మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇటీవల కీలక విషయాన్ని ప్రకటించిన సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. తన భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ స్టేజ్-4 కేన్సర్‌ని విజయవంతంగా ఓడించిందని మీడియా సమావేశంలో ప్రకటించారు. కేవలం వైద్యులమీదే ఆధారపడకుండా కొన్ని ప్రత్యేక మైన చికిత్సా పద్దతులను అవలంబించామని క్రమశిక్షణ, కఠినమైన జీవనశైలి,ఆయుర్వేద పద్ధతులు, ఆహార నియమాలతో తీవ్రమైన స్టేజ్-4 కేన్సర్‌నుంచి బయటపడినట్టు వెల్లడించారు. ముఖ్యంగా నిమ్మరసం, పచ్చి పసుపు, యాపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి వంటి వాటి ద్వారా కేన్సర్ మహమ్మారిని జయించినట్టు ప్రకటించడం చర్చకు దారి తీసింది. మరి కేవలం స్ట్రిక్ట్ డైట్ మాత్రమే క్యాన్సర్ రికవరీకి సహాయపడుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కొన్నాళ్ల క్రితం కేన్సర్ బారిన పడిన నవజ్యోత్ కౌర్ చికిత్స తీసుకుంది. తగ్గిపోయిందని అనుకున్నారు. కానీ కుమారుడి పెళ్లి తర్వాత స్టేజ్-3 రూపంలో తీవ్రంగా మళ్లీ వచ్చింది. చికిత్స తీసుకున్నా ఫలితం లేదు సరికదా మరింత ముదిరింది. కేవలం 5 శాతం మాత్రమే చాన్స్ ఉందని, కోలుకోవడం కష్టం అని వైద్యులు తేల్చేశారు. కానీ కఠినమైన ఆహార నియమాలు, జీవన శైలి మార్పులతో ఆమె క్యాన్సర్‌ను ఓడించిందని, అయితే ఇది దగ్గర డబ్బు ఉన్నందున కాదు, క్రమశిక్షణ, ఆహార నియమాలను పాటించి 40 రోజుల తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యిందంటూ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు సిద్దూ. ఆమె ఇపుడు వైద్యపరంగా కేన్సర్‌ను ఓడించిందని సిద్దూ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఉపవాసం ప్రాముఖ్యత, చక్కెర , కార్బోహైడ్రేట్లు లేని ఆహారం కేన్సర్‌ను దూరం చేస్తుందన్నారు.
ఆమె తన రోజును నిమ్మరసంతో ప్రారంభించేదని, పచ్చి పసుపు తినేదని, ఆపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి లాంటి తీసుకునేదన్నారు. ఇంకా సిట్రస్ పండ్లు,గుమ్మడికాయ, దానిమ్మ, ఉసిరి, బీట్‌రూట్ , వాల్‌నట్స్ వంటి రసాలు ఆమె రోజువారీ ఆహారంలో భాగంగా ఉండేవన్నారు.
My wife is clinically cancer free today ….. pic.twitter.com/x06lExML82
— Navjot Singh Sidhu (@sherryontopp) November 21, 2024
అందరికీ వర్తించదు: నిపుణుల హెచ్చరిక
కేన్సర్ చికిత్సలో పోషకాహార పాత్ర కీలకమైనదే, కానీ అది మాత్రమే రికవరీకి ఆహారం మాత్రమే సరిపోదని హెచ్చరిస్తున్నారు. వ్యాధినుంచి కోలుకోవడానికి ఆహారం గణనీయంగా తోడ్పడుతుంది. కానీ కీమోథెరపీ, రేడియేషన్ లేదా శస్త్రచికిత్స వంటి సాంప్రదాయ చికిత్సలకు ఎంతమాత్రం సరిపోదు. కేన్సర్ బహు ముఖమైంది. తీవ్రతను బట్టి, కేన్సర్ కణాలను నాశనం చేయడానికి పలు చికిత్సల కలయిక అవసరం అంటున్నారు వైద్య నిపుణులు
అలాగే ఉపవాసం కేన్సర్ రోగులకు ఉపవాసం అస్సలు పనికిరాదని, కేన్సర్ రోగులను ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్, లేదా ఉపవాసంలో ఉంచడం నేరమంటున్నారు మరికొందరు నిపుణులు. ఇది కోలుకోవడానికి అవసరమైన పోషకాహారాన్ని నిరోధిస్తుందన్నారు.
తక్కువ-గ్లైసెమిక్ డైట్, న్యూట్రాస్యూటికల్స్ గ్లూకోజ్-ఆధారిత కేన్సర్‌లలో చికిత్సల సామర్థ్యాన్ని పెంచగలవని డాక్టర్ మల్హోత్రా ట్వీట్ చేశారు. అయితే అందరికీ ఇది వర్తించదన్నారు. కేన్సర్ రకం, దశ ఆధారంగా, జీవక్రియ అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఆహార ప్రణాళికలను రూపొందించుకోవాలి. ముఖ్యంగా రోగులు ఆంకాలజిస్టులు, డైటీషియన్‌ల సలహాలను తీసుకోవాలని డాక్టర్ మల్హోత్రా జోడించారు.
కేన్సర్‌నుంచి బయటపడాలంటే.. తొలి దశలోనే గుర్తించడం,కేన్సర్ రకం, లక్షణాలతో పాటు అత్యాధునిక చికిత్స, రోగి విల్ పవర్, ఆహార నియమాలు, రోగి శారీరక, మానసిక స్థితి, కుటుంబ సభ్యుల సహకారం, మద్దతు ఇవన్నీ కీలకమైనవి.
Comments
Please login to add a commentAdd a comment