నాసిక్ నుంచి ముంబై చేరుకున్న రైతు ర్యాలీ
ముంబై: అన్నదాతలు ఆదివారం ముంబై నగరాన్ని ముంచెత్తారు. డిమాండ్ల సాధన కోసం దాదాపు 50 వేల మంది మహారాష్ట్ర రైతులు ముంబైలో అడుగుపెట్టారు. వారంతా సోమవారం అసెంబ్లీని ముట్టడించనున్నారు. రైతు సమస్యలు తీర్చాలంటూ మహారాష్ట్రలోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది కర్షకులు పాదయాత్రగా వచ్చారు. ఎండలు మండిపోతున్నా, అరికాళ్లు బొబ్బలెక్కుతున్నా లెక్కచేయకుండా దీక్షతో ఆరు రోజులపాటు 180 కిలో మీటర్లు నడిచిన వారంతా ముంబైలోని కేజే సోమయ మైదానానికి చేరుకున్నారు. ఆ తర్వాత వారు అర్ధరాత్రి ఆజాద్ మైదానానికి బయల్దేరారు. మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ వీరికి ముంబై శివార్లలో స్వాగతం పలికారు. మంగళవారం నాసిక్‌లో యాత్ర ప్రారంభమైంది.
ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లుగా రైతు రుణాలను మాఫీ చేయడం, పెట్టుబడికి అయిన ఖర్చు కన్నా కనీసం 50 శాతం ఎక్కువగా కనీస మద్దతు ధర ఉండేలా చూడడం, ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయడం, అకాల వర్షాలు, తెగుళ్ల కారణంగా పంట నష్టపోయిన వారిని ఆదుకోవడం, ఆదివాసీలు సాగు చేస్తున్న భూములను వారి పేర్లన రిజిస్టర్ చేయడం తదితరాలు రైతుల డిమాండ్లలో ప్రధానమైనవి. రైతు సమస్యల పరిష్కారానికి ఆరుగురు సభ్యులతో ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశామనీ, ఆ సంఘం రైతులతో చర్చలు జరుపుతుందని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. కమ్యూనిస్టుల అనుబంధ అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) రైతుల పోరాటానికి నేతృత్వం వహిస్తోంది. ఎవరికీ ఇబ్బంది లేకుండా, శాంతియుతంగా తాము నిరసన తెలుపుతామని ఏఐకేఎస్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment