Farmer Movement
-
నేడు మళ్లీ ఢిల్లీ చలో
చండీగఢ్: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత సహా పలు డిమాండ్ల సాధనకు రైతు సంఘాలు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం ఆదివారం తిరిగి మొదలవుతుందని రైతు సంఘం నేత సర్వాన్ సింగ్ పాంథర్ చెప్పారు. శంభు నుంచి శుక్రవారం మొదలైన ర్యాలీపై హరియాణా పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో మొత్తం 16 మంది గాయపడ్డారని, వీరిలో ఒకరు వినికిడి శక్తి కోల్పోయారని ఆయన వివరించారు. క్షతగాత్రుల్లో నలుగురు చికిత్స పొందుతుండగా మిగతా వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారన్నారు. ఈ పరిణామంతో శనివారం ర్యాలీని నిలిపివేశామని ఆయన శంభు వద్ద మీడియాకు తెలిపారు. తమ డిమాండ్లపై చర్చలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహా్వనం అందలేదని పాంథర్ చెప్పారు. తమతో చర్చలు జరిపే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. అందుకే, 101 మంది రైతుల బృందంతో కూడిన జాతాను ఆదివారం మధ్యాహ్నం నుంచి శాంతియుతంగా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. శుక్రవారం రైతులపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో కేందరంలోని బీజేపీ ప్రభుత్వం అసలు స్వరూపం బట్టబయలైందని ఆయన వ్యాఖ్యానించారు. -
ప్రభుత్వం అయితే మాత్రం!
‘నోరు లేనివాళ్లు ఉండరు. నోరు మెదపని వాళ్లే ఉంటారు..’ అంటారు అరుంధతీ రాయ్. ప్రస్తుతం జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు రాయ్. ప్రభుత్వం అయితే మాత్రం! మనకు అనంగీకారాలు ఉండకూడదా? మనం నోరెత్తకూడదా.. అని ప్రశ్నిస్తున్నారు. అరుంధతీ రాయ్ రచయిత్రి. 1997లో ఆమె రాసిన తొలి నవల ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’తోనే ఇప్పటికీ ఆమె గుర్తుకు వస్తారు. ముఖ్యంగా ఆమె ఉద్యమ రచయిత్రి. మార్పు కోసమే ఆమె చేసే ప్రతి రచనా, రాసే ప్రతి వ్యాసం, మాట్లాడే ప్రతి మాటా! ఆమెను గుర్తు చేసే అంతకుముందరి విషయం మరొకటి కూడా ఉంది. 1989లో ‘ఇన్ విచ్ యానీ గివ్స్ ఇట్ దోజ్ వన్స్’ అనే టీవీ చిత్రానికి స్క్రీన్ ప్లే రైటర్‌గా ఆమెకు జాతీయ అవార్డు వచ్చింది. ఆ అవార్డును 2016లో ఆమె ప్రభుత్వానికే తిరిగి ఇచ్చేశారు! దేశంలో పెరిగిపోతున్న మతపరమైన అసహనాన్ని నిరసిస్తూ ఆమె అలా చేయడం కూడా రాయ్‌ని సామాజిక బాధ్యత స్వీకరించిన రచయిత్రిగా నిలబెట్టింది. తాజాగా ఆమె సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించడంతో మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ‘‘పోరు జరుగుతున్నప్పుడు, ఆందోళన వ్యక్తం అవుతున్నప్పుడు, ప్రదర్శనల నినాదాలు మిన్నంటుతున్నప్పుడు, కొందరు చనిపోతున్నప్పుడు.. మౌనం వహించడం నేరం’’ అంటారు అరుంధతీ రాయ్. ఇప్పుడు ఆమె మాట్లాడుతున్నది కచ్చితంగా రైతు ఉద్యమం గురించే. నోరు విప్పని ప్రముఖుల గురించే. పౌరస్వేచ్ఛను, మానవ హక్కులను రాజకీయ నిర్ణయాలు ఎలా ధ్వంసం చేస్తున్నాయో ఒక సామాజిక, ఉద్యమ కార్యకర్తగా ఆమె నిరంతరం తన వ్యాసాలలో, ప్రసంగాలలో వివరిస్తూ ఉంటారు. అరుంధతి ప్రజానుకూలవాది. గత రెండున్నర దశాబ్దాలుగా ఆమె పార్లమెంటు బయట.. ‘ఏకవ్యక్తి విపక్షం’గా వ్యవహరిస్తున్నారు! ఆమెలో బెరుకుదనం ఉండదు. ఆమె మాటలో మృదుత్వం ఉండదు. మంచి అనుకున్నదాన్ని ఎంత బలంగా ప్రచారం చేస్తారో.. చెడు అనుకున్నదాన్ని అంత ఘాటుగా విమర్శిస్తారు. అరుంధతీ రాయ్ తండ్రి బెంగాలీ హిందువు. తల్లి మలయాళీ సిరియన్ క్రిస్టియన్. కలకత్తాలో ఉండేవారు. ఆమెకు రెండేళ్లప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రిని వదిలి తమ్ముడితో పాటు తల్లితో కేరళ వచ్చేసింది. తర్వాత కొన్నాళ్లు ఊటీలో అరుంధతి తాతగారి ఇంట్లో ఉంది ఆ కుటుంబం. అక్కడి నుంచి మళ్లీ కేరళకు. అరుంధతి చదువు కూడా ఆమె కుటుంబం లాగే ఒక చోట స్థిరంగా సాగలేదు. కొట్టాయంలో కొంత, నీలగిరులలో కొంత పూర్తయింది. ఢిల్లీ ‘స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్’ నుంచి పట్టా తీసుకుంది. అక్కడే ఆమెకు సహ ఆర్కిటెక్ట్ గెరాడ్ డా కన్హాతో పరిచయం అయింది. ఇద్దరూ కొన్నాళ్లు ఢిల్లీలో, గోవాలో సహజీవనం చేశారు. తర్వాత విడిపోయారు. తిరిగి ఢిల్లీ వచ్చాక, 1984లో ఆమెకు ప్రదీప్ క్రిషన్ కలిశారు. ప్రదీప్‌కు సినిమాలు తీయాలని. ఈమెకు సమాజాన్ని మార్చాలని. ఇద్దరూ కలిసి సమాజాన్ని మార్చే సినిమా ఒకటి తీశారు. ‘మెస్సీ సాహిబ్’. దానికి అవార్డు వచ్చింది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొద్దికాలానికే అరుంధతికి సినిమాలు, టీవీ సీరియళ్లు బోర్ కొట్టేశాయి. వాటిని వదిలేసి రకరకాల ఉద్యోగాలు చేశారు. ఏరోబిక్ క్లాసులు నడిపారు. ప్రదీప్‌తో విడిపోయారు. బాల్యంలోని తన జ్ఞాపకాలను రాయడం మొదలుపెట్టారు. ఆ జ్ఞాపకాలే చివరికి ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ అయ్యాయి. -
ఆ చట్టాలను రద్దు చేయాల్సిందే
న్యూఢిల్లీ/చండీగఢ్: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం కొనసాగుతోంది. ఢిల్లీలోకి ప్రవేశించే ప్రధాన మార్గాలను బుధవారం వరుసగా ఏడోరోజు రైతులు దిగ్బంధించారు. నిరసనల్లో పాల్గొంటున్న రైతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కీలకమైన ఢిల్లీ–నోయిడా మార్గాన్ని అధికారులు మూసేశారు. ఢిల్లీ–హరియాణా మార్గంలోని సింఘు, టిక్రీల వద్ద ట్రాఫిక్‌ను నిలిపేశారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం సహా తమ డిమాండ్లను అంగీకరించేంతవరకు నిరసన కొనసాగుతుందని రైతు సంఘాలు పునరుద్ఘాటించాయి. ప్రభుత్వంతో మరో విడత చర్చలను నేడు రైతులు జరప నున్న విషయం తెలిసిందే. రైతుల నిరసనలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ సూటు, బూటు సర్కారు హయాంలో రైతుల ఆదాయం సగమయిందన్నారు. మరోవైపు, రైతుల నిరసనలకు మద్దతుగా ఉత్తర భారతదేశం వ్యాప్తంగా రవాణా సేవలు నిలిపేస్తామని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్(ఏఐఎంటీసీ) హెచ్చరించింది. రైతుల డిమాండ్లను నెరవేర్చనట్లయితే డిసెంబర్ 8 నుంచి రవాణా సేవలు ఆగిపోతాయని స్పష్టం చేసింది. రవాణా(కార్గో, ప్యాసెంజర్) సేవలందించే దాదాపు 95 లక్షల ట్రక్కు యజమానులు, సుమారు 50 లక్షల ట్యాక్సీ, బస్ ఆపరేటర్లకు, ఇతర సంబంధిత వర్గాలకు ఏఐఎంటీసీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘రవాణా సేవలు నిలిచిపోతే ఆహారధాన్యాలు, కూరగాయలు, బంగాళాదుంపలు, ఉల్లిగడ్డలు, పాలు, పళ్లు, ఔషధాలు.. తదితర నిత్యావసరాల రవాణా ఆగిపోతుంది. ప్రస్తుతం యాపిల్ పళ్ల సీజన్ నడుస్తోంది. రవాణా నిలిచిపోతే అవి పాడైపోతాయి’ అని ఏఐఎంటీసీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక సమావేశాలు పెట్టండి వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. డిమాండ్లను నెరవేర్చడంలో ఆలస్యం చేస్తే ఢిల్లీలోకి ప్రవేశించే ఇతర మార్గాలను కూడా దిగ్బంధిస్తామని హెచ్చరించాయి. గురువారం జరగనున్న చర్చల్లో తమ అభ్యంతరాలను పాయింట్లవారీగా వివరిస్తామన్నారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన పంజాబ్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు దూకి సీఎం నివాసం వైపు వెళ్తున్న కార్యకర్తలపై వాటర్ కెనాన్లను ప్రయోగించారు. పంజాబ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బరీందర్ ధిల్లాన్, పలువురు ఇతర నేతలను అదుపులోకి తీసుకున్నారు. మంత్రుల చర్చలు ఢిల్లీలో రైతుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే మంత్రి పియూష్ గోయల్ బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలను ఏ విధంగా తొలగించాలనే విషయంపై వారు చర్చించారు. సింగూ సరిహద్దు వద్ద భారీ స్థాయిలో గుమిగూడిన రైతులు -
ఎందుకు ‘మహా’ రైతులు కన్నెర్ర చేస్తున్నారు?
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో రైతన్నలు రోడ్డెక్కారు. నాసిక్ నుంచి ముంబై వరకు లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఈనెల 12న ముంబైలో అసెంబ్లీ ముట్టడికి సన్నాహాలు చేస్తున్నారు. అన్నదాతల ఆక్రందనలకు కారణాలేంటి ? ఎందుకు రైతులు ఫడ్నవీస్ సర్కార్‌పై కన్నెర్ర చేస్తున్నారు ? ఏమిటీ మార్చ్ భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో 30 వేల మంది రైతులతో మార్చి 6న నాసిక్‌లో మహా పాదయాత్ర మొదలైంది. మొత్తం 180 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర ఆదివారం ముంబై చేరుకుంటుంది. 12న జరగనున్న అసెంబ్లీ ముట్టడిలో 70 వేల మందివరకు రైతులు పాల్గొంటారని అంచనాలున్నాయి. ముంబై ఆగ్రా జాతీయరహదారి మీదుగా ఈ లాంగ్ మార్చ్ కొనసాగుతోంది. వేలాది మంది రైతులు రోడ్లపైనే తింటున్నారు.. ఎక్కడ కాస్త జాగా కనిపిస్తే అక్కడే నిద్రపోతున్నారు. తమ డిమాండ్లు తీర్చాలంటూ నినదిస్తున్నారు. ఈ మహా పాదయాత్రలో మహిళా రైతులు, 90 ఏళ్ల పై బడిన వృద్ధులు కూడా ఉన్నారు. ఎందుకీ పాదయాత్ర ఈ ఏడాది అకాల వర్షాలు రైతన్నలను నిండా ముంచేశాయి. వడగండ్ల వానలు కడగండ్లను మిగిల్చాయి. పింక్ బాల్ వార్మ్ పత్తి రైతుల్ని పీల్చిపిప్పి చేసింది. ఫిబ్రవరిలో కురిసిన వడగళ్లవానలకు లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొత్తం 19 జిల్లాల్లో రబీ పంట తుడిచిపెట్టుకుపోయింది. అమరావతి, మరఠ్వాడ, నాగపూర్, నాసిక్ ప్రాంతాల్లో రైతులు దారుణంగా నష్టపోయారు. ఇక మహారాష్ట్రలో గత ఏడాది 84 శాతం వ్యవసాయ భూముల్లో పత్తి పంట సాగు చేశారు. అయితే ఈ పంటకు సోకిన పింక్ బాల్ వార్మ్ కారణంగారైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పుల్లో కూరుకుపోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంది.. గత ఏడాది మహారాష్ట్ర సర్కార్ 34 వేల కోట్ల రైతు రుణాల మాఫీకి హామీ ఇచ్చింది. కానీ అమలు సరిగా జరగలేదు. దీంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ సమస్యల తీరేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు. రైతులు చేస్తున్న డిమాండ్లు ఏంటి ? ఫడ్నవీస్ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతు రుణాలన్నీ మాఫీ చేయాలి. విద్యుత్ బిల్లుల్ని రద్దు చేయాలి. స్వామినాథన్ కమిటీ సిఫారసులన్నీ అమలు చేయాలి కనీస మద్దతు ధరతో రైతులకు ఒదిగేదేమీ లేదు. చట్టబద్ధమైన ధరను కల్పించాలి. అకాల వర్షాలు, పింక్ బాల్ వార్మ్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం పెంచాలి. బుల్లెట్ రైళ్లు, సూపర్‌హైవేలు వంటి అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో పంటభూముల్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నిలిపివేయాలి. ఆదివాసీలకు అటవీ భూములపై యాజమాన్య హక్కులు కల్పించాలి. నాసిక్, థానే, పాల్ఘడ్ ప్రాంతాలను కలుపుతూ ప్రతిపాదించిన నదుల అనుసంధానం ప్రాజెక్టు కారణంగా ఎన్నో ఆదివాసీ గ్రామాలు నష్టపోతాయి.. అందుకే ఆ రూట్ మ్యాప్‌ను మార్చాలి. ఆగని అన్నదాతల ఆత్మహత్యలు రైతు సమస్యల పరిష్కారానికి గత ఏడాది ప్రభుత్వం రుణ మాఫీని ప్రకటించినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. క్షేత్రస్థాయిలో దీని అమలు జరగలేదు. దీంతో అన్నదాతల ఆత్మహత్యలు ఆగలేదు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 1753 మంది రైతన్నలు బలవన్మరణానికి పాల్పడ్డారు. విదర్భ, మరఠ్వాడ, నాసిక్ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చేసేదంతా చేస్తున్నాం: సర్కార్ మరోవైపు మహారాష్ట్ర సర్కార్ రైతులకు చేయాల్సినదంతా చేస్తున్నామని చెబుతోంది. 35 లక్షల 68 వేల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రుణమాఫీ పథకం కింద ఇప్పటివరకు 13, 782 కోట్లు నిధులు విడుదల చేశామని చెబుతోంది. అంతేకాదు ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయ రంగానికే అత్యంత ప్రాధాన్యతనిస్తూ 15వేల కోట్ల రూపాయలను కేటాయించారు. రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రం నుంచి 2,400 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ప్రభుత్వం కోరింది. . అయితే ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదు. -(సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
‘మహా’ మార్చ్
ముంబై: చరిత్రలో రైతు ఉద్యమాలు ఎన్నో చూశాం. కానీ రికార్డు స్థాయిలో వేలాది మంది అన్నదాతలు 180 కి.మీ మేర పాదయాత్ర చేపట్టడం బహుశా ఇదే తొలిసారేమో! ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతోంది ఇదే. రుణ మాఫీ అమలు సహా ఇతర సమస్యలు పరిష్కరించాలని సుమారు 30 వేల మంది రైతులు మార్చి 6న నాసిక్ నుంచి ముంబైకి మహా యాత్రగా బయల్దేరారు. మార్గ మధ్యలో వారికి థానె, పాల్ఘడ్ తదితర జిల్లాల రైతులు జతకలిశారు. 12న ర్యాలీ ముంబై చేరుకునే సరికి రైతుల సంఖ్య 70 వేలకు పెరగొచ్చు. అదే రోజు రాష్ట్ర అసెంబ్లీని ముట్టడించే వీలుంది. భారతీయ కిసాన్ సభ ఈ పోరాటానికి నేతృత్వం వహిస్తోంది. ముంబై–ఆగ్రా జాతీయ రహదారి మీదుగా మార్చ్ కొనసాగుతోంది. రైతులు భోజనాలు, నిద్ర లాంటి అవసరాలను రోడ్లపైనే తీర్చుకుంటున్నారు. ఈ మహా పాదయాత్రలో మహిళా రైతులు, 90 ఏళ్లకు పై బడిన వృద్ధులు కూడా ఉన్నారు. అసంతృప్తిని రగిల్చిన పంట నష్టం.. ఈ ఏడాది అకాల వర్షాలు రైతన్నలను నిండా ముంచాయి. పింక్ బాల్ వార్మ్ చీడ పత్తి పంటను దెబ్బతీసింది. ఫిబ్రవరిలో కురిసిన వడగళ్ల వానలకు లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 19 జిల్లాల్లో రబీ పంట తుడిచిపెట్టుకుపోయింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంది. గత ఏడాది మహారాష్ట్ర సర్కార్ రూ. 34 వేల కోట్ల రుణాల మాఫీకి హామీ ఇచ్చినా అది క్షేత్రస్థాయిలో సరిగా అమలు కాలేదు. దీంతో అన్నదాతల్లో అసంతృప్తి కట్టలు తెంచుకుని ఉద్యమానికి దారి తీసింది. ఆగని ఆత్మహత్యలు.. రుణ మాఫీ పథకం అమలులో ప్రభుత్వం వైఫల్యం చెందడం వల్ల రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 1753 మంది రైతన్నలు బలవన్మరణానికి పాల్పడ్డారు. విదర్భ, మరఠ్వాడ, నాసిక్ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరోవైపు, రైతులకు చేయాల్సినదంతా చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. 35 లక్షల 68 వేల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రుణమాఫీ పథకం కింద ఇప్పటివరకు రూ. 13, 782 కోట్లు విడుదల చేశామని తెలిపింది. రైతు సమస్యల పరిష్కారానికి రూ. 2,400 కోట్ల ఆర్థిక సాయం కోరగా కేంద్రం నుంచి స్పందన రాలేదు. రైతుల డిమాండ్లు ఇవీ.. ► ఫడ్నవీస్ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతు రుణాలన్నీ మాఫీ చేయాలి ► విద్యుత్ బిల్లుల్ని రద్దు చేయాలి ళీ స్వామినాథన్ కమిటీ సిఫారసులన్నీ అమలు చేయాలి ► కనీస మద్దతు ధరతో రైతులకు ఒరిగేదేమీ లేదు. చట్టబద్ధమైన ధరను కల్పించాలి. ► అకాల వర్షాలు, పింక్ బాల్ వార్మ్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం పెంచాలి ► బుల్లెట్ రైళ్లు, సూపర్‌హైవేలు వంటి అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో పంటభూముల్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నిలిపివేయాలి. -
రైతు ఉద్యమంలో కొత్త మలుపు
విశ్లేషణ మునుపెన్నడూ ఎరుగని రీతిలో 150కి పైగా రైతు సంస్థలు కలసి అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ కమిటీ అనే ఒకే వేదిక మీదకు వచ్చాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు, వివిధ రకాల పంటలకు ప్రాతినిధ్యం వహించే రైతు కూటమిగా అది రూపొందింది. చాలా కాలంగా వామపక్షాల నినాదంగా ఉన్న రైతు–కూలీ ఐక్యత వాస్తవమైంది. బహుశా మొదటిసారిగా రైతు సంస్థలు, సంఘాలన్నీ ఉమ్మడి అజెండాను అమోదించాయి. ఈ సంఘటన నిలవగలిగితే దేశ వ్యవసాయ సంక్షోభం సమస్యపై నిర్ణయా త్మకమైన జోక్యం చేసుకోగల బ్రహ్మాండమైన శక్తిసామర్థ్యాలు దానికి సమకూరగల అవకాశం ఉంది. భారత రైతు ఉద్యమం నూతన దశలోకి ప్రవేశి స్తోందా? ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానాన్ని చూపడానికి ఆరు వారాల సమయం చాలా తక్కువ. పున్ టాంబా రైతుల సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి దేశ వ్యాప్తంగా రైతు ఆందోళనల స్వభావంలో కొంత కొత్తదనాన్ని సూచించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆరు రాష్ట్రాల రైతులను, రైతు సంఘాలను, ఉద్యమాలను అనుసంధానిస్తూ సాగిన ఆరు వారాల కిసాన్ ముక్తి యాత్ర కలిగించిన ప్రభావం దీన్ని రూఢి చేసింది. ఈ యాత్ర, మందసౌర్ పోలీసు కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించిన తర్వాత సరిగ్గా నెల రోజులకు, అంటే జూలై 6న అక్కడి నుంచే బయలుదేరింది. అది ఆరు రాష్ట్రాల మీదుగా ఢిల్లీకి చేరింది. క్షేత్ర స్థాయికి అతి సన్నిహితంగా సాగుతున్న రైతు ఉద్యమాల నూతన ప్రపంచంలోకి పరికించి చూడటానికి ఈ యాత్ర మంచి అవకాశం అయింది. ఈ యాత్ర ముగిశాక నేనిప్పుడు దేశ రైతు ఉద్యమాల చరిత్రలో మౌలికమైన పెను మార్పు ప్రారంభమైందని నిర్ధారణకు వచ్చాను. మూడో తరం రైతు ఉద్యమం మీడియా, ఈ మార్పునకు సంబంధించిన కొన్ని బాహ్య లక్షణాలను గుర్తించడం ఇప్పుడే మొదలైంది. జీన్స్ ధరించిన కొత్త తరం రైతు కార్యకర్తల గురించిన కథనాలు వెలువడ్డాయి. అలాగే స్మార్ట్ఫోన్లు, వాట్సాప్‌ల వాడకం కూడా ప్రజల దృష్టిని ఆకర్షించింది. అలాంటి కథనాలు అసలు విషయాన్ని విస్మరించేలా చేయవచ్చు. భారత వ్యవసాయరంగంలోని నూతన వాస్తవాలకు, మారుతున్న భారత రాజకీయాల స్వభావానికి తగ్గట్టుగా రైతు ఉద్యమాలు కూడా సర్దుబాటవుతున్నాయి. ఇవి, మూడో తరం రైతు ఉద్యమాలు. వలసపాలనలోని భారతదేశంలో పెల్లుబికిన రైతు తిరుగుబాట్లు మొదటి తరానికి చెందినవి. మాప్పిలా రైతు తిరుగుబాటూ, గాంధేయవాద చంపారన్, ఖేరా, బార్డోలీ రైతు ఉద్యమాలూ, బెంగాల్‌లోని తెభాగా పోరాటం చాలా వరకు బ్రిటిష్ వలసవాద భూమి కౌలు విధానాల అణచివేతకు ప్రతిస్పందనలు. రెండవ తరం రైతు ఉద్యమాలు 1980లలో సాగినవి. అవి, పల్లెటూరి మహేంద్ర సింగ్ తికాయత్, కార్యకర్తగా మారిన ఆర్థికశాస్తవేత్త శరద్ జోషి, స్వతంత్రుడైన మజుందార్ స్వామి నేతృత్వంలో సాగినవి. ఆధునిక పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలో నిర్లక్ష్యానికి గురవుతున్న సాపేక్షికంగా మెరుగైన రైతుల నిరసన ఇది. ప్రాథమికంగా వారి పోరాటాలు గిట్టుబాటు ధరల సమస్యపై సాగినవి. ఆ ఉద్యమాలకు సమాంతరంగా పెద్ద భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా భూమిలేని పేద శ్రామికుల పోరాటాలు సాగాయి. ప్రధానంగా వాటికి నక్సలైట్లు నాయకత్వం వహించారు. నిజమైన ‘రైతు–కూలీ ఐక్యత’ ఇక మూడో తరం రైతు కార్యకర్తలు ఒక నూతన నేపథ్యాన్ని ఎదుర్కొంటున్నారు. గత తరంలో, భూకమతాల విఘటన (ముక్కలు చెక్కలు కావడం) జరిగింది. వ్యవసాయ రంగం మొత్తంగానే బికారిగా మారే పరిస్థితిని ఎదుర్కొంటోంది. సాగుబడి విస్పష్టంగానే లాభసాటి కాని కార్యకలాపం అయింది. వ్యవసాయరంగానికి సంబంధించిన ఆర్థిక, జీవావరణ సంక్షోభం భారత రైతు మనుగడకు సంబంధించిన సంక్షోభంగా మారుతోంది. నేటి రైతు ఉద్యమం, రైతు ఆత్మహత్యలనే వాస్తవాన్ని ఎదుర్కోవాల్సి ఉంది. ఈ కొత్త రైతు ఉద్యమం, భూస్వామి, రైతు, భాగస్వామ్య రైతు లేదా భూమిలేని రైతు అనే సంప్రదాయక విభజనలను తుడిచిపెట్టేస్తోంది. గ్రామీణ భారతం పేదరికం పాలు కావడంతో నేటి రైతు ఉద్యమాలు రైతులలోని అన్ని విభాగాలను ఒక్కటి చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ‘రైతు–కూలీ ఐక్యత’ చాలా కాలంగా వామపక్షాల నినాదంగా ఉండేది. అయితే ఇటీవలి కాలంలోనే ఆ నినాదం రైతు ఉద్యమాలలో ప్రతిధ్వనించడం మొదలైంది.రైతు నిర్వచనాన్ని విస్తృత పరచడం వివిధ సామాజిక విభాగాలను కలుపుకుపోవడాన్ని ప్రోత్సహించింది. దళితులు, ఆదివాసులు చాలా ఎక్కువగా పనిచేసేది వ్యవసాయ కార్యకలాపాలలోనే. అయినా వారిని ప్రధాన స్రవంతి రైతు ఉద్యమాలు రైతులుగా చూడలేదు. ఈ పక్షపాత ధోరణి మారడం మొదలైంది. అలాగే దళిత, ఆదివాసీ సమస్యలను పట్టించుకోవడానికి రైతు ఉద్యమాలు సుముఖత చూపడం కూడా పెరిగింది. వ్యవసాయరంగంలోని ముడింట రెండు వంతుల శ్రమను చేస్తున్న మహిళా రైతులను గుర్తించడం పట్ల సుముఖత కూడా పెరిగింది. కనీ వినీ ఎరుగని రైతు ఐక్యత భావజాల పరంగా చెప్పాలంటే, ఈ నూతన రైతు ఉద్యమం పాత విభజనల నుంచి దూరంగా జరుగుతోంది. భూమిగలవారు, భూమిలేనివారి మధ్య వైరుధ్యంపై గతంలో దృష్టి కేంద్రీకృతమయ్యేది. నేడు అది, ఆ రెండు వర్గాలూ ఆర్థిక వ్యవస్థ బాధితులేననే గుర్తింపుపైకి మళ్లింది. భారత్ గీఇండియాగా (గ్రామీణ భారతం, పట్టణ ఇండియా అని) స్థూలంగా పేర్కొన్న పట్టణ– గ్రామీణ విభజనపై కూడా కొంత పునరాలోచన జరి గింది. ఎంతైనా ‘ఇండియా’ లోపల సైతం ‘భారత్’ లోని ఒక పెద్ద భాగం ఉంది. అంతేగానీ ‘భారత్’లో ‘ఇండియా’ ఉండటం కాదు. జీవావరణ సంబంధమైన సంక్షోభం రైతులు, రైతులుకానివారి పైన కూడా దుష్ప్రభావాన్ని చూపుతుందని, అనారోగ్యంతో ఉండే రైతులు దేశానికి అనారోగ్యకరమైన ఆహారాన్నే ఉత్పత్తి చేస్తారనే గుర్తింపు కూడా పెరుగుతోంది. భావజాలపరంగా పట్టువిడుపులు లేకుండా ఉండే వైఖరికి దూరంగా జరగడం రాజకీయ ఐక్యతను, విధానాలపై దృష్టిని కేంద్రీకరించడాన్ని అనుమతించింది. మునుపెన్నడూ ఎరుగని రీతిలో 150కి పైగా రైతు సంస్థలు కలసి అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) అనే ఒక వేదిక మీదకు వచ్చాయి. అత్యంత వైవిధ్యభరితమైన రాజకీయ–భావజాలపరమైన వైఖరులు ఉన్న సంస్థలను కూడా ఈ సంఘటనలో భాగం చేసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు, వివిధ రకాల పంటలకు ప్రాతినిధ్యం వహించే రైతు కూటమిగా అది రూపొందింది. ఈ సంఘటన నిలవగలిగితే, వ్యవసాయ సంక్షోభం సమస్యపై నిర్ణయాత్మకమైన జోక్యం చేసుకోగల బ్రహ్మాండమైన శక్తిసామర్థ్యాలు దానికి సమకూరే అవకాశం ఉంది. రైతు సంఘాలకు ఉమ్మడి అజెండా బహుశా మొదటిసారిగా రైతు సంస్థలు, సంఘాలన్నీ ఉమ్మడి అజెండాను అమోదించాయి. ఏఐకేఎస్సీసీలో భాగంగా ఉన్న అన్ని సంస్థలూ, దానికి బయట ఉన్నవి సైతం న్యాయమైన, గిట్టుబాటు ధరలు, రుణ విముక్తి అనే రెండు అంశాల అజెండాపైనే తమ శక్తియుక్తులన్నిటినీ కేంద్రీకరించడానికి అంగీకరించాయి. రైతుకు ఇచ్చిన విశాలమైన అర్థానికి అనుగుణంగానే ఈ రెండు డిమాండ్లను కూడా మరింత సమగ్రమైన రీతిలో నిర్వచించారు. న్యాయమైన, గిట్టుబాటు ధరను భారత రైతాంగంలో పదింట ఒకరికి తక్కువ మందికే లబ్ధిని చేకూర్చే కనీస మద్దతు ధరకు, సేకరణకు పరిమితం చేయలేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అన్ని పంటలకు, అందరు రైతులకు నిజంగానే అందేలా చేయాలని నేటి రైతు ఉద్యమాలు డిమాండు చేస్తున్నాయి. లేదంటే ప్రభుత్వం ప్రకటించిన ధరకు, రైతుకు దక్కిన ధరకు మధ్య ఉండే లోటును తమకు చెల్లించాలని కోరుతున్నారు. అదేవిధంగా, రుణ విముక్తి డిమాండును కూడా, కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలు లేదా గ్రామీణ సహకార బ్యాంకుల రుణాలకు పరిమితం చేయలేదు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల రుణ విషవలయాన్ని కూడా ఈ డిమాండులో భాగం చేశారు. ఈ మౌలిక మార్పు, ఈ కొత్త రైతుల నాయకత్వంలోని మార్పులో కనిపించింది. మధ్యస్థాయిలోని రైతు ఉద్యమ నాయకత్వం గ్రామీణ మూలాలూ, పట్టణాలతో పరిచయమూ ఉన్న నాయకులతో కూడినది. వారు రైతు కుటుంబాల నుంచి వచ్చినవారు. రైతుల బాధలను వారు అర్థం చేసుకోగలరు. అంతేకాదు, విధానకర్తల భాషలోనూ మాట్లాడగలరు. వారు క్షేత్ర స్థాయిలో పోరాటాలను నడపడమే కాదు, సమాచార హక్కు చట్టాన్ని, వ్యాజ్యాలను సాధనాలుగా వాడగలరు కూడా. నేటి నూతన రైతు ఉద్యమాలకు వెన్నెముకగా ఉన్నది ఈ యువ నాయకత్వమే. ఈ కొత్త తరం రైతుల ఉద్యమాలు అంతకు ముందటి వాటికంటే మరింత ప్రభావశీలమైనవా? మునుపెన్నటి కంటే నేడు రైతు పోరాటాల ఆవశ్యకత ఎక్కవగా ఉన్నా... వారిని సమీకరించడం గతంలో కంటే మరింత కష్టంగా మారింది. ఊహాత్మకతను, రాజీలేనితత్వాన్ని కలిగి ఉంటూ, అందరినీ కలుపుకుపోయే నాయకత్వం అందుకు అవసరం అవుతోంది. రైతు ఉద్యమాలు ఎదుర్కొంటున్న సవాలు ఇదే. - యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు ‘ మొబైల్ : 98688 88986 -
బీసీలకు అన్యాయం జరగనివ్వం
పిఠాపురం : కాపు ఉద్యమం ద్వారా బీసీలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. తమ సామాజిక వర్గమైన కాపులను బీసీల్లో చేర్చాలని అడుగుతున్నామే తప్ప బీసీ సోదరులకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లలో మార్పు చేయమనడం లేదని స్పష్టం చేశారు. పిఠాపురం పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఉద్యమానికి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా తప్పక తన పూర్తి మద్దతు ఉంటుందని, అలాగే వైఎస్సార్సీపీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వర్తింపచేస్తున్న రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులూ చేయకుండా కాపు సామాజిక వర్గానికి జనాభా ప్రాతిపదికన అదనంగా రిజర్వేషన్లు అడుగుతున్నామన్నారు. ఒకరికి అన్యాయం జరగడానికి కాపు సామాజిక వర్గం ఎప్పుడూ ఒప్పుకోదని ఆయన స్పష్టం చేశారు. ఈ సామాజిక వర్గంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు న్యాయం చేయాలన్నదే కాపు ఉద్యమ లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా చేపట్టిన కాపు ఉద్యమం తమ హక్కును సాధించుకోవడం ఖాయమని జ్యోతుల పేర్కొన్నారు. 27న కాకినాడలో వైఎస్సార్ సీపీ యువభేరి ఈనెల 27న కాకినాడలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో యువభేరి నిర్వహిస్తున్నామని, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతారని జ్యోతుల తెలిపారు. 21న నిర్వహించాల్సిన యువభేరి అనివార్యకారణాల వల్ల వాయిదా పడిందన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచీ పార్టీలకతీతంగా ఉన్నత విద్యావంతులు యువభేరికి హాజరయ్యేలా ప్రతి నాయకుడూ, కార్యకర్తా పనిచేయాలన్నారు. విద్యార్థి సమస్యలు, ఉపాధి అవకాశాలపై ప్రశ్నించగలిగే విద్యావంతులం తా యువభేరికి వచ్చి సమస్యలను తెలియజేయాలని కోరా రు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కన్వీనర్ పెం డెం దొరబాబు మాట్లాడుతూ యువభేరి విజయవంతానికి అందరూ కృషి చేయాలన్నారు. పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం సభ్యుడు మధుసూదన్‌రెడ్డి, పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కురుమళ్ల రాంబాబు, పార్టీ నేతలు గండేపల్లి బాబీ, అబ్బిరెడ్డి రామచంద్రారెడ్డి, కారే శ్రీనివాసరావు, మొగిలి అయ్యారావు, ఆనాల సుదర్శన్, జ్యోతుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.