అరుంధతీ రాయ్
‘నోరు లేనివాళ్లు ఉండరు. నోరు మెదపని వాళ్లే ఉంటారు..’ అంటారు అరుంధతీ రాయ్. ప్రస్తుతం జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు రాయ్. ప్రభుత్వం అయితే మాత్రం! మనకు అనంగీకారాలు ఉండకూడదా? మనం నోరెత్తకూడదా.. అని ప్రశ్నిస్తున్నారు.
అరుంధతీ రాయ్ రచయిత్రి. 1997లో ఆమె రాసిన తొలి నవల ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’తోనే ఇప్పటికీ ఆమె గుర్తుకు వస్తారు. ముఖ్యంగా ఆమె ఉద్యమ రచయిత్రి. మార్పు కోసమే ఆమె చేసే ప్రతి రచనా, రాసే ప్రతి వ్యాసం, మాట్లాడే ప్రతి మాటా! ఆమెను గుర్తు చేసే అంతకుముందరి విషయం మరొకటి కూడా ఉంది. 1989లో ‘ఇన్ విచ్ యానీ గివ్స్ ఇట్ దోజ్ వన్స్’ అనే టీవీ చిత్రానికి స్క్రీన్ ప్లే రైటర్‌గా ఆమెకు జాతీయ అవార్డు వచ్చింది. ఆ అవార్డును 2016లో ఆమె ప్రభుత్వానికే తిరిగి ఇచ్చేశారు! దేశంలో పెరిగిపోతున్న మతపరమైన అసహనాన్ని నిరసిస్తూ ఆమె అలా చేయడం కూడా రాయ్‌ని సామాజిక బాధ్యత స్వీకరించిన రచయిత్రిగా నిలబెట్టింది. తాజాగా ఆమె సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించడంతో మళ్లీ వార్తల్లోకి వచ్చారు.
‘‘పోరు జరుగుతున్నప్పుడు, ఆందోళన వ్యక్తం అవుతున్నప్పుడు, ప్రదర్శనల నినాదాలు మిన్నంటుతున్నప్పుడు, కొందరు చనిపోతున్నప్పుడు.. మౌనం వహించడం నేరం’’ అంటారు అరుంధతీ రాయ్. ఇప్పుడు ఆమె మాట్లాడుతున్నది కచ్చితంగా రైతు ఉద్యమం గురించే. నోరు విప్పని ప్రముఖుల గురించే. పౌరస్వేచ్ఛను, మానవ హక్కులను రాజకీయ నిర్ణయాలు ఎలా ధ్వంసం చేస్తున్నాయో ఒక సామాజిక, ఉద్యమ కార్యకర్తగా ఆమె నిరంతరం తన వ్యాసాలలో, ప్రసంగాలలో వివరిస్తూ ఉంటారు. అరుంధతి ప్రజానుకూలవాది. గత రెండున్నర దశాబ్దాలుగా ఆమె పార్లమెంటు బయట.. ‘ఏకవ్యక్తి విపక్షం’గా వ్యవహరిస్తున్నారు! ఆమెలో బెరుకుదనం ఉండదు. ఆమె మాటలో మృదుత్వం ఉండదు. మంచి అనుకున్నదాన్ని ఎంత బలంగా ప్రచారం చేస్తారో.. చెడు అనుకున్నదాన్ని అంత ఘాటుగా విమర్శిస్తారు.
అరుంధతీ రాయ్ తండ్రి బెంగాలీ హిందువు. తల్లి మలయాళీ సిరియన్ క్రిస్టియన్. కలకత్తాలో ఉండేవారు. ఆమెకు రెండేళ్లప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రిని వదిలి తమ్ముడితో పాటు తల్లితో కేరళ వచ్చేసింది. తర్వాత కొన్నాళ్లు ఊటీలో అరుంధతి తాతగారి ఇంట్లో ఉంది ఆ కుటుంబం. అక్కడి నుంచి మళ్లీ కేరళకు. అరుంధతి చదువు కూడా ఆమె కుటుంబం లాగే ఒక చోట స్థిరంగా సాగలేదు. కొట్టాయంలో కొంత, నీలగిరులలో కొంత పూర్తయింది. ఢిల్లీ ‘స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్’ నుంచి పట్టా తీసుకుంది.
అక్కడే ఆమెకు సహ ఆర్కిటెక్ట్ గెరాడ్ డా కన్హాతో పరిచయం అయింది. ఇద్దరూ కొన్నాళ్లు ఢిల్లీలో, గోవాలో సహజీవనం చేశారు. తర్వాత విడిపోయారు. తిరిగి ఢిల్లీ వచ్చాక, 1984లో ఆమెకు ప్రదీప్ క్రిషన్ కలిశారు. ప్రదీప్‌కు సినిమాలు తీయాలని. ఈమెకు సమాజాన్ని మార్చాలని. ఇద్దరూ కలిసి సమాజాన్ని మార్చే సినిమా ఒకటి తీశారు. ‘మెస్సీ సాహిబ్’. దానికి అవార్డు వచ్చింది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొద్దికాలానికే అరుంధతికి సినిమాలు, టీవీ సీరియళ్లు బోర్ కొట్టేశాయి. వాటిని వదిలేసి రకరకాల ఉద్యోగాలు చేశారు. ఏరోబిక్ క్లాసులు నడిపారు. ప్రదీప్‌తో విడిపోయారు. బాల్యంలోని తన జ్ఞాపకాలను రాయడం మొదలుపెట్టారు. ఆ జ్ఞాపకాలే చివరికి ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment