగ్గినపల్లి ఎజ్రయ్య, కొమ్మవరపు విల్సన్‌రావు, విడదల సాంబశివరావు, పోగుల విజయశ్రీ, కొండపల్లి సుదర్శనరాజు, గుమ్మ సాంబశివరావు, కాకాని సుధాకర్, సీహెచ్ స్వరూపరాణి, గుమ్మడి విజయ్‌కుమార్, డి.అనిల్‌కుమార్, పీవీ సుబ్బారావుకు సాహితీ పురస్కారాలు ప్రదానం చేశారు. వ్యాసరచన, వక్తృత్వం పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. -
పట్టనట్టుండే రచయిత
ఆధునిక కాలంలో దాదాపు ఒక సన్యాసిగా బతికిన సుప్రసిద్ధ ‘ఫ్రెంచ్’ రచయిత మిలన్ కుందేరా జూలై 11న తన 94వ ఏట కన్నుమూశారు. ఒక దశ తర్వాత ఇంటర్వ్యూలు ఇవ్వడానికి నిరాకరించి, అధికారిక జీవిత చరిత్రలు రాయడానికి ఒప్పుకోక, జనానికి దూరంగా, తన గురించి వీలైనంత తక్కువ తెలిసేలా మసలుకున్నారు. రాతలోకి వచ్చినది మాత్రమే జీవితం; రచయిత వ్యక్తిగత జీవితం గురించిన కుతూహలం రచనల సమగ్రతను దెబ్బకొడుతుందనేది ఆయన భావన. కమ్యూనిస్టు రచయితగా మొదలైన కుందేరా, అనంతర కాలంలో ఆ భావజాలంతో పాటు తన మాతృదేశం చెకొస్లొవేకియాకూ, దాని పౌరసత్వానికీ, చివరకు తన మాతృభాష ‘చెక్’కూ దూరం కావాల్సి వచ్చింది. మొదట్లో చెక్ భాషలోనే రాసినప్పటికీ, మలి దశలో ఫ్రెంచ్‌లోనే రాయడానికి నిర్ణయించుకున్నారు. తనను ఫ్రెంచ్ రచయితగానే చూడాలనీ, తన రచనలను ఫ్రెంచ్ భాషవిగానే పరిగణించాలనీ కోరారు. 1929 ఏప్రిల్ 1న జన్మించిన మిలన్ కుందేరా యవ్వనోత్సాహంలో కమ్యూనిస్టు విప్లవాన్ని సమర్థించినవాడే. సోషలిస్టు రష్యాకు జైకొట్టినవాడే. 24వ యేట మొదటి సంపుటి సహా, విప్లవ సమర్థనగా మూడు కవితా సంపుటాలను వెలువరించినవాడే. విమర్శక గొంతులను నిరసిస్తూ, ఇంకా ఎవరినీ లోపలేసి తాళాలు వేయడం లేదు కదా అని వాదించినవాడే. కానీ పై అధికారిని విమర్శించినందుకు ఒకసారీ, పార్టీలో సంస్కరణలు జరగాలని కోరినందుకు మరోసారీ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దీనివల్ల తనకు విముక్తి లభించిన భావన కలిగిందని తర్వాత చెప్పారాయన. రాయాలనుకుంటున్న థీమ్స్ మీద పెట్టుకున్న మానసిక నిరోధం తొలగినట్టయి రచయితగా మరింత స్వేచ్ఛను పొందారు. ఆయన తొలి నవల ‘ద జోక్’(1967)లో వినోదానికి అనుమతి లేని సంతోషంలో ఉంటారు మనుషులు. ప్రేయసికి రాసిన లేఖలోని ఒక సరదా వాక్యాన్ని (ఆశావాదం అనేది మానవాళి నల్లమందు) కూడా ఓ త్రిసభ్య కమిటీ విచారిస్తుంది. ఈ కారణంగా కథానాయకుడిని పార్టీ నుంచి బహిష్కరించే ఓటింగుకు ఆఖరికి కర్తవ్యోన్ముఖురాలైన అతడి ప్రేయసీ చెయ్యెత్తి సమ్మతిస్తుంది. పార్టీ నుంచి బహిష్కరణ వల్ల కుందేరా తన ప్రొఫెసర్ ఉద్యోగం పోగొట్టుకుని, పియానో వాయించే తండ్రి వారసత్వంగా వచ్చిన సంగీతాన్ని పాఠాలుగా చెబుతూ, దినసరి కూలీగా పనిచేస్తూ, మారుపేరుతో పత్రికలకు జాతక ఫలాలు రాస్తూ బతకాల్సి వచ్చింది. ఆయన ఫోన్ ను ట్యాప్ చేశారు. రచనలను నిషేధించారు. ఒక దశలో సీక్రెట్ పోలీసులు రాతప్రతుల కోసం ఆయన గదిని గాలించారు. అప్పుడే పూర్తయివున్న ‘లైఫ్ ఈజ్ ఎల్స్వేర్’(1973) నవల రాతప్రతిని దాని పేరుకు తగినట్టుగానే స్నేహితుల సాయంతో అప్పటికే ఫ్రాన్స్‌కు తరలించారు. ఆ తర్వాత రెండేళ్లకు ఆయన ఫ్రాన్స్‌కు వెళ్లిపోయారు. 1979లో చెక్ పౌరసత్వం రద్దయింది. 1981లో ఫ్రాన్స్ పౌరసత్వం పొందారు. (నలభై ఏళ్ల తర్వాత, 2019లో మాత్రమే చెక్ పౌరసత్వాన్ని పునరుద్ధరించారు. గొప్ప చెక్ రచయిత పునరాగమనానికి ప్రతీకగా చూస్తున్నామని చెబుతూ, ఆ చర్యను గొప్ప గౌరవంగా అభివర్ణించింది ప్రభుత్వం.) స్టాలినిస్టు కాని మనిషిని నేను సులభంగా గుర్తించగలిగేవాడిని; ఆయన నవ్వే విధానం నేను భయపడాల్సిన మనిషి కాదని చెప్పేది, అన్నారు కుందేరా. ఆయనకు అత్యంత ప్రసిద్ధి తెచ్చిపెట్టిన నవల ‘ది అన్ బేరబుల్ లైట్నెస్ ఆఫ్ బీయింగ్’ (1984)లో కథానాయిక తమ కుక్కపిల్లను ఒడిలోకి తీసుకుని జోకొడుతూ, ‘భయపడకు, భయపడకు, భయపడకు’ అని దాన్ని ఊరడిస్తుంది. ‘ద బుక్ ఆఫ్ లాఫ్టర్ అండ్ ఫర్గెటింగ్’(1979)లోని ‘అధికారానికి వ్యతిరేకంగా మనిషి చేసే పోరాటం, మరపునకు వ్యతిరేకంగా జ్ఞాపకం చేసే పోరాటం’ అనే వాక్యం చదివినప్పటినుంచీ తనతో ఉండిపోయిందనీ, ప్రపంచంలోని ఘటనల పట్ల తన అవగాహనను ప్రజ్జ్వరిల్లజేసిందనీ చెబుతారు సల్మాన్ రష్దీ. తన రచనా గదిలోని ఒక గోడకు తండ్రి ఫొటోనూ, తన అభిమాన సంగీత కారుడు లియోస్ యానాచెక్ ఫొటోనూ పక్కపక్కనే పెట్టుకున్న కుందేరా, నవల మాత్రమే సాధించేది సాధిస్తూనే అది ఒక మ్యూజికల్ నోట్లా ఉండాలనీ, నవలలోని అందరి కథనాలూ ఏకసూత్రతతో లయబద్ధంగా అమరాలనీ అంటారు. ఒక కామా కూడా ఉండాల్సిన చోట లేకపోతే నచ్చని పర్ఫెక్షనిస్టు ఆయన. చిత్రంగా ఆయన మొదటి నవల జోక్ ఆంగ్లంలో వచ్చినప్పుడు, తన నియంత్రణలో లేని అనువాదం కారణంగా అధ్యాయాలు తారుమారయ్యాయి. దీనివల్ల ‘ఐరనీ’ కాస్తా ‘సెటైర్’ అయ్యింది. 1992లో మాత్రమే ఆయనకు సంతృప్తి కలిగించే అనువాదం వచ్చింది. ఆంగ్లభాషలో ఇది ఐదో వెర్షన్ అని ఆయనే ముందుమాట రాస్తూ నవ్వుకున్నారు. అయితే నవలల పేర్ల విషయంలో మాత్రం ఆయనకు పట్టింపు లేదు. ఒక నవల పేరును ఇంకో నవలకు పెట్టినా సరిగ్గా సరిపోతుందంటారు. తనను పీడించే అంశాలు పరిమితమైనవనేది ఆయన ఉద్దేశం. 2015లో వచ్చిన ‘ద ఫెస్టివల్ ఆఫ్ ఇన్ సిగ్నిఫికెన్స్’ ఆయన చివరి నవల. మలి దశ రచనల్లో రాజకీయాల కంటే తత్వానికి ప్రాధాన్యం ఇచ్చిన కుందేరా, జీవితానికి రెండో అవకాశం లేకపోవడం కూడా ఒక విముక్తి లాంటిదేనంటారు. ప్రపంచ వ్యాప్తంగా జనాలు అర్థం చేసుకోవడం కంటే తీర్పులు ఇవ్వడానికే ఇష్టపడుతున్నారంటూ, ప్రపంచంలోని ఘటనలను మరీ అంత సీరియస్‌గా తీసుకోకపోవడం కూడా ఒక ప్రతిఘటనే అని చెబుతారు. అన్నీ పట్టించుకుంటూనే ఏమీ పట్టనట్టుగా ఉండాలంటే చాలా సంయమనం కావాలి. -
రూప..కంప్యూటర్ ఇంజనీర్ కానీ, పిల్లల కోసం పుస్తకాలు రాస్తుంది
పిల్లల పుస్తకప్రపంచంలో తనదైన ప్రత్యేకత నిలుపుకుంది రూపా పాయ్. ఫాంటసీ–అడ్వెంచర్ పుస్తకాలతో పాటు ‘ది గీతా ఫర్ చిల్డ్రన్’లాంటి భిన్నమైన పుస్తకాన్ని రాసి ప్రశంసలు అందుకుంది. ఈ పుస్తకం ‘క్రాస్‌వర్డ్ అవార్డ్’ గెలుచుకుంది. మరో భిన్నమైన పుస్తకం ‘ది యోగా సూత్రాస్ ఫర్ చిల్డ్రన్’తో పిల్లలను పలకరించింది బెంగళూరుకు చెందిన రూప... పిల్లల పత్రిక ‘టార్గెట్’తో పాటు లండన్ కేంద్రంగా ప్రచురితమయ్యే ‘ట్రావెల్ ట్రెండ్స్’ మ్యాగజైన్ కోసం ఎన్నో రచనలు చేసింది రూప. అయితే తనకు పిల్లల కోసం రచనలు చేయడం అంటేనే బాగా ఇష్టం. ‘నేను రచయిత్రి కాకపోయి ఉంటే టీచర్ని అయ్యేదాన్ని’ అంటుంది కంప్యూటర్–ఇంజనీరింగ్ చదువుకున్న రూప. చిన్నప్పటి నుంచి పుస్తకాలు తెగ చదివేది. బెంగళూరులోని లైబ్రరీలన్నీ ఆమెకు సుపరిచితమే. చదవగా, చదవగా తనలో కాల్పనిక ప్రపంచం ఒకటి అస్పష్టంగా ఆవిష్కారమయ్యేది. కళ్ల ముందు ఏవేవో పాత్రలు, దృశ్యాలు కదలాడుతుండేవి. కాగితం, కలం పట్టిన తరువాత వాటికి ఒక రూపం ఇచ్చింది. రకరకాల జానర్స్‌లో రచనలు చేయడం గురించి రూప ఇలా అంటోంది...‘కథ మంచిదైతే, ఆకట్టుకునేలా ఉంటే అది ఏ జానర్ అనేది పిల్లలు పట్టించుకోరు. వారికి కచ్చితంగా హాస్యం ఉండాల్సిందే. ముఖ్యంగా క్లైమాక్స్ అనేది వారికి నచ్చాలి’.‘ది గీతా ఫర్ చిల్డ్రన్’ పుస్తకం రూపకు ఎంతో పేరు తెచ్చింది.‘మన పురాణాలకు సంబంధించిన ఎన్నో సంక్లిష్టమైన విషయాలను పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా రాస్తున్నారు కదా....మరి భగవద్గీత గురించి ఎందుకు రాయకూడదు’ అని ఒకరోజు అడిగింది ఎడిటర్ వత్సల. అయితే అందుకుముందెన్నడూ భగవద్గీతను రూప చదవలేదు. అలా అని ‘నేను రాయలేను’ అనలేదు. ‘ఓకే’ అంటూ రంగంలోకి దిగింది. ‘గీత’ను ఎన్నోసార్లు చదివింది. అనేకసార్లు చదివిన తరువాత ‘గీత గురించి పిల్లలకు చెప్పాలనే ఆలోచన నాకు ఎందుకు రాలేదు’ అనుకుంది.నిజానికి అదొక సవాలు. కానీ ఆ సవాలును ఇష్టంగా స్వీకరించింది రూప. ‘ది గీతా ఫర్ చిల్డ్రన్’ పిల్లలనే కాదు వారి తల్లిదండ్రులను కూడా ఆకట్టుకుంది. ‘మంచి ప్రయత్నం’ అని ప్రశంసించారు.‘ది గీతా ఫర్ చిల్డ్రన్’ పుస్తకం విజయవంతం అయిన తరువాత ‘ఇదే కోవలో మరో పుస్తకం రాస్తే బాగుంటుంది’ అని చాలామంది అడిగారు. అయితే అలా రాస్తే రొడ్డకొట్టుడుగా ఉంటుందని రూపకు ఆనిపించింది. ‘ఇప్పుడు కావాల్సింది మరో విభిన్నమైన పుస్తకం’ అని అనుకుంది. అలా వచ్చిందే...‘సో యూ వాంట్ టు నో ఎబౌట్ ఎకనామిక్స్’ పుస్తకం. ఈ పుస్తకం రావడానికి మరో కారణం ‘గీతను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడంలో విజయం సాధించాను’ అనే ఆత్మవిశ్వాసం. ఈ పుస్తకం తరువాత వచ్చిన ‘రెడీ 99’కి కూడా మంచి స్పందన వచ్చింది. పుస్తకం రాయడానికి రూప అనుసరించే పద్ధతి ఏమిటి? పుస్తకం రాయడానికి ముందు మనసు అనే కాగితంపైనే ఎన్నో వాక్యాలు రాసుకుంటుంది. అక్కడే ఎడిటింగ్ చేసుకుంటుంది. తాను ఎంచుకున్న అంశంపై ఎన్నో పుస్తకాలు చదువుతుంది. ఆ అంశంపై పట్టు ఉన్న వాళ్లతో మాట్లాడుతుంది. విషయ అవగాహన తరువాత పిల్లలను ఆకట్టుకునేలా, అర్థమయ్యేలా ఎలా రాయాలో అనేదానిపై కసరత్తు చేస్తుంది.‘పన్నెండు సంవత్సరాల వయసులో ఒక పిల్లల మాసపత్రికను చూస్తూ...పెద్దయ్యాక ఈ పత్రికకు కథలు రాయాలనుకునేదాన్ని. నా కల నెరవేరింది. ఇంతకంటే అదృష్టం, ఆనందం ఏముంటాయి!’ అంటుంది రూపా పాయ్. పిల్లలకు యోగా సూత్రాలు భగవద్గీత శ్లోకాల సారాంశాన్ని, ఆర్థిక సూత్రాల మర్మాన్ని పుస్తకాల ద్వారా పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పిన రూపా పాయ్ తాజా పుస్తకం ‘ది యోగ సూత్రాస్ ఫర్ చిల్డ్రన్’. చిన్నప్పుడు మనసులో పడిన ఒక బీజం మొక్క అవుతుంది. ఆ తరువాత బలమైన చెట్టు అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన పుస్తకం ఇది. ‘మనలో కలిగే రకరకాల భావాలకి మనమే యజమాని’ ‘నేను శరీరాన్ని కాదు. కాని ఈ శరీరమనే అద్భుతమైన నిర్మాణంతో ఈ అద్భుత ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను’ ‘నేను మనసుని కాదు. కానీ మనసు అనే మహా నిర్మాణంలో ఎన్నో అద్భుతాలను అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాను’... ఇలా ఆకట్టుకునే మాటలు ఎన్నో ఉన్న ‘ది యోగ సూత్రాస్ ఫర్ చిల్డ్రన్’ ఆబాలగోపాలానికి ప్రియమైన పుస్తకం అవుతుంది అనడంలో సందేహం లేదు. -
అరే..! హై స్కూల్ స్టుడెంట్.. ప్రముఖ రచయిత్రిని అడగకూడందే అడిగారే..!
సోషల్ మీడియా వేదికగా సామాన్యులు కూడా బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తులతో కనెక్ట్ అవుతారు. ఈ క్రమంలో ఎదురయ్యే సంభాషణలు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ రచయిత్రి ప్రీతి షెనాయ్ని ఓ విద్యార్థి వింతైన సహాయం చేయమని కోరాడు. ఇది చూస్తే.. ఈ రోజుల్లో పిల్లలే ఇంత.. చాలా క్రేజీ.. అని అనుకోకుండా ఉండలేరు. పదో తరగతి చదువుతున్న విద్యార్థి ప్రీతిని హోం వర్క్ చేసిపెట్టమని సహాయం కోరారు. కాంపిటీషన్లో భాగంగా స్కూల్లో పది లైన్ల పద్యం రాసుకురమ్మన్నారట టీచర్. ఏదీ గుర్తుకు రావడం లేదట. దీంతో ఏకంగా ప్రముఖ రచయిత్రి ప్రీతిని అడిగారు. రచయిత్రి కాదా..! బాగా రాస్తుందనుకున్నారో ఏమో మరి..! అయితే.. స్టుడెంట్ అడిగిన సహాయాన్ని ప్రీతి సున్నితంగా తిరస్కరించారు. స్టుడెంట్ అడిగిన సహాయాన్ని ప్రీతి స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అది కాస్త.. నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ పోస్టుపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. అది హోం వర్క్ కాదు.. కాంపిటీషన్.. ఏకంగా ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దామనే ప్లాన్ చేశారా స్టుడెంట్ అంటూ స్పందించారు. 10వ తరగతి విద్యార్థి అంటే ఇంకా చిన్నపిల్లలేం కాదు.. తిరస్కరించినందుకు ధన్యవాదాలు అంటూ మరికొందరు కామెంట్ చేశారు. చాట్ జీపీటీని అడుగొచ్చు కదా..! ఇలా అడగడం ఎందుకు? అని మరికొందరు ఫన్నీగా సలహాలు ఇచ్చారు. And look at this message I received just now ! A kid wants me to do their homework for them! 🤷🏻♀️🤷🏻♀️🤷🏻♀️ pic.twitter.com/T6yv6dE8N4 — Preeti Shenoy (@preetishenoy) June 29, 2023 ఇదీ చదవండి: బీచ్ రోడ్లో 'బిగ్ బీ' పాటకు వృద్ధ జంట స్టెప్స్.. ఆనంద్ మహేంద్ర ట్వీట్.. వీడియో వైరల్.. -
పీ ఫర్ పాడ్‌కాస్ట్.. బీ ఫర్ భార్గవి
లాక్డౌన్ లైఫ్స్టైల్లో మెరిసిన ఒక ట్రెండ్.... పాడ్‌కాస్ట్. ‘పాడ్‌కాస్ట్’ పాపులారిటీ గురించి వినడమేగానీ దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడానికి, సక్సెస్ఫుల్ పాడ్‌కాస్టర్‌గా రాణించాలనుకునే వారికి సాధికారికమైన సమాచారం కరువైంది. ఈ లోటును పూరించడానికి మంచి పుస్తకాన్ని తీసుకువచ్చి ఔత్సాహికులకు మేలు చేసింది భార్గవి.. లీడింగ్ హెచ్ఆర్ కన్సల్టింగ్ కంపెనీ ‘ఎక్సెల్ కార్పోరేషన్’కు సీయీవోగా ఉన్న బెంగళూరుకు చెందిన భార్గవి స్వామి మన దేశంలోని లీడింగ్ పాడ్కాస్టర్లలో ఒకరు. కంటెంట్ ప్రొడ్యూసర్‌గా కూడా తన సత్తా చాటుతుంది. మన దేశంలో పాడ్కాస్ట్పై వచ్చిన తొలిపుస్తకం ‘పీ ఫర్ పాడ్‌కాస్ట్’ రచయిత్రిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తన అనుభవాలను క్రోడీకరించి ఫస్ట్–పర్సన్లో రాసిన ఈ పుస్తకం పాడ్‌కాస్ట్ గురించి ప్రాథమిక విషయాలను తెలుసుకోవాలనుకునేవారికి దిక్సూచిలా నిలిచింది. ‘ఆర్ట్ ఆఫ్ పాడ్‌కాస్టింగ్’ను అక్షరాల్లోకి తెచ్చింది. బిజినెస్ పాడ్‌కాస్ట్ షో ‘పీపుల్ హూ మ్యాటర్’తో సక్సెస్ఫుల్ పాడ్‌కాస్టర్‌గా పేరు తెచ్చుకుంది భార్గవి. పాడ్‌కాస్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టే ముందు దాని లోతుపాతులు ఏమిటో తెలుసుకోవడానికి చిన్నపాటి రీసెర్చ్ లాంటిది చేసింది. అయితే పాడ్‌కాస్టర్‌గా తొలి అడుగులు వేయడానికి అవసరమైన సమాచారం దొరకడం గగనం అయింది. ‘జీరో ఇన్ఫర్మేషన్’ అనేది వెక్కిరిస్తున్నా తన పరిశోధనలో ఎక్కడా తగ్గింది లేదు. మాస్కమ్యూనికేషన్లో మాస్టర్స్ చేసిన భార్గవి తనదైన పద్ధతిలో పరిశోధన చేస్తూ సమాచారాన్ని సంపాదించింది. ‘తెలుసుకోవడానికి ఇన్ని విషయాలు ఉన్నాయా!’ అనిపించింది. తాను సక్సెస్ఫుల్ పాడ్‌కాస్టర్‌గా రాణించడానికి అవి మంచి మార్గాన్ని చూపాయి. తన సక్సెస్‌తోనే ఆగిపోకుండా పాడ్‌కాస్టింగ్‌లో సక్సెస్ కావాలనుకునేవారి కోసం ‘పీ ఫర్ పాడ్‌కాస్టింగ్’ అనే పుస్తకం రాసింది. వెబ్‌సీరీస్‌ల కోసం స్క్రిప్ట్ రాసినప్పుడు ఫస్ట్ డ్రాఫ్ట్‌లోనే ఓకే అయిపోయేది. ‘పీ ఫర్ పాడ్‌కాస్టింగ్’ విషయంలో మాత్రం పలుసార్లు పుస్తకాన్ని తిరగరాసింది. ఏదో ఒక విషయాన్ని కొత్తగా చేరుస్తూ వచ్చింది. ఈ పుస్తకానికి భార్గవి తల్లి ఎడిటర్లా వ్యవహరించింది. సూచనలు ఇచ్చింది. తల్లితో కలిసి ఈ ప్రాజెక్ట్ మీద పనిచేయడం భార్గవికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ‘పుస్తకాలు ఎక్కువగా చదవడం వల్ల రచనల ద్వారా ఒక విషయాన్ని సులభంగా కమ్యూనికేట్ చేయగలిగే విద్య పట్టుబడింది. నాలోని భావాలను ఆవిష్కరించడానికి రచనలను ఒక మాధ్యమంలా చేసుకుంటాను. అయితే పీ ఫర్ పాడ్‌కాస్ట్ అనేది నాలోని భావాల ఆవిష్కరణకు మాత్రమే పరిమితమైపోలేదు. ఎంతోమందికి దారి చూపించింది’ అంటుంది భార్గవి. అరవింద్ అడిగ, కిరణ్ దేశాయ్, అశ్విని సంఘీ.. మొదలైన వారి రచనలపై ఆసక్తి చూపించే భార్గవి కార్పొరేట్ దిగ్గజాల ఆలోచనలను, లీడర్షిప్, కోచింగ్‌లకు సంబంధించి పుస్తకాలను ఇష్టపడుతుంది. సంతోషం వెనక ఉండే శాస్త్రీయతను తెలుసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తుంది. ‘పాడ్‌కాస్టర్‌గా నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మరింతగా ప్రయత్నిస్తున్నాను’ అంటున్న భార్గవి స్వామి వెబ్‌సీరీస్ కోసం స్క్రిప్ట్‌లు రాయడానికి, ఒక యంగ్ ఎంటర్ప్రెన్యూర్ గురించి ఫిక్షన్ బుక్ రాయడానికి సన్నాహాలు చేస్తోంది. సక్సెస్ మంత్ర లాక్డౌన్ లైఫ్‌స్టైల్ వల్ల రీడింగ్, రైటింగ్ అనేవి మనకు బాగా చేరువయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పాడ్‌కాస్ట్ సెగ్మెంట్ దూసుకుపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాడ్‌కాస్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టాను. ‘పాడ్‌కాస్టర్‌గా సక్సెస్ కావాలి’ అనుకోగానే సరిపోదు. అందుకు తగిన కసరత్తులు చేయాలి. మనదైన ప్రత్యేకత కోసం ప్రయత్నించాలి. స్కూల్‌రోజుల్లో నేను చదువుల్లో ముందు ఉండడంతో పాటు పాటలు పాడేదాన్ని. నృత్యాలు చేసేదాన్ని. ఉపన్యాస పోటీల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. అయితే ఇవేమీ స్కూలు దగ్గరే ఆగిపోలేదు. సృజనాత్మక విషయాలలో నాకు నిరంతరం తోడుగా నిలుస్తున్నాయి. ‘మీ సక్సెస్ మంత్ర ఏమిటి?’ అని చాలామంది నన్ను అడుగుతుంటారు. సక్సెస్‌కు షార్ట్కట్లు ఉండవు. మనల్ని సక్సెస్‌ఫుల్‌గా మార్చడానికి గాడ్ఫాదర్లు ఉండరు. వృత్తిపై మనం చూపే ఆసక్తి, పడే కష్టం, మన పరిచయాలు విజయపథంలో దూసుకుపోవడానికి కారణం అవుతాయి. సక్సెస్ కోసం ఒకరిని అనుసరించాలనే రూల్ ఏమీలేదు. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమిటో కనుక్కుంటే చాలు. – భార్గవి స్వామి, స్టార్ పాడ్‌కాస్టర్, ఎంటర్ప్రెన్యూర్ (చదవండి: పట్టుదారంతో జీవితాన్ని అల్లుకుంది ) -
భావి ఫలం
పాత కథే. కానీ కొత్త విషయానికి ప్రారంభంగా పనికొస్తుంది. చావు దగ్గరపడిన ఓ ముసలాయన ఎంతో శ్రద్ధగా మొక్క నాటడాన్ని చూసిన బాటసారి నవ్వడం మనకు తెలుసు. అది ఎప్పటికి పెరిగేనూ, ఎప్పటికి కాసేనూ! ప్రతి పనినీ మన కోసమే చేయం. ముందు తరాలకు పనికొచ్చేట్టుగా చేస్తాం. అదే వాళ్ల పూర్వీకులుగా మనం ఇవ్వగలిగే కానుక! బాటసారిలో గౌరవం పెరిగేలా వృద్ధుడు ఇదే చెబుతాడు. సరిగ్గా ఇలాంటి భావనతోనే నార్వేలో ‘ఫ్యూచర్ లైబ్రరీ ప్రాజెక్ట్’ ప్రారంభమైంది. దీనికి శ్రీకారం చుట్టింది స్కాట్లాండ్కు చెందిన విజువల్ ఆర్టిస్ట్ కేటీ పేటర్సన్. ఈమె వయసు 41 ఏళ్లు. ఈ భవిష్యత్ గ్రంథాలయ ప్రాజెక్టు 2014లో ప్రారంభమైంది. వందేళ్ల పాటు అంటే 2114 వరకూ కొనసాగుతుంది. ఒక్కో ఏడాదికి ఒక్కో రచయిత తన సరికొత్త అముద్రిత రచనను ఈ గ్రంథాలయానికి బహూకరిస్తారు. మొదటి రచనగా 2014 సంవత్సరానికి మార్గరెట్ అట్వుడ్ (కెనడా) తన ‘స్క్రిబ్లర్ మూన్ ’ సమర్పించారు. 2015కు డేవిడ్ మిషెల్ (ఇంగ్లండ్) తన ‘ఫ్రమ్ మి ఫ్లోస్ వాట్ యు కాల్ టైమ్’ను ఇచ్చారు. 2016కు షివోన్ (ఐస్లాండ్), 2017కు ఏలిఫ్ షాఫక్ (టర్కీ) తమ రచనలు బహూకరించారు. 2018కి హాన్ కాంగ్ (దక్షిణ కొరియా), 2019కి కార్ల్ ఊవ్ నాస్‌గార్డ్ (నార్వే), 2020కి ఓసియన్ వువాంగ్ (వియత్నాం) ఇచ్చారు. ఈ రచనలన్నీ ఆంగ్లంలోనే ఉన్నాయని కాదు, అలా ఇవ్వాలని కూడా లేదు. సౌకర్యార్థం శీర్షికల వరకు ఆంగ్లంలో అనువదించి ఉంచారు. విశేషం ఏమంటే– ఇందులోకి చేరే ‘పుస్తకాలు’ ఏమిటో కేటీకి గానీ, ఈ లైబ్రరీని నిర్వహించడానికి నెలకొల్పిన ‘ద ఫ్యూచర్ లైబ్రరీ ట్రస్టు’కు గానీ తెలీదు. సాహిత్యానికి గానీ కవిత్వానికి గానీ అద్భుతమైన చేర్పు అయిన, భవిష్యత్ తరాల ఊహలను అందుకోగలిగే శక్తి సామర్థ్యాలున్న రచయితను ఆ సంవత్సరపు రచయితగా ఎంపిక చేసుకుంటారు. వారు అంగీకరించాక, అది రాయడానికి ఒక ఏడాదైనా పడితే, ఆ పూర్తయిన రాతపత్రిని నార్వేలో జరిపే ప్రత్యేక వేడుక ద్వారా స్వీకరిస్తారు. అందుకే 2021కి గానూ సిత్సి దాంగెరెంబ్గా(జింబాబ్వే) ‘నారిని అండ్ హర్ డాంకీ’ని 2022లో ఇచ్చారు. 2022 సంవత్సరానికి జుడిత్ షలన్ స్కీ (జర్మనీ) ఈ జూన్ లో అందజేస్తారు. ఆ రాతప్రతిని ప్రత్యేకమైన వస్త్రాల్లో చుట్టి, ఓస్లో ప్రజా గ్రంథాలయంలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన గదిలో ఉంచుతున్నారు. ఇవి వందేళ్ల తర్వాత ప్రచురితమవుతాయి. మరో విశేషం ఏమంటే, ఈ పుస్తకాలను అచ్చు వేయడానికే వెయ్యి చెట్లను ప్రత్యేకంగా అక్కడి నార్డ్‌మార్కా అటవీ ప్రాంతంలో పెంచుతున్నారు. ఈ వంద చేతిరాత ప్రతులను ఈ చెట్లతో తయారుచేసిన కాగితాలతో లిమిటెడ్–ఎడిషన్ గా ప్రచురిస్తారు. అందుకే దీన్ని ప్రపంచపు అత్యంత రహస్య గ్రంథాలయం అని గార్డియన్ పత్రిక అభివర్ణించింది. అయితే వందేళ్ల పాటు వీటిని చదవకుండా పాఠకులకు దూరంగా ఉంచుతున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి. వందేళ్ల నాటికి ఈ ప్రాజెక్టును ప్రారంభించిన వాళ్లుగానీ, దీనికి పుస్తకాలు సమర్పించిన చాలామంది రచయితలుగానీ ఉండరు. మార్గరెట్ అట్వుడ్ వయసు 83 ఏళ్లు. అంతెందుకు, ఈ ప్రాజెక్టు రచయితలుగా పరిగణనలోకి వచ్చిన టోమాస్ ట్రాన్స్ ట్రోమార్ (స్వీడన్ ), ఉంబెర్టో ఎకో (ఇటలీ) ఇప్పటికే మరణించారు కూడా. ‘‘అప్పటికి దీర్ఘకాలంగా నిశ్శబ్దంగా ఉన్న నా గొంతుక ఉన్నట్టుండి, ఒక వందేళ్ల తర్వాత మేల్కొంటుందన్న ఆలోచనే చిత్రంగా ఉంది. ఆ కంటెయినర్ లోంచి ఆ పుస్తకంలోని మొదటి పేజీ తెరిచే ఇప్పటికింకా శరీరంగా రూపుదిద్దుకోని ఆ చేతికి ఆ గొంతుక ఏం చెబుతుంది?’’ అని ఉద్విగ్నంగా మాట్లాడారు మార్గరెట్ అట్వుడ్. ‘‘భవిష్యత్తులో ఎప్పుడో చదువుతారని ఆశిస్తున్న ఒక రాతప్రతిని రాయడమనే ఆలోచనే ఒక ఉత్తరం రాసి నదిలో వేయడం లాంటిది. అది ఎటు పోతుందో మనకు తెలీదు, ఎవరు చదువుతారో తెలీదు– ఆ కాలప్రవాహాన్ని విశ్వసించడమే’’ అన్నారు ‘ద బాస్టర్డ్ ఆఫ్ ఇస్తాంబుల్’, ‘ద ఫార్టీ రూల్స్ ఆఫ్ లవ్’ లాంటి నవలలు రాసిన ఎలిఫ్ షఫాక్. ఆమె ఇచ్చిన ‘ద లాస్ట్ టాబూ’ కాల ప్రవాహంలో ఏ మలుపులు తీసుకుంటుందో! ‘‘నేనెట్లాగూ మరో వందేళ్లు ఉండను. నేను ప్రేమించేవాళ్లు కూడా ఉండరు. ఈ కనికరం లేని వాస్తవం నా జీవితంలోని అత్యంత ముఖ్యమైన విషయం గురించి ఆలోచించేట్టు చేసింది. నేనెందుకు రాస్తాను? నేను రాస్తున్నప్పుడు ఎవరితో సంభాషిస్తున్నాను? ఆ తర్వాత నేను ఒక ప్రపంచాన్ని ఊహించాను, అక్కడ నేను ప్రేమించేవాళ్లు ఎవరూ ఉండరు. కానీ ఆ ప్రపంచంలో నేను బతికి వుండగా కలిసిన నార్వేలోని చెట్లు ఇంకా ఉంటాయి. మనుషులకూ, చెట్లకూ మధ్య ఉన్న స్పష్టమైన ఈ అంతరం నన్ను తాకింది. ఈ ధ్యానం ఎంత తీవ్రమైనదంటే, మన నశించిపోయే జీవితాల అశాశ్వతత్వానికీ, విలువైన పెళుసుదనాల మన జీవితాలకూ నేరుగా కళ్లు తెరిపించింది’’ అంటారు దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్. ‘‘ఈ ఆలోచన అద్భుతం. ఇప్పటికింకా పుట్టని పాఠకులకు మన కాలం నుంచి వారి కాలానికి ఒక చిన్న పడవను పంపడమే ఇది’’ అన్నారు కార్ల్ ఓవ్ నాస్‌గార్డ్. ఇప్పుడు పెరుగుతున్న ఈ చెట్ల నుంచి కాయనున్న పుస్తకాలను ఆరగించడానికి ప్రపంచంలోని ఏ మూలల్లో మనుషులు జీవం పోసుకోనున్నారో! వందేళ్ల తర్వాత ఏం జరుగుతుందో చూడాలని ఇప్పుడే కుతూహలంగా లేదూ! -
Nandini Krishnan: అనువాద వారధి
సొంతగా రచనలు చేయగలిగేవారు అనువాదాలు చేయరు. భాష బాగా వచ్చినంత మాత్రాన అనువాదం చేయలేరు. దానికి నైపుణ్యం, కొంత నిస్వార్థం కావాలి. తమిళ రచయిత్రి నందిని కృష్ణన్ చేసిన ‘పొన్నియిన్ సెల్వన్’ ఇంగ్లిష్ అనువాదం ఏప్రిల్ 24న మార్కెట్లోకి రానుంది. నవలలోని పాతకాలపు తమిళాన్ని నేటి యువతకు అందేలా అనువాదం చేయడం సులువు కాదు. తమిళంలోని ఉత్తమ నవలలను సవాలుగా తీసుకుని నందిని ఇంగ్లిష్‌లో అనువాదం చేస్తోంది. ఆమెకు వస్తున్న గుర్తింపు ఆ రంగంలో రాణించాలనుకునే స్త్రీలు గమనించదగ్గది. దాదాపు 2500 పేజీలు ఉండే ఐదు భాగాల భారీ ప్రఖ్యాత తమిళ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ను ఇంగ్లిష్‌లో అనువాదం చేయబూనడం సాహసం. కాని ఈ క్లాసిక్‌ను అనువాదం చేయడానికి చాలా మంది ట్రై చేస్తూనే వచ్చారు. ముగ్గురు నలుగురు సఫలీకృతులయ్యారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్‌కు తగ్గట్టుగా అనువాదం చేయడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు నందిని కృష్ణన్ వంతు. ఆమె చేసిన ఈ నవల అనువాదం మొదటి భాగం పూర్తయ్యింది. ఏప్రిల్ 24న విడుదల కానుంది. వెస్ట్‌ల్యాండ్ బుక్స్ దీనిని ప్రచురిస్తుంటే ‘పొన్నియిన్ సెల్వన్’ను రెండు భాగాల సినిమాగా తీస్తున్న దర్శకుడు మణిరత్నం ఈ కార్యక్రమానికి ప్రోత్సాహకుడిగా ఉన్నాడు. ‘పొన్నియిన్ సెల్వన్ నవల 75 ఏళ్ల క్రితం నాటిదని గుర్తు లేనంతగా అనునిత్యం తమిళ సాహిత్యంలో కలగలిసిపోయింది. కల్కి రాసిన ఈ నవలలోని భాషను, పై అర్థాన్ని, లోపలి అర్థాన్ని అర్థం చేసుకుని అనువాదం చేయడం చాలా జటిలం. అయినా చేశాను. పాఠకులు సులభంగా చదువుకోవడానికి, చేత బట్టుకోవడానికి వీలుగా ఇంగ్లిష్‌లో ఐదు కంటే ఎక్కువ భాగాలుగా విభజించి పుస్తకాలుగా తేనున్నాము’ అని తెలిపింది నందిని కృష్ణన్. ఎవరీ నందిని కృష్ణన్? నందిని కృష్ణన్ చెన్నైలో స్థిరపడిన నాటకకర్త, రచయిత్రి, స్టేజ్ యాక్టర్ కూడా. లండన్‌లో, ఢిల్లీలో జర్నలిస్ట్‌గా పని చేసింది. ఆ తర్వాత చెన్నై నుంచి వెబ్, ప్రింట్ మీడియాలలో పని చేయడం మొదలుపెట్టింది. హాస్యం రాస్తుంది. పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లకు ప్రాధాన్యం ఇచ్చే భారతీయ వైవాహిక వ్యవస్థపై విమర్శను పెడుతూ వివాహమైన స్త్రీలను, పురుషులను ఇంటర్వ్యూ చేసి ‘హిచ్డ్: ది మోడర్న్ అండ్ అరేంజ్డ్ మేరేజ్’ పుస్తకం తెచ్చింది. ట్రాన్స్ మెన్ జీవితాల ఆధారంగా ‘ఇన్విజిబుల్ మెన్‘ పుస్తకం రాసింది. పెరుమాళ్ మురుగన్ నవలలను ఇంగ్లిష్‌లో అనువాదం చేయడం ద్వారా అనువాద రంగంలో ప్రవేశించింది. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్‘ అనువాదం చేస్తోంది. నందిని కృష్ణన్ ఇంట్లో ఎప్పుడూ వీధి కుక్కలు ఉంటాయి. వాటిని సాకుతుంటుంది. పిల్లులను కూడా. ‘కుక్కలు, పిల్లలు, వేల కొద్ది పుస్తకాలు అంతే మా ఇల్లు’ అని చెబుతుంది. కత్తి మీద సాము ‘అనువాదం చేయడం కత్తి మీద సాము’ అంటుంది నందిని. ‘సొంత రచనైతే అలా ఒక సమాధి స్థితికి వెళ్లి రాసుకుంటూ పోతాము. అనువాదం అలా కాదు. అప్రమత్తంగా ఉండాలి. ఎదుటివారు చదివితే అది కేవలం అనువాదం అనిపించకూడదు. అదే సమయంలో ఒరిజినల్ నవల తాలూకు పరిమళం దానిలో ఉండాలి. అనువాదం పూర్తి చేశాక ఎవరిదో కన్నబిడ్డను మనం సాకాం... ఇక దీనితో రుణం చెల్లిపోయింది అన్న బాధ తప్పదు’ అంటుంది నందిని. ‘అనువాదకులు స్వయంగా రచయితలు కాకపోవడం వల్ల కొన్ని అనువాదాలు చెడిపోతాయి. ఎందుకంటే వాళ్లు ప్రతి మాటా కచ్చితంగా అనువాదం చేస్తూ కృతకంగా మారుస్తారు. అనువాదకులు స్వయంగా రచయితలైనా కూడా కొన్ని అనువాదాలు చెడిపోతాయి. ఎందుకంటే వారు తమ సృజనశక్తిని కూడా కలుపుతారు. అది తప్పు. వేరొకరు గీసిన బొమ్మను నకలు చేసేటప్పుడు మనం పికాసో అంతటివాళ్లమైనా ఆ బొమ్మలో మన గొప్పదనం చూపకూడదు. అనువాదం అయినా అంతే’ అంటుంది నందిని కృష్ణన్. మంచి అనువాద రుసుము ‘అనువాదంలో రాణించాలంటే మంచి డబ్బు కూడా మనకు ఆఫర్ చేయాలి. తగిన డబ్బు లేకుండా అనువాదం చేయడం అనవసరం’ అంటుంది నందిని. ‘కొంతమంది కల్లబొల్లి మాటలు చెప్పి అనువాదం చేయించుకోవాలనుకుంటారు. వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. నేను రోజుకు ఆరేడు గంటలు అనువాదం చేస్తాను. ఒక పదానికి బదులు ఎన్ని పదాలు వాడొచ్చో అవసరమైతే లిస్ట్ రాసుకుంటాను. ఒరిజినల్ని చదువుతూ, అనువాదాన్ని చదువుకుంటూ పని ముగిస్తాను. పెరుమాళ్ మురుగన్ లాంటి రచయితలు పల్లెల్లో మరీ కొన్ని వర్గాలు మాత్రమే వాడే మాటల్ని ఉపయోగించి రాస్తారు. వాటికి ఇంగ్లిష్ మాటలు ఉండవు. డిక్షనరీలు కూడా ఉండవు. అందుకే అవసరమైతే ఒరిజినల్ రచయితనే సంప్రదిస్తూ డౌట్లు క్లియర్ చేసుకుంటూ అనువాదం ముగించాలి’ అంటుంది నందిని. నందిని లాంటి అనువాదకులు తెలుగులో కూడా ఉంటే మన క్లాసిక్స్ కూడా ప్రపంచ పాఠకులకు తప్పక చేరుతాయి. అనువాదకులకు గుర్తింపునూ తెచ్చిపెడతాయి. -
పారిస్ పవనాలు
తెలుగువాళ్లు ఉగాది జరుపుకోవడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు ప్రపంచ సాహిత్యానికి ‘వసంతం’ వచ్చింది. సాహిత్య రంగంలో అత్యంత విశిష్టమైన మ్యాగజైన్ గా పేరున్న ‘ద పారిస్ రివ్యూ’ తన 70వ వార్షికోత్సవ ‘స్ప్రింగ్’ సంచికను ఈ వారంలోనే విడుదల చేసింది. అన్ని సంచికలనూ క్రమసంఖ్యతో వెలువరించే సంప్రదాయం ఉన్నందున పత్రిక పరంపరలో ఇది 243వ ఇష్యూ. 2018లో మ్యాన్ బుకర్ గెలుచుకుని, అదే ఏడాది నోబెల్ పురస్కారం పొందిన పోలండ్ రచయిత్రి ఓల్గా తొకార్చుక్ ఇంటర్వ్యూ ఈ సంచిక విశేషాల్లో ఒకటి. కవిత్వం, వచనం, కళలకు అత్యంత ప్రాధాన్యముండే ఈ పత్రికలో రచయితల అంతరంగాలను లోలోతుల నుంచి అత్యంత సూక్ష్మంగా, విశదంగా స్పృశించడం మొదటినుంచీ ఒక ప్రత్యేకతగా నిలిచిపోయింది. నేపథ్యం, రాసే విధానం, విచారధారతో పాటు సాహిత్య సృజనను ప్రయోగ శాలలో పరిశీలించినంత లోతుగా జరిపే కాలాతీత సంభాషణలు ఇవి. ‘ఒక రాత్రి ఓ స్నేహితుడు నాకు ఫ్రాంజ్ కాఫ్కా కథల పుస్తకం అరువిచ్చాడు. నేనుంటున్న లాడ్జికి తిరిగివెళ్లి ‘ద మెటమార్ఫసిస్’ చదవడం మొదలుపెట్టాను. ఆ మొదటివాక్యమే నన్ను దాదాపు మంచంలోంచి కిందపడేసినంత పని చేసింది. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ మొదటి వాక్యం ఇలా ఉంది: ‘‘ఒక ఉదయం కలత నిదురతో మేల్కొన్న గ్రెగర్ జాంజా, మంచంలో తానొక పెద్ద పురుగుగా మారిపోయి ఉండటం గుర్తించాడు...’’ ఆ వాక్యం చదవగానే, ఎవరైనా ఇలాంటి విషయాలు కూడా రాయవచ్చని నాకు ఇంతకుముందు తెలీదే అని నాకు అనిపించింది. తెలిసివుంటే, నేను ఎప్పుడో రాయడం మొదలుపెట్టేవాడిని. వెంటనే నేను కథలు రాయడం మొదలుపెట్టాను’ అని తన సాహిత్య ప్రస్థానం గురించి చెబుతారు గాబ్రియేల్ గార్సియా మార్వె్కజ్. ‘ఫిక్షన్ నా జర్నలిజానికి సాహిత్య విలువను ఇచ్చింది. జర్నలిజం నా ఫిక్షన్ ను వాస్తవానికి దగ్గరగా ఉండేట్టు చేసింది’ అంటారు ఈ పాత్రికేయ రచయిత. ‘నేను ఏ భాషలోనూ ఆలోచించను. నేను దృశ్యాల్లో ఆలోచిస్తాను. అసలు ఎవరికైనా ఆలోచించేటప్పుడు భాషతో పని ఉంటుందనుకోను’ అని చెబుతారు తన మాతృభాష రష్యన్ కు దూరమైన వ్లాదిమీర్ నబకోవ్. ‘అచ్చులోకొచ్చిన నా ప్రతీ పదమూ అనేకమార్లు తిరగరాయబడిందే. నా ఎరేజర్లతో పోలిస్తే నా పెన్సిళ్ల జీవితకాలమే ఎక్కువ’ అంటారు ఈ పర్ఫెక్షనిస్టు. ‘నేను ఎవరికీ ప్రాతినిధ్యం వహించటం లేదు’ అని నిర్మొహమాటంగా చెప్పే భారత మూలాలున్న ట్రినిడాడ్–బ్రిటిష్ రచయిత వి.ఎస్.నైపాల్, ‘మనిషి అనునిత్యం నైతిక తీర్పుల బరువు మోయనక్కర్లేని ప్రపంచాన్ని కోరుకున్నాను’ అంటారు. ఎర్నెస్ట్ హెమింగ్వే, జేమ్స్ థర్బర్, రే బ్రాడ్బరీ, స్టీఫెన్ కింగ్, రేమండ్ కార్వర్, మాయా ఏంజెలో, లిడియా డేవిస్ లాంటి వందలాది మేటి రచయితల ఇంటర్వ్యూలను ‘ది ఆర్ట్ ఆఫ్ ఫిక్షన్ ’ విభాగంలో ప్రచురించింది పారిస్ రివ్యూ. జార్జ్ లూయీ బోర్హెస్, హారుకీ మురకామి, మిలన్ కుందేరా, సైమన్ దె బువా, ఒర్హాన్ పాముక్, సల్మాన్ రష్దీ, చినువా అచేబే లాంటి భిన్న మూలాలున్న రచయితలు ఇందులో ఉన్నారు. ‘ది ఆర్ట్ ఆఫ్ పొయెట్రీ’గా రాబర్ట్ ఫ్రాస్ట్, టీఎస్ ఎలియట్, అక్తావియో పాజ్, పాబ్లో నెరూడా, ఎజ్రా పౌండ్ లాంటి కవుల సంభాషణలను నమోదు చేసింది. ఇవన్నీ ‘ద రైటర్స్ ఎట్ వర్క్’ పుస్తకాల సిరీస్‌గా వచ్చాయి. ప్రపంచ చరిత్రలో పట్టువిడవకుండా ఒంటిచేత్తో నెరిపిన సాంస్కృతిక సంభాషణగా దీన్ని అభివర్ణించారు సాహిత్య విమర్శకుడు జో డేవిడ్ బెలామీ. ఈ త్రైమాసిక ఆంగ్లభాష పత్రిక ఫ్రాన్ ్స రాజధాని నగరం పారిస్‌లో 1953లో ప్రారంభమైంది. 1973లో అమెరికాలోని న్యూయార్క్ నగరానికి తన కార్యస్థానాన్ని మార్చుకుంది. పత్రికను స్థాపించిన నాటి నుంచీ 2003లో మరణించేదాకా– యాభై ఏళ్లపాటు అమెరికా రచయిత జార్జ్ ప్లింప్టన్ దీనికి ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించారు. ఆయన ముద్ర ఎంతటిదంటే, ఈయన తర్వాత ఆ స్థానంలోకి వచ్చిన బ్రిజిడ్ హ్యూస్... ప్లింప్టన్ గౌరవార్థం ‘సంపాదకురాలు’ అనిపించుకోవడానికి నిరాకరించారు. ప్రస్తుతం ఎమిలీ స్టోక్స్ సంపాదకురాలిగా ఉన్నారు. పత్రిక చరిత్రలో ఈమె ఆరో ఎడిటర్. ఫిలిప్ రాత్, ఇటాలో కాల్వీనో, శామ్యూల్ బెకెట్, డేవిడ్ ఫాస్టర్ వాలెస్ లాంటి మహామహుల రచనలు పారిస్ రివ్యూలో చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం 24,000 ప్రింట్ కాపీల సర్క్యులేషన్, నెలకు సుమారు 12 లక్షల ఆన్ లైన్ వ్యూస్ ఇది కలిగివుంది. ఈ ఏడు దశాబ్దాల్లో ఎన్నో సాహిత్య పత్రికలు మూతపడ్డాయి. ‘ఎన్ని పోయినా మనకు ‘పారిస్’ మాత్రం ఉంటుంది’ అంటారు రచయిత వుహాన్ విడాల్. ‘పారిస్ రివ్యూ చచ్చేంత బోర్ కొడుతోందని ఎప్పటికీ అనలేం’ అంటారు పబ్లిషర్ జెస్సా క్రిస్పిన్ . ఉత్తమ సాహిత్యానికి పెద్దపీట వేయడంతో పాటు, ఆర్కైవు మొత్తాన్నీ అందుబాటులో ఉంచడం, అందులోని క్లాసిక్స్‌ను నవతరపు రచయితల వ్యాఖ్యానంతో పునఃప్రచురించడం లాంటివి కొత్త పాఠకులను పాత సాహిత్యంతో పరిచయం చేసుకునేలా ఉపకరిస్తున్నాయి. 2012 నుంచీ మొబైల్ యాప్ ప్రారంభించింది. 2017లో పాడ్‌కాస్ట్ మొదలుపెట్టింది. సమకాలీన రచయితల రచనలను తమ గొంతుల్లోనే వినిపించడం కూడా మొదలుపెట్టింది. ఎలా రాయాలో శిక్షణ ఇచ్చే రోక్సానే గే తన ‘మాస్టర్ క్లాస్’లో వర్తమాన రచయితలకు ఇచ్చే ఒక ముఖ్యమైన సలహా: పారిస్ రివ్యూ ఇంటర్వ్యూలను లోతుగా చదవడం! సాహిత్యం రెండో ఆలోచనగా మాత్రమే ఉండే ప్రపంచంలో దాన్ని ఉత్సాహభరితం చేస్తూ, ప్రధాన స్రవంతికి తేగలిగింది ‘ద పారిస్ రివ్యూ’! -
Kudrat Dutta Chaudhary: హక్కుల గొంతుక
దేశం కాని దేశం వెళ్లిన వారికి రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి సమస్యల్లో ఉన్న వారికి తక్షణ సహాయం చేసే బలమైన వ్యక్తి అవసరం. అలాంటి వ్యక్తి... కుద్రత్ చౌదరి. ఇమిగ్రెంట్ రైట్స్ కమిషనర్‌గా శాన్ఫ్రాన్సిస్కోలో నివసించే వలసదారులకు అండగా ఉండనుంది... శాన్ఫ్రాన్సిస్కో (యూఎస్) ఇమిగ్రెంట్ రైట్స్ కమిషనర్(ఐఆర్సీ)గా బాధ్యతలు చేపట్టిన కుద్రత్ దత్తా చౌదరి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఈ పదవికి ఎంపికైన భారతసంతతి(ఇమిగ్రెంట్)కి చెందిన తొలివ్యక్తిగా గుర్తింపు పొందింది. శాన్ఫ్రాన్సిస్కోలో నివసించే వలసదారుల సమస్యలు, విధానాలకు సంబంధించిన విషయాలపై మేయర్, బోర్డ్ ఆఫ్ సూపర్వైజర్స్కు ‘ఐఆర్సీ’ సలహాలు ఇస్తుంది. ‘కొత్త బాధ్యత నాలో ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని నింపింది. నా వాళ్ల గురించి పనిచేసే అవకాశం లభించింది’ అంటుంది కుద్రత్. చండీగఢ్‌లో జన్మించిన కుద్రత్ ‘పంజాబ్ ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా’లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించింది. లండన్ కింగ్స్ కాలేజీలో క్రిమినాలజీ, క్రిమినల్ జస్టిస్ చదువుకుంది. హార్వర్డ్ లా స్కూల్లో స్త్రీవాదం, పితృస్వామిక హింస, లైంగిక దోపిడికి సంబంధించిన అంశాలను లోతుగా అధ్యయనం చేసింది. హక్కుల ఉద్యమాలపై మంచి అవగాహన ఉన్న కుద్రత్ సమస్యల పరిష్కారంలో ‘ట్రబుల్ షూటర్’గా పేరు తెచ్చుకుంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా తనదైన శైలిలో పరిష్కరించేది. కుద్రత్ మంచి రచయిత్రి కూడా. 2015 భూకంపం (నేపాల్) తరువాత మానవసంబంధాల్లో వచ్చిన మార్పులు, మనుషుల అక్రమరవాణా, లైంగిక దోపిడిపై ‘లైజా: సమ్ టైమ్స్ ది ఎండ్ ఈజ్ ఓన్లీ ఏ బిగినింగ్’ అనే పుస్తకం రాసింది. కుద్రత్ రాసిన ‘లైజా’ పుస్తకం నేపాల్‌లో ఒక వేసవిలో వచ్చిన భూకంపం తాలూకు భయానక భౌతిక విలయ విధ్వంసాన్ని మాత్రమే కాదు మనిషిలోని విధ్వంసాన్ని కూడా కళ్లకు కడుతుంది. 19 సంవత్సరాల లైజా భూకంపంలో తల్లిదండ్రులను కోల్పోతుంది. ఏ దిక్కూ లేని పరిస్థితులలో తమ్ముడిని తీసుకొని కట్మాండూలోని మామయ్య ఇంటికి వెళుతుంది. నా అనుకున్నవారే మోసం చేయడంతో, ఇండియాలోని ఒక చీకటిప్రపంచంలోకి నెట్టబడుతుంది లైజా. ఇలాంటి విషాదాలెన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి. -
రైటర్స్ బ్లాక్
చాలా చిన్న విషయమే ఇది. ఏం లేదు... ఫలానా ఊళ్లో నివసించే ఒక రచయిత తన ఊళ్లో పూర్తిగా గుంతలు పడ్డ రోడ్లు చూసి ‘చిల్లుల కంబళి’ అనే కథ రాయాలనుకున్నాడు. కొంచెం వ్యంగ్యం రాయగలడు. మాట విరుపులో అందె వేసిన చేయి. ఈ గుంతలకు కారకులెవరో నేరుగా చెప్పకుండా కాకినీ, పిచ్చుకనూ పాత్రలుగా చేసి మొత్తం కథ చెప్పేయగలడు. అయినా సరే చిన్న సంశయం వచ్చింది. కథ ఎట్లాగూ తన ఊళ్లోని ఘోరమైన రోడ్ల గురించి. మరి అచ్చయ్యాక మునిసిపల్ కమిషనర్ గారికి ఈ కథ ఎవరైనా చూపిస్తేనో! ఎం.ఎల్.ఏ సముఖాన ఎవరైనా చదివి వినిపిస్తేనో! పార్టీ కార్యాలయంలో ఔత్సాహికులైన కార్యకర్తలు దీనిని రెడ్ఇంక్తో మార్క్ చేస్తేనో! పాఠకులు చదివి ధర్నాకు ప్లాన్ చేస్తారని పోలీసు వారికి సందేహం వస్తేనో! ఎందుకొచ్చిన గొడవ. ‘చిల్లుల కంబళి’ని మూల పడేశాడు. ఆ తర్వాత ఏ కథా రాయలేక పోయాడు. రైటర్స్ బ్లాక్. ‘ఎక్స్’ మతం, ‘వై’ మతం, ‘జడ్’ మతం గురించి ఒక రచయిత ఎంతో అధ్యయనం చేశాడు. మతాల సకారాత్మక, నకారాత్మక చర్యలను, ప్రపంచవ్యాప్తంగా వాటి మధ్య ఘర్షణను, దరిమిలా స్థానిక ప్రతిఫలనాలను విశదం చేసే 500 పేజీల నవల రాయదలిచి మూడు సంవత్సరాలు సెంట్రల్ లైబ్రరీలో మెటీరియల్ కోసం కూసాలు కదుల్చుకున్నాడు. మతాల కంటే ముందు మనిషే ఉంటా డని మనిషిని దాటి దాటి దాటి మతాల దగ్గరకు రావాలని తన నవలకు ‘ఏ టు ఆర్’ అని పేరు పెట్టుకున్నాడు. నవల చివరలో మార్క్స్‌ను ప్రస్తావిస్తూ ‘మతం ఒక మత్తుమందు’ అని కూడా రాస్తా డట. మిత్రుడు అంతా విని తక్కిందంతా ఓకేగాని ఈ చివరి వాక్యాన్ని పట్టుకుని తమ వ్యాపారాన్ని దెబ్బ తీసేందుకే ఈ నవల రాశావని ‘డిస్టిలరీల జాతీయ సమాఖ్య’ వ్యాజ్యం వేస్తే ఏం చేస్తావ్? అన్నాడు. అంతే. సదరు రచయిత ఆ నవలను అటక ఎక్కించేశాడు. తర్వాత ఏమీ రాయలేదు. రైటర్స్ బ్లాక్. ‘సగటు పట్టణం’ అనే పట్టణానికి ఢిల్లీ ఎంతో దూరమైనా నిజానికి ఢిల్లీ దూరంగా లేదని అక్కడ నివసించే మరొక రచయితకు తెలిసొచ్చింది. అతడు రాయదలిచింది ‘హాయి నడక’ అనే కథను! అందులో పెట్రోలు పోయించుకోలేక ఒక సగటు ఉద్యోగి స్కూటర్ మాని ఆఫీసుకు నడక మీద వెళ్లడం మొదలెడతాడు. తొలత ఇబ్బందిగా ఉన్నా తర్వాత నడకలో ఏదో హాయి ఉందని గ్రహిస్తాడు. దారిలో తన లాంటి వాళ్లే పదిమంది కలవడంతో వారి మధ్య స్నేహం చిగురిస్తుంది. వారంతా వాట్సప్ గ్రూప్ పెట్టుకుంటారు. ఈ కథ అచ్చుకు ముందు చదివిన విమర్శక మిత్రుడు ‘మంచి కథే గాని స్నేహానికి కొత్త వార«ధే గాని వాళ్లంతా ఎప్పుడైతే వాట్సప్ గ్రూప్ పెట్టారో అప్పుడే దేశానికి ప్రమాదకరంగా మారారు. కథ అచ్చయ్యాక కేంద్ర జాగరూకత సంస్థ వచ్చి దేశ సార్వ భౌమత్వానికి విఘాతం కలిగించడానికే ఆ పది మందీ వాట్సప్ గ్రూప్ పెట్టుకున్నారని అంటే కాదని ఎలా నిరూపిస్తావ్’ అన్నాడు. కథ చిరిగిపోయింది. ప్రస్తుతం ఆ రచయిత సగటు పట్టణంలో సగటు బతుకు బతుకుతున్నాడు. రైటర్స్ బ్లాక్. దుప్పి పిల్లల్ని, అప్పుడే పుట్టిన లేడి కూనల్ని నోట కరిచి అవి ఆర్తనాదాలు చేస్తున్నా నిశ్చలంగా ఉండగలిగే పులులను ‘క్షమాభిక్ష’ పేరుతో బోన్ల నుంచి విడిచి పెడతారు. పర్యావరణ హితం కోరే ఒక రచయితకు కథ రాయాలనిపిస్తుంది. రాయలేడు. మిట్ట మీద ఉండే వర్గం వారు పల్లంలో ఉండే వర్గం వారికి కంచె కట్టి ఇబ్బంది పెడతారు. హింసిస్తారు. వివక్షను నిరసించే ఒక రచయితకు కథ రాయాలనిపిస్తుంది. రాయలేడు. కోర్టుకెక్కిన ఫలానా ప్రజావ్యాజ్యంలో న్యాయం ఇదేనని అందరికీ తెలిసినా తీర్పు ఎందుకు ఆలస్యమవుతోంది అని ఒక రచయితకు అసహనం కలుగుతుంది. కథ రాయాలనుకుంటాడు. రాయలేడు. ఆడవాళ్ల బాధలు, ఆదివాసుల బాధలు, ఉద్యోగాలు రాక ఖర్చులకు డబ్బులు లేక కటకటలాడే నిరుద్యోగుల వేదనలు, పేదల పెను ఆర్తనాదాలు, మూలకు నెట్టివేయబడేవారి మూల్గులు, తల్లితండ్రుల చేత చిక్కి ర్యాంకుల వేటలో అల్లాడుతున్న పిల్లల శోకాలు, విస్తారమైన దేశ సంపదలో ఆవగింజంత భాగం కూడా దొరకని కోట్లాది దీనుల మాట పడిపోవడాలు, 12 గంటల చాకిరీకి పొందే చిల్లర జీతాల దీనుల ఈసురోలు, పెను సర్పాలను పట్టి చంపే శక్తిని మరిచిన చలిచీమల మతిమరుపులు... ఇవి కథలు రాయాలని ఉంటుంది చాలామంది రచయితలకు. కానీ రాయలేకపోతున్నారు. రైటర్స్ బ్లాక్. మామూలుగా అయితే ఏదైనా రాయాలనుకుని రాయలేకపోవడం, రాసేందుకు ఆలోచన, ఆసక్తి సన్నగిల్లిపోవడాన్ని ‘రైటర్స్ బ్లాక్’ అంటారు. కాని సత్యం çపలకక పోవడం వల్ల, పలకలేని వాతావరణం ఉండడం వల్ల బలవంతపు రైటర్స్ బ్లాక్‌కు నేడు రచయితలు గురవుతున్నారు. రచయితలు అప్రియమైన సత్యాలు పలికేది జనం పట్ల ఉన్న ప్రియత్వం వల్లే! పాలకుల పట్ల ఉన్న బాధ్యత వల్లే! సత్యం వినే ఓర్పు ఉండాలి. సత్యం లేని చోట చీకటి చోటు చేసుకుంటుంది. సరే! మరి రైటర్స్ బ్లాక్ రిస్క్ వద్దనుకునే వారికి రాయడానికి ఏం మిగులుతాయి? ఎన్నో! శృంగార కథలు, ఉద్రేక నవలలు, నేరగాథలు, అత్తాకోడళ్ల కీచులాటలు, వెకిలి హాస్యాలు, కాలక్షేప బఠాణీలు, కన్నీటి చుక్కకుగాని ఆలోచనా వీచికకు గాని వీలు లేని శుష్క వైకల్యాలు. జాతి సత్యం వైపు ఉండాలా? శుష్కతలో మునిగి తేలాలా? ఎచ్చట రైటర్స్ బ్లాక్ లేకుండా ఉండునో... అచ్చట ధర్మం ఒక పాదానైనా నడుచును!! -
30 రోజుల్లో రచయిత
సమాజంలో భౌతికంగా మనిషి ఎదగగలిగే ఎన్నో హోదాలున్నాయి. కానీ ‘రచయిత’ కావడం అనేది వేరే లెవెల్. రాయడం వల్ల వచ్చే ‘రిటర్నులు’ ఏమిటనేవి ఇదమిద్దంగా ఎవరూ చెప్పలేరు. అయినాకూడా కొందరు రాస్తూనేవుంటారు. రాయడం అనేది వారికి గాలి వీచినంత, పూవు పూచినంత, ప్రవాహం సాగినంత సహజం. రచయిత అనే ట్యాగ్ మనం ఊహించలేనంత పెద్దది. రచయిత అనగానే ఒక మేధావి, ఒక ఆలోచనాపరుడు, జీవితంలో అన్నీ చూసినవాడు అనే ఇమేజ్ కదలాడుతుంది. ఆటోమేటిగ్గా అది ఒక ప్రత్యేక గౌరవానికి కారణం అవుతుంది. అయితే రాసేవాళ్లకు కొన్ని సమస్యలు ఉన్నాయి. చదివేవాళ్లు తగ్గిపోయారు, పుస్తకాలు అమ్ముడు కావడం లేదు, అసలు ఎవరికైనా కాంప్లిమెంటరీ కాపీ ఇచ్చినా దాన్ని ఆసాంతం చదువుతారన్న ఆశ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత స్థితప్రజ్ఞుడైనా కొంత నిరాశ పడక తప్పదు. మరి ఇలాంటప్పుడు ఎవరైనా ఎందుకు రాయాలి? అసలు ఏ రచయితకైనా తన పుస్తకాన్ని పాఠకులు చదవాలి, పుస్తకం అమ్ముడు కావాలి అని అంత పట్టింపు ఎందుకు? అని ఎదురు ప్రశ్నిస్తారు దీపక్ విలాస్ పర్బత్. ‘వెల్ డన్! యు ఆర్ హైర్డ్’, ‘ఎ మాంక్ ఇన్ సూట్’ లాంటి రచనలు చేసిన దీపక్, అచ్చయ్యే పుస్తకాల్లో 60–70 శాతం చదవనివే ఉంటాయంటారు. అందుకే అమ్మడానికి బదులుగా ఫ్రీ గిఫ్ట్‌గా ఇవ్వడం ద్వారా పుస్తకానికి వచ్చే ఆ వందో, రెండు వందలో ఖరీదు కంటే కూడా ఎక్కువ సంపాదించవచ్చని చెబుతారు. ‘‘ఒక మోటివేషనల్ స్పీకర్‌గా మనం ఒక కాలేజీకి వెళ్లి ప్రిన్సిపాల్‌కు ఏ విజిటింగ్ కార్డో, బ్రోషరో ఇస్తే– మనం అక్కడినుంచి వచ్చిన మరుక్షణం అది చెత్తబుట్టలో పడిపోవచ్చు. పైగా అలాంటివి ఎన్ని ఇచ్చినా మన గురించి వాళ్లకు ఒక సరైన అంచనా రాకపోవచ్చు. అదే ఒక పుస్తకం ఇస్తే? బ్రోషర్ కంటే తక్కువ ఖర్చుతో ప్రింటయ్యే పుస్తకం మన గురించిన అత్యుత్తమ పరిచయ పత్రం అవుతుంది. ఆయన చదవకపోవచ్చు, ఊరికే ర్యాకులో పెట్టేయొచ్చు; కానీ ఇచ్చివెళ్లినవాడు ఒక రచయిత అనే ఇమేజ్ పనిచేస్తుంది. ఆ సైకాలజీతోనే మనం ఆడుకోవాలి,’’ అంటారు. ఆ కారణంగానే పుస్తకాన్ని మీ ఎదుగుదలకు ఒక పెట్టుబడిగా వాడుకోండి అని సలహా ఇస్తారు కైలాశ్ సి.పింజానీ. ‘డేట్ యువర్ క్లైంట్స్’, ‘క్యాచ్ ద షార్క్’ లాంటి రచనలు చేసిన కైలాశ్... ఏ ఫీల్డ్ వాళ్లయినా ఎదగడానికి పుస్తకాన్ని ఒక ఆయుధంగా మలుచుకోవచ్చునంటారు. ‘‘ఉజ్జాయింపుగా సమాజంలో తొంభై తొమ్మిది శాతం మంది రచయితలు కాలేరు. కాబట్టి, ఆ రాయగలిగేవాళ్లు అమాంతం ఆ ఒక్క శాతం బ్రాకెట్లోకి వచ్చేస్తారు. ఆ గుర్తింపే మిమ్మల్ని ప్రత్యేకంగా ఉంచుతుంది. మీరు రాకెట్ అనుకుంటే, పుస్తకం మీకు రాకెట్ లాంచర్ అవుతుంది,’’ అని చెబుతూ అర్జెంటుగా ఒక పుస్తకం రాసేయమని సలహా ఇస్తారు. అంత అర్జెంటుగా ఎలా రాసేయడం? ముప్పై రోజుల్లో పుస్తకం ఎలా రాయాలో ఈ ఇరువురు సహచరులు ‘సూపర్ ఫాస్ట్ ఆథర్’ పేరుతో శిక్షణ ఇస్తుంటారు. ‘‘పుస్తకం నూటాయాభై పేజీలకు మించకూడదు. ఏ మనిషైనా రాయగలిగేవి మూడు ఏరియాలు: సొంతం జీవితంలోని డ్రామా, వృత్తిపరమైన అనుభవాలు, ప్రత్యేక ఇష్టాయిష్టాలు. పెద్దగా రీసెర్చ్ అవసరం లేని టాపిక్ ఎంచుకోండి. దాన్ని పది అధ్యాయాలుగా విభజించుకోండి. ప్రతి అధ్యాయానికీ పది ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోండి. ఒక ప్రశ్నను ఒక పేరాగా విస్తరించండి. దానికి జవాబును మూడు పేరాల్లో రాయండి. అంటే పది అధ్యాయాల్లో వంద ప్రశ్నలకు నాలుగు వందల పేరాలు అవుతాయి. రోజుకు ఐదు ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. ఇరవై రోజుల్లో వంద ప్రశ్నలు పూర్తవుతాయి. ఐదు రోజులు రీసెర్చ్‌కు వదిలేస్తే, ఇంకో ఐదురోజుల్లో మార్పులు చేర్పులు, కరెక్షన్స్ చేయండి. ముప్పయ్యో నాటికి ఫస్ట్ డ్రాఫ్ట్ రెడీ! ఎగ్జామ్ హాల్లో ఇచ్చే మూడు గంటల సమయంలో మనకు ఇష్టం లేని పాఠాల మీద ఎన్నో అడిషనల్ పేపర్లు రాసివుంటాం. అలాంటప్పుడు మనకు ఇష్టమైన టాపిక్ మీద రాయడం ఎంత సులభం?’’ అంటారు కైలాశ్. ఇలా మ్యాగీ నూడుల్స్‌లా వండే రచనలు ఎలా ఉంటాయో తెలీదు. బాగుండొచ్చు కూడా. అయితే కొందరు తెలుగు కవులు, రచయితలకు ఇవి కొత్త చిట్కాలు కాకపోవచ్చు. వాళ్లు ఇంతకంటే వేగంగా రాయగలరు; ఇంతకంటే బాగా ప్రమోట్ చేసుకోగలరు. తేడా అల్లా దీపక్, కైలాశ్ లాంటివాళ్లకు తమ విషయంలో ఒక పారదర్శకత ఉంది; మనవాళ్ల విషయంలో అదీ కనబడదు. కేవలం నెమ్మదిగా రాయడం వల్లే ఒక రచన గొప్పదైపోదు. తన రాత మీద రచయిత ఎంత ప్రాణం పెడతాడన్నది ముఖ్యం. ‘యుద్ధము–శాంతి’ మహానవలను టాల్‌స్టాయ్ తొమ్మిదిసార్లు తిరగరాశాడట. ‘కరమజోవ్ బ్రదర్స్’ చదువుతున్నప్పుడు దోస్తోవ్స్కీ ఒక ఆధ్యాత్మిక జ్వర పీడితుడిలా కనబడతాడు. వాక్యంలో పెట్టాల్సిన ఒక్క కామా గురించి కూడా ఆస్కార్ వైల్డ్ తల బద్దలుకొట్టుకునేవాడట. యావజ్జీవితం సాహిత్యమే ఊపిరిగా బతికాడు చలం. జీవితకాలం రాసిన మొత్తం కూడా గట్టిగా ఒక పుస్తకానికి మించనివాళ్లు ఉన్నారు. వాళ్లు నిజంగా రచయితలు. కానీ ఇప్పుడు పుంఖానుపుంఖంగా వస్తున్న పుస్తకాలు కొన్ని చెట్ల ప్రాణాలు తీయడానికి తప్ప పనికిరావు. కాబట్టి రాసేవాళ్లందరూ రచయితలు కారు. వచ్చిన ప్రతిదీ పుస్తకం కాదు. దాన్ని వేరు చేసుకోగలగడమే పాఠకుల విజ్ఞత. -
రష్దీ జీవించి ఉండడం ఆశ్చర్యమే
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో భారత రచయిత సల్మాన్ రష్దీని కత్తితో పొడిచాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు హదీ మతార్ తన దాడి వెనుక ఎవరి ప్రమేయం లేదని చెప్పాడు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని తెలిపాడు. రష్దీ చిత్తశుద్ధి లేని వ్యక్తి అని అందుకే అతనంటే తనకి నచ్చడని చెప్పాడు. తనంతట తానుగానే రష్దీని పొడిచానని వెల్లడించాడు. జైలు నుంచే న్యూయార్క్ పోస్ట్ వార్తాసంస్థకు వీడియో ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చాడు. రష్దీ ఇంకా ప్రాణాలతో ఉన్నారన్న విషయం తెలియగానే తాను చాలా ఆశ్చర్యపోయానని చెప్పాడు. రష్డీకి మెడపై 3 కత్తి పోట్లు, కడుపులో నాలుగుసార్లు, కుడి కన్ను, ఛాతీ, కుడి తొడపై కత్తి పోట్లు ఉన్నాయని ఆయనకి చికిత్స చేస్తున్న వైద్యులు వెల్లడించారు. రష్దీ రాసిన నవల ‘ది సటానిక్ వెర్సస్’లో తాను కొన్ని పేజీలే చదివానని, అంతా చదవలేదన్నారు. రష్దీపై ఫత్వా జారీ చేసిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమైనీ ఆదేశంతో ఈ దారుణానికి పాల్పడ్డావా? అన్న ప్రశ్నకు మతార్ సమాధానం ఇవ్వలేదు. అయతొల్లా అంటే తనకు గౌరవం ఉందని చెప్పాడు. -
Salman Rushdie: నిలకడగా ఆరోగ్యం.. వెంటిలేటర్ తొలగింపు
న్యూయార్క్: భారత మూలాలున్న ప్రముఖ రచయిత, బుకర్ బహుమతి విజేత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. రష్దీకి వాయవ్య పెన్సిల్వేనియాలోని యూపీఎంసీ హ్యమాట్ సర్జరీ సెంటర్ ఆస్పత్రిలో ఇప్పటివరకూ వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ వచ్చారు. తాజాగా సల్మాన్ రష్దీ ఆరోగ్యం కాస్త అదుపులోకి రావడంతో వెంటిలేటర్ తొలగించారు. ప్రస్తుతం రష్దీ మాట్లాడుతున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్‌ను వైద్యులు తొలగించారని వివరించారు. అమెరికాలోని ఓ వేదిక పై ప్రసంగించడానికి వెళ్లిన సల్మాన్ రష్దీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. సల్మాన్ రష్దీ మెడపై, పొట్టలోనూ పలుమార్లు కత్తితో పొడిచారు. 20 సెకండ్ల వ్యవధిలోనే సుమారు 10 నుంచి 15 సార్లు కత్తి పోట్లకు సల్మాన్ రష్దీ గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బలగాలు నిందితుడిని అరెస్టు చేశాయి. సల్మాన్ రష్దీని వెంటనే చాపర్‌లో హాస్పిటల్‌కు తరలించారు. అత్యవసర చికిత్సలో భాగంగా వైద్యులు నిరంతరం శ్రమించడంతో రష్దీ ఆరోగ్య పరిస్థితి అదుపులోకి రావడమే కాకుండా బెడ్‌పైనే ఆయన జోక్‌లు వేస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. చదవండి: సల్మాన్ రష్డీపై దాడి.. 30 ఏళ్లు భయం గుప్పిట్లోనే! ఆ నవల జోలికి వెళ్లినోళ్లందరికీ ఇదే గతి! -
Salman Rushdie: వెంటిలేటర్‌పై రష్దీ.. ఒక కన్ను కోల్పోయే ప్రమాదం
న్యూయార్క్: భారత మూలాలున్న ప్రముఖ రచయిత, బుకర్ బహుమతి విజేత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ది సతానిక్ వర్సెస్ రచన తర్వాత దశాబ్దాలుగా ఇస్లామిక్ బెదిరింపులను ఎదుర్కొంటున్న రష్దీపై ఓ ఆగంతకుడు అమెరికాలో చర్చావేదికపైనే కత్తితో విచక్షణారహితంగా దాడిచేసిన విషయం విదితమే. రక్తసిక్తమైన రష్దీకి వాయవ్య పెన్సిల్వేనియాలోని యూపీఎంసీ హ్యమాట్ సర్జరీ సెంటర్ ఆస్పత్రి వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. 20 సెకన్ల వ్యవధిలో ఆగంతకుడు వెనుక 15 సార్లు కత్తితో పొడిచినట్లు తెలుస్తోంది. ‘గంటలపాటు ఆయనకు శస్త్రచికిత్స కొనసాగింది. మెడ భాగంలో కత్తిపోట్ల కారణంగా మెడ నుంచి చేతిలోకి వచ్చే నరాలు తెగిపోయాయి. ఒక కన్ను కోల్పోయే ప్రమాదం ఉంది. పొత్తికడుపుపై కత్తిగాటుతో కాలేయం దెబ్బతింది’ అని సల్మాన్ రష్దీ ప్రతినిధి ఆండ్రూ విలే న్యూయార్క్ టైమ్స్ వార్తాసంస్థతో చెప్పారు. పశ్చిమ న్యూయార్క్‌లోని చౌటాకా ఇన్స్టిట్యూట్లో రష్దీపై దాడి చేసిన వ్యక్తిని 24 ఏళ్ల హదీ మతార్‌గా గుర్తించారు. అతడిపై హత్యాయత్నం, దాడి సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. 150 ఏళ్ల చరిత్రలో తొలి దారుణం ‘150 ఏళ్ల లాభాపేక్షలేని విద్యా సంస్థ చరిత్రలో ఇలా దాడి జరగడం ఇదే తొలిసారి’ అని చౌటౌకా ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు మైఖేల్ హిల్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. సంస్థలో జరిగే కార్యక్రమాలకు భద్రత పెంచాలంటూ గతంలోనే విజ్ఞప్తులు వచ్చాయన్న వార్తలను ఆయన కొట్టేపారేశారు. అయితే, కార్యక్రమ నిర్వాహకులు అక్కడ ఎలాంటి సెక్యూరిటీ సెర్చ్ చేయలేదని, మెటల్ డిటెక్టర్లు లేవని, బ్యాగుల తనిఖీ విధానం లేదని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పడం గమనార్హం. ‘ఇరాన్ నేత అయోతొల్లా హత్య ఆదేశాలిచ్చినా రష్దీ తన స్వేచ్ఛా గళాన్ని వినిపించారు. ఈ కష్టకాలంలో రష్దీ ధైర్యాన్ని, అంకిత భావాన్ని వేనోళ్లా పొగడాల్సిన సమయమిది’ అని కౌంటర్ ఎక్స్‌ట్రీమిజమ్ ప్రాజెక్ట్ సీఈవో మార్క్ వ్యాఖ్యానించారు. ఉగ్రసంస్థల ఆర్థికమూలాలను దెబ్బతీయాలంటూ కౌంటర్ ఎక్స్‌ట్రీమిజమ్ ప్రాజెక్ట్ అనే లాభాపేక్షలేని ప్రభుత్వేతర సంస్థ పనిచేస్తోంది. దాడిపై ఇరాన్ మౌనం రష్దీని చంపాలంటూ దాదాపు దశాబ్దం క్రితం దేశ సుప్రీం లీడర్ అయోతొల్లా ఇచ్చిన ఫత్వాను ఇన్నాళ్లకు ఓ ఆగంతకుడు అమలుకు యత్నించాడన్న వార్తలపై ఇరాన్ పెదవి విప్పలేదు. ‘ఫత్వాను అమలుచేసే ప్రయత్నం జరిగింది’ అంటూ పొడిపొడిగా ఒక ప్రకటనను మాత్రం శనివారం ఇరాన్ అధికారిక మీడియా వెలువరించింది. ‘ ఇలాంటి ఘటనలు ఇరాన్‌ను అంతర్జాతీయ సమాజం నుంచి దూరం చేస్తాయి’ అని ఇరాన్ మాజీ దౌత్యవేత్త మాషల్లా సెఫాజదీ అన్నారు. దాడిపై వెల్లువెత్తిన నిరసనలు ఘటనను భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడిగా సాహిత్యలోకం అభివర్ణించింది. రచయితల గొంతు నొక్కే, హింసాత్మక, అణచివేత ధోరణులపై ముక్తకంఠంతో తమ తీవ్ర నిరసనను వ్యక్తంచేశారు. అత్యంత హేయమైన చర్యగా బుకర్ ప్రైజ్ విజేత, రచయిత్రి గీతాంజలి శ్రీ వ్యాఖ్యానించారు. నీల్ గైమన్, అమితవ్ ఘోష్, స్టీఫెన్ కింగ్, జీన్ గెరీరో తదితరులు దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. రష్దీ త్వగా కోలుకోవాలని కోరుకున్నారు. జాగర్‌నాట్ బుక్స్, పెంగ్విన్ రాండమ్ హౌస్ ఆఫ్ ఇండియా వంటి పలు పబ్లిషింగ్ సంస్థలూ ఘాటుగా స్పందించాయి. ఎవరీ హదీ మతార్? న్యూజెర్సీలోని ఫెయిర్‌వ్యూ ప్రాంతంలో మతార్ నివసిస్తున్నాడు. మతార్ ఎందుకు దాడి చేశాడనే కారణాలను వెతికే పనిలో అమెరికా ఎఫ్‌బీఐ, స్థానిక దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. ‘ఘటనాస్థలిలోని బ్యాక్ ప్యాక్, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సెర్చ్ వారెంట్ తీసుకునే పనిలో అధికారులు ఉన్నారు. దాడి ఘటన వెనుక ఎవరూ ఉండకపోవచ్చని, మతార్ ఒక్కడికే ఇందులో ప్రమేయముందని అధికారులు ప్రాథమికంగా విశ్వసిస్తున్నారు. లెబనాన్ మూలాలున్న మతార్ నేర చరిత్రపై వివరాలు సేకరిస్తున్నాం’ అని పోలీస్ ట్రూప్ కమాండర్ మేజర్ ఎజీన్ జె. స్టాన్జ్యూస్కీ చెప్పారు. అయితే, అతని సామాజిక మాధ్యమాల ఖాతాలను పరిశీలించగా కొన్ని విషయాలపై స్పష్టత వచ్చింది. షియా ఉగ్రవాదులకు ముఖ్యంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కు మతార్ సానుభూతిపరుడని తెలుస్తోందని దర్యాప్తులో భాగంగా ఉన్న ఒక ఉన్నతాధికారి ఎన్బీసీ న్యూస్‌తో చెప్పారు. మతార్ వాడుతున్న సెల్‌ఫోన్ మెసేజింగ్ యాప్‌లో ఇరాన్ కమాండర్ ఖాసిమ్ సులేమానీ ఫొటోను దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. సులేమానీ ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్కు సైన్యాధికారిగా ఉన్నాడు. రష్దీ రాసిన రచనను ఇరాన్ 1988లో నిషేధించిన విషయం తెల్సిందే. ఇంత భద్రత అవసరమా? గతంలో రష్దీ వ్యాఖ్య హత్యా బెదిరింపుల నేపథ్యంలో ఆయనకు కల్పించిన అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై ఒకానొక దశలో అసహనం వ్యక్తంచేశారని న్యూయార్క్ పోస్ట్ ఒక కథనం ప్రచురించింది. చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్లో ఒక సారి రచయితల సదస్సు జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చిన రష్దీ మాట్లాడారు. ‘ఇంత మందితో నాకు భద్రత కల్పించడం నిజంగా అవసరమా? నాకైతే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది. నాకు ఇంతగా అదనపు భద్రత అవసరమని నేనెప్పుడూ అడగలేదు. గతంలో ఎలాంటి భద్రతా లేకుండానే ఇక్కడొకొచ్చాను. ఇప్పుడు ఇదంతా వృథా ప్రయాస. అయినా, భద్రత అవసరమైన రోజులను నేనెప్పుడో దాటేశాను’ అని ఆనాటి సభలో అన్నారు. -
న్యూయార్క్: వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీపై దాడి
-
వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీపై దాడి
న్యూయార్క్: భారత సంతతికి చెందిన ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత సల్మాన్ రష్దీ (75)పై శుక్రవారం అమెరికాలో హత్యాయత్నం జరిగింది. న్యూయార్క్‌లో ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు ఆయన సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రజెంటర్ రష్దీని సభికులకు పరిచయడం చేస్తుండగా ఓ వ్యక్తి ఉన్నట్టుండి వేదికపైకి దూసుకొచ్చి వెనక నుంచి దాడికి తెగబడ్డాడు. కనీసం 10 సెకన్ల పాటు కత్తితో ఆయనను పదేపదే పొడిచాడు. మెడ తదితర చోట్ల పది నుంచి పదిహేను దాకా కత్తిపోట్లు దిగినట్టు తెలుస్తోంది. దాంతో రష్దీ రెయిలింగ్‌ను ఊతంగా పట్టుకుని అలాగే కిందికి ఒరిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ‘‘రష్దీ చుట్టూ రక్తం మడుగులు కట్టింది. అయన కళ్ల చుట్టూ, చెంపల గుండా రక్తం కారింది. వెనకనున్న గోడ, సమీపంలోని కుర్చీతో పాటు పరిసరాలు కూడా రక్తసిక్తంగా మారాయి’’ అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ హఠాత్సంఘటనతో సభికులంతా బిత్తరపోయారు. సహాయకులు, భద్రతా సిబ్బంది తక్షణం స్పందించి కింద పడిపోయిన రష్దీని పైకి లేపారు. ప్రథమ చికిత్స తర్వాత హుటాహుటిన హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. దాడిలో రష్దీ మెడపై గాయమైనట్టు న్యూయార్క్ పోలీసులు నిర్ధారించారు. ‘‘స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు దాడి జరిగింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. రష్దీ ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతానికి మాకెలాంటి సమాచారం లేదు’’ అని వెల్లడించారు. రష్దీని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తికి కూడా దాడిలో స్వల్ప గాయాలైనట్టు చెప్పారు. రష్దీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదని బీబీసీ వార్తా సంస్థ పేర్కొంది. దాడి అనంతరం అంతా రష్దీ చుట్టూ మూగగా దుండగుడు దర్జాగా వేదిక దిగి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. కొద్ది దూరం వెళ్లాక సభికులు, భద్రతా సిబ్బంది అతన్ని నిర్బంధించారు. దాడిపై సాహితీ ప్రపంచం నుంచి విమర్శలు, ఖండనలు వెల్లువెత్తుతున్నాయి. జరిగింది మాటలకందని దారుణమని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచల్ అన్నారు. రష్దీ ప్రాణాలతోనే ఉన్నారని ధ్రువీకరించారు. కడపటి సమాచారం అందేసరికి ఆయనకు ఆపరేషన్ జరుగుతున్నట్టు సమాచారం. బెదిరింపులే ప్రసంగాంశం... శుక్రవారం రష్దీపై జరిగిన దాడికి పశ్చిమ న్యూయార్క్ శివార్లలోని చౌటౌకా ఇన్స్టిట్యూషన్ వేదికైంది. అక్కడ రష్దీ ప్రసంగ అంశం కూడా బెదిరింపుల కారణంగా ప్రవాసులుగా మారిన రచయితలకు సంబంధించిందే కావడం విశేషం. వారి రక్షణకు కృషి చేస్తున్న పిట్స్బర్గ్ నాన్‌ప్రాఫిట్ సిటీ ఆఫ్ అసైలం అనే సంస్థ ఏర్పాటు చేసిన ఈ సభలో ‘మోర్ దాన్ షెల్టర్ (ఆశ్రయానికి మించి...)’ అనే అంశంపై ఆయన మాట్లాడాల్సి ఉంది. అందులో భాగంగా బెదిరింపులు ఎదుర్కొంటున్న రచయితలకు అమెరికా ఆశ్రయంగా మారుతున్న వైనంపై కూడా చర్చ జరగాల్సి ఉంది. ‘‘రష్దీపై దాడి జరిగిందని తెలిసి షాకయ్యా. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. పాశ్చాత్య దేశాల్లో అత్యంత సురక్షిత పరిస్థితుల్లో నడుమ ఉన్న ఆయనపైనే దాడి జరిగిందంటే ఇస్లాంపై విమర్శనాత్మక ధోరణి కనబరిచే వారందరిపైనా దాడులు తప్పవు. చాలా ఆందోళనగా ఉంది’’ – తస్లీమా నస్రీన్ ఫత్వా పడగ నీడలో.. వివాదాస్పద రచయితగా పేరుపడ్డ రష్దీ 1947 జూన్ 19న ముంబైలో జన్మించారు. పూర్తి పేరు అహ్మద్ సల్మాన్ రష్దీ. రచయితగా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. చారిత్రక విషయాలతో పాటు వర్తమాన అంశాలకు ఆత్మాశ్రయ శైలిలో మనసుకు హత్తుకునేలా అక్షర రూపమివ్వడం ఆయన ప్రత్యేకత. 14 నవలలు, ఓ కథా సంకలనంతో పాటు పలు కాల్పనికేతర రచనలు చేశారు. ఎన్నో సాహిత్య అవార్డులు అందుకున్నారు. బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం, దేశ విభజన దాకా సాగిన పరిణామాలను చిత్రించిన నవల మిడ్నైట్స్ చిల్డ్రన్కు 1981లో ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ లభించింది. అయితే మతాన్ని కించపరిచే రాతలు రాస్తున్నారంటూ 1980ల నుంచే రష్దీని వివాదాలు చుట్టుముట్టాయి. బెదిరింపులు మొదలయ్యాయి. మహ్మద్ ప్రవక్త జీవితం ఆధారంగా 1988లో రాసిన నాలుగో నవల సటానిక్ వర్సెస్ పెను దుమారానికే దారితీసింది. పాకిస్తాన్ సహా పలు దేశాలు దాన్ని నిషేధించాయి. రష్దీని చంపుతామంటూ లెక్కలేనన్ని బెదిరింపులు వచ్చాయి. ఫత్వాలు జారీ అయ్యాయి. రష్దీని ఉరి తీయాలంటూ ఇరాన్ ఆధ్యాత్మిక నేత అయతుల్లా ఖొమైనీ 1989లో ఫత్వా జారీ చేశారు. ఆయన్ను చంపిన వారికి 30 లక్షల డాలర్ల రివార్డు ఇస్తామంటూ ఇరాన్ తదితర దేశాల నుంచి ప్రకటనలు వెలువడ్డాయి! దాంతో 1989లో రష్దీ భారత్ వీడారు. జోసెఫ్ ఆంటొన్ అనే మారుపేరుతో తొమ్మిదేళ్లకు పైగా రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. అందుకే తన జ్ఞాపకాలకు జోసెఫ్ ఆంటొన్ పేరుతోనే పుస్తక రూపమిచ్చారు. ఎప్పటికైనా చంపి తీరతామంటూ ఇరాన్ నుంచి తనకు ఏటా క్రమం తప్పకుండా ‘ప్రేమలేఖలు’ వచ్చేవని రష్దీ ఒక సందర్భంలో చెప్పారు. బెదిరింపుల నేపథ్యంలో 1989 నుంచి 2002 దాకా బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు నిరంతర భద్రత కల్పించింది. సాహిత్యానికి చేసిన సేవకు గాను 2007లో నైట్‌హుడ్ ఇచ్చి గౌరవించింది. ఈ అనుభవాలకు కూడా ‘ఫత్వా జ్ఞాపకాలు’గా రష్దీ పుస్తక రూపమిచ్చారు! 2000 అనంతరం అమెరికాలో స్థిరపడ్డారు. అంతర్జాతీయ రచయితల సంఘానికి సారథ్యం వహించారు. బెదిరింపుల కారణంగా ప్రవాసంలో గడుపుతున్న రచయితల సంక్షేమం కోసం నడుం బిగించారు. రష్దీ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయనకు నలుగురు పిల్లలు. 30 ఏళ్లకు పైగా రష్దీ ఫత్వా పడగ నీడలోనే గడుపుతున్నారు. ఇటీవల భారత్ వచ్చేందుకు కేంద్రం వీసా నిరాకరించడం తననెంతగానో బాధించిందని చెప్పారాయన. అనువాదకుల హత్య సటానిక్ వర్సెస్ను అనువదించినందుకు ప్రపంచవ్యాప్తంగా పలువురు రచయితలు ప్రాణాలు కోల్పోయారు! జపనీస్‌లోకి అనువదించిన హిటోషీ ఇగరాషీని యూనివర్సిటీ క్యాంపస్‌లోనే పొడిచి చంపారు. టర్కిష్‌లోకి అనువదించిన అజీజ్ నెసిన్పై జరిగిన బాంబు దాడి ఆయనతో పాటు మరో 36 మందిని కూడా బలి తీసుకుంది. ఇటాలియన్‌లోకి అనువదించిన ఎటోర్ కాప్రియోలో కత్తి పోట్ల బారిన పడ్డారు. నార్వే భాషలో ప్రచురించిన వ్యక్తి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. నిరంతరం భారీ భద్రత నడుమ బతకాల్సి వస్తోందంటూ రష్దీ పలుమార్లు ఆవేదన వెలిబుచ్చారు. కానీ ఆయనపై తాజాగా దాడికి భద్రతా లోపాలే ప్రధాన కారణమంటూ ఘటనకు ప్రత్యక్ష సాక్షులైన సాహితీ అభిమానులు వాపోవడం విషాదం. -
భర్తను హత్య చేసేందుకే...ఆ నవల రాసిందా?
Author goes on trial for her spouses Assassinate Case: కొన్ని కేసులు చాలా విచిత్రంగా ఉంటాయి. నిందితులు తాము చేయాలనుకునే నేరం కోసమే ఇలాంటి విచిత్రమైన పనులు చేస్తారో లేక యాదృచ్చికంగా జరుగుతాయో తెలియదు. కానీ ఇక్కడొక రచయిత విషయంలో అలానే జరిగింది. వివరాల్లోకెళ్తే...నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ రొమాన్స్ కథల స్వీయ రచయిత. అయితే ఆమె ప్రస్తుతం తన భర్త డేనియల్ బ్రోఫీకి సంబంధించిన హత్య కేసుని ఎదుర్కొంటోంది. ఈ మేరకు నాన్సీ 2018లో అరెస్టు అయినప్పటి నుంచి కస్టడీలోనే ఉంది. ఆమె భర్త సౌత్‌వెస్ట్ పోర్ట్‌ల్యాండ్‌లోని ఒరెగాన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్లో విధులు నిర్వర్తించడానికి వెళ్తున్న సమయంలో హత్యకు గురైయ్యాడు. ఆయన్ని ఎవరో తపాకీతో కాల్చి చంపారు. అయితే ఆమె తన భర్త మృతి చెందడానికి కొన్ని వారాల ముందు హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్ అనే పేరుతో ఒక నవల రాయడం గమనార్హం. తొలత ఆమె భర్త మరణం పోలీసులకు ఒక మిస్టరీ కేసుగా అనిపించింది. అయితే తదనంతర విచారణల నేపథ్యంలో ఆమె అసలైన నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు ట్రాఫిక్ కెమెరాల్లో ఆమె భర్త హత్య జరగడానికి ముందు ఆ ప్రాంతంలో తిరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఆమె కోర్టులో విచారణ ఎదుర్కొంటోంది. అయితే న్యాయమూర్తి సీనియర్ డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ షాన్ ముల్ట్నోమా కౌంటీ సుమారు 10 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ కోసం లాంటి దారుణానికి ఆమె ఒడిగట్టిందని అన్నారు.అంతేకాదు ఆమె అక్రమ సంపాదనతో చాలా లాభపడిందని కూడా అన్నారు. అయితే ఆమె గతంలో ఎలాంటి నేరారోపణలకు పాల్పడలేదన్నారు. ఈ మేరకు ఈ కేసు ఏడు వారాలపాటు విచారణ కొనసాగనుందని న్యాయమూర్తి తెలిపారు. (చదవండి: ఇంజనీరింగ్, ఎంబీఏ చదివారు.. విలాసాల కోసం యూట్యూబ్ చూసి..) -
శతక నీతి – సుమతి..: వారి వెంట ఉంటే చాలు!
సత్పురుషులు అంటే కచ్చితంగా ఇలానే ఉంటారు అని చెప్పలేం. మంచి గుణాలతో మాత్రం ఉంటారు. రామ్ చరిత్ మానస్ లో తులసీదాస్ గారు సత్పురుషులను మూడు వర్గాలుగా విభజించారు. గులాబీ చెట్టు మంచి పూలు పూస్తుంది. చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాయి. మంచి వాసనలు ఉంటాయి. కానీ ఆ చెట్టుకు కాయలుండవు. పండ్లుండవు. ఒకరకం సత్పురుషులు ఈ గులాబీ చెట్టులాంటివారు. మంచి మాటలు చెబుతూ సమాజాన్ని నడిపిస్తుంటారు. వారు ఎవరికీ అపకారం చేయరు. ఎవరినీ పాడు చేయరు. కానీ వాళ్ళు మంచి పనులు అదే పనిగా చేస్తున్నారా అంటే చెప్పడం కొద్దిగా కష్టమే. మామిడి చెట్టు ఉంటుంది. పూత పూస్తుంది, కాయా కాస్తుంది. పండ్లూ వస్తాయి. రెండో రకం సత్పురుషులు ఇలాటి వారు. మంచి మాటలు చెబుతారు. మంచి పనులూ చేస్తుంటారు. రెండూ ఉంటాయి తప్ప మంచి మాటలు చెప్పి పనులు చెయ్యకుండా కూర్చునే రకం కాదు. తమతో ఉన్న వాళ్ళను తమ వెంట తిప్పుకుంటూ అందరితో మంచి పనులు చేయిస్తుంటారు. పనస చెట్టు ఉంది. మామిడి కాయ లేదా పండయితే ఒకరికే సరిపోతుంది. పనసపండును పదిమందికి పంచవచ్చు. ఈ రకం వారు మంచి మాటలు అదే పనిగా చెప్పరు. కానీ మంచి పనులు మాత్రం ఆపకుండా చేసుకుంటూ పోతుంటారు. ఇదీ తులసీదాసుగారి వర్గీకరణ. ఇటువంటి సత్పురుషులతో కలిసి మెలిసి తిరుగుతుంటే మనం కూడా పూజార్హత పొందుతాం. వారితో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మంచిపనులు చేస్తూ పోతుంటాం. వారి త్యాగశీలత, నిస్వార్థంగా పనిచేసే తత్త్వం, అంకిత భావం, సమాజం పట్ల ప్రేమానురాగాలవంటి గుణాలను వారు చెబుతూ ఆచరించి చూపుతుంటే ... వాటి ప్రభావం మన మీద కూడా గాఢంగా పడుతుంది. క్రమేణా జీవితం దానికి అలవాటు పడి మనలో ఉన్న దుర్గుణాలు వాటతంట అవే మాయమయిపోతుంటాయి. సత్పురుషులతో సహవాస గొప్పదనాన్ని చెప్పడానికి రామకృష్ణ పరమ హంస ఒక ఉదాహరణ చూపుతుంటారు. ఒక ఏనుగు దారివెంట నడిచి వెడుతుంటూంది. కొబ్బరి చెట్టు కనపడితే కొబ్బరి కాయలను తొండంతో తుంపి నోట్లో వేసుకుంటుంది. అరటి చెట్టు కనబడితే ఆకులను పట్టి లాగేస్తుంది, చింపేస్తుంది. అంతవరకు దాని మీద కూర్చున్న మావటి పట్టించుకోడు. అక్కడ అరటి గెలలను తొండంతో పట్టుకుని లాగేయపోతుండగా... అంకుశం గుచ్చే ప్రయత్నం చేస్తాడు.. వెంటనే అది తొండాన్ని వెనక్కి తీసేసుకుంటుంది. సత్పురుషులు మావటిలాంటి వారు. మనం పనికిమాలిన పనులు చేస్తున్నా, అనవసర మాటలు మాట్లాడుతున్నా... మృదువుగానే మనల్ని మందలిస్తారు. మనల్ని చక్కదిద్దుతారు. నిజానికి వారు ప్రత్యేకించి మనల్ని పట్టించుకోనక్కరలేదు. వాళ్ళ సాహచర్యంలో అటువంటి పనులు చేయడానికి, అధిక ప్రసంగాలకు ఆస్కారముండదు. ధూళికణమయినా గాలితో కలిస్తే పైకెగిరినట్టు సత్పురుషుల సాంగత్యం మనల్ని ఉన్నతంగా నిలుపుతుంది. వారి సాంగత్యం లేకపోయినా నష్టమేదీ నేరుగా అనుభవంలోకి రాదు కానీ దుర్జనులతో కలిస్తే మాత్రం హాని జరిగితీరుతుందని చెప్పడానికే బద్దెనగారు –‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ /గించిత్తు నల్లి కుట్టిన/ మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ’’ హెచ్చరిస్తున్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కొడవటిగంటి వరూధిని కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: కొడవటిగంటి కుటుంబరావు భార్య, దివంగత రచయిత్రి శాంతసుందరి తల్లి శ్రీమతి వరూధిని (97) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న ఆమె కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం కన్నుమూశారు. ప్రముఖ నటి, రచయిత్రి కొమ్మూరి పద్మావతి, పాత్రికేయులు కొమ్మూరి వెంకట్రామయ్యలకు 29 మార్చి 1925లో గుంటూరులో వరూధిని జన్మించారు. ఆకాశవాణి లలిత సంగీత కార్యక్రమాలలో పాల్గొన్నారు. కుటుంబరావును 1945లో వివాహమాడారు. అప్పటి నుంచీ, కొకు రాసిన ప్రతీ రచనను భద్ర పరి చారు. కొడుకు రోహిణి ప్రసాద్(49) అణుశాస్త్రవేత్త, సైన్స్ రచయిత 2012లో అనారోగ్యంతో మరణించారు. వరూధిని కూతురు, సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత శాంత సుందరి (72) కేన్సర్‌తో ఇటీవలే మరణించారు. -
‘బుజ్జాయి’ కన్నుమూత
సాక్షి ప్రతినిధి, చెన్నై: చిట్టిపొట్టి బొమ్మలు, బాలల కథల సంపుటితో బుజ్జాయిగా బహుళ ప్రాచుర్యం పొందిన దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి గురువారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో ప్రముఖ రచయిత, కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాజహంస దంపతులకు 1931 సెప్టెంబర్ 11న ఆయన జన్మించారు. బుజ్జాయి అనే కలంపేరుతో ఫ్రీలాన్స్ కార్టూనిస్టుగా, చిన్నపిల్లల కథారచయితగా ప్రసిద్ధి చెందారు. ఆయన బొమ్మల కథల్లో ‘డుంబు’ చిన్నారులను బాగా అలరించింది. అలాగే ‘పంచతంత్ర’ ధారావాహిక కథలు ‘ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ’లో 1963–68 వరకు ప్రచురితమయ్యాయి. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం కథానికను బొమ్మలద్వారా పాఠకులకు పరిచయం చేశారు. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన పలు రచనలకు అవార్డులు అందించాయి. -
ఇంతమందికి నచ్చుతుందనుకోలేదు!
అవరోధాలు, ఆటంకాలు, అడ్డుగోడలు ఎన్ని ఎదురైనా మనలో ప్రతిభ ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కాస్త ఆలస్యమైనా చివరికి నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకుంటాం. అనుకున్న దానిని సాధించేందుకు పట్టుదలతో పాటు ఆత్మస్థైర్యం ఉండాలని నిరూపించి, ఉదాహరణగా నిలుస్తోంది పదిహేడేళ్ల ఖుషీ శర్మ. ఒక పక్క చదువు, మరోపక్క ఆటల్లో రాణిస్తూనే పాఠకులు మెచ్చే నవలను రాసి, టీన్ ఆథర్‌గా ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. చండీగఢ్‌కు చెందిన ఖుషీ శర్మ ఇంటర్మీడియట్ విద్యార్థి. జాతీయ స్థాయి స్క్వాష్ పోటీల్లో పాల్గొని రెండుసార్లు పతకాలను సాధించింది. పియానో బాగా ప్లే చేస్తుంది. కథక్ డ్యాన్సర్. అనేక స్టేజ్ ప్రదర్శనలు కూడా ఇచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు ఏది అనిపించినా వెంటనే నోట్ చేసుకునే అలవాటు ఉన్న ఖుషీ..ఏకంగా సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ నవలను రాసింది.‘ద మిస్సింగ్ ప్రాఫెసీ– రైజ్ ఆఫ్ ద బ్లూ ఫోనిక్స్’ పేరిట నవలను విడుదల చేసింది. బుక్ విడుదలైన నెలరోజుల్లోనే వెయ్యికాపీలు అమ్ముడవడమేగాక, అమేజాన్ ట్రెండింగ్ బుక్ జాబితాలో టాప్‌ప్లేస్‌లో దూసుకుపోతోంది ఖుషి నవల. ఇంత చిన్నవయసులో థ్రిల్లింగ్ నవలను రాసి పాఠకుల మనసులు దోచుకుంటోంది ఈ టీనేజర్. కరోనా సమయంలో వైరస్‌కు సంబంధించిన అనేక విషయాలపై పరిశోధిస్తూ, అందుకు సంబంధించిన సమాచారాన్ని తను నడుపుతోన్న ‘బ్లాగ్ విత్ ఖుషి’లో పోస్ట్ చేస్తుండేది. ఇలా అనేక విషయాలమీద అవగాహన ఏర్పర్చుకున్న ఖుషి తనకు వచ్చే వినూత్న ఆలోచనలను పుస్తకంలో రాసి దాన్ని నవలగా తీర్చిదిద్దింది. ఈ నవలలో అంబర్ హార్ట్ అనే హీరోయిన్ ఉంటుంది. ఈమె మూడొందల ఏళ్లకోసారి ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఎదురయ్యే దుష్టశక్తులతో పోరాడుతుంటుంది. దీనిలో అడుగడుగునా సాహసాలు, సైన్స్, పర్యావరణానికి సంబంధించిన అనేక అంశాలను ఉత్కంఠ భరితంగా కథలో వర్ణించింది ఖుషి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆకట్టుకునే అంశాలు దీనిలో ఉన్నాయి. ఇంత చిన్నవయసులో ఎంతో అనుభవం ఉన్న రచయితలా ఖుషి నవలను రాయడం విశేషం. ఇంతమందికి నచ్చుతుందనుకోలేదు! ‘‘చిన్నప్పటి నుంచి రాయడం ఇష్టమేగానీ, నా నవల పాఠకులకు నచ్చుతుందని ఎప్పుడూ అనుకోలేదు. కరోనా రాకముందు పదోతరగతి పరీక్షలు, మరోపక్క స్క్వాష్‌లో బిజీగా ఉండేదాన్ని. కరోనా లాక్‌డౌన్‌తో అన్నీ బంద్ అయిపోయి ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి. ఈ సమయంలో చిన్నచిన్న పద్యాలు రాయడం ప్రారంభించాను. ఇలా రాస్తుండగా... ‘వన్ కంట్రోల్స్ ఫైర్, ద అదర్ కంట్రోల్స్ సోల్, టు సేవ్ ది వరల్డ్, ఈచ్ మస్ట్ ప్లే దెయిర్ రోల్’ కవిత తట్టింది. దీని ఆధారంగా పదిహేడు చాప్టర్ల వరకు రాశాను. అయితే మధ్యలో నా మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయాయి. ఖాళీ సమయం దొరకడంతో అక్కను విసిగిస్తున్నానని చెప్పి ‘నువ్వు రాస్తున్న బుక్‌ను రెండురోజుల్లో’ పూర్తిచేయగలవా? అని ఇంట్లో వాళ్లు డెడ్‌లైన్ పెట్టారు. దీంతో కొన్ని రోజుల్లో తొమ్మిదివేల పదాలు రాశాను. అలా రాస్తూ 75000 పదాలతో ఏకంగా ఈ నవలను రాయగలిగాను’’ అని ఖుషి చెప్పింది. -
చదువులో ధ్యానం
ఒక సంస్కృతిని నాశనం చేయడానికి పుస్తకాలను కాల్చే పనిలేదు; జనాన్ని చదవకుండా చూడండి చాలు అంటాడు అమెరికన్ రచయిత రే బ్రాడ్బరీ. ఇదే అర్థం ఇచ్చే వాక్యాన్ని రష్యన్ కవి జోసెఫ్ బ్రాడ్స్కీ ఇంకోలా చెబుతాడు. పుస్తకాన్ని కాల్చడానికి మించిన పెద్ద నేరాలు ఉన్నాయి; అందులో ఒకటి వాటిని చదవకపోవడం! చిరిగిన చొక్కానైనా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అన్న కందుకూరి వీరేశలింగం మనకు ఉండనే ఉన్నారు. చదవడం అనేది ఎంత ప్రాధాన్యత కలిగినదో చెప్పడానికి జార్జ్ ఆర్.ఆర్. మార్టిన్ ఉటంకింపు ఒక్కటి సరిపోతుంది. ప్రపంచాన్ని కుదిపిన ‘ఎ గేమ్ ఆఫ్ థ్రోన్స్’, అది భాగమైన ‘ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్’ సిరీస్ సృష్టికర్త అంటాడు: చనిపోయేలోగా ఒక పాఠకుడు వెయ్యి జీవితాల్ని జీవిస్తాడు. ఎప్పుడూ చదవనివాడు మాత్రం ఒకటే జీవితం గడుపుతాడు. చదవడం అనేది ఒక ఈవెంట్. ఒక పోటీ. స్నేహితుల దగ్గర పుస్తకాలు తెచ్చుకోవడం, దాని గురించి మాట్లాడుకోవడం, లైబ్రరీలు, రీడింగ్ రూములు, అద్దె పుస్తకాల షాపులు, పాత పుస్తకాల షాపులు, అక్కడే నిలబడి పుస్తకంలో ఏ కొన్ని పేజీలనో ఆబగా చదువుకోవడం... అదంతా ఒక పాత కథ. వెయ్యి పేజీల పుస్తకమైనా ఇట్టే ముగిసిపోయేది. దిండు సైజు నవలైనా అసలు బరువయ్యేది కాదు. చదవడం అనేది గొప్ప విషయం అని అర్థమవుతూనే, దానికి దూరమైపోవడం కూడా నిజమని తెలుస్తూనే ఏమీ చేయలేని చిత్రమైన స్థితిలో ఉన్నాం. టెలివిజన్ నన్ను చాలా ఎడ్యుకేట్ చేస్తుంది; ఎవరైనా టీవీ ఆన్ చేసిన ప్రతిసారీ నేను గదిలోకి వెళ్లి పుస్తకం చదువుకుంటాను అన్నాడు వ్యంగ్యంగా గ్రూచో మార్క్స్. దృశ్యం రావడం అనేది చదవడాన్ని దెబ్బకొట్టిందని అందరికీ ఇప్పుడు తెలిసినదాన్నే అందరికీ తెలియకముందే చెప్పాడీ కమెడియన్. వేగవంతమైన రోజువారీ జీవితంలో నెమ్మదిగా సాగే చదువుకు స్థానం లేకుండా పోయింది. ప్రతిదాన్ని కథనంలో పెట్టాలనే సామాజిక మాధ్యమాల ధోరణి పుస్తకం మీద కాసేపు శ్రద్ధగా చూపు నిలపనీయని స్థితికి తెచ్చింది. ఒక అంచనా ప్రకారం, ప్రింటు కాగితాన్ని చదివేవాళ్లు దాన్ని సగం చదివి వదిలేస్తే, అదే అంశాన్ని డిజిటల్లో అయితే ఐదో భాగం చదవడమే ఎక్కువ. అయితే చదవడం అనేది కొంతవరకూ రూపం మార్చుకుంది అని కూడా చెప్పొచ్చు. ఆడియో బుక్ వింటే చదవడం అవుతుందా, అవదా? ఆన్లైన్ క్లాసులు వింటే చదవడం వచ్చినట్టా, కాదా? ఏదైనా పీర్ ప్రెషర్. గొప్ప స్వీడిష్ సినిమా చూసినంత మాత్రాన దాన్ని పంచుకోవడానికి ఎవరూ లేకపోతే మళ్లీ సమూహంలో భాగం కావడానికి బిగ్‌బాస్ గురించి మాట్లాడవలసిందే. అందుకే ప్రతి మార్పునూ భౌతిక పరిస్థితులే శాసిస్తాయి. ఈ పరిస్థితులు చాలావరకూ సాంకేతికమని చెప్పక తప్పదు. చదవడం మీద ఆసక్తి ఉన్నవాళ్లను కూడా అందులో మునగనీయని స్థితి. పాము మందును పాము విషంలోంచే తయారు చేస్తారు. పోయిన చోటే వెతుకు అన్నట్టుగా, పోవడానికి కారణమైనదే ఇప్పుడు కొత్తగా ఊతం అవుతోంది. ఏ డిజిటల్ మాధ్యమాలైతే చదువును చంపేశాయని భావిస్తున్నామో అవే మళ్లీ పెరగడానికి కారణమవుతున్నాయి. క్లబ్ హౌజ్ పుస్తకాలను చర్చించడానికి ఉపకరిస్తోంది. ఫేస్బుక్ గోడల మీద క థలు, వ్యాసాలు అచ్చవుతున్నాయి. చదివిన పుస్తకాల గురించి మాట్లాడే ‘బుక్‌టోక్’ విదేశాల్లో బాగా ఆదరణ పొందుతోంది. దీనివలన పుస్తకాల అమ్మకాలు కూడా పెరుగుతున్నాయని చెబుతున్నారు. పుస్తకాలు చదవడం ద్వారా కూడా సెలబ్రిటీలు కావొచ్చని ఇది నిరూపిస్తోంది. టిక్టోక్లో భాగమైన దీన్ని ఇండియాలో కూడా తిరిగి ప్రారంభం కావొచ్చన్న ఆశాభావాన్ని సంస్థ ఉన్నతాధికారి ఒకరు వ్యక్తం చేశారు. దృశ్యం విసుగెత్తి సృజనకు ఉన్న అవధులను గుర్తుతెస్తుంది. స్వీయ ఊహాత్మక ప్రపంచంలోకి వెళ్లాలంటే శబ్దమే దారి. బహుశా, అందువల్లే మళ్లీ ఆడియో బుక్స్ పాపులర్ అవుతున్నాయి. ఇంకొకటి: ఒకప్పుడు లోకానికి మన ముఖాన్ని చూపుకోవడమనే ఉబలాటం ఎక్కువగా ఉంటుంది. అదింక రొటీన్ స్థాయికి వచ్చేశాక, మన ముఖం కనబడటం అనేది ప్రాధా న్యత కోల్పోతుంది. ప్రైవసీ అనేది గొప్ప ప్రివిలేజ్ అవుతుంది. అందుకే ముఖం కనబడకుండా వినగలిగే, మనగలిగే సామాజిక మాధ్యమాలకు ఆదరణ దక్కుతుంది. అప్పుడు చూడటంలో కన్నా చదవడంలోనే ఎక్కువ ఆనందం దొరికే స్థితి వస్తుంది. బహుశా ప్రపంచం ఈ సంధికాలంలో ఉన్నదేమో. ఈ స్థితిని దర్శించే కాబోలు కొందరు చదువరులు అప్పుడే ‘స్లో రీడింగ్’ అనేదాన్ని ప్రచారంలోకి తెస్తున్నారు. ప్రతి అక్షరాన్ని ఆబగా కాకుండా, జీర్ణించుకుంటూ, ఆస్వాదించుకుంటూ చదవమని చెబుతున్నారు. ప్రపంచాన్ని ఒకసారి స్లో మోషన్లో దర్శించండి. ఇంకా స్ఫుటంగా, స్పష్టంగా, దాని అన్ని సూక్ష్మ వివరాలతో, దానిదైన ప్రత్యేకతలతో. మీ చుట్టూ ఉన్నదే మరింత తదేకంగా, ఏకాగ్రతగా చూడటంలో ఎలాంటి ధ్యానస్థితి ఉంటుందో చదవడంలో కూడా అలాంటిదాన్ని అనుభవంలోకి తెచ్చుకొమ్మని సూచిస్తున్నారు. ‘ఆధునిక జీవితంలోని వేగాన్ని తగ్గించుకోవడానికి అనుసరించాల్సిన ప్రతిక్రియల్లో నెమ్మదిగా చదవడం ఒకటి’ అంటాడు కార్ల్ హోనోరే. ‘ఇన్ ప్రెయిజ్ ఆఫ్ స్లో’ అనే పుస్తకాన్ని కూడా రాశాడీ కెనడా పాత్రికేయుడు. ఏ రిజొల్యూషన్స్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నవాళ్లు ఈ రానున్న కొత్త సంవత్సరంలో ఇదొకటి తీర్మానం చేసుకోవచ్చు. చదవడం అనేది ఎటూ ఉంటుంది. కానీ దాని పూర్ణరూపంతో మనలోకి ఇంకేలా చదవాలని ఒక తీర్మానం చేసుకుందాం. ఒక హైకూను చదివినంత మెత్తగా, నెమ్మదిగా చదవడాన్ని ఆనందిద్దాం. -
Sreemoyee Piu Kundu: సింగిల్ ఉమెన్‌గా ఉండటానికి ఎన్నో కారణాలు.. అయితే
‘హాయ్ శైలి... ఇన్నాళ్ల తరువాత నిన్ను చూసే భాగ్యం కలిగింది. ఎలా ఉన్నావు?’ ‘నన్ను గుర్తు పట్టావా?’ ‘నాకు అక్కలాంటిదానివి నువ్వు. ఎందుకు గుర్తుపట్టను!’ ‘కొత్త ఇల్లు కొన్నందుకు శుభాకాంక్షలు భార్గవి. ఫొటోల్లో కంటే సన్నగా కనిపిస్తున్నావు. ఇలాగే బాగున్నావు’ ... ఇవి ఏ ఫంక్షన్ హాల్లోనో వినిపించిన మాటలు కాదు. ఈ హాల్లో వివాహ వేడుకలాంటిదేమీ జరగడం లేదు. అందరూ ఒకరికి ఒకరు బాగా తెలుసు. అయితే ఎప్పుడూ ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకోలేదు. ఈ సమావేశానికి వచ్చిన వాళ్లు సింగిల్ ఉమెన్. వారు సింగిల్ ఉమెన్‌గా ఉండడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. అయితే వారందరిని ఒకటి చేసింది, ఒక కుటుంబంలా నిలిపింది స్టేటస్ సింగిల్. కొన్ని సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా ఉన్న సింగిల్ ఉమెన్స్ ఆన్లైన్ వేదికగా ఒక బృందంగా ఏర్పడ్డారు. కష్టాలు, సుఖాలు, సంతోషాలు, సలహాలు...ఒకరితో ఒకరు పంచుకునేవారు. తమ గ్రూప్‌ను మరింత బలోపేతం చేయడానికి ఆన్లైన్ నుంచి ఆఫ్‌లైన్‌కు నడిచొచ్చారు. అందరూ దిల్లీలో సమావేశం అయ్యారు. ‘ఒకరినొకరం ప్రత్యక్షంగా కలుసుకోవడం చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చింది. కులం, మతం, ప్రాంతాలకు అతీతం గా మేమందరం ఒకే కుటుంబం అనే భావన కలిగింది’ అంటుంది రచయిత్రి, కాలమిస్ట్ శ్రీమోయి కుందు. అలా వచ్చిందే ఈ పుస్తకం.. ‘స్టేటస్ సింగిల్’ ఏర్పాటులో ఆమె కీలక పాత్ర పోషించింది. ‘రియల్ అకేషన్’ ‘హ్యాపియర్ టైమ్’ ‘యువర్ బిగ్డే’... తన ప్రతి పుట్టిన రోజు వేడుకల్లో తరచు వినిపించే మాటలు ఇవి. ఈసారి తన పుట్టిన రోజును ఒక వేడుకలా జరుపుకోకుండా, గుర్తుండి పోయే పని ఒకటి చేయాలనుకుంది. అలా వచ్చిందే ఆమె రాసిన ‘స్టేటస్ సింగిల్’ అనే పుస్తకం. దీని కోసం 30–40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అర్బన్ ఉమెన్స్ మూడువందల మందిని ఇంటర్వ్యూ చేసింది. వారి అనుభవాలను రికార్డ్ చేసింది. ఈ పుస్తకం సింగిల్ ఉమెన్ కష్టాలు, కన్నీళ్లనే కాదు... వారి పోరాట పటిమనూ కళ్లకు కట్టింది. సింగిల్ ఉమెన్‌పై రకరకాల అపోహలు ఉన్నాయి. వారికి కోపం ఎక్కువని. ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతుంటారని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారని... ఇలాంటి ఎన్నో అపోహలకు ఈ పుస్తకం సమాధానం చెబుతుంది. ‘నేను రాసిన పుస్తకం సెల్ఫ్–హెల్ప్ బుక్లా ఉపయోగపడకపోవచ్చు. స్ఫూర్తిదాయక పుస్తకం కాకపోవచ్చు. కానీ ఏ ఒక్కరికైనా ఉపయోగపడితే అంతకంటే సంతోషం ఏముంటుంది’ అని కుందు చెబుతున్నప్పటికీ ఎంతోమంది సింగిల్ ఉమెన్‌కు ఈ పుస్తకం స్ఫూర్తిదాయకంగా, సెల్ఫ్–హెల్ప్ బుక్లా ఉపయోగపడుతుంది. తర్వాత ఏమిటి మరి? ఢిల్లీలోనే కాదు దేశం నలుమూలలా ‘స్టేటస్ సింగిల్’ సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరికొకరు అండగా నిలవాలనేది లక్ష్యం. వారి లక్ష్యం ఫలించాలని ఆశిద్దాం. చదవండి: Vaccine RJ Aswathy Murali: టీవీ కంటే రేడియో ద్వారానే.. అలా మా కమ్యూనిటీలో -
Haut Monde Mrs India Worldwide: ప్రతిభా షా
ఉద్యోగం చేసి అలసిపోయి..అబ్బా చాలా కష్టపడ్డాం... అనుకునే వాళ్లు కొందరైతే...ఈ ఉద్యోగం ఇంకెన్నాళ్లు చేస్తాం? ఇక చాలు విసుగొస్తుంది. ఇంకేదైనా కొత్తగా నేర్చుకుందాం! అని సరికొత్త ఉత్సాహంతో విభిన్న రంగాల్లో దూసుకుపోతుంటారు మరికొందరు. ఈ కోవకు చెందిన వ్యక్తే అమిషా సేథీ. రచయితగా... వెల్నెస్ కోచ్‌గా... గ్లోబల్ మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా విజయవంతంగా రాణిస్తూనే.. తాజాగా ప్రతిష్టాత్మక ‘హౌట్ మొండే మిసెస్ ఇండియా వరల్డ్‌వైడ్– 2021’ పదో సీజన్ విన్నర్‌గా నిలిచి, కిరీటాన్ని కైవసం చేసుకుంది. అమిషా రాజ్‌కోట్‌లో పుట్టినప్పటికీ పెరిగిందంతా ఢిల్లీలోనే. బాల్యంలో స్నేహితులతో కలిసి డ్యాన్స్‌షోలు చూడడం. థ్రిల్లర్, రొమాంటిక్ నవలలు చదువుతూ... సినిమాలు చూస్తూనే చదువులో మంచి గ్రేడ్లు తెచ్చుకునేది. తను చూసిన డ్యాన్స్షోల ప్రభావంతో చిన్ననాటి నుంచి కొరియోగ్రాఫర్ అవ్వాలని కలలను కనేది. కానీ వివిధ కారణాలతో కొరియోగ్రఫీ చేయలేకపోయింది. దీంతో ఇంటర్మీడియట్ అయ్యాక నోయిడాలోని బిజినెస్ స్కూల్లో ఎమ్బీఏ చదివింది. తరవాత చికాగోలోని‘ కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్’లో ఎగ్జిక్యూటివ్ స్కాలర్స్ ప్రోగ్రామ్ చేసింది. బడా కంపెనీలకు కన్సల్టెంట్‌గా.. అమిషా చదువు పూర్తయిన వెంటనే ఎయిర్‌టెల్‌లో ఉద్యోగిగా చేరింది. ఇక్కడ నాలుగేళ్లు పనిచేసాక, బ్లాక్‌బెర్రీ కంపెనీకి మారింది. ఈ రెండు కంపెనీలలో వివిధ హోదాల్లో పనిచేసింది. బ్లాక్‌బెర్రీలో బ్రాండ్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా, ఎయిర్ ఏసియాలో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా, జఫీన్లో గ్లోబల్ సీఎమ్వోగా అత్యుతమ సేవలందించింది. అనేక బడా కంపెనీలకు కన్సల్టెంట్‌గా అమిషా అందించిన సేవలకుగాను.. వరల్డ్ ఉమెన్ లీడర్షిప్ కాంగ్రెస్ ఇచ్చే ‘యంగ్ ఉమెన్ రైజింగ్ స్టార్’, ద ఏసియా పసిఫిక్ యంగ్ ఉమెన్ అచీవర్స్ అవార్డు, సీఎన్‌బీసీ యూత్ అచీవర్స్ అవార్డు, మార్కెటింగ్ ఎక్స్‌లెన్స్ లాంటి ఎన్నో అవార్డులు వరించాయి. రచయిత నుంచి మోటివేషనల్ స్పీకర్ వరకు... కన్సల్టెంట్‌గా విజయవంతంగా దూసుకుపోతూ, అనేక ఉన్నతస్థాయి పదవుల్లో తనని తాను నిరూపించుకున్న అమిషాకు గ్రంథాలు, శిల్పాల మీదకు ఆసక్తి మళ్లింది. దీంతో వివిధ గ్రంథాలను చదువుతూ అనేక విషయాలు తెలుసుకునేది. గ్రంథాలను చదివేటప్పుడు తనకు వచ్చిన ఆలోచనలను కాగితం మీద పెట్టేది. అలాగే వివిధ భాషల్లో తను చదివిన గ్రంథాలను అందరూ చదివేందుకు వీలుగా అనువాదాలు చేసింది. ఇలా అమిషా రాసి పుస్తకం ‘ఇట్ డజంట్ హర్ట్ టు బి నైస్’ బెస్ట్‌సెల్లర్ బుక్‌గా నిలిచింది. పుస్తకాల ప్రమోషన్లో భాగంగా అమిషా మాటతీరు ఆసక్తికరంగా ఉండడంతో, ‘‘అంతా ఇంకా మాట్లాడండి’’ అంటూ ప్రోత్సహించడంతో అమిషా మోటివేషనల్ స్పీకర్‌గా మారింది. ప్రతి సెషన్‌కు ఏం మాట్లాడాలి? ఆరోజు ఏం సందేశం ఇవ్వాలి... అని బాగా సన్నద్ధమయ్యేది. ఏన్షియంట్ టైమ్‌లెస్ టెక్నిక్స్, మెడిటేషన్, ఫన్ గేమ్స్, న్యూరోసైన్స్, సైకలాజికల్ టెస్టులను వివిధ వర్క్‌షాప్స్‌లో అందిస్తూ తన కంటెంట్‌ను మెరుగుపరుచుకుంది. ఇవేగాక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్, ఆసుపత్రులు, సపోర్ట్ సెంటర్లలో తరచూ హ్యాపీనెస్ సెషన్లను నిర్వహిస్తుండేది. వెల్నెస్కోచ్.. ఫిట్‌నెస్‌కు బాగా ప్రాముఖ్యతనిచ్చే అమిషా ‘ఏజ్ రివర్సల్ థెరపీస్’, యోగా, మెడిటేషన్, ఆధునిక వ్యాయామాలపై ఆసక్తితో వాటి గురించి లోతుగా తెలుసుకుని తను ఆచరించడంతోపాటు.. ఫిట్‌గా ఎలా ఉండాలో తోటి వాళ్లకు నేర్పించేంత ప్రావీణ్యాన్ని సంపాదించింది. తన ఫిటెనెస్, ఆకర్షించే రూపం, తెలివితేటలతో బెంగళూరు తరపున పాల్గొని ప్రతిష్టాత్మక హౌట్ మొండే మిసెస్ ఇండియా వరల్డ్‌వైడ్–2021 సీజన్–10 విజేతగా నిలిచింది. యూఏఈలో జరిగిన ఈ పోటీలో 21 దేశాల నుంచి అతివలు పాల్గొనగా, అందులో 96 మంది ఫైనలిస్టులలో గ్లామర్, గుడ్‌లుక్స్, తెలివితేటల ప్రతిభ ఆధారంగా అమిషా సేథీ టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ‘‘జీవితంలో విజయం, ఓటమి రెండూ లేవు. జీవితమంటే ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయడమే. ఈ సూత్రం నమ్మే నేను ఈ స్థాయికి ఎదిగాను.’’ అంటూ అమిషా నేటి యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది. -
అబ్బాయిల వేషం కట్టి... తప్పించుకుంది
తాలిబన్లు చెప్పే మాటలు న మ్మకండి. వాళ్లు చేసే ప్రమాణాలు ఎప్పుడైనా మారిపోవచ్చు. మీరు మీ కుంటుంబాలతోపాటు స్నేహితులను అఫ్గానిస్తాన్ నుంచి తరలించండి అని హెచ్చరిస్తోంది స్పెయిన్‌లో నివసిస్తోన్న అఫ్గాన్ మహిళా కార్యకర్త, రచయిత నదియా గులామ్. ప్రస్తుతం నదియా అఫ్గాన్‌లో లేనప్పటికీ తన కుటుంబం మాత్రం ఇంకా అక్కడే ఉండడంతో ఆమె తీవ్ర ఆందోళన చెందుతోంది. ‘‘నా కుటుంబమే కాదు, అక్కడ ఉన్న వేలమంది కూడా నా కుటుంబ సభ్యులే. తాలిబన్లు తమ మాతృదేశాన్ని ఆక్రమించుకున్నప్పటి నుంచి నా కంటనీరు ఆగడం లేదు.గతంలో కంటే తాలిబన్లు ఇప్పుడు మరింత తెగబడతారు. గత ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులు ఒక్కొక్కరుగా కనపడకుండా పోతారు’’ అని వణికిపోతోంది. నదియా ఇంతగా భయపడడానికి... గతంలో తాలిబన్ల అరాచకాల వల్ల తను అనుభవించిన నరకయాతనలే. తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను పరిపాలిస్తున్న రోజులవి. అప్పుడు నదియాకు పదకొండేళ్లు ఉంటాయి. ఒకరోజు నదియా వాళ్ల ఇంటిపై బాంబు పడింది. ఇంట్లో ఉన్న అమ్మానాన్నలు తీవ్రంగా గాయపడ్డారు. నదియా వాళ్ల అన్నయ్య ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో బయట పడిన నదియాకు రూపురేఖలు వికృతంగా మారిపోయాయి. ఒక బాంబు దాడి కుటుంబాన్నే నాశనం చేసింది. ఇది ఇలా ఉండగా... అదే సమయంలో ‘‘మహిళలు చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, ఇల్లు విడిచి బయటకు రాకూడదు’’ అని తాలిబన్లు హుకుం జారీ చేశారు. ఒకపక్క అన్నయ్య లేడు, నాన్న ఉన్నప్పటికీ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబానికి తనే ఆధారం కావాల్సి వచ్చింది. అడపిల్లలు బయటకు వెళ్లకూడదు. వెళ్లకపోతే ఇల్లు గడిచే పరిస్థితి లేదు. ఇంతటి క్లిష్టసమయంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది నదియా. అమ్మాయిగా బయటకు వెళ్తే తప్పు గానీ, అబ్బాయిగా కాదు కదా! అనుకుని బయటకు వెళ్లేటప్పుడు అబ్బాయిలా బట్టలు వేసుకుని, అబ్బాయిలా తిరుగుతూ మగవాళ్లలా పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. ఇలా పదేళ్ల పాటు తన బాల్యాన్ని, గుర్తింపును కోల్పోయి బతికింది. పదేళ్ల తరవాత ఓ ఎన్జీవో సాయంతో స్పెయిన్‌కు శరణార్థిగా వెళ్లింది. స్పెయిన్ వచ్చాక మళ్లీ పుట్టినట్లు అనిపించింది తనకు. కొత్త జీవితాన్ని ప్రారంభించే క్రమంలో ముఖానికి సర్జరీ చేయించుకుని వికృతంగా ఉన్న రూపాన్ని కాస్త మార్చుకుంది. అలాగే తనలా శరణార్థులుగా వస్తోన్న నిరాశ్రయుల కోసం ‘‘పాంట్స్ పర్ లా పావ్’’ను స్థాపించి, శరణార్థులకు వివిధ రకాల భాషలు, వృత్తిపరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తూ వారికి బతుకుదెరువు చూపిస్తోంది. అంతేగాక చిన్నతనంలోనే అనేక కష్టాలను ప్రత్యక్షంగా అనుభవించిన నదియా అనుభవాలతో ‘‘ద సీక్రెట్ ఆఫ్ మై టర్బన్’’, టేల్స్ దట్ హీల్డ్ మీ’’, ‘‘ద ఫస్ట్ స్టార్ ఆఫ్ ది నైట్’’ పుస్తకాలను రాసి రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకుంది. తనలా ఇంకెంతమందో... ఇన్ని కష్టాలు పడిన నదియా ఇప్పటికీ ఆ చీకటిరోజులను మర్చిపోలేక పోతోంది. తాజాగా తాలిబన్లు మరోసారి పిల్లలు, అమ్మాయిలు, మహిళలపై ఎంతటిదారుణమైన చర్యలకు పాల్పడతారోనని వణికి పోతుంది. తనలాగా ఇంకెంతమంది అమ్మాయిలు తమ జీవితాలను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.‘‘ప్లీజ్ మా దేశానికి గన్స్ సరఫరా చేయకండి. నా దేశం గత యాభై ఏళ్లుగా యుద్ధంలో పోరాడుతూనే ఉంది. అఫ్గాన్‌లో 85 శాతం మంది ప్రజలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. నిజంగా మీరు మాకు సాయం చేయాలంటే మానసిక ధైర్యాన్ని ఇవ్వండి. మహిళలు చదువుకునేందుకు సహకరించండి’’ అని అంతర్జాతీయ సమాజాన్ని అర్థిస్తోంది. అంతేగాదు, గత పదిరోజులుగా అఫ్గాన్ నుంచి ప్రజలను తరలించేందుకు శాయశక్తులా కృషిచేస్తోంది. నిజంగా కష్టాలు పడిన వారికే ఆ బాధ తెలుస్తుంది అనడానికి నదియా నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. నదియా గులామ్ -
Manya Harsha: అక్షరాలా చైతన్యం
వంద మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఆ ఒక్క అడుగు పడే సమయం కూడా అంతే కీలకమైనది. పదేళ్లు నిండేలోపే కొన్ని అడుగులు నడిచేసింది మాన్యాహర్ష. అవగాహన అడుగులు తాను వేసింది, తోటి పిల్లలతో వేయించింది. తాను చెప్పగలిగిన విషయాన్ని అలతి అలతి పదాలతో ఐదు పుస్తకాలు రాసింది. వాటికి బొమ్మలు వేసింది. గేయాలను స్వరపరుచుకుంది. స్వయంగా పాడి వినిపిస్తోంది. తాజాగా వ్యర్థం కూడా అర్థవంతమేనని నిరూపించింది. మాన్యా హర్ష ఎకో యాక్టివిస్ట్. క్లైమేట్ అండ్ వాటర్ విభాగంలో పని చేస్తోంది. యాక్టివిస్ట్ అంటే సమస్య మీద గళం విప్పి ఊరుకోవడం కాదు... పరిష్కారం చూపించడం అని నిరూపిస్తోంది. పరిష్కారాన్ని కూడా మాటల్లో కాదు... చేతల్లో చూపిస్తోంది. ఇంట్లో వాడి పారేసే వ్యర్థాలతో పేపర్ తయారు చేసి చూపిస్తోంది. బెంగళూరులో ఆరవ తరగతి చదువుతున్న మాన్య పిల్లల్లో పర్యావరణం పట్ల అవగాహన కల్పించడానికి 2018లో ‘ద వరల్డ్ వాటర్ కన్జర్వేషన్ డే (మార్చి 22) నాడు బెంగళూరు, జేపీ నగర్ వీథుల్లో వాకథాన్ నిర్వహించింది. తల్లిదండ్రులు, పుట్టెనహల్లి లేక్ నిర్వహకుల సహకారంతో దొరసాని ఫారెస్ట్ నుంచి పుట్టెనహల్లి సరస్సు వరకు పిల్లలతో కలిసి మొక్కలు నాటింది. మార్కోనహల్లి డ్యామ్, వర్కా బీచ్ పరిశుభ్రత కార్యక్రమంలో పనిచేసింది. ఇదే సమయంలో నగరంలో కొండల్లా పేరుకుపోతున్న వ్యర్థాలను చూసినప్పుడు వాటిని ఉపయోగంలోకి తీసుకురావడం ఎలా... అనే ప్రశ్న తలెత్తింది. ఆ ప్రయత్నం ఇంటి నుంచే మొదలు పెట్టింది. పది ఉల్లిపాయల తొక్కల్లో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి తగినంత నీరు పోసి కుకర్‌లో ఉడికించింది. ఆ తరవాత మెత్తగా గ్రైండ్ చేసింది. ఆ గుజ్జును ఒక పలుచని వస్త్రం మీద సమంగా పరిచి ఆరబెట్టింది. అదనపు నీరు ఇగిరిపోయి గుజ్జు మాత్రం లేత వంగపండు పేపర్‌గా మారింది. మాన్య తన ప్రయోగాన్ని మరింత విస్తరించింది. లేత పసుపు రంగు పేపర్ కోసం మొక్కజొన్న, లేత ఆకుపచ్చ కాగితం కోసం బఠాణి గింజల తొక్కలతోనూ విజయవంతంగా ప్రయోగం చేసింది. పండుగల సమయంలో ఉపయోగించే పూలు, తమలపాకులతో మృదువైన పేపర్ని చేసి చూపించింది. పాత దినపత్రికల తో క్యారీ బ్యాగ్‌లు చేసి ప్లాస్టిక్ బ్యాగ్‌లకు బదులుగా వాడమని వీథి పక్కన పండ్లు, కూరగాయలమ్ముకునే వాళ్లకిచ్చింది. కరోనా డైరీస్ మాన్య తొలి పుస్తకం పేరు ‘నేచర్ అవర్ ఫ్యూచర్’. ప్రకృతి గురించి ఇంగ్లిష్‌లో రాసిన గేయాలకు యూఎన్ వాటర్ విభాగం నుంచి ప్రశంసలందుకుంది. రెండవ పుస్తకం ‘ద వాటర్ హీరోస్’. నీటి ఆవశ్యకత, నీటికొరత మీద రాసింది. దీనికి కేంద్ర జల శక్తి విభాగం అవార్డు వచ్చింది. మూడవ పుస్తకం పేరు ‘నీరిన పుతాని సంరక్షకారు’. ఇది రెండవ పుస్తకానికి కన్నడ వెర్షన్. ఇక కోవిడ్ సమయంలో స్కూళ్లు బంద్ అయ్యాయి. ఈ సుదీర్ఘ విరామంలో మాన్య ‘వన్స్ అప్ ఆన్ ఎ టైమ్ ఇన్ 2020’ అంటూ కరోనా డైరీస్ మొదలు పెట్టింది. దానికి కన్నడ వెర్షన్ కూడా రాసింది. మొత్తం ఐదింటిలో మూడు ఇంగ్లిష్, రెండు కన్నడ భాషల్లో వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ప్రకృతి ఇతివృత్తంగా ఆరవ పుస్తక రచనలో ఉంది. చైల్డ్ ప్రాడిజీ మ్యాగజైన్ టాప్ హండ్రెడ్ చైల్డ్ ప్రాడిజీల జాబితాలో మాన్యను ‘ద నేచర్ హీరో’ టైటిల్‌తో చేర్చింది. పది రికార్డులు మూడు పూలు ఆరు కాయలన్నట్లుగా సాగుతోన్న మాన్య ప్రకృతి ఉద్యమంలో ఇప్పటి వరకు పది రికార్డులు అందుకుంది. ► ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి మూడు ► ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ∙వజ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్ ► వరల్డ్ రికార్ట్స్ ఇండియా ∙గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ► ఎక్స్‌క్లూజివ్ వరల్డ్ రికార్డ్స్ ► కర్నాటక అచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అక్షరంతోనే చైతన్యం! ‘‘అమ్మానాన్నలతో కలిసి అనేక ప్రదేశాలకు వెళ్లాను. సరస్సులు, నదులు చాలా చోట్ల చెత్తతో నిండిపోయి ఉంటున్నాయి. చెత్తను లారీల్లో తెచ్చి నీటిలోకి పోయడం కూడా చూశాను. ఎందుకలా చేస్తున్నారని చాలా బాధ కలిగేది. కోపం వచ్చేది. అప్పుడు మా నాన్న ‘మనం అనుకున్న దాన్ని సాధించడానికి గొడవ పడడం మార్గం కానే కాదు. అక్షరం కత్తికంటే పదునైనది. నీ కోపాన్ని అక్షరాల్లో చూపిస్తే నీ కళ్ల ముందు నీటిలో చెత్తను పోసే వాళ్లను మాత్రమే కాక, ఎంతోమందిని చైతన్యవంతం చేయవచ్చు’ అని చెప్పారు. ఎలా రాయాలో కూడా నేర్పించారు. నేను నమ్మేది ఒక్కటే... ఈ ప్రకృతిలో వ్యర్థం అంటూ ఏదీ ఉండదు. మనం దానిని వ్యర్థం అనే భావనతో చూడడం తప్ప’’. – మాన్యహర్ష, బాల ఉద్యమకారిణి -
ప్రముఖ రచయిత్రి మాజేటి జయశ్రీ కన్నుమూత
కొరుక్కుపేట: ప్రముఖ రచయిత్రి, తెలుగు తరుణి సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మాజేటి జయశ్రీ(72) ఇకలేరు. గురువారం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్, విజయవాడకు చెందిన డాక్టర్ మాజేటి జయశ్రీ తల్లిదండ్రులు వ్యాపారరీత్యా చెన్నైలో స్థిరపడ్డారు. మద్రాసు వర్సిటీ నుంచి ఎంఏ పూర్తిచేసిన ఆమె 21వ ఏటనే క్వీన్ మేరీస్‌కళాశాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి ఎంతోమంది విద్యార్థులకు మార్గదర్శకురాలుగా నిలిచారు. 2015 సంవత్సరంలో చెన్నైలో తెలుగు భాష పరిరక్షణ, మహిళల సాధికారత దిశగా తెలుగు తరుణి సంస్థను స్థాపించి అనేక సాంస్కృతిక, సంక్షేమ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తు వచ్చారు. అనేక సంస్థల నుంచి అవార్డులను అందుకున్న ఆమె రచనల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. సందేశాత్మక పుస్తకాలను రచించి ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల కోసం టీటీకే సంస్థ ఆధ్వర్యంలో స్కూల్ అట్లాస్ రూపొందించారు. ఈమెకు ఇద్దరు కుమారులు. గురువారం సాయంత్రం చెన్నై ఓటేరి శ్మశాన వాటికలో జయశ్రీ దహన సంస్కారాలు పూర్తి చేసినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. జయశ్రీ మృతి వార్త తెలుసుకున్న తెలుగు తరుణి అధ్యక్షురాలు కె. రమణి, ఇతర సభ్యులు, తెలుగు ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. -
ఇది ధైర్యం కాదు... భయం లేకపోవడం!
ఎమ్మెస్సీ కంప్యూటర్స్, ఎకనమిక్స్‌లో ఎంఫిల్ చేసిన కవిత యాగ బుగ్గన యూఎస్‌లో సాఫ్ట్వేర్ నిపుణులుగా, ఇండియాలో డెవలప్మెంటల్ ఎకనమిస్ట్‌గా చేశారు. ట్రావెల్, ఫిక్షన్, నాన్ఫిక్షన్ రైటర్. రిషివ్యాలీ స్కూల్ ఆమెకు ప్రపంచాన్ని చదవడం నేర్పించింది. సునిశితంగా విశ్లేషించి, ప్రశ్నించగలిగిన నైపుణ్యాన్ని అలవరిచింది. ‘‘వీటన్నింటి నేపథ్యంలో నాకు తెలిసిందేమిటంటే... ఆధ్యాత్మికత అంటే జీవితాన్ని నిస్సారంగా గడపడం కాదు, సమాజం నుంచి దూరంగా వెళ్లిపోవడమూ కాదు. సమాజంలో జీవిస్తూ, వృత్తి ఉద్యోగాలలో కరుణపూరితంగా వ్యవహరించగలగడం’ అంటారామె. ఆ నీటిలో విషం లేదు! కవిత విస్తృతంగా పర్యటనలు చేస్తారు. అవి సాహసానికి లోతైన నిర్వచనాన్ని తెలియచేస్తుంటాయి. అవన్నీ జీవితాలను అర్థం చేసుకోవడానికే అయి ఉంటాయి. మూఢనమ్మకాలను తుడిచేయడానికి సాహసాలు చేశారు. మన్సరోవర్ సమీపంలోని రాక్షస్‌తాల్ ను స్థానికులు విషపు నీటి మడుగు అంటారు. రావణాసురుడు ఆ మడుగు దగ్గర తపస్సు చేసిన కారణంగా అవి విషపూరితమయ్యాయనే కథనంతో ఆ సరస్సు సామాజిక బహిష్కరణుకు గురైంది. కవిత తన పర్యటన సందర్భంగా ఆ నీటిని తాగి ‘నేను తాగాను, ఏమైంది’ అని ప్రశ్నించారు. కొంచెం ఉప్పగా ఉన్న కారణంగా ఆ నీటిని తాగవద్దు అని చెప్పడానికి ఇంత పెద్ద ట్యాగ్ తగిలించడం ఏమిటనేది ఆమె ప్రశ్న. అందరూ తీర్పరులే! ప్రయాణం అంటే ప్రదేశాలను చూసే వ్యాపకం కాదు, జీవితాలను చదివే సాధనం అంటారు కవిత. గుంటూరు జిల్లాలోని స్టూవర్ట్‌పురం మీదుగా ఎంతోమంది ఎన్నోసార్లు ప్రయాణించి ఉంటారు. స్టేషన్ పేరు విని ఆ పేరు రావడానికి కారణాలు తెలుసుకుని, ఆ గ్రామాన్ని ఏర్పాటు చేయడానికి దారి తీసిన పరిస్థితులను అన్వేషించారు కవిత. కులవ్యవస్థ మన సమాజంలో అభివృద్ధి నిరోధకంగా ఉన్న పెద్ద అడ్డంకి. అయితే ఏకంగా ఒక సామాజిక వర్గం మొత్తాన్ని దొంగలుగా ముద్ర వేయడాన్ని తీవ్రంగా నిరసించారామె. ‘‘ఒక వ్యక్తి గుణగణాలు ఆ వ్యక్తికే పరిమితం. ఒక వ్యక్తి దుర్గుణాలను ఆ కుటుంబం మొత్తానికి ఆపాదించడమే పెద్ద తప్పు, అలాంటిది ఆ కులమంతటికీ ఆపాదించడం ఏమిటి? సంస్కరణ పేరుతో వారిని బలవంతం గా ఒకచోటకు తరలించి, ఇక్కడే నివసించాలనే నిర్దేశించడం శిక్షార్హమైన నేరం’’ అంటారు కవిత. మన సమాజంలో అగ్రవర్ణాలుగా చలామణిలో ఉన్న వాళ్ల విషయంలో ఇలాగే చేసేవారా... అంటూ అప్పటి బ్రిటిష్ పాలకుల విధానాన్ని నిరసించారు. తన ప్రయాణ పరిశోధనలన్నింటినీ అక్షరబద్ధం చేస్తారామె. మన సమాజంలో ఉన్న పెద్ద అవలక్షణం... ఇతరుల జీవితానికి ప్రతి ఒక్కరూ తీర్పరులుగా మారిపోవడమే అంటారు కవిత. పాశ్చాత్య జీవనశైలిని మన జీవితాల్లోకి స్వాగతించినంత బేషరతుగా వారి ఆలోచన ధోరణిని అలవరుచుకోవడం లేదంటారామె. హిందూ, రివర్ టీత్, తెహల్కా, జాగరీ లిట్ వంటి వార్తాపత్రికలు, ఫిక్షన్– నాన్ ఫిక్షన్ జర్నల్స్‌లో ప్రచురితమైన రచనల్లో ఆమె తెలుగు నేల మీద విస్తరించిన బ్రిటిష్ కాలనీ బిట్రగుంటను కూడా ప్రస్తావించారు. చైనా పాలనలో టిబెట్ వాసుల అసంతృప్తినీ, నేపాల్‌లోని హమ్లా వ్యాలీ ప్రజల పేదరికాన్నీ రాశారు. అసలైన తాత్వికత శ్రీలంక, నేపాల్, టిబెట్, లెబనాన్, రుమేనియా, ఇటలీ, ఫ్రాన్స్, యూకే, యూఎస్, కెనడా,స్పెయిన్, చైనా, జపాన్, కాంబోడియా, మయన్మార్, థాయ్‌ల్యాండ్, టాంజానియావంటి అనేక దేశాల్లో పర్యటించిన కవిత అసలైన తాత్విక జీవనం సాగిస్తున్నది సంచార జాతులేనంటారు. ‘‘ఆదివాసీలు, అందులోనూ సంచార జాతుల ఫిలాసఫీ చాలా గొప్పది. ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, అందుకే ఈర్ష్య, అసూయ, వైషమ్యాలు ఉండవు. జీవితాన్ని యథాతథంగా స్వీకరిస్తారు. అడవుల్లో జీవించే వాళ్లు ప్రకృతి ఏమి ఇస్తే దాంతోనే జీవితం అనుకుంటారు, ప్రకృతికి హాని కలిగించరు. ప్రభుత్వాలు అడవి మీద ఆధిపత్యాన్ని హస్తగతం చేసుకోవడంతో వారి జీవితాల్లో ఒడిదొడుకులు మొదలయ్యాయ’’ంటారు కవిత. మగవాళ్లు సాహసించని ప్రదేశాలకు కూడా ఆమె చొరవగా వెళ్లిపోతారు, అక్కడి విషయాలను అంతే ధైర్యంగా రాస్తారు. అదే విషయాన్ని ఆమె ‘ఇది ధైర్యం కాదు, భయం లేకపోవడం’ అంటారు. జీవితం పట్ల ఆందోళన, భయం లేనప్పుడు ఏదీ భయపెట్టద’ని రిషీవ్యాలీ స్కూల్ నేర్పించిన ఫిలాసఫీని మరోసారి గుర్తు చేశారు. – వాకా మంజులారెడ్డి -
సమాజం లెక్క తేల్చిన కథల మేష్టారు
ఆయన వృత్తిరీత్యా లెక్కల మాష్టారు. కాని సమాజంలో ప్రతిదానికీ ఒక లెక్క ఉంటుందని, ఒక లెక్కను పెద్దవాళ్లు కలిసి నిర్ణయిస్తారని, ఆ పెద్దవాళ్లకు రెండు రెళ్లు ఆరనీ, కింద వాళ్లకు శేషం సున్నా అనీ ఆయన స్కూల్లో పిల్లలకు కాకుండా కథల్లో పాఠకులకు చెప్పారు. మనుషులు ఈసురోమని ఉంటే అందుకు కారణం ఆ సదరు మనుషులు కారని వెనుక ఎక్కడో ఉండే మనుషులని ఆయన చెప్తారు. తెలుగు కథను ఉన్నతీకరించిన కాళీపట్నం రామారావు 97వ ఏట జీవించి అస్తమించారు. ఆయన రచనలు, ఆయన రచనా పరిశ్రమ ప్రతి తెలుగు ‘ఫ్యామిలీ’కి తెలిసి ఉండాలి. పోస్ట్‌మేన్ ఇంటికి ఉత్తరాలు తెచ్చి ఇస్తాడు. పోలీసు ఇంటికి రక్షణ కల్పిస్తాడు. ఇంజినీరు ఇల్లు కడతాడు. ప్రభుత్వ అధికారి ఇల్లు నడవడానికి అవసరమైన సంఘపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తాడు. వీరంతా సమాజంతో ఉంటూ సమాజం కోసం పని చేస్తూ సమాజంలో భాగంగా ఉంటారు. కాని ఈ సమాజం ఎలా ఉందో ఎవరు చెప్తారు? కథకుడే చెప్తాడు. సమాజాన్ని చూసి సమాజానికి దానిని తిరిగి చూపిస్తాడు కథకుడు. సమాజం ఎలా ఉందో రాసేవాణ్ణి రచయిత అనొచ్చు. అలా ఎందుకు ఉందో రాసేవాణ్ణి మంచి రచయిత అనొచ్చు. అలా ఉండకుండా ఏమి చేయవచ్చో రాసి పాఠకులను ఆలోచనాశీలురుగా, కర్తవ్యోన్ముఖులుగా చేసే రచయితను గొప్ప రచయిత అనొచ్చు. కాళీపట్నం రామారావు అలాంటి గొప్ప రచయిత. మనం ఏం చేయాలో ముందు నిర్ణయించుకోవడం అందుకు తగ్గట్టుగా జీవితాన్ని నిర్మించుకోవడం అందరూ చేయరు. కాళీపట్నం రామారావు తన వివాహం అయ్యాక, 1947 నాటి కాలంలోనే 80 రూపాయల జీతం వచ్చే స్పోర్ట్స్ డిపోలోని ఉద్యోగానికి రాజీనామా చేశారు. కారణం అది కథలు రాసుకోవడానికి అవసరమైన టైమ్ ఇవ్వదని. 30 రూపాయల జీతం వచ్చే ప్రభుత్వ ఉపాధ్యాయుడి జీతం ఎంచుకున్నాడాయన. తెలుగు కథ తనకు అవసరమై ఆయన జీవితాన్ని రూపుదిద్దుకుందా అనిపిస్తుంది. 1979లో ఆయన రిటైరయ్యారు. అది కూడా కథ చేసుకున్న ఒక ఏర్పాటే. ఎందుకంటే ఆ తర్వాతి సమయమంతా ఆయన తెలుగు కథకే ఇచ్చారు. దాదాపు 30–35 ఏళ్లు తెలుగు కథ ప్రచారానికి, సేకరణకి, భద్రపరచడానికి వెచ్చించారు. దేని నుంచి పొందామో దానికే తిరిగి ఇవ్వడం చేసిన అరుదైన రచయిత కాళీపట్నం రామారావు. శ్రీకాకుళం చైతన్యధార ప్రపంచంలో గొప్ప రచయితలందరూ జీవితంలో రకరకాల పనులు చేసినవారే. శ్రీకాకుళం జిల్లా మురపాక ప్రాంతానికి చెందిన కాళీపట్నం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కుదురుకునేంత వరకూ రకరకాల పనులు చేశారు. టైపిస్ట్‌గా, డిస్ట్రిక్ట్ కోర్టులో చిరుద్యోగిగా, రేషనింగ్ ఆఫీసులో ఎంక్వయిరీ ఆఫీసరుగా ఇలా రకరకాల పనులు చేశారు. పత్రికల్లో పని చేయాలని ఆయనకు గట్టిగా ఉండేది. మద్రాసు (చెన్నై) వెళ్లి ప్రయత్నించినా జరగలేదు. సాహిత్యం పట్ల ఏర్పడిన ఆసక్తి ఆయనను కథకుడిగా ఉండమని కోరింది. 1943లో ఆయన మొదటి కథ ‘ప్లాట్‌ఫారమో?’ అచ్చయ్యింది. ఆ తర్వాత ఆయన కొన్ని కథలు రాసినా ఇవి కాదు కదా రాయాల్సింది అని అనిపించింది. ఆలోచన కలిగించనిది కథ ఎలా అవుతుంది అని ఆయన అనుకున్నారు. పాఠకులకు ఆలోచన కలిగించాలంటే రచయితకు చదువు, అవగాహన, జ్ఞానం, హేతువు, సైద్ధాంతిక భూమిక, ప్రాపంచిక దృక్పథం ఇవన్నీ ఉండాలి కదా అని అధ్యయనంలో పడ్డారు. 1955 నుంచి దాదాపు ఎనిమిదేళ్లు కథలు రాయకుండా పూర్తిగా అధ్యయనంలో ఉండిపోయారు. 1964లో ‘తీర్పు’ కథతో అసలైన కాళీపట్నం రామారావు తెలుగు పాఠకలోకానికి తెలిశారు. 1966లో ఆయన రాసిన ‘యజ్ఞం’ కథ తెలుగు సాహిత్యానికి చూపు, ఊపు ఇచ్చింది. ‘కథ ఎందుకు?’, ‘కథ ప్రయోజనం ఏమి?’, ‘కథ నడిచే మార్గం ఎలా ఉండాలి’ ఈ ప్రశ్నలన్నింటికి ఆ కథ ఒక మార్గదర్శిగా నిలిచింది. సామాజిక సమస్యలు, అంతర్గత ఆరాటాలు శరీరం మీద పీడన మనసు మీద పడుతుంది. మనసు పడే వొత్తిడి శరీరానికి హాని కలిగిస్తుంది. వ్యవస్థ గతి వ్యవస్థది మాత్రమే కాదు. ఆ గతిలో సమాజంలోని ప్రతి పౌరుడు భాగం. ఆ గతి మతి తప్పితే ఆ పౌరుడు బాధితుడవుతాడు. ఆ పౌరుడే ఇంటికొస్తే వ్యక్తిగా మారి అంటే తండ్రిగా, భర్తగా, కుమారుడిగా వొత్తిడి ఎదుర్కొంటాడు. ఈ రెంటినీ కాళీపట్నం రామారావు కథగా చేసి తెలుగు పాఠకులకు చూపారు. గుప్పిట విప్పేసినట్టుగా రాయడం ఆయన పద్ధతి కాదు. సూచించినట్టుగా పొరల చాటున దాచినట్టుగా ఆయన పరమసత్యాన్ని నిగూఢపరిచి దానిని తానే కనుగొన్న సంతృప్తిని పాఠకునికి ఇస్తారు. పౌరహితం కోరుతున్నట్టు కనిపించే ఈ సామాజిక వ్యవస్థ నిజానికి మేడిపండు. ఇది పైకి మంచిగా కనిపిస్తూ లోపల పీడితుల రక్తాన్ని తాగుతూ ఉంటుందని ఆయన రాసిన ‘యజ్ఞం’ కథ నాటి సామాజిక, ఆర్థిక మూలాల కఠినత్వాన్ని చూపింది. ఈ కథ ముగింపులో నిస్సహాయుని ఆగ్రహ ప్రకటనగా బాధితుడు తన ఇంటి పిల్లాడి తల నరకడాన్ని రచయిత చూపిస్తాడు. నేటికీ అదే జరుగుతోంది.. బలవంతుడైన పీడకునితో పోరాటానికి దిగితే మనకు ఆపద ఎదురవుతుంది. అప్పుడు మనవాళ్లే వచ్చి మన చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఆ పోరాటం నుంచి విరమింప చేస్తారు. అయితే పోరాటం వొద్దనా? కాదు ఒకరూ ఒకరూ ఒకరూ కాక అందరు కలిసినప్పుడు బలవంతుడు తోక ముడుస్తాడన్న సూచన ఉంది అందులో. ఆ భాష, ఆ సొగసు కాళీపట్నం రామారావు కేవలం ప్రగతిశీల కథ రాసి ఉంటే ఇంత ఖ్యాతి వచ్చి ఉండేది కాదు. ఆయన తాను పుట్టి పెరిగిన శ్రీకాకుళం మీద తన కథలను నిలబెట్టి ఆ స్థానికతే విశ్వజనీయత అనే భావనతో కథలు చెప్పారు. శ్రీకాకుళపు భాషను ఆయన సొగసుగా సంభాషణల్లో దించారు. ముఖ్యం శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రికి మల్లే ఆయన కూడా స్త్రీల పాత్రలకు ఎంతో సజీవమైన సంభాషణలను సమకూర్చారు. ‘నో రూమ్’, ‘ఆర్తి’, ‘చావు’, ‘జీవధార’, ‘భయం’... ఈ కథలన్నీ ఇందుకు ఉదాహరణ. ‘జీవధార’ కథలో పైకి నీటి సమస్య వస్తువుగా కనపడుతుంది. మురికివాడ వాసులకు తాగునీళ్లు ఉండవు. దాపులో ఒక శ్రీమంతుల ఇంటిలో కావల్సినన్ని నీళ్లు. మురికివాడ ఆడవాళ్లు రోజు ఆ శ్రీమంతుల గేటు దగ్గరకు వచ్చి నీళ్లు అడుగుతూ ఉంటారు. ఆ శ్రీమంతులు చీదరించుకుంటూ ఉంటారు. చీదరించుకుంటూ ఉంటే ఆ ఆడవాళ్లు కొన్నాళ్లు పడతారు... మరి కొన్నాళ్లు సహిస్తారు... దప్పికతో ప్రాణం పోతుంటే ఏం చేస్తారు? తిరగబడతారు. అంతమంది తిరగబడితే ఆ శ్రీమంతులు నీళ్లేం ఖర్మ ఏమైనా ఇచ్చి తోక ముడవరూ? బాధితులందరూ కలిసి తిరగబడాలి... పీడితులందరూ కలిసి తిరగబడాలి... మైనార్టీ సమూహాలు అన్నీ కలిసి తిరగబడాలి... అని రచయిత సూచన. ఏదీ ఊరికే రాదు. ‘సాధించుకోవాలి’ ఈ వ్యవస్థ నుంచి. సాధించుకోవడం మెత్తగా సాధ్యం కాదు ఎప్పటికీ. దీపధారి కాళీపట్నం రామారావు ‘విరసం’ (విప్లవ రచయితల సంఘం) ఏర్పడినప్పటి నుంచి దాదాపు 15 ఏళ్లు అందులో క్రియాశీల సభ్యులుగా ఉన్నారు. రావిశాస్త్రి, వరవరరావు, కె.వి.రమణారెడ్డి వంటి ఉద్దండులతో ఆయన కలిసి పని చేశారు. తెలుగునాట విప్లవ కథ విస్తృతం కావడంలో అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి వంటి రచయితలు సిద్ధం కావడానికి మరోవైపు మధ్యతరగతి కథను ముందుకు తీసుకెళ్లడంలో వివిన మూర్తి, కవనశర్మ తదితరులు ముందంజ వేయడానికి కాళీపట్నం రామారావు స్ఫూర్తిగా నిలిచారు. ఆయనకు ‘సాహిత్య అకాడెమీ’ వచ్చినా తిరస్కరించారు. కొత్త కథకులను సిద్ధం చేసేందుకు ఊరూరు తిరిగి వర్క్‌షాపులు పెట్టారు. కథామెళకువలు చెప్పే వ్యాసాలు రాసి పుస్తకాలు వెలువరించారు. ఈ సమయంలోనే ఆయన ‘కథల మేష్టారు’గా గౌరవం పొందసాగారు. కథానిలయం 1996 ప్రాంతంలో నిజానికి ఎవరైనా సరే విశ్రాంత జీవనం కోరుకునే వయసులో ఆయన ‘కథానిలయం’ అనే బృహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఈ ఆలోచన చెప్పినప్పుడు ముందు హేళన, ఆ తర్వాత సంశయం, ఆ తర్వాత అంగీకారం పొందారు. తెలుగులో వచ్చిన కథలన్నీ ఒక్కచోట చేరాలి అని ఆయన చేసిన ఆలోచన ఇవాళ తెలుగువారికి ఒక విలువైన భాండాగారాన్ని సిద్ధం చేసింది. శ్రీకాకుళంలో ఆయన రెండస్తుల ‘కథా నిలయం’ కట్టడానికి కథాభిమానులు తలా ఒక ఇటుక ఇచ్చారు. ఇందుకోసమై హైదరాబాద్ రవీంద్రభారతిలో పెద్ద కార్యక్రమం చేసి కాళీపట్నంకు ‘లక్ష రూపాయల’ పర్స్ అందజేశారు. తెలుగులో వచ్చిన వీక్లీలు, మంత్లీలు, కథాసంకలనాలు, వాటితో పాటు రచయితల డేటా, వారు రాసిన కథల పట్టిక ఇవన్నీ చాలా పెద్ద పని. కాళీపట్నం తన భుజాల మీద వేసుకు చేశారు. ఆ తర్వాత ఆ ఆలోచన ఆ మొత్తం కథలను డిజిటలైజ్ చేయడం వైపు మళ్లింది. ఇవాళ ‘కథానిలయం’ వెబ్సైట్లో వేలాది కథలు డిజిటలైజ్ అయి ఉన్నాయి. విద్యార్థులకు, అధ్యయనం చేయాలనుకునేవారికి ఆ సైట్ ఒక అతి పెద్దసోర్స్. ఏనాటి కథలో, కథకులో తెలుసుకోవాలంటే ఆ సైట్‌కు వెళ్లక తప్పదు. మరో భాషకు ఇలాంటి సైట్ ఏమాత్రం లేదు. ఇది తెలుగువారి ఘనత. ఇందుకు కారకులు కాళీపట్నం. నిరంతర అధ్యయన శీలి కాళీపట్నం రామారావు నిరంతర అధ్యయనంలోనే ఉన్నారు. 96 ఏళ్లు వచ్చినా కన్ను కనిపించినంత సేపు చదవడానికే ఇష్టపడ్డారు. శ్రీకాకుళంలో కాళీపట్నం రామారావు తమ కథను చదివి మెచ్చుకుంటే అదే పెద్ద అవార్డుగా యువ కథకులు భావిస్తారు. ఆయన నిరంతరం కొత్త కథకులను ప్రోత్సహిస్తూనే వచ్చారు. 2006లో రాసిన ‘అన్నెమ్మ నాయురాలు’ ఆయన చివరి కథ. తెలుగు కథ పయనంలో కాళీపట్నం అస్తమయం వల్ల ఒక శకం ముగిసింది. అలాంటి రచయిత, కథా కార్యకర్త మరొకరు సిద్ధం కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. తెలుగు కథ ఉన్నంత వరకూ తప్పక కాళీపట్నం ప్రస్తావన, శ్రీకాకుళం ఉనికి ఉంటూనే ఉంటుంది. ఆ మహా కథకునికి నివాళి. కమిటెడ్ రైటర్ కాళీపట్నం రామారావును నిబద్ధ రచయితగా చెబుతారు. నిబద్ధతకు ఒక ఉదాహరణగా చూపుతారు. తన చేతిలో ఉన్న కథను, అక్షరాన్ని దేనికి నిబద్ధం చేయాలో ఎంత మేరకు చేయాలో ఆయన్ను చూసి నేర్చుకోవాలని అంటారు. కనపడిందంతా, తోచిందంతా రాయడం కాళీపట్నం ఏనాడూ చేయలేదు. పొద్దుపోక రాయడం చేయలేదు. కాలక్షేపం కోసం రాయడాన్ని అసలు చేయలేదు. ఒక సత్యాన్ని కనుగొని ఆ సత్యానికి అవసరమైన కథను, పాత్రలను ఎంచుకుని, ఒక ప్రయోజనాన్ని ప్రతిపాదించి, ఒక చూపును ఇవ్వగలిగే కథ రాయగలిగినప్పుడే రాశారు. అందుకే ఆయన ముఖ్యమైన కథలు ఒక డజనుకు మించవు. అయినా సరే అవి వంద కథలకు సమానమైన ఖ్యాతి పొందాయి. – సాక్షి ఫ్యామిలీ -
వరల్డ్ గ్రేటెస్ట్ లవర్: ‘ఆయనకు 130 మంది లవర్స్’
‘కాసనోవా ఎవరు?’ అనే ప్రశ్నకు ‘వరల్డ్ గ్రేటెస్ట్ లవర్’ ‘ఆయనకు 130 మంది లవర్స్’ ‘ఆయన చూపుల మాయజాలంలో ఎంత అందగత్తె అయినా చిక్కుకుపోవాల్సిందే’....ఇలా ఎన్నో వినిపిస్తాయి. కాసనోవా ఆత్మకథ ఇప్పటికీ హాట్‌కేకే!. కాసనోవాపై ఆసక్తితో ఆయన గురించి చరిత్రకారులు ఎప్పటికప్పడూ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజా పరిశోధన చెప్పేదేమిటంటే...కాసనోవా మంచి వైద్యుడు అని. ఆయన వైద్యుడు కాలేకపోయినా(ఫెయిల్డ్ డాక్టర్) వైద్యశాస్త్రం పట్ల ఆసక్తిని మాత్రం వదులుకోలేదు. ఎన్నో వైద్య పుస్తకాలు చదివేవాడు. వైద్యానికి సంబంధించి ఆయన ఆలోచనలు, పరిశీలనలు, అంచనాలు చాలా విలువైనవి అంటున్నారు పరిశోధకులు. మొటిమల నివారణ నుంచి గర్భస్రావరం వరకు ఆయన స్త్రీలకు ఎన్నో సలహాలు ఇచ్చేవాడట. ఆయన చరిత్రపై ‘శృంగారపర్వం’ మాత్రమే డామినెట్ చేయడంతో ఆయనలోని నిపుణుడైన వైద్యుడి గురించి ఎవరూ పట్టించుకోలేదు. వెనిస్లో జన్మించిన గియాకోమో జిరోలామో కాసనోవా... సైనికుడు, జూదరి, వ్యాపారి, సాహసికుడు, రచయిత.. ఇలా ఎన్నో కావాలనుకున్నాడు.. పదిమందిలో పేరు తెచ్చుకోవడానికి కాదు, పలువురు స్త్రీల మనసు దోచుకోవడానికి! ఒకానొక సమయంలో కాసనోవా డిప్రెషన్లోకి వెళ్లాడు. దాని నుంచి బయటపడడానికి రోజుకు 10 గంటలు తన జ్ఞాపకాలను రాసేవాడు. ‘ఐసోలేషన్’ అనే మాట ఇప్పుడు చాలా గట్టిగా వింటున్నాంగానీ ఆరోజుల్లోనే కాసనోవా ఐసోలేషన్లోకి వెళ్లాడు. కరోనా కాదు సుమీ! తన ఆత్మకథ ‘స్టోరీ ఆఫ్ మై లైఫ్’ పూర్తిచేయడానికి. ఈ పుస్తకం పై ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ 18వ శతాబ్దంలో యూరోపియన్ల సాంఘిక జీవితాన్ని సాధికారికం గా చెప్పిన పుస్తకం అనడంలో ఎవరూ విభేదించరు. చదవండి: పద్మావతీ! నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి ఇల్లు – ఆఫీస్ వేగం తగ్గినా రన్నింగే -
ప్రభుత్వం అయితే మాత్రం!
‘నోరు లేనివాళ్లు ఉండరు. నోరు మెదపని వాళ్లే ఉంటారు..’ అంటారు అరుంధతీ రాయ్. ప్రస్తుతం జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు రాయ్. ప్రభుత్వం అయితే మాత్రం! మనకు అనంగీకారాలు ఉండకూడదా? మనం నోరెత్తకూడదా.. అని ప్రశ్నిస్తున్నారు. అరుంధతీ రాయ్ రచయిత్రి. 1997లో ఆమె రాసిన తొలి నవల ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’తోనే ఇప్పటికీ ఆమె గుర్తుకు వస్తారు. ముఖ్యంగా ఆమె ఉద్యమ రచయిత్రి. మార్పు కోసమే ఆమె చేసే ప్రతి రచనా, రాసే ప్రతి వ్యాసం, మాట్లాడే ప్రతి మాటా! ఆమెను గుర్తు చేసే అంతకుముందరి విషయం మరొకటి కూడా ఉంది. 1989లో ‘ఇన్ విచ్ యానీ గివ్స్ ఇట్ దోజ్ వన్స్’ అనే టీవీ చిత్రానికి స్క్రీన్ ప్లే రైటర్‌గా ఆమెకు జాతీయ అవార్డు వచ్చింది. ఆ అవార్డును 2016లో ఆమె ప్రభుత్వానికే తిరిగి ఇచ్చేశారు! దేశంలో పెరిగిపోతున్న మతపరమైన అసహనాన్ని నిరసిస్తూ ఆమె అలా చేయడం కూడా రాయ్‌ని సామాజిక బాధ్యత స్వీకరించిన రచయిత్రిగా నిలబెట్టింది. తాజాగా ఆమె సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించడంతో మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ‘‘పోరు జరుగుతున్నప్పుడు, ఆందోళన వ్యక్తం అవుతున్నప్పుడు, ప్రదర్శనల నినాదాలు మిన్నంటుతున్నప్పుడు, కొందరు చనిపోతున్నప్పుడు.. మౌనం వహించడం నేరం’’ అంటారు అరుంధతీ రాయ్. ఇప్పుడు ఆమె మాట్లాడుతున్నది కచ్చితంగా రైతు ఉద్యమం గురించే. నోరు విప్పని ప్రముఖుల గురించే. పౌరస్వేచ్ఛను, మానవ హక్కులను రాజకీయ నిర్ణయాలు ఎలా ధ్వంసం చేస్తున్నాయో ఒక సామాజిక, ఉద్యమ కార్యకర్తగా ఆమె నిరంతరం తన వ్యాసాలలో, ప్రసంగాలలో వివరిస్తూ ఉంటారు. అరుంధతి ప్రజానుకూలవాది. గత రెండున్నర దశాబ్దాలుగా ఆమె పార్లమెంటు బయట.. ‘ఏకవ్యక్తి విపక్షం’గా వ్యవహరిస్తున్నారు! ఆమెలో బెరుకుదనం ఉండదు. ఆమె మాటలో మృదుత్వం ఉండదు. మంచి అనుకున్నదాన్ని ఎంత బలంగా ప్రచారం చేస్తారో.. చెడు అనుకున్నదాన్ని అంత ఘాటుగా విమర్శిస్తారు. అరుంధతీ రాయ్ తండ్రి బెంగాలీ హిందువు. తల్లి మలయాళీ సిరియన్ క్రిస్టియన్. కలకత్తాలో ఉండేవారు. ఆమెకు రెండేళ్లప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రిని వదిలి తమ్ముడితో పాటు తల్లితో కేరళ వచ్చేసింది. తర్వాత కొన్నాళ్లు ఊటీలో అరుంధతి తాతగారి ఇంట్లో ఉంది ఆ కుటుంబం. అక్కడి నుంచి మళ్లీ కేరళకు. అరుంధతి చదువు కూడా ఆమె కుటుంబం లాగే ఒక చోట స్థిరంగా సాగలేదు. కొట్టాయంలో కొంత, నీలగిరులలో కొంత పూర్తయింది. ఢిల్లీ ‘స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్’ నుంచి పట్టా తీసుకుంది. అక్కడే ఆమెకు సహ ఆర్కిటెక్ట్ గెరాడ్ డా కన్హాతో పరిచయం అయింది. ఇద్దరూ కొన్నాళ్లు ఢిల్లీలో, గోవాలో సహజీవనం చేశారు. తర్వాత విడిపోయారు. తిరిగి ఢిల్లీ వచ్చాక, 1984లో ఆమెకు ప్రదీప్ క్రిషన్ కలిశారు. ప్రదీప్‌కు సినిమాలు తీయాలని. ఈమెకు సమాజాన్ని మార్చాలని. ఇద్దరూ కలిసి సమాజాన్ని మార్చే సినిమా ఒకటి తీశారు. ‘మెస్సీ సాహిబ్’. దానికి అవార్డు వచ్చింది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొద్దికాలానికే అరుంధతికి సినిమాలు, టీవీ సీరియళ్లు బోర్ కొట్టేశాయి. వాటిని వదిలేసి రకరకాల ఉద్యోగాలు చేశారు. ఏరోబిక్ క్లాసులు నడిపారు. ప్రదీప్‌తో విడిపోయారు. బాల్యంలోని తన జ్ఞాపకాలను రాయడం మొదలుపెట్టారు. ఆ జ్ఞాపకాలే చివరికి ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ అయ్యాయి. -
ప్రముఖ రచయిత్రి ఆనందరామం ఇకలేరు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రచయిత్రి సి. ఆనందరామం గురువారం ఉదయం హైదరాబాద్ వెస్ట్ మారెడ్‌పల్లిలోని స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె అసలు పేరు ఆనంద లక్షి్మ. భర్త రామం పేరును తన పేరు చివర జోడించి రచయిత్రి సి.ఆనందరామంగా తెలుగు సాహిత్య లోకంలో రాణించారు. 1935, ఆగస్టు 20వ తేదీన ఏపీలోని పశి్చమగోదావరి జిల్లా ఏలూరులో ఆమె జని్మంచారు. 60 నవలలు, 100కు పైగా కథలు, కొన్ని విమర్శనా గ్రంథాలను రాశారు. ఆమె రాసిన నవల ఆత్మబలి... సంసార బంధం పేరుతో సినిమాగా, అదే నవల జీవన తరంగాలు పేరిట టీవీ సీరియల్‌గా వచ్చింది. జాగృతి నవలను త్రిశూలం సినిమాగా, మమతల కోవెల నవలను జ్యోతి సినిమాగా తీశారు. ఏలూరులోని ఈదర వెంకటరామారెడ్డి స్కూలులో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఇంటర్ వరకు మామూలుగా చదివి బీఏ డిగ్రీని ప్రైవేటుగా పూర్తి చేశారు. అనంతరం సీఆర్ఆర్ కాలేజీలో తెలుగు ట్యూటర్‌గా కొన్నాళ్లు పనిచేశారు. 1957లో వివాహం అయ్యాక ఆమె హైదరాబాద్‌కు మకాం మార్చారు. 1958–60లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ. తెలుగు చదివారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి గైడ్‌గా పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. హోంసైన్స్ కాలేజీ, తర్వాత నవజీవన్ కాలేజీలో కొంతకాలం పనిచేశాక 1972లో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేరి ప్రొఫెసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. సుమారు 30 మంది విద్యార్థులు ఆమె ఆధ్వర్యంలో పీహెచ్డీ చేశారు. 2000 సంవత్సరంలో పదవీ విరమణ పొందారు. ఎన్నో అవార్డులు.. గృహలక్ష్మి స్వర్ణకంకణం 1972, మాలతీ చందూర్ స్మారక అవార్డు 2013, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు 1979 (తుఫాన్ నవలకు), మాదిరెడ్డి సులోచన బంగారు పతకం 1997, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు రెండు పర్యాయాలు, సుశీలా నారాయణరెడ్డి పురస్కారం, గోపీచంద్ పురస్కారం, అమృతలత జీవన సాఫల్య పురస్కారాలు ఆమెను వరించాయి. ఆమె మృతితో ఒక శకం ముగిసిందని, శాశ్వతంగా గుర్తుండిపోయే రచనలు చేసిన ఆనందరామంకు అశ్రు నివాళి.. అని పలువురు కవులు పేర్కొన్నారు. -
ఒక్కగానొక్క ఆడబిడ్డ అన్నట్లుగా..
‘ఒక్కగానొక్క ఆడబిడ్డ’ అన్నట్లుగా కమలా హ్యారీస్‌ను అమెరికాలో అందరూ తమ కుటుంబ సభ్యురాలిని చేసుకున్నారు! ఆమె ‘పరిపూర్ణమైన అమెరికన్’ అయుంటే ఇంకా బాగుండేదనే భావన తెల్లజాతి స్థానికుల్లో ఉన్నప్పటికీ, తమ దేశానికి వైస్ ప్రెసిడెంట్ అయిన తొలి మహిళగా ఆమెను గుర్తిస్తున్నారు. గౌరవిస్తున్నారు. మహిళలైతే ఆమెతో ఏమైనా చెప్పాలని ఉత్సాహపడుతున్నారు కూడా. ఆ ఉత్సాహం ఒక్క అమెరికన్ మహిళల్లోనే కాదు, యావత్ ప్రపంచ మహిళల్లో వ్యక్తం అవుతోంది. ఆ విషయాన్ని న్యూయార్క్‌లోని ఆఫ్రో–అమెరికన్ రచయిత్రి డాక్టర్ పెగ్గీ బ్రూక్స్ కనిపెట్టారు. కమలపై తనొక పుస్తకం వేస్తున్నాననీ, ఆమెకు ఏదైనా చెప్పదలచినవారు ఉత్తరం రాసి తనకు పంపిస్తే ఆ ఉత్తరాలను పుస్తకంగా వేస్తానని ప్రకటించారు. వేల ఉత్తరాలు వచ్చాయి. వాటిలోంచి 120 ఉత్తరాలు ఎంపిక చేసి పుస్తకంగా విడుదల చేశారు పెగ్గీ బ్రూక్స్. పెగ్గీ బ్రూక్స్ వేసిన ఆ పుస్తకం పేరు ‘డియర్ కమల: ఉమెన్ రైట్ టు ది న్యూ వైస్ ప్రెసిడెంట్’. ఆ పుస్తకాన్ని ఒక వ్యక్తి తప్పకుండా చదవాలని బ్రూక్స్ కోరుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరో అర్థమయ్యే ఉంటుంది. కమలా హ్యారిస్! ఇప్పటికే ఒక కాపీని ఆమె యూఎస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్‌కి పంపించారు కనుక కమల ఆ పుస్తకాన్ని చదివే అవకాశాలు ఉన్నాయి. పైగా అందులోనివి వివిధ మహిళలు తనకు రాసిన ఉత్తరాలు! నేడు, రేపట్లో కమల నుంచి బ్రూక్స్‌కి ఒక సందేశం వచ్చినా రావచ్చు..‘బ్రూక్స్.. మీ ప్రయత్నం నాకెంతగానో ఉపకరిస్తుంది’ అని. మంచి విషయానికి స్పందించకుండా ఉండలేకపోవడం కమల స్వభావం. పుస్తకంలో కేవలం ఉత్తరాలు మాత్రమే లేవు. ఆ ఉత్తరాలను సమన్వయం చేస్తూ కమలా హ్యారిస్‌తో ఒక రచనా ప్రక్రియగా రచయిత్రి బ్రూక్స్ పంచుకున్న మనోభావాలూ ఉన్నాయి. ‘‘ఉత్తరాల్లో ఎక్కువ భాగం.. సమాజంలోని స్త్రీ పురుష అసమానతలను తొలగించమని కోరుతూ చేసిన విజ్ఞప్తులే ఉన్నాయి’’ అంటున్నారు బ్రూక్స్. ∙∙ బరాక్ ఒబామా అధ్యక్షుడు అయినప్పుడు, ఆయన భార్య, ‘ఫస్ట్ లేడీ’ అయిన మిషెల్ ఒబామా మీద కూడా ఇదే విధంగా ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు బ్రూక్స్. ఆ పుస్తకం పేరు ‘గో, టెల్ మిషెల్’. అయితే రాజకీయాల్లో ఉన్న మహిళలు, రాజకీయ నేతల భార్యల మీద మాత్రమే పుస్తకాలు రాసే స్పెషలిస్టు కారు బ్రూక్స్. ప్రధానంగా ఆమె ఆఫ్రో–అమెరికన్ మహిళల జీవిత వైవిధ్యాలకు, వారి జీవన వైరుధ్యాలకు ప్రామాణికత కల్పించే చరిత్రకారిణి. కవయిత్రి, నాటక రచయిత్రి. ఆమె రాసిన ‘వండర్ఫుల్ ఇథియోపియన్స్ ఆఫ్ ది ఏన్షియంట్ కుషైట్ ఎంపైర్’ గ్రంథం జగద్విఖ్యాతి చెందినది. కుషైట్లది ఈజిప్టులోని ఇరవై ఐదవ రాజవంశం. డెబ్బై ఎనిమిదేళ్ల పెగ్గీ బ్రూక్స్ బాల్టిమోర్‌లో జన్మించారు. భర్త yð న్నిస్తో కలిసి 1986లో న్యూయార్క్ వెళ్లి స్థిరపడ్డారు. ఇద్దరు పిల్లలు. పుస్తకాలు, నాటికలు ఆమె జీవనాసక్తులు. ఆమె చదివేవీ, రాసేవీ అన్నీ కూడా స్త్రీల సంబంధ సామాజికాంశాలే. పొలిటికల్ సైన్స్ బి.ఎ. చదివారు. ప్రజారోగ్యంపై రెండు డాక్టరేట్లు చేశారు. అవి కూడా ఉమెన్ హెల్త్ పైనే. కుటుంబ బంధాలపై, ముఖ్యంగా తల్లీబిడ్డల అనుబంధాలపై ఆమె రచనలకు అవార్డులు కూడా వచ్చాయి. కుటుంబ సంబంధాలు మెరుగుపడితే సమాజం, సామాజిక సంబంధాలు మెరుగుపడితే స్త్రీల స్థితిగతులు మెరుగుపడతాయని బలంగా నమ్ముతారు పెగ్గీ బ్రూక్స్. -
డగ్లస్ స్టువార్ట్‌కు బుకర్ ప్రైజ్
లండన్: న్యూయార్క్‌కు చెందిన స్కాటిష్ రచయత డగ్లస్ స్టువార్ట్ 2020 సంవత్సర బుకర్ప్రైజ్ను గెలుచుకున్నారు. ‘‘షుగ్గీబెయిన్’’ పేరిట రచించిన తన ఆత్మకథకు ఆయన 50వేల పౌండ్ల బుకర్ ప్రైజ్‌ను సాధించారు. 1980 ప్రాంతంలో గ్లాస్గో నగరంలో జరిగిన ఘటనల సమాహారంగా ఈ నవలను మలచారు. పోటీలో ఐదుగురు రచయితలను తోసిరాజని డగ్లస్ ఈ బహుమతి పొందారు. పోటీలో పాల్గొని ఓటమి పొందిన వారిలో భారతీయ మూలాలున్న రచయిత అవని దోషి (రచన: బర్న్ట్ షుగర్)కూడా ఉన్నారు. రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌లో గ్రాడ్యుయేషన్ అనంతరం డగ్లస్ న్యూయార్క్‌కు వచ్చారు. షుగ్గీ బెయిన్ పబ్లిష్ కావడానికి ముందు 30 మంది ఎడిటర్లు ఆ రచనను తిరస్కరించారు. (చదవండి: జార్జియా రీకౌంటింగ్‌లో బైడెన్ గెలుపు) -
విద్యార్థి దశ నుంచే ఉద్యమాల పాట..
సాక్షి, నాగర్‌కర్నూల్: శానసమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానానికి ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణ ఉద్యమంలో తమ ఆట పాటలతో ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన ఈయనకు అరుదైన గౌరవం కల్పించింది. పల్లె కన్నీరు పెడుతోందో.. అని తెలంగాణ ప్రజాజీవితాన్ని ప్రపంచానికి చాటిన జానపద కవి, గాయకుడు గోరటి వెంకన్న. తెలంగాణ భాష, యాసను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రత్యేక ఉద్యమ ఆకాంక్షను మరింత బలోపేతం చేశారు. చదవండి: (ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్ ) విద్యార్థి దశ నుంచే ఉద్యమాల పాటలకు నాంది పలికారు. ఎన్నో పుస్తకాలు రాశారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. విదేశాల్లోనూ సత్కారాలు పొందారు. నాగర్‌కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం గౌరారానికి చెందిన గోరటి నర్సింహ, ఈరమ్మ మొదటి సంతానం గోరటి వెంకన్న. ఎంఏ (తెలుగు) విద్యాభ్యాసం చేసిన ఈయన ప్రస్తుతం ఏఆర్ సబ్ డివిజనల్ కో–ఆపరేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. పలు సినిమాలకు పాటలు రాశారు. ఎన్కౌంటర్, శ్రీరాములయ్య, కుబుసం సినిమాల్లో రాసిన పాటలను మంచి పేరు వచ్చింది. బతుకమ్మ చిత్రంలో పాటలు రాయడంతో పాటు నటించారు. రాసిన పుస్తకాలు.. ప్రజాకవి గోరటి వెంకన్న రాసిన అనేక పుస్తకాలు అచ్చయ్యాయి. 1994లో ఏకునాదం మోత, 2002లో రేలపూతలు పుస్తకాలు రాసి 2007లో తెలుగు యూనివర్సిటీ నుంచి ఉత్తమ గేయ కావ్య పురస్కారం అందుకున్నారు. 2010లో అలసేంద్రవంక, 2016లో పూసిన పున్నమి, 2019లో వల్లంకి తాళం, 2019లో ద వేవ్ ఆఫ్ ద క్రెస్సెంట్ వంటి పుస్తకాలను రాసి అవార్డులు అందుకున్నారు. అవార్డులు ఇవే.. 2019లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘కబీర్ సమ్మాన్’ జాతీయ అవార్డును అందించింది. 2006లో హంస అవార్డు, 2016లో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ అవార్డు, 2014లో ఉగాది పురస్కారం, 2019లో తెలంగాణ సారస్వత పరిషత్ నుంచి సినారే అవార్డు, లోక్‌నాయక్ అవార్డు, 2018లో తెలంగాణ మీడియా అకాడమి నుంచి అరుణ్‌సాగర్ అవార్డు, 2007లో అధికార భాషా సంఘం పురస్కారం అందుకున్నారు. -
ఉన్నత విలువలకు కళలే సోపానం
భారతీయ లలిత కళలను పరిరక్షిం చడానికి కొత్త ప్రణాళికలు వేయవల సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజంలో కళలకు మనుగడ లేకపోతే మానవీయ ప్రవర్తన క్రమంగా దిగ జారి పోతుంది. కళా సాహిత్య సంస్కృతులకు చేయూత నీయడం మనందరి బాధ్యత. కళా పరిరక్షణకు రెండు దారులున్నాయి. తాత్కాలిక ప్రోత్సాహం, దీర్ఘకాలిక కార్యాచరణ. కళ మానవ సమాజంలో అనివార్య అంతర్భాగం. మనుషులు మసిలే సంఘంలో కళలు సర్వదా అలరిస్తూ ఉండాలి. మానవులందరూ ఐక్యతగా, సంతోషంగా లేకపోతే ఎంత గొప్ప కళ అయినా దాని ప్రయో జనం నెరవేరదు. ప్రస్తుత పరిస్థితుల్లో కళాకారుడు బతికి బట్ట కట్టకపోతే కళ కనుమరుగయే ప్రమాదం ఉంది. అందుకే కళాకారులకు అండదండలు అందించేందుకు ఆలోచనలు చేయవలసిన అవసరముంది. నిర్మల్, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలను కాపాడుకోవాలి. అయితే వీరు బొమ్మల తయారీకి విని యోగించే ‘పొనికి’ కర్ర లభ్యత తగ్గిపోతోంది. వేలాది మంది కళాకారుల, శ్రామికుల బతుకుదెరువు ఈ కర్రపై ఆధారపడి ఉంది. కర్ర కోసమై ప్రత్యేకంగా కొన్ని ఎకరాల్లో ఈ చెట్లను పెంపు చేయాలి. అట్లాగే అవిభక్త అదిలాబాద్ జిల్లాలో నివసించే రెండు లక్షల అరవై వేల గోండు తదితర ఆదివాసీల కోసం సంప్ర దాయ సిద్ధంగా తయారు చేసే ‘డోక్రా’ లోహ కళాకృతుల తయారీకి ఉపయోగించే ఇత్తడి, కలప ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అందువల్ల ఈ కళను వృత్తిగా గల ‘ఓజా’ అనే ఉపజాతివారు ఆ సంప్రదాయ వృత్తికి దూరమవుతు న్నారు. కానీ, ప్రాచీన కళలను పోగొట్టు కోవడంతో మనం గొప్ప సాంస్కృతి వైభవాన్ని కోల్పోతాం. వీటి పునఃప్రతిష్ట కోసం నవంబర్ 1 నుండి జరుగనున్న ఆరో ‘కారా’ ఉత్స వాలలో ఈ సంగీతవాద్యాలు, కళాకృతులు ప్రదర్శనకు ఏర్పాట్లు జరిగాయి. భారతదేశంలో కళాభివ్యక్తీకరణకు అనేక రూపాలు, విధానాలు ఉన్నాయి. అలాగే ప్రజల అభిరుచి, అవసరాలు కూడా అంతే వైవిధ్యంగా ఉన్నాయి. ఒక నాటి పంచాణం వారు తయారు చేసిన పనిముట్లు, కొలత పాత్రలు, విగ్రహాలు, దైవరూపాలు, కులం, తెగల సంకేతాల వంటివి ఈనాడు అపురూప కళాఖండాలుగా పరిగణించడం చూస్తున్నాం. ఆదిమ మానవుడు ఆనాడు ఆయా పరిసరాలలోగల అటవీ జంతువుల బొమ్మలు గుహలలో చిత్రించారు. ఈనాడు అవి ఎంతో కొత్త శైలిలో కనిపిస్తాయి. ఆధునిక చిత్రరంగానికి వారసత్వపు ఊపిరినిస్తున్నాయి. అలాగే లోహ చిత్రాకృతులు, పంట పండించేప్పుడు వాడే పరికరాలు, వస్తువులు, ధాన్యం కుండలు, పూజాసామగ్రి అన్నింటిలోనూ ఆనాటి కళాత్మక వ్యక్తీకరణలు దర్శనమిస్తాయి. ఆదిలాబాద్‌లోని గోండు గిరి జనుల కోసం ‘ఓజా’ అనే చిన్న తెగదారు ‘డోక్రా’ శైలిలో ఇత్తడిని కరిగించి, మైనం సాంచాలు తీసి బొమ్మలు, విగ్ర హాలు తయారు చేస్తారు. నాలుగువేల ఏళ్ల క్రితంనాటి ఈ సంప్రదాయిక శైలి ఇప్పుడు అంతరించిపోయే ప్రమాదంలో పడింది. మన దేశంలో బెంగాల్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో తయారయ్యే ఈ కళారూపాల గురించి ఎక్కువగా తెలియదు. ఈ ప్రదర్శనలో వీటితోపాటు తాళపత్ర గ్రంథాలు, రెండు వందల ఏళ్లనాటి చుట్టలు, విలక్షణ రాతప్రతులను కూడా ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే శుష్కించిపోయిన రాతప్రతులను సరిచేయించడం జరిగింది. విభిన్న రూపాలలో, కళాత్మక తయారీలో ఉన్న గ్రంథాలను చూపించడానికిగాను ఒక ప్రత్యేక ప్రదర్శన స్థలాన్ని ఏర్పాటు చేయబడింది. గతంలోని మన లేఖన సంప్రదాయ తీరుతెన్నులను కళ్లకు కట్టినట్టు చూపే ప్రయత్నాలు సైతం జరిగాయి. తాళపత్ర గ్రంథాలు తదితర లేఖన సామగ్రి ఎంత చూడముచ్చటగా తయారు చేసేవారో తెలుసుకోవచ్చు. వీటికి తోడుగా ఏనాడూ కనీవినీ ఎరుగని మనం కోల్పోయిన లేదా అంతరించే దశలో ఉన్న ఆదివాసీ, జానపద సంగీతవాద్యాల ఆది ధ్వనులకు మూల మైన వాద్యాల ప్రదర్శన ఉంటుంది. మన దేశంలో వాద్యం ఒక్కటే విడిగా మనలేదు. సంగీత కళాకారుడనేవాడు గురువుగా, వైద్యుడిగా, కుల సమూహ పెద్దగా చదువు వచ్చినవాడై ఉంటాడు. సంగీత వాద్యం ప్రదర్శనగా, వీరగాథగా, మౌఖిక సాహిత్యగనిగా ఉంటుంది. ఇలాంటి ఎన్నోరకాల అంశాలని చేర్చి ఒక విభాగంగా వాద్యాల ప్రదర్శన ఏర్పాటు చేయడమైనది. వీటితోపాటు సుదీర్ఘకాలం వ్యయప్రయాసలకోర్చి సుప్రసిద్ధ పరిశోధకులు ఆచార్య జయధీర్ తిరుమలరావు సేకరించిన ఎన్నో సాంస్కృ తిక, సాహిత్య అంశాలను ఇక్కడ చూడవచ్చు. బి. నర్సన్ వ్యాసకర్త కవి, విమర్శకులు ‘ 94401 28169 (నవంబర్ 1 నుండి 8 వరకు సప్తపర్ణి, హైదరాబాద్‌లో ‘కారా’ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాల సందర్భంగా) -
ఆ రోజును చూసినవారు
దసరా, దీపావళి పండుగలు జరుపుకున్నట్లుగా స్వాతంత్య్ర దినోత్సవ పండుగ జరుపుకున్నాం. అప్పుడు నాకు 22 సంవత్సరాల వయసు. ఇంటిల్లిపాదీ ఉదయాన్నే తలంట్లు పోసుకుని, కొత్తబట్టలు కట్టుకున్నాం. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాం. గడపలకు పసుపు రాసి, కుంకుమ పెట్టాం. ఇల్లంతా కళకళలాడింది. రోజూ ఉండే ఇల్లే అయినా ఆ రోజు ఎంతో కొత్తగా అనిపించింది. రకరకాల మిఠాయిలు తయారు చేశాం. ఇంటికి వచ్చినవారందరికీ నిండుగా భోజనం పెట్టాం. అప్పుడు మేం హైదరాబాద్‌లో ఉంటున్నాం. జెండా ఎగురవేయటానికి హైదరాబాద్ ఆకాశవాణి కార్యాలయానికి వెళ్లాం. అప్పటికి ఇంకా డక్కన్ రేడియోగా వ్యవహరించేవారు. ఆ రోజు నేను ఎరుపు అంచు ఉన్న నీలం రంగు పట్టు చీర కట్టుకున్నాను. ఆ చీరంటే నాకు చాలా ఇష్టం. బుచ్చిబాబుగారు ఖద్దరు పైజమా, లాల్చీ కట్టుకున్నారు. పైన వేసుకోవటానికి ముందుగానే జోద్పూర్ కోటు కుట్టించుకున్నారు. ఆ రోజు మద్రాసు నుంచి సినీ నటులు పుష్పవల్లి, భానుమతి గారలు వచ్చారు. జైలు నుంచి విడుదలైన వారిలో కొందరు ఆకాశవాణి ద్వారా ప్రత్యక్షంగా తమ అనుభవాలు పంచుకున్నారు. ఎస్.ఎన్ మూర్తి గారు స్టేషన్ డైరెక్టర్. ఉమామహేశ్వరరావు అనే అనౌన్సర్ ‘భారత దేశం నేటి నుంచి స్వతంత్ర దేశం’ అని అనౌన్స్మెంట్ ఇచ్చారు. వింజమూరి సీత అనసూయలు, టంగుటూరి సూర్యకుమారి దేశభక్తి గీతాలు ఆలపించారు. కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆ రోజు ఎక్కడ చూసినా, ‘మా ఇంట్లో వాళ్లు ఇన్నిరోజులు జైలుకి వెళ్లొచ్చారు. ఇంత శిక్ష పడింది’ అంటూ అదొక వేడుకగా, కథలుకథలుగా చెప్పుకున్నారు. పిల్లలంతా ఇళ్ల ముందు ముగ్గులు వేశారు. ఎల్బి స్టేడియాన్ని అందంగా అలంకరించారు. జెండాలు ఎగురవేశారు. ఎంతోమంది పిల్లలు, కుటుంబాలను వదులుకుని ఉద్యమంలో పాల్గొని జైలుపాలయ్యారు. వారు జైలుకు వెళ్లినప్పుడు వారి కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఎలా గడిచిందో ఆ భగవంతుడికే తెలియాలి. ఉద్యమంలో పాల్గొన్న వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయటానికి పార్టీ వారికి ఫండ్స్ ఉండేవి కాదు. జైళ్ల నుండి విడుదలైనవారంతా ఇళ్లకు నడిచి వెళ్లవలసి వచ్చేది. ఇన్నాళ్లు పడిన శ్రమకు ఫలితం లభించిందనే ఆనందమే వారి ముఖాలలో కనిపించింది. ఒకసారి గాంధీగారు హైదరాబాద్ వచ్చినప్పుడు సత్యనారాయణ అనే ఆయన వేసిన పెయింటింగ్ గాంధీగారికి నా చేత ఇప్పించారు. గాంధీగారు స్టేజీ మీద నుంచి కిందకు దిగటానికి, నా భుజాల మీద చేయి వేసుకున్నారు. చాలాకాలం ఆ భుజాన్ని ఎంతో పవిత్రంగా తడుముకునేదాన్ని. స్వాతంత్య్రం వచ్చిన రోజున నాకు ఆ సంఘటన ఒక్కసారి మనసులో స్ఫురించింది. అలాగే ప్రకాశం పంతులు గారు మా ఇంటికి వస్తుండేవారు. మా వారిని ‘ఏరా! బుచ్చీ!’ అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. ఆరోజులు ఎంతో గొప్పవి. స్ఫూర్తిదాయకమైనవి. – శివరాజు సుబ్బలక్ష్మి (95), రచయిత్రి (ప్రముఖ రచయిత బుచ్చిబాబు సతీమణి) బెంగళూరు -
ప్రముఖ రచయిత్రి కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత, కార్యకర్త సాదియా డెహ్ల్వి క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత బుధవారం తన ఇంటిలో కన్నుమూశారు. ఆమె వయసు 63. "సాదియా డెహ్ల్వి మరణవార్త విని చాలా బాధ కలిగింది. ఆమె ఢిల్లీ సంస్కృతికి చిహ్నం. నాకు మంచి స్నేహితురాలు, గొప్ప మానవతావాది. సాదియా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ అని ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ ట్వీట్ చేశారు. రాయల్ ‘షామా’ కుటుంబానికి చెందిన ఎంఎస్ డెహ్ల్వి ఉర్దూ మహిళా పత్రిక బానోకు ఎడిటర్‌గా పనిచేశారు. ఆమె తాత, హఫీజ్ యూసుఫ్ డెహ్ల్వి, 1938లో షమా అనే ఉర్దూ చిత్రం, సాహిత్య మాసపత్రికను స్థాపించారు. ఆహార పదార్థాల గురించి బాగా తెలిసిన ఆమె, 2017లో ఢిల్లీ వంటకాలపై "జాస్మిన్ & జిన్స్: మెమోరీస్ అండ్ రెసిపీస్ ఆఫ్ మై ఢిల్లీ అనే పేరుతో ఒక పుస్తకం రాశారు. ప్రముఖ రంగస్థల నటుడు జోహ్రా సెహగల్ నటించిన ‘అమ్మా అండ్ ఫ్యామిలీ’తో పాటు మరికొన్ని డాక్యుమెంటరీలు, టెలివిజన్ కార్యక్రమాలను ఎంఎస్ డెహ్ల్వి నిర్మించారు. ఎంఎస్ డెహ్ల్వి దివంగత రచయిత కుష్వంత్ సింగ్‌కు సన్నిహితురాలు. కుష్వంత్ సింగ్ తన "నాట్ ఎ నైస్ మ్యాన్ టు నో" పుస్తకాన్ని ఆమెకు అంకితం చేశారు. కుష్వంత్ సింగ్ "మెన్ అండ్ ఉమెన్ ఇన్ మై లైఫ్" పుస్తకం మొదటి పేజీలో ఎంఎస్ డెహ్ల్వి ఫోటోను ముద్రించారు. అదేవిధంగా ఒక ఛాప్టర్లో ఆమె గురించి తెలిపారు. ఎంఎస్ డెహ్ల్వి చేసిన ‘నాట్ ఎ నైస్ మ్యాన్ టు నో’ అనే టెలివిజన్ కార్యక్రమంలో కుష్వంత్ సింగ్ వివిధ రంగాలకు చెందిన మహిళలను ఇంటర్వ్యూ చేశారు. కుమారుడు అర్మాన్ అలీతో కలిసి డెహ్ల్వి ఢిల్లీలో నివసిస్తున్నారు. అక్కడే ఆమె తుదిశ్వాస విడిచారు. చదవండి: బ్రెజిల్లో కరోనా ఉగ్రరూపం -
ప్రముఖ రచయిత్రి కందుకూరి మహాలక్ష్మి కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత్రి కందుకూరి వెంకట మహాలక్ష్మి ఢిల్లీలోని మునిర్కాలో ఉన్న తమ స్వగృహంలో శనివారం ఉదయం 10.30 గంటలకు కన్నుమూశారు. మహాలక్ష్మి తొలితరం రేడియో న్యూస్ రీడర్‌గా అందరికీ సుపరిచితులైన కందుకూరి సూర్యనారాయణ సతీమణి. ఆయన ఆకాశవాణిలో పదవీ విరమణ చేసిన తరువాత ఢిల్లీలో స్థిరపడిన మహాలక్ష్మి ఆంధ్రప్రదేశ్ భవన్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. ఆమె రచయిత్రి, గాయని, వ్యాఖ్యాత, నటి, నాటక దర్శకురాలిగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపి మన్ననలు పొందారు. ఆమె 150కి పైగా కథానికలు, మూడు పుస్తకాలు, అనేక కవితలు, నాటకాలు రాశారు. ఆమె రచనలు పలు పత్రికలలో ప్రచురితమై పలువురి ప్రశంసలు అందుకున్నాయి. ఆమెకు 2009లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి అవార్డు అందించింది. మహాలక్ష్మి ఇంద్రజాల ప్రదర్శనలో కూడా నేర్పరి. తన 12 వ ఏటనే విఖ్యాత ఇంద్రజాలికుడు పీసీ సర్కార్ ఎదుట ప్రదర్శన ఇచ్చి ఆయన ప్రశంసలందుకున్నారు. ఆమె 1960 దశకంలో రేడియో మాస్కోలో కూడా పనిచేశారు. బల్గేరియాలో జరిగిన యూత్ కల్చరల్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో 1998లో జరిగిన ప్రపంచ తెలుగు సమావేశానికి సాహిత్య విభాగం చైర్‌పర్సన్‌గా మహాలక్ష్మి వ్యవహరించారు. అదేవిధంగా ఆంధ్ర వనితామండలి ప్రచురించిన ‘న్యాయవాణి’ అనే పత్రికకు సంపాదకురాలిగా కూడా ఉన్నారు. ఇందులో మహిళల సమస్యలకు పరిష్కారాలు చూపేవారు. ఆమెకు మాతృభాషపట్ల ఎనలేని మమకారం. ‘లోకకల్యాణం కోసమే సాహిత్య సేవ’అనే నమ్మకంతో పనిచేసేవారు. మహాలక్ష్మి రచనలపై తిరుపతి, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో పలువురు పరిశోధనలు చేసి పీహెచ్‌డీలు పొందారు. ప్రధానంగా జానపద సాహిత్యానికి ఆమె పెద్దపీట వేసి ప్రాచుర్యం కల్పించారు. దేశ,విదేశాల్లో అత్యుత్తమ పురస్కారాలు పొందారు. మహాలక్ష్మి మృతి పట్ల ఢిల్లీలోని పలువురు తెలుగువారు, సాహితీ ప్రముఖులు, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రతినిధులు తమ సంతాపం వ్యక్తం చేశారు. -
సాహిత్యశీలి అస్తమయం
సాక్షి, ఒంగోలు: ‘డియర్ మరణమా, ప్రియ నేస్తమా, నీ వయసెంతో కానీ, నువ్వొక నిశ్శబ్ధ మేధావివి, నీవే లేకపోతే, ఈ లోకం గతేంకాను? ఒక్క మాట చెప్పు. ఎప్పుడూ నా నీడలోనే నీవుంటావు. ఎందుకు మనకీ దోబూచులాట? ఎట్లైనా అంతిమ విజయం నీదేకదా!’ అంటూ మృత్యువుతో స్నేహం చేసిన ప్రముఖ న్యాయవాది, ప్రకాశం జిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షుడు బీమనాథం హనుమారెడ్డి(79) ఆదివారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం రాష్ట్ర 9వ మహాసభల మూడో రోజున ఆయన మరణించడంతో సాహిత్య లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురయింది. ఈ నెల 17వ తేదీ నుంచి ఒంగోలు ఏకేవీకే కాలేజీ ప్రాంగణంలో మహాసభలు నిర్వహిస్తుండగా, చివరి రోజైన ఆదివారం ఆయన ముగింపు ఉపన్యాసం ఇవ్వాల్సి ఉంది. పలువురు సాహిత్యవేత్తలను ఆయన సత్కరించాల్సి ఉంది. ఇంతలోనే హనుమారెడ్డి మృతి చెందారన్న వార్త విని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 500 మందికి పైగా కవులు, రచయితలు, సాహిత్యవేత్తలు హతాశులయ్యారు. సభా ప్రాంగణం నుంచి ఒంగోలు వీఐపీ రోడ్డులోని హనుమారెడ్డి స్వగృహం వరకు సంతాప ర్యాలీ నిర్వహించారు. హనుమారెడ్డి పార్థివదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. రచయితల మహాసభ వేదికపై హనుమారెడ్డి మృతికి సంతాపం తెలియజేస్తున్న ప్రముఖులు నివాళులర్పించిన ప్రముఖులు రచయిత, న్యాయవాది హనుమారెడ్డి మృతిపై రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖ సాహిత్యవేత్తలు, కవులు నివాళులర్పించారు. మహాసభల ప్రాంగణంలో నిర్వహించిన సంతాప సభలో, భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, కేపీ కొండారెడ్డి, దారా సాంబయ్య, దామచర్ల జనార్దన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, పీడీసీసీబీ మాజీ చైర్మన్ మేదరమెట్ల శంకరారెడ్డి, ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షుడు సోమేపల్లి వెంకటసుబ్బయ్య, ప్ర.ర.సం జిల్లా అధ్యక్షుడు పొన్నూరి వెంకటశ్రీనివాసులు, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, కవి సంధ్య శిఖామణి, చలపాక ప్రకాష్, డాక్టర్ సామల రమేష్‌బాబు, ఇడమకంటి లక్ష్మీరెడ్డి, గుత్తికొండ సుబ్బారావు, టి.అరుణ, డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, డాక్టర్ నూనె అంకమ్మరావు, మల్లవరపు ప్రభాకరరావు, పి.శ్రీనివాస్ గౌడ్, శ్రీరామకవచం సాగర్, కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, పాలూరి శివప్రసాద్‌తోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు, రచయితలు నివాళులర్పించారు. హనుమారెడ్డి పార్థివదేహం వద్ద నివాళులర్పిస్తున్న రచయితలు, శ్రేయోభిలాషులు నేడు అంత్యక్రియలు హనుమారెడ్డి పార్థివదేహంతో సోమవారం ఉదయం 11 గంటలకు అంతిమ యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు, ప్ర.ర.సం జిల్లా అధ్యక్షుడు పొన్నూరి వెంకట శ్రీనివాసులు, కోశాధికారి యత్తపు కొండారెడ్డి తెలిపారు. ఒంగోలు వీఐపీ రోడ్డులోని హనుమారెడ్డి స్వగృహం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న శ్మశానవాటిక వరకు అంతిమ యాత్ర నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంపీ మాగుంట సంతాపం న్యాయవాది, రచయిత హనుమారెడ్డి మృతి వార్త తనను ఎంతగానో కలచి వేసిందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా కోర్టులో ఏపీపీగా ప్రజలకు ఎనలేని సేవలు చేసిన హనుమారెడ్డి రచయితల సంఘం అధ్యక్షుడిగా రాష్ట్రస్థాయి మహాసభలు నిర్వహించడంలో విశేషంగా కృషి చేశారని తెలిపారు. మంచితనానికి, మానవత్వానికి ఆయన నిదర్శనంగా నిలిచారని, న్యాయవాదులకు, రచయితలకు ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు. హనుమారెడ్డి నేపథ్యం.. 1941 ఏప్రిల్‌లో అద్దంకి మండలం వెంకటాపురం గ్రామంలో జన్మించిన హనుమారెడ్డి న్యాయవాదిగా పట్టా పొంది వడ్లమూడి గోపాలకృష్ణ, సుంకర దశరథరామిరెడ్డి వద్ద జూనియర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. లాయర్‌గా జీవితాన్ని ప్రారంభించి 1970 నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఆరేళ్లపాటు సేవలందించారు. 1985లో ప్రకాశం జిల్లా లోక్ అదాలత్ కన్వినర్‌గా పనిచేశారు. 1999లో ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై తెలుగు భాష, సాహిత్యాల వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. జిల్లా రచయితల సంఘానికి రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చారు. గడిచిన 55 ఏళ్లుగా ఒంగోలులో ప్రముఖ క్రిమినల్ లాయర్‌గా పేరుప్రఖ్యాతులు పొందారు. ఈ క్రమంలో డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు తర్వాత ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి దాదాపు 20 ఏళ్లకు పైగా విశేషంగా సాహిత్య సేవ చేశారు. వెన్నెలపువ్వు, పల్లెకు దండం పెడతా, మావూరు మొలకెత్తింది, గుజ్జనగూళ్లు, వీక్షణం, వెన్నెల గీతం, పావని, వర్గకవి శ్రీశ్రీ , మహిళ, విద్యార్థి రాజ్యాంగం, రిజర్వేషన్లు, రెడ్డి వైభవం తదితర పుస్తకాలు రచించారు. -
‘చిగురుమళ్ల’కు అరుదైన గౌరవం
భద్రాచలంటౌన్: ఒకే కవి 101 పుస్తకాలను రచించడం, వాటిని ముద్రించడం, ఒకే వేదికపై అన్నింటినీ ఆవిష్కరించడం ప్రపంచ సాహిత్య చరిత్రలోనే అరుదైన ఘట్టం. ఇది భద్రాచలం వాసి అయిన కవి చిగురుమళ్ల శ్రీనివాస్‌కు సాధ్యమైంది. ఈ పుస్తకాలను భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఇప్పటివరకు ఒకే కవి రాసిన వంద పుస్తకాలను ఒకేసారి ఆవిష్కరించిన దాఖలాలు లేవు. సుమారు ఐదేళ్ల కఠోరశ్రమ, దీక్షతో ఆయన ఈ పుస్తకాలను ముద్రించారు. ఒక్కో సామాజిక అంశంపై ఒక్కో పుస్తకం చొప్పున ప్రచురించడం విశేషం. అంతేకాక జూలై 6న ప్రపంచ వ్యాప్తంగా 101 శతక పుస్తకాలను 101 వేదికలపై ఒకే రోజు ఆవిష్కరించబోతుండడం మరో విశేషం. శ్రీనివా స్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. మానవీయ విలువలు చాటి చెప్పడం కోసం అమ్మ శతకం, నాన్న శతకం, మేలుకొలుపు, చద్దిమాట వంటి శతకాలను రచించారు. సామాజిక రుగ్మతలపై కూడా తన కలాన్ని ఎక్కుపెట్టారు. మద్యపాన శతకం, ధూమపాన శతకం, గడ్డి శతకం, హారితహారంపై శతకాలు రాయడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనం. యువతలో దేశభక్తిని ప్రేరేపించేలా స్వాతంత్య్ర శతకం, భరతబిడ్డ, భరతవీర, వీరభారతి, వీరభూమి, జయభారతి, జాతీయ సమైక్య త, జై జవాన్ వంటి శతకాలను రచించారు. ఇవేకాకుండా అన్నదాత శతకం, పంట పొలము శతకం, సొంత ఊరు శతకం, ఆడపిల్ల శతకం, స్వచ్ఛభారత్ శతకం వంటి గొప్ప సామాజిక ప్రయోజనంతో కూడిన విషయాలపై ఆదర్శవంతమైన కవిత్వం రచించారు. కాగా, ఇంతటి మహోన్నత శతకాలను రచించిన శ్రీనివాస్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. -
అల్‌హార్తికి మాన్ బుకర్ బహుమతి
లండన్: సాహిత్యరంగంలో అందించే ప్రఖ్యాత మాన్‌బుకర్ ప్రైజ్ 2019కిగానూ ఓ అరబ్ మహిళను వరించింది. ఒమన్‌కు చెందిన రచయిత్రి జోఖా అల్హార్తి(40) రాసిన ‘సెలస్టియల్ బాడీ’ నవలకు ఈసారి మాన్ బుకర్ ప్రైజ్ దక్కింది. లండన్‌లోని రౌండ్‌హౌస్‌లో బుకర్ప్రైజ్ను అందుకున్న అల్హార్తి.. ఈ అవార్డును గెలుచుకున్న తొలి అరబ్ మహిళగా చరిత్ర సృష్టించారు. బ్రిటన్ నుంచి 1951లో స్వాతంత్య్రం పొందాక ఒమన్‌లో చోటుచేసుకున్న మార్పులను, బానిసత్వం పరిస్థితులను ఈ నవలలో అల్హార్తి వర్ణించారు. ఈ అవార్డు కింద అందే రూ.44.60 లక్షల(64,000 డాలర్ల)ను అల్హార్తి, అనువాదకురాలు మార్లిన్ చెరిసగం పంచుకోనున్నారు. -
సాహితీ సవ్యసాచి ద్వానా శాస్త్రి ఇకలేరు..
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ రచయిత, సాహితీవేత్త ద్వా.నా. శాస్త్రి (72) కన్నుమూశారు. గత అర్థరాత్రి ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ద్వానా శాస్త్రి గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. కాగా ద్వా.నా.శాస్త్రి అని పిలవబడే ద్వాదశి నాగేశ్వర శాస్త్రి కృష్ణాజిల్లా లింగాలలో 1948 జూన్ 15 వ తేదీన జన్మించారు. సాహితీ సవ్యసాచిగా పేరుగాంచిన ద్వానా శాస్త్రి విభిన్న పత్రికల్లో వేలాది పుస్తక సమీక్షలు చేసిన ఏకైక వ్యక్తి. వందేళ్లనాటి ఛాయా చిత్రాలు, అరుదైన పుస్తకాలు, అలనాటి విశేష కవితలు, వెలుగులోకి తెచ్చారు. అంతేకాకుండా సాహిత్యంలో పలు ప్రయోగాలు చేసి అంతర్జాతీయ రికార్డులు సొంతం చేసుకున్నారు. ఏకధాటిగా 12 గంటల పాటు తెలుగు భాషా సాహిత్యాలపై ప్రసంగించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. -
మాట వింటే దేవత.. మీటూ అంటే దెయ్యం
ఒక స్త్రీ.. పితృస్వామ్య సమాజం రూపొందించిన చట్రంలో ఇమిడిపోతే ఆమెను దేవతగా కొలుస్తారు. ఆమెను ఇంటికి దీపం అంటారు. అదే స్త్రీ తనకు తాను స్వతంత్ర అభిప్రాయాలతో, వ్యక్తిత్వంతో రాణిస్తుంటే దెయ్యం అనేస్తారు. మగ ఉద్యోగులు లేడీ బాస్‌లను భరించలేకపోవడానికి కారణం కూడా ఈ భావజాలమేనా? ‘ఎస్’ అంటున్నారు సుధా మీనన్. ‘ఉమెన్ ఆన్ టాప్’ అనే అంశం మీద గత నెలలో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో ఒక చర్చాగోష్ఠి జరిగింది. మహిళలు ఎన్ని రంగాల్లో అభివృద్ధి సాధించారో తలుచుకుంటూ స్ఫూర్తిదాయకంగా సాగుతోంది చర్చ. ప్రపంచంలో స్త్రీ– పురుషుల మధ్య సమానత్వం అనేది ఎక్కడా ఆచరణలో లేదని, అవకాశాల్లో అది ప్రతిబింబిస్తూనే ఉంటుందని, అయినప్పటికీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగడంలో మహిళలు ఎక్కడా వెనుకడుగు వేయకపోవడం వల్లనే ఈ లక్ష్యాలు సాధ్యమయ్యాయని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సుధా మీనన్ వంటి రచయితలు తమ అనుభవాలను పంచుకున్నారు కూడా. ఇదే సభలో ఒక వ్యక్తి లేచి ‘ఒక వైపు ‘మీటూ’ ఉద్యమం ఉధృతంగా నడుస్తోంది. మరోవైపు ‘ఉమెన్ ఆన్ టాప్’ అని చర్చా వేదికలూ మీరే నిర్వహిస్తారు. దీనిని ద్వంద్వ వైఖరిగా చూడవచ్చా?’ అనే ప్రశ్న లేవనెత్తాడు. దీని మీద హక్కుల కార్యకర్త వసంత కన్నభిరాన్ స్పందిస్తూ ‘‘అది ద్వంద్వ వైఖరి కాదు, అవి రెండూ రెండు వేర్వేరు కోణాలు మాత్రమే’’ అన్నారు. ‘‘మీటూ ఉద్యమం పట్ల మగవాళ్ల అసహనం ఇలా బయటపడుతోందంతే. మగ సమాజం నుంచి ఎదురవుతున్న సవాళ్లకు బెంబేలు పడి వెనక్కిపోయే మహిళలకు ధైర్యం చెప్పడానికి ‘ఉమెన్ ఆన్ టాప్’ అనే అంశం మీద చర్చ చాలా అవసరం’’ అన్నారామె. ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు ‘ఉమెన్ ఆన్ టాప్’ చర్చలో భాగంగా సుధా మీనన్.. మహిళలకు ఎదురయ్యే అనేక సామాజిక పరిమితులను ప్రస్తావించారు. వాటన్నింటినీ అధిగమించి సమాజంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం, దానిని నిలబెట్టుకోవడంలో మహిళలకు తానే చక్కటి నిదర్శనమని కూడా చెప్పారామె. ‘‘చిన్నప్పుడు నేను చాలా ముభావంగా ఉండేదాన్ని. నా భావాన్ని బయటకు చెప్పడం వచ్చేది కాదు. బాల్యం అంతా బిడియంతోనే గడిచింది. మాట్లాడేటప్పుడు ఎదుటి వారి కళ్లలోకి చూడడానికి కూడా భయపడేదాన్ని. అమ్మ ఎప్పుడూ ‘చదువుని నిర్లక్ష్యం చేయకూడదు’ అని చెప్తుండేది. ఎందుకు? ఏమిటి? అని తెలియకపోయినప్పటికీ ఆమె మాటను పాటించడం ఒక్కటే నేను చేసింది. చదవడం వల్ల నాకు నా భావాలను వ్యక్తం చేయడానికి రచన అనే వేదిక దొరికింది. నేను రాసిన ఐదు రచనలకూ సమాజంలో స్త్రీనే ఇతివృత్తం. ఏదీ ఫిక్షన్ కాదు. ప్రతిదీ వాస్తవిక సంఘటనల ఆధారంగా మలిచిన కథనాలే. దశాబ్దాలు దాటినా ఆ రచనలు ఇప్పటికీ కాలదోషానికి గురికాలేదంటే... మన సమాజంలో మహిళ పట్ల మగవాళ్లు చూపిస్తున్న వివక్ష అలాగే ఉందని అర్థం. ఇప్పటికీ ఆడపిల్లలు తమ భావాలను మనసులో దాచుకోవడానికే మొగ్గు చూపుతున్నారు తప్ప వ్యక్తం చేయడానికి సాహసించడం లేదు. ఎందుకంటే సమాజం ఒక లేబిల్ వేస్తుంది. ఆ లేబిల్ని భరిస్తూ జీవించాల్సి వస్తుందనే భయం. చెప్పినట్లు వింటే దేవత. వినకుంటే దెయ్యం. ‘దేవి, దివా ఆర్ షీ డెవిల్’లో అదే రాశాను’’ అని తెలిపారు సుధా మీనన్. సర్దుబాట్లు మహిళకే! ‘‘ఒక మగవాడు కెరీర్లో బిజీ అయితే ఆ ఇంట్లో అందరూ అతడికి సహకరిస్తారు. బంధువుల ఫంక్షన్లకు అతడు హాజరుకాలేకపోతే భార్య, తల్లి, తండ్రి, పిల్లలు అందరూ ‘అతడి తీరికలేనితనాన్ని’ ఇంట్లో వాళ్లతోపాటు బంధువులు కూడా గౌరవిస్తారు. అదే ఒక మహిళ తన ఆఫీస్‌లో బాధ్యతల కారణంగా ‘ఫలానా ఫంక్షన్‌కి నేను రాలేను, మీరు వెళ్లండి’ అంటే ఇంటి నుంచే వ్యతిరేకత మొదలవుతుంది. ‘ఎలాగోలా సర్దుబాటు చేసుకుని రావాలి’ అని ఒత్తిడి చేస్తారు. ఈ పరిస్థితి చూస్తూ పెరిగిన ఆ ఇంటి ఆడపిల్లలు తమ ఇష్టాలను, అభిప్రాయాలను గొంతులోనే నొక్కేసుకుంటున్నారు. ఆడపిల్లలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే వాతావరణం కల్పించలేని ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి తనకేం కావాలో సమాజంలో మాత్రం నోరు ఎలా తెరవగలుగుతుంది’’ అని ప్రశ్నించారు సుధ. ‘సమాజంలో అవరోధాలు ఎప్పుడూ ఉంటాయి. వాటిని ఎదుర్కొని నిలబడిన వాళ్లే టాప్‌లో నిలవగలుగుతారు. టాప్‌లో నిలవడానికి చేస్తున్న ప్రయత్నంలో లోపం ఉండరాదు’ అన్నారామె. అదే సందర్భంలో వ్యక్తం అయిన ‘మీటూ ఉద్యమం – ఉమెన్ ఆన్ టాప్’ అంశాల పట్ల విశ్లేషణాత్మక వాదన కొనసాగింది. అంతిమంగా... ‘మీటూ అంటూ ఉద్యమించాల్సిన పరిస్థితులు సమాజంలో అడుగడుగునా ఉన్నాయి. వాటన్నింటినీ ఎదుర్కొని పెద్ద స్థానాలను అధిరోహించిన మహిళలను గుర్తు చేసుకోవడం ఎప్పుడూ అవసరమే. ఇప్పుడు మరింత అవసరం. ఎందుకంటే ‘మీటూ’ ఉద్యమంలో బయటపడుతున్న భయానకమైన అనుభవాలను చూసి ఆడపిల్లలు చాలెంజింగ్ జాబ్స్‌లోకి రావడానికి జంకే ప్రమాదం ఉంటుంది. భయపడి దాక్కోవడం కాదు, బయటకొచ్చి నిలబడాలని చెప్పడానికి ‘ఉమెన్ ఆన్ టాప్’ అనే చర్చ ఎప్పుడూ అవసరమే. మీటూ ఉన్నంతకాలం ఈ చర్చకు ప్రాసంగికత ఉంటూనే ఉంటుంది’ అనే ముగింపుతో గోష్ఠి ముగిసింది. మీటూపై పురుషుల అసహనం లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళలు ‘మీ టూ’ అంటూ ముందుకు రావడంతో ఎంతోమంది ప్రముఖుల ముసుగులు తొలిగాయి. ఇలా ఇంకా ఎన్ని తలలు రాలుతాయోననే భయం మగ సమాజాన్ని వెంటాడుతోందిప్పుడు. ఆ అభద్రతలో నుంచి వస్తున్న వితర్క వాదనలే ఇవన్నీ. ఆడవాళ్లకు ఇంత ధైర్యం వచ్చిందేమిటి... అనే అసహనం కూడా పెరిగిపోతోంది. మహిళలు లక్ష్యాలను సాధిస్తున్నారు, టాప్‌లో నిలుస్తున్నారనే వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి కూడా అహం అడ్డు వస్తోంది. తనకు ఇంత వరకు తెలిసిన సమాజం తమకు ఫ్రెండ్లీగా ఉంది, ఇప్పుడు మహిళలు గళమెత్తితే వచ్చే మార్పు తమకు అనుకూలంగా ఉండకపోవచ్చు.. అనే ఆందోళన మగవాళ్ల చేత ఇలా మాట్లాడిస్తోంది. చలనశీలి సుధా మీనన్.. బిజినెస్ జర్నలిస్టు, రచయిత, మోటివేషనల్ స్పీకర్. మహిళల్లో నాయకత్వ లక్షణాలు, స్త్రీ–పురుష వైవిధ్యతల ఆధారంగా కార్పొరేట్ సంస్థలు, విద్యాసంస్థల్లో తలెత్తే అంశాలను చర్చించి పరిష్కరించడంలో ఆమె నిష్ణాతురాలు. నాన్ఫిక్షన్ రచనలు ఐదు చేశారు. అవి ‘ఫైస్టీ యట్ ఫిఫ్టీ’, ‘దేవి, దివా ఆర్ షీ డెవిల్’, ‘గిఫ్టెడ్: ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఆఫ్ పీపుల్ విత్ డిసేబిలిటీస్’, ‘విరాసత్’, ‘లెగసీ: లెటర్స్ ఫ్రమ్ ఎమినెంట్ పేరెంట్స్ టు దెయిర్ డాటర్స్’. వీటితోపాటు ఆమె ‘గెట్ రైటింగ్’, ‘రైటింగ్ విత్ ఉమెన్’ పేరుతో రైటింగ్ వర్క్‌షాపులు నిర్వహించారు. - వాకా మంజులారెడ్డి -
హంతకుడు ఎవరు?
ప్రముఖ రచయిత రాజశేఖరం హత్య వార్త ఆనాటి దినపత్రికలో చదివాడు ప్రైవేటు డిటెక్టివ్ శ్రీకర్. దినపత్రిక టీ పాయ్మీద గిరాటు వేసి ఉన్నపళంగా పోలీస్ స్టేషన్‌కు బయలుదేరాడు. హత్యా ప్రాంతం ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ చరణ్ తను కలిసి ఇదివరకు రెండు మూడు క్లిష్టమైన కేసులు పరిష్కరించారు. శ్రీకర్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ గురించి వాకబు చేస్తూ.. ‘‘ఎవరైనా అనుమానస్తులున్నారా.. కూపీ లాగావా’’ అంటూ తనూ అదే చిరునవ్వు ప్రదర్శించాడు. ‘‘రాజశేఖర్ ముఖంపై దిండు బలంగా అదిమి ఊపిరాడకుండా చేశారని పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది’’ అన్నాడు చరణ్.శ్రీకర్‌కు తాను సేకరించిన కొన్ని ఆధారాలు చూపించాడు.‘‘కాని ఇవి మార్ఫింగ్ ఫోటోలేమోనని నా అనుమానం. పైగా అవి పూర్తిగా నేరాన్ని రుజువు చేసేలా లేవు. అందుకే ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు.. పైగా ఫోటో తీశారూ అంటే మరో మనిషి ఆ గదిలో ఉన్నట్లేగా.. ఎవరో అతను తెలిస్తే గాని కేసు ముందుకు సాగదు’’ అని వివరిస్తూ..తన కెదురుగా నిలబడ్డ అనుమానితుడిని చూపించాడు. ‘‘ఇతను రాజశేఖరం వద్ద టైపిస్టుగా పనిచేసే కుమార్.. ఇంటరాగేషన్ చేస్తున్నాను’’అన్నాడు చరణ్.‘‘రాజశేఖరం గారిని ఎందుకు చంపావ్.. ఈ ఫోటోలో ఉన్నది నువ్వేగా..’’ అంటూ ప్రశ్నించాడు శ్రీకర్. ‘‘సార్! నేను హత్య చేయలేదు సర్.. నేను రాజశేఖర్ గారి ముఖం మీద ఉన్న దిండును తీసి చూశానంతే’’ గజ, గజ వణకుతూ అన్నాడు కుమార్. ‘‘సార్.. నేనూ ఒక రచయితనే. ‘జయసుధ’ అనే కలం పేరుతో కథలు రాస్తున్నది నేనే అని చాలా మందికి తెలియదు. ప్రముఖ రచయిత రాజశేఖరం ఒక వేదికపై పరిచయమయ్యారు. వారన్నా.. వారి రచనలన్నా నాకు చాలా ఇష్టం. నా రచనా శైలి బాగుంటుందని తనకు సాయం చెయ్యమని కోరారు. వారు కథకు ప్లాట్ ఇస్తే నేను కథగా..స్క్రిప్ట్‌గా.. నవలగా డెవలప్ చేసే వాణ్ణి. ఇద్దరం చర్చించుకొని తుది నిర్ణయం తీసుకున్నాక రాజశేఖరం పర్సనల్ కంప్యూటర్లో టైప్ చేసి పదిలపరచే వాణ్ణి. వారి సహచర్యం వల్ల మరిన్ని మెలకువలు నేర్చుకుంటూ నా రచనలను కూడా కొనసాగిస్తున్నాను. వారికి వచ్చే పారితోషికంలో కొంత నాకు ముట్ట చెప్పే వారు. అది నేనూహించినదాని కంటే ఎక్కువ మొత్తం. అలా వారి ఉప్పు తినే నేను వారికి ముప్పు తలపెడ్తానా.. సర్’’ అని వాపోయాడు కుమార్.‘‘కేవలం కథలవరకేనా.. లేక వారి కుటుంబ కథల్లో కూడా తలదూర్చే వాడివా’’ కాస్త వ్యంగ్యంగానే అడిగాడు శ్రీకర్. ‘‘నా కంత సాన్నిహిత్యం లేదు సార్.. నాకు తెలిసినంత వరకు వారికి పెద్ద కుటుంబం అంటూ ఏదీ లేదు. చుట్టాలు, పక్కాలు వచ్చిన జాడ కనబడేది కాదు. వారి సతీమణి పది సంవత్సరాల క్రితమే కాలం చేశారట. వారికి ఏకైక సంతానం విశాల్. తల్లి లేని పిల్లవాడు కదా అని కాస్త గారాబమెక్కువనుకుంటాను’’‘‘ఎందుకలా అనుకుంటున్నావ్’’ ‘‘విశాల్ చదివేది ఇంటర్ రెండవ సంవత్సరమే గాని డబ్బు మంచినీళ్ళ ప్రాయంలా ఖర్చు చేస్తుంటాడని రాజశేఖరంగారు అప్పుడప్పుడు చెప్పే వారు’’ ‘‘ఇంట్లో ఇంకా ఎవరెవరుంటారు’’‘‘వంట మనిషి రాములమ్మ. ఆమె భర్త రంగయ్య తోట పని చూసుకుంటూ ఉంటాడు’’ శ్రీకర్ మనసుకు ఎందుకో కుమార్ నిర్దోషని తోచింది. ఆ మరునాడు ఉదయమే తన ఫోన్లో మెసేజ్ చూసుకొని శ్రీకర్ ఆఫీసుకు వెళ్ళాడు కుమార్. ‘‘నీకు వివాహమయ్యిందా..’’ అడిగాడు శ్రీకర్.‘‘వివాహమయ్యింది సర్.. ఒక పాప గూడా.. ఉంది’’ ‘‘పాప వయసెంత.. బడికి వెళ్తుందా..’’‘‘లేదు సర్.. ఆరేళ్ళ ప్రాయం..’’ అంటూ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఆగిపోయాడు. అది గమనించిన శ్రీకర్ ‘‘చూడు కుమార్.. నావద్ద ఏదీ దాచిపెట్టొద్దు’’‘‘రహస్యమేమీ లేదు సార్..’’ నీళ్ళు నములసాగాడు. ‘‘మీ పాపకు గుండెలోని చిన్న రంధ్రం గురించి డాక్టర్లు ఏమన్నారు’’ అని శ్రీకర్ ప్రశ్నించే సరికి గతుక్కుమన్నాడు కుమార్.‘‘సార్.. ఆ విషయం చెబితే.. డబ్బు కోసం నేనే హత్య చేసానని మీకు అనుమానం వస్తుందని చెప్పాలా వద్దా.. అని సందేహించాను సర్. డాక్టర్లు మరి కొన్ని పరీక్షలు చేస్తే గాని చెప్పలేమన్నారు. నిజం దాచినందుకు క్షమించండి సర్.. ప్లీజ్’’ అని వేడుకున్నాడు కుమార్. ‘‘రాజశేఖరంగారు సినిమాలకు కూడా రాస్తుంటారు కదా.. ఆ రంగంలో ఎవరైనా పోటీదారులున్నారా..’’‘‘పోటీదారుల సంగతి తెలియదు గాని సార్.. కథలకు ఎంతో డిమాండు ఉన్నదన్న విషయం తెలుసు’’‘‘రాజశేఖరంగారు హత్య కాబడ్డ రోజు నువ్వు ఎక్కడున్నావు?’’ ‘‘సార్ గది పక్కనే నాకూ ఒక గది ఇచ్చారు. ఎవరైనా సార్‌తో మాట్లాడ్డానికి వచ్చినప్పుడు నేను నా గదిలోకి వెళ్ళి కథలు పూర్తి చేస్తుంటాను.ఆ రోజు ఉదయమే వారి అబ్బాయి విశాల్ వచ్చాడు సర్. కాలేజీ మమ్మల్ని బొటానికల్ టూర్ కోసం బెంగళూరు తీసుకెళ్తుంది. అలాగే మైసూర్ కూడా విహార యాత్రకు వెళ్ళి వద్దామని అంటున్నారు.పదివేలు కావాలని అడిగి తీసుకున్నాడు.రాత్రి భోజనం తరువాత సరిచేసిన ఆ నాలుగు కథలను ప్రింటౌట్ తీసి తప్పులుంటే సరిచెయ్యండని సార్కిచ్చి.. నేను నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను.తెల్లవారుజామున లేచి ఫైనల్ ప్రింటౌట్ కాపీలు తీయాల్సి ఉంది. మధ్యరాత్రి నన్నెవరో పిలిచినట్లు వినిపించింది. లేచి గబగబా వెళ్లి సార్ గది తట్టాను. సాధారణంగా సార్ తలుపు గడియపెట్టుకోరు. గదిలోకి వెళ్లి చూస్తే సార్ ముఖంపై దిండు ఉంది. పక్కన టీపాయ్ పైన మేము తయారు చేసిన కథలు.. కంప్యూటరూ.. సార్ సెల్ ఫోన్ కనపడలేదు. నాకు అనుమానమేసి సార్ దిండును పైకి తీశాను. సార్ కనుగుడ్లు నిలబడి ఉన్నాయి. భయంతో రంగయ్యా! అంటూ గట్టిగా అరిచాను. ఎవరూ రాలేదు. భయమేసింది. లేని శక్తి కూడగట్టుకొని ఔట్హౌస్కు పరుగెత్తి,. తలుపుబాదాను. రంగయ్య తలుపు తీశాడు. విషయం చెప్పే సరికి రంగయ్య, రాములమ్మ ఇద్దరూ పరుగు పరుగున నా వెనకాలే వచ్చారు.ఉలుకూ.. పలుకూ.. లేని సార్‌ను చూసి ఏడ్వసాగారు. వెంటనే రాజశేఖరం ఫ్యామిలీ డాక్టరుకు ఫోన్ చేశాను. డాక్టరు వచ్చి సార్‌ను పరీక్షించాడు. చనిపోయి దాదాపు గంట కావస్తోందని.. పోలీసులకు ఫోన్ చేశాడు. కొద్దిసేపటికి ఇన్స్పెక్టర్ చరణ్ గారు తన బృందంతో వచ్చారు. బాడీని పోస్ట్‌మార్టంకు పంపారు. నిన్న ఉదయమే బాడీని నాకప్పగించారు’’ అని కుమార్ చెప్తుంటే ఆవేదన అడ్డుపడింది. ఆగిపోయి మౌనంగా రోదించసాగాడు. ‘‘నేను కాలేజీకి ఫోన్ చేసి విషయం చెప్పి విశాల్‌ను అర్జెంటుగా వెనక్కి పంపించమన్నాను. అసలు వారు ఎలాంటి విహారయాత్రలకూ పిల్లలను తీసుకెళ్ళలేదట’’ శ్రీకర్ భృకుటి ముడిపడింది. వెంటనే ఇద్దరూ కలిసి రాజశేఖరం ఇంటికి వెళ్ళారు. విశాల్ గది చూద్దామని లోనికి వెళ్తుంటే.. శ్రీకర్ సెల్ ఫోన్ మోగింది.. ఆన్ చేశాడు. ‘‘హల్లో చరణ్..’’ అన్నాడు శ్రీకర్. అందులో నేనుచెప్పిన విషయం ఏమయ్యింది? అనే అర్థం ప్రస్ఫుటమవుతోంది.‘‘నేనొక మొబైల్ నంబరిస్తాను.ఆ నంబరుకే రాజశేఖరం గత రెండు రోజులుగా పలుమార్లు మాట్లాడాడు. కాని ఆ నంబర్ ఎవరి పేరుమీద రిజిస్టర్ అయిందో.. వివరాలు లేవు’’ఇన్స్పెక్టర్ చరణ్ గొంతు అస్పష్టంగా కుమార్‌కు వినవస్తోంది. ‘‘ఈ నంబర్ ఎవరిదో తెలుసా’’ అంటూ కుమార్‌కు చూపిస్తూ అడిగాడు. ‘‘రచయిత సుందరం నంబర్. అప్పుడప్పుడు కథల విషయంలో ఇరువురు చర్చించుకునే వారు’’‘‘ఈ విషయం నాకు ముందెందుకు చెప్పలేదు.. పోటీదారులెవరూ తెలియదన్నావ్’’ అంటూ రెట్టించాడు శ్రీకర్. ‘‘ఇతనూ ఒక రచయితనే కదా అనుకున్నాను సర్’’‘‘మరి రచయితల్లోనే కదా.. పోటీ తత్వముండేది. ఏదైనా నా వద్ద దాచొద్దని చెప్పాను. సుందరం రచయిత అనే విషయం చెప్పలేదు. అంటే నిన్నూ అనుమానించక తప్పదు’’ గంభీరంగా అన్నాడు శ్రీకర్.దెబ్బకు ఠారెత్తి పోయాడు కుమార్. విశాల్ గదిలో కొన్ని రహస్యపు కాగితపు ముక్కలు దొరికాయి. వాటిని వాసన చూశాడు శ్రీకర్. ఏదో అనుమాన మేసింది.రాములమ్మను ఒంటరిగా మరో గదిలోకి పిలిచి విచారించాడు. తన అనుమానం నిజమయ్యింది. నిజనిర్థారణ కోసం తన అసిస్టెంట్ అనిల్‌కు ఫోన్ చేద్దామనుకునే సరికి అనిల్ ప్రత్యక్షమయ్యాడు ‘‘సార్.. మీ అనుమానం నిజమే. నేను కాలేజీకి వెళ్ళి విశాల్ గురించి వాకబు చేశాను. విహార యాత్ర అబద్ధం.. విశాల్ అలా అబద్ధాలాడుతూ తన తండ్రి దగ్గర డబ్బు పట్టిస్తాడని.. అ డబ్బుతో మాదక ద్రవ్యాలు కొంటాడని అతని స్నేహితులు కొందరు చెప్పారు. అతని మొబైల్ సిగ్నల్స్..శంషాబాద్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుపుతోంది.అదే ప్రాంతంలో సుందరం ఫామ్‌హౌస్ ఉంది’’ అన్నాడు అనీల్.‘‘కమాన్ క్విక్..’’ అంటూ వేగంగా కారు వైపు కదిలాడు శ్రీకర్. ‘‘భేష్.. ఇప్పటికైనా అక్కరకొచ్చే ఒక ఇన్ఫర్మేషనిచ్చావ్’’ అనిల్ పరుగెత్తి కారు డ్రైవ్ చేద్దామని సీట్లో కూర్చున్నాడు. శ్రీకర్ కారు ముందు సీట్లో.. కుమార్ వెనక సీట్లో కూర్చున్నారు. కారు వాయువేగంగా కదిలింది. ‘‘చరణ్.. శంషాబాద్ సుందరం ఫామ్‌హౌస్‌కు వెళ్తున్నా. అర్జెంటుగా పోలీసు ఫోర్స్‌ను తీసుకొని వచ్చేయ్’’ అంటూ ఫోన్ కట్ చేశాడు.‘‘సర్.. అక్కడే సుందరంగారు కథలు చెప్తుంటే అతని అసిస్టెంట్ భూషణం టైప్ చేస్తుంటాడు’’ అంటూ మరికొంత సమాచారమిచ్చాడు కుమార్.‘‘భూషణం ఎలాంటి వాడు.. నీకేమైనా తెలుసా’’ కూపీ లాగాడు శ్రీకర్.‘‘అంతగా పరిచయం లేదు సర్. అతను నా కంటే ముందు రాజశేఖరంగారి వద్ద పనిచేసే వాడట. అతని ప్రవర్తన నచ్చక పంపించేశానని సార్ ఒకసారి అన్నారు. ప్రస్తుతం సుందరం దగ్గర పనిచేస్తున్నాడు’’ మళ్ళీశ్రీకర్ ఏమంటాడో.. భూషణం గురించి ముందు చెప్పక పోవడమూ తప్పు చేశానని గిల్టీగా ఫీలయ్యాడు కుమార్.‘‘అదే కుమార్.. నీలో ఉన్న పెద్ద తప్పు. ఏదైనా అడగంది చెప్పడం లేదు. నేర పరిశోధన సమయంలో ఏ విషయమూ దాచొద్దు. సరే అయిందేదో అయింది. నాకు భూషణం మీద అనుమానంగా ఉంది. అనిల్ త్వరగా పోనీయ్’’ అంటూ వేగిర పెట్టాడు శ్రీకర్. వారు ఫామ్‌హౌస్ చేరుకునే సరికి చరణ్ తన బృందంతో అప్పుడే జీపు దిగుతున్నాడు.చరణ్ సంకేతాలందుకొని పోలీసులు తలుపులు బద్దలుకొట్టారు. ఎదురుగా ముగ్గురు రౌడీలు.. పోలీసులను చూడగానే కాళ్ళకు బుద్ధి చెప్పబోయారు. నలుగురు పోలీసులు చుట్టుముట్టి రౌడీలను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరు భూషణం.. కుమార్ గుర్తించాడు.‘‘విశాల్ ఎక్కడ’’ అని గద్దించాడు ఇన్స్పెక్టర్ చరణ్. భూషణాన్ని సోదా చేసి సెల్ ఫోన్ లాక్కున్నాడు. భూషణం పక్క గదిలోకి కదిలాడు. అంతా వెంబడించారు. మంచంపై విశాల్ మత్తుగా నిద్రపోతున్నాడు. ఇంతగా అలజడి అయినా విశాల్ లేవక పోవడం.. అధిక మొత్తంలో మాదక ద్రవ్యం కన్జ్యూమ్ చేసి ఉంటాడని భావించాడు చరణ్. శ్రీకర్, అనిల్ పక్క గది లోకి వెళ్ళి సోదా చేసారు. రాజశేఖరం గారి పర్సనల్ కంప్యూటర్.. కథలు దొరికాయి. వాటిని తీసుకొచ్చి చరణ్‌కు అందజేశారు.చరణ్ భూషణం సెల్ ఫోన్ లోని ఫొటోలు చూపించాడు. ఇద్దరూ.. చిరునవ్వు నవ్వుకున్నారు. ఇద్దరు పోలీసులను విశాల్ దగ్గర కాపలా పెట్టి లేచాక స్టేషన్‌కు తీసుకురమ్మన్నాడు చరణ్.‘‘చరణ్.. అనిల్, కుమార్‌లను కూడా ఇక్కడే ఉండనిద్దాం. విశాల్ లేచాక ముందుగా రాజశేఖరం గారి అంతిమ సంస్కారం పోలీసుల పర్యవేక్షణలో చేయిద్దాం. కుమార్, అనిల్ ఆ పని చూసుకుంటారు. నేను నీతో స్టేషన్‌కు వస్తాను’’ అని అనుమతి అడిగాడు శ్రీకర్. చరణ్ ఓకే.. అన్నట్టుగా తలూపాడు. ఇద్దరు రౌడీలను, భూషణంను పోలీసు జీపు ఎక్కించారు పోలీసులు.చరణ్, శ్రీకర్ అంతా కలిసి అదే జీబులో వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. ఇన్స్పెక్టర్ చరణ్ తనదైన శైలిలో లాఠీ ఝళిపించే సరికి భూషణం గుండె అదిరి పోయింది. లాఠీ రుచి చూడక ముందే..‘‘సర్.. నిజం చెబుతాను’’ అంటూ చరణ్ కాళ్ళపై పడిపోయాడు భూషణం. శ్రీకర్ కనుసైగ చూసి మీడియాను రమ్మన్నాడు చరణ్. ఫామ్‌హౌస్ నుంచి వస్తుంటే దారిలో శ్రీకర్ మీడియాకు ప్రముఖ రచయిత రాజశేఖరం హంతకుడు దొరికాడని చెప్పడం విన్నాడు. మీడియా ముందు భూçషణం నోరు విప్పాడు.‘‘కుమార్ కంటే ముందు రచయిత రాజశేఖరం గారి దగ్గర నేను అసిస్టెంట్‌గా పని చేసేవాడిని. మాది చాలా పెద్ద కుటుంబం. ఖర్చుల కోసం అడ్డదార్లు తొక్కాల్సి వచ్చేది. నాకు కథలు రాయడం రాదు. కేవలం కంప్యూటర్లో టైప్ చేసే వాణ్ణి. ఒకసారి రాజశేఖరంగారి ఒక కథా వస్తువును రచయిత సుందరం గారికి లీక్ చేశాను. తను అధిక మొత్తంలో డబ్బు ఇచ్చాడు. కథలకు అంత డబ్బు వస్తుందని నాకు మొదటి సారిగా తెలిసింది. ఆ కథను డెవలప్ చేసి సుందరం గారు ఒక నిర్మాతకు అమ్మాడు. అది సినిమాగా తీశారు. విజయం సాధించింది. ఆ కథ నాదంటూ రాజశేఖరం నిర్మాతతో గొడవకు దిగాడు. అప్పుడు నా విషయం బయట పడింది. నన్ను అందరి ముందూ తిట్టి ఉద్యోగంలో నుంచి తీసేశాడు రాజశేఖరం. సుందరంగారు నన్ను చేరదీశారు. రాజశేఖరం గారి కథలతో మూడు సినిమాలు అత్యంత ప్రజాదరణ పొందడం.. సుందరంగారి కథలతో సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడం.. ఆలోచనలో పడ్డాం. నాకు విశాల్ సంగతి పూర్తిగా తెలుసు. అతను మత్తు మందుకు బానిస. అది రాజశేఖరం గారికి తెలియదు. పూర్తిగా కథల్లో మునిగి పోయి విశాల్ గురించి పెద్దగా పట్టించుకునే వాడు కాదు. కొడుకుపై నమ్మకమెక్కువ. విశాల్‌ను బుట్టలో వేసుకున్నాను. ముందుగా కొంత మత్తుమందు ఉచితంగా ఇచ్చాను. దాంతో నన్ను పూర్తిగా నమ్మాడు. డబ్బు కోసం మీ నాన్న గారిని బలవంత పెట్టొద్దు. ఎంత కావాలన్నా అంత బ్రౌన్ షుగర్ నీకందిస్తారని నమ్మబలికి సుందరం గారికి పరిచయం చేశాను. రాజశేఖరం గారు కుమార్ సాయంతో మరి కొన్ని కథలు సిద్ధం చేస్తున్నారని విశాల్ ద్వారా తెలుసుకున్నాను. ఈసారి కథలతో బాటు ఏ ఆధారాలు లేకుండా ల్యాప్‌టాప్‌ను కూడా తస్కరించాలని.. సుందరం గారికి నా పథకం చెప్పాను.మరో పథకం కూడా వేసి.. సినీ జగత్తులో నాకు మరో పోటీ దారుడు లేకుండా చేయి. నీకూ పగ చల్లారినట్టు ఉంటుంది. కుమార్‌ను కూడా లేపెయ్యి. కోటి రూపాయలిస్తానని ఆశ చూపారు సుందరంగారు. కోటి రూపాయలంటే మాటలా! ఒక్క దెబ్బకు రెండు పిట్టలను పడగొట్టాలనుకున్నాను. తను విహార యాత్రకు వెళ్లాడని తెలుసు.. ఎవరికీ అనుమానం రాదని ఆ రాత్రి రమ్మన్నాడు విశాల్. విశాల్ చెప్పిన సమయానికి వారి ఇంటికి వెళ్ళాను. విశాల్ నన్ను తన గదిలో కూర్చోమన్నాడు. తను రాజశేఖరం గదికి వెళ్ళి కథలు.. పర్సనల్ కంప్యూటర్, సెల్ ఫోన్ తెచ్చిచ్చాడు. వానిని ఒక బ్యాగులో సర్దుకొని రెండుబ్రౌన్ షుగర్ పాకెట్లిచ్చాను. దాన్ని చూడగానే ఆవురావురుమంటూ లాగించాడు విశాల్. అతను అలా ఒరిగి పోగానే నేను రాజశేఖరం గదిలోకి వెళ్ళి దిండు ముఖాన పెట్టి ఊపిరాడకుండా అదిమి పట్టాను. కాసేపటికి ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్నాక ‘కుమార్.. కుమార్’ అంటూ గట్టిగా పిలిచాను. కుమార్ వస్తున్నట్లు గమమనించి వెళ్ళి ఆల్మారా వెనుకాల దాక్కున్నాను. కుమార్ వచ్చి రాజశేఖరాన్ని చూస్తుంటే సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీశాను. కుమార్ రంగయ్య కోసం ఔట్ హౌస్‌కు పరుగెత్తడం చూసి విశాల్‌ను ఎత్తుకొని, బ్యాగు తీసుకొని బయట పడ్డాను. ఇంటికి కాస్తా దూరంగా పార్క్ చేసిన కారులో శంషాబాద్ ఫామ్‌హౌస్‌కు చేరుకున్నాను.తెల్లవారు జామున విశాల్ లేచాడు. కాని ఇంకా పూర్తిగా మత్తు వదలినట్లుగా లేదు. వాళ్ల నాన్న గారిని కుమార్ హత్య చేశాడని అనుకుంటున్నారంతా. నీవేలి ముద్రలు టీపాయ్ మీద పడి ఉంటాయి. విహార యాత్రకు వెళ్ళినవాడి వేలి ముద్రలెలా వచ్చాయనే అనుమానం రావచ్చు. నీ విహార యాత్ర అబధ్ధమని తేలితే నిన్నూ అరెస్టు చేయవచ్చు. ఎందుకైనా మంచిది. నువ్వు ఇప్పుడప్పుడే బయటికి వెళ్ళొద్దని భయపెట్టి.. బలవంతంగా మత్తు మందు ఇంజక్షన్ చేశాను. ఫొటోల ప్రింటౌట్లను మరుసటి రోజు ఉదయమే ఎస్సై గారి క్వార్టర్ గుమ్మం ముందు వేయించాను. కాని నా ఫోన్లో ఫొటోలు డిలీట్ చెయ్యడం మరిచాను’’ అంటూ తల దించుకున్నాడు భూషణం. ‘‘మావాళ్ళు సుందరాన్ని అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకు వస్తున్నామని ఇప్పుడే ఫోన్ వచ్చింది. తప్పు చేసిన వారెవరూ చట్టం నుండి తప్పించుకో లేరు. ఈ కేసులో శ్రీకర్, అనిల్‌తో బాటు కుమార్ గూడా నా కెంతగానో సహకరించారు. వారికి నా ధన్యవాదాలు’’ అంటూ విలేకరుల ముందు తన వినమ్రతను చాటుకున్నాడు చరణ్. - క్రైమ్ స్టోరీ -
చేలల్లో నీలిమ
జర్నలిస్టు, రచయిత్రి అయిన నీలిమ ఈ మధ్యే ‘విడోస్ ఆఫ్ విదర్భ’ అనే పుస్తకం రాసింది. ఆక్స్ఫర్డ్ ప్రచురణ. ఈ పుస్తకం ఇటీవలే విడుదలైంది.తెలంగాణ వ్యవసాయ పరిస్థితులు, రైతుల స్థితిగతుల మీద అధ్యయనం చేయడానికి హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడితే చాలా విషయాలను పంచుకుంది. వాటిలోని విశేషాంశాలివి. 2001.. జూలై. ఫూలన్ దేవి హత్య జరిగిన రెండు రోజుల తర్వాత ఆమె హత్యకు పాల్పడ్డ షేర్ సింగ్ రాణా లొంగిపోనున్నాడనే వార్తలు మొదలయ్యాయి. అప్పటికే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్‌లో మంచిపేరు తెచ్చుకున్న ముప్పై ఏళ్ల యంVŠ జర్నలిస్ట్ ఒక అమ్మాయి తన ప్రశ్నలతో షేర్ సింగ్ రాణాను ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తోంది. అతను డెహ్రాడూన్ వైపు గాని, రూర్కీ వైపు గాని వెళ్లి ఉండొచ్చు అని పోలీసుల ఊహాగానాలు. ఆ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్స్ అన్నీ అలెర్ట్ అయ్యాయి. కానీ ఆ అమ్మాయిలో ఏదో సందేహం? అతను ఆ రెండు ప్రాంతాల వైపు కాకుండా... తనింటికి దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌లోనే సరెండర్ అవుతాడని. అందుకే అతని ఇంటికి దగ్గర్లో ఉన్న పోలీస్‌స్టేషన్ మీదే దృష్టి పెట్టింది. ఆమె అనుమానం నిజమైంది. వెంటనే ఆ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ షేర్ సింగ్ రాణా ఉన్నాడు! గబగబా ప్రశ్నల పరంపర సంధించింది. పదిహేను నిమిషాలకు మిగతా మీడియాకు ఉప్పంది, అక్కడికి వచ్చి వాలింది. కానీ రాణాను మొదట పట్టుకున్న ఘనత ఆమెకే దక్కింది. ఆమె కెరీర్లో ఇలాంటివి ఎన్నో! 2జీ స్పెక్ట్రమ్, నార్కోటిక్స్ నుంచి రాజకీయ కుట్రల దాకా ఎన్నెన్నో రిపోర్టింగ్స్.. చెప్పుకుంటూ వెళితే చాలానే! ఆమే నీలిమ. ‘ది స్టేట్స్‌మన్’లో తొలి ఉద్యోగం కోట నీలిమ పుట్టింది విజయవాడలో. పెరిగింది ఢిల్లీలో. తండ్రి కేవీఎస్ రామశర్మ. ఆయనా జర్నలిస్టే. నేషనల్ హెరాల్డ్‌కి ఎడిటర్‌గా పనిచేశారు. తల్లి ఉమా శర్మ. రచయిత్రి. ప్రపంచాన్ని ఎలా చూడాలో నాన్న ద్వారా నేర్చుకుంది నీలిమ. అమ్మ వల్ల ఊహాత్మక శక్తి పెరిగింది. ఈ రెండూ తన వృత్తికి ఎంతగానో ఉపయోగపడ్డాయి అంటుంది నీలిమ. అసలు తను జర్నలిస్ట్ అవడానికి ప్రేరణ మాత్రం తండ్రి నుంచే వచ్చింది అని చెప్తుంది. ఢిల్లీలో చదువు. అమెరికాలో పీహెచ్డీ చేసింది. జర్నలిస్ట్‌గా మొదట పెన్ను పట్టింది ‘‘ది స్టేట్స్‌మన్’’ పత్రికలో. తర్వాత ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ది సండే గార్డియన్లకు పనిచేసింది. ప్రస్తుతం ది హఫింగ్టన్ పోస్ట్, డైలీ ఓ, డీఎన్ఏ, న్యూస్ 18లకు కాలమిస్ట్‌గా వ్యాసాలు రాస్తోంది. ఆమె దృష్టి అంతా పాలిటిక్స్, పాలసీస్, జెండర్, రైతుల మీదే. పత్రికల విధానాలు నచ్చలేదు! 2001–02 మధ్య.. హఠాత్తుగా రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతున్నట్టు గమనించింది నీలిమ. దేశానికి అన్నం పెట్టే రైతు బలవంతంగా ప్రాణం తీసుకునేదాకా వెళ్లాడంటే ఎంత దారుణమైన పరిస్థితులున్నట్టు! వాళ్లకోసం విధానాలు రూపొందించే యంత్రాంగానికి క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసా? రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుందో కనీసం రైతులకన్నా తెలుసా? వీటి గురించి కదా తను రిపోర్ట్ చేయాలి. వీటిని కదా.. మీడియా బ్యానర్లు రాయాలి. కానీ వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంది. నిజాన్ని చెప్పాలి అంటే తాను పనిచేస్తున్న పత్రికల పాలసీకి భిన్నంగా నడవాలి. అందుకే రాజీనామా చేయాలనుకుంది నీలిమ. వెంటనే నెలవారీ ఖర్చులు, ఈఎమ్ఐలు, కట్టవలసిన లోన్లు కళ్లముందు కనిపించాయి. ఉద్యోగం వదిలేసి పూర్తిగా రైతుల ఆత్మహత్యల రీసెర్చ్ మీదే ఉండాలంటే ఇంకో ఇన్కమ్ సోర్స్కావాలి. అదేంటి? ఈ సంఘర్షణతో మరో రెండేళ్లు గడిచాయి. ఉద్యోగం మాని, విదర్భకు నీలిమ పెయింటర్ కూడా. ఉపనిషత్ల సారమే ఆమె పెయింటింగ్స్ థీమ్. దేశవిదేశాల్లో ఎగ్జిబిషన్స్ పెడ్తుంది. అప్పుడనిపించింది.. ఆదాయం కోసం ఈ కళనే ఉపయోగించుకోవాలని. రైతుల ఆత్మహత్యల పరిస్థితుల మీద రీసెర్చ్‌ను ఖరారు చేసుకుంది. 2004లో ఉద్యోగానికి రాజీనామా చేసి మహారాష్ట్రలోని విదర్భ బయలుదేరింది. అంతకుముందు మన దేశ వ్యవసాయం, పద్ధతులు, నష్టాలు వగైరా అన్నిటి మీద వచ్చిన పుస్తకాలు, శాస్త్రీయ పరిశోధనలన్నిటినీ అక్కడ చదివింది. తన పరిశోధనను సాగించింది. ఆ శోధననంతా పాఠ్యాంశంగా చెబితే ప్రజలకు పట్టదనీ గ్రహించింది. అందుకే వాటిని కథల రూపంలో, నవలల రూపంలో రాసింది. అలా రాసిన మొదటి పుస్తకం ‘‘రివర్‌స్టోన్స్’’. వ్యవసాయాన్ని, రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వ పాలసీలు ఎంత నిర్లక్ష్యం చేశాయో నవలారూపంలో వివరించిన పుస్తకం అది. 2007లో అచ్చయింది. రెండో పుస్తకం ‘‘డెత్ ఆఫ్ ఎ మనీలెండర్’’ 2009లో వచ్చింది. పల్లెల్లో పేదరికాన్ని పట్టించుకోకుండా వదిలేసిన మెయిన్ జర్నలిజం మీద ఎక్కుపెట్టిన అక్షరాస్త్రం ఆ పుస్తకం. 2013లో మూడో పుస్తకం ‘‘షూస్ ఆఫ్ ది డెడ్’’ని రాసింది. పొలిటికల్ బుక్‌గా అది బాగా పాపులర్ అయింది. పల్లెల్లోని యువత, నగరంలోని యువత మధ్య ఉండే వ్యత్యాసాన్ని.. దానికి కారణమైన వ్యవస్థకు నీలిమ అద్దం పట్టిందీ నవలలో. 2016లో ‘‘ది హానెస్ట్ సీసన్’’ను రాసింది. పార్లమెంట్ నాలుగు గోడల మధ్య జరిగే డీల్స్‌ను బహిర్గతం చేసిందీ పుస్తకంలో. ఆమె రాసిన ‘‘షూస్ ఆఫ్ ది డెడ్’’నవలను ప్రముఖ తమిళ దర్శకుడు వెట్టిమారన్ సినిమాగా కూడా రూపొందించబోతున్నాడు. ఇదీ కోట నీలిమ రచయిత్రిగా మారిన తీరు. ది గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ నీలిమ పుస్తకాలన్నీ ఇంగ్లిష్‌లోనే ఉన్నాయి. కారణం తనకు తెలుగు అంత గొప్పగా రాయడం రాకపోవడమే అంటారు. ‘‘చిన్నప్పుడు మా నాన్న గారు మాకు తెలుగు నేర్పే విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. ఏదైనా తెలుగు పుస్తకం ఇచ్చి చదవమని చెప్పేవారు. చాలా హార్డ్‌గా ఉంది నాన్నా అంటే అవునా అంటూ ‘వేయి పడగలు’ వంటి భారీ పుస్తకాన్ని తెచ్చి ముందు పెట్టేవారు. మేం మొహం తేలేస్తే.. ‘ఇప్పుడు ముందు ఇచ్చిన పుస్తకం తేలిగ్గా అనిపిస్తుంది కదా.. చదవండి’ అనేవారు. అలా తెలుగు నేర్పే విషయంలో ఎంత పట్టుదలగా ఉండేవారో.. పుస్తకాలు చదివే విషయంలో కూడా అంతే ఇదిగా ఉండేవారు. నా ఎనిమిదో యేటనే చార్ల్స్ డికెన్స్ ‘‘ది గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్’ పుస్తకం ఇచ్చారు. అర్థంకాలేదు. మళ్లీ నాలుగేళ్లకు ఇచ్చారు చదవమని. అలా ఉంటుంది ఆయన ట్రైనింగ్. ఈ రోజు ఇలా ఉన్నామంటే అమ్మా, నాన్నే కారణం’’ అని గుర్తు చేసుకుంది నీలిమ. తెలుగు నేర్పాలని తండ్రి అంత ప్రయత్నించినా.. ఢిల్లీలో పెరగడం, వృత్తిరీత్యా ఇంగ్లిష్ భాషకే పరిమితమవడం వల్ల తెలుగు మీద పట్టు రాలేదు నీలిమకు. అందుకే తన పుస్తకాలను తెలుగులో అనువదించేందుకు.. ఇంకా చెప్పాలంటే ఇతర భారతీయ భాషల్లో అనువదించేందుకూ ప్రయత్నిస్తోంది. సమస్యలపై ‘స్టూడియో అడ్డా’ ప్రస్తుతం తెలంగాణ రైతు సమస్యలు, చేనేత కార్మికుల అవస్థలు, గల్ఫ్ వలసల గురించీ అధ్యయనం చేయడానికి హైదరాబాద్ వచ్చింది. ‘‘తెలంగాణలోనూ రైతుల ఆత్మహత్యలు భయం కలిగిస్తున్నాయి. ముందు నేను తెలంగాణ పల్లెలన్నీ తిరగాలనుకుంటున్నాను’’ అంది నీలిమ. ఇంకోవైపు ‘‘స్టూడియో అడ్డా’’ అనే సంస్థనూ స్థాపించి.. సోషల్ ఫారమ్‌గా మలిచింది. ఎవరైనా ఆ సంస్థలో ఎన్రోల్ చేసుకోవచ్చు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న అన్ని అంశాలు, సమస్యలు చర్చిస్తారు. ఆర్ట్ ఎగ్జిబిషన్స్నూ ఆమె కండక్ట్ చేస్తోంది. ఇదీ కోట నీలిమ మల్టీ టాస్కింగ్. విడోస్ ఆఫ్ విదర్భ నాలుగు పుస్తకాలు రాశాక నీలిమ ఆలోచన మారింది. ఇంత రీసెర్చ్‌లో ఆమెకు విషయాలన్నీ చెప్పింది చనిపోయిన రైతుల భార్యలు, తల్లులే. బరువు, బాధ్యతలను వదిలేసి ఆత్మహత్యతో రైతులు సాంత్వన పొందితే వాటన్నిటినీ నెరవేరుస్తున్నది ఈ ఆడవాళ్లే. అప్పులు తీర్చి, పిల్లలకు చదువులు చెప్పించి, పెళ్లిళ్లు చేసి జీవనాన్ని వెళ్లదీస్తున్నారు. అలాంటి వాళ్ల స్ట్రగుల్‌ని కదా చెప్పాలి అనుకుంది. అందుకే ‘‘విడోస్ ఆఫ్ విదర్భ’’గా పుస్తకాన్ని తెచ్చింది. ‘‘ఈ పుస్తకం రాయడానికి నాలుగేళ్లు పట్టింది. ముందు 100 కేస్‌స్టడీస్ తీసుకున్నా.. అందులోంచి 50 ఎంచుకొని అందులోంచి మళ్లీ పద్దెనిమిది తీసుకున్నా. ఆ పద్దెనిమిది మంది జీవితాలు ఒకేరకంగా లేవు. ఒక్కొక్కరూ ఒక్కోరకంగా జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. ఎవరూ ఎక్కడా ఆత్మగౌరవాన్ని కోల్పోలేదు. ధైర్యంగా నిలబడ్డారు. వాళ్లను చూస్తే.. వాళ్ల కథలు వింటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. వాళ్లకున్నంత సెల్ఫ్ ప్రైడ్, సెల్ఫ్‌రెస్పెక్ట్ అర్బన్ విమెన్, ఈవెన్ వర్కింగ్ క్లాస్ విమెన్‌కి కూడా ఉండదనిపించింది. చాలా నార్మల్ లేడీస్.. చదువు లేదు.. బయటి ప్రపంచం తెలియదు.. ఆర్థికంగా ఎలాంటి అండలేని వాళ్లు.. అయినా వాళ్లు నిలబడ్డ తీరు.. అద్భుతం! వాళ్ల భర్తలు చేసిన పనే వాళ్లు చేసి ఉంటే ఎన్ని కుటుంబాలు రోడ్డున పడేవి?’’ అంటూ తన పుస్తక నేపథ్యాన్ని వివరించింది నీలిమ. – సరస్వతి రమ -
ఇతడు
బలహీనమైన గుండె కలవారు ఈవారం ఈ దెయ్యం కథను చదవకపోవడమే మంచిది. ఎందుకంటే.. ఈ కథను రాయడం మొదలు పెట్టాక ఈ రచయితకు రెండుసార్లు దెయ్యం కనిపించింది! ఈ రెండుసార్లూ హైదరాబాద్ సిటీ బస్సులోనే ఈ రచయితకు దెయ్యం కనిపించింది. అదికూడా లేడీస్ సీట్ల వైపే కనిపించింది! లేడీస్ సీట్ల దగ్గర రచయితకేం పని అని మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు. అది ముఖ్యం కాదు. లేడీస్ సీట్ల దగ్గరే దెయ్యం ఎందుకు కనిపించిందన్నది కూడా ముఖ్యం కాదు. అయితే అక్కడ ఆ రెండుసార్లూ రచయితకు కనిపించింది మగదెయ్యమే! చచ్చి దెయ్యాలయ్యాక కూడా ఈ మగవాళ్లు సిగ్గులేకుండా సిటీబస్సుల్లో ఆడవాళ్ల సీట్ల కోసం వెంపర్లాడతారా అని మీలో కొందరికి ఆ దెయ్యం మీద, ఈ రచయిత మీదా అసహ్యం కలగవచ్చు. అలా ఎందుకు జరిగిందన్నది అక్కర్లేని సంగతి. ఎలా జరిగిందన్నది కథలోని సంగతి. బలహీనమైన గుండె కలవారు ఈ కథను ఎందుకు చదవకూడదనే దానికి లాజిక్ ఏమీ లేదు. కథకూ, బస్సులో కనిపించిన దెయ్యానికీ సంబంధం కూడా లేదు. కథ రాస్తున్నప్పుడు ఇలా జరిగిందని చెప్పడమే రచయిత ఉద్దేశం. కథ చదువుతున్నప్పుడు మీకు ఒక వేళ దెయ్యం కనిపించినా.. అది కూడా కథకు, ఆ దెయ్యానికీ సంబంధం లేని విషయమే అనుకుని మీరు ధైర్యంగా ఉంటే ఫర్వాలేదు. అంత ధైర్యం మనకెందుకులే అనుకున్నవాళ్లు ఈ వారం ఈ పేజీని తిప్పేయడమే మంచిది. హైదరాబాద్‌లో ‘49 ఎం’ నెంబరు సిటీబస్సు సికింద్రాబాద్–మెహిదీపట్నం మధ్య తిరుగుతుంటుంది. రోజూ ఆ నెంబర్ బస్‌లోనే ఆఫీస్‌కి వెళ్తాడు ఈ రచయిత. బంజారాహిల్స్‌లో ఆఫీస్. సరిగ్గా ఆఫీస్ ముందే బస్టాప్. సీటు దొరికితే సౌకర్యవంతమైన ప్రయాణమే.రచయిత అనే జీవి ఫలానాలా ఉంటుంది అనుకుంటే, ఆ ఫలానాలా కచ్చితంగా ఉండడు ఈ రచయిత. అంతేకాదు. అదోలా ఉంటాడు! ‘నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్లు వీళ్లూ చెప్పడమే తప్ప నాక్కూడా తెలీదు’ అని ఏదో సినిమాలో మహేశ్‌బాబు అంటాడు. ఈ రచయితక్కూడా తను రచయితనని, రచయితను కాననీ తెలీదు. ఇతణ్ణి చూసినవాళ్లెవరైనా వాళ్లకై వాళ్లు అనుకోవడమే.. దెయ్యంలా ఉన్నాడని. ఆ అనుకునేవాళ్లు కూడా ఇతడు దెయ్యంలా ఉన్నాడని అనుకోరు. దెయ్యం ఇలాగే ఉంటుందేమో అనుకుంటారు. మరి వాళ్లు అనుకుంటున్నట్లు ఇతడికెలా తెలుస్తుంది? తెలియదు. వాళ్లు అనుకుంటున్నారేమోనని ఇతడు అనుకుంటాడు. బస్సు స్పీడుగా వెళ్లే ప్రయత్నం చేస్తోంది. మెట్రో ఎక్స్‌ప్రెస్ కాబట్టి అది స్పీడుగానే వెళ్లాలి. రోడ్డుపై వాహనాల రద్దీ బస్సును వేగంగా కదలనివ్వడం లేదు. రోడ్డు పై ఎంత రద్దీ ఉందో, బస్సులోపలా అంతే రద్దీ ఉంది! రోడ్డుపై యాక్సిడెంట్‌ను తప్పించడానికి డ్రైవరు బ్రేక్ నొక్కిన ప్రతిసారీ బస్సులోపల యాక్సిడెంట్ అవుతోంది. ఎవరెవరివో ఎముకలు పుటుక్కుమంటున్నాయి. రచయిత నిలబడి ప్రయాణిస్తున్నాడు. ఆఫీసు రెండో మూడో స్టాపుల దూరం ఉందనగా ఇతడికి సీటు దొరికింది. దొరికింది అని ఇతడేం అనుకోలేదు. కండక్టర్ చూసి, ‘కోర్చోండక్కడ’ అని ఖాళీ సీటు చూపిస్తే వెళ్లి కూర్చున్నాడు. ‘కూర్చోండి’ అంటే వెళ్లి కూర్చున్నాడు కానీ, అది లేడీస్ సీటా, జెంట్స్ సీటా అని ఇతడు చూసుకోలేదు. ఎందుకు చూసుకోలేదంటే.. ఆ ఖాళీ సీటు పక్కన కిటికీ వైపు కూర్చొని ఉన్నది స్త్రీ కాదు, పురుషుడు. సాధారణంగా ఇతడు లేడీస్ సీటు ఖాళీగా ఉన్నా వెళ్లి కూర్చోడు. కూర్చున్న సేపట్నుంచీ ఇతడి ఆలోచనలు తెగిపోతాయి. తెగిపోయి, లేడీస్ ఎవరైనా వస్తారేమో, వాళ్లొచ్చినప్పుడు లేవాలేమో అన్న టెన్షన్ మొదలౌతుంది.ఏం ఉన్నా, లేకున్నా మనిషికి టెన్షన్ ఉండకూడదని ఇతడు అనుకుంటాడు. అందుకే లేడీస్ సీట్లలో కూర్చోవడం కన్నా వెయ్యి కిలోమీటర్లయినా నిలబడి ప్రయాణించడమే సుఖం అనుకుంటాడు. సీట్లో కూర్చోగానే తన ఆలోచనల్లోకి తను వెళ్లిపోయాడు రచయిత. స్టాప్ దగ్గరపడుతుందన్న ఆలోచన కూడా రానంతగా ఆలోచనల్లో మునిగిపోయాడు. అప్పుడొచ్చిపడింది ఇతడి భుజంపై ఎవరిదో చెయ్యి! తలెత్తి చూశాడు. పక్కనే వచ్చి నిలబడి ఉన్న ఒక మగమనిషి చెయ్యి అది. ‘‘లెయ్! లేడీస్ సీట్లో ఎందుక్కూర్చున్నావ్. లేడీస్ నిలబడి ఉన్నారు చూళ్లేదా? లేడీస్ నీ దగ్గరకొచ్చి, దండంపెట్టి లెయ్యమని అడుక్కోవాలా’’ అని పెద్దగా అరుస్తోంది ఆ చెయ్యి. అరుస్తోంది ఆ మనిషి నోరే అయినా, అది నోరు అరుస్తున్నట్లుగా లేదు. చెయ్యి అరుస్తున్నట్లుగా ఉంది. అప్పుడు గమనించాడు రచయిత.. అవి లేడీస్ సీట్లని. సీట్లోంచి లేచాడు. రచయిత పక్కన, విండో సీట్లో కూర్చొని ఉన్న మనిషి కూడా అరుస్తున్న మనిషివైపు కోపంగా చూస్తూ సీటు ఖాళీ చేశాడు. ఖాళీ అయిన ఈ రెండు సీట్లలోకి... ఎప్పట్నుంచి నిలబడి ఉన్నారో.. ఆ ఇద్దరు ఆడవాళ్లు వచ్చి కూర్చున్నారు. ఆ ఘటన జరిగిన రోజు ర చయిత ఎప్పటిలా ఆఫీస్ దగ్గర స్టాప్‌లో దిగలేదు. ఎండ్ పాయింట్ మెహిదీపట్నం వెళ్లిపోయి.. బస్ డ్రైవర్, కండక్టర్.. బ్రేక్‌లో టీ తాగుతుంటే వెళ్లి అడిగాడు.. ‘ఎవరతను?’ అని. కండక్టర్‌కి వెంటనే అర్థమైంది. ‘‘తెలీదు!’’ అన్నాడు. రెండ్రోజుల తర్వాత మళ్లీ అలాంటి ఘటనే ఎదురైంది ఇతడికి. అయితే ఎదురైంది ఇతడికి కాదు. ఎవరో లేడీస్ సీట్లో కూర్చొని ఉంటే ఎవరో వచ్చి అరుస్తున్నారు.. సీట్లోంచి లెయ్మని! ఆరోజు అరచిన వ్యక్తి,ఈరోజు అరుస్తున్న వ్యక్తీ ఒకరు కాదు. రెండోసారి ఈ ఘటన జరుగుతున్నప్పుడు రచయిత నిలబడి లేడు. కూర్చొని ఉన్నాడు. లేడీస్ సీట్ల దగ్గర ఒక స్త్రీ నిస్సహాయంగా నిలబడి ఉంది. ఆమె కోసమే ఆ అపరిచితుడు జెంట్స్‌తో గొడవపడుతున్నాడు.ఆమెను పిలిచి తన సీటిచ్చాడు ఇతడు. ఆమె కూర్చోలేదు! ‘ఇది జెంట్స్’ సీటు కదా అంది. ఇతడికి నవ్వొచ్చింది. ‘‘బస్సుల్లో లేడీస్ సీట్లు మాత్రమే ఉంటాయి. జెంట్స్ సీట్స్ ఉండవు. ఇవి అందరికీ కామన్’’ అని చెప్పాడు.. మగవాళ్ల వైపు ఉన్న సీట్లను చూపిస్తూ. ఆ రోజు కూడా ఆఫీస్ దగ్గర ఉండే స్టాప్‌లో కాకుండా ఎండ్ పాయింట్లో దిగి, కండక్టర్ని అడిగాడు ఇతడు. ఆ రోజు ఉన్నది వేరే కండక్టర్. లేడీ కండక్టర్. ‘‘మేడమ్.. ఎవరతను?’’ అని అడిగాడు. ఆమె వెంటనే అర్థం చేసుకుంది! ‘‘మా కండక్టరే. ‘లేడీస్ సీట్లోంచి లేచి, లేడీస్‌కి సీట్ ఇవ్వు’ అని గట్టిగా అన్నందుకు ఓ ప్యాసింజర్ మా కండక్టర్ని బస్సులోనే కొట్టి చంపేశాడు. ఒక్కరైనా అడ్డు రాలేదు. ఈమధ్యే జరిగింది. మనిషి పోయినా మనసింకా డ్యూటీ చేస్తున్నట్లే ఉంది’’ అని చెప్పింది. ఆమె కంట్లో తడిని గమనించాడు అతడు. -
కారణజన్ముడు కాటన్
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పలువురికి సర్ ఆర్ధర్ కాటన్ జీవిత సాఫల్య పురస్కారాలు అందజేత రాజమహేంద్రవరం రూరల్ : ఒక ఆంగ్లేయుడు భారతీయుల యోగక్షేమాలు కోసం పరితపించడం మామూలు విషయం కాదని, సర్ ఆర్ధర్ కాటన్ నిజంగా కారణజన్ముడని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. బొమ్మూరులోని తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఫిలాంత్రోఫిక్ సొసైటీ, తెలుగు యూనివర్సిటీ సంయుక్తంగా కాటన్ 214వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఉండవల్లి మాట్లాడుతూ ధవళేశ్వరంలో ఆనకట్ట నిర్మించి ఉభయగోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన అపర భగీర«ధుడు కాటన్ అని కొనియడారు. ఫిలాంత్రోఫిక్ సొసైటీ వ్యవస్థాపకులు అద్దంకి రాజయోనా స్వాగతం పలుకగా, ఇండియన్ నర్సరీ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభకు అధ్యక్షత వహించిన సాహిత్య పీఠాధిపతి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మాట్లాడుతూ కాటన్ మహిమాన్వితుడని కొనియడారు. అందుకే ఆయన కీర్తి భారతదేశ నదీజలాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అంతర్లీనమై కలకాలం నిలిచే ఉంటుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెరుకూరి వెంకట రామారావు, తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తిమండ ప్రతాప్, బొమ్మూరు మాజీ సర్పంచి మత్సేటి ప్రసాద్, సీనియర్ పాత్రికేయులు ఎం.శ్రీరామ్మూర్తి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి కొల్లివెలసి హారిక, డాక్టర్ పి.హేమలత మాట్లాడారు. వివిధ రంగాలకు చెందిన 21 మంది ప్రముఖులకు సర్ ఆర్ధర్ కాటన్ జీవిత సాఫల్య పురస్కారాలు అందించారు. పురస్కార గ్రహీతలు వీరే పల్ల వెంకన్న (కడియం), ఆచార్య ఎండ్లూరి సుధాకర్, దూలం రాజ్‌కుమార్(పొట్టిలంక), సత్తి భాస్కరరెడ్డి (కందరెడ్డి, దుళ్ల), తుమ్మిడి అరుణ్‌కుమార్(రాజమహేంద్రవరం), డాక్టర్ గుబ్బల రాంబాబు (స్వర్ణాంధ్ర సేవా సంస్థ), బొంతు శ్రీహరి (సఖినేటిపల్లి), డాక్టర్ మానికిరెడ్డి సత్యనారాయణ (కాకినాడ), కర్రా వెంకటలక్ష్మి (ఎంపీపీ, వై.రామవరం), ఇసుకపట్ల ఇమ్మానియేలుకుమార్ (అన్నా మినిస్ట్రీస్, రావులపాలెం), అలమండ ప్రసాద్(కూచిపూడి నృత్య కళాకారుడు, సామర్లకోట), రహీమున్నీసాబేగం(విశాఖ), తురగా సూర్యారావు (కాకినాడ), కొచ్చెర్ల చక్రధారి(సూక్ష్మకళాకారుడు, సామర్లకోట), డాక్టర్ బీఎస్ఎస్ఏ జగదీష్(టీచర్, సామర్లకోట), శివకోటి విజయప్రసాద్ (మ్యుజీషియన్, కాకినాడ), పొట్నూరి రజనీకాంత్ (ఏలూరు), ప్రత్తి రామలక్ష్మణమూర్తి (టీచర్, పిఠాపురం), పి.కీర్తిప్రియ (కూచిపూడి నర్తకి, శ్రీకాకుళం), గరికిపర్తి నమశ్శివాయ (కాకినాడ), ముష్ఠి శ్రీదేవి (వెదురుపాక)లను జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు, పతకాలతో ఘనంగా సత్కరించారు. -
‘ఇష్టపడి చదివితేనే ఉన్నతి’
కామారెడ్డి : కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే ఉన్నత స్థాయికి చేరుకుంటారని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్(ట్రస్మా) ఆ«ద్వర్యంలో కామారెడ్డిలో పదో తరగతి విద్యార్థులకు విద్యపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరేందుకు ప్రయత్నించాలన్నారు. విజయాన్ని అందిపుచ్చుకోవడానికి ఇష్టంతో చదవాలని సూచించారు. పదోతరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం, పదో తరగతి తర్వాత చదవాల్సిన కోర్సుల ఎంపిక తదితర అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో బల్రాం, ట్రస్మా పట్టణ అధ్యక్షుడు టి.ఆనంద్‌రావ్, ప్రధాన కార్యదర్శి పి.రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారి కృష్ణమూర్తి, మాస్టర్ మైండ్స్ అధినేత మోహన్, ఆయా పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మనవి చేసే విఠల కీర్తనలు!
సత్గ్రంథం సాహిత్యమన్నా, కృష్ణదేవరాయలన్నా ప్రాణం పెట్టే మోదుగుల రవికృష్ణ తెలుగు సాహితీ చరిత్రపై లోతైన పరిశోధన చేసి, కొన్ని చక్కటి వ్యాసాలు రాశారు. వాటికే అందమైన పుస్తకరూపమిచ్చారు. పద్నాలుగు వ్యాసాలున్న ఈ చిన్నిపొత్తంలో సంగీత సద్గురు త్యాగరాజస్వామివారిపైన, నిఘంటు రచయిత బహుజనపల్లి సీతారామాచార్యులుపైన, సూర్యరాయాంధ్ర నిఘంటువుపైన, జానపద వాఞ్మయంపైనా చక్కటి పరిశోధన కనిపిస్తుంది. ‘బొబ్బిలియుద్ధం’ వ్యాసం చదువుతుంటే ఆ చారిత్రాత్మక ఘటన కళ్లముందు బొమ్మకడుతుంది. అన్నింటికీ మించి ‘విఠ్ఠలకీర్తనలు అన్నమయ్యవా?’ అంటూ పెట్టిన టైటిల్‌ని చూసి ముచ్చటేస్తుంది. రచయిత ప్రచురణకర్తగా మారి, తాను కొన్ని పుస్తకాలకు రాసిన ముందుమాటలను కూడా ‘మనవి మాటలు’ పేరుతో పుస్తకంగా మలిచారు. నేటితరానికి అందుబాటులో లేని కొన్ని మంచి గ్రంథాలను పునర్ముద్రించాలన్న తన లక్ష్యసాధనను త్వరలోనే చేరుకుంటారని ఆశిద్దాం. విఠ్ఠల కీర్తనలు అన్నమయ్యవా? పుటలు:128; వెల రూ. 80; మనవి మాటలు, పుటలు:149; వెల రూ. 80; రచయిత ఫోన్: 9440320580 - డి.వి.ఆర్. -
హ్యారీపోటర్ కుర్చీకి కోట్లలో డిమాండ్!
న్యూయార్క్: పురాతన, చారిత్రక నాణేలు, వస్తువులు, అపురూప చిత్రాలు, వజ్రాలు ఇలా కొన్ని ప్రత్యేక వస్తువులు వేలం పాటలో వేలు, లక్షల కోట్ల రూపాయల ధర పలకడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు కేవలం ఓ చెక్క కుర్చీ కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. అయితే దాని వెనుక ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని అలరించి, వేలాది కోట్ల రూపాయలు వసూలు చేసిన హ్యారీపోటర్ కథ ఉంది. అందుకే ఆ కుర్చీ అంత ధర పలికింది. హ్యారీపోటర్ సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది అభిమానులను ఆకట్టుకున్న బ్రిటిష్ రచయిత జెకె రోలింగ్ వాడిన కుర్చీ వేలంలో 2 కోట్ల 63 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. రోలింగ్ ఆ కుర్చీలోనే కూర్చొని హ్యారీపోటర్ లోని మొదటి రెండు వ్యాల్యూమ్ లు రాయడమే ఆ కుర్చీకి అంత డిమాండ్ రావడానికి కారణం. రోలింగ్ కు ఆమె తల్లి 1930 శకం నాటి ఓ మిస్ మ్యాచ్ కుర్చీని (ఇంట్లోని నాలుగు సరిపోలని కుర్చీల్లో ఒకదాన్ని) బహుమతిగా ఇచ్చిందట. న్యూయార్క్ లో నిర్వహించిన వేలంలో ఇప్పుడా ఓక్ కుర్చీ 2 కోట్ల 63 లక్షల రూపాయల ధర పలికినట్లు హెరిటేజ్ ఆక్షన్స్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఏభై ఏళ్ళ వయసున్న రచయిత రోలింగ్ 1997, 1998 ల్లో ప్రచురితమైన 'హ్యారీపోటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్', 'హ్యారీపోటర్ అండ్ ది ఛాంబర్ ఆఫ్ సీక్రెట్స్' రెండు సిరీస్ ను ఆ కుర్చీలోనే కూర్చొని రాసిందట. కుర్చీని ఆక్షన్ కు ఇచ్చిన రోలింగ్ తాను టైప్ రైటర్ ముందు కూర్చొనేందుకు అదే కుర్చీని వాడానని, నా రచనలకు ఆ కుర్చీ ఎంతో సహాయపడిందని తెలుపుతూ కుర్చీతోపాటు ఓ లేఖను కూడ రాసి ఇచ్చినట్లు ఆక్షన్ హౌస్ తెలిపింది. అయితే ఎంతో గుర్తుగా ఉన్న ఆ కుర్చీని వీడేందుకు చాలా బాధ అనిపించినా దాని అమ్మకం వెనుక అంతకంటే ప్రముఖమైన కారణం ఉందని తెలిపింది. గులాబీ, బంగారు, ఆకుపచ్చ రంగు పెయింట్ చేసిన పదాలతో అలంకరించిన ఆ కుర్చీని 2002 లో నేషనల్ సొసైటీకి విరాళంగా ఇచ్చినట్లు ఆమె తెలిపింది. మాంత్రిక జగతి, పురాణాలతో కూడిన పిల్లల సాహిత్యాన్నిరాసిన చరిత్ర ఆ కుర్చీకి ఉందని, అందుకే ఆ కుర్చీ అంతటి ప్రాముఖ్యతను పొందిందని ఆక్షన్ హౌస్ తెలిపింది. -
తొలిసారి ప్రపంచాన్ని చూశా..
అనుబంధం అల్లిబిల్లి పదాలతో అద్భుత అర్థాలను సృష్టించిన పాటల రచయిత అతడు. ఆయన కలమే ఓ విప్లవ గళమై నినదిస్తుంది.. అమ్మలా లాలిస్తుంది. ఆయనకు ఇన్ని భావాలను, అనుభవాలను నేర్పించింది మాత్రం ఈ మహానగరమేని చెబుతాడిప్పుడు. ఆయన చంద్రబోస్. ప్రముఖ సినీగీత రచయిత. వరంగల్ జిల్లాలోని ఓ గ్రామం చల్లగరిగ నుంచి వచ్చిన కుర్రాడు ఇప్పుడు భాగ్యనగరంతో పెనవేసుకుపోయాడు. నగరంపై ఆయన మమకారపు అనుబంధాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. - సాక్షి, సిటీబ్యూరో ‘1986లో హైదరాబాద్ వచ్చాను. అమ్మ, నాన్నల రక్షణ నుంచి అప్పుడే బయటకు రావటం. స్వతంత్రంగా హైదరాబాద్‌లో తిరగటం ప్రారంభమైంది. అప్పుడే తొలిసారి ప్రపంచాన్ని చూశాను. ఆకలి అనుభవం, ఒంటరితనం, అవమానం, దైన్యం, నైరాశ్యం ఇలాంటివన్నీ ఈ నగరంలో అనుభవించాను. కొంత కాలం తర్వాత సంపాదన, కీర్తి, విజయం, మానవత పొందాను. విభిన్న పార్శ్వాలు, ధ్రువాలు గల విశ్వనగరానికి సరైన నిర్వచనం హైదరాబాద్. ఇరానీ కేఫ్‌లో రూ. 2 సమోసాలతో పాటు పార్క్ హయత్‌లో రూ.3 వేల లంచ్ వరకు ఇక్కడ రుచి చూడవచ్చు. ఎంతో వైవిధ్యం ఉన్న నగరమిది. ఇక్కడ వాతావరణం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. నివాస యోగ్యమైన వాతావరణం. ఎలాంటి భయం లేని ప్రాంతం. ఇక్కడి భౌగోళిక వాతావరణం, ఉష్ణోగ్రత ఆరోగ్యకరంగా ఉంటాయి. హైదరాబాద్ అంటే ఒక్క ఊరు కాదు ఎన్నో ఊళ్ల (గ్రామాల) సమ్మేళనం. ఇక్కడ ఒక వైపు ఏపీ వారు, మరొక వైపు రాయలసీమవాసులు, తమిళులు, గుజరాత్, జైనులు, సిక్కులు, నేపాలీలు, కన్నడిగులు ఒక రేమిటి.. దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని భాషలు, సంస్కృతుల వారు ఇక్కడ ఉన్నారు. అది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో కలిసి కట్టుగా ఉండేందుకు స్థిర నివాసాలు ఏర్పరుచుకోవడం ఆశ్చర్యంగా ఉంటుంది. మంగా టిఫిన్ సెంటర్, గణపతి కాంప్లెక్స్‌ను ఆస్వాదించే వారు లక్షల్లో ఉన్నారు. మరోపక్క భారతదేశానికే ఆరోగ్య రాజధాని ఈ నగరం. సాఫ్ట్వేర్ రంగంలో మన స్థానం మనదే. ఇప్పుడు నగరం అభివృద్ధి మెట్రో కన్నా వేగంగా పరుగెడుతోంది. అన్ని వర్గాలు, మతాలు, అన్నీ పార్టీల ప్రజానీకాన్ని ఏకం చేసేది ఒక్కటే ఒక్కటి. అదే హైదరాబాద్ దమ్ బిర్యానీ’ అంటూ ముగించారు. -
క్లైమాక్స్ మిస్సయింది!
హ్యూమర్ ఫ్లస్ ఈ సంవత్సరం చేపల చెరువుల మీద గుర్నాధానికి భారీ నుంచి అతి భారీ లాభాలు వచ్చాయి. ఈ సంతోషంలో తన చిరకాల కోరిక ఒకటి గుర్తుకు వచ్చింది. సినిమా తీయాలనేది అతని చిన్నప్పటి కోరిక. తాను అమితంగా ఇష్టపడే ‘మిస్సమ్మ’ సినిమాను రిమేక్ చేయాలనుకొని రంగంలోకి దిగాడు. తన స్వగ్రామం పేరునే తన నిర్మాణ సంస్థకు పెట్టుకొని మురిసిపోయాడు.‘మునుగుడు పాలెం టాకీస్’....అబ్బో అదిరిపోయింది అనుకున్నాడు ఒకటికి రెండుసార్లు. థాయ్‌లాండ్‌లోని ‘షంగ్రీ-ల’ బీచ్ హోటల్లో స్టోరీ డిస్కషన్‌ను మొదలైంది. దీనికోసం హైదరాబాద్, అమరావతి ఉభయ రాష్ట్రాల నుంచి పెద్ద రచయితలను, పెద్ద రచయిత కావాలనుకుంటున్న చిన్న రచయితలను, పనిలో పనిగా ఘోస్టు రచయితలను కూడా తీసుకువచ్చాడు గుర్నాధం. ‘‘మిస్సమ్మ సినిమానే కదా మనం రిమేక్ చేస్తుంది. దీనికి స్టోరీ డిస్కషన్ ఎందుకు? కథను చెడగొట్టకుండా ఉన్నదున్నట్లు తీస్తేనే మంచిది’’ అన్నాడు సీనియర్ రచయిత కళ్లజోడు సవరిస్తూ. ‘‘ఉన్నదున్నట్లు తీస్తే రీమేక్ చేయడం ఎందుకు? పాత సినిమానే మళ్లీ విడుదల చేస్తే సరిపోతుంది. మన స్టైల్లో కథ ఉండాలనే ఈ స్టోరీ డిస్కషన్ ఏర్పాటు చేశాను’’ అన్నాడు రాబోయే కాలంలో కాబోయే టాప్ ప్రొడ్యూసర్ గుర్నాథం. మొదట యువ రచయిత ఇడ్లీ ఈశ్వర్నాథ్ కథ చెప్పడం మొదలు పెట్టాడు... ‘‘పాత మిస్సమ్మ సినిమాలో చిన్నప్పుడు సావిత్రి మిస్ అవుతుంది. మన సినిమాలో మాత్రం హీరో చిన్నప్పుడు పుష్కరాల్లో మిస్ అవుతాడు. ఇక అప్పటి నుంచి అతని పేరు మిస్సయ్యగా స్థిరపడిపోతుంది. మిస్సయ్య కోసం కోటీశ్వరుడైన అతని తండ్రి ప్రకాశ్‌రాజ్ వెదకని చోటు ఉండదు. పదహారు సంవత్సరాల తర్వాత... మిస్సయ్య ఆచూకీ కోసం పేపర్లో ప్రకటన ఇస్తాడు. ‘మిస్సయ్య...మోస్ట్ వాంటెడ్’ ప్రకటన చూసి ‘నేనే మిస్సయ్యను’ అంటూ ఒకడు వస్తాడు. ఎడమకాలు మీద చింతగింజంత పుట్టుముచ్చ చూసి, తన కొడుకే అని డిసైడై పోయి ఆనందంలో మునిగిపోతాడు ప్రకాశ్‌రాజ్. కథలో ట్విస్ట్ ఏమిటంటే, నెల తిరిగే లోపే ‘వాడు మిస్సయ్య కాదు...నేనే అసలు మిస్సయ్యను’ అంటూ డజను మంది మిస్సయ్యలు వస్తారు. పుట్టుమచ్చలు సేమ్ టు సేమ్. ప్రకాశ్‌రాజ్ తల పట్టుకుంటాడు. అసలు మిస్సయ్య ఎవరు అనేదే క్లైమాక్స్’’ ‘‘బానే ఉందిగానీ, ఆ ఒరిజినల్ మిస్సయ్యను ఎలా కనిపెట్టారు అనేది నువ్వే చెబితే ఓ పనై పోతుంది’’ అన్నాడు సీనియర్ రచయిత విసుగ్గా. ‘‘మీరు ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు రాశారు కదా...మీరు చెబితేనే బాగుంటుంది’’ అని బాంబును సీనియర్‌పై వేసి చేతులు దులుపుకున్నాడు జూనియర్. వారం రోజుల పాటు క్లైమాక్స్ కోసం చర్చలు జరిగాయి...నో ఫలితం! నిర్మాత గుర్నాధానికి చిర్రెత్తిపోయింది.‘‘మీరెవరూ వద్దయ్య...హాలివుడ్ ఫేమస్ స్క్రీన్‌ప్లే రైటర్ డేవిడ్ రాబ్సన్ డూప్సన్ను పిలిపిస్తున్నాను. పోతే పోయింది డబ్బు!’’ అని అన్నంత పని చేశాడు నిర్మాత.డబ్బు కట్టలు బ్యాగులో సర్దుకుంటూ ‘‘కథ ఏంటి?’’ అని అడిగాడు రాబ్సన్ డూప్‌సన్. నిర్మాత టకటకమని కథ చెప్పి...‘‘గంటలో స్క్రీన్‌ప్లే చెప్పేస్తారని మీకు పేరు. మా సినిమా క్లైమాక్స్ కోసం మాత్రం ఎంత టైమ్ తీసుకున్నా ఫరవాలేదు’’ అన్నాడు గుర్నాథం. ‘‘అయిదు నిమిషాల్లో చెప్పేస్తా...నీకేమైనా అభ్యంతరమా?’’ పొడవాటి సిగరెట్ ముట్టిస్తూ అన్నాడు డూప్‌సన్. ‘‘అంత కంటే భాగ్యమా’’ మెలికలు తిరిగాడు గుర్నాథం. ‘‘వెరీ సింపుల్...ఇప్పుడు ఎలా అనుకున్నారో అలాగే సినిమా తీసి విడుదల చేయండి. దీనికి ‘మిస్సయ్య...ది బిగినింగ్’ అని పేరు పెట్టండి. శుభం కార్డుకు బదులు... అసలైన మిస్సయ్య ఎవరో పార్ట్-2 ‘మిస్సయ్య...ది కన్‌క్లూజన్’లో చూడండి అని వేయండి. సినిమా హిట్ అయితే పార్ట్-2 గురించి, క్లైమాక్స్ గురించి ఆలోచిద్దాం. హిట్ కాకపోతే మాత్రం వేరే సినిమా గురించి ఆలోచిద్దాం’’ అని టైమ్ చూసుకున్నాడు డూప్‌సన్. తన టైమ్ బాగలేదని డిసైడైపోయాడు గుర్నాథం! -
నచ్చిన పది పుస్తకాలు
దీన్ని ‘నాకు నచ్చిన పది పుస్తకాల జాబితా’ అనే కన్నా ‘నాకు నచ్చిన పదిమంది రచయితల పుస్తకాల జాబితా’ అనాలి. తెలుగు నుంచి ఐదుగురూ, ఇంగ్లీషు నుంచి ఐదుగురూ ఉండేలా ఈ ఎంపిక చేశాను. త్రిపుర ‘కథలు’: పాఠకుణ్ని ఇంత చేరువగా తీసుకుని కథలు చెప్పిన రచయిత తెలుగులో మరెవరూ నాకు తగల్లేదు. ఎంత చేరువగా అంటే, పాఠకునితో తనకు ఒక ఇంటిమేట్ షేర్డ్ పాస్ట్ ఉన్నట్టు భుజం మీద చెయ్యేసి, కాబట్టి అన్నీ వివరించి చెప్పాల్సిన అవసరం లేదన్నట్టు గుసగుసగా గొణుగుతూ చెప్పే కథలవి. సోకాల్డ్ మహారచయితలెందరో రచనా సర్వస్వాలే రాసి సంపాదించుకోలేని గొంతు త్రిపుర ఈ కొన్ని కథల్లో సాధించుకున్నారు. కథల్లో నాకు బాగా నచ్చినవి ఈ క్రమంలో: ‘చీకటి గదులు’, ‘జర్కన్’, ‘ప్రయాణికులు’, ‘గొలుసులు -చాపం- విడుదల భావం’. పెద్దగా నచ్చని, త్రిపురతనం లేవని అనిపించే కథలు: ‘వలసపక్షుల గానం’ (సగం కథ కాఫ్కా అనువాదం), ‘హోటల్లో’, ‘సుబ్బారాయుడి రహస్య జీవితం’. అలాగే కొన్ని ఇంటర్వ్యూల్లో త్రిపుర చెప్పిందాన్ని బట్టి కాఫ్కాని నేనెందుకు ఇష్టపడతానో అందుకే ఇష్టపడిన మనిషి ఆయనే అనిపిస్తుంది. ఆయన ఆమోదముద్ర చూసింతర్వాతనే ఇ్ఛజ్ఛీ, ఓ్ఛటౌఠ్చఛి లాంటి రచయితల్ని పరిచయం చేసుకున్నాను. వీలుండీ ఆయన్ని కలవలేకపోవటం ఒక పెద్ద లిటరరీ రిగ్రెట్. చలం ‘అమీనా’: చలం కథకునిగా కన్నా కూడా వ్యక్తిగా ఎక్కువ ఇష్టం. అయితే, చలంలోని కథకుడు నాకు బాగా నచ్చిన చోటు మాత్రం ‘అమీనా’నే. పైన ‘పాఠకుణ్ని చేరువగా తీసుకుని కథ చెప్పడం’ అన్నానుగా- అది చలం ఈ రచనలో చేసినట్టు ఎక్కడా చేయలేదు. ఇక్కడ చలం మొపాసా కాదు, డీహెచ్ లారెన్సు కాదు, ఠాగూరూ కాదు; ఇక్కడ చలం చలమే! ఈ పుస్తకం గురించి బ్లాగులో రాశాను.http://loveforletters.blogspot.in/2011/05/blog-post_06.html. శ్రీపాద ‘అనుభవాలూ జ్ఞాపకాలూను’: I like it for its poetry, music & language. నాకాయన అభిప్రాయాలూ అవీ పెద్దగా ఏం పట్టలేదు. ఇందులో కనపడిన జీవితం నచ్చింది. ఆ జీవితాన్ని చెప్పటంలో ఆయన భాష నచ్చింది. కామా తర్వాత కామాకి ఒక్కో పైసంగతి వేస్తూ ఆయన వాక్యాన్ని సంగీతమయంగా సాగించే పద్ధతి బాగుంటుంది. తెన్నేటి సూరి ‘చంఘిజ్ ఖాన్’: ఈ పుస్తకం పట్ల నాకున్నది సెంటిమెంటల్ వాల్యూ అని చెప్పాలేమో. అమ్మకి ఏదో ఊరు బదిలీ అయినప్పుడు ఈ పుస్తకాన్ని లైబ్రరీ డిపాజిట్ వదిలేసి దగ్గర ఉంచేసుకుంది. నాకు ఊహ తెలిసినప్పణ్నించీ ఇంట్లోనే ఉంది. చాలాసార్లు చదివాను. ‘సూటూ బోడ్గా బట్ టెంగ్రీ టెమూజిన్ ఖాఖాన్’ అని అరుస్తూ, కత్తి ఒర (మొలతాడు) లోంచి తాతయ్య పడక్కుర్చీ కర్ర బయటకు లాగి, పోలోమంటూ వెళ్లి ఏ బియ్యంబస్తా మీదో, కొబ్బరిమాను మీదో పడి కత్తిపోట్లు పొడవటం లాంటి ఎన్నో హీరోయిక్ డీడ్స్‌కి కావాల్సిన ఇమేజినేషన్ని మెదడులో నింపిందీ పుస్తకం. నామిని ‘నా కుశల నా మనేద’: The whole of Namini is the perfect sum of his writings. అంతగా సాహిత్యానికి తన్ను తాను ఇచ్చేసుకున్నాడు. ఈ ‘నా కుశల నా మనేద’ అనేది వైకుంఠం గీసిన ముఖచిత్రంతో ఇటీవల వెలువడిన ఎడిషన్‌లో కొత్తగా చేర్చిన రచన. ఐ్ట’ట ్చ ౌజ ఝఠటజీజ ౌఠ్ఛిట ఛ్ఛ్చ్టీజి. మిగతా నామిని రచనలన్నీ చిన్న నిడివిగల ప్రదర్శనలు (నవలల్ని మినహాయించి). కానీ దాదాపు యాభై పేజీల ఈ రచన మాత్రం ఒక శాక్సాఫోన్ ఆర్టిస్టు ఒకే ఎమోషనల్ కంటెంటును ఎక్కడా తడబాటు లేకుండా, ఎక్కడా సాగదీసినట్టు అనిపించకుండా పలికించిన పాటలాగా భలే సాగుతుంది. ఓ్చజజ్చు ఈజ్చీటజ్ఛీట: నేనీ పుస్తకాన్ని దొబ్బుకొచ్చాను, కానీ ఎప్పుడూ పశ్చాత్తాపపడలేదు. ప్రపంచపు ప్రాణమయ సారాంశానికి మన జీవితాన్ని ఎంత దగ్గరగా తీసుకెళ్లచ్చో చెప్పిన పుస్తకం; సాహిత్యాన్ని ఎంత దగ్గరగా తీసుకెళ్లచ్చో కూడా చెప్పిన పుస్తకం. ఈ పుస్తకాన్ని వరుసగా చదవక్కర్లేదు. పూర్తిగా కూడా చదవక్కర్లేదు. మనలో కాఫ్కా అంశ ఏదైనా ఉంటే అదే ఖాళీల్ని పూరించుకుంటుంది, మిగతాది తనకు తానే రాసుకుంటుంది. Flaubert 'Sentimental Education': ‘‘నా తరం మనుషుల మోరల్ హిస్టరీ రాయాలనుకున్నాను’ అని చెప్పుకున్నాడు ఫ్లాబె ఈ రచన గురించి. నా వరకూ ఇది నా ఆత్మ తాలూకు రొమాంటిక్ హిస్టరీ అనిపిస్తుంది. ‘దీవిలో ఒంటరిగా చిక్కుబడిపోతే దగ్గరుండాలనుకునే పుస్తకాల జాబితా’ అంటారు కదా, అలా రెండే పుస్తకాలు పట్టుకెళ్లే వీలుంటే ‘కాఫ్కా డైరీ’లతో పాటూ ఈ పుస్తకాన్నీ తీసుకువెళ్తాను. ఎందుకంటే, ఫ్లాబె ఈ పుస్తకాన్ని ఎలాగో జీవితమంత సంక్లిష్టంగానూ నిర్మించగలిగాడు. పుస్తకంలో ఎన్నో మూలల్ని అలా చదివి వదిలేయక పట్టి ఊహించుకుంటే ఇంకెన్నో కథలు ఆవిష్కృతమవుతాయి. Borges 'Selected Nonfiction': జీవితమనేది కాఫ్కాకి రాయటం కోసం ఒక సాకు ఐతే, బోర్హెస్‌కు చదవటం కో ఒక పాఠకుని జీవితం కూడా ఈక్వల్‌గా సృజనాత్మకమనీ, స్వయం సమృద్ధమనీ చెప్తుంది బోర్హెస్ నాన్ ఫిక్షన్. ఆయన కాల్పనిక రచనలు కూడా పఠనాజీవితం మధ్యలో పఠనం ఆధారంగానే ఆడుకున్న ఆటల్లాంటివి. Dostoevsky 'Brothers Karamazov': For the sheer feverish absorption it induces in the reader. దేవుడు చచ్చిపోయాడని టెంకిజెల్ల కొట్టినట్టు చెప్పి జీవితపు ఎసెన్సిషయల్ ఏకాకితనానికీ, ఏడ్చే మూలలేనితనానికీ సంసిద్ధపరచిన పుస్తకమిది. ఇవాన్ కరమజవ్ని మనలో గుర్తించటం, లేదా అతన్ని మనమీదకు ఆవహింపజేసుకోవటమూ ఒక శాపం. Salinger 'Franny And Zooey': అమాయకత్వం చేయి వదిలి, కాపట్యపు రద్దీ మధ్య దారి తప్పి దిక్కుతోచక, తిరిగి జ్ఞానరాహిత్యపు సాంత్వన కోసం అంగలార్చే శరణార్థి రచనలు శాలింజర్వి. అలాగే ఆయన వచనాన్ని చదవటం అంటే చెక్కిన వజ్రాన్ని వేళ్ల మధ్య ఎత్తిపట్టుకుని లోపలి ప్రతిఫలిత వర్ణకేళిని చూడటం లాంటిది. ఆయనలోని ఈ రెండు అంశాల పక్వదశ ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ఒక పాఠకుని జీవితం కూడా ఈక్వల్‌గా సృజనాత్మకమనీ, స్వయం సమృద్ధమనీ చెప్తుంది బోర్హెస్ నాన్ ఫిక్షన్. మెహెర్ రచయిత -
మొక్కే కదా అని పీకేస్తే...
పంచ్ శాస్త్ర ‘నువ్వు నాకో హీరోను చూపెట్టు. నీకు క్షణాల్లో... ట్రాజెడి రాసిస్తా’ అన్నాడొక అమెరికన్ రచయిత. హీరో అంటే... కొండంత ధైర్యం. కొండను పిండి చేసే సాహసం. కళ్లతో శత్రువును దెబ్బతీసే నైపుణ్యం. మరి అలాంటి హీరోను పట్టుకొని ‘ట్రాజెడి రాస్తానంటాడేమిటి? కామెడీ కాకపోతే!’ అనుకోవద్దు. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ట్రాజెడి ఎంత పండితే, హీరో ధీరత్వం, శూరత్వం అంతగా పండుతాయి. పంచ్లైన్లు అంతగా పండుతాయి. అటు చూడండి తన అనుచరులతో ఇంద్రసేనారెడ్డి సునామీలా వీరశంకర్రెడ్డి ఇంటివైపుకు దూసుకొస్తున్నాడు. ఈ వీరశంకర్రెడ్డి విషకుట్రలో... ఇంద్రసేనారెడ్డి తన కుటుంబాన్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలా మిగిలాడు. రగులుతున్న అగ్నిపర్వతంలా మిగిలాడు. ఇప్పుడు ఆ అగ్నిశిఖ శత్రువు ఇంటి ముందుకు వచ్చింది. శత్రువు ఇంటి ముందుకు ఇంద్రసేనారెడ్డి ఎందుకు వచ్చాడు? చంపేయడానికా? కాదు... ‘కన్న కొడుకును ఎందుకు చంపేశావురా?’ అని నిలదీసి నిప్పుల వర్షం కురిపించడానికి వచ్చాడు. వీరశంకర్రెడ్డి తన కన్నకొడుకును ఎందుకు చంపుకున్నాడు? తన కొడుకును... శత్రువైన ఇంద్రసేనారెడ్డి రక్షించినందుకు!! ఇంద్రసేనారెడ్డి గర్జిస్తున్నాడు... ‘వీర శంకర్ రెడ్డీ.... ఏం చూసి పెట్టాడురా నీకు నీ అయ్య ఆ పేరు? పసిబిడ్డను చంపుతావనా? నా మీద కనురెప్ప ఎత్తే ధైర్యమైనా లేక పసిబిడ్డ మీద కత్తి దూస్తావా?’ ఇంద్రసేనారెడ్డి భుజం మీద రక్తసిక్తదేహంతో శవమై పోయిన పసిబిడ్డ- ‘‘నాన్నా నేనేం పాపం చేశానని... చంపేశావు?’’ అని వీరశంకర్రెడ్డిని మౌనంగా అడుగుతున్నాడు. ఆ పసిబిడ్డ తల్లి దుఃఖసముద్రమై రోదిస్తోంది. భుజం మీద ఉన్న పసిబిడ్డ శవాన్ని రెండు చేతుల్లోకి తీసుకుంటూ ఇంద్రసేనారెడ్డి ఆ బిడ్డ తల్లితో అంటాడు ‘అమ్మా... ఈ చేతులు కాపాడడం వల్ల నీ బిడ్డ దూరమైతే.... నన్ను క్షమించమ్మా...’ వీరశంకర్రెడ్డి అరుస్తున్నాడు... ‘నా బిడ్డను నేను చంపుకున్నా...మీకేంది రా బాధ?’ వీరశంకర్రెడ్డి చెంప చెళ్లుమనలేదుగానీ, అంతకంటే ఎక్కువ శక్తి ఉన్న ఒక డైలాగ్ అతని చెంప చెళ్లుమనిపించలా ఇంద్రసేనారెడ్డి నోటి నుంచి దూసుకొచ్చింది... ‘నీ బిడ్డా... నువ్వు కన్నావా మోశావా?పెంచావా? రేయ్... నిన్ను పొడిస్తే అమ్మా అంటావు. ఇప్పుడు ఆ అమ్మ కడుపులోనే పొడిచావు. నీకు, నీ తమ్ముళ్లకు కత్తిగాయం ఎలా ఉంటుందో తెలుసు. ఓ తల్లికి గుండెగాయం అయితే, ఆ తల్లి పేగులకు గాయమైతే ఎలా ఉంటుందో తెలియదు. భర్త పోతే తన పసుపుకుంకుమలను పోగొట్టుకునే స్త్రీ తన బిడ్డ పోతే తన సర్వస్వం కోల్పోయి కుమిలి కుమిలి ఏడుస్తుంది చూడరా’’ ఆవేశస్థాయిని ఆర్ద్రత స్థాయికి తీసుకెళ్లి ఆ తల్లి వైపు తిరిగి ఇంద్రసేనారెడ్డి అంటాడు- ‘చూడమ్మా-నీకు నీ కొడుకు ఆకారం దూరమైందేగానీ, ఆత్మ ఈ తులసి మొక్కలో ఉంది.బాగా నీళ్లు పోసి పెంచు... పెరిగే ఈ మొక్కను చూస్తే ఎదుగుతున్న నీ కొడుకు గుర్తుకు రావాలి. అతనికి తను చేసిన పాపం గుర్తుకు రావాలి. నిద్ర పోయే ముందు... నిద్ర లేచే ముందు... అన్నం తినే ముందు ఆరు బయకు పోయే ముందు.... ఆ మొక్కకు మొక్కాలి. కాదని అడ్డంగా వాదించి ఎండ బెడితే మీ అందరికీ పాడె కడతా’ ఈ మాటలతో శత్రువుల గుండెలు వణికాయి. ఆ వణుకును తారస్థాయికి తీసుకెళ్లడానికి అన్నట్లు... ఇంద్రసేనారెడ్డి వెళుతూ వెళుతూ అంటాడు - ‘వీర శంకర్ రెడ్డి మొక్కే కదాని పీకేస్తే పీక కోస్తా!’ పంచ్శాస్త్రను పరాకాష్ఠకు తీసుకెళ్లిన ఈ డైలాగు ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంది. -
ఈ విషయం చాలామందికి తెలీదు...
హిట్ క్యారెక్టర్ ‘చిత్రం భళారే విచిత్రం’ సినిమా పేరు చెప్పగానే బ్రహ్మానందం చేసిన బ్రహ్మం పాత్ర గుర్తుకొచ్చి తీరాల్సిందే. బ్రహ్మానందం టాప్‌టెన్ కేరెక్టర్స్‌లో ఇది కనుక పెట్టకపోయుంటే ‘నీ ఎంకమ్మా...’ అని మనం తిట్లు తినాల్సిందే! చిత్రం... భళారే విచిత్రం! (1992) డెరైక్ట్ చేసింది: పీయన్ రామచంద్రరావు సినిమా తీసింది: ఆర్వీ విజయ్ కుమార్ మాటలు రాసింది: తోటపల్లి మధు బ్రహ్మం మామూలు తిండిపోతు కాదు... వీర మహా తిండిపోతు. ఓ రకంగా బకాసురుడికి జిరాక్సు కాపీ. కిచెన్లోకెళ్తే ప్రపంచమే మరిచిపోతాడు. రూమ్మేట్స్కి వంట చేసిపెట్టడమే అతని తక్షణ కర్తవ్యం. నోరిప్పితే చాలు తిండిగోలే. అనగనగా ఓ బ్యాచ్‌లర్ రూమ్. ఓనర్ జి.గరుడాచలం కన్నుగప్పి ఇద్దరుంటామని చెప్పి నలుగురు తిష్ట వేస్తారక్కడ. నలుగురూ నాలుగు రకాలు. వీళ్లల్లో బూందీ బ్రహ్మానందం మాత్రం సమ్‌థింగ్ స్పెషల్. ఇంటి పేరు నిలబెట్టిన ఘనుడతడు. మన బ్రహ్మానికి చిర్రెత్తిపోతే చాలు... ‘‘మా తాతగాడు అలా చేసుండకపోతే నాకీ కర్మ పట్టి ఉండేది కాదు’’ అని ఆక్రోశిస్తుంటాడు. ఇంతకూ వాళ్ల తాత ఏం చేశాడో, ఏం చేయలేదో అని తెగ క్యూరియాసిటీ వచ్చేస్తుంది కదూ. నిజంగానే వాళ్ల తాతకు అంత దృశ్యం లేదు. వాళ్ల తాత బిర్లాలా బిజినెస్ చేసుంటే, ఈ బ్రహ్మంగాడు మైసూర్ మహారాజులాగా బతికేసేవాడట. అదండీ వాడి బాధ. ఈ వెధవ జీవితాన్ని... ఛండాలపు లైఫ్‌ని... దరిద్రపు జిందగీని ఎన్నాళ్లు అనుభవించాలన్నదే వాడి చింత. అయ్యయ్యో... అసలు విషయం మరిచిపోయాం. ఈ బ్రహ్మంగాడికి ఇంకో పిచ్చి కూడా ఉందండోయ్. అది మామూలు పిచ్చి కాదు. భక్తి పిచ్చి. దేవుడు ఫొటో కనిపిస్తే చాలు పూనకం వచ్చేస్తుంది. ముద్దులు పెడుతూ... చేతులూపుతూ... చప్పట్లు కొడుతూ పులకించి పోతుంటాడు. ఇతని సంగతి తెలిసినవాళ్లకు ఓకే గానీ, తెలియని వాళ్లు మాత్రం చాలా అపార్థం చేసేసుకుంటారు. ఒకాయనైతే తన పెళ్లాన్ని పిలుస్తున్నాడనుకుని కొట్టినంత పనిచేసేశాడు. ఈ బ్రహ్మంగాడికి అక్క లేదు కానీ, తిక్క ఉంది. చీటికీ మాటికీ ‘నీ ఎంకమ్మా...’ అనే ఊతపదం వాడుతూ తన అసహనాన్ని టన్నుల కొద్దీ ప్రదర్శిస్తుంటాడు. దోమ కుట్టనివాడు ఎవడైనా ఉంటాడేమో కానీ, ప్రేమ కుట్టనివాడు ఎవ్వడూ ఉండడు. మన బ్రహ్మమైనా అంతే మరి. ఆ రోజు ఏం జరిగిందంటే - పార్కు దగ్గర వేరుశెనక్కాయల బండి కనబడుతుంది. నోరూరిపోతుంది మన వాడికి. పావలాకో రూపాయికో కొనుక్కుని తింటే జిహ్వ చాపల్యం తీరి చావదాయె. అందుకే హోల్‌సేల్‌గా బండి మొత్తం బేరమాడతాడు. ఈలోగా గజలక్ష్మి వచ్చి మొత్తం కొని పారేస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే మన బ్రహ్మానికి కళ్లు చెదిరిపోతాయ్. గుండె అదిరిపోతుంది. బాపు బొమ్మలాగా... సారీ... కుదేసిన బస్తాలాగా... ఆవిరి కుడుములాగా ఇంతటి అందం... మందం ఉన్న అమ్మాయి ఈ సిటీలో ఉందని నాకిన్నాళ్లూ తెలియలేదే అని తెగ వాపోతాడు. మొత్తానికి వేరుశెనక్కాయల బండి కలిపింది ఇద్దర్నీ. ఓ మంచి బెంచీ చూసుకుని... ఇద్దరూ ఎదురూ బొదురూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ వేరుశెనక్కాయలు తింటుంటారు. ‘‘బైదిబై... మిరియాల చారుమీద మీ అభిప్రాయం’’ అడుగుతాడు బ్రహ్మం. గజలక్ష్మి చాలా ముద్దుగా ‘‘బెల్లం వేస్తే ఇష్టం’’ అంటుంది. ‘‘ఐసీ... మరి చిక్కుడు కాయ పులుసులో టమోటా కలిపితే?’’ ‘‘బెల్లం వేస్తే ఇష్టం’’ ‘‘వంకాయను చీరి, కొబ్బరి కూరి లైట్‌గా నెయ్యిలో వేస్తే?’’ ‘‘బెల్లం వేస్తే ఇష్టం’’ ‘‘బెల్లం అంటే అంతిష్టమా?’’ ఫైనల్‌గా అడుగుతాడు బ్రహ్మం. గజలక్ష్మి తన కళ్లను గారెల్లాగా తిప్పుతూ ‘‘బెల్లమంటే ప్రాణం’’ అంటుంది. కళ్లూ కళ్లూ ప్లస్సు... వాళ్లూ వీళ్లూ మైనస్... అన్న రీతిలో బ్రహ్మం, గజలక్ష్మిల ప్రేమ 360 చెకోడీలు, కిలోన్నర పకోడీలుగా వర్థిల్లడం మొద‘లవ్’తుంది. బ్రహ్మచారులకి రూము దొరకడం గగనం కాబట్టి... ఫ్యామిలీ అని అబద్ధమాడి మన బ్రహ్మంతో సహా అతని ఫ్రెండ్స్ అందరూ తలా ఒక వేషం వేస్తారు. మన బ్రహ్మం మాత్రం మావగారి వేషం. సాదాసీదా మావగారు కాదండోయ్. మేడిన్ అమెరికా. ‘రక్త కన్నీరు’ నాగభూషణం తరహాలో ‘‘అమెరికాలో అయితే ఓకే... ఇండియాలో అయితే ఎలా?’’ అంటుంటాడు చీటికీ మాటికీ. ఆత్మకూరు, అమలాపురం కూడా తెలీని మన బ్రహ్మంగాడు అమెరికా గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? జస్ట్ ఒకసారి ఊహించుకోండి. అటువైపు ప్రేమ తిప్పలు... ఇటు వైపు రూము తిప్పలు... ఫైనల్‌గా బ్రహ్మం కథ సుఖాంతమవుతుంది.బ్రహ్మంతో గజలక్ష్మి పెళ్లికి వాళ్ల నాన్న ఓకే అంటాడు. లడ్డూలో జీడిపప్పులాగా - పెసరట్టులో ఉప్మాలాగా -ఉల్లిగారెలో అల్లం చట్నీలాగా - ఇద్దరూ కలిసిపోతారు. దాంతో ‘శుభం’ కార్డు పడుతుంది. - పులగం చిన్నారాయణ పాపులర్ డైలాగ్ ‘‘కొత్తావకాయా... అయ్యో... అదంటే నాకు ప్రాణం. అమెరికాలో అదే ఫాలో అయ్యేవాణ్ణి. బ్రేక్‌ఫాస్ట్‌లో అవకాయ బద్ద... లంచ్‌లో ఆవకాయ బద్ద... డిన్నర్లో ఆవకాయ బద్ద...’’ నా స్థాయిని పెంచిన పాత్ర కమెడియన్‌గా నా స్థాయిని పెంచిన పాత్ర ఇది. ‘నీ ఎంకమ్మ’ అనే ఊతపదాన్ని ఇప్పటికీ జనాలు మరిచిపోలేదు. ఈ సినిమా సెకండాఫ్‌లో నేను మహానటులు నాగభూషణం గారిని ఇమిటేట్ చేశాను. ఈ సినిమా చూసి ఆయన స్వయంగా ఫోన్ చేసి మరీ మెచ్చుకున్నారు. ఆ ప్రశంసను ఎప్పటికీ మరచిపోలేను. - బ్రహ్మానందం ఈ విషయం చాలామందికి తెలీదు... ఓ మరాఠీ సినిమా నచ్చి, దాని ఆధారంగా సినిమా తీయాలనుకున్నారు దర్శకుడు పీఎన్ రామచంద్రరావు. పెళ్లిసందడి, ప్రేమపురాణం నాటికలు మిక్స్ చేసి ఈ స్క్రిప్టు రాశా. ఈ నాటికలు రాసింది నేనే. గిరిబాబు చేసిన డిపార్ట్మెంటల్ స్టోర్స్ ప్రొప్రయిటర్ పాత్ర, ‘గాడిద గుడ్డు’ అనే ఊతపదం ‘పెళ్లిసందడి’లోనిదే. ఇక ‘ప్రేమపురాణం’ నాటికను మద్రాసులో కళాసాగర్ సంస్థ ఆధ్వర్యంలో ఉగాదికి ప్రదర్శించాం. నేను బూందీ బ్రహ్మానందం పాత్ర చేశాను. దాన్నే ఈ సినిమాలో పెట్టాం. మేం విజయవాడలో ఉన్నప్పుడు గుండు హనుమంతరావు మా దగ్గరకొచ్చి మిమిక్రీ చేసేవాడు. అందులో దేవుళ్ల పిచ్చి ఐటమ్ బాగా పేలేది. దాన్నే ఈ సినిమాలో ఉపయోగించా. ద్వితీయార్ధంలో బ్రహ్మానందం ఓల్డ్ గెటప్‌కు రావు గోపాలరావు ఇమిటేషన్ పెడదామనుకున్నారు. నేనేమో ‘రక్తకన్నీరు’ నాగభూషణం పేరు చెప్పా. బ్రహ్మనందం కూడా రావుగోపాలరావు ఇమిటేషనే పెడదామన్నారు. దాంతో సాయిబాబా బొమ్మ ముందు రెండు చీటీలు రాసి బ్రహ్మానందంతో తీయిస్తే, నాగభూషణం పేరు వచ్చింది. ఇక్కడ నేను చేసిన చిట్కా ఏమంటే - రెండు చీటీల్లోనూ నాగభూషణం పేరే రాశాను. ఈ నాగభూషణం ఇమిటేషన్‌కు బ్రహ్మానందంకు మిమిక్రీ నాగేశ్వరరావు డబ్బింగ్ చెప్పారు. ఈ విషయం చాలామందికి తెలియదు. ‘కృష్ణా జిల్లాలో లారీ క్లీనర్లు ఎక్కువగా ‘నీ ఎంకమ్మా’ అనే ఊతపదం వాడుతుంటారు. రాజశేఖర్ నటించిన ‘పాప కోసం’లో బ్రహ్మానందంది లారీ క్లీనర్ పాత్ర. దానికి ‘నీ ఎంకమ్మా’ అనే ఊతపదం పెట్టా. ఆ సినిమా ప్లాప్ కావడంతో ఊతపదం పేలలేదు. అందుకే ఇందులో పెట్టా. - తోటపల్లి మధు, రచయిత -
సగటు మహిళే నా నాయిక
‘కల్పనా సాహిత్యం- రచయిత్రుల కృషి’ సదస్సులో ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సాక్షి, హైదరాబాద్: నాకు ఏ పుస్తకాలూ, కవులూ ప్రేరణ కాదు. సగటు మహిళ త్యాగం, శ్రమ, ఆమె జీవితమే నా రచనలకు ప్రేరణ. నా కథలు, నవలల్లో నాయిక ఆమే’’ అని సుప్రసిద్ధ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి తెలిపారు. ‘సెక్రటరీ’, ‘మీనా’, ‘జీవన తరంగాలు’ లాంటి ప్రసిద్ధ నవలల ద్వారా కొన్ని తరాలను ఉర్రూతలూపిన యద్దనపూడి చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సాహితీ ప్రియుల ముందుకు వచ్చి తన మనసులోని మాటలను పంచుకున్నారు. శనివారం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో ‘కల్పనా సాహిత్యం - రచయిత్రుల కృషి’ అనే అంశంపై వర్సిటీలోని మహిళా అధ్యయన కేంద్రం, రచయిత్రులే సభ్యులుగా నడుస్తున్న మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థ ‘లేఖిని’ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో యద్దనపూడి ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘అప్పట్లో కొంతమంది వంటింటి సాహిత్యం అంటూ స్త్రీల రచనల్ని చిన్నచూపు చూసేవారు. ఆ మాటలకు భిన్నంగా పాఠకులు ఈ రచనలను బాగా ఆదరించారు. అది నాపట్ల, నా రచనలపట్ల ప్రేమానుబంధంగా పరిణమించింది. నేను ఉమ్మడి కుటుంబంలో పుట్టాను. కథలు రాయడం మొదలుపెట్టాక ఆ ఇల్లే నాకు విస్తృత సమాజంగా అనిపించేది. నేను చదివింది పదే అయినా చూసిన విషయాలు, నా చుట్టూ ఉన్న మనుషుల జీవితాలతోనే మమేకమయ్యాను. అవే నేను రాశాను. నా కలానికి సగటు గృహిణే పెద్ద బలం. నేను, నా పాఠకులు, నా ప్రచురణకర్తలు.. ఇదొక త్రివేణీ సంగమం’’ అని యద్దనపూడి తన రచనా జీవితాన్ని ఆవిష్కరించారు. స్త్రీల రచనలే సమాజానికి మేలు చేశాయి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొంటూ ‘‘ఈనాడు కవిత్వంకన్నా ఎక్కువ మేలు చేస్తున్నది కథలే. స్త్రీల రచనలు ‘వంటింటి కథలు’ కాదు. అవి ఇంటింటి కథలు’’ అని వ్యాఖ్యానించారు. రచయిత్రుల రచనలు ప్రారంభమై వందేళ్లు గడచినా వాటిపై తగినంత చర్చ జరగడం లేదనీ, అందుకే నిరుడు తెలంగాణ రచయిత్రుల సదస్సు చేసినట్లే, ఈసారి ఈ ప్రయత్నం చేస్తున్నామని మహిళా అధ్యయన కేంద్రం సంచాలకులు, రచయిత్రి సి.మృణాళిని తన అధ్యక్షోపన్యాసంలో పేర్కొన్నారు. సాహితీవేత్త ఆచార్య సుమతీ నరేంద్ర కీలకోపన్యాసం చేస్తూ పత్రికల్లో వచ్చే యద్దనపూడి తదితరుల రచనలను ముందుగా చదవడం కోసం ఆ రోజుల్లో పాఠకుల్లో నెలకొన్న పోటీ వాతావరణాన్ని గుర్తుచేశారు. స్త్రీల రచనలపై వచ్చిన విమర్శల్ని తిప్పి కొడుతూ, ‘‘స్త్రీల రచనలు అమ్మల మనోభావాలనూ, ఉద్యోగినుల సమస్యలనూ, బాల వితంతువుల సమస్యలనూ, ఇష్టంలేని భర్తతో కాపురం చేస్తున్న స్త్రీల వేదనలనూ ప్రతిబింబించాయి. సెక్స్, క్రైమ్, మూఢనమ్మకాలే ప్రధానాంశాలుగా రాసిన నవలలకన్నా ఇవే మెరుగైనవి, సమాజానికి మేలు చేసినవి’’ అని సుమతీ నరేంద్ర విశ్లేషించారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త ముదిగంటి సుజాతారెడ్డి మాట్లాడుతూ, స్త్రీల సాహిత్య ఆవిర్భావం నుంచి 1960ల దాకా సాగిన కృషిని సమీక్షించారు. ‘లేఖిని’ అధ్యక్షురాలు, రచయిత్రి వాసా ప్రభావతి మాట్లాడుతూ ‘‘తెలుగు సమాజాన్ని ఉన్నత స్థాయికి తెచ్చింది రచయిత్రులే’’ అన్నారు. ఈ సదస్సు ద్వారా 1960ల మొదలు ఇప్పటివరకు వచ్చిన స్త్రీల సాహిత్యంపై సింహావలోకనం జరుపుతున్నట్లు తెలిపారు. గౌరవ అతిథిగా హాజరైన కథా రచయిత ఏఎన్ జగన్నాథ శర్మ మాట్లాడుతూ తన రచనా నేపథ్యానికి బీజం వేసింది మహిళలు, మహిళల సాహిత్యమేనన్నారు. రచయిత్రుల సందడి ప్రముఖ రచయిత్రులు డి.కామేశ్వరి, పొత్తూరి విజయలక్ష్మి, డి.శారదా అశోకవర్ధన్, ముక్తేవి భారతి, శాంతకుమారి, కె.బి. లక్ష్మి, సోమరాజు సుశీల తదితరులతోపాటు రచయితలు శ్రీపతి, వేదగిరి రాంబాబు, సుధామ, సుద్దాల అశోక్‌తేజ హాజరవడంతో సభా ప్రాంగణం సాహితీ పరిమళాలు వెదజల్లింది. రామలక్ష్మీ ఆరుద్ర, రంగనాయకమ్మ, అబ్బూరి ఛాయాదేవి, నాయని కృష్ణకుమారి, ఆనందారామం తదితర 15 మంది ప్రముఖ రచయిత్రుల రచనలను విశ్లేషిస్తూ మరో 15 మంది రచయిత్రులు పత్రాలను సమర్పించడం ఈ సదస్సును సాధారణ సమావేశాలకన్నా భిన్నంగా నిలిపింది.