థానెలో నినాదాలిస్తూ ముందుకు కదులుతున్న వేలాదిమంది రైతులు
ముంబై: చరిత్రలో రైతు ఉద్యమాలు ఎన్నో చూశాం. కానీ రికార్డు స్థాయిలో వేలాది మంది అన్నదాతలు 180 కి.మీ మేర పాదయాత్ర చేపట్టడం బహుశా ఇదే తొలిసారేమో! ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతోంది ఇదే. రుణ మాఫీ అమలు సహా ఇతర సమస్యలు పరిష్కరించాలని సుమారు 30 వేల మంది రైతులు మార్చి 6న నాసిక్ నుంచి ముంబైకి మహా యాత్రగా బయల్దేరారు.
మార్గ మధ్యలో వారికి థానె, పాల్ఘడ్ తదితర జిల్లాల రైతులు జతకలిశారు. 12న ర్యాలీ ముంబై చేరుకునే సరికి రైతుల సంఖ్య 70 వేలకు పెరగొచ్చు. అదే రోజు రాష్ట్ర అసెంబ్లీని ముట్టడించే వీలుంది. భారతీయ కిసాన్ సభ ఈ పోరాటానికి నేతృత్వం వహిస్తోంది. ముంబై–ఆగ్రా జాతీయ రహదారి మీదుగా మార్చ్ కొనసాగుతోంది. రైతులు భోజనాలు, నిద్ర లాంటి అవసరాలను రోడ్లపైనే తీర్చుకుంటున్నారు. ఈ మహా పాదయాత్రలో మహిళా రైతులు, 90 ఏళ్లకు పై బడిన వృద్ధులు కూడా ఉన్నారు.
అసంతృప్తిని రగిల్చిన పంట నష్టం..
ఈ ఏడాది అకాల వర్షాలు రైతన్నలను నిండా ముంచాయి. పింక్ బాల్ వార్మ్ చీడ పత్తి పంటను దెబ్బతీసింది. ఫిబ్రవరిలో కురిసిన వడగళ్ల వానలకు లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 19 జిల్లాల్లో రబీ పంట తుడిచిపెట్టుకుపోయింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంది. గత ఏడాది మహారాష్ట్ర సర్కార్ రూ. 34 వేల కోట్ల రుణాల మాఫీకి హామీ ఇచ్చినా అది క్షేత్రస్థాయిలో సరిగా అమలు కాలేదు. దీంతో అన్నదాతల్లో అసంతృప్తి కట్టలు తెంచుకుని ఉద్యమానికి దారి తీసింది.
ఆగని ఆత్మహత్యలు..
రుణ మాఫీ పథకం అమలులో ప్రభుత్వం వైఫల్యం చెందడం వల్ల రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 1753 మంది రైతన్నలు బలవన్మరణానికి పాల్పడ్డారు. విదర్భ, మరఠ్వాడ, నాసిక్ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరోవైపు, రైతులకు చేయాల్సినదంతా చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. 35 లక్షల 68 వేల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రుణమాఫీ పథకం కింద ఇప్పటివరకు రూ. 13, 782 కోట్లు విడుదల చేశామని తెలిపింది. రైతు సమస్యల పరిష్కారానికి రూ. 2,400 కోట్ల ఆర్థిక సాయం కోరగా కేంద్రం నుంచి స్పందన రాలేదు.
రైతుల డిమాండ్లు ఇవీ..
► ఫడ్నవీస్ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతు రుణాలన్నీ మాఫీ చేయాలి
► విద్యుత్ బిల్లుల్ని రద్దు చేయాలి ళీ స్వామినాథన్ కమిటీ సిఫారసులన్నీ అమలు చేయాలి
► కనీస మద్దతు ధరతో రైతులకు ఒరిగేదేమీ లేదు. చట్టబద్ధమైన ధరను కల్పించాలి.
► అకాల వర్షాలు, పింక్ బాల్ వార్మ్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం పెంచాలి
► బుల్లెట్ రైళ్లు, సూపర్‌హైవేలు వంటి అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో పంటభూముల్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నిలిపివేయాలి.
Comments
Please login to add a commentAdd a comment