Treatment
-
HousewifeDermatitis గురించి విన్నారా? చలి చేతికి చిక్కొద్దు!
ఈ చర్మవ్యాధిని గృహిణులకు వచ్చే సమస్యగా ప్రత్యేకంగా పేర్కొంటారు. ఎందుకంటే ఇంటి గచ్చును శుభ్రం చేస్తుండటం, బట్టలు ఉతికే సమయంలో సబ్బు (డిటెర్జెంట్) వీళ్ల చేతుల్ని ప్రభావితం చేస్తుండటం, ఇంటిపనుల్లో ఇంకవైనా రసాయనాలు తగిలి చేతులు ఇరిటేషన్‌కు లోనవ్వడం వంటివి జరుగుతుంటాయి కాబట్టి దీన్ని ‘హౌజ్ వైఫ్ డర్మౖటెటిస్’ అంటారు. దాంతోపాటు చెయ్యిపై దుష్ప్రభావాలు పడతాయి కాబట్టి దీన్ని ‘హ్యాండ్ ఎక్సిమా’, ‘హ్యాండ్ డర్మటైటిస్’ అని కూడా అంటారు. నిజానికి ఇది కేవలం గృహిణులనే కాకుండా పలు రకాల రసాయనాలు వాడే వృత్తుల్లో ఉండే వారందరికీ వస్తుంది. ముఖ్యంగా శుభ్రం చేసే వృత్తుల్లో ఉన్నవారూ, కేటరింగ్, బ్యూటీ కేర్ సెలూన్లలో హెయిర్ డ్రస్సింగ్ చేసేవారూ, హెల్త్‌కేర్ ఇండస్ట్రీలో ఉన్నవారు... వీళ్లంతా ఏదో ఒక డిటర్జెంట్ లేదా రసాయనం చేతుల్లోకి తీసుకొని పనిచేస్తుంటారు కాబట్టి వీళ్లందరినీ ఈ ఎగ్జిమా లేదా డర్మటైటిస్ ప్రభావం చూపుతుంది. పైగా చలి పెరిగే ఈ సీజన్లో ఇది మరింత బాధిస్తుంటుంది. మహిళలను ఎక్కువగా బాధించే ఈ సమస్య గురించి తెలుసుకుందాం. ఈ వింటర్ సీజన్లో మామూలుగానే చర్మం పొడిబారడం ఎక్కువ. దీనికి తోడు రసాయనాలూ చేతులపై దుష్ప్రభావం చూపడం వల్ల ఈ సమస్య మరింతగా అరచేతులూ, చేతివేళ్లూ, గోళ్ల చుట్టూ ఉండే చర్మం (పెరీ ఉంగ్యువల్) ప్రభావితమయ్యే భాగాల్లో ఈ సమస్య తీవ్రంగా మారినప్పుడు అక్కడ నీటిపొక్కుల్లా రావడాన్ని పామ్ఫాలిక్స్’ అని అంటారు. ఒక్కోసారి కొందరిలో ఈ సమస్య అనువంశీకంగానూ కనిపిస్తుంది. తమ సొంత వ్యాధి నిరోధక శక్తే తమ చర్మాన్ని దెబ్బతీయడం వల్ల ఇలా జరుగుతుంది. కొన్ని అలర్జిక్ రియాక్షన్స్, ఆహారం వల్ల కలిగే అలర్జీలు, చాలాసేపు నీళ్లలో ఉండటం వంటి అంశాలూ దీన్ని మరింత పెచ్చరిల్లేలా చేస్తాయి. డ్రై స్కిన్ ఉన్నవారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి ఇక్కడ ఇన్ఫెక్షన్లా కూడా మారి మరింత ఇబ్బంది కలిగించే అవకాశముంది. నివారణ / మేనేజ్మెంట్ / చికిత్స... ఇంటి పనులు అయిన వెంటనే ఘాటైన సువాసనలు లేని మంచి క్లెన్సర్‌ను గోరు వెచ్చని నీటిలో వేసి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. (ఇందుకు వేడి నీళ్లు ఉపయోగించకూడదు. కేవలం గోరువెచ్చని నీళ్లే వాడాలి). ఇక క్లెన్సర్‌ను ఎంపిక చేసే విషయంలో వాటిల్లో ఘాటైన లేదా చేతికి హానిచేసే తీవ్రమైన రసాయన సాల్వెంట్స్ లేకుండా జాగ్రత్తపడాలి. ∙చేతులకు ఈ సమస్యను తెచ్చిపెట్టే డిటర్జెంట్లు / రసాయనాలు కలిపిన నీళ్లు... వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండటం లేదా తప్పనప్పుడు ఈ ఎక్స్పోజర్ వ్యవధిని వీలైనంతగా తగ్గించడం. చేతులను శుభ్రంగా ఉంచుకోవడం (హ్యాండ్ హైజీన్‌ను పాటించడం). ఇందుకోసం ఘాటైన సబ్బులను కాకుండా గ్లిజరిన్, ఆల్కహాల్ బేస్డ్ మైల్డ్ శానిటైజర్లు వాడటం. (కీర్తి సురేష్ పెళ్లి చీర : స్పెషల్‌గా కీర్తి ఏం చేసిందో తెలుసా?)ఇల్లు శుభ్రం చేసే సమయంలో లేదా ఇంటి పనులప్పుడు శుభ్రమైన కాటన్ గ్లౌజ్ వాడటం. ఇంటికి సంబంధించిన కాస్తంత మురికి పనులు (డ్రైయిన్లు శుభ్రం చేయడం వంటివి) చేసేటప్పుడూ గ్లౌజ్ ధరించడం. చర్మ సంరక్షణ కోసం వాడే వాసన లేని ఎమోలియెంట్స్ (చేతులకు హాయిగొలిపే లేపనాల వంటివి) వాడటం. అరచేతులు, చేతివేళ్లు తేమ కోల్పోకుండా ఉండేందుకు చేతికి కొబ్బరి నూనె లేదా చేతులు తేమ కోల్పోకుండా చేసే ఆయింట్మెంట్స్ / క్రీమ్స్ వాడటం. చేతులకు తగిలే చిన్న చిన్న దెబ్బలు, గీరుకుపోవడం వంటి వాటినీ నిర్లక్ష్యం చేయకుండా వాటికి తగిన బ్యాండ్ఎయిడ్ వంటివి వేయడం. ఈ జాగ్రత్తలు పాటించాక కూడా ఇంకా చేతులు పొడిబారిబోయి, చర్మం లేస్తుండటం, పొట్టురాలుతుండటం, పగుళ్లు వస్తుండటం జరుగుతుంటే డర్మటాలజిస్టుకు చూపించాలి. వారు తగిన పూతమందులు, ఇతరత్రా చికిత్సలతో సమస్యను తగ్గిస్తారు. లక్షణాలు... చేతులపై చర్మం బాగా పొడిగా మారడం, ఇంతగా పొడిబారడంతో పొట్టు లేస్తుండటం చేతివేళ్లపై పగుళ్లు, ఈ పగుళ్ల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న చిన్న పుండ్లలా మారడం (బ్లిస్టర్స్) చర్మం ఊడిపోతూ ఉండటం , చర్మం ఎర్రబారడం ఒక రకమైన నొప్పితో కూడిన ఇబ్బంది. -డా. స్వప్నప్రియసీనియర్ డర్మటాలజిస్ట్ -
ఇలాంటి చెవి సమస్యలు కనిపించాయా? ఓ కన్నేయండి మరి!
కొందరిలో అకస్మాత్తుగా చెవులు వినపడకుండాపోయే సమస్య కనిపిస్తుంటుంది. అకస్మాత్తుగా కనిపించే ఈ వినికిడి సమస్యను ఇంగ్లిష్‌లో ‘సడెన్ డెఫ్నెస్’ అనీ, వైద్యపరిభాషలో ‘సడెన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్’ (సంక్షిప్తంగా ఎస్ఎస్ హెచ్ఎల్) అంటారు. అకస్మాత్తుగా వచ్చే ఈ సమస్య సాధారణంగా ఒక్క చెవినే ప్రభావితం చేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది, అప్పుడు ఏం చేయాలి, వైద్యులు ఎలాంటి చికిత్సలు అందిస్తారనే అంశాలను తెలుసుకుందాం. అకస్మాత్తు వినికిడి సమస్యను గుర్తించడం కాస్త విచిత్రంగానే జరుగుతుంది. ఉదాహరణకు పొద్దున్నే వాకింగ్‌కు వెళ్తున్నప్పుడు వినిపించే అలారం ఒకవైపే వినిపిస్తుండం లేదా ఫోన్ మాట్లాడుతుంటే ఒకవైపు చెవి వినిపించక... మరో చెవితో వినాల్సి రావడం వంటి అంశాలతో ఈ సమస్య తెలిసి వస్తుంది. లక్షణాలు... చెవి పూర్తిగా నిండిపోయినట్లు భావన కలుగుతుండటం తల తిరుగు తున్నట్లుగా (డిజ్జీనెస్) అనిపిస్తుండటం ట్రాన్స్ఫార్మర్ దగ్గర నిల్చున్నప్పుడు వినిపిస్తున్నట్టుగా చెవిలో హోరుమనే శబ్దం వినిపిస్తుండటం (ఈ తరహా సమస్యను ‘టినైటస్’ అంటారు. ఇది విడిగా కూడా కనిపించే అవకాశముంది). గుర్తించడం / నిర్ధారణ ఎలా? ఈఎన్టీ డాక్టర్‌ను సంప్రదిస్తే... కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ‘కండక్టివ్ హియరింగ్ లాస్’ అనే వినికిడి సమస్య లేదనే అంశాన్ని నిర్ధారణ చేయడం కోసం ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. అంటే చెవిలో గులిమి గానీ లేదా ద్రవాలు గాని అడ్డుపడటం వల్ల వినికిడి సమస్య రావడాన్ని కండక్టివ్ హియరింగ్ లాస్ అంటారు. ఆ అడ్డంకిని తొలగించగానే ఈ సమస్య తొలగిపోతుంది. కానీ ‘అకస్మాత్తుగా వచ్చే వినికిడి సమస్య’ (ఎస్ఎస్హెచ్ఎల్)లో అలా జరగదు. అటు తర్వాత ‘ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ’ అనే మరో వైద్య పరీక్షతో చెవి ఏయే ఫ్రీక్వెన్సీలలో, ఎంతెంత గట్టి శబ్దాలు వినగలుగుతోందనే విషయాన్ని తెలుసుకుంటారు. అకస్మాత్తుగా వినికిడి సమస్య వచ్చిన వారు కేవలం 72 గంటల్లోనే 30 డెసిబుల్స్ కంటే తక్కువ తీవ్రత ఉన్న శబ్దాలను వినగలిగే శక్తిని కోల్పోతారు. ఇలా అకస్మాత్తుగా వినికిడి సమస్య వచ్చిన వారికి ఎదుటివారు మామూలుగా మాట్లాడుకుంటున్నప్పటికీ అవి గుసగుసల్లా అనిపిస్తుంటాయి. పైన పేర్కొన్న పరీక్షలతో పాటు మరికొన్ని రక్తపరీక్షలు, ఎమ్మారై వంటి ఇమేజింగ్ పరీక్షలు, బ్యాలెన్స్ పరీక్షలూ బాధితుల్లో ఈ సమస్యకు కారణమేమిటో తెలుసుకోడానికి ఉపయోగపడతాయి. కోల్పోయిన వినికిడి శక్తి మళ్లీ వస్తుందా? వినికిడి శక్తి కోల్పోయిన వెంటనే ఎంత త్వరగా చికిత్సకోసం వస్తే అంతగా వినికిడిని మళ్లీ పొందడం సాధ్యమవుతుంది. అయితే... ఇందులో కొందరికి కోల్పోయిన వినికిడి శక్తి పూర్తిగా వస్తే మరికొందరికి కొద్దిగానే వస్తుంది. చికిత్స ఆలస్యమవుతున్న కొద్దీ కోల్పోయిన వినికిడి శక్తిని తిరిగి పొందడం అన్నది కూడా తగ్గుతూ పోతుంది. అందుకే వినికిడి కోల్పోయినట్లు అనిపించగానే తక్షణమే డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. చికిత్స : వినికిడి శక్తిని కోల్పోయిన సందర్భాల్లో అది ఏ కారణం వల్ల జరిగిందో తెలియనప్పుడు ప్రధానంగా కార్టికో స్టెరాయిడ్స్ సహాయంతో చికిత్స అందిస్తారు. అవి చెవిలో వచ్చిన ఇన్ఫ్లమేషన్ (వాపు)ను తగ్గించి, వినికిడి శక్తిని పునరుద్ధరించడానికి తోడ్పడుతుంది. గతంలో ఈ స్టెరాయిడ్స్‌ను నోటి ద్వారా తీసుకునే మందుల రూపంలో ఇచ్చేవారు. అయితే ఇటీవల వీటిని చెవిలోపలికి ఇచ్చే ఇంజెక్షన్ల (ఇంట్రా టింపానిక్ ఇంజెక్షన్స్) రూపంలో ఇస్తున్నారు. ఇలా ఇవ్వడం వల్ల ఈ మందులు ప్రభావపూర్వకంగా పనిచేస్తాయి. అంతేకాకుండా, ఈ స్టెరాయిడ్స్ కారణంగా శరీరంలో కలిగే దుష్ప్రభావాలనూ (సైడ్ ఎఫెక్ట్స్) నివరించ వచ్చు. అంతేకాదు, ఇలా ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం వల్ల మందు చెవిలో లోపలి వరకు మందు చేరడం సులువవుతుంది. వీటిని ఔట్ పేషెంట్స్ విభాగంలోనే ఓటోలారింగాల జిస్టుల ఆధ్వర్యంలో ఇస్తుంటారు. ఫలితాలు ప్రభావ పూర్వకంగా ఉండాలంటే ఈ ఇంజెక్షన్లను సమస్య కనుగొన్న వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ అకస్మాత్తు వినికిడి సమస్యకు ఇంకేవైనా అంశాలు కారణమని తెలిస్తే... ముందుగా వాటికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా ఇన్షెక్షన్ వల్ల ఈ సమస్య వచ్చిందని తేలితే, యాంటీబయాటిక్స్ ఇవ్వడం, ఏవైనా హానికరమైన మందుల వల్ల ఈ సమస్య వచ్చిందని తేలితే, ఆ మందుల్ని ఆపేసి, ప్రత్యామ్నాయ ఔషధాలను ప్రిస్క్రయిబ్ చేయడం, ఒకవేళ తమ సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ ఈ సమస్యను తెచ్చిపెట్టిందని తేలినప్పుడు... ఆ వ్యవస్థను నెమ్మదింపజేసే మందులను వాడటం వంటి చికిత్సలను డాక్టర్లు సూచిస్తారు. ఒకవేళ వినికిడి లేమి సమస్య చాలా తీవ్రంగా ఉన్నా... లేదా సమస్య రెండువైపులా చెవులకూ వస్తే బయటి శబ్దాలను పెద్దగా వినిపింపజేసే ‘హియరింగ్ ఎయిడ్స్’ వాడటం లేదా నేరుగా చెవి నుంచి మెదడుకు శబ్దాలను వినిపించే ప్రక్రియను ప్రేరేపించే ‘కాక్లియార్ ఇంప్లాంట్స్’ అమర్చడం వంటి చికిత్సలు అవసరం కావచ్చు. విస్మరించే అవకాశాలు ఎక్కువ... అకస్మాత్తుగా తమకు ఒక చెవి వినిపించకుండా పోయిన ఈ సమస్యను కొందరు పూర్తిగా విస్మరిస్తుంటారు. దీనికి కారణం... తమకు ఏదో అలర్జీ కారణంగా చెవి దిబ్బెడ వేసినట్లు అనిపిస్తుందని అనుకుంటుంటారు లేదా తమకు సైనస్ వంటి ఇన్ఫెక్షన్ ఉన్నందున ఇలా జరుగుతుందని భావిస్తుంటారు. మరికొందరైతే చెవిలో గువిలి చేరిందనీ, అందువల్ల తమ చెవి నిండుగా అనిపిస్తుందనీ, దాన్ని శుభ్రం చేయిస్తే అంతా మామూలైపోతుందని భావిస్తుంటారు.-డా. మోగంటి అశోక్ పృథ్విరాజ్, సీనియర్ ఈఎన్టీ, హెడ్ అండ్ నెక్ సర్జన్ -
కంట్లో వలయం కనిపిస్తోందా? ఈ విషయాలు తెలుసుకోండి!
కొంతమందికి కంట్లో నల్లగుడ్డు చుట్టూరా ఓ తెల్లని రింగ్ కనిపిస్తుంటుంది. దీన్ని చూడగానే ఆందోళనకు గురవుతుంటారు. కానీ ఇది అంతగా ఆందోళన చెందాల్సిన అంశమూ కాదు... అంతగా ప్రమాదకారీ కాదు. ఇది కేవలం అలర్జీతో వచ్చిన సమస్య మాత్రమే. మన కన్ను ఆరు బయట ఉండే దుమ్మూ ధూళి వంటి కాలుష్యాలకూ, పుప్పొడికి ఎక్స్పోజ్ అయినప్పుడు... అలర్జీ ఉన్నవాళ్లలో కంటి నల్ల గుడ్డు చుట్టూ ఇలాంటి తెల్లటి రింగ్ కనిపించే అవకాశం ఉంది. అందుకే కేవలం ఇలా రింగ్ కనిపించే వాళ్లు మాత్రమే కాకుండా అందరూ ఈ తరహా కాలుష్యాలకు దూరంగా ఉండాలి. రక్షణ కోసం ప్లెయిన్ గ్లాసెస్ వాడటమూ మంచిదే. ఈ సమస్య ఉన్నవారు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కన్ను స్వచ్ఛమైన నీటితో కడుగుతూ ఉండాలి. డాక్టర్‌ను సంప్రదించి యాంటీ అలర్జిక్ చుక్కల మందు వాడాల్సి ఉంటుంది. (కేవలం రూ. 500తో మొదలై, కష్టాలను ‘పచ్చడి’ చేసింది!)అయితే హానికరం కాదు కదా అంటూ ఈ సమస్యను అలాగే వదిలేస్తే... దీర్ఘకాలం తర్వాత చూపు కాస్తంత మందగించడం, కార్నియా పొర దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి కాబట్టి వీలైనంత త్వరగా కంటి డాక్టర్‌కు చూపించుకొని వారు సూచించే మందులు వాడాలి. -
కంజెనిటల్ గ్లుకోమా: ఒకసారి వస్తే.. జీవితాంతం పరీక్షలు చేయించుకోవాల్సిందేనా?
కంటిలో ఉండే ఓ ద్రవం తాలూకు ఒత్తిడి పెరగడం వల్ల కంటి నరం (ఆప్టిక్ నర్వ్) దెబ్బతిని చూపు కోల్పోయే పరిస్థితిని గ్లుకోమా (నీటికాసుల జబ్బు) అంటారన్న విషయం తెలిసిందే. చిన్న పిల్లల్లోనూ పుట్టుకతో వచ్చే కారణాలతో గ్లుకోమా వస్తే, దాన్ని కంజెనిటల్ గ్లుకోమాగా చెబుతారు. గతంలో కాస్త అరుదుగా కనిపించే ఈ కేసులు ఇటీవల విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కంజెనిటల్ గ్లుకోమా అంటే ఏమిటి, దాని లక్షణాలూ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సల వంటి అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. కన్ను ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతూ... కంటిలో ప్రవహించే ‘యాక్వస్ హ్యూమర్’ అనే ఒక ద్రవం సరైన రీతిలో ఎప్పటికప్పుడు ఒక డ్రైనేజ్ యాంగిల్ ద్వారా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. కొంతమంది చిన్నారుల్లో ఈ యాక్వస్ హ్యూమర్ ప్రవహించాల్సిన డ్రైనేజీ యాంగిల్ సరిగా అభివృద్ధి కాదు. దాంతో యాక్వస్ హ్యూమర్ బయటకు ప్రవహించలేక అక్కడే చిక్కుబడి΄ోతుంది. దాంతో కంటిలో ఒత్తిడి పెరిగి, కంటి నరంపైన కూడా ఒత్తిడి పెరిగి కంటి నరం దెబ్బతింటుంది. ఇలా కంటిలోని యాక్వస్ హ్యూమర్ బయటకు వెళ్లలేక ఒత్తిడి పెరిగి చూపు కోల్పోయే పరిస్థితినే ‘కంజెనిటల్ గ్లుకోమా’ లేదా చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే గ్లుకోమా అంటారు. ఎప్పుడు బయటపడుతుంది?కంజెనిటల్ గ్లుకోమా ముఖ్యంగా రెండు రకాలు. మొదటిది ప్రైమరీ కంజెనిటల్ గ్లుకోమా, రెండోది సెకండరీ కంజెనిటల్ గ్లుకోమా. ప్రైమరీ కంజెనిటిల్ గ్లుకోమాలో ఇతరత్రా అబ్నార్మాలిటీస్ ఉండవు. సెండకరీ కంజెనిటల్ గ్లుకోమాలో కార్నియాకు, ఐరిస్లకు సంబంధించిన అబ్ నార్మాలిటీస్ కూడా ఉంటాయి. ఇక ప్రైమరీ కంజెనిటల్ గ్లుకోమాలో వయసును బట్టి మరో మూడు రకాలుంటాయి. అవి... పుట్టుకతోనే వస్తే దాన్ని కంజెనిటల్ గ్లుకోమా. పుట్టిన మూడేళ్లప్పుడు (0 – 3) బయట పడేవి ఇన్ఫెంటైల్ గ్లుకోమా. మూడేళ్ల తర్వాతది జువెనైల్ గ్లుకోమా. లక్షణాలు... కొన్ని లక్షణాలను బట్టి పిల్లల్లో కంజెనిటల్ గ్లుకోమా ఉందేమోనని సాధారణంగా అనుమానిస్తుంటారు. ఉదాహరణకు పిల్లల కంట్లోంచి అదేపనిగా ఎక్కువగా నీరు స్రవిస్తున్నా, కొద్ది΄ాటి వెలుతురునూ పిల్లలు భరించలేక΄ోతున్నా లేదా కాంతి పడగానే కన్ను గట్టిగా మూయడం లేదా కనుగుడ్డు పెద్దదిగా మారడం, కంట్లోని నల్ల΄ాప మసకగా మారిపోతున్నా పిల్లల్లో కంజెనిటల్ గ్లుకోమా ఉందేమోనని అనుమానించాలి. వీటన్నింటిలోనూ కనుగుడ్డు పరిమాణం (సైజ్) పెద్దగా మారి΄ోతుండటాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఈ లక్షణాలతో పాటు పిల్లలు అదేపనిగా ఏడుస్తుండటం, తరచూ వాంతులు చేసుకుంటుండటం, ముఖ్యంగా తిన్న వెంటనే ఇలా జరుగు తుంటే తక్షణం కంటి వైద్యనిపుణులకు తప్పనిసరిగా చూపించాలి. నిర్ధారణ ఇలా... ∙కంట్లో ఉండే ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్‌ను కొలవడం ∙కంట్లోని నల్ల΄ాప వ్యాసాన్ని కొలవడం ∙కంటోని నల్ల΄ాప ఎంత స్పష్టంగా ఉందో చూడటం ∙కనుగుడ్డు మొత్తం పరిమాణం (యాగ్జియల్ లెంగ్త్)కొలవడం కంటి నరం, కంటి డిస్క్‌కు జరిగిన నష్టాన్ని తెలుసుకోవడం కంటిలో దృష్టిలోపాలు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవడం ∙యాక్వియస్ హ్యూమర్ బయటకు వెళ్లే డ్రైనేజీ యాంగిల్‌ను అంచనా వేయడం కోసం ‘గోనియోస్కోపీ’ అనే పరీక్షను నిర్వహించడం. సర్జికల్ చికిత్సలు... ఇందులో యాంగిల్ సర్జరీ, ఫిల్టరేషన్ సర్జరీ, డ్రైయినేజ్ సర్జరీ అనే మూడు అంశాల కోసం సర్జరీలు జరుగుతాయి. యాంగిల్ సర్జరీ కోసం గోనియాటమీ, ట్రాబెక్యులాటమీ అనే శస్త్రచికిత్సలు చేస్తారు. కార్నియా స్పష్టంగా (క్లియర్‌గా) ఉన్నవాళ్లలో గోనియాటమీ అనే శస్త్రచికిత్స చేస్తారు. ఇందులో 70% వరకు మంచి ఫలితాలే వస్తాయి ∙కార్నియా మసకగా ఉన్నవాళ్లలో ట్రాబ్యెక్యులాటమీ అనే శస్త్రచికిత్స చేస్తారు ∙ఇంకా కొంతమందిలో ఫిల్టరింగ్ ఆపరేషన్స్ అనే ట్రాబెక్యులెక్టమీ, క్లియరెక్టమీ అనే శస్త్రచికిత్సలూ చేస్తారు ∙డ్రైయినేజ్ ప్రొసీజర్ కోసం షంట్ సర్జరీ / వాల్వ్ సర్జరీ అనేది చేస్తారు ∙చికిత్స కోసం పిల్లలను బాగా ఆలస్యంగా తీసుకువచ్చినప్పుడు వాళ్లలో క్రైయో లేదా డయోడ్ లేజర్ అనే ప్రక్రియలతో చికిత్స అందిస్తారు. ఈ చికిత్సలకు తోడు... పిల్లల్లో రెఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉన్నప్పుడు వాళ్లకు కంటి అద్దాలు ఇస్తారు. కొందరిలో ఒక కన్ను మూసి, ఒక కన్ను తెరచి ఉంచే ప్యాచింగ్ /ఆంబ్లోపియా చికిత్సలు అందిస్తారు. జెనెటిక్స్ విభాగంలోని ఇప్పుడు వచ్చిన పురోగతితో ఈ తరహా జెనెటికల్ సమస్యలకు మూడు రకాల జన్యువులు కారణం అని తెలుసుకున్నారు. తల్లిదండ్రుల్లో ఈ జన్యువులు ఉంటే, పుట్టిన పిల్లలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. ఒకసారి గ్లుకోమా శస్త్రచికిత్స అయ్యాక... ఆ పిల్లలు క్రమం తప్పకుండా జీవితాంతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. వంశపారంపర్యమా... కాదా?ఇది పూర్తిగ వంశ పారంపర్యమే అని చెప్పలేకపోయినప్పటికీ... తల్లిదండ్రులిద్దరిలోనూ గ్లుకోమా ఉంటే... వారి పిల్లల్లో ఛైల్డ్‌హుడ్ గ్లుకోమా వచ్చే అవకాశాలు 10 శాతం వరకు ఉంటాయి. ఒకవేళ తలిదండ్రులిద్దరిలో ఒకరికి గ్లుకోమా ఉంటే వారి తొలిచూలు, మలిచూలులో పుట్టిన పిల్లల్లో కంజెనిటల్ గ్లుకోమా వచ్చే అవకాశాలు 5 శాతం మందిలో ఉంటాయి. ఒకవేళ పుట్టిన తొలిచూలు, మలిచూలు పిల్లల్లో కంజెనిటల్ గ్లుకోమా ఉంటే... ఆ తర్వాత పుట్టే పిల్లల్లో గ్లుకోమా వచ్చే అవకాశాలు 25 శాతం మేరకు ఉంటాయి. కంజెనిటల్ గ్లుకోమా నిర్ధారణ అయితే... దానికి శస్త్రచికిత్స చేయడమన్నదే ప్రధానంగా అందించాల్సిన చికిత్స. గ్లుకోమా ఉన్నట్లు తేలగానే డాక్టర్లు ఇచ్చే చుక్కల మందులు కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే. ఇవి కంట్లో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడమే కాకుండా కార్నియల్ క్లారిటీ కోసం ఉపయోగపడతాయి. ఈ కార్నియల్ క్లారిటీ వల్ల చిన్నారులకు ఏ ఆపరేషన్ ఉపయోగపడుతుందో నిర్ధారణ చేయవచ్చు. ఈ శస్త్రచికిత్సలో... కంట్లో యాక్వియస్ హ్యూమర్ వల్ల పెరుగుతున్న ఒత్తిడంతా తొలగి΄ోయేలా... ఆ ద్రవాన్నంతా బయటకు పంపుతారు (అంటే డ్రైయిన్ చేస్తారు). అయితే... కంట్లోని ఆ ఒత్తిడి తొలగించడానికి ఒక్కోసారి ఒకటి కంటే ఎక్కువ శస్త్రచికిత్సా విధానాలు (మల్టిపుల్ సర్జికల్ ప్రొసిజర్స్) అవసరం పడవచ్చు. డాక్టర్ రవికుమార్ రెడ్డి సీనియర్ కంటి వైద్య నిపుణులు -
గాయిటర్ అంటే...? లక్షణాలు, చికిత్స!
మన శరీరంలో అనేక గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులలో థైరాయిడ్ గ్రంథి చాలా కీలకమైనది. మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకృతిలో శ్వాసనాళానికి రెండువైపులా ఉండే ఈ గ్రంథి థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. కొందరిలో ఈ గ్రంథి చాలా పెద్ద సైజుకు పెరిగిపోతుంది. ఇలా థైరాయిడ్ గ్రంథి అసాధారణమైన సైజుకు పెరగడాన్ని ‘గాయిటర్’ అంటారు. గాయిటర్ రకాలు... ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి డిఫ్యూస్ గాయిటర్, రెండోది నాడ్యులార్ గాయిటర్. సాధారణ పరిమాణం కంటే థైరాయిడ్ గ్రంథి ఉబ్బిపోయి ఇరువైపులా సమానంగా పెరగడాన్ని ‘డిఫ్యూస్ గాయిటర్’గా పరిగణిస్తారు. ఇక రెండోది ‘నాడ్యులార్ గాయిటర్’. ఈ నాడ్యులార్ గాయిటర్‌లో థైరాయిడ్ గ్రంథిలోని ఏదైనా ఒక భాగంలో ఒకటి లేదా ఇంకా ఎక్కువ సంఖ్యలో గడ్డలు ఏర్పడతాయి. థైరాయిడ్ గ్రంథిలో ఇలా గడ్డలు పెరగడాన్ని నాడ్యులార్ గాయిటర్ అంటారు. గాయిటర్ సమస్య వచ్చిన కొంతమందిలో సాధారణంగా థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో ఎలాంటి మార్పులూ కనిపించవు. కానీ మరికొందరిలో మాత్రం థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువగా గానీ లేదా తక్కువ మోతాదులోగానీ ఉత్పత్తి అవుతుంటాయి. ఒకవేళ హార్మోన్ల ఉత్పత్తి మోతాదులు పెరిగితే దాన్ని ‘హైపర్ థైరాయిడిజం’ అనీ, తగ్గితే ‘హైపోథైరాయిడిజమ్’ అని అంటారు. హైపర్ థైరాయిడిజమ్‌లో జీవక్రియల వేగం పెరగడంతో బాధితులు సన్నబారిపోవడం, హైపో థైరాయిడిజమ్‌లో జీవక్రియలు మందగించడంతో బాధితులు లావెక్కడం అనే ప్రధాన లక్షణాలతో పాటు మరికొన్ని సమస్యలు కనిపిస్తాయి. నిర్ధారణ పరీక్షలు... గొంతు దగ్గర బాగా ఉబ్బి కనిపించడం అనే పైకి కనిపించే లక్షణంతో దీన్ని కొంతవరకు నిర్ధారణ చేసినప్పటికీ... పూర్తి నిర్ధారణ కోసం థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలైన టీ3, టీ4, టీఎస్‌హెచ్, అల్ట్రాస్కాన్, ఎఫ్ఎన్ఏసీ వంటివి అవసరమవుతాయి. చికిత్స...థైరాయిడ్ సమస్య నిర్ధారణ కోసం చేసే పరీక్షల ఫలితాల ఆధారంగా గాయిటర్ చికిత్సకు ఎండోక్రైనాలజిస్ట్ ఆధ్వర్యంలో తగిన చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇప్పటికి అందుబాటులో ఉన్న వైద్యపరిజ్ఞానంతో థైరాయిడ్ వ్యవస్థను సరిచేయడం ద్వారా కొంతమందిలో థైరాయిడ్ గ్రంథి వాపు (గాయిటర్) తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ఇలాంటి రోగులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డా. వ్రిందా అగర్వాల్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ -
చిన్న పాప.. పెద్ద జబ్బు... నయం కావాలంటే రూ. 16 కోట్లు కావాలి
మైసూరు: చిత్రంలో కనిపించే చిన్నారికి పెద్ద జబ్బే సోకింది. ఆ జబ్బు నయం కావాలంటే రూ. 16 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో కన్నవారు హడలిపోయారు. తమ బిడ్డను కాపాడేందుకు దాతలు సహాయం చేయాలని వేడుకుంటున్నారు. వివరాలు.. మైసూరులో దేవరాజు మొహల్లాలో నివసించే హెచ్.నాగశ్రీ, ఎన్.కిశోర్ దంపతులకు 22 నెలల కీర్తన అనే కూతురు ఉంది. కానీ చిన్నారికి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) అనే అరుదైన జబ్బు సోకిందని ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. దీనివల్ల పాప ఎప్పుడూ నీరసంగా ఉంటుంది, కండరాలు బలహీనంగా ఉంటాయి, కనీసం ఆహారం నమలడం కూడా చేత కాదు. ఇక ఆడుకోవడం అనేదే ఉండదు. ఈ జబ్బు రెండవ దశలోకి వచ్చిందని, పాప మరింత బలహీనమైందని వాపోయారు. జన్యు చికిత్స, అరుదైన ఇంజెక్షన్లతో వైద్యం చేయిస్తే నయమవుతుందని వైద్యులు తెలిపారు, కానీ అందుకు రూ. 16 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. నిత్యం ఒక టానిక్ తాగాల్సి ఉంటుంది, ఒక్క బాటిల్ ధర రూ. 6 లక్షలని చెప్పారు. పేదవాళ్లయిన తమకు అంత స్తోమత లేదని, దాతలే ఆదుకోవాలని అభ్యర్థించారు. వివరాలకు చిన్నారి తండ్రి కిశోర్‌ని 9901262206 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
జాకీర్ హుస్సేన్ ఉసురు తీసిన ప్రాణాంతక వ్యాధి, ఈ విషయాలు తెలుసుకోండి!
ప్రఖ్యాత తబలా వాయిద్య కళాకారుడు జాకీర్ హుస్సేన్ అనారోగ్యంతో కన్నుమూయడం సంగీత ప్రపంచాన్ని శోక సంద్రంలోకి నెట్టేసింది. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ (ఐపీఎఫ్) తో అనే దీర్గకాలిక వ్యాధితో బాధపడుతూ శాన్ ఫ్రాన్సిస్కోలో తుదిశ్వాసతీసుకున్నారు.దీంతో అసలేంటి ఐపీఎఫ్? ఇది అంత ప్రమాదకరమా? చికిత్స లేదా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణలు, నివారణ మార్గాలను తెలుసుకుందాం. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అంటే ఏమిటి?సాధారణంగా ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్‌ను ప్రాణాంతక వ్యాధిగా పరిగణిస్తారు. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అనేది ఊపిరితిత్తులలోని గాలి సంచులు లేదా అల్వియోలీ ( ఊపిరితిత్తులలోని చిన్న, సున్నితమైన గాలి సంచులు)గాలి పీల్చినప్పుడు రక్తప్రవాహంలోకి ఆక్సిజన్ పొందడానికి అవి సహాయపడతాయి. వీటి చుట్టూ ఉన్న కణజాలాలను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధే ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్.అమెరికా నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ (NIH) ప్రకారం, ఇది తీవ్రమైన దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, ఇది అవయవంలోని గాలి సంచులు లేదా అల్వియోలీ చుట్టూ ఉన్న కణజాలాలను ప్రభావితం చేస్తుంది. ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ మచ్చలు, ఊపిరితిత్తుల కణజాలం మందంగా మారిపోతుంది. ఫలితంగా ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఈ లక్షణాలు ఇవి మరింత ముదిరి ఊపిరితిత్తుల పనితీరు సన్నగిల్లి, రక్తంలోకి, శరీరంలోని మిగిలిన భాగాలకు ఆక్సిజన్ సరఫరా కష్టమవుతుంది. అల్వియోలీ గోడలు మందంగా మారి మచ్చలు రావడాన్నే ఫైబ్రోసిస్ అంటారు. అలాగే ఇడియోపతిక్ అంటే ఈ పరిస్థితికి కారణమేమిటో గుర్తించలేకపోవడం. ఈ వ్యాధిని సరియైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రాణానికి కూడా ప్రమాదం.కారణాలుధూమపానం అలవాటున్న వారికి, ఫ్యామిలీలో అంతకుముందు ఈ వ్యాధి వచ్చిన చరిత్ర ఉన్నా ఆ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది . సాధారణంగా 60- 70 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధికనిపిస్తుంది. అంతేకాదు ఈ వ్యాధి ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ వ్యాధి స్త్రీల కంటే పురుషులలోనే ఎక్కువగా కనిపిస్తుంది. రసాయనాలు లేదా ప్రమాదకర పదార్థాలను ఎక్కువగా పీల్చడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయిలక్షణాలుఊపిరి ఆడకపోవడం: మొదట్లో అలసిపోయినపుడు ఊపిరి పీల్చుకోవడం కష్టమవు తుంది. వ్యాధి ముదురుతున్న కొద్దీ శ్వాస సమస్యలు పెరుగుతాయి. ఏపనీ చేయంకుండా, విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది.విపరీతమైన పొడిదగ్గుకీళ్ళు ,కండరాలలో నొప్పిఅలసిపోయినట్లు లేదా బలహీనంగా అనిపించడం .కారణం లేకుండానే బరువు తగ్గడంనైల్ క్లబ్బింగ్ అంటే చేతివేళ్లు లేదా కాలి వేలి గోర్లు వెడల్పుగా, స్పాంజిలాగా ఉబ్బినట్లుగా అవ్వడం రక్తంలో చాలా తక్కువ ఆక్సిజన్ వల్ల సైనోసిస్, నీలిరంగు చర్మం , నోటి చుట్టూ, చర్మంపైనా, కళ్ల చుట్టూ బూడిద రంగు లేదా తెల్లటిమచ్చలుఈ లక్షణాలు కొందరిలో చాలా త్వరగా వ్యాపిస్తాయి. మరికొందరిలో చాలా నెమ్మదిగా వ్యాపిస్తాయి. దీర్ఘం కాలం పాటు ఉంటే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. తగిన వైద్యపరీక్షలు చేయించుకోవాలి. చికిత్స లేదుఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్‌కు ప్రస్తుతానికి ఖచ్చితమైన చికిత్స లేదు. అయితే కొన్ని మందులు, ఇతర చికిత్సలు ద్వారా వ్యాధి ముదరకుండా జాగ్రత్తపడవచ్చు. ఊపిరితిత్తులకు ఎక్కువ నష్టం వాటిల్లకుండా కాపాడుకోవచ్చు. నోట్: ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే అని గమనించగలరు. వ్యాధి ఏదైనా, నిపుణుల పర్యవేక్షణలో, సంబంధిత వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించుకొని చికిత్సతీసుకోవాల్సి ఉంటుంది. -
ముక్కుదిబ్బడ బాధిస్తోందా?!
అదో చిత్రమైన పరిస్థితి. చూడ్డానికి అంతా బాగానే ఉంటుంది. కానీ ముక్కు రంధ్రాల్లో ఏదో అడ్డు ఉన్న భావనతో గాలి ఆడటం కష్టమవుతుంది. ఒక్కోసారి ఒక్కో ముక్కు రంధ్రం నుంచి మాత్రమే గాలాడుతుంటుంది. అదీ అతి కష్టంగా. నలుగురితో ఉన్నప్పుడు ముక్కు ఎగబీలుస్తూ, గాలాడని ముక్కు రంధ్రాన్ని తెరవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరీ ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కోసారి గురక కూడా వస్తుంది. ఈ గాలి ఆడకపోవడం సమస్యకు అదనంగా చికాకూ, చిరాకూ కలుగుతుంటాయి. ఈ సమస్య ఎందుకొస్తుంది, పరిష్కారాలేమిటో చూద్దాం.ముక్కుదిబ్బడ కారణంగా శ్వాస పీల్చుకోలేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. రకరకాల కారణాలతో వచ్చే అలర్జీలు, సైనసైటిస్, ముక్కులోని రెండు రంధ్రాల మధ్యన ఉండే దూలం (సెప్టమ్) సరిగా లేకపోవడం, (అంటే) ముక్కు దూలం పూర్తిగా నిటారుగా లేకుండా అది ఎంతో కొంత ఒంపు తిరిగి ఉండటం వంటి అనేక అంశాలు శ్వాస సరిగా తీసుకోలేకపోవడానికి కారణమవుతాయి. నిజానికి ముక్కు నుంచి ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్లేలోపు... ఊపిరి పీల్చుకునే సమయంలోనే ముక్కులో కొన్ని ప్రక్రియలు జరుగుతాయి. ముందుగా బయటి నుంచి ముక్కులోకి ప్రవేశించిన గాలి ఉష్ణోగ్రతను... ఊపిరితిత్తుల వద్ద ఉన్న ఉష్ణోగ్రతతో దాదాపు సమం చేయడానికి ముక్కులోని మ్యూకస్ పొరలపై ఉండే నేసల్ టర్బినేట్స్ ప్రయత్నిస్తాయి. బయటి తేమను ఊపిరితిత్తుల వద్ద ఉన్న తేమతో సమం చేయడానికీ ఈ టర్బినేట్స్ కృషిచేస్తాయి. ముక్కులోపలి వెంట్రుకల సహాయంతో గాలిలోని కాలుష్యాలు కొంత ఫిల్టర్ అవుతాయి. అయితే అలర్జీల సమస్య ఉన్నవారిలో ముక్కులోని మ్యూకస్ పొరల్లో ఇన్ఫ్లమేషన్ కారణంగా వాపు వచ్చే అవకాశముంది కాబట్టి ముక్కు ద్వారా గాలి సాఫీగా లోపలికి వెళ్లే ప్రక్రియలో కొంత అడ్డంకులు ఏర్పడతాయి. ఈ అడ్డంకుల కారణంగానే ‘ముక్కు దిబ్బడ’ వస్తుంది. దాంతో గాలిని బలంగా పీల్చడం లేదా నోటితో గాలి పీల్చాల్సి రావడం జరుగుతుంటుంది. ఇలాంటివారు కాస్త పక్కకు ఒరుగుదామన్నా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే పడుకుంటే ఈ బాధ మరింత పెరుగుతుంది. కూర్చున్నప్పుడే కొద్దిమేర ఈ సమస్య తగ్గినట్టు అనిపిస్తుంది. కొన్ని వైద్య చికిత్సలు... ముక్కుదిబ్బడ సమస్య ఉపశమనం కోసం కొన్ని రకాల సింపుల్ చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ సలహాతో డీకంజెస్టెంట్స్, యాంటీహిస్టమైన్స్, నేసల్ స్ప్రేస్ వంటి మందుల్ని వాడటం మేలు. వీటితో చాలా వరకు మంచి ప్రయోజనం ఉంటుంది. ∙యాంటీహిస్టమైన్స్ : ట్యాబ్లెట్స్ రూపంలో లభ్యమయ్యే ఈ మందులు కఫం రూపంలో ఉండే మ్యూకస్‌ను వీలైనంతగా తొలగించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని దూరం చేసి, శ్వాస సాఫీగా జరిగేలా చూస్తాయి. అయితే యాంటీహిస్టమైన్స్‌లో ప్రతికూలత ఏమిటంటే ఇవి వాడినప్పుడు బాధితులు చాలావరకు మందకొడిగా కనిపిస్తుంటారు. చురుకుదనం ఎక్కువగా ఉండదు. డీకంజెస్టెంట్స్ : ముక్కులో కేవలం రెండు చుక్కలతో చాలావరకు ప్రయోజనం ఉంటుంది. ఈ చుక్కల మందు... ముక్కులోని అడ్డంకి ఫీలింగ్‌ను తొలగించడానికి, టర్బినేట్స్ డీ–కంజెషన్కు ప్రయత్నిస్తాయి. ముక్కు కారడం వంటి సమస్యలు పరిష్కారం దొరకక΄ోయినా శ్వాస సాఫీగా అయ్యేందుకు ఇవి చాలావరకు తోడ్పడతాయి. ∙సెలైన్ నేసల్ స్ప్రే : ముక్కులోకి స్ప్రే చేసుకునే ఈ మందులు ముక్కుదిబ్బడను తాత్కాలికంగా తగ్గిస్తాయి. ఆవిరి పట్టడం : అనేక శతాబ్దాలుగా అనుసరిస్తున్న ఇంటి చిట్కా ఇది. ముక్కు దిబ్బడ పట్టిన సందర్భాల్లో ప్రతి ఒక్కరూ ముందుగా ప్రయత్నించదగిన ప్రక్రియ ఆవిరి పట్టడం. విక్స్ లాంటి మందును వేడి నీటిలో వేసి ఆవిరి పట్టే ఈ ప్రక్రియ చాలా సురక్షితమైనది. అయితే వీటిన్నింటితో ప్రయోజనం లేనప్పుడు డాక్టర్లు ముక్కు దూలం సరిచేయడానికి శస్త్రచికిత్సను సూచిస్తారు. లేదా ఇతరత్రా కారణాలను బట్టి చికిత్స అందిస్తారు. మరికొన్ని అనర్థాలు కూడా... తరచూ ముక్కుదిబ్బడ సమస్యతో బాధపడుతుండేవారిలో దీర్ఘకాలంలో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు వాళ్లలో గురక, స్లీప్ ఆప్నియా, తగినంత నిద్ర లేకపోవడం, పట్టిన కొద్దిపాటి నిద్రలో నాణ్యత లేకపోవడం, రాత్రి నిద్ర సరిపోకపోవడంతో అసహనం, పనిపై దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటి అనేక సమస్యలు కనిపిస్తుంటాయి. డాక్టర్ ఈ.సీ. వినయకుమార్, సీనియర్ ఈఎన్టీ సర్జన్ (చదవండి: ప్లాస్టిక్స్ బరువును పెంచుతాయా..?) -
నిమ్మరసం, పచ్చిపసుపుతో క్యాన్సర్‌కు చెక్? సిద్ధూకి రూ. 850 కోట్ల లీగల్ నోటీసు
మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్‌కి నవజ్యోత్ సింగ్ సిద్ధూకి భారీ షాక్ తగిలింది. అల్లోపతి మందులు లేకుండానే తన భార్య 4వ దశ క్యాన్సర్ నుంచి అద్భుతంగా కోలుకుందన్న వ్యాఖ్యలపై ఛత్తీస్‌గఢ్ సివిల్ సొసైటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.వారం రోజుల్లోగా సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని లీగల్ నోటీసులిచ్చింది. లేనిపక్షంలో రూ.850 కోట్ల పరిహారం చెల్లించాలంటూ నోటీసులిచ్చింది. అంతేకాదు సిద్ధూ వ్యాఖ్యలు క్యాన్సర్ బాధితులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, క్షమాపణలు చెప్పాలని కోరింది.డైట్ కంట్రోల్ వల్ల తన భార్య నవజ్యోత్ కౌర్‌కు స్టేజ్-4 క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్) నయమైందంటూ సిద్ధూ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. పాలు, చక్కెర పదార్థాలకు దూరంగా ఉంటూ, నిమ్మరసం, పచ్చిపసుపు, వేప, తులసి లాంటి పదార్థాలతో కేవలం 40 రోజుల్లోనే తన భార్య వైద్యపరంగా క్యాన్సర్‌ను జయించిందని మీడియా సమావేశంలో వెల్లడించారు. తాజాగా దీనిపై సివిల్ సొసైటీ తీవ్రంగా మండిపడింది. సిద్ధూ వాదనలు సందేహాస్పదమైనవి, తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని, ఇది క్యాన్సర్‌తో పోరాడుతున్న ఇతరులకు ప్రమాదకరంగా మారుతుందని సొసైటీ కన్వీనర్ డాక్టర్ కులదీప్ సోలంకి ఒక ప్రకటనలో తెలిపారు.కాగా పలువురు వైద్య నిపుణులు, ఆంకాలజిస్టులు కూడా సిద్ధూ వ్యాఖ్యల్ని ఖండించారు. సిద్ధూ వ్యాఖ్యలకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని టాటా మెమోరియల్ ఆసుపత్రి కూడా ప్రకటించింది. కేవలం శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి నిరూపితమైన చికిత్సలతోనే క్యాన్సర్‌ను నయం చేయవచ్చని తెలిపింది. అయితే దీనిపై స్పందించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ డైట్ ప్లాన్‌ను వైద్యులతో సంప్రదించి అమలు చేశామని ,"చికిత్సలో సులభతరం"గా పరిగణించాలని సోమవారం తెలిపాడు. మరి తాజా నోటీసులపై ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. ఇదీ చదవండి: ఐశ్వర్య డ్రెస్సింగ్‌పై దారుణంగా ట్రోలింగ్ : ‘బచ్చన్’ పేరు తీసేసినట్టేనా? -
కనురెప్పలకూ చుండ్రు, నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
చుండ్రు ఇబ్బందికరంగా ఉంటుంది, ప్రత్యేకించి శీతాకాలంలో. చుండ్రు అనగానే తలలో మాత్రమే వస్తుందని అనుకుంటాం. కానీ కనురెప్పలు, కనుబొమ్మలపై సైతం చుండ్రు ఏర్పడుతుంది ఇది సాధారణంగా శీతాకాలం లేదా సీజన్ మార్పుల సమయంలో కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది సాధారణమే అయినా..చికిత్స చేయకుండా వదిలివేస్తే ప్రమాదకరం అని కూడా సూచిస్తున్నారు. ఇది ఎందుకు వస్తుంది, లక్షణాలు, నివారణ మార్గాలు చూద్దాం రండి!కనురెప్పలతోపాటు మీసాలు , ముక్కు మీద కూడా చుండ్రు కనిపిస్తుంది! ఇతర ప్రాంతాల మాదిరిగా కాకుండా, కనురెప్పల చుండ్రును చికిత్స చేయకుండా వదిలేస్తే కొన్ని తీవ్రమైన ప్రమాదాలొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా లెన్స్ ధరించేవారు, ఇన్ఫెక్షన్లను నివారించడానికి కనురెప్పల చుండ్రు పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఐలైనర్, మస్కరాతో నిద్రించే అలవాటు ఉండే వారు కూడా అప్రమత్తంగా ఉండాలి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ (స్టెఫిలోకాకస్) కనురెప్పల ద్వారా ఉత్పత్తి అయ్యే నూనెలలో తగ్గుదల, డెర్మటైటిస్,సెబోరిహెక్ డెర్మటైటిస్ మూలంగా కనుబొమ్మలు, కనురెప్పలపై చుండ్రు సమస్య తలెత్తుతుంటుంది. బ్లెఫారిటస్ డెర్మటైటిస్ వల్ల కనురెప్పల అంచుల్లోవాపు, మంట, ఇరిటేషన్ లాంటివి వస్తాయి. సెబోరిహెక్ డెర్మటైటిస్ లో క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ కండిషన్ ఎదుర్కొంటాం. లక్షణాలుకనురెప్పల చుండ్రు బైటికి పెద్దగా కనిపించకపోయినప్పటికీ, కనురెప్పల దురద, కనురెప్పలు ఎర్రగా మారడం, కళ్లలో మంట లేదా కనురెప్పల అడుగుభాగంలో పొలుసుల చుండ్రు , కళ్ల వెంబడి నీళ్లు, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వెంట్రుకలపై చుండ్రు ఉండటం కేవలం సౌందర్య సమస్య కాదు, కంటి ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది.కళ్లు ఎప్పుడూ చికాకు పెట్టడం, ఎర్రబడటం, కను బొమ్మలు ఊడిపోవడం పొడిబారడం, కార్నియల్ దెబ్బతినడం స్టైస్ లాంటి సమస్యలొస్తాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే, కండ్లకలక లేదా కెరాటిటిస్ (కార్నియా వాపు) వంటి దీర్ఘకాలిక కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇరిటేషన్ వల్ల కళ్లను ఎక్కువగా రుద్దడం వల్ల కార్నియాలు బలహీనపడతాయి, ఇది కెరాటోకోనస్ (కార్నియా సన్నబడటానికి, కోన్ ఆకారంలోకి ఉబ్బడానికి కారణమయ్యే కంటి వ్యాధి) వంటి పరిస్థితులకు దారితీయవచ్చు.చిట్కాలు: రాత్రి పడుకోబోయే ముందు టేబుల్ స్పూను బాదం ఆయిల్ తీసుకుని దాన్ని వేడి చేసి, గోరువెచ్చగా ఉన్నపుడు కనుబొమ్మలు, కనురెప్పల మీద సున్నితంగా మసాజ్ చేయాలి. ఉదయం లేచిన తర్వాత చల్లటి నీళ్లతో కనురెప్పలు, కనుబొమ్మలు శుభ్రంగా కడుక్కోవాలి.కల్లీలేని కొబ్బరి నూనె, అలోవెరా జెల్ కలిపి, దురదగా ఉన్న చోట్ల మృదువుగా అప్లయ్ చేయాలి .ఫంగస్ కారణంగా కనుబొమ్మలు, కనురెప్పలపై ఏర్పడే చుండ్రు పోగొట్టడానికి టీ ట్రీ ఆయిల్ ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీఫంగల్ సుగుణాలు చాలా ఉన్నాయి. టేబల్ స్పూను టీట్రీ ఆయిల్ తీసుకుని దాన్ని మైక్రోవేవ్ లో కొన్ని సెకన్ల పాటు వేడిచేయాలి. ఈ నూనెను కాటన్ బాల్ సాయంతో కనుబొమ్మలపై, కనురెప్పలపై సున్నితంగా రాసి పది నిమిషాలు అలాగే ఉంచి, తరువాత శుభ్రంగా కడగాలి. నోట్ : ఇది అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే. సమస్య తీవ్రతను గుర్తించి సమస్య మరీ ముదరకుండా వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. -
పిల్లల్లో దొడ్డికాళ్లు, కారణాలు తెలుసుకోండి!
పిల్లల్లో మోకాళ్ల వద్ద దూరం ఎక్కువగా ఉండి, చిన్నారుల అరికాళ్లు దగ్గరగా ఉంచినప్పుడు ఈ రెండు కాళ్లూ బయటివైపునకు విల్లులా ఒంగి ఉండే కండిషన్‌ను ఇంగ్లిష్‌లో బౌడ్ లెగ్స్, వైద్యపరిభాషలో జీనూవేరమ్ అంటారు. తెలుగు వాడుక భాషలో ఈ కండిషన్‌ను ‘దొడ్డికాళ్లు’ అంటుంటారు. నిజానికి పుట్టిన పిల్లలందరూ చిన్నతనంలో కొన్నిరోజుల పాటు ఎంతోకొంత దొడ్డికాళ్ల (బౌడ్ లెగ్స్) కండిషన్‌ను కలిగి ఉంటారు. శిశువు తన పిండ దశలో దగ్గరగా ముడుచుకుని (ఫోల్డెడ్ పొజిషన్లో) ఉండటమే దీనికి కారణం. అందువల్ల అప్పుడే పుట్టిన పిల్లల్లో కాళ్లు ఇలా ఉండటం చాలా సాధారణం. పిల్లలు నడక మొదలు పెట్టాక, వాళ్లు తమ కాళ్లపై కొంత బరువు మోపుతుండటం మొదలుకావడంతో... అంటే... ఒకటిన్నర–రెండు సంవత్సరాలప్పటి నుంచి వాళ్ల కాళ్లు మామూలుగా కావడం మొదలవుతుంది. దాదాపు మూడేళ్ల వయస్సు వచ్చేసరికి కాళ్లు రెండూ నార్మల్ షేప్‌కు వస్తాయి. ఒకవేళ చిన్నారుల్లో వారు మూడేళ్లు పైబడ్డాక కూడా బౌడ్ లెగ్స్ (సివియర్ బౌడ్ లెగ్స్) కండిషన్ ఎక్కువగా కనిపిస్తుంటే అందుకు కారణాలు ఏమై ఉంటాయా అని ముందుగా ఆలోచించాలి. అంటే ఆ పరిస్థితికి... రికెట్స్ వంటి వ్యాధులు గానీ; లేదా లెడ్ (సీసం), ఫ్లోరైడ్స్ వంటి విష పదార్థాల ప్రభావం ఎక్కువ కావడం గానీ; లేదా ఎముకల షేప్ మారడం (బోన్ డిస్ప్లేసియాస్) వంటివి గానీ కారణం కావచ్చా అని ఆలోచించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాలతోనే ఒకవేళ బౌడ్ లెగ్స్ వచ్చి ఉంటే, దాన్ని కాస్తంత తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ జీనూవేరమ్ కండిషన్ ఉన్న పిల్లలకు ఎక్స్‌రే, రక్తపరీక్షల వంటివి చేసి కారణాలను నిర్ధారణ చేయాలి. కారణం తెలిశాక తగిన చికిత్స అందించాలి. అయితే మొదట్లో ఈ బౌడ్ లెగ్స్ కండిషన్ కనిపిస్తున్నప్పటికీ చిన్నారుల్లో మూడేళ్ల వయసు వచ్చే వరకు ఈ సమస్య గురించి ఆలోచించాల్సిన లేదా ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. మూడేళ్ల తర్వాత కూడా అలాగే ఉంటే మాత్రం అప్పుడు పిల్లల నిపుణులను లేదా ఆర్థోపెడిక్ నిపుణులను తప్పక సంప్రదించాలి. -
ఆస్టియోపోరోసిస్: 40 ఏళ్లు దాటాక.. ఈ జాగ్రత్తలు తప్పవు లేదంటే రిస్కే!
మామూలుగానే భారతీయుల్లో ఆస్టియో పోరోసిస్ కేసులు ఎక్కువ. ఇక మహిళల్లో ఈ రుగ్మత ముప్పు మరింత ఎక్కువ. యాభై ఏళ్లు దాటాక మహిళల్లో దాదాపు 40% నుంచి 50% మందిలో ఆస్టియోపోరోసిస్ కనిపించడం చాలా సాధారణంగా జరిగేదే. అలాగే మెనోపాజ్ దాటిన మహిళల్లో కనీసం 40% మందిలో ఇది కనిపిస్తుందంటే దీని విస్తృతి అర్థం చేసుకోవచ్చు. ఇక ఆస్టియోపోరోసిస్ వచ్చిన మహిళల్లో మూడింట ఒక వంతు మందికి ఏదో ఒక దశలో తుంటి ఎముక ఫ్రాక్చర్ కేసులు తప్పక కనిపిస్తాయి. వారికి ముప్పుగా పరిణమిస్తూ, వారిలో ఇంత విస్తృతంగా కనిపించే ఆస్టియోపోరోసిస్ గురించి తెలుసుకుందాం. మానవులందరిలోనూ 20 ఏళ్లు వచ్చే వరకు ఎముకల పెరుగుదల సంభవిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. కానీ దాదాపు 40 ఏళ్లు వచ్చేవరకు ఇవి బలంగానే ఉంటూ, ఆ తర్వాత క్రమంగా తమ బలాన్ని కోల్పోతూ పెళుసుగా మారి΄ోతుంటాయి. కానీ మహిళల్లో మాత్రం వాళ్ల ఓవరీల నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్– ఈస్ట్రోజెన్ తగ్గడం మొదలుకాగానే ఎముకలు బలహీనం కావడం ప్రారంభమవుతుంది. ఇక రుతుక్రమం ఆగిపోయాక ఈస్ట్రోజెన్ ఉత్పత్తి కూడా తగ్గిపోవడంతో ఈ అంశమే వాళ్లలో ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారిపోయి, తేలిగ్గా విరిగిపోయే కండిషన్ అయిన ఆస్టియోపోరోసిస్‌కు కారణమవుతుంది. మహిళల్లోనూ ఈ ముప్పు ఎవరెవరిలో... వయసు పెరుగుతున్న కొద్దీ ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు అందరికీ ఉన్నప్పటికీ, కొందరిలో మాత్రం ఈ రిస్క్ మరీ ఎక్కువ పోషకాహార లోపాలున్నవారికి... మన దేశంలో మహిళలు పాలు, విటమిన్ డి ఉన్న పదార్థాలు తీసుకోవడం చాలా తక్కువ. అన్ని పోషకాలూ ఉన్న ఆహారాలు తీసుకోవడమూ వాళ్లలో తక్కువే. కాబట్టి మహిళల్లో ఈ రిస్క్ మరింత ఎక్కువ రుతుక్రమం ఆగిన మహిళల్లోనూ, గర్భసంచితో పాటు ఒకటి లేదా రెండు ఓవరీస్ తీయించుకున్న వాళ్లల్లో. చాలాకాలం పాటు స్టెరాయిడ్స్ వాడేవారిలో వ్యాయామం చేయని వారిలో (మన దేశంలో మహిళల్లో వ్యాయామం చాలా తక్కువ) పొగతాగే అలవాటు ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి స్మోకింగ్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే టమద్యం తీసుకోవడం వల్ల శరీర కణాల (ప్రధానంగా ఎముక కణాల) అభివృద్ధి, పెరుగుదల ప్రభావితం అవుతాయి. ఫలితంగా మద్యం అలవాటు ఉన్నవాళ్లలో ఆస్టియోపోరోసిస్ రిస్క్ పెరుగుతుంది టకుటుంబ చరిత్ర... కుటుంబంలో ఎవరికైనా ఆస్టియో పోరోసిస్ ఉంటే ఆ కుటుంబ సభ్యులకు దీని రిస్క్ ఎక్కువ. ఆస్టియోపోరోసిస్ – నిర్ధారణ...రక్తపరీక్ష, ఎక్స్–రే, బీఎమ్‌డీ (బోన్ మాస్, డెన్సిటీ – అంటే ఎముక సాంద్రత నిర్ధారణ చేసే పరీక్షల ద్వారా రోగిలో దీన్ని నిర్ధారణ చేయవచ్చు)చికిత్స ఇలా...ప్రాథమిక నివారణ చర్యలు ఆస్టియోపోరోసిస్ కండిషన్‌ను ఆలస్యం చేస్తాయి. ఫలితంగా వయసు రిస్క్ తగ్గుతుంది. క్యాల్షియమ్, విటమిన్ ‘డి’...డాక్టర్లు ప్రాథమిక చికిత్సగా క్యాల్షియమ్, విటమిన్ ‘డి’ ఇస్తారు. అంటే... 60 ఏళ్లు దాటిన వారికి ప్రతిరోజూ 1500 ఎంజీ క్యాల్షియమ్నూ, విటమిన్–డిని రోజూ 10 నుంచి 15 ఎంజీ ఇస్తారు. బిస్ఫాస్ఫోనేట్స్...ఇవి ఒక రకం మందులు. వీటినే బిస్ఫాస్ఫోనేట్స్ అని కూడా అంటారు. ఎముక తనలోని పదార్థాన్ని కోల్పోయే ప్రక్రియను ఇవి ఆలస్యం చేస్తాయి. ఫలితంగా ఎముక సాంద్రత తగ్గే వేగం మందగిస్తుంది. దానివల్ల ఎముక మరింత కాలం దృఢంగా ఉంటుంది. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ రుతుక్రమం ఆగిన మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను తిరిగి భర్తీ చేసే ఈ చికిత్స ప్రక్రియను కూడా అవసరాన్ని బట్టి డాక్టర్లు చేస్తుంటారు. అయితే ఈ హెచ్ఆర్టీ వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా కనిపిస్తాయి. అంటే... రొమ్ముల సలపరం, మళ్లీ రుతుస్రావం మొదలుకావడం, బరువు పెరగడం, మూడ్స్ మాటిమాటికీ మారి΄ోవడం, మైగ్రేన్ తలనొప్పి రావడం వంటివన్నమాట. కాబట్టి రోగి కండిషన్ ను బట్టి హెచ్ఆర్టీ అవసరమా కాదా అన్నది డాక్టర్లే నిర్ధారిస్తారు. క్యాల్సిటోనిన్: ఈ మందులు ముక్కు ద్వారా పీల్చే మందుగా లభిస్తాయి. అయితే ఇవి తప్పనిసరిగా డాక్టర్ల సలహా మేరకే తీసుకోవాల్సి ఉంటుంది. టెరీపారటైడ్: ఇది ఆస్టియోపోరోసిస్ చికిత్స ప్రక్రియలో ఇది కూడా ఒక మందు. ఇది ఎముకలో పెళుసుబారిన చోట కొత్త కణజాలం ఉత్పత్తి అయ్యేలా దోహదపడుతుంది. ఫలితంగా ఎముక ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. ఈ మందును కడుపు ప్రాంతంలోగాని, తొడల ప్రాంతంలోగాని ఇంజెక్షన్ చేయడం ద్వారా శరీరంలోకి పంపుతారు. దాదాపు ఏడాదిన్నరపాటు ఉపయోగించాల్సి ఉంటుంది. మంచి ప్రభావకారి అయినప్పటికీ ప్రస్తుతం దీని ఖరీదు ఎక్కువ. వికారం (నాసియా), తలనొప్పి, కాళ్లూచేతుల నొప్పి వంటి కొన్ని సైడ్ఎఫెక్ట్స్ కూడా కనిపించే ఈ మందుల దీర్ఘకాల ప్రభావాలు ఇంకా తెలియదు.డోనోసుమాబ్స్: ఇది సరికొత్త మందు. చాలా వేగంగా పనిచేస్తుంది. చవకగా కూడా లభిస్తుంది. తీసుకోవడమూ సులభం.లక్షణాలు... ఎముకలు దేహం లోపల ఉంటాయి కాబట్టి ఆస్టియోపోరోసిస్ వచ్చే సూచనలు ముందే కనిపించేందుకు అవకాశం లేదు. ఇది చాప కింద నీరులా వచ్చే పరిణామం. ఎముకలు పలచబారడం దీర్ఘకాలం జరుగుతూ పోతే చిన్న గాయలకే ఎముకలు విరిగే ముప్పు పెరుగుతుంది. చిన్నపాటి ప్రమాదానికే ఎముక తేలిగ్గా విరిగిపోతుంటే దాన్ని ఆస్టియో పోరోసిస్గా గుర్తించవచ్చు. ఇక సాధారణంగా కనిపించే కొన్ని లక్షణాలు... ఒళ్లు నొప్పులు (జనరలైజ్డ్ బాడీ పెయిన్స్) టఎముకలు, కీళ్ల నొప్పులు (బోన్ అండ్ జాయింట్ పెయిన్స్) అలసట (ఫ్యాటిగ్నెస్)చిన్న ప్రమాదానికే ఎముక విరగడం విపరీతమైన వెన్ను నొప్పి, కాస్తంత వెన్ను ఒంగినట్లయి శరీరం ఎత్తు తగ్గడంసీ, డీ, ఈ, ఎఫ్, జీ, ఎస్.. ఎముకలు వీక్ ఆస్టియోపోరోసిస్ నివారణ కోసం ఉపయోగపడే అంశాలను చాలా తేలిగ్గా గుర్తు పెట్టుకోవచ్చు. ఇంగ్లిష్ అక్షరాలు వరుసగా సీ, డీ, ఈ, ఎఫ్, జీ గుర్తు పెట్టుకుంటే చాలు. ‘సి’ ఫర్ క్యాల్షియమ్– అంటే అది ఎక్కువగా తీసుకోవాలి. ‘డి’ ఫర్ విటమిన్ డి – అంటే శరీరానికి తగినంత అందేలా చూసుకోవాలి. ‘ఈ’ ఫర్ ఎక్సర్సైజ్ – అంటే శరీరాన్ని కాస్తంత శ్రమపెట్టి ఎక్సర్సైజ్ చేయించాలి. ‘ఎఫ్’ ఫర్ ‘ఫాల్స్’ – అంటే ఇంగ్లిష్‌లో పడిపోవడం. కాస్తంత వయసు పైబడ్డాక బాత్రూమ్ల వంటి చోట్ల, ఇతరత్రా కింద పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ‘జి’ ఫర్ గెయిన్ వెయిట్ – అంటే శరీరం బరువు కాస్తంత పెరగాలి. అది ఎత్తుకు తగినట్లుగా ఉండాలి. -
నిమ్మకాయ, పచ్చిపసుపుతో సిద్ధు భార్య కేన్సర్ ఖతం: నిపుణుల హెచ్చరికలివే!
మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇటీవల కీలక విషయాన్ని ప్రకటించిన సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. తన భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ స్టేజ్-4 కేన్సర్‌ని విజయవంతంగా ఓడించిందని మీడియా సమావేశంలో ప్రకటించారు. కేవలం వైద్యులమీదే ఆధారపడకుండా కొన్ని ప్రత్యేక మైన చికిత్సా పద్దతులను అవలంబించామని క్రమశిక్షణ, కఠినమైన జీవనశైలి,ఆయుర్వేద పద్ధతులు, ఆహార నియమాలతో తీవ్రమైన స్టేజ్-4 కేన్సర్‌నుంచి బయటపడినట్టు వెల్లడించారు. ముఖ్యంగా నిమ్మరసం, పచ్చి పసుపు, యాపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి వంటి వాటి ద్వారా కేన్సర్ మహమ్మారిని జయించినట్టు ప్రకటించడం చర్చకు దారి తీసింది. మరి కేవలం స్ట్రిక్ట్ డైట్ మాత్రమే క్యాన్సర్ రికవరీకి సహాయపడుతుందా? నిపుణులు ఏమంటున్నారు?కొన్నాళ్ల క్రితం కేన్సర్ బారిన పడిన నవజ్యోత్ కౌర్ చికిత్స తీసుకుంది. తగ్గిపోయిందని అనుకున్నారు. కానీ కుమారుడి పెళ్లి తర్వాత స్టేజ్-3 రూపంలో తీవ్రంగా మళ్లీ వచ్చింది. చికిత్స తీసుకున్నా ఫలితం లేదు సరికదా మరింత ముదిరింది. కేవలం 5 శాతం మాత్రమే చాన్స్ ఉందని, కోలుకోవడం కష్టం అని వైద్యులు తేల్చేశారు. కానీ కఠినమైన ఆహార నియమాలు, జీవన శైలి మార్పులతో ఆమె క్యాన్సర్‌ను ఓడించిందని, అయితే ఇది దగ్గర డబ్బు ఉన్నందున కాదు, క్రమశిక్షణ, ఆహార నియమాలను పాటించి 40 రోజుల తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యిందంటూ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు సిద్దూ. ఆమె ఇపుడు వైద్యపరంగా కేన్సర్‌ను ఓడించిందని సిద్దూ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఉపవాసం ప్రాముఖ్యత, చక్కెర , కార్బోహైడ్రేట్లు లేని ఆహారం కేన్సర్‌ను దూరం చేస్తుందన్నారు. ఆమె తన రోజును నిమ్మరసంతో ప్రారంభించేదని, పచ్చి పసుపు తినేదని, ఆపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి లాంటి తీసుకునేదన్నారు. ఇంకా సిట్రస్ పండ్లు,గుమ్మడికాయ, దానిమ్మ, ఉసిరి, బీట్రూట్ , వాల్నట్స్ వంటి రసాలు ఆమె రోజువారీ ఆహారంలో భాగంగా ఉండేవన్నారు.My wife is clinically cancer free today ….. pic.twitter.com/x06lExML82— Navjot Singh Sidhu (@sherryontopp) November 21, 2024అందరికీ వర్తించదు: నిపుణుల హెచ్చరిక కేన్సర్ చికిత్సలో పోషకాహార పాత్ర కీలకమైనదే, కానీ అది మాత్రమే రికవరీకి ఆహారం మాత్రమే సరిపోదని హెచ్చరిస్తున్నారు. వ్యాధినుంచి కోలుకోవడానికి ఆహారం గణనీయంగా తోడ్పడుతుంది. కానీ కీమోథెరపీ, రేడియేషన్ లేదా శస్త్రచికిత్స వంటి సాంప్రదాయ చికిత్సలకు ఎంతమాత్రం సరిపోదు. కేన్సర్ బహు ముఖమైంది. తీవ్రతను బట్టి, కేన్సర్ కణాలను నాశనం చేయడానికి పలు చికిత్సల కలయిక అవసరం అంటున్నారు వైద్య నిపుణులుఅలాగే ఉపవాసం కేన్సర్ రోగులకు ఉపవాసం అస్సలు పనికిరాదని, కేన్సర్ రోగులను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, లేదా ఉపవాసంలో ఉంచడం నేరమంటున్నారు మరికొందరు నిపుణులు. ఇది కోలుకోవడానికి అవసరమైన పోషకాహారాన్ని నిరోధిస్తుందన్నారు.తక్కువ-గ్లైసెమిక్ డైట్, న్యూట్రాస్యూటికల్స్ గ్లూకోజ్-ఆధారిత కేన్సర్లలో చికిత్సల సామర్థ్యాన్ని పెంచగలవని డాక్టర్ మల్హోత్రా ట్వీట్ చేశారు. అయితే అందరికీ ఇది వర్తించదన్నారు. కేన్సర్ రకం, దశ ఆధారంగా, జీవక్రియ అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఆహార ప్రణాళికలను రూపొందించుకోవాలి. ముఖ్యంగా రోగులు ఆంకాలజిస్టులు, డైటీషియన్ల సలహాలను తీసుకోవాలని డాక్టర్ మల్హోత్రా జోడించారు.కేన్సర్‌నుంచి బయటపడాలంటే.. తొలి దశలోనే గుర్తించడం,కేన్సర్ రకం, లక్షణాలతో పాటు అత్యాధునిక చికిత్స, రోగి విల్ పవర్, ఆహార నియమాలు, రోగి శారీరక, మానసిక స్థితి, కుటుంబ సభ్యుల సహకారం, మద్దతు ఇవన్నీ కీలకమైనవి. -
మలబద్ధకంతో మహాబాధ... నివారణకు ఇలా చేయండి!
మలబద్ధకం ఉన్నవారికి అది చాలా బాధాకరమైన సమస్యే అయినప్పటికీ... నిజానికి వారికి అదొక్కటే కాకుండా, దాని నుంచి వచ్చే ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఎన్నెన్నో. అందుకే ఒక్క మలబద్ధకాన్ని నివారించుకుంటే చాలా రకాల ఆరోగ్య అనర్థాల నుంచి కాపాడుకోవచ్చు. అందుకే దీని నివారణ అంటే చాలా రకాల జబ్బుల నివారణ అని అర్థం చేసుకోవాలి. మలబద్ధకం నివారణకు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలివి... పీచుపదార్థాలు (ఫైబర్) మలబద్ధకాన్ని సమర్థంగా నివారిస్తుంది. అన్ని రకాల ధాన్యాల్లోనూ పొట్టులో పీచు పదార్థాలు ఎక్కువ. అందుకే పొట్టు తీయని ధాన్యాలు... మరీ ముఖ్యంగా వరి విషయానికి వస్తే దంపుడు బియ్యం వంటివి మేలు చేస్తాయి. ఇక మామూలు ధాన్యాల్లో కంటే తృణధాన్యాల్లో పీచు ఎక్కువ. వాటితో పాటు కాయగూరలు, ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాల్లోనూ పీచు పాళ్లు ఎక్కువ. పీచు (ఫైబర్) సమృద్ధిగా ఉండే ఆహారాలతోపాటు తాజా పండ్లతో దీన్ని నివారించుకోవడం తేలికే. మొత్తం జీర్ణవ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచడంతో పాటు తేలిగ్గా విరేచనమయ్యేందుకు ఫైబర్ సహాయపడతుంది. అంతేకాకుండా... ఒంట్లోని చక్కెరను రక్తంలో నెమ్మదిగా కలిసేలా చేయడంతోపాటు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులను అదుపులో ఉంచడానికీ ఫైబర్ సహాయం చేస్తుంది. చిక్కుళ్లలో ప్రొటీన్‌తోపాటు ఫైబర్ కూడా ఎక్కువే. ఇవి కండరాలకు బలాన్నివ్వడంతో పాటు మలబద్దకం నివారణకూ తోడ్పడుతుంది. ఇక పండ్ల విషయానికి వస్తే... పీచు ఎక్కువగా ఉండే బొ΄్పాయి, పుచ్చ, నారింజ వంటి పండ్లు మలబద్ధకాన్ని తేలిగ్గా నివారిస్తాయి. చక్కెర మోతాదులు తక్కువగానూ, పీచు ఎక్కువగానూ ఉండే పండ్లను డాక్టర్లు డయాబెటిస్ బాధితులకు తినమంటూ సూచిస్తారు. ఇవి మలబద్ధకంతో పాటు చాలా రకాల క్యాన్సర్లనూ నివారిస్తాయి. అయితే పళ్లరసాల రూపంలో తీసుకుంటే అందులో పీచుపదార్థాలు దాదాపుగా ఉండవు. అందుకే పండ్లను కొరికి తినడమే మంచిది. పీచుపదార్థాలతోపాటు తగినన్ని నీళ్లు తాగడం వల్ల కూడా విరేచనం సాఫీగా అవుతుంది. అందుకే రోజుకు కనీసం రెండు లీటర్ల (కనీసం పది గ్లాసుల)కు తగ్గకుండా నీళ్లు తాగడం మంచిది. మామూలు ధాన్యాల్లో కంటే తృణధాన్యాల్లో పీచు ఎక్కువ. వాటితోపాటు కాయగూరలు, ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాల్లోనూ పీచుపాళ్లు ఎక్కువ. పీచు (ఫైబర్) సమృద్ధిగా ఉండే ఆహారాలతోపాటు తాజా పండ్లతో దీన్ని నివారించుకోవడం తేలికే. మొత్తం జీర్ణవ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచడంతోపాటు తేలిగ్గా విరేచనమయ్యేందుకు ఫైబర్ సహాయపడతుంది. అంతేకాకుండా... ఒంట్లోని చక్కెరను రక్తంలో నెమ్మదిగా కలిసేలా చేయడంతోపాటు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులను అదుపులో ఉంచడానికీ ఫైబర్ సహాయం చేస్తుంది. -
ఎముక కేన్సర్ అంటే..?
ఎముక మీద ఏదైనా అసాధారణ లేదా అవాంఛిత కణజాలం పెరుగుదలతో కనిపించే ‘ఎముక ట్యూమర్’లను ఎముక క్యాన్సర్‌గా చెప్పవచ్చు. ఇలాంటి ఎముక గడ్డలు శరీరంలోని ఏ ఎముకపైన అయినా రావచ్చు. అంటే ఎముక పైభాగంలో లేదా లోపలి వైపునా ఇంకా చెప్పాలంటే ఎముకలోని మూలుగ (బోన్ మ్యారో)లో... ఇలా ఎక్కడైనా రావచ్చు. ఈ బోన్ కేన్సర్ గురించి సాధారణ ప్రజలకూ అవగాహన కలిగేలా యూకే బర్మింగ్హమ్లోని రాయల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్‌కు చెందిన మస్క్యులో స్కెలిటల్ రేడియాలజీ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. రాజేశ్, అలాగే అక్కడి వైద్యురాలు డాక్టర్ సుష్మితా జగదీశ్ చెబుతున్న కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఎముక కేన్సర్‌లో రకాలివి...ఎముకల గడ్డల గురించి... ఎముక మీద వచ్చే ఈ గడ్డ (బోన్ ట్యూమర్) అన్నది ప్రమాదాన్ని తెచ్చిపెట్టే (మేలిగ్నెంట్) బోన్ కేన్సర్ గడ్డ కావచ్చు లేదా అది ఎలాంటి ప్రమాదాన్నీ కలిగించని (బినైన్) గడ్డ కూడా కావచ్చు. ఇక ఎముక కేన్సర్ గురించి చెప్పాలంటే వచ్చే విధానాన్ని బట్టి వీటిని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకవేళ క్యాన్సర్ గనక ఎముకలోనే మొదలైతే దాన్ని ‘ప్రైమరీ బోన్ క్యాన్సర్’ అంటారు. ఒకవేళ ఈ కేన్సర్ దేహంలోని మరో చోట మొదలై... ఆ కణాలు ఎముక మీదికి చేరి ఎముక కణాలనూ క్యాన్సర్ కణాలుగా మార్చడం వల్ల వచ్చిన కేన్సరైతే దాన్ని ‘మెటాస్టాటిక్ బోన్ డిసీజ్’ అనీ ‘సెకండరీ బోన్ కేన్సర్’ అని డాక్టర్లు చెబుతారు. ప్రైమరీ బోన్ కేన్సర్లలో... మల్టిపుల్ మైలోమా (మూలుగలో వచ్చే కేన్సర్) ఆస్టియోసార్కోమా (ఇది టీనేజీ పిల్లల ఎముకల్లో కనిపించే సాధారణమైన కేన్సర్... సాధారణంగా మోకాలి చుట్టూ ఇది అభివృద్ధి చెందుతుంది) ఈవింగ్స్ సార్కోమా (ఇది కూడా యువతలో ఎక్కువగా కనిపిస్తూ సాధారణంగా కాళ్లూ, కటి భాగాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది) కాండ్రో సార్కోమా (ఇది ఎముకల్లో కనిపించే అతి సాధారణ రూన్సర్లలో రెండో ది, ఎక్కువగా మధ్య వయస్కుల్లో అందునా చాలావరకు కటి లేదా భుజం ఎముకల్లో కనిపిస్తుంది). సెకండరీ బోన్ కేన్సర్లలో దేహంలోని... రొమ్ము, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ప్రోస్టేట్ వంటి ఇతర ప్రాంతాల్లో వచ్చి కేన్సర్లు పెరుగుతూ ఆ కణాలు ఎముకలకూ చేరి అలా ఎముక కేన్సర్‌కూ కారణమవుతాయి. ఇక... ఏ హానీ చేయని బినైన్ ట్యూమర్స్ అని పిలిచే ఎముక గడ్డల విషయానికి వస్తే... తేడాలను బట్టి వాటిని ఆస్టియోకాండ్రోమా, జెయింట్ సెల్ ట్యూమర్స్ అని పిలుస్తారు. ఇవి ఎముకలపై పెరిగే అంతగా అమాయకరం కాని ‘నాన్ కేన్సరస్’ గడ్డలని చెప్పవచ్చు. లక్షణాలు..ఎముక కేన్సర్ లక్షణాలు తొలి దశల్లోనే గుర్తించడం అంతగా సాధ్యం కాదు. లక్షణాలిలా ఉంటాయి. నొప్పి : కేన్సర్ గడ్డ వచ్చిన ఎముక ప్రాంతంలో నిరంతరం నొప్పి వస్తూ సమయం గడుస్తున్నకొద్దీ దీని తీవ్రత పెరుగుతుంది. వాపు : ఎముక క్యాన్సర్ వచ్చిన చోట స్పష్టంగా వాచినట్లుగా వాపు కనిపిస్తుంది. ఫ్రాక్చర్లు: క్యాన్సర్ వచ్చిన ఎముక బలహీనంగా మారడంతో తేలిగ్గా విరగడానికి అవకాశాలెక్కువ. తీవ్రమైన అలసట, బరువు తగ్గడం : బాధితుల్లో బాగా నీరసం, నిస్సత్తువ, అలసట కనిపిస్తాయి. అలాగే బాధితులు ఎక్కువగా బరువు తగ్గుతారు. చికిత్స... ఒకసారి ఎముక కేన్సర్ నిర్ధారణ చేశాక... ఆ కేన్సర్ దశ, వ్యాధి తీవ్రత వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని, ప్రాధాన్యక్రమంలో ఏ చికిత్స ప్రక్రియను తొలుత లేదా ఆ తర్వాత నిర్వహించాలో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఎముక కేన్సర్‌కు అవలంబించే సాధారణ చికిత్స ప్రక్రియల్లో ముఖ్యమైనవి... శస్త్రచికిత్స : ఎముకపైన ఉన్న గడ్డనూ... దాంతోపాటు ఆ చుట్టుపక్కల కణజాలాన్ని శస్త్రచికిత్సతో తొలగిస్తారు. కీమోథెరపీ : కొన్ని మందులతో కేన్సర్ కణాలను తుదముట్టించే ప్రక్రియను కీమోగా చెప్పవచ్చు. ప్రధానంగా ఈ ప్రక్రియను ఆస్టియోసార్కోమా వంటి కేన్సర్ల కోసం వాడతారు. రేడియేషన్ థెరపీ : అత్యంత శక్తిమంతమైన రేడియేషన్ కిరణాల సహాయంతో కేన్సర్‌ను మాడ్చివేసే ప్రక్రియనే రేడియోషన్ థెరపీగా చెబుతారు. సాధారణంగా శస్త్రచికిత్స ద్వారా కేన్సర్ గడ్డలను తొలగించలేని సమయాల్లో డాక్టర్లు ఈ ప్రక్రియను ఎంచుకుంటారు. అన్ని కేన్సర్లలో లాగే ఎముక కేన్సర్‌నూ ఎంత త్వరగా గుర్తించి, నిపుణులైన డాక్టర్లతో మంచి చికిత్స అందిస్తే ఫలితాలూ అంతే మెరుగ్గా ఉంటాయి. మరీ ముఖ్యంగా... పెరుగుతున్న పిల్లల్లో ఇవి వారి ఎదుగుదలను ప్రభావితం చేయడంతోపాటు కొన్నిసార్లు వైకల్యాలకూ కారణమయ్యే అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా వీటిని కనుగొని, తగిన చికిత్స అందించాలి. బాధితుల్లో కనిపించే మెరుగుదల (ప్రోగ్నోసిస్) అనే అంశం... అది ఏ రకమైన కేన్సర్ లేదా ఏదశలో దాన్ని కనుగొన్నారు, బాధితుడికి అందుతున్న చికిత్సకు ఎలా ప్రతిస్పందిస్తున్నాడనే అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీవల మంచి అధునాతన చికిత్స ప్రక్రియలతోపాటు కొత్త కొత్త చికిత్స ప్రణాళికలు అందుబాటులోకి రావడం, సరికొత్త పరిశోధనలతో వచ్చిన ఆవిష్కరణల కారణంగా బాధితుల్లో మంచి మెరుగుదల కనిపిస్తోంది. ఎముక కేన్సర్‌తో జీవించాల్సి వస్తే... ఎముక క్యాన్సర్‌తో జీవించాల్సి వచ్చే బాధితులకు తమ కుటుంబసభ్యుల నుంచి, డాక్టర్ల నుంచి ఆరోగ్య సంరక్షకుల నుంచి మంచి సహకరం అవసరం. ఎముక కేన్సర్ వచ్చిందని తెలియగానే అన్ని కేన్సర్లలో లాగానే బాధితులు షాక్‌కు గురికావడం, జీవితం శూన్యమైనట్లు అనుకోవడం, నిరాశా నిస్పృహలకు గురికావడం వంటివి ఉంటాయి. అయితే వాళ్లు బాగా కోలుకోవడం అన్నది... వాళ్లకు అందే చికిత్సతోపాటు వాళ్లకు నైతిక మద్దతు అందించే కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. తమకు వచ్చిన కేన్సర్ రకం, దాని గురించి అవసరమైన సమాచారంతోపాటు తమకు వచ్చిన వ్యాధి గురించి డాక్టర్లు, తమకు నమ్మకమైనవాళ్లతో అరమరికలు లేకుండా చర్చించడం వంటి అంశాలు త్వరగా కోలుకునేలా చేస్తాయి. ఈ క్రమంలో నర్సులూ, తాము తీసుకునే మందులు, తమకు లభించాల్సిన ట్రాన్స్‌పోర్టు సహకారాలూ, బాధితుల బాధల్ని తమవిగా ఎంచి, సహానుభూతితో మద్దతు అందించే సపోర్ట్ గ్రూపుల సహకారం బాగుంటే కోలుకునే ప్రక్రియ కూడా మరింత మెరుగ్గా, వేగంగా జరుగుతుంది. ∙నిర్ధారణ...సాధారణంగా ఎక్స్–రే, ఎమ్మారై, సీటీ స్కాన్ పరీక్షలతోపాటు సాధారణంగా చిన్న ముక్క తీసి పరీక్షించే బయాప్సీ ద్వారా ఎముక కేన్సర్ నిర్ధారణ చేస్తారు. డాక్టర్ (ప్రొఫెసర్) బి. రాజేష్ మస్క్యులో స్కెలిటల్ రేడియాలజీ స్పెషలిస్ట్, రాయల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ బర్మింగ్హమ్ (యూకే) (చదవండి: చెదురుతున్న గుండెకు అండగా...!) -
రొమ్ము క్యాన్సర్‌కు అరుదైన చికిత్స
కేన్సర్.. ఒకప్పుడు పేరు వినడానికే భయపడిన మహమ్మారి.. ఇప్పుడు ఎక్కువ మందికి వ్యాపిస్తోంది. అధైర్యపడకుండా చికిత్సతో దాన్ని జయిస్తున్నవారు కొందరైతే.. కారణాలేవైనా ఇంకొందరు ప్రాణాలు పోతున్నాయి. వ్యాధి భయం కంటే.. చికిత్సలో భాగంగా చేసే కీమోథెరపీ చూపించే నరకం అధికం. అలాంటివేవీ లేకుంటా కేన్సర్‌ను జయించారో శాస్త్రవేత్త. తనకు వచ్చిన రొమ్ము క్యాన్సర్‌కు తానే చికిత్స చేసుకుని చరిత్రలో నిలిచారు. అయితే దీనిపై కొందరు శాస్త్రవేత్తలు విభేదిస్తున్నారు. ఇది అన్ని దశల్లోనూ ఉపయోగించలేమంటున్నారు. క్రొయేషియాకు చెందిన 50 ఏళ్ల బీటా హలాస్సీ శాస్త్రవేత్త. జాగ్రెబ్ విశ్వవిద్యాలయంలో వైరాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. గతంలోనే కేన్సర్ డిటెక్ట్ అవ్వడంతో మాస్టెక్టమీ చేయించుకున్నారు. 2020లో మళ్లీ పునరావృతమైంది. ఈసారి మూడో స్టేజీ. సాధారణంగా హడలెత్తిపోతాం. కానీ ఆమె అలా కాదు. ధైర్యంగా ఎదుర్కొంది. కాకపోతే.. మొదటి సారి కీమోథెరపీతోనే విసిగిపోయిన ఆమె.. ఈసారి అటువైపు మొగ్గుచూపలేదు. తనకు తానే చికిత్స చేసుకోవాలనుకున్నారు. వైరాలజిస్ట్ కూడా కావడంతో.. యాంటీవైరస్ వేక్సిన్స్తోనే ప్రయోగం చేశారు. మీజిల్స్ వైరస్, ఫ్లూ లాంటి వ్యాధులకు ఇచ్చే వేక్సిన్స్ను కలిపి.. తన ప్రయోగశాలలోనే కొత్త వైరస్‌ను సృష్టించారు. దాన్ని ఇంజెక్ట్ చేసి చికిత్స చేసుకోవడం ప్రారంభించారు. ఇది కణితిపై నేరుగా దాడి చేసిన రోగనిరోధక వ్యవస్థను పెంచే శక్తివంతమైనన వైరస్‌గా పనిచేసింది. హలాస్సీ నాలుగు సంవత్సరాలుగా కేన్సర్ రహితంగా ఉంది. స్టేజ్ 3లో చికిత్స.. ఆంకోలిటిక్ వైరోథెరపీ (ఓవీటీ)గా పిలిచే ఈ ప్రయోగాత్మక వేక్సిన్ ఆమె స్టేజ్ 3 కేన్సర్ చికిత్సకు సహాయపడింది. ఓవీటీ.. క్యాన్సర్ చికిత్స కోసం అభివృద్ధి చెందుతున్న విధానం. ఇది క్యాన్సర్ కణాలపై దాడి చేయడానికి, వాటితో పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. ఓవీటీ క్లినికల్ ట్రయల్స్ లాస్ట్స్టేజ్లో ఉన్న మెటాస్టాటిక్ క్యాన్సర్ పై ప్రయోగించారు. కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు ప్రారంభ దశ కేన్సర్లకు కూడా దీన్ని సూచిస్తున్నారు. కణితి కణానికి మీజిల్స్ వైరస్, వెసిక్యులర్ స్టోమాటిటిస్ వైరస్ ఉన్నట్టుగా గుర్తించిన హలాస్సీ.. రెండు వైరస్‌లను సరైన మోతాదులో మిళితం చేసి, తనకు తాను చికిత్స చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఇప్పటివరకు ఈ రెండు వ్యాధికారక క్రిములను ఓవీటీ క్లినికల్ ట్రయల్స్‌లో ఉపయోగించారు. మీజిల్స్ వైరస్ మెటాస్టాటిక్ రొమ్ము కేన్సర్స్ చికిత్సలో ఉపయోగిస్తారు. భిన్న వాదనలు.. కేన్సర్ చికిత్సకు.. శస్త్రచికిత్స, కెమోథెరపీ, బయోలాజికల్ థెరపీ, రేడియేషన్ వంటి ప్రస్తుత విధానాలకు బదులుగా ఓవిటిని ఉపయోగించాలని హలాస్సీ సూచిస్తున్నారు. దీనిని కొందరు వైద్య పరిశోధకులు విభేదిస్తున్నారు. ఆంకోలిటిక్ వైరస్‌లతో స్వీయ వైద్యం రోగ నిర్ధారణ చేసిన కేన్సర్‌ను ఎదుర్కోవడానికి సరైన విధానం కాదంటున్నారు. కానీ ప్రారంభ దశలో ఓవీటీని నియోఅడ్జువెంట్ థెరపీగా క్లినికల్ ట్రయల్స్ జరపాలని సూచిస్తున్నారు. -
కట్టుకట్టి వదిలేశారు
సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామానికి చెందిన రమేశ్ సోమవారం బైక్‌పై వెళుతుండగా యాక్సిడెంట్ అయింది. దీంతో ముఖంపై తీవ్ర గాయం అయింది. వైద్యం కోసం నూజివీడు ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా, విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేశారు. రమేశ్ అదేరోజు జీజీహెచ్‌లో అడ్మిట్ అయ్యారు. ముఖంపై అయిన గాయానికి వైద్యులు కట్టు కట్టారు. తదుపరి చికిత్స అందించాలంటే ఆరోగ్యశ్రీ కింద కేసులు రిజిస్ట్టర్ చేసి, అనుమతులు వచ్చేవరకూ ఆగాలన్నారు. కుటుంబ సభ్యుల నుంచి సిబ్బంది ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని కేసు రిజిస్టర్ చేస్తున్నామని చెప్పారు. ఆ రోజు నుంచి బుధవారం వరకు మూడురోజుల పాటు అనుమతులు రాలేదని చికిత్సలో జాప్యం చేస్తూ వచ్చారు. ‘చిన్న గాయానికి చికిత్సకోసం మూడురోజుల నుంచి ఎదురుచూస్తున్నాం. ఇంకెన్ని రోజులు పడుతుందని ప్రశ్నిస్తే.. ఏమో చెప్పలేం.’ అని సిబ్బంది సమాధానం ఇస్తున్నారని రమేశ్ కుమారుడు వాపోయాడు. రమేశ్ తరహాలోనే చికిత్సల్లో జాప్యంతో ఏపీవీవీపీ, బోధనాస్పత్రుల్లో నిరంతరం పలువురు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సల కోసం డబ్బు ఖర్చుపెట్టే స్తోమతలేక ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయిస్తున్న నిరుపేద రోగులకు తక్షణమే వైద్య సేవలు అందడం లేదు. ఆరోగ్యశ్రీ నుంచి అనుమతులు రావాలంటూ రోజుల తరబడి ఆస్పత్రుల్లో వేచి ఉండేలా చేస్తున్నారు. మైనర్ సర్జరీలకు సైతం ఆరోగ్యశ్రీ కార్డు కావాలని ఆస్పత్రుల్లో డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వాస్పత్రులంటే ఎటువంటి షరతులు లేకుండా తక్షణ వైద్యం అందుతుందని ప్రజలకు నమ్మకం. ప్రస్తుత ప్రభుత్వంలో ఇందుకు భిన్నంగా ఆస్పత్రుల్లో పరిస్థితులు ఉంటున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో ఇండియన్ వెయిన్ కాంగ్రెస్
సాక్షి,హైదరాబాద్ : మన దేశంలో దాదాపు 25 శాతం మంది ప్రజలు వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారని, వీళ్లలో చాలామందికి శస్త్రచికిత్సలు అవసరం లేకుండానే నయం చేయొచ్చని జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులు తెలిపారు. ప్రస్తుతం అనేక అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని అందిపుచ్చుకుని దేశంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా అద్భుతమైన చికిత్సలు చేయొచ్చని వివరించారు. నగరంలోని అవిస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల డిస్ట్రిక్ట్ 150 కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ స్థాయిలో ఇండియన్ వెయిన్ కాంగ్రెస్ 2024ను శుక్రవారం నిర్వహించారు. దీనికి అవిస్ ఆస్పత్రి వ్యవస్థాపకుడు, ప్రముఖ వాస్క్యులర్ ఇంటర్వెన్షనల్ నిపుణుడు డాక్టర్ రాజా వి. కొప్పాల నేతృత్వం వహించారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 100 మంది వరకు వైద్య నిపుణులు దీనికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. బ్రెజిల్ నుంచి కొందరు నిపుణులు ఆన్లైన్లో హాజరై తమ అభిప్రాయాలు, అనుభవాలను పంచుకున్నారు.ముఖ్యంగా వెరికోస్ వెయిన్స్ సమస్యను శస్త్రచికిత్సలు అవసరం లేకుండా లేజర్ల ద్వారా, ఇతర మార్గాల్లో నయం చేయడం ఎలాగన్న అంశంపై ఇందులో విస్తృతంగా చర్చించారు. అవిస్ ఆస్పత్రిలో గత ఎనిమిదేళ్లుగా ఇప్పటికి దాదాపు 40 వేల మందికి పైగా రోగులకు శస్త్రచికిత్స అవసరం లేకుండా నయం చేశామని, ఈ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ రాజా వి. కొప్పాల అన్నారు.అంతర్జాతీయంగా పేరున్న డాక్టర్ రోడ్రిగో గోమ్స్ డీ ఒలీవియెరా, డాక్టర్ రాజేష్ వాసు, డాక్టర్ ఫెర్రనాండో ట్రెస్ సిల్వెరియా లాంటి వాస్క్యులర్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ నిపుణులు ఈ సదస్సుకు హాజరై.. అంతర్జాతీయంగా ఈ రంగంలో వస్తున్న పలు మార్పులు, చికిత్సా విధానాలు, ఎదురవుతున్న సవాళ్ల గురించి చర్చించారు. వీరితో పాటు వాస్క్యులర్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ నిపుణులు కూడా పాల్గొన్నారు. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్సలు అవసరం లేదని, అయితే కొన్నిసార్లు తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని తెలిపారు.వెరికోస్ వెయిన్స్ విషయంలో అద్భుతమైన పరిశోధనలు జరుగుతున్నాయని, వాటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా విజ్ఞాన సముపార్జన చేయాలని నిపుణులు సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై డాక్టర్ రాజా వి. కొప్పాల సంతోషం ప్రకటించారు. -
అరుదైన జబ్బుతో అర్జున్ కపూర్ : ఎమోషనల్ కామెంట్స్,అంత ప్రమాదకరమా?
నటి మలైకా అరోరా, బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్(Arjun Kapoor) ఇద్దరూ ఒకరి కోసం ఒకరం అన్నంతగా చెట్టా పట్టాలేసుకుని తిరిగిన ప్రేమజంట. ఏమైందో తెలియదు గానీ, ఇటీవల వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. తాజాగా అర్జున్ కపూర్ తన ఆరోగ్యంపై కీలక విషయాన్ని వెల్లడించాడు. నిద్ర పట్టక ఇబ్బంది పడేవాడినంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. హాషిమోటోస్ థైరాయిడిటిస్ ((Hashimoto's disease) అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో తాను బాధపడుతున్నట్లు అర్జున్ కపూర్ వెల్లడించారు. ఇది థైరాయిడ్ తరువాత స్టేజీ అని, రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని పేర్కొన్నాడు. ఇది బరువు పెరగడానికి అది కూడా కారణం కావచ్చునని అన్నాడు. తాను లావుగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి మరింత పెరిగి అందరికీ దూరంగా ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్ట పడేవాడినని చెప్పాడు.‘‘సింగం ఎగైన్’’ మూవీ సమయంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, మానసికంగా, శారీరకంగా. నేను ఎంత డిప్రెషన్లో ఉన్నానో లేదో నాకు తెలియదు. అసలు ఈ సినిమా చేయాలా వద్దా ? నన్ను జనాలు ఆదరిస్తారా? లేదా? అనే అనుమానం పీడించేది. కానీ నాకు ఈ సినిమా పునర్జన్మ నిచ్చింది’’. కరియర్లో వరుస ఫ్లాప్‌లో ఇబ్బందిపడుతున్న తరుణంలో డైరెక్టర్ రోహిత్ శెట్టి, అర్జున్ కపూర్ కాంబోలో వచ్చిన 'సింగం ఎగైన్' మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రధాన విలన్ "డేంజర్ లంక" పాత్రతో అర్జున్ కపూర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. మలైకా, అర్జున్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. 2019లో, వారు సోషల్ మీడియాలో తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించారు. ఇటీవల ఇద్దరూ విడిపోయినట్టు ధృవీకరించారు. అసలేంటీ హషిమోటో వ్యాధి,ఎలా వస్తుంది?హషిమోటో వ్యాధికి ఖచ్చితమైన కారణాలపై స్పష్టతలేనప్పటికీ, జన్యు, పర్యావరణ , హార్మోన్ల అసమతుల్యత , జీవనశైలి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.ఫ్యామిలీలో థైరాయిడ్ లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధుల ఉంటే రావచ్చు. పురుషుల కంటే స్త్రీలే దీనికి ఎక్కువ గురయ్యే అవకాశ ఉంది. బహుశా హార్మోన్ల ప్రభావాల వల్ల కావచ్చు.ఏ వయసులోనైనా సంభవించవచ్చు, అయితే సాధారణంగా మధ్య వయస్కులలో బయటపడుతుంది.పర్యావరణ కారకాలు: అయోడిన్ అధికంగా తీసుకోవడం, రేడియేషన్‌కు గురికావడం లేదా ఇన్ఫెక్షన్లు.ఒత్తిడి , జీవనశైలి: దీర్ఘకాలిక ఒత్తిడి, పోషకాహారం లోపం లక్షణాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. జీవక్రియ, గుండె పనితీరు, జీర్ణక్రియలో సమస్యలు, కండరాలపై పట్టు కోల్పోవడం, మెదడు పనితీరులో లోపాలు అలసట,బలహీనత,బరువు పెరుగటం తరచుగా డిప్రెషన్, ఆందోళన , మూడ్ స్వింగ్స్చలిని తట్టుకోలేకపోడం , కండరాలు , కీళ్ల నొప్పులుమలబద్ధకం, ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయిచికిత్ససాధారణ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను పునరుద్ధరించడానికి , అలసట మరియు బరువు పెరగడం వంటి లక్షణాలను తగ్గించడానికి థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని వాడతారు.థైరాయిడ్పనితీరును క్రమం తప్పకుండాపర్యవేక్షించుకోవాలి. అవసరం మేరకు మందుల మోతాదును సర్దుబాటు చేసుకోవాలి.సెలీనియం, జింక్ సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి.ఒత్తిడికి దూరంగా ఉండేలా మెడిటేషన్, యోగా లాంటివి చేయాలి.థైరాయిడ్ ఆరోగ్యానికి తోడ్పడతాయి, అయినప్పటికీ అధిక అయోడిన్‌ను నివారించాలి. తగిన వ్యాయామం చేయాలిరోజుకు కనీసం 6 గంటల నిద్రం ఉండేలా జాగ్రత్త పడాలి.నోట్: ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. థైరాయిడ్ సమస్య ఉన్నట్టు అనుమానం ఉన్న వారు వెంటనే వైద్యుడిని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి. -
ఆరు నెలల పోరాటం.. చనిపోవడం ఖాయం అనుకున్నా: హీరామండి నటి
బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా తెలుగువారికి సైతం సుపరిచితమే. చివరిసారిగా హీరామండి వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే గతంలో మనీషా కొయిరాలా క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మనీషా క్యాన్సర్ చికిత్స రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను భరించలేని బాధను అనుభవించినట్లు తెలిపారు. చికిత్స తీసుకునే సమయంల తాను చనిపోతానని భావించినట్లు వెల్లడించింది. కొన్ని నెలల పాటు అమెరికాలో శస్త్రచికిత్స తీసుకున్నట్లు పేర్కొన్నారు. తన తల్లి నేపాల్ నుంచి రుద్రాక్షను తీసుకొచ్చి వైద్యునికి ఇచ్చిందని మనీషా చెప్పుకొచ్చింది. కాగా.. మనీషా కొయిరాలా 2012లో అండాశయ క్యాన్సర్‌తో పోరాడి గెలిచారు.మనీషా మాట్లాడుతూ..'2012లో నాకు క్యాన్సర్ నిర్ధారణ జరిగింది. ఆ సమయంలో నేను చాలా భయపడ్డాను. నేను వైద్యులతో మాట్లాడినప్పుడు చనిపోతానని భావించా. ఇక లైఫ్‌కు ముగిసినట్లే అనిపించింది. ఆ తర్వాత న్యూయార్క్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నా. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ సమయంలో భరించలేని బాధ, నొప్పి అనుభవించా. ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. చివరి స్టేజ్‌లో ఉందని తెలిసింది. న్యూయార్క్‌లో ఉన్న గొప్ప వైద్యులు నాకు చికిత్స అందించారు. దాదాపు 11 గంటలు ఆపరేషన్ చేశారు. కీమో థెరపీ గురించి నా కుటుంబానికి కూడా వైద్యులు వివరించారు. వైద్యం కొనసాగుతున్న సమయంలో అమ్మ నాకోసం ఎన్నో పూజలు చేసింది. ఆమె ధైర్యంతోనే నేను ఆ మహమ్మారిని జయించాను. ఈ జీవితం నాకు దేవుడిచ్చిన పునర్జన్మ' అని అన్నారు. -
పశువులు, కోళ్ల వైద్యానికి ప్రామాణిక మార్గదర్శకాలు
పశువులు, కోళ్ల వైద్యానికి సంబందించి సరికొత్తప్రామాణిక మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రంయాంటీబయాటిక్ తదితర ఔషధాల వినియోగాన్ని తగ్గించటం, దుర్వినియోగాన్ని అరికట్టే ప్రత్యామ్నాయ చికిత్సలపై దృష్టి సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఈవీఎంల)కు పెద్దపీటఈవీఎంలపైప్రాంతీయ భాషల్లో పుస్తకాలు, వీడియోలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన ఎన్.డి.డి.బి.దేశంలో పశువులు, కోళ్లకు వచ్చే జబ్బులు, ఇన్ఫెక్షన్లకు అందించేప్రామాణిక చికిత్సా పద్ధతులను నిర్దేశిస్తూ కేంద్ర పశు సంవర్థక, పాడి అభివృద్ధి శాఖ సరికొత్త మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. పాడి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు తదితర పశువులతో పాటు కోళ్ల చికిత్సకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. నిర్హేతుకంగా యాంటీబయాటిక్స్ తదితర అల్లోపతి ఔషధాల వినియోగాన్ని కట్టడి చేయటంతో పాటు.. ఆరోగ్యదాయకమైన ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులను విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చే లక్ష్యంతో కేంద్రం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా పాడి పశువుల చికిత్సలో చీటికి మాటికి యాంటీబయాటిక్స్‌ను అతిగా వాడటం, దుర్వినియోగం చేయటం వల్ల పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు తదితర ఆహారోత్పత్తుల్లో వాటి అవశేషాలు మోతాదుకు మించి మిగిలి΄ోతున్నాయి.పశువైద్యంలో యాంటీబయాటిక్ మందులను అతిగా వాడటం వల్ల సూక్ష్మజీవులు నిరోధకతను సంతరించుకుంటున్నాయి. ఫలితంగా యాంటీబయాటిక్ ఔషధాలు నిరర్థకంగా మారుతున్నాయి. ఇది ప్రజారోగ్యానికి పైకి కనిపించని పెను ముప్పుగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ), యుఎస్ఎయిడ్ సంస్థల తోడ్పాటుతో కేంద్ర పశుసంవర్థక మంత్రిత్వ శాఖ 6 నెలల పాటు సుమారు 80 మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని నిపుణులతో చర్చించింది. సరికొత్తప్రామాణిక మార్గదర్శకాలను రూపొందించి ఇటీవలే విడుదల చేసింది. అల్లోపతి ఔషధాలను ఏయే జబ్బులకు ఎంత మోతాదులో వాడాలో మార్గదర్శకాలలో పొందుపరిచారు.ఈవీఎంలకు పెద్ద పీటఅంతేకాకుండా, సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నో వెటరినరీ మెడిసిన్ప్రాక్టీసెస్ – ఈవీఎంల)ను, హోమియో వంటి ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులకు కూడా ప్రభుత్వం ఈ మార్గదర్శకాల్లో పెద్ద పీట వేయటం విశేషం. సంప్రదాయ ఆయుర్వేద పద్ధతుల్లో రైతులే స్వయంగా తయారు చేసుకొని వాడేందుకు వీలుగా ఉండే చికిత్సా పద్ధతులను కూడా పొందుపరిచారు. ఈ రంగంలో 20 ఏళ్లు కృషి చేసిన తమిళనాడుకు చెందిన ఎమిరిటస్ ప్రొఫెసర్ ఎన్. పుణ్యస్వామి 22 రకాల పశువ్యాధులకు రూపొందించిన ఈవీఎం పద్ధతులకు చోటు కల్పించారు. దేశంలో పాడిపై ఆధారపడిన చిన్న, సన్నకారు రైతులకు అతితక్కువ ఖర్చుతో సమకూరే ఈవీఎం చికిత్సా పద్ధతులు ఉపయోగపడతాయని కేంద్ర పశుసంవర్థక శాఖ కార్యదర్శి అల్క ఉపాధ్యాయ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, హోమియో గురించి ప్రస్తావించినప్పటికీ ఈ చికిత్స పద్ధతుల గురించి మార్గదర్శకాల్లో వివరించలేదు. దేశంలోని నలుమూలల్లోని పశు వైద్యులు, వైద్య సిబ్బంది, సంప్రదాయ వైద్యులు, పశు΄ోషకుల అనుభవాలు, సూచనలతో ప్రతి 2–3 ఏళ్లకోసారి ఈ మార్గదర్శకాలను పరిపుష్టం చేయనుండటం మరో విశేషం.సంప్రదాయ ఆయుర్వేద చికిత్సాపద్ధతులు తమిళనాడుకు చెందిన తంజావూరులోని వెటరినరీ యూనివర్సిటీ పరిశోధనా కేంద్రంలో ‘ఎత్నో–వెటరినరీ హెర్బల్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ యూనిట్’ అధిపతిగా పనిచేసిన ఎమిరిటస్ ప్రొఫెసర్ డా.ఎన్. పుణ్యస్వామి, టిడియు ఎమిరిటస్ప్రొఫెసర్ ఎం.ఎన్. బాలకృష్ణన్ నాయర్ పశువ్యాధులకు సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నో వెటరినరీ మెడిసిన్ప్రాక్టీసెస్– ఈవీఎంల)పై సుదీర్ఘంగా పరిశోధన చేసి ప్రమాణీకరించారు. ముఖ్యమైన 22 రకాల జబ్బులకు (అల్లోపతి మందులు, యాంటీబయాటిక్స్ వాడవసరం లేకుండా) రైతుల ఇళ్లలో ΄ోపు డబ్బాల్లో ఉండే మసాలా దినుసులు, పెరట్లో ఉండే మొక్కలతో ఆయుర్వేద మందుల్ని రైతులే స్వయంగా తయారు చేసుకొని వాడుకోగలిగే పద్ధతులను పొందుపరచిన ఒక చిరు పుస్తకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలతో పాటు అందుబాటులోకి తెచ్చింది. ఆంగ్లం, హిందీ, తెలుగుతో పాటు 12 భాషల్లో ఈ చిరుపుస్తకాల పీడీఎఫ్‌లను అందుబాటులోకి తెచ్చింది. పశువులకు, ముఖ్యంగా పాడి ఆవులు, గేదెలకు వచ్చే జబ్బులకు ఆయుర్వేద మందులను రైతులు ఇంటి దగ్గరే ఎలా తయారు చేసుకోవాలి? ఎలా వాడాలి? అనేది తెలుగు సహాప్రాంతీయ భాషల్లో రూపొందించిన వీడియోలను జాతీయ పాడి అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డి.బి.) యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచారు. ఈ చిరు పుస్తకాల పిడిఎఫ్‌లను, ఆయుర్వేద మందుల తయారీ, వాడే పద్ధతులు తెలిపే వీడియోలను ఉచితంగానే చూడొచ్చు.. డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాంటీబయాటిక్స్, రసాయనిక ఔషధాల అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన పాలు, మాంసం ఉత్పత్తికి దోహదం చేసే మార్గం ఇది. -
చిక్కే....‘సిస్ట్’ర్స్... జాగ్రత్త!
మహిళల్లో సాధారణంగా గర్భసంచి పక్కనే ఉండే ఓవరీస్‌లో లేదా వారి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన అవయవాల్లో... రకరకాల సిస్ట్లు కనిపిస్తుంటాయి. సిస్ట్ అంటే నీరు లేదా నీటి వంటి ద్రవపదార్థంతో నిండి ఉన్న సంచి అని అర్థం. మహిళల్లో ఇలా సిస్ట్లు కనిపించడం మామూలే. సాధారణంగా కనిపించే కొన్ని రకాల సిస్ట్ల గురించి ప్రాథమిక అవగాహన కోసం... ఈ కథనం. ఫాలిక్యులర్ సిస్ట్: అండం విడుదల సమయంలో కనపించే సిస్ట్ ఇది. పీరియడ్స్ తరువాత ఐదు లేదా ఆరు రోజుల నుంచి క్రమంగా సైజ్ పెరుగుతూ ΄ోతుంది. సాధారణంగా 2 నుంచి 2.2 సెం.మీ. సైజ్‌కు చేరాక... మహిళల్లో అండం విడుదల జరిగాక కనుమరుగవుతుంది. కార్పస్ ల్యుటియల్ సిస్ట్: అండం విడుదలైన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే... ఆ పిండాన్ని స΄ోర్టు చేయడానికి ఏర్పడే సిస్ట్ ఇది. సాధారణంగా ఈ సిస్ట్లు వాటంతట అవే కనుమరుగవుతాయి.ఎండోమెట్రియల్ సిస్ట్: రక్తంతో నిండి ఉండే ఈ సిస్ట్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో కనపడుతుంది. ఈ సిస్ట్లు తీవ్రమైన నొప్పి కలిగిస్తాయి. ఇవి క్రమంగా పెద్దదై కొన్నిసార్లు పలిగి΄ోయే అవకాశం ఉన్నందున ఇటువంటి సిస్ట్‌లను ఇంజక్షన్ ద్వారా తాత్కాలికంగా పెరగకుండా చేయడంగానీ లేదా సర్జరీ ద్వారా తీసేవేయడం కానీ చేస్తుంటారు. ఇలా చేయాల్సిన అవసరమూ ఉంటుంది. ఇన్ఫెక్టెడ్ సిస్ట్: ఓవరీస్‌లో ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. ట్యూబ్‌తో కలిసి ట్యూబో–ఒవేరియన్ సిస్ట్ల పెల్విస్ ఇన్ఫెక్షన్స్లో సాధారణంగా ఇది కనిపిస్తుంటుంది. పాలిసిస్టిక్ ఓవరీస్ : సాధారణంగా ప్రతినెలా 20 నుంచి 30 ఫాలికల్స్ ఓవరీస్‌లో పెరగడం ప్రారంభిస్తాయి. వీటన్నింటిలో అత్యంత అనువుగా ఉన్న ఫాలికల్ మాత్రమే అండంగా మారుతుంది. అది... మిగిలిన వాటికన్నా మరింత వేగంగా పెరిగి... పీరియడ్స్ వచ్చిన 12–16 రోజుల మధ్యలో విడుదల అవుతుంది. ఇక మిగిలిన ఫాలికల్స్ అన్నీ వాటంతట అవే మాయమైపోతాయి. కాని ఊబకాయం, హార్మోన్ల అసమతౌల్యత ఉన్న మహిళల్లో ఆ ఫాలికల్స్ అన్నీ ఒకే సైజ్ వరకు పెరుగుతాయిగానీ, ఏ ఒక్కటీ అండంగా మారదు. అలా పెరిగిపోయిన ఈ సిస్ట్ల వల్ల పీరియడ్స్ సక్రమంగా రాక΄ోవడం, బరువు మరింతగా పెరగడం, అవాంఛిత రోమాలు రావడం జరగవచ్చు. స్కానింగ్ చేసి చూసినప్పుడు ఈ ఫాలికల్స్ అన్నీ చిన్న చిన్న నీటి బుడగల్లాగా కనపడతాయి. వీటినే డాక్టర్లు పాలిసిస్టిక్ ఓవరీస్’గా చెబుతారు. ఈ సమస్యను మందులతో, జీవనశైలి మార్పులతో తగ్గించడం సాధ్యమవుతుంది. సీరస్ లేదా మ్యూసినస్ సిస్ట్ : ఇవి కూడా ఓవరీస్‌లో సాధారణంగా కనిపించే సిస్ట్లే. నలభై ఏళ్లకు పైబడినవారిలో కనిపిస్తుంది. సైజును బట్టి చికిత్స నిర్ణయిస్తారు.చాలావరకు వాటంతట అవి తగ్గిపోయేవే... ఇన్ని రకాల సిస్ట్లు ఉన్నా ఫాలిక్యులార్, కార్పస్ ల్యుటియల్, చిన్న సైజ్‌లో ఉన్న సీరస్ సిస్ట్లు వాటంతట అవే తగ్గిపోతాయి. కొన్ని సమయాలలో 6 సెం.మీ సైజ్ కన్నా ఎక్కువగా ఉంటే సిస్ట్లు లేదా నీరులాంటి పదార్థంతోపాటు గట్టిగా ఉన్న సిస్ట్లు, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ల వంటికి మాత్రమే శస్త్రచికిత్స అవసరమ వుతుంది.శస్త్రచికిత్స అవసరమయ్యేవి... కొన్ని సిస్ట్లు మెలిక తిరిగి అంటే టార్షన్కు గురై పేషెంట్‌కు విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, కళ్లు తిరగడం, స్పృహ తప్పిపోవడం వంటి సమస్యలను తెచ్చిపెట్టినప్పుడు ఆపరేషన్ తప్పని సరి. చివరగా... మహిళలు తామ ఓవరాల్ ఆరోగ్యం కోసం సరైన ఆహారం, ఎక్సర్సైజ్ చేస్తే బరువు తగ్గడం చాలా మంచిది. దీనివల్ల ఇతరత్రా అనేక సమస్యలతో పాటు కొంతవరకు సిస్ట్లు కూడా నివారితమయ్యే అవకాశం ఉంది. - డా. స్వాతి హెచ్వికన్సల్టెంట్, అబ్‌స్టెట్రీషియన్ – గైనకాలజిస్ట్ -
రోజూ అదే టైమ్‌కు ఠంచనుగా వాంతులా? ఎందుకలా?!
కొందరికి అదే పనిగా వాంతులవుతాయి. అంతేకాదు... రోజూ అదే టైమ్‌కు అవుతాయి. ఒకవేళ వాంతులు కాని పక్షంలో... కనీసం వికారంగానైనా ఉండే అవకాశముంది. వాంతులై కొన్ని గంటలు గడిచాకే హాయిగా అనిపిస్తుంటుంది. చిత్రంగా మళ్లీ ఆ మర్నాడు మళ్లీ అదే టైమ్‌కు వాంతులు కావడం మొదలవుతుంది! క్రితం రోజు ఎంత సేపు అయ్యాయో, ఆ మర్నాడు సైతం అంతే సేపు అవుతుంటాయి!. విచిత్రమైన ఈ జబ్బు పేరు... ‘సైక్లిక్ వామిటింగ్ సిండ్రోమ్’. సంక్షిప్తంగా సీవీఎస్ అంటారు. చిన్నపిల్లల్లో ఇది మరీ ఎక్కువ. పెద్ద వయసు వాళ్లలోనూ కొందరిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది. సాధారణంగా ఈ ‘సీవీఎస్’తో పాటు కడుపునొప్పి, తలనొప్పి, మైగ్రేన్ కూడా కనిపించే అవకాశాలెక్కువ. దీనికి నిర్దిష్టమైన చికిత్స ఏదీ లేదుగానీ... వాంతుల వల్ల తగ్గి΄ోయిన / దేహంలోంచి వెళ్లిపోయిన లవణాలను భర్తీ చేసేందుకు సెలైన్ ఎక్కించాల్సి ఉంటుంది. ఇతరత్రా ప్రత్యేకమైన చికిత్స లేకపోయినప్పటికీ... సాధారణంగా వాంతులను, వికారాన్ని తగ్గించే మందులను‘యాంటీ–ఎమెటిక్’ డ్రగ్స్‌తో డాక్టర్లు ఈ ‘సీవీఎస్’ సమస్యకు చికిత్స అందిస్తారు. ఇదీ చదవండి: Clinical vampirism రక్తం తాగాలనిపించే జబ్బు గురించి తెలుసా? -
మరో ఆరుగురికి డయేరియా
నరసరావుపేట: పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలోని అంజనాపురం కాలనీలో డయేరియా మరింత ప్రబలుతోంది. కేసులు పెరుగుతున్నాయి. కాలనీలో శనివారం మరో ఆరుగురికి డయేరియా సోకింది. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటివరకు ఈ కాలనీలో వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతిచెందారు. 17 మంది ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో కొంతమంది ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇళ్లకు వెళ్లారు. శనివారం కూడా ఆరుగురికి డయేరియా సోకటం ఆందోళన కలిగిస్తోంది. కాలనీలో తమ్మిశెట్టి మాధవి, దేవళ్ల రాకేష్, తమ్మిశెట్టి అశోక్, తమ్మిశెట్టి శ్రీనివాసరావు, కొట్రా అన్నమ్మ, మరొకరు శనివారం వాంతులు, విరేచనాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. కాలనీలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాల్లో ప్రాథమిక చికిత్స చేసిన తరువాత మెరుగైన వైద్యం కోసం సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలకు తరలిస్తున్నారు.ప్రస్తుతం వాంతులు, విరేచనాలతో చికిత్స పొందుతున్న వారిలో కొట్రా అన్నమ్మ ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. తాగునీటి బోరులో నీరు కలుషితమవడంతో అంజనాపురం కాలనీ వాసులు ఈ నెల 22 నుంచి డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి వ్యాధి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
వైద్యుల నిర్లక్ష్యమే.. ప్రాణాలు తీసింది
లబ్బీపేట (విజయవాడతూర్పు): ప్రాణాపాయస్థితిలో చికిత్స కోసం వస్తే సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే రోగి మృతి చెందాడంటూ బంధువులు ఆందోళనకు దిగిన ఘటన శనివారం విజయవాడలో చోటుచేసుకుంది. మృతుని మేనమామ కథనం మేరకు.. కృష్ణాజిల్లా, పామర్రు మండలం జుజ్జువరం గ్రామానికి చెందిన గార్లపాటి ఆది పవన్‌కుమార్ (35) తాపీపని చేస్తుంటాడు. ఇటీవల కాలుకు దెబ్బతగలడం, మూడురోజులుగా జ్వరం ఉండటంలో స్థానికంగా చికిత్సపొందుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి హార్ట్‌రేట్ ఎక్కువగా ఉండటంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. లెటర్లో వైరల్ ఫీవర్, గ్యాస్ట్రయిటిస్ అని పేర్కొన్నారు. శనివారం తెల్లవారు జామున విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకురాగా, వైద్యులు పరీక్షించి, జనరల్ వార్డులో అడ్మిట్ చేశారు. ఈక్రమంలో ఉదయం 9.30 గంటలకు పవన్‌కుమార్ మృతి చెందాడు. బంధువుల ఆందోళన ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని కనీసం ఐసీయూలో ఉంచకుండా, సాధారణ వార్డులో చేర్చడం వల్లే మృతి చెందాడంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. అదేమని అడిగితే బెడ్లు ఖాళీలేవని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వాపోయారు. వైద్యులు, సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటల ఆందోళన తర్వాత ఆస్పత్రి అధికారులు వారి వద్దకు వచ్చి ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించి మృతదేహాన్ని తీసుకెళ్లారు.అంతర్గత రక్తస్రావంతోనే మృతి రోగి పవన్‌కుమార్ మూడురోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. మచిలీపట్నం నుంచి రిఫర్‌చేసిన లెటర్లో కూడా వైరల్ ఫీవర్, గ్యాస్రై్టటీస్ అని రాశారు. వైరల్ ఫీవర్‌లో ప్లేట్స్‌లెట్స్ తగ్గిన కారణంగా అంతర్గత రక్తస్రావం (ఇంటర్నల్ బ్లీడింగ్)తో ఒక్కసారిగా బీపీ తగ్గి మరణం సంభవించింది. రోగి బంధువుల ఆరోపణలపై కూడా విచారణ చేస్తాం. ఇందుకు ముగ్గురు సీనియర్ ప్రొఫెసర్లతో విచారణకు కమిటీ వేశాం. – డాక్టర్ ఎ వెంకటేశ్వరరావు, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్