రైతులను ఆదుకుంటున్న పాట..
ముంబై: పాటంటే ఓ శబ్దనాదం. ఓ శంఖారావం. ప్రపంచ స్వాతంత్య్ర, విప్లవ ఉద్యమాల్లో పాట పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. పాట ఓ ఆయుధం. ఓ సందేశం....ఇదంతా ఒకవైపు. మరో వైపు మనుసును ఉల్లాసపరిచేది. తేలిక పరిచేది. కష్టాలను మరిపింపచేసేది. కన్నీళ్లను తుడిచేది. బతకడానికి భరోసానిచ్చేది. ఇదే భావం కలిగిందీ మహారాష్ట్రకు చెందిన ఓ ఉన్నతాధికారికి. ఆకలి బాధలతో అప్పుల భయాలతో ఆత్మహత్యలు చేసుకొని అర్ధాంతరంగా తనువులను చాలిస్తున్న రైతుల్లో భరోసా నింపేందుకు పాటనే ఆయుధంగా చేసుకున్నారు. రైతులతో మమేకమయ్యారు. అధికారికంగా చేయలేని సహాయాన్ని పాట సాయంతో చేస్తున్నారు.
ఆ అధికారి పేరు విజయ్‌కుమార్ ఫద్. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ డివిజనల్ కమిషనరేట్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్)లో డిప్యూటి డివిజనల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. భక్తి పాటలు పాడడం, కథలు చెప్పడంలో నేర్పరి. చిన్నప్పుడే అబ్బిన ఈ విద్యను జీవన పోరాటంలో ఓడిపోతున్న రైతుల రక్షణ కోసం ఎందుకు ఉపయోగించకూడదన్న ఆలోచ న వచ్చింది ఓ రోజు. వెంటనే దోవతి, కురతా వేసుకున్నారు. తలకుపాగా చుట్టుకున్నారు. తంబూరను చేతపుచ్చుకున్నారు. రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న గ్రామాలను ఎంచుకున్నారు. అక్కడికి వెళ్లడం ప్రారంభించారు.
పాట ద్వారా రైతులను ఆకట్టుకోవడం, వారి మనసులను ఉల్లాసపర్చడం, వారి మనసులు స్థిమితపడ్డాక అసలు కథలోకి వారిని లాక్కురావడం ఆయన ముందుగా చేసే పని. ఆ తర్వాత మానవ జీవితం ఎంత గొప్పదో, దాన్ని ఎందుకు వృధా చేసుకోకూడదో విడమర్చి చెప్పడం, చరిత్రలో చెరగిపోని విజయగాథలను తెలియచెప్పడం, వారిలో మానసిక ధైర్యాన్ని కల్పించడం ఆయన పాత్రలో రెండో అంకం. ఆ తర్వాత రైతులు తాము ఎదుర్కొంటున్న కష్టాల నుంచి ఎలా బయటపడాలో, అందుబాటులో ఉన్న పరిష్కార మార్గాలేమిటో సూచించడం మూడో అంకం. ఆ తర్వాత విసిగివేసారి పోతున్న రైతులను ఒక్కొక్కరిని తనవద్దకు పిలిపించుకొని వారి కష్టాలను స్వయంగా తెలసుకొని కౌన్సిలింగ్ ఇవ్వడం చివరి అంకం.
ఈ సామాజిక బాధ్యతను భుజానమోయడం కోసం విజయ్‌కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేయలేదు. డ్యూటీలు ఎగ్గొట్టడం లేదు. వారాంతం సెలవుల్లో, ప్రభుత్వ సెలవుదినాల్లో గ్రామాలకు వెళుతున్నారు. ఇప్పటికే ఆయన పాతిక గ్రామాలకు వెళ్లి వచ్చారు. తాను వెళ్లాల్సిన గ్రామాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు పలు గ్రామాల ప్రజలు తమ గ్రామాలకు రావాల్సిందిగా ఆర్జీలు కూడా పెట్టుకుంటున్నారు.
ఆయన కృషి ఎంతో సత్ఫలితాలిస్తోందని అటు రైతులు, ఇటు ఆయన తోటి ఉద్యోగులు చెబుతున్నారు. లాథూర్ గ్రామానికి చెందిన తనది కూడా రైతు నేపథ్యమేనని, త న కుటుంబ సభ్యులు ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారని, అందుకనే రైతుల సమస్యలపై తనకు సరైన అవగాహన ఉందని విజయ్‌కుమార్ మీడియాకు తెలిపారు. ఆత్మహత్యల వల్ల సమస్యలు పరిష్కారం కాదని, బతికి సాధించాలనే మనోధైర్యాన్ని వారిలో కల్పించడమే తన లక్ష్యమని ఆయన చెప్పారు.